రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, May 30, 2024

1432 : హాలీవుడ్ రివ్యూ

 

దర్శకత్వం : మైకేల్ షో వాల్టర్
తారాగణం : ఏన్ హాత్వే, నికోలస్ గాలిట్జీన్, ఎల్లా రుబీన్, రీడ్ స్కాట్ తదితరులు
రచన : మైకేల్ షో వాల్టర్, జెన్నిఫర్ వెస్ట్ ఫెల్ట్
సంగీతం : సిద్ధార్థ ఖోస్లా, ఛాయాగ్రహణం : జిమ్ ఫ్రొహ్నా 
బ్యానర్స్ : అమెజాన్ - ఎంజీఎం స్టూడియోస్
విడుదల : మే 2, 2024 (అమెజాన్ ప్రైమ్)
***

        మెరికన్ రోమాంటిక్ డ్రామా ది ఐడియా ఆఫ్ యూ మార్చిలో విడుదలైంది. అక్కడ్నుంచి మే 2 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 2001 నుంచీ 10 రోమాంటిక్ సినిమాలు తీసిన మైకేల్ షో వాల్టర్ దీని దర్శకుడు. 2014 నుంచి 14 సినిమాలు  నటించిన బ్రిటిష్ నటుడు నికోలస్ గాలిట్జీన్ ఇందులో హీరో. 2001 నుంచి 45 సినిమాలు నటించిన అమెరికన్ నటి ఏన్ హాత్వే హీరోయిన్. న్యూయార్క్ లో గోల్డ్ స్పాట్ బ్యాండ్ తో ప్రసిద్ధి చెందిన సిద్ధార్థ ఖోస్లా సంగీత దర్శకుడు. రచయిత్రి రాబిన్ లీ ఇదే పేరుతో రాసిన హిట్ నవల ఈ సినిమా కాధారం. అయితే ఈ సినిమా చూసి తీవ్ర అసంతృప్తి చెందిన రాబిన్ లీ చేసిన వ్యాఖ్యలేమిటి? తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రోమాంటిక్ డ్రామా కథేమిటి? కొత్తగా చెప్తున్నదేమిటి? ఇవి తెలుసుకుందాం...

కథ

లాస్ ఏంజిలిస్ లో సోలెన్ మర్చండ్ (ఏన్ హాత్వే) విజయవంతంగా ఆర్ట్ గ్యాలరీ నడుపుతున్న నడివయస్కురాలు. 40 ఏళ్ళ ఆమెకి 16 ఏళ్ళ కూతురు ఇజ్జీ (ఎల్లా రుబీన్) వుంటుంది. సోలెన్ భర్త డానియేల్ (రీడ్ స్కాట్) నుంచి విడాకులు తీసుకుంది అతను వేరే వ్యవహారం నడపడంతో. అయితే అతను వచ్చి పలకరించి పోతూనే వుంటాడు. ఒక రోజు అతను కూతురు ఇజ్జీనీ, ఆమె ఫ్రెండ్స్ నీ మ్యూజిక్ ఫెస్టివల్ కి తీసుకుపోతూంటే, మధ్యలో ఆఫీసు నుంచి అర్జెంట్ కాల్ రావడంతో, వీళ్ళని తీసికెళ్ళమని సోలెన్ ని కోరతాడు. సోలెన్ వాళ్ళని తీసుకుని మ్యూజిక్ ఫెస్టివల్ కి వెళ్తుంది. అక్కడ బాత్రూమ్ కోసం వెతికి ఆగి వున్న వ్యాను బాత్రూమ్ అనుకుని ఎక్కేస్తుంది. అది బాత్రూమ్ కాదు, పాపులర్ సింగర్ హేస్ క్యాంప్ బెల్ పర్సనల్ వ్యాన్. ఆగస్ట్ మూన్ అనే బ్యాండ్ అతను నడుపుతున్నాడు.
       
వ్యానులో ఈ అనుకోని పరిచయం ఇద్దరి మధ్యా రిలేషన్ షిప్ కి దారితీస్తుంది. మొదట తన కన్నా 16 ఏళ్ళు చిన్నవాడైన హేస్ తో ప్రేమాయణం మనస్కరించక పోయినా క్రమంగా అతడ్ని అంగీకరిస్తుంది. ఇద్దరి
మధ్య ప్రేమ మెల్లగా పెరగడం మొదలైన తర్వాత ఒకటొకటే అర్ధమవుతాయామెకి. కలిసి వుండాల్సిన అవసరం, ఒకరినొకరు మిస్సవడం, బలంగానూ పచ్చిగానూ అనుభవమవుతున్న ప్రేమ -ఇదంతా ఎంతో కాలం నిలబడవని అర్ధమై పోతుంది. ఈ ఏజ్ గ్యాప్ రోమాన్సుకి ఈ డిజిటల్ యుగంలో వున్న భద్రత ఎంతో, సెలబ్రిటీతో జీవితం, అందులోనూ నిత్యం ప్రపంచ కళ్ళల్లో పడుతూ ఇబ్బంది పెట్టే తన నడి వయసుతో పడే బాధ ఏమిటో - ఇవన్నీ కలిసి సంఘర్షణకి గురి చేస్తాయి. అంతేగాక కూతురి ప్రశ్నలు, మాజీభర్త హెచ్చరికలు- ఇవి కూడా తోడై ఇక్కడ్నుంచి అతడితో తెగతెంపులు, మళ్ళీ అతికింపులు, మళ్ళీ తెగతెంపులు... ఇలా తయారవుతుంది జీవితం. చివరికి ఈ ప్రేమ ఏ తీరానికి చేరుకుంది? ఇద్దరూ ఒకటయ్యారా, విడిపోయారా? ముగింపేమిటి? ఇవీ మిగతా కథలో...

హాలీవుడ్ ముగింపే!
ఈ రోజుల్లో చాలా మంది స్త్రీలని  బాధపెడుతున్న వొత్తిళ్ళు-  నిరంతరం యవ్వనంగా, పరిపూర్ణంగా కనిపించాలని సమాజం, మీడియా కలిసి పెంచుతున్న వొత్తిడి... స్త్రీలు ఎలా ప్రవర్తించాలి, ఎవరితో డేటింగ్ చేయాలి, ఎలాంటి దుస్తులు ధరించాలీ వంటి విషయాలపై నిరంతర తీర్పులు, రన్నింగ్ కామెంటరీలు- ఇవి హేస్ -సోలెన్ ప్రేమ కథలో చూస్తాం.
       
ఈ కథలో తన కంటే బాగా చిన్న వాడితో డేటింగ్
చేయడాన్ని ప్రశ్నించే సమాజం ఇంకా వుండడం చోద్యంగానే వుంటుంది. వయసులో తేడా ప్రపంచానికి కనిపిస్తోంది గానీ వాళ్ళిద్దరికీ కాదు. అయితే అతను సెలబ్రిటీ. ఇక్కడొచ్చింది చిక్కు. కూతురు, భర్త, విడాకులు, వయస్సూ ... ఇలా ఇన్ని అధైర్యాలు తన కుండగా, అతను సెలబ్రిటీ కూడా కావడంతో మీడియా ఫోకస్ ని తట్టుకోలేక, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని జయించలేక, అతడితో లవ్ -హేట్ రిలేషన్ షిప్  అనే చట్రంలో ఇరుక్కుని ఏం చేసిందనేది ఇక్కడ ముఖ్యమైన పాయింటు.
       
అయితే ఇదే పేరుతో నవల రాసిన రచయిత్రి రాబిన్ లీ ఈ కథని తను ట్రాజడీగా ముగిస్తే
, సినిమా తీసి సుఖాంతం చేయడాన్ని తప్పుబట్టింది. ఈ సినిమా వాళ్ళు ఇంతే- కథలు సుఖాంతమైతేనే కమర్షియల్ గా సక్సెస్ అవుతాయని నమ్ముతారని ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. హాలీవుడ్ వాళ్ళు ఇలా చేయగా లేనిది తెలుగు సినిమాల్లో చేస్తే తప్పేమిటి? దీన్నే తెలుగులో తీస్తే పెళ్ళి చేసి, శోభనం పెట్టి, బ్యాక్ గ్రౌండ్ లో కెవ్వుమని పుట్టిన పిల్లాడి కేక విన్పిస్తేనే పరిపూర్ణమైన ముగింపు అవుతుందన్నట్టు. సోలెన్ లాంటి హీరోయిన్ పాత్ర ఎలా కిల్ అయినా ఫర్వాలేదు- సమాజం ఆడదాన్ని ఒంటరిగా వదలదు కాబట్టి- పెళ్ళి చేసి మెడకో డోలు కడుతుంది కాబట్టీ!!
        
ఈ నవల మీద వచ్చిన పాఠకుల అభిప్రాయాలూ చూస్తే- కొన్ని రోజుల వరకూ దీని ప్రభావం నుంచి తేరుకోలేక పోయామని రివ్యూలు రాశారు పాఠకులు!
—సికిందర్


1431 : స్పెషల్ ఆర్టికల్

 

దిలాబాద్ జిల్లాకి చెందిన యువతి నడిపే తెలుగు యాత్రి అనే యూట్యూబ్ ట్రావెల్ ఛానెల్లో  కొద్ది రోజుల క్రితం ఉజ్బెకిస్తాన్ నుంచి ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆమె ఎక్కిన క్యాబ్ లో డ్రైవర్ ఆమె ఇండియన్ అని తెలుసుకుని హిందీ పాట పాడడం మొదలెట్టాడు. ఆ పాట దోస్త్ దోస్త్ నా రహా అని రాజ్ కపూర్ నటించిన సంగం (1964) సినిమా లోనిది. ఇదేమీ ఆశ్చర్యపర్చే విషయం కాదు. ఎందుకంటే దశాబ్దాల  నుంచీ రష్యన్ ప్రజలకి హిందీ సినిమాలు తెలుసు. 1950, 60 లలో రాజ్ కపూర్ సినిమాలు రష్యాలో కూడా మ్యూజికల్ హిట్సే. కాబట్టి నాటి సోవియెట్ రష్యాలో భాగమైన ఉజ్బెకిస్తాన్లో క్యాబ్ డ్రైవర్ పాట పాడడం రొటీనే. రష్యన్లు రాజ్ కపూర్, మిథున్ చక్రవర్తి, హేమ మాలిని, షారూఖ్ ఖాన్ వంటి స్టార్స్ సినిమాలు చూస్తూ పెరిగారు. అయితే ఈ చారిత్రక సాంస్కృతిక అనుబంధాన్ని పునరుజ్జీవింపజేసేందుకు, రష్యాలో భారతీయ సినిమా షూట్‌లు, షోలు పెంచే పనిలో ఇరు దేశాల్లోని సినిమా పరిశ్రమలు పని చేస్తున్నాయని ఒక నివేదిక పేర్కొంటోంది.
        
లా ఎందుకు జరుగుతోంది? ఎందుకంటే, ఫిబ్రవరి 2022లో రష్యా యూక్రేన్ పై దాడి చేసినందుకు నిరసనగా హాలీవుడ్ సంస్థలు రష్యా నుంచి వైదొలిగాయి. పోతే పోయారనుకుని పుతిన్ ప్రభుత్వం ఇండియన్ నిర్మాతల్ని లాగడానికి, రష్యాలో ఇండియన్ సినిమాలని ప్రోత్సహించడానికి, నిర్మాణాలని పెంచడానికీ గట్టి ప్రయత్నం ప్రారంభించింది.
        
రష్యాలో చిత్రీకరించిన  సర్దార్ ఉద్దం సింగ్’, పఠాన్’, టైగర్ 3’, జుగ్ జుగ్ జియో’ వంటి ఇటీవలి హిట్స్ కి  సహాయ సహకారా లందించిన ముంబాయికి చెందిన ప్రొడక్షన్ లైన్ కంపెనీ కార్టినా ఎంటర్‌టైన్‌మెంట్ లైన్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తోంది. ఇంకా ఈ కంపెనీ ప్రస్తుతం అంతరిక్షంలో ప్రయాణించిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ బయోపిక్ కి, ధర్మా ప్రొడక్షన్స్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎమ్మే ఎంటర్‌టైన్‌మెంట్, రోహిత్ శెట్టి ప్రొడక్షన్స్ వంటి కంపెనీలు చేపట్టిన అనేక ప్రాజెక్టులకి షూట్ కోసం సంప్రదింపులు జరుపుతోంది.
        
ఈ సంవత్సరం రష్యన్ అధికారులు నిర్మాణ ఖర్చుల్లో రాయితీలు అందించడం ద్వారా ఎక్కువ సంఖ్యలో భారతీయ నిర్మాతల్ని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తాము ఇండియన్ నిర్మాతల కోసం ఏవైనా సేవలకి ఫ్రంట్ ఆఫీసు లేదా సూపర్ మార్కెట్ లాగా వున్నామని, ఇక్కడ షూటింగ్ చేయడానికి తక్కువ ధరల్ని అందించడం ద్వారా నిర్మాణ ఖర్చుల్ని వీలైనంత వరకూ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామనీ, మాస్కోలో మేయర్ కార్యాలయానికి చెందిన డిప్యూటీ హెడ్ ఎవ్జెనీ కోజ్లోవ్ పేర్కొన్నారు.
        
గత నెలలో తమిళ యాక్షన్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’  మాస్కో-సిటీ ఆఫ్ సినిమా కార్యక్రమంలో పాల్గొన్న మొదటి విదేశీ నిర్మాణంగా నిలిచింది. మాస్కోసిటీ ఆఫ్ సినిమా నిర్మాతలకి  రాయితీల్ని అందిస్తుంది. సినిమా నిర్మాతల్నిఆకర్షించే బాధ్యతగా మాస్కో సాంస్కృతిక శాఖ, బాలీవుడ్ నిర్మాతలతో సంబంధాలు ఏర్పరుచుకుంటోందని కోజ్లోవ్ చెప్పారు.
       
ఇదిలా వుండగా
, రష్యా అంతటా భారతీయ సినిమాల ప్రదర్శన పెరిగింది. మాస్కో, సెయింట్ పీటర్స్ బర్గ్ లతో పాటు, ఆర్ఖంగెల్స్క్, బెల్గోరోడ్, కజాన్, పెన్జా, సరతోవ్, తులా, ఉలియానోవ్స్క్, చెబోక్సరీతో సహా దేశవ్యాప్తంగా 40కి పైగా కేంద్రాల్లో భారతీయ చలనచిత్రాల్ని ప్రదర్శిస్తున్నారు.
        
బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన  బ్లాక్ బస్టర్ 'పఠాన్' లో ఘనీభవించిన సరస్సు మీద ఉత్కంఠభరి హై-స్పీడ్ మోటర్‌బైక్ చేజ్ సీక్వెన్స్ దక్షిణ సైబీరియాలో చిత్రీకరించిందే. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ లు  నటించిన యాక్షన్-థ్రిల్లర్ 'టైగర్ 3' ని సెయింట్ పీటర్స్ బర్గ్ లో  పాక్షికంగా చిత్రీకరించారు. తమిళంలో అజిత్ కుమార్ 'వలిమై', విక్రమ్ 'కోబ్రా' సహా అనేక తమిళ సినిమాలని రష్యాలో షూట్ చేశారు. విజయ్ ఆంటోనీ  'అగ్ని సిరగుగల్' ని విపరీత వాతావరణ పరిస్థితుల్లో రష్యా, కజకిస్తాన్, ఇంకా మధ్య ఆసియాలోని ఇతర ప్రదేశాల్లో షూట్ చేశారు.
        
పూర్వపు యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ (యూఎస్ ఎస్ ఆర్) -ఇండియాల మధ్య సాంస్కృతిక మార్పిడి 1950ల నాటి రాజ్ కపూర్ క్లాసిక్స్ 'ఆవారా',  'శ్రీ 420' తో ప్రారంభమైంది. రాజ్ కపూర్ తరువాతి 20 సంవత్సరాల పాటు రష్యాలో అభిమాన తారగా వెలుగొందారు.  'ఆవారా' - రష్యన్ భాషలో డబ్ అయి  'బ్రొడియాగా' గా విడుదలైంది. 1970లో రాజ్ కపూర్ 'మేరా నామ్ జోకర్' ఇండియాలో ఫ్లాపైనా రష్యాలో పెద్ద హిట్. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, రేఖ, మిథున్ చక్రవర్తిల సినిమాలు హిట్టవసాగాయి. మిథున్ చక్రవర్తి డిస్కో డాన్సర్ తో రష్యన్స్ ని గంగవెర్రులెత్తించాడు.
       
అయితే ఇప్పుడెన్ని షూటింగులు రష్యాలో జరిగినా
, ఎన్ని సినిమాలు ప్రదర్శించినా రష్యన్లకి ఇండియన్ సినిమాలంటే పాత సినిమాలే. పాటలంటే పాత పాటలే. సన్నగా వర్షం కురుస్తున్న నడి రాత్రి ఉజ్బెకిస్తాన్ క్యాబ్ డ్రైవర్, పక్కన తెలుగు యాత్రితో,  దోస్త్ దోస్త్ నా రహా పాడుకుంటూ డ్రైవ్ చేస్తూ, గతాన్ని స్మరించుకుంటూ తదాత్మ్యం చెందడం ఒక అపురూప  దృశ్యమే!

***
  

Thursday, May 23, 2024

1430 : మలయాళం రివ్యూ


రచన- దర్శకత్వం : జిత్తూ మాధవన్
తారాగణం : ఫాహద్ ఫాజిల్
, హిప్ స్టర్, మిథున్ జై శంకర్, శంతన్, అంబన్, మన్సూరలీ ఖాన్, నీరజా రాజేంద్రన్ తదితరులు
సంగీతం :
సుశీన్ శ్యామ్, ఛాయాగ్రహణం : సమీర్ తాహిర్
బ్యానర్స్ : అన్వర్ రషీద్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫాహద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్
నిర్మాతలు : నజ్రియా నజీమ్, అన్వర్ రషీద్
విడుదల : మే 9
, 2024 (అమెజాన్ ప్రైమ్)

 ***

        లయాళం సినిమాలు తిరిగి హిట్ బాట పట్టి అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి, 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకూ వరుసగా 5, 15,30 కోట్ల బడ్జెట్స్ తో తీసిన సినిమాలు 100 కోట్లకి పైగా వసూళ్ళు సాధిస్తున్నాయి. ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, భ్రమయుగం, ఆడు జీవితంల తర్వాత ఇప్పుడు ఆవేశం...ఏప్రిల్ 11 న విడుదలైన ఆవేశం అయితే 4 వారాల్లో 155 కోట్లు వసూలు చేసి ఓటీటీలో స్ట్రీమింగ్ కొచ్చేసింది. దీన్ని 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫాహద్ ఫాజిల్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీ ఈ రోజు (మే 9) నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం మలయాళం భాషలో ఇంగ్లీషు సబ్ టైటిల్స్ తో ప్రసారమవుతున్న ఈ మూవీ లో అసలేముంది? ఎందుకింత హిట్టయ్యింది? తెలుసుకుంటే సినిమా తీయడం చాలా సింపుల్ విషయమని తెలిసిపోతుంది. హైప్ లు, బిల్డప్పులు, హీరోయిన్లు, రోమాన్సులు కూడా అవసరం లేదని అర్ధమైపోతుంది. వివరంగా చూద్దాం...

కథ

అజు (హిప్‌స్టర్), బీబీ (మిథున్ జై శంకర్), శంతన్‌ (రోషన్ షానవాజ్) అనే ముగ్గురూ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవడానికి కేరళ నుంచి బెంగుళూరు వస్తారు. కాలేజీ హాస్టల్ కంటే ప్రైవేట్ హాస్టల్లో స్వేచ్ఛగా వుండొచ్చని అక్కడ చేరతారు. కాలేజీలో సీనియర్ విద్యార్ధి కుట్టి తో మాటామాటా పెరిగి అతడి అహాన్ని దెబ్బతీస్తారు. ప్రతీకారంగా కుట్టి అతడి గ్యాంగ్ ముగ్గుర్నీ కొడతారు. దీన్ని అవమానంగా భావించి అజు ప్రతీకారం తీర్చుకోవడానికి లోకల్ గ్యాంగ్‌స్టర్స్ ని వెతకడం ప్రారంభిస్తాడు. ఒక బార్ లో ముగ్గురికీ మలయాళీ-కన్నడిగ గ్యాంగ్ స్టర్ రంగా (ఫాహద్ ఫాజిల్) పరిచయమవుతాడు. అతను మెడకి, చేతులకి బాగా బంగారం వేసుకుని, వైట్ డ్రెస్ లో వుంటాడు. కోపం వచ్చినా, సంతోషం వచ్చినా అతిగా స్పందిస్తాడు. అతడితో స్నేహం కొనసాగిస్తూ కాలేజీలో కుట్టి గ్యాంగ్ వల్ల తమకి జరిగిన అవమానం గురించి చెప్తారు. రంగా తన గ్యాంగ్ ని పెట్టి కుట్టినీ, అతడి గ్యాంగ్ నీ చిత్తుగా తన్నిస్తాడు. అయితే అజు అండ్ ఫ్రెండ్స్ కి దీంతో సంతృప్తి కలిగినా, రంగాతో స్నేహం వదులుకోలేని పరిస్థితి వుంటుంది, అతను వెంటపడి స్నేహం చేస్తూంటే.
       
దీంతో చదువులో వెనుకబడిపోతారు.
పరీక్షలు తప్పుతారు, ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయబోతే, బతిమాలుకుని పరీక్షలు క్లియర్ చేస్తామని మాటిస్తారు. కానీ పరిస్థితిని రంగా అర్ధం జేసుకోడు. అతను హర్ట్ అవకుండా స్నేహం ఎలా వదులుకోవలో వీళ్ళకీ అర్ధం గాదు. ఇంతలో రంగా మాజీ బాస్ రెడ్డి (మన్సూరలీ ఖాన్) రంగాని  చంపడానికి ఈ ముగ్గురి సాయం కోరతాడు.
       
ఇప్పుడేం ఛేశారు
? రంగాని వదిలించుకుని చదువు మీద దృష్టి పెడదామంటే రెడ్డి వచ్చి సాయం అడుగుతాడేమిటి? రంగాని వదిలించు కోవడమంటే అతడ్ని చంపడమేనా? ఇలా ఇన్ని సమస్యల్లోంచి ఎలా బయటపడ్డారన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

ఇది చాలా తేలికపాటి యాక్షన్ కామెడీ కథ. ఎంటర్టయిన్ చేయడమే ముఖ్యోద్దేశం. ముగ్గురు కాలేజీ స్టూడెంట్స్ తమకి జరిగిన  అవమానానికి ప్రతీకారం కోసం గ్యాంగ్ స్టర్ ని ఆశ్రయిస్తే, ఆ గమ్మత్తయిన కామెడీ గ్యాంగ్ స్టర్ ఈ ప్రతీకారం తీర్చి బదులుగా స్నేహం చేయడం మొదలెట్టాడు. దీంతో వాళ్ళ చదువు గల్లంతై అతడ్ని వదిలించుకోవడమెలా అనుకుంటే, ఇంకో గ్యాంగ్ స్టర్ వదిలించుకునే మార్గం చెప్పాడు... ఇంతే కథ. ఈ స్పీడు యుగంలో భారీ కథలు అక్కర్లేదు. ఈ తేలికపాటి కథకి రెండున్నర గంటలు కూర్చోబెట్టే కథనం చేయడం దగ్గరే  కష్టపడాలి, అంతే. సినిమాకి ఇంత చాలు. ఎక్కువైతే ఫ్లాప్ అయ్యే అవకాశాలే ఎక్కువ. హాలీవుడ్ ది బీకీపర్ కూడా ఇలాగే యాక్షన్ ఎక్కువ, స్టోరీ తక్కువ.  
       
అయితే ఈ తేలికపాటి స్టోరీని నిలబెట్టిన ఎలిమెంట్ ఇంకోటి కూడా వుంది. ఫాహద్ ఫాజిల్ గ్యాంగ్ స్టర్ క్యారక్టర్ తీరుతెన్నులు. అంతు చిక్కని మనస్తత్వంతో
, ఎప్పుడేం చేస్తాడో తెలియని బిహేవియర్ తో, సంతోషమైనా, కోపమైనా, ఏదైనా చాలా అతి చేసే ఎమోషనల్ క్యారక్టర్ గా తన చుట్టూ తిరిగే కథతో ఆడుకోవడం. ఈ క్యారక్టరైజేషన్ లేకపోతే తేలికపాటి స్టోరీకూడా ఏమీ చేయలేదు.
       
ఫస్టాఫ్ - సెకండాఫ్ రెండిటినీ బ్యాలెన్స్ చేసే క్యారక్టర్ ఇది. మీకు సాయం కావాల్సి వస్తే పోలీసుల దగ్గరికెళ్ళండి
, రౌడీల్ని వెంటబెట్టుకుంటే వాళ్ళు శత్రువులకన్నా ఎక్కువై పోతారని- ఒక అంతర్లీన హెచ్చరిక చేసే కథ ఇది.  మీడియం రేంజి సినిమాకి హై రేంజి ఫలితాల్ని ఇచ్చే- ఇస్తున్న మూవీ మేకింగ్ పాఠమిది.

నటనలు- సాంకేతికాలు

ఇది పూర్తిగా ఫాహద్ ఫాజిల్ ఒన్ మ్యాన్ షో. అతడి నటనకి స్పీడు ఒక ముఖ్య టూల్. పూర్తిగా సైకో కామెడీ చేసే పాత్ర. క్లయిమాక్స్ వరకూ ఒక సస్పెన్స్ పోషిస్తాడు. ఇంత హైపర్ యాక్టివ్ గా ఏదైనా అతిగా చేసే ఇతను పిరికివాడా అన్నట్టు వుంటాడు. ఎలాగంటే, ఏదైనా స్ట్రీట్ ఫైట్ జరిగేటప్పుడు తన గ్యాంగ్ ని ముందుకు తోసి తను వెనక దాక్కుంటాడు. గ్యాంగ్ లో అంబన్‌ (సజీన్ గోపు) అనే అనుచరుడు కెప్టెన్ గా పొరాడి సక్సెస్ చేస్తాడు. ఇలా తను ఫైట్ చేయకుండా పిరికివాడా అన్నట్టు సస్పెన్స్ ని పోషిస్తాడు. క్లయిమాక్స్ లో మాత్రం ఒంటరిగా విరోధులకి చిక్కి నప్పుడు విజృంభించి విశ్వరూపం చూపిస్తాడు. పాత్రచిత్రణలో ఈ వెలుగు నీడలు ఇంట్రెస్టింగ్ గా వుంటాయి. ఫాజిల్ దీంతో స్టార్ గా చాలా ఎత్తుకెళ్ళిపోయాడు.
       
ఈ మూవీలో హీరోయిన్లు లేరు
, రోమాన్సులు లేవు. ఉన్న ఒక్క స్త్రీపాత్ర ఒక స్టూడెంట్ కి మదర్ గా నటించిన నీరజా రాజేంద్రన్, అంతే. స్టూడెంట్స్ గా నటించిన ముగ్గురూ హిప్ స్టర్, మిథున్ జై శంకర్, శంతన్ మంచి టాలెంట్ ని ప్రదర్శించారు.
       
డిమ్ లైటింగ్ తో సమీర్ తాహిర్ ఛాయాగ్రహణం కథకి తగ్గ మూడ్ ని క్రియేట్ చేస్తే
, సుశీన్ శ్యామ్ సంగీతం సీన్స్ కి ప్రాణం పోసింది. భారీ క్రౌడ్ తో గ్యాంగ్ స్టర్ రంగా బర్త్ డే పార్టీ సాంగ్ కొరియోగ్రఫీ పరంగానూ, కళాదర్శకత్వం పరంగానూ అతి పెద్ద ఆకర్షణ.
       
2023 లో
రోమాంచమ్ అనే సూపర్ హిట్ తీసిన దర్శకుడు జిత్తూ మాధవన్ తనదైన బ్రాండ్ ముద్రతో, శైలితో సినిమా తీయడానికి లేనిపోని బరువులు మోయనవసరం లేదని మరోసారి నిరూపిస్తూ బాక్సాఫీసుని భారీగా నింపేశాడు.

—సికిందర్


Monday, May 20, 2024

1429 : రివ్యూ

 

 రచన -దర్శకత్వం : మణికాంత్ గెల్లి

తారాగణం : రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్ తదితరులు
సంగీతం : కళ్యాణీ మాలిక్, ఛాయాగ్రహణం : ఆఖిల్ వల్లూరి
నిర్మాతలు : నవ్య, రంజిత్ కుమార్, చందన
విడుదల : మే 17, 2024 (ఆహా ఓటీటీ)
***

హా నుంచి ఓటీటీలో పెళ్ళి కథతో మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో శివానీ రాజశేఖర్ హీరోయిన్ గా నటించింది. రాహుల్ విజయ్ హీరో. మణికాంత్ దర్శకుడు. తెలంగాణాలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతబడిన సమయంలో ఇంట్లో చూసుకోవడానికి ఈ పెళ్ళి కథ ఎలా వుందో చూద్దాం…

కథ
    సాఫ్ట్ వేర్ లో పనిచేసే విద్య (శివానీ రాజశేఖర్) ఇంట్లో పెళ్ళి వొత్తిడిని దాట వేస్తూ వుంటుంది. నచ్చిన వాడు దొరకడం కష్టమని చెబుతుంది. మెకానికల్ ఇంజనీరుగా చిన్న ఉద్యోగం చేసే వాసు (రాహుల్ విజయ్) కూడా ఇదే అభిప్రాయంతో పెళ్ళిని వాయిదా వేస్తూ వుంటాడు. ఇద్దరూ అపరిచితులుగా ఒక చోట ఓ ప్రవచనం విన్నప్పుడు పెళ్ళికి అంగీకారం తెలుపుతారు. అయితే విద్య ఒక షరతు పెడుతుంది. సంబంధాల కోసం చూస్తున్న అబ్బాయిలకి ఒక ప్రశ్నా పత్రం పంపి అందులో కరెక్టుగా సమాధానాలిచ్చిన వాడితో పెళ్ళి చూపులకి ఒప్పుకుంటానంటుంది.

అలా వాసుకి ఒక ప్రశ్నాపత్రం చేరుతుంది. అతనిచ్చిన సమాధానాలు నచ్చి పెళ్ళి చూపులకి ఒప్పుకుంటుంది. పెళ్ళిచూపుల్లో ప్రత్యక్షంగా మాట్లాడుకున్నాక పెళ్ళికి ఒప్పుకుంటుంది. పెళ్ళి చేసుకున్నాక మరొక లిస్టు ఇచ్చి వాటికి ఒప్పుకోవాలంటుంది. ఒప్పుకున్న తర్వాత గతంలో తనని ఏక పక్షంగా ప్రేమించిన వాడి గురించి చెబుతుంది. దీంతో అతడి ఇగో దెబ్బ తింటుంది, దాంతో ఆమె ఇగో కూడా దెబ్బ తింటుంది. ఒకే ఇంట్లో ఇద్దరూ ఎడమొహం పెడ మొహంగా వుంటారు. ఇప్పుడు వీళ్ళ ఇగోల సమస్య ఎలా తీరింది? ఎలా తిరిగి దగ్గరయ్యారు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ
    సమకాలీన సమస్యతో డైనమిక్ కథ కాదు. ఏ నాటిదో పాత పెళ్ళి కథ. కథలోసరైన సంఘర్షణ కూడా లేదు. సంఘర్షణ కాని సంఘర్షణగా చూపించిన పాయింటుకి చెప్పిన కారణం ఆమెని కన్నింగ్ క్యారక్టర్ గా తయారు చేసింది. ఒకసారి పెళ్ళి చూపులకి ముందే ప్రశ్నాపత్రంతో పరీక్షపెట్టి ఒప్పుకున్నప్పుడు, మొదటి రాత్రి ఇంకో ప్రశ్నాపత్రం తీయడమేమిటి? అతను ఆమెని నాలుగు దులుపుళ్ళు దులపక సంతకం పెట్టి ఇవ్వడమేమిటి? ఆమె తనని ఏక పక్షంగా ప్రేమించిన వాడి గురించి పెళ్ళి చూపులప్పుడే చెప్పేయక, మొదటి రాత్రి చెప్పడమేమిటి? ఆమె క్రిమినల్ మెంటాలిటీకి అతను గుడ్ బై కొట్టేయక ఇంకా ఆ ఇంట్లో వుండడమేమిటి? అతడి జాబ్ పోయాక ఆమె మీద ఆధారపడి బ్రతకడమేమిటి? చివరికి అతను స్టార్ట్ అప్ బిజినెస్ పెట్టుకునే ఆలోచనతో వున్నాడని తెలుసుకుని, అందుకు ఆమె చెక్కు ఇస్తే తీసుకుని ఈ కథకి ముగింపు పలకడమేమిటి? ఆ చెక్కు ఆమె పాత ప్రేమ నుంచి అతడి దృష్టి మళ్ళించడానికి తాయిలంలా ఇస్తున్నట్టు అన్పించలేదా? ఇన్నిసార్లు తనతో ఆడుకుంటూ వుంటే బకరాలా అతను బిహేవ్ చేయడమేమిటి? కథకి, పాత్రలకి ఏమైనా అర్ధం పర్ధం వున్నట్టు అన్పిస్తున్నాయా?
        
దర్శకుడు ఆమె పాత్రకి అలాటి యాంగిల్స్ ఉద్దేశించి వుండక పోవచ్చు. కానీ ఆలోచన లేకుండా కథ రాసి పడేస్తే అలాగే కన్నింగ్ క్యారక్టర్ గానే తేలింది ఆమె పాత్ర. చెవిలో పువ్వులు పెట్టినట్టుగానే తయారైంది అతడి పాత్ర. విద్యకి అహం లేదు, వాసుకీ అహం లేదు- వున్నదల్లా వాసుతో విద్య ఆడుకున్న క్రిమినల్ గేమే ఈ కథ!
       
ఈ కథతో దర్శకత్వం కూడా సినిమా తీసినట్టుగా లేదు. టీవీ సీరియల్ కంటే దిగదుడుపుగా వుంది. నిలబడి
, కూర్చుని పాత్రలు మాట్లాడుకోవడమే వుంది. మాటలతోనే కథ సాగుతూంటుంది, సంఘటనలతో కాదు. దృశ్యాల్లో చలనం వుండదు. కాబట్టి ఈ సినిమా విజువల్స్ మూసేసి ఆడియో వింటే రేడియో నాటికలా చక్కగా అర్ధమైపోతుంది. ఇక హీరోహీరోయిన్ల పేరెంట్స్ పాత్రలు కథకి అనవసర బరువు. చేసేదేమీ వుండదు. కొత్త కాపురం చూడడానికి నల్గురూ వచ్చేస్తారు. వచ్చేసి ఎప్పుడు చూసినా సోఫాల్లో కూర్చునే వుంటారు. కొత్త కాపురంలో పరిస్థితిని గ్రహించరు. ఎక్కడైనా వియ్యాపురాళ్ళు ఇద్దరూ ఇలా వస్తే ఇంట్లో ఎమున్నాయీ ఏం లేవూ తరచి చూసి సలహాలిస్తారు. కొత్త కాపురం మరింత ఎలివేట్ అవడానికి సూత్రాలు చెప్తారు. లేదా ఒకావిడ ఎన్టీఆర్- భానుమతిల వివాహబంధంలో సూర్యకాంతంలా వుంటే, కూతురి కాపురంలో ఇన్వాల్వ్ అయి నిప్పుల కుంపటి పెడుతుంది. ఇలా వుంటాయి జీవితాలు. దర్శకుడు ఈ జీవితాల్ని, డ్రామానీ చూపించే ప్రయత్నమే చేయలేదు. పొడిపొడిగా పైపైనా ఏదో చూపించేసి సరిపెట్టాడు. చివరికా పేరెంట్స్ కి కొత్త కాపురంలో ఇగోల సమస్య తెలియకుండానే ముగిసిపోతుంది కథ. అందుకే ఇవి అనవసర పాత్రలు.

 నటనలు సాంకేతికాలు
    శివానీ రాజశేఖర్ నటన ఒక్కటే ఈ సినిమాకి ఆకర్షణ. పాత్ర ఎలా వున్నా నటనలో ఈసారి ఇంప్రూవ్ అయింది. కథలో సంఘర్షణ, కోపతాపాలు వంటివి లేకపోవడంతో సన్నివేశాల్ని సున్నితంగా, అనుభవశాలిలా నటించి ఓకే అన్పించుకుంది. కానీ హీరో రాహుల్ విజయ్ మొహంలో భావాలు పలికే ప్రశ్నే లేదు. తను వున్న సన్నివేశాలకి ప్రాణం పోసే నటనే లేదు. సాంకేతికంగా చెప్పుకోదగ్గదిగా లేదు. 90 శాతం ఇండోర్స్ దృశ్యాలే వున్నాయి. ఇవీ చలనం లేకుండా స్తబ్దుగా ,వుండే దృశ్యాలు. ఎక్కడా లేచి పరుగెట్టవు. పడుకునే వుంటాయి. కళ్యాణీ మాలిక్ సంగీతం కూడా ఇంతే బలహీనం. సమకాలీన సమస్యలతో పెళ్ళికథ తీయకుండా, పాత బడిన ఫార్ములా కథనే, పాత్రల్ని ఇలా తయారు చేసి చాదస్తంగా తీస్తే, యూత్ కెలా కనెక్ట్ అవుతుందన్నది ప్రశ్న!

—సికిందర్

Friday, May 10, 2024

1428 : రివ్యూ

రచన-దర్శకత్వం: హరి
తారాగణం : విశాల్, ప్రియా భవానీ శంకర్, తులసి, సముద్రకని, మురళీ శర్మ, యోగి బాబు, విజయ్ కుమార్, జయప్రకాష్ తదితరులు
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : సుకుమారన్
నిర్మాత : కార్తికేయన్ సంతానం, అలంకార్ పాండియన్  
విడుదల :ఏప్రిల్ 26, 2024
***
        పురచ్చి దళపతి (విప్లవ దళపతి) విశాల్ 2017 లో ‘తుప్పరివాలన్’ (తెలుగులో ‘డిటెక్టివ్’) 
హిట్టయిన తర్వాతవరుసగా 9 ఫ్లాపులిచ్చి, చిట్టచివరికి 2023 లో మార్క్ ఆంథోనీ తో ఏకంగా రూ. 100 కోట్ల బ్లాక్ బస్టర్ ఇచ్చేసి సర్ప్రైజ్ చేశాడు. ఈ మాస్ యాక్షన్ మూవీకి సైన్స్ ఫిక్షన్ జోడించి విప్లవాత్మకంగా ఒక కొత్త వెరైటీని సృష్టించాడు. ఇకపైన విశాల్ ఇలాగే అప్డేట్ అవుతూ బ్లాక్ బస్టర్స్ ఇస్తాడనుకునేలా నమ్మకం కల్గించాడు. తమిళంలో సూర్యతో సింగం సిరీస్ పోలీస్ సినిమాలతో రికార్డులు బ్రేక్ చేసిన దర్శకుడు హరి కూడా తన ఒకే రకమైన పాత మూస మాస్ సినిమాలనుంచి అప్డేట్ అయినట్టూ కనిపించాడు.  కానీ మళ్ళీ అదే పాత మూస బాట పట్టి మరో మూడు అట్టర్ ఫ్లాపులిచ్చాడు. ఇలా  అప్డేట్ అయిన విశాల్, అప్డేట్ అయీ పాత వాసనలు వెదజల్లడానికే సిద్ధపడిన హరి తో చేతులు కలిపితే ఏం జరిగింది? చేతులు కాలాయా, కరతాళ ధ్వనులు అందుకున్నాయా? ఏం జరిగిందో తెలుసుకుందాం...

కథ
చిత్తూరులో పళని స్వామి (సముద్రకని) అనే ఎమ్మెల్యేకి రత్నం (విశాల్) నమ్మిన బంటుగా వుంటూ పనులు చక్కబెడుతూంటాడు. పోలీసులు చేసే సగం పనులు తనే చేసి శాంతి భద్రతలకి గ్యారంటీగా వుంటాడు. చిన్నతనంలో తల్లిని కోల్పోయిన బాధ వెంటాడుతూంటుంది. ఇలా వుండగా, ఓ రోజు మల్లిక (ప్రియా భవానీ శంకర్) నీట్ పరీక్ష రాయడానికి చిత్తూరు వస్తే ఆమెని చంపడానికి ఓ గ్యాంగ్ ప్రయత్నిస్తుంది. రత్నం ఆ దాడిని తిప్పికొట్టి ఆమెని కాపాడతాడు. ఆమెని ప్రేమిస్తాడు. అయితే ఆమె తన తల్లి పోలికలతో వుండడంతో క్షోభ అనుభవిస్తాడు. ఆమెని చంపడానికి గ్యాంగ్ చేసే ప్రయత్నాలు ఆగవు.
       
మల్లిక కుటుంబానికి కొంత స్థలముంది. ఆ స్థలం తమిళనాడు నుంచి తిరుపతి విడిపోయినప్పుడు తమిళనాడులోకి వెళ్ళిపోయింది. ఆ స్థలంలో పూర్వీకుల సమాధులున్నాయి. సంవత్సరానికోసారి వెళ్ళి పూజలు చేసి వస్తూంటారు. ఈ సంవత్సరం వెళ్ళినప్పుడు చూస్తే
, ఆ స్థలంలో ఓ మెడికల్ కాలేజీ కట్టేస్తున్నారు. దీంతో మల్లిక తండ్రి (జయప్రకాష్)  ల్యాండ్ మాఫియా లింగం (మురళీ శర్మ) మీద పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాడు. పోలీసులు తండ్రి సంతకంతో వున్న అగ్రిమెంట్ చూపించి దబాయించారు.
       
దీనికి ముందు మల్లిక చదువుకోసం ఆమె తండ్రి వేరే చోట కొంత అప్పుతీసుకుని
, ఖాళీ కాగితం మీద సంతకం పెట్టి ఇచ్చాడు. ఆ కాగితాన్ని సొంతం చేసుకున్న లింగం, దాని మీద స్థలం అమ్మకం తాలూకు అగ్రిమెంట్  రాసుకుని వెళ్ళగొట్టాడు. అయితే అగ్రిమెంట్ మీద తన సంతకం చెల్లదని తండ్రి అసలు విషయం బైట పెట్టాడు. ఆ స్థలాన్ని ఆరవ తరానికి చెందిన మొదటి వారసులే అమ్మగలరనీ, ఆ ప్రకారం ఆరవ తరం మొదటి వారసురాలిగా తన కూతురు మల్లికకి మాత్రమే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టే అధికారముందనీ స్పష్టం చేసేశాడు.
       
దీంతో లింగం
, ఈ కూతురు మల్లికని గనుక లేపేస్తే అయిదవ తరం వారసుడు తండ్రి చేసిన సంతకంతో అగ్రిమెంట్ చెల్లుతుందని మల్లికని లేపేసే కార్యక్రమానికి తెర లేపాడు.
       
ఇప్పుడేం జరిగింది
? రత్నం మల్లికని కాపాడి స్థలం ఆమె కుటుంబానికి దక్కేలా లింగం అంతు చూశాడా? తల్లి పోలికలతో వున్న మల్లికని ప్రేమించలేని క్షోభ నుంచి ఎలా బయట
పడ్డాడు? తల్లి మరణంతో లింగం కున్న సంబంధం తెలుసుకుని ఏం చేశాడు? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగతా కథ.

ఎలావుంది కథ 

హరి చేతిలో హరీమన్న పాత రొడ్డ కొట్టుడు కథ. హరితో చేతులు కలిపి విశాల్ తిరిగి 'మార్క్ ఆంథోనీ పూర్వపు ఫ్లాప్ మసాలా కాలాని కెళ్ళిపోయిన కథ. ప్రమాదంలో హీరోయిన్, ఆ హీరోయిన్ ని కాపాడే హీరోల సినిమాలు తెలుగులో, తమిళంలో వచ్చీ వచ్చీ చచ్చిపోయాయి. దీన్ని బతికించడానికి ఇప్పుడు నానా పాట్లు పడ్డారు. స్థూలంగా ఒక ల్యాండ్ సెటిల్మెంట్ కథని సాగదీసి సాగదీసి, చెప్పడానికి కథ లేదన్నట్టు అడుగడుగునా ఫైట్లతో నింపేశారు.

తమిళనాడు నుంచి తిరుపతి విడిపోయినప్పుడు తమిళనాడులోకి స్థలం వెళ్ళిపోవడమనే అంశం, 2017 లో విద్యాబాలన్ నటించిన బేగం జాన్ ని గుర్తు చేస్తుంది. ఇందులో 1947 లో దేశ విభజనప్పుడు అటు బెంగాల్లో, ఇటు పంజాబ్ లో రెండు గీతలు గీసేసి దేశాన్ని విభజించేస్తాడు రాడ్ క్లిఫ్. అటు తూర్పు పాకిస్తాన్, ఇటు పశ్చిమ పాకిస్తాన్, మధ్యలో ఇండియా పొమ్మంటాడు. దీని ప్రకారం కంచె వేసుకుంటూ వస్తూంటే, సరీగ్గా రాడ్ క్లిఫ్ రేఖ మీద బేగం జాన్ వేశ్యా గృహం తగుల్తుంది. ఖాళీ చేయాల్సిందిగా ఆమెకి నోటీసులిస్తే చించి పారేస్తుంది- మీరు సాని కొంప అంటున్న ఈ ఇల్లు నా ఇల్లు, నా దేశం. మమ్మల్ని ఇక్కడ్నించి కదిలించాలని చూశారో, మీ కాళ్ళూ చేతులూ తీసేసి దేహ విభజనచేస్తాంఅని వార్నింగ్ ఇస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ ఎమోషనల్  స్టోరీ.

        
ఇదొకటైతే, రత్నం లో హీరో తల్లికి వేశ్యాగృహంలో మగ్గే కథ ఫ్లాష్ బ్యాకుగా వేశారు. ఇలా ప్రాంత విభజనతో స్థలం స్థానభ్రంశం చెందడం, వేశ్యాగృహమూ అనే ఈ రెండు అంశాలూ బేగం జాన్ నుంచి ఎత్తేస్తే వచ్చిన ఫలితమే, రత్నం అనే రొడ్డ కొట్టుడు అని అనుమానించాల్సిన పరిస్థితి.
       
ఫస్టాఫ్ న్యాయం పేరుతో హత్యలుచేసే హీరో
, ప్రమాదంలో హీరోయిన్, ఆమెతో ప్రేమ, తర్వాత ఆమె అసలు కథ అనే టెంప్లెట్ లో సాగినా, అగ్రిమెంట్ కాగితమనే వివాదం దగ్గర కొత్త మలుపు తీసుకున్నా, సెకండాఫ్ కొచ్చేసరికి గుంటూరు కారం లో తాత గారి అగ్రిమెంట్ పై మహెష్ బాబు సంతకం పెట్టాల్సిన తరహాలో అర్ధంపర్ధం లేని కథలా మారిపోయింది. పైగా ఈ కథ వదిలేసి హీరో తల్లి చావుకి కారకుడయ్యాడని అదే విలన్ మీద పగదీర్చుకునే హీరో రివెంజీ స్టోరీగా మారిపోయింది! అట్టర్ ఫ్లాపులతో అన్నేళ్ళ అనుభవంతో విశాల్ కథల్ని ఎలా జడ్జి చేస్తాడో అర్ధంగాని పదార్ధంగా మారిపోయింది...

నటనలు- సాంకేతికాలు
వీటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కళ తప్పిన మొహంతో హీరోయిన్, కండలు తిరిగిన శరీరంతో విశాల్, దట్టంగా పౌడరు పూసుకునే పిచ్చితో విలన్-అంతా ఆటవికంగా వుంటుంది. దర్శకుడు హరి రిటైర్ అవడానికిక పరాకాష్ట. అవసరం లేకపోయినా ఫైట్లు. అవీ సాగదీసిన ఫైట్లు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతమైతే చెప్పక్కర్లేదు- శరీరం కుంచించుకుపోయే స్వరాలు. బ్యాక్ గ్రౌండ్ విషాద గీతం, దాని సాహిత్యం అద్భుతం. విశాల్ తెలుగు డబ్బింగ్ అయితే ఎవరో జూనియర్ ఆర్టిస్టుకి చెప్పినట్టుంది. డబ్బింగ్ ఆర్టిస్టు విశాల్ ని జ్యూనియర్ ఆర్టిస్టు అనుకున్నాడేమో తెలీదు.
       
ఇంకో ముఖ్య విషయమేమిటంటే-
బేగం జాన్ లో వేశ్యా గృహాన్ని తొలగింఛడానికి దాన్నే కేంద్రంగా జేసుకుని ఎన్నిసార్లు పోలీసు దాడులు జరుగుతాయో- అదే తరహాలో- సెకండాఫ్ లో హీరోయిన్ ని చంపడానికి హీరోయిన్ కుటుంబం వున్న ఇంటి మీదే విలన్ రకరకాలుగా దాడులు చేస్తూంటాడు. ఈ రకంగా రత్నం బేగం జాన్ విసిరేయగా దొరికిన కొన్ని కథా సౌందర్యపు రత్నాల్ని ఏరి తెచ్చుకుని, రత్న కిరీటం తయారు చేసుకుందన్న మాట!

—సికిందర్