రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, January 15, 2024

1401 : రివ్యూ!


 

రచన- దర్శకత్వం : శైలేశ్ కొలను
తారాగణం : వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్, సారా పలేకర్, జయప్రకాష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ముఖేష్ ఋషి తదితరులు
సంగీతం : సంతోష్ నారాయణన్, ఛాయాగ్రహణం : మణికంఠన్
బ్యానర్ : నీహారిక ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాత : వెంకట్ బోయినపల్లి
విడుదల : జనవరి 13, 2024
***

        వెంకటేష్ 75వ సినిమాగా సైంధవ్ ని  ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించి సంక్రాంతి సినిమాల రిలోకి దింపారు. ఈ బరిలోకి దింపిన మహేష్ బాబు గుంటూరు కారం ఎలాటి ఫలితాన్ని నమోదు చేసిందో తెలిసిందే. హనుమాన్ ఎలా దూసుకెళ్తోందో చూస్తున్నదే. ఇప్పుడు మరోస్టార్ సినిమా సైంధవ్ సంగతేమిటి? మహేష్ బాబుని ఫాలో అయిందా? నాగార్జునతో ఇంకో స్టార్ సినిమా కూడా హనుమాన్ తో పోటీపడ బోతోంది. ఎవరొచ్చినా హనుమాన్ తో పోటీ పడాల్సిందేనా? సైంధవ్ వచ్చేసి హనుమాన్ ని చిత్తు చిత్తు చేసిందా? ఈ అమూల్య విషయాలు తెలుసుకుందాం...

కథ

సైంధవ్ (వెంకటేష్)  చంద్రప్రస్థ అనే కల్పిత నగరం పోర్టులో క్రేన్ ఆపరేటర్ గా పని చేస్తూంటాడు. అతడికి గాయత్రి (సారా పలేకర్) అనే కూతురు. భార్య వుండదు. పక్కింట్లో మనోజ్ఞ (శ్రద్దా శ్రీనాథ్) కి భర్త వుండడు. గొడవపడి వచ్చేసింది. ఆమె సైంధవ్ కి, గాయత్రికి సన్నిహితంగా వుంటుంది. సైంధవ్ గతంలో మిత్రా (ముఖేష్ ఋషి) అనే డ్రగ్ మాఫియా దగ్గర పనిచేసి మానేశాడు.
       
ఇలా వుండగా
, ఒకరోజు గాయత్రి  జబ్బు పడుతుంది. అది స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA) అనే అరుదైన వ్యాధి. దాని చికిత్సకి 17 కోట్ల రూపాయలు విలువ చేసే ఇంజెక్షన్ అవసరం. దీనికోసం సైంధవ్ వెళ్ళి మిత్రాని కలుస్తాడు. మిత్రా తన ప్రత్యర్ధి వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్ధీఖ్) ని చంపమని షరతు పెడతాడు. సైంధవ్ ఏం చేశాడు? కూతుర్ని కాపాడుకోవడం కోసం వికాస్ మలిక్ ని చంపాడా లేదా అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

ఇది కథ కాదు, వధ. తీసుకున్న ముఖ్యమైన పాయింటుని ఇష్టమొచ్చినట్టు వధించి వడ్డించిన వ్యధ. వెంకటేష్ కి కమల్ హాసన్ నటించిన పానిండియా హిట్ విక్రమ్ లాంటి యాక్షన్ సినిమా చేయాలని కోరిక. దర్శకుడికి ఆ యాక్షన్ లో ఒక ఇంజెక్షన్ ని చొరబెట్టాలని ఆరాటం. దాంతో హైదరాబాద్ లో పిల్లాడికి ఇదే SMA వ్యాధి చికిత్సకి క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ. 16 కోట్లు సేకరించి, అమెరికా నుంచి తెప్పించి ఇంజెక్షన్ తో బతికించిన హ్యూమన్ డ్రామాతో కూడిన నిజ సంఘటనకి ఇన్స్ ఫైర్ అయి, ఈ కథ చేస్తూ మాఫియా గొడవలకి ఎక్కువ, పిల్ల వ్యాధి హ్యూమన్ డ్రామాకి తక్కువా అన్నట్టు సినిమా చుట్టేసి, సంక్రాంతి పోటీల్లో వెంకటేష్ ని గల్లంతు చేశారు.

వ్యాధుల మీద సినిమాలు చాలా వచ్చాయి. కానీ ఒక సామాన్యుడి కూతురికి అత్యంత ఖరీదైన వ్యాధి అనే ఈ కథ ప్రపంచ సినిమాల్లోనే మొదటిసారిగా అంది వచ్చిన అరుదైన అవకాశం. దీన్ని ధ్వంసం చేసుకున్నాడు. హైదరాబాద్ ఉదంతంలో క్రౌడ్ ఫండింగ్ ద్వారా దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు సహా ప్రజలు స్పందించి 16 కోట్లు సేకరించి పెట్టిన హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీలోని
తాదాత్మ్యం, కరుణ, సానుభూతి, ప్రేరణ, ప్రేమ, భయాలూ ఆనందాలూ, తీరా తెప్పించిన ఇంజెక్షన్ తో ఫలిస్తుందా లేదా అన్న ఉత్కంఠ- హై డ్రామా- ఈ సినిమా సక్సెస్ దినుసులన్నీ వదిలేసి మాఫియాల మరణహోమాలతో అసలు పిల్ల వ్యాధి అన్న సమస్యకే చోటు లేకుండా చేశాడు.
       
సినిమా మొదలు పెడితే ఎడతెరిపిలేని
, మనం ఫాలోకాలేని ఏవేవో మాఫియాల గొడవలే. ఎక్కడో ఇంటర్వెల్ ముందు కూతురికి ఖరీదైన వ్యాధి సమస్యతో పాయింటు కొచ్చి, మళ్ళీ సెకండాఫ్ లో మాఫియాల గొడవలే. కుటుంబ సెంటిమెంట్ల సినిమాలెక్కువ చేసిన వెంకటేష్ కైనా కూతురి కథ గల్లంతయిందని తెలియలేదా? కూతురి చికిత్స డబ్బులకోసం హత్యలు చేయడమేమిటి? ఆ కూతురు పెద్దదై తనప్రాణాలు ఎలా కాపాడాడో తెలుసుకుని అసహ్యించుకోదా? సినిమా కథకి నైతిక ప్రశ్నలు అవసరం లేదా?
       
ఇంకో విషయం ఏమిటంటే
, కూతురి కథని మింగేస్తూ మాఫియాల గొడవలుండగా, మరో 300 మంది పిల్లలకి ఇదే వ్యాధిని తీసుకొచ్చి కూతురి కథని పూర్తిగా భూస్థాపితం చేసే శారు! సూపర్ ఫైన్ మెంటల్ కథ ఇది.
       
దీంతో కమల్ హాసన్
విక్రమ్ నేకాదు, రజనీకాంత్ జైలర్ లాగా, విజయ్ లియో లాగా కూడా తీసి, 75 వ సినిమాకి కనీవినీ ఎరుగని హిట్ కొడుతున్నామని ఫీలైపోయారు.
       
ఇక దీనికి ఎవరెలా నటించారో
, సాంకేతికులు ఎవరెలా పనిచేశారో చెప్పుకోవడం హాస్యాస్పదంగా వుంటుంది. అసలు విషయానికొస్తే, ఇదే నిర్మాతకి వెంకటేష్ కోసం సింగిల్ సిటింగ్ లో ఒక కథ ఓకే చేయించుకున్నాడు ఒక అసోసియేట్. ఆ కథ వెంకటేష్ కి సూటయ్యే ఫన్నీ విలేజి యాక్షన్ థ్రిల్లర్. నిర్మాత దాన్ని పక్కన పెట్టి సైంధవ్ తీశాడు. లేకపోతే నానితో శ్యామ్ సింఘరాయ్ హిట్ తీసిన నిర్మాతకి ఈ సంక్రాంతికి ఇంత బ్యాడ్ గా వుండేది కాదు, హనుమాన్ ఎదురుగా నిలబడి!
—సికిందర్

Saturday, January 13, 2024

1400 : రివ్యూ


 

రచన- దర్శకత్వం : ప్రశాంత్ వర్మ
తారాగణం : తేజ సజ్జా, అమృతా అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రకని, వినయ్ రాయ్, సత్య, గెటప్ శ్రీను తదితరులు
సంగీతం : అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్, ఛాయాగ్రహణం : దాశరధి శివేంద్ర
బ్యానర్ : ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్, నిర్మాత : నిరంజన్ రెడ్డి
విడుదల : జనవరి 12, 2024
***

        ల్కి, జాంబీరెడ్డి వంటి విభిన్న సినిమాలు తీసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ సూపర్ హీరో ఫాంటసీ కథతో హనుమాన్ తీశాడు. మధ్యతరహా సినిమాగా యువహీరో తేజ సజ్జా తో తీసిన దీన్ని సంక్రాంతి పెద్ద సినిమాల పోటీలో విడుదల చేయడం ఒక సాహసం. అయితే ఈ సాహసం ఫలించింది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో విజయవంతగా ప్రదర్శనలకి నోచుకుంటోంది. దీని విశేషాలేమిటో చూద్దాం...

కథ
1998 లో ఓ మహానగరంలో మైకేల్ అనే దుష్ట బాలుడు సూపర్ మాన్ అవ్వాలని ప్రయత్నిస్తూంటాడు. సూపర్ మాన్ శక్తుల్ని మంచికోసం ఉపయోగించాలని తల్లిదండ్రులు ఉద్బోధిస్తే వాళ్ళని చంపేస్తాడు. ప్రస్తుతానికొస్తే, అంజనాద్రి అనే మారు మూల గ్రామం. అక్కడ హనుమంతు (తేజ సజ్జా) అనే చిల్లర దొంగ. ఇతను అక్క అంజమ్మ (వరలక్ష్మీ  శరత్ కుమార్) పెంపకంలో పెరిగాడు. మీనాక్షి (అమృతా అయ్యర్) ని ప్రేమించాడు. ఆమె మెడిసిన్ చదువుకుని వచ్చింది. గ్రామంలో గజపతి (రాజ్ దీపక్ శెట్టి) అనే పాలెగాడు ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తూ పీడిస్తూంటాడు. ఇతడ్ని ఎదిరించిన మీనాక్షి ప్రమాదంలో పడుతుంది. ఈమెని కాపాడబోయిన హనుమంతు నదిలో పడిపోతాడు. నదిలో ఒక హనుమతుడి అంశగల రుధిరమణి దొరుకుతుంది. దాంతో అతడికి సూపర్ హీరో శక్తులు వచ్చేస్తాయి. ఆ శక్తులతో గజపతిని ఎదిరిస్తూ వుంటే, రుధిరమణిని చేజిక్కించుకుని సూపర్ మాన్ అవుదామని మైకేల్ (వినయ్ రాయ్) వచ్చేసి దాడులు మొదలెడతాడు.
       
ఇప్పుడు రుధిరమణితో మంచికోసం హనుమంతు, చెడుకోసం మైకేల్ ల మధ్య పోరాటంలో ఎవరు గెలిచారన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

అప్పట్లో చిరంజీవి- శ్రీదేవి నటించిన కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సోషియో ఫాంటసీ కథ. హాలీవుడ్ నుంచి అదే పనిగా వస్తున్న మార్వెల్ స్టూడియోస్ కామిక్స్ సూపర్ హీరో సినిమల్లాంటి కథ. అయితే దీన్ని ఆధునిక ప్రపంచంలో, ఆధునిక పాత్రలతో, హైఫై గా  కాకుండా, నేటివిటీతో కూడిన గ్రామీణ ప్రపంచంలో, సాధారణ గ్రామీణ పాత్రలతో, దైవభక్తిని కూడా జోడించి తీయడంతో, క్లాస్ -మాస్ ప్రేక్షకులకి చేరువగా వెళ్ళగలుగుతోంది.
        
యాక్షన్ సినిమాలంటే నరుకుడు సినిమాలుగా పేరుపొందిన ఈ రోజుల్లో హింసకి దూరంగా కామెడీతో కూడిన అడ్వెంచర్ థ్రిల్లర్ గా తీయడంతో ఒక తాజాదనం చేకూరింది. పైగా మాస్- యాక్షన్ హీరోయిజం ఇమేజి వున్న నటుడ్ని తీసుకోకుండా సామాన్య యువకుడిలా కన్పించే ఏ ఈమెజీ లేని తేజ సజ్జాని తీసుకోవడం కూడా ఈ ప్రయత్నానికి ప్లస్ అయింది. ఏ ప్రత్యేకతలూ లేని ఒక సామాన్య పల్లెటూరి వాడు సూపర్ హీరోగా మారి శత్రువుల్ని ఎదుర్కొనే పరిణామ క్రమమాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు ఫస్టాఫ్ లో గంటకి పైగా తీసుకుంది. రుధిరమణి దొరికిన తర్వాత అతీతశక్తులతో అతను సూపర్ హీరోగా మారే ఘట్టం వచ్చేసరికి ప్రేక్షకులనుంచి కేరింతలే. ఇక్కడ్నించీ వరుసగా కేరింతలే.
       
ఈ పూర్తి స్థాయి కామెడీతో కూడిన సూపర్ హీరో అడ్వెంచర్స్ కి
, క్లయిమాక్స్ లో హిమాలయాల నుంచి సాక్షాత్తూ హనుమంతుడే రావడంతో మరోస్థాయి థ్రిల్. అయితే ఇందులో పాత వాసన వేసే మూస సన్నివేశాలు, మందకొడి కథనం, అనవసర పాత్రలు వంటి అవరోధాలూ లేకపోలేదు. సినిమా నిడివిని రెండున్నర గంటల నుంచి రెండు గంటలకి కుదించేస్తే ఈ లోపాలు తొలగి పోయేవి.

నటనలు- సాంకేతికాలు

పాత సినిమాల్లో పల్లెటూరి పాత్రల్లో సాదాసీదా చిరంజీవిలాగా తేజ సజ్జా వుండడం కనెక్టివిటీకి బాగా తోడ్పడింది. అశక్తుడైన సామాన్యుడు అతీత శక్తులతో అసామాన్యుడిగా మారడమానే ఇరు పార్శ్వాల్ని సమయోచితంగా ప్రదర్శించాడు. నటనకి కామెడీ ప్రేక్షకుల్ని ఇంకా దగ్గర చేసేలా వుంది. హీరోయిన్ తో రోమాన్స్ లో ఫీల్ లేకపోవడం, అక్క పాత్రతో సెంటిమెంట్లు లోపించడం వంటి లోపాలున్నాయి. యాక్షన్ సీన్స్, క్లయిమాక్స్ లో పతాక స్థాయి పోరాటాలూ బాగా కుదిరాయి. చిన్న హీరోకి పెద్ద హిట్ సంక్రాంతి దక్కడమన్నది రికార్డే.
       
హీరోయిన్
అమృతా అయ్యర్ కి అందచందాలు, నటించే టాలెంట్ వున్నాయి. హీరో అక్క పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ యాక్షన్ సీను కేరింతలకి ఇంకో సమయం. విలన్స్ గా రాజ్ దీపక్ శెట్టి, వినయ్ రాయ్ లు  మరోసారి స్టైలిష్ విలన్ రోల్ చేశారు. గెటప్ శ్రీను, సత్య, జబర్దస్త్ రోహిణి తదితరులు నవ్వించే క్యారక్టర్లు. ఇక విభీషణుడిగా వచ్చే సముద్రని  హూందాగా నటించాడు.
       
తక్కువ బడ్జెట్లోనే
టెక్నికల్‌గా బాగా తీయడం దర్శకుడిని నిర్మాతల లక్కీ ఛామ్ గా చేసే విషయం. అయితే బడ్జెట్ మూడు రెట్లు పెరిగిందని నిర్మాత ప్రకటన. వీఎఫ్ఎక్స్, సాంగ్స్, నేపథ్య సంగీతం (ముగ్గురు సంగీత దర్శకులు) వీలైనంత క్వాలిటీతో ఇచ్చారు. క్లయిమాక్స్ 15 నిమిషాల నేపథ్య సంగీతం భారీ సినిమాల స్థాయిలో వుంది.
       
కరుడుగట్టిన హింసాత్మక గెటప్స్ తో హీరోల సినిమాల్ని తీస్తున్న ఈ రోజుల్లో హింసే లేకుండా విజయవంతమైన కమర్షియల్ సినిమా తీయడం
, ఎంటర్ టైన్ చేయడం, బాక్సాఫీసులో డబ్బులు కళ్ళజూడడం మొదలైన మంచి పనులు హనుమాన్ తో సుసాధ్యం చేసి చూపించారు.

—సికిందర్
 

Friday, January 12, 2024

1399 : రివ్యూ


 

రచన- దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
తారాగణం: మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షీ చౌదరి, రమ్య కృష్ణ, ఈశ్వరీ రావు, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రావురమేష్, మురళీశర్మ,జయరాం, సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం : ఎస్. తమన్, చాయాగ్రహణం: మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్
బ్యానర్ : హారిక & హాసిని క్రియేషన్స్, నిర్మాత : ఎస్. రాధా కృష్ణ
విడుదల : జనవరి 12, 2024
***

        దాదాపు ప‌ద‌మూడేళ్ళ త‌ర్వాత మ‌ళ్ళీ మ‌హేష్‌బాబు- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా సంక్రాంతిని టార్గెట్ చేస్తూ భారీ స్థాయిలో విడుదలైంది. చాలా కాలంగా రకరకాలుగా వార్తల్లో వుంటూ వచ్చిన గుంటూరు కారం పానిండియాగా మాత్రం విడుదల కాలేదు. 2022 లో సర్కారువారి పాట తర్వాత మహేష్ బాబు నటించిన కొత్త సినిమా ఎలా వుంది? గుంటూరు కారం లాంటి పాత్రలో తను ఘాటుగా వున్నాడా, చప్పగా వున్నాడా, ఎలా వున్నాడు? ఇది తెలుసుకుందాం.

కథ

ర‌మ‌ణ (మ‌హేష్‌బాబు) ని చిన్న‌ప్పుడు త‌ల్లి వసుంధర (రమ్యకృష్ణ) వ‌దిలిపెట్టి వెళ్ళిపోతుంది. తండ్రి స‌త్యం (జ‌య‌రామ్‌) ఓ కేసులో జైలు కెళ్తాడు. మేనత్త (ఈశ్వరీబాయి) రమణని పెంచుతుంది. అటు తల్లి ఇంకో పెళ్ళి చేసుకుంటుంది. హైదరాబాదులో సీనియర్ రాజకీయనాయకుడైన తండ్రి వెంకటస్వామి (ప్రకాష్ రాజ్) అండదండలతో వసుంధర మంత్రిగా ఎదుగుతుంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవిపై కన్నేసిన కాటా మధు (రవిశంకర్) అనే ఇంకో నాయకుడు వసుంధర గతాన్ని బయట పెట్టి ఆమె రాజకీయ జీవితాన్ని అంతం చేయాలనుకుంటాడు. దీన్ని అడ్డుకునేందుకు వెంకటస్వామి గుంటూరులో వున్న మనవడు రమణని పిలిపించి, త‌ల్లితో త‌న‌కెలాంటి సంబంధం లేద‌ని సంతకం పెట్టించుకోవాలను
కుంటాడు.  
       
ఈ ప్రయత్నం ఫలించిందా
? రమణ సంతకం పెట్టాడా? తండ్రి స‌త్యం ఎందుకు జైలు కెళ్ళాడు? వసుంధర కొడుకు రమణని దూరం పెట్టడానికి అసలు కారణం ఏమిటి? ఆమె తండ్రి వెంకటస్వామి చేసిన కుట్ర లేమిటి? తల్లికి దూరమై బాధపడుతున్న రమణ తల్లి మనసు మార్చడానికి ఏం చేశాడు? చివరికి తల్లీకొడుకులు ఒకటయ్యారా? ఇందులో ఆముక్త (శ్రీలీల‌), రాజీ( మీనాక్షి చౌద‌రి) పాత్ర లేమిటి? ... ఇదీ మిగతా కథ.

ఎలా వుంది కథ

ఇది సంక్రాంతికి కొత్త పంటేం కాదు. పాత పంటల్నే అదేపనిగా కోస్తూ ఇంకా అందిస్తున్నాడు దర్శకుడు త్రివిక్రమ్. చిన్న‌త‌నంలోనే త‌ల్లికి కొడుకు దూరం కావ‌డం, పాతికేళ్ళ త‌ర్వాత క‌ల‌వ‌డం అనే ఒకే కథతో అల్లు అర్జున్ తో అల వైకుంఠ‌పుర‌ములో’, పవన్ కల్యాణ్ తో అత్తారింటికి దారేది’, పవన్ కళ్యాణ్ తోనే మళ్ళీ అజ్ఞాత‌వాసి సినిమాలు తీశాడు. ఇదే పురాతన కథని ఈసారి రాజకీయ రంగాన్ని జోడించి మహేష్ బాబుతో కొత్త కథగా అందించే ప్రయత్నం చేశాడు. అయితే కావచ్చు కానీ, ఈ తల్లీ కొడుకుల కథకి ప్రధానంగా తీసుకున్న- తల్లితో సంబంధం లేదని మహేష్ బాబు సంతకం పెట్టాలనే పాయింటు నమ్మశక్యంగా లేక, లీగల్ గానూ చెల్లక, సినిమా ఫస్టాఫ్ లోనే తేలిపోయే ప్రమాదంలో పడింది.
       
కేవలం సంతకం పెట్టాలనే స్టోరీ పవర్ లేని సినిమాని మహేష్ బాబు స్టార్ పవర్ తో కమర్షియల్ గిమ్మిక్కులు చేసి నిలబెట్టేందుకు విఫలయత్నం చేశాడు. గుంటూరు- హైదరాబాద్ ల మధ్యే మహేష్ బాబు కారేసుకుని సంతకం పెట్టే పాయింటుతో పదేపదే తిరిగే సీన్లే రిపీటవుతూంటాయి. మధ్యలో లాయర్ కూతురుగా శ్రీలీల మహేష్ బాబు ఇంట్లో మకాం వేసి సంతకం కోసం చేసే కామెడీ ప్రయత్నాలతో ఒక ట్రాకు వుంటుంది. ఈ ట్రాకులో రోమాన్సు పాటలూ వగైరా వుంటాయి. మిర్చీ వ్యాపారం చేసే మహేష్ బాబు ప్రత్యర్ధి పాత్ర జగపతిబాబుతో ఫైట్లు వగైరా వుంటాయి. సంతకం పెట్టక పోతే మహేష్ బాబుని కేసుల్లో ఇరికించే కుట్రలూ రిపీట్ అవుతూ వుంటాయి. ఇదంతా బలహీన కథగా సాగుతూ
, ఇంటర్వెల్లో తల్లితో ముఖా ముఖీ అయ్యే సీనుతో బలం పుంజుకుంటుంది సినిమా.
       
సెకండాఫ్ మళ్ళీ సంతకం గురించి మామూలే. తాత పాత్రలో ప్రకాష్ రాజ్ తో రిపీటయ్యే కొట్లాటలే. ఒక దశకొచ్చేటప్పటికి సెకండాఫ్ విషయం లేక శూన్యమై పోతుంది. చివరికి భారంగా తెలిసిన అన్ని విషయాలూ తేలి
, తల్లీ కొడుకులు ఏకమయ్యే పవర్ఫుల్ ఎమోషనల్ సీనుతో ముగుస్తుంది.
       
తాత చేతిలో పాతికేళ్ళుగా కీలుగా బొమ్మగా మారిన తల్లి సమస్యని గుర్తించి
, ఆమెకి  విముక్తి కలిగించి సుఖాంతం చేయాల్సిన కథలో మహేష్ బాబు అసలేమీ చేయకపోవడంతో, తను కూడా తాత ఆడించినట్టూ ఆడే పాసివ్ పాత్ర కావడంతో, సినిమా చాలా రిస్కులో పడే ప్రమాదంలో పడింది.

ఎవరెలా చేశారు

ఇది పూర్తిగా మహేష్ బాబు ఒన్ మాన్ షో. తన యాక్టింగ్ స్కిల్స్ తో సినిమాకి మంచి గ్లామర్ తీసుకొచ్చాడు. ఇంటర్వెల్ సీనులో, ముగింపులో హృదయాల్ని బరువెక్కించే నటన కనబర్చాడు. మిగతా అంతటా విషయం లేని కథలో  ఏం చేస్తున్నాడో తెలియక రకరకాల కామెడీ, యాక్షన్ సీన్లు చేసుకుంటూ పోయాడు. శ్రీలీలతో హత్తుకునే రోమాన్సూ చేయక డాన్సులతో సరిపెట్టాడు. ఎంత సేపూ తల్లి లేని కొడుకుగా ఫీలవ్వడమే తప్ప,అవతల కొడుకులేని తల్లి ఫీలింగ్స్ ని గుర్తించే పని పెట్టుకోలేదు. గుర్తించి వుంటే తగిన హీరోయిజం వచ్చేది. యాక్టివ్ క్యారక్టర్ గా పంజరంలో వున్న తల్లి కోసం ఒక లక్ష్యంతో యాక్షన్ లోకి దిగే వాడు. ఇది సాంతం నవ్విస్తూ పోయే యాక్షన్ కామెడీ అయితే సినిమాని ఇంకో స్థాయికి తీసికెళ్ళి సక్సెస్ చేసేవాడు. కథలో ప్రధాన పాత్రగా లక్ష్యమే లేక పోతే కధేం వుంటుంది. కథ లేకపోతే తనెందుకు.
       
శ్రీలీలకి ఈ సినిమాలో కూడా పాత్రే లేదు. మరోసారి పాటల్లో డాన్సింగ్ డాల్ గా సరిపెట్టుకుంది. మహేష్ మరదలి పాత్రలో మీనాక్షీ చౌదరిది కొన్ని సీన్లకి పరిమితమైన పాత్ర. ఇక
రమ్య కృష్ణ, ఈశ్వరీ రావు, జగపతి బాబు, రావురమేష్, మురళీ శర్మ,జయరాం వెన్నెల కిషోర్ అందరి పాత్రలూ తక్కువే- ఒక్క విలనీతో  ప్రకాష్  రాజ్ తప్ప. సునీల్ ప్రారంభంలో ఒక సీనులో కనిపించి, విగ్రహంగా, ఆ తర్వాత విగ్రహం తలగా మారతాడు. చాలా అన్యాయం.
       
గుంటూరు
, హైదరాబాద్ లొకేషన్లు, మిర్చీ గోడౌన్ సెట్, ఇతర ఔట్ డోర్ లొకేషన్స్ కి  విజువల్స్ బావున్నాయి. యాక్షన్ సీన్స్ సహా సాంకేతికంగా ఉన్నతంగా వుంది. తమన్ సంగీతంలో పాటలు, వాటి కొరియోగ్రఫీ  కూడా బావున్నాయి. బావుండాల్సింది మళ్ళీ తల్లీ కొడుకుల కథతో త్రివిక్రమ్ రాతపని, తీతపని. దీనికి మహేష్ బాబు (అగ్రిమెంట్ మీద) సంతకం పెట్టే పని. ఇక ప్రేక్షకుల నుంచి సంతకాల సేకరణే మిగిలింది.
—సికిందర్

 

Thursday, January 11, 2024

1398 : స్క్రీన్ ప్లే టిప్స్

స్క్రిప్టు రచనలో తోడ్పడే స్క్రీన్ ప్లే చెక్ లిస్ట్ ఇదివరకు ఇచ్చాం. స్క్రీన్ ప్లే వుండే సీను లో ఏఏ అంశాలుండాలో హాలీవుడ్ చెక్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం...
1. సీన్ ఉద్దేశం :
1. పాత్ర గోల్ లో పురోగతి లేదా మార్పు వుందా?
2. సీను కథని ముందుకు కదిలిస్తోందా?
3. పాత్రల మధ్య సంఘర్షణ సృష్టిస్తోందా?
4. కొత్త పాత్రని పరిచయం చేస్తోందా?
5. పాత్రల్ని డెవలప్ చేస్తోందా?
6. రాబోయే పరిణామాల్ని పరోక్షంగా సూచిస్తోందా?
7. పాత్ర తీసుకునే రిస్కుని పెంచుతోందా?
2. స్ట్రక్చర్ :
1.  సీనుకి స్పష్టమైన బిగినింగ్-మిడిల్- ఎండ్ లున్నాయా?
2. సీనుకి ఓపెనింగ్ హుక్ వుందా?
3. సీను హాఫ్ వేలో యాక్షన్ తో ప్రారంభమవుతోందా?
4. యాక్షన్ సీనుకి గోల్- కాన్ఫ్లిక్ట్- డిజాస్టర్ లున్నాయా?
5.  యాక్షన్ సీనులో రెస్పాన్స్- డైలెమా- డెసిషన్ లున్నాయా?
6. పాత్ర ఒక పాయింటాఫ్ వ్యూతో  కొనసాగుతోందా?  
7.  కథ తగినంత వేగంతో సాగేందుకు సీను తోడ్పడుతోందా?
8. మూడ్, టోన్ సీను స్వభావంతో మ్యాచ్ అవుతున్నాయా?
9. పాత్ర గోల్ ని చేరుకోవడానికి వ్యక్తులు, సంఘటనలు, భావోద్వేగాలు, రహస్యాలు అవరోధంగా నిలుస్తున్నాయా?

10. క్లయిమాక్స్ కథకి, పాత్ర చిత్రణకి లోబడి వుందా?
11. క్లయిమాక్స్ లో తగినంత సస్పెన్స్, సర్ప్రైజ్, ట్విస్టు వున్నాయా?
12. సింబాలిజాలు, ప్రతీకాలంకారాలు వున్నాయా?
3. హీరో/హీరోయిన్ :
1. సీనులో ఏం కోరుకుంటున్నారో స్పష్టత, భౌతిక చర్యల వెనుక భావోద్వేగాలతో కూడిన  ఆలోచనలు, డైలాగులు వున్నాయా?
2. నెగెటివ్ గా ఫీలైతే వెనక్కి, పాజిటివ్ గా ఫీలైతే ముందుకూ కదులుతున్నారా?
3. ఇద్దరి మధ్య విలువల వైరుధ్యాలున్నాయా?
4. ప్రేక్షకులు ఎవరిపట్ల సానుభూతితో వుండాలో స్పష్టత వుందా?
5. అనుబంధ పాత్రలు సీనులో ఉండడం  కోసం స్పష్టమైన ప్రయోజనముందా?
4.  డైలాగులు:
1. ప్రతి పదం తప్పనిసరి అవసరంతో డైలాగులు పటిష్టంగా వున్నాయా?
2. డైలాగులు ఆసక్తికరంగా, సీనుని ముందుకు కదిలించే విధంగా వున్నాయా?
3. డైలాగులు బోరు కొట్టకుండా సహజంగా వున్నాయా?
4. పాత్రల స్వభావం డైలాగుల్లో ప్రతిఫలిస్తున్నాయా?
5.  పాత్ర ఎంపిక చేసుకునే పదాలు ప్రత్యేకతతో వున్నాయా?  
6. డైలాగులు పాత్ర చిత్రణని, కథని, సంఘర్షణని, సమాచారాన్ని వెల్లడిస్తున్నాయా?
***

Monday, January 8, 2024

1397 : రివ్యూ


 

రచన- దర్శకత్వం : సెల్విన్ రాజ్ జేవియర్
తారాగణం : సతీష్, రేజీనా, శరణ్య, నాజర్, ఆనంద్ రాజ్, విటివి గణేష్, రెడిన్ కింగ్ స్లే తదితరులు  
సంగీతం : యువన్ శంకర్ రాజా, ఛాయాగ్రహణం : యువ
బ్యానర్ : ఏజీఎస్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాతలు: కలపతి ఎస్. అఘోరమ్, కలపతి ఎస్. గణేష్
విడుదల : 5.1.24 ( ఓటీటీ- నెట్ ఫ్లిక్స్)
***

        మిళంలో హార్రర్ కామెడీ కన్జూరింగ్ కన్నప్ప (మాయాజాలంలో  కన్నప్ప) డిసెంబర్ 8 న విడుదలై యావరేజి రిజల్టు పొందింది. ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. తెలుగు వెర్షన్ అందుబాటులో వుంది. కొత్త దర్శకుడు సెల్విన్ రాజ్ జేవియర్ హార్రర్ కామెడీలో కొత్త ఐడియాతో దీన్ని తీశాడు. కమెడియన్ సతీష్ హీరోగా నటించాడు. దర్శకుడు అందించిన కొత్త ఐడియా ఏమిటి?  దాంతో ఎంతవరకు ఒప్పించాడు? ఒక ఆత్మ- దాంతో భయపడి కామెడీ పుట్టించడం బ్రాకెట్లోనే హార్రర్ కామెడీలుంటాయి. అయితే ఈ ఫార్ములాని కొత్త ఐడియాతో ఏ రకంగా విభిన్నం చేశాడు? ఇది తెలుసుకుందాం...

కథ

కన్నప్పన్ (సతీష్) గేమ్ డిజైనర్ గా ఉద్యోగ ప్రయత్నాల్లో వుంటాడు. తండ్రి ఆంజనేయన్ (విటివి గణేష్) పెన్షన్ తో ఇల్లు గడుస్తూంటుంది. తల్లి లక్ష్మి (శరణ్య) యూట్యూబ్ వీడియోలు తీస్తూంటుంది. పెళ్ళి కాని మామ శేఖర్ (నమో నారాయణ్) ఇంట్లో పడి తింటూ వుంటాడు. ఒకరోజు ఇంట్లో నీళ్ళు రాకపోతే పక్కన పాడుబడి మూసిపెట్టిన బావి మీద రేకులు తీసి నీళ్ళు తోడుతాడు కన్నప్పన్. ఆ బకెట్టుకి చిక్కుకుని ఒక శిథిలావస్థలో వున్న డ్రీమ్ క్యాచర్ వస్తుంది. పీడ కలలు రాకుండా పడగ్గదిలో పెట్టుకునే దిష్టి బొమ్మ లాంటిది అది. దానికి ఈకలుంటే ఒక ఈక పీకుతాడు. అంతే, పీకల్లోతు ప్రమాదంలో ఇరుక్కుపోతాడు. రాత్రి నిద్రపోతే కలలో ఒక కోట కనిపిస్తుంది. ఆ కోటలో తనపాటు ఒక ఆడ దెయ్యం వుంటుంది. తప్పించుకుని బయటపడతాడు. మెలకువొఛ్చేస్తుంది. ఇలా ప్రతీరాత్రీ జరుగుతుంది. కలలో ఆడ దెయ్యం కొడితే ఆ దెబ్బ తెల్లారి వొంటి మీద కన్పిస్తుంది.

       
ఇలా వుండగా
, డెవిల్ ఆర్మ్ స్ట్రాంగ్ (ఆనంద్ రాజ్) అనే రౌడీకి డబ్బులు బాకీ పడతాడు కన్నప్పన్. ఆ రౌడీ వేధిస్తూంటాడు. కన్నప్పన్ పీడకలలకి సంబంధించి ఎళుమలై (నాజర్) అనే భూత వైద్యుణ్ణి సంప్రదిస్తాడు. డ్రీమ్ క్యాచర్ వల్ల పీడకలలొస్తున్నాయంటే ఈ కోటలో డ్రీమ్ కీ వెతికి పట్టుకోవడం ఒక్కటే మార్గమని చెప్తాడు ఎళుమలై. పీడకలలో ఆ కోట 1930లలో బ్రిటిష్ కాలపు నాటిదని, అందులో రాబర్ట్- మెక్డలీన్ అనే ప్రేమికులు హత్యకి గురయ్యారనీ, ఆ ఆడ దెయ్యం మెక్డలీన్ దేననీ చెప్తాడు.
       
ఇప్పుడు కన్నప్పన్ ఏం చేశాడు
? పీడకలల్ని వదిలించుకోవడానికి కోటలో డ్రీమ్ కీ ని వెతికి పట్టుకున్నాడా? ఆ ప్రయత్నంలో ఆడ దెయ్యంతో ఎన్ని ప్రమాదాలెదుర్కొన్నాడు? డెవిల్ ఆర్మ్ స్ట్రాంగ్ పీడ ఎలా వదిలించుకున్నాడు? డాక్టర్ జానీ (రెడిన్ కింగ్ స్లే) అనే సైకియాట్రిస్టు కూడా దిష్టి బొమ్మ ఈక పీకితే అతడికే జరిగింది? కన్నప్పన్ ఇంట్లో కూడా తెలియక అందరూ ఈకలు పీకితే వాళ్ళకేం జరిగింది? అంతా కలిసి పీడకలలో కోటలో దెయ్యం పాలబడ్డారా? ఈ కేసులో భూతవైద్యుడు ఎళుమలైకి పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ డార్క్ డేవ్స్ (రెజీనా) ఎలా తోడ్పడింది? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఇది ఫాంటసీని మేళవించిన హార్రర్ కామెడీ కథ. పీడకలలు, పీడ కలల్లో కోట, కోటలో ఆడ దెయ్యం, పీడకలలకి విరుగుడుగా డ్రీమ్ కీ ని సాధించడం ఇదంతా సబ్ కాన్షస్ మైండ్ లో చేసే సైకలాజికల్ జర్నీ. అరేబియన్ నైట్స్ కథ లాంటిది. విష్ణుపురాణంలో అమృతం పొందడానికి క్షీరసాగర మథనం జరపడం లాంటిది. అయితే ఈ సెన్స్ తో సినిమా తీయలేదు. నిగూఢార్ధాన్ని వదిలేసి కామెడీ కోసం కామెడీ అన్నట్టు పని కానిచ్చేశారు. దీంతో ఇది హార్రర్ కామెడీ షుగర్ కోటింగుతో ఆత్మిక దహాన్ని తీర్చే స్పిరిచ్యువల్ థ్రిల్లర్ అయ్యే గొప్ప అవకాశాన్ని పోగొట్టుకుంది. హార్రర్ సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ లో న్యాయం కోసం ఆక్రందించే రొటీన్ దెయ్యం కథగా మాత్రమే ఇది రూపొందింది.
       
పీడకలల్లో వచ్చే హార్రర్ సీన్లు కాసేపటికే తేలిపోతాయి. భయపెట్టే హర్రర్ కంటే కామెడీలు ఎక్కువుంటాయి. ఈ కామెడీలు భయం చుట్టే రొటీన్ గా వుంటాయి. రౌడీతో
, సైకియాట్రిస్టుతో కామెడీలు కొన్ని నవ్వించినా- అసలు పాయింటు డ్రీమ్ కీ రహస్యం గురించి కథ సాగదు. ఆ డ్రీమ్ కీ కోసం పోటాపోటీలతో ఆడ దెయ్యంతో తలపడే కథగా వుంటే పాత్రలు నేర్చుకునే పాఠాలుగా వుండేది. రొటీన్ గా ఆడ దెయ్యానికి జరిగిన అన్యాయం గురించే  కథ చేయడంతో- కొత్త ఐడియా కాస్తా పాత పచ్చడియే అయింది.

నటనలు- సాంకేతికాలు

కమెడియన్ సతీష్ కామెడీ అతిగా వుండదు. మొహంలో అమాయకత్వంతో ఫ్రెష్ నెష్ తీసుకొస్తాడు నటనకి. కమర్షియల్ హంగులు పెద్దగా వుండవు. ఈ సినిమా కంటే అతనే ఎక్కువ గుర్తుంటాడు. ఇక శరణ్య, గణేష్, నమో నారాయణ్ కుటుంబ కామెడీని రక్తి కట్టిస్తారు ఆయా సన్నివేశాల్లో. నాజర్, రెజీనా కసాండ్రా భూతవైద్యులుగా అదోలాంటి మ్యానరిజమ్స్ తో ఫారినర్స్ లా వుంటారు. రౌడీగా, సైకియాట్రిస్టుగా ఆనంద్ రాజ్, రెడిన్ కింగ్ స్లేలు మాత్రం పాత స్టయిల్ కామెడీకి కట్టుబడి వుంటారు.
       
ఈ మూవీ
సౌండ్ డిజైన్, యువన్ శంకర్ రాజా సంగీతం, యువ సమకూర్చిన ఛాయాగ్రహణం హార్రర్ వాతావారణాన్ని సమృద్ధిగా సృష్టిస్తాయి. అయితే చూసి భయపడేంత కాదు. కొత్త దర్శకుడు జేవియర్ కొత్త ఐడియాలో వున్న నిగూఢార్ధాన్ని పట్టుకోగలిగివుంటే ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాగా వుండేది. దీన్ని కొంచెం తేడాగా పీడ కలల్లో జరిగే కథగా రొటీన్ హార్రర్ కామెడీ అనుకుని పైపైన చూసేస్తే ఏ బాధా వుండదు.

—సికిందర్