రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, June 8, 2020

951 : రివ్యూ

      పొన్మంగళ్ వందాళ్ (బంగారు బొమ్మ వచ్చేసింది) ఎవిడెన్సు లేని ఎమోషనల్ కోర్టు డ్రామాతో రక్తి కట్టించాలని చేసిన ఒక విఫలయత్నం. కోర్టులో సింగిల్ లొకేషన్ వెర్బల్ కథనంతో యాక్షన్ లేని 120 నిమిషాల సస్పెన్స్ కథ నడపబోయి విఫలమయ్యారు. సినిమా నేపథ్యం లేని కొత్త దర్శకుడు జేజే ఫ్రెడరిక్ చాలా రీసెర్చి చేశానన్నాడు గానీ, ఆ రీసెర్చి లాయర్లు ఎలా పనిచేస్తారు, కోర్టులెలా పనిచేస్తాయి వంటి న్యాయ ప్రక్రియ తెలుసుకోవడం గురించి మాత్రమే వుంది తప్ప -అసలు కోర్టు రూమ్ డ్రామా, లేదా లీగల్ థ్రిల్లర్స్ ఎలా రాస్తారు, ఎలా తీస్తారు అన్న వాటికి సంబంధించి స్క్రీన్ ప్లే రీసెర్చి చేసుకున్నట్టు లేదు. కోర్టుల్లో కేసు విచారణలు ఎలా జరుగుతాయో అక్కడ హాజరై పరిశీలించానన్నాడు గానీ, అసలు సినిమాల్లో ఆ కోర్టు రూం డ్రామాలు ఎలా రక్తి కట్టిస్తారో సినిమాలు చూసి తెలుసుకున్నట్టు లేదు. దీంతో తను వాస్తవ కోర్టుల్లో ఎలా చూసిన దృశ్యాలు అలా సినిమాగా తీసేస్తే పరమ బోరు వ్యవహారంగా తేలింది. ఇంటర్వెల్ సీను సైతం కిక్ లేకుండా పేలవంగా తయారైంది. ఈ బలహీన కథాకథనాలకి తగ్గట్టు సంగీత దర్శకుడు కూడా కేవలం రెండు మూడు పరికరాలతో పరమ నీరసంగా సంగీతం చేశాడు. 

       
సీనియర్ హీరోయిన్ జ్యోతిక పాత సినిమా పాట పల్లవిని టైటిల్ గా పెట్టుకుని బంగారు బొమ్మలా విచ్చేసింది, మంచిదే. పొన్మంగళ్ ఇంగెవాగా కూడా రావొచ్చు. ఎన్నోడ దేవతగానూ రావొచ్చు. కానీ వచ్చి కాస్త కటాక్షించే పనేదో చేయకుండా కఠినంగా శిక్షించే పని పెట్టుకుంటేనే ప్రేక్షకులకి జీవన్మరణ సమస్య. అసలీ సబ్జెక్టుని ఎలా నమ్మి నిర్మించిందనేది పెద్ద సస్పెన్స్. లాయర్ గా, ఫ్లాష్ బ్యాక్ లో తల్లిగా తన రెండు పాత్రలు, బాలికలపై అత్యాచారాలనే భావోద్వేగం, లేడీస్ ని ఆకర్షించే ముచ్చటైన టైటిల్, ఇవన్నీ ఉత్సాహపర్చి ముందుకు నడిపించినట్టుంది. కానీ లాయర్ పాత్ర, తల్లి పాత్ర, బాలికలపై  అత్యాచారాలూ అనే పాయింటూ ఏవీ బలంగా దర్శకుడు చిత్రించ లేదని స్క్రిప్టు చూసి తెలుసుకున్నట్టు లేదు. లాక్ డౌన్ వల్ల మార్చిలో విడుదలవాల్సిన సినిమా ఆగిపోయి ఇప్పుడు అమెజాన్ లో విడుదలై నష్టపోకుండా బయటపడ గల్గింది గానీ, లేకపోతే థియేటర్స్ లో విడుదలై వుంటే ఒక్క రోజైనా ఆడుతుందానేది అనుమానమే. టీవీ సీరియల్స్  కూడా ఇలా తీయడానికి సాహసించరేమో. 

        ఇది పదిహేనేళ్ళ క్రితం ఒక సీరియల్ కిల్లర్ కేసుని తిరగదోడే కథ. స్కూలు వయసు బాలికల్ని చంపే జ్యోతి అనే సీరియల్ కిల్లర్, ఎన్కౌంటర్ లో చనిపోయి కేసు క్లోజ్ అవుతుంది. పదిహేనేళ్ళ తర్వాత లాయర్ వెన్బా (జ్యోతిక పోషించిన ఈ పాత్ర వెన్బా అంటే కవిత అని అర్ధం) ఆ కేసు రీ ఓపెన్ చేయించి వాదిస్తుంది. దీంతో ఆమె పట్ల వ్యతిరేకత వస్తుంది. తమ పిల్లల్ని చంపిన సీరియల్ కిల్లర్ని నిర్దోషిగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నందుకు తల్లులు దాడి కూడా చేస్తారు. ఆ నాటి కేసులో సాక్షుల్ని కోర్టులో విచారిస్తూ వాళ్ళ తప్పుడు సాక్ష్యాల్ని బయట పెడుతూంటుంది వెన్బా. వరదరాజన్ (త్యాగరాజన్) అనే పలుకుబడిగల వ్యక్తి కొడుకు రోహిత్ (అఖిల్ సంతోష్) నీ, అతడి స్నేహితుడినీ జ్యోతి చంపిందని ఆరోపణ. ఊటీలో రోహిత్, అతడి స్నేహితుడూ ఒక బాలికని కిడ్నాప్ చేస్తున్న జ్యోతి బారి నుంచి కాపాడబోతే, వాళ్ళని కాల్చి చంపిందని ఆ నాటి కేసులో రుజువైన విషయం. ఇది నిజం కాదని ఇప్పుడు వెన్బా వాదన. పోలీసులు సాక్ష్యాలు సృష్టించి జ్యోతి మీద తప్పుడు కేసు బనాయించి ఎన్కౌంటర్ చేశారని, పోలీసులు పేర్కొన్నట్టు జ్యోతి నార్త్ ఇండియన్ కాదనీ ఆమె వాదం.

        ఈ వాదాన్ని ఎలా నిరూపించింది? అసలెందుకు ఈ కేసు చేపట్టింది? జ్యోతితో తనకి సంబంధ మేమిటి? జ్యోతి కాకపోతే బాలికల సీరియల్ కిల్లర్ ఎవరై వుంటారు? అసలు తనెవరు?... ఇవన్నీ మిగతా కథలో తెలిసే విషయాలు. 

        2005 లో 19 మంది బాలికల్ని-
     చంపి పాతిపెట్టిన రేపిస్టు కిల్లర్ సురీందర్ కోహ్లీ సంచలనం సృష్టించిన నోయిడా నిథారీ కేసు గుర్తు కొస్తుంది ఈ సినిమా చూస్తూంటే. ఈ మధ్య తెలుగు రీమేక్ ‘రాక్షసుడు’ కూడా గుర్తుకొస్తుంది. అయితే కథకో ప్రణాళిక అంటూ లేకపోవడంతో దర్శకుడు ఫీలైన సస్పెన్సు లన్నీ తేలిపోతూంటాయి.  ఏ విషయం దాచాలి, అదెప్పుడు చూపించాలి, ఏ విషయాన్నీ తురుపు ముక్కగా వాడుకోవాలి, అదెలా ముగింపు బ్యాంగ్ గా ఇవ్వాలీ అన్న డైనమిక్స్ పట్ల పూర్తిగా అవగాహన లేకపోవడంతో, విషయముండీ సినిమాకి చాలని విషయంగా నీరుగారిపోయింది. 


        సస్పెన్స్, థ్రిల్, టెంపో అనేవేవీ దృష్టిలో పెట్టుకోకుండా కథ నిర్వహించడంతో ముందే కథేమిటో, జ్యోతిక పాత్రెవరో, ఆమెకి సీరియల్ కిల్లర్ జ్యోతి ఏమవుతుందో తెలిసిపోతూ - అసలు చూస్తున్నది సినిమాయేనా అన్పించేలా తయారైంది. ఈ కథ సీరియల్ కిల్లర్ అంటున్న జ్యోతి గురించా, లేక హత్యకి గురైన మైనర్ ఆడపిల్లల గురించా- దేనికి ఎక్కువ ఎమోషనల్ ఇంపాక్ట్ - షాక్ వేల్యూ వుంటుందో తెలుసుకోక పోవడం వల్ల కథనం గజిబిజి అయింది. 

        ఈ కథలో కర్త, కర్మ రెండున్నాయి. సీరియల్ కిల్లర్ అంటున్న జ్యోతి కర్త అయితే, ఆమె చేతిలో మరణించారంటున్న బాలికలు కర్మ స్థానంలో వున్నారు. ఇప్పుడు సస్పెన్సు తో సినిమా నిలబడాలంటే కర్తతో కథ నడుపుతూ కర్మని చివరి వరకూ దాచిపెట్టాలి. అంటే జ్యోతి ఎవర్ని చంపిందీ చెప్పకుండా ఆమె సీరియల్ కిల్లర్ కాదని నిరూపించే అంశంతో మాత్రమే కథ నడపాలి. ఎప్పుడైతే చివరికి జ్యోతి దోషి కాదని నిరూపణ అయి అసలు కిల్లర్ దొరికిపోతాడో, అప్పుడు అతడిక్ కనెక్ట్ చేస్తూ అతను చంపిన బాలికల మృతదేహాల వెలికితీత చూపించాలి. బాలికల అత్యాచార హత్యలు అన్న విషయం ఇప్పుడు లైవ్ గా, తాజాగా రివీలైనప్పుడు ఎక్కువ షాకింగ్ గా వుంటుంది. కదిలించే దృశ్యంగా వుంటుంది, బలమైన ఎమోషన్ తో వుంటుంది. ముగింపుకో అర్ధముంటుంది. నాటకీయత వుంటుంది. ఈ ముగింపుకి ఫీలవుతూ థియేటర్ నుంచి, లేదా అమెజాన్ నుంచి నిష్క్రమిస్తారు ప్రేక్షకులు. 

        ఈ కథకి ముగింపు జ్యోతి దోషి కాదని తేలడం కాదు. జ్యోతి దోషి కాదనే తేలుతుందని మనకి ముందే తెలుసు. అసలు జ్యోతి చంపిందంటున్నది ఎవర్నీ అన్నది ఈ కథకి ముగింపవుతుంది. చివరికి బాలికల మృత దేహాలనే తురుపు ముక్కని ఓపెన్ చేసి ప్రయోగించడమే కథలో తెలియని, వూహించని స్టన్నింగ్ ముగింపవుతుంది. అచ్చు గుద్దినట్టు వాళ్ళ మృతదేహాల క్లోజింగ్ ఇమేజితో. 

        కానీ దర్శకుడు ఎలా చేశాడంటే, సినిమా ఓపెనింగ్ లో పదిహేనేళ్ళ క్రితం జ్యోతి చేసిందంటున్న బాలికల హత్యాకాండా, మృతదేహాలూ సహా ఆమె ఎన్కౌంటర్ మొత్తం విప్పి చూపించేసి చేతులు దులుపుకున్నాడు. దీంతో మొదటి ఐదు నిమిషాల్లోనే సినిమా అయిపోయింది. అమెజాన్ అనవరంగా మిగిలిన 115 నిమిషాల సినిమా కొనుక్కుని మన నెత్తిన రుద్దింది. ఇలా కాకుండా, బాలికల హత్యాకాండా, వాళ్ళ మృతదేహాలూ చూపించకుండా, ఆమె ఒక సీరియల్ కిల్లర్ అనే చెప్పి - ఆమె ఎన్కౌంటర్ ఎలా జరిగిందో అది మాత్రమే చూపించి ముగిస్తే-  ఆమె ఎవర్ని చంపి వుంటుందన్న సస్పెన్స్ ఈ కథని కాపాడేది. మిగతా 115 నిమిషాల సినిమాకో అర్ధంపర్ధం వుండేది. 

        ఇంకోటేమిటంటే, వెన్బా జ్యోతి కూతురనీ కూడా ఇంటర్వెల్లో చెప్పేసి ఇంకో సారి చేతులు దులుపుకున్నాడు. సస్పెన్సుని ఏమాత్రం కడుపులో దాచుకోలేక పోతున్నాడు దర్శకుడు. ఎంత త్వరగా చెప్పేస్తే అంత కడుపు తేలిక బడుతుందని తొందర పడుతున్నాడు. అతడి కడుపుతోనే వచ్చింది మొత్తం సమస్యంతా. వెన్బా జ్యోతి కూతురని ఇంటర్వెల్లో చెప్పేయడంతో, ఇక జ్యోతి మీద నుంచి, బాలికల హత్యల మీద నుంచీ, వెన్బా జాలి కథ మీదికి మళ్ళిపోయింది కథ. ఇక కోర్టులో ఆమె సెల్ఫ్ పిటీ తో కూడిన వాదనలు. అన్యాయం జ్యోతి కి కాకుండా, బాలికలకి కాకుండా, తనకే జరిగి పోయినట్టు! 

        ఈ కథని ఫిల్టర్ చేసి చూస్తే, ఈ కథ ఎన్కౌంటర్ కి గురైన జ్యోతిది కాదు, కేసు వాదిస్తున్న వెన్బాదీ కూడా కాదు, దర్శకుడి కడుపు కథ కూడా కాదు, ఘోర అకృత్యాలకి బలైన బాలికలది మాత్రమే ఈ కథ! జ్యోతీ, వెన్బా పాత్రలు కేవలం దయనీయమైన ఆ బాలికల మరణాలని బయటపెట్టేందుకు తోడ్పడే సాధనాలు మాత్రమే. ఇలాటి కేవల సాధన మాత్రమైన వెన్బా,  కథని తన మీదికి మళ్ళించుకుని సానుభూతి పొందాలనుకోవడం అక్రమం. 

        ఫస్టాఫ్ ఇంటర్వెల్ కి ముందు - 
       వెన్బా కి ఆమెని పెంచుకున్న పేతురాజ్ (భాగ్యరాజ్), జ్యోతి (ఈ జ్యోతి పాత్ర కూడా జ్యోతిక పోషించిందే) రాసిన డైరీ ఇచ్చి చదవమంటాడు. ఈ డైరీతో ఫ్లాష్ బ్యాకు వస్తూంటే వెన్బా జ్యోతి కూతురని మనకి తెలిసిపోతుంది. దీంతో ఇంటర్వెల్ కోర్టు సీన్లో తను జ్యోతి కూతురని చెబితే మనకి బ్యాంగ్ కాకుండా పోయింది. తెలిసిపోయిన విషయమే మళ్ళీ చెబితే ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా అవుతుంది. పైగా దీని చిత్రీకరణ కూడా బ్యాంగ్ ఇవ్వాలన్న ఎఫెక్ట్స్ తో లేదు. దీనికి తగ్గట్టే సంగీత దర్శకుడు కూడా నాటకాల్లో కీ బోర్డు సంగీతంలా నీరసంగా వాయించి వెళ్ళిపోయాడు. జ్యోతీ, బాలికల కథ మధ్యలోకి వెన్బా దూరి చేసిన నిర్వాకం ఇదన్న మాట. 


        జ్యోతి ఎన్కౌంటర్ అయ్యేనాటికి వెన్బాకి ఎంతలేదన్నా పదేళ్లుంటాయి. ఇంకా ఆమె తల్లి కథ తెలుసుకోమని డైరీ ఇవ్వడమేమిటి? దర్శకుడి ఉద్దేశం ప్రేక్షకులకి ఆ కథ తెలియజేయాలని. ఇందుకు వెన్బాని మాధ్యమంగా వాడడం పాత్ర పరంగా తప్పుడు కథనం. మొత్తం కథనీ వెన్బా మీదికి మళ్ళించే - ఈ జ్యోతి ఫ్లాష్ బ్యాక్ తో వెన్బా ఆమె కూతురని బయటపెట్టడం ఇప్పుడనవసరం. జ్యోతి నిర్దోషి అని నిరూపించాక, తను జ్యోతి కూతుర్ననీ, అందుకే ఈ కేసు తిరగదోడాననీ  చెప్పి కోర్టులో వాదన ముగిస్తే, అప్పుడు అదొక కొత్త మలుపుగా నమోదవుతుంది కథనంలో. కథనం రీఫ్రెష్ అవుతుంది. 

        కొత్త దర్శకుడు సీనియర్ దర్శకుల్నే- 
      నటవర్గంలో చేర్చి ప్రేక్షకాకర్షణ పెంచాలనుకున్నట్టుంది గానీ, కథాకథనాలే పేలవంగా తెలిపోతూంటే ఆకర్షణకి అవకాశంలేదు. ముందు కథ ఆకర్షించాలి, ఆ తర్వాతే మిగతా ఆకర్షణలు. పేతురాజ్ పాత్రలో భాగ్య రాజా, ప్రాసిక్యూటర్ పాత్రలో పార్తీపన్, వరదరాజన్ పాత్రలో త్యాగరాజన్, జడ్జి పాత్రలో ప్రతాప్ పోతన్, మైనర్ పాత్రలో పాండ్య రాజన్, డీఎస్పీ పాత్రలో సుబ్బు పంచు... ఇలా దర్శకులతో ‘మల్టీ స్టారర్’ తారాతోరణం కట్టాడు ఈపాటి సినిమాకి.  


     కోర్టుల వాదోపవాదాలతో మాటలతోనే కథ నడుస్తూంటుంది. ఈ సీన్లేవీ థ్రిల్లింగ్ గా వుండవు. కోర్టు రూమ్ డ్రామా అంటే, ఎవిడెన్సుతో రక్తి కట్టించకుండా, వెన్బా జాలి కథతో కూడిన ఎమోషనల్ డ్రామా అన్నట్టు తయారైంది. తగిన ఎవిడెన్స్ లేకుండా, కోర్టులో అందర్నీ కన్నీళ్లు పెట్టించే ఆమె జాలి కథ నమ్మేసి, జడ్జి తీర్పు చెప్పడం అమెచ్యూరిష్ గా వుంది. తను కూడా అప్పట్లో అత్యాచారానికి గురైన బాలికల్లో ఒక బాలికే. కానీ ఈ కథకి ఒక కథానాయకిగా తన విషాదాన్ని దాచుకుని, ఇతర బాలికల విషాదానికే విలువివ్వడం కథానాయిక లక్షణం. 


       ఎప్పుడైనా పాత కేసుల్ని తిరగదోడాలంటే, కోర్టు పునర్విచారణకి ఆదేశిస్తుంది. దాంతో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమవుతుంది. అంటే కోర్టు బయటే ఈ ప్రక్రియ జరిగి, ఫలితాల్ని కోర్టుకి సమర్పిస్తారు. అంతేగానీ ఫ్రెష్ కేసులో జరిగినట్టు కోర్టులో పాత కేసుల విచారణ జరగదు. ఏదో సినిమా కోసం ఇలా కోర్టు విచారణ పెట్టుకున్నారు గానీ దీనికి లాజిక్ లేదు. ఈ విచారణలో ఎప్పుడో పదిహేనేళ్ళ నాటి సాక్షులు నిన్న మొన్న జరిగినట్టు, చూసినట్టు చెప్పేస్తూంటారు. ఫోటోలని గుర్తు పట్టేస్తూంటారు. కనీసం సాక్షుల జ్ఞాపక శక్తితో నైనా సస్పెన్స్, డ్రామా, గందరగోళం సృష్టించి దుమారం రేపలేదు దర్శకుడు. హ్యూమన్ సైకాలజీ, డ్రామా ఏవీ ముట్టుకోలేదు. పైగా జడ్జి విలన్ నుంచి లంచం తీసుకుని తీర్పుని తారుమారు చేస్తున్నట్టు చూపించడం పూర్తిగా అనవసరం, అది కథకి ఉపయోగపడ నప్పుడు. 

        రీసెర్చి న్యాయ ప్రక్రియ తెలుసుకోవడం గురించి మాత్రమే కాకుండా, కోర్టు రూం డ్రామా తీయడం గురించి కూడా చేసుకుని వుంటే - ఈ కథతో ఇంత అత్యాచారం జరిగేది కాదు.

సికిందర్ 

Friday, June 5, 2020

ప్రకటన


ఇకపై షూటింగ్​ చేయాలంటే ఇవి పాటించాల్సిందే
        త్వరలో పునఃప్రారంభమయ్యే సినిమా, టీవీ షూటింగ్స్​కు సంబంధించి 16 పేజీల మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్రం. షూటింగ్​ సమయాల్లో ఈ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది వాటి గురించి తెలుసుకుందాం.
       లాక్​డౌన్​తో నిలిచిపోయిన సినిమా, టీవీ షూటింగ్స్​ ఇతర కార్యకలాపాలు త్వరలో పునఃప్రారంభమయ్యే నేపథ్యంలో వాటికి సంబంధించి 16పేజీల మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్రం. షూటింగ్​ స్పాట్​లో ఈ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రతి ఒక్కరు మాస్కులు, శానిటైజరు, గ్లౌజులు, భౌతికదూరం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించింది. అందులోని ముఖ్యమైన మార్గదర్శకాలపై ఓ లుక్కేద్దాం.
👉 చేతులు కడుక్కోవడం, శానిటైజేషన్‌ ప్రతి ఒక్కరికీ తప్పనిసరి. యూనిట్‌ సభ్యులు ప్రతి ఒక్కరూ మాస్క్‌, గ్లోవ్స్‌ షూటింగ్‌ స్పాట్‌లో ఉన్నంత సేపూ విధిగా ధరించాలి.
👉 సెట్‌లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరిగా చేయించుకోవాలి. అధిక శరీర ఉష్ణోగ్రత ఉన్న వ్యక్తుల్ని సెట్‌లోకి రానివ్వకూడదు.
👉 ఇండోర్​ లొకేషన్స్​లో గాలి ప్రసరణ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డిస్పోసబుల్ గ్లాసులు, ప్లేట్లు, కప్స్​ ఉపయోగించాలి. ముఖ్యంగా ప్రింటర్​ స్టేషన్స్​లోని కరెంట్​తో సహా ఇతరత్రా మీటాలను కూడా శానిటైజింగ్​ చేయాలి.
👉 సెట్​లోని ప్రతి ఒక్కరు తమ ఫోన్లలో 'ఆరోగ్య సేతు' యాప్​ ఇన్​స్టాల్​ చేసుకోవాలి. తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి. వైద్య సిబ్బంది, సెట్స్​ బయట అన్ని వేళలా ఆంబులెన్స్​ అందుబాటలో ఉండటం తప్పనిసరి.
👉 ప్రతిరోజూ షూటింగ్‌ ప్రారంభించే ముందు స్టూడియో మొత్తాన్ని శానిటైజ్‌ చేయాలి.
👉 గర్భవతి, 65 ఏళ్లు పైబడిన వారు షూటింగ్​ స్పాట్​లో లేకుండా చూసుకుంటే మంచిది. ఒకవేళ ఉంటే వారి కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. షూటింగ్​ సమయాల్లో అభిమానులను మాత్రం అస్సలు అనుమతించకూడదు.
👉ఆడిషన్స్​ వీలైనంత వరకు ఫేస్​ టైమ్​, జూమ్​, స్కైప్​ వంటి సామాజిక మాధ్యమాల యాప్​ ద్వారా జరిగేలా చూసుకోవాలి.
👉 నటీనటులను తమ కాస్ట్యూమ్​ వారే తెచ్చుకునే విధంగా ప్రోత్సహించాలి.
👉 24 గంటలపాటు షూటింగ్​ స్పాట్​, స్టూడియోల్లో సెక్యూరిటీ గార్డ్స్​ విధుల్లో ఉండేలా చూసుకోవాలి. తద్వారా అతడు మాత్రమే గ్లౌజులు ధరించి తలుపులను తెరవడం, మూసివేయడం చేయడం ద్వారా ఎవరు తలపుల హ్యాండిల్స్​ను తాకకుండా ఉండే అవకాశం ఉంటుంది.
👉 మధ్యాహ్న భోజన సమయంలోనూ భౌతిక దూరం తప్పనిసరి. ముఖ్యంగా పెళ్లి, మార్కెట్లు, ఫైట్​ వంటి భారీ సన్నివేశాలను కరోనా తగ్గేవరకు చిత్రీకరించకుండా ఉండటం మంచిది.
👉 మేకప్‌ సిబ్బంది, హెయిర్‌ డ్రెస్సర్స్‌ పీపీఈ సెట్స్‌ ధరించాలి. ప్రతి ఒక్కరికీ మేకప్‌ చేసే ముందు, చేసిన తర్వాత శానిటైజ్‌ చేసుకోవడం తప్పనిసరి. మేకప్‌ చేసే సమయంలో మూడో వ్యక్తిని దగ్గరకు రానివ్వకూడదు.
👉 10ఏళ్ల లోపు పిల్లలను సెట్​లోకి అనుమతించకూడదు. ఒకవేళ అనుమతిస్తే ఆ పిల్లల బాగోగులు చూసుకోవడానికి ఒక్కరిని మాత్రమే నియమించాలి.
👉 నాన్​ ఫిక్షన్​ షోల్లో భౌతిక దూరం ఉండేలా సీట్లను కేటాయించాలి.
👉 షూటింగ్​లో ఉన్న నటీనటులకు, మిగతా సిబ్బందికి వసతి కల్పించడం, ముఖ్యంగా వారి ప్రయాణాల కోసం ప్రత్యేక వాహనాలను కేటాయించడం వంటివి చేయాలి. వారు ప్రజారవాణాను ఉపయోగించకుండా చూసుకోవాలి.
👉 సెట్స్​ లేదా స్టూడియోల్లో ప్రొడక్షన్​ బృందాలకు ప్రత్యేక విభాగాలను కేటాయించాలి. తద్వారా పనిచేసే సబ్బంది గుమిగూడకుండా ఉండటానికి దోహదపడతుంంది.
👉 సెట్స్​లో ఉన్నవారు ఒకరి ఫోన్​లను ఒకరు తాకకూడదు. ముఖ్యంగా భోజనాలను ప్రత్యేకంగా ఇంటి వద్ద నుంచే తెచ్చుకునేలా వారిని ప్రోత్సాహించాలి.

(దర్శకుడు వీరశంకర్ ఫేస్బుక్ వాల్ నుంచి)

Thursday, June 4, 2020

ప్రకటన




 క్విజ్ ఫ్లాప్!
నిన్నటి స్ట్రక్చరాస్యతా క్విజ్ ఫ్లాపైంది.
ఎవరూ ఆసక్తి చూపలేదు. ముగ్గురు మాత్రమే స్పందించారు.
వారికి వ్యక్తిగతంగా సమాధానాలిచ్చాం.
***

Wednesday, June 3, 2020

950 : రివ్యూ!


      నూట యాభై ఏళ్ల క్రితం కేరళలోని పాలక్కడ్ లో ఒక అమ్మవారి జాతరలో భాగంగా కుమ్మట్టి కాళి అనే పౌరాణిక ప్రదర్శన పుట్టింది. పాలక్కడ్ తో బాటు, త్రిసూర్, మలబార్ లలో ఓనం పండగప్పుడు ఈ జాతర జరుగుతుంది. ఈ పౌరాణికం శివుడికీ అర్జునుడికీ మధ్య సన్నివేశం... మారువేషంలో  వున్నశివుడి పాశుపతాస్త్రం కోసం అర్జునుడి పోరాటం... అది మనస్సు నుంచి, నేత్రాల నుంచి, వాక్కు నుంచీ వెలువడే అత్యంత విధ్వంసకర అస్త్రం. దాన్ని సమవుజ్జీ కాని శత్రువుపై ప్రయోగించరాదు, అలాగే యోగ్యులు కాని యోధులు వాడరాదు. ‘అయ్యప్పనుం కోషియం’ ప్రారంభ దృశ్యంగా ఈ ప్రదర్శన జరుగుతోంది...పాశుపతాస్త్రం అర్జునుడి వశమైంది శివుడి ఔదార్యంతో చివరికి. 

       
గో కూడా భయంకర పాశుపతాస్త్రం. ఇగోలతో ఇద్దరు వ్యక్తుల మధ్య వైషమ్యాలు ఎవరికీ గెలుపు నివ్వవు, ఓటమినీ ఇవ్వవు. నిరంతర విధ్వంసంతో ఇద్దరూ అంతమైపోవడమే. అతను బలమైన రాజకీయ సంబంధాలున్న మాజీ ఆర్మీ హవల్దార్. ఇతను సామాన్య పోలీస్ ఎస్సై. సామాన్యుడితో ఇగో ఏమిటని బలవంతుండు అనుకోవడం లేదు. బలవంతుడితో ఇగో ఎందుకని సామాన్యుడూ అనుకోవడం లేదు. ఇద్దరూ బాహాబాహీకి దిగారు, ఒక ముగింపులేని పోరాటానికి తెరలేపారు. 



        అతను ఊటీలో సినిమా షూటింగు జరుపుకుంటున్న మిత్రుడైన ఒక దర్శకుడు అడిగితే, పూటుగా తాగి, పెట్టె నిండా మద్యం బాటిళ్ళు కార్లో పెట్టుకుని బయల్దేరాడు. మద్యనిషేధం అమల్లో వున్న అట్టప్పడి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో పోలీస్- ఎక్సైజ్ జాయింట్ ఆపరేషన్లో దొరికిపోయాడు. దొరికిపోవడమే గాక నానా గలభా చేసి ఎక్సైజ్ అధికారిని కొట్టాడు. అతణ్ణి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించాడు ఎస్సై అయ్యప్పన్ నాయర్. పేరడిగితే కోషీ జాన్ అని చెప్పాడు. ఫోన్ చెక్ చేస్తే సీఎం పినరయి విజయన్, మాజీ సీఎం ఊమెన్ చాండీలతోబాటు, ఇంకొందరు నాయకులు, జర్నలిస్టుల ఫోన్ నెంబర్లూ వున్నాయి. కంగారుపడి పై అధికారికి ఫోన్ చేసి చెప్పాడు అయ్యప్పన్. అతణ్ణి డీసెంట్ గా ట్రీట్ చేసి, కేసు బుక్ చేసి కోర్టుకి హాజరు పర్చమన్నాడు పై అధికారి. ఇక తన అరెస్టు, కోర్టు, జైలూ తప్పవని గ్రహించిన కోషీ, తెలివిగా నాటకమాడేడు. తనకి మద్యం కావాలనీ, మద్యం లేకపోతే హెల్త్ ప్రాబ్లమనీ చెప్పి నమ్మించి, సీజ్ చేసిన లిక్కర్ లోంచి కొంత పోయించుకుని తాగాడు. ఇదంతా ఫోన్ లో రికార్డు చేశాడు. ఉదయం కోర్టుకీ, అట్నుంచి అటే జైలుకీ వెళ్ళాక, బెయిలు మీద విడుదలై వచ్చి, ఫోన్లో రికార్డు చేసిన వీడియోని ఛానెల్లో బట్టబయలు చేశాడు. 

          దీంతో మద్యం కేసులో అరెస్టయిన నిందితుడికి మద్యం పోసిన ఇంకో నిందితుడిగా మారి, సస్పెండ్ అయిపోయాడు ఎస్సై అయ్యప్పన్ నాయర్, లేడీ కానిస్టేబుల్ సహా. ఇక కోషీ - అయ్యప్పన్ ల రగడ, రచ్చ, కచ్చ మొదలైపోయాయి. తనని సస్పెండ్ చేయించినందుకు కోషీ ముందే కోషీ అనుచరుణ్ణి విపరీతంగా కొట్టాడు అయ్యప్పన్. దీంతో కోషీ తండ్రి కురియన్ జాన్ కోషీకి అంగరక్షకులుగా కొందరు వృత్తి నేరస్థుల్ని పంపాడు. కురియన్ జాన్ కూడా బలమైన రాజకీయ సంబంధాలున్న మాజీ ఆర్మీ హవల్దార్. అతను విపరీతంగా ఇగోకి పోయి అయ్యప్పన్ భార్య అరెస్టుకి పావులు కదిపాడు. అయ్యప్పన్ ఆదివాసీ మావోయిస్టు కార్యకర్త అయిన కణ్ణమ్మని పెళ్లి చేసుకున్నాడు. అయ్యప్పన్ అంతు చూడాలని కోషీ అట్టప్పడిలోనే లాడ్జిలో మకాం వేశాడు. అయ్యప్పన్ జేసీబీ పెట్టి కోషి కార్యాలయాన్ని కూల్చేశాడు. కోషి తను కూడా జేసీబీ పెట్టి అయ్యప్పన్ ఇంటిని కూల్చేశాడు. కోషీ ఇల్లు కూల్చేస్తే కోషీ కారుని పేల్చేశాడు అయ్యప్పన్. ఇలా దాడికి ప్రతి దాడి చేసుకుంటూ పోలీసుల్ని పరుగులు పెట్టించారు. తన వ్యవహారంలో తండ్రి అనవసరంగా జోక్యం చేసుకుని ఇబ్బందిలో పడేస్తున్నాడని, అతణ్ణి అరెస్ట్ చేయించేశాడు కోషీ. 

         ఇలా మరెన్నో సంఘటనలు జరిగి, ఇక ఫైనల్ గా చావో రేవో  తేల్చుకోవా లనుకున్నారు.  సరిహద్దు దాటి తమిళనాడులో కొట్టుకునే కార్యక్రమం పెట్టుకుంటే, కేరళ పోలీసులు అడ్డు రారనుకున్నారు. అలా తమిళనాడు మార్కెట్ లో కొట్టుకోసాగారు. తమిళ పోలీసులతోబాటు కేరళ పోలీసులు కూడా వచ్చేసి  అయ్యప్పన్ కోషీని చంపకుండా ఆపబోయారు. అయ్యప్పన్ ఆగేటట్టు లేడు. అయ్యప్పన్ మీద సస్పెన్షన్ ఎత్తేశారని సీఐ చెప్పడంతో, అయ్యప్పన్ శాంతించి కోషీని వదిలేశాడు. ఇక కోషీ సొంతూరు కట్టపణకే ట్రాన్స్ ఫర్ చేయించుకుని, కొత్త ఎస్సైగా కోషీని పరిచయం చేసుకుని, కరచాలనం చేశాడు అయ్యప్పన్.

ఎలావుంది కథ
      కోషీ పాత్ర పోషించిన నటుడు, నిర్మాత, దర్శకుడు, పంపిణీ దారుడు, గాయకుడూ అయిన - నూరు సినిమాలూ నటించిన- పృథ్వీరాజ్ సుకుమారన్ కి, అయ్యప్పన్ పాత్ర నటించిన శతాధిక చిత్రాల నటుడు బిజూ మీనన్ కీ మలయాళంలో విపరీతమైన ఫాలోయింగ్ వుంది. ఏ ఒక్కర్ని తక్కువ చేసి చూపించినా ఆ అభిమానులతో సమస్య లొస్తాయి. అందుకని ఎవరి గెలుపూ, ఎవరి ఓటమీ లేని, ఇదమిత్థమైన ఒక ముగింపూ లేని కథగా ఇది తెరకెక్కింది. దీంతో నటులుగా వాళ్ళ ఇమేజులకి న్యాయం జరిగిందేమో గానీ, కథకి న్యాయం జరగలేదు. కథ ప్రకారం వాళ్ళ ఇగోలతో వాళ్ళే తేల్చుకోకుండా, మధ్యలో పై అధికారుల జోక్యంతో శాంతించడం పాత్రౌచిత్యాల్ని దెబ్బ తీసింది. అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవల్ని పై అధికారులూ నాయకులూ కల్పించుకుని ఎప్పుడో ఆపి వుండొచ్చు. సహజంగా ఇదే జరుగుతుంది. మొదట్నుంచీ జరిగేవన్నీ జరగనిచ్చి, చిట్టచివరికి మధ్యలో దూరి కథని ఆపారు అధికారులు. కథ ఆగింది కానీ ముగియలేదు. పాపులర్ నటుల ఇమేజుల్ని కాపాడేందుకు కథతో ఇలా చేయాల్సి వచ్చింది దర్శకుడికి. 


        దీన్ని బాలకృష్ణ - రానా, లేదా రవితేజ - రానా లతో తెలుగులో రీమేక్ గురించి వార్తలొస్తున్నాయి. సీనియర్ బాలకృష్ణకీ, జూనియర్ అయిన రానాకీ, కోషీ - బిజూ మీనన్ లకి లాగా సమాన ఇమేజులు, ఫ్యాన్ బేస్ లు లేవు. అలాగే సీనియర్ రవితేజకీ, జూనియర్ అయిన రానాకీ సమాన ఇమేజులు, ఫ్యాన్ బేస్ లూ లేవు. ఈ కథని వీళ్ళ కాంబినేషన్స్ లో తీస్తే ముగింపుతో ఇబ్బంది పడాల్సిన అవసరముండదు. మలయాళంలో లాగా కాకుండా సీనియర్ కే విజయాన్ని చేకూర్చి కథ ముగించెయ్యొచ్చు. కాకుండా మలయాళంలో లాగా అక్కడి పరిస్థితుల్ని బట్టి కథతో రాజీ పడినట్టు, ఎవరి విజయమూ ఎవరి ఓటమీ లేకుండా సీనియర్ జూనియర్లని కలిపి తీస్తే ఎబ్బెట్టుగా వుండొచ్చు. మలయాళంలో అది ఇమేజులు నిర్ణయించిన కథ. ఇలా ఇమేజులు నిర్ణయించిన కథే చేయాలనుకుంటే బాలకృష్ణ - రవితేజ సీనియర్ లిద్దరి కాంబినేషన్ని ఆలోచించాలి.   
     
        టిమ్ అలెన్ నటించిన ‘జో సమ్ బడీ’ (2001) లో బలహీనుడైన టిమ్ ని, బలవంతుడైన పాట్రిక్ వర్బర్టర్, కూతురి ముందే కొడతాడు. దీంతో చాలా అవమానపడి, ఇగో పెంచుకుని, బలవంతుడైన పాట్రిక్ ని, తన కూతురి ముందే ఎలాగైనా కొట్టాలని కష్టపడి బలవంతుడుగా మారతాడు టిమ్. ఇక పాట్రిక్ ని పబ్లిక్ గా కొడతానని ప్రకటించి, ప్రేక్షకుల మధ్య బరిలోకి దూకుతాడు. కానీ పాట్రిక్ ని కొట్ట లేకపోతాడు. కారణం? కొడితే తన ఇగో మాత్రమే సంతృప్తి పడుతుంది. కానీ ఇప్పుడు కొట్టగల్గీ తనని కొట్టిన పాట్రిక్ ని కొట్టకుండా క్షమించేస్తే, మనిషిగా తను ఇంకో మెట్టు పైనుంటాడు. తన ఇగో మెచ్యూర్డ్ ఇగోగా ఎదుగుతుంది... ఇగోని మెచ్యూర్డ్ ఇగోగా మార్చి చూపేదే కదా మంచి కథ. ఈ నిర్ణయంతో ఈ కథ ముగింపులో టిమ్ అందరి దృష్టిలో ఉన్నతుడిగా ప్రకాశిస్తాడు. 

        కోషీ, అయ్యప్పన్ ల సమస్య సమాన ఇగోలు. ఎవరూ తగ్గి ఒకర్ని క్షమించేసి, కథ ముగించేసే పరిస్థితి లేదు. నటుల ఇమేజుల సమస్య వుంది. లేదా ఇద్దరూ గెలవలేమని కామన్ సెన్సు తో సంఘర్షణని విరమించాలంటే కూడా అందుకూ సమాన ఇగోలు ఒప్పుకోవు. పాశుపతాస్త్ర మన్నాక వినాశమే తప్ప శాంతి, సంధి వుండవు. అంటే రణంలో ఇద్దరూ మరణించాలి. ఇందుకూ ఇమేజులు ఒప్పుకోవు. మరెలా అంటే, ఇంతే. సమవుజ్జీల కథని ఎక్కడో ఒక చోట ఆపెయ్యాలి, ముగించడం సాధ్యం కాదు. ఇలా ఇది ఆలోచించడానికి ఒప్పుకోని ఎమోషనల్ ప్రేక్షకుల వల్ల హిట్టయ్యిందనుకోవాలి.

ఎవరెలా చేశారు
      ఈ సినిమాకి ఎవరు హీరో, ఎవరు విలన్ అంటే, ఇద్దరూ హీరోలే, ఇద్దరూ విలన్లే. ఒకరు హీరోగా, ఒకరు విలన్ గా లేరు. ఇద్దరూ ఇగో అనే ఇన్ స్టింక్ట్ కి రెండు ముఖాలే. ఇద్దరూ ఇక్కడ ఇగోలతో బ్యాడ్ పనులే చేస్తున్నారు కాబట్టి ఇద్దరూ విలన్లే. యాంటీ క్యారక్టర్లే. అయితే ఇగోని ప్లే చేయడానికి కోషీకున్నంత క్యారక్టర్ బేస్ అయ్యప్పన్ కి లేదు. కోషీ పాత్రలో సుకుమారన్ చాలా కూల్ గా, సెటిల్డ్ గా వుంటాడు. మనసులో ఏమాలోచిస్తున్నాడో అంతుపట్టకుండా వుంటాడు. ఆలోచనలు రేకెత్తించే ముఖభావాలతో, శరీర భాషతో ఇంప్రెస్ చేస్తాడు. తను కేసులో ఇరుక్కుంటున్నానని గ్రహించి, మాయోపాయంగా అయ్యప్పన్ చేతే మద్యం పోయించుకుని తాగి, అతణ్ణి ఇరికించే ఎత్తుగడతో సుకుమారన్ కోషీ పాత్ర ఇగోకి అర్ధముంది. అది ఆ పాత్ర అవసరం కూడా. పోలీసు అయివుండీ కోషి ఎత్తుగడకి పడిపోయిన అయ్యప్పన్ తన ఫూలిష్ నెస్ కి సిగ్గుపడకుండా, కోషీ మీద పగ పెంచుకునే ఇగోకి మాత్రం జస్టిఫికేషన్ లేదు. అది స్వయంకృతాపరాధం. తను చేసుకున్న కర్మ. అనుభవించాల్సిందే. సవరించుకోవాల్సిన తన అసమర్ధతని అలాగే వదిలేసి, పగతో రగిలిపోవడం పాత్ర డొల్ల తనాన్నిపట్టిస్తుంది. 

          ఇద్దరి మధ్య ఒక డీల్ జరిగి, ఆ డీల్ లో కోషీ మోసం చేస్తే అయ్యప్పన్ కి అన్యాయం జరిగిందనుకోవచ్చు. బాధితుడని సానుభూతి కలగవచ్చు. అప్పుడతడి ఇగోకీ పగకీ అర్ధముండొచ్చు. కోషీ అడిగిందే తడవుగా నట్టనడి పోలీస్ స్టేషన్ లో, సీజ్ చేసిన లిక్కర్నే సీలు విప్పి కోషికి పోస్తూ, అతడి కెమెరా రికార్డింగు కే దొరికిపోతే ఇంకెక్కడి బాధితుడు, ఇంకెక్కడి సానుభూతి. కనీసం అతణ్ణి కోర్టుకి రిమాండ్ చేస్తున్నప్పుడైనా, ఫోన్ ని సీజ్ చేసి రికార్డులో చూపించాలి కదా? ఇవేమీ చేయకుండా చేతులారా ఇరుక్కుని కోషీ మీద చెలరేగి పోవడంలో అర్ధం లేదు. ఇలా చేసి తన మీద కోషీ ఎప్పుడో గెలిచేశాడు. తను చేస్తున్నది న్యాయమైన కోషీ టాలెంటుతో కూడిన అతడి గెలుపుని, టాలెంటు లేని తను అక్రమంగా లాక్కోవాలనుకోవడమే. కోషీ కున్నంత క్యారక్టర్ బేస్ తనకి లేకపోవడం ఇందుకే. 

       అయితే కోషీ కూడా ‘నువ్వు మందు పోయడం నీ తెలివితక్కువతనం, నేను నమ్మక ద్రోహమే చేస్తానని తెలుసుకోకపోవడం నీ మూర్ఖత్వం.  నీ తెలివి తక్కువతనానికీ, మూర్ఖత్వానికీ నన్ను బాధ్యుడ్ని చెయ్యకు. నిన్ను కరెక్ట్ చేసుకో, వెళ్ళు’ అని అనాలి. కానీ ఈ పాయింటు గ్రహించి అనడు. ఇక చివరికి అయ్యప్పన్ సస్పెన్షన్ ఎత్తేశారనగానే కోషీతో పగా ప్రతీకారం మర్చిపోయి ఆనందభరితు డవడం పాత్రని మరీ దిగజార్చింది. తనకి ఉద్యోగం తిరిగొస్తే, ఉద్యోగం పోగొట్టిన కోషీతో ఇగో వుండదా? మరి సస్పెన్షన్ ఎత్తి వేయించుకునే ప్రయత్నాలేవో చేసుకోక ఎందుకు కోషీ వెంట పడ్డాడు? 


        ఈ పాత్రలో బిజూ మీనన్ ది ఆవేశపూరిత నటన. పాత్రచిత్రణ లోపాలతో నిమిత్తం లేకుండా నటనలకి ఆవార్డులూ వచ్చేస్తాయి. లోపాలతో బిజూ మీనన్, బలమైన మోటివ్ తో సుకుమారన్ ల మధ్య ప్రత్యర్ధులుగా కెమిస్ట్రీ మాత్రం చెప్పుకోదగ్గదే. వీళ్ళిద్దరి భార్యల పాత్రల్లో నటించిన అన్న రాజన్, గౌరీ నందాల పాత్రలు బలహీనమైనవి. సుకుమారన్ అన్న రాజన్ ని కొట్టే సీను అభ్యంతరకరంగా వుంటుంది. పలుకుబడిగల కుటుంబంలో భార్య పరిస్థితి ఇలా వుంటే, సామాన్య కుటుంబంలో ఆదివాసీ భార్యగా వామ పక్ష మూలాలుండీ గౌరీదీ ప్రాబల్యం లేని పాత్ర. 
          

         ఇక లేడీ కానిస్టేబుల్ పాత్ర. కోషీకి మద్యం పోయడంలో సహకరించి సస్పెండ్ అయిన లేడీ కానిస్టేబుల్ కూడా కోషీని ఏహ్యభావంతో నీచంగా చూడడం దేనికి? అతనేం తప్పు చేశాడు. అతడికి కులుకుతూ ఆనందంగా, చట్టవ్యతిరేకంగా మందు పోసి, నీచానికి పాల్పడింది తనే కదా?  సుకుమారన్ తండ్రిగా అతిక్రియాశీలత్వంతో సమస్యని జటిలం చేసే పాత్రలో సీనియర్ నటుడు రంజిత్ కన్పిస్తాడు. ఇంకా పోలీసు పాత్రలూ, అనుచరుల పాత్రలూ చాలా వున్నాయి.   

చివరికేమిటి
     కృత్రిమత్వం, ఫార్ములా, మూస అనేవాటికి దూరంగా కేరళ గ్రామీణ నేటివిటీ కోసం కృషి చేశాడు దర్శకుడు సాచీ. ఈ హాట్ కథకి కూల్ కలర్స్ వాడి నేత్రానందం కల్గించాడు. పాటలు లేవు. నేపథ్య సంగీతం మాత్రం ట్రైబల్ ట్యూన్స్ కుదరక కుదేలయింది. మాటలు సింథటిక్, డిజైనర్, మూస, పంచ్, టెంప్లెట్ ధోరణుల నుంచి రిలీఫ్ గా, మనుషులు మాట్లాడుకున్నట్టు వున్నాయి. ఫైట్లు మనుషులు పోరాడుకున్నట్టున్నాయి. దాదాపు మూడు గంటల నిడివే ఈ స్వల్ప కథకి, అత్యల్ప కాన్ఫ్లిక్ట్ కీ బాగా ఎక్కువ. ఒక దశ కొచ్చేటప్పటికి చిన్న విషయానికి ఇంత సాగదీయడం అనవసర మన్పిస్తుంది. నాయకులూ ఉన్నతాధికార్లూ ఇద్దర్నీ కూర్చోబెట్టి క్లాసు తీసుకుంటే, ఎప్పుడో ముగిసిపోయే గొడవ. కథకి పాశుపతాస్త్రంతో పోలిక వర్కౌట్ కాని పరిస్థితి ఇంకో పక్క. ఇంతకి ముందు చెప్పుకున్నట్టు ఎమోషనల్ ప్రేక్షకులతో బాటు, ఇద్దరు నటుల ఫ్యాన్స్ తో దీనికింత టాక్ వచ్చి వుంటుంది.  


సికిందర్

        సైడ్ లైట్స్ : 1939 లో ‘పాశుపతాస్త్రం’ అనే సినిమా తీశారు. దర్శకుడు కచ్చర్ల కోట రంగారావు. షూటింగ్ విశాఖ పట్టణం లోని ఆంద్ర సినీ టోన్ స్టూడియోలో జరిగింది. షూటింగ్ చివరి దశలో వుంది. స్టూడియో పార్టనర్స్ కి ఏవో ఇగో లొచ్చి ఒక పార్టనర్ షూటింగు జరుగుతూండగానే తన వాటా కింద ఇచ్చిన లైట్లూ ఇతర పరికరాలూ లాక్కెళ్ళి పోయాడు. స్టూడియో మూతబడింది. సినిమా ఎలాగో పూర్తయ్యింది. కానీ ‘పాశుపతాస్త్రం’ షూటింగు జరుగుతూండగానే ఇగోలనే పాశుపతాస్త్రాలు పైకి తీసి ‘కేరళ కుమ్మట్టి కాళి’ ఆడిన పార్టనర్స్ ఏం సాధించారు. ‘పాశుపతాస్త్రం’ సినిమాకేం కాలేదు, స్టూడియోనే ఇవ్వాళ వైజాగ్ కి సినిమా లైట్ హౌస్ కాకుండా, ఎవరికీ గుర్తుకూడా లేకుండా పోయింది.

       
స్ట్రక్చరాస్యులకో  చిన్న పరీక్ష : పైన మూడో పేరా నుంచీ 5 వ పేరా వరకూ ఇచ్చిన కథా సంగ్రహంలో ప్లాట్ పాయింట్ వన్, ప్లాట్ పాయింట్ టూ ఎక్కడున్నాయో గుర్తించగలరా? గుర్తిస్తే మాకు రాసి పంపి మీ స్ట్రక్చరాస్యతని నిరూపించుకోండి.




Monday, June 1, 2020

ప్రకటన


డియర్ రీడర్స్,
‘ప్లేలన్నీ ఎలా ప్లే చేస్తాయి?’ నాల్గు వ్యాసాల లింకులు ఈ కింద ఇస్తున్నాం.
సద్వినియోగం చేసుకోగలరు.


949 : సందేహాలు -సమాధానాలు


Q:  పిరియాడిక్ కథలు (1970, 80 ప్రాంతాల్లో జరిగే రంగస్థలం’ లాంటివి ) రాయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారా? అప్పటి పరిస్థితులు, సమస్యలు సహజంగానే ఇప్పుడు ఉండవు కాబట్టి సమకాలీనత లోపిస్తుంది కదా, దాన్నుంచి బయటపడడం ఎలా? సమకాలీనత కచ్చితంగా ఉండాలా? లేకపోయినా డ్రామాతో నిలబెట్టొచ్చారంగస్థలం’ లాగే?  మహానటి’, జెర్సీ’ సినిమాల్లో ప్రాసంగికతను తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలను వివరించగలరు. అలాగే ఒక పాత్ర జీవితం నుంచి మరొక పాత్ర ఇన్ స్పైర్ అయ్యే తీన్ మార్’ లాంటి స్క్రీన్ ప్లే లు చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించగలరు. రిఫరన్స్ సినిమాలు కూడా ప్రస్తావించగలరు?
అశోక్, ఏడీ 

A:  ఒక కవి అన్నట్టు ఇప్పుడు కాలం కరోనా పూర్వంగా, కరోనా శకంగా రెండు ముక్కలైంది. ఈ లెక్కన ఇప్పుడు కరోనా శకంలో వున్నామని అనుకోవాలి. కూలీనుంచీ కుబేరుడి వరకూ, సూది నుంచీ విమానం వరకూ అందరూ, అన్ని రంగాలూ ఆర్ధికంగా ఛిన్నాభిన్నమైన గడ్డు కాలం. ఈ విధ్వంసం లోంచి పునర్నిర్మాణ కాలమిది. ఈ కాలంలో కళ్ళు మూసుకుని ఇంకా కరోనా పూర్వపు అవే కథలు అలాగే తీస్తూ కూర్చోవడం సాధ్యమవుతుందా? ఒకతను ఒక బ్యాంకు అవినీతి కథ పట్టుకొచ్చాడు. ఇప్పుడు బ్యాంకులకి ఎగనామం పెట్టి విదేశాలకి ఉడాయించే కథలకి ఆడియెన్స్ కనెక్ట్ అవుతారా? ఎవడి జేబుల్లోనూ డబ్బే లేదు, ప్రభుత్వాల దగ్గరా లేదు, ఇంకా అవే పాత అవినీతి కథలేమిటి? ప్రేక్షకుల జేబుల్లో డబ్బులు పెట్టే కథలు కావాలి. డబ్బుల కోసం పాట్లు కావాలి. 

        పీరియాడిక్ సినిమాలూ ఇంతే. ఇప్పుడు బ్రతుకులెలా అని ఆలోచిస్తూంటే ఎప్పటివో పీరియాడిక్ కథల సినిమాలకి మార్కెట్ వుంటుందా అనేది వేసుకోవాల్సిన ప్రశ్న. 2008 ఆర్ధిక మాంద్యంలో హాలీవుడ్ కుప్పతెప్పలుగా రోమాంటిక్ కామెడీలు తీస్తూ ఆర్ధిక బాధల్ని మరిపించే ప్రయత్నం చేసింది. మార్కెట్ యాస్పెక్ట్ హాలీవుడ్ కి తెలిసినంతగా ఎవరికీ తెలీదు. ఇప్పుడు కరోనా కాలపు కొత్త ఆర్ధిక, జీవన పరిస్థితులు బాక్సాఫీసుని నిర్ణయిస్తాయి. ఏం సినిమాలు తీయాలో ఎవరికీ తెలియడం లేదు. ఒకటి మాత్రం నిశ్చింతగా తీసుకోవచ్చు : ఎంటర్ టైనర్స్. పలాయన వాద కాలక్షేప ఎంటర్ టైనర్లు. 1896 లో నిమాల్ని కనిపెట్టిన లూమియర్ బ్రదర్స్ కీ, ఆ తర్వాత వచ్చిన నిర్మాతలకీ ఏం తీయాలో తెలియదు. ఎంటర్ టైనర్లే తీసుకుంటూ పోయారు. కాలప్రవాహంలో ఎందరెందరో నిర్మాతలు కలుస్తూ, కాలాన్నిబట్టి సినిమాల్ని శాఖోప శాఖల జానర్లుగా విస్తరింప జేస్తూ, 124 ఏళ్లలో ఇప్పుడు కరోనా నాటికి - ఒక మహావృక్షాన్ని నిలబెట్టారు. అది కుప్ప కూలింది అందరి జీవితాలతో బాటు. ఇప్పుడు నిలబెట్టాలంటే ఏ మందులు వేయాలో, ఏ కాయలు కాయించాలో ఎవరికీ తెలియడం లేదు. జీవితాలు అర్ధమైతే తప్ప సినిమా ఆర్ధిక శాస్త్రం పట్టుబడేలా లేదు. మళ్ళీ 1896 నుంచీ ప్రారంభమవడం తప్పదేమో. సినిమాలిప్పుడు తిరిగి 1896 కే చేరుకున్నట్టు. కాబట్టి బ్యాక్ టు ది ఎంటర్ టైనర్స్. 

        ఇక మీరడిగిన చివరి రెండు ప్రశ్నలకి వివరణ ఇక్కడ సాధ్యం కాదు. మీరడిగిన ప్రశ్నలు నల్గురికి ఉపయోగ పడేవే. వీటికి ప్రత్యేక ఆర్టికల్స్ అవసరం. ప్రయత్నం చేద్దాం.

Q: మే 20 న Q & A లో ఒక ప్రశ్నకు మీరిచ్చిన సమాధానం పెద్ద హోం వర్క్ ఇచ్చింది. పది రకాల స్క్రీన్ ప్లే లు అన్నారు కద. అవేంటి వెతికి, రకం సినిమాలు వెతకడం చాలా పని. తెలుగు సినిమాలు ఏడాదికి వంద వస్తాయి కద. అన్నీ ఒకే తరహా నెరేషన్. ఒకటి రెండు కొత్త రకం ఉంటాయి. అవే గొప్ప సినిమాలు మనకు. ఇంక సర్క్యులర్ నేరేషన్ తో సినిమాలు ఎపుడొస్తాయో. చిన్న సందేహం. కథ చెప్పే విభిన్న పద్ధతుల్లో హైపర్ లింక్  ఒకటి. ఇది మల్టిపుల్ నెరేషన్. ఉదాహరణగా సత్యజిత్ రేకాంచన్ జంగ’,  తెలుగు వేదం’,  తమిళ్ ‘సూపర్ డీలక్స్’  ఇచ్చారు. ఐతే తరహాలో రెండు, మూడు వేరు వేరు కథలతో మొదలుపెట్టి ఒకచోట ముడివేస్తారు. ఇవి వేరువేరు కథలకు ఒకే ముగింపు తప్ప, కథలు చెప్పే పద్ధతి లీనియర్ గానే ఉంటుంది కద? ఫెబులా, రోషోమన్ లలాగా హైపర్ లింక్ స్పెషల్ టెక్నిక్ ఎలా ఔతుంది? ఆదివారం సందేహం కింద తీర్చగలరు.
చందు తులసి, కథా రచయిత

A: హైపర్ లింక్ అంటే కేవలం ముగింపులోనే కథలన్నిటికీ లింకు పెట్టి ముగించడం కాదు. కథనంలోనూ వాటికి లింకులుంటాయి. ఒక కథలో ఒకరికి జరిగే ఓ సంఘటన ప్రభావం, ఇంకో కథలో ఇంకొకరి మీద వుంటుంది. ఇలా మనుషులంగా మనం ఎక్కడెక్కడో ఎవరెవరితోనో కనెక్ట్ అయి వుంటామన్న ఫీల్ ని కల్గిస్తుంది. అంతేగానీ విడివిడి కథలకి మాత్రమే చివర్లో ఒక ముగింపుతో లింకుపెట్టడం కాదు. కింద ఇచ్చిన రెండు లింకులు క్లిక్ చేసి, 10 రకాల ప్లేలు తెలుసుకోవచ్చు. 

Q: ‘అయ్యప్పనుం కోషియం’ రివ్యూ కోసం ఎదురు చూస్తున్నాం. మలయాళం సినిమాలు ఒక క్రేజ్ గా ఎందుకుంటున్నాయి? వాటిని రీమేక్స్ చేయడం కూడా జరుగుతోంది.
ఆది, ఏడీ 

A: రివ్యూ రెండు రోజుల్లో వస్తుంది. మలయాళం సినిమాలు అక్కడి మట్టి కథలు చెప్తాయి. అందుకని కమర్షియల్ మూస ఫార్ములాలకి భిన్నంగా అన్పిస్తాయి. మట్టి కథలకి మొహం వాచి వున్న ప్రేక్షకులకి ఇవే గిట్టుబాటు అవుతాయి. అక్కడి మట్టి కథల్ని ఇక్కడి మట్టి కథలుగా రీమేక్ చేస్తే చేయవచ్చు. తేడా ప్రేక్షకులకే తెలుస్తుంది. ఎక్కడిదో మట్టి ఎందుకు, ఇక్కడ మట్టి లేదా? ఇక్కడి మట్టిలో బాక్సాఫీసు కన్పించడం లేదా? లేక మట్టిని పిసికి బొమ్మెలా తయారు చేయాలో తెలీడం లేదా? ముందు పిసకడం నేర్చుకోవాలి. చేతులకి మట్టి అంటకుండా మీసం తిప్పితే లాభం లేదు.

సికిందర్
లింక్స్ : పది నమూనాలు-1
పది నమూనాలు-2