రచన- దర్శకత్వం : నెల్సన్ దిలీప్ కుమార్
తారాగణం : శివ కార్తికేయన్, ప్రియాంకా అరుళ్ మోహన్, వినయ్ రాయ్, యోగిబాబు, మిలింద్
సోమన్, రెడిన్ కింగ్ స్లే, జారా వినీత్
తదితరులు
సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్, ఛాయాగ్రహణం : విజయ్ కార్తీక్ కణ్ణన్
నిర్మాతలు : శివ కార్తికేయన్, కోటపడి రాజేష్
బ్యానర్ : శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్, కేజేఆర్ స్టూడియోస్
విడుదల అక్టోబర్ 9, 2021
***
Monday, October 11, 2021
1062 : రివ్యూ
Saturday, October 9, 2021
1061 : రివ్యూ
దర్శకత్వం : బి
గోపాల్
తారాగణం: గోపీచంద్, నయన తార, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, అభిమన్యూ సింగ్, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ,
గుండు హనుమంత రావు తదితరులు
కథ : వక్కంతం వంశీ, మాటలు : అబ్బూరి రవి, సంగీతం : మణిశర్మ, ఛాయాగ్రహణం : బాలమురుగన్
బ్యానర్: జయ బాలాజీ రియల్ మీడియా
నిర్మాత : తాండ్ర రమేష్
విడుదల : అక్టోబర్ 8, 2021
***
నటనలు - సాంకేతికాలు
―సికిందర్
(Published in telugurajyam.com,
a US based website)
1060 : రివ్యూ
దర్శకత్వం : క్రిష్ తారాగణం : వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, కోట శ్రీనివాసరావు, నాజర్, సాయిచంద్, రవిప్రకాష్, అన్నపూర్ణ, హేమ తదితరులు
కథ, మాటలు : సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి, స్క్రీన్ ప్లే : క్రిష్, సంగీతం : ఎంఎం కీరవాణి; పాటలు : సీతారామ శాస్త్రి, చంద్రబోస్, కీరవాణి; ఛాయాగ్రహణం : వీఎస్ జ్ఞాన శేఖర్
బ్యానర్ : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్ రెడ్డి.
విడుదల : అక్టోబర్ 8,2021
***
(Published in
telugurajyam.com,
a US based website)
Monday, September 27, 2021
1059 : మూవీ నోట్స్
Thursday, September 16, 2021
'పాలపిట్ట' మాసపత్రిక 'విస్మృత సినిమా' ఆర్టికల్ - 724
తెలుగు ప్రేక్షకుల సినిమాభిరుచి అప్పుడూ ఇప్పుడూ ఒకే తరహాలో తీర్చిదిద్దుకు న్నట్టుంది. సినిమాలు పక్కా వినోదాత్మకంగా వుండాలన్నదే మెజారిటీ వర్గం ప్రేక్షకులు శిలాశాసనం రాసుకున్న ఏకైక అభిరుచేమో. స్టాంపు వేసిన ఈ అభిరుచి ప్రకారం సినిమాలు వుండకపోతే విషయం లేని సినిమాల కింద మరణశాసనం రాసేస్తారు. బలమైన కథ వుందంటే, ఇక విషయం లేనట్టేనని తీర్పు ఇచ్చేస్తారు. ఈ వర్గం ప్రేక్షకులు కాలగర్భంలో కలిపేసిన సినిమాలన్నీ విస్మృత సినిమాలు కావు. తగిన కథాబలమూ, కథా ప్రయోజనమూ వుండి, వాళ్ళ అభిరుచికి దూరంగా వుండిపోయినవే విస్మృత సినిమాలన్పించుకుంటాయి. వాళ్ళ దృష్టిలో వీటికి వినోదాత్మక విలువ వుండదు. వినోదాత్మక విలువలు లేని సినిమాలు ఇతర భాషల్లో హిట్టయి చరిత్రలో నిల్చిపోతే, అవే తెలుగులో పునర్నిర్మించినప్పుడు ఫ్లాపయి పౌరసత్వాన్ని కోల్పోతాయి. ఇలాటిదే ఇంకో విస్మృత సినిమా ‘మనసే మందిరం’. ఇది తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో హిట్టయి, విచిత్రంగా తెలుగులో టైటిల్ మాత్రమే పాపులరైంది.
తమిళ మాతృక నుంచి ఈ రీమేకులన్నీ జరిగాయి. వినోదాత్మక విలువలు లేని, పూర్తి శోక రసమయమైన ఈ మాతృకని, ఎలా ఇన్ని భాషల్లో రీమేక్ చేయడానికి సాహసించారనేది జవాబు దొరకని ప్రశ్న. బహుశా కథని నమ్మడం వల్ల, కథకిచ్చిన ముగింపుకి దాసోహమై పోవడం వల్ల. ఇంతకంటే కారణాలు కన్పించవు. అదింకా 1960 ల నాటి కాలం. ట్రాజడీలని ఆదరిస్తున్న ట్రెండ్. ఈ ట్రెండ్ లో సి.వి. శ్రీధర్ అనే నిర్మాత, దర్శకుడు, రచయిత ‘నెంజిల్ ఒరు ఆలయం’ అనే విషాదాంత ప్రేమాయణం తీశాడు. సి.వి. శ్రీధర్ ( చిత్తమూర్ విజయ రాఘవులు రెడ్డియార్ శ్రీధర్, 1933 – 2008) తమిళ, తెలుగు, హిందీ భాషల్లో మంచి పేరున్నదర్శకుడు.1954 లో 21 వ యేట దర్శకుడైన శ్రీధర్, 1991 వరకూ 37 ఏళ్ల సుదీర్ఘ వృత్తి జీవితంలో 66 సినిమాలు తీశాడు. వీటిలో 47 తమిళం, 10 తెలుగు, 9 హిందీ వున్నాయి. ఎమ్జీఆర్, శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్, రాజ్ కపూర్, రాజేంద్రకుమార్, రాజ్ కుమార్, అశోక్ కుమార్, కిషోర్ కుమార్, శశికపూర్, రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్, సంజీవ్ కుమార్, శత్రుఘ్న సిన్హా, అక్కినేని నాగేశ్వరరావు, మీనాకుమారి, వైజయంతీ మాలా, రాజశ్రీ, హేమమాలిని, ముంతాజ్, సావిత్రి, కృష్ణకుమారి, బి. సరోజా దేవి, దేవిక...ఇలా కనువిందు చేసే అగ్ర తారాతోరణంతో ఆయన సినిమాలు కళకళ లాడేయి.
వెంటనే 1963 లో హిందీలో రీమేక్ చేశాడు. అప్పుడు బొటాబొటీ ముప్ఫై ఏళ్ళే! రాజేంద్ర కుమార్, మీనా కుమారి, రాజ్ కుమార్ లాంటి ఉద్దండులతో ‘దిల్ యేక్ మందిర్’. తీశాడు. శంకర్ – జైకిషన్ సంగీతం, ఏ. విన్సెంట్ ఛాయాగ్రహణం. ఇది 175 రోజులు ఆడి భారీ విజయం సాధించింది (అప్పట్లో కోటీ పది లక్షలు). ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. రాజ్ కుమార్ కి ఫిలిం ఫేర్ సహాయ పాత్రధారి అవార్డు లభించింది. 1966 లో తెలుగులో ‘మనసే మందిరం’ గా ఇంకో రీమేక్ చేశాడు. అప్పుడు 33 ఏళ్ళు! అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య నటీనటులు. ఎం.ఎస్. విశ్వనాథన్ సంగీతం, బాలు ఛాయాగ్రహణం.
1976 లో మలయాళంలో ‘హృదయం ఒరు క్షేత్రం’ గా, 1977 లో కన్నడలో ‘కుంకుమ రక్షే’ గా అక్కడి నిర్మాతలు, దర్శకులు రీమేక్స్ చేశారు. ఇలా మాతృకతో కలుపుకుని మొత్తం ఐదు సినిమాలయ్యాయి. తెలుగులో తప్ప అన్నీ హిట్టయ్యాయి. ఒక్క శ్రీధర్ తీసిన తమిళ, హిందీ, తెలుగు రీమేకులు తెలుపు – నలుపులో అయితే; మలయాళ, కన్నడ రీమేకులు రంగుల్లో తీశారు. హాలీవుడ్ నుంచి జగ్ ముంద్రా దీన్ని ఇంగ్లీషులో రీమేక్ చేయాలనీ కూడా విఫలయత్నం చేశాడు.
మాతృకతో బాటు రీమేకులన్నీ పూర్తిగా హాస్పిటల్లో తీసినవే. ఒక ప్రేమ సన్నివేశం, హిందీలో ఒక పాట తప్ప, హాస్పిటల్ దాటి బయటికి రాని ఇండోర్ కథా కథనాలతో తీశారు. మొదటి సీనుతో హస్పిటల్లోకి వెళ్ళే కెమెరా, చివరి సీనులో మాత్రమే హాస్పిటల్ దాటి బయటి దృశ్యాని కొస్తుంది. ఈ రెండున్నర గంటల ఇండోర్ డ్రామా 30 రోజుల్లో తీశారు. తెలుగులో సారధి స్టూడియోలో తీశారు. పాటల విషయాని కొస్తే, హిందీలో ఎక్కువ హిట్టయిన వెంటాడే పాటలున్నాయి : ‘యహా కోయీ నహీ తేరే మేరే సివా’ (రఫీ), ‘హమ్ తేరే ప్యార్ మే సారా ఆలమ్’ (లత), ‘యాద్ న జాయే భీతే దినోకీ (రఫీ), రుక్ జా రాత్ ఠెహర్ జారే చందా’ (లత), ‘దిల్ యేక్ మందిర్ హై’ (రఫీ, సుమన్ కళ్యాణ్ పూర్).
హాస్పిటల్లో నవంబర్ తొమ్మిదవ తేదీ క్యాలెండర్ కాగితం చించి రోజు ప్రారంభిస్తాడు డాక్టర్ రఘు (ఏఎన్నార్). తల్లి (శాంత కుమారి) వచ్చి, ఇంటికి రాకుండా హాస్పిటల్లోనే వుండిపోతున్నావు, ఒకసారి ఇంటికి రమ్మని ప్రాధేయపడుతుంది. తనకి హస్పిటలే జీవితమంటాడు. హాస్పిటల్ కి సీత (సావిత్రి) వస్తుంది. ఆమెని చూసి ఖిన్నుడవుతాడు రఘు. ఆమె కూడా అతణ్ణి చూసి కంగారు పడుతుంది. ఇద్దరూ గతంలో ప్రేమికులు. ఆమె కూడా భర్త వుంటాడు. అతడి ముందు బయటపడకుండా జాగ్రత్తపడతారు. భర్త రాము (జగ్గయ్య) కి క్యాన్సర్ వుందనీ, చికిత్స కోసం తీసుకు వచ్చాననీ అంటుంది.
డాక్టర్ రఘు వైద్య విద్య కోసం విదేశాల కెళ్ళినప్పుడు, తను ప్రేమిస్తున్న సీతకి ధనికుడైన రాముతో బలవంతపు పెళ్లి చేసేస్తాడు ఆమె తండ్రి. ఇది తెలుసుకున్న రఘు మానసికంగా దెబ్బతిని, ఇక పెళ్ళే చేసుకోనని, హాస్పిటల్ కి అంకితమై పోతాడు.
ఇప్పుడామె భర్తకి క్యాన్సర్. ఆమె సందిగ్ధంలో పడుతుంది. ఈ హాస్పిటల్ రఘుదని తెలీక వచ్చేసింది. ఇప్పుడు భర్తని ఇతడి చేతిలో పెడితే నయం చేస్తాడా, కక్ష తీర్చుకుంటాడా? రెండు వారాల్లో ఆపరేషన్ చేయకపోతే బతకడని రఘు అనేస్తాడు. ఆమె భర్తని కాపాడాలనే తప్ప అతడి మనసులో ఇంకే ఉద్దేశాలూ వుండవు. రాముకి వీళ్ళిద్దరి ప్రేమ గురించి తెలిసిపోతుంది. అతను అర్ధం జేసుకుని, ఆపరేషన్ లో తను మరణిస్తే, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని తీర్మానిస్తాడు. సీతకి ఇది జీర్ణంకాక రామూని బతికించుకోవాలని తీవ్ర సంఘర్షణ ప్రారంభిస్తుంది. రాము మాటలతో రఘు ధైర్యం కోల్పోతాడు. ఆపరేషన్ ఏ మాత్రం విఫలమైనా అది సీత తన సొంతమవుతుందన్న ఆశతోనే చేశాడని అందరూ అనుకుంటారు. ఇది భరించలేడు. దీంతో ఆపరేషన్ మీది బెంగతో నిద్రాహారాలు మాని, సర్జరీ శాస్త్రాలన్నీ తిరగేస్తూ పిచ్చివాడై పోతాడు. చివరికి ఆపరేషన్ రోజు రానే వస్తుంది. ఆపరేషన్ సక్సెస్ చేసి కుప్పకూలి మరణిస్తాడు డాక్టర్ రఘు.
‘మనసే మందిరం’ ముఖ్య పాత్రలు మూడూ పాసివ్ పాత్రలు కాదు. ఈ కథ ట్రాజడీయే అయినా తలరాతని విధికే వదిలేసి ఏడుస్తూ కూర్చునే పాసివ్ పాత్రలు కావు. తలరాతని మార్చుకోవడానికి పరిస్థితులతో సంఘర్షించే, లక్ష్యమున్న యాక్టివ్ పాత్రలు. డాక్టర్ రఘు పాత్రలో ఏఎన్నార్ కి ఆపరేషన్ విజయవంతం చేయాలన్న లక్ష్యం, దాంతో సంఘర్షణ; సీత పాత్రలో సావిత్రికి మృత్యు ముఖం లోంచి భర్తని కాపాడుకోవాలన్న లక్ష్యం, దాని తాలూకు సంఘర్షణ; క్యాన్సర్ రోగి రాము పాత్రలో జగ్గయ్యకి వాళ్ళిద్దర్నీ కలపాలన్న లక్ష్యం, దీని తాలూకు సంఘర్షణ. లక్ష్యం మాటల్లో వుంటే చాలదు, అది చర్యల్లో విజువల్ గా కన్పించాలి. జగ్గయ్య వాళ్ళిద్దరికీ కలిపి వీలునామా కూడా రాసేసి లక్ష్య శుద్ధిని చాటుకుంటాడు.
ఈ కథనంలో ఆలస్యం చేయకుండా రెండో సీన్లోనే కథ ప్రారంభించేస్తాడు దర్శకుడు. మొదటి సీనులో తల్లి వచ్చి, ఇంటికి రమ్మని ఏఎన్నార్ తో చెప్పి వెళ్ళాక, రెండో సీన్లోనే సావిత్రి జగ్గయ్యతో వచ్చేస్తుంది. జగ్గయ్యకి క్యాన్సర్. ఏఎన్నార్ కి ఎదుట వున్న సావిత్రితో పాత జ్ఞాపకాల తూఫాను, సావిత్రికి ఏఎన్నార్ మీద అనుమానం, వ్యతిరేకత. ఇలా కథకి ప్రధాన పాత్ర ఏఎన్నార్ అయితే, వ్యతిరేకించే ఎదుటి పాత్రగా సావిత్రి, వీళ్ళిద్దరి మధ్య గార్డియన్ పాత్రగా జగ్గయ్య. ఇలా బలాబలాల సమీకరణ పూర్తయ్యింది ఇక సంఘర్షణ అనే కథనరంగానికి.
ఈ రెండో సీన్లోనే ఎక్స్ రే చూస్తున్నప్పుడు, ఏఎన్నార్ కి సావిత్రితో గతం తాలూకు ఒక దృశ్యం మెదులుతుంది. వీళ్ళిద్దరూ పూర్వ ప్రేమికులని దృశ్యపరంగా క్లుప్తంగా చెప్పడం. ఈ సంక్షిప్త దృశ్యంలో పెళ్లెప్పుడని సావిత్రితో ఏఎన్నార్ అంటాడు. తండ్రితో మాట్లాడతానని ఆమె చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంతకి మించి వీళ్ళిద్దరి పూర్వ ప్రేమ సన్నివేశాలు కథనంలో మరెక్కడా రావు. హాలీవుడ్ స్క్రీన్ ప్లే సూత్రమొకటుంది : కథనంలో డిమాండ్ ని సృష్టించు, సరఫరాని ఆపెయ్యి అని.
ఇలా ఈ వొక సీనులో వాళ్ళ ప్రేమని అరకొరగా చూపించేసి, మనకి పూర్తిగా చూడాలన్పించే డిమాండ్ ని సృష్టించాడు దర్శకుడు. కానీ మరెక్కడా ఏఎన్నార్ – సావిత్రి హిట్ రోమాంటిక్ జంటతో మనకి చూడాలన్పించే ఆ పూర్తి ప్రేమ తాలూకు నులి వెచ్చని సన్నివేశాలని సరఫరా చేసి, డిమాండ్ ని తీర్చే పాపాన పోడు దర్శకుడు. కవితాత్మకంగా వూహకే వదిలేశాడు. దీంతో ఈ కథన భంగం (సీనస్ ఇంటరప్టస్) ఒక తియ్యటి బాధలా మిగిలిపోతుంది మనకి. ఇలాటి తియ్యటి బాధల్ని సృష్టించడం గొప్ప దర్శకుల వల్లే అవుతుంది. సినిమా ద్వితీయార్ధంలో ఒక చోట సావిత్రే తానెందుకు జగ్గయ్యని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో మాటల్లో చెప్తుంది. ఇప్పుడు కూడా ఫ్లాష్ బ్యాక్ వేయలేదు. ఫ్లాష్ బ్యాక్ అనేది ప్రధాన కథకి అవసరమైన సమాచారాన్ని అందించే వనరు మాత్రమే. అది కథవదు. కనుక మాటల్లో చెప్పేస్తే సరిపోతుంది. దాన్నే ఫ్లాష్ బ్యాకువేసి చూపిస్తూ పోతే, అది ప్రధాన కథ స్క్రీన్ టైముని తినేసి, అదే ప్రధాన కథ అన్నట్టుగా తయారవుతుంది.
ఇలా రొడ్డకొట్టుడు ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యే సరికి ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఇక్కడ్నుంచి జగ్గయ్య ఆపరేషన్ గురించిన అసలు కథ. ఏ కథైనా ఈ చట్రంలోనే వేసి రంగులరాట్నం తిప్పడం. రెండు మాటల్లో చెప్తే పోయే పాత పురాణాన్ని సగం సినిమా ఫ్లాష్ బ్యాకుగా వేసి, అది కూడా ప్రధాన కథే అన్నట్టుగా విన్యాసాలు చేయడం. ఒకే సినిమాలో రెండు ప్రధాన కథలుండవన్న ఇంగిత జ్ఞానంలేక. ఉన్న ప్రధాన కథ లోతుపాతుల్లోకి వెళ్ళడం తెలీక, ఎత్తుకున్న ప్రధాన కథ నడపడమూ తెలీకా, ఇలా ఇంటర్వెల్ వరకూ వృధా కాలక్షేపం చేయడం. కథని వీలయినంత తక్కువ స్క్రీన్ టైముకి కుదిస్తూ, సెకండాఫ్ లో ఏదో కథ చెప్పేసి, బయటికి దూకెయ్యడం. ఆ వికృత సినిమాల్ని ప్రేక్షకుల చేతిలో పెట్టడం.
కానీ శ్రీధర్ ప్రధాన కథ రెండో సీన్లో వెంటనే ప్రారంభమయింది మొదలు, చివరంటా రెండున్నర గంటలూ ఎడతెగని బిగితో ఆద్యంతం జ్వలిస్తూ సాగుతుంది ఫ్లాష్ బ్యాక్ ని ఎగేస్తూ. ఇందులో ఏఎన్నార్ – సావిత్రిల పూర్వ ప్రేమ కథని నామమాత్రం చేయడంలో ఇంకో ఉద్దేశం కూడా వుండొచ్చు. దర్శకుడు దీన్ని పూర్తి స్థాయి సస్పెన్స్ కథగా చెప్పాలనుకున్నాడు. పూర్వ ప్రేమ తాలూకు ఏ మాత్రం ఫ్లాష్ బ్యాక్ వేసినా, నడుస్తున్న ప్రధాన కథ తాలూకు సస్పెన్స్ ధార చెదిరిపోతుంది. కథనిండా మేట వేసిన శోక రసాన్ని మరిపించడానికి సస్పెన్స్ అనే షుగర్ కోటింగ్ ఇచ్చాడు – ‘ముత్యాల ముగ్గు’ లో బాపు - రమణలు కథా మూలంలో వున్న శోక రసాన్ని మరిపించే, అద్భుత రసపు షుగర్ కోటింగుతో హుషారైన కథ చెప్పినట్టు. శ్రీధర్ కూడా ఈ షుగర్ కోటింగ్ ని కాపాడుకునే కథనమే చేశాడు సస్పెన్సు అనే ఏకసూత్రతని కాపాడుకుంటూ.
ఆర్ట్ ఆఫ్ నెగోషియేషన్ లో సమస్యల్ని డీల్ చేసే విధానముంటుంది. ప్రతీ సమస్యా ఓ గతంతో ముడిపడి వుంటుంది. ఆ గతాన్ని సరిచేస్తే సమస్య పరిష్కారమైపోతుంది. పాలకులు సరి చేయరు. వాళ్లకి కాష్ఠం రగులుతూ వుండాలి. రచయితలు సరి చేయాల్సి వుంటుంది. రచయితలు కూడా పాలకుల పాలెగాళ్ళయితే చెయ్యరు. అది వేరే సంగతి. ఆపరేషన్ సమస్యతో ఏఎన్నార్, సావిత్రిల పరస్పర భయసందేహాలు తీరి పరిష్కారమవాలంటే, వాళ్ళ గత సంబంధాన్ని తేల్చెయ్యాలి. అంటే గార్డియన్ పాత్రగా వున్న జగ్గయ్యకి ఈ వ్యవహారం తెలిసిపోయి, అతనో నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ఆపరేషన్ తో సమస్య పరిష్కారమవుతుంది. అంటే కథనం జగ్గయ్యకి తెలిసే ముందు, తెలిసిన తర్వాతా అనే ద్విముఖాలుగా వుండాలి. తెలిసేముందు రిలేషన్ షిప్ తో ఒక సస్పెన్స్, తెలిశాక ఆపరేషన్ తో ఇంకో సస్పెన్స్. ఇలా రెండు విడతల సస్పెస్ తో కథాపథకం. ఈ స్పష్టత, ఈ విభజన, ఈ ప్లానింగ్ లేకపోతే ఏం కథ చేస్తున్నామో జుట్టు పీక్కున్నా అర్ధంగాదు. స్క్రీన్ ప్లే పండితుడు జేమ్స్ బానెట్ మాటల్లో సినిమా కథంటే సైకో థెరఫీయే.
ఈ గండం గడిచాక మరో గండం ఎదురవుతుంది. ఏఎన్నార్ తల్లి హాస్పిటల్ కొస్తుంది. ఆమె కొడుకు జీవితం గురించి సావిత్రి, జగ్గయ్యల ముందు వాపోతుంది, “ఎవరో ఒకమ్మాయిని ప్రేమించాడట. ఆ అమ్మాయి ఇంకొకర్ని పెళ్లి చేసుకుందట. దాంతో వాడి మనసు విరిగిపోయి పెళ్ళే చేసుకోలేదు” అని.
ఇక్కడున్న సావిత్రియే కొడుకు ప్రేమించినమ్మాయని ఆమెకి తెలీదు. ఇదెక్కడ బయటపడుతుందోనని సావిత్రికి ఒకటే ఆందోళన. జగ్గయ్య అంతా విని నిర్వేదంగా, “ఈ రోజుల్లో ప్రేమించడం సరదా అయిపోయింది. దీనివల్ల ఎందరి జీవితాలు ఎలా నాశనమవుతున్నాయో ఎవ్వరూ వూహించడం లేదు. నేనూ సీతా మీ అబ్బాయికి నచ్చజెప్పి ఎలాగైనా పెళ్ళికి ఒప్పిస్తాం” అంటాడు.
ఆమె వెళ్ళిపోయాక సావిత్రితో అంటాడు, “చూశావా సీతా, ఒక పురుషుడికి ఒక స్త్రీ చేసిన ద్రోహం. ప్రేమించింది ఒకర్ని, పెళ్ళాడింది ఒకర్ని. ఆ అమ్మాయి ఎంత మోసగత్తె అయి వుండాలి. నా బాధంతా పాపం ఆ డాక్టర్ గురించే. ఇంత చదువూ తెలివీ వుండి కూడా ప్రేమంటే ఒక ఆట వస్తువుగా భావించే ఆడదాన్ని నమ్మి ఎలా మోసపోయాడో చూశావా?”
సావిత్రికి గుండె పగిలిపోతూంటుంది తనని ఇంతింత మాటలంటూంటే, “ ఏమో ఆ అమ్మాయి మంచిది కాదని ఎలా అనగలం?” అనేస్తుంది. అందుకు జగ్గయ్య, “మంచిదెలా అవుతుంది సీతా? ఆమె నిజంగా డాక్టర్ని ప్రేమించి వుంటే, తర్వాత ఆ భర్తకి మనసెలా ఇవ్వగలుగుతుంది? ఒకవేళ భర్త పట్ల నిజాయితీగా వుంటే, డాక్టర్ తో ఆమె ప్రేమంతా నాటకమే కదా?” అని. ఆమె తట్టుకోలేక భోరుమంటుంది.
దీంతో అయిపోలేదు. సావిత్రీ ఏఎన్నార్ లకి జగ్గయ్యతో ఇంకో గండం. సావిత్రి ముందు ఏఎన్నార్ కి కౌన్సెలింగ్ చేస్తాడు జగ్గయ్య. ఏఎన్నార్ పాత ప్రేమని తోడుతాడు. ఆ ప్రియురాలిని నిందిస్తాడు. ఈ ప్రేమలు ఒట్టి కబుర్లనీ, బతకడానికి తెలియని వాళ్ళే వీటిని పట్టుకుని ప్రాకులాడతారనీ, దీన్నుంచి తేరుకుని పెళ్లి చేసుకుని తల్లిని సంతోష పెట్టమనీ అంటాడు.
తర్వాత ఏఎన్నార్ సావిత్రిని ఏకాంతంలో కలిసి మాట్లాడుతూండడంతో వినేస్తాడు జగ్గయ్య. ఈ సందర్భంగా సీత అంటుంది, “నా భర్త నన్ను ప్రాణంతో సమానంగా చూసుకుంటున్నాడు. ఒకనాడు మీరు ప్రేమించిన అమ్మాయి నేనేనని తెలిస్తే వారి హృదయం బద్దలై పోతుంది. అందువల్ల ఏర్పడే విపరీత పరిణామాలకు మీరు కారణం కాకూడదనే నా కోరిక” అని.
ఆమె చెప్పుకొస్తుంది. ఆమె తండ్రి బ్యాంకు క్యాషియర్. యాభై వేలు పోయిన నేరం మీద పడింది. బ్యాంక్ డైరెక్టర్ ని కలిసి చెప్పుకుంటే, జైలుకెళ్ళకుండా వుండాలంటే తన కొడుక్కి కూతుర్నివ్వా లన్నాడు డైరెక్టర్. కూతురికి చెప్పుకుంటే, తను ఏఎన్నార్ ని ప్రేమించానని చెప్పుకుని ససేమిరా అంది. “నీ సుఖం కోసం జైలు పాలవ్వాలా నేనూ? ఈ ఇంటికోసం ప్రేమని త్యాగం చేయలేవా?’ అని నిలదీశాడు తండ్రి. తను జైలుకెళ్తే తల్లి గుండాగి చస్తుందని కూడా అన్నాడు. ఇక విధిలేక జగ్గయ్యని చేసుకుంది. చేసుకున్నాక తెలిసింది అతడికి క్యాన్సర్ అని. జగ్గయ్య తండ్రి ఇది దాచిపెట్టి తనకి తాళి కట్టించాడని అర్ధమైంది...
సావిత్రి ఇలా చెప్పేసి ఆగదు. ఆ ఫోటో ఇచ్చెయ్యమంటుంది. అదొక్కటే తను సాంత్వన పొందడానికి మిగిలిన ఆధారమంటాడతను. ప్రేమని మర్చిపోలేనంటాడు. మానవ జీవిత పరమార్ధం వలచి విలపించడం కాదంటుంది. అతడి వృత్తి, పేరు ప్రతిష్టలు తన మూలంగా నాశనమై, తానో సమాజ ద్రోహిగా నిలబడ లేనంటుంది. ఇక మర్చి పొమ్మంటుంది. చేసేది లేక ఫోటో చించేస్తాడు.
కథనంలోఈ తొలి విడత సస్పెన్స్ విభాగంలో, రాబోయే మలి విడత సస్పన్స్ విభాగపు కథనానికి అడ్డు పడకుండా కొన్నిసమస్యల్ని పరిష్కరిస్తున్నాడు దర్శకుడు. ప్రేమని అతను మర్చిపోకపోతే చేయబోయే ఆపరేషన్ కి అది అడ్డుపడుతుంది. కానీ చేయబోయే ఆపరేషన్ కి జగ్గయ్య ప్రకటించే నిర్ణయం అడ్డుపడబోతోంది. అందువల్ల రెండు కారణాలు అడ్డుపడితే గజిబిజి అవుతుందని, మొదటి కారణమైన ప్రేమ ని క్లియర్ చేసేశాడు దర్శకుడు. ఇప్పుడు వీళ్ళ పూర్వ ప్రేమ తెలిసిపోయిన నేపధ్యంలో, జగ్గయ్య ఏం నిర్ణయం తీసుకుంటాడనే మలి విడత సస్పెన్స్ తో కథనం మొదలు. జగ్గయ్యకి తెలియక ముందు కథనం పూర్తయి, తెలిసింతర్వాత కథనం ఇక మొదలవుతోంది.
“ఇక ముందు కూడా మీకిలాగే జరుగుతుంది”
“మీరు చెప్తున్నది జ్యోతిషం, నేను చెప్తున్నది నిజం... మీరొక వాగ్దానం చెయ్యాలి. నేను చనిపోతే ఆమెకి మళ్ళీ పెళ్లి జరిపించే బాధ్యత మీది...”
ఏఎన్నార్ నెత్తిన పిడుగులు పడతాయి. ససేమిరా అంటాడు జగ్గయ్య. సరే, ఆమె అంగీకరిస్తే తన వాగ్దానం తప్పక నేరవేరుస్తానంటాడు ఏఎన్నార్. ఇక్కడ జగ్గయ్య వ్యూహాత్మకంగా నేరుగా ఆమెని పెళ్లి చేసుకోమనడం లేదు. సావిత్రితో కూడా ఇలాగే వ్యూహాత్మకంగా అంటాడు. నేరుగా చెప్పేసి షాకివ్వదల్చుకోలేదు. ఇప్పుడు సావిత్రి, ఏ ఎన్నార్ లకి జగ్గయ్య చావుబతుకుల సమస్య ముఖ్యమైపోతుంది. పూలూ పసుపూ తెప్పించుకుని సుమంగళిలా అలంకరించుకుని పూజలు చేస్తుంది. ఇంతలో ఓ ఐదేళ్ళ బాలికకి ఏఎన్నార్ చేసిన ఆపరేషన్ విఫలమై చనిపోతుంది. దీంతో సావిత్రికి ఏఎన్నార్ సామర్ధ్యం మీద నమ్మకం పోతుంది. జగ్గయ్యని ఇక్కడ్నించి తీసికెళ్ళి పోతానంటుంది.
“డాక్టర్, ఏదైనా జరిగితే మీరు కారణం కాకూడదని నా కోరిక. మీరు నా హృదయంలో శాశ్వతంగా వుండాలంటే నా భర్త ఇక్కడ చచ్చిపోకూడదు. నన్ను ప్రేమించి విఫలమయ్యారని మీరు కక్ష సాధించారని నేనేనాడూ అనుకోకూడదు”
సరీగ్గా రెండు వారాల గడువు పూర్తయి ఆపరేషన్ మొదలవుతూంటే, గదిలో కెళ్ళి తలుపులు బిడాయించుకుంటుంది. ఏఎన్నార్ చేతిలో భర్త మరణ వార్త వింటే, అదే క్షణం తన చావూ జరిగిపోవాలని గదిలో వుండి పోతుంది.
ఏఎన్నార్ పరిస్థితి కొన్ని రోజుల ముందునుంచే దారుణంగా వుంటుంది. ఆపరేషన్ చేయగలుగుతాడా అన్న గొప్ప ఆత్మనూన్యతా భావానికి లోనవుతాడు. ఒక ఉత్తమురాలైన తల్లికి పుట్టిన కొడుకుగా నీతో ఎలాటి స్వార్ధానికీ పోనని అన్నా కూడా ఆమె నమ్మదు. కన్న తల్లిని సాక్ష్యంగా చేసి చెప్పడం కన్నా ఉత్కృష్ట నివేదన ఇంకేం వుంటుంది. ఆమె నమ్మదు. ఆమె పరిస్థితులు ఆమెకున్నాయి. ఆమె కూడా నమ్మనప్పుడు డాక్టర్ గా తన సామర్ధ్యం పట్ల ఆత్మవిశ్వాసం పూర్తిగా కరిగిపోతుంది. తిండి మానేసి, నిద్ర మానేసి, శస్త్ర చికిత్స పుస్తకాలు చదివేస్తూంటాడు. ఎలాగైనా ఆపరేషన్ సక్సెస్ చేసి తన నిజాయితీ నిరూపించుకోవాలి...
నిరూపించుకుంటాడు. కానీ అది యాంటీ క్లయిమాక్స్ కి దారి తీస్తుంది. జగ్గయ్యకి ఆపరేషన్ సక్సెస్ అయిందని తలుపు కొట్టి కొట్టి సావిత్రిని పిల్చి, ఆమె తలుపు తీశాక శుభవార్త చెప్పేసి కుప్పకూలి మరణించి పోతాడు.
కథ పూర్తి విషాదం కాబట్టి కామెడీ ట్రాకు పెట్టారు. చలం – గిరిజ – రేలంగిలు వేసుకునే కామెడీ వేషాలు కథతో సంబంధం లేకుండా హాస్పిటల్లో ఓ పక్క వచ్చి పోతూంటాయి. వినోదం లేని లోటు ఇలా తీర్చినట్టున్నాడు. కానీ వినోదం ప్రధాన పాత్రలతో కూడా కాస్త వుండాలి. ఇక హాస్పిటల్లో కొందరి పేషంట్లతో సబ్ ప్లాట్స్ (ఉపకథలు) వుంటాయి. ఇవి ప్రధాన కథలో సంఘర్షిస్తున్న ఏఎన్నార్, సావిత్రి, జగ్గయ్య పాత్రల ప్రవర్తనల్ని నియంత్రించే దిశగా వుంటాయి. సబ్ ప్లాట్స్ లో ఉత్పన్నమయ్యే అర్థాలు మెయిన్ ప్లాట్స్ లో ప్రతిఫలిస్తూంటాయి. ఇలా ఇన్ని పొరలుగా కథ వున్నప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అనే ఇంకో పొర కల్పిస్తే ఎక్కువైపోయే మాట నిజమే. అందుకని ఫ్లాష్ బ్యాక్ ని పరిహరించడం మేలే చేసింది.
దర్శకుడితో బాటు తెరవెనుక ఆత్రేయ గురించి కూడా చెప్పుకోవాలి. ఆయన మాటల మాంత్రికుడు కాదు. మాయ చేయడు. జీవితాలు పలికే పలుకులనే నిరాడంబరంగా స్వచ్ఛంగా పలికిస్తాడు. సంభాషణల బలం ఈ ట్రాజడీకి ప్రధాన ఆకర్షణ.
ఐతే ఈ కథలో దర్శకుడు కూడా జవాబు చెప్పలేని ప్రశ్న వొకటుంది. ఈ ప్రశ్న వేస్తే కథేమవుతుందో, పాత్రలేమై పోతాయో తెలీదు. సినిమా కూడా వుండే అవకాశమందో లేదో తెలీదు. కానీ మన బుద్ధికి ఇలా తోస్తుంది : జగ్గయ్య తాను చనిపోతే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలన్నాడు. చనిపోకపోతే? ముగ్గురూ ఇలాగే సిగపట్లు పడుతూ వుండిపోతారా ముగింపు లేకుండా? దేవుడు జోక్యం చేసుకుని ఏఎన్నార్ ని తప్పించడం జగ్గయ్య అదృష్టమే!