రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో ప్రశ్న కోసం తేదీ ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. ఔచిత్యం ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో ప్రశ్న కోసం తేదీ ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. ఔచిత్యం ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

18, జూన్ 2024, మంగళవారం

1440 : రివ్యూ!

 

రచన- దర్శకత్వం : నిథిలన్ స్వామినాథన్
తారాగణం : విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్. మమతా మోహన్ దాస్, భారతీ రాజా, అభిరామి, నటరాజ్ తదితరులు
సంగీతం :  ఆజనీష్ లోకనాథ్, ఛాయాగ్రహణం  : దినేష్ పురుషోత్తమన్
బ్యానర్స్ : ఎన్‌వీఆర్ సినిమా, ప్యాషన్ స్టూడియోస్
నిర్మాతలు : సుదర్శన్ సుందరం, జగదీష్ ఫళని స్వామి
విడుదల : జూన్ 14, 2024
***

        విజయ్ సేతుపతి 50వ సినిమా అనగానే ఆసక్తి, మార్కెట్ లో కదలిక, సోషల్ మీడియాలో హల్చల్ ఏర్పడ్డాయి. 50 వ సినిమాగా అతనేం ప్రత్యేకత చూపించబోతున్నాడ న్న కుతూహలమొకటి. దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ తో, కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తో కలిపి ఆ ప్రత్యేకత ఎలా వుండబోతోంది? కమర్షియల్ సినిమాని ఏ భిన్న కోణంలో చూపించాడు? ఇందులో తన పాత్ర ఎలాటిది? ముసురు
కుంటున్న ఇన్నిప్రశ్నలతో ఈ తమిళ సినిమా కథ కూడా సంధిస్తున్న ప్రశ్నలేమిటి? ఇవి తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం...

కథ

హారాజా (విజయ్ సేతుపతి) చిన్న సెలూన్ పెట్టుకుని జీవిస్తూంటాడు. ఒక ప్రమాదంలో భార్య చనిపోతే కూతురే లోకంగా బ్రతుకుతూంటాడు. ఓ రాత్రి ఇంట్లో దొంగలు పడతారు.  దొంగలు ఇంట్లోంచి లక్ష్మిని ఎత్తుకు పోతారు. మహారాజా పోలీస్ స్టేషన్ కెళ్ళి లక్ష్మిని వెతికి పెట్టమని కంప్లెయింట్ ఇస్తాడు. లక్ష్మి అనేది అతను చెత్తడబ్బాకి పెట్టుకున్న పేరు. చెత్తడబ్బా వెతకడమేమిటని పోలీసులు నవ్వి అవమానించి వెళ్ళగొడతారు. మహారాజా ఏడు లక్షలు లంచమిస్తానంటే ఒప్పుకుని చెత్త డబ్బా వెతకడం మొదలెడతారు.
       
ఏమిటీ చెత్తడబ్బా
? అది ఎంతుకంత ముఖ్యమయింది మహారాజాకి? కూతురితో ఆ చెత్తడబ్బా కున్న సంబంధమేమిటి? పోలీసులు ఆ చెత్తడబ్బాని వెతికి పట్టుకోగలిగారా? అప్పుడేం జరిగింది? అప్పుడు బయటపడ్డ భయంకర రహస్యాలేమిటి? ఇందులో క్రిమినల్ సెల్వన్ (అనురాగ్ కశ్యప్) పాత్రేమిటి? ఇతడికి మహారాజా విధించిన  శిక్షేమిటి? ఈ ప్రశ్నలకి సమాధానాలు మిగతా కథ చూసి తెలుసుకోవాలి.

ఎలావుంది కథ

ఇది ప్రతీకారంతో కూడిన  సస్పెన్స్ థ్రిల్లర్ కథ. అయితే ప్రతీకార కథ అనేది చివరి వరకూ సస్పెన్స్ లో వుంటుంది. కథ మాత్రం లీనియర్ నేరేషన్ లో వుండదు. ముందుకీ వెనక్కీ నడుస్తూ నాన్ లీనియర్ గా వుంటుంది. చివర్లో ఈ నాన్ లీనియర్ దృశ్యాలన్నీ ఏది ఎప్పుడు ఎందుకు జరిగాయనే  ప్రశ్నలన్నిటికీ సమాధానమిస్తూ కొలిక్కి వస్తాయి. అయితే ఈ దృశ్యాల్ని క్రమపద్ధతిలో పేర్చుకుని కథని అర్ధం చేసుకోవడానికి మాత్రం మెదడుకి శ్రమ కల్గించాల్సిందే.
       
సింపుల్ గా చెప్పాలంటే ఇది విజయ్ సేతుపతి పాత్ర చెత్తడబ్బాని అడ్డు పెట్టుకుని తనకి జరిగిన అన్యాయానికి కారణమైన క్రిమినల్ ముఠాని ట్రాప్ చేసేందుకు పన్నిన పథకం. పోలీసుల సాయంతో ట్రాప్ చేసి పట్టుకున్నాక
, అసలేం జరిగిందనేది అప్పుడు పొరలు పొరలుగా వీడిపోయే కథ. అంటే ఎండ్ సస్పెన్స్ అని నేరుగా తెలియకుండా ఎండ్ సస్పెన్స్ కథ నడపడం. టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో (1955) అనే హాలీవుడ్ మూవీ ఈ తరహా కథా సంవిధానానికి బాట వేసింది. అయితే చివర్లో విప్పాల్సిన ప్రశ్నలు ఎక్కువ వుండకూడదు. వుంటే తికమక, వాటితో మెదడుకి శ్రమా పెరిగిపోతాయి.
       
అయితే ప్రతీ వారం సస్పెన్స్ థ్రిల్లర్స్ పేరిట సినిమాలు వచ్చేసి క్రాఫ్ట్ తెలియక అపహాస్యమవుతున్న వేళ
మహారాజా ఒక మెచ్చదగ్గ ప్రయత్నమే. దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ మేధో పరంగా స్క్రిప్టు మీద చాలా వర్క్ చేశాడు, కానీ కథలోంచి ఎక్కువ ప్రశ్నలు లాగి పరీక్షకి పెట్టాడు.
       
ఫస్టాఫ్ విజయ్ సేతుపతి పాత్ర పరిచయం
, చెత్తబుట్ట కోసం పోలీసుల దర్యాప్తు, పోలీస్ స్టేషన్ లో సేతుపతి పడే అవమానాలు, మరో రెండు వేరే పాత్రలతో వేరే సంఘటనలు, తర్వాత ఈ సంఘటనల్లో సేతుపతి పాత్ర కూడా వున్నట్టు  ఫ్లాష్ బ్యాక్ లో రివీలవడం, ఆ పాత్రలతో యాక్షన్ సీను వగైరా వుంటాయి.
       
సెకండాఫ్ లో అనురాగ్ కశ్యప్ క్రిమినల్ పాత్ర కార్యకలాపాలతో కథలో కొత్త సంఘటనలు ప్రారంభమవుతాయి. చెత్తడబ్బా కోసం పోలీసుల వేట సాగుతూనే వుంటుంది. అనురాగ్ కశ్యప్ క్రిమినల్ అని తెలియని సేతుపతితో దృశ్యాలు వస్తాయి. చివరికి పోలీసులు నకిలీ చెత్తడబ్బా తయారు చేసి
, దాని దొంగగా ఒకడ్ని చూపించేసరికి వాడితో సేతుపతి కూతురికి ముడిపెట్టి భయంకర రహస్యాలు వెల్లడవడం మొదలవుతాయి... ఇవి షాకింగ్ గా వుంటాయి. చివర్లో రివీలయ్యే కేవలం కూతురితో ఈ షాకింగ్ ఎలిమెంటే ప్రేక్షకులతో కనెక్ట్ అయి సినిమా సక్సెస్ కి దారితీసింది తప్ప...చిక్కుముడులతో వున్న కథ అర్ధమై కాదు. ఇంతా చేసి ఇది రెండుంపావు గంటల్లో ముగిసిపోయే కథ.

నటనలు- సాంకేతికాలు

తన 50వ సినిమాగా  గుర్తుండిపోయే పాత్ర నటించాడు విజయ్ సేతుపతి. గిరి గీసుకోకుండా ఎలాటి పాత్రనైనా నటించే సేతుపతి కమల్ హాసన్ బాటలో నడుస్తున్నట్టు అని పిస్తాడు. ఈ సినిమాలో ప్రతీ సీనూ అతడికి సవాలే. ఫస్టాఫ్ లో పోలీసులు తనతో ఎలా ప్రవర్తించినా, కొట్టినా బానిసలా పడుండే నటనని అత్యున్నతంగా కనబరుస్తాడు. అతడి విజృంభణ అంతా క్లయిమాక్సులోనే. రాక్షసుడవుతాడు. అంతర్లీనంగా కూతురి సెంటిమెంటుతో భావోద్వేగాల్ని రగిలిస్తూ.
       
సమాజంలో కుటుంబం వున్న మంచివాడిగా కనిపిస్తూ ఘోర నేరాలు చేసే పాత్రలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా గుర్తుండే పాత్ర నటించాడు. చివరికి అతడి ఖాతాలో పడే శిక్ష ఘోరంగా వుంటుంది. మిగతా పోలీసుల పాత్రలు
, దొంగల పాత్రలు నటించిన నటీనటులందరూ మంచి పనితనం కనబర్చారు. సాంకేతికంగా రియలిస్టికి మూవీ పోకడలతో వుంది. సంగీతం, ఛాయాగ్రహణం, యాక్షన్ సీన్లు, లొకేషన్లు, కాస్ట్యూమ్స్ వగైరా అన్నీ సహజంగా వుంటాయి.
        
ఇంతా చేసి దీన్ని కేవలం సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉద్రేకపర్చి వదిలేయలేదు. చెప్పకుండానే కర్మ సిద్ధాంతం చెప్పే కథతో వుంటుంది- నువ్వు యితరులకేం చేస్తావో అదే నీకూ తిరిగొస్తుందని!
—సికిందర్

 

 


18, జనవరి 2023, బుధవారం

1287 : రివ్యూ!


  కొన్ని విజాతి జానర్లని కలిపి జానర్ బ్లెండర్ గా సినిమాలు తెలుగులో వస్తూంటాయి. అవి చాలా వరకూ క్రాఫ్టు కుదరక విఫలమవుతూ వుంటాయి. కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణు కథ అని ఒకటి రాబోతోంది. దీని గురించి చెబుతూ- కాన్సెప్ట్ తో మొదలై లవ్ కామెడీ మిక్స్ అయి, క్రైమ్ నుంచి సస్పెన్స్ నుంచి సాగే ఒక ఇంటెన్స్ డ్రామా అనుకోవచ్చు - అని పబ్లిసిటీ ఇచ్చారు. ఇలా చాంతాడంత గందరగోళంగా చెబితే సినిమా ఇంకెంత గందరగోళంగా వుంటుందో అర్ధం జేసుకోవచ్చు. నవరసాల్లో ఏది ఎందుకు మిక్స్ చేస్తున్నారో స్పష్టత లేక ఫ్లాపయిన సినిమాలున్నాయి. పూర్వం హవా అనే హిందీలో తల్లి కథగా నడుస్తున్న హార్రర్ కథనం (బీభత్స రసం) కాస్తా, ఆమె కూతురి కథగా మారిపోయి సైకో థ్రిల్లర్ గా (అద్భుత రసం) ముగుస్తుంది. ఇలా విజాతి జానర్ల కలబోత అతుకులేసినట్టు వుంటే సినిమా ఎటూ గాకుండా పోతుంది. కలబోత అంటే జానర్ల మద్య కార్యకారణ సంబంధం.
ట్రైలర్

         నేపథ్యంలో వచ్చిందే విజాతి జానర్ల స్వ- ఎ సౌండ్ ఆఫ్ సోల్ అనే హార్రర్-రోమాంటిక్ - సస్పెన్స్ థ్రిల్లర్. కొత్త వాళ్ళు చేసిన ప్రయోగం. రచన -దర్శకత్వం మను పీవీ. జిఎంఎస్ గ్యాలరీ ఫిలిమ్స్ బ్యానర్‌పై జిఎం సురేష్ నిర్మాణం. మహేష్ యడ్లపల్లి, స్వాతీ భీమిరెడ్డి, యశ్వంత్ పెండ్యాల, మాణిక్ రెడ్డి, శ్రీనివాస్ భోగిరెడ్డి, సిద్ధార్థ్ గొల్లపూడి నటీనటులు. సంగీతం కరణం శ్రీ రాఘవేంద్ర, ఛాయాగ్రహణం దేవేంద్ర సూరి, కూర్పు శ్రీ వర్కల.

భ్రాంతితో దిగ్భ్రాంతులు

అభిషేక్ ఒక ఆర్టిటెక్ట్. నాయనమ్మ చనిపోతే వస్తాడు. మంచం మీద వున్న చనిపోయిన నానమ్మ లేచి మంచి నీళ్ళు తాగి పడుకోవడం చూసి కలవరపతాడు. అంత్యక్రియల తర్వాత కూడా నాయనమ్మ సజీవంగానే కన్పిస్తూ వుంటే దిగ్భ్రాంతి చెందుతాడు. తనది లాజికల్ మైండ్. తనకి కన్పిస్తున్నవి నిజం కాదు, భ్రాంతి అని నమ్ముతాడు. ఈ భ్రాంతితో వుండగానే ఇంకో భ్రాంతికి లోనవుతాడు. తను ప్రేమించిన చనిపోయిన స్వప్న వచ్చి తను నిజం అంటుంది, అబద్ధమంటాడు. ఈ సంఘర్షణతో వుండగానే ఆమె చావు వెనుక రహస్యముందని అనుమానిస్తాడు. ఈ అనుమానంతో ఛేదించుకుంటూ వెళ్తూంటే వూహించని విషయాలు బయటపడుతూంటాయి. ఇదంతా నిజమా? అబద్దమా? అసలు తనకి ఏం జరుగుతోంది? దీన్నుంచి ఎలా బయటపడాలి? కొలీగ్ భాస్కర్, డాక్టర్ జయప్రకాష్, పోలీస్ ఇన్స్ పెక్టర్, మినిస్టర్...వీళ్ళందరికీ వున్న సంబంధమేమిటి? తెలుసుకుంటూంటే అభిషేక్ కి మతి పోతూంటుంది...

బలమైన కథ- బిగువైన మలుపులు

నాయనమ్మ మరణంతో హార్రర్ గా ప్రారంభమై, స్వప్న రాకతో ఫ్లాష్ బ్యాక్ లో రోమాన్స్ లోకి తిరగబెట్టి, ఆమె మరణంతో సస్పెన్స్ థ్రిల్లర్లోకి మలుపు తీసుకునే మల్టీపుల్ జానర్స్ కథ. ఈ మూడు జానర్స్ కార్యకారణ సంబంధం (కాజ్ అండ్ ఎఫెక్ట్) తో పరస్పరం కనెక్ట్ అయివుంటాయి. నాయనమ్మ మరణం అభిషేక్ సబ్ కాన్షస్స్ మైండ్ లో ట్రిగర్ పాయింట్ గా పనిచేస్తే, దీంతో చనిపోయిన స్వప్న మైండ్లోకి తిరిగొచ్చింది. తిరిగొచ్చిన స్వప్న ఆమె మరణం వెనుక రహస్యం తెలుసుకునేందుకు దారితీసింది. వీటన్నిటికీ మూలకారణం షిజోఫ్రేనియాతో బాధపడే అభిషేక్ మానసిక స్థితి. విజాతి జానర్లతో కాన్సెప్ట్ పకడ్బందీగా వుంది.    
        
దీని కథనం కామెడీలతో, ఎంటర్టైన్ మెంట్ తో పక్కదారులు పట్టకుండా జానర్స్ మర్యాదలతో సూటిగా, స్పష్టంగా వుంది. సెకండాఫ్ కథనంలో మలుపులు కావాల్సినంత సస్పెన్స్ నీ, థ్రిల్స్ నీ సృష్టిస్తాయి.
        
దర్శకుడు మనూ ప్రొఫెషనల్ గా కనిపిస్తాడు కథ విషయంలో- సెకండాఫ్ లో  లాజికల్ గా కొన్ని లోపాలున్నప్పటికీ. ముగింపు ముగిసిపోయిన కథకి పొడిగింపులా వుంటుంది. 1983 లో హిందీ ధువా లో (హాలీవుడ్ టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’- 1958 కి అనుసరణ) క్యారక్టర్లు ఒకటొకటే నిజస్వరూపాలు బయటపెట్టుకుని, ఎంతో దయామయురాలిగా కన్పించే రాజమాతని హంతకురాలిగా రివీల్ చేసే షాకింగ్ ముగింపులాంటిది వుండాల్సింది అభిషేక్ పాత్రతో. అభిషేక్ పాత్ర ఏ మానసిక సమస్యతో మొదలైందో అదే మానసిక సమస్యతో క్యారక్టర్ ఆర్క్, ట్విస్టు వంటివి లేకుండా ముగిసి పోవడం డైనమిక్స్ లేమిని సూచిస్తుంది.
        
పోతే, అభిషేక్ పాత్రలో మానసిక సంఘర్షణతో వుండే నటనని మహేష్ యడవల్లి మంచి టెంపో తో పోషించాడు. కొత్త వాడులా అన్పించడు. దాదాపు ప్రతీ సీనులో తను వుంటూ కథని బాగా క్యారీ చేశాడు. స్వప్న పాత్రలో స్వాతీ భీమిరెడ్డి సంఘర్షణ కూడా బలంగా పోషించింది. నెగెటివ్ గా కన్పించే భాస్కర్ గా యశ్వంత్ పెండ్యాల యాక్షన్ తో కథ ముందుకు సాగడానికి తోడ్పడ్డాడు. డాక్టర్ గా శ్రీనివాస్ భోగిరెడ్డి, మరో డాక్టర్ గా సిద్ధార్థ్ గొల్లపూడి డ్రామాని పకడ్బందీగా పోషించారు. ఇన్స్ పాత్రలో మాణిక్ రెడ్డి ప్రత్యేక దృష్టినాకర్షిస్తాడు.
        
సంగీతం, ఛాయాగ్రహణం, కూర్పు మొదలైన విభాగాలు నిర్వహించిన సాంకేతికులు కథతో పోటీపడ్డారు. దర్శకుడు మానూ పీవీ చిన్న సినిమాకి బలమైన కంటెంట్ ముఖ్యమని, దానికి బలమైన టాలెంట్ కూడా అవసరమని ఈ జానర్ బ్లెండర్ తో తేల్చి చెప్పాడు. దీన్ని clasc యాప్ ని డౌన్ లోడ్ చేసుకుని ఉచితంగా చూడొచ్చు.

—సికిందర్

13, నవంబర్ 2020, శుక్రవారం

998 : రివ్యూ

 

  అందరూ కొత్త వాళ్ళే ప్రయత్నించిన అమెరికాలో తెలుగు ఇండియన్ సైకో కిల్లర్ మూవీ గతం. ఇలా అంటున్నందుకు బాధపడక పోతే, కాస్తాలోచిస్తే, ఇలాటి మూవీస్ అఫెన్సివ్ గా వుంటాయి. గతంలో తెలుగులో, హిందీలో ఇలాటి ఫారిన్ నేపథ్యాల్లో తీసిన ఇండియన్ పాత్రలతో క్రైమ్ సినిమాలు, మాఫియా సినిమాలూ చూస్తున్నప్పుడు ఈ ప్రశ్నే రేకెత్తించేలా వుండేవి. ప్రేక్షకులంగా మనం ఇలా చూపించింది చూసి ఎంజాయ్ చేయలేం కదా? మధ్యలో దేశం గుర్తొచ్చి ఎంజాయ్మెంటు చెడగొడుతుంది. సినిమా చూడవయ్యా అంటే దేశాన్ని గుర్తు చేసుకోవడం నాన్సెనూ సైకో తనమూ అన్పించవచ్చు. మనం సైకోలమే, కానీ ఫారినర్లు ఇలాటి సినిమాలు చూస్తే ఫారిన్లో కూడా ఇండియన్లు ఇంతేనేమో అనుకోవడం సైకోతనం కాబోదు. అమెరికాలో కొందరు ఎన్నారై నేరగాళ్ళు వుండొచ్చు. ఎఫ్బీఐ వేటాడుతున్న టాప్ 10 నేరగాళ్ళల్లో భద్రేష్ కుమార్ వుండొచ్చు. ఇంకో గర్ల్ ఫ్రెండ్ తో కలిసి భార్యని చంపి అరెస్టయిన నర్సన్ వుండొచ్చు. కాల్ సెంటర్ స్కామ్ చేసి దొరికిపోయిన కొందరు ఇండియన్ యూత్ వుండొచ్చు. పరాయి దేశాల్లో ఇది తప్పూ అని చెప్పే బదులు గ్లోరిఫై చేసే సినిమాలు వస్తున్నాయి, అదీ సమస్య. ఫారిన్ వెళ్ళి సెటిలవడమంటే ఇండియన్ స్టయిల్ నేరాల్ని అక్కడ దిగుమతి చేసుకోవడమా? ఫ్రాన్స్ లో ఉగ్రవాదాన్ని దిగుమతి చేసుకుంటున్న ఒక వర్గానికీ మనకీ తేడా ఏముంది?

    క్రైమ్ జానర్ అసలు ఎజెండా నైతిక విలువల్ని గుర్తు చేయడమే, స్థాపించడమే. అప్పుడే కథా ప్రయోజనమనే మౌలికాంశం నెరవేరుతుంది. సాధ్యం కాకపోతే ఇలాటి సినిమాల్ని తెలుగు రాష్ట్రాల నేపథ్యంగా తీసుకోవచ్చు. సినిమాల్ని సినిమాల్లాగా చూడాలన్న అర్ధం లేని వాదం పని  చెయ్యదు. కమర్షియల్ సినిమా అనేది అతి పెద్ద మాస్ మీడియా అయినంత మాత్రాన బాధ్యత వుండదని కాదు. 

        నీతి శతకం ఆపి విషయానికొస్తే, ఖచ్చితంగా ఇది కథాపరంగా పాక్షికంగా, మేకింగ్ పరంగా ఫర్వాలేదనిపించేలా కొత్త వాళ్ళు చేసిన మంచి ప్రయత్నం, సందేహం లేదు. పాత్రల పరంగా అందరూ కొత్తవాళ్లు కావడంతో పోల్చుకోవడానికి గడ్డాలు అడ్డం వస్తున్నాయి. నటనల పరంగా కథే రిలీఫ్ లేని సీరియస్ మూడ్ కావడంతో, సింగిల్ ఎక్స్ ప్రెషన్ తో సేఫ్ అయిపోయారు కొత్త నటులూ, నటీమణులూ. సైకో రిషిగా రాకేష్, గర్ల్ ఫ్రెండ్ అదితిగా పూజిత, సైకోని పట్టుకునే అర్జున్ గా నిర్మాతల్లో ఒకరైన భార్గవ, ఈయన కొడుకు హర్షగా హర్షా ప్రతాప్, అందరూ మాటలు పలకడానికి నోటికి పనిచెప్పినట్టు కన్పిస్తారు. బిహేవియర్ ద్వారా కూడా భావ ప్రకటన చేసి వుండాల్సింది. ఎలాగూ ఈ మూవీని థియేటర్లలో సామాన్య ప్రేక్షకులకి ఉద్దేశించినట్టు లేదు. డైలాగులు ఇంగ్లీషులో ధారాళంగా ప్రవహించాయి. కొన్ని చోట్ల కథలో మలుపుల్ని తెలియజేసే కీలక డైలాగులు కూడా ఇంగ్లీషులోనే వున్నాయి. సామాన్యులకి కథెలా అర్ధమవుతుంది. అందుకని నెటిజన్లని ఉద్దేశించినప్పుడు, ఇన్ని డైలాగుల్ని కూడా తగ్గించి, ఫిలిమ్ ఈజ్ బిహేవియర్ అని దృష్టిలో పెట్టుకుని, యాక్షన్ ద్వారా అంటే చేతల ద్వారా చెప్పిస్తే - ఈ టెక్నిక్ ఆకర్షణగా వుండేది. 
        
        నిడివి గంటా 40 నిమిషాలే అయినా నిదానమైన నడకవల్ల రెండు గంటలు గడిచిపోయినట్టు అన్పిస్తుంది. మిస్టరీకి వేగం తక్కువ వుండొచ్చు; థ్రిల్లర్ కి వేగమెక్కువ వుండాలి. మనోజ్ రెడ్డి ఛాయాగ్రహణం, శ్రీచరణ్ పాకాల సంగీతం ఫర్వాలేదన్పించే స్థాయిలో  వున్నాయి. పాటల్లేవు. కొత్త దర్శకుడు కిరణ్ కొత్తవాడు అన్పించేలా లేడు. కాకపోతే కథనంలో పాక్షికంగానే సక్సెస్ అయ్యాడు.

***

        అమెరికాలో వుంటున్న రిషి (రాకేష్) ఒక ప్రమాదానికి లోనై హాస్పిటల్లో వుంటాడు. స్పృహలో కొచ్చాక జ్ఞాపక శక్తి కోల్పోయి వుంటాడు. గర్ల్ ఫ్రెండ్ అదితి (పూజిత) ని కూడా గుర్తు పట్టడు. తన కెవరున్నారంటే తల్లి లేదనీ, తండ్రి వున్నాడనీ చెప్తాడు. తండ్రి దగ్గరికి వెళ్దామని తీసుకు బయల్దేరుతుంది. దారిలో కారు పాడయితే అర్జున్ (భార్గవ) అనే వ్యక్తి లిఫ్ట్ ఇచ్చి తన ఇంటికి తీసుకుపోతాడు. ఆ ఇంట్లో అర్జున్ కొడుకు హర్ష (హర్షా ప్రతాప్) కూడా అర్జున్ తో పాటు సైకోలా ప్రవర్తిస్తాడు. ఆ రాత్రి కొన్ని ఇబ్బందికర అనుభవాలతో రిషి అదితితో పారిపోయే ప్రయత్నం చేస్తాడు. అర్జున్ అడ్డుకుంటాడు. రిషి ఆ ఇంట్లో ఇరుక్కుంటాడు.

        ఎవరీ అర్జున్, హర్ష? ఎందుకు రిషిని, అదితిని ట్రాప్ చేశారు? జ్ఞాపక శక్తి కోల్పోయిన రిషి గతమేమిటి? అతడి గతంతో ఈ తండ్రీ కొడుకుల గతంతో వున్న సంబంధమేమిటి? ఎవరు సైకో, ఎవరు కాదు?... అన్న ప్రశ్నలతో కొనసాగేదే మిగతా కథ.

***


       ఇది సైకలాజికల్ కథ కాదు, అంటే ఇందులో పాత్ర ఎందుకు సైకలాజికల్ పేషంట్ గా మారాడన్న విచిత్స, చికిత్స అన్నది గాకుండా, ఒక సైకోగా చేస్తున్న నేరాలకి ఎలా అడ్డు కట్ట వేశారన్న కథ. సైకో థ్రిల్లర్. ఫ్లాష్ బ్యాకులతో నాన్ లీనియర్ కథనం. ఈ నాన్ లీనియర్ కథనం పోనూపోనూ ఫ్యాక్షన్ సినిమాల టెంప్లెట్ లో పడి, నిలబెట్టుకున్న నవ్యత కాస్తా డీలా పడిపోయింది క్లయిమాక్స్ సహా.

        స్ట్రక్చర్ లేదని కాదు, వుంది. నాన్ లీనియర్ లో చెదిరిపోయింది. మొదటి పది నిమిషాల్లోపు రిషి అదితిలు  అర్జున్ ఇంట్లో ప్రవేశించడంతో ప్లాట్ పాయింట్ వన్ వచ్చేస్తుంది. ఇక మిడిల్ సంఘర్షణలో వూహించని మలుపు తిరుగుతుంది. పాత్రలు తారుమారైపోతాయి. సైకోగా రిషి తేలతాడు, తన కూతుర్ని హత్య చేసిన రిషి చేత నిజం చెప్పించే పథకంతో అర్జున్ రివీలవుతాడు.

        
        అంటే ఎండ్ సస్పెన్స్  కథనాలకి 1958 లో పరిష్కారం సూచించిన 'టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో' టెక్నిక్ అన్న మాట. దీని గురించి చాలా సార్లు చెప్పుకున్నాం. దీని హిందీ రీమేకుగా 'ధువా' వస్తే, తర్వాత ఇంకో రీమేకుగా హిందీలోనే 'ఖోజ్' వచ్చింది. దీన్ని అప్పట్లో తెలుగులో 'పోలీస్ రిపోర్ట్' గా రీమేక్ చేశారు. 'పోలీస్ రిపోర్ట్' అప్పట్లో బాగా తీయలేదనీ, ఇప్పుడు తీయవచ్చాని ఒక దర్శకుడు అడిగారు. అదే కథ ఎన్నిసార్లు తీస్తారు. 'గతం' లాగా ఇంకేదైనా కథతో తీయొచ్చు.
        
        కాకపోతే 'ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో' లో పాత్రలు చిట్ట చివర్లో రివీలవుతాయి, 'గతం' లో మిడిల్ మధ్యలో రివీల్ అయ్యాయి. అంతే  తేడా. ఈ రివీలయ్యే ముందు వచ్చే ట్విస్టుల మీద ట్విస్టులకి మొదట జస్టిఫికేషన్ కన్పిస్తుంది. ఇంట్లో సింగిల్ లొకేషన్లో నైట్ పూట జరిగే చిన్న కథ కాబోలన్న అభిప్రాయం కల్గించడం వల్ల. సింగిల్ లొకేషన్లో ఒక పూట లేదా ఒక రోజులో ముగిసే చిన్న కథలకి హాలీవుడ్ కథనం ట్విస్టులతోనే వుంటుంది. లేకపోతే అదే లొకేషన్లో తక్కువ టైమ్ స్పాన్ లో కదలని సీన్లు బోరు కొడతాయి. ట్విస్టులతో ఎప్పటికప్పుడు వేగంగా కథ రీఫ్రెష్ అవాల్సిందే.
        
    అయితే ఎప్పుడైతే మిడిల్ మధ్యలో పాత్రలు తారుమారై అసలు కథ బయటపడుతుందో- అప్పుడు ఈ ట్విస్టులు చీటింగ్ అనిపిస్తాయి. వాటికి అర్ధం కనిపించదు. ఇదొక పూటలో ముగిసిపోయే చిన్న కథ కాదని ఇప్పుడు తేలింది కాబట్టి.
        
        కొన్ని రోజుల స్పాన్ తో వుండే పెద్ద కథల్లో మల్టీపుల్ ట్విస్టులుండవు. వుంటే హిందీలో 'క్యాష్' లా నవ్వులపాలవుతుంది సినిమా. పెద్ద కథలు ఒకే ట్విస్టు కేంద్రంగా వుంటాయి- 'తూర్పు- పడమర' లాగా. ట్విస్టు అంటే పొడుపు కథ. పొడుపు కథ అన్నాక దాన్ని విప్పాలిగా. అందుకే పైన చెప్పుకున్నట్టు హాలీవుడ్ సింగిల్ లొకేషన్ చిన్న కథల్లో ఒక ట్విస్టు ఇచ్చి, దాన్ని విప్పి, ఇంకో ట్విస్టు ఇస్తూ పోతారు. 'గతం' లో ఇది కూడా జరగలేదు. 
        
       కథల్లో ఏది జరిగినా పాత్రల గోల్ ప్రకారమే జరుగుతుంది. మెమరీ తెప్పించడానికి రిషి బ్రెయిన్లో ట్రిగ్గర్ పాయింట్ ని యాక్టివేట్ చేయడం గోల్ అయినప్పుడు, ఆ ట్రిగ్గర్ పాయింటుతో సంబంధం లేని ట్విస్టులు అతడికెలా ఇస్తారు. వూరికే ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడానికి కాకపోతే. అందుకే వర్కౌట్ కాలేదు.

***

       పాత్రలు తారుమారయ్యాక అసలు కథ చెప్తూ మూడు ఫ్లాష్ బ్యాకులు వస్తాయి. ఇక్కడే తప్పులో కాలేశారు. మొదటిది రిషి చేసిన హత్య గురించి, రెండోది అతడికి యాక్సిడెంట్ జరిగిన విధం గురించి, మూడోది మెమరీ తెప్పించడానికేం చేయాలా అన్న దాని గురించి. వీటిలో మొదటిది మాత్రమే చూపించి, బోరు కొట్టే మిగిలిన రెండూ ఎత్తేయాల్సిన పని. గతంలో రిషి- అర్జున్ లు ఏ సంఘటనతో కనెక్ట్ అయ్యారో ఆ హత్య గురించి తప్ప ఇంకో ఫ్లాష్ బ్యాక్ అవసరం లేదు. కథ శిల్పం చెడి, బ్యూటీ పోతుంది. మిగిలిన రెండు ఫ్లాష్ బ్యాకుల్లో విషయాన్ని క్లయిమాక్స్ కి సర్దేసి- 'ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో' చూపిన మార్గంలో ఏకకాలంలో రిషితో బాటూ ప్రేక్షకులూ ఉలిక్కిపడేలా ప్రయోగించాల్సిన తురుపు ముక్క. ఒక సారి  హిందీ 'ధువా' లో క్లయిమాక్స్ లో అమ్జాద్ ఖాన్ నేతృత్వంలోని సీబీఐ బృందం ఆధారాలు చూపిస్తూ రాఖీని రౌండప్ చేసే డ్రమెటిటిక్, క్లాసిక్ సీను చూడండి.

***

       ఈ కథకి గోల్, డ్రమెటిక్ క్వశ్చన్ ఏదైనా వుంటే, రిషి మెమరీ తెప్పించడమే. ఇదొక్కటే కథ. కథంటే ఇప్పుడు లైవ్ గా జరిగేదే. దీని మీదే ప్రక్షకులు దృష్టి పెట్టి యాక్టివ్ గా వుంటారు. దీన్నోదిలేసి ఎప్పుడో గతంలో జరిగిన ఫ్లాష్ బ్యాకులేస్తే దృష్టి చెదిరి పాసివ్ అయిపోతారు ప్రేక్షకులు. ఎందుకంటే అది కథ కాదు కాబట్టి. లైవ్ గా జరుగుతున్న కథకి గత సమాచారమివ్వడం కాబట్టి. అనవసరంగా లైవ్ లో జరుగుతున్న ఆసక్తికర కథనాపి పాత సమాచారమిస్తున్నారు కాబట్టి. రాంగోపాల్ వర్మ ఏ సినిమాలోనూ ఫ్లాష్ బ్యాకుల జోలికి ఎందుకు పోలేదో ఒకసారాలోచిస్తారు కాబట్టి. ప్రేక్షకులు తెలివైన వాళ్ళు కాబట్టి. ఫ్లాష్ బ్యాకులంటే శుభ్రమైన కథ వెన్నులో బాకులు దింపడమే కాబట్టి. అదేం గొప్ప టెక్నిక్కేం కాదు కాబట్టి. 

        
        అందుకని రిషి కి యాక్సిడెంట్ ఎలా అయ్యిందీ అన్న బోరు కొట్టిన ఫ్లాష్ బ్యాక్ అప్రస్తుతం కథకి. అది మెమరీ వచ్చాక అమ్జాద్ ఖాన్ టైపులో అతడికే ఇవ్వాల్సిన డోస్. అలాగే మెమరీ ఎలా తప్పించాలా అని ఆలోంచించే సీన్లూ, డాక్టర్ తో తెలుసుకునే ప్రక్రియలతో కూడుకున్న ఇంకో బోరు కొట్టేసిన ఫ్లాష్ బ్యాక్ కూడా అనవసరం. ట్రిగ్గర్ పాయింటుని ఎలా యాక్టివేట్ చేస్తారో చెప్పేశాకా ఇంకా చూపించడమెందుకు. చెప్పకుండా చూపించేసి అమ్జాద్ ఖాన్ టైపులో చివర్లో ఫాస్ట్ గా చెప్పేస్తే ప్రేక్షకులు బ్రతికి పోతారు గాని. ప్రేక్షకులు- ప్రేక్షకులు- ప్రేక్షకులు- ప్రేక్షకుల్ని మర్చిపోయి కథ చేస్తే అదేమంత ఆరోగ్యవంతంగా వుండక పోవచ్చు.

సికిందర్

 

15, అక్టోబర్ 2020, గురువారం

985 : స్క్రీన్ ప్లే సంగతులు

(కొన్ని ఇతర రాత పనుల వల్ల బ్లాగు రాత పని దాని తల రాతగా మారిపోయింది... మన్నించాలి)

        క్రైమ్ థ్రిల్లర్లు ఫ్లాష్ బ్యాక్స్ తో వుంటే ఒకే ఉద్దేశంతో వుంటాయి : దర్యాప్తు అధికారి గోల్, అంటే హత్యా రహస్యాన్ని కనుక్కునే ఉద్దేశం. దీంతో ఆ ఫ్లాష్ బ్యాక్స్ హత్యా రహస్యం తాలూకు క్లూస్ బయటపడే కథనాలతో వుంటాయి. ఫ్లాష్ బ్యాక్స్ తో ఏ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లు చూసినా ఇదే చట్రంలో వుంటాయి. ఫ్లాష్ బ్యాక్స్ లో బయటపడుతూ పోయే క్లూస్ తీవ్రతలో ఒకదాన్ని మించి ఒకటుంటాయి. పరస్పర విరుద్ధంగానూ వుండొచ్చు. దీంతో దర్యాప్తు క్రమంలో సస్పెన్స్, థ్రిల్ బాగా పెరుగుతాయి. ఇంతేకాదు, గతం (ఫ్లాష్ బ్యాక్స్) జోలికి పోతే దర్యాప్తు అధికారికి చావు తప్పదన్న హెచ్చరిక, దాడులు కూడా వుంటాయి. దీంతో కథకి ప్రధాన పాత్రగా దర్యాప్తు అధికారికి సంఘర్షణ, గోల్, పరిష్కారమనే అర్ధవంతమైన త్రీ యాక్ట్ స్ట్రక్చర్ ఏర్పడుతుంది స్క్రీన్ ప్లేకి. ఇలా ఫ్లాష్ బ్యాక్స్ స్క్రీన్ ప్లేలో ప్రధాన పాత్ర ప్రయాణానికి తోడ్పడాలి. అంటే, స్క్రీన్ ప్లేలో వుండే మిడిల్ విభాగపు సంఘర్షణతో కూడిన బిజినెస్ ఆధారంగా, కథా విస్తరణకి తోడ్పడాలి. ప్రధాన పాత్ర ఈ ముఖ్యావసరాల్ని తీర్చని ఇంకేవో ఉద్దేశాలతో ఫ్లాష్ బ్యాక్స్ వుంటే, ఫ్లాష్ బ్యాక్స్ సహా పూర్తి కథా విఫలమవుంతుంది. నిశ్శబ్దం లో ఈ ఘోర తప్పిదమే జరిగింది.   


ని
శ్శబ్దం లో ప్రధాన పాత్ర అంజలి పోషించిన పోలీస్ డిటెక్టివ్ మహాలక్ష్మి పాత్ర. దీనికి అనూష్కా సాక్షి పాత్ర, మహాలక్ష్మి పాత్రకి ప్రతినాయకి పాత్ర. చివరికి రహస్యం విప్పితే ఆమే హత్య చేసి వుంది గనుక. 1981 హిందీ ధువా లో రాఖీ లాగా, 1989 ఖోజ్ లో రిషి కపూర్ లాగా, దీని రీమేక్ తెలుగులో పోలీస్ రిపోర్ట్ లో మోహన్ లాగా; ఇంకా బెంగాలీ, మలయాళ, తమిళంలలో హీరో పాత్రల్లాగా, తాజాగా 2019 లో మలేషియా మిస్టరీ డిలైలా లో హీరో పాత్రలాగా. ఇవన్నీ 1958 బ్రిటిష్ ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో కి అనుసరణలు. ఎండ్ సస్పెన్స్ కథలతో సినిమాలకి జరుగుతున్న నష్టాలకి ఈ బ్రిటిష్ క్రైమ్ థ్రిల్లర్ ఆనాడు పరిష్కారం చెప్పింది. ఈ కోవలో నిర్మించిన పై సినిమాలు మెప్పుపొందాయి. (మల్లాది వెంకటకృష్ణ మూర్తి మాటలు రాసిన పోలీస్ రిపోర్ట్ యూట్యూబ్ లో వుంది. ఇది చూసి ప్రేక్షకులు పెట్టిన కామెంట్లు చూడండి). ఎండ్ సస్పెన్స్ తో వచ్చే నష్టాల గురించి సందర్భం వచ్చిన్నప్పుడల్లా బ్లాగులో రాస్తూనే పోయాం. అయినా కూడా నిశ్శబ్దం లాంటివి పదేపదే వచ్చి పెద్ద శబ్దంతో ధడేలుమని ఫ్లాపవుతున్నాయి. ఇక కాకులెగిరి పోతున్న రెక్కల చప్పుడు. అభినవ హిచ్ కాకులు’. మచ్చుకి కొన్ని ఉదాహరణలు ఈ లింక్ క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేస్తూ చూడొచ్చు. 

కథా రూపం 

     నిశ్శబ్దం పూర్తి కథ వీకీపీడీయాలో అప్పుడే ఇచ్చేశారు. దాని ప్రకారమే చూద్దాం. అయితే పూర్వ కథ ఇవ్వలేదు. సినిమాలో ముందుగా చూపించిన పూర్వ కథ చూస్తే, అమెరికాలో ఒక పాడుబడ్డ విల్లాలో ఒక జంట హత్యకి గురవుతారు. ఇలాటి సంఘటనలు జరుగుతూంటాయి. పోలీసులు పరిశోధించి ఈ హత్యల్లో మానవ ప్రమేయం కన్పించక పోవడంతో, విల్లాలో ఆత్మవుందని భావించుకుని కేసులు మూసేస్తారు. ఐతే వచ్చిన వాళ్ళనల్లా చంపుతున్న ఆత్మే వుంటే, అన్నిసార్లు వెళ్తున్న పోలీసుల్ని ఎందుకు చంపడంలేదో స్పష్టత వుండదు. ఆ విల్లాలోకి ఇంకెవరూ వెళ్లకుండా సీలు కూడా చెయ్యరు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 47 ఏళ్ల తర్వాత ప్రధాన కథ మొదలవుతుంది. 

ప్రధాన కథ : చెవిటి మూగ అయిన పెయింటర్ సాక్షి (అనూష్కా) మ్యూజిషియన్ ఆంథోనీ గోన్సాల్వెజ్ (మాధవన్) తో ఎంగెజిమెంటు చేసుకుని, ఆ విల్లాలో వున్న పెయింటింగు కోసం అతడితో అక్కడికి వెళ్తుంది. అక్కడ ఆంథోనీ మీద ఆత్మ దాడి చేసి చంపేస్తుంది. సాక్షి పారిపోతుంది. 

ఈ కేసుని పోలీస్ డిటెక్టివ్ మహాలక్ష్మి (అంజలి) ఆమె బాస్ రిచర్డ్ డాకిన్స్ (మైకేల్ మాడ్సెన్) చేపడతారు. అప్పటికే వీళ్ళు కొందరమ్మాయిల మిస్సింగ్ కేసుల మీద వుంటారు. ఆంథోనీ హత్యకి సంబంధించి మహాలక్ష్మి సాక్షిని ప్రశ్నిస్తుంది. ఆమె స్టేట్ మెంట్ లో ఆమె ఫ్రెండ్ సోనాలీ కనిపించడం లేదని చెప్తుంది. తన ఎంగేజిమెంటైన రెండురోజుల తర్వాత నుంచి కనిపించడం లేదు. 

          సాక్షితో ఫ్లాష్ బ్యాక్ -1:  సాక్షి సోనాలీతో బాటు అనాధాశ్రయంలో పెరిగింది. ఒకరోజు ఒక సమాచారం వస్తే సియాటిల్ బయల్దేరుతుంది. సోనాలీ డిస్టర్బ్ అయి సాక్షి సియాటిల్లో స్థిరపడగానే తనని పిలిపించుకోవాలని మాట తీసుకుంటుంది. సియాటిల్లో ఆర్ట్ గ్యాలరీలో చేరుతుంది సాక్షి. అక్కడ వివేక్ (సుబ్బరాజు) అనే అతను పరిచయమవుతాడు. అప్పుడు అక్కడికి ఆర్ట్ ఎగ్జిబిషన్ని ప్రారంభించడానికి మ్యూజిషియన్ ఆంథోనీ వస్తాడు. సాక్షి వేసిన పెయింటింగ్ కి ఫిదా అయిపోయి మిలియన్ డాలర్లు ఆమె అనాథాశ్రయాని కిచ్చేస్తాడు. తన మ్యూజికల్ ప్రోగ్రామ్ కి ఆహ్వానిస్తాడు. ప్రోగ్రామ్ అయ్యాక తనకి పెయింటింగ్ నేర్పమం
టాడు. ఆమెకి మ్యూజిక్ నేర్పుతాడు. ఇంతలో సోనాలీ వచ్చేసి సాక్షితో వుంటుంది. ఇక సాక్షీ ఆంథోనీల మధ్య స్నేహం ప్రేమగా మారి ఎంగేజిమెంటుకి దారితీస్తుంది. తర్వాత ఒక రోజు విల్లాలో వున్న జోసఫైన్ పెయింటింగు తెచ్చుకునేందుకు ఆంథోనీని తీసుకుని వెళ్తుంది సాక్షి. అక్కడ ఆత్మ ఆంథోనీని చంపేసింది.     

 ప్రధాన కథ : డిటెక్టివ్ మహాలక్ష్మి దర్యాప్తు కొనసాగిస్తూ సోనాలీ అదృశ్యం గురించి ఆరా తీయడానికి అనాధాశ్రయం వెళ్తుంది. ఆమె అదృశ్యానికీ ఆంథోనీ హత్యకీ సంబంధముందని అనుమానిస్తుంది. సాక్షి తనకే సొంతమన్నట్టుగా సోనాలీ ప్రవర్తన వుండేదని తెలుసుకుంటుంది. ఈ ప్రవర్తనతో సోనాలీ ఒకడ్ని పొడిచిన కేసులో జైలుకెళ్లింది కూడా. తిరిగివచ్చి మహాలక్ష్మి సాక్షి ఇంటికెళ్తే, అక్కడొక ముసుగువ్యక్తి ఎదురయ్యేసరికి వెంటాడి కాలుస్తుంది. తప్పించుకుంటాడు.

పోలీసులు మళ్ళీ విల్లా కెళ్ళి సోనాలీకి సంబంధించిన సాక్ష్యాధారాలకోసం శోధిస్తారు. అక్కడ టామ్ అనే పోలీసుకి ఒక తాళం చెవి దొరుకుతుంది. అది ఆంథోనీది. అది రిచర్డ్ కివ్వడాని వెళ్తాడు. అది తీసుకుని టామ్ ని చంపేస్తాడు రిచర్డ్. టామ్ శవం దగ్గర రిచర్డ్ బ్లేజర్ బటన్ని చూసి రిచర్డ్ ని అనుమానిస్తుంది మహాలక్ష్మి.

రిచర్డ్ రూమ్ లోకి రహస్యంగా వెళ్ళి అక్కడ తాళం చెవిని గమనిస్తుంది. రిచర్డ్ ని ఫాలో అయి ఆంథోనీ ఫామ్ హౌస్ కెళ్తుంది. రిచర్డ్ అక్కడ సీసీ టీవీ హార్డ్ డిస్క్ కోసం వెతికి అది లేకపోవడంతో కోపంతో వెళ్ళిపోతాడు. 

 వివేక్ తో ఫ్లాష్ బ్యాక్ -2  : వివేక్ దృక్కోణంలోకి కథ మారుతుంది. ఆర్ట్ గ్యాలరీలో సాక్షీ వివేక్ లు స్నేహితులయ్యారు. సోనాలీ వచ్చి సాక్షితో వున్నాక సాక్షిని వివేక్ కి దూరంగా వుంచడానికి ప్రయత్నిస్తుంది. ఇందుకు హర్టయిన వివేక్ కి సోనాలీ డిఫరెంట్ క్యారక్టరని నచ్చజెప్తుంది సాక్షి. ఈ ప్రవర్తనతో గతంలో ఆమె ఒకడిమీద చేసిన హత్యాప్రయత్నం గురించి చెప్తుంది. ఇదెలా జరిగిందో సంఘటన వివరిస్తుంది. వివేక్ సోనాలీని అర్ధం జేసుకుని దగ్గరవుతాడు. ప్రపోజ్ చేస్తాడు. ఇదయ్యాక ఆంథోనీ సాక్షికి ప్రపోజ్ చేస్తే సోనాలీఒప్పుకోదు. ఒక ప్రోగ్రాంలో అభిమానులు ఆంథోనీని చుట్టుముట్టి ముద్దుల్లో ముంచెత్తి ఫోన్ నంబర్లు ఇచ్చేసరికి అతను తిరుగు బోతని చెప్పేస్తుంది సోనాలీ. కావాలంటే రుజువు చేస్తానంటుంది. అతణ్ణి రెచ్చగొడుతూ మెసేజి పెడుతుంది. పట్టించుకోడు. తర్వాత కలుసుకోవడానికి ఒప్పుకుంటాడు. అతడితో ఫామ్ హౌస్ కెళ్తుంది. సాక్షి అనుసరిస్తుంది. వాళ్ళిద్దర్నీ గమనిస్తుంది. వాళ్ళు సన్నిహితంగా వున్నప్పుడు అతను అకస్మాత్తుగా బ్యాట్ తీసుకుని ఆమె తల మీద కొట్టి చంపేస్తాడు. రిచర్డ్ వచ్చేసి ఈ హత్యని గప్ చిప్ చేయడానికి సాయపడతాడు ఆంథోనీకి.

 సాక్షి అక్కడ్నించి పారిపోయి జరిగింది వివేక్ కి చెప్తుంది. ఇద్దరూ ఆంథోనీకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. మిస్సయిన ఇతర అమ్మాయిలు ఆంథోనీ ప్రోగ్రాం జరిగినప్పుడల్లా మిస్సయ్యారని తెలుసుకుంటుంది సాక్షి. ఇక ఆంథోనీని చంపే పథకమేస్తారు సాక్షీ వివేక్ లు. పెయింటింగ్ వంకతో ఆంథోనీని పాడుబడ్డ విల్లాకి తీసికెళ్తుంది సాక్షి. అక్కడ సోనాలీ గురించి ఆంథోనీని అడగడం మొదలెడతారు సాక్షీ వివేక్ లు. 

ఆంథోనీతో ఫ్లాష్ బ్యాక్ -3 : ఆంథోనీ చెప్పడం మొదలెడతాడు. అతడికి రెండేళ్ల క్రితం పెళ్లయింది. ఒకరోజు భార్య పడకమీద అతణ్ణి వేరే పేరుతో పిలిచేస్తుంది. అతను అనుమానిస్తాడు. ఆమె మోసం చేస్తోందని గ్రహిస్తాడు. ఒక హోటల్ కి ఆమెని ఫాలో అయి ఆమె ప్రియుడు సహా పట్టుకుని ఇద్దర్నీచంపేస్తాడు. కెప్టెన్ రిచర్డ్ వచ్చి చూసి ఆంథోనీకి చెప్తాడు. తను కూడా తన భార్యని ఫాలో అయి ఇక్కడికి వచ్చానని, ఆమె ప్రియుడితో వేరే రూంలో వుందనీ అంటాడు. ఆంథోనీ వెళ్ళి రిచర్డ్ భార్యని కూడా చంపేస్తాడు. అప్పట్నుంచీ మోసం చేసే అమ్మాయిల్ని ఆంథోనీ చంపడం మొదలెడితే రిచర్డ్ కవర్ చేస్తూ వచ్చాడు. ఇదంతా విన్న సాక్షి ఆ విల్లాలో ఆంథోనీని చంపేస్తుంది. 

ప్రధాన కథ : సాక్షి వివేక్ లు హార్డ్ డిస్క్ ఆధారంగా రిచర్డ్ నేరాలు ఎఫ్బీఐకి చెప్పాలని ప్రయత్నిస్తూంటే రిచర్డ్ వచ్చేసి దాడి చేస్తాడు. మహాలక్ష్మి వచ్చేసి రిచర్డ్ ని చంపేసి వాళ్ళిద్దర్నీ కాపాడుతుంది. ఆంథోనీ హత్యని అంతుచిక్కని హత్యగా ప్రకటిస్తారు. సాక్షీ వివేక్ లు సోనాలీ సమాధి దగ్గర శ్రద్ధాంజలి ఘటిస్తారు. 

క్యాన్సిలైన కథ 

      పై రూపంలో వున్న కథలో స్థూలంగా కొన్ని ప్రధాన అడ్డంకులు కన్పిస్తాయి. విల్లాలో ఆత్మ చంపుతోందని గత కేసులతో తేలాక, ఆంథోనీ హత్యా దర్యాప్తుకి అవకాశమెక్కడిది? అది కూడా ఆత్మ చంపిన కేసే అవదా? ఇంకెందుకు దర్యాప్తు చేపట్టాలి? సోనాలీ చంపి వుంటుందని ఏ ఆధారాలతో మొదట అనుమానించి దర్యాప్తుకి ప్రారంభోత్సవం చేశారు. అలా దర్యాప్తు చేస్తూ పోలీసులు విల్లాలో కొస్తూంటే ఆత్మ వాళ్ళ మీద ఎందుకు దాడి చేయడం లేదు? ఆంథోనీని చంపడానికి సాక్షి అలాటి విల్లాలోకి తీసికెళ్ళే ధైర్యమెలా చేసింది? చివరికి ఆంథోనీ హత్య మరో మిస్టరీ వీడని మరణమని చెబుతూ కథ ముగించారు. అంటే ఆత్మ వున్నట్టా? ఆత్మ వుంటే, సాక్షి ఆంథోనీని చంపుతోంటే, సాక్షిని కదా ఆత్మ చంపెయ్యాలి ఆమె కుట్ర పసిగట్టి?

సాక్షీ ఆంథోనీల ప్రేమకి సోనాలీ అడ్డు. సోనాలీనలా వుంచుదాం, అసలు ఒక సెలబ్రిటీ మ్యూజీషియన్ తనకి ప్రపోజ్ చేస్తే సాక్షి ఒకసారి అతడి ప్రొఫైల్ చెక్ చేసుకోవాలిగా? అప్పుడతను పెళ్ళయిన వాడనీ, భార్య ఆత్మహత్య చేసుకుందనీ తెలుసుకుని జాగ్రత్త పడాలిగా? ఆంథోనీ కూడా భార్య మోసం చేసిందని అలాటి అమ్మాయిల్ని చంపే సైకోగా మారినప్పుడు, సాక్షిని ఎందుకు ప్రేమించి ఎంగేజిమెంట్ చేసుకున్నాడు? అతను మారాడా? మారితే తనని పరీక్షించబోయిన సోనాలీ నెందుకు చంపాడు? సవ్యమైన పాత్ర చిత్రణలు అవసరం లేదా? పైపైన రాసేసి పైపైన తీసేయడానికి మసాలా సినిమాలకి కుదిరినట్టు, ప్రేక్షకుల మేధకి పదునుపెట్టే ఇన్వెస్టిగేటివ్ సినిమాలకి కూడా కుదురుతుందా? పై అడ్డంకుల వల్ల ఎక్కడికక్కడ కథే క్యాన్సిల్ అయిపోతూంటే, ఇంకా సినిమాగా తీసే మాటెక్కడిది?

క్రమం – అపక్రమం

     పై కథ అపక్రమ (నాన్ లీనియర్) పద్ధతిలో వుంది. దీన్ని క్రమ (లీనియర్) పద్ధతి లోకి మార్చి  అసలెక్కడ మొదలై ఎలా సాగి ముగిసిందో చూద్దాం. 

సాక్షితో ఫ్లాష్ బ్యాక్ -1:  సాక్షి సోనాలీతో బాటు అనాధాశ్రయంలో పెరిగింది. ఒకరోజు ఒక సమాచారం వస్తే సియాటిల్ బయల్దేరుతుంది. సోనాలీ డిస్టర్బ్ అయి సాక్షి సియాటిల్లో స్థిరపడగానే తనని పిలిపించుకోవాలని మాట తీసుకుంటుంది. సియాటిల్లో ఆర్ట్ గ్యాలరీలో చేరుతుంది సాక్షి. అక్కడ వివేక్ (సుబ్బరాజు) అనే అతను పరిచయమవుతాడు. అప్పుడు అక్కడికి ఆర్ట్ ఎగ్జిబిషన్ని ప్రారంభించడానికి మ్యూజిషియన్ ఆంథోనీ వస్తాడు. సాక్షి వేసిన పెయింటింగ్ కి ఫిదా అయిపోయి మిలియన్ డాలర్లు ఆమె అనాథాశ్రయాని కిచ్చేస్తాడు. తన మ్యూజికల్ ప్రోగ్రామ్ కి ఆహ్వానిస్తాడు. ప్రోగ్రామ్ అయ్యాక తనకి పెయింటింగ్ నేర్పమంటాడు. ఆమెకి మ్యూజిక్ నేర్పుతాడు. ఇంతలో సోనాలీ వచ్చేసి సాక్షితో వుంటుంది...దీని కొనసాగింపు ఫ్లాష్ బ్యాక్ 2 లో వుంది : 

వివేక్ తో ఫ్లాష్ బ్యాక్ -2  :  ఆర్ట్ గ్యాలరీలో సాక్షీ వివేక్ లు స్నేహితులయ్యారు. సోనాలీ వచ్చి సాక్షితో వున్నాక సాక్షిని వివేక్ కి దూరంగా వుంచడానికి ప్రయత్నిస్తుంది. ఇందుకు హర్టయిన వివేక్ కి సోనాలీ డిఫరెంట్ క్యారక్టరని నచ్చజెప్తుంది సాక్షి. ఈ ప్రవర్తనతో గతంలో ఆమె ఒకడిమీద చేసిన హత్యాప్రయత్నం గురించి చెప్తుంది. ఇదెలా జరిగిందో సంఘటన వివరిస్తుంది. వివేక్ సోనాలీని అర్ధం జేసుకుని దగ్గరవుతాడు. ప్రపోజ్ చేస్తాడు. ఇదయ్యాక ఆంథోనీ సాక్షికి ప్రపోజ్ చేస్తే సోనాలీ ఒప్పుకోదు. ఒక ప్రోగ్రాంలో అభిమానులు ఆంథోనీని చుట్టుముట్టి ముద్దుల్లో ముంచెత్తి ఫోన్ నంబర్లు ఇచ్చేసరికి అతను తిరుగు బోతని చెప్పేస్తుంది సోనాలీ. కావాలంటే రుజువు చేస్తానంటుంది. అతణ్ణి రెచ్చగొడుతూ మెసేజి పెడుతుంది. పట్టించుకోడు. తర్వాత కలుసుకోవడానికి ఒప్పుకుంటాడు. అతడితో ఫామ్ హౌస్ కెళ్తుంది. సాక్షి అనుసరిస్తుంది. వాళ్ళిద్దర్నీ గమనిస్తుంది. వాళ్ళు సన్నిహితంగా వున్నప్పుడు అతను అకస్మాత్తుగా బ్యాట్ తీసుకుని ఆమె తల మీద కొట్టి చంపేస్తాడు. రిచర్డ్ వచ్చేసి ఈ హత్యని గప్ చిప్ చేయడానికి సాయపడతాడు ఆంథోనీకి.

సాక్షి అక్కడ్నించి పారిపోయి జరిగింది వివేక్ కి చెప్తుంది. ఇద్దరూ ఆంథోనీకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. మిస్సయిన ఇతర అమ్మాయిలు ఆంథోనీ ప్రోగ్రాం జరిగినప్పుడల్లా మిస్సయ్యారని తెలుసుకుంటుంది సాక్షి. ఇక ఆంథోనీని చంపే పథకమేస్తారు సాక్షీ వివేక్ లు. పెయింటింగ్ వంకతో ఆంథోనీని పాడుబడ్డ విల్లాకి తీసికెళ్తుంది సాక్షి. అక్కడ సోనాలీ గురించి ఆంథోనీని అడగడం మొదలెడతారు సాక్షీ వివేక్ లు.... దీని కొనసాగింపు ఫ్లాష్ బ్యాక్ 3 లో వుంది :

ఆంథోనీతో ఫ్లాష్ బ్యాక్ -3 : ఆంథోనీ చెప్పడం మొదలెడతాడు. అతడికి రెండేళ్ల క్రితం పెళ్లయింది. ఒకరోజు భార్య పడకమీద అతణ్ణి వేరే పేరుతో పిలిచేస్తుంది. అతను అనుమానిస్తాడు. ఆమె మోసం చేస్తోందని గ్రహిస్తాడు. ఒక హోటల్ కి ఆమెని ఫాలో అయి ఆమె ప్రియుడు సహా పట్టుకుని ఇద్దర్నీచంపేస్తాడు. కెప్టెన్ రిచర్డ్ వచ్చి చూసి ఆంథోనీకి చెప్తాడు. తను కూడా తన భార్యని ఫాలో అయి ఇక్కడికి వచ్చానని, ఆమె ప్రియుడితో వేరే రూంలో వుందనీ అంటాడు. ఆంథోనీ వెళ్ళి రిచర్డ్ భార్యని కూడా చంపేస్తాడు. అప్పట్నుంచీ మోసం చేసే అమ్మాయిల్ని ఆంథోనీ చంపడం మొదలెడితే రిచర్డ్ కవర్ చేస్తూ వచ్చాడు. ఇదంతా విన్న సాక్షి ఆ విల్లాలో ఆంథోనీని చంపేస్తుంది. 

ఇదీ ప్రధాన కథకి ముందు అసలు జరిగింది. ఈ నేపథ్యంలో మొదటి ప్రధాన కథ ఇలా మొదలైంది :

మొదటి ప్రధాన కథ : విల్లాలో ఆంథోనీని చంపి పారిపోయిన సాక్షి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆంథోనీని దెయ్యం చంపిందని చెప్తే - పోలీస్ డిటెక్టివ్ మహాలక్ష్మి (అంజలి) ఆమె బాస్ రిచర్డ్ డాకిన్స్ (మైకేల్ మాడ్సెన్) చేపడతారు. అప్పటికే వీళ్ళు కొందరమ్మాయిల మిస్సింగ్ కేసుల మీద వుంటారు. ఆంథోనీ హత్యకి సంబంధించి మహాలక్ష్మి సాక్షిని ప్రశ్నిస్తుంది. ఆమె స్టేట్ మెంట్ లో ఆమె ఫ్రెండ్ సోనాలీ కనిపించడం లేదని చెప్తుంది. తన ఎంగేజిమెంటైన రెండురోజుల తర్వాత నుంచి కనిపించడం లేదు... దీని కొనసాగింపు రెండో ప్రధాన కథలో వుంది :       

రెండో ప్రధాన కథ : డిటెక్టివ్ మహాలక్ష్మి దర్యాప్తు కొనసాగిస్తూ సోనాలీ అదృశ్యం గురించి ఆరా తీయడానికి అనాధాశ్రయం వెళ్తుంది. ఆమె అదృశ్యానికీ ఆంథోనీ హత్యకీ సంబంధముందని అనుమానిస్తుంది. సాక్షి తనకే సొంతమన్నట్టుగా సోనాలీ ప్రవర్తన వుండేదని తెలుసుకుంటుంది. ఈ ప్రవర్తనతో సోనాలీ ఒకడ్ని పొడిచిన కేసులో జైలుకెళ్లింది కూడా. తిరిగివచ్చి మహాలక్ష్మి సాక్షి ఇంటికెళ్తే, అక్కడొక ముసుగువ్యక్తి ఎదురయ్యేసరికి వెంటాడి కాలుస్తుంది. తప్పించుకుంటాడు

 పోలీసులు మళ్ళీ విల్లా కెళ్ళి సోనాలీకి సంబంధించిన సాక్ష్యాధారాలకోసం శోధిస్తారు. అక్కడ టామ్ అనే పోలీసుకి ఒక తాళం చెవి దొరుకుతుంది. అది ఆంథోనీది. అది రిచర్డ్ కివ్వడాని వెళ్తాడు. అది తీసుకుని టామ్ ని చంపేస్తాడు రిచర్డ్. టామ్ శవం దగ్గర రిచర్డ్ బ్లేజర్ బటన్ని చూసి రిచర్డ్ ని అనుమానిస్తుంది మహాలక్ష్మి. 

        రిచర్డ్ రూంలోకి రహస్యంగా వెళ్ళి అక్కడ తాళం చెవిని గమనిస్తుంది. రిచర్డ్ ని ఫాలో అయి ఆంథోనీ ఫామ్ హౌస్ కెళ్తుంది. రిచర్డ్ అక్కడ సీసీ టీవీ హార్డ్ డిస్క్ కోసం వెతికి అది లేకపోవడంతో కోపంతో వెళ్ళిపోతాడు...దీని కొనసాగింపు మూడో ప్రధాన కథలో వుంది : 

మూడో ప్రధాన కథ : సాక్షి వివేక్ లు హార్డ్ డిస్క్ ఆధారంగా రిచర్డ్ నేరాలు ఎఫ్బీఐకి చెప్పాలని ప్రయత్నిస్తూంటే రిచర్డ్ వచ్చేసి దాడి చేస్తాడు. మహాలక్ష్మి వచ్చేసి రిచర్డ్ ని చంపేసి వాళ్ళిద్దర్నీ కాపాడుతుంది. ఆంథోనీ హత్యని అంతుచిక్కని హత్యగా ప్రకటిస్తారు. సాక్షీ వివేక్ లు సోనాలీ సమాధి దగ్గర శ్రద్ధాంజలి ఘటిస్తారు.

ఇలా వుంది  స్క్రీన్ ప్లే స్ట్రక్చర్

   ప్రధాన కథతోనే  స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వుంటుంది. పై ఫ్లాష్ బ్యాకులన్నీ ప్రధాన కథకి  ఉపోద్ఘాతాలే తప్ప ప్రధాన కథ కాదు. ఫ్లాష్ బ్యాకులు (డ్రీమ్ టైమ్) ఎప్పుడూ ప్రధాన కథ (రియల్ టైమ్) కావు. మూడుగా వున్న ప్రధాన కథని చూస్తే, 
      మొదటి ప్రధాన కథలో : విల్లాలో ఆంథోనీని చంపి పారిపోయిన సాక్షి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆంథోనీని దెయ్యం చంపిందని చెప్తే - పోలీస్ డిటెక్టివ్ మహాలక్ష్మి (అంజలి) ఆమె బాస్ రిచర్డ్ డాకిన్స్ (మైకేల్ మాడ్సెన్) చేపడతారు. అప్పటికే వీళ్ళు కొందరమ్మాయిల మిస్సింగ్ కేసుల మీద వుంటారు. ఆంథోనీ హత్యకి సంబంధించి మహాలక్ష్మి సాక్షిని ప్రశ్నిస్తుంది. ఆమె స్టేట్ మెంట్ లో ఆమె ఫ్రెండ్ సోనాలీ కనిపించడం లేదని చెప్తుంది. తన ఎంగేజిమెంటైన రెండురోజుల తర్వాత నుంచి కనిపించడం లేదు...అనేదంతా బిగినింగ్
, అంటే సమస్యా విభాగం. 

రెండో ప్రధాన కథలో : డిటెక్టివ్ మహాలక్ష్మి దర్యాప్తు కొనసాగిస్తూ సోనాలీ అదృశ్యం గురించి ఆరా తీయడానికి అనాధాశ్రయం వెళ్తుంది. ఆమె అదృశ్యానికీ ఆంథోనీ హత్యకీ సంబంధముందని అనుమానిస్తుంది. సాక్షి తనకే సొంతమన్నట్టుగా సోనాలీ ప్రవర్తన వుండేదని తెలుసుకుంటుంది. ఈ ప్రవర్తనతో సోనాలీ ఒకడ్ని పొడిచిన కేసులో జైలుకెళ్లింది కూడా. తిరిగివచ్చి మహాలక్ష్మి సాక్షి ఇంటికెళ్తే, అక్కడొక ముసుగువ్యక్తి ఎదురయ్యేసరికి వెంటాడి కాలుస్తుంది. తప్పించుకుంటాడు. 

పోలీసులు మళ్ళీ విల్లా కెళ్ళి సోనాలీకి సంబంధించిన సాక్ష్యాధారాలకోసం శోధిస్తారు. అక్కడ టామ్ అనే పోలీసుకి ఒక తాళం చెవి దొరుకుతుంది. అది ఆంథోనీది. అది రిచర్డ్ కివ్వడాని వెళ్తాడు. అది తీసుకుని టామ్ ని చంపేస్తాడు రిచర్డ్. టామ్ శవం దగ్గర రిచర్డ్ బ్లేజర్ బటన్ని చూసి రిచర్డ్ ని అనుమానిస్తుంది మహాలక్ష్మి. 

రిచర్డ్ రూంలోకి రహస్యంగా వెళ్ళి అక్కడ తాళం చెవిని గమనిస్తుంది. రిచర్డ్ ని ఫాలో అయి ఆంథోనీ ఫామ్ హౌస్ కెళ్తుంది. రిచర్డ్ అక్కడ సీసీ టీవీ హార్డ్ డిస్క్ కోసం వెతికి అది లేకపోవడంతో కోపంతో వెళ్ళిపోతాడు...అనేదంతా మిడిల్, అంటే సంఘర్షణా విభాగం.

మూడో ప్రధాన కథలో :  సాక్షి వివేక్ లు హార్డ్ డిస్క్ ఆధారంగా రిచర్డ్ నేరాలు ఎఫ్బీఐకి చెప్పాలని ప్రయత్నిస్తూంటే రిచర్డ్ వచ్చేసి దాడి చేస్తాడు. మహాలక్ష్మి వచ్చేసి రిచర్డ్ ని చంపేసి వాళ్ళిద్దర్నీ కాపాడుతుంది. ఆంథోనీ హత్యని అంతుచిక్కని హత్యగా ప్రకటిస్తారు. సాక్షీ వివేక్ లు సోనాలీ సమాధి దగ్గర శ్రద్ధాంజలి ఘటిస్తారు... అనేదంతా ఎండ్, అంటే పరిష్కార విభాగం. 

ఫ్లాష్ బ్యాకుల పాత్ర

    పై మూడు బిగినింగ్-మిడిల్- ఎండ్ విభాగాల్లో ఫ్లాష్ బ్యాకులెలా పాత్ర వహించాయో చూద్దాం. బిగినింగ్ విభాగంలో మహాలక్ష్మి దర్యాప్తు చేపట్టిన ఫలితంగా (కాజ్ అండ్ ఎఫెక్ట్) సాక్షితో ఫ్లాష్ బ్యాక్ -1 లో :  సాక్షి సోనాలీతో బాటు అనాధాశ్రయంలో పెరిగింది. ఒకరోజు ఒక సమాచారం వస్తే సియాటిల్ బయల్దేరుతుంది. సోనాలీ డిస్టర్బ్ అయి సాక్షి సియాటిల్లో స్థిరపడగానే తనని పిలిపించుకోవాలని మాట తీసుకుంటుంది. సియాటిల్లో ఆర్ట్ గ్యాలరీలో చేరుతుంది సాక్షి. అక్కడ వివేక్ (సుబ్బరాజు) అనే అతను పరిచయమవుతాడు. అప్పుడు అక్కడికి ఆర్ట్ ఎగ్జిబిషన్ని ప్రారంభించడానికి మ్యూజిషియన్ ఆంథోనీ వస్తాడు. సాక్షి వేసిన పెయింటింగ్ కి ఫిదా అయిపోయి మిలియన్ డాలర్లు ఆమె అనాథాశ్రయాని కిచ్చేస్తాడు. తన మ్యూజికల్ ప్రోగ్రామ్ కి ఆహ్వానిస్తాడు. ప్రోగ్రామ్ అయ్యాక తనకి పెయింటింగ్ నేర్పమంటాడు. ఆమెకి మ్యూజిక్ నేర్పుతాడు. ఇంతలో సోనాలీ వచ్చేసి సాక్షితో వుంటుంది...అనే  సమాచారం మహా లక్ష్మికి దొరికింది.

ఇప్పుడు ఆమె మిడిల్ విభాగంతో ఏ ఫ్లాష్ బ్యాక్ కనెక్ట్ అయింది? ఏదీ కాలేదు. వివేక్ తో రెండవ ఫ్లాష్ బ్యాక్ ఆమె సంఘర్షణలో భాగంగా (కాజ్ అండ్ ఎఫెక్ట్) ప్రారంభం కాలేదు. స్క్రీన్ ప్లే తెగి, ఆమె పాయింటాఫ్ వ్యూ నుంచి వివేక్ పాయింటాఫ్ వ్యూకి వేరే ముక్కగా ఫ్లాష్ బ్యాక్ 2 ప్రారంభమయ్యింది. దీంతో మిడిల్ విభాగంలో ఆమెకుండాల్సిన సంఘర్షణ కాస్తా గల్లంతై పోయింది. 

మహా లక్ష్మి ఎండ్ విభాగంలో ఆమెకే బయటపడాల్సిన ఆంథోనీతో మూడో ఫ్లాష్ బ్యాక్ కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్ తో లేకుండా, ఆమెతో సంబంధం లేకుండా, ఆంథోనీ పాయింటాఫ్ వ్యూలో, సాక్షీ వివేక్ లకి చెప్పే ఫ్లాష్ బ్యాకుగా జొరబడిపోయింది. 

ఈ రెండు ఫ్లాష్ బ్యాకులూ స్ట్రక్చర్ని చెడగొట్టి స్క్రీన్ ప్లేని స్క్రీన్ ప్లే కాకుండా చేశాయి. ఫలితంగా ప్రధాన పాత్రగా, కథానాయికగా, మహాలక్ష్మి కుండాల్సిన కి త్రీయాక్ట్ స్ట్రక్చర్ బలం గుల్లయింది. కేసు తేల్చే దృక్పథంతో వుండాల్సిన ఆమెకి ఒక గోల్ అంటూ లేకుండా పోయింది. 

మరేం చెయ్యాలి?

      ప్రతినాయక పాత్ర లేకపోతే ప్రధాన పాత్రకి గోల్ వుండదు. కథంటేనే నాయక- ప్రతినాయక పాత్రల మధ్య సంఘర్షణ. ఈ కథలో ఆంథోనీని చంపిన సాక్షియే ప్రతినాయిక. కానీ కథలో ప్రతినాయిక పాత్రని గుర్తించక, ఫీలవ్వక, ఏదో తోచినట్టూ రాసుకుంటూ పోయాడు కథకుడు. ఫలితంగా తాడూ బొంగరం లేని కథానాయిక అయింది మహాలక్ష్మి. సిడ్ ఫీల్డ్ మాటల్లో చెప్పాలంటే - the character seems to disappear off  the page’

        ప్రతినాయిక సాక్షి. అంటే అనూష్కా కేంద్ర బిందువుగా వుండాల్సిన నేర కథ. అనూష్కా- వర్సెస్ అంజలి ఇద్దరు హీరోయిన్ల డైనమిక్స్ తో థ్రిల్లర్ వుంటే ఎంత జనరంజకంగా వుంటుంది. మార్కెట్ యాస్పెక్ట్ నిర్ణయించుకుని ఈ కథ ఏమైనా చేశారా?

అనూష్కా పాత్ర ఆటోమేటిగ్గా పైన చెప్పుకున్న ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో చట్రంలో ఒదిగిపోతుంది. పైనే చెప్పుకున్న ఇతర భాషల్లో వచ్చిన సినిమాలు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో కి అదే కథతో రీమేకులు. కానీ నిశ్శబ్దం కథ వేరు. ఇందులో అనూష్కా పాత్ర మాత్రమే ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో లో పాత్రకున్న, షేడ్ తో వుంటుంది. అందులో ఆ పాత్ర చుట్టూ అల్లిన కథ వేరు, నిశ్శబ్దం కథ వేరుగా వుంటుంది. ఎక్కడా పోలిక రాదు, కాపీ అని ఎవరూ అనలేరు. 

        హిందీ రీమేక్ ధువా లో రాజమాతగా అప్పటి హీరోయిన్ రాఖీ చేసిన హత్య తాలూకు గుట్టు విప్పే ఘట్టం చివర్లో ఒక క్లాసిక్ చిత్రణ. ఒక పాజిటివ్ క్యారెక్టర్ ఉన్నట్టుండి నెగెటివ్ గా బండారం బయటపడుతుంది. మిథున్ చక్రవర్తి, అంజాద్ ఖాన్ తదితర సీబీఐ బృందం అండర్ కవర్ ఆపరేషన్ కి అద్భుత, వెంట్రుకలు నిక్కబొడుచుకునే పరాకాష్ట!

సికిందర్