రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, July 25, 2015

కాపీ కొట్టడమెలా?



స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సాయి కిశోర్ మచ్చ

తారాగణం :  అల్లరి నరేష్, సాక్షి చౌదరి, ఆశీష్ విద్యార్థి, సప్తగిరి, చంద్రమోహన్, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, కృష్ణభగవాన్, పోసాని తదితరులు
కెమెరా: దాము నర్రావు
, సంగీతం: సాయి కార్తీక్, మాటలు: శ్రీధర్ సీపాన
బ్యానర్ :ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి., నిర్మాత : రామబ్రహ్మం సుంకర
విడుదల : జూలై
24,2015.

***
తెలుగులో ఉన్న ఏకైక కామెడీ హీరోకి తనతో తనే పోటీ పడలేని పరిస్థితి తలెత్తుతోంది!. వరస ఫ్లాపులతో సతమత మవుతూ- ఓ హిట్ కోసం ఇంకేం చేయాలో తోచక, కొరియన్ సినిమాల మీద దృష్టి సారిస్తే గతంలో ఒకటి హిట్టయ్యిందనీ, కనుక మళ్ళీ ఆ దృష్టే ఇంకో హిట్ కి బాట వేయవచ్చనీ ఆశించి చేసిన ఈ తాజా ప్రయత్నమూ కలిసిరాక పోవడం  చాలా బ్యాడ్.

    జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, వంశీ, రేలంగి నరసింహారావు ల్లాగా జీవితంలోంచి కామెడీని సృష్టించే దర్శకులు గాక, సినిమాల్లోంచి దిగుమతి చేసుకునే రెడీమేడ్ ‘కామెడీ దర్శకులు’  ఇవ్వాళ్ళ రావడం చేత అల్లరి నరేష్ కీ పరిస్థితి. తను స్పెషలైజ్ చేస్తున్న కామెడీ రంగంలో తనని నిలబెట్టేంత ప్రతిభగల నిజమైన హాస్యరస సృజనకారులు ఒక్కరైనా ఉన్నారా  అని ప్రశ్నించుకుంటే, లేదనే సమాధానం వస్తుంది. మొత్తం కామెడీకే ఒకే ఒక్క హీరో మిగిలడం నరేష్ కి కాలం ఇస్తున్న బంగారు అవకాశం. దీనికి కట్ అండ్ పేస్ట్ దర్శకులతో ప్రయోగాలు చేస్తున్నంత కాలం, కాలం కలిసి వచ్చే అవకాశమే  లేదు... 



           టాప్ దర్శకుడు శ్రీను వైట్ల దగ్గర కో - డైరెక్టర్ గా అనుభవం సంపాదించిన సాయి కిషోర్ సైతం దర్శకుడుగా తన మొదటి సినిమాకి తనదైన ఒరిజినాలిటీతో గాక, విదేశీ కాపీ వ్యవహారం మీద ఆధారపడ్డం దేనికో అర్ధంగాదు. నిజానికి విదేశీ సినిమాని తెలుగు నేటివిటీకి తగ్గట్టు కాపీ కొట్టి తీయడమే కష్టం- సొంతంగా తెలుగులోనే కథేదో ఆలోచించుకుని తంటాలు పడ్డం సులభం. కాపీ కొట్టేటప్పుడు కథనం కూడా మార్చేస్తే ఎలా? ఆ వొరిజినల్ తీసిన దర్శకుడు ఆ సబ్జెక్టుకి ఎన్నో రకాలుగా ఆలోచించి ఆలోచించి  ఇప్పుడున్న తీరులో కథనాన్ని తీర్చిదిద్దుకుని సక్సెస్ సాధించి ఉంటాడు. దాన్ని కాపీ కొడుతూ ఆ కథనాన్ని కెలకడానికి ఇంకేమీ వుండదు - ఆ కథకి ఆ కథనమే నప్పుతుందని బాక్సాఫీసు సాక్షిగా ఒకసారి రుజువయ్యాక! ఇలాటివి అర్ధం జేసుకోకుండా కథనం మీద తెలుగుకి ఇంకేదో ‘బెటర్ మెంట్’ (!) ఆలోచిస్తే ఈ సినిమాలాగే వుంటుంది!

          కాపీకూడా ఎలా కొట్టాలో మాట్లాడుకునే దుస్థితిలో  మనం వుండడం కాపీ కొట్టిన  సినిమాల వల్లే  కలుగుతోంది- కాపీ ఎలా కొట్టి వుండాల్సిందో మాట్లాడుకోవడమంటే ఆ కాపీని (కథా చౌర్యాన్ని) సమర్ధించినట్టే  అవుతుంది. ఈ సినిమా మాతృక అయిన ‘మై వైఫ్ ఈజే గ్యాంగ్ స్టర్’ దర్శకుడు కూడా ఈ సినిమాతో పరిచయమైన కొత్త దర్శకుడే. కొరియన్ దర్శకులెందుకో హాయిగా హాలీవుడ్ సినిమాల్ని కాపీ కొట్టుకోకుండా, ఇంత కష్టపడి తమ క్రియేటివిటీనంతా  తెలుగు దర్శకులకి ధారదత్తం చేస్తున్నారు!

          ఈ నేపధ్యంలో ఈ కామెడీ కథేమిటో చూద్దాం..
ఆమె పెళ్లి పథకం
      దుబాయిలో డాన్ గా ఆధిపత్యం చెలాయిస్తున్న పూజ ( సాక్షిచౌదరి) తన ప్రత్యర్ధి బడా ( ఆశీష్ విద్యార్థి ) అనే అతడి కొడుకుని ఒక గొడవలో చంపేస్తుంది. ప్రతీకారంగా ఈమెని చంపడం కోసం బడా ప్రయత్నాలు మొదలెడతాడు. ఇంతలో ఇండియాలో తనకో తల్లి వుందని తెలుస్తుంది పూజకి. చిన్నప్పుడు తనని తీసుకుని తన తండ్రి దుబాయ్ వచ్చేసి డాన్ గా ఎదిగాడు. తనని కూడా డాన్ గా తయారు చేశాడు. ఇప్పుడు క్యాన్సర్ తో బాధ పడుతున్న తల్లిని హైదరాబాద్ వచ్చి కలుసుకుంటుంది. ఆమె పరిస్థితి చూసి ఇక్కడే సెటిలయి పోతుంది. ఇదిలా వుండగా ఇంకెంతో కాలం బతకని ఆ తల్లి ఓ కోరిక కోరుతుంది- పూజ పెళ్లి చేసుకోవాలని. పూజ దీన్ని కాదన లేక పోతుంది.

         దీంతో తన గ్యాంగ్ ని పురమాయించి, తను డాన్ అనే సంగతి చెప్పకుండా వరుణ్ణి వె
మంటుంది- ఇది పేరుకే పెళ్లనీ, కేవలం తల్లి కోరిక తీర్చడానికి  చేసుకుంటున్నా ననీ అంటుంది.

          ఇక్కడే ఒక అమాయకుడైన, భయస్థుడైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నాని ( నరేష్) అనే వాడు ఉంటాడు. ఇతడికి పద్ధతిగల అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఇల్లు కట్టుకుని హాయిగా జీవించాలని వుంటుంది. ఒకరోజు అలాటి కలల రాణిగా కన్పించిన పూజని చూసి మనసు పారేసుకుంటాడు. ఆ ఫోటో పట్టుకెళ్ళి మ్యారేజ్ బ్యూరోని సంప్రదిస్తాడు. ఆ బ్యూరో అతను ( కృష్ణ భగవాన్) పూజ ఒక  డాన్ అన్న సంగతి చెప్పకుండా సంబంధం కుదిర్చేస్తాడు.

          ఇక పెళ్లి చేసుకున్న పూజా ఒక భార్యలా ప్రవరించక పోవడంతో, మొదటి రాత్రి కూడా జరక్కపోవడంతో నానికి కష్టాలు మొదలవుతాయి. ఈ ఉత్తుత్తి  పెళ్ళితో తల్లిని సంతృప్తిపర్చి తన ‘బిజినెస్’ చూసుకుంటూ వుంటుంది పూజా. ఆ బిజినెస్ ఏమిటో, అసలామె ఎవరో ఒకరోజు నానికి తెలిసిపోవడంతో, బెదిరిపోయి పారిపోయేందుకు  విఫలయత్నాలు చేస్తూంటాడు...

          ఇదీ విషయం. ఇలా పెళ్లి నటిస్తున్న పూజాని ఆమె తల్లి ఇంకేం కోరిక కోరింది? దాంతో ఆమెకి నాని అవసరం ఎలా ఏర్పడింది? వీళ్ళిద్దరి కాపురం ఎలా చక్కబడింది? మధ్యలో దుబాయ్ లో వున్న ప్రత్యర్ధి ఇంకేం చేశాడు?  ఇవన్నీ కలుపుకుని ఇక్కడ్నించీ సాగే కథ.

ఎవరెలా చేశారు?
      నరేష్ కిది వెంటనే రెండోసారి ఈ తరహా పాత్ర పోషించడం- గత నవంబర్లోనే ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’  అనే హీరోయిన్ ఓరియెంటెడ్  సినిమాలో కవల సోదరి ధాటికి కి తట్టుకోలేని సోదరుడి పాత్రలో ఎలా చిత్తయ్యాడో- తిరిగి ఇప్పుడూ  ‘జేమ్స్ బాండ్ - నేను కాదు నా పెళ్ళాం’  అంటూ హీరోయిన్ కే అప్పజెప్పేసిన కథలో చతికిలబడిపోయాడు. కామెడీ ఎంత చేశానన్నది కాదు, ఎలాటి పాత్రలో కామెడీ చేస్తున్నామన్నది ముఖ్యం. ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ని ఫాలో అయ్యే పాసివ్ పాత్రలే పోషించినట్టు నరేష్ కి తెలిసి వుంటే- పాసివ్ పాత్రలతో మెప్పించడానికి వచ్చే సమస్యలేమిటో  తెలిసివుంటే, ఈ సినిమా ఒప్పుకునే వాడు కాదు. సూటిగా చెప్పుకోవాలంటే, ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ లాగే ఇదీ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమానే. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో నరేష్ కేం పని? ఇదీ ప్రశ్న! అసలు కొరియన్ ఒరిజినల్ ‘మై వైఫ్ ఈజే గ్యాంగ్ స్టర్’ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమానే. సహజంగానే ఇలాటి సినిమాల్లో హీరోకి ప్రాధాన్యం వుండదు. అతను పక్క పాత్రలా ఉండిపోతాడు. పైగా ఇలాటి పాత్రల్లో ప్రముఖ హీరోలు కూడా నటించరు- ఈ సింపుల్ లాజిక్ ని కూడా పట్టించుకోకుండా, కొరియన్ సినిమా అనగానే కళ్ళుమూసుకుని కాపీ కొట్టేస్తే ఎలా?

          తెలుగులో  పెళ్ళాం కాలి చెప్పు కింద మొగుడి  కామెడీ లెన్నో వచ్చాయి. పాసివ్ గా ఆ మొగుడు మొదట నానా ఇబ్బందులు పడ్డా, ఓ దశ కొచ్చేటప్పటికి పెళ్ళానికి ఎదురు తిరిగి యాక్టివ్ గా మారిపోతాడు, ఇక తనే కథ నడిపించుకుంటూ పోతాడు. ఈ తరహా సినిమాల్లో వుండే క్యారక్టరైజేషన్ ఇదే నని పూర్వం ఎన్నో కామెడీలు తెలియజెప్పాయి. అయినా గ్రహించకపోతే ఎలా?

          ఇలాకాక సాంతం కొరియన్ సినిమాలో వున్నట్టుగానే పాత్ర ఉండాలనుకుంటే దానికి ఇమేజి లేని నటుణ్ణి పెట్టుకోవాలి. కొరియన్ సినిమాలో ఈ పాత్ర నటించిన పార్క్ సాంగ్ మ్యూన్ మొదటి నుంచీ సహాయ పాత్రలు వేస్తున్న నటుడే తప్ప హీరో కాదు. సహాయ పాత్రలోనే -పెళ్ళాం చాటు మొగుడిగా ఇదే  ‘మై వైఫ్ ఈజే గ్యాంగ్ స్టర్’ (2001)  తో మంచి పాపులారిటీ సంపాదించుకోవడంతో- ఆ వెంటనే హీరోగా మారిపోయి రెండు కామెడీల్లో నటించి అట్టర్ ఫ్లాపయ్యాడు- తిరిగి సహాయ పాత్రల కొచ్చేశాడు. ఇలాటిది కామెడీ హీరోగా ఇమేజి వున్న నరేష్ సహాయ పాత్రలో నటిస్తే  ప్రేక్షకు లెలా రిసీవ్ చేసుకుంటారు? కాబట్టి ఎంత కామెడీ చేశామన్నది కాదు, ఏ పాత్రలో చేశామన్నది ముఖ్యం. తన పాత్ర ఎంతకీ హీరోగా మారకపోతే ఆ కామెడీ అంతా దేనికనేది ఎవరికైనా తట్టే ప్రశ్న!
                                                          ***
         స్టయిలిష్ డాన్ పాత్రలో సాక్షి చౌదరి ఒడ్డూ పొడవూ సరిపోయాయి. కాస్ట్యూమ్స్ కూడా ఆమె డాన్ పాత్ర ని ఎలివేట్ చేశాయి. సీరియస్ దృశ్యాల్లో, యాక్షన్ దృశ్యాల్లో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ వెలకట్ట లేనిదే- కానీ సాంప్రదాయ దుస్తుల్లో ఒకమ్మాయిగా ఆమె నటన వెలవెలబోయింది. ఆడతనంతో హావభావ ప్రకటన అంత ఆకట్టుకోదు. పాత్రకి రెండు షేడ్స్ వున్నాయి. మొదటి యాక్షన్ షేడ్ కి మాత్రమే  న్యాయం చేయగల్గింది.
          ఇక ఆమె గ్యాంగ్ లో వున్న సప్తగిరి  సహా హాస్య పాత్రలవి బలవంతపు కామెడీయే. వేరే ఫ్యాక్షన్ పాత్రల కామెడీ కూడా అదో రకం. మాటల రచయిత శ్రీధర్ సీపాన క్రియేటివిటీ ప్రాస డైలాగులకే సరిపోయింది. ఈ సినిమాలకి ఆవల- బయట జీవితంలో- ఇతర రంగాల్లో నిఖార్సయిన చాలా హాస్యముంది రియల్ గా ఎంజాయ్ చేయడానికి - కామెడీ కోసం ఇలాటి కృత్రిమ కామెడీ సినిమాలకే వెళ్ళనవసరం లేదు.

          పాటలు ఒకటి రెండు ఫర్వాలేదు. ఇక ఫైట్స్ తప్ప ఇతర సాంకేతిక విభాగాలకి ఏ ప్రత్యేకతా కన్పించదు.
         
          ఇక దర్శకత్వం ఈ కాలపు కొత్త దర్శకుడికి మల్లే గాక, ఓల్డ్ ఫ్యాషన్డ్ గా వుంది. కొరియన్ ఒరిజినల్ తీసిన కొత్త దర్శకుడు చో జింగ్యూ క్రియేషన్ తో పోలిస్తే- తెలుగులో ఇది రొడ్డ కొట్టుడు టేకింగ్. దర్శకుడి ముద్ర- ‘ఫలానా ఈ ముద్రతో, శైలితో కొత్త దర్శకుడిగా నేను ప్రేక్షకుల ముందుకు  ఇలా వస్తున్నా’ నంటూ ఓ ప్రామిజింగ్ ఆరంభం ఈ సినిమాతో వుంటే బావుండేది. అంతిమంగా  తెరమీద సినిమా ఎలా కన్పిస్తుందో నిర్ణయించేది డైలాగ్ వెర్షనే అయినప్పుడు,  ఆ డైలాగ్ వెర్షన్ని తీసుకుని ఇదివరకు దర్శకులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయే వాళ్ళు. నిశ్శబ్ద వాతావరణం లో, మౌన ముద్రలో కెళ్ళి పోయి- మనసు తెర మీద ఆ డైలాగ్ వెర్షన్ని రన్ చేసుకుంటూ, దీన్ని ఏ శైలీ శిల్పాలతో తెరకెక్కించాలో మనసులో ముద్రించుకుని- శబ్ద ఫలితాలు  సహా తీవ్రమైన  పేపర్ వర్క్ చేసుకుని, సర్వసన్నద్ధులై సెట్స్ కి వెళ్లేందుకు వచ్చేవాళ్ళు.

స్క్రీన్ ప్లే సంగతులు
          ఈ స్క్రీన్ ప్లే ఎలా వుందో చూసే ముందు ఒరిజినల్ కొరియన్ మూవీ ‘మై వైఫ్ ఈజే గ్యాంగ్ స్టర్’ - (జోపాగ్ మనూరా) ఎలా వుందో చూడాల్సిందే : ఇందులో హీరోయిన్ ఓ క్రిమినల్ ఆర్గనైజేషన్లో నంబర్ టూగా వుంటుంది. చిన్నప్పుడు ఈమె, ఈమె అక్క అనాథాశ్రమంలో పెరుగుతున్నప్పుడు తను తప్పి పోయింది. ఎక్కడో పెరిగి పెద్దదై  క్రిమినల్ గా మారిపోయింది తను. ఇప్పుడా అక్క ఫలానా ఆస్పత్రిలో క్యాన్సర్  పేషంట్ గా ఉందని తెలిసి వెళ్లి కలుసుకుంటుంది. ఇద్దరూ భావోద్వేగాలకి లోనవుతారు. ఇక ఇంకొద్ది కాలంలో చనిపోబోయే అక్క ఒక కోరిక కోరుతుంది- చెల్లెల్ని పెళ్లి కూతురిగా చూడాలని.
          
           చేసేదిలేక  ఆ పెళ్లి ప్రయత్నాల్ని తన అనుచరుడు ‘రోమియో’ కి అప్పజెప్తుంది హీరోయిన్. అయితే తానెవరో బయట పెట్ట వద్దంటుంది. ఆ సంబంధాలు చూసేందుకు రోమియో చేసే ప్రయత్నాలు బెడిసికొడుతున్నప్పుడు, ఓ రోజు రోడ్డు మీద ఓ చిన్న గొడవకి ఓ ఇద్దరు హీరోయిన్ మీద దాడి చేస్తారు. ఇది చూసిన ఒకతను ఆమెని కాపాడేందుకు అడ్డు పడతాడు. చూసుకోకుండా ఆమె అతడి తల పగులగొట్టేస్తుంది. అతను అమాయకుడైన ప్రభుత్వోద్యోగి. హాస్పిటల్లో పడ్డ ఇతడి వివరాలు తెలుసుకుని హీరోయిన్ తో పెళ్లి చూపులు ఏర్పాటు చేసేస్తాడు రోమియో. ఈమె పెళ్లి చేసుకుంటోందని వైట్ షార్క్ అనే ప్రత్యర్ధి గ్యాంగ్ బాస్ కి తెలిసి, ఆ పెళ్లి చెడగొట్టేందుకు అనుచరుల్ని పంపిస్తాడు. ఆ గలాటా మధ్యలోనే పెళ్ళయిపోతుంది. 

        పెళ్ళయ్యాక ఆఫీసులో గొడ్డు చాకిరీలాగే ఇంటి చాకిరీ కూడా చేయాల్సి వస్తుంది అమాయకుడికి. ఆమె భార్యలా కాపురం చేయకుండా మగరాయుడిలా తిరుగుతూంటుంది- ఏమంటే బయట వేశ్యల్ని చూసుకోమంటుంది. హర్టయి, పెళ్ళంటే మరణ శిక్ష విధించడం కాదంటూ  ఆమెని ‘రేప్’ చేసేస్తాడు. కానీ ఇంకా తర్వాత ఆ ప్రయత్నం ఎప్పుడు చేసినా - నా పర్మిషన్ లేకుండా నా దగ్గరి కొస్తే తంతానంటూ లాగి తంతూంటుంది.

          వీళ్ళ  ‘కాపురం’ ఇలా సాగుతోందో తెలిసి, ఇక సామరస్యం కుదుర్చాలన్న ఉద్దేశంతో అక్క వచ్చి మకాం వేస్తుంది. కాపురం చేసే పద్దతి ఇది కాదని చెల్లెలికి నచ్చ జెప్తూ, ఆమె బిడ్డని కంటే చూడాలనుందని మరో కోరిక కోరుతుంది. దీంతో ఇరకాటంలో పడ్డ హీరోయిన్ ఇక తప్పక, అమాయక భర్తని రేప్ చేయడం మొదలెడుతుంది- ఎక్కడపడితే అక్కడ, ఎప్పుడుపడితే అప్పుడు. తట్టుకోలేక పోతాడు.

          ఇలా వుండగా, ఈమె పెళ్లి చేసుకుని సుఖపడుతోందని భావించుకున్న వైట్ షార్క్ అనుచరుడొకడు, ఓర్చుకోలేక మళ్ళీ కెలుక్కుంటాడు. ఈసారి వాణ్ణి పొడిచి పారేస్తుంది. వెంటనే ఇరుపక్షాల అత్యవసర సమావేశం ఏర్పాటవుతుంది. హీరోయిన్ బాస్ కూడా వస్తాడు. హీరోయిన్ తన అనుచరుణ్ణి అన్యాయంగా పొడిచేసింది గనుక, ఇప్పుడీమె మార్షల్ ఆర్ట్స్ వీరుడైన తన ముఖ్య అనుచరుడితో తలపడి నిరూపించుకోవాలని వైట్ షార్క్ సవాలు విసురుతాడు. ఈ పోరాటంలోకూడా ఓడించి పారేస్తుంది హీరోయిన్.

          తీరా ఆమె గర్భం ధరించిన విషయం, అదే సమయంలో ఆమె గ్యాంగ్ లీడర్ అన్న సంగతీ ఒకే సారి తెలుస్తాయి భర్తకి. ఆ షాక్ లోంచి తేరుకుని, జరిగిందేదో జరిగిపోయింది, ఇక ఈ వృత్తి మానెయ్యమంటాడు. ఆమె కొంత సమయం అడుగుతుంది. 

          కథా ప్రారంభంలోనే ఆమె అనుచరుడు రోమియో ఓ టీనేజీ కుర్రాణ్ణి  పట్టుకొచ్చి గ్యాంగులో పోస్టు ఇప్పిస్తాడు. ఎప్పుడూ ఈ టీనేజర్ని ని వెంటేసుకు తిరుగుతూ ప్రతీ దానికీ లాగిపెట్టి ఒకటిచ్చుకుంటూంటాడు. ఈ టీనేజర్ ని ఒకసారి సిటీలోనే ఒక చిల్లర గ్యాంగ్ రోడ్డు మీద బట్టలిప్పించి కొడతారు. ఇది రోమియో దృష్టి కొస్తుంది. వాళ్ళని పట్టుకుని తను చితకబాదుతాడు. ఈ నేపధ్యంలో ఇప్పుడు రోమియో కి ఒక లవర్ దొరుకుతుంది. ఈమెకి గిఫ్టు కొనుక్కుని వచ్చేందుకు బయటి కెళ్ళినప్పుడు ఆ చిల్లర గ్యాంగ్ పట్టుకుని చంపేస్తారు. ఇది వైట్ షార్క్ చేయించిన హత్యగానే భావించుకున్న హీరోయిన్ వాళ్ళ మీదికి  సమరానికి కెళ్తుంది- కడుపుతో వున్న ఆమెని తీవ్రంగా గాయపరుస్తారు. హాస్పిటల్ పాలవుతుంది. దీంతో అమాయక భర్త వైట్ షార్క్ మీద పగ బడతాడు. 

          వైట్ షార్క్ ఘనంగా పార్టీ చేసుకుంటూ- తన జీవితంలో ఈ జులై- ఆగస్టు మాసాల్లో టపాకాయలు పేలి వెలుగులు విరజిమ్ముతాయని జాతకంలో రాసుందని చెప్పుకుంటాడు. అమాయక భర్త పెట్రోలు తెచ్చి వాళ్ళ మీద గుమ్మరిస్తాడు. వైట్ షార్క్ కి సిగరెట్ ముట్టిద్దామని లైటర్ వెలిగిస్తాడు తెలివి తక్కువ అనుచరుడు. దాంతో తను చెప్పిన జీవితంలో మతాబుల వెలుగుల్లాగే ఒక్కసారి మంటలు రేగి మాడి మసైపోతాడు వైట్ షార్క్ ముఠాతో సహా!
                                                          ***


విలన్ - జంగ్ సే జిన్
        ఒక సున్నిత హాస్యకథా చిత్రమిది! ఈ ఫీల్ ని ఎక్కడా చెదరనివ్వలేదు కొత్త దర్శకుడు చో జింగ్యూ. ‘నా పెళ్ళాం గ్యాంగ్ స్టర్’ అని టైటిల్ వున్నా ఇదస్సలు గ్యాంగ్ స్టర్స్ తన్నుకునే  కథ కాదన్న స్పష్టతతో వున్నాడు దర్శకుడు. అందువల్ల హీరోయిన్ కి - ఆమె ప్రత్యర్ధి వర్గంతో ఏవో వృత్తిపరమైన గొడవల జోలికీ, యాక్షన్ ఎపిసోడ్లకీ పోలేదు. ఎక్కడా ఆమెని గ్యాంగ్ స్టర్ లా బిల్డప్ ఇస్తూ కూడా చూపించలేదు. పైగా ఈ పాత్రకి ఒక  ‘హీ- మాన్’ లాంటి స్ట్రాంగ్ బాడీ వున్న నటిని కూడా ఎంపిక చేసుకోలేదు. అతి సాధారణంగా కన్పించే షిన్ యున్ క్యుంగ్ అనే హీరోయిన్ని తీసుకున్నాడు. ఈమె 1989 నుంచీ ఈ సినిమా అప్పటికి డజను కొరియన్ సినిమాల్లో నటించిన అనుభవంగల నటీమణి. 2001 లో ‘మై వైఫ్ ఈజే గ్యాంగ్ స్టర్’ తర్వాత మరో పది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది. వీటిలో ‘మై వైఫ్ ఈజే గ్యాంగ్ స్టర్’ -  2, 3 కూడా వున్నాయి. తాజాగా 2014 లో ‘ది ప్లాన్’ అనే మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో లోన్ మాఫియాగా నటించింది. 

         ప్రస్తుత సినిమాలో ఆ మూడు చోట్ల ఫైట్ సీన్లలో తప్పితే  మరెక్కడా వీరావేశంగానీ, అనవసర గాంభీర్యంగానీ ప్రదర్శించదు. గ్యాంగ్ సభ్యులతో కూర్చున్నా లేచినా ఎలాటి బిల్డప్స్ వుండవు. ఈ సినిమా మొత్తాన్నీ ప్రధానంగా కొన్ని ముఖ్య పాత్రల గురించి కథగా అర్ధం జేసుకోవాలి. కొన్ని ముఖ్య పాత్రల గురించి కథా కథనాలు కావడం వల్ల ఆ  ప్రతీ ఒక్క పాత్రా గుర్తుండిపోయే విధంగా పాత్రచిత్రణ చేశారు. ఈ పాత్ర చిత్రణలకి దర్శకుడికి ఒక స్థిరమైన విజన్ వుండి తీరింది! 

దర్శకుడు చో జింగ్యూ

హీరోయిన్ షిన్ యున్ క్యుంగ్

     గ్యాంగ్ స్టర్ గా మగరాయుడిలా తిరుగుతున్న ఆమెని అక్క ఏమని కోరింది? పెళ్లి చేసుకుంటే చూడాలని వుందంది. దీనికి హీరోయిన్ పాత్ర రియాక్షనేమిటి? ఒకసారి తనని తాను చూసుకుంది- తను పెళ్లి చేసుకోగల ఆడదేనా అన్నట్టు! ఈ కథ పాత్రల గురించే! ఆయా పరిస్థితుల్లో పాత్రలెలా రియాక్టవుతాయో వాటి మానసిక ప్రపంచాల్నీ  చూపిస్తూ, అంత బలంగా కథని ప్రేక్షకుల మనస్సుల్లో నాటడం గురించే!
          అక్క మాటతో ఆమెకి సహజంగానే రెండు పరిస్థితు లేర్పడ్డాయి : మొదటిది పెళ్లి సంబంధాలు చూసుకోవడం, రెండోది పెళ్ళికి తగ్గట్టుగా తనని తాను గ్యాంగ్ స్టర్ ఇమేజి నుంచి కుదురైన ఒక సాధారణ అమ్మాయి తరహాకి మార్చుకోవడం. రెండు పనులూ అనుచరుడు రోమియోకి అప్పజెప్పింది. మొదట  గ్యాంగ్ లోనే ఎవరైనా ఉన్నారేమో చూసి, కాదని  బయటి సంబంధాలు చూడ్డం మొదలెట్టాడు రోమియో. మరో వైపు తన బాస్ లో ఆడతనాన్ని తీర్చిదిద్దేందుకు ఒక బ్యూటీషియన్ ని తెచ్చి అప్పగించాడు. ఇక మొదలయ్యాయి  ఈ రెండు కోణాల్లో హాస్య ప్రహసనాలు. ఇన్నాళ్ళూ ఆడపిల్లగానే ఫీలవ్వని తను ఇప్పుడా ఫీలింగ్ ని డెవలప్ చేసుకోవాల్సిన పరిక్ష. మరో వైపు రోమియో తెచ్చే సంబంధాలు - పెళ్లి చూపులప్పుడు ఎలాగెలాగో ప్రవర్తించి, మాట్లాడి చెడగొట్టుకోవడం! ఇదంతా హాస్యభరితంగానే ప్రొజెక్ట్ అవుతూ వుంటుంది హాస్యరసప్రదానమైన సినిమా కాబట్టి! 

          ఇలా వుండగా, అప్పుడామె  రోడ్డు మీద జరిగిన ఒక సంఘటనలో అమాయక ఉద్యోగి తల పగులగొట్టేసింది. ఇదామె క్యారక్టర్ ఆర్క్. ఈ సంఘటనతో తను రిస్కులో పడడమే గాక, అతణ్ణి కూడా రిస్కులో పడేసిన ఆత్యయిక పరిస్థితి కథనంలో తటస్థించింది. సంఘటనని సృష్టించి దాంతో కథని ముందుకు నడిపించేదే పాత్ర. లేకపోతే ఆ పాత్ర చప్పగా తేలిపోవడమే గాక కథనాన్నీ పట్టి పల్లారుస్తుంది
-( What is character but the determination of incident? And what is incident but the illumination of character?- Henry James).

         
ఈ సంఘటనతోనే ఆమెకి పెళ్ళికొడుకు దొరికాడు.  ఆ తర్వాత పెళ్లి జరిగిపోయింది. ఇక ఈ అవసరంలేని మొగుడితో స్ట్రగుల్ చేయసాగింది. సమస్య పెళ్ళే- ఆ పెళ్ళితో వచ్చిన అమాయక భర్తే, ఈ స్ట్రగుల్ రక రకాలుగా పెరుగుతూ క్యారక్టర్ ఆర్క్ నీ, టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ నీ పెంచే మరో సమస్య ఎదురయ్యిందామెకి. అది తను బిడ్డని కనాలన్న అక్క ఆదేశం.

          మళ్ళీ బ్యూటీషియన్ ప్రవేశం. బిడ్డని కనడం గురించి ఆమెతో రకరకాల ప్రయోగాలు- ఆ ప్రయోగాలతో సీన్ రివర్సల్. ఇంత కాలం సెక్సు కోసం భర్త వేధించాడు, ఇప్పుడు గర్భం ధరించడం కోసం తను వేధించడం! వెంటనే బిడ్డని కని అక్కకి చూపించాలన్న స్ట్రగుల్ ఇలా కొనసాగింది.

          ఈ క్రమంలో క్యారక్టర్ గ్రోత్ ( ఎదుగుదల) మీద కూడా దృష్టిపెట్టాడు దర్శకుడు. లేకపోతే  ఆమె క్యారక్టర్ ఆర్క్- అర్ధవంతంగానూ సమగ్రంగానూ వుండబోదు. అందుకని ఆమెని నిజమైన గృహిణిగా  మార్చడం మొదలెట్టాడు దర్శకుడు. భర్త చిత్రించుకుని  దాచుకున్న ఒక అందమైన చిత్రపటాన్ని చూసిందామె : అందులో తనూ తన భర్తా ఇద్దరు అందమైన పిల్లలతోఅన్యోన్యంగా వున్నారు! ఇది చూసి ఆమె కదిలిపోయింది. ఒకింత అపరాధభావంతో సిగ్గుపడింది. ఇప్పుడు జీవితానికో అర్ధం పర్ధం తెలిసివచ్చింది. ప్రవర్తన మార్చుకుంది. ఇక వంట చేసే బాధ్యత భర్తకి తప్పింది. ఆమె వంట చేస్తూంటే - ఇవ్వాళ్ళ మా ఆవిడ నా కోసం వంట చేస్తోందని అతనూ   సంతోషించాడు.

          తీరా తను గర్భవతి అని తెలియడం, అదే సమయంలో తను గ్యాంగ్ స్టర్ అని భర్తకి తెలియడమూ జరిగి- అప్పుడు తను చావుకి దగ్గర్లో వున్న అక్క కోసం ఆడిన అబద్ధాన్ని నిజాయితీగా ఒప్పుకోవడం, అతను కూడా అర్ధం జేసుకోవడం వగైరా జరిగి, ఆ అస్తవ్యస్త కాపురం కథ సుఖాంతమయ్యింది!

          దీని తర్వాత తన అనుచరుడు రోమియోని ఎదుటి గ్యాంగ్ హతమార్చిందన్న పగతో, గర్భవతిగానే దండయాత్రకి వెళ్ళడం తో ఈ పాత్ర ముగింపు దశకి చేరుకుంది!

          ఇప్పుడీ క్యారక్టర్ ఆర్క్ ని చూద్దాం : గ్యాంగ్ స్టర్ గా పరిచయం / అక్కని కలుసుకోవడంతో తన గ్యాంగ్ స్టర్ అస్తిత్వానికి స్వస్తి చెబుతూ పెళ్ళికి అర్హమైన అమ్మాయిగా మారాలనుకోవడం / దీనికోసం ప్రయత్నాలు / పెళ్లి సంబంధాలతో అవకతవక పనులు / ఒకడి తల పగులగొట్టి వాణ్నే పెళ్లి కొడుకుని చేసుకోవడం/ వాడితో సరీగ్గా కాపురం చేయకపోవడం / బిడ్డని కనాలని అక్క ఇంకో షరతు పెడితే మళ్ళీ దాని కోసం స్ట్రగుల్ పడ్డం / ఈ స్ట్రగుల్లో భర్త అంతరంగం తెలుసుకుని నిజమైన భార్యగా మారిపోవడం / గర్భం ధరించి  అక్క మాట తీర్చడం / తను గ్యాంగ్ స్టర్ అని భర్తకి తెలిసిపోవడం తో నిజాయితీగా ఆ సంగతి ఒప్పుకోవడం / తన కోసం ఏమైనా చేసే రోమియో హత్యకి ప్రతీకారంగా గర్భావతిగానే రిస్కు తీసుకుని పోరాటానికి వెళ్ళడం!

          ఇదంతా చూస్తే ఈ కథ ఎవరిదన్పిస్తోంది? హీరోయిన్ పాత్రదా, లేక ఆమె భర్త పాత్రదా? ఇంకా స్పష్టత అవసరమా? కాబట్టి హీరోయిన్ కథే అయిన ఈ స్క్రీన్ ప్లేలో, పై పేరాలో చెప్పుకున్న ఈమె క్యారక్టర్ ఆర్క్ లో ఇప్పుడు పాత్ర ఎలా  కన్పిస్తోంది? అర్ధవంతమైన పాత్ర ప్రయాణమే ఇలాంటి బర్నింగ్ ఆర్క్ ని ఏర్పాటు చేస్తుంది! చిన్నప్పుడు అనాధగా తప్పిపోయిన ‘దారితప్పిన’ అమ్మాయిని అన్ని విధాలా దార్లో పెట్టి మోక్షం కల్గించడమే ఈ పాత్ర చిత్రణ వెనకాలున్న వ్యూహం. ఈ కథ కొన్ని ముఖ్య పాత్ర ( ల) గురించే తప్ప మరొకదాని గురించికాదు!
                                                          ***

టీనేజర్ తో రోమియో 
          ఇక అక్క పాత్రవిషయానికొస్తే, ఈమెకి  చెల్లెలి పనీ పాట్లు ఏమిటో తెలియకపోయినా, పెళ్ళీ గిళ్ళీ లేని ఆ చెల్లెల్ని అలా చూడలేక పెళ్లి కోరిక కోరింది. ఆ పెళ్లి తర్వాత కాపురం సవ్యంగా లేదని తనే పూనుకుని చక్కదిద్దబోయింది. ఆ క్రమంలోనే - ఈ భూమ్మీద   నుంచి మనం మన గుర్తులు వదలకుండా వెళ్ళిపోవడం క్షంతవ్యం కాదని సంతానవతి కావడం గురించి చెల్లెలికి ఉపదేశించింది. తీరా ఆమె గర్భవతి అయ్యే లోపే కన్నుమూసింది. ఇది అసంతృప్తిగా ఉందా? ఇలా జరిగితేనే ఈ పాత్ర గుర్తుండి పోతుంది. అంతేగాని చెల్లెలు కన్న బిడ్డని ఒళ్లోకి తీసుకుని ఆనందంగా తనువు చాలించడం - షిట్! షిట్! అది అధమస్థాయి పాత్రచిత్రణ- బ్యాడ్ మెలోడ్రామా- చవక బారు కథనం కూడా అవుతుంది! 

          ఇక అమాయక భర్త పాత్ర భార్యతో పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలో తెలీని అయోమయపు పాత్ర. ఈ పాత్ర భార్య పాత్ర ప్రయాణాన్ని అనుసరించే సాగిందే తప్ప ఎలాటి తిరుగుబాటూ చేయలేదు. అసలీ కథలో హీరోయిన్ కి సమస్యని ఎలా డిజైన్ చేశారంటే, ఆమెకి అక్క కోరిక తీర్చడమే సవాలుగా మారేట్టు! అంతే తప్ప భర్త ఆమెకి సమస్య కాదు, బయట విలనూ తనకి సమస్య కాదు! అక్కతో వచ్చిన సమస్యే తనకి విలన్! ఈ విలన్ తో తను మానసిక ప్రపంచంలో అంతర్యుద్ధం చేస్తోంది- ఎమోషనల్ గోల్ కోసం! సమస్య ఇక్కడ (ఎమోషనల్ గా ) పుట్టినప్పుడు బయట వేరే ఫిజికల్ గోల్స్ వుండవు- భర్తని  దారికి తెచ్చుకోవాలనో, విలన్ అంతు చూడాలనో వుండదు. ఆమెకి అక్క వల్ల  ఏర్పడిన ఎమోషనల్ గోల్ మాత్రమే  వుంది.  కాబట్టి భర్త పాత్రని తిరుగుబాటు చేయించి వేరే విలన్ ని ఫిజికల్ గా సృష్టించకుండా జాగ్రత్త పడ్డాడు లేదు దర్శకుడు. అప్పుడది మొదలెట్టిన కథకి న్యాయం చేయని వేరే పిచ్చి కథవుతుంది కాబట్టి!
          భార్యతో పరిస్థితి చక్కబడ్డాకే- ముగింపులో గర్భవతిగా వున్న ఆమె పోరాటానికి వెళ్లి ప్రమాదంలో పడినప్పుడు మాత్రమే ఈ  భర్త పాత్ర యాక్టివేట్ అయ్యింది. వెళ్లి ఆ గ్యాంగ్ ని భస్మీపటలం చేశాడు!

          ఇక రోమియో, అతను పట్టుకొచ్చే టీనేజీ కుర్రాడూ మరో రెండు ముఖ్య పాత్రలు. టీనేజర్  ‘పని’ నేర్చుకుంటున్నాడు. రోమియో కి బాస్ ( అంటే హీరోయిన్- ఈమెని బిగ్ బ్రదర్ అని పిలుస్తాడు- ఇలాటి పిలుపుల వల్లే  కాబోలు ఈమె తన ఆడతనాన్ని మర్చిపోయింది) అంటే ఎనలేని గౌరవం. ఈమె ఏం చెప్తే అది చేయడానికి కామెడీగా గొప్ప హడావిడీ చేస్తాడు. పెళ్లి సంబంధాల్ని  చూడ్డం తో మొదలయ్యే ఇతడిగాడి  క్యారక్టర్ ఆర్క్- ఆ పెళ్లి జరిపించడం, అయినా కాపురంలో ఇన్వాల్వ్ కాకుండా పక్క పనులు చూసుకోవడం, అవికూడా లేక టీనేజర్ని వెంటేసుకుని బలాదూరు తిరగడం, వాణ్ణి ఎవరో తన్నారని  ఆ చిల్లర గ్యాంగ్ ని తన్నడం, తన రోమియో అనే పేరుకి తగ్గట్టుగా తను లేనని ఆలస్యంగా అవగతమై ఒక లవర్ని చూసుకోవడం, ఆమెకి బహుమతి కొని తెచ్చే ప్రయత్నంలో వున్నప్పుడు చిల్లర గ్యాంగ్ చేతిలో చావడం- ఇలా ముగుస్తుంది ఈ ఫన్నీ క్యారక్టర్ పాత్ర ప్రయాణం.

          ఇక ప్రత్యర్ధి గ్యాంగ్ పాత్ర వైట్ షార్క్ వచ్చేసరికి ఇతనూ పెంపుడు పిల్లి జుట్టు నిమురుతూ వ్యంగాస్త్రాలు విసిరే కామిక్ విలనే. హీరోయిన్ పెళ్లి చేసుకోవడం నచ్చక ఆ పెళ్లిని చెడగొట్టమని అనుచరుల్ని పంపుతాడు. ఇంకోసారి తన అనుచరుడొకణ్ణి  ఆమె పొడిచిందన్న కోపంతో మీటింగ్ ఏర్పాటు చేసి ఆమెకి సవాలు విసిరినప్పుడూ, చివర్లో క్లయిమాక్స్ లోనూ కన్పిస్తాడు.

          ఇదీ అయిదారు పాత్రల మీద మాత్రమే ప్రధానంగా దృష్టిని ఫోకస్ చేసి- వాటిద్వారా కథని ఆసక్తికరంగా మల్చిన దర్శకుడి వ్యూహం. పక్క పాత్రలన్నిటినీ  హీరోయిన్ చుట్టూ తిరిగే పాత్రలుగానే నిర్మించడం, తత్ఫలితంగా వాటిని కూడా ఒడ్డున పడ్డ చేపల్లాగానే చూపడం, ఇక్కడ దర్శకుడు బాగా రిజిస్టర్ చేస్తున్న సంగతి!
          
            హాయిగా తమ వృత్తేదో చేసుకుంటున్న  హీరోయినూ ఆమె అనుచర బృందమూ అది మానుకుని,  అలవాటులేని ఇంకో ప్రపంచంలోకి అడుగు పెట్టడం, పెళ్ళీ కాపురం గీపురం అంటూ చేతకాని పన్లు పెట్టుకుని నవ్వుల పాలవుతూ- అలవాటు లేని ఈ జీవితంతో ఒడ్డున పడ్డ చేపల్లా గిలగిలా కొట్టుకోవడం! అంటే, పాత్రలు తాము సుఖంగా ఉంటున్న కాన్షస్ వరల్డ్ లోంచి, అదేమిటో తెలీని నిగూఢమైన మహా సముద్రం లాంటి సబ్ కాన్షస్ ప్రపంచం లో పడి కొట్టుకోవడమన్న మాట! కేవలం గొప్ప సినిమాల్లోనే మనలోని ఈ కాన్షస్- సబ్ కాన్షస్ మైండ్ ల ఇంటర్ ప్లే తెరమీద ఆవిష్కృత మవుతుంది- అలాటిది ఇక్కడ కన్పించడం విశేషం!

          ఇదీ పాత్ర చిత్రణ అంటే! కామెడీ కథలోనూ డెప్త్ ని తీసుకురావడమంటే. జీవితాన్ని చూపించడమంటే! జీవితం దేనికోసమో చెబుతూ ఆ చేదు మాత్రకి- పాత్రోచితమైన కామెడీతో షుగర్ కోటింగ్ ఇస్తూ- తెలియకుండా ప్రేక్షకుల చేత మింగించడం! ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాని ఎందుకలా అంతలా మెచ్చుకున్నారంటే  ఈ పై అన్ని కారణాల వల్లే!

స్ట్రక్చర్ సంగతి!
             మూడంకాలు పెట్టుకుని, ఆ బిగినింగ్- మిడిల్ - ఎండ్ అనే మూడంకాలకి రెండు మూలస్థంభాలు పెట్టుకుని, వాటి మధ్య వాటికి దారి తీయించే  ఉత్సుకతని రేపే కథనాన్ని మాత్రమే చేసుకుంటే,  ఆస్వాదించడానికి  సినిమా ఎంత హాయిగా వుంటుందో తెలిపే ఉదాహరణ ఇదే!
          సకాలంలో సరీగ్గా 18 వ నిమిషంలో బిగినింగ్ ముగిసిపోయి మొదటి మూల స్థంభం ఏర్పాటవుతుందిందులో. ఇలా మిడిల్ లో పడిన కథ సరీగ్గా గంటా 28 వ నిమిషానికి ఆ మిడిల్ కి ముగింపు పలుకుతూ రెండో మూల స్థంభం ఏర్పాటవుతుంది. మొదటి మూల స్థంభం రోడ్డు మీద జరిగే సంఘటనలో హీరోయిన్ కాబోయే భర్త తల పగులగొట్టండం అయితే, రెండో మూలస్థంభం రోమియో హత్యకి గురికావడం. బిగినింగ్ 18 నిమిషాలు నడిస్తే, రెండు మూలస్థంభాల మధ్య మిడిల్ గంటా 10 నిమిషాలు సాగడం. ఇక ఎండ్ 20 నిమిషాలు తీసుకోవడం. ఇప్పుడు స్ట్రక్చర్ ని అంకాల వారీగా విభజిస్తే సుమారు 1 : 2 : 1 నిష్పత్తిలో బ్యాలెన్సింగ్ గా వుండడం. మొత్తం స్క్రీన్ ప్లే లో బిగినింగ్ 25 శాతం, ఎండ్ మరో 25 శాతం ఉంటూ - మిడిల్ ఉండాల్సిన 50 శాతమూ వుండడం. ఈ స్ట్రక్చర్ తో కథకి బలమైన వెన్నెముక ఏర్పడడం.

          సంఘటనలతో మూలస్థంభాలు ఏర్పాటు చేయాల్సిందే. సినిమా అనేది విజువల్ మీడియా- రేడియో నాటకం కాదు డైలాగులతో మూలస్థంభాలు  ఏర్పాటు చేయడానికి. సంఘటనల రూపంలో మూల స్థంభాలని ఏర్పాటు చేసినప్పుడే సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. రెండోది మూలస్థంభాలు ఈ మూడింటిని కలిగి వుంటాయి : సమస్య, ఎమోషన్, పరిణామాలు. పై మొదటి మూలస్థంభాన్ని చూస్తే, ఆమె అతడి తల పగులగొట్టడంలో ఆత్మరక్షణ అనే ఎమోషన్ వుంది. పెళ్లి సమస్య పాకాన పడింది, ఆ సంఘటన పరిణామాలు అనూహ్యం!

          రెండో మూలస్థంభంలో రోమియో హత్యలో అతడి లవర్ తో శాశ్వత ఎడబాటు అనే ఎమోషన్ వుంది, తన హత్య హీరోయిన్ కి సమస్యగా నిల్చింది, ఈ సంఘటన పరిణామాలు అనూహ్యం!

          ఇతర సీన్లకి భిన్నంగా మూల స్తంభాలకి ఈ ప్రత్యేకతలు కల్పించినప్పుడే అవి కథనిమలుపు తిప్పే మూలస్థంభాలు ( ప్లాట్ పాయింట్స్) అన్పించుకుంటాయి. 

          మిడిల్లో సమస్యతో ఆమె సంఘర్షణ ఏఏ  మలుపులు తిరుగుతూ సాగిందో ఆమె పాత్ర చిత్రణ విభాగంలో పైన చెప్పుకున్నాం. మిడిల్ ప్రారంభంలో సరీగ్గా పెళ్లి సమయానికి విలన్ని పరిచయం చేశాడు దర్శకుడు. ఆ పెళ్లి చెడ గొట్ట మన్నాడు. పెళ్లి వేడుకలో ఆ గ్యాంగ్ వచ్చేసి చేసే కామెడీ గలాటా, వాళ్ళని రోమియో ఎదుర్కొనే క్రమం అంతా ఒక సింబాలిజం కూడా కావొచ్చు. ఈ కిష్కింధ కాండ లాగే ఆమె సంసారం కూడా ఉండబోతోందని. తెరవెనుక అంతరార్ధం లేకుండా ఇందులో ఏ సీన్లూ కన్పించవు. కాబోయే భర్త తల పగుల గొట్టినప్పుడు కూడా రేపామె చేతిలో  భర్త పరిస్థితి ఇదే నన్న అంతరార్ధం తొంగి చూస్తోంది. అలాగే ఒక సంఘటన మరో సంఘటనగా మలుపు తిరిగే డైనమిక్స్ కూడా ఈ మిడిల్ విభాగంలో వున్నాయి. ఉదాహరణకు ఆమె తల్లి కాబోతోందన్న సంతోషకర వార్తకి అతను బొమ్మలు పట్టుకుని ఆనందంగా వస్తే- ఆమె మాఫియా అన్న సంగతి బయటపడి విషాదంగా మారడం. అలాగే  రోమియో తన ప్రేయసికి బహుమతి తెస్తానని వెళ్తే అక్కడ హత్యకి గురికావడం. ఇలాటి డైనమిక్స్  కథనాన్ని ఉద్విగ్నభరితం చేశాయి. అలాగే అక్కా చెల్లెళ్ళ మధ్య సన్నివేశాల్లో వెచ్చదనం ఒక హైలైట్. స్ట్రక్చర్లో అక్క పాత్రకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత అంతా ఇచ్చాడు- ఈ కథ మొదలవడానికి కారకురాలు ఆమె కాబట్టి. అక్క ఫలానా ఆస్పత్రిలో వుందని తెలిసి హీరోయిన్ వెళ్తున్నప్పుడు చిన్నప్పటి మాంటేజేస్ ఒకెత్తు.

           పోతే మిడిల్ ని ముగించి రెండో మూలస్తంభం ఏర్పాటు చేయాడానికి సబ్ ప్లాట్ ని వాడుకున్నాడు. ఇదొక ప్రయోగమని గుర్తించాలి. హీరోయిన్ ప్రధాన కథమీద కూడా రెండో మూల స్థంభం లేకుండా సబ్ ప్లాట్ మీద పెట్టడానికి కారణం ఒకటి - అప్పటికి భర్తతో ఆమె పరిస్థితి సుఖాంత మయ్యింది. అంటే ప్రధాన కథ ముగిసిపోయింది. అలా కాకుండా ఆ ప్రధాన కథనే సాగదీసి అందులో విలన్ ని చొరబెట్టి దాని మీదే  క్లయిమాక్స్ కి వెళ్లి వుంటే అది చీప్ కథనమయ్యేది. అందుకే రోమియో అనే ముఖ్యపాత్రకి లవ్ ట్రాక్ ప్రారంభించి అతడి హత్యతో రెండో మూల స్థంభం ఏర్పాటు చేసి, దీని మీదే హీరోయిన్ క్లయిమాక్స్ కి వెళ్లేట్టు చేశాడు. ఇది స్టోరీ క్లయిమాక్స్ కాదు, ఎవరూ ఊహించని విధంగా ప్లాట్ క్లయిమాక్స్ తో సినిమాని ముగించాడు.  ఈ ప్లాట్ క్లయిమాక్స్ నే  బాలచందర్ తీసిన ‘మరో చరిత్ర’ అనే సూపర్ హిట్ లోనూ చూడొచ్చు. 

        రోమియో హత్యకి విలన్ తో ఏ సంబంధమూ లేదు. వేరే చిల్లర గ్యాంగ్ పని అది. కానీ  అది విలన్ చేసిన పనే అని హీరోయిన్ అపోహపడి వెళ్ళింది. ఆమె అపోహలతోనే మూలస్థంభాలు రెండూ ఏర్పాతయ్యాయని గమనించాలి. మొదటి మూలస్థంభంలో అమాయకుణ్ణి కూడా దుండగుడు అనుకుని అపోహపడి తల బద్దలు చేసింది. రెండో మూల స్థంభంలో విలనే అనుకుని పోరాటానికి వెళ్ళింది. ఆమె అపోహవల్ల చేయని హత్యకి చచ్చాడు విలన్! ఇది కూడా పైకి కన్పించని కామెడీయే!

         ఇక ఈ స్ట్రక్చర్ కి ‘బుకెండ్’ ప్రారంభ ముగింపులతో మొత్తం సినిమాకే పరిపూర్ణత వచ్చింది. ఇప్పుడు ‘ఓపెనింగ్ బ్యాంగ్’ గురించి చెప్పుకుంటే- సినిమా ప్రారంభమే హాఫ్ వేలో వర్షంలో ఆమె చేసే మార్షల్ ఆర్ట్స్ పోరాటంతో మొదలవుతుంది. రాత్రి పూట బ్లూ టింట్ లో ఆ హైస్పీడ్ యాక్షన్ సీన్ అత్యంత కళాత్మకంగా వుంటుంది. ఈ సీన్లో విలన్ వుండడు. తనకి తెలిసిన వాణ్ణి ఒకణ్ణి కాపాడేందుకే ఆమె ఫైట్ చేసే సీన్ ఇది. దీంతో కథకీ ఎలాటి సంబంధం లేదు. ఈ ఫైట్ తర్వాత ఎక్కడో వున్నా విలన్ పగబట్టి ఆమెని చంపెయ్యాలని ఆదేశించే ‘బ్యాంగ్’ కూడా లేదు. అసలీ కథలో ఒక విలన్ ఉంటాడనే హింట్ కూడా ఇవ్వకుండా, ఇస్తే ఈ కామెడీ పెళ్లి కథని ఆస్వాదించేందుకు అదొక డిస్టర్బెన్స్ గా ఉంటుందని- దాన్ని పక్కనబెట్టి, ఫక్తు హీరోయిన్ పెళ్లి కథే చెప్పుకొచ్చాడు.




                సినిమా ముగింపులో భర్త విలన్న్ గ్యాంగ్ ని తగులబెట్టాక మరో ఓపెనింగ్ బ్యాంగ్ లాంటి పోరాటమే మరో గ్యాంగ్ తో మొదలవుతుంది. ఈ పోరాటంలో హీరోయిన్ కి తోడుగా గ్యాంగ్ స్టర్ గా మారిన భర్త ఉంటాడు! ఈ బుకెండ్ కవరింగ్ వల్ల ఒక పుస్తకానికి ముందు అట్ట, వెనుక అట్ట అనే బైండింగ్ లాంటి  ప్యాకింగ్ ఏర్పడింది. 

          ఇలా అర్ధవంతమైన స్ట్రక్చర్, పాత్ర చిత్రణలతో పాటు- వాటిమీద దర్శకుడి చెక్కు చెదరని ఫోకస్ ఈ సినిమాని జనరంజకం చేశాయి.

‘జేమ్స్ బాండ్’ సంగతి?
          హీరోయిన్ కథలో సహాయ పాత్ర ఉండాల్సిన చోట పాపులర్ కామెడీ హీరోని తెచ్చి ఇరికించారు. దీంతో కథా కథనాలు, పాత్ర చిత్రణలూ అస్తవ్యస్తమై పోయాయి. హీరోయిన్ కి మాఫియాగా లేనిపోని బిల్డప్ లిచ్చి ఆమెకి పోటీ మాఫియాతో శత్రుత్వపు కథ కూడా ఎందుకో నడిపారు. ఓపెనింగ్ బ్యాంగ్ లో ఆమె ఆ మాఫియా తమ్ముణ్ణి చంపడమూ,  దీంతో మాఫియా పగబట్టినట్టు బ్యాంగ్ ఇవ్వడమూ హాస్యాస్పదంగా వున్నాయి. ఈ కథ దేని గురించి అసలు? ఇలా కాలం చెల్లిన, చూసి చూసి వున్న పాత మూస బ్యాంగే మళ్ళీ ఇచ్చి అర్ధరహితంగా ఈ కథని ప్రారంభించారు.
         
          ఇలా బ్యాక్ గ్రౌండ్ లో ఒక విలన్ ఉన్నాడని మనల్ని డిస్టర్బ్ చేస్తూ- హీరో- హీరోయిన్ల పెళ్ళీ సంసారం కథలో ఆ విలన్ చేత ఆమె మీద హత్యాప్రయత్నాలు చేయిస్తూ, క్లయిమాక్స్ ఆ విలన్ తోనే ఆ పెళ్ళీ సంసారం కథకి ముగింపు పలికిస్తూ భలే కథ అల్లారు.

          తల్లి మాటతో పెళ్లి చేసుకోవాలనుకున్న, చేసుకున్నడాన్ అయిన అమ్మాయికి, బ్యాక్ డ్రాప్ లో మాఫియా విలన్లతో వేరే కథేమిటి? ఆమెకి విలన్ ఆమె తల్లి మాటే కాదా? తల్లి మాట తోనే ఈ కథ ప్రారంభం కాలేదా? ఇలా పాత్రల గురించి కథగా కాకుండా, ఏవో కథల గురించి పాత్రలుగా మార్చుకుని తీసేశారు.

          పాత్రల్ని నిలబెట్టడంలో విఫలమయ్యారనేందుకు ఒక్క సీను చాలు. క్యాన్సర్ తో వున్న తల్లి పెళ్లి చేసుకోమంటే ఉండాల్సిన మాఫియా హీరోయిన్ రియాక్షన్, ఫీలింగ్స్- ఇక మాఫియా వేషాలు మానేసి నార్మల్ అమ్మాయిగా మారాలా? అన్న డైనమిక్స్ - వదిలేసి ఆమె ఆనందం చూపించేసి కట్ చేసేశారు. ఆ ఆనందం అర్ధమేమిటి? పెళ్లి చేసుకోవడం హేపీ అనేనా? అయితే మొగుణ్ణి ఎందుకు సతాయించింది? ఇక ఓవర్ యాక్షన్ చేస్తూ వొంటి నిండా చీరా కట్టుకుని, జడేసుకుని, బొట్టూ కాటుకలు పెట్టుకుని గుడి కెళ్తుంది! ఈ పాత మూస సీనులో గుడికే వచ్చిన హీరో ఆమెని చూసి ఫ్లాట్ అయిపోతాడు. ఇక ఆ అమ్మాయే కావాలని పెళ్లి సంబంధాలవాడిని వేధిస్తాడు. కథలో బిగినింగ్ ని ముగిస్తూ ఏర్పాటు చేసిన మొదటి మూల స్థంభం అన్నమాట ఇలా వుంది! ఇందులోనూ కామెడీ సినిమాకుండాల్సిన వొరిజినల్లో వున్న లాంటి డైనమిక్స్ లేదు, ఎమోషన్ లేదు, సమస్యా ఏర్పాటు కాలేదు, పరిణామాల ఫోర్ షాడోవింగ్ లేదు.
         
          హీరోకి ఇంకో కథ పెట్టారు. గతంలో ఒక ఫ్యాక్షన్ కుటుంబంలో సంబంధం చూడబోతే, అక్కడా ఆమ్మాయి తడాఖా చూసి పారిపోయి వచ్చాడని! వాళ్ళంతా ఇతడి కోసం వెతుకుతు న్నారని!  హీరోయిన్ని మాఫియాలు వెతుకుతున్నారు, హీరోని ఫ్యాక్షనిస్టులు వెతుకుతున్నారు..ఇలా ఇష్టారాజ్యంగా అల్లుకుంటూ పోయారు- ప్రధాన కథ తల్లి కిచ్చిన మాట అన్న సంగతి పూర్తిగా మర్చిపోయారు. అ తల్లి కూడా క్యాన్సర్ పేషంట్ లా కాక ఇంట్లో హాయిగా తిరుగుతూంటుంది- ఈమెని చూసి కూతురికి అనుమానం రావాలి నిజానికి -తన పెళ్లి జరిపించడం కోసం క్యాన్సర్ నటిస్తోందా అని!

          ఇంటర్వేల్లోనే హీరోకి హీరోయిన్ మాఫియా అని తెలిసిపోతుంది. దాంతో ఆమెని వదిలేసి పారిపోయే అతడి గొడవ మొదలవుతుంది. వదిలేసి పారిపోవడమేమిటి? పారిపోయి ఏం చేయాలనుకున్నాడు? ఏమిటీ అతడి లక్ష్యం? వేరే ఇంకో పెళ్లి చేసుకోవాలనా? ఇలా హీరోయిన్ కథలో హీరో కథ ఇరికించడం వల్ల స్పష్టత ఇవ్వలేని గజిబిజిగా మారిపోయింది వ్యవహారం.

          సెకండాఫ్ సంగతి చెప్పనే అక్కర్లేదు. ఇరవై నిమిషాల సేపు ఆగిన బస్సులో బురఖా లేసుకుని ఒక గుంపుగా చేసిన రభస- కూడా దారీ తెన్నూ తెలీని కథాకథనాల పర్యవసానమే.  కొరియన్ కామెడీ వృత్తిగత ప్రపంచంలోంచి ఖర్మకాలి వ్యక్తిగత ప్రపంచంలో కొచ్చి పడ్డ పాత్రల చేతకాని తనమైతే- అదిక్కడ ఏమిటేమిటోగానో మారిపోయింది.
         
          అసలీ సినిమాలో అల్లరి నరేష్ కి స్థానం లేదు- వేరే జ్యూనియర్ తో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా- అదీ ఒక స్ట్రక్చర్ లో పెట్టి సున్నిత హాస్య చలన చిత్రంగా తీయాల్సిన కథ!

          ఈ కొత్త దర్శకుడు ఈ కథతో రెండేళ్ళు అల్లరి నరేష్ ని ప్రయత్నించినట్టు తెలియ వస్తోంది. ముందుగా తయారు చేసుకున్న కథ వేరే ఉండొచ్చు- ఈ రెండేళ్ళల్లో దాన్ని ఎవరెవరికో నచ్చే విధంగా అదే పనిగా డెవలప్ మెంట్లు (!)  చేసీ చేసీ వున్న ఫలితంగా ఈ వికృతరూపం దాల్చి ఉండొచ్చు. ‘డాన్- నేను కాదు నా పెళ్ళాం’  అని ఉండాల్సిన టైటిల్ కూడా అర్ధం లేకుండా ‘జేమ్స్ బాండ్ నేను కాదు నా పెళ్ళాం’  గా మారిపోయింది!    


—సికిందర్

PS: వేరే సినిమాల్ని కాపీ కొట్టేటప్పుడు, లేదా నిజాయితీగా రీమేక్ చేసేప్పుడు వాటిని కూలంకషంగా విశ్లేషించుకుని ( అంటే చర్చించుకుని కాదు, స్పష్టంగా వీలైనంత రాసుకుని) ఆ కథా నిర్మాణం, పాత్రచిత్రణలు, వాటి దృశ్యీకరణల వెనకున్న ఉద్దేశాల్నీ, వ్యూహాల్నీ, అనుసరించిన విధానాల్నీ మదింపు చేసి, వీలయితే అందులోంచి కొంత నేర్చుకుని, మొత్తం సబ్జెక్టునీ ‘ఓన్’ చేసుకుని ముందుకెళ్తే ప్రమాదాలు తప్పుయేమో!


          


         
         










Thursday, July 23, 2015

వన్ లైన్ ఆర్డర్



‘శివ’- బిగినింగ్ వన్ లైన్ ఆర్డర్
1.  భవానీ మనిషి గణేష్ అనుచరులతో కాలేజీ కొచ్చి స్టూడెంట్ ని చంపడం.

2.  టైటిల్స్.
3.  కొత్త స్టూడెంట్స్ గా కాలేజీలో ఎంటరైన శివ,  క్లాస్ రూమ్ లో లెక్చరర్ తో జేడీ దుష్ప్రవర్తనని గమనించడం, మల్లిక్ పరిచయమవడం. 
4.  జేడీ ప్రవర్తనని లెక్చరర్ ప్రిన్సిపాల్ కి కంప్లెయింట్ చేయడం, వాళ్ళ జోలికి పోతే మనకే నష్టమని ప్రిన్సిపాల్ అనడం.
5.  భవానీ అనే గూండాకి జేడీ ఎటాచ్ అయి వున్నట్టు శివకి మల్లిక్ పరిస్థితిని వివరించడం.
6.  క్యాంటీన్ లో మల్లిక్ మరి కొందరు మిత్రుల్నీ, ఆశానీ శివకి పరిచయం చేయడం; క్యాంటీన్ బాయ్ మీద జేడీ  నేస్తం వచ్చి దౌర్జన్యం చేయడం.
7.  శివతో ముఖా ముఖీ అయిన జేడీ శివని టీజ్ చేయడం.
8.  ఇంట్లో శివ అన్న-శివ ల మధ్య కాలేజీ ఫీజు ప్రస్తావనకి వదిన అయిష్టం కనబరచడం, రౌడీలు గణేష్ చందాల కోసం వస్తే శివ వాళ్ళని గమనించడం.
9.  శివ ఫ్రెండ్ తో జేడీ దౌర్జన్యం చేస్తే ఎందుకు ప్రిన్సిపాల్ కి కంప్లెయింట్ ఇవ్వలేదని శివ అడగడం, అలా చేస్తే భవానీయే కలగజేసుకుంటాడని మల్లిక్ అనడం.
10.  శివ తన అన్నకి కాలేజీ విషయాలు చెప్తే కలగజేసుకోవద్దని వద్దని అన్న మందలించడం, అన్న కూతురితో శివ బాంధవ్యం.
11.  అన్న కూతురితో  ఐస్ క్రీం షాపు కొచ్చిన శివకి, అక్కడికే వచ్చిన ఆశా ఎదురవడం, అన్న కూతురుతో ఆమె పరిచయం.
12.  ఎప్పుడూ సీరియస్ గా వుండే శివని కాలేజీలో ఆశా టీజ్ చేయడం.
13.  క్యాంటీన్ బాయ్ తెలంగాణా భాషలో రామాయణం చెప్పి అందర్నీ నవ్వించడం .
14.  మొదటి పాట- శివ అండ్ ఫ్రెండ్స్ అందరి మీదా.
15.   సైకిలు మీద పోతున్న శివ, ఆశాని ఎక్కించుకోవడం; ఆమె తన గురించీ, సిఐ గా ఉంటున్న తన అన్న గురించీ క్లుప్తంగా చెప్పడం.  
16.  ఇంటి దగ్గర డ్రాప్ చేసిన శివని ఆశ ఇంట్లోకి తీసికెళ్ళి అన్న కి పరిచయం చేయడం, భవానీతో ప్రాబ్లం వచ్చిందని అన్న బయటి కెళ్ళిపోవడం.

17.  షాపు కెళ్ళి వస్తున్న వదినని రౌడీలు టీజ్ చేయడం.
18.  ఈ టీజింగ్ గురించి ఇంటికొచ్చి చెప్తున్న వదిన మాటలు శివ వినడం. టాపిక్ శివ మీదికి మళ్ళి అతను ఇంట్లో వుండడం ఇష్టం లేదన్నట్టుగా ఆమె మాట్లాడడం, శివ వినడం.
19.  వదినతో అన్ని మాటలు పడుతూ ఇంకా ఆ ఇంట్లో ఎందుకుంటున్నావని శివని ఆశా ఆగడం, జేడీ వచ్చి కావాలని ఆశాకి డాష్ ఇవ్వడం, శివ రియాక్ట్ అవబోతే ఆశ ఆపడం.
20.  సైకిల్ స్టాండ్ దగ్గర  జేడీ మళ్ళీ శివని రెచ్చగొట్టడం- ఇక సహించలేక శివ సైకిలు చెయిన్ తెంపి  జేడీనీ అతడి గ్యాంగునీ చావగొట్టడం.

సూత్రాల విన్యాసం

        దీ 20 సీన్లతో వున్న బిగినింగ్ విభాగపు వన్ లైన్ ఆర్డర్. ఈ వన్ లైన్ ఆర్డర్ కీ,  సినాప్సిస్ లో బిగినింగ్ విభాగానికి సంబంధించి వున్న కథకీ ఏ సంబంధమూ లేదని గమనించాలి.  సంబంధం  ఉండకూడదు కూడా. ఉంటే అదొక సినాప్సిస్సే అన్పించుకోదు. కథలో పాత్రలన్నిటినీ కలిపి సినాప్సిస్ రాయడం ఎక్కడా వుండదు. కేవలం విషయమేమిటో తెలియడానికి ముఖ్యమైన పాత్రలతో ప్రధాన కథని క్లుప్తంగా మాత్రమే రాసుకోవడం జరుగుతుంది. కనుక సినాప్సిస్ వన్ లైన్ ఆర్డర్ గా మారే సరికి అందులో వుండని పాత్రలన్నీ వచ్చేసి సమగ్ర కథా తయారీకి తోడ్పడతాయి. వన్ లైన్ ఆర్డర్ వేయడమంటేనే ఆటా పాటలతో సహా పూర్తి స్థాయి కథ గా విస్తరించడమేనని ఇదివరకే చెప్పుకున్నాం.

          
కాబట్టి పై లైన్ ఆర్డర్ లో బిగినింగ్  విభాగం బిజినెస్ కి అవసరమున్న పాత్రలు వచ్చేశాయి. శివ అన్నా వదినెలు, వాళ్ళ కూతురూ, సిఐ అయిన ఆశా అన్న, లెక్చరర్, ప్రిన్సిపాల్, శివ మిత్ర బృందం, జేడీ మిత్ర బృందం, క్యాంటీన్ బాయ్, ఓపెనింగ్ లో గణేష్ అనే గూండా తదితర పాత్రలన్నీచేరి, సమగ్ర కథా సృష్టికి తమ వంతు కృషి చేయడానికి బిజినెస్ లో పాలుపంచుకుంటున్నాయి. 

          ఇరవై సీన్లతో వున్న ఈ బిగినింగ్ లైన్ ఆర్డర్ ముప్ఫై నిమిషాల నిడివితో వుంది. అంటే ఈ విభాగాన్నిఇంటర్వెల్ దాకా సాగదీయలేదని గమనించాలి. ఇంటర్వెల్ లోపు ముప్పై నిమిషాల్లోనే దీన్ని ముగించి మిడిల్ ని టచ్ చేశారు. అంటే కథలో కెళ్ళి పోవడానికి సిద్ధమైపోయారు. ఎంత త్వరగా కథలో కెళ్ళి పోతే అంత ఎక్కువగా ప్రేక్షకుల్ని గౌరవించినట్టు.

          ఐతే వన్ లైన్ ఆర్డర్ కి ఉపక్రమించినప్పుడు ఎవరికైనా మొట్ట మొదట ఎదురయ్యే ప్రశ్న ప్రారంభ దృశ్యం ఏమిటా అనేది. ముందు దీనిగురించి చర్చించుకుని మిగతా ఆర్డర్ లో కెళ్దాం. బిగినింగ్ విభాగాన్ని ఎలా ప్రారంభించి ఎలా ముగించాలనే దానికైతే  సూత్రాలున్నాయి. కానీ మొత్తం కథనీ  ఏ సీనుతో ప్రారంభించాలనే దానికి సూత్రాలుండవు. ఏ కథకా కథగా ఓపెనింగ్ సీను ఊహించాల్సిందే. ఏ ఓపెనింగ్ సీను లక్ష్యమైనా ముందుగానే ప్రేక్షకులకి లంగరు వేయడమే. ఆ లంగరుకో, గాలానికో చిక్కిన ప్రేక్షకులు చివరిదాకా గిలగిలా కొట్టుకోవాల్సిందే ఆ ఓపెనింగ్ సీను కొనసాగింపూ-  ముగింపుల కోసం! అంతరార్ధం కోసం! అందుకే దీన్ని ఓపెనింగ్ బ్యాంగ్ అంటున్నారు. బ్యాంగ్ ఇచ్చి వదిలిపెడితే ప్రేక్షకులు సీట్లకి కర్చుకుపోయి ఉంటారని ప్రధానోద్దేశం. అయితే వస్తున్న అవే మూస సినిమాలకి అవే బాపతు ఓపెనింగ్ బ్యాంగులు చూసీ చూసీ ప్రేక్షకులు మొద్దు బారిపోయారనేది వేరే విషయం. 


బ్యాంగోపనిషత్తు!
         తెలుగు సినిమాల్లో ఓపెనింగ్ బ్యాంగు  రెండు రకాలుగా ఉంటోంది : కథకి సంబంధించిన బ్యాంగ్, పాత్రకి సంబంధించిన బ్యాంగు. కథకి సంబంధించిన బ్యాంగు కథాక్రమంలో ఎక్కడో  రివీలై కథలో సస్పెన్సుని విడగొడుతుంది. పాత్రకి సంబంధించిన బ్యాంగ్ కి కథతో సంబంధం ఉండదు. అది ఆ పాత్ర - హీరో లేదా విలన్ స్వరూపాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు ఇచ్చే బ్యాంగ్ మాత్రమే. హీరో అయితే వీరోచితంగా ఒక అడ్వెంచర్ చేస్తాడు, విలన్ అయితే కౄరంగా ఒక మర్డర్ చేస్తాడు. ఈ సంఘటనలకి కథతో సంబంధం వుండదు. వూరికే ఆ పాత్రల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాగా వుంటాయి. 

          ఇక బ్యాంగులే వుండని కథా ప్రారంభాలుంటాయి. ‘బాహుబలి’ లో అప్పుడే పుట్టిన బిడ్డని ( హీరోని) కుట్ర నుంచి తప్పిస్తూ శివగామి పాత్ర చేసే త్యాగంతో కూడిన దృశ్యాలుగా వుంటే, ‘భజరంగీ భాయిజాన్’ లో పాకిస్తాన్ మూగ బాలిక ఇండియాలో తప్పి పోయే దృశ్యాలతో వుంటుంది. ఇవి బ్యాంగులు అన్పించుకోవు, వీటిలో సస్పెన్సు వుండదు, హయిగా కథని ప్రారంభించాలన్న ఉద్దేశం తప్ప. 

          ఇంకో రకం ప్రారంభం వుంటుంది. అది బ్యాంగే అన్పించినా బ్యాంగ్ కాదు. ఇదే ‘శివ’ లో వుంది. ‘శివ’ లైన్ ఆర్డర్ లో మొదటి సీనుగా భవానీ మనిషి గణేష్ అనుచరులతో కాలేజీ కొచ్చి స్టూడెంట్ ని చంపడంగా వేశారు. 1989 లో ఈ సినిమా విడుదలై నప్పుడు మార్నింగ్ షో  చూసిన వాళ్లకి ఇది ఓపెనింగ్  బ్యాంగ్ గానే అన్పించి వుంటుంది. ఆ వెంటనే దృశ్యాలు చూస్తూంటే- ఇదసలు  బ్యాంగే  కాదనీ, కథా ప్రారంభమే అలా వుందని అర్ధం జేసుకుని వుంటారు. ఆ తర్వాతి ఆటల కల్లా విషయం పోక్కుతుంది కాబట్టి అక్కడ్నించీ ప్రేక్షకులు కథా ప్రారంభంగానే ఈ ‘ఓపెనింగ్ బ్యాంగు’ ని తీసుకుని వుంటారు.

          ఈ బ్యాంగు కాని బ్యాంగు కథా ప్రారంభమే అని ఎలా అనగలమంటే, ఆ గ్యాంగుతో వచ్చి హత్య చేసిన వాడు సహాయ పాత్ర, హత్యకి గురైన వాడూ సహాయ పాత్రే. ఈ ఘటనలో  దాచి పెట్టిన విషయం  లేదు. కనుక సస్పెన్సు లేదు. కాబట్టి ఇది కథలో ఇంకెప్పుడో రివీలయ్యేందుకు పెట్టుకున్న సస్పెన్సుతో కూడిన – కథకి సంబంధించిన బ్యాంగ్ కాదు. అలాగని హీరో నో విలనో పాల్పడిన చర్య తాలూకు బ్యాంగ్ కాదు కాబట్టి, ఇది పాత్ర తాలూకు బ్యాంగ్ కూడా కాలేకపోయింది.

          మరి ఈ మైనర్ పాత్రలతో ఇంత గొప్ప సినిమా కథని ఎందుకు ప్రారంభించినట్టు? ఇక్కడికే వస్తున్నాం. అసలు కథని – లైన్ ఆర్డర్ ని- ఎలా ప్రారంభించాలీ అని ఇంకెంత మాత్రం తలబద్దలు కొట్టుకో నవసరం  లేకుండా సూత్రాలున్నాయి. కావాల్సింది  వీటిని అర్ధం జేసుకోవాలన్న ఆసక్తే. సూత్రాల పరిజ్ఞానం వుంటే రోజుల తరబడీ జుట్లు పీక్కునే పరిస్థితి నుంచి విముక్తి!

          ‘శివ’ లో ఈ ఓపెనింగ్ బ్యాంగ్  లేదా మొదటి సీను కథా ప్రారంభమే అని తేలింది కాబట్టి, ఇది నిస్సందేహంగా బిగినింగ్ విభాగపు బిజినెస్ సూత్రాల పరిధిలోకి వచ్చేస్తుంది. ఏమిటా బిగినింగ్ విభాగపు బిజినెస్ సూత్రాలు? బిగినింగ్ విభాగపు బిజినెస్ సూత్రాలు = 1. ప్రథాన పాత్రనిఇతర ముఖ్య పాత్రల్నీ పరిచయం చేసికథా నేపధ్యాన్ని సృష్టించడం; 2. ప్రధాన పాత్రకి సమస్య తలెత్తేందుకు ప్రేరేపించే పరిస్థితుల్ని లేదా శక్తుల్ని చూపడం; 3. సమస్య తలెత్తే దిశగా పరిస్థితుల కల్పన;  4. సమస్య ఏర్పాటు- ఇంతే! 

          ఈ సూత్రాల వరుస క్రమం ఎలావుందో తుచా దీన్ని తప్పకుండా ఫాలో అవుతూ లైన్ ఆర్డర్ లో వరుసగా, యాదృచ్చికంగా  సీన్లు వాటికవే పడిపోతాయి! ఇది సూత్రాల గొప్పతనమేం కాదు, సినిమా కథా రచన అనే ప్రక్రియని తలకెత్తుకుని లో ఎందరెందరో- వేలాదిమంది కొత్తా పాతా రచయితలూ సృష్టించిన- ఇంకా సృష్టిస్తున్న స్క్రీన్ ప్లేలలో అంతర్లీనంగా ప్రవహిస్తున్న వాళ్ళ కథన కుతూహలపు కండూతే బయట పెట్టిన శాశ్వత సత్యాలివి!.

          సూత్రాలు ఏ ఆకాశంలోంచో వూడిపడవు. లేదా ఎవరికో కలలో దేవుడు కన్పించి చెప్పేవి కావు. న్యూటన్ మహాశయుడికి ఏ దేవుడో  కన్పించి గురుత్వాకర్షణ శక్తి గురించి చెప్పలేదు. కూర్చున్న చెట్టుకింద ఆపిల్ పండు రాలి పడితే, అది చూసి ప్రశ్నించుకున్న ఆయనకి భూమికి  గురుత్వాకర్షణ శక్తి వుందని రివీలయిందంతే.


స్క్రిప్టు ముందా? సూత్రాలు ముందా? 
      అలాగే సిడ్ ఫీల్డ్ కూడా తను స్క్రిప్ట్ రీడర్ గా సినీ మొబైల్ అనే కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, వేలాదిగా స్క్రిప్టులు చదువుతూంటే, ఆ స్క్రిప్టు లన్నిట్లో యధాలాపంగా ఆ కథనాల్లో అనేక సామాన్యాంశాలు కనపడసాగాయి. అవన్నీ ఒకే విధమైన  స్ట్రక్చర్ ని ఫాలో అవుతున్నట్టు కన్పించడమే గాక, ఆ స్ట్రక్చర్ లోపల కొలువు దీరిన సీన్ల క్రమం ఓ పద్ధతినే  అనుసరిస్తున్నట్టు అన్పించింది.  ఆ పద్ధతే- ఉదాహరణకి బిగినింగ్ విభాగానికొస్తే- ముందుగా  ప్రథాన పాత్రనిఇతర ముఖ్య పాత్రల్నీ పరిచయం చేసికథా నేపధ్యాన్ని సృష్టిస్తూ, ఆ పైన  ఆ ప్రధాన పాత్రకి సమస్య తలెత్తేందుకు ప్రేరేపించే పరిస్థితుల్ని లేదా శక్తుల్ని చూపిస్తూ, ఇంకా తర్వాత సమస్య తలెత్తే దిశగా పరిస్థితుల కల్పన చేసుకొస్తూ, ఇంకా తర్వాత – చిట్ట చివర్న సమస్యని ఏర్పాటు చేసేస్తున్నారు!

          ప్పుడు అర్ధమైంది స్క్రీన్ ప్లేల రహస్యం. దీంతో తృప్తి పడకుండా, ఆ స్క్రిప్టులతో సంబంధం లేకుండా, వచ్చిన సినిమాల్ని చూస్తూంటే  కూడా – వాటిలోనూ  ఆ కథనాల్లో ఇదే క్రమం కనపడ సాగింది. ఇది చాలా క్రేజీ ఆవిష్కరణ. అంతవరకూ ఎవరూ చేయనిది. ఈ ఆవిష్కరణకి సిడ్ ఫీల్డ్ ఎక్స్ రే కళ్ళే కీలకం. ఇక సమస్త స్క్రీన్ ప్లే రచన అనే కళ సూక్ష్మ స్థాయిలో బోధపడి- తాను గమనించిన బిగినింగ్ విభాగంలో బిజినెస్ కో నిర్వచనాన్నిచ్చి- అలాగే ఇతర విభాగాలకీ వాటి నిర్వచనాలిచ్చి- ప్లాట్ పాయింట్లు, పించులు వంటి పేర్లు సృష్టించి స్క్రీన్ ప్లేకి ఓ పారడైం ( భూమిక) ని రూపొందించి, సినిమా కథా రచన మేడీజీ అంటూ ప్రపంచాని కందించాడు సిడ్నీ ఆల్విన్ ఫీల్డ్! 

          లా తను కనుగొన్న సూత్రాల్ని 1979 లో ‘ స్క్రీన్ ప్లే’ అనే పుస్తకంగా రాస్తే అది 28 భాషల్లో అనువాదమవడమే గాక, అమెరికాలో 500 యూనివర్సిటీల్లో పాఠ్యాంశంగా మారింది. కాబట్టి ఇలా స్క్రీన్ ప్లే సూత్రాలే కాదు, ఇంకే కళా రూపాల సూత్రాలైనా ఆ కళా రూపాల నిశిత పరిశీలనల్లోంచే ఏర్పడ్డాయే తప్ప, ముందుగా ఎవరో సూత్రాల్నిఏర్పరిస్తే, వాటిని పట్టుకుని కళా రూపాలేర్పడలేదు. నాట్యమైనా, సంగీతమైనా ఏదైనా ఇంతే!

          కాబట్టి ఎవరో వచ్చి సూత్రాలు చెప్పడమేమిటి, నా పధ్ధతి నాకుంటుంది- దాని ప్రకారమే రాసుకుంటానని ఇగోలకి పోనవసరం లేదు. ఆ సూత్రాలనేవి  ఎందరో రాసిన, రాస్తున్న, సినిమాలుగా తీసిన, తీస్తున్న వేలాది స్క్రిప్టుల్లోంచే బయట పడిన శాశ్వత సత్యాలని గుర్తించాలి. మరైతే ఇలా  అందరూ ఒకే స్ట్రక్చర్ ని ఫాలో అయి ఎలా రాస్తున్నారంటే, మాట నేర్చినప్పట్నించీ మనిషి కథలు చెప్పుకొస్తున్న కళ అదే కాబట్టి. అదొక ఇన్ స్టింక్ గా మానవజాతి నరనరానా ఇంకిపోయింది. కథ ఎలా చెప్తే మనసు అంగీకరిస్తుందో- మనోరంజితంగా వుంటుందో  మనసు దానికదే డిసైడ్  చేసుకుంటుంది. అదే ( ఆ స్ట్రక్చరూ దాని విభాగాల బిజినెస్సూ) భూమ్మీద చిట్ట చివరి మనిషి మిగిలున్నంతవరకూ కొనసాగుతూనే వుంటుంది.


          పై విధంగానే ‘శివ’ స్క్రిప్టు కూడా తయారైపోయింది! కాకపోతే అప్పటికే రాం గోపాల్ వర్మ మీద హాలీవుడ్ సినిమాల ప్రభావం వుండడం చేత స్క్రీన్ ప్లే కి ఆ సినిమాల్ని అనుసరించినట్టు కన్పిస్తుంది. అయినా దీన్ని పరికించి చూస్తే ఇది ఆటోమేటిగ్గా కథనంలో అన్ని సూత్రాలూ కలగలిసిన  సశాస్త్రీయ స్క్రీన్ ప్లే గా కళ్ళ ముందు నిలుస్తుంది. ఇదెలా సాధ్యమంటే  పైన చెప్పుకున్న ఇన్ స్టింక్ట్ వల్లే. 
         మరి ఇది విదేశీ స్క్రీన్ ప్లే మోడలే 
అనుకుంటే, రికార్డు స్థాయిలో తెలుగు ప్రేక్షకుల్ని ఎలా ఆకర్షించింది? కాబట్టి ఈ సూత్రాల్ని పాటించడం అదేదో తెలుగుకి పనికి రాని పరాయితనం అనుకునే వాళ్లకి ‘శివ’ గట్టి సమాధానం చెప్తుంది.

ముందుగా మొదటి సూత్రం
     ఇప్పుడు  విషయానికొస్తే, ఇలా ‘శివ’  ఓపెనింగ్ సీనే కథా ప్రారంభమని పై విశ్లేషణ ద్వారా తేలింది. ఇది బిగిబింగ్ విభాగపు బిజినెస్ సూత్రాల పరిధిలోకి ఎలా వచ్చేసిందో ఇక చూద్దాం : ఈ బిగినింగ్ విభాగపు సూత్రాల వరుసక్రమం-  మొదట ‘ప్రథాన పాత్రనిఇతర ముఖ్య పాత్రల్నీ పరిచయం చేసికథా నేపధ్యాన్ని సృష్టించడం’  అనే టూల్ తో ప్రారంభమవుతుంది కాబట్టి ఆ ప్రకారం ఈ ఓపెనింగ్ దృశ్యంలో ఓ హత్యా సంఘటన ద్వారా గణేష్ అనే సహాయ పాత్రని పరిచయం చేశారు. ఈ పాత్ర చేత కాలేజీ దగ్గర హత్య చేయించి,  ఈ కాలేజీ భవానీ అనే గూండా పట్టులో ఉందనీ, అందులో భాగంగా తేడా వచ్చిన శాల్తీని తన అనుచరుడు గణేష్ చేత లేపేయించాడనీ ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ సినిమా కథా నేపధ్యాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఈ కథ అసాంఘిక శక్తులు వర్సెస్ విద్యార్థులు అనే కోణంలో ఉంటుందని చాటారు. ఇలా మొదటి సూత్రపాలనతో కథ ప్రారంభమయ్యింది.                                                                           

   
           ఈ మొదటి సూత్రమే తర్వాతి ఆరు సీన్లలోనూ ప్రవహించింది. రెండో సీను టైటిల్స్ కింద  తీసేస్తే, ఈ కింద ఇచ్చిన మిగిలిన మూడు నుంచీ ఏడో సీను వరకూ వాటిలో వున్న విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. 


2.  టైటిల్స్.
3.  కొత్త స్టూడెంట్స్ గా కాలేజీలో ఎంటరైన శివ,  క్లాస్ రూమ్ లో లెక్చరర్ తో జేడీ దుష్ప్రవర్తనని గమనించడం, మల్లిక్ పరిచయమవడం. 
4.  జేడీ ప్రవర్తనని లెక్చరర్ ప్రిన్సిపాల్ కి కంప్లెయింట్ చేయడం, వాళ్ళ జోలికి పోతే మనకే నష్టమని ప్రిన్సిపాల్ అనడం.
5.  భవానీ అనే గూండాకి జేడీ ఎటాచ్ అయి వున్నట్టు శివకి మల్లిక్ పరిస్థితిని వివరించడం.
6.  క్యాంటీన్ లో మల్లిక్ మరి కొందరు మిత్రుల్నీ, ఆశానీ శివకి పరిచయం చేయడం; క్యాంటీన్ బాయ్ మీద జేడీ  నేస్తం వచ్చి దౌర్జన్యం చేయడం.
7.  శివతో ముఖా ముఖీ అయిన జేడీ శివని టీజ్ చేయడం.

          ఈ సీన్లలో ముందుగా 1. పాత్రల పరిచయం- కథా నేపధ్య ఏర్పాటు, 2. ప్రధాన పాత్రకి సమస్య తలెత్తేందుకు ప్రేరేపించే పరిస్థితుల్ని లేదా శక్తుల్ని చూపడం అనే మొదటి రెండు సూత్రాలూ ఎలా చోటు చేసుకున్నాయో చూద్దాం ( కథా నేపధ్యమంటే, ఏ బ్యాక్ డ్రాప్ లో కథ చెప్తున్నామో ఆ వాతావరణ సృష్టి చేయడం. ‘శివ’ సింగిల్ జానర్ పూర్తి స్థాయి మాఫియా కథ కావడం వల్ల, సీన్లలో ఆ ‘ఫీల్’ ఎడతెరిపి లేకుండా మెయిన్ టెయిన్ అవుతోంది, ఇది చాలా ముఖ్యం).

          ముందుగా మూడవ సీన్లో  శివ పాత్ర ప్రవేశం, వెంటనే క్లాస్ రూమ్ లో లెక్చరర్ జేడీ పాత్రల పరిచయం, జేడీ ప్రవర్తన ద్వారా, మొట్ట మొదటి సీన్లో చూపించిన కథానేపధ్య (మాఫియా పడగ నీడ) వాతావరణపు కొనసాగింపు, ఆ వెంటనే మల్లి పాత్ర పరిచయం ( ఇది మొదటి సూత్రం).

          నాల్గో సీన్లో ప్రిన్సిపాల్ పాత్ర పరిచయం, లెక్చరర్ వచ్చి జేడీ గురించి చెప్తున్నప్పుడు మాఫియా పడగ నీడ కి ఎదురు లేదని స్పష్టం చేయడం ద్వారా దాని శక్తిని తెలియజేయడం. ( ఇది కూడా మొదటి సూత్రం).

          ఐదో సీన్లో జేడీ భవానీకి ఎటాచ్ అయి వున్నట్టు చెప్పడం ద్వారా, మాఫియా పడగ నీడకి ప్రత్యక్ష ప్రతినిధిని ఎష్టాబ్లిష్ చేయడం- అంటే  ప్రధాన పాత్రకి సమస్య తలెత్తేందుకు ప్రేరేపించే పరిస్థితుల్ని లేదా శక్తుల్ని చూపడం ( ఇది రెండవ సూత్రం)

          ఆరో సీన్లో హీరోయిన్ తో పాటు మరికొన్ని ముఖ్య పాత్రల పరిచయం తో బాటు- ఇంత 
వరకూ ఒక ఫీల్ గా మాత్రమే  కొనసాగుతున్న మాఫియా పడగ నీడ రుచిని - జేడీ నేస్తం ద్వారా యాక్షన్ తో చూపడం (మొదటి రెండు సూత్రాలు ).

          [ఓపెనింగ్ సీను లోనే మాఫియా పవరెంతో బహిరంగ హత్య ద్వారా రుచి చూపించాక, మళ్ళీ ఆ ఫీల్ నీ, ఆ రుచినీ చూపడం ఎందుకనే సందేహం రావచ్చు. ఓపెనింగ్ సీను ప్రేక్షకులకి చూపించాక, ఇప్పుడా పరిస్థితుల్ని హీరోకి పరిచయం చేస్తున్నారు].

          ఏడో  సీన్లో శివనీ, మాఫియా ప్రతినిధి జేడీనీ ఎదురెదురు పెట్టి విజువల్ గా మాఫియా యాక్షన్ తీవ్రతని మరి కొంచెం పెంచడం (రెండో సూత్రం).

           ఈ ఐదు  సీన్ల బిజినెస్ లో స్పష్టంగా మొదటి రెండు సూత్రాల పాలనని గుర్తించాం.  అంటే పాత్రల పరిచయంతో పాటు, కథా నేపధ్యపు సృష్టి చేస్తూ, ప్రధాన పాత్రకి సమస్య తలెత్తేందుకు ప్రేరేపించే పరిస్థితుల్ని లేదా శక్తుల్ని చూపించు కొచ్చారు. ఇది చాలా  అవసరం! ఈ సూత్రాలు  ఆర్డర్ ని ఇలా సెట్ చేశాయి. ఇలా కథ ప్రకారం ఈ ఆర్డర్ లో పడిన సీన్లు చేసే పనులు కూడా కొన్ని వుంటాయి. వీటిని బాగా దృష్టిలో పెట్టుకోవాలి. స్ట్రక్చర్ లో భాగంగా ఎలాటి, ఏ తరహా- క్రైం, కామెడీ, లవ్, యాక్షన్, ఫ్యామిలీ, రాజకీయ, విప్లవ- ఏ సినిమా కథ వన్ లైన్ ఆర్డర్ కైనా, వాటి వాటి రసపోషణ లతో-  ఐదు పనులు చాలా ముఖ్యం. ఆ ఐదు పనులు లేదా ఎలిమెంట్స్ ఇవి :  

1. పాత్ర చిత్రణలు
2. అంతర్గత- బహిర్గత సమస్యలు
3. క్యారక్టర్ ఆర్క్
4. టైం అండ్ టెన్షన్ గ్రాఫ్5. ఎమోషన్ 

      ఈ ఎలిమెంట్స్ ఆర్డర్ లో పడుతున్నాయా సరిపోల్చుకుంటూ వెళ్ళాలి. ఇది క్రియేటివిటీ అని భ్రమించకూడదు. ఇది స్ట్రక్చర్ లో భాగమే. ఇది క్రియేటివిటీయే అని అపార్ధం జేసుకుని, నా క్రియేటివిటీ వేరు- ఇప్పుడివి అవసరం లేదు, పెట్టుకుంటే ఇంకెప్పుడో ఇంకెక్కడో పెట్టుకుంటానని పట్టుదలకి పోవడం విషయం తెలీక మూర్ఖత్వమే! అప్పుడు చేసేది కథనం కాదు, ఎంచక్కా కథని ఉరి తీయడమే! 
       పై ఎలిమెంట్స్ లోకి వెళ్ళే ముందు, ఇప్పుడు ఫైనల్ గా క్రియేటివిటీ అంటే ఏమిటో ప్రత్యక్షంగా తెలుసుకోవడం అవసరం.  ఉదాహరణకి పై వన్ లైన్ ఆర్డర్ లో కథాక్రమం ప్రకారం, మూడో సీన్లో, లెక్చరర్ తో జేడీ దుష్ప్రవర్తన వుంటే బావుంటుందని రాసుకున్నారను కుందాం. ఇదీ కథకి దోహదపడే, స్ట్రక్చర్ లో సెట్టయ్యే సీను. ఈ పాయింటు ని ( దుష్ప్రవర్తనని) ఎలా చూపించాలన్నదే డిస్కషన్, ఆ సీను సృష్టిలో భాగంగా వచ్చే క్రియేటివ్ కోణం. రకరకాలుగా ఆలోచించి - లెక్చరర్ మొహం మీద సిగరెట్ పోగూదితే ఎఫెక్టివ్ గా ఉంటుందనుకుని డిసైడ్ చేశారనుకుందాం- ఆ ప్రకారం తర్వాత ట్రీట్ మెంట్ లో ఇది రాసుకుని, దీన్నే డైలాగ్ వెర్షన్ లో పెట్టుకుని ఉండొచ్చు; లేదా ట్రీట్ మెంట్ లో సిగరెట్ పొగ గాక ఇంకోటేదో  అనుకుని, దాన్ని డైలాగ్ వెర్షన్ లో సిగరెట్ పోగూదడంగా మార్చుకోవచ్చు. 

          క్రియేటివిటీ నిరంతర ప్రక్రియ- దానికి కొలమానాలూ కాలమానాలూ లేవు. సెట్లో కూడా సీన్ల రూపం మారిపోవచ్చు. కానీ స్ట్రక్చర్ మారదు. కథకి దోహద పడుతూ ఆ స్ట్రక్చర్ లో, వన్ లైన్ ఆర్డర్ ద్వారా  సెట్ అయిన సీన్లలో ఎస్టాబ్లిష్ చేసిన పాయింట్స్ మారవు- ఇదే స్క్రీన్ ప్లే అంటే. ఆ సెట్టయిన ఆ పాయింట్స్ వ్యక్తీకరణలతో సీన్ల స్వరూపం మారవచ్చు- ఇదీ క్రియేటివిటీ అంటే. స్ట్రక్చర్ ని క్రియేటివిటీ తో  కన్ఫ్యూజ్ చేయకూడదు. స్ట్రక్చర్ లో భాగమైన ఈ ఐదు  ఎలిమెంట్స్- పాత్ర చిత్రణలు, అంతర్గత- బహిర్గత సమస్యలు, క్యారక్టర్ ఆర్క్, టైం అండ్ టెన్షన్ గ్రాఫ్, ఎమోషన్ -  వీటి  నిర్వహణ కూడా ఈ బిగినింగ్ బిజినెస్ లోనే మొదలవుతుంది. అదెలాగో ఈ కింద చూద్దాం.   


ఎలిమెంట్స్ నిర్వహణ 

       1. పాత్ర చిత్రణలు, 2. అంతర్గత- బహిర్గత సమస్యలు, 3. క్యారక్టర్ ఆర్క్, 4. టైం అండ్ టెన్షన్ గ్రాఫ్, 5. ఎమోషన్!
          మరొక్క సారి పై ఐదు సీన్లని పరిశీలించండి : ఒక్క ప్రిన్సిపాల్ సీను తప్ప ప్రతీ సీనులో వెల్లడవుతున్న విషయాలకి  హీరో శివ సాక్షీ భూతంగా ఉంటున్నాడు. ఇది ఆటోమేటిగ్గా పాత్రని  సస్పెన్స్ ఫుల్ గా తయారు చేస్తుందన్న మాట. కళ్ళముందు పరిస్థితులకి అతనేమీ స్పందించకుండా మౌనంగా గమనిస్తున్నాడు. ఇతనేం చేయబోతాడన్న ఉత్కంఠ, సస్పన్స్  ఈ పాత్ర చిత్రణ ద్వారా ఏర్పడ్డాయి.

          ఇక హీరోయిన్ సహా ఇతర శివ బృందం లోని పాత్రలకి అప్పుడే ప్రాధాన్యం ఇవ్వలేదు. జేడీ కి మాత్రమే ఇచ్చారు. ఇది హీరోకి ప్రత్యర్ధి వర్గపు పాత్ర కాబట్టి ఈ ఒక్క దానికే ప్రాధాన్యమిస్తూ ఇలా ఎస్టాబ్లిష్ చేయడంవల్ల పాయింటు ( అంటే ఇక్కడ జరగబోయే సంఘర్షణ)  ఒక్కటే హైలైటయ్యింది. ప్రేక్షకుల్ని ఇన్వాల్వ్ చేయడానికి ఇది చాలా ముఖ్యం. 

          కేవలం జేడీ పాత్ర  ఎంటరైన మూడో సీన్లో, మళ్ళీ శివతో ముఖాముఖీ అయిన చివరి ఏడో  సీన్లో ఈ పాత్రని రెండు సార్లు మాత్రమె ప్రత్యక్షం చేసి, మధ్యలో మిగిలిన సీన్లలో పరోక్షం చేస్తూ- ఈ పాత్ర గురించిన ఇతరుల ప్రస్తావన, బిల్డప్ ఇచ్చారు. ఇలా ఈ పాత్రని కూడా సస్పెన్స్ ఫుల్ గా తయారు చేస్తూ- క్యారక్టర్ ఆర్క్ ని సృష్టించారు.
         క్యారక్టర్ ఆర్క్ అంటే కథనంలో పాత్ర స్వభావంతో, సస్పెన్స్ తో, స్ట్రగుల్ తో, జయాపజయాలన్నిటితో కలుపుకుని క్షణక్షణానికీ గ్రాఫ్ ని పెంచడమో తగ్గించడమో చేయడం  (పటం చూడండి).  ఈ గ్రాఫ్ లేదా ఆర్క్ శివ విషయంలో కూడా పెంచుతూ పోయారు. ఇలా పాత్రచిత్రణలు, వాటి క్యారక్టర్ ఆర్క్స్ అనే ఎలిమెంట్స్ నిర్వహణని ఎలా చేసుకోచ్చారో పై సీన్లలో గమనించండి.

          ఇక- టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ -అంటే వెండితెర  మీద సమయం ( స్క్రీన్ టైం ) గడుస్తున్న కొద్దీ కథనం ద్వారా టెన్షన్ పెంచడం. సీన్లని బట్టి ఈ గ్రాఫ్ లేస్తూ పడుతూ వుంటుంది ( పటం చూడండి).  ఈ మొదటి ఏడు సీన్లలో ఈ గ్రాఫ్ ని ఎలా పెంచుకుంటూ వచ్చారో గమనించండి- ఓపెనింగ్ సీన్లోనే టెన్షన్ ప్రారంభించారు. ఆ తర్వాత మూడు నుంచి  ఏడో సీను  దాకా ప్రతీ సీనుకీ  డైలాగ్స్ రూపంగానో ( వెర్బల్ గా ),  యాక్షన్ రూపంగానో  (విజువల్ గా)  ఏదో ఒక విధంగా టెన్షన్ గ్రాఫ్ ని పెంచుకుంటూ పోయిన విధాన్ని బాగా స్టడీ చేయండి.

          ఇక అంతర్గత - బహిర్గత  సమస్యలు. ఈ దశలో ఇవి ప్రధాన పాత్రకే డెవలప్ చేస్తూ పోవాలి. అలా శివకి మాత్రమే ముందుగా బహిర్గత సమస్యలకి దారి వేస్తూ పోయారు. ఈ పాత్ర వున్నసీన్లలో మాఫియా వాతావరణం నేపధ్యాన్ని ప్రయోగిస్తూ అందులోంచి ఉత్పన్నమయ్యే పరిస్థితుల ద్వారా బహిర్గత సమస్యని డెవలప్ చేస్తూ పాయారు. 3, 5, 6, 7 సీన్లని పరిశీలిస్తే శివకి ఎదురయ్యింది బహిర్గత సమస్యా రూపాలే. 

          ఏడో సీను దగ్గర జేడీ తో శివకి ఈ బహిర్గత సమస్యగా రూపుదాలుస్తున్న పరిస్థితిని ఓ కొలిక్కి తెచ్చి ఆపేశారు. ఇక్కడితో ఓ బ్లాక్ పూర్తయ్యింది. ఇక చేంజ్ ఓవర్ కెళ్ళాలి. ప్రారంభం దగ్గరనుంచీ ఈ ఏడు సీన్లూ మార్పు లేకుండా ఒకే కాలేజీ వాతావరణం లో జరుగుతూ వచ్చాయి. ఇక్కడ బహిర్గత సమస్య లో కొంత భాగాన్ని  ఎష్టాబ్లిష్ చేస్తూ ఆపారు. మరి అంతర్గత సమస్య ఎక్కడ  చెప్పాలి? అది కూడా కాలేజీ లోనేనా? కాదు. అంతర్గత సమస్య ఎప్పుడూ వ్యక్తిగతమైనది అయ్యుంటుంది. అందుకని శివ ఇంటికెళ్ళాలి. ఇలా కాలేజీలో ఒకే వాతావరణం లో నడుస్తున్న కథనాన్ని, దాని వల్ల  ఏర్పడిన మొనాటనీనీ ఛేదిస్తూ- కాస్త వాతావరణ మార్పుతో- అంటే చేంజి ఓవర్ తో- మరో వాతావరణంలోకి తీసి కెళ్ళారు. 

          అంతర్గత సమస్య చెప్పేందుకు చేంజ్ ఓవర్ తో- ఎనిమిదో సీనులో-  శివ కుటుంబాన్ని ఓపెన్ చేశారు. 

8.  ఇంట్లో శివ అన్న-శివ ల మధ్య కాలేజీ ఫీజు ప్రస్తావనకి వదిన అయిష్టం కనబరచడం, రౌడీలు గణేష్ చందాల కోసం వస్తే శివ వాళ్ళని గమనించడం.

9.  శివ ఫ్రెండ్ తో జేడీ దౌర్జన్యం చేస్తే ఎందుకు ప్రిన్సిపాల్ కి కంప్లెయింట్ ఇవ్వలేదని శివ అడగడం, అలా చేస్తే భవానీయే కలగజేసుకుంటాడని మల్లిక్ అనడం.
10.  శివ తన అన్నకి కాలేజీ విషయాలు చెప్తే కలగజేసుకోవద్దని వద్దని అన్న మందలించడం, అన్న కూతురితో శివ బాంధవ్యం.
11.  అన్న కూతురితో  ఐస్ క్రీం షాపు కొచ్చిన శివకి, అక్కడికే వచ్చిన ఆశా ఎదురవడం, అన్న కూతురుతో ఆమె పరిచయం.
12.  ఎప్పుడూ సీరియస్ గా వుండే శివని కాలేజీలో ఆశా టీజ్ చేయడం.
13.  క్యాంటీన్ బాయ్ తెలంగాణా భాషలో రామాయణం చెప్పి అందర్నీ నవ్వించడం .
14.  మొదటి పాట- శివ అండ్ ఫ్రెండ్స్ అందరి మీదా

          చేంజ్ ఓవర్ తో ఈ రెండో బ్లాకులో 8 నుంచీ  14 వరకూ 7 సీన్లు వున్నాయి.  8 నుంచీ  14  వరకూ ఒక బ్లాకు అని ఎలా గుర్తించామంటే, 8 తో ప్రారంభమైన కథనం 14 దగ్గర వచ్చిన మొదటి పాట  వరకూ ఒక ఒరవడిలో సాగి, తర్వాతి 15 వ సీను నుంచీ కథనం సీరియస్ అవుతున్నందుకు.

          ఈ రెండో బ్లాకులో  సీన్లు ఎక్కువగా శివ ఇంట్లోనూ, ఆశా ఇంట్లోనూ, బయటా వుండడం గమనించాలి. ఇంట్లో శివకి వదినతో ప్రాబ్లం ( అంతర్గత సమస్య)  వున్నట్టు చూచాయగా 8 వ సీన్లోనే చెప్పారు. ఈ అంతర్గత సమస్య ఎందుకవసరం? ఐదవ ఎలిమెంట్ అయిన ఎమోషన్  పుట్టేందుకు అవసరం. ఇంతవరకూ కాలేజీ వ్యవహారాలతో బహిర్గత సమస్యగా ఉంటున్న  పరిస్థితితో కథలోగానీ, శివ పాత్రపట్ల ప్రేక్షకుల పట్ల గానీ ఎమోషన్ పుట్టిందా? లేదు కదా? బహిర్గత సమస్యకి అంతర్గత సమస్య తోడైతేనే ఎమోషన్ పుడుతుంది. అలా చివరిదైన ఐదో ఎలిమెంట్ కి కూడా ఇలా అంకురార్పణ జరిగింది. 

          చేంజ్ ఓవర్ కోసం ఇలా రెండో బ్లాకు తీసుకున్నా, ఇదింకా బిగినింగ్ విభాగమే కాబట్టి వాటి సూత్రాల పాలన కొనసాగింది : ఎనిమిదో  సీనులో అన్నా, వదిన, వాళ్ళ కూతురు పాత్రల పరిచయం- రౌడీల ఆగమనం ( మొదటి రెండు సూత్రాలతో బాటు ఎమోషన్ అనే ఎలిమెంట్).

          తొమ్మిదో సీను  నుంచి మూడో సూత్రాన్ని అమలు చేశారు. కాలేజీలో జేడీ పాల్పడిన ఒక చర్య మీద ఎందుకు కంప్లెయింట్ ఇవ్వలేదని శివ అనడం ద్వారా- అంతవరకూ సాక్షిగా ఉంటున్న ఈ పాత్రని యాక్షన్ లోకి దింపుతూ సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన ప్రారంభించారు. ఇది మూడో సూత్రం(క్యారక్టర్ ఆర్క్, టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ అనే ఎలిమెంట్స్ కూడా మరింత పెరిగాయి.

          పదో సీను కాలేజీ విషయాల్లో కల్పించుకోవద్దని అన్న మందలించడంతో శివ కంకణ బద్ధుడవుతున్నాడని తెలపడం. ఇక్కడే అన్న కూతురితో బాంధవ్యం చూపడం ద్వారా అమ్మాయి పాత్ర పరమైన సస్పెన్స్ ని క్రియేట్ చేయడం- ఈ అమ్మాయి కూడా సమస్యలో ఇరుక్కుంటుందేమోనన్న ఆదుర్దాతో( మూడో సూత్రం అమలు ప్లస్ ఎమోషన్, క్యారక్టర్ ఆర్క్, టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ ల ఉధృతి).

          పదకొండో సీను అమ్మాయిని ఆశాకి పరిచయం చేయడంతో అమ్మాయి పాత్ర కీలకం కాబోతోందన్న ఉత్కంఠ ( పాత్రల పరస్పర పరిచయం- మొదటి సూత్రం అమలు ప్లస్ అమ్మాయి తాలూకు క్యారక్టర్ ఆర్క్ ప్రారంభం, టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ మరింత ఉధృతి).

          ఇంతే, ఇంకా అదేపనిగా కథ చెప్పకుండా మూడో బ్లాకులోకి వెళ్ళే ముందు మూడు సరదా సీన్లు (12, 13, 14)  వేశారు పాటతో సహా. 
                                                            

గోల్ కి చేరువలో!
      సినిమా కథలోనైనా ఓ పాట పూర్తయ్యిందంటే కథనం చేంజి ఓవర్ తీసుకోవడం మామూలే. ఆ చేంజి ఓవర్ మరో కొత్త పాత్రతోనో, కొత్త పరిణామంతోనో ఏర్పడ్డం కద్దు. ఇక్కడ కూడా ఈ చేంజ్ ఓవర్ కోసం తీసుకున్న మూడో బ్లాకులో- సీఐ పాత్ర ప్రవేశంతో చేపట్టారు.

15.   సైకిలు మీద పోతున్న శివ, ఆశాని ఎక్కించుకోవడం; ఆమె తన గురించీ, సిఐ గా ఉంటున్న తన అన్న గురించీ క్లుప్తంగా చెప్పడం.  
16.  ఇంటి దగ్గర డ్రాప్ చేసిన శివని ఆశ ఇంట్లోకి తీసికెళ్ళి అన్న కి పరిచయం చేయడం, భవానీతో ప్రాబ్లం వచ్చిందని అన్న బయటి కెళ్ళిపోవడం.

17.  షాపు కెళ్ళి వస్తున్న వదినని రౌడీలు టీజ్ చేయడం.
18.  ఈ టీజింగ్ గురించి ఇంటికొచ్చి చెప్తున్న వదిన మాటలు శివ వినడం. టాపిక్ శివ మీదికి మళ్ళి అతను ఇంట్లో వుండడం ఇష్టం లేదన్నట్టుగా ఆమె మాట్లాడడం, శివ వినడం.
19.  వదినతో అన్ని మాటలు పడుతూ ఇంకా ఆ ఇంట్లో ఎందుకుంటున్నావని శివని ఆశా ఆగడం, జేడీ వచ్చి కావాలని ఆశాకి డాష్ ఇవ్వడం, శివ రియాక్ట్ అవబోతే ఆశ ఆపడం.
20.  సైకిల్ స్టాండ్ దగ్గర  జేడీ మళ్ళీ శివని రెచ్చగొట్టడం- ఇక సహించలేక శివ సైకిలు చెయిన్ తెంపి  జేడీనీ అతడి గ్యాంగునీ చావగొట్టడం.

          పదిహేనవ, పదహారవ సీన్ల ద్వారా  ఆశా అన్న సీఐ పాత్రని ఎస్టాబ్లిష్ చేశారు. ఇదింకా బిగినింగ్ విభాగమే కాబట్టి మరో పాత్ర గా సీఐ పరిచయం జరిగింది ( మొదటి సూత్రం)  సీఐ పాత్ర భవానీ ని ప్రస్తావించడంతో, కథానేపధ్య సృష్టి మళ్ళీ అందుకుంది ( మొదటి సూత్రం), అలాగే చెబుతున్న మాఫియా ఈ కథలో పోలీసు పాత్ర ఉనికి ద్వారా ఉత్కంఠ రేపుతూ, టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ ఎలిమెంట్ ని  మరింత  వృద్ధి చేయడాన్నిగమనించాలి. 

          పదిహేడో సీనులో వదిన పాత్రని రౌడీలతో ఏడ్పించడం ద్వారా ఈ మాఫియా పడగ నీడ ఆమె ఇంట్లోకి కూడా చొర బడునుందన్న ఫోర్ షాడోయింగ్ అనే అదనపు ఎలిమెంట్ (మాఫియా పడగ నీడతో మొదటి సూత్రం కొనసాగింపు).

          పద్దెనిమిదో సీన్లో ఈ ఫోర్ షాడోయింగ్ ఎలిమెంట్ కొనసాగింపు తో బాటు- ఎనిమిదో సీన్లో చూచాయగా చెప్పిన శివ మీది వదిన పాత్ర అయిష్టాన్ని, ఇప్పుడు తీవ్రత పెంచి శివకి రుచి చూపిస్తూ అంతర్గత సంఘర్షణ అనే ఎలిమెంట్ ని పక్వానికి తేవడం. ఎమోషనల్ ఎలిమెంట్ పెరగడం, పంతొమ్మిదో సీన్లో కాలేజీలో ఆశా మాటలతో ఈ ఎమోషనల్ కోషేంట్ మరింత పెంచి- తద్వారా శివ పాత్ర పై ప్రేక్షకులకి ఎనలేని సానుభూతిని పెంచి- ఇక బహిర్గత పోరాటానికి సిద్ధం చేయడం.

          ఇదే సీన్లో ఆశా కి కావాలని జీడీ డాష్ ఇవ్వడంతో - మూడో సూత్రం సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన కూడా పక్వానికొచ్చి ఇక శివ పూర్తిగా రియాక్ట్ అవడం!

          ఇరవయ్యోవ సీనులో శివ పాత్ర కట్లు తెంచుకుంటూ తిరుగుబాటు చేయడం- జేడీ అండ్ గ్యాంగు ని చావదన్నడంతో- నాల్గో సూత్రంగా  సమస్య ని  ఏర్పాటు చేయడం!
           బిగినింగ్ విభాగాన్ని గోల్ కి చేర్చారు!

          గోల్ కి చేరడం తో బిగినింగ్ విభాగం వన్ లైన్ ఆర్డర్ ముగిసింది!


బిగినింగ్ విభాగం గోల్ లో ఉండాల్సిన ఎలిమెంట్స్ ఏమిటి?
రేపు!