రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, May 31, 2024

1434 : రెవ్యూ!

 

రచన : దర్శకత్వం : కృష్ణ చైతన్య
తారాగణం: విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి, నాజర్, గోపరాజు రమణ, హైపర్ ఆది తదితరులు  
సంగీతం: యువన్ శంకర్ రాజా, ఛాయాగ్రహణం : అనిత్ మాదాడి
బ్యానర్స్: సితార ఎంటర్టయిన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
విడుదల : మే 31, 2024
***

        టీవల గామి సక్సెస్ తర్వాత విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సమ్మర్ లో ఎండలకి, క్రికెట్ కి, ఎన్నికలకీ భయపడి పెద్ద సినిమాలని వాయిదా వేశాక, మే చివర్లో సమ్మర్ కి సెలవు చెబుతూ ఈ మూవీ విడుదలైంది. దీనికి కృష్ణ చైతన్య దర్శకుడు. ఈ సినిమా ప్రకటించినప్పట్నుంచీ ఆసక్తి రేపుతూ వచ్చింది.  హిందీలో గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ లాగా టైటిల్ తో వచ్చిన ఈ మూవీ ట్రైలర్ చూస్తే బలహీనంగా వుంది. ఈ సినిమాలో చాలా గ్యాంగ్‌లు వున్నాయి, కానీ ఇది గ్యాంగ్‌స్టర్ సినిమా కాదని, దీన్ని గ్యాంగ్‌స్టర్ మూవీగా పరిగణించవద్దనీ ప్రేక్షకుల్ని అభ్యర్థిస్తున్నానని ప్రకటించాడు దర్శకుడు. అంటే ఏమిటి? ఏమో! సినిమా చూస్తేగానీ తెలీదు. సినిమా చూసి తెలుసుకుందాం...

కథ

ఈ కథ పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని ఓ లంక గ్రామంలో పాతికేళ్ళ క్రితం జరుగుతుంది.  అక్కడ పేకాట, తాగుడు, వేశ్యతో సంబంధం, డబ్బులు కొట్టేయడం వంటి పనులతో గడుపుతున్న రత్న(విశ్వక్ సేన్) కి గొదావరిలో ఇసుక అక్రమ రవాణా కంటబడుతుంది. దాని వెనుక ఎమ్మెల్యే దొరస్వామిరాజు (గోపరాజు రమణ) వుంటాడు. ఇతడి రాజకీయ ప్రత్యర్ధిగా నానాజీ (నాజర్)వుంటాడు. రత్న తెలివిగా దొరస్వామి రాజు దగ్గర చేరిపోయి ఇసుక వ్యాపారం చూస్తూంటాడు. నానాజీకో కూతురు బుజ్జి (నేహాశెట్టి) వుంటుంది. ఈమెని ప్రేమించి నానాజీకి శత్రువు అవుతాడు. అయితే ఎన్నికల్లో దొరస్వామి రాజుని ఓడిస్తానని నానాజీ ని ఒప్పిస్తాడు. ఎన్నికల్లో దొరస్వామి రాజుమీద పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుస్తాడు. దీంతో తలెత్తిన పరిణామాల్లో ఇద్దరికీ శత్రువు అవుతాడు.
       
ఇప్పుడేం చేశాడు రత్న
? ఇద్దరు విరోధుల్ని ఎలా ఎదుర్కొన్నాడు? బుజ్జిని పెళ్ళి చేసుకున్నాడా? ప్రేమించిన వేశ్య రత్నమాల (అంజలి) ఏమైంది? ఇవి తెలుసుకోవాలంటే మిగతా కథ చూడాలి.

ఎలావుంది కథ

గోదావరిలొ కొట్టుకు పోయిన నాటు పడవలా వుంది. పడవలో దర్శకుడు, హీరో, నిర్మాతలూ అందరూ వున్నారు. రెస్క్యూ ఆపరేషన్ తో కూడా ఈ కథతో  సినిమాని నిలబెట్టలేరు. రాయలసీమ, తెలంగాణాల్లో మాదిరిగానే ఆంధ్రా ప్రాంతంలోనూ హత్యలు, ఘర్షణలు జరుగుతున్నాయని, ప్రతిసారీ గోదావరి జిల్లాల్ని సుందరంగా చూపించడం చాలా అసహజంగా అన్పించిందనీ, గోదావరి జిల్లాల్లో కనువిందు చేయాల్సిన దానికంటే ఎక్కువే వుందనీ, ఆ విధంగా ఈ సినిమా ద్వారా చక్కని ఎమోషన్స్ తో కూడిన మంచి కథని చెప్పే అవకాశం లభించిందనీ చెప్పాడు దర్శకుడు.
       
చాలా గొప్పగా చెప్పాడు. కానీ కథ అనేది ప్రధానంగా  
పాత్ర-సమస్య-పరిష్కారం అనే చట్రంలో వుంటే కథవుతుందని మరిచాడు. దీంతో కథంతా గందరగోళంగా తయారైంది. ఈ కథలో హీరోకి సినిమాని నిలబెట్టే ప్రధాన సమస్యా (పాయింటు), ఆ సమస్యని సాధించాలన్న భావోద్వేగాలతో కూడిన లక్ష్యమూ లేకపోవడంతో, ఇది సినిమా కథే కాకుండా పోయింది.
       
సినిమా సాంతం ఒక సమస్య వస్తే
, దాన్నెదుర్కొన్నాక ఇంకో సమస్య వస్తే, దీన్నెదు ర్కొన్నాక ఇంకో సమస్య వస్తే ... ఎలా ఎన్నో సమస్యలు, వాటిని ఎన్నోసార్లు ఎదుర్కోవడాలే తప్ప, ఒకచోట ఆగి ప్రధాన సమస్యతో పాయిటుకి రాదు. ఇది ఒక ఎపిసోడ్ తర్వాత ఇంకో ఎపిసోడ్ గా సాగే డాక్యుమెంటరీల కోసం వాడే స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ కింది కొస్తుంది. ఇలా వచ్చిన టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఆటోనగర్ సూర్య వంటి వెన్నో అట్టర్ ఫ్లాపయ్యాయి. డాక్యుమెంటరీ కథనాలతో కమర్షియల్ సినిమాలు తీయలేరు.
       
కాబట్టి ఇంటర్వెల్లో కూడా కథేమిటో అర్ధం గాదు. ఇంటర్వెల్ తర్వాత అస్సలు అర్ధంగాదు. విలన్లతో ఏవేవో సమస్యలు
, హీరో పోరాటాలూ వచ్చిపోతూంటాయి. ఇన్ని సమస్యలు, పోరాటాలు అర్ధంగాకుండానే, మరిన్ని సమస్యలూ పోరాటాలూ వచ్చేస్తూంటాయి. హీరోతో కుదురుగా కథే లేకపోయాక, మరోవైపు ఎన్నో పాత్రల ఉపకథలు కూడా వచ్చేస్తూ ఇంకా గందరగోళమై పోతుంది. ఇలా హీరో సహా ఏ పాత్రా నిలబడక- తన్నుకుని చావడమే వుంటుంది.
       
గోదావరి జిల్లాలో యాక్షన్ కథ చెప్పడానికి పూర్వమున్న
కత్తి కట్టడం అనే సాంప్రదాయాన్ని కేంద్ర బిందువుగా తీసుకున్నాడు. అక్కడ పగదీర్చుకునే కార్యక్రమాన్ని కత్తి కట్టడం అంటారు. దీన్ని రూపుమాపడం హీరో లక్ష్యం. దీని మీదే నిలబడి కథ చెయ్యక, ఈ పాయింటుని మరుగున పడేసి ఏమేమో చేశాడు. టైటిల్ కూడా ఈ కథకి కుదర్లేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే క్రిమినల్, మాఫియా కథల్ని సూచించే టైటిల్ లాగా వుంది. కానీ చూస్తే ఇది రెండు రాజకీయ గ్రూపుల రొటీన్ కథ. రాజకీయ నాయకులు పోషించుకునే కార్యకర్తల్ని గ్యాంగ్స్ అనరు. పూర్వం 1970, 80 లలో గోదావరి జిల్లాల్లో గ్రామ కక్షలతో కూడిన సినిమాలెన్నో వచ్చేవి. వాటిలో జమీందారో, సర్పంచో విలన్ గా వుండేవాడు. ఆ బాపతు కథే ఇదీనూ.     
       
దర్శకుడన్నట్టు
,
ప్రతిసారీ గోదావరి జిల్లాల్ని కనువిందుగా చూపించలేదు. అప్పుడు కూడా గ్రామ కక్షలతో కొట్టుకోవడం చూపించారు. కాబట్టి తానేదో మొదటి సారిగా చూపించడం లేదు. 2023 లో శ్రీకాంత్ అడ్డాల తీసిన పెదకాపు కూడా ఇలాటి గోదావరి జిల్లా యాక్షన్ కథనే గజిబిజి గందరగోళంగా తీసి అట్టర్ ఫ్లాప్ చేశాడు.  

నటనలు –సాంకేతికాలు

విశ్వక్ సేన్ వూర మాస్ పాత్ర వేశాడు. మధ్యలో ఎమ్మెల్యేగా మారినా తేడా లేకుండా అదే వూర మాస్ గా నటించుకుపోయాడు. క్యారక్టర్ ఆర్క్ అనేది లేకుండా పదిహేనేళ్ళ పాత్ర జర్నీని ఎత్తు పల్లాల్లేకుండా, భావోద్వేగాల్లేకుండా ఫ్లాట్ గా, రొడ్డ కొట్టుడుగా చేసుకుపోయాడు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచాక ఆ పదవిలోనే కొనసాగక, మధ్యలో పదవి పోగొట్టుకుని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవడం, కొట్లాడుకుని ఓ పది సార్లు జైలు కెళ్ళడం, అయిదారుసార్లు ఆస్పత్రికెళ్ళడం, ఒకర్ని కన్నాక మళ్ళీ ఇంకోసారి ఇంకో పిల్లని కనడం, ఇలా చేసిందే చేస్తూ అక్కడక్కడే తిరుగుతూంటాడు తప్ప ముందు కెళ్ళే  కథా నాయకత్వమే లేదు. ఓ సమస్య, దాని పరిష్కారం కోసం ఓ లక్ష్యం వుంటేగా?  పాటలు, ఫైట్లు బాగా చేశాడు, ఫస్టాఫ్ లో లారీ మీద యాక్షన్ సీను ఎక్సైటింగ్ గా వుంది.
       
హీరోయిన్లు నేహాశెట్టి
, అంజలి ఇద్దరికీ పాత్రలు అంతంత మాత్రం. ప్రభావం చూపరు. విలన్లుగా నాజర్, గోపరాజు రమణలవి ఫార్ములా పాత్రలు, నటనలు. హీరో వెంట వుండే హైపర్ ఆది రెండు మూడు చోట్ల కామెడీ డైలాగులు విసురుతాడు.
       
సాంకేతికంగా ఏ లోటూ లేకుండా చూసుకున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతంలో మూడు పాటల్లో మొదటి రోమాంటిక్ పాట
, దాని చిత్రీకరణా బావున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టాప్ అనొచ్చు. అలాగే అనిల్ మాదాడి ఛాయాగ్రహణం టాప్ రేంజిలో వుంది. ఇందులో పచ్చటి పంట పొలాలు కనపడవు, ఎర్రటి రక్తాలు కనపడతాయి. యాక్షన్ సీన్స్, కళాదర్శకత్వం చెప్పుకోదగ్గవి. కానీ దర్శకుడి చేతిలో విషయపరంగా సినిమా చెప్పుకో దగ్గది కాదు.

—సికిందర్


1432 : స్పెషల్ ఆర్టికల్

 

  హాలీవుడ్ బాక్సాఫీసు స్థితిని చూస్తే 2024 ప్రత్యేక సంవత్సరం. జనవరి ఒకటి నుంచి ఈ రోజు మే 22 వరకు మొత్తం 176 హాలీవుడ్ సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో 10 బ్లాక్ బస్టర్లున్నాయి. ఇది హాలీవుడ్ మనుగడకి సరిపోతుందా? 2020-21 కోవిడ్ మహమ్మారి- లాక్ డౌన్ ల తర్వాత మొదటిసారిగా అమెరికాలో సినిమా టిక్కెట్ల అమ్మకాలు 9 బిలియన్ డాలర్లకి చేరుకున్న స్థితి 2023 లో కన్పించింది. కోవిడ్ పూర్వ స్థితిని బట్టి చూస్తే ఇది తక్కువే. కాబట్టి హాలీవుడ్‌ బాక్సాఫీసుని కోవిడ్ పూర్వ స్థితికి చేర్చాలంటే ఏం చేయాలి? హాలీవుడ్ జర్నలిస్టు రేయాన్ స్కాట్ దీనికి సమాధానం చెప్పాడు. బాధ్యత పూర్తిగా ప్రేక్షకుల మీద వుంచాడు. ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రేక్షకులు సినిమాలు ఎక్కువగా చూడాలని చెప్పడమే!

        మెరికా బాక్సాఫీసుని కోవిడ్ పూర్వ స్థాయికి తిరిగి రావడానికి సగటు వ్యక్తి సంవత్సరానికి ఇన్ని సినిమాలు థియేట్రికల్‌గా చూడాలని రికమెండ్ చేసే గణితానికి సంబంధించిన ఆసక్తికర విశ్లేషణ ఇది. ప్రస్తుతం మన దేశంలో వున్న పరిస్థితికి కూడా దీన్ని వర్తింపజేసుకోవచ్చు. టాలీవుడ్ నిలబడాలంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు యేటా ఎన్ని సినిమాలు థియేటర్లకి వెళ్ళి విధిగా చూడాలన్నది. హాలీవుడ్ కి సంబంధించి, 2009 నుంచి 2019 వరకు ప్రతి సంవత్సరం అధిగమిస్తూ వచ్చిన 10 బిలియన్ డాలర్ల బాక్సాఫీసుని లక్ష్యంగా పెట్టుకుని 2024 ని చూడాలి.
       
ప్రస్తుత అమెరికా జనాభా లెక్కల ప్రకారం
, అక్కడ 336.4 మిలియన్ల (33 కోట్ల 64 లక్షలు) మంది ప్రజలు నివసిస్తున్నారు. స్టాటిస్టా ప్రకారం 2022 నాటికి అమెరికాలో  82% మంది వ్యక్తులు కనీసం కొన్నిసార్లు సినిమాలకి వెళ్తున్నారు. జర్మనీకి చెందిన
స్టాటిస్టా అనేది 170 వివిధ రణగాల్లోని  80, 000 కంటే ఎక్కువ అంశాలపై గణాంకాలు, నివేదికలు, అంతర్దృష్టులతో కూడిన సమాచారాన్ని అందించే గ్లోబల్ డేటా - బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్. ఇది మన దేశపు బాక్సాఫీసు గణాంకాల్ని కూడా ఎప్పటికప్పుడు విడుదల చేస్తూంటుంది.
       
స్టాటిస్టా చెప్పిన 2022 నాటికి అమెరికాలో కనీసం కొన్నిసార్లు సినిమాలకి వెళ్తున్న వ్యక్తుల శాతాన్ని సౌలభ్యం కోసం 80% అనుకుంటే
, ఇది  దాదాపు 269 మిలియన్ల (26 కోట్ల తొమ్మిది లక్షలు) మంది ప్రేక్షకుల సంఖ్యని సూచిస్తుంది. అమెరికాలో సినిమా టిక్కెట్ ప్రస్తుత సగటు ధర 10.78 డాలర్లుగా వుంది.  కాబట్టి, సగటు వ్యక్తి సంవత్సరానికి ఎన్ని సినిమాలు చూడాలి?
       
సగటు టిక్కెట్ ధర 10.78 డాలర్లని
, 10 బిలియన్ డాలర్ల బాక్సాఫీసు టార్గెట్ తో భాగిస్తే 927,643,785 టిక్కెట్లని విక్రయించాల్సి వుంటుంది. దీన్ని జనాభాలో 80% ప్రేక్షకుల సంఖ్యతో భాగిస్తే, ఒక్కొక్కరికి సంవత్సరానికి 3.44 టిక్కెట్‌లకి చేరుకుంటుంది. దీన్ని 4 టికెట్లుగా రౌండప్ చేస్తే, హాలీవుడ్ ని సేఫ్ జోన్ లో వుంచడానికి సగటు వ్యక్తి సంవత్సరానికి మూడు లేదా నాలుగు సినిమాలు విధిగా థియేటర్లలో చూడవలసి వుంటుంది. సంవత్సరానికి మూడు నాల్గు సినిమాలు చూడ్డం సమస్యే కాకూడదు. అవుతోందంటే ఈ మాత్రం కూడా ప్రతీ సగటు వ్యక్తి సినిమాలు చూడడం లేదన్న మాట.
       
సినిమా చూడడం అనేది సగటు వ్యక్తికి సాధారణ అభిరుచి
, అలవాటు. దురదృష్టవశాత్తూ, ఓటీటీ స్ట్రీమింగులు రావడంతో కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చిన కొద్ది వారాలకే ఓటీటీల్లో ఇంటింటి పండుగగా మారడాన్ని నిర్మాతలు అనుమతించడం, కూర్చున్న కొమ్మని నరుక్కున్నట్టు బాక్సాఫీసుని దెబ్బ దీసుకోవడమే.
       
నిజం చెప్పాలంటే
, సంవత్సరానికి 10 బిలియన్ డాలర్ల హాలీవుడ్ బాక్సాఫీసు టార్గెట్ అనేది అత్యాశేమీ కాదు. 11.3 బిలియన్ డాలర్లకి చేరుకున్న 2019 సంవత్సరం వుండనే వుంది. మరిన్ని సినిమాలు చూడమని ప్రేక్షకుల్ని అభ్యర్ధించడం కూడా అన్యాయం కాదు. సంవత్సరానికి మూడు నాల్గు సినిమాలే థియేటర్లకి వెళ్ళి చూడమనడం. అంటే నెలకు 0.25 నుంచి 0.33 సినిమా మాత్రమే. ఇంతకంటే హీనంగా అడుక్కోవడమేముంటుంది?
       
అయినా దీన్ని ఖాతరు చేస్తారా ప్రేక్షకులు
? హాలీవుడ్ తో బాటు థియేటర్ చైన్‌లు ఈ సమస్యని పరిష్కరించాలి. నీర్మాతలు తమ సినిమాలతో ప్రేక్షకుల సమయాన్ని వృధా చేయబోమని భరోసా ఇస్తూ నాణ్యమైన సినిమాలందించాలి. ఐమాక్స్, 4 డీఎక్స్, డ్రైవ్ ఇన్ వంటి ప్రీమియం థియేటర్ల సంఖ్యని పెంచుకుంటూ పోవడం కాదు, వాటిలో ప్రదర్శించే సినిమాలు కూడా ప్రీమియం సినిమాలుగా వుండాలి. రాబోయే సంవత్సరాల్లో థియేట్రికల్ సినిమా వ్యాపారం మారు మూల ప్రాంతాల్లో కూడా ఆరోగ్యంగా వుండాలంటే ఇది తప్పక దృష్టి పెట్టాల్సిన ముఖ్యాంశం.

***


Thursday, May 30, 2024

1432 : హాలీవుడ్ రివ్యూ

 

దర్శకత్వం : మైకేల్ షో వాల్టర్
తారాగణం : ఏన్ హాత్వే, నికోలస్ గాలిట్జీన్, ఎల్లా రుబీన్, రీడ్ స్కాట్ తదితరులు
రచన : మైకేల్ షో వాల్టర్, జెన్నిఫర్ వెస్ట్ ఫెల్ట్
సంగీతం : సిద్ధార్థ ఖోస్లా, ఛాయాగ్రహణం : జిమ్ ఫ్రొహ్నా 
బ్యానర్స్ : అమెజాన్ - ఎంజీఎం స్టూడియోస్
విడుదల : మే 2, 2024 (అమెజాన్ ప్రైమ్)
***

        మెరికన్ రోమాంటిక్ డ్రామా ది ఐడియా ఆఫ్ యూ మార్చిలో విడుదలైంది. అక్కడ్నుంచి మే 2 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 2001 నుంచీ 10 రోమాంటిక్ సినిమాలు తీసిన మైకేల్ షో వాల్టర్ దీని దర్శకుడు. 2014 నుంచి 14 సినిమాలు  నటించిన బ్రిటిష్ నటుడు నికోలస్ గాలిట్జీన్ ఇందులో హీరో. 2001 నుంచి 45 సినిమాలు నటించిన అమెరికన్ నటి ఏన్ హాత్వే హీరోయిన్. న్యూయార్క్ లో గోల్డ్ స్పాట్ బ్యాండ్ తో ప్రసిద్ధి చెందిన సిద్ధార్థ ఖోస్లా సంగీత దర్శకుడు. రచయిత్రి రాబిన్ లీ ఇదే పేరుతో రాసిన హిట్ నవల ఈ సినిమా కాధారం. అయితే ఈ సినిమా చూసి తీవ్ర అసంతృప్తి చెందిన రాబిన్ లీ చేసిన వ్యాఖ్యలేమిటి? తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రోమాంటిక్ డ్రామా కథేమిటి? కొత్తగా చెప్తున్నదేమిటి? ఇవి తెలుసుకుందాం...

కథ

లాస్ ఏంజిలిస్ లో సోలెన్ మర్చండ్ (ఏన్ హాత్వే) విజయవంతంగా ఆర్ట్ గ్యాలరీ నడుపుతున్న నడివయస్కురాలు. 40 ఏళ్ళ ఆమెకి 16 ఏళ్ళ కూతురు ఇజ్జీ (ఎల్లా రుబీన్) వుంటుంది. సోలెన్ భర్త డానియేల్ (రీడ్ స్కాట్) నుంచి విడాకులు తీసుకుంది అతను వేరే వ్యవహారం నడపడంతో. అయితే అతను వచ్చి పలకరించి పోతూనే వుంటాడు. ఒక రోజు అతను కూతురు ఇజ్జీనీ, ఆమె ఫ్రెండ్స్ నీ మ్యూజిక్ ఫెస్టివల్ కి తీసుకుపోతూంటే, మధ్యలో ఆఫీసు నుంచి అర్జెంట్ కాల్ రావడంతో, వీళ్ళని తీసికెళ్ళమని సోలెన్ ని కోరతాడు. సోలెన్ వాళ్ళని తీసుకుని మ్యూజిక్ ఫెస్టివల్ కి వెళ్తుంది. అక్కడ బాత్రూమ్ కోసం వెతికి ఆగి వున్న వ్యాను బాత్రూమ్ అనుకుని ఎక్కేస్తుంది. అది బాత్రూమ్ కాదు, పాపులర్ సింగర్ హేస్ క్యాంప్ బెల్ పర్సనల్ వ్యాన్. ఆగస్ట్ మూన్ అనే బ్యాండ్ అతను నడుపుతున్నాడు.
       
వ్యానులో ఈ అనుకోని పరిచయం ఇద్దరి మధ్యా రిలేషన్ షిప్ కి దారితీస్తుంది. మొదట తన కన్నా 16 ఏళ్ళు చిన్నవాడైన హేస్ తో ప్రేమాయణం మనస్కరించక పోయినా క్రమంగా అతడ్ని అంగీకరిస్తుంది. ఇద్దరి
మధ్య ప్రేమ మెల్లగా పెరగడం మొదలైన తర్వాత ఒకటొకటే అర్ధమవుతాయామెకి. కలిసి వుండాల్సిన అవసరం, ఒకరినొకరు మిస్సవడం, బలంగానూ పచ్చిగానూ అనుభవమవుతున్న ప్రేమ -ఇదంతా ఎంతో కాలం నిలబడవని అర్ధమై పోతుంది. ఈ ఏజ్ గ్యాప్ రోమాన్సుకి ఈ డిజిటల్ యుగంలో వున్న భద్రత ఎంతో, సెలబ్రిటీతో జీవితం, అందులోనూ నిత్యం ప్రపంచ కళ్ళల్లో పడుతూ ఇబ్బంది పెట్టే తన నడి వయసుతో పడే బాధ ఏమిటో - ఇవన్నీ కలిసి సంఘర్షణకి గురి చేస్తాయి. అంతేగాక కూతురి ప్రశ్నలు, మాజీభర్త హెచ్చరికలు- ఇవి కూడా తోడై ఇక్కడ్నుంచి అతడితో తెగతెంపులు, మళ్ళీ అతికింపులు, మళ్ళీ తెగతెంపులు... ఇలా తయారవుతుంది జీవితం. చివరికి ఈ ప్రేమ ఏ తీరానికి చేరుకుంది? ఇద్దరూ ఒకటయ్యారా, విడిపోయారా? ముగింపేమిటి? ఇవీ మిగతా కథలో...

హాలీవుడ్ ముగింపే!
ఈ రోజుల్లో చాలా మంది స్త్రీలని  బాధపెడుతున్న వొత్తిళ్ళు-  నిరంతరం యవ్వనంగా, పరిపూర్ణంగా కనిపించాలని సమాజం, మీడియా కలిసి పెంచుతున్న వొత్తిడి... స్త్రీలు ఎలా ప్రవర్తించాలి, ఎవరితో డేటింగ్ చేయాలి, ఎలాంటి దుస్తులు ధరించాలీ వంటి విషయాలపై నిరంతర తీర్పులు, రన్నింగ్ కామెంటరీలు- ఇవి హేస్ -సోలెన్ ప్రేమ కథలో చూస్తాం.
       
ఈ కథలో తన కంటే బాగా చిన్న వాడితో డేటింగ్
చేయడాన్ని ప్రశ్నించే సమాజం ఇంకా వుండడం చోద్యంగానే వుంటుంది. వయసులో తేడా ప్రపంచానికి కనిపిస్తోంది గానీ వాళ్ళిద్దరికీ కాదు. అయితే అతను సెలబ్రిటీ. ఇక్కడొచ్చింది చిక్కు. కూతురు, భర్త, విడాకులు, వయస్సూ ... ఇలా ఇన్ని అధైర్యాలు తన కుండగా, అతను సెలబ్రిటీ కూడా కావడంతో మీడియా ఫోకస్ ని తట్టుకోలేక, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని జయించలేక, అతడితో లవ్ -హేట్ రిలేషన్ షిప్  అనే చట్రంలో ఇరుక్కుని ఏం చేసిందనేది ఇక్కడ ముఖ్యమైన పాయింటు.
       
అయితే ఇదే పేరుతో నవల రాసిన రచయిత్రి రాబిన్ లీ ఈ కథని తను ట్రాజడీగా ముగిస్తే
, సినిమా తీసి సుఖాంతం చేయడాన్ని తప్పుబట్టింది. ఈ సినిమా వాళ్ళు ఇంతే- కథలు సుఖాంతమైతేనే కమర్షియల్ గా సక్సెస్ అవుతాయని నమ్ముతారని ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. హాలీవుడ్ వాళ్ళు ఇలా చేయగా లేనిది తెలుగు సినిమాల్లో చేస్తే తప్పేమిటి? దీన్నే తెలుగులో తీస్తే పెళ్ళి చేసి, శోభనం పెట్టి, బ్యాక్ గ్రౌండ్ లో కెవ్వుమని పుట్టిన పిల్లాడి కేక విన్పిస్తేనే పరిపూర్ణమైన ముగింపు అవుతుందన్నట్టు. సోలెన్ లాంటి హీరోయిన్ పాత్ర ఎలా కిల్ అయినా ఫర్వాలేదు- సమాజం ఆడదాన్ని ఒంటరిగా వదలదు కాబట్టి- పెళ్ళి చేసి మెడకో డోలు కడుతుంది కాబట్టీ!!
        
ఈ నవల మీద వచ్చిన పాఠకుల అభిప్రాయాలూ చూస్తే- కొన్ని రోజుల వరకూ దీని ప్రభావం నుంచి తేరుకోలేక పోయామని రివ్యూలు రాశారు పాఠకులు!
—సికిందర్


1431 : స్పెషల్ ఆర్టికల్

 

దిలాబాద్ జిల్లాకి చెందిన యువతి నడిపే తెలుగు యాత్రి అనే యూట్యూబ్ ట్రావెల్ ఛానెల్లో  కొద్ది రోజుల క్రితం ఉజ్బెకిస్తాన్ నుంచి ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆమె ఎక్కిన క్యాబ్ లో డ్రైవర్ ఆమె ఇండియన్ అని తెలుసుకుని హిందీ పాట పాడడం మొదలెట్టాడు. ఆ పాట దోస్త్ దోస్త్ నా రహా అని రాజ్ కపూర్ నటించిన సంగం (1964) సినిమా లోనిది. ఇదేమీ ఆశ్చర్యపర్చే విషయం కాదు. ఎందుకంటే దశాబ్దాల  నుంచీ రష్యన్ ప్రజలకి హిందీ సినిమాలు తెలుసు. 1950, 60 లలో రాజ్ కపూర్ సినిమాలు రష్యాలో కూడా మ్యూజికల్ హిట్సే. కాబట్టి నాటి సోవియెట్ రష్యాలో భాగమైన ఉజ్బెకిస్తాన్లో క్యాబ్ డ్రైవర్ పాట పాడడం రొటీనే. రష్యన్లు రాజ్ కపూర్, మిథున్ చక్రవర్తి, హేమ మాలిని, షారూఖ్ ఖాన్ వంటి స్టార్స్ సినిమాలు చూస్తూ పెరిగారు. అయితే ఈ చారిత్రక సాంస్కృతిక అనుబంధాన్ని పునరుజ్జీవింపజేసేందుకు, రష్యాలో భారతీయ సినిమా షూట్‌లు, షోలు పెంచే పనిలో ఇరు దేశాల్లోని సినిమా పరిశ్రమలు పని చేస్తున్నాయని ఒక నివేదిక పేర్కొంటోంది.
        
లా ఎందుకు జరుగుతోంది? ఎందుకంటే, ఫిబ్రవరి 2022లో రష్యా యూక్రేన్ పై దాడి చేసినందుకు నిరసనగా హాలీవుడ్ సంస్థలు రష్యా నుంచి వైదొలిగాయి. పోతే పోయారనుకుని పుతిన్ ప్రభుత్వం ఇండియన్ నిర్మాతల్ని లాగడానికి, రష్యాలో ఇండియన్ సినిమాలని ప్రోత్సహించడానికి, నిర్మాణాలని పెంచడానికీ గట్టి ప్రయత్నం ప్రారంభించింది.
        
రష్యాలో చిత్రీకరించిన  సర్దార్ ఉద్దం సింగ్’, పఠాన్’, టైగర్ 3’, జుగ్ జుగ్ జియో’ వంటి ఇటీవలి హిట్స్ కి  సహాయ సహకారా లందించిన ముంబాయికి చెందిన ప్రొడక్షన్ లైన్ కంపెనీ కార్టినా ఎంటర్‌టైన్‌మెంట్ లైన్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తోంది. ఇంకా ఈ కంపెనీ ప్రస్తుతం అంతరిక్షంలో ప్రయాణించిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ బయోపిక్ కి, ధర్మా ప్రొడక్షన్స్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎమ్మే ఎంటర్‌టైన్‌మెంట్, రోహిత్ శెట్టి ప్రొడక్షన్స్ వంటి కంపెనీలు చేపట్టిన అనేక ప్రాజెక్టులకి షూట్ కోసం సంప్రదింపులు జరుపుతోంది.
        
ఈ సంవత్సరం రష్యన్ అధికారులు నిర్మాణ ఖర్చుల్లో రాయితీలు అందించడం ద్వారా ఎక్కువ సంఖ్యలో భారతీయ నిర్మాతల్ని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తాము ఇండియన్ నిర్మాతల కోసం ఏవైనా సేవలకి ఫ్రంట్ ఆఫీసు లేదా సూపర్ మార్కెట్ లాగా వున్నామని, ఇక్కడ షూటింగ్ చేయడానికి తక్కువ ధరల్ని అందించడం ద్వారా నిర్మాణ ఖర్చుల్ని వీలైనంత వరకూ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామనీ, మాస్కోలో మేయర్ కార్యాలయానికి చెందిన డిప్యూటీ హెడ్ ఎవ్జెనీ కోజ్లోవ్ పేర్కొన్నారు.
        
గత నెలలో తమిళ యాక్షన్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’  మాస్కో-సిటీ ఆఫ్ సినిమా కార్యక్రమంలో పాల్గొన్న మొదటి విదేశీ నిర్మాణంగా నిలిచింది. మాస్కోసిటీ ఆఫ్ సినిమా నిర్మాతలకి  రాయితీల్ని అందిస్తుంది. సినిమా నిర్మాతల్నిఆకర్షించే బాధ్యతగా మాస్కో సాంస్కృతిక శాఖ, బాలీవుడ్ నిర్మాతలతో సంబంధాలు ఏర్పరుచుకుంటోందని కోజ్లోవ్ చెప్పారు.
       
ఇదిలా వుండగా
, రష్యా అంతటా భారతీయ సినిమాల ప్రదర్శన పెరిగింది. మాస్కో, సెయింట్ పీటర్స్ బర్గ్ లతో పాటు, ఆర్ఖంగెల్స్క్, బెల్గోరోడ్, కజాన్, పెన్జా, సరతోవ్, తులా, ఉలియానోవ్స్క్, చెబోక్సరీతో సహా దేశవ్యాప్తంగా 40కి పైగా కేంద్రాల్లో భారతీయ చలనచిత్రాల్ని ప్రదర్శిస్తున్నారు.
        
బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన  బ్లాక్ బస్టర్ 'పఠాన్' లో ఘనీభవించిన సరస్సు మీద ఉత్కంఠభరి హై-స్పీడ్ మోటర్‌బైక్ చేజ్ సీక్వెన్స్ దక్షిణ సైబీరియాలో చిత్రీకరించిందే. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ లు  నటించిన యాక్షన్-థ్రిల్లర్ 'టైగర్ 3' ని సెయింట్ పీటర్స్ బర్గ్ లో  పాక్షికంగా చిత్రీకరించారు. తమిళంలో అజిత్ కుమార్ 'వలిమై', విక్రమ్ 'కోబ్రా' సహా అనేక తమిళ సినిమాలని రష్యాలో షూట్ చేశారు. విజయ్ ఆంటోనీ  'అగ్ని సిరగుగల్' ని విపరీత వాతావరణ పరిస్థితుల్లో రష్యా, కజకిస్తాన్, ఇంకా మధ్య ఆసియాలోని ఇతర ప్రదేశాల్లో షూట్ చేశారు.
        
పూర్వపు యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ (యూఎస్ ఎస్ ఆర్) -ఇండియాల మధ్య సాంస్కృతిక మార్పిడి 1950ల నాటి రాజ్ కపూర్ క్లాసిక్స్ 'ఆవారా',  'శ్రీ 420' తో ప్రారంభమైంది. రాజ్ కపూర్ తరువాతి 20 సంవత్సరాల పాటు రష్యాలో అభిమాన తారగా వెలుగొందారు.  'ఆవారా' - రష్యన్ భాషలో డబ్ అయి  'బ్రొడియాగా' గా విడుదలైంది. 1970లో రాజ్ కపూర్ 'మేరా నామ్ జోకర్' ఇండియాలో ఫ్లాపైనా రష్యాలో పెద్ద హిట్. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, రేఖ, మిథున్ చక్రవర్తిల సినిమాలు హిట్టవసాగాయి. మిథున్ చక్రవర్తి డిస్కో డాన్సర్ తో రష్యన్స్ ని గంగవెర్రులెత్తించాడు.
       
అయితే ఇప్పుడెన్ని షూటింగులు రష్యాలో జరిగినా
, ఎన్ని సినిమాలు ప్రదర్శించినా రష్యన్లకి ఇండియన్ సినిమాలంటే పాత సినిమాలే. పాటలంటే పాత పాటలే. సన్నగా వర్షం కురుస్తున్న నడి రాత్రి ఉజ్బెకిస్తాన్ క్యాబ్ డ్రైవర్, పక్కన తెలుగు యాత్రితో,  దోస్త్ దోస్త్ నా రహా పాడుకుంటూ డ్రైవ్ చేస్తూ, గతాన్ని స్మరించుకుంటూ తదాత్మ్యం చెందడం ఒక అపురూప  దృశ్యమే!

***
  

Thursday, May 23, 2024

1430 : మలయాళం రివ్యూ


రచన- దర్శకత్వం : జిత్తూ మాధవన్
తారాగణం : ఫాహద్ ఫాజిల్
, హిప్ స్టర్, మిథున్ జై శంకర్, శంతన్, అంబన్, మన్సూరలీ ఖాన్, నీరజా రాజేంద్రన్ తదితరులు
సంగీతం :
సుశీన్ శ్యామ్, ఛాయాగ్రహణం : సమీర్ తాహిర్
బ్యానర్స్ : అన్వర్ రషీద్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫాహద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్
నిర్మాతలు : నజ్రియా నజీమ్, అన్వర్ రషీద్
విడుదల : మే 9
, 2024 (అమెజాన్ ప్రైమ్)

 ***

        లయాళం సినిమాలు తిరిగి హిట్ బాట పట్టి అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి, 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకూ వరుసగా 5, 15,30 కోట్ల బడ్జెట్స్ తో తీసిన సినిమాలు 100 కోట్లకి పైగా వసూళ్ళు సాధిస్తున్నాయి. ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, భ్రమయుగం, ఆడు జీవితంల తర్వాత ఇప్పుడు ఆవేశం...ఏప్రిల్ 11 న విడుదలైన ఆవేశం అయితే 4 వారాల్లో 155 కోట్లు వసూలు చేసి ఓటీటీలో స్ట్రీమింగ్ కొచ్చేసింది. దీన్ని 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫాహద్ ఫాజిల్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీ ఈ రోజు (మే 9) నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం మలయాళం భాషలో ఇంగ్లీషు సబ్ టైటిల్స్ తో ప్రసారమవుతున్న ఈ మూవీ లో అసలేముంది? ఎందుకింత హిట్టయ్యింది? తెలుసుకుంటే సినిమా తీయడం చాలా సింపుల్ విషయమని తెలిసిపోతుంది. హైప్ లు, బిల్డప్పులు, హీరోయిన్లు, రోమాన్సులు కూడా అవసరం లేదని అర్ధమైపోతుంది. వివరంగా చూద్దాం...

కథ

అజు (హిప్‌స్టర్), బీబీ (మిథున్ జై శంకర్), శంతన్‌ (రోషన్ షానవాజ్) అనే ముగ్గురూ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవడానికి కేరళ నుంచి బెంగుళూరు వస్తారు. కాలేజీ హాస్టల్ కంటే ప్రైవేట్ హాస్టల్లో స్వేచ్ఛగా వుండొచ్చని అక్కడ చేరతారు. కాలేజీలో సీనియర్ విద్యార్ధి కుట్టి తో మాటామాటా పెరిగి అతడి అహాన్ని దెబ్బతీస్తారు. ప్రతీకారంగా కుట్టి అతడి గ్యాంగ్ ముగ్గుర్నీ కొడతారు. దీన్ని అవమానంగా భావించి అజు ప్రతీకారం తీర్చుకోవడానికి లోకల్ గ్యాంగ్‌స్టర్స్ ని వెతకడం ప్రారంభిస్తాడు. ఒక బార్ లో ముగ్గురికీ మలయాళీ-కన్నడిగ గ్యాంగ్ స్టర్ రంగా (ఫాహద్ ఫాజిల్) పరిచయమవుతాడు. అతను మెడకి, చేతులకి బాగా బంగారం వేసుకుని, వైట్ డ్రెస్ లో వుంటాడు. కోపం వచ్చినా, సంతోషం వచ్చినా అతిగా స్పందిస్తాడు. అతడితో స్నేహం కొనసాగిస్తూ కాలేజీలో కుట్టి గ్యాంగ్ వల్ల తమకి జరిగిన అవమానం గురించి చెప్తారు. రంగా తన గ్యాంగ్ ని పెట్టి కుట్టినీ, అతడి గ్యాంగ్ నీ చిత్తుగా తన్నిస్తాడు. అయితే అజు అండ్ ఫ్రెండ్స్ కి దీంతో సంతృప్తి కలిగినా, రంగాతో స్నేహం వదులుకోలేని పరిస్థితి వుంటుంది, అతను వెంటపడి స్నేహం చేస్తూంటే.
       
దీంతో చదువులో వెనుకబడిపోతారు.
పరీక్షలు తప్పుతారు, ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయబోతే, బతిమాలుకుని పరీక్షలు క్లియర్ చేస్తామని మాటిస్తారు. కానీ పరిస్థితిని రంగా అర్ధం జేసుకోడు. అతను హర్ట్ అవకుండా స్నేహం ఎలా వదులుకోవలో వీళ్ళకీ అర్ధం గాదు. ఇంతలో రంగా మాజీ బాస్ రెడ్డి (మన్సూరలీ ఖాన్) రంగాని  చంపడానికి ఈ ముగ్గురి సాయం కోరతాడు.
       
ఇప్పుడేం ఛేశారు
? రంగాని వదిలించుకుని చదువు మీద దృష్టి పెడదామంటే రెడ్డి వచ్చి సాయం అడుగుతాడేమిటి? రంగాని వదిలించు కోవడమంటే అతడ్ని చంపడమేనా? ఇలా ఇన్ని సమస్యల్లోంచి ఎలా బయటపడ్డారన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

ఇది చాలా తేలికపాటి యాక్షన్ కామెడీ కథ. ఎంటర్టయిన్ చేయడమే ముఖ్యోద్దేశం. ముగ్గురు కాలేజీ స్టూడెంట్స్ తమకి జరిగిన  అవమానానికి ప్రతీకారం కోసం గ్యాంగ్ స్టర్ ని ఆశ్రయిస్తే, ఆ గమ్మత్తయిన కామెడీ గ్యాంగ్ స్టర్ ఈ ప్రతీకారం తీర్చి బదులుగా స్నేహం చేయడం మొదలెట్టాడు. దీంతో వాళ్ళ చదువు గల్లంతై అతడ్ని వదిలించుకోవడమెలా అనుకుంటే, ఇంకో గ్యాంగ్ స్టర్ వదిలించుకునే మార్గం చెప్పాడు... ఇంతే కథ. ఈ స్పీడు యుగంలో భారీ కథలు అక్కర్లేదు. ఈ తేలికపాటి కథకి రెండున్నర గంటలు కూర్చోబెట్టే కథనం చేయడం దగ్గరే  కష్టపడాలి, అంతే. సినిమాకి ఇంత చాలు. ఎక్కువైతే ఫ్లాప్ అయ్యే అవకాశాలే ఎక్కువ. హాలీవుడ్ ది బీకీపర్ కూడా ఇలాగే యాక్షన్ ఎక్కువ, స్టోరీ తక్కువ.  
       
అయితే ఈ తేలికపాటి స్టోరీని నిలబెట్టిన ఎలిమెంట్ ఇంకోటి కూడా వుంది. ఫాహద్ ఫాజిల్ గ్యాంగ్ స్టర్ క్యారక్టర్ తీరుతెన్నులు. అంతు చిక్కని మనస్తత్వంతో
, ఎప్పుడేం చేస్తాడో తెలియని బిహేవియర్ తో, సంతోషమైనా, కోపమైనా, ఏదైనా చాలా అతి చేసే ఎమోషనల్ క్యారక్టర్ గా తన చుట్టూ తిరిగే కథతో ఆడుకోవడం. ఈ క్యారక్టరైజేషన్ లేకపోతే తేలికపాటి స్టోరీకూడా ఏమీ చేయలేదు.
       
ఫస్టాఫ్ - సెకండాఫ్ రెండిటినీ బ్యాలెన్స్ చేసే క్యారక్టర్ ఇది. మీకు సాయం కావాల్సి వస్తే పోలీసుల దగ్గరికెళ్ళండి
, రౌడీల్ని వెంటబెట్టుకుంటే వాళ్ళు శత్రువులకన్నా ఎక్కువై పోతారని- ఒక అంతర్లీన హెచ్చరిక చేసే కథ ఇది.  మీడియం రేంజి సినిమాకి హై రేంజి ఫలితాల్ని ఇచ్చే- ఇస్తున్న మూవీ మేకింగ్ పాఠమిది.

నటనలు- సాంకేతికాలు

ఇది పూర్తిగా ఫాహద్ ఫాజిల్ ఒన్ మ్యాన్ షో. అతడి నటనకి స్పీడు ఒక ముఖ్య టూల్. పూర్తిగా సైకో కామెడీ చేసే పాత్ర. క్లయిమాక్స్ వరకూ ఒక సస్పెన్స్ పోషిస్తాడు. ఇంత హైపర్ యాక్టివ్ గా ఏదైనా అతిగా చేసే ఇతను పిరికివాడా అన్నట్టు వుంటాడు. ఎలాగంటే, ఏదైనా స్ట్రీట్ ఫైట్ జరిగేటప్పుడు తన గ్యాంగ్ ని ముందుకు తోసి తను వెనక దాక్కుంటాడు. గ్యాంగ్ లో అంబన్‌ (సజీన్ గోపు) అనే అనుచరుడు కెప్టెన్ గా పొరాడి సక్సెస్ చేస్తాడు. ఇలా తను ఫైట్ చేయకుండా పిరికివాడా అన్నట్టు సస్పెన్స్ ని పోషిస్తాడు. క్లయిమాక్స్ లో మాత్రం ఒంటరిగా విరోధులకి చిక్కి నప్పుడు విజృంభించి విశ్వరూపం చూపిస్తాడు. పాత్రచిత్రణలో ఈ వెలుగు నీడలు ఇంట్రెస్టింగ్ గా వుంటాయి. ఫాజిల్ దీంతో స్టార్ గా చాలా ఎత్తుకెళ్ళిపోయాడు.
       
ఈ మూవీలో హీరోయిన్లు లేరు
, రోమాన్సులు లేవు. ఉన్న ఒక్క స్త్రీపాత్ర ఒక స్టూడెంట్ కి మదర్ గా నటించిన నీరజా రాజేంద్రన్, అంతే. స్టూడెంట్స్ గా నటించిన ముగ్గురూ హిప్ స్టర్, మిథున్ జై శంకర్, శంతన్ మంచి టాలెంట్ ని ప్రదర్శించారు.
       
డిమ్ లైటింగ్ తో సమీర్ తాహిర్ ఛాయాగ్రహణం కథకి తగ్గ మూడ్ ని క్రియేట్ చేస్తే
, సుశీన్ శ్యామ్ సంగీతం సీన్స్ కి ప్రాణం పోసింది. భారీ క్రౌడ్ తో గ్యాంగ్ స్టర్ రంగా బర్త్ డే పార్టీ సాంగ్ కొరియోగ్రఫీ పరంగానూ, కళాదర్శకత్వం పరంగానూ అతి పెద్ద ఆకర్షణ.
       
2023 లో
రోమాంచమ్ అనే సూపర్ హిట్ తీసిన దర్శకుడు జిత్తూ మాధవన్ తనదైన బ్రాండ్ ముద్రతో, శైలితో సినిమా తీయడానికి లేనిపోని బరువులు మోయనవసరం లేదని మరోసారి నిరూపిస్తూ బాక్సాఫీసుని భారీగా నింపేశాడు.

—సికిందర్