రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, November 17, 2017

549 : రివ్యూ!



రచన దర్శకత్వం : హెచ్. వినోద్
తారాగణం : కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్, అభిమన్యు సింగ్, బోస్ వెంకట్, స్కార్లెట్ మల్లేష్ విల్సన్, మాథ్యూ వర్గీస్, జమీల్ ఖాన్, రోహిత్ పాఠక్ తదితరులు
సంగీతం : జిబ్రాన్, ఛాయాగ్రహణం : సత్యన్ సూర్యన్, యాక్షన్ : దిలీప్ సుబ్రమణ్యన్
బ్యానర్ : డ్రీమ్ వారియర్ పిక్చర్స్ , రిలన్స్ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు : ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా
విడుదల : నవంబర్ 17, 2017
***
        తమిళ స్టార్ కార్తీ మరోసారి పోలీస్ పాత్రతో వచ్చాడు. తమిళ మాతృకకి తెలుగు టైటిల్ అంత కొత్తగానూ బలంగానూ లేకపోయినా (‘కీ’ అని  దీర్ఘం కూడా లేకపోయినా), నాన్ స్టాప్ యాక్షన్ పోషిస్తూ తన రొటీన్ మసాలాకి భిన్నంగా రియల్ పోలీసు అయ్యాడు. ఎన్నో పోలీసు సినిమాలు వచ్చాయి. వాటిలో ఏముంటుందో తెలిసిందే. ముఖ్యంగా ‘సిన్సియర్ పోలీ సాఫీసర్ని’ అన్నగొప్ప  డైలాగు ఖంగు మంటుంది. అవెంత సిన్సియర్ సినిమాలో చూస్తూనే వుంటాం. కార్తీ ఇంకా కొత్తగా ఏం చూపించాడన్నదే ప్రశ్న. ఎలా వుంటాయో తెలిశాక ఎందుకు మరో పోలీసు సినిమా చూడాలి. ఇందులో వున్న ప్రత్యేకత లేమిటి? ఆ ప్రత్యేకతలు ఎంతవరకూ అర్ధవంతంగా వున్నాయి?...ఇవన్నీ తెలుసుకుందాం.
కథ 
      ధీరజ్ ( కార్తీ ) చనిపోయిన తండ్రి బాటలోనే పోలీసాఫీసర్  అవాలనుకుంటాడు. ఆ సంబంధమైన ట్రైనింగు వగైరా పొంది ఇంటికొస్తాడు. ఇంట్లో చెల్లెలు, తల్లీ వుంటారు. పక్కింట్లో చదువబ్బక ఫెయిలవుతున్న ప్రియ (రకుల్ ప్రీత్ సింగ్) వుంటుంది. ఈమెని చూడగానే ప్రేమలో పడి, చదువు నేర్పుతూ ఆమె ప్రేమలో పడేట్టు చేసుకుంటాడు. పెళ్ళయిపోతుంది. 

          ధీరజ్ కి డీఎస్పీ గా పోస్టింగ్ వస్తుంది. తన దుందుడుకుతనంతో అన్ని చోట్లా ట్రాన్స్ ఫరవుతూంటాడు. తాజాగా చెన్నై దగ్గరలో తిరువళ్ళూరుకి బదిలీ అవుతాడు. అక్కడ ఒక ఎమ్మెల్యే హత్యకి గురవుతాడు.  కౄరుడైన దోపిడీ దొంగ  ఓంవీర్ ( అభిమన్యు సింగ్) ముఠా సభ్యులు ఈ హత్యచేసి ఇల్లు దోచుకుంటారు.  గత పదేళ్లుగా రాజస్థాన్ కి చెందిన ఈ ముఠా దోపిడీలూ హత్యలూ చేసి తప్పించుకుంటోంది. దీన్ని పట్టుకోవడానికి రంగంలోకి దిగుతాడు ధీరజ్. ఈ క్రమంలో ఏఏ ప్రయత్నాలు చేశాడు, ఏఏ  ప్రమాదాలెదుర్కొన్నాడు, చివరికి పట్టుకున్నాడా లేదా అన్నది మిగతా కథ.

ఎలా వుంది కథ 
      తమిళనాడులో జరిగిన నిజ కథ అన్నారు. 1995 – 2005 మధ్యకాలంలో పోలీసులకి సమస్యగా పరిణమించిన  దోపిడీ ముఠాని ప్రాణాలకి తెగించి రాజస్థాన్ వెళ్లి పట్టుకున్న ఓ తమిళనాడు  పోలీసాఫీసర్ కేసు రికార్డే ఈ కథ. కర్ణాటకలో ఇలాటి కిరాతక ముఠా కథతో దండుపాళ్యం అనే సినిమాలొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుత ముఠాకి హాజ్ పుత్ వంశానికి చెందిన హవేలీల ముఠా అని ఏదో కల్పిత పేరిచ్చారు (రాజస్థాన్ లో రాజ్ పుత్ లు, హవేలీలూ ధ్వనించేలా ).  అయితే అసలు మూలాల్లోకి వెళ్లి  శతాబ్దాల కొంత చరిత్ర కూడా చెప్పుకొచ్చారు. థగ్స్ లేదా తెలుగులో థగ్గులు అనే ఈ హిందూ ముస్లిం కిరాతక నేరస్థముఠాలు ఆరు శతాబ్దాల క్రితం పుట్టాయి. ఎన్నో తెగలుగా విడిపోయి ఉత్తరాన వివిధ రాష్ట్రాల్లో చెలరేగాయి. ఓ ఇరవై లక్షల మందిని చంపేశాయి. చివరికి బ్రిటిష్ పాలకులు ఈ సంచార నరహంతక దోపిడీ ముఠాల్ని తుదముట్టించినా,  అక్కడక్కడా ఇంకా వారసులు ఉనికిని చాటుకుంటూనే వున్నారు. అమీర్ ఖాన్ నటిస్తున్న ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ ఈ కథే. ప్రస్తుత కథకీ ఈ చారిత్రక నేపధ్యంతో ఒక విలువ వచ్చింది. ఇలాటి ఆలోచనలు తమిళులకే వస్తాయి. తెలుగూస్ కి రానేరావు.


ఎవరెలా చేశారు 
      మసాలా పోలీసులా కాకుండా కార్తీ సమాజంలో పోలీసులా కనపడతాడు. బాధపడతాడు. కష్టపడతాడు. కసి పెంచుకుంటాడు. విజయవంతంగా డ్యూటీ పూర్తి చేస్తాడు. నాన్ స్టాప్ యాక్షన్తో వేడి పుట్టిస్తాడు. హీరోయిన్ తో రోమాన్స్ చేస్తాడు. పాటలు పాడడు, డాన్సులు చెయ్యడు. ముఠాలతో తన రొటీన్ కామెడీ ఫైట్లు చెయ్యడు. రాజస్థాన్ లో తమిళనాడు పోలీసు బృందానికి  నాయకత్వం వహించే సీరియస్ డీఎస్పీ గా కన్పిస్తాడు. ఐతే ఇదే రాజస్థాన్ బీడు భూముల్లో  ‘సర్ఫరోష్’ లో తన టీముతో యాంటీ టెర్రర్ ఆపరేషన్ నిర్వహించే ఎసిపి పాత్రలో అమీర్ ఖాన్ అంత పవర్ఫుల్ అయితే కాదు, కానీ ఫర్వాలేదు. 

          రకుల్ ప్రీత్ సింగ్ ఇంటి దగ్గర ప్రియురాలి హొయలు పోతూ, ఆపైన ఇల్లాలి కళలు పోతూ, కథకి అవసరం లేని హోమ్లీ పాత్రలో  ఫ్యామిలీ ఆడియెన్స్ ని పట్టేయాలని తెగ కృషి చేసింది. ఇదంతా మనకి ఖుషీ కాకుండా పోయింది. ఎందుకో తర్వాత తెలుసుకుందాం. థగ్గుల చరిత్రకి ప్రతినిధి అయిన ముఠా నాయకుడు ఓంవీర్ గా నటించిన ప్రద్యుమ్న సింగ్ పాత్రే మంటగలిసి పోయింది. అసలు ముఖ్యంగా నిలబెట్టాల్సిందీ, బాగా ప్రొజెక్టు చేయాల్సింది ఈ పాత్రనే. 

          మిగిలిన పాత్రల్లో తమిళులకే కొత్త వాళ్ళు ఎక్కువ. కాబట్టి మనకీ కొత్తే. అందరూ ఆయా పోలీసు, దోపిడీ ముఠాల పాత్రల్లో బాగా చేశారు. మహమ్మద్ జిబ్రాన్ నేపధ్య సంగీతం ‘హైపర్’ తర్వాత మళ్ళీ ఇంకోసారి నరాల మీద సమ్మెట పోట్లు. సినిమాలో ఇంకేమీ కనపడకూడదనీ, తనే వినపడాలనీ తపన చాలా వున్నట్టుంది.  దాదాపు ముప్పాతిక భాగం హై ఓల్టేజి యాక్షన్ సీన్లే వున్న ఈ మూవీకి సత్యన్ సూర్యన్ కెమెరా, దిలీప్ సుబ్రమణ్యన్ యాక్షన్ కోరియోగ్రఫీ అద్భుతంగానే వున్నాయి. ఈ రీసెర్చి సహిత భారీ పోలీస్ యాక్షన్ మూవీ దర్శకుడు వినోద్ కి రెండో సినిమా. అయితే ఈ మొత్తం ప్రయత్నంలో మిస్సింగ్ ఇన్ యాక్షన్ అనదగ్గవి రెండున్నాయి. ఇవి కూడా వుంటే ఇంకో మెట్టు పైనుండేది ఈ ప్రయత్నం. అవేమిటో కింద చూద్దాం. 

చివరికేమిటి 
     పోలీస్ ప్రోసీజురల్ జానర్ ని రొటీన్ యాక్షన్ జానర్ లో తీస్తే చాలా ఇబ్బంది వస్తుంది. యాక్షన్  హోరులో పాత్ర చిత్రణలు గల్లంతై
పోతాయి. వాటి మీద ఫోకస్ వుండదు.  వాటికి తగినంత స్పేస్ వుండదు. పక్కా  యాక్షన్ అయితే  ఇవి అంతగా అవసరంలేదు. కానీ ఓ రియల్ పోలీసు కేసు చూపిస్తున్నప్పుడు- ఆ రియల్  పోలీసాఫీసర్ పడే మానసిక సంఘర్షణ, బాధల చిత్రణ హత్తుకోవాలి. అప్పుడే నిజ సంఘటన సార్ధకమవుతుంది. ఇదేమీ ఇక్కడ కన్పించదు. కథకి అవసరం లేని ప్రియుడిగా, భర్తగా హీరోని చూపించడం మీదే ఏదో బాక్సాఫీసు ఆదుర్దా పడిపోయారు. దీంతో ఏమైందంటే ఒక రొమాంటిక్ సీను, ఒక యాక్షన్ సీను, ఒక కామెడీ సీను ... మళ్ళీ ఒక రొమాంటిక్ సీను, ఒక యాక్షన్ సీను, ఒక కామెడీ సీను...ఇలా పూరీ జగన్నాథ్ స్టయిల్లో అవే రిపీటయ్యే తతంగమే నడిచింది. సెకండాఫ్ లో సీరియస్ యాక్షన్ సీన్స్ మధ్య  కూడా – హీరో ఇంటిదగ్గరున్న హీరోయిన్ని వూహించుకునే షాట్స్ , లేదా హీరోయిన్ హీరోని  వూహించుకునే షాట్స్ సడెన్ గా  వచ్చి పడుతూంటాయి. చాలా చిరాగ్గా వుంటుంది డైరెక్షన్. ఫ్యామిలీ చూపించక పోతే ఆడియెన్స్ ఏమనుకుంటారో ఏమో నన్న కంగారే  ప్రవర్థమాన మవుతూంటుంది అంతటా. 

          ఇక ప్రద్యుమ్న సింగ్ క్యారక్టర్. అంత చారిత్రక నేపధ్యం చెప్పిన ఈ పాత్రకి కథే లేకుండా పోయింది. కథంతా హీరో వైపు నుంచి ఏక పక్షమే. ఇతను వెంటాడడం, అతను పారిపోవడం. పారిపోతూ వుండే దొంగోడి పాత్రకి పరిమితం చేశారు. ఒక దశ కొచ్చేటప్పటికి ఈ మొనాటనీ సినిమాలో విషయం లేదనే ఫీలింగ్ కి దారి తీస్తుంది. శతాబ్దాల నాటి థగ్గులు  అని యానిమేషన్స్ తో చరిత్ర చెప్పి వదిలేస్తే అయిపోతుందా. ఇప్పుడు చూపిస్తున్న థగ్గులకి పాత్రచిత్రణ, వాళ్ళ జీవితాలు, కుటుంబ సంబంధాలు, సామాజిక సంబంధాలు, మానసిక లోకం, ఆశయాలు, గమ్యాలు... ఇవన్నీ చూపించి ఒక అవతలి పక్షం కథగా ఎష్టాబ్లిష్ చేసినప్పుడే వాళ్ళు కూడా అర్ధమై మొత్తం సినిమాలో    ఇన్వాల్వ్ అవగలం. 

          ‘షోలే’ లో గబ్బర్ సింగ్ పుట్టుపూర్వోత్తరాలూ, ఎందుకు బందిపోటు అయ్యాడో ఫ్లాష్ బ్యాకూ  అవసరంలేదు. తనదైన ప్రత్యేక శైలిలో ఆ పాత్ర నటించడానికి, డైలాగులు పేల్చడానికి,  దోచుకోవడాని చంపడానికీ ఇచ్చిన చాలా స్పేస్ చాలు, అన్నీ కవరై పోతాయి. కానీ ఇక్కడ థగ్గు  పాత్రకి ఇదంతా ఏదీ?  గుంపులో ఒకడిగా సరిగ్గా రిజిస్టర్ కూడా కాడు. 


       ప్రద్యుమ్న పాత్రకి క్యారక్టర్ బయోగ్రఫీ లేకపోవడంతో, చోటు చేసుకున్న రెండో లోపం మొత్తం  కథలో ఎక్కడా సస్పెన్స్ లేకపోవడం. కథా కథనాలు పోలీసుల వైపు నుంచి ఏక పక్షమైనప్పుడు సస్పెన్స్ ఎలా క్రియేటవుతుంది. 

          అమీర్ ఖాన్ ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ వస్తున్న నేపధ్యంలో,  వినోద్ తీసిన ‘ఖాకీ’ ఇంకో మెట్టు పైనుండాల్సింది.

-సికిందర్  
https://www.cinemabazaar.in



548 : రైటర్స్ కార్నర్







        హాఫ్ గర్ల్ ఫ్రెండ్,  నూర్, కభీ కభీ ఆల్వేస్, మేరే డాడీకీ మారుతీ, బ్యాంక్ చోర్ లాంటి సినిమాలతో రచయిత్రిగా ముందుకు దూసు కెళ్తున్న ఇషితా మొయిత్రా సంభాషణల రచయిత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె రాసే సంభాషణలకి చిన్నప్పట్నుంచీ తెలియకుండానే ఆమెకి ప్రిపరేషన్ వుంది. ఇప్పటి ట్రెండ్ కి అనుకూలంగా రాయడానికి ఆ ప్రిపరేషనే పనికొచ్చింది. ఇంతేగాక వివిధ జానర్ మర్యాదల్ని  కూడా దృష్టిలో పెట్టుకుని ఆ ప్రకారం డైలాగులు రాయడంలో ఆరితేరారు. ఆమె ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో వృత్తి సంబంధమైన ఆసక్తికర అంశాలెన్నో కూడా ప్రస్తావించారు. అవేమిటో చూద్దాం...

మీ నేపధ్యం గురించి చెప్పండి.  మీరెలా రంగంలోకి వచ్చారు? మీరు దేశంలో వివిధ ప్రాంతాల్లో నివసించిన అనుభవం మీ డైలాగ్ రైటింగ్ మీద ఏమైనా ప్రభావం చూపిందం
టారా?
          తప్పకుండా ప్రభావం వుంది. పది వేర్వేరు ప్రాంతాల్లో పది స్కూళ్ళలో  చదివాన్నేను. వివిధ భాషల్ని ఇట్టే  పట్టేయడం చిన్నప్పుడే అలవాటయ్యింది. పట్టేసుకుని అలాగే మాట్లాడేదాన్ని. ఇరవై ఏళ్ళు వచ్చేటప్పటికల్లా నేను డైలాగ్ రైటర్ ని అవడానికే ఈ ప్రిపరేషన్ అంతా అని నాకు అన్పించింది.  అమృత్ సర్ లో వున్నప్పుడు పంజాబీ చదవడం, రాయడం నేర్చేసుకున్నాను. సిక్కింలో వున్నప్పుడు అక్కడ నేపాలీ ఎలా మాట్లాడతారో  అది పట్టేసుకున్నాను. మనం ఎక్కడి కెళ్ళినా అక్కడ మాట్లాడే స్థానిక భాష ఒకటుంటుంది. హిందీకి చాలా మాండలికాలున్నాయి. అవి దాదాపు నాకు తెలుసు. ఇక మా ఆయన సింధీ కావడంతో అదీ వచ్చేసింది. ఇవన్నీ కలిసి నన్ను మాటల రచయిత్రిని చేశాయను కుంటున్నాను. రాసే డైలాగులు చెక్కినట్టు వుండ కూడదని  నా అభిప్రాయం. యాదాలాపంగా వచ్చేయాలి. మనుషులు యదాలాపంగానే మాట్లాడతారని గమనించాను.
రచయితలకి ఇప్పుడు గతంలో కంటే అవకాశాలు పెరిగాయని అంటున్నారు. రచనా రంగంలోకి రావాలంటే ఇప్పుడు తగిన సమయం అంటారా? సినిమాలు,  టీవీ,  వెబ్ సిరీస్, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ...ఇన్ని ముఖాలుగా విస్తరించింది రచనారంగం.
          కచ్చితంగా ఇది మంచి కాలం. ముందు ఇంకా చాలా మంచి కాలం వుంటుంది. అవకాశాలు బాగా పెరుగుతాయి. ఎన్నెన్నో రకాల కథలు కావాలిప్పుడు. టీవీలో చూస్తే ఫాంటసీలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రకాంత, నాగిన్ లాంటి ఫాంటసీలు రాయడానికి ఫాంటసీ రచయితలు కావాలి. టీవీలు ఇప్పుడు విభిన్న కథలకి వేదిక లవుతున్నాయి. అవి రాసేవాళ్ళు కావాలి. ఒకప్పుడు పాకిస్తాన్ టీవీల్లో ప్రసారమైన పది ఎపిసోడ్ల మినీ సిరీస్ కథలు ఇప్పుడు వెబ్ సిరీస్ కి స్ఫూర్తి నిచ్చాయి. సినిమాల విషయాని కొస్తే దంగల్, బాహుబలి లాంటి మెగా మూవీస్ దేశం బయట అనువాదాలతో మార్కెట్ ని విస్తరించుకుంటూ,  ఆయా భాషల రచయితలకి అవకాశాలు కల్పిస్తున్నాయి. కనుక ఇప్పుడున్నది మంచికాలమే, రచయితలవడానికి మంచి సమయం.

సినిమాల్లో రచయితలకి తగిన విలువా గౌరవం వుండవనీ,  పారితోషికాలు కూడా తక్కువేననీ ఎప్పట్నించో వింటున్న మాట. గత కొన్ని సంవత్సరాలుగా ఇది బాగా చర్చ కొస్తోంది. ఇప్పుడు పరిస్థితిలో ఏమైనా మార్పు వచ్చిందంటారా?
          సినిమాల్లోకి నేనొచ్చినప్పుడు నాకో అభిప్రాయముండేది. స్క్రిప్టు కూడా వుండదనీ, షూటింగ్ చేసుకుంటూ రాసుకుంటారనీ... కానీ చూస్తే అలా లేదు. నేను పని చేసిన సినిమాలకి షూటింగ్ డ్రాఫ్ట్ లేకుండా షూటింగ్ కి వెళ్ళలేదు. బయటి వాళ్ళు అనుకున్నట్టు గాక ఇక్కడంతా పద్ధతిగానే వుంది. రచయితల్ని చిన్న చూపు చూడ్డం లేదు. కార్పొరేట్ సంస్థలు వచ్చాక రచయితలకి అన్నీ మంచి సౌకర్యాలే లభిస్తున్నాయి డబ్బు సహా. పాత బ్యానర్లు కూడా కార్పొరేట్ సంస్కృతిని అవలంబిస్తున్నాయి. కాబట్టి అంతా ప్రొఫెషనల్ గానే వుంది. రచయితల్నే కాదు, టెక్నీషియన్లని కూడా గౌరవంగా చూస్తున్నారు. పైగా మాకు చాలా స్ట్రాంగ్ రైటర్స్ అసోసియేషన్ వుంది. ఇప్పుడిప్పుడే లీగల్ టీం కూడా ఏర్పాటయ్యింది. కాబట్టి రచయితలు  తమ కాంట్రాక్టులకి ఫ్రీ రీడింగ్ తో బాటు, ఇంకేవైనా  సమస్యలు వస్తే ఉచితంగా లీగల్ టీం సాయం పొందవచ్చు.
మీరొకసారి అన్నారు - మీరు వచ్చినప్పుడు దాదాపు రచయిత్రులు లేరని.  ఇప్పుడు యాభై శాతం కన్పిస్తున్నారు. ఇది నిజమేనా?
          నిజమే. నేను వచ్చినప్పుడు శివానీ భతీజా వున్నారు. ఫనా, మైనేమ్ ఈజ్ ఖాన్ రాశారు. ఆవిడ పెద్ద రచయిత్రి. ఆవిడ తప్ప మిగిలిన వాళ్ళు రచయితలే కన్పించేవారు. దర్శకురాళ్ళు కూడా అప్పుడు ఇద్దరే - ఫరా ఖాన్, రీమా కాగ్తీ.  రాన్రాను ఈ దశాబ్ద కాలంలో ఎలా జరిగిందో, విరివిగా రచయిత్రులొచ్చేశారు. ఒక బిగ్ మూవీకీ స్క్రీన్ ప్లేకి ఒకరు, డైలాగ్స్ కి ఒకరుంటే, వాళ్ళల్లో ఒకరు రచయిత్రి వుంటున్నారు. ఇందుకే అనుకుంటా, ఇప్పుడు విమెన్ మూవీస్ ఎక్కువ వస్తున్నాయి. ఒక స్త్రీగా నాకొచ్చే మొట్ట మొదటి ఆలోచన - హీరోయిన్ ఓరియెంటెడ్ కథ రాయాలనే.
రచయిత్రుల్ని సీరియస్ గా తీసుకోరని మీకెప్పుడైనా అన్పించిందా? ఒక సక్సెస్ ఇస్తే అన్నీ చక్కబడతాయని అన్పించలేదా?
          జండర్ ని బట్టి ట్రీట్ చేస్తారనుకోను. మేం రచయిత్రులమే రావడం సరైన టైంలో వచ్చాం. కాలం మారుతున్న తరుణంలో వచ్చాం. మేం  లేడీస్ సినిమాటోగ్రాఫర్స్ గా వెళ్తే ఒకప్పుడు సమస్య లొచ్చేవి. ఎందుకంటే సాంప్రదాయపరంగా కొన్ని పనులు పురుషులకే పరిమితమయ్యాయి. ఇప్పుడలా లేదు. జండర్ గోడ తొలిగిపోయి ఎందరో కెమెరా వుమన్ లున్నారు. అసలు రైటింగ్ నే  ఆడవాళ్ళ పనిగా అంటగట్టినట్టు నా అనుమానం. చాలామంది అంటారు - రైటింగ్ మే ఆప్ కో కోనే మే బైఠ్ కర్ చుప్ చాప్ కామ్ కర్నాహై ( చప్పుడు చేయకుండా మూల కూర్చుని చేసుకునే పని రాసుకునే పని) కాబట్టి అది మా లేడీస్ కి కరెక్ట్ అనుకుంటారు. లడ్కియాఁ శాంత్ హోతీ హై – ( అమ్మాయిలు శాంతంగా వుంటారు) అని ఇంకో అభిప్రాయం.  కాబట్టి కుదురుగా కూర్చుని రాసుకుంటారనుకుంటారు. కాబట్టి రైటర్స్ గా  మాకు సమస్యలు ఎదురు కావు. ఐతే సక్సెస్ ఇస్తేనే వర్క్ వుంటుందనేది కూడా నిజం.

డైలాగ్ రైటర్ కి కొన్ని పరిమితులుంటాయి. ఇచ్చిన స్క్రీన్ ప్లే లో  సెట్ చేసిన సీన్లకి డైలాగులు రాయాలి. ఇది మీ స్వేచ్ఛకేమైనా అడ్డా?
          నిజానికి డైలాగ్ రైటర్స్ కి స్క్రీన్ ప్లే మీద కొంత అధికారముంటుంది. కొన్ని మార్పు చేర్పులు మేం చేయక తప్పదు. వృత్తిలో భాగమే అది. చాలా ఛాలెంజింగ్ గా వుంటుంది. ఎక్సయిటింగ్ గా కూడా వుంటుంది. ఆ కొత్త కథా ప్రపంచాల్లోకి నేనెళ్ళి, అక్కడి పాత్రల్లో నేనొక దాన్నయి, అవెలా మాటాడితే నప్పుతుందో ఆలోచించడం ఎక్సయిటింగ్. అలా ఆ ప్రపంచాల్ని నేను ఓన్ చేసుకున్న
ప్పుడు అవి నా  సీన్లయి పోతాయి. కొంత అధికారం వచ్చేస్తుంది. ఇక ఏ జానర్ కా జానర్ ని దృష్టిలో పెట్టుకుని రాయాలి. నూర్ లాంటి ఓ జీవిత పార్శ్వం కావొచ్చు, హాఫ్ గర్ల్ ఫ్రెండ్ లాంటి మెయిన్ స్ట్రీమ్ డ్రామా కావొచ్చు. దేనికదిగా ఫ్లేవర్ తో సంభాషణలు రాయాలి. ఇదొక ఛాలెంజి.
మీకిచ్చిన కథ తీరు ఎప్పుడైనా మీకు నచ్చక పోవడం జరిగిందా? అంతకంటే బాగా రాయవచ్చని అన్పించిందా?
          డైలాగ్ రైటర్ గా పూర్తీ స్క్రీన్ ప్లే అందుకుంటాను. దాన్ని చదివి చేపట్టాలా వద్దా నిర్ణయించుకుంటాను.  ఆకట్టుకోకపోతే డైలాగులు రాయను.
నూర్ లో శతాబ్దాల ఆక్రోశాన్ని మీ డైలాగులు అత్భుతంగా  వ్యక్తపర్చాయి. కానీ సెకండాఫ్ లో కొచ్చేసరికి లేనిపోని సామాజిక సందేశాలతో దారి తప్పినట్టుంది కథ. మీరెంత బాగా డైలాగులు రాసినా ఇతర కారణాల వల్ల సినిమా ఫ్లాప్ అయితే  మీకేమనిపిస్తుంది?
          కొన్నిసార్లు ఎం జరుగుతుందో చెప్పడం కష్టం. సినిమా నిర్మాణంలో నిమగ్నమై వున్న వాళ్ళు నిష్పాక్షికతని కోల్పోతారు.  ఎక్కడ తప్పు చేశారో విడుదలయ్యాక గానీ తెలుసుకోలేరు. అప్పుడు కూడా తప్పు ఒప్పుకోరు. సినిమా ఎలా వున్నా ణా దైలగులకి త్విత్తర్ లో మెసేజి లొస్తు న్నాయి ఇప్పటికీ.
మీరిక పూర్తి స్థాయి స్క్రీన్ ప్లే రైటర్ అవాలనుకోవడం లేదా?  స్క్రీన్ ప్లే, డైలాగులు రెండూ ఇలాగే కొనసాగించాలనుకుంటున్నారా?
          రెండూ చేస్తేనే కథని ఓన్ చేసుకోగలుగుతాను. బ్యాంక్ చోర్ కి స్క్రీన్ ప్లే రైటర్ గా  కూడా పేరు  పడింది. ఆ దర్శకుడూ నేనూ డైలాగుల్ని వర్కౌట్ చేస్తున్నప్పుడు అక్కడక్కడా స్క్రీన్ ప్లేమార్చాల్సి
వచ్చింది.  డైలాగ్ రైటింగ్ స్వతంత్ర జాబ్ కాదు. కతతోనూ ఆ తర్వాత స్క్రీన్ ప్లేతోనూ ముడుపడి వుండే పని.
డైలాగ్ రైటింగ్ గురించి వున్న అపోహలేమిటి?
          గటు ప్రేక్షకులు డైలాగులే స్క్రీన్ ప్లే అనుకుంటారు.  స్క్రీన్ ప్లేనే కథనుకుంటారు. కన్వ్యూజ్ అయిపోతారు. కొందరు నన్నిలా అడిగారు – హాఫ్  గర్ల్ ఫ్రెండ్ చేతన్ భగత్ రాశారు, ఇక మీరు చేసిందేమిటని. చేతన్ భగత్ హాఫ్ గర్ల్ ఫ్రెండ్ నవల రాస్తే ఇక మేం చేసేదేమీ వుండదా సినిమాకి? నవ్వి వూరుకున్నాను.
మీరు సినిమాలతో బాటు టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇలాగే ఇవన్నీ కలిపి చేయడం మీకెలా అన్పిస్తోంది?
          మొదట్లో కచ్చితంగా ఏ గోల్ తో వుండాలో తెలిసేది కాదు. మేరీ డాడ్ కీ మారుతీ మూవీకి రాశాక సినిమాలే నా కెరీర్ అవాలని నిశ్చయాని కొచ్చేశాను. నిజానికి నేను మెయిన్ స్ట్రీమ్  సినిమా లవర్ని. అందుకే ఇక్కడున్నాను. జామియా ఇస్లామియా యూనివర్శిటీ లో జర్నలిజం చేశాను. దాంతో న్యూస్ చానెల్ కెళ్ళవచ్చు. డాక్యుమెంటరీలు తీసి జాతీయ అవార్డులు అందుకోవచ్చు. నా ఫ్రెండ్స్ ఇదే చేస్తున్నారు.  కానీ నాకు కమర్షియల్ హిందీ సినిమాలే ప్రాణం. సినిమాలే గోల్ గా పెట్టుకున్నాను. ఓం శాంతి ఓం ఉదయం ఏడుంపావు ఆటకే  వెళ్లిపోయానంటే నా పిచ్చేమిటో మీకర్ధమవుతుంది. అలాటి సినిమాలే నాకిష్టం. ఎంటర్ టెయిన్మెంట్ తప్ప. పెద్ద పెద్ద సామాజిక సందేశాలు వుండకూడదు. రోజులలాగే వున్నాయి మరి – పాప్ కార్న్ ఖావో, కాఫీ పియో, పిక్చర్ దేఖో!
ఇప్పుడు  డైలాగ్స్ పరంగా మార్పేమైనా వచ్చిందా? మీరెలాటి డిమాండ్స్ ఎదుర్కొం
టున్నారు. ఇప్పుడు నాటకీయత తగ్గి సహజత్వం కోరుకుంటున్నారా నిర్మాటలు?
          మేకప్ చేసుకోవడం ఎలాగో డైలాగులు రాయడం అలాగ. మనం మేకప్ వేసుకుంటే మేకప్ వేసుకున్నట్టు వుండకూడదు కదా. అది రియల్ గా అన్పించదు, పైగా బోరు కొడుతుంది. డైలాగులు కూడా ప్రేక్షకులు రియల్ గా  ఫీలవ్వాలి, వాటికి  గ్రామర్ వుండవసరం లేదు.  నూర్,  హాల్ఫ్ గర్ల్ ఫ్రెండ్ రెండిటికీ వేర్వేరుగా రాశాను. హాల్స్ గర్ల్ ఫ్రెండ్ కి హై పిచ్ డైలాగులవసరం దాని జానర్ ని బట్టి. ఆ డైలాగుల్లో జీవితం తొంగి చూడనవసరం లేదు. సాంప్రదాయ సంభాషణలు అవసరం లేదు.  ఫిర్ భి తుమ్ కో చాహూంగా అంటూ పాట వుండనవసరం లేదు. నూర్ లో ఫ్రెండ్స్ మాట్లాడుకునేవి సహజమైన మాటలే. డైలాగుల్లా వుండవు. ఏ మూవీకా మూవీ టోన్ ని దృష్టిలో పెట్టుకుని రాయాల్సి వుంటుంది.
          (ఇషితా రాసిన కొన్ని డైలాగులు : చీజేఁ ఐసీ టూట్ తీ హై కీ ఉన్ కా దూబారా జుడ్నా పాసిబుల్ నహీ హోతా, సిర్ఫ్ దరాయేఁ రహె జాతీ హై – కొన్ని ఎలా విరిగి పోతాయంటే అవి తిరిగి అతుక్కోవడం సాధ్యం కాదు, పగుళ్ళు అలాగే  వుండిపోతాయి – ‘హాల్ఫ్ గర్ల్ ఫ్రెండ్’
          అగర్ యూ  ప్లేయింగ్ మే బి యూ లూసింగ్... మగర్ అగర్ యూ రన్నింగ్ అవే, తో యూ పక్కా లూసింగ్ – నువ్వాడితే ఆటలో ఓడిపోవచ్చు, కానీ పారిపోతే పక్కగా ఓడిపోతావ్- ‘హాల్స్ గర్ల్ ఫ్రెండ్’
            హమారీ లైఫ్ బస్ యహీ బన్ కే రహే గయీ హై...ఏక్ ఎస్సెమ్మెస్ జోక్, యా ఫిర్ ఏక్  స్టేటస్ అప్డేట్ – జీవితం ఇలా తయారైపోయింది- ఒక ఎస్సెమ్మెస్ జోకు,  లేదా ఒక స్టేటస్ అప్డేట్ – ‘ఆల్వేస్ కభీ కభీ’
          ముంబాయి యూ ఆర్ కిల్లింగ్ మీ...తూ భీ అందర్సే ఖోక్లీ ...మై భీ – ముంబాయ్!  చంపేస్తున్నావ్ నన్ను...నువ్వూ లోపల డొల్ల...నేనూ డొల్ల – ‘నూర్’
         
ఇస్ సాల్ మై సీధీ సావిత్రీ సే తేడీ సావిత్రీ బనూంగీ - ఈ సంవత్సరం నేను మంచ
మ్మాయి నుంచి చెడ్డమ్మాయి నవుతా – ‘నూర్’ )

ఇంకేవైనా మీకు లక్ష్యాలున్నాయా
          కచ్చితంగా ఏవీ లేవు. రాతపనే హాయిగా వుంది. ఆనందాన్నిస్తోంది, జీవితంలో అన్నీ ఇస్తోంది - యూరోపియన్ హాలిడేస్ సహా. కాకపోతే డెవలప్ అవుతూ వుండాలి, డిఫరెంట్ గా రాస్తూ వుండాలి. లేకపోతే  నాకే బోరు కొట్టొచ్చు ఈ వృత్తి.
డైలాగ్ క్రెడిట్స్ అంటూ మన దగ్గరే ఇస్తారు. గ్లోబల్ గా రైటర్లకి స్క్రీన్ ప్లే అనే ఇస్తారు. మన విధానం ఓకేనా?
          మనం  ఓరల్ గా కథలుచేప్పుకునే సంస్కృతి నుంచి వచ్చాం. రాసే ముందు కథలు నోటితో చెప్పుకుంటాం.  రామాయణమైనా సరే మౌఖికంగా ప్రచారమయ్యాకే రాతలో కొచ్చింది. కాబట్టి వాక్కుకి  చాలా విలువ వుంది. ఇంకా మనకి సాంగ్సూ డాన్సులూ అంటూ చాలా వుంటాయి. కాబట్టి మనకి డైలాగ్ రైటర్ అనే వాడు ప్రత్యేకంగా పుట్టాడు. నాకైతే స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రెండూ వేర్వేరు వృత్తు లన్పిస్తాయి. ఒకటి కుడి రెక్కయితే, మరోటి ఎడం రెక్క. మొత్తం కథా ప్రపంచానికి స్క్రీన్ ప్లే ఒక చదరంగం లాంటిది. ఎప్పుడే పావు కదపాలి, ఎలా ఆడాలి ఇదంతా ఒక ప్రహేళికలా వుంటుంది. డైలాగులు అలాకాదు, అవి సహజాతం నుంచి పలుకుతాయి. మన  సహజాతం నుంచి వచ్చిన డైలాగుల్ని అదే పనిగా దిద్దితే అవి చెడి పోతాయి. స్క్రీన్ ప్లేని తగినంత దిద్దకపోతే అదీ చెడ్డగా వస్తుంది. కాబట్టి రెండూ వేర్వేరు జాబ్స్. అందుకే స్క్రీన్ ప్లే మాత్రమే రాయడంలో రాణించిన వాళ్ళుంటారు, డైలాగులు మాత్రమే రాయడంలో ఆరితేరిన వాళ్ళుంటారు.
          ఇంకోటేమిటంటే,  స్క్రీన్ ప్లేని ఇంగ్లీషులో రాస్తారు. డైలాగులు హిందీలో రాసుకుంటారు. అందువల్లే  స్క్రీన్ ప్లే రాసే వాళ్ళు  నల్గురుంటారు. ఆ ఇంగ్లీషు స్క్రీన్ ప్లేకి హిందీ డైలాగులు రాయడానికి ఒక్కరే వుంటారు. డైలాగులకి ఎక్కువ మంది వుంటే క్యారక్టర్స్ ఒక విధానంలో మాటాడవు. క్యారక్టర్స్  ఒక విధానంలో మాట్లాడాలంటే ఒకరే డైలాగ్ రైటర్ వుండాలి. స్క్రీన్ ప్లే కి అలాకాదు, దానికి ఎందరున్నా వాళ్ళందరి ఇన్ పుట్స్ పనికొచ్చేవే.
 రివ్యూ రైటర్ల మీద మీ అభిప్రాయమేమిటి? రివ్యూలు చదువుతూంటారా?
         
చదువుతాను, కానీ పెద్దగా పట్టించుకోను. రివ్యూ అనేది ఒకరి అభిప్రాయం. నాకూ ఓ అభిప్రాయముంటుంది. పైగా నేను రివ్యూస్ ని కూడా రివ్యూ చేయగలను. రివ్యూలు రాసేవాళ్ళు  కొందరికి దర్శకుడో రచయితో అవాలని వుంటుంది. దాంతో తమలోని దర్శకుడు, లేదా రచయితా మైండ్ తో సినిమాలు చూస్తూంటారు. ఏమైనా అది వాళ్ళ అభిప్రాయం, నేను సీరియస్ గా తీసుకోనవసరం లేదు.


-ఏజెన్సీస్  

Wednesday, November 15, 2017

547 : సెకండాఫ్ సంగతులు!





 ప్పట్లో బ్రహ్మోత్సవం,కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్, డిక్టేటర్, బ్రూస్ లీ, జ్యోతి లక్ష్మి, సైజ్ జీరో, ఆటోనగర్ సూర్య, దొంగోడు, ధమ్... ఇప్పట్లో నిన్నే కోరి, నేనే రాజు- నేనే మంత్రి, గరుడ వేగ...ఇవన్నీ సెకండాఫ్ సిండ్రోమ్ పాలబడి ప్రశ్నర్ధకమయ్యాయి. కాకపోతే చివరి మూడు మాత్రం ఏదో అదృష్టం కొద్దీ గట్టెక్కాయి. ఈ సిండ్రోమ్ ఎలా ఏర్పడుతుందో తెలిసిందే. ఫస్టాఫ్ లో  చెప్పిన పాయింటు సెకండాఫ్ లో వేరే కథగా మారిపోవడం ఎక్కువగా జరుగుతూంటుంది. అలాగే ఇంటర్వెల్ నిర్వహణ సరిగా లేకున్నా జరుగుతుంది. గరుడ వేగది ఇంటర్వెల్ సమస్యే నని గత వ్యాసంలో చెప్పుకున్నాం. ఇంటర్వెల్లో ప్రేక్షకుల్ని ఆపకుండా కథనే ఆపేశారు. లేదా ఫస్టాఫ్ లో చెప్పుకొస్తున్న టెర్రరిజం విషయం ముగించారు. ఇక్కడ్నించీ సెకండాఫ్ ఏమిటి? ఇంటర్వెల్లో ప్రేక్షకుడు ఏమాలోచిస్తాడు? ఇక పట్టుబడ్డ నిరంజన్ అయ్యర్ ని సెకండాఫ్ లో ప్రశ్నిస్తారు, అతను టెర్రర్ నెట్వర్క్ గుట్టు విప్పుతాడు, ప్రతాపరెడ్డిని ఎందుకు చంపాలనుకున్నారో చెప్తాడు, అప్పుడా మొత్తం టెర్రర్ నెట్వర్క్ ని హీరో నాశనం చేస్తాడు- ఇంతేగా?

          థ తెలిసిపోతూ ఇంటర్వెల్ కి ఇవిఆసక్తి కల్గించే అంశాల్లా లేవు. అసలిలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే - ఈ కథ టెర్రరిజం గురించి కాదు, వేరే రాజకీయ కుట్రల కథ కూడా కాదు, ఒకేవొక్క ప్లుటోనియం  మైనింగ్ మాఫియా కథ. దీన్ని ఎక్కడా బయట పెట్టకుండా సెకండాఫ్ లో ఇంకో అరగంట వరకూ దాచిపెడితే బోలెడు సస్పన్స్ ని సృష్టించ వచ్చను కున్నారు. అంటే ఎండ్ సస్పెన్స్ అన్నమాట. ఎండ్ సస్పెన్స్ అవుతుందని తెలియక చేయడమన్న మాట. అందుకని టెర్రరిజం కథలా ఫస్టాఫ్ లో పూర్తిగానూ, రాజకీయ కుట్ర కథలా సెకండాఫ్ లో కొంతవరకూ నడిపేస్తే సరిపోతుందనుకున్నారు. అదే చేశారు. కథ చెప్పకుండా కథ నడపలేరు కాబట్టి ఈ పిట్ట కథలతో కవరింగు, మభ్యపెట్టడాలు, తప్పుదోవ పట్టించడాలు,  ప్రేక్షకుల్ని ఫూల్స్ చేయడాలూ వగైరా వగైరా. కథ చెప్పడమంటే ముందు పాయింటు చెప్పడమే. పాయింటుని  దాచి కథ నడపాలనుకుంటే, ఇలా ఎండ్ సస్పన్స్ అయి  గరుడ వేగ అవుతుంది. 

          సింగం త్రీ వుంది. అందులో పాయింటు ఆస్ట్రేలియా నుంచి చట్టవ్యతిరేకంగా బయలాజికల్, ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు తెచ్చి మన దేశంలో పారబోసే కుట్ర. స్పైడర్ వుంది. అందులో మనుషుల్ని చంపి వాళ్ళ బంధువులు భోరున ఏడుస్తూంటే ఆ శబ్దాన్ని ఆనందించే సైకో కుట్ర. వివేకం వుంది. ఇందులో
 కార్పొరేట్ శక్తులు అణుశక్తితో ప్రపంచంలో భూకంపాల్ని సృష్టించి వ్యాపారం చేసుకోవాలనుకునే కుట్ర. లై వుంది. ఇందులో చాలా పూర్వం నుంచీ నేరాలు చేసి  తప్పించుకుంటున్న మాస్టర్ క్రిమినల్ ని పట్టుకునే ప్రయత్నం. ఇవేవీ ఎండ్ సస్పెన్సు లు కావు. ఇవన్నీ మనకి ముందు ఫస్టాఫ్ లో నే చెప్పేసి కథ నడుపుతారు. అయినా ఇవి ఫ్లాపయ్యాయంటే వేరే కారణాలున్నాయి : సింగం త్రీ లో పిచ్చి పిచ్చి షాట్లతో టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ తలనొప్పి తెప్పించడం, స్పైడర్ లో హీరోకన్నా విలనే హీరో అయిపోవడం, వివేకంలో ఇంటర్వెల్ నుంచి మిత్ర ద్రోహం కథగా మారిపోవడం, ఇక లై లో విలన్ ఎప్పుడో నేరాలు చేశాడని అనడమే గానీ, ఇప్పుడు కథలో ఒక్క  కుట్ర కూడా  చేయకపోవడం!

         
Caring + Story Telling x Sincerity = CONNECTION  అని ఒక ఈక్వేషన్ వుంది. గరుడ వేగలో ముఖ్యంగా చివరిదైన సిన్సియారిటీ లోపించడం వల్ల ( ఉన్నదున్నట్టు కథ చెప్పకుండా వేరే కథనాలతో మభ్యపెట్టడం) మొదటి రెండూ సాధ్యంకాక, సెకండాఫ్ ప్రేక్షకులతో కనెక్షన్ తెగిపోయింది. సెకండాఫ్ లో ఇంకొక విచిత్రమేమిటంటే,  యాక్షన్ సీన్లు మైండ్ లెస్ గా వుండడం. మైండ్ లెస్ కామెడీలకి నవ్వుకోగలం. ఇంత హెవీ యాక్షన్ మూవీలో  మైండ్ లెస్ యాక్షన్ కి కూడా నవ్వుకోవాలా?

ఇంతకీ ఏముంది సెకండాఫ్ లో?
        సెకండాఫ్ మూడు ఎపిసోడ్లుగా వుంది. రాజకీయ కుట్రని చెప్పి నిరంజన్ ని వేరే జైలుకి తరలించే మొదటి ఎపిసోడ్, హీరోతోబాటు తప్పించుకున్న నిరంజన్ ని చంపే ప్రయత్నపు రెండో ఎపిసోడ్, విలన్ షిప్ లో బయల్దేరిపోతున్నాడని అడ్డుకునే మూడో ఎపిసోడ్ .

             మొదటి ఎపిసోడ్ : ఛానెల్స్ లో ప్రతాపరెడ్డి మీద బాంబు దాడి కుట్రని భగ్నం చేశారని ప్రకటనలు. ప్రతాపరెడ్డి ని చూపిస్తే అతను ఇది రాజకీయ కుట్ర అనీ, రూలింగ్ పార్టీయే చేసిందనీ  ఆరోపిస్తూ చిందులేస్తాడు. ఇది  టీవీలో చూస్తున్న విలన్ కన్పిస్తాడు. నిరంజన్ ఇంటరాగేషన్ మొదలవుతుంది. ఒక లాయర్ వచ్చి నిరంజన్ తో డీల్ కుదుర్చుకుంటాడు. సుల్తాన్ బజార్ లో రషీద్ సుల్తాన్ అనే టెర్రర్ గ్రూపు దగ్గరికి క్రిమినల్స్ వచ్చి ఓ కవరందుకుంటారు. ఇదీ మొదటి ఎపిసోడ్. 

          ఈ మొదటి ఎపిసోడ్ తోనే, అసలు  సెకండాఫ్ మొదటి దృశ్యంతోనే,  ఏక సూత్రత అనే త్రాసు అమాంతం తలకిందులైపోయింది.  తూకం వేసేవాడు త్రాసు ముల్లు  దగ్గర వేలు పెట్టి తూకాన్ని ఏమారిస్తే దండి కొట్టాడు అంటారు. గరుడ వేగ లో గండి కొట్టుకున్నారు. అసలు ఏక సూత్రత అంటే ఏమిటి? మొదలెట్టిన పాయింటుతో అదే కథ చివరంటా చెప్పడం మాత్రమే కాదు, ఆ కథని ఆశ్రయించి వుండే సమస్త  హంగులూ అదే ఫీల్ ని ప్రకటించడం కూడా.  ఏక సూత్రత కింద జానర్ మర్యాద వుంటుంది. జానర్ మర్యాద కింద దాన్ని గౌరవిస్తూ ఇతర హంగులన్నీ వుంటాయి. ఏ జానర్ మర్యాదని అనుసరిస్తూ కథ చెప్తున్నారో,  అదే జానర్ మర్యాదని ఆద్యంతం ప్రదర్శించడం జానర్ మర్యాదని గౌరవించడమవుతుంది. 2015 లో తెలుగులో జానర్ మర్యాదని చివరంటా కాపాడుకున్న సినిమాలే హిట్టయ్యాయని బాగా గమనించాలి. అంటే  రసానుభూతి అనే ఎలిమెంట్ ని ప్రేక్షకులు ఫీలవడం మొదలెట్టారన్న మాట. ‘ముత్యాలముగ్గు’  కథలో విషాదమున్నా దాన్ని వినోదమనే షుగర్ కోటింగిచ్చి అద్భుత రసప్రధానంగా చూపించుకొచ్చారు. ఈ రసానుభూతి ఎక్కడా చెడకుండా చూశారు. ‘ఖరీబ్ ఖరీబ్ సింగిల్’  మెచ్యూర్డ్ లవ్ స్టోరీ. దీని జానర్ మర్యాద ఏదైతే వుందో  – వయసు మళ్ళిన ప్రేమల లెవెల్ - దాన్ని ముగింపు వరకూ కాపాడేరు.

          గరుడవేగ ఫస్టాఫ్ కథని ఎంత ఏమార్చినా, చూపించుకొస్తున్నది సీరియస్ యాక్షన్/ అడ్వెంచర్ జానర్. సీరియస్ యాక్షన్ / అడ్వెంచర్  జానర్ కి అద్భుత రసమే వుంటుంది. అలాగే దీన్ని అద్భుత రస ప్రధానంగా బాగానే చిత్రీకరించారు. అలా సీరియస్ యాక్షన్ డిమాండ్ చేసే ప్రకారం  – పాత్రల తీరుతెన్నులు, సంభాషణలు, పాల్పడే చర్యల మెకానిజం, నేపధ్య వాతావరణ సృష్టి వగైరాలతో మొత్తం స్టయిలిష్, మోడర్నిటీలతో కూడిన సెటప్ అంతా,  ఏకసూత్రతంతా,  సెకండాఫ్ మొదలయ్యేసరికి మాయమైపోయింది.

          ముందు మోడర్నిటీ స్థానే పాత మూస ఎలా మొదలవుతుందంటే, చానెళ్ళ ప్రసారాలతో.  సెకండాఫ్ ఒపెనవగానే థియేటర్  స్క్రీన్నిండా  రొడ్డ కొట్టుడుగా చానెళ్ళ  స్క్రీన్స్  వేసేసి, కథా ప్రపంచంలోని  దృశ్య శబ్ద సౌందర్యాల్ని  చెడగొట్టి, లౌడ్ స్పీకర్లు పెట్టినట్టు,  రంగంలోవున్న యాంకర్ల చేత నాటుగా వార్తల్ని చదివించే  అనాలోచిత పధ్ధతి ఇక్కడా ఎదురవుతుంది. ఆ వార్తలు కథలోని పాత్రలుగాక, ప్రేక్షకులు విని తీరాలన్నట్టు (టార్చర్ అనుభవించాలన్నట్టు) దృశ్య శబ్ద కాలుష్యాలతో నిండి వుంటుంది. ప్రతీ సినిమాలో ఇదే భరించలేని చీప్ తంతు తప్ప, ఇది కళ కాదని కళ్ళు తెరిచేది వుండదు. కళ అదేదో పెద్ద మాట కాదు. బీ గ్రేడ్ చిత్రీకరణలే ఏ గ్రేడ్ లో వుండకూడదన్న కామన్ సెన్స్ మాట. ఒకసారి రాం గోపాల్ వర్మ ‘సర్కార్ త్రీ’ లో టీవీ న్యూస్ ని ఎలా చూపించారో, ఎంత అర్ధవంతంగా కథా ప్రపంచంలోని పాత్రలకి తెలిసేట్టు మాత్రమే చూపించి, ఆ దృశ్య శబ్ద మర్యాదలతో ఎంత అందంగా మనం కూడా ఆ పాత్రలతో బాటు లీనమై ఫీలయ్యేట్టు చేశారో తెలుసుకోవడం మంచిది. 

          ఎలక్ట్రానిక్ మీడియా కంటే ప్రింట్  మీడియా చాలా పెద్ద ఇండస్ట్రీ. సినిమాల్లో 
దీని ఉనికే లేకుండా  పోయింది. మాటాడితే కుర్ర రిపోర్టరీమణులు మైకులుపట్టులుని పోలోమని వచ్చేసి నాన్సెనికల్ ప్రశ్నలేయడం, సినిమా చూస్తున్న ప్రేక్షకుల వైపు తిరిగి నీచంగా రిపోర్టు చేయడం ప్రతీ సినిమాలో వున్నట్టే ఇక్కడా నిండిపోయింది.  ఎప్పుడైతే  సెకండాఫ్ లో టెర్రరిజం కూడా పోయి, రాజకీయ కోణం ఓపెన్ చేశారో- ఇక చీదరగా రిపోర్టరీమణులు రక్కడం మొదలెడతారు. వీళ్ళ రక్కుడు రెండో ఎపిసోడ్ వరకూ వుంటుంది.  ఈ యాంకర్లతో  / రిపోర్టరీమణులతో కథ చెప్పించడమేమిటో అర్ధంగాదు. పాత్రల ద్వారా సహజంగా కథ తెలియజేయాలంటే కష్ట పడాలి - దీనికి షార్ట్ కట్  ఛానెళ్ళతో వాయింపులు. ఇలా బి గ్రేడ్ చిత్రీకరణలకి ఏ గ్రేడ్ జీతాలు తీసుకోవడం.

(మిగతా రేపు)
-సికిందర్