రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

28, ఆగస్టు 2022, ఆదివారం

1198 : రివ్యూ!

రచన - దర్శకత్వం : పూరీ జగన్నాధ్
తారాగణం : విజయ్ దేవరకొండ,  అనన్యా పాండేరమ్య కృష్ణఅలీరోణీత్ రాయ్విషు రెడ్డిమార్కండ్ దేశ్ పాండేమైక్ టైసన్
సంగీతం : సునీల్ కశ్యప్తనీష్ బాగ్చీఛాయాగ్రహణం : విష్ణు శర్మ
బ్యానర్స్ : ధర్మా ప్రొడక్షన్స్,  పూరీ కనెక్ట్స్ఏఏ ఫిల్మ్స్
నిర్మాతలు :  కరణ్ జోహార్పూరీ జగన్నాధ్ఛార్మీ కౌర్అపూర్వా మెహతా
విడుదల :  25 ఆగస్టు, 2022
***

            రెండేళ్లుగా ప్రేక్షకులెంతగానో ఎదురు చూసిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్’ మొత్తానికి విడుదలైంది. అర్జున్ రెడ్డి’ తో సూపర్ ఫేమస్ అయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు లైగర్ తో కొత్త జోన్ లోకి ప్రవేశించాడు. పానిండియా జోన్. ప్రమోషన్స్ లోనే నార్త్ లో అసంఖ్యాక ఫ్యాన్స్ ని సంపాదించుకుని బాలీవుడ్ నే ఆశ్చర్య పర్చాడు. ఇలాటి విజయ్ పూర్తిగా గల్లీ మాస్ క్యారక్టర్ తో పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో బిగ్ బ్యాంగ్ ఇచ్చేందుకు కిక్ బాక్సర్ గా విచ్చేశాడు హీరోయిన్ అనన్యా పాండేతో కలిసి. ప్రేక్షకులకి బోనస్ గా వరల్డ్ ఛాంపియన్ మైక్ టైసన్ ని కూడా తారాగణంలో భాగంగా చేర్చారు. తెలుగులో తొలి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మూవీగా నమోదు చేశారు. అయితే ఇంతా చేసి ఇది ఫ్లాప్ అయితే ఏమిటి పరిస్థితి అని కూడా పూరీ సహా నిర్మాతలే అనుకోవడం కొసమెరుపు. ఈ అనుమానం ఎందుకొచ్చినట్టుమూవీని అంత తేడాగా తీశారాతీస్తే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పానిండియా కలలేమవుతాయిభవిష్యత్తు ఏమవుతుందిముందుగా కథలోకి వెళ్ళి చూద్దాం...

కథ

సింహానికీపులికీ పుట్టిన క్రాస్ బ్రీడ్ గా చెప్పుకునే కరీంనగర్ కి చెందిన లైగర్ (విజయ్ దేవరకొండ) ముంబాయిలో చాయ్ అమ్మి జీవనం సాగించే తల్లి బాలామణి (రమ్యకృష్ణ) తో వుంటాడు. తనకి నత్తి వుండడం వల్ల అవమానాలు పడుతూంటాడు. బాలామణి భర్త ఫైటర్ గా ఛాంపియన్ కావాలన్న కలలు నెరవేరక ముందే చనిపోయాడు. అందుకని కొడుకుని మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) వరల్డ్ ఛాంపియన్ గా తీర్చిదిద్దాలని తీసుకుని ముంబాయి వచ్చింది. ఇక్కడొక ట్రైనర్ (రోణిత్ రాయ్) దగ్గర ట్రైనింగ్ కి చేర్పించింది. అయితే లక్ష్యం నెరవేరే వరకూ అమ్మాయిల జోలికి పోవద్దని షరతు పెట్టింది. కానీ తాన్యా (అనన్యా పాండే) అనే డబ్బుగల అమ్మాయి లైగర్ ఫైటింగ్ స్కిల్స్ ని చూసి వెంటపడి ప్రేమిస్తుంది. తనూ ప్రేమిస్తాడు. ఒకానొక ఘట్టంలో అతడికి నత్తి వుందని వదిలేస్తుంది. దీంతో ప్రేమలో దెబ్బతిన్న లైగర్ లక్ష్యం కూడా చిక్కుల్లో పడుతుంది.

ఇప్పుడేం చేశాడు లైగర్తల్లికిచ్చిన మాట నిలబెట్టుకున్నాడావిఫల ప్రేమలోంచి కోలుకుని వరల్డ్ ఛాంపియన్ అయ్యాడాతాన్యా ప్రేమని గెల్చుకున్నాడాఇదీ మిగతా కథ. 

ఎలావుంది కథ

సినిమా ప్రారంభంలో లైగర్ తన కథ చెప్పుకోవడం మొదలెడుతూ, ‘నాకు కథ చెప్పడం రాదుట్రై చేస్తాను’ అంటాడు. తీరా షో పడ్డాక కథ చెప్పడం ట్రై చేస్తే ప్రేక్షకులు వూరుకుంటారా? సినిమా తీయక ముందే నేరేషన్ ఇచ్చుకోవడం ట్రై చేయాలి గాని. అన్నట్టే అతడికి కథ చెప్పడం రాలేదు. ఏం కథ చెప్పాడో అర్ధం గాదు. ఈ కథ అసలెందుకు బాగాలేదో కథ చెప్పడం రాని లైగర్ మీదికి తోసేసి పూరీ ఇలా తప్పించుకుంటున్నట్టు వుంది.

తన పేరే (టైటిల్) సరిగా పలకలేని నత్తిగల వాడు కథ ఎలా చెప్తాడు నిజానికివిచిత్రం కదూనత్తి పాత్రతో కథ చెప్పించడంఅడుగడుగునా ఇలాగే వుంటుంది పూరీ తప్పించుకునే ప్లాన్. సినిమా ఫ్లాపవడానికి నత్తినత్తిగా కథ చెప్పిన లైగరే కారణం, తను కాదన్న మాట!

సరే, ఇది పూరీ ఎప్పుడూ తీసే సినిమాల్లోలాగే అదే అరిగిపోయిన పురాతన కథ. ఆయన కథల్ని మార్చడుస్టార్స్ ని మారుస్తాడు. వాళ్ళతో అవే టెంప్లెట్ కథలుఅవే టెంప్లెట్ పాత్రలు, అదే టెంప్లెట్ మేకింగ్, మొత్తంగా అదే టెంప్లెట్ సినిమా. క్రియేటివిటీకి, కొత్తదనానికీ చోటే వుండదు. అందుకే 15 రోజుల్లో ఏ స్క్రిపు అయినా రెడీ. ఇంకా పూరీ సినిమాలకి రివ్యూలు రాయడం కూడా ఇలాంటిదేహెడ్డింగ్ మార్చేస్తే ఏ సినిమాకైనా అదే రివ్యూ మ్యాచ్ అవుతుంది.

ఇక స్పోర్ట్స్ జానర్ సినిమా అంటే కూడా టెంప్లెట్ కథే. ఎవరు స్పోర్ట్స్ సినిమా తీసినా ఈ టెంప్లెట్టే వుంటుంది- 1. ఆట నేర్పే ఒక ట్రైనర్2. ఒక పీడితుడు, 3. ట్రైనింగ్, 4. సమస్యలు5. పీడితుడికి ఒక ప్రత్యర్థి6. ఆటలో ప్రత్యర్ధితో ఓటమి7. తీవ్రమైన ట్రైనింగ్, 8. ఆటలో ప్రత్యర్ధి మీద గెలుపు, 9. పీడితుడు విజేతగా మెడల్, ఇంతే!

ఈ 9 స్టోరీ బీట్స్ కి తగ్గ సీన్స్ ని చకచకా టెంప్లెట్లో (మూకుట్లో) వేసుకుంటూ పోతే స్పోర్ట్స్ మూవీ వంట వేడివేడిగా తయార్! బడ్జెట్ ని బట్టి ఇనప మూకుట్లో, సత్తు గిన్నెలో, రాచిప్పలో, మట్టి పిడతలో పడతాయి బీట్స్ దినుసులు. లైగర్ ది ఇనప మూకుడు. ఏ స్పోర్ట్స్ మూవీ చూసినా ఇంతే కథ. దీంతో స్పోర్ట్స్ మూవీస్ లో కొత్తగా చూడడాని కేమీ వుండడం లేదు.

స్క్రీన్ ప్లే ట్యూటర్ కెన్ మియమోటో ఈ టెంప్లెట్ ని అప్డేట్ చేశాడు. గొప్ప స్పోర్ట్స్ డ్రామాని క్రియేట్ చేయాలంటే దృష్టి పెట్టాల్సింది పాత్ర క్రీడలో ఏం సాధించాలనుకుంటోందో ఆ గోల్ మీద కాదు, ఆ మార్గంలో ఎదురైన ఆటంకాల్ని పాత్ర ఎలా బీట్ చేసిందన్నది, ఆ అవసరం ఎందుకన్నది. సిల్వెస్టర్ స్టాలోన్ తో రాకీ సిరీస్ సినిమాల విజయ రహస్యమిదే అన్నాడు.

క్రీడల్ని పక్కనబెట్టి మన విషయమే చూద్దాం. మనకి గోల్స్ వుంటాయి బాగా డబ్బు సంపాదించాలని లేదా పేరు పొందాలని లేదా ఇంకేదో. ఇవి సాధించాక సుఖంగా సెటిలై పోతామా? డబ్బు సంపాదించడమే గోల్ గా పెట్టుకుని డబ్బులే డబ్బులు సంపాదించుకున్న వాళ్ళంతా సుఖంగా వుంటున్నారా? ఆ అశాంతి దేనికి? దుష్ప్రవర్తన దేనికి? ఆత్మహత్యలు దేనికి?

వాళ్ళు భౌతికంగా స్థిరపడ్డమే గోల్ అనుకున్నారు కాబట్టి- ఆత్మిక సుఖాన్ని గుర్తించలేదు కాబట్టి. ఆత్మ కోరుకునేది వేరు. సంపాదనలో పడకముందు చిన్నప్పట్నుంచో, ఆ తర్వాతో కొన్ని స్వచ్ఛమైన కోరికలు పుడతాయి- ఇవి యూనివర్స్ కి బాగా కనెక్ట్ అయి వుంటాయి. పుస్తకాలు బాగా చదవాలని, పాటలు వినాలని, టూర్లు వెళ్ళాలని, పేదల్ని ఆదుకోవాలని, ఇంకేదో సేవ చేయాలని, తిరిగి ప్రపంచానికేదో ఇవ్వాలనీ.. ఇలా ఇవి ఆత్మిక సుఖాన్నిస్తాయి. పాటు పడాల్సింది ఈ ఆత్మిక సుఖం కోసమే. దీనికి భౌతిక సుఖం ఒక మెట్టు మాత్రమే. పరీక్ష  పాసవడం, ఉద్యోగం పొందడం, బిజినెస్ చేయడం, డబ్బు సంపాదించడం, విదేశాలకెళ్ళి సెటిలవడం - ఇవి గోల్స్ కానేకావు. ఇవి సంపాదించాక ఆత్మిక సుఖం కోసం ఏం చేస్తామన్నదే గోల్. గోల్ అంటే ఇదే. ఈ గోల్ కి రీచ్ అవ్వాలనే చేసే పనులు చేయాలి. ఇది జరిగిన నాడు మనశ్శాంతి గొప్పగా వుంటుంది.

అలాగే క్రీడల్లో కూడా మెడల్ కొట్టడమే గోల్ కాదు. కెన్ మియమోటో అన్నట్టు దేనికోసం మెడల్ కొడుతున్నారనేది ముఖ్యం. సల్మాన్ ఖాన్ నటించిన స్పోర్ట్స్ మూవీ సుల్తాన్ (2016) లో- రెజ్లింగ్ లో సుల్తాన్ (సల్మాన్) నేషనల్ ఛాంపియన్ వరకూ ఎదిగి పెళ్ళి చేసుకుంటాడు. భార్య గర్భవతవుతుంది. ఆమెకి నెలలు నిండిన సమయంలో వరల్డ్ ఛాంపియన్ కెళ్తాడు. అక్కడ  గెలుస్తున్న సమయంలో ఇక్కడ కొడుకు పుట్టి చనిపోతాడు. అరుదైన ఓ-పాజిటివ్’ బ్లడ్ గ్రూపుతో పుట్టిన కొడుకు రక్తం దొరక్క రక్త హీనతతో చనిపోతాడు. సుల్తాన్ ది ఆ బ్లడ్ గ్రూపే. దీంతో తను దగ్గరుండి కొడుకుని రక్షించుకోలేక పోయాననే తీవ్ర క్షోభకి లోనవుతాడు. కొడుకుని బతికించుకో లేకపోయిన తను కూడా  మొహం చూపించలేనని దూరమవుతుంది భార్య (మియామోటో చెప్పే ఆటంకమిదే). ఇక సుల్తాన్ తన కొడుకు లాంటి పరిస్థితి ఇంకొకరికి రాకూడదని వాడి పేర బ్లడ్ బ్యాంకు స్థాపించే లక్ష్యం తోక్రీడా రంగాన్ని వదిలేసిఉద్యోగం చేసుకుంటూ సాధారణ జీవితం గడుపుతూంటే-

ఈ గతం తెలుసుకున్న స్పోర్ట్స్ ఏజెంట్, బ్లడ్ బ్యాంకు పెట్టాలంటే సుల్తాన్ మళ్ళీ రెజ్లింగ్ కి సిద్ధం కావాలనిచాలా డబ్బొస్తుందనీ  ఒప్పించి తీసుకుపోతాడు. ఆ వరల్డ్ మిక్స్డ్ మార్షల్ ఈవెంట్ కోసం తిరిగి శిక్షణ పొందిఅంతర్జాతీయ ఫైటర్స్ ని చిత్తు చిత్తుగా ఓడించి- వచ్చిన బోల్డు డబ్బుతో బ్లడ్ బ్యాంకు స్థాపిస్తాడు సుల్తాన్. నల్గురికి తోడ్పడే బ్లడ్ బ్యాంకు భౌతిక సుఖం కాదు, ఆత్మిక సుఖం. దీని కోసమే పాటుపడ్డాడు. భౌతిక లక్ష్యం  ఆత్మిక లక్ష్యానికి వాహకం మాత్రమే. అదే గమ్యం కాదు.

లైగర్ లో ఈ యాంగిల్ లేదని కాదు. అది వ్యక్తిగత స్థాయిలో వుండి పోయింది. భర్త ఛాంపియన్ అవ్వాలన్న కల తీరకుండా చనిపోతే ఆ కల కొడుకు ద్వారా తీర్చాలని తల్లి ప్రయత్నించే కథ. తల్లి మాట మీద తండ్రి కల నెరవేర్చాలని లైగర్ పాత్ర. జేమ్స్ బానెట్ స్టోరీ వీల్ ప్రకారం ఇది తన స్వార్ధం కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వుండే అట్టడుగు స్థాయి పాత్ర, దీని పై స్థాయిలో సమాజం కోసం పాటు పడే పాత్ర వుంటుంది. దీని పై స్థాయిలో ప్రపంచం కోసం పాటుపడే పాత్ర వుంటుంది. ఇంకా దీని పై స్థాయిలో ఆథ్యాత్మికంగా పాటుపడే పాత్ర వుంటుంది.

ఈ కథాచట్రం (స్టోరీ వీల్) లో లైగర్ ఏ ర్యాంకులో వున్నాడు? ఇతనెలా ఆడియెన్స్ కి అంత బాగా కనెక్ట్ అవుతాడు? తండ్రి కల వుంటే నెరవేర్చకూడదని కాదు. ఇంకో ఉన్నతాశయాన్ని కలిపి తను ఛాంపియన్ అయినప్పుడు తండ్రి ఇంకా సంతోషిస్తాడు. ఇలా కాకుండా ప్రియురాలు తనకి నత్తి వుందని ఛీ కొట్టి వెళ్ళి పోయిందని, ఆమెకి ప్రూవ్ చేయడం కోసం ఛాంపియన్  అవ్వాలనుకోవడం కథకి ఎమోషనల్ రేషన్ కార్డు నివ్వదు. ఇది కూడా వ్యక్తిగత స్థాయే. పైగా ఒకరికేదో ప్రూవ్ చేయడం కోసం పనిని చేపట్టడమంటే అది ఆ పనిని కండోములా వాడి పారేయడం లాంటిది. గోలూ కాదు ఏమీ కాదు, రివెంజీ మెంటాలిటీ.

నటనలు - సాంకేతికాలు 

ఈ సినిమాలో లైగర్ గా విజయ్ ని  తప్ప ఇంకొకర్ని వూహించలేమనేది నిజమేగానీ, విజయ్ లైగర్ పాత్ర ఫైట్లు చేసి మాంచి యాక్షన్ పాత్రలా కన్పించినంత మాత్రాన అది యాక్టివ్ పాత్ర కాదు, పూర్తిగా పాసివ్ పాత్ర. పాత్ర డైనమిక్స్ కి నత్తి పెద్ద అడ్డంకి. ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని హుషారుగా ఎంటర్ టైన్ చేయాల్సిన తను- నత్తి వల్ల డైలాగులు కూడా ఎంజాయ్ చేయలేని పరిస్థితి తెచ్చాడు. కాబట్టి పవర్ఫుల్ మాస్ డైలాగులుపంచ్ డైలాగులూ సాధ్యం కాలేదు. ఇది పెద్ద ట్రాజడీ. కొత్తగా ఎంటరవుతూ, నత్తి మాట్లాడి పానిండియా ప్రేక్షకులకి ఎలా దగ్గరవాలనుకుంటాడు? నత్తి మార్కెట్ యాస్పెక్ట్ ని చంపేసింది.

ఫైటర్ గా మాత్రం పూర్తి మేకోవర్ తో- సిక్స్ ప్యాక్ తో నిజంగా పులే. ఎంఎంఏ రింగ్ లో ప్రత్యర్థుల్ని విరగ్గొట్టే సీన్లు టాప్. సినిమా కోసం తన ఎనర్జీ ఎంత పెట్టి చేయాలో అంతా చేశాడు. దేశమంతా తిరుగుతూ ప్రమోషన్స్ కి కూడా అంతే కష్టపడ్డాడు. కానీ ఇందులో పదో వంతు కూడా కథ విషయంలోపాత్ర విషయంలో పూరీ కష్ట పడలేదు. దీ సమస్య.

అతడి గోల్ అతడి గోల్ కాదు, అది తల్లి గోల్. అతను తల్లి చెప్పు చేతల్లో వుండే పాసివ్ క్యారక్టర్. వృత్తి విషయంలోనూ, ప్రేమ విషయంలోనూ. ప్రేమ లవర్స్ నడుపుకునే రోమాంటిక్ కామెడీగా లేక, ఇటు తన తల్లి చేతిలో, అటు హీరోయిన్ తండ్రి చేతిలో పెద్దలు నడిపే రోమాంటిక్ డ్రామా కావడం యూత్ అప్పీల్ కీ, బాక్సాఫీసు అప్పీల్ కీ గండి కొట్టింది.      

హీరోయిన్ అనన్యది పాత మూస ఫార్ములా పాత్రఈమె ప్రేమకూడా నలిగిపోయిన టెంప్లెట్టే. హీరోకి దూరమై, తర్వాత నీ గోల్ నుంచి నిన్ను డిస్టర్బ్ చేయకూడదనే అలా దూరమయ్యాననని నీతి వాక్యాలు చెప్పే చాలా పాత మూస ఫార్ములా చాలా సినిమాల్లో చూసేశాం. ఇన్నేళ్ళ అనుభవంతో కాపీ పేస్టే తప్ప, పూరీ కొత్తగా ఆవిష్కరించిం దేమీ లేదు. అయితే అనన్య  హావభావాలు బాగా ఒలికించగలదు. ఈ సినిమాతోనైనా తను గాడిలో పడుతుందేమో చూడాలి.

ఇక తల్లిగా రమ్యకృష్ణ మాస్ పాత్ర ఓవర్ డ్రామా అవుట్ డేటెడ్ అయిపోయింది. మెలోడ్రామాల కాలం నాటి పాత మోడల్ పాత్ర. అరుపులతో, మాట విరుపుతో లైగర్ కంటే రమ్యకృష్ణ నటనే టైగర్ లా వుంది.

ఎంతో ప్రచారం చేసిన వరల్డ్ ఛాంపియన్ మైక్ టైసన్ అతిధి పాత్ర... ముగింపులో వచ్చి కథనే ఆకస్మికంగా ముగించేస్తాడు. టైసన్ తో విజయ్ ఫైట్ సీను టైసన్ అభిమానులకి బాధ కల్గిస్తుందేమో తెలియదు. చాలా ప్రయత్నం చేసిన మీదట టైసన్ నటించడానికి ఒప్పుకున్నట్టు సమాచారం. ఒప్పుకుని ముగింపులో వచ్చి బాక్సాఫీసుకే పనికి రాకుండా విరిచేశాడు సినిమాని.

పాటల గురించి చెప్పుకోవడానికి లేదు. పాటలు హిట్ కాలేదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. కెమెరాఎడిటింగ్కోరియోగ్రఫీయాక్షన్ కొరియోగ్రఫీలొకేషన్స్ అన్నీ హైక్లాస్ గా వున్నాయి - ఒక్క పూరీ చేతిలో స్క్రిప్టు తప్ప!

చివరికేమిటి  

ఫస్టాఫ్ విజయ్ ట్రైనింగుహీరోయిన్ తో ప్రేమమదర్ తో ఫ్యామిలీ సీన్లూ ఇవే వుంటాయి ఓ మూడు పాటలతో. మధ్య మధ్య వీధి పోరాటాలతో. ఇంటర్వెల్లో విజయ్ కి నత్తి అని తెలిసి హీరోయిన్ దూరమవుతుంది. ప్రేమ కథే బలహీనమంటేఈ ఇంటర్వెల్ మలుపు మరీ వీక్. ఇక్కడే ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి చెందారు. ఇక సెకండాఫ్ మరీ దారుణం. నేషనల్ ఛాంపియన్ గెలవడంఆపైన వరల్డ్ ఛాంపియన్ కెళ్ళడం తగిన విషయంస్ట్రగుల్ఎమోషన్స్ లేకుండా ఫ్లాట్ గా సాగిపోతాయి. ఇక పూరీ సినిమాల్లో అలవాటుగా వుండే హీరోయిన్ కిడ్నాప్ ఒకటి. పోనూ పోనూ దిగజారి పోతూ వుంటుంది ఈ పానిండియా ప్రయత్నం. ఇంకేం చెప్పలేక మైక్ టైసన్ రాకతో, నాల్గు పిడి గుద్దులతో సడెన్ గా శుభం పడి పోతుంది.

స్టేడియంలో వస్తాదులు ఎదురు చూస్తూంటే, ఇంకెక్కడో అవుట్ డోర్ లో విజయ్ దేవరకొండ హీరోయిన్ కిడ్నాప్ గురించి మైక్ టైసన్ ని మట్టి కరిపిస్తే, ఆ క్లిప్పింగ్స్ ప్రసారమై విజయ్ దేవరకొండ వరల్డ్ ఛాంపియన్ అయిపోవడ మేమిటో అడక్కూడదు.   

కనీసం కథకి కావాల్సిన ఒక విలన్ఒక కాన్ఫ్లిక్ట్ లేకపోతే సినిమా నిలబడుతుందా? నత్తీ కథకేమీ ఉపయోగ పడలేదు. తన నత్తే తనకి విలన్ అయ్యుంటే ఆ స్ట్రగుల్ సానుభూతిని రాబట్టుకునేది. కాన్ఫ్లిక్ట్ నత్తి వల్ల ప్రేమలో పుట్టడంతో దాన్ని కాన్ఫ్లిక్ట్ గానే ఫీలవలేదు ప్రేక్షకులు. వారియర్ హాలీవుడ్ హిందీ రీమేక్ బ్రదర్స్ (2015) లో ఎఎంఏ ఛాంపియన్ షిప్ కి అన్నదమ్ములే ఒకరికొకరు విలన్లు. రింగ్ లో కొట్టుకుని కొట్టుకుని రక్తసిక్తమైన వాతావరణంలో, తమ్ముడ్ని ఇంకా కొట్టి ఓడించలేక ఏడుస్తాడు అక్షయ్ కుమార్. బంపర్ హిట్టయ్యింది.

పూరీ చూడని కథా లోకాలు ఇంకా చాలావున్నాయి. తిప్పి తిప్పి అవే సారం లేని కథలు ఇంకెంత కాలం...

—సికిందర్

 

27, ఆగస్టు 2022, శనివారం

1197 : ఓటీటీ రివ్యూ!

 

దర్శకత్వం : అశోక్ తేజ
తారాగణం : హెబ్బా పటేల్, సాయి రోనక్, పూజిత పొన్నాడ, వశిష్ట ఎన్ సింహా తదితరులు
రచనా : సంపత్ నంది, సంగీతం : అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం : సౌందర రాజన్
నిర్మాత : కేకే రాధామోహన్
విడుదల : ఆగస్టు 26, 2022 (ఆహా ఓటీటీ)
***
        ర్శకుడు సంపత్ నంది కథ రాసి అశోక్ తేజ కిచ్చాడు దర్శకత్వానికి. ఇది లాక్ డౌన్ కి పూర్వం థియేటర్ కోసం తీసిన సీరియల్ కిల్లర్ సినిమా. కానీ థియేటర్ రిలీజ్ కి బిజినెస్ కాక ఆహా ఓటీటీ ద్వారా విడుదలైంది. గంటన్నర నిడివి వుండడం వల్ల, విషయం బలహీనంగా వుండడం వల్ల థియేటర్ కి దూరమైందని సులభంగా చెప్పొచ్చు. దీనికి నిజంగా జరిగిన కథ అని ట్యాగ్ ఇచ్చారు, కానీ ఎక్కడ జరిగిందో చెప్పలేదు. కానీ జరిగిన ఒక ఉదంతం మనకి గుర్తొస్తుంది. దీని గురించి తర్వాత చెప్పుకుందాం. ఇందులో హెబ్బా పటేల్ ప్రధాన పాత్ర పోషించింది. కేజీఎఫ్ సినిమాల నటుడు వశిష్ట సింహాతో బాటు పూజితా పొన్నాడ, సాయి రోనక్ లు ఇతర పాత్రల్లో నటించారు.

        లా తారాగణం ఆకర్షణీయంగా వుంది. రచన సంపత్ నందితో బాటు, సంగీతం అనూప్ రూబెన్స్, కెమెరా సౌందర రాజన్ కూడా పెద్ద పేర్లే. మరి ఇంత మంది హేమాహేమీలు కలిసి ఎలాటి సరుకు అందించారు? ఇలాటి సినిమా తీయడానికి హేమాహేమీలు అవసరం లేదా? కొత్తవాళ్ళు సరిపోతారా? ఈ విషయం తెలుసుకుందాం...  

కథ

అనుదీప్ (సాయి రోనక్) ఐపీఎస్ ట్రైనీగా ఓదెల (కరీంనగర్ - పెద్దపల్లి జిల్లా) పోలీస్ స్టేషన్ కొస్తాడు. హైదరాబాద్ లో ఇతడికో గర్ల్ ఫ్రెండ్ (పూజితా పొన్నాడ) వుంటుంది. ఓదెలలో రాధ (హెబ్బా పటేల్) అనే యువతి భర్త తిరుపతి (వశిష్ట సింహా) తో ఇస్త్రీ షాపు నడుపుతూంటుంది. పెళ్ళయి తొమ్మిదేళ్ళయినా వీళ్ళకి పిల్లలు పుట్టరు. భర్తకున్న లైంగిక సమస్యతో డాక్టర్ ని కూడా సంప్రదిస్తుంది రాధ. ఇలా వుండగా గ్రామంలో ఆకస్మాత్తుగా హత్యలు మొదలవుతాయి. శోభనం జరిగిన మర్నాడే ఒక పెళ్ళి కూతురు హత్యకి గురవుతుంది. ఇంకోరోజు ఇంకో పెళ్ళి కూతురూ ఇలాగే హత్యకి గురవుతుంది. వెంటనే ఐపీఎస్ అనుదీప్ ఈ కేసులు చేపడతాడు. శోభనం తర్వాత అత్యాచారం చేసి చంపుతున్నాడంటే వీడెవడో సైకో కిల్లర్ అనుకుని దర్యాప్తు మొదలెడతాడు. ఇంతలో ఇంకో హత్య జరుగుతుంది. ఇలాటి పరిస్థితుల్లో అనుదీప్ వద్దన్నా సర్పంచ్ కూతురి పెళ్ళిచేయడంతో, ఆ పెళ్ళి కూతుర్ని ఓదెల రైల్వే స్టేషన్ నుంచి అపహరించి చంపుతాడు హంతకుడు.

ఎవరీ సీరియల్ కిల్లర్? ఎందుకు చంపుతున్నాడు? ఇంకా ఎంతమందిని చంపాడు? వీడ్ని పట్టుకోవడానికి అనుదీప్ ఏ వ్యూహం పన్నాడు? పోలీస్ స్టేషన్ కి మొండెం లేని తల పట్టుకుని వచ్చిందెవరు? అనుదీప్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఎలా ప్రమాదంలో పడింది? ఇవి తెలియాలంటే మిగతా సినిమా చూడాలి.

ఎలావుంది కథ

2019 లో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్​ లో పట్టుబడ్డ సీరియల్ కిల్లర్ శ్రీనివాసరెడ్డి కేసు ఈ కథకి మూలమని చెప్పొచ్చు. మెకానిక్ శ్రీనివాసరెడ్డి వరసగా ముగ్గురమ్మాయిల్ని అత్యాచారం చేసి చంపి పాడుబడ్డ బావిలో పడేశాడు. ఈ కేసులో అతడికి ఉరిశిక్ష పడింది.

దీన్ని దృష్టిలో పెట్టుకుని శోభనం పెళ్ళి కూతుర్ల కథ అల్లాడు కథకుడు. ఇందులో కూడా పాడుబడ్డ బావే హత్యాస్థలం. అయితే కథా కథనాలు కుదర్లేదు. మొత్తం గంటన్నర కూడా సిల్లీగా వుంటుంది కథనం. సీరియల్ కిల్లర్ కథకి ఆ జానర్ మర్యాదలే వుండవు. థ్రిల్, సస్పెన్స్, టెన్షన్ మొదలైన వాటికి స్థానమే వుండదు. మొదటి పది నిమిషాల్లోనే సీరియల్ కిల్లరెవరో క్లూ ఇచ్చేస్తున్నట్టు కూడా గ్రహించకుండా, హెబ్బాపటేల్ నపుంసక భర్తతో డాక్టర్ దగ్గరి కెళ్ళే సీను వేసేశారంటే ఏమనాలి.

ఇక దీనికో కథా ప్రయోజనం కల్పించారు. చివర్లో తేల్చిందేమిటంటే- ఇంపీరియా ఇంపోటెన్సీ సిండ్రోమ్ అనే అంగస్తంభన వైఫల్య రుగ్మతొకటి వుందనీ, తల్లిదండ్రుల వల్ల, తోబుట్టువుల వల్ల, సమాజం వల్లా ఇది వస్తుందనీ, ఏటా 12 వేలమంది దీని బారిన పడుతున్నారనీ...ఇలా జరగకుండా వుండాలంటే మనమే బాధ్యత తీసుకోవాలనీ ఏమేమో అర్ధంగాకుండా చెప్పారు. మనమేం బాధ్యత తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి ఇలా అర్ధం పర్ధం లేకుండా తీస్తే? ముందు తను బాధ్యత తీసుకుని కథ సరీగ్గా తీయాలి. ఇంపీరియా ఇంపోటెన్సీ సిండ్రోమ్ ఏమిటో గూగుల్లో ఎంత కొట్టినా దొరికి చావడం లేదు. ఇలాటి  కథకి సీక్వెల్ కూడా రాబోతున్నట్టు చివర్లో హెచ్చరిక ఒకటి!

కథలో ఇన్వెస్టిగేషన్లో డీఎన్ఏ ద్వారా వయసు తెలుసుకోవచ్చని చెప్పారు. ఇప్పుడు అందుబాటులో కొచ్చిన ఆధునిక డీఎన్ఏ ఏజ్ టెస్టింగ్ ద్వారా ఇది సాధ్యమే. ఇలాటి శాస్త్రీయ సమాచారమివ్వడం బావుంది.

నటనలు- సాంకేతికాలు


ఈ కథ ప్రధాన పాత్ర ఎవరో అర్ధం గాకుండా వుంటుంది. దర్యాప్తు అధికారిగా ట్రైనీ ఐపీఎస్ ప్రధాన పాత్ర అనుకుంటాం. లేకపోతే ట్రైనీ ఐపీఎస్ లెవెల్ అధికారి అవసరం లేదు, ఎస్సై వుంటే సరిపోతుంది. కానీ హత్యల్ని పరిశోధించే ట్రైనీ ఐపీఎస్ అనుదీప్ గా సాయి రోనక్ చాలా వీక్, పాసివ్ క్యారెక్టర్. ఏం చేస్తాడో అతడికే తెలీదు. ఆరువేల జనాభావున్న గ్రామంలో సీరియల్ కిల్లర్ ని పట్టుకోలేక పోవడం అతడి అసమర్ధతని తెలుపుతుంది.  

సాయి రోనక్ ఒక పోలీసుగానే వుండడు, మొహంలో ఎక్స్ ప్రెషన్సే వుండవు. చివరికి కిల్లర్ ని పట్టుకునే ప్లాన్ గర్ల్ ఫ్రెండ్ పూజితా పొన్నాడే ఇస్తుంది. పెళ్ళి చేసుకుని ఫస్ట్ నైట్ చేసుకుందాం, అప్పుడు తెల్లారి వచ్చే కిల్లర్ ని ట్రాప్ చేసి పట్టుకుందామంటుంది. అలాగే పెళ్ళి చేసుకుని ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేసి కాఫీ తాగుతూంటాడు. సీరియల్ కిల్లర్ వచ్చేసి భార్యని ఎత్తుకు పోతాడు! సీరియల్ కిల్లర్ కాదు ఇంపోటెంట్, పెద్ద ఇంపోటెంట్ ఈ ఐపీఎస్ ట్రైనీయే!!

ఐపీఎస్ ట్రైనీ భార్యని ఎత్తుకుపోతే పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా వేరే పనులు చేసుకుంటూ వుంటారు. ఐపీఎస్ ట్రైనీ కారెక్కి తీరుబడిగా ఎటో పోతాడు. కిల్లర్ గురించి హెబ్బా పటేల్ ఫోన్లు చేస్తూంటే వచ్చేస్తున్నానంటాడు. ఇక లాభం లేదన్నట్టు- ఈ ఐపీఎస్ ట్రైనీ శుద్ధ వేస్ట్ ఫెలో అన్నట్టు, హెబ్బా పటేలే హీరో గా బయల్దేరి సీరియల్ కిల్లర్ ని చంపి, ట్రైనీ ఐపీఎస్ భార్యని కాపాడి తెచ్చి ముందు పడేస్తుంది!

కొత్త భార్యతో ఎక్కడికో పోతున్న ట్రైనీ ఐపీఎస్ ని గ్రామ ప్రజలు మెచ్చుకుని, మళ్ళీ ఎప్పుడొస్తారని అంటారు. గట్టిగా కాచుకోండి, ఎస్పీగా వస్తాను అంటాడు! ఏం పీకాడనో ఇంకా ఎస్పీగా ఓదెల రైల్వే స్టేషన్ 2 తో వస్తాడట! ఇలాటి కథలు రాయకపోతే సంపత్ నంది కొంపలు మునిగిపోతాయా?
       
అంటే ఇక హెబ్బా పటేలే ప్రధాన పాత్రనుకోవాలి. ఇంకో ముఖ్య పాత్ర ప్లాన్ ఇచ్చిన పూజితా పొన్నాడ. పోలీస్ స్టేషన్లో అందర్నీ వెళ్ళగొట్టి వీళ్ళిద్దరికీ అప్పజెప్పాలి.

ఇక సాంకేతికంగా చూస్తే అనూప్ రూబెన్స్ సంగీతం, సౌందర రాజన్ కెమెరా ఇలాటి సినిమాని చూడండి, చూడండి - అని ఉత్తేజపరుస్తూంటాయి. ఓదెల రైల్వే స్టేషన్ టైటిల్ తో పెద్దగా సంబంధమే వుండదు. శోభనం రాత్రి హంతకుడు సరైన టైటిల్. ఇదీ హేమాహేమీల ఉమ్మడి శ్రమ దాన ఎపిసోడ్!

—సికిందర్
(రేపు లైగర్ రివ్యూ)


26, ఆగస్టు 2022, శుక్రవారం

1196 : లైగర్

    లైగర్ సృష్టించిన హంగామా విడుదల కాగానే అయ్యో రామా అయిపోయింది... ముంబాయి నేపథ్యంతో పూరీ జగన్నాథ్ ఎన్టీఆర్ తో తీసిన ఆంధ్రావాలా (2004) కూడా ఇలాగే మార్నింగ్ షోకల్లా కుప్పకూలింది. ఇప్పుడు ముంబాయి బ్యాక్ డ్రాప్ తోనే విజయ్ దేవరకొండతో తీసిన లైగర్ కూడా మార్నింగ్ షోకే కుప్పకూలింది. ఇంకా చెప్పాలంటే మార్నింగ్ షో ఇంటర్వెల్ కే కుప్ప కూలింది. నత్తి వల్ల లైగర్ లోకల్ గానే లేచి గాండ్రించ లేకపోయాడు, ఇక గ్లోకల్ గా తన వాణి ఏం వినిపిస్తాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ - పూరీ జగన్నాథ్ పానిండియా కలలు బాక్సాఫీసుతో తలపడలేక చతికిలబడ్డాయి. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ తో మైక్ టైసన్నే క్లయిమాక్స్ లో కొట్టగల్గిన రౌడీ స్టార్, బాక్సాఫీసు కొట్టిన రౌండ్ హౌస్ కిక్ కి తట్టుకో లేక టేక్ డౌన్ అయిపోయాడు. అయినా ఏం ఫర్వాలేదు. ఇప్పుడు సినిమా బిజినెస్ ప్రాఫిట్టే!

        లైగర్ ని 110 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. 90 కోట్ల డిస్ట్రిబ్యూటర్ల షేర్ రావాలంటే 180 కోట్లు వసూలు చేయాలంటున్నారు. ఇది జరగని పని. అయితే బాక్సాఫీసులో జరగని పని ఓటీటీలో జరిగి పోతుంది. ఇంకా లాభాలే వస్తాయి. ఓటీటీ ఎక్కువగా ఇలాటి అట్టర్ ఫ్లాప్ సినిమాల అడ్డాగా పురోభివృద్ధి చెందుతోంది. ఫ్లాప్ మరకలంటిన సినిమాల్ని ఓటీటీ వాషింగ్ మెషీన్ లో వేసి తీస్తే, తెల్లగా వెండితెర లాగా నిగనిగ లాడతాయి. కనుక ఓటీటీ వుండగా పూరీ జగన్నాథ్ అవే ప్రాచీన నిల్వ కథలతో, అవే సినిమాలు అలాగే నిర్భయంగా, సాలా క్రాస్ బ్రీడ్ అనుకుంటూ తీస్తూ పోవచ్చు.

విషయం ఇది కాదు, పానిండియా అంటూ సౌత్ సినిమాలు చేస్తున్న దండయాత్రకి బాలీవుడ్ గజగజ వణుకుతోంది. అలాంటప్పుడు ఇలా బాలీవుడ్ ముంగిట తెలుగు సినిమాలు గజగజ వణుకుతూ నిలబడితే బావుండదు. ఇలాటివి ఇంకో రెండు వస్తే లైట్ తీసుకుంటుంది బాలీవుడ్. సౌత్ నుంచి వచ్చే పానిండియా సినిమాల్లో తెలుగుకే ఎక్కువ గుర్తింపు వుంది బాలీవుడ్ లో, హిందీ రాష్ట్రాల్లో. తాజాగా నిఖిల్ నటించిన  కార్తికేయ 2 కూడా దీనికి ఉదాహరణ. నిఖిల్ లాంటి చిన్న హీరో సినిమా పానిండియా మార్కెట్ లో 100 కోట్లు వసూలు చేస్తుందని ఎవరూ వూహించలేదు.

బాహుబలి రెండు భాగాలతో మొదలైన తెలుగు పానిండియా టూర్ ఆర్ ఆర్ ఆర్’, పుష్ప లతో తారాస్థాయికి చేరుకుని కార్తికేయ2 తో నిలదొక్కుకుంది. ఇదే తమిళం నుంచి వచ్చిన విక్రమ్ మినహా వాలిమై’, బీస్ట్’, ఈటీ వంటి పానిండియాలు ఫ్లాపయ్యాయి, తమిళనాడులో హిట్టయ్యాయి. కారణం ఇవి మరీ పాత మూసగా వుండడం లైగర్ లాగే. ఇక కన్నడ నుంచి కేజీఎఫ్ రెండు సినిమాలూ పానిండియాకి కల్ట్ మూవీస్ అయి, బాలీవుడ్ కి కుదుపునిచ్చాయి. సంఖ్యాపరంగా చూస్తే తెలుగు పానిండియాలే ఇవ్వాళ బాలీవుడ్ లో, హిందీ రాష్ట్రాల్లో నెంబర్ వన్ గా వున్నాయి.

హిందీ రాష్ట్రాల్లో ప్రేక్షకులు హిందీ సినిమాలతో విసిగిపోయారు. బి సి సెంటర్లలో సింగిల్ స్క్రీన్ థియేటర్లకి హిందీ మాస్ సినిమాలు రావడం లేదు. తెలుగు మాస్ సినిమాలు అక్కడి నగరాల్లో మల్టీ ప్లెక్సుల్లోనే గాక, వూళ్ళల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా ఈ లోటుని తీరుస్తున్నాయి. దీంతో తెలుగు సినిమాలు, తెలుగు స్టార్లూ హిందీ ప్రేక్షకులకి దగ్గరై, హిందీ స్టార్స్ ని కన్నెత్తి చూడ్డం లేదు ప్రేక్షకులు. లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్, పృథ్వీరాజ్, షంషేరా, షేర్ దిల్, ఎటాక్, బచ్చన్ పాండే వంటి స్టార్ సినిమాలన్నీ అట్టర్ ఫ్లాపయ్యాయి. వీటిలో మూడు అక్షయ్ కుమార్ వే వున్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రేపు సెప్టెంబర్ 9 న విడుదలయ్యే మల్టీ స్టారర్  బ్రహ్మాస్త్రం మీదే పంచప్రాణాలు పెట్టుకుని వున్నారు.

సీఐఐ సౌత్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ నివేదిక ప్రకారం, 2021లో సినిమాల అఖిల భారత బాక్సాఫీసు కలెక్షన్లలో 62 శాతం సౌత్ సినిమాల నుంచే వచ్చాయి. ఈ ధోరణి మరింత బలపడుతోందని నివేదిక చెప్తోంది. నిజమే, గత కొన్ని సంవత్సరాలుగా మల్టీప్లెక్స్ ప్రేక్షకులని ఆకర్షిస్తున్న బాలీవుడ్, సింగిల్ స్క్రీన్ ప్రేక్షకుల్ని వదిలేసింది. దేశంలో ఎక్కువ మంది సింగిల్ స్క్రీన్ ప్రేక్షకులే వున్నారు- దీంతో సింగిల్ స్క్రీన్ మసాలాలతో వస్తున్న సౌత్ సినిమాల్ని చూసేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు ప్రేక్షకులు.

పై నివేదిక ఇంకో విషయం కూడా చెప్తోంది : మహమ్మారి తర్వాత వినోద ప్రాథమ్యా లు మారి పోతున్నందున, సినిమా ప్రేక్షకులు ఏం చూడాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి సౌత్ నిర్మాతలు సూపర్ స్మార్ట్ మార్కెటింగ్ నిపుణుల్ని నియమించుకుంటున్నారు. ప్రేక్షకుల అభిరుచుల ప్రీ-ప్రొడక్షన్ సర్వేలని  కూడా నిర్వహిస్తున్నారు.

 

ఫిక్కీ కూడా ఒక నివేదిక విడుదల చేసింది : సింగిల్ స్క్రీన్ థియేటర్‌లకి తగ్గ హిందీ సినిమాల్లేక వాటి ఆదాయాలు క్షీణించడం, అవి మూతబడడం జరిగిపోతున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్టు ధరలు 50 నుంచి  70 రూపాయల మధ్యే వుండడంతో, మూడు రెట్లు ధరలు ఎక్కువ వుండే మల్టీ ప్లెక్సుల్లో ఆడే హిందీ సినిమాలే తీస్తున్నారు. సింగిల్ స్క్రీన్స్ ని కలుపుకుని మల్టీ ప్లెక్సుల్లో కూడా సౌత్ పానిండియా లు దండయాత్ర మొదలెట్టడంతో బాలీవుడ్ కి మల్టీప్లెక్స్ ప్రేక్షకులు  కూడా చేజారిపోతున్నారు. ఢిల్లీ, యూపీ, తూర్పు పంజాబ్ సర్క్యూట్‌ల పంపిణీదారులైతే హిందీ సినిమాలకి జనాలతో వున్న అనుబంధం తెగి పోయిందనీ, మల్టీప్లెక్సులు   ఎక్కువ డబ్బుని  తెచ్చిపెడుతున్నందున నిర్మాతలు మెట్రో-సెంట్రిక్ లేదా ఓవర్సీస్ మార్కెట్లకి సరిపోయే సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టారనీ,  ఇక సింగిల్ స్క్రీన్స్ తో మేం వ్యాపారాలు మూసుకోవాల్సిందేననీ వాపోతున్నారు.

ఇలా హిందీ రాష్ట్రాల్లో సినిమాల పరంగా శూన్యమేర్పడితే ఆ శూన్యాన్ని భర్తీ చేస్తూ సొమ్ముచేసుకునే పానిండియా సినిమా ఫార్ములా యేదో తెలుగు సినిమాల్లో కనిపెట్టాలే తప్ప, ఇంకా తెలుగు ధోరణిలో అరిగిపోయిన మూస దగ్గరే ఆగిపోతే లైగర్ లాంటి అనుభవాలే ఎదురవుతాయి.
***

 

24, ఆగస్టు 2022, బుధవారం

1195 : లైగర్

 

    రేపే పానిండియా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ థియేటర్స్ ని షేక్ చేస్తూ విడుదలవుతోంది. ఈలోగా దీని స్టోరీ లీక్ అయిందని పుకార్లు వైరల్ అవుతున్నాయి. కానీ లీక్ అవక పోయినా దీని స్టోరీ ఎలా వుంటుందో చెప్పొచ్చు. బాక్సర్ సినిమా కథలు కూడా మూసే కాబట్టి. గతంలో రవితేజతో పూరీజగన్నాథ్ తీసిన అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి లో రవితేజ బాక్సరే. జయసుధ అతడి మదర్. మదర్ సెంటిమెంటుతో ఈ బాక్సర్ కథ. ఇటీవల వరుణ్ తేజ్ నటించిన గని అనే మరో బాక్సర్ మూవీ వచ్చింది. ఇందులోకూడా మదర్ సెంటిమెంటే. బాక్సింగ్ అంటే ఇష్టం లేని మదర్ నదియాతో వరుణ్ తేజ్ స్ట్రగుల్. ఇప్పుడు లైగర్ కథ లీక్ అయిందని విన్పిస్తున్న వెర్షన్లు కూడా ఇదే కోవలో వున్నాయి- రౌడీ స్టార్ కి మదర్ రమ్యకృష్ణతో సెంటిమెంటల్ డ్రామా.

        నాడెప్పుడో అమితాబ్ బచ్చన్ తో త్రిశూల్ అని వచ్చింది. ఇందులో అక్రమ సంతానమైన అమితాబ్ బచ్చన్, తల్లి వహిదా రెహమాన్ కి న్యాయం చేయడం కోసం, బిల్డర్ అయిన తండ్రి సంజీవ్ కుమార్ తో తలపడతాడు.

ఇదే యాంగిల్ లీకైన ఒక వెర్షన్లో కన్పిస్తుంది... ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్‌ లైగర్ లో నటించిన విషయం తెలిసిందే. ఈ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్, రౌడీ స్టార్ తండ్రి పాత్రలో కనిపిస్తాడు. తల్లి పాత్రలో రమ్యకృష్ణ వుంటుంది. లైగర్ సినిమా కథ నటి నీనా గుప్తా వ్యక్తిగత జీవితం నుంచి తీసుకున్నట్టు ఈ వెర్షన్. ఈమె వెస్టిండీస్‌ క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్ ని ప్రేమించింది. అతడ్ని పెళ్లి చేసుకోకుండానే కుమార్తె మసాబాకి జన్మనిచ్చింది. లైగర్ కూడా ఇదే స్టోరీ లైన్‌లో వుండబోతోందని వూహాగానాలు. ఇందులో రౌడీ స్టార్ తను అక్రమ సంతానమనే ఉక్రోషంతో సొంత తండ్రి మైక్ టైసన్‌తో తలపడతాడు- త్రిశూల్ లో అమితాబ్ లాగా అన్నమాట.

వైరల్ అవుతున్న ఇంకో వెర్షన్ ఏమిటంటే, ఇది మైక్ టైసన్ నిజ జీవిత కథ అని ఇన్‌సైడ్ టాక్. తల్లిదండ్రుల మధ్య విభేదాల కారణంగా మైక్ టైసన్ బాల్యం చితికిపోయిన సంగతి తెలిసిందే. టైసన్‌ ని  అతని తల్లి పెంచింది. భర్తతో గొడవల కారణంగా  ఆమె డిప్రెషన్‌లో వుండేది. ఇంట్లో పరిస్థితులతో విసుగు చెంది కోపంతో వున్న మైక్ టైసన్ అనవసరమైన గొడవలకి దిగి స్కూల్లో తోటి స్టూడెంట్స్ ని కొట్టేవాడు. తల్లికి ఫిర్యాదులు రావడంతో, ఆమె చితగ్గొట్టేది. టైసన్ 13 ఏళ్లు దాటకముందే 38 సార్లు జైలుకు వెళ్లాడు. అతడి వార్తలు మీడియాలో కనిపించేవి. ఇది చూసి  న్యూయార్క్ కి చెందిన బాక్సింగ్ శిక్షకుడు టైసన్ కోపాన్ని బాక్సింగ్ వైపు మళ్లించాలని నిర్ణయించుకున్నాడు. ఈ మలుపు ప్రపంచానికి మైక్ టైసన్ రూపంలో బాక్సింగ్ లెజెండ్‌ ని  అందించింది. లైగర్ లో రౌడీ స్టార్- రమ్య కృష్ణ ల మధ్య ఈ కథే వుండబోతోందని వార్తలు.

ఈ వెర్షన్ ప్రకారం కరీంనగర్‌కి చెందిన రమ్యకృష్ణ  కొన్ని కారణాల వల్ల ముంబైకి వెళుతుంది. అక్కడ ఆమె ఒక మురికివాడలో టీ దుకాణం నడుపుతూ నివసిస్తుంది. ఆ మహానగరంలో ఒంటరి స్త్రీగా సమస్యల్ని ఎదుర్కొంటూ రౌడీ స్టార్ కి ధైర్యవంతురాలైన తల్లిగా మారుతుంది. అయితే రౌడీ స్టార్ ఆమెకి తెలియకుండా ఫైటర్ గా మారతాడు. కొడుకు ఫైటర్ కావడం రమ్యకృష్ణకి అస్సలు ఇష్టముండదు. కానీ రౌడీ స్టార్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా గొప్ప ఫైటర్‌గా ఎదిగి అంతర్జాతీయ స్థాయికి సెలెక్ట్ అవుతాడు.

లీకులు తెలుగు సినిమాలకి కొత్త కాదు. ఆచార్య కథని మెగా స్టార్ చిరంజీవి కూడా ఈవెంట్స్ లో వాయిదాల పద్ధతిన లీక్ చేస్తూ పోయారు. అల్లు అర్జున్ పుష్ప’, మహేష్ బాబు సర్కారువారి పాట’, నాగార్జున-నాగ ఛైతన్య ల బంగార్రాజు’, రాజమౌళి ఆర్ ఆర్ ఆర్’, ప్రభాస్ రాధేశ్యామ్ కథలు కూడా లీకయ్యాయి.

ఇంకా నిర్మాణం ప్రారంభం కానీ నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా కథ కూడా లీక్... గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రానున్న బాలాయ మూవీ కథ గురించి జోరుగా చెప్పుకుంటున్నారు. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం. ఒకటి అరవై ఏళ్ల వృద్ధుడి పాత్ర. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యపు కథ. ఇది నేటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకి అద్దం పడుతుంది. ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన  కొన్ని పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయి. అనంతపూర్ కి ఓ భారీ పరిశ్రమ రావాల్సి వుంది. అది వేరే రాష్ట్రానికి తరలిపోయింది.. ఇలా వుంటుంది ఈ కథ అని లీకులిస్తున్నారు.

ఇక రవితేజ రామారావు ఆన్ డ్యూటీ అయితే ఏకంగా సినిమాలోని దృశ్యాలే సోషల్ మీడియాలో దర్శన మిచ్చాయి. మహేష్ బాబు సర్కారు వారి పాట  ట్రైలర్ తో బాటు, అల్లు అర్జున్ పుష్ప లోని దాక్కో దాక్కో పాట కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో నిర్మాతలు సైబర్ క్రైమ్ ని ఆశ్రయించారు.

ఇంకా గమ్మత్తేమిటంటే, కథా రచయితే కథని లీక్ చెయ్యడం. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు మూవీ కోసం కథ సిద్ధం చేస్తున్న విజయేంద్ర ప్రసాద్- కథేమిటో చెప్పేశారు. రాజ‌మౌళికి జంతువులంటే చాలా ఇష్టం కాబ‌ట్టి ఆఫ్రికా అడ‌వుల నేపథ్యంలో కథ వుంటుందని చెప్పేశారు. ప్రసిద్ధ అమెరికన్ రచయిత విల్బర్ స్మిత్ రాసిన ఒక హిస్టారికల్ థ్రిల్లర్ ని కథ కోసం తీసుకున్నట్టు కూడా చెప్పేశారు...ఉండుండి ఆ మధ్య పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు కథ కూడా లీకైందని వార్తలొచ్చాయి.

ఈ విధంగా టాలీవుడ్ లో లీకుల పరిశ్రమ వెలసి దాని పని అది చేసుకు పోతోంది. సంతోషించాల్సిందేమిటంటే, లీకులు పాజిటివ్ గానే వుంటున్నాయి. సినిమాలు డ్యామేజ్ అయ్యేలా కథల్ని చెత్తగా మార్చి విష ప్రచారాలు చేయడం లేదు.
***