రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, October 5, 2015

జోడు పాయింట్ల జుగల్బందీ..?

        
దర్శకత్వం : మేఘనా గుల్జార్ 

తారాగణం : ఇర్ఫాన్ ఖాన్, కొంకణా సేన్ శర్మ, టబు, ఆయేషా పర్వీన్, నీరజ్ కబి,
సోహం శర్మ, గజరాజ్ రావ్, అతుల్ కుమార్, శిశిర్ శర్మ తదితరులు
రచన- సంగీతం :  విశాల్ భరద్వాజ్,  సాహిత్యం : గుల్జార్
ఛాయాగ్రహణం :  పంకజ్ కుమార్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్
బ్యానర్ : జంగ్లీ పిక్చర్స్, వీబీ పిక్చర్స్, మిర్చీ మూవీస్
నిర్మాతలు : విశాల్ భరద్వాజ్, వినీత్ జైన్
విడుదల :  2 అక్టోబర్ 2015

***
         2008 లో నోయిడాలో ఆరుషీ- హేమ రాజ్ ల జంటహత్యల కేసు జాతీయ మీడియా పుణ్యమా అని సంచలనాత్మక ఉదంతంగా హోరెత్తిపోతోంది ఇవ్వాళ్ళ కూడా. జాతీయ మీడియాగా చెప్పుకునే ఉత్తరాది మీడియా ఇలాటి హై సొసైటీ హత్య కేసులకి లేనిపోని ప్రాధ్యాన్య మిచ్చి నాన్ స్టాప్ కవరేజీ ఇవ్వడం మామూలే. జెస్సికా లాల్ హత్య కేసు, నిథారీ గొలుసు హత్యల కేసు, సునందా పుష్కర్ హత్య కేసు, తాజాగా షీనా బోరా హత్య కేసు...వీటికి కవరేజీ మాత్రమే ఇవ్వడం కాదు, ఛానెళ్ళ దర్బార్లలో సొంత కోర్టులు నిర్వహించి తీర్పులు కూడా చెప్పేయడం చేసేస్తున్నారు. షీనా బోరా హత్య కేసులో పది రోజులు గొడవ గొడవగా వరస కోర్టులు నిర్వహించి, ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జీయాని హంతకురాలిగా తేల్చిపారేసింది ఓ నంబర్ వన్ ‘జాతీయ’ ఛానెల్. ఇవే హత్యలు దక్షిణ దేశం లో జరిగితే ప్రాంతీయ వార్తల స్థానానికి కూడా నోచుకోవు జాతీయ ఛానెళ్ళుగా చెప్పుకునే ఉత్తరాది ఇంగ్లీషు ఛానెళ్ళలో. ట్యాంక్ బండ్ మీద రైతు ఆత్మహత్య చేసుకుంటే అది జాతీయ వార్త కాదు, ఓ రాజస్థాన్ రైతు ఢిల్లీ వచ్చి ఆత్మహత్య చేసుకుంటే రోజుల తరబడి రగడ, ఆ రైతు స్వగ్రామాని కెళ్ళి  పరిశోధనలు. దక్షిణ రాష్ట్రాలే కాదు, ఈశాన్య రాష్ట్రాల్ని కూడా ఈ దేశంలో భాగంగా గుర్తించడానికి నిరాకరిస్తాయి ‘జాతీయోత్తరాది’ మీడియా సంస్థలు. ఈ నేపధ్యంలో ఆరుషీ -హేమ రాజ్ జంట హత్యల మీద ఓ సినిమా తీయగాలిగారంటే అది  ‘జాతీయోత్తరాది’ మీడియా పుణ్యాన అంత పాపులర్ అయినందునే. నిజానికి ఈ ఏ హత్య కేసుల పట్లా దక్షిణాది ప్రజలకి అంత ఆసక్తి లేదు. సినిమాని మాత్రం దేశ వ్యాప్తంగా విడుదల చేశారు...



        కవి గుల్జార్ కుమార్తె, దర్శకురాలు మేఘనా గుల్జార్ కూడా ఈ సినిమా తీస్తూ తీర్పు చెప్పేశారు. నిజానికి కేసు హైకోర్టులో పెండింగులో వుంది. మేఘన తీర్పు చెప్పడమే గాక,  పొట్టపోసుకోవడానికి ఇళ్ళల్లో పని చేసుకునే సేవకుల మనోభావాల్ని దెబ్బతీస్తూ  ఈ సినిమాకి  పబ్లిసిటీ కూడా ఇస్తున్నారు. ఢిల్లీ, ముంబాయిలలోని ఉన్నత వర్గాల వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తూ, ఇప్పుడు పని వాళ్ళని చూసి భయపడాల్సి వస్తోందని ప్రచారం చేయిస్తున్నారు. ఒకావిడ పాతికేళ్ళుగా నమ్మకంగా పని చేస్తున్న పనివాణ్ణి  ఈ సినిమా చూసి రమ్మని పంపానని చెప్పుకుంది! ఇంకో బిజినెస్ మాగ్నెట్  స్వయంగా తను పనివాణ్ణి తీసికెళ్ళి సినిమా చూపిస్తానని చెప్పుకున్నాడు! ఇంకా చాలామంది చాలా చాలా చెప్పుకొచ్చారు పనివాళ్ళపై అనుమానాలు పెట్టుకుని. ఈ సినిమాలో చూపించినట్టుగా పనివాళ్ళు చెడ్డవాళ్ళుగా మారకూడదన్న మెసేజి ఉదారంగా ఇచ్చేస్తున్నారు. పనివాళ్ళ ద్రోహాల కంటే యజమానుల  శాడిజాలే ఎక్కువన్న సంగతి మర్చిపోతున్నారు. నోయిడాలో ఆ హత్యలు జరిగినప్పుడు పని వాళ్ళంటే లేని భయం, ఈ ప్రచారం, ఇప్పుడు సినిమా విడుదలయ్యాక అర్జెంటుగా గుర్తు కొచ్చేసింది. ఓ కళారూపంగా ఈ సినిమా పట్ల ఏ కాస్త ఆసక్తి పెంచుకున్న వాళ్లని కూడా ఈ నెగెటివ్ పబ్లిసిటీతో దూరం చేసుకుంటున్నారు. ఎనిమిదేళ్ళ నుంచీ ఇంకా తెమలని కేసులో పనివాళ్ళని ఎలా దోషులుగా చిత్రిస్తారో వాళ్ళ విజ్ఞతకే వదిలెయ్యాలి.


        కళారూపంగా చూస్తే ఈ సినిమాతో మేఘన అద్బుతాన్నే సాధించారు టెక్నికల్ గా, విషయపరంగా కాదు. 2002 లో దర్శకురాలిగా తొలి సినిమా ‘ఫిల్హాల్’  (తాత్కాలికంగా..) తీసి ఎవర్నీ సంతృప్తి పర్చలేకపోయిన తను, మరో మూడు సినిమాలతోనూ చుక్కాని లేని నావలాగే ప్రయాణించు కొచ్చారు.  ‘తల్వార్’ తో ఇప్పుడు తన జానర్ ఏంటో, చేరాల్సిన గమ్యస్థానమేంటో తెలుసుకున్నారు. మరో మీరా నాయర్ అన్పించుకోవడానికి  నామోషీ ఏమీ వుండకూడదు.  నిజానికి దర్శకురాళ్ళు కమర్షియల్ సినిమాల కంటే రియలిస్టిక్ సినిమాలు తీసే పేరు సంపాదించుకుంటున్నారు. 

          నిజానికి రియలిస్టిక్ సినిమాలు తీయడమే కష్టం. కమర్షియల్ సినిమాల్లో అరగంట కొరియోగ్రాఫర్లు పాటలేసుకుంటారు, అరగంట ఫైట్ మాస్టర్లు ఫైట్లేసుకుంటారు. మిగిలిన గంట దర్శకులకి వదిలిపెడతారు. ఈ గంటలో మళ్ళీ ఓ అరగంట కామెడీ వేసి తప్పించుకుని, చివరాఖర్లో చద్దన్నంలా మిగిలే ఆ అరగంట సేపే దర్శకులు కథ పెట్టుకుని పని కల్పించుకుంటారు.

          రియలిస్టిక్ సినిమాలతో అలాకాదు. మొత్తం రెండు గంటల నిడివినీ ఔట్ సోర్సింగ్ ఇవ్వకుండా దర్శకులే  భుజాన్నేసుకుని, ఏ మసాలాలూ వుండని సబ్జెక్టుని, తమ మేధస్సుని రంగరించి దగ్గరుండి దృశ్యీ కరించుకోవాల్సిందే. ఈ గడ్డు ప్రయత్నంలో మేఘనా తడబడకుండా దాటేశారు. ఐతే స్క్రిప్టుకి సంబంధించిన పనీపాటా తను పెట్టుకోకుండా,  మరో రియలిస్టిక్  మాంత్రికుడు విశాల్ భరద్వాజ్ కి అప్పజెప్పారు.

***
    ‘ల్వార్’ రెగ్యులర్ రియలిస్టిక్ సినిమాల ధోరణిలో కూడా వుండదు. ఎడిటింగ్ గిమ్మిక్కు లుండవు. ఆర్ట్ సినిమా వాస్తవికతతో ఏ హడావిడీ లేకుండా, ఆర్ ఆర్ తోనూ ఉద్రేకపర్చకుండా, సైలెంట్ గా నిజజీవితంలో లాంటి సాదాసీదా సన్నివేశాలతోనే షాకిస్తూ, ఆలోచింప జేస్తూ సాగిపోతుంది. అక్కడక్కడా డాక్యుమెంటరీ ధోరణి వచ్చి చేరుతుంది. దీంతో ఇది డాక్యూ డ్రామా జానర్ ని సంతరించుకుంది. ఈ హత్యోదంతాన్ని బహుళ దృష్టి కోణాల్లో చెప్పాల్సిన అవసర ముంటుంది. నిజ కేసు అలాగే వుంది. మూడు  పోలీసు బృందాలు సేకరించిన సాక్ష్యాల్లో మూడు రకాల వాంగ్మూలాలిచ్చిన  పనివాళ్ళతో తలనొప్పిగా తయారైన కేసు. ఏ వొకరు చెప్పింది మరొకరితో సరిపోలని రోషోమన్ ఎఫెక్ట్ లాంటి పరిస్థితి. అందుకే ఇదింకా తేలని కేసుగా ఉండిపోయింది. ఐతే పని వాళ్ళు వాళ్ళ దృష్టికోణంలో అసలా రాత్రి ఏం  జరిగిందీ చెప్పుకొస్తున్నప్పుడు, ఆ దారుణానికి రచయిత ఇచ్చిన ట్రీట్ మెంట్, దాన్ని దర్శకురాలు చిత్రీకరించిన తీరూ ఒక క్లాసిక్ సందర్భం, కవి సమయం.

***
     ఓ తెల్లారి పొద్దుటే శృతీ టాండన్ ( ఆయేషా పర్వీన్) బెడ్ రూమ్ లో హత్యకి గురై వుంటుంది. ఆమె తల్లిదండ్రులు రమేష్ ( నీరజ్ కబీ), నూతన్ ( కొంకణా సేన్ శర్మ) టాండన్ లు షాక్ అవుతారు. పోలీస్ ఇన్స్పెక్టర్ ధనీరామ్ (గజరాజ్ రావ్) వచ్చి దర్యాప్తు ప్రారంభిస్తాడు. ఎప్పుడూ చెవి దగ్గర సెల్ ఫోన్ పెట్టుకుని పిచ్చి వాగుడు వాగుతూ, నోట్లో పాన్ వేసుకుని అసహ్యంగా నములుతూ, న్యూసెన్స్ గా వుండే ఇతను దేని మీదా సరీగ్గా దృష్టి పెట్టడు. అక్కడి సాక్ష్యాధారాలు  కూడా సేకరించడు. ఒక్క ఇంట్లో ఉండాల్సిన నలభై ఐదేళ్ళ పనివాడు ఖేంపాల్ లేకుండాపోయాడని మాత్రం గ్రహిస్తాడు. ఆ ఖేంపాల్ ని అనుమానితుణ్ణి చేసేస్తాడు. వాడే శృతిని చంపి పారిపోయాడని ప్రకటించేస్తాడు. మర్నాడు ఆ ఖేంపాల్ శవమై టెర్రస్ మీద కన్పిస్తాడు. కంగుతిన్న ధనీరామ్ అక్కడ గోడ మీద రక్తంతో కూడిన హస్త ముద్రపడి వున్నా దాన్నీ తేలిగ్గా తీసుకుంటాడు. అతడి దర్యాప్తు చాలా నీచస్థాయిలో వుంటుంది. హత్యలు జరిగితే ఫోరెన్సిక్ టీముని పిలిపించాలని గానీ, స్నిఫర్ డాగ్స్ ని రప్పించాలని గానీ అతడికి తోచదు. ఖేంపాల్ గొంతు కోసేసి వుంటుంది. శృతి హత్య కూడా గొంతు కోసేసే జరిగింది. 

          శృతి తల్లిదండ్రులు రమేష్-నూతన్ లు డెంటిస్టులు. వాళ్ళ క్లినిక్ లో కాంపౌండర్ గా పనిచేసే, ఖేంపాల్ క్లోజ్ ఫ్రెండ్ కన్హయ్యా అనే వాణ్ణి ప్రశ్నించడం మొదలెడతాడు ధనీరామ్ నిర్లక్ష్యంగా. డాక్టర్ రమేష్ కి వివాహేతర సంబంధం ఉందనీ, కూతురితో పనివాడు ఖేంపాల్ సంబంధం పెట్టుకున్నాడని అనుమానిస్తున్నాడనీ ఏదేదో చెప్పుకొస్తాడు కన్హయ్యా. దీంతో పూనకం పూనినట్టు నిర్ణయానికొచ్చేస్తాడు ధనీరామ్. వెంటనే పై అధికారి మీడియా సమావేశం పెట్టి- ఈ జంట హత్యలు డాక్టర్ రమేషే చేశాడని ప్రకటించేస్తాడు. తన కూతురూ పనివాడు ఖేంపాల్ ఇద్దరూ ఆ రాత్రి  కలిసివుండగా చూసి తట్టుకోలేక చంపేశాడనీ, ఇది కచ్చితంగా ఆనర్ కిల్లింగే అని చెప్పేసి, డాక్టర్ రమేష్ ని అరెస్టు చేయించి జ్యూడీషియల్ కస్టడీకి పంపించేస్తాడు. దీంతో పోలీసులమీద దుమారం రేగుతుంది అంతటా. ప్రభుత్వం ఈ కేసుని పోలీసుల నుంచి తప్పించి సీడీఐ కి అప్పగిస్తుంది.

       దీంతో జాయింట్ డైరెక్టర్ స్థాయిలో వున్న సెంట్రల్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీడీఐ - సీబీఐ పేరు మార్చి ఇలా పెట్టారు) అధికారి అశ్విన్ కుమార్ ( ఇర్ఫాన్ ఖాన్) రంగంలో కొస్తాడు. అసిస్టెంట్ కమిషనర్ హోదాలోవున్న వేదాంత్ (సోహాం శర్మ) తో కలిసి కేసుని తిరగదోడతాడు. కేసు దర్యాప్తులో ఎన్నో లోసుగులున్నట్టు గ్రహిస్తారు. ఇద్దరూ ఇన్స్పెక్టర్  ధనీరామ్ ని పిలిపించి గదిలోపెట్టి, ఏంట్రా నీ ఇన్వెస్టిగేషనూ నువ్వూ -అంటూ చితకబాదడం మొదలెడతారు. దారికొచ్చి ధనీరామ్ చేసిన తప్పులన్నీ చెప్పేసుకుంటాడు.

          సీడీఐ డైరెక్టర్ స్వామి (ప్రకాష్ బేలవాది ) రిటైరవుతూ ఒక మాట చెప్పివుంటాడు అశ్విన్ కుమార్ కి- న్యాయదేవత చేతిలో త్రాసు ఒక్కటే  కాదు, ఇంకో చేతిలో తల్వార్ కూడా వుంటుంది. ఆ తల్వార్ మనమే- పోలీసులం.  గత అరవయ్యేళ్ళుగా ఆ తల్వార్ తుప్పు పట్టిపోయింది. దాన్ని శుభ్రం చేయాల్సిన బాధ్యత నీదే- అని. 

          ధనీరామ్ శుభ్రపడ్డాడు. డాక్టర్ రమేష్ మీద తప్పుడు కేసు పెట్టారని నమ్ముతూంటాడు  అశ్విన్ కుమార్. ఫోరెన్సిక్ టీముతో రీ- ఇన్వెస్టిగేషన్ చేయిస్తాడు. కాంపౌండర్ కన్హయ్యానీ, వాడి ఇంకో మిత్రుణ్ణీ నార్కో టెస్టుకి గురిచేసి కొత్త విషయాల్ని రాబడతాడు. ఆ రాత్రి ఖేంపాల్ గదిలో వీళ్ళిద్దరూ మద్యం తాగుతూ వున్నట్టు, శృతి గదిలోకెళ్ళి ఆమెని అనుభవించాలని చూసినట్టూ, ఖేంపాల్ అడ్డుపడితే అతణ్ణి  చంపేసి టెర్రస్ మీద పడేసినట్టూ, తమని చూసిన శృతిని కూడా చంపేసినట్టూ తేలుతుంది ఆ టెస్ట్ లో. 

          కొత్తగా వచ్చిన సీడీఐ డైరెక్టర్ జేడీ కుమార్ ( శిశిర్ శర్మ) కి ఈ దర్యాప్తు నచ్చదు. అశ్విన్ కనుగొంటున్న విషయాలు అతను నమ్మడు. దీనికి తోడు ప్రమోషన్ ని ఆశిస్తున్న అశ్విన్ సహ అధికారి వేదాంత్,  అశ్విన్ కి ద్రోహం తలపెట్టడంతో, అతడితో కలబడతాడు అశ్విన్. వెంటనే అశ్విన్ ని సస్పెండ్ చేసేస్తాడు జేడీ కుమార్. 

        మళ్ళీ కొత్తగా దర్యాప్తుని అశ్విన్ మాజీ బాస్, రిటైరైన పాల్ (అతుల్ కుమార్) కే  అప్పగిస్తాడు జేడీ కుమార్. పాల్ జేడీ కి అనుకూలంగానే  డాక్టర్ రమేష్ నీ, అతడి భార్యనీ నిందితులుగా నిర్ధారిస్తూ రిపోర్టిస్తాడు. ఇతడి రిపోర్టుకి ఆధారం ఆడ పనిమనిషి ఇచ్చిన సాక్ష్యం. ఇప్పుడు కేంద్ర మంత్రి జోక్యం చేసుకుంటాడు. రెండు టీములూ ఆయన ముందు హాజరై వాదనలతో వేడెక్కిస్తాయి. అశ్విన్ పనివాళ్ళని- పాల్ భార్యాభర్తల్ని హంతకులుగా తేల్చడం గందరగోళంగా అన్పించి క్లోజర్ కి వేసుకోమంటాడు కేంద్ర మంత్రి. ఛార్జి షీటు దాఖలు చేయాల్సిన సీడీఐ, కేసులో సరయిన సాక్ష్యాధారాలు లభించనందున  మూసేయాల్సిందిగా పిటిషన్ వేసుకుంటుంది. జడ్జి చీవాట్లు పెట్టి, భార్యాభర్తల మీద చార్జిషీట్ వేసి కేసు నడపమంటుంది. అలా కేసు నడిచి, డాక్టర్ దంపతులిద్దరూ దోషులుగా తేలి యావజ్జీవ శిక్షతో జైలుకి తరలిపోతారు. ఈ కేసు తప్పుల తడక అంటూ హైకోర్టు కి అప్పీల్ చేసుకుంటారు.
***


          నిజజీవితంలో ఈ కేసు సుప్రీం కోర్టు దాకా పోవచ్చు. తుది తీర్పు వెలువడకుండానే కేసు పట్ల ఒక స్టాండ్ తీసుకుంటూ సినిమా తీయడంతోనే వచ్చింది ఇబ్బంది. ఇతర పాత్రలు ఏమైనా ప్రతిపాదించవచ్చు- కానీ  ప్రధాన పాత్ర ఏం చెప్పిందన్నదే లెక్క కొస్తుంది. అశ్విన్ కుమార్ పనివాళ్ళని నిందితుల్ని చేయడమే సబబు అన్పించదు. ఇలా చేయడం వల్లే  ఒక వర్గం ప్రజలు పనివాళ్ళని కించ పర్చే కామెంట్లు  చేస్తూ మీడియా కెక్కారు సినిమా పబ్లిసిటీలో భాగంగా. వాళ్ళది వ్యవస్థీకృత రంగం కాదు కాబట్టి, వాళ్లకి సంఘాలూ నాయకులూ లేరు కాబట్టి సరిపోయింది. లేకపోతే  ఈపాటికి పనివాళ్ళు వీధి కెక్కి యజమానులు రోడ్డున పడేవాళ్ళు.  

             1950 లో అకిరా కురసావా తీసిన ‘రోషోమన్’ అనే ప్రసిద్ధ సినిమా వుంది. జరిగిన ఒక హత్య గురించి చూసిన నల్గురూ నాల్గు విధాలుగా చెప్పుకొచ్చే కథనం. వీటిలో నిజమేదో ప్రేక్షకులకే వదిలేస్తాడు దర్శకుడు. ఏ సాక్ష్యం  వైపూ ప్రేక్షకుల్నిలీడ్ చేయడు. అదే తను నమ్ముతున్నానని కూడా చెప్పడు. ఒక ప్రశ్నగానే ముగించేస్తాడు కథని.  అదీగాక ఆ వాంగ్మూలాలు అబద్ధాలు అన్పించేట్టుగా కూడా చిత్రించడు. ఆ వాంగ్మూలాలతో అబద్ధాల ఆట, రాజకీయ చదరంగం, ఎత్తుకు పై ఎత్తులేయడం లాంటి గిమ్మిక్కులకి కూడా పాల్పడడు. ‘తల్వార్’ లో ఇవే వున్నాయి. దర్శకురాలే కేసుని తిమ్మిని బొమ్మిని చేస్తూ రాజకీయం చేసినట్టుగా తయారయ్యింది. కురసావా చూపించదల్చుకుంది - నీషే ఫిలాసఫీకి వెండితెర రూపాన్నే అని మనకర్ధమౌతుంది.  నిజాలనేవి లేనే లేవనీ, కేవలం భాష్యాలే ఉంటాయనీ అన్నాడు నీషే (There are no facts, only interpretations-Frederick Niche).

          ‘
తల్వార్’ అనే టైటిల్  తో పోలీస్ వ్యవస్థ నిర్వాకమెలా వుంటుందో చెప్పాలనుకున్నారు. పోలీసుల నిర్వాకంవల్లే  నిజ కేసు అలా తయారయ్యింది. ఒక కేసుని పట్టుకుని వాళ్ళ అసమర్ధత, వాళ్ళ రాజకీయాలు, పోటాపోటీలు ఎలావుంటాయో చక్కగా చూపించారు సినిమాలో. అశ్విన్ కుమార్ వచ్చాక పోలీస్ ప్రొసీజర్ ని కూడా సశాస్త్రీయంగా చూపించారు. ఈ కేసులో మూడురకాల సాక్ష్యాలతో  పోలీసుల పరిస్థితి ఇదీ- అనే రోషోమన్ ఎఫక్ట్ తో ముగించేస్తే సరిపోయేది. కాన్సెప్ట్ ఇదయినప్పుడు కాన్సెప్ట్ తో సంబంధంలేని నిందితుల నిర్ధారణ తతంగానికి తెరతీయాల్సిన అవసరం లేదు. కేసుతో  పోలీసులే గందరగోళంగా వున్నప్పుడు  ఫలానా వాళ్ళు నిందితులనడం అర్ధరహితమే. ఒకే కథలో ఈ రెండూ పరస్పరం పొసగని పాయింట్లు. అయినా ఒకే ఒరలో రెండు తల్వార్లు దూర్చారు- ‘హవా’ లో తల్లి కథగా నడుస్తున్న సినిమా కాస్తా ఆమె పిల్ల కథగా ముగిసినట్టు- పోలీసుల మీద చర్చ కాస్తా పనివాళ్ళ మీదికి మళ్ళిపోయింది. పోలీసులు బతికిపోయారు ఇలాకూడా- పనివాళ్ళు బలైపోయారు చివరికి.
***
           దీనికి పాపం దర్శకురాలి బాధ్యత లేదనుకోవాలి.  ఆవిడ విశాల్ భరద్వాజ్ ని నమ్ముకున్నారు. ఆయన ఏం రాస్తే అదే తీశారు. ఈ సారెందుకో విశాల్ భరద్వాజ్ రాయడానికి రెండు తల్వార్లు పెట్టుకున్నారు. ఒక తల్వార్ తో తీస్తే ఇన్ స్పైర్ అయి రెండో తల్వార్ తో ఇంకెవరూ తీయకుండా రెండు తల్వార్లనీ తనే వాడేసుకున్నారు. కానీ  భరద్వాజ్ ఎంత ప్రయత్నించినా పనివాళ్ళ తల్వార్ తుప్పు పట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే వాళ్ళ పనే తోమి శభ్రంగా ఉంచుకోవడం!        ఈ సినిమా ద్వారా కేసు మీదా, పోలీసుల తీరు మీదా ప్రశ్నాస్త్రాన్ని సంధించాల్సింది కాస్తా  తీర్పులతో మీడియా దర్బార్ లతో పోటీపడ్డారు- మీడియా పుట్టించిన సినిమాయే కాబట్టి!


          ఇర్ఫాన్ ఖాన్ ఈ సినిమాకి ఎస్సెట్. ఏ సినిమాకైనా అతను ఎసెట్టే. కానీ భార్య పాత్రలో టబు ఒక పంటి కింద రాయి. బయట యాక్షన్ లో వుండే హీరోకి ఇంటి దగ్గర సమస్యల్లో వుండే, లేదా సమస్యలు సృష్టించే భార్య వుండడం హాలీవుడ్ మూస. అదిక్కడ జొరబడకూడదు. జొరబడి వీళ్ళ విడాకుల గొడవని తీర్చిందీ లేదు. అర్ధాంతరంగా ముగిసే వ్యవహారం.

          ఇతర పాత్రల్లో ప్రతీ ఒక్కరూ ఈ సినిమాకి హైలైట్. ఎలా నటింప జేసుకోవాలో, నటుల చేత ఎలా మాట్లాడించుకోవాలో ఈ సినిమా చూసి ఇంకా తెలుగు దర్శకులు నేర్చుకోవాల్సింది వుంది. ఈసారి మేఘనా గుల్జార్ ఇంకాస్త మంచి రియలిస్టిక్ సృష్టి తో ముందుకొస్తారని ఆశిద్దాం.


-సికిందర్.

          

         
         

             
         



         











Sunday, October 4, 2015

ఇవి స్క్రీన్ ప్లే సంగతులు..


        కొత్త దర్శకుడు శ్రీనివాస రెడ్డి సీనియర్ దర్శకుల దగ్గర పనిచేసిన అనుభవంతో కథంటే ఏమిటో తెలుసుకున్న నాలెడ్జి ఆశ్చర్య పరుస్తుంది. వేసి చూసుకుంటే సీనియర్ల సినిమాలకీ, తను తీసిన సినిమాకీ తేడా ఏమిటో ఇప్పటికైనా తను పసిగట్టగల్గడం అనుమానమే. వాళ్ళ సినిమాల్లో వున్నది కథ ఐతే,  తన సినిమాలో లేనిది కథే. కథ లేకుండా సినిమా ఎలా తీస్తామని నిర్మాత దగ్గర్నుంచీ హీరో వరకూ అందరూ ప్రశ్నించ వచ్చు. ఆ కథగా అనుకుంటున్నది కథ కాదు, సీన్లే. అద్బుతమైన సీన్లు తీస్తున్నామనుకుని అదే కథ అనుకోవడం- కాగుతున్న నూనెలో నాలుగు బెండకాయలేసి తిప్పుతూ అదే వంట అనుకున్నట్టు. దర్శకుడి కాగుతున్న నూనె బ్రెయిన్. అందులో వేసిన బెండకాయలు సీన్లు. బెండకాయలేసే ముందు వంటకి ఏ స్ట్రక్చర్ వుంటుందో, దేన్ని బేస్ చేసుకుని వంట ప్రారంభిస్తారో-  ఆ ఉల్లి, పోపు, మిరప, కరివేపాకూ వగైరా వగైరా- లేకుండా వండి పడేసినట్టు,  దర్శకుడి సినిమా వంటకం కూడా సమస్య- సంఘర్షణ- పరిష్కారమనే బేసిక్స్ ని  వదిలేసి వండేసినట్టుంది చూస్తూంటే. 


            సమస్య ఉందిగా- హీరోని చంపాలని విలన్ అనుకోవడం?
          సంఘర్షణ ఉందిగా- హీరో ఎదురు తిరిగి పోరాడడం?
          పరిష్కారం ఉందిగా- విలన్ మీద హీరో గెలుపు?  ..అనుకోవచ్చు. మరెందుకు బోరు కొడుతోంది సినిమా?
          మూడూ తప్పే. 1- గోల్ హీరోకి లేదు, 2- హీరో రియాక్టివ్ గా అంటే, ఒక విధంగా పాసివ్ గా వున్నాడు, 3- ఇది కథే అని నమ్మితే ఏ కథో కూడా తెలీకుండా పోయింది.
***
            మొదట్నించీ వద్దాం..

.
          ఇబ్బందుల్లో పడ్డ ప్రేమికుల పెళ్ళిళ్ళు హీరో చేస్తూంటాడు. ఎందుకు చేస్తున్నాడనే దానికి గతితప్పి దాదాపు క్లయిమాక్స్ దగ్గర చెప్పారు. ఇది ఫ్లాష్ బ్యాక్ కాదు. ఈ చూపించిందాంట్లో విషయంతో, వర్తమాన కథలో హీరో డీల్ చేస్తున్న, లేదా సంఘర్షిస్తున్న హీరోయిన్ సహా ఏ పాత్రతోనూ ఎలాటి సంబంధం లేదు. కాబట్టి ఇది ఫ్లాష్ బ్యాక్ కాదు. కేవలం హీరో ఇప్పటి ప్రవర్తనకి వివరణ ఇచ్చుకునే అతడి వ్యక్తిగత అనుభవంతో కూడిన సర్కిల్ ఆఫ్ బీయింగ్ మాత్రమే. ఈ సర్కిల్ ఆఫ్ బీయింగ్ లో శివ అనే పేరుతో వున్న హీరో శివ కాదు, రామ్. శివ అనే క్లాస్ మేట్ తో గట్టి ఫ్రెండ్ షిప్ వుంటుంది. ఓ రోజు ఆ శివ ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకని తెలుసుకుంటే, ప్రేమించినమ్మాయి వేరే పెళ్లి చేసుకుంటోంది. కాబట్టి ఆ కోపంతో అక్కడి కెళ్తే, ఆమె శవమై వుంటుంది. దాంతో రాం, శివగా పేరు మార్చుకుని, పెద్దలకారణంగా పెళ్ళికి నోచుకోని ప్రేమికులిలా చచ్చిపోకూడదని, తనే పెళ్ళిళ్ళు చేస్తున్నాడన్నమాట.

          ఇప్పుడు  తాజాగా,  ఇష్టపడ్డ వాడితో కేంద్ర మంత్రి కూతురి పెళ్లి చేసేసి పారిపోతూ రైలెక్కేస్తాడు. ఒక స్టేషన్లో రైలాగితే సిగరెట్ తాగి వస్తానని దిగి వెళ్తాడు. స్టేషన్ బయట సిగరెట్ తాగేందుకు లైటర్ తీస్తూంటే ఒకడు లాగేసుకుంటాడు. దాన్ని అక్కడే వున్న భోజిరెడ్డి పెద్ద కొడుక్కి ఇవ్వబోతాడు. ఇవ్వకుండా శివ ఫైటింగ్ మొదలెడతాడు. 


          ఇక్కడెందుకో ఓ హిందీ సినిమాలో క్లాసిక్ సీన్ గుర్తొస్తోంది. షోమాన్ మన్మోహన్ దేశాయ్ తీసిన  ‘రోటీ’  లో రొట్టె కోసం రోడ్డు పక్క రాజేష్ ఖన్నా ఫైట్ మాస్టర్ శెట్టి తో తలపడతాడు. రాజేష్ ఖన్నా కి ఆ రొట్టె చాలా అవసరం. అతడి జీవితం అలా వుంది. ఒక రొట్టె కోసం దేశంలో మాడుతున్న కడుపులెన్నో. దేశంలో ఆకలి కడుపులకి సింబల్ ఆ రొట్టె. దానికోసం ఆ ఫైట్ ఒక బలమైన సోషల్ కామెంట్. కాబట్టి ఈ పోరాట సీనుకి పూర్వరంగం ఇంత  బలంగా వుండి మనకే  ఆవేశాన్ని రగిలిస్తుంది- మనమే శెట్టీని కొట్టెయ్యాలన్పించేంతగా!


          సరే, శివ ఆ లైటర్ కోసం ముఠా అంతటినీ భోజిరెడ్డి పెద్ద కొడుకుతో సహా తన్ని, సిగరెట్ వెల్గించుకుని రైలెక్కేసి వెళ్ళిపోతాడు. ఈ సంఘటన శివ మీద భోజిరెడ్డికి పగని రగిలిస్తుంది. వాణ్ణి పట్టుకు రండని చెప్పి ముఠాని ఎగ దోస్తాడు. పట్టుకొస్తే వూరి జనం ముందు చంపి ప్రతిష్ట నిలుపుకోవాలని.

          ఇదీ కథకి ఏర్పాటయిన సమస్య లేదా పాయింటు. బిగినింగ్ విభాగాన్ని ముగిస్తూ ప్లాట్ పాయింట్ -1 ఏర్పాటు. ఇక్కడి నుంచీ మొదలయ్యే మిడిల్లో సంఘర్షణా పర్వం ప్రారంభించాలి.  ఎప్పుడైనా ఏ సినిమా కథ జాతకమైనా ఈ ప్లాట్ పాయింట్-1 అనే ఘట్టం ఆయురారోగ్యాల మీదే ఆధారపడి వుంటుంది. ఎందుకంటే సినిమా ఇక్కడ్నించీ ముందుకు నడవడానికి ఉప్పందే సన్నివేశం ఇదే కాబట్టి. మరి ఇంత  ఆయువు పట్టులాంటి ఈ సన్నివేశాన్ని ఎలా స్థాపించారో ఒకసారి చూద్దాం- ఈ సన్నివేశం బాగోకపోతే క్లయిమాక్స్ కూడా బాగోదు. యథా ప్లాట్ పాయింట్-1 తథా ప్లాట్ పాయింట్-2 అని కదా?


          చెక్ లిస్టు చూద్దాం-
          1- రైల్వే స్టేషన్ ముందు భోజిరెడ్డి పెద్ద కొడుకుతో హీరో పోరాడే ఈ సన్నివేశం నడుస్తున్న కథనంలోంచి సహజంగా పుట్టుకొచ్చిందా?
          2- ఈ సన్నివేశానికి కి లాజిక్ ఉందా?
          3- ఈ సన్నివేశానికి హీరో ఏమాశించి తెరతీశాడు?
          4- అప్పుడు హీరో కేమైనా గోల్ ఏర్పడిందా?
          5- ఏర్పడితే ఆ గోల్ లో ఎమోషన్ ఉందా?
          6-తను పాల్పడిన ఈ సన్నివేశం తాలూకు పరిణామాల హెచ్చరిక ఏమైనా ఉందా?
          ఇవీ కథకి కీలకమైన ప్లాట్ పాయింట్ -1 చెక్ లిస్టు ప్రశ్నలు.


          పై ప్రశ్నల్ని వివరించుకుంటే-
          1- ప్లాట్  పాయింట్ -1 సన్నివేశం నడుస్తున్న కథనంలోంచి సహజంగా పుట్టుకు రాకపోతే హీరో పాసివ్ అయిపోతాడు.
          2-ఈ సన్నివేశానికి లాజిక్ లేకపోయినా పాసివ్ అయిపోతాడు. ఎందుకంటే ఏ పాత్రా ఎట్టి పరిస్థితిలోనూ లాజిక్ ని ఎగెయ్యాలని చూడదు. లాజిక్ తో వున్న పాత్రని లొంగ దీసి లాజిక్ లేకుండా తన సౌలభ్యం కోసం నడిపించేది దర్శకుడే/ కథకుడే. ఎప్పుడైతే తానుగా నడిచే పాత్ర (యాక్టివ్) ని లొంగదీసి నడిపిస్తారో అప్పుడది పాసివ్ గా మారిపోతుంది.
          3- హీరో ఏదైనా ఆశిస్తేనే సన్నివేశానికి తెరతీయగలడు.
          4- ఈ సన్నివేశంలో హీరోకి గోల్ ఏర్పడకపోతే కథకి అర్ధమే లేదు, హీరోకి పనే లేదు, కథలో అంతా వూరికే చక్కర్లు కొడుతూ నిర్మాత ఇచ్చే డబ్బుని ఎంజాయ్ చేయడం తప్ప.
          5- గోల్ లో ఎమోషన్ లేకపోతే  ‘కిక్-2’ లోలాగే వుంటుంది పరిస్థితి.
          6- సన్నివేశంలో హీరో పాల్పడిన చర్య తాలూకు పరిణామాల హెచ్చరిక లేకపోతే కథలోనూ - కథలో పాత్రల మధ్యా టెన్షన్ అనేది వుండదు. 


          ఇప్పుడు సినిమాలో ఎలావుందో చూద్దాం-
          1- రైల్వే స్టేషన్ ముందు భోజిరెడ్డి పెద్ద కొడుకుతో హీరో పోరాడే ఈ సన్నివేశం నడుస్తున్న కథనంలోంచి సహజంగా పుట్టలేదు. నడుస్తున్న కథనం రైలెక్కి హీరో పారిపోతూ వుండడం. ఆ క్రమంలో రైల్లోనే కాకతాళీయంగా జరగాల్సిన ఈ సంఘటన రైల్లో జరగలేదు. అనుభూతి ఐక్యతని భంగపరుస్తూ ఎక్కడో స్టేషన్ బయట జరిగింది. మనం భోంచేస్తూ మధ్యలో లేచి పక్కింటి కెళ్ళి మంచి నీళ్ళు తాగి రాం కదా. అలాగన్న మాట.


          2- ఈ సన్నివేశానికి  లాజిక్ లేదు. ట్రైన్ స్టేషన్లో ఎంత సేపాగుతుంది? ఆ ఆగిన కొన్ని క్షణాల్లో హీరో వెళ్లి ఎలా సిగరెట్ తాగొస్తానంటాడు? ప్లాట్ ఫాం మీద తాగడానికి వీల్లేదు. స్టేషన్ బయటి కెళ్ళి తాగిరావాలి. అప్పటి దాకా రైలాగుతుందా? అయినా అలాగే స్టేషన్ బయటికెళ్ళి పాన్ షాపు దగ్గర తాగడానికి లైటర్ తీశాడంటే- కావాలని భోజిరెడ్డి పెద్ద కొడుకుతో దెబ్బలాట కోసం, ఆ దెబ్బలాట ద్వారా భోజిరెడ్డి కి పగ రగిలించడం కోసం, రైల్లో కుదరదని స్టేషన్ బయటికి స్థలమార్పిడి చేసి  లాజిక్ లేకుండా ఇంత ముఖ్య ఘట్టాన్నిసృష్టించారు. దర్శకుడు/కథకుడు ఇక్కడ హీరోని బయటికి తోలేశాడు. దీంతో ఇల్లాజికల్ గానూ పాసివ్ గానూ మారిపోయాడు హీరో. పావుగంట సేపు అతను ఫైట్ చేసి తీరిగ్గా వచ్చేదాకా రైలాగి వుందంటే  మొత్తం డ్రైవరూ స్టేషన్ మాస్టారూ అందరూ ముసుగుతన్ని నిద్రపోతున్నట్టా? 


          3- ఈ హీరో తన లైటర్ ని ఆశించి ఈ సన్నివేశానికి తెర తీశాడు. ‘శివ’ లో నాగార్జున పోగుపడిన క్రోధావేశాలతో సైకిలు చెయిను లాగి ప్రత్యర్ధిని  కొడుతూ సన్నివేశానికి తెరతీస్తాడు. మనశ్శాంతిని  ఆశించి ఉంటాడు. ఇక్కడ మన హీరోకి భోజిరెడ్డితో గానీ అతడి కొడుకులతో గానీ  ఏ పూర్వ వైరమూ లేదు. కేవలం తన దగ్గర అప్పటికప్పుడు లాక్కున్న లైటర్ కోసం పోరాటానికి దిగాడు. 


          4- హీరోకి ఎలాటి గోల్ ఏర్పడలేదు. ఎందుకంటే  ఆ లైటర్ తీసుకుని భోజిరెడ్డి పెద్ద కొడుకు పారిపోలేదు. పారిపోయి వున్నా  ఆ లైటర్ ని పొందాలన్న గోల్ హీరోకి ఏర్పడేదేమో! లైటర్ ని  పొందడం కూడా ఒక గోలేనా? అన్పించవచ్చు. ఇక్కడింతే దర్శకుడి రచన ప్రకారం. ఇంతకంటే విషయం లేదు.  ‘శివ’ లో నాగార్జున తిరగబడ్డంతో ఇక మాఫియా అంతు చూడడమే గోల్ గా ఉంటుందని అర్ధం జేసుకుంటాం.  కాబట్టి కీలకమైన ఈ ప్లాట్ పాయింట్ - 1 దగ్గర మన హీరోకి ఎలాటి ఆశయమూలేదు,  గోల్ కూడా ఏర్పడలేదు.


          5- గోలే లేనప్పుడు ఎమోషన్ కూడా ఇక్కడ ఏర్పడలేదు. వుంటే గింటే అది విలన్ భోజి రెడ్డి కి రాంగ్ ప్లేస్ లో, రాంగ్ టైంలో ఇక్కడ గోల్, ఎమోషన్ ఏర్పడ్డాయి. అంటే హీరో గోల్ నీ, ఎమోషన్ నీ  విలన్ హైజాక్ చేశాడన్న మాట. కథ అతడి చేతిలోకి వెళ్ళిపోయింది. హీరో పెయిడ్ హాలిడే ఎంజాయ్ చేయడమే. ఇక్కడ్నించే కథకి దుర్దశ మొదలయ్యింది. ‘శివ’ లో నాగార్జున  గోల్ కి వున్న ఎమోషన్ ఎలాటిదో వేరే చెప్పనక్కర లేదు. మన హీరో కనీసం ఆ లైటర్ కోసం చేస్తున్న పోరాటంలో  ఎమోషన్ పుట్టే అవకాశం ఎటూ లేదు. ఇందాక చెప్పుకున్న రాజేష్ ఖన్నా రొట్టె కి లాంటి పూర్వరంగంలో వున్న ఎమోషన్ లైటర్ తో వుండే అవకాశం లేదు కాబట్టి. అదే తను పెళ్లి చేయబోయే ఏ అమ్మాయి ఫోటోనో లైటర్ స్థానంలో ఉండుంటే ఎమోషన్ పుట్టేదేమో.


          6- హీరో పాల్పడిన సన్నివేశం (భోజిరెడ్డి పెద్దకొడుకుని కొట్టడం) తాలూకు పరిణామాల హెచ్చరిక మాత్రం వుంది, కానీ దానికి ఫీల్ లేదు.  భోజిరెడ్డి చంపడానికి సిద్ధమయ్యాడు. తప్పీజారీ ఒకవేళ హీరో చచ్చినా ఏ ఆశయం కోసం చచ్చినట్టు? ఉత్తి సిగరెట్ లైటర్ కోసమా? కాబట్టి కథలో- పాత్రల మధ్యా ఎక్కడా టెన్షన్ పుట్టలేదు. వరుణ్ సందేశ్ నటించిన ‘కుర్రాడు’ (2009) లో సెంట్రల్ పాయింటుగా బైక్ కోసం పోరాటం చేస్తే సినిమా ఏమైందో తెలిసిందే.
          వీటన్నిటి దృష్ట్యా ప్లాట్ పాయింట్ -1 విఫలమయింది.
***
     అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే, చెప్పదల్చుకున్న కథేమిటో తెలియకపోవడం దగ్గరే. చెప్పదల్చుకున్నది హీరో హీరోయిన్ల ప్రేమకథా, లేకపోతే  హీరోకీ విలన్ కీ మద్య లడాయికి సంబంధించిన యాక్షన్ కథా తెలుసుకోక పోవడం దగ్గరే. చాలా సినిమాల్లో దర్శకులిలాగే బోల్తా పడుతున్నారు. మొన్నటికి మొన్న ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ లో చూశాం- కథ సీక్రెట్ కొరియర్ కి సంబంధించింది అయితే, చాంతాడంత ప్రేమకథ నడుపుకొచ్చి అదే ప్రధాన కథ అన్నట్టు తయారు చేశాడు. 

          ప్రస్తుత సినిమాలో విలన్ తో హీరో లడాయే ప్రధాన కథయితే అది కరెక్టే. ఎందుకంటే ప్రధాన కథకే ప్లాట్ పాయింట్స్ వుంటాయి. సబ్ ప్లాట్ కి వుండవు. అలాంటప్పుడు ఆ ప్రధాన కథని దృష్టిలో పెట్టుకునైనా ఇంకో ప్రధాన కథగా ప్రేమకథ చెప్పుకురాకూడదు. ‘స్వామిరారా’ లో ప్రధాన యాక్షన్ కథకి పోటీగా ప్రేమకథ నడపలేదు. అందులో రోమాన్స్ వుంటుంది గానీ అది ఆ యాక్షన్లో అంతర్లీనంగా వుండీ లేనట్టు వుంటుంది. ఈ రోజుల్లో  పూర్తి నిడివి ప్రేమ కథలెవరు చూస్తారు. సినిమాల్లో మూస ఫార్ములా ప్రేమలకి మించిన రియలిస్టిక్ ప్రేమలు షార్ట్ ఫిలిమ్స్ లో చూసేస్తున్నారు.

          ఈ కథకి నాల్గు పేజీల్లో మొదట సినాప్సిస్ రాసుకుని వుంటే అప్పుడే తెలిసిపోయేది- ఒకే సినిమాలో రెండు ప్రధాన కథలు చూపిస్తున్నానేంట్రా బాబూ అని. హీరోయిన్ తో ప్రేమ కథ- విలన్ తో యాక్షన్ కథ. మళ్ళీ ఇక్కడ తిరకాసు వుంది. విలన్ తో యాక్షన్ కథకీ ఠికానా  లేదు. ఎందుకంటే లైటర్ కోసం విలన్ కొడుకుని తన్నడం, ఆ తన్నిన హీరోని చంపాలని విలన్ పగబట్టడం యాక్షన్ కథకి చాలదు. ఇందుకే సినిమా చివరంటా విలన్ పెడబొబ్బలు పెట్టడం హాస్యాస్పదంగా మారిపోయింది. అదో కథే అన్పించక- కథకోసం వెతుక్కునే పనిలో విసిగిపోవడమే జరిగింది.


          ఇది ప్రేమకథ కాదనీ, విలన్ తో యాక్షన్ ప్రధాన కథ అనీ  గందరగోళాన్ని ఫిల్టర్ చేశాం. మళ్ళీ ఇక్కడ యాక్షన్ కథకి ఆ ప్లాట్ పాయింట్ -1 చాలదని పైన చెప్పుకున్నాం. అంటే ఆ ప్లాట్ పాయింట్ -1 యాక్షన్ కామెడీకి సరిపోతుందని అర్ధం. కాబట్టి ఫైనల్ గా ఈ సినిమా యాక్షన్ కామెడీ గానే వుండాలని తేలుతోంది. మెయిన్ విలన్ తప్ప అతడి ముఠా, సెకండ్ విలన్ సహా అతడి ముఠా చేసింది కూడా ఈ సినిమాలో కామెడీనే. 


          మరి అలాగైనా వుందా? లేదు. ఎందుకంటే ప్లాట్ పాయింట్ -1 దగ్గర గోల్ విలన్ కేర్పడింది. కనుక ఆ ప్లాట్ పాయుంట్- 1 లో ఉండే పైన చెప్పుకున్న ఆరు అంశాల్నీ- సరిదిద్ది హీరోకి ఆపాదిస్తూ గోల్ ని అతడికి ఏర్పాటు చేసినప్పుడు- చంపుతానని విలన్ పెడబొబ్బలు పెట్టినా నష్టం లేదు. మేనేజ్ చెయ్యొచ్చు. ఐతే అక్కడ లైటర్ స్థానం లో మరొకటుండాలి. హీరోయినే ఉండొచ్చు. హీరోయిన్ని పట్టుకోవడానికి రైలుదాకా వెంటాడి వచ్చిన భోజిరెడ్డి పెద్దకొడుకు అండ్ గ్యాంగ్ ని తన్ని హీరోయిన్ ని రక్షించవచ్చు హీరో. ఆ హీరోయిన్ భోజిరెడ్డి కూతురే అనుకుంటే హీరోని చంపాలన్న భోజిరెడ్డి పెడబొబ్బలకి అప్పుడు అర్ధంవుంటుంది. ఎందుకంటే అది గోల్ లా కాకుండా సహజమైన రియాక్షన్ కింద మారిపోతుంది గనుక. యాక్షన్ కి పాల్పడ్డ హీరోకి హీరోయిన్ ని కాపాడడం గోల్ అవుతుంది. అప్పుడీ గోల్ లో ఎమోషన్ గిమోషన్ వగైరాలన్నీ వచ్చి చొరబడి పోతాయి చక్కగా. కథకి జీవం కూడా వస్తుంది. 


          ఆ కూతురు (హీరోయిన్) ఇష్టం లేని పెళ్లిని తప్పించుకొస్తే ఆమెని హీరో కాపాడడమనే కథనం  ఈ సినిమా థీమ్ కి కూడా కనెక్ట్ అవుతుంది. అసలు థీమ్ ఏమిటి? అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఇలాటి చిక్కుల్లోంచి కాపాడి ఇష్టపడిన పెళ్ళిళ్ళు చేసే హీరో కథేగా? మరి ఈ సినిమాలో విలన్ తో ప్రధాన కథలోగానీ, హీరోయిన్ తో ప్రేమ కథలోగానీ ఈ థీమ్ ఎక్కడ ప్రతిబింబించింది? థీమ్ ని పక్కకి తోసేసి ఒక పిచ్చి యాక్షన్ కథ, ఇంకో పిచ్చి ప్రేమకథ చెప్పుకొచ్చారే! ఇది కరెక్టే అనుకోవాలా?


          సినిమా క్లయిమాక్స్ దగ్గర చూపించిన హీరో గతం తాలూకు ( థీమ్  తాలూకు) ఆ సర్కిల్ ఆఫ్ బీయింగ్ ఎందుకని అర్ధం లేకుండా పోయిందంటే ఇందుకే! సినిమా సాంతం నడిపించిన యాక్షన్ కథకీ, ప్రేమకథకీ ఆ చూపించిన సర్కిల్ ఆఫ్ బీయింగ్ తో థీమాటిక్ కనెక్షన్ లేనందు వల్లే. ఎంత అనుభవమున్నా సినిమా కథ చాలా సులభం అనుకుంటే ఎలా? వొళ్ళు దగ్గర పెట్టుకుని నూటొక్క దిక్కుల్లోంచి పరికిస్తూంటే గానీ  ఓ మాదిరి కథ తయారవదు. ఇంకో చోట ఇలా ఉద్యోగం చేస్తే ఒక్క రోజు కూడా ఉంచరు. ఒకళ్ళు నమ్మి కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నప్పుడు కుక్క చావు చావాల్సిందే అర్ధంపర్ధం వున్న కథ కోసం. అమెచ్యూరిష్ చేష్టలు పనికిరావు. పది పాత సినిమాలు పోగేసి రొడ్డ కొట్టుడు అరిగిపోయిన మూస ఫార్ములా కథ కూడా సవ్యంగా తయారుచేసుకో లేకపోతే ఇంకెందు కోసం ఫీల్డులో వుంటున్నట్టు?
***
        థీమ్ తో కనెక్ట్ కాకుండా కథెలా వుంటుంది. లంగరేయక పోతే యేటి వొడ్డున పడవ వుంటుందా? కాబట్టి  పైన చెప్పుకున్నట్టు ఆ విధంగా ప్లాట్ పాయుంట్- 1 దగ్గరే హీరోయిన్ని థీమ్ తో కనెక్ట్ చేసుకుంటే మొత్తం కథంతా ఏకత్రాటి పైకొచ్చేస్తుంది. ఈ సినిమాలో చూపించినట్టుగా అతుకుల బొంతలా విడివిడి మూడు (సర్కిల్ ఆఫ్ బీయింగ్ తో కలుపుకుని)   పురాణాల్లా వుండదు. 

          హీరోయిన్ తో పారిపోయినప్పుడు హీరో గోల్ ఆమె ఇష్టపడ్డ పెళ్లి చేయడమే. థీమాటిక్ మ్యాపుకి న్యాయం చేయడమే. ఈ క్రమంలో ఆమే అతణ్ణి ఇష్టపడొచ్చు.  దీన్ని పక్కన పెడితే, మొదట చంపడంగా వున్న విలన్ రియాక్షన్ సడలిపోతూ ఇంకేదో ప్రయోజనమాశించి హీరోతో సఖ్యతగా మారిపోవచ్చు. చివరి దాకా చంపుతాననే ఒకే ఘనీభవించిన రియాక్షన్ తో అతనుండిపోతే కథలో పస వుండదు, పైగా  యాక్షన్ కామెడీ అవదు. పరిస్థితి ఏకశిలా సదృశంగా ఉండిపోతే ఆత్మహత్యా సదృశమే యాక్షన్ కామెడీకి. విలన్ అనే వాడికి ఏ విలువలూ వుండవు. కూతురూ ప్రతిష్టా అనుకున్న వాడు కాస్తా ఇంకేవో తుచ్ఛ ప్రయోజనాలకోసం దిగజారి పోవచ్చు. వాటితో హీరోకి వల వేయడానికి ప్రయత్నించవచ్చు. హీరో కౌంటర్ ప్లానుతో అతణ్ణి ఇరికించి ఆడుకోవడం మొదలెట్టొచ్చు.

          సినిమాలో ఎలా చూపించారంటే, ప్లాట్ పాయింట్-1 దగ్గర పాసివ్ పాత్రగా ప్రాణప్రతిష్ట  చేసిన హీరోని  చివరంటా అలాగే నడిపించేశారు. అదెలా, ఇద్దరు విలన్ల గ్యాంగుల్నీ తంతూనే ఉన్నాడుగా అనొచ్చు. పాత్రచిత్రణలో తన్నడంలో తేడాలుంటాయి : వచ్చి మీద పడితే మాత్రమే ఆత్మరక్షణ చేసుకుంటూ తంతే పాసివ్ పాత్ర- తనే వెళ్లి వాళ్ళనే ఆత్మరక్షణలో పడేస్తూ తంతే యాక్టివ్ పాత్ర. ఈ తేడా తెలుసుకోకుండా ఏళ్ల తరబడీ యాక్షన్ సినిమాలు తీస్తూనే వున్నారు- పాసివ్ పాత్రలతో. వందల సార్లు వీటి గురించి రాస్తున్నా,  మళ్ళీ వారం వచ్చేసరికి ఇంకో పాసివ్ హీరోతో  ప్రతిష్టాత్మక సినిమా ప్రత్యక్షం. స్టార్లందరూ అంత బిల్డప్స్ తో నటిస్తున్నవి ఉత్త పాసివ్ పాత్రలు తప్ప మరేం కావు. 


          ఇలా మన హీరో గ్యాంగులు వచ్చి దాడి చేసినప్పుడే ఎదురుదాడి చేయడమనే  రియాక్టివ్ క్యారక్టర్ గా కొనసాగాడు తప్పితే- ఆ విలన్ తీసుకునే యాక్షన్ కి తన రియాక్షన్నే చూపిస్తూ పోయాడు తప్పితే- పరిస్థితిని తన చేతిలోకి తెచ్చుకుని, పైచేయిగా తనే యాక్షన్ తీసుకుని, విలన్ ని లాక్ చేసేసే కౌంటర్ ఆలోచన ఒక్కటీ చేయలేదు. పైగా పక్క పాత్రలు పొగుడుతూంటాయి హీరో బ్రెయిన్ పవర్ గురించి! 


          చిట్టచివరికి విలనే హీరోయిన్నెత్తుకుపోయి- హీరోని తనూరికి రప్పించుకుని పంచాయితీ పెట్టాల్సివచ్చింది! ఇదీ ఇంత భారీ సినిమాలో హీరో యాక్షన్ సైడ్ పాత్రచిత్రణ, రైటింగ్ సైడ్ నిర్వాకం. 


          ఇక హీరో ప్రేమ విషయానికొస్తే- ఈ ప్రేమేమిటి? ఇతనెలా ఇష్టం లేని హీరోయిన్ వెంట పడతాడు? థీమాటిక్ మ్యాప్ ఏమిటి? ఏ సర్కిల్ ఆఫ్ బీయింగ్ నుంచి, ఏ కమిట్ మెంట్ తో తను బయల్దేరాడు? ఇష్టపడ్డ  ప్రేమికుల పెళ్ళిళ్ళకి ఆటంకాలుండొద్దనే ఎజెండాతోనేగా చచ్చిపోయిన మిత్రుడి పేరు పెట్టుకుని? అలాంటప్పుడు  చివరిదాకా ఇష్టంలేని హీరోయిన్ని అలా వేధిస్తాడేమిటి? ప్రేక్షకులు అమాయకులనా?  హీరో ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? క్యారక్టర్-  స్టోరీగీరీ ఏం పట్టించుకోకండి- నా ఇమేజి చూడండి- ఇమేజికి తగ్గట్టు హీరోయిన్ తో రోమాన్స్, సాంగ్స్, స్టె ప్పులూ, విలన్స్ తో ఫైట్స్ మాత్రమే చూసి, నా పెయిడ్ హాలీడేని ఎంజాయ్ చేయండనా?
***
         ప్రతిష్టాత్మకంగా తన సంస్థ ముప్ఫయ్యో వార్షికోత్సవానికి గుర్తుగా ఇంత భారీ సినిమాతో సీనియర్ నిర్మాత రవికిషోర్ ఇచ్చిన కొత్త అనుభూతి ఏమీ లేదు. అత్యవసరంగా ఆయన  ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందే. పైన చెప్పుకున్న కథాకథనాలకి, పాత్ర చిత్రణలకి తోడు- సినిమా మొదలవగానే హీరోతో ఒక సాహసం, ఆ వెంటనే ఒక గ్రూప్ సాంగ్, అదే కర్నూలు, అవే రౌడీల కుటుంబాలు, సినిమా చివర్లో ఒక ఫోక్ సాంగ్ అనే టెంప్లెట్ తోనే కొత్త దర్శకులూ, ఈ సినిమాలో అదేపనిగా క్లారిటీ, భయ్యా, బొంగేంకాదూ- అని అదే అనుకరణల టెంప్లెట్ మాటల రచయితలూ..రవికిషోర్ తీసే సినిమాలకి వన్నె చేకూర్చలేరు. తక్షణం ఆయన అప్రమత్తం కావాల్సి వుంటుంది.

-సికిందర్

         

          



Saturday, October 3, 2015

నేను మారను!



తారాగణం: రామ్‌, రాశి ఖన్నా, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి,  జయప్రకాష్‌రెడ్డి, అభిమన్యు సింగ్‌, వినీత్‌ కుమార్‌, శ్రీనివాసరెడ్డి, ఫిష్‌ వెంకట్‌, సప్తగిరి, సురేఖావాణి తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌,   ఛాయాగ్రహణం :  రసూల్‌ ఎల్లోర్‌,  ఎడిటింగ్ : 'కేరింత' మధు 
బ్యానర్‌: శ్రీ స్రవంతి మూవీస్‌,   నిర్మాత : 'స్రవంతి' రవికిషోర్‌
రచన- దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి
విడుదల: అక్టోబర్‌ 2, 2015,   సెన్సార్ :  U/A
***
          శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ 30 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని  రామ్ హీరోగా రవికిషోర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘శివమ్’ అట్టహాసంగా విడుదలయ్యింది. భారీ తారాగణంతో, కాస్ట్ లీ నిర్మాణ విలువలతో ప్రేక్షకులని అలరించడానికి ముందుకొచ్చింది. నిజానికి ప్రేక్షకులేం కోరుకుంటున్నారు, నిర్మాతలూ హీరోలూ ఏం కోరుకుంటున్నారు - అనే గ్యాప్ ని పూడ్చడానికి ఈ బిగ్ కమర్షియల్ ఏమైనా ప్రయత్నం చేసిందా, లేక తనూ షరా మామూలుగా ఆ పూడ్చలేని  అగాథం లో పడిపోయి తల్లడిల్లిందా ఈ కింద చూద్దాం..

లైటర్ చాలా లైట్ గురూ!
         
శివ (రామ్) ప్రేమించుకుని పెళ్లి చేసుకోలేక పోతున్న జంటలకి ఎంతయినా రిస్క్ చేసి పెళ్ళిళ్ళు చేస్తూంటాడు. ఓపెనింగ్ లోనే ఓ కేంద్ర మంత్రి కూతురుని ఇష్టం లేని పెళ్లి నుంచి తప్పించి ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించేస్తాడు. ఆ కేంద్ర మంత్రి మనుషులకి దొరక్కుండా ట్రైనెక్కి పారిపోతాడు. మధ్యలో ట్రైన్ ఆగినప్పుడు సిగరెట్ తాగుదామని వెళ్లి లైటర్ కోసం ఓ గ్యాంగ్ తో  ఘర్షణ పడతాడు. ఆ గ్యాంగ్ లీడర్ అక్కడి వూళ్ళో ప్రజల్నిబాధిస్తున్న భోజిరెడ్డి (వినీత్ కుమార్) అనే అతడి కొడుకు. లైటర్ కోసం జరిగే ఆ ఘర్షణలో భోజిరెడ్డి కొడుకుని గాయపర్చి తిరిగి ట్రైనెక్కి వెళ్ళిపోతాడు శివ. అలా పొలాల్లో ఒకమ్మాయి తనూజా ( రాశి ఖన్నా) ఐ లవ్యూ అని పెద్దగా అంటూ వెంటబడుతూంటే ట్రైన్ దూకేసి ఆమె వెంటపడతాడు. ఆమె ఛీత్కరించుకుంటుంది. అయినా ఆమెకోసం దగ్గరలోని కర్నూలులో సెటిలవుతాడు. ఆమె ఐలవ్యూ అన్నది ఓ నాటకానికి  రిహార్సల్ లో భాగంగా. అదీ ట్రైన్ని చూసి అనే ఘట్టం. అయినా వదిలిపెట్టకుండా ప్రేమించమని వెంటపడతాడు శివ.

          ఇలా వుండగా తన కొడుకుని కొట్టినందుకు ఊళ్ళో ఘోర పరాభవంగా ఫీలైన భోజి రెడ్డి, శివని సజీవంగా పట్టుకు రమ్మనీ, వాణ్ని ఇక్కడే జనం ముందు చంపి పరువు నిలబెట్టుకుంటాననీ ముఠాని పంపిస్తాడు. మరోవైపు ఎప్పుడో తనూజాని చూసి మనసుపారేసుకున్న అభి ( అభిమన్యు సింగ్) అనే ఇంకో రౌడీ కూడా శివ కోసం వెతుకు తూంటాడు. ఈ రెండు గ్యాంగు లేకాక, పాత కక్ష తో శివని చంపాలని ప్రభ ( బ్రహ్మానందం), శివ ప్రవర్తన నచ్చక చంపాలని వెతుకుతున్న శివ తండ్రీ (పోసాని)..ఇలా ఇన్ని గ్యాంగుల్ని తప్పించుకుంటూ తనూజా ప్రేమకోసం ప్రయత్నిస్తూంటాడు శివ. చివరికి ఆమె ప్రేమని ఎలా పొందాడు, ప్రత్యర్ధుల్ని ఎలా మట్టి  మట్టికరిపించాడూ అనేది మిగతా కథ.

ఎవరెలా చేశారు
         
రామ్ కిది వరుసగా అదే మార్పులేని మూస మాస్ పాత్ర. ‘ఒంగోలు గిత్త’, ‘మసాలా’, ‘పండగ చేస్కో’ ల తర్వాత నాల్గో మాస్ సినిమా. అవే చుట్టూ వుండే పాత్రలతో అవే రొటీన్ డ్రామాలు. ఇవేవీ అంతకి ముందు  సూపర్ హిట్టయిన  ‘కందిరీగ’ దరిదాపులకి రావడం లేదు. ‘కందిరీగ’ లాంటి కథాబలంవున్న సినిమా ఇక రామ్ నుంచి ఆశించకూడదేమో. ప్రస్తుత సినిమా సమస్య అంతా  కథలో దమ్ము లేకపోవడమే. మెచ్యూరిటీ కన్పించని ఈ మాస్ మేనియా నుంచి బయటికొస్తే తప్ప రామ్ కి వెరైటీ పాత్రలు పడవు. ప్రస్తుత సినిమాలో నటించేందుకు కథా లేదు, పాత్రకూడా  లేదు. వూరికే అర్ధంలేని కామెడీలతో, పది నిమిషాలకో ఫైట్ తో, బలం లేని ప్రేమ సన్నివేశాలతో నడిపించేశారు. తను కోరుకుంటున్న మాస్ ఇమేజీ ఇలా సాధ్యం కాదు. కేవలం తన ఇమేజియే సినిమాని కాపాడుతుందనుకోవడం కూడా పొరపాటే. వెంటనే రామ్ ఈ ధోరణి నుంచి బయట పడితే మంచిది.
     
          హీరోయిన్ రాశి ఖన్నా కీ సరైన పాత్రేలేదు. పైగా లావెక్కి రామ్ కి  సరిజోడీ అన్పించుకోలేదు. ఆమె లావుని కప్పిపుచ్చడానికి ఎక్కడా జీన్స్, పంజాబీలు లాంటివి వేయించకుండా జాగ్రత్త పడినట్టుంది. ఒక పాటలో షార్ట్ డ్రెస్ వేసినప్పుడు ఆమె ఎంత లావో బయట పడిపోయింది. హీరోయిన్ రాంగ్ సెలెక్షన్ ఈ సినిమాకి.

          ఇతర పాత్రల్లో నటించిన బ్రహ్మానందం, శ్రీనివాసరెడ్డి, జేపీ, పోసాని, వినీత్ కుమార్ మొదలైన వాళ్ళు వీలైనంత కామెడీ చేసి సీన్లని నిలబెట్టడానికి ప్రయత్నించారు, అయితే కథలేని కామెడీ సీన్లేమిటన్న ప్రశ్న, వెలితి వెంటాడుతూంటాయి.

          ఒక్క దేవీ శ్రీప్రసాద్ సంగీతం, రసూల్ ఎల్లోర్  ఛాయాగ్రహణం -ఈ రెండే సినిమాకి ప్లస్. అయితే సమస్య ఎక్కడ వచ్చిందంటే సినిమా చాలా బోరుకొట్టడంతో పాటలు బావున్నప్పటికీ భరించడం కష్టమైపోతుంది. ఇక  ‘కేరింత’ మధు చేసిన ఎడిటింగ్  సినిమా స్పీడునేమీ పెంచలేదు సరికదా- నిడివి సాగి సాగి 2 గంటల 45 నిమిషాలకి చేరింది. యాక్షన్ వైపు చూస్తే పీటర్ హెయిన్స్ మంచి పోరాట దృశ్యాలు కంపోజ్ చేశారు.  
స్క్రీన్ ప్లే సంగతులు
(to be concluded..)

Wednesday, September 30, 2015

రైటర్స్ కార్నర్



          2012 లో ‘పాన్ సింగ్ తోమార్’ కి ఉత్తమ స్క్రీన్ ప్లే జాతీయ అవార్డుతో వెలుగులో  కొచ్చిన సంజయ్ చౌహాన్, డీవీడీల్లో సినిమా కథల్ని కాపీ చేయడం దగ్గర మొదలై, జాతీయ అవార్డుతో బాటు ‘ఫిలింఫేర్’, ‘స్క్రీన్’ అవార్డులు కూడా సాధించుకోగల సొంత కథలతో బాలీవుడ్ లో ఓ స్థాయికి చేరిన రచయిత. ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్’, ‘ఐయాం కలాం’, ‘మైనే గాంధీకో క్యో మారా’ వంటి సొంత కథలతో తన ప్రతిభ చాటుకున్న చౌహాన్, నందితా దత్తా కిచ్చిన ఈ ఇంటర్వ్యూ లో-  హిందీ సినిమా రచయితలది ఎంత దయనీయ స్థితో చెప్పుకొస్తూ, కొత్త రచయితలకి కొన్ని విలువైన సూచనలు చేశారు..
కథని నమ్ముకున్న సినిమాలకే అవార్డు లొస్తున్నాయి. దీన్ని మీరెలా చూస్తారు? ఇప్పుడు  రచయితల పాత్రలో ఎలాటి మార్పు లొచ్చాయంటారు?
          కప్పుడు బలమైన కథలకే ప్రాధాన్య ముండేది. అప్పట్లో అబ్రార్ అల్వీ ని గానీ, కె.ఎ. అబ్బాస్ ని గానీ ఎవర్ని తీసుకున్నా రచయితలంటే  మంచి గౌరవం లభించేది. దర్శకుడు- రచయిత అనే కాంబినేషన్ కూడా అప్పట్లో వుండేది. ఆ తర్వాత సలీం -జావేద్ ల కొత్త తరం ప్రారంభమయ్యింది. ఇది రచయితలకి స్టార్ హోదాని సంతరించి పెట్టింది. విధిగా పోస్టర్ల మీద రచయితల పేర్లూ పడేవి. సలీం- జావేద్ లు విడిపోయాకా వాళ్ళ స్థానాన్ని మరెవ్వరూ భర్తీ చేయలేక పోయారు. ఇక్కడ్నించే హిందీ  సినిమా చరిత్రలో చాలా దుర్దశ ప్రారంభమయ్యింది. అది డీవీడీ రైటింగ్ కల్చర్.  నిర్మాతలో దర్శకులో డీవీడీ లిచ్చి, ఉన్నదున్నట్టు సీన్లు రాసుకు రమ్మనడం ప్రారంభించారు. జావేద్ అఖ్తర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఇక్కడ గుర్తొస్తోంది. ఆయన ఒక కథ రాసుకుని నిర్మాతకి వినిపిస్తే- అంతా విన్న ఆ నిర్మాత, మీ కథ అద్భుతమే,  కానీ ఇలాటి కథతో ఇదివరకు సినిమా రాలేదే? అన్నారట!
          దీని తర్వాత సోనీ పిక్చర్స్ వారు హిందీలో ‘సావరియా’ తీశారు. సోనీ రాకతో డిస్నీ పిక్చర్స్, ట్వెంటీయత్ సెంచురీ ఫాక్స్ ల వంటి హాలీవుడ్ కంపెనీలు కూడా హిందీలోకి అడుగు పెట్టాయి. దీంతో నిర్మాతలు దర్శకులూ జాగ్రత్త పడ్డారు. రచయితగా ఇందుకు  నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ కంపెనీలు హిందీలో ఎవరెవరు ఏఏ  సినిమాలు తీస్తున్నారో ఓ కన్నేయడం ప్రారంభించాయి. హాలీవుడ్ సినిమాల్ని కాపీ చేస్తే నోటీసులు పంపసాగాయి. వాళ్ళ సినిమాల్ని మనం కాపీ కొట్టి కోట్ల రూపాయలు వాళ్లకి కట్టబెట్టే కన్నా, మన రచయితలకే ఓ 10-15 లక్షలిచ్చి సొంత కథలు బాగా రాయించుకుందామన్న జ్ఞానం వచ్చింది. సొంత కథలు అడగడం ప్రారంభించారు. అందులో సీక్రెట్ ఫార్ములా వుండాలనుకున్నారు. అలా సౌత్ ఇండియా కెళ్ళి అక్కడ హిట్టవుతున్న సినిమాల రీమేక్ హక్కులు కొనడం మొదలెట్టారు. ఈ ట్రెండ్ కూడా ఇంకో  మూడు
నాలుగేళ్ళలో ముగిసిపోవచ్చను కుంటున్నాను.
        ఇదే సమయంలో కథాబలమున్న సినిమాలు రావడం రెండు మూడేళ్ళ క్రితం ప్రారంభమయ్యింది. అది కూడా పూర్తిగా కథని నమ్ముకుని కాదు- హీరోల్ని నమ్ముకునే. ఆ హీరోలతో సినిమాలు కూడా మట్టి కరిచాయి. నాకు తెలిసి బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఒక్క సల్మాన్ ఖాన్  సినిమాలే అవెంత బ్యాడ్ గా ఉన్నప్పటికీ  ఆడుతున్నాయి. ఇదీ నేటి పరిస్థితి. ఇక ముందెలా వుంటుందో చెప్పలేను.
          కాబట్టి ఇప్పుడు నిర్మాతలూ స్టార్లూ కూర్చుని ఇంకేం చేయాలా అని ఆలోచిస్తున్నారు. అక్షయ్  కుమార్ నటించిన ‘ఓ మై గాడ్’ వంద కోట్ల క్లబ్ లో చేరి వుండకపోతే ‘స్పెషల్ 26’ లో ఆయన నటించి వుండేవారే  కాదు. ‘ఓ మైగాడ్’ లో మెయిన్ క్యారక్టర్ వేసిన పరేష్ రావల్ ఎవరు? ఓ యాభై ఏళ్ల పెద్ద మనిషి. ఆయనతో కథాబలం వల్లే ఆ సినిమా హిట్టయ్యింది. ఎటు తిరిగీ కథని నమ్ముకోవాల్సిందే. అందువల్ల రచయితల మీద ఇప్పుడు  బరువు బాధ్యతలు బాగా  పెరిగాయి.

అంటే మీరనేది హిందీ సినిమాలు సౌత్ రీమేకుల మీదే ఎక్కువ ఆధార పడ్డాయనా?   

          అవును. ఇక్కడ హిందీ సినిమా పరిశ్రమని సరీగ్గా అర్ధం జేసుకోవాలి. పరిశ్రమ అనడంలోనే అది వ్యాపారమేగానీ కళ కాదని అర్ధమవుతోంది. ఎవరైనా కోట్ల రూపాయలు ఒక సినిమాకి పెడుతున్నారంటే సమాజ సేవ చేస్తున్నారని కాదు, వ్యాపారంలో పెట్టుబడి పెడుతున్నట్టు. కనుక ఆ పెట్టుబడి మీద రిటర్న్స్  ఉంటాయా లేదా అని ఆరా తీస్తారు. అప్పుడు సౌత్ సినిమా ఏదైనా హిట్టయ్యిందనుకోండి, దాని మీద దృష్టి పెడతారు. అది విజయవంతమైన హిట్ ఫార్ములా అని రుజువయ్యింది కాబట్టి- దాన్ని రిమేక్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయిని నమ్ముతారు. అందులో మంచి లాభాలు గడించాక ‘పాన్ సింగ్ తోమర్’, ‘బర్ఫీ’ లాంటి ఒరిజినల్ సినిమాలు  ఒకే నిర్మాత తీయడానికి ముందుకొస్తారు.

కథా బలమున్న సినిమాలకి ఇప్పుడు గుర్తింపు వస్తోందన్నారు, మరైతే రచయితల పరిస్థితేమిటి?
          నిజమే. ‘పాన్ సింగ్ తోమర్’ పూర్తయి విడుదల కాకపోవడం మా అందర్నీ ఆందోళన పర్చిన మాట వాస్తవం. ఏం చేయాలో అర్ధం గాలేదు. అప్పుడు దాని దర్శకుడు తిగ్మాంశూ ధూలియా,  మనమొక నలభై లక్షలు పెట్టి స్మాల్ మూవీ చేద్దామన్నారు. పారితోషికాలు తీసుకోకుండా లాభాలోస్తే పంచుకుందామన్నారు. ఈ అయిడియాతో కథల్ని అన్వేషించ సాగాం. ఒక రోజు నేను ‘సాహెబ్ బీవీ ఔర్ గులాం’  (1962) చూస్తూ కూర్చున్నాను. అది నా అభిమాన సినిమా. చూస్తూంటే  దీన్ని ఈ కాలపు కథగా మారిస్తే ఎలా వుంటుందన్న ఆలోచన వచ్చింది. ఆ సాహెబ్ సాహెబూ కాదు, బీవీ అతడి బానిసా  కాదు, ఎవరో ప్రేయసి వుంటే ఆమెకి గుర్తింపూ  వుండకూడదు.. ఇలా ఒక  కథ అల్లి తిగ్మాంశూకి విన్పించాను. అలా 40 లక్షల్లో దాన్ని తీసేశాం. దాంట్లో తెలిసిన నటులెవరూ లేరు. సినిమా విడుదలయ్యాకా అందరికీ కొత్తగా అన్పించింది. బలమైన కొత్త తరహా కథ, కొత్త రకం ట్రీట్ మెంట్, ఫీల్ వగైరా. మంచి బిజినెస్ జరిగింది. కొత్త ఐడియా తో తీస్తే ఆదరించే ప్రేక్షకులెప్పుడూ వుంటారు. 

       దీని సక్సెస్ తో ‘పాన్ సింగ్ తోమర్’ విడుదల కాగల్గింది. దీనికి ‘ఫ్రమ్ ది డైరెక్టర్ ఆఫ్ సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్’ అని ట్యాగ్  లైన్ వేయాల్సి వచ్చింది. అప్పటికి కూడా అన్యమనస్కంగానే విడుదల చేశారు. పబ్లిసిటీకి రెండు వారాలు మాత్రమే టైం ఇచ్చారు. ఇర్ఫాన్ ఖాన్ సోలో హీరో గా కమర్షియల్ అంశాలు లేకుండా ఒక నిజ కథ ఆధారంగా తీసిన సినిమా అది. విడుదలయ్యాల మంచి స్పందన వచ్చింది అన్ని వర్గాల నుంచీ. కాబట్టి కథా బలమున్న స్మాల్ మూవీస్ కి ఎప్పుడూ ఢోకా ఉండదని మరోసారి మా విషయంలో రుజువయ్యింది. ఇలాటివి సక్సెస్ అయినప్పుడు నిర్మాతలు రచయితలకి డీవీడీ కల్చర్ అప్పటికంటే ఎక్కువ మొత్తాలు చెల్లించడానికి సిద్ధ పడుతున్నారు. డీవీడీ రైటింగ్ అంటే మక్కీకి మక్కీ డైలాగులతో సహా దించడమే. ఇక రచయితలకి మానమర్యాద లెక్కడుంటాయి చెప్పండి. అప్పట్లో నేనెక్కడికి వెళ్ళినా నాకొక డీవీడీ ఇచ్చి రాసుకు రమ్మనేవారు. మొహం మీద వాళ్ళని ఏమనలేక, డీవీడీ తెచ్చుకుని చూస్తూ -నో ఇది నేను రాయను గాక రాయనని కేకలేయడమే!

డీవీడీల దశ నుంచి ఇప్పుడు కథాబలం దశకి వచ్చారు మీరు- ఈ మార్పెలా వుంది?
         
చూడండీ, జీవితంలో మన నిర్ణయాలు మనం  తీసుకోగల దశ కూడా ఒకప్పటి కొస్తుంది. మన ఛాయిస్ ని మనమే ఎంపిక చేసుకోగల మంచి రోజులూ వస్తాయి. ఇప్పుడు నేనున్న  స్టేజిలో ఇలా కూర్చుని నాకు నచ్చని వర్క్ కి నో చెప్పగల స్వేచ్చతో వున్నాను. అంటే ఏదో సాధించాననేగా? ‘పాన్ సింగ్ తోమర్’ సక్సెస్ తర్వాత ఒక నటీమణి నన్ను  పిల్చి తను ఒక జీవిత చరిత్ర తీయాలను కుంటున్నట్టు చెప్పారు. ‘పాన్ సింగ్ తోమర్’ జీవిత చరిత్రే కాబట్టి వీటిలో నేను ఎక్స్ పర్ట్ నని మార్కెట్లో వ్యాపించింది. ఆ నటీమణి చెప్పిన జీవిత చరిత్ర భావరీ దేవీ అనే ఆవిడది.  శరీరాన్ని పణంగా పెట్టి పనులు జరిపించుకుంటుంది, రాజకీయనాయకుల సరదాలు  తీర్చుకోవడానికి వాడుకుంటారు. అప్పుడామె డిమాండ్లు హద్దులు దాటడంతో వాళ్ళు ఇరుకున పడతారు. కథ సంక్లిష్టంగా తయారవుతుంది. ఇదంతా విని- అసలు మీరేం చెప్పాలనుకుంటు న్నారని ఆ నటీమణిని అడిగాను. మీ క్యారక్టర్ ఎవరు? ఏ క్యారక్టర్ తో జర్మీ చేస్తున్నారు కథలో? మంచి వాడెవడు? చెడ్డ వాడెవడు? అప్పుడేమిటి కథ? మీరేం స్టాండ్ తీసుకో దల్చారు చివరికి? పైగా  భావరీ దేవీ కథతో సినిమాలు తీసే ఆలోచనలో మరికొందరూ వున్నారు. వాటిలో మల్లికా షెరావత్ తో ఒకటి. ఆమెతో ఈ కథ అంటే సెక్స్ తో రెచ్చ గొట్టేదిగానే వుంటుంది. అందుకని ఈ కథతో ముందుకు వెళ్ళ వద్దని ఆవిడకి చెప్పాను. ఈ కథ నాకూ నచ్చలేదు కాబట్టి నేనూ రాయనని చెప్పేశాను. ఆవిడఅర్ధం జేసుకుని విరమించుకున్నారు. నేను నో చెప్పే పొజిషన్లో వున్నాను కాబట్టి ఒక బ్యాడ్ మూవీ కి రాయకుండా అలా తప్పుకోగలిగాను. 

మరి మీరు ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్’ సీక్వెల్ కి ఎందుకు రాయడం లేదు?
          ఇంత త్వరగా సీక్వెల్ అంటే జీర్ణించుకోలేకపోయాను. ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్’ అనుకోకుండా హిట్టయింది. చీకట్లో రాయేసి చూశామంతే. అన్నిసార్లూ అలా జరక్కపోవచ్చు. అదీగాకా ఆ సినిమా తీయాల్సిన పరిస్థితి  వేరు. దాంతో మాకంత పేరొస్తుందని ఊహించను కూడా లేదు.  అలాటి హిట్ కి సీక్వెల్ అంటే దానికంటే ఎక్కువ అంచనాలుంటాయి ప్రేక్షకులకి. అప్పటికీ నేను తిగ్మాంశూతో కొంత స్క్రిప్ట్ వర్క్ చేశాను కూడా. కన్విన్స్ కాలేక తప్పుకున్నాను. నాకు తెలిసి ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్’ , ‘పాన్ సింగ్ తోమర్’ ల తర్వాత  ‘మిలన్ టాకీస్’ తీయాలి. అప్పుడు మా రేంజి ఒకటొకటిగా ఎక్కడెక్కడికి చేరుకుంటుందో మార్కెట్ కి అర్ధమౌతుంది. ఇలాంటప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్లి సీక్వెల్ తీయడం మంచి నిర్ణయం కాదన్పించింది.

మళ్ళీ రచయితల విషయానికొస్తే, వాళ్ళ హక్కుల్ని పరిరక్షించడానికి సరయిన చట్టా లున్నాయంటారా?
          లేవు. చట్టాలు చేసే ముందే వాటిని ఉల్లంఘించే మొనగాళ్ళు ఉన్నారిక్కడ. చట్టాల పట్ల ఇండియన్ల మైండ్ సెట్టే అది. కాపీరైట్ అని అంటూంటారు. రచయితగా ఇక్కడ పనిచెయ్యాలి, బతకాలి, డబ్బు సంపాదించాలి. సినిమా అంటే ఏమిటి? సినిమా అంటే మూలంలో ఒక అయిడియా లేదా కాన్సెప్ట్. కనుక ఏ నిర్మాతో దర్శకుడో తమతో రచయిత చర్చిస్తున్న సబ్జెక్టు  వాస్తవానికి ఒక అయిడియా అనీ, కాన్సెప్ట్ అనీ అనేసి, రాతపూర్వకంగా రిజిస్టర్ చేయించుకుంటే  రచయిత ఏం చేస్తాడు? అవే ఐడియాలూ కాన్సెప్టులూ ఎవరికైనా స్ఫురించవచ్చు కదా? స్క్రీన్ ప్లే, డైలాగులూ రాస్తే వాటిమీద హక్కులెలా అడుగుతాడు రచయిత? 
          పూర్వం కాంట్రాక్టులు ఉండేవి కావుగానీ విలువలు ఉండేవి. పరస్పర గౌరవ మర్యాదలుండేవి. అప్పుడు సరిపోయిది. ఇప్పుడు కొత్త కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి. అర్ధంకాని 10-15 పేజీల కాంట్రాక్ట్ మీద సంతకాలు చేయాల్సి వస్తోంది. అందులో వుండే న్యాయ పరిభాషని అర్ధం జేసుకోవడం మనవల్ల కాదు. లాయర్ అవసరం. ఎంతమంది రచయితలు  లాయర్లని భరించగలరు. కొత్త రచయితలు అసలేం మాటాడలేరు. నీకు వర్క్ కావాలంటే హక్కులన్నీ మాకుంటాయి, ఇష్టం లేకపోతే  థాంక్యూ వెరీ మచ్ గుడ్ బై - అనేస్తారు నిర్మాతలు. 
      మరి ఫిలిం రైటర్స్ అసోసియేషన్ (ఎఫ్ డబ్ల్యీవ్ ఏ) పాత్రేమిటి?
        మా హక్కుల్ని కాప్పాడ్డానికి వాళ్ళు శాయశక్తులా కృషి చేస్తూనే ఉన్నారు. చాలాసార్లు సక్సెస్ అయ్యారు. కానీ ఆ డబ్బెవరివ్వాలి? నిర్మాతలేగా? అసోసియేషన్ వాళ్ళు మాత్రమేం చేయగలరు? అలాంటి కాంట్రాక్టుల మీద సంతకాలు చేయవద్దని మాత్రం చెప్తూంటారు. చేయకపోతే అసోసియేషన్ మా వైపుంటుంది. మరి సంతకం చేయకపోతే- నీతో మాకు పనేం లేదు వెళ్ళచ్చని నిర్మాతలంటారే- ఎలా? అసోసియేషన్ ఏం చేస్తుంది?
రచయితలకి సామాజిక బాధ్యతా అవసరమంటారా?
         
మనం ఏం చెప్తున్నామో అది ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు సామాజిక బాధ్యత అవసరమే.
కొత్త రచయితలకి మీరిచ్చే సలహా?
          ఏం రాయాలనుకున్నారో అది రాసెయ్యాలి. కొన్నిసార్లు డబ్బు అవసరం కొద్దీ నానా చెత్తా రాయాల్సి వస్తుంది. తప్పదు. ఆసియాలోనే ఖరీదైన నగరం ముంబాయి. ఇక్కడ బతకడం కష్టం. పోతే కాపీ చేయడం గానీ, ఇతరుల్లా రాయాలనుకోవడం గానీ చేయకుండా వుంటే మంచిది. ఏదైనా రచయిత తనలోంచి వచ్చిన దైతేనే ఎంజాయ్ చేస్తూ రాయగలడు. ఎవరి సినిమా కూడా బ్యాడ్ అని తప్పుబట్ట కూడదు. మంచి చెడ్డలు విశ్లేషించుకుంటే ప్రయోజనం వుంటుంది. ఎవర్నీ ఎగతాళి చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు సినిమా తీస్తున్నప్పుడు దాన్ని నమ్మే తీసివుంటారు.
*