రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, November 18, 2023

1379 : రివ్యూ


 రచన -దర్శకత్వం: అజయ్ భూపతి

తారాగణం : పాయల్ రాజ్‌పుత్, నందితా శ్వేతా, రవీంద్ర విజయ్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, శ్రవణ్ రెడ్డి, దివ్యా పిళ్ళై, అజయ్ ఘోష్ తదితరులు  
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్
బ్యానర్ : ముద్ర  మీడియా వర్క్స్
నిర్మాతలు: స్వాతి రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ, అజయ్ భూపతి
విడుదల : నవంబర్ 17, 2023
***

        ‘ఆర్ ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ సినిమాల దర్శకుడు అజయ్ భూపతి మూడో సినిమా ‘మంగళవారం’. ఇందులో పాయల్ రాజ్పుత్ హీరోయిన్. అజయ్ భూపతి పాయల్ రాజ్పుత్ తో అడల్ట్ మూవీ ఆర్ ఎక్స్ 100 తీసిన తర్వాత శర్వానంద్- సిద్ధార్థ్ లతో తీసిన మహాసముద్రం హిట్ కాలేదు. పాయల్ కూడా ఆర్ ఎక్స్ 100  తర్వాత నటించిన 8 సినిమాలూ హిట్ కాలేదు. తిరిగి ఇప్పుడు ఇద్దరూ ఇంకో అడల్ట్ మూవీ మంగళవారం తో తిరిగి వచ్చారు. మరి ఈసారి ఆర్ ఎక్స్ 100 లాంటి మ్యాజిక్ వర్కౌట్ అయిందా? ఈ విషయం తెలుసుకుందాం...

కథ  

    రాజమండ్రి దగ్గర్లో ఓ గ్రామంలో గ్రామ దేవతకి ఇష్టమైన  మంగళవారం రోజు రెండు ఆత్మహత్యలు జరుగుతాయి. దీనికి ముందు రోజు మృతులిద్దరికీ అక్రమ సంబంధముందని గోడ మీద ఎవరో రాస్తారు. కొత్తగా వచ్చిన ఎస్సై మాయ (నందితా శ్వేత) వీటిని హత్యలుగా అనుమానించి పోస్ట్ మార్టంకి పంపించబోతే జమీందారు (కృష్ణ చైతన్య) అడ్డుపడతాడు. తిరిగి మళ్ళీ మంగళవారం ఇలాగే ఇంకో రెండు ఆత్మహత్యలు జరుగుతాయి. వీళ్ళిద్దరికి కూడా అక్రమ సంబంధముందని ముందురోజు ఎవరో గోడ మీద రాస్తారు. దీంతో ఎస్సై మాయ  ఈ నాలుగు మరణాలని హత్యలుగా భావించి చర్యలు తీసుకుంటుంది. ఇవి హత్యలైతే ఎవరు ఎందుకు చేస్తున్నారు? గోడల మీద రాస్తోందెవరు రు? ఈ వ్యవహారంలో జమీందారు, జమీందారు భార్య (దివ్యా పిళ్ళై), ఫోటోగ్రాఫర్ (శ్రవణ్ రెడ్డి), డాక్టర్ (రవీంద్ర విజయ్) ల ప్రమేయం ఏమిటి? కొన్నాళ్ళ ముందు ఊరంతా వెలి వేసిన శైలు (పాయల్ రాజ్పుత్) కథ ఏమిటి? ఆమె ప్రేమించిన మదన్ (అజ్మల్ అమీర్) వ్యవహారమేమిటి? చివరికి ఏం తేల్చింది ఎస్సై మాయ? ఈ ప్రశ్నలకి సమాధానాలు మిగతా కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ

    ఏ- సర్టిఫికేట్ పొందిన ఈ అడల్ట్ సినిమా కథ నింఫోమేనియక్(అదుపులో లేని  కామకోరికల) యువతి గురించి. నింఫోమేనియా మీద హాలీవుడ్ లో పదుల సంఖ్యలో సినిమాలొచ్చాయి. దీన్ని తెలుగులో ప్రయత్నించారు. ఈ నింఫోమేనియా బాధితురాలి చుట్టూ వాళ్ళవాళ్ళ అవసరాలతో చాలామంది నేరాలు ఘోరాలకి పాల్పడతారు. చివరి అరగంట కథలో ఇవి పొరలుపొరలుగా బయటపడతాయి. అయితే కథంతా ఈ బాధితురాలి సమస్యకి పరిష్కారం వెతికే మానవత్వం చూపించక, అడుగడుగునా ఆమె పట్ల క్రూరత్వమే ప్రదర్శించి అంతమొందించడం సినిమాకోసం అవసరమై వుండొచ్చు.
       
ప్రధాన పాత్ర పోషించిన పాయల్ ఇంటర్వెల్ వరకూ కనిపించదు. ఫస్టాఫ్ గ్రామంలో మరణాలు
, వివిధ పాత్రలు వాటి పరిచయాలు, స్వభావాలు, వేడుకలు, కొట్లాటలు ఇవే సాగుతూ, ఇంటర్వెల్ షాట్ లో పాయల్ మిస్టీరియస్ గా కనిపించడంతో ముగుస్తుంది. ఇలా ప్రధాన పాత్ర లేని, కథ ప్రారంభం కాని ఫస్టాఫ్ తో బోరు కొట్టకుండా కాస్త ఎంటర్ టైన్ కూడా చేస్తూ నడిపాడు దర్శకుడు.
       
ఇంటర్వెల్లో ఎంట్రీ ఇచ్చిన పాయల్ తో సెకండాఫ్ కథ ఒక ఫ్లాష్ బ్యాక్ తో ప్రారంభమవుతుంది. ఇక్కడ ఆమె కాలేజీకి వెళ్ళడం
, కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్ మదన్ తో ప్రేమాయణం చాలా పేలవంగా సాగుతాయి.  అయితే ఈ ఎపిసోడ్ లోనే పాయల్ మానసిక రుగ్మత తాలూకు చిహ్నాలు కన్పిస్తాయి. అవి పెరిగి పెరిగి లైంగికంగా ఆమె విచ్చల విడితనానికి దారి తీస్తాయి. ఈ మలుపు దగ్గర్నుంచి కథ ఇంకెన్ని మలుపులు తిరిగిందన్నది వెండి తెరపైనే చూడాలి.  
       
చివరి అరగంటలోనే ఐదారు మలుపులు
, వాటి ఫ్లాష్ బ్యాకులు మొత్తం జరిగిన నేరాల చుట్టూ కథని సమప్ చేస్తాయి. దీన్ని లాజికల్ గా పకడ్బందీగా పోషించాడు దర్శకుడు. ఫస్టాఫ్ లో కనిపించిన వివిధ పాత్రలు ఇక్కడ సర్ప్రైజింగ్ గా రివీలవుతాయి. అయితే చివర్లో ముసుగు వ్యక్తి ఎవరన్న సస్పెన్స్ ని విప్పినప్పుడు ఈ హైడ్రామా తేలిపోతుంది. అసలు ముసుగు వ్యక్తి ఎవరై వుంటాడో పెద్ద సస్పెన్స్ కాదు. ఎందుకంటే ఫస్టాఫ్ ప్రారంభంలో పాయల్ చిన్నప్పటి కథలో అతను చనిపోయినట్టు చూపించారుగానీ, పాత్రని బట్టి బతికే వుంటాడనీ, తిరిగి వస్తాడనీ వూహించేయ వచ్చు.
       
కాబట్టి ముగింపులో హల్చల్ చేస్తున్న ముసుగు వ్యక్తి ఎవరై వుంటాడో ఇట్టే తెలిసిపోతుంది. అయితే సర్ప్రైజ్ ఎలిమెంట్ కోసం ఇంకో ఫినిషింగ్ టచ్ ఇచ్చి వుండొచ్చు. ముసుగు తీసినప్పుడు అతను ఎవరైనా పాపులర్ హీరో అయివుంటే సర్ప్రైజ్ చేసే వాడు. ముగింపు నెక్స్ట్ లెవెల్లో వుండేది. ఈలలు పడేవి. ఇలా కాకుండా ఎవరో తెలియని ఆర్టిస్టుని చూపించారు. ఆ స్థానంలో వుండాల్సింది ఎంతో కొంత గుర్తింపు వున్న హీరో. ఎవరైనా తెలిసిన హీరో అయివుంటే పాయల్ లాంటి హీరోయిన్ కోసం డ్రామా ఎక్సైటింగ్ గా ఎలివేట్ అయ్యేది. అనామకుడితో
, అతడి అనుభవం లేని నటనతో పూర్తిగా విఫలమైంది. దీని తర్వాత రెండు పాత్రలతో వేరే ట్విస్టులు ముగింపుని నిలబెడతాయి.

నటనలు- సాంకేతికాలు

    ఫస్టాఫ్ ప్రారంభంలో పాయల్ చిన్ననాటి కథ వుంటుంది. ఇంటర్వెల్లో హార్రర్ ఎంట్రీ ఇచ్చాక సెకండాఫ్ లో అరగంట ఫ్లాష్ బ్యాక్ లో ఆమె కనిపిస్తుంది. కాకపోతే ఈ ఫ్లాష్ బ్యాక్ లోనే మూసి పెట్టిన ఆమె కథని, వివిధ పాత్రలు వాటి ఫ్లాష్ బ్యాకులు చెప్తూ ఆమెని తెరపైకి తీసుకొస్తూంటారు. దీంతో పాయల్ సెకండాఫ్ అంతా కన్పిస్తుంది. ఈ సెకండాఫ్ అంతా ఆమెది నాన్ స్టాప్ ఏడుపే. ప్రతీ సీనులో ఆమని కొట్టడం,వాడుకోవడం, వెళ్ళగొట్టడం తాలూకు ఏడ్పులే వుంటాయి. ఇలా పాత్ర మానసిక సంఘర్షణతో బలమైనదే. దీన్ని పకడ్బందీగా పోషించింది. ఆర్ ఎక్స్ 1000 కంటే ఈ పాత్ర బలమైనదే. ఇది నటించడానికి ధైర్యం కూడా కావాలి. కాకపోతే కథగా పాత్రకి న్యాయం జరగలేదు. ఆమె పాత్రని మిగతా పాత్రల కథలు కమ్మేయడంతో, ఆఖరికి పటానికి దండేసి వూరంతా కొలిచే పాత్ర వేరే అయింది.
        
ఇక బాగా ఆకట్టుకునే ఇంకో పాత్ర డాక్టర్. ఈ పాత్రలో రవీందర్ విజయ్ చివరి ట్విస్టుల్లో పాయల్ కంటే ఎక్కువ సానుభూతిని కొట్టేస్తాడు. రియల్ హీరో అనిపిస్తాడు. జమీందారుగా చైతన్య కృష్ణకి నటించే అవకాశమున్న పాత్ర దక్కింది. జమీందారు భార్యగా దివ్యా పిళ్ళై ముగింపులో విజృంభిస్తుంది. అన్ని పాత్రల మధ్య కరివేపాకు పాత్ర ఎస్సైగా వేసిన నందితా శ్వేతదే. ఈమె వూళ్ళో పోలీసు గస్తీ పెట్టిస్తే ఒక్క మర్డర్ జరగదు. ఆ పని చేయదు. పాత్రలిచ్చే ట్విస్టులు చూసి తెల్లబోవడం తప్ప.
       
అంధుడి పాత్ర వేసిన ఆర్టిస్టుతో అజయ్ ఘోష్ కామెడీ చేశాడు- డబుల్ మీనింగుల కామెడీ. ఫోటో గ్రాఫర్ గా శ్రవణ్ రెడ్డిది కీలక పాత్రే. ఇంగ్లీష్ లెక్చరర్ గా అజ్మల్ అమీర్ కి పాయల్ తో రోమాన్స్
, ఒక పాట, కొన్ని అడల్ట్ సీన్స్ కుదిరాయి.
       
అజనీష్ లోక్‌నాథ్
సంగీతంలో మూడు పాటలున్నాయి. జాతర పాట చిత్రీకరణ సహా హైలైట్. దాశరథి శివేంద్ కెమెరా వర్క్ చెప్పుకోదగ్గది సీజీ సహా. సాంకేతికంగా సినిమా బలంగా వుంది. దర్శకుడు అజయ్ భూపతి తిరిగి ఆర్ ఎక్స్ 100 రేంజికి చేరుకోకపోయినా యూత్ అప్పీల్ లేని అడల్ట్ మూవీతో ఫర్వాలేదనిపించే కొత్త ప్రయోగం మాత్రం చేశాడు.
—సికిందర్

Sunday, November 12, 2023

1378 : రివ్యూ

రచన- దర్శకత్వం మనీష్ శర్మ
తారాగణం : సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, ఇమ్రాన్ హాష్మి, రేవతి, సిమ్రాన్, కుముద్ మిశ్రా, షారూఖ్ ఖాన్ (గెస్ట్) తదితరులు
సంగీతం (పాటలు) :  ప్రీతమ్, సంగీతం (నేపథ్యం) : తనుజ్ టికూ, ఛాయాగ్రహణం : అనయ్ గోస్వామి  
బ్యానర్ : యశ్ రాజ్ ఫిలిమ్స్, నిర్మాత : ఆదిత్యా చోప్రా
విడుదల : నవంబర్ 12, 2023
***

        శ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ సినిమాల్లో టైగర్3 ఐదవది. మొదటి నాలుగు ఏక్ థా టైగర్’, టైగర్ జిందా హై’, వార్’, పఠాన్ మొదలైనవి. ఇవికాక వార్2’, టైగర్ వర్సెస్ పఠాన్ మరో రెండు రాబోయే స్పై యూనివర్స్ సినిమాలు. మొదటి నాలుగు సినిమాల వసూళ్ళు 2,426 కోట్ల రూపాయలని చెబుతున్నారు. టైగర్ పేరుతో సినిమాల్లో సల్మాన్ ఖాన్ నటిస్తే, వార్ పేరుతో హృతిక్ రోషన్ ఒకటి నటించాడు. వార్ 2 లో హృతిక్- ఎన్టీఆర్ లు నటించబోతున్నారు. అలాగే టైగర్ వర్సెస్ పఠాన్ లో సల్మాన్- షారుఖ్ లు బద్ధ శత్రువులుగా నటించ బోతున్నారు. టైగర్ సిరీస్ లో సల్మాన్- కత్రినా కైఫ్ లు గూఢచారులుగా నటిస్తూ వస్తున్నారు. ప్రస్తుత టైగర్ 3 లో కూడా ఇద్దరూ అవే పాత్రల్ని కంటిన్యూ చేశారు.

        యితే ఈసారి దర్శకుడు యాక్షన్ సినిమాలు తీసిన దర్శకుడు కాదు. ఇతను బ్యాండ్ బాజా బారాత్’, లేడీస్ వర్సెస్ విక్కీ బహల్’, శుధ్ దేశీ రోమాన్స్ వంటి చిన్న రోమాంటిక్ సినిమాలు తీసిన దర్శకుడు మనీష్ శర్మ. అయాన్ ముఖర్జీ కూడా ఇలాటి చిన్న సినిమాలు తీసిన దర్శకుడే. ఇతను బ్రహ్మస్త్ర వంటి బిగ్ యాక్షన్ మూవీ తీసి హిట్ చేశాడు. మరి టైగర్3 తో మనీష్ శర్మ ఈ రేంజిని అందుకోగలిగాడా?ఈ విషయం పరిశీలిద్దాం...

కథ

    అవినాష్ సింగ్ రాథోడ్ అలియాస్ టైగర్ (సల్మాన్ ఖాన్) రా ఏజెంట్.  జోయా (కత్రినా కైఫ్) పాకిస్తానీ ఐఎస్సై ఏజెంట్. ఇద్దరూ గత టైగర్ జిందా హై లో భార్యాభర్తలయ్యారు. ఇప్పుడు ఎదిగిన కొడుకు వున్నాడు. మైథిలీ మీనన్ (రేవతి) రా చీఫ్. ఈమె రష్యాలోని పీటర్స్ బర్గ్ లో టైగర్ కి ఒక ఎసైన్మెంట్ అప్పజెప్తుంది. ఆ ఎసైన్మెంట్ మీద వెళ్ళిన టైగర్ కి అదే ఎసైన్మెంట్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్న జోయా దొరికి పోతుంది. ఏమంటే, మాజీ ఐఎస్సై ఏజెంట్ ఆతీష్ రెహ్మాన్ (ఇమ్రాన్ హాష్మి) తమ కొడుకుని బంధించి బ్లాక్ మెయిల్ చేశాడని చెప్తుంది. ఇప్పుడు ఆతీష్  అదే కొడుకుని అడ్డం పెట్టుకుని జోయా, టైగర్ లు ఇంకో ఆపరేషన్ చేయాలని బ్లాక్ మెయిల్ చేస్తాడు.
       
దీంతో ఇస్తాన్బుల్ లో భద్రపర్చిన పాకిస్తాన్ కి చెందిన సీక్రెట్ న్యూక్లియర్ కోడ్స్ దొంగిలించడానికి వెళ్తారు టైగర్-జోయా. ఆ కోడ్స్ తో ఇండియా మీద పగదీర్చుకోవాలను కుంటున్నాడు ఆతీష్. 1999 కార్గిల్ యుద్ధంలో శాంతి ప్రక్రియకి ఆతీష్ అడ్డుపడడంతో సైన్యం అతడ్ని తొలగించింది. ఇండియాతో శాంతిని వ్యతిరేకించే ఆతీష్ పగబట్టి వున్నాడు. ఇప్పుడా సీక్రెట్ కోడ్స్ తో ఇండియా మీద దాడి చేయాలనుకుంటున్నాడు. టైగర్
- జోయా
లు ఆ సీక్రేట్ కోడ్స్ అతడికి అప్పగించి కొడుకుని కాపాడుకున్నతర్వాత, ఈ దొంగతనం టైగర్ మీద వేసి పాక్ ఆర్మీకి పట్టిస్తాడు ఆతీష్. ఇక పాకిస్తాన్ లో బందీ అయిన టైగర్ కి ఉరిశిక్ష నిర్ణయిస్తుంది సైన్యం.
       
ఇప్పుడేం చేశాడు టైగర్
? ఉరిశిక్షని ఎలా తప్పించుకున్నాడు? సైనిక నియంతృత్వాన్ని వ్యతిరేకించే పాక్ ప్రధాని నస్రీన్ ఇరానీ (సిమ్రాన్) పాక్ జనరల్ తో ఎలాటి ప్రమాదంలో పడింది? ఇందులో టైగర్ తీసుకున్న చర్యలేమిటి? పాక్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆతీష్ తలపెట్టిన కుట్ర ఏమైంది? జోయాతో బాటు మరి కొందరు రా ఏజెంట్లు పాక్ లో చొరబడి చేసిన ఆపరేషన్ ఏమిటి? ఈ ప్రశ్నలకి సమాధానాలు మిగతా కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ
?

    ఖలేజా లో మహేష్ బాబు ఎక్కడో రాజస్థాన్ వెళ్ళి అక్కడి జనం సమస్యల గురించి పొరాడి ఫ్లాప్ చేసుకున్న కథలా వుంది. ఎక్కడో రాజస్థాన్ ప్రజల కష్ట సుఖాలు తెలుగు ప్రేక్షకుల కేమవసరం? అలాగే ఎక్కడో పాకిస్థాన్ ని కాపాడి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసే కథ ఇండియన్ ఆడియెన్స్ కేమవసరం? ఇది పాకిస్థాన్ కోసం పాకిస్థానీ పాత్రలతో పాకిస్థాన్లో తీసిన పాకిస్థానీ సినిమాలా వుంది చివరి వరకూ. నేటివిటీ ప్రాబ్లం. ఇదే దెబ్బకొట్టింది. పాక్ లో సైనిక నియంతృత్వాన్ని రూపుమాపి, ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలనే ఐడియాతో సినిమా తీయాలనే ఆలోచనే అతి తెలివితో కూడుకున్నదిలా కనిపిస్తోంది.
       
కనుక ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే కథ
, భావోద్వేగాలు, ఏదైనా కాస్త దేశభక్తీ కరువయ్యాయి. ఇండియన్ ప్రధానిని కాపాడే కథకుండేంత పౌరుషం పాక్ ప్రధానిని కాపాడే కథతో లేకుండా పోయాయి. ఫస్టాఫ్ వివిధ టైగర్ ఆపరేషన్స్ తో ఆఫ్ఘనిస్తాన్, పీటర్స్ బర్గ్, ఇస్తాన్బుల్, ఆస్ట్రియాల్లో యాక్షన్ సీన్స్ తో కథ సాగుతున్నంత సేపూ బాగానే వుంటుంది.       

ఇంటర్వెల్లో టైగర్ పాక్ ఆర్మీకి చిక్కాక ఇక సెకండాఫ్ అంతా పాకిస్థాన్ గురించి పాకిస్థాన్లోనే జరుగుతుంది. ఇండియాకి ప్రమాదకరంగా వున్న సీక్రెట్ కోడ్స్ ని చేజిక్కిం
చుకోవడం గురించి మొత్తం సినిమా అంతా పాక్ లోనే నడిపినా ఇబ్బంది వుండేది కాదు. హేపీ భాగ్ జాయేగీ లో హీరోయిన్ ప్రేమించిన వాడికోసం పాకిస్థాన్ పారిపోతే, ఆమెని పట్టుకోవడం కోసం పాకిస్థాన్లో నడిపిన కామెడీ ఇందుకే హిట్టయ్యింది. పాకిస్థాన్లో నడిపినా కథ ఇండియా గురించై వుండాలి.
       
కానీ ఇండియాకి పొంచి వున్న ముప్పుని నివారించకుండా
, అక్కడి సైన్యం నుంచి పాక్ ని కాపాడే కథ చేయడంతో రిజల్టు రివర్స్ అయింది. అసలు సెకండాఫ్ లో సీక్రెట్ కోడ్స్ ప్రస్తావనే వుండదు. టైగర్ ని ఎందుకైతే పాక్ ఆర్మీ పట్టుకున్నారో, ఆ సీక్రెట్ కోడ్స్ కోసం టార్చర్ చెయ్యనే చెయ్యరు. ఉరిశిక్ష వేసి పారేస్తారంతే!

నటనలు- సాంకేతికాలు

    టైగర్ స్పైగా ఈసారి సల్మాన్ వయసు తాలూకు అలసటతో కనిపిస్తాడు. ఎమోషన్స్ ఒలికించి అలసటని దాయడానికి పాత్రకి ఎక్కడా ఎమోషన్స్ పుట్టే కథే లేదు. అందుకని ఎంత భారీ యెత్తున హైరేంజి యాక్షన్ సీన్స్, ఛేజింగులు చేసినా ఫ్లాట్ గా వుంటాయి. అతను ఇండియా గురించి పోరాడితే ఫీలింగు వుంటుంది. కనీసం కొడుకుని అడ్డం పెట్టుకుని అతీష్ బ్లాక్ మెయిల్ చేసినప్పుడు - దేశమా, కొడుకా అన్న డైలెమాలో పడాలి. తను దేశమే అంటే, భార్య కొడుకు కోసం ఆతీష్ డిమాండ్ ని తీర్చాలన్నప్పుడు సంఘర్షణ పుట్టి - తగు భావోద్వేగాలతో డ్రామా ఏర్పడేది. ఇలాటి ఘట్టాలే కరువయ్యాయి.
       
యాక్షన్ హీరోయిన్ గా కత్రినాకైఫ్ చేసే ఫైట్స్
, ముఖ్యంగా టవల్ ఫైట్ హైలైట్ గా నిలుస్తాయి. ఇక విలన్ గా ఒకప్పటి హీరో ఇమ్రాన్ హాష్మీ ఒక్కడికే లక్ష్యంతో కూడిన తగిన ఎమోషన్స్ వున్నాయి. తనకు సాధ్యమయ్యెంత విలనీ పోషించాడు. షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్ లో సల్మాన్ ని కాపాడే సుదీర్ఘమైన 15 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ సెకెండాఫ్ కి హైలైట్. చాలా గగుర్పాటు కల్గించేదిగా వుంటుంది. అయితే ఇక్కడ పఠాన్ లో యాక్షన్ సీన్లో ఇద్దరూ చేసినంత ఫన్ లేదు. ఇక రాచీఫ్ గా రేవతి, పాక్ ప్రధానిగా సిమ్రాన్ పాత్రల్లో సరిపోయారు.
       
ప్రీతమ్ సంగీతంలో రెండే పాటలున్నాయి. రెండూ బావున్నాయి. ఏదో చేసి ప్రీతమ్ పాటల్ని సక్సెస్ చేస్తాడు. తనుజ్ టికూ నేపథ్య సంగీతం చెప్పుకోదగ్గది. భార్యా భర్తలుగా సల్మాన్ - కత్రినాలు పరస్పర విరోధాలతో చేసుకునే ఫైటింగ్ కి నేపథ్య సంగీతంలో శోకరసం ప్రవహించడం యాక్షన్ సీనుకి బలం చేకూర్చేదిగా వుంటుంది. అలాగే మిగిలిన యాక్షన్ సీన్స్ కి నేపథ్య సంగీతం వాటి పరిస్థితులకి అద్దం పడుతుంది. ఇక అనయ్  గోస్వామి ఛాయాగ్రహణం హై క్వాలిటీ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నది. యాక్షన్ కొరియోగ్రఫీ
, ఔట్ డోర్ లొకేషన్స్ ప్రత్యేకంగా వున్నాయి.
       
కానీ చిన్న సినిమాల దర్శకుడు మనీష్ శర్మ ఈ భారీ స్పై యాక్షన్ ని భుజానెత్తుకుని అన్యాయమే చేశాడు. చిత్రీ కరణతో కాదు
, రచనతో. కనీసం కాస్త కామెడీ, ఫన్, ఎంటర్టయిన్మెంట్ లాంటి ఎలిమెంట్సే లేకుండా, రిలీఫ్ లేకుండా, సాంతం యమ సీరియస్ కథ చేశాడు. ఆ కథకి నేటివిటీ లోపమే కాకుండా, కథనంలో థ్రిల్, సస్పెన్స్, మలుపులు వంటి సినిమా కోరుకునే కనీసావసరాలు కూడా తీర్చలేక పోయాడు. సినిమాలో దీపావళి ప్రస్తావన వుంటుంది రెండు మూడు సార్లు విలన్స్ తో. పాకిస్థాన్ కోసం పాకిస్థాన్లో జరిగే ఈ కథ, పాకిస్థానీ పాత్రలకి దీపావళి టపాసులేమో గానీ, స్థానిక భారతీయ బాధిత ప్రేక్షక జీవులకి మాత్రం దీపావళి రోజు దీంతో అంత సీను లేదు.
—సికిందర్

 

Thursday, November 9, 2023

1377 : రివ్యూ

 

రచన- దర్శకత్వం: మిఖిల్ ముసలే
తారాగణం : నిమ్రత్ కౌర్, రాధికా మదన్, భాగ్యశ్రీ, శృతీ వ్యాస్, సుబోధ్ భావే, సోహామ్ మజుందార్ తదితరులు
సంగీతం : హితేష్ సోనిక్, ఛాయాగ్రహణం : త్రిభువన్ బాబు సాదినేని
బ్యానర్ : మాడక్ ఫిల్మ్స్, నిర్మాత : దినేష్ విజన్
విడుదల : అక్టోబర్ 27, 2023
***

          సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతూంటాయి. యూజర్లు తమ అకౌంట్ లోకి వీడియో రాగానే ముందూ వెనుకా ఆలోచించకుండా షేర్ బటన్ నొక్కేస్తారు. అది అసలీయా, నకిలీయా నిమిత్తం వుండదు. అలా ఫేక్ (నకిలీ) వీడియోలు కూడా వైరల్ ఐపోతూంటాయి. మరొకటేమిటంటే, ఒకవేళ అది మార్ఫ్పింగ్ లేదా ఎడిటింగ్ చేసిన ఫేక్ వీడియో కాకపోయినా, స్క్రిప్టెడ్ వీడియోనేమో అని కూడా తెలుసుకోరు. అది రియల్ అనుకుని దాన్నీ వైరల్ చేసేస్తారు. సోషల్ మీడియాలో ఏది రీల్, ఏది రియల్ కనిపెట్టడం కూడా కష్టమే. ఉదాహరణకి, ముంబాయిలో సరైన దుస్తులు ధరించకుండా రెచ్చగొడుతూ విచ్చల విడిగా తిరిగే అలవాటున్న టీవీ నటి, మోడల్ ఉర్ఫీ జావేద్ గురించి తెలిసిందే. ఈమె మొన్న నవంబర్ 3 న తన మీద ఫేక్ అరెస్ట్ వీడియో సృష్టించుకుని వైరల్ చేసింది. ఆ వీడియోలో రెచ్చగొట్టే దుస్తులు ధరించిన ఉర్ఫీని, కాఫీషాప్ లో మహిళా పోలీసులు కస్టడీలోకి తీసుకుని పోతూంటారు. ఇది వైరల్ అయింది. గుడ్ జాబ్ అని పోలీసుల్ని మెచ్చుకుంటూ, తిక్క కుదిరిందని ఉర్ఫీమీద కసి తీర్చుకుంటూ కామెంట్లు కూడా పోస్ట్ చేసుకున్నారు అతి ఉత్సాహపరులు.
          
తీరా ఈ వీడియో చూసి ఆ ఏరియా పోలీసులు వాళ్ళు పోలీసులుగా నటించడానికి ఉర్ఫీ హైర్ చేసుకున్న మహిళలని కనిపెట్టేశారు. ఉర్ఫీ ఇలా నకిలీ మహిళా పోలీసులతో స్క్రిప్టెడ్ డ్రామా క్రియేట్ చేసినందుకు ఆమెని పట్టుకుని క్రిమినల్ కేసు పెట్టేశారు. సోషల్ మీడియా మూక ఇది కూడా చూసి ఫూల్స్ అయినందుకు కంగుతిన్నారు. కానీ ఉర్ఫీకేమవుతుంది, ఆమెదగ్గర కోట్ల రూపాయలున్నాయి. కానీ ఇలా వైరల్ చేయడం వల్ల దెబ్బ తింటున్న జీవితాలూ వున్నాయి. వెలివేతలున్నాయి, ఆత్మహత్యలూ వున్నాయి. ఈ పరిస్థితినే  తీసుకుని సజినీ షిండే కా వైరల్ వీడియో తీశాడు దర్శకుడు మిఖిల్ ముసలే.

కథేమిటి
?

    పుణేలో సజినీ షిండే (రాధికా మదన్), శ్రద్ధా ఓస్వాల్ (శృతీ వ్యాస్) లు ఒక స్కూల్లో టీచర్లుగా పనిచేస్తూంటారు. ఆ స్కూలుకి కళ్యాణీ పండిట్ (భాగ్యశ్రీ) ప్రిన్సిపాల్. ఒక స్కూలు ఎసైన్మెంట్ లో భాగంగా టీచర్లు ఇద్దరూ సింగపూర్ వెళ్తారు. ఆ రోజు సజినీ బర్త్ డే. రెస్టారెంట్ లో తప్ప తాగి పార్టీ చేసుకుంటూ, అర్ధనగ్నంగా వున్న ఇద్దరు యువకులతో శాండ్ విచ్ డాన్స్ చేస్తుంది సజినీ. దీన్ని ఎవరో వీడియో తీసి వైరల్ చేస్తారు. దాంతో సజినీని ఇంటిదగ్గరా, స్కూల్లో, బయటా ఘోరంగా అవమానిస్తారు. ప్రిన్సిపాల్ కళ్యాణి ఇద్దర్నీ సస్పెండ్ చేస్తుంది. ఇక సజినీ ఒంటరి అయిపోయి- మానసిక క్షోభ తట్టుకోలేక- సెలవు తీసుకుంటున్నానని ఫేస్ బుక్ లో పోస్టు పెట్టి మాయమైపోతుంది.
         
ఆమె మిస్సింగ్ కేసుని క్రైమ్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ బేలా బారోట్ (నిమ్రత్ కౌర్) తీసుకుని దర్యాప్తు ప్రారంభిస్తుంది. ఈ దర్యాప్తుతో ఎవరూ సహకరించరు. మాయమై పోయిన సజినీ ఒకవేళ ఆత్మహత్య చేసుకుని వున్నా దానికంటే కూడా తమ పరువు ప్రతిష్టలే ముఖ్యమన్నట్టు ప్రవర్తిస్తారు. స్కూలు ప్రిన్సిపాల్ కూడా ఇదే ధోరణితో వుంటుంది. ఇక సజినీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందా
, లేక ఆత్మహత్య చేసుకుందా, లేక ఎవరైనా చంపేశారా అన్నది అంతు చిక్కని మిస్టరీగా మారుతుంది. దీన్ని ఇన్స్ పెక్టర్ బేలా ఎలా ఛేదించి నిజాన్ని కనుక్కున్నదనేది మిగతా కథ.  

ఏకపక్షంగా విషయం

    పుణేని ఆధునిక- ఎక్కువగా సాంప్రదాయ సంస్కృతుల కేంద్రంగా చూపిస్తూ సోషల్ మీడియా బాధితురాలి కథ చెప్పాడు దర్శకుడు. అయితే ఈ బాధితురాలికి వ్యతిరేక పాత్రలే తప్ప, బాధితురాలి తరపున పోరాడే పాత్రలు లేకపోవడంతో కథ ఏకపక్షంగా, చప్పగా సాగుతుంది. దీంతో కథలో బాధ, జీవం లేకుండా పోయాయి. సోషల్ మీడియా దుష్పరిణామాలకి ఒక పరిష్కారం చూపించాల్సిన కథ కాస్తా బాధితురాలిని వదిలేసి, కేవలం ఆమె అదృశ్యం వెనుక వ్యక్తుల్ని పట్టుకునే మామూలు, ఆసక్తి కల్గించని సస్పెన్స్ థ్రిల్లర్ గా మారిపోయింది.ఇదే ఈ సినిమాని పేలవంగా మార్చింది.
         
ఆమె తండ్రి స్టేజినటుడు. అభ్యుదయ పాత్రలేస్తాడు. కానీ ఇంటిదగ్గర భార్యతో
, కూతురితో క్రూరంగా వుంటాడు. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలివ్వడు. అతడి తమ్ముడు కూడా మగ దురహంకారంతో వుంటాడు. ఆనర్ కిల్లింగ్స్ ని సమర్ధిస్తాడు. కొడుకు, అంటే బాధితురాలి తమ్ముడు పిరికిపంద. బాయ్ ఫ్రెండ్ కూడా ఆమె వైరల్ వీడియో చూసి గుడ్ బై కొట్టేస్తాడు. ప్రిన్సిపాల్ సరేసరి. ఇక తోటి టీచరైనా బాధితురాలి పక్షం తీసుకోదు. సైలెంట్ అయిపోతుంది. ఇలా ఇంటా బయటా ఒంటరి అయిపోయాక అలాటి నిర్ణయం తీసుకుంది బాధితురాలు.
         
కనీసం తండ్రిని అభ్యుదయ భావాలున్న వ్యక్తిగా చూపించి వుంటే
, కూతురికి జరుగుతున్న అన్యాయానికి ఏడ్చి పోరాడే పాత్రగా కథకి బలం తీసుకొచ్చేవాడు. సోషల్ మీడియా సమస్య కేంద్ర బిందువయ్యేది. ఇన్స్ పెక్టర్ కూడా స్త్రీ అయి వుండీ ఇలాటి బాధితురాళ్ళ సమస్యకి పరిష్కారం కనుగొనే దిశగా కాక, ఆమె అదృశ్యం వెనుక హస్తాల్ని పట్టుకునే పోలీసు డ్యూటీకే పరిమితమవడంతో జీవం లేని పాత్రగా మిగిలిపోయింది.
          
ఈ కథలో ప్రధానంగా అల్లరిపాలైంది బాధితురాలి వ్యక్తిత్వమే. ఇన్స్ పెక్టర్ ఇందులో నిజమెంత అని తెలుసుకునే ప్రయత్నం చేసి వుంటే- సింగపూర్ లో ఆమె అలా ప్రవర్తించడానికి మూల కారణం తెలిసి వచ్చేదేమో. ఎందుకంటే దర్శకుడు కథ అలా తయారు చేసుకున్నాడు, అందులో వున్న అర్ధాన్ని తెలుసుకోలేదు. ఆమెది తండ్రి వల్ల ఇంటి దగ్గర అణిగిమణిగి వుండే జీవితమని చూపించాడు. కాబట్టి సింగపూర్ లో ఆమె అలా ప్రవర్తించడానికి ఈ అణిచివేతే కారణమేమో.  ఆ క్షణం ఒక్కసారి అలా రెక్కలు విప్పుకుందేమో. అంతేగానీ ఆమె స్వాభావికంగా తప్ప తాగి తిరిగే మనిషి కాదేమో. అంటే ఆమె అలా చేయడానికి కారకుడు తండ్రే అవుతాడేమో. అప్పుడు ఇలా కనిపించని దోషుల్ని కూడా బయటపెట్ట వచ్చెమో ఇన్స్ పెక్టర్?
         
అసలా వీడియో తీసిందెవరో కూడా పట్టుకుని ఒక ఆడదానిగా నాల్గు తగిలించి- ఇలాటి పోకడకి వైరల్ మూకకి తగిన క్లాసు పీకి వుంటే
, ఇన్స్ పెక్టర్ కి రాణింపుగా వుండేది. అసలు ఆడదిగానే ఫీలవ్వదు ఇన్స్ పెక్టర్!
         
ఇక చుట్టూ సమాజం. ఇలాటి సంఘటనల్లో ఆందోళన లేవదీసే ప్రాణులు వుండకుండా పోవు. నవంబర్ 3 న బనారస్ హిందూ యూనివర్సిటీ ఘటనపై చెలరేగిన ఆందోళనే తార్కాణం. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక విద్యార్ధిని
, ఆమె స్నేహితుడు క్యాంపస్ లో  వాకింగ్ చేస్తూంటే, బయటి నుంచి వచ్చిన ముగ్గురు దుండగులు స్నేహితుడ్ని కొట్టి, ఆమెని ఈడ్చుకెళ్ళి, వివస్త్రని చేసి అసభ్యంగా ప్రవర్తించి, వీడియోలు తీసిన సంఘటనతో వేల మంది విద్యార్ధులతో యూనివర్సిటీ భగ్గుమంది. కానీ మన స్కూలు టీచర్ కథలో టీచర్ వైపు వుండే ప్రాణులెవరూ వుండరు. ఇలావుంది సోషల్ మీడియాతో కథ!

సస్పెన్స్ థ్రిల్లర్ సంగతులు

టీచర్ సజినీ షిండే అదృశ్యం వెనుక ఎవరు? దర్శకుడే! కానీ దర్శకుడికి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ దాగుడుమూతలాట వల్ల కాలేదు. ఇన్స్ పెక్టర్ అనుమానితుల్ని ప్రశ్నించడం, ఉండుండి ఒకో క్లూ పట్టుకోవడం చాలా నత్త నడకలాగా సాగుతుంది. ఆ క్లూలు కూడా కథని వేగంగా పరుగెత్తించవు. ఆ క్లూస్ కూడా సర్ప్రైజ్ చెయ్యవు. ఇంటర్వెల్లో నైతే పేలవమైన మలుపుతో ఉస్సూరంటుంది ప్రాణం.
         
ఇక సెకండాఫ్ మళ్ళీ
అదృశ్యం వెనుక ఎవరు సాగతీత కథే. ఇంతకి మించి ఏమీ వుండదు. వెళ్ళి వెళ్ళి క్లయిమాక్స్ లో దోషి అరెస్ట్. ఈ దోషిని, నేర కారణాన్నీ చూసి ఇలాటి సస్పెన్స్ థ్రిల్లర్స్ తో అనుభవమయ్యే నిరాశే ఇక్కడా ఎదురవుతుంది. ఎందుకంటే ఇది ఎండ్ సస్పెన్స్ కథ. ఎండ్ సస్పెన్స్ కథలు సినిమాకి పనికి రావు. చివరివరకూ దోషి ఎవరా అని ఓపికని పరీక్షించే ఇలాటి కథలు- తీరా ఆ దోషినీ, నేర కారణాన్నీ బయట పెడితే కథ పంక్చరై పోతుంది. అది భారీ షాకుతో చాలా డిస్టర్బింగ్ గా వుంటే తప్ప, ఒక పతాక స్థాయిలో వెంటాడే ముగింపుగా వుంటే తప్ప, సినిమా నిలబడదు. దీన్ని ఇంతవరకూ ఎవరూ సాధించలేకపోయారు. ఈ సినిమా కూడా సాధించలేదు.

—సికిందర్
         


Wednesday, November 8, 2023

1376 : రివ్యూ

 

రచన -దర్శకత్వం ; ఎంజి శ్రీనివాస్
తారాగణం: శివరాజ్‌కుమార్, అనుపమ్ ఖేర్, జయరామ్, అర్చనా జాయిస్, ప్రశాంత్ నారాయణన్, దత్తన్న తదితరులు
సంగీతం : అర్జున్ జన్య, ఛాయాగ్రహణం : మహేంద్ర సింహా
బ్యానర్ : సందేశ్ ప్రొడక్షన్స్, నిర్మాత  : సందేశ్ నాగరాజ్
విడుదల : నవంబర్ 4, 2023
***

            న్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇటీవల జైలర్ లో ఒక పాత్రలో గ్యాంగ్ స్టర్ గా అతిధి పాత్ర నటించి ఆకట్టుకున్నాడు. ఈ జైలర్ ఫీవర్ ఇంకా వుండగానే శివరాజ్ కుమార్ మరో యాక్షన్ మూవీతో కన్నడ ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేశాడు. గత నెల దసరాకి కన్నడలో విడుదలైన ఘోస్ట్ రెండువారాల్లో రూ. 20 కోట్లు వసూలు చేసి హిట్టనిపించుకుంది. దీని బడ్జెట్ రూ. 15 కోట్లే. ఈ రోజు తెలుగు వెర్షన్ విడుదలైంది. ఇప్పుడు తెలుగులో దీని పరిస్థితేమిటో చూద్దాం...

కథ   

    కర్ణాటకలో జైళ్ళ ప్రయివేటీకరణ గురించి పదేళ్ళు పొరాడి విజయం సాధిస్తాడు మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ (ప్రశాంత్ నారాయణన్). భూమి పూజ చేయడానికి జైలుకెళ్తాడు. అదే సమయంలో ఒక ముసుగు వ్యక్తి, అతడి ముఠా జైలుని హైజాక్ చేసి ఖైదీలు సహా వామన్ శ్రీనివాస్ ని, జైలు అధికారుల్నీ బందీలుగా వుంచుకుంటారు. దీంతో వెంటనే సిటీ పోలీస్ కమీషనర్ చరణ్ రాజ్  (జయరాం) రంగంలోకి దిగుతాడు. జైలుని హైజాక్ చేసిన ముసుగు వ్యక్తి బిగ్ డాడీ (శివరాజ్ కుమార్) అనే క్రైమ్ బాస్ అని తెలుసుకుంటాడు.
        
బిగ్ డాడీ జైలులో దాచిపెట్టిన వెయ్యి కిలోల బంగారాన్ని దోచుకోవడానికి హైజాక్ చేశాడు. ఒక కుంభకోణంలో భారీ యెత్తున బంగారాన్ని పట్టుకున్న సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్, జైలర్ థామస్ తో కలిసి బంగారాన్ని జైల్లో దాచాడు. ఈ విషయం కనిపెట్టిన అసిస్టెంట్ ప్రభునీ, అతడి భార్యనీ చంపేశాడు. ఈ బంగారం గుట్టు బయటపడకుండా జైలుని ప్రవేటీకరణ చేయాలని రాజకీయ పార్టీతో కుమ్మక్కయి ప్రయత్నాలు మొదలెట్టాడు. వీళ్ళ ఎత్తుగడని చిత్తు చేస్తూ బంగారాన్ని దోచుకోవడానికి బిగ్ డాడీ ఎంటరయ్యాడు.
       
ఎవరీ బిగ్ డాడీ
? తనలాగే వున్న ఆనందరావు చనిపోతే తనెవరు? ఆనందరావు ఎవరు? వామన్ శ్రీనివాస్ చంపేసిన ప్రభు, అతడి భార్య బిగ్ డాడీ కేమవుతారు? బంగారం ఎవరిది? బిగ్ డాడీ ఏం చేయాలనుకున్నాడు? అతను అంత కర్కశంగా ఎందుకు మారాడు?... ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

    పక్కా మాస్ కమర్షియల్ కథ. ఒక దోపిడీ, ఒక హైజాక్, కొన్ని హత్యలు, ప్రతీకారం వంటి బాక్సాఫీసు అప్పీలున్న ఎలిమెంట్స్ తో భారీ యెత్తున తలపట్టిన సూపర్ స్టార్ కి సూటయ్యే మసాలా కథ. 60 ఏళ్ళ సూపర్ స్టార్ తో ఎడాపెడా హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో, కళ్ళు తిప్పుకోనివ్వని వేగవంతమైన కథనంతో సాగే మూసఫార్ములా కథ. హీరోయిన్, పాటలు, కామెడీలు లేని, ఎత్తిన ఆయుధం దించని రివెంజీ డ్రామా.
       
యువదర్శకుడు ఎంజి శ్రీనివాస్ సినిమా అంతటా ఒకే టెంపోని మెయింటెయిన్ చేస్తూ శరవేగంగా కథని పరుగులెట్టించిన విధానంలో అర్ధాలు
, లాజిక్కులు, లింకులు, ప్రశ్నలు, కామన్ సెన్సు అన్నీ నలిగి చదును అయిపోయాయి. జైళ్ళని ప్రైవేటీకరించడమేమిటి? పాత్రల మధ్య సంబంధాలు, సెంటిమెంట్లు, భావోద్వేగాలూ హాస్యాస్పదమయ్యాయి. అయితే ఇవి ఆలోచించేంత సమయం కూడా వుండదు ప్రేక్షకులకి. ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడే ట్విస్టులతో బిజీగా వుండడమే సరిపోతుంది. ఇలా ఫోకస్ అంతా యాక్షన్ మీదే పెట్టి సినిమా తీశాడు తప్ప, విషయం మీద కాదు.
       
పైగా మానవాతీత ఇమేజిగల క్యారక్టర్ తో శివరాజ్ కుమార్ బ్రహ్మాండంగా మోస్తున్నట్టున్న కథతో ప్రేక్షకులు చిత్తైపోవడమే జరుగుతుంది - అతడి స్టార్ పవర్ కి సాష్టాంగపడి. శివరాజ్ కుమార్ కి డైలాగులు చెప్పేంత టైమ్ కూడా లేదు. అతడి కళ్ళు మాత్రమే మాట్లాడతాయి. ఎప్పుడో గానీ ఒక సింగిల్ లైను డైలాగు వదులడు. ఇలా శివరాజ్ కోసం కమర్షియల్ సినిమా అర్ధాలే మార్చేస్తున్న ఈ తరహా మేకింగ్ లో పరిపక్వత కనిపించదు. సినిమా అంతటా క్రౌడ్ సీన్లూ
, హడావిడీ ఎక్కువే. అయితే ఇంత హంగామాతో చప్పున కేవలం  రెండుంపావు గంటల్లో ముగిసిపోవడమే హాయి అన్పించే పాజిటివ్ అంశం.

నటనలు- సాంకేతికాలు

    వివిధ భాషల్లో హిట్లు ఇస్తున్న 60 ప్లస్ స్టార్ల సరసన శివరాజ్ చేరిపోయాడు. కేజీఎఫ్ తో ప్రారంభమయిన గ్యాంగ్ స్టర్ పాత్రల ట్రెండ్ లో తనూ భాగమయ్యాడు. ఇప్పుడు చిరంజీవి కూడా హీరోయిన్లు, డాన్సులు, కామెడీలూ  లేని సినిమాలు చేసి 60 ప్లస్ స్టార్స్ క్లబ్ లో సమానత్వం కోసం సమాయత్తమవున్న విషయం తెలిసిందే. కరుడు గట్టిన గ్యాంగ్‌స్టర్‌గా కొత్త అవతారంలో తిరిగి వచ్చిన శివరాజ్‌కుమార్, పాత్రని మంచి ధీమాతో పోషించాడు. తెలుగులో ఏమోగానీ, కన్నడలో అతడి హైపర్ హీరోయిజానికి ఈలలే పడుతున్నాయి. ఈలలు పడే సీన్లు తగినన్ని వుండేలా జాగ్రత్త తీసుకున్నాడు దర్శకుడు.  అసలు ఈ దర్శకుడే శివరాజ్ వీరాభిమాని. కాబట్టి సినిమాకూడా అభిమానుల లెవెల్లో వుంది, క్వాలిటీతో బాటు.
        
కన్నడ సూపర్ స్టార్ సొగసైన హేర్ స్టయిల్ తో, నీలి రంగు కాంటాక్ట్ లెన్సులతో, పాత్రకి తగ్గ సొగసైన కాస్ట్యూమ్స్ తో, తగినంత రిచ్ గా కనిపించేలా చూసుకున్నాడు. ఇక యాక్షన్ సీన్స్ లో వీరవిహారం కుర్ర హీరోలని తలదన్నేలా వుంది. యువరతంలో కొత్త అభిమానులూ పుట్టుకొచ్చేలా వుంది.
       
ఇక ఇతర ముఖ్యపాత్రల్లో జయరాంది పూర్తి నిడివిగల పాత్రయితే
, అనుపమ్ ఖేర్ ది చివర్లో వచ్చే స్వల్ప పాత్ర. పాటలు లేని ఈ సినిమాలో
అర్జున్ జన్య బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా స్పీడ్‌కి బాగా కలిసొచ్చింది. యాక్షన్ సీన్స్ లో చేతులకి బేడీలతో కూడిన ఒకటి ప్రత్యేకంగా నిలుస్తుంది.  అయితే తెలుగు డబ్బింగ్ పట్ల శ్రద్ధ చూపించలేదు. మొత్తం మీద మాస్ ప్రేక్షకులకి ఈ కన్నడ డబ్బింగ్ మంచి కాలక్షేపం. మిగిలిన వారికి జస్ట్ టైమ్ పాస్ సినిమా.

—సికిందర్


Friday, November 3, 2023

1375 : రివ్యూ

 

దర్శకత్వం: తరుణ్ భాస్కర్
తారాగణం : బ్రహ్మనందం, తరుణ్ భాస్కర్, చైతన్యా రావు, జీవన్ కుమార్, రాగ్ మయూర్
రఘురామ్రవీంద్ర విజయ్ తదితరులు
సంగీతం : వివేక్ సాగర్, ఛాయాగ్రహణం : ఏజే ఆరోన్
నిర్మాతలు: సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్
విడుదల : నవంబర్ 3, 2023
***

        పెళ్ళిచూపులు’, ఈ నగరానికి ఏమైంది సినిమాల దర్శకుడు తరుణ్ భాస్కర్ మహానటి’, సీతారామం’, స్కైలాబ్ వంటి కొన్ని సినిమాల్లో సహాయ పాత్రలు నటించాడు. తిరిగి ఇప్పుడు హీరోగా నటిస్తూ కీడా కోలా అనే క్రైమ్ కామెడీకి దర్శకత్వం వహించాడు. ఏమిటీ క్రైమ్ కామెడీ, ఇదేమైనా డిఫరెంట్ గా వుందా, లేక వచ్చిపోయే మరో రొటీన్ వ్యవహారంగా వుందా తెలుసుకుందాం...

కథ

    వరదరాజులు (బ్రహ్మానందం), అతడి మనవడు వాస్తు (చైతన్యా రావు), వీళ్ళ లాయర్ లంచం (రాగ్ మయూర్) ఓ కేసులో కోటి రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఒకరోజు వరదరాజులు కోసం కోలా బాటిల్‌ తెస్తే అందులో బొద్దింక వుంటుంది. దీంతో కంపెనీ మీద కేసు వేసి 5 కోట్లు నష్టపరిహారం కొట్టేయాలని ప్లాను వేస్తారు. అదే సమయంలో హత్య కేసులో పదేళ్ళు జైలు శిక్ష అనుభవించి తిరిగి వస్తాడు నాయుడు (తరుణ్ భాస్కర్). ఇతడి తమ్ముడు జీవన్ నాయుడు ( జీవన్) ఒక కార్పొరేటర్ చేసిన అవమానాన్ని భరించలేక తనూ కార్పొరేటర్ అవ్వాలన్న కసితో వుంటాడు. దీనికి కోటి రూపాయలు కావాలి. దీనికొక ప్లాను వేస్తారు అన్నదమ్ములు. ఆ ప్లాను ప్రకారం కోలా కంపెనీలో పని చేస్తున్న నాయుడు బాటిల్లో బొద్దింక వేస్తాడు. ఆ కోలా కీడా (కీడా అంటే పురుగు) ని అడ్డం పెట్టుకుని కంపెనీ నుంచి కోటి రూపాయలు లాగాలనుకుంటారు. కానీ ఆ బాటిల్ వరద రాజులు దగ్గరుంది. ఇప్పుడేం జరిగిందనేది మిగతా కథ.

బాటిల్ కోసం నాయుడు వరదరాజులుని పట్టుకుంటే ఏం జరిగింది
? కోటి కాదు ఐదు కోట్లు పంచుకోవచ్చని ఒప్పందం కుదిరాక జాయింటుగా ఈ రెండు గ్రూపులు చేపట్టిన ఆపరేషన్ ఏమిటి? కంపెనీ సీఈఓ (రవీంద్ర విజయ్) ఆడుకున్న కౌంటర్ గేమ్ ఏమిటి? ఈ గేమ్ లో షాట్స్ (రఘురామ్) అనే కిల్లర్ పోషించిన పాత్రేమిటి? ప్రాణాల మీదికి తెచ్చుకుని కాల్పుల్లో చచ్చిందెవరు, బతికిందెవరు? బాటిల్ ఏమైంది? అది ఎవరి ప్రాణాలు కాపాడింది?  చివరికి డబ్బుంటే స్వేచ్ఛ వుంటుందని నమ్మిన వరదరాజులి నత్తి మనవడు నేర్చుకున్న జీవిత సత్యం ఏమిటి? ఇవన్నీ సెకండాఫ్ లో తెలుసుకోవచ్చు.

ఎలావుంది కథ

    డబ్బు చుట్టూ మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు పాల్పడే చర్యలతో కూడిన క్రైమ్ కామెడీ కథ ఇది. బ్రోచేవారెవరురా’, భలే మంచి రోజు లాంటి క్రైమ్ కామెడీల కోవకి ఇది చెందుతుంది. అయితే దర్శకత్వపు శైలి హాలీవుడ్ దర్శకుడు గై రిచీని పోలి వుంటుంది. సంగీతంలో పాప్ సంగీత మెలాగో, క్రైమ్ కామెడీల్లో గై రిచీది అలాటి పాప్ కల్చర్ స్టయిల్.  తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దీన్ని వాడుతూంటాడు. ఇదే కీడా కోలా ని తెలుగులో వస్తున్న రొటీన్ క్రైమ్ కామెడీల నుంచి వేర్పరుస్తుంది. నమ్మడానికి వీల్లేని అసంబద్ధ కథ, మెంటల్ పాత్రలు, మైండ్ లెస్ కామెడీ- ఫిలిమ్ నోయర్ జానర్ తరహా క్రిమినల్స్ వాడేలాటి మాటలు, బ్యాక్ గ్రౌండ్ లో క్రేజీ పాటలతో సాగే కథనం వగైరా క్రియేటివిటీలతో ఓ రెండు గంటల బోరు కొట్టని కాలక్షేపం.

నటనలు- సాంకేతికాలు

    నాయుడు పాత్రలో దర్శకుడు తరుణ్ భాస్కర్ నటనలో ఇంకో మెట్టు పైకెక్కాడు. పాత్రచిత్రణే ఈ క్రైమ్ కామెడీకి బలం. అతడి నడక, ముఖకవళికలు, తీసుకునే నిర్ణయాలు, పాల్పడే చర్యలు- ఇవన్నీ సీరియస్ గా వుంటూనే ఫన్నీగా వుంటాయి. ఈ సినిమాలో ఆడ పాత్రల్లేవు. చైనా నుంచి వచ్చిన ఒక నిలువెత్తు బార్బీ డాల్ వుంటుంది. దాంతో ప్రేమలో పడతాడు. చివర్లో గుండు దెబ్బ తిని నీట మునుగుతున్నప్పుడు టైటానిక్ లో హీరోహీరోయిన్ల అమర ప్రేమలాగా బార్బీ చేతి వేలికి తన చేతి వేలు తగిలే సరికి ప్రాణాలు లేచొచ్చేస్తాయి. అర్ధం లేని కామెడీలకి ఇలాటి ఫన్నీ ఇన్నోవేటివ్- క్రియేటివ్ సీన్స్ ఎన్నో వాడాడు. దర్శకుడుగా, నటుడుగా యూత్ కి కావాల్సిన ఓ కొత్త అనుభూతినంతా ఇచ్చాడు.
       
రెండో చెప్పుకోదగ్గ పాత్రలో వరదరాజులి మనవడుగా చైతన్యా రావు నటన. నత్తిని ఓ కొత్త పోకడతో నటించి దృశ్యాల్ని నిలబెట్టాడు. ఎన్ని సంబంధాలు చూసినా ఇతడి పెళ్ళి కాదు. చైనా డాల్ ఇతడి దగ్గరే వుంటుంది. దీంతో కూడా సంబంధాలు రావు. ఇంకో మ్యాడ్ క్యారక్టర్ జీవన్ నాయుడు పాత్రలో జీవన్ నటన ఇంకో ఫన్. లాయర్ గా రాగ్ మయూర్
, తరుణ్ భాస్కర్ మెంటల్ అనుచరుడుగా విష్ణు ఓయీ ప్రతీ సీనులో వుండే ఫన్నీ క్యారక్టర్లు. కిల్లర్ షాట్స్ గా రఘురామ్, సీఈఓ విలన్ గా రవీంద్ర విజయ్ క్రూరత్వాలు ఓపక్క. ఇక వరదరాజులుగా బ్రహ్మానందం వీల్ చైర్ కి పరిమితమై ఏంట్రా ఈ జీవితమని గడిపే ఇంకో ఫన్నీ పాత్ర.
        సాంకేతికంగా ఏజే ఆరోస్ కెమెరా వర్క్ ఇంకో కళాత్మక విలువ. ఔట్ డోర్, ఇండోర్ లొకేషన్స్ పాత్రలుండే ఇరుకు లొకాలిటీల్ని ఎక్కువగా ప్రొజెక్టు చేస్తాయి. వివేక్ సాగర్ సంగీతంలో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సాంగ్స్ కథని ముందుకు నడిపిస్తూంటాయి.
       
స్క్రీన్ ప్లే చూస్తే ఇంటర్వెల్ ఇంకా ఏమీ జరక్కుండానే అకస్మాత్తుగా వచ్చినట్టు అనిపిస్తుంది. కారణం ఇంటర్వెల్ వరకూ ఫస్టాఫ్ గంట అంతా నడిచేది పాత్రల పరిచయా లతో
, సమస్యకి దారితీసే పరిస్థితులతో మాత్రమే. అంటే బాటిల్ ని కలిగివున్న బ్రహ్మానందం దగ్గరికి తరుణ్ భాస్కర్ వచ్చి పట్టుకోవడంతోనే ఇంటర్వెల్ వస్తుంది. అంటే కథ తాలూకు సమస్య, దాంతో గోల్ ఏర్పాటు కాకుండానే – కథ ప్రారంభం కాకుండానే- ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఇలా ప్లాట్ పాయింట్ వన్ తో ఇంటర్వెల్ వేయడం రూల్స్ కి విరుద్ధమే అయినా రూల్స్ ని కూడా బ్రేక్ చేయాలనుకున్నట్టుంది దర్శకుడు. ఈ సినిమాకి కాబట్టి ఇది సరిపోయింది. మొత్తానికి కీడా కోలా లాజిక్ లేని కథని కలర్ఫుల్ పాత్రచిత్రణల వల్ల, గైరిచీ మేకింగ్ శైలి వల్లా తేలికగా తీసుకుని ఎంజాయ్ చేయదగ్గ ఆధునిక క్రైమ్ కామెడీగా  ఫర్వాలేదనిపించుకునే విధంగా తెరకెక్కిందని చెప్పొచ్చు! 

—సికిందర్