పురచ్చి దళపతి
(విప్లవ దళపతి అని టైటిల్స్ లో వేశారు) విశాల్ 2017 లో ‘తుప్పరివాలన్’ (తెలుగులో ‘డిటెక్టివ్’) హిట్టయిన తర్వాత, వరుసగా 9 ఫ్లాపులిచ్చి కూడా
విప్లవ దళపతి అన్పించుకోవడం విచిత్రం. ఒకే రకమైన మాస్ యాక్షన్ సినిమాలు అతడిని
ముందుకెళ్ళకుండా చేశాయి. ఇప్పుడు కూడా మాస్ యాక్షన్నే తీసుకుని ‘మార్క్ ఆంటోనీ’ నటించాడు. అయితే ఇక్కడ నిజమైన
విప్లవం తీసుకొచ్చాడు. ఈ మాస్ యాక్షన్ కి సైన్స్ ఫిక్షన్ జోడించి విప్లవాత్మకంగా ఒక
కొత్త వెరైటీని సృష్టించాడు. గతంలో ‘త్రిష-ఇలియానా-నయనతార’, ‘ఏఏఏ’, బాఘీరా’ అనే మూడు తమిళ సినిమాలు తీసిన దర్శకుడు
అధిక్ రవిచంద్రన్ ఈ కొత్త వెరైటీని ప్రేక్షకుల ముందుంచాడు. ఇందులో ఎంతవరకు విశాల్
ని నిలబెట్టేందుకు కృషి చేశాడో తెలుసుకుందాం....
తర్వాత 1995 లో గ్యారేజి నడుపుకుంటున్న మార్క్ ఆంటోనీతో రమ్య (రీతూవర్మ) ప్రేమలో పడుతుంది. ఇలా వుండగా, ఒక సైంటిస్టు 30 ఏళ్ళు కష్టపడి తయారు చేసిన టెలిఫోను గ్యారేజీలో మూలన పడి వుంటుంది. ఆ టెలిఫోన్ కి టైమ్ ట్రావెల్ ఫోన్ అని పేరు పెట్టాడు. దాన్ని డయల్ చేస్తే కాల్స్ వర్తమానం నుంచి గతంలోకి వెళ్తాయి. ఈ ఫోను అనుకోకుండా మార్క్ ఆంటోనీకి తగిలే సరికి, ఆ బుక్కులో వున్న సూచనల ప్రకారం 1975 లో చనిపోక ముందు తన తల్లి నెంబర్ కి ఫోన్ చేసి మాట్లాడతాడు. అప్పట్లో తన తల్లిని తండ్రి చంపేశాడని అతడికి తెలుసు. అందుకని ఇప్పుడు చిన్నప్పటి తనకే ఫోన్ చేసి, తల్లిని కాపాడుకోమని హెచ్చరిస్తాడు...ఐతే ఇక్కడే మొత్తం మలుపు తిరుగుతుంది.
అసలు తల్లిని చంపిందెవరు? తండ్రిని చంపింది కూడా ఎవరు? చనిపోయిన తండ్రి ఇప్పుడెలా బతికున్నాడు? బతికున్న జాకీ మార్తాండ ఇప్పుడెలా చచ్చిపోయాడు? ఈ మొత్తం గేమ్ లో ఏకాంబరం పాత్రేమిటి? నిజాలు బయటికి తీయడానికి, ఆ నిజాలతో శత్రువు మీద పగదీర్చుకోవడానికీ మార్క్ ఆంటోనీకి టెలిఫోన్ ఎలా ఉపయోగపడింది? మొత్తానికి మొత్తం తనే వెళ్ళి 1975 కాలంలో ఎలా పడ్డాడు? చివరికేమైంది? ఇదీ మిగతా కథ.
రెండోదేమిటంటే, ఈ గ్యాంగ్ స్టర్స్ కథ సీరియస్ గా లేకపోవడం. ఫన్నీగా, కామిక్ సెన్స్ తో లైట్ గా తీసుకుని చంపుకోవడాలు, శతృత్వాలు వుండడం. అందుకని టైంట్రావెల్ ఎలిమెంట్ తో –ట్విస్టులతో థ్రిల్ చేస్తూ నవ్విస్తుంది. ఈ కామెడీకి కేంద్రబిందువు జాకీ మార్తాండగా నటించిన దర్శకుడు ఎస్ జె సూర్య. మూడోది, ఎక్కడా స్లో అవకుండా సీన్స్, యాక్షన్ స్పీడుగా సాగడం. నాల్గోది 1975, 1995 రెండు కాలాల కాల్పనిక ప్రపంచాలు చాలా వరకూ నైట్ సీన్లతో, లైటింగ్ ఎఫెక్ట్స్ తో కనువిందు చేయడం.
అయితే ఫస్టాఫ్ ఇంటర్వెల్ కొచ్చేసరికి ఎవరు ఎవర్ని చంపారో సస్పెన్స్ వీడిపోయి- విలన్ ని చంపడంతో కథైపోతుంది. ఇక్కడే ఒక చిన్న ట్విస్టుతో మళ్ళీ కథ పుట్టి సెకండాఫ్ లో కెళ్తుంది. ఫస్టాఫ్ లో టెలిఫోన్ తో మేనేజ్ చేసిన విశాల్, ఇప్పుడు తానే వెళ్ళి 1975 కాలంలో కెళ్ళి పడేసరికి- అక్కడ తన తండ్రిని చంపిన వాడికోసం వేచివున్న ఎస్ జె సూర్య చేతిలో పడతాడు. ఆ టెలిఫోన్ కూడా సూర్య చేతిలో పడేసరికి కథ ఇంకో మలుపు తిరిగి ఫన్ గా మారుతుంది.
ఈ సెకండాఫే కథ ఆగిన చోటే మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళి, ఇంకో రూపంలో రిపీటవడంతో - టైమ్ లూప్ స్క్రీన్ ప్లేగా, సర్క్యులర్ స్క్రీన్ ప్లేగా మారిపోయి మూడ్ చెడగొడతుంది. అర్ధం జేసుకోవడానికి భారంగా మారుతుంది. టైమ్ ట్రావెల్ జానర్లో ఈ కొత్త గా అన్పింఛే సైన్ ఫిక్షన్ కథని మళ్ళీ ఇన్ని క్రియేటివిటీలతో సంక్లిష్టం చేయనవసరం లేదు. దీన్ని దాటేసే ప్రయత్నం చేస్తూ ఎస్ జె సూర్య కామెడీ లేకపోతే, విశాల్ నటించిన ఈ సినిమా కూడా చాలా ప్రమాదంలో పడేది.
అయితే విశాల్ ని ఎస్ జె సూర్య కామిక్ విలనీతో డామినేట్ చేశాడు. సూర్య లేకపోతే ఈ మైండ్ లెస్ కామెడీ ఫెయిలయ్యేది. సెకండాఫ్ లో యంగ్ విశాల్ చాలా సేపు కనిపించకపోవడంతో, ఆ లోటుని సూర్యయే తెగ నవ్వించే విలనీతో భర్తీ చేశాడు.
హీరోయిన్ రీతూవర్మ మాత్రం ఎప్పుడో గానీ కనిపించదు. ఈ సూపర్ ఫాస్ట్ యాక్షన్ థ్రిల్లర్ లో ఆమెతో రోమాన్స్ కి, సాంగ్స్ కీ చోటు లేదు. వుంటే స్పీడ్ బ్రేకర్స్ లా బోరు కొట్టేవేమో. విశాల్ తల్లిగా అభినయది చిన్న పాత్ర. విశాల్ తో వుండే కమెడియన్ రెడిన్ కింగ్స్లే కి ఈసారి ఆశాభంగం తప్పలేదు. సూర్య లేకపోతే అతడి కామెడీని ఎంజాయ్ చేయొచ్చు. సూర్య వుండేసరికి అతడి టక్కుటమారాలు పనిచేయలేదు.
సునీల్ పోషించిన గ్యాంగ్ స్టర్ పాత్రకి మంచి -చెడు రెండు షేడ్స్ వున్నాయి. రెండిట్లో ప్రూవ్ చేసుకున్నాడు. సైంటిస్టుగా దర్శకుడు సెల్వరాఘవన్ ఈసారి ముఖం కని పించని గడ్డం మీసాలతో గుర్తు పట్టలేకుండా, తన విలక్షణ నటనని ప్రేక్షకులు ఎంజాయ్ చేయకుండా జాలిగా మిగిలిపోయాడు.
జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, అభినందన్ ఛాయాగ్రహణం సినిమాకి హైలైట్స్ గా నిలుస్తాయి. ప్రొడక్షన్ క్వాలిటీకి భారీగా ఖర్చు పెట్టారు. అలాగే ఐదుగురు యాక్షన్ డైరెక్టర్లతో ఈ నాన్ స్టాప్ యాక్షన్ థ్రిల్లర్ ని దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ కొత్త తరహాలో ప్రేక్షకుల ముందుంచాడు. ‘తుప్పరివాలన్’ తర్వాత విశాల్ కెరీర్ లో ఇదొక వెరైటీ సినిమా అనొచ్చు!
—సికిందర్