రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

3, మే 2017, బుధవారం



      డార్క్ మూవీస్ లో చివరిగా విలన్ పాత్రని పరిశీలిస్తే, ఇతను పూర్తి కాంట్రాస్ట్ తో వుంటాడు. అంటే ఇతర పాత్రలకి  వాటి కష్టాలతో చీకట్లు ముసురుకుని వుంటే, కష్టాలు పెట్టే ఇతను మాత్రం పూర్తి వెలుగులో  ప్రకాశిస్తాడు. చివర్లో ఎలాగూ పాపాలు పండి చీకట్లో కలిసిపోతాడు, చీకట్లో మగ్గుతూ వుండిన పాత్రలు కష్టాలు తీరి వెలుగుని చూస్తాయి. దర్శకుడు / రచయిత డైనమిక్స్ ని అర్ధం చేసుకున్నప్పుడే డార్క్ మూవీస్ జానర్ కి న్యాయం చేయగల్గుతారు. ఇతర జానర్స్ కి స్ట్రక్చర్ సార్వ జనీనం అయితే ( ఇది  నమ్మక  నూటికి 90 ఫ్లాపులు తీస్తూనే వున్నారు) స్ట్రక్చర్ లోపల క్రియేటివిటీ వ్యక్తిగతం. ఇతర జానర్స్ లో  క్రియేటివిటీ కి రూల్స్ లేవు. చిత్రీకరణ ఎలాగైనా చేసుకోవచ్చు. కానీ డార్క్ మూవీస్ తో  అలా  కుదరదు. స్ట్రక్చర్ తో బాటు క్రియేటివిటీ కి కూడా రూల్స్ వుంటాయి. క్రియేటివ్ రూల్స్ లో భాగమే విలన్ ని అలా చూపించడం.

      
డార్క్ మూవీస్  విలన్ రిచ్ గా, స్టయిలిష్ గా వుంటాడు. మెత్తగా, మర్యాదగా  మాట్లాడతాడు. విందు లిస్తాడు, వినోదాలు పంచుతాడు. తనలోని జంతు ప్రవృత్తిని కప్పిపుచ్చుకుంటూ వుంటాడు. హై సొసైటీ వ్యక్తిగా హిపోక్రసీ ప్రదర్శిస్తాడు. తన స్థాయి, అంతస్తు, కుటుంబ సంబంధాలు అన్నీ షో పుటప్ గా బయట పడుతున్నా పట్టించుకోడు- కేవలం తన జంతు ప్రవృత్తి మాత్రం బయట పడకుంటే చాలనుకుంటాడు. దాంతో రహస్యంగా గొంతులు కోసే పనులుంటాయి. మొదటి సారి డ్రింక్ కి  ఆహ్వానిస్తే గొప్పగా వుందని, రెండోసారి ఆహ్వానం అందుకుని వెళ్తే ఏమంత  గొప్పగా వుండదు- అందులో విషం  కలిపి చంపే తీర్తాడు.  

         
తెలుగు  యాక్షన్ లేదా హార్రర్ సినిమాల్లో చూపించినట్టు డబ్బు లేని వాళ్ళలాగా, దిగువ తరగతి వాళ్ళలాగా, సామాజిక విలువ లేని వాళ్ళలాగా, కుర్తా పైజామా వేసుకుని, గడ్డం మీసాలతో రోతగా వుండే విలన్లకి డార్క్ మూవీస్ లో  స్థానం లేదు. డార్క్ మూవీ విలన్ సామాజికంగా శక్తిమంతుడు

అంగద్ బేడీ- ‘పింక్’
      16- డి’  లో మరణాల కేసుల్ని ఇన్స్ పెక్టర్ పరిశోధిస్తూంటాడో  అతడి తమ్ముడే విలన్. పింక్’  లో రాజకీయ నాయకుడి కొడుకు విలన్, కహానీ -2’లో సంపన్నురాలి కొడుకు విలన్. వీళ్ళందరూ యంగ్ స్టయిలిష్ విలన్లు కావడాన్ని గుర్తించాలి. కథని బట్టి విలన్ల ఏజి గ్రూపు. ‘16- డిలో హింసాత్మక ప్రేమాయణం కాబట్టి యంగ్ విలన్, కహానీ-2’  లో చైల్డ్ ఎబ్యూజ్ కాబట్టి యంగ్ విలన్, పింక్లో రిసార్ట్ పార్టీ సంఘటన  కాబట్టి యంగ్ విలన్.

         
ఫిలిం నోయర్ కాలంలో హంప్రీ బోగార్ట్, బర్ట్ లాంకాస్టర్, గ్రెగరీ పెక్, ఇంగ్రిడ్ బెర్గ్ మన్, ఆవా గార్డెనర్, లానా టర్నర్ లాంటి స్టార్లు నటించేవాళ్ళు కాబట్టి వాళ్ళకి తగ్గ భారీ విలన్లు సినిమాల్లో వుండే వాళ్ళు. తెలుగులో డార్క్ మూవీస్ వైపు స్టారూ చూసే అవకాశం లేదు కాబట్టి,  చిన్నచిన్న  హీరోలతో, కొత్త కొత్త  హీరోలతో తీయాల్సి వచ్చే డార్క్ మూవీస్ కి,  వాటిలో చూపించే నేర స్వభావాన్ని బట్టి విలన్స్ ని సృష్టించు కోవాల్సి వుంటుంది


కునాల్ కౌషిక్- ‘16-డి’
          చిన్న చిన్న, కొత్త కొత్త హీరో లంటున్నామని  డార్క్ మూవీస్ తీయడం చీప్ టేస్ట్ అనుకోవద్దు. స్టార్లు నటిస్తామంటే స్టార్లతోనే తీసుకోగలిగే సబ్జెక్ట్ మ్యాటర్ వీటిలో వుంది. అసలీ డార్క్ మూవీస్ వ్యాసాలు రాయడమే చిన్న చిన్న, కొత్త కొత్త హీరోలతో, ప్రేమలూ వెకిలి దెయ్యాలూ దిక్కూ దివాణం లేకుండా పోతున్న పరిస్థితిని గమనించే! పరిస్థితుల్లో అట్నుంచి  తమిళ మలయాళడార్క్మేఘాలు వచ్చి కమ్ముకుని కాసులు కురిపించుకోవడం చూసే

         
చీమలు కూడా జాలిగా చూసి నవ్వుకుని పక్క థియేటర్ల లోకి వెళ్ళిపోయే చిన్న చిన్న, కొత్త కొత్త హీరోల ప్రేమల, వెకిలి దెయ్యాల సినిమాలు తీసి పరువు పోగొట్టుకునేకన్నా, ఇదే చిన్న చిన్న, కొత్త కొత్త హీరోలతో డార్క్ మూవీస్ తీస్తే- ఒకవేళ ఫ్లాప్ అయినా పరువేం పోయే పరిస్థితి వుండదు. ఈ నిర్మాతకి టేస్టుంది, దర్శకుడికి టెక్నిక్ వుందని మార్కెట్ లో పేరొస్తుంది. పదిహేనేళ్ళ క్రితం ప్రేమ సినిమాల వెల్లువలో ఇలాటి జ్ఞానోదయమే కలిగింది : ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రివ్యూలు వేస్తూంటే, మధ్యలోనే నిర్మాతలు కొత్త దర్శకులని బయటికి పట్టుకెళ్ళి కొత్త ఆఫర్లు ఇవ్వడం, కర్చీఫులు వేసుకోవడం చేసేవాళ్ళుఎందుకని? యాక్షన్ సీన్స్ బాగా తీశాడని. ప్రేమ సినిమాలు తీస్తే ఏమొస్తుంది? కొత్త దర్శకుడు మసాలా యాక్షన్ తీస్తే- కాసులు రాలే కమర్షియల్స్ తీయగలడన్న సర్టిఫికేట్ పొందినట్టేనని చెప్పుకునే వాళ్ళు.


జుగల్ హన్స్ రాజ్ – ‘కహానీ-2’
       ఇదే జ్ఞానోదయం ఇప్పుడింకా ఇన్నేసి పనికిరాని  నకిలీ ప్రేమలు, వెకిలి దెయ్యాలు తీస్తున్న కొత్త వాళ్ళకి కలగడం లేదన్న సత్యాన్ని వ్యాసకర్త కంట గమనించాడు. బ్లాగ్ సైడ్ బార్లో పోస్ట్ చేసిన రచయిత్రి వ్యాఖ్యలు మన కొత్త వాళ్ళకి సరీగ్గా సరిపోతాయి- సినిమాలకి రాయడానికి హాలీవుడ్ కొచ్చే యువ రచయితలు పదహారేళ్ళ వయసులో తమకేం జరిగిందో రాసుకుంటూ కూర్చుంటారని ఆవిడ అంది. మనవాళ్ళ పనీ ఇదే. కొత్త రచయితలకి జర్నలిస్టులు అవమని చెప్తానని కూడా అందావిడ. ఎందుకంటే జర్నలిస్టులు తమకి తెలీని ప్రపంచాల్లోకి కూడా దూసుకుపోతారని. 

         కాకతాళీయంగా ఈ వ్యాఖ్యని పోస్టు చేసే ముందు రాత్రి,  ఈ వ్యాఖ్యని నిజం చేసే అనుభవం ఎదురైంది ఈ వ్యాసకర్తకి. అతనొక కథ చెప్పాడు. దాన్ని ఇవాళ్టి  జనరేషన్ దిశగా మళ్లించబోతే భయపడిపోయాడు. కారణమేంటో, ఎందుకు భయపడుతున్నాడో అర్ధంగాలేదు. తెల్లారి అనుకోకుండా ఈ రచయిత్రి వ్యాఖ్య చూసినప్పుడు ఈ వ్యాసకర్తకి జ్ఞానోదయమైంది. అతను అదే పదహారేళ్ళ కౌమార దశలోంచి కథ చెప్పాడన్న మాట!  దాన్ని ఈ వ్యాసకర్త ఇవాళ్టి జనరేషన్ దిశగా మళ్లించబోతే జర్నలిస్టు స్పిరిట్ లేక భయపడిపోయాడన్న మాట!  జర్నలిస్టు స్పిరిట్  వున్న రచయిత ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు, భయపడడు.  జర్నలిస్టు స్పిరిట్ లేకపోతే తన వూహల్లోనే భయపడుతూ రాస్తూంటాడు. జర్నలిస్టు రచయిత అవకపోయినా నష్టం లేదు, రచయిత జర్నలిస్టు కూడా అవకపోతే చాలా నష్టమే!

          నకిలీ ప్రేమల, వెకిలి దెయ్యాల భ్రమాజనితమైన సేఫ్ జోన్ లోంచి బయటపడి డార్క్ మూవీస్ వైపుకి రావాలంటే రచయితకి /  దర్శకుడికి జర్నలిస్టు స్పిరిట్ వుండాల్సిందే!

***
     హాలీవుడ్ లో  ఫిలిం నోయర్ ట్రెండ్ గడిచి నియో నోయర్ ట్రెండ్ ఇప్పటివరకూ గత 57 ఏళ్లుగా సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వున్నా, అత్యధిక సంఖ్యలో అవి పెద్ద స్టార్లు నటించినవి గానే కనపడతాయి. పెద్ద దర్శకులు తీస్తున్నారు కాబట్టి వాళ్ళు కొత్త వాళ్లతోనో, చిన్న వాళ్లతోనో  తీయడం లేదేమో. బిల్లీ వైల్డర్, రోమన్ పొలాన్ స్కీ, రిడ్లీ స్కాట్, మార్టిన్ స్కార్సీస్, క్రిస్టఫర్ నోలన్, మైకేల్ మన్, కోయెన్ బ్రదర్స్, క్వెంటిన్ టరాంటినో, సిడ్నీ లుమెట్...చెప్పుకుంటూ పోతే లెక్కలేనంత మంది అగ్ర దర్శకులు తేల్తారు. క్లింట్ ఈస్ట్ వుడ్, అల్ పెసినో, బ్రూస్ విల్లీస్, హారిసన్ ఫోర్డ్, జాన్ ట్రవోల్టా, జాక్ నికోల్సన్...ఇలా లెక్కలేనంత మంది అగ్ర హీరోలు కన్పిస్తారు. వీళ్ళకి తగ్గ రేంజిలోనే విలన్స్ వుంటారు. 

           హాలీవుడ్ నోయర్ ప్యాకేజీ వేరు. తెలుగు ప్యాకేజీ వేరు. కొత్త హీరోలతో, లేదా చిన్న హీరోలతో వీటిని తీసుకోవాల్సిందే. వీళ్ళకి తగ్గ  రేంజిలోనే విలన్స్ ని చూసుకోవాలి. ఇతర జానర్స్ కి సంబంధించి ప్యాడింగ్ అని అంటూంటారు. డార్క్ మూవీస్ కి ప్యాడింగ్ విధానం పనిచెయ్యదు. ఆ ప్యాడింగ్ లో భాగంగా విలన్ గా ప్రకాష్ రాజ్ ని పెడదాం, జగపతి బాబుని పెట్టుకుందా మనుకుంటే మాత్రం, పిల్లి మీదికి సింహాన్ని తోలినట్టు వుంటుంది. ఇలాటి  సీనియర్లు ‘16-డి’ లో రెహమాన్ లాగా, ‘పింక్’ లో అమితాబ్ బచ్చన్ లాగా ఇన్వెస్టిగేటర్ పాత్రలకి పనికొస్తారేమో గానీ విలన్స్ గా సూట్ కారు. 


        డార్క్ మూవీ విలన్ ఎప్పుడూ క్లాస్ గా వుంటాడు. ఒకప్పుడున్న భూస్వామికి కొత్తావతారంలా వుంటాడు. కానీ వర్గ శత్రువు కాదు. డార్క్ మూవీస్ కథలు వర్గపోరాట కథలు కావు. ఇంతకి  ముందు వ్యాసాల్లో చెప్పుకున్నట్టు –వాళ్ళ చేతల చేత సంపన్నులని నేరాల్లో ఇరికించి తమాషా చూపించే బాక్సాఫీసు అప్పీలు గల థ్రిల్లింగ్ కథలు.


-సికిందర్
http://www.cinemabazaar.in

2, మే 2017, మంగళవారం


        డార్క్ మూవీస్ లో రెండు రకాల స్త్రీ పాత్ర లుంటాయి . ఒకటి సామాన్యమైన హీరోయిన్ పాత్ర,  ఇంకొకటి అసామాన్యమైన వాంప్ పాత్ర.  హీరోయిన్,  వాంప్ ఇద్దరూ హీరోకి ఒకరు ఉపగ్రహంలా, ఇంకొకరు గ్రహశకలంలా వుంటారు. హీరోయిన్ కక్ష్యలో వున్న ఉపగ్రహంలా వుంటే, వాంప్ వినాశాన్ని సృష్టించే గ్రహశకలంలా దూసు కొస్తుంది. హీరోయిన్ ధనికురాలై వుండాలని లేదు, మధ్యతరగతికి చెందినదై కూడా వుండొచ్చు. ఆమె వస్త్రధారణ సామాన్యంగా వుంటుంది. భారీ మేకప్, లిప్ స్టిక్ వాడదు. హీరో కేసు పరిశోధిస్తున్న ఎస్సై అయినా, లేదా కేసులో ఇరుక్కున్న నిందితుడైనా హీరోయిన్ అతణ్ణి ప్రేమిస్తుంది. ఆమె నిజాయితీతో వుంటుంది. అయితే  కేవలం ప్రేమ కోసం, పాటలకోసం అన్నట్టుగా కాక  ఈమెకో సంబంధిత వృత్తి నిచ్చి హీరోకి సహాయకారిగా చేస్తే, పాత్రకి ఆకర్షణ పెరుగుతుంది. హీరో  ఎస్సై అయితే తను రిపోర్టర్, హీరో క్రైం రిపోర్టర్ అయితే తను సహ రిపోర్టర్, హీరో క్రిమినల్ లాయర్ అయితే తను అసిస్టెంట్... ఇలా ప్రొఫెషనల్ పాత్రని సృష్టించవచ్చు.

         
డార్క్ మూవీస్ జానర్ కో నియమిత మూడ్ వుంటుంది. ఈ మూడ్ ని చెడగొట్టే విధంగా హీరోయిన్ పాత్రని సృష్టించకూడదు. అంటే టీచర్, అనాధలని ఆదుకునే మదర్  థెరిస్సా, కాలేజీ స్టూడెంట్, డాన్స్ స్కూల్ నడిపే దొడ్డమ్మ లాంటి పాత మూస ఫార్ములా పాత్రల్ని సృష్టించ కూడదు. ఉదాహరణకి ‘స్వామి  రారా’  యాక్షన్ కామెడీ జానర్ లో హీరోయిన్ కలర్స్ స్వాతిది టీచర్ పాత్ర. ఈ పాత్రకి  డార్క్ మూవీస్ లో స్థానం లేదు. యాక్షన్ కామెడీ వేరు, డార్క్ మూవీ వేరు. అలాగని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అంటే కూడా కుదరదు. ఈ డార్క్ మూవీ జానర్ ప్రధానంగా మర్డర్ మిస్టరీ గురించి వుంటుంది. ఈ మిస్టరీని ఛేదించడానికి తోడ్పడే పైన చెప్పుకున్న రిపోర్టర్, లాయర్ అసిస్టెంట్ వంటి పాత్రలు ఆ కథా ప్రపంచంలో ఇమిడిపోతాయి. 

          డార్క్ మూవీ మర్డర్ మిస్టరీగా కాక, ‘నగరం’ లాంటి క్రైం డ్రామాగా వున్నప్పుడు హీరోయిన్ పాత్రతో స్వేచ్ఛ తీసుకోవచ్చు, ‘నగరం’ లో హీరోయిన్ రేజీనా కసాండ్రా సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అయినట్టు. క్రైం డ్రామా మర్డర్ ఇన్వెస్టిగేషన్ తో కాక, ఒక విపత్కర పరిస్థితి లోంచి బయట పడే కథతో వుంటుంది. కనుక హీరోయిన్ పాత్రలకి పరిమితులుండవు. అలాగని పైన చెప్పుకున్న పాత  మూస ఫార్ములా పాత్రలు పనికిరావు. 

         ‘పింక్’ లాంటి క్రైం ఇన్వెస్టిగేషన్ ఆధారిత డార్క్ మూవీలో హీరోయినే బాధితురాలు. హీరోయిన్ బాధితురాలైనప్పుడు ఏ వృత్తిలో నైనా వుండవచ్చు. అయితే డార్క్ మూవీస్ అంటే రిచ్ పీపుల్ కథలే కాబట్టి, హీరోయిన్ బాధితురాలై  వున్నా ఆధునిక జీవితానికి అలవాటుపడ్డ టాప్ ప్రొఫెషనల్ అయివుండక తప్పదు- ‘పింక్’ లో హీరోయిన్ తాప్సీ లాగా. 

          డార్క్ మూవీ హీరోయిన్ నిందితురాలై కూడా వుండవచ్చు-  ‘కహానీ -2’  లో విద్యాబాలన్ లాగా. విద్యా బాలన్ ఒక సంపన్నుల పిల్లలు చదివే స్కూల్లో క్లర్కు గా పనిచేస్తూంటుంది. పిల్లల్లో ఒక బాలికని వాళ్ళ సంపన్న కుటుంబపు అరాచకం నుంచి కాపాడడానికి ప్రయత్నించిన ఫలితంగా నేరస్థురాలిగా ముద్రపడి బాలికతో పారిపోతుంది. ఇలా డార్క్ మూవీ ఇన్వెస్టిగేషన్ అయినా, క్రైం డ్రామా అయినా హీరోయిన్ నింది తురాలైనప్పుడు కూడా హై ఫై గానే వుంటుంది తప్ప – బస్తీలో పొట్టేలు పున్నమ్మలా వుండదు. 

          హీరోయిన్ సంఘటనకి సాక్షి అయినప్పుడు విలన్ పంజరంలో చిక్కుకుంటుంది- ‘నేనూ మనిషినే’ లో కాంచన లాగా. హీరోయిన్ సంపన్నురాలై వుంటే విశృంఖలత్వంతో  వుంటుంది- ‘బిగ్ స్లీప్’ లో మార్తా వికెట్స్ లాగా. ఈమె గాంబ్లింగ్ కి అలవాటుపడి బ్లాక్ మెయిల్ లో ఇరుక్కుంటుంది. 

          డార్క్ మూవీ హీరోయిన్ సంపన్నురాలైనా, ప్రొఫెషనల్ అయినా, సాక్షి అయినా, బాధితురాలైనా, నిందితురాలైనా మనసులో కుళ్ళు వుంచుకుని ప్రవర్తించదు. నీతీనిజాయితీ లుంటాయి. ఇక్కడ ఇలా ఈమెని వేరు చేస్తూ అడుగు మందం అడ్డ గీత గీయాల్సిందే. ఈ గీత కావల వుంటుంది సకల దుర్బుద్ధుల వాంప్.

‘ది బిగ్ స్లీప్’ లో  ఈ కళాత్మక షాట్ ఏం చెప్తోంది?
      హీరోయిన్ లో  ఏమేం వుంటాయో అవేవీ వాంప్ లో వుండవు. ఆఖరికి కట్టుకునే బట్టలు కూడా. ఈమె మాయలేడి, మాటకారి. భారీ మేకప్ తో అట్టహాసంగా కాస్ట్యూమ్స్ వేసుకుని గుంభనంగా మూవ్ అవుతూంటుంది. స్మోక్ చేస్తుంది, డ్రింక్ చేస్తుంది. హీరోని వల్లో వేసుకుని చెడ్డ పనుల వైపుకి లాగుతుంది. అడ్డంగా ఇరికించి చల్లగా జారుకుంటుంది. ఆ హీరో ఎస్సై అయినా సరే, నిందితుడైనా సరే- తనపని తాను చేసుకుపోతుంది. ఈమె దగా చేసే రకమని ప్రేక్షకులకి తెలుస్తూన్నా హీరోగారికే తెలీదు. ఈమె విలన్ కి వుంపుడుగత్తెగా వుండొచ్చు, లేదా   పోటీ విలన్ గానూ వుండవచ్చు. ఇంకా లేదా నీరా రాడియాలాగా గూఢచర్యం చేసి ‘రాడియా టేప్స్’ సృష్టించవచ్చు. ఈమె సంపన్నులతో సంబంధ బాంధవ్యాలు కలిగి వుంటుంది. చివరికి ఈమెకి విజయం వుండదు. 

          డార్క్ మూవీస్ లో ఈ రెండు రకాల స్త్రీ పాత్రలు కాక సహాయ పాత్రలు  ఎన్నైనా వుండవచ్చు. అవన్నీ ఈ జానర్ డిమాండ్ చేసే మూడ్ ని క్రియేట్ చేసేవిగానే వుండాల్సి వుంటుంది. ఎందుకు మూడ్ కి  తగ్గ పాత్ర లుండాలని  పదే పదే నొక్కి చెప్తున్నామంటే, డార్క్ మూవీస్ అనేవి ఇతర జానర్స్ కంటే కూడా ఓ ప్రత్యేక కళతో కూడుకుని వుంటాయి. విషయపరంగానే గాక, చిత్రీకరణ పరంగానూ ఇవి భిన్నంగా  వుంటాయి. నేరాలతో మనిషిలోని, సమాజంలోని చీకటి కోణాల్ని వెల్లడి చేయడమనే ప్రధాన ఎజెండాతో ఇవి  రూపొందుతాయి. ఇంత కాలం తెలుగు సినిమాలు ఈ బలమైన జానర్ ని పట్టించుకోక వెనుక బడిపోయాయి. కళాత్మకత, సృజనాత్మకత అనేవి ప్రేమ సినిమాల్లోనూ, దెయ్యం సినిమాల్లోనూ ఏనాడో కనుమరుగైపోయాయి. కానీ డార్క్ మూవీస్ కళాత్మకత, సృజనాత్మకత ఏనాడూ చచ్చిపోయేవి కావు. ఇవిలేక డార్క్ మూవీస్ లేవు. వీటిని రుచి మరిగిన ప్రేక్షకులు వీటిని విడిచి పెట్టనూ లేరు.



- సికిందర్ 

30, ఏప్రిల్ 2017, ఆదివారం


     డార్క్  మూవీస్ లో ప్రధానంగా నాల్గు  రకాల పాత్రలుంటాయి : పోలీస్ హీరో - లేదా నిందితుడైన హీరో, హీరోయిన్, వాంప్, విలన్ అనేవి. ముందుగా పోలీస్ హీరో  పాత్రని పరిశీలిస్తే, ఒకప్పుడు ఫిలిం నోయర్ సినిమాల్లో హీరో వచ్చేసి ప్రైవేట్ డిటెక్టివ్ గా వుండేవాడు. నియో నోయర్ ప్రారంభమయ్యాక ప్రైవేట్ డిటెక్టివ్ స్థానంలోకి పోలీసు అధికారి వచ్చాడు. తెలుగు సినిమాల్లో కొమ్మూరి డిటెక్టివ్ పాత్ర యుగంధర్ గా నాగభూషణం, అసిస్టెంట్ రాజుగా కృష్ణ లతో 1971లో  ‘పట్టుకుంటే లక్ష’ తీస్తే, ఆతర్వాత 1986 లో  వేరే డిటెక్టివ్ పాత్రలతో చిరంజీవితో జంధ్యాల ‘చంటబ్బాయ్’, 1992 లో  మోహన్ బాబు తో వంశీ ‘డిటెక్టివ్ నారద’ తీశారు. ఈ రెండూ హస్యపాత్రలే. హిందీలో రాజ్ కపూర్- రాజేంద్ర కుమార్ లతో తీసిన ‘దో జాసూస్’ (1975) లో  జంట డిటెక్టివ్ ల పాత్రలూ హస్యపాత్రలే. సీరియస్ డిటెక్టివ్  పాత్ర హిందీలో కూడా అరుదే. కానీ సత్యజిత్ రే బెంగాలీలో జనజీవనస్రవంతిలో భాగం చేసి పెట్టారు తను తీసిన డిటెక్టివ్ సినిమాల్ని. డిటెక్టివ్ ఫెలూదా పాత్ర సృష్టికర్తా- సినిమా దర్శకుడూ  తనే కావడం చేత డిటెక్టివ్ ఫెలూదా పాత్రతో అన్నేసి సినిమాలు తీయడం ఆయనకే సాధ్యమైంది. ఫెలూదా పాత్రతో ఆయన డిటెక్టివ్ సాహిత్యం రాసి ఇంటింటికీ దాన్ని అభిమాన పాత్ర చేసిన ఫలితంగానే సినిమాలతో ఆయనకిది సాధ్యపడింది. ఇప్పటికీ ఈ పాత్రతో టీవీ సిరీస్ తీస్తున్నారు.

         కానీ  డిటెక్టివ్ పాత్రలకి తెలుగులో ఎప్పుడూ ఆదరణ లేదు. అది సినిమాటిక్ పాత్ర కాలేకపోయింది. కారణం, డిటెక్టివ్ సాహిత్యం ఇతర సాహిత్య ప్రక్రియల్లాగా ప్రధాన స్రవంతిలోకి చేరకపోవడం. ఓ డిటెక్టివ్ నవలతో సినిమా తీస్తే, వాటి కుండే ఓ వర్గం  సాహిత్యాలాభిషులు వరకూ మాత్రమే ఆ సినిమా చూస్తే  ఏం లాభం? అమెరికాలో డిటెక్టివ్ సాహిత్యానికి అనంతమైన పాఠకలోకం వుంది. అందుకని హాలీవుడ్ లో నోయర్ సినిమాలు విరివిగా వచ్చాయి. డిటెక్టివ్ పాత్ర అక్కడ సినిమాటిక్ అయింది. తెలుగులో డిటెక్టివ్ సాహిత్యమే అంతరిస్తున్నాక మధుబాబు యాక్షన్ హీరో షాడో ప్రవేశించాడు. ఇది వార పత్రికల్లో సీరియల్స్ రూపంలో ఇంటింటికీ తెలిసిన పాత్రే అయ్యింది. అయినా వెండి తెర రూపం ధరించకపోవడానికి కారణం రచయిత మధుబాబు ఒప్పుకోకపోవడమే. ఆ పాత్ర పాఠకుల వూహల్లో వుండిపోవాలేతప్ప, దానికో రూపమివ్వకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. ఇది వేరే విషయం, ఇది డార్క్ మూవీ పాత్ర కాదు- యాక్షన్ జానర్ పాత్ర. 

       తెలుగులో డిటెక్టివ్ పాత్ర సినిమా ప్రేక్షకులందరికీ  తెలియకపోయినా,  సీఐడీ పాత్రని గుర్తు పట్టి అందరూ  అభిమానించే వాళ్ళు ఒకప్పుడు. సీఐడీ అంటే పోలీసు విభాగపు ఉద్యోగియే కాబట్టి సినిమాటిక్ గా ఆ పాత్రని స్వీకరించారు ప్రేక్షకులు.  1965 లో  ఈ పాత్రతో ఎన్టీ ఆర్ నటించిన ‘సీఐడీ’ హిట్టయ్యింది. సీఐడీ అంటే క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ అధికారి అని అర్ధం. కొన్ని కుటుంబ సినిమాల్లో కూడా అప్పుడప్పుడు ఒక సీఐడీ పాత్ర వుండేది. రానురానూ ఈ సీఐడీ పాత్రని చులకనగా చిత్రీకరిస్తూ, హాస్య నటులకి కూడా ఈ పాత్రని అప్పగిస్తూ  తెరమరుగు చేశారు.  సీఐడీ పాత్ర కూడా చనిపోయింది. 

          ఇక ఎస్సై వచ్చాడు. ఈ  ఎస్సై పాత్రకి  నోయర్ సినిమాలో- లేదా డార్క్ మూవీస్ లో  స్వతంత్రంగా ఎలాటి స్థానమూ లేదు, వుండడానికీ  వీల్లేదు. నోయర్ మూవీస్ లో  కథలు  ఓ  దొంగతనం లేదా ఓ మోసం లాంటి చిన్న చిన్న నేరాల చుట్టూ వుండవు. హత్య వంటి పెద్ద నేరాల గురించే వుంటాయి.  యాక్షన్ జానర్ లో ఈ హత్య కేసుల్లో స్వయంగా దర్యాప్తు చేసే ఎస్సై పాత్ర మనకి కన్పిస్తూంటాడు. ఇది లాజిక్ వుండని యాక్షన్ సినిమాలకే  సరిపోతుంది.

          డార్క్ మూవీస్ కి వాస్తవికత కావాలి. పోలీసు వ్యవస్థ, దాని పనితీరు ఎలా వుంటాయో వున్నదున్నట్టూ చూపించాలి, ఎలాటి దాటి వేతలూ పనికిరావు. అంటే హత్య కేసుని  ఎస్సై పాత్ర దర్యాపు చేస్తున్నట్టు చూపించినా,  అతడి  పై అధికారి సర్కిల్ ఇన్స్ పెక్టర్ (సీఐ) పర్యవేక్షణలో చేస్తున్నట్టు చూపించాల్సిందే. హత్య కేసులు సి ఐ పరిధిలో వుంటాయి. ఈయన్నే ఇన్స్ పెక్టర్ అని కూడా అంటారు. అయితే ఇన్స్ పెక్టర్ పాత్రని హీరో కిస్తే పెద్ద వయసు పాత్ర అనే ఫీలింగ్ వస్తుందన్న సంశయంతో  హీరోని యంగ్ ఎస్సైగానే చూపిస్తూ వస్తున్నారు. ఇది డార్క్ మూవీ జానర్ మర్యాదని దెబ్బ తీసేపని. యాక్షన్ మూవీ కైతే తీసుకోవచ్చు.

         16- డి లో నేరుగా  హత్యకేసు దర్యాప్తు చేస్తూ ఇన్స్ పెక్టర్ పాత్రలో సీనియర్ నటుడు రెహమాన్ కన్పిస్తాడు. అలాగే కహానీ -2 లో హత్య కేసుని దర్యాప్తు చేస్తూ సీనియర్ నటుడు ఖరజ్ ముఖర్జీ ఇన్స్ పెక్టర్ గా వుంటాడు, అతడి నేతృత్వంలో యంగ్ నటుడు అర్జున్ రాం పాల్ ఎస్సైగా వుంటాడు. అంటే ఒక సీనియర్ నటుడికి ఇన్స్ పెక్టర్ పాత్రనిచ్చి అతనే హీరోగా  నేరుగా హత్య కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చూపించడం ఒక పధ్ధతి; యంగ్ నటుణ్ణి ఎస్సైగా చూపిస్తూ అతను ఇన్స్ పెక్టర్ నేతృత్వంలో కార్య క్షేత్రంలో దూకినట్టు హీరోగా చూపించడం రెండో పధ్ధతి. ఈ రెండూ కాక ఇంకో పద్దతి లేదు. వుంటే అది జానర్ మర్యాద తప్పడమే. 

          జానర్ మర్యాద తప్పితే సినిమా ఎక్కడ తేడా కొడుతోందో ప్రేక్షకులకి మాటల్లో చెప్పగలిగే పాండిత్యం లేకపోయినా, వాళ్ళ అంతరంగానికి తెలుస్తూంటుంది. అంతరంగాన్ని మభ్యపెట్టి ఎవ్వరూ తప్పించుకోలేరు. కాబట్టి జానర్ మర్యాద విషయంలో అడ్డగోలుతనం పనికిరాదు. అది ఒక్కో కోటి రూపాయలని లెక్కెట్టి ఆ అడ్డగోలుతనపు  హోమానికి ప్రీతిపాత్రం చేయడమే. దర్యాప్తు అధికారులుగా అట్టహాసంగా బిల్డప్పు లిస్తూ ఎసిపి, డిసిపి పాత్రల్ని చూపించడం కూడా వాస్తవిక డార్క్ మూవీ జానర్ లక్షణం కానే కాదు. అది లాజిక్ అవరంలేని యాక్షన్ జానర్ లక్షణం. వీడు లాజిక్ వుండని రొడ్డకొట్టుడు యాక్షన్ జానరేదో చూపిస్తున్నాడులే అని అర్ధం జేసుకుని, వెండి తెరమీద సినిమాని దాని ఖర్మానికి వదిలేసి, రెస్టు పుచ్చుకోవడానికి    వెళ్ళిపోతుంది ప్రేక్షకుల అంతరంగం కాబట్టి బాధ వుండదు. ఒకసారి వాస్తవికత అంటూ హింట్ ఇచ్చి వాస్తవికతకి ఎగనామం పెడుతూ పోతే మాత్రం అంతరంగం మేల్కొని వుండి పొడుస్తూ వుంటుంది ప్రేక్షకుల్ని. ఇదీ జానర్ మర్యాద  సైకో ఎనాలిసిస్. 

      డార్క్ మూవీస్ లో హీరోని సినిమాటిక్ గా, ఈ జానర్ కి తగ్గట్టుగా  ఎస్సై పాత్రగా చూపించాలంటే ఒకటే మార్గం : అతను ఇన్స్ పెక్టర్ కింద పనిచేస్తున్నట్టు చూపించడమే. ఎందుకంటే అసలు దర్యాప్తు అధికారి ఇన్స్ పెక్టరే. ఈయన్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (ఐఓ) అంటారు. కోర్టులో సాక్ష్యమిచ్చేది ఐఓ గా ఈయనే తప్ప, ఎస్సై కాదు. ఇన్స్ పెక్టర్ నే హీరోగా చూపించాలంటే సీనియర్ నటుడు వినా మార్గాంతరం లేదు, యంగ్ హీరోని ఇన్స్ పెక్టర్ అంటే బావుండదు కాబట్టి.   ఎసిపి, ఏఎస్పీ లవంటి ఐపీఎస్ పోస్టులు డైరెక్టు పోస్టులు. ఐపీఎస్ చదివిన యంగ్ హీరో పాత్ర నేరుగా ఈ పోస్టుల్లోకి వెళ్ళవచ్చు. కానీ ఇన్స్ పెక్టర్ అవాలంటే ఎలాటి కోర్సులూ,  డైరెక్టు పోస్టింగులూ వుండవు. ఎస్సైగా పనిచేసి సీనియారిటీ ప్రకారం ఇన్స్ పెక్టర్ గా ప్రమోషన్ పొందాల్సిందే. 

          ఈ ఇన్స్ పెక్టర్ తర్వాత డీఎస్పీ గా ప్రమోట్ అవచ్చు. పోలీసు వ్యవస్థ రెండు విధాలుగా వుంటుంది : జిల్లా పోలీసు వ్యవస్థ, నగర కమీషనరేట్ వ్యవస్థ. జిల్లాకి ఎస్పీ ఉన్నతాధికారిగా వుంటాడు. ఈయనకింద ఏఎస్పీలు, డివిజన్ కొకరు చొప్పున డీఎస్పీలు, డీఎస్పీల కింద సర్కిల్ కొకరు చొప్పున ఇన్స్ పెక్టర్లు, ఇన్స్ పెక్టర్ల కింద వాళ్ళ సర్కిల్స్  లో పోలీస్ స్టేషన్ కొకరు చొప్పున ఎస్సైలూ వుంటారు.

          నగర కమీషనరేట్ వ్యవస్థలో కమీషనర్, ఆయన కింద  డిసిపిలు, డిసిపిల కింద ఎసిపిలు, ఎసిపిల కింద సర్కిల్ కొకరు చొప్పున  ఇన్స్ స్పెక్టర్లు, ఇన్స్ పెక్టర్ల కింద  వాళ్ళ సర్కిల్స్ లో పోలీస్ స్టేషన్స్ లో ఒకరి కంటే ఎక్కువమంది ఎస్సైలూ వుంటారు.

          ఫార్ములా యాక్షన్ మూవీస్ లో ఎలా చూపిస్తారంటే నగరంలో ఎస్పీ ధూంధాం చేస్తూంటాడు. నగరంలో ఎస్పీ పోస్టే వుండదని ఇంగితం చెప్తున్నా అలాగే చూపిస్తారు. కానీ డార్క్ మూవీ కథ నగరంలో జరిగితే కమీషనరేట్ వ్యవస్థని, జిల్లాల్లో ఎక్కడైనా కథ జరిగితే ఎస్పీ వ్యవస్థనీ ఖచ్చితంగా వేర్వేరుగా చూపించాల్సిందే. 

          డార్క్ మూవీస్ లో  హీరోకి ఎస్సై పాత్ర తర్వాత,  సినిమాటిక్ గా పనికొచ్చే మరికొన్ని పాత్రలున్నాయి : క్రైం రిపోర్టర్, క్రిమినల్ లాయర్, క్రైం నవలా రచయిత అన్నవి. హిందీ ‘మనోరమ- సిక్స్ ఫీట్ అండర్’ లో  హీరో అభయ్  డియోల్ పాత్ర డిటెక్టివ్ నవలా రచయిత పాత్రే.   నానా పాట్లు పడి  పోలీసులకి సమాంతరంగా హత్య కేసు పరిశోధిస్తూంటాడు. ఇక క్రైం రిపోర్టక్ కీ లాజికల్ గా హత్య కేసుల్ని పరిశోధించే అనుమతి  వుంటుంది. అలాగే క్రిమినల్ లాయర్ పాత్ర కూడా పాపులరే. దీనికోసం 1960 లోరాజేంద్ర కుమార్ తో బీఆర్ చోప్రా తీసిన ఖానూన్ (చట్టం) అనే బిగి సడలని క్లాసిక్ హిట్ చూడాల్సిందే. ఇంకా క్రిమినల్ లాయర్ పాత్రకోసం ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్ సృష్టించిన నవలా పాత్ర పెర్రీ మేసన్ తో వచ్చిన హాలీవుడ్ సినిమాలూ, టీవీ సిరీస్ లూ యూట్యూబ్ లో విరివిగా దొరుకుతాయి, అవి చూడవచ్చు. 

          డార్క్ మూవీ హీరోగా ఎస్సైకి ప్రత్యాన్మాయంగా క్రైం రిపోర్టర్, క్రైం రైటర్, క్రిమినల్ లాయర్ మొదలైన పాత్రలు మాత్రమే సినిమాటిక్ న్యాయాన్ని చేకూరుస్తాయని గ్రహించాలి. ఎప్పట్నించో  నగరాల్లో ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలున్నాయి. ఇవి ప్రజల దృష్టికి అంతగా రావడంలేదు. సినిమా ప్రేక్షకులు కూడా వీటిని సినిమాటిక్ గా తీసుకోవడంలేదు. 2014 లో విడుదలైన తమిళ డబ్బింగ్  ‘భద్రమ్’ లో హీరో అశోక్ సెల్వన్ ది ఒక డిటెక్టివ్ ఏజెన్సీలో పనిచేసే ప్రైవేట్ డిటెక్టివ్ పాత్ర. ఇది సినిమాటిక్ గా వర్కౌట్ కాలేదు. డిటెక్టివ్ ఏజెన్సీలు హత్యకేసుల జోలికి వెళ్ళే అనుమతి లేదు. వాటికి  చీటింగ్, ఫ్రాడ్, బ్యాక్ గ్రౌండ్ చెక్, మిస్సింగ్ కేసులు, కార్పోరేట్ గూఢచర్యం. ఇన్సూరెన్స్ మోసాలు, ఆస్తి వివాదాలు  వంటి పరిధుల్లోనే లైసెన్సులు వుంటాయి. ప్రైవేట్ వ్యక్తులు, కంపెనీలు వీటి సేవలు పొందుతారు తప్ప,  పోలీసులు వీటి సహాయం తీసుకోరు. ఈ డిటెక్టివ్ ఏజెన్సీలు సినిమా ప్రేక్షకుల కరుణా కటాక్షాలకి దూరంగానే వుండిపోతున్నాయి. డిటెక్టివ్ అన్న పదమే ఇప్పటికీ తలకెక్కడం లేదు మెజారిటీ సంఖ్యలో జనాలకి. సినిమా ఫీల్డులోనూ చాలామందికి డిటెక్టివ్ ఎవరో తెలీదు. 

          ఇక నగర పోలీసు వ్యవస్థలో క్రైం బ్రాంచ్ అని వుంటుంది. ఈ క్రైం బ్రాంచ్ లో డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్లు వుంటారు. అయినా డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ పాత్రకి సినిమాల్లో ఛాన్సు లేదు. ఎవరో గ్రహాంతర వాసిలా అన్పిస్తాడు. సినిమాల్లో కేవలం ఇన్స్ పెక్టర్ అనే వాడుంటేనే అర్ధంజేసుకో గల్గుతారు ప్రేక్షకులు.  తెలుగు డిటెక్టివ్ నవలల్లో క్రైం బ్రాంచే తప్ప పోలీస్ స్టేషన్లు వుండేవి కావు. ఈ క్రైం బ్రాంచుల్లో పనిచేసే డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ పాత్రలు కొన్ని పాపులరయ్యాయి-  ఈ డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ పాత్రలు పాఠకుల అభిమాన డిటెక్టివ్ పాత్రలకి సహాయంగా వుండేవి లాజిక్ లేకుండా. 

          ఇదంతా హీరోని  నేర పరిశోధకుడుగా చూపించడం గురించి. ఇక నిందితుడిగా చూపించే డార్క్ మూవీస్  కథలుంటాయి. హత్య కేసు మీదపడి  దాంట్లోంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు. ఇక్కడ హీరో సామాన్యుడై  వుంటాడు. అయితే  ‘ఖైదీ’ లో చిరంజీవి లాంటి యాక్షన్ హీరో అయివుండడు. డార్క్ మూవీస్ పాత్రలూ కథలూ మేధస్సునే ప్రస్ఫుటింప జేస్తాయి. మేధస్సుతోనే సమస్యా పరిష్కారమనేది వుంటుంది. కాబట్టి ఈ నిందితుడైన సామాన్యుడైన హీరో పోలీసుల్ని కొట్టి పారిపోవడం, బిగ్ యాక్షన్ ఎపిసోడ్స్ కి తెర తీయడం వంటివి వుండవు. ఇలాటి హాలీవుడ్ నోయర్ హీరో పాత్రలు నైరాశ్యంతో వుంటాయి, లోకం మీద కసితో వుంటాయి, తిరుగుబాటు మనస్తత్వంతో వుంటాయి, తన విలువలే ప్రామాణికమన్న ధోరణిలో వుంటాయి. దీనికి ఉదాహరణగా  తెలుగు సినిమాలు చూపడం కష్టం. తెలుగులో నోయర్ సినిమాల జాడ లేదు గనుక. హాలీవుడ్ లో  'టాక్సీ డ్రైవర్',  'చైనా టౌన్' లాంటి ప్రసిద్ధ నోయర్ సినిమాలున్నాయి అవి చూడొచ్చు.

          బాధిత, లేదా నిందితుడైన హీరో తను నిర్దోషి అని నిరూపించుకోవడానికి ఏదైనా క్లూ పట్టుకుంటాడు. క్లూ కోసమే ప్రయత్నిస్తూంటాడు. ఆ క్లూ అతడికి దొరక్కుండా విలన్ లేదా, పోలీసులు అడ్డు పడుతూంటారు. హీరో చుట్టూ వంచించే, వేధించే, మోసగించే, నమ్మక ద్రోహం చేసే పాత్రలే వుంటాయి. చివరికి న్యాయమే గెలిచినా నోయర్ మూవీస్ ఎలిమెంట్స్ ఇవే- వంచన, వేధింపులు, మోసం, నమ్మక ద్రోహం...


(రేపు- ‘నోయర్ హీరోయిన్ నోట్సు’)
-సికిందర్