దర్శకత్వం :
మేఘనా గుల్జార్
తారాగణం : ఇర్ఫాన్ ఖాన్, కొంకణా సేన్ శర్మ, టబు, ఆయేషా పర్వీన్, నీరజ్ కబి,
సోహం శర్మ, గజరాజ్ రావ్, అతుల్ కుమార్, శిశిర్ శర్మ తదితరులు
రచన- సంగీతం : విశాల్ భరద్వాజ్, సాహిత్యం : గుల్జార్
ఛాయాగ్రహణం : పంకజ్ కుమార్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్
బ్యానర్ : జంగ్లీ పిక్చర్స్, వీబీ పిక్చర్స్, మిర్చీ మూవీస్
నిర్మాతలు : విశాల్ భరద్వాజ్, వినీత్ జైన్
విడుదల : 2 అక్టోబర్ 2015
***
కవి గుల్జార్ కుమార్తె, దర్శకురాలు మేఘనా గుల్జార్
కూడా ఈ సినిమా తీస్తూ తీర్పు చెప్పేశారు. నిజానికి కేసు హైకోర్టులో పెండింగులో వుంది.
మేఘన తీర్పు చెప్పడమే గాక, పొట్టపోసుకోవడానికి
ఇళ్ళల్లో పని చేసుకునే సేవకుల మనోభావాల్ని దెబ్బతీస్తూ ఈ సినిమాకి
పబ్లిసిటీ కూడా ఇస్తున్నారు. ఢిల్లీ, ముంబాయిలలోని ఉన్నత వర్గాల వారి నుంచి
అభిప్రాయాలు సేకరిస్తూ, ఇప్పుడు పని వాళ్ళని చూసి భయపడాల్సి వస్తోందని
ప్రచారం చేయిస్తున్నారు. ఒకావిడ పాతికేళ్ళుగా నమ్మకంగా పని చేస్తున్న పనివాణ్ణి ఈ సినిమా చూసి రమ్మని పంపానని చెప్పుకుంది! ఇంకో
బిజినెస్ మాగ్నెట్ స్వయంగా తను పనివాణ్ణి
తీసికెళ్ళి సినిమా చూపిస్తానని చెప్పుకున్నాడు! ఇంకా చాలామంది చాలా చాలా
చెప్పుకొచ్చారు పనివాళ్ళపై అనుమానాలు పెట్టుకుని. ఈ సినిమాలో చూపించినట్టుగా పనివాళ్ళు
చెడ్డవాళ్ళుగా మారకూడదన్న మెసేజి ఉదారంగా ఇచ్చేస్తున్నారు. పనివాళ్ళ ద్రోహాల కంటే
యజమానుల శాడిజాలే ఎక్కువన్న సంగతి
మర్చిపోతున్నారు. నోయిడాలో ఆ హత్యలు జరిగినప్పుడు పని వాళ్ళంటే లేని భయం, ఈ ప్రచారం,
ఇప్పుడు సినిమా విడుదలయ్యాక అర్జెంటుగా గుర్తు కొచ్చేసింది. ఓ కళారూపంగా ఈ సినిమా పట్ల
ఏ కాస్త ఆసక్తి పెంచుకున్న వాళ్లని కూడా ఈ నెగెటివ్ పబ్లిసిటీతో దూరం
చేసుకుంటున్నారు. ఎనిమిదేళ్ళ నుంచీ ఇంకా తెమలని కేసులో పనివాళ్ళని ఎలా దోషులుగా
చిత్రిస్తారో వాళ్ళ విజ్ఞతకే వదిలెయ్యాలి.
కళారూపంగా చూస్తే ఈ సినిమాతో మేఘన
అద్బుతాన్నే సాధించారు టెక్నికల్ గా, విషయపరంగా కాదు. 2002 లో దర్శకురాలిగా తొలి సినిమా
‘ఫిల్హాల్’ (తాత్కాలికంగా..) తీసి
ఎవర్నీ సంతృప్తి పర్చలేకపోయిన తను, మరో మూడు సినిమాలతోనూ చుక్కాని లేని నావలాగే ప్రయాణించు
కొచ్చారు. ‘తల్వార్’ తో ఇప్పుడు తన జానర్
ఏంటో, చేరాల్సిన గమ్యస్థానమేంటో తెలుసుకున్నారు. మరో మీరా నాయర్ అన్పించుకోవడానికి
నామోషీ ఏమీ వుండకూడదు. నిజానికి దర్శకురాళ్ళు కమర్షియల్ సినిమాల కంటే
రియలిస్టిక్ సినిమాలు తీసే పేరు సంపాదించుకుంటున్నారు.
నిజానికి
రియలిస్టిక్ సినిమాలు తీయడమే కష్టం. కమర్షియల్ సినిమాల్లో అరగంట కొరియోగ్రాఫర్లు
పాటలేసుకుంటారు, అరగంట ఫైట్ మాస్టర్లు ఫైట్లేసుకుంటారు. మిగిలిన గంట దర్శకులకి
వదిలిపెడతారు. ఈ గంటలో మళ్ళీ ఓ అరగంట కామెడీ వేసి తప్పించుకుని, చివరాఖర్లో చద్దన్నంలా
మిగిలే ఆ అరగంట సేపే దర్శకులు కథ పెట్టుకుని పని కల్పించుకుంటారు.
రియలిస్టిక్ సినిమాలతో అలాకాదు. మొత్తం రెండు గంటల నిడివినీ ఔట్ సోర్సింగ్ ఇవ్వకుండా దర్శకులే భుజాన్నేసుకుని, ఏ మసాలాలూ వుండని సబ్జెక్టుని, తమ మేధస్సుని రంగరించి దగ్గరుండి దృశ్యీ కరించుకోవాల్సిందే. ఈ గడ్డు ప్రయత్నంలో మేఘనా తడబడకుండా దాటేశారు. ఐతే స్క్రిప్టుకి సంబంధించిన పనీపాటా తను పెట్టుకోకుండా, మరో రియలిస్టిక్ మాంత్రికుడు విశాల్ భరద్వాజ్ కి అప్పజెప్పారు.
***
‘తల్వార్’ రెగ్యులర్ రియలిస్టిక్ సినిమాల ధోరణిలో
కూడా వుండదు. ఎడిటింగ్ గిమ్మిక్కు లుండవు. ఆర్ట్ సినిమా వాస్తవికతతో ఏ హడావిడీ లేకుండా,
ఆర్ ఆర్ తోనూ ఉద్రేకపర్చకుండా, సైలెంట్ గా నిజజీవితంలో లాంటి సాదాసీదా
సన్నివేశాలతోనే షాకిస్తూ, ఆలోచింప జేస్తూ సాగిపోతుంది. అక్కడక్కడా డాక్యుమెంటరీ
ధోరణి వచ్చి చేరుతుంది. దీంతో ఇది డాక్యూ డ్రామా జానర్ ని సంతరించుకుంది. ఈ
హత్యోదంతాన్ని బహుళ దృష్టి కోణాల్లో చెప్పాల్సిన అవసర ముంటుంది. నిజ కేసు అలాగే
వుంది. మూడు పోలీసు బృందాలు సేకరించిన
సాక్ష్యాల్లో మూడు రకాల వాంగ్మూలాలిచ్చిన పనివాళ్ళతో
తలనొప్పిగా తయారైన కేసు. ఏ వొకరు చెప్పింది మరొకరితో సరిపోలని రోషోమన్ ఎఫెక్ట్
లాంటి పరిస్థితి. అందుకే ఇదింకా తేలని కేసుగా ఉండిపోయింది. ఐతే పని వాళ్ళు వాళ్ళ
దృష్టికోణంలో అసలా రాత్రి ఏం జరిగిందీ
చెప్పుకొస్తున్నప్పుడు, ఆ దారుణానికి రచయిత ఇచ్చిన ట్రీట్ మెంట్, దాన్ని దర్శకురాలు చిత్రీకరించిన
తీరూ ఒక క్లాసిక్ సందర్భం, కవి సమయం.
***
ఓ తెల్లారి పొద్దుటే శృతీ టాండన్ ( ఆయేషా పర్వీన్)
బెడ్ రూమ్ లో హత్యకి గురై వుంటుంది. ఆమె తల్లిదండ్రులు రమేష్ ( నీరజ్ కబీ), నూతన్
( కొంకణా సేన్ శర్మ) టాండన్ లు షాక్ అవుతారు. పోలీస్ ఇన్స్పెక్టర్ ధనీరామ్ (గజరాజ్
రావ్) వచ్చి దర్యాప్తు ప్రారంభిస్తాడు. ఎప్పుడూ చెవి దగ్గర సెల్ ఫోన్ పెట్టుకుని పిచ్చి
వాగుడు వాగుతూ, నోట్లో పాన్ వేసుకుని అసహ్యంగా నములుతూ, న్యూసెన్స్ గా వుండే ఇతను
దేని మీదా సరీగ్గా దృష్టి పెట్టడు. అక్కడి సాక్ష్యాధారాలు కూడా సేకరించడు. ఒక్క ఇంట్లో ఉండాల్సిన నలభై ఐదేళ్ళ
పనివాడు ఖేంపాల్ లేకుండాపోయాడని మాత్రం గ్రహిస్తాడు. ఆ ఖేంపాల్ ని అనుమానితుణ్ణి
చేసేస్తాడు. వాడే శృతిని చంపి పారిపోయాడని ప్రకటించేస్తాడు. మర్నాడు ఆ ఖేంపాల్ శవమై
టెర్రస్ మీద కన్పిస్తాడు. కంగుతిన్న ధనీరామ్ అక్కడ గోడ మీద రక్తంతో కూడిన హస్త
ముద్రపడి వున్నా దాన్నీ తేలిగ్గా తీసుకుంటాడు. అతడి దర్యాప్తు చాలా నీచస్థాయిలో
వుంటుంది. హత్యలు జరిగితే ఫోరెన్సిక్ టీముని పిలిపించాలని గానీ, స్నిఫర్ డాగ్స్ ని
రప్పించాలని గానీ అతడికి తోచదు. ఖేంపాల్ గొంతు కోసేసి వుంటుంది. శృతి హత్య కూడా గొంతు
కోసేసే జరిగింది.
శృతి తల్లిదండ్రులు రమేష్-నూతన్
లు డెంటిస్టులు. వాళ్ళ క్లినిక్ లో కాంపౌండర్ గా పనిచేసే, ఖేంపాల్ క్లోజ్ ఫ్రెండ్ కన్హయ్యా
అనే వాణ్ణి ప్రశ్నించడం మొదలెడతాడు ధనీరామ్ నిర్లక్ష్యంగా. డాక్టర్ రమేష్ కి
వివాహేతర సంబంధం ఉందనీ, కూతురితో పనివాడు ఖేంపాల్ సంబంధం పెట్టుకున్నాడని
అనుమానిస్తున్నాడనీ ఏదేదో చెప్పుకొస్తాడు కన్హయ్యా. దీంతో పూనకం పూనినట్టు
నిర్ణయానికొచ్చేస్తాడు ధనీరామ్. వెంటనే పై అధికారి మీడియా సమావేశం పెట్టి- ఈ జంట
హత్యలు డాక్టర్ రమేషే చేశాడని ప్రకటించేస్తాడు. తన కూతురూ పనివాడు ఖేంపాల్ ఇద్దరూ
ఆ రాత్రి కలిసివుండగా చూసి తట్టుకోలేక
చంపేశాడనీ, ఇది కచ్చితంగా ఆనర్ కిల్లింగే అని చెప్పేసి, డాక్టర్ రమేష్ ని అరెస్టు చేయించి
జ్యూడీషియల్ కస్టడీకి పంపించేస్తాడు. దీంతో పోలీసులమీద దుమారం రేగుతుంది అంతటా.
ప్రభుత్వం ఈ కేసుని పోలీసుల నుంచి తప్పించి సీడీఐ కి అప్పగిస్తుంది.
దీంతో జాయింట్ డైరెక్టర్ స్థాయిలో
వున్న సెంట్రల్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీడీఐ - సీబీఐ పేరు మార్చి
ఇలా పెట్టారు) అధికారి అశ్విన్ కుమార్ ( ఇర్ఫాన్ ఖాన్) రంగంలో కొస్తాడు. అసిస్టెంట్
కమిషనర్ హోదాలోవున్న వేదాంత్ (సోహాం శర్మ) తో కలిసి కేసుని తిరగదోడతాడు. కేసు
దర్యాప్తులో ఎన్నో లోసుగులున్నట్టు గ్రహిస్తారు. ఇద్దరూ ఇన్స్పెక్టర్ ధనీరామ్ ని పిలిపించి గదిలోపెట్టి, ఏంట్రా నీ
ఇన్వెస్టిగేషనూ నువ్వూ -అంటూ చితకబాదడం మొదలెడతారు. దారికొచ్చి ధనీరామ్
చేసిన తప్పులన్నీ చెప్పేసుకుంటాడు.
సీడీఐ డైరెక్టర్ స్వామి (ప్రకాష్ బేలవాది ) రిటైరవుతూ ఒక మాట చెప్పివుంటాడు అశ్విన్ కుమార్ కి- న్యాయదేవత చేతిలో త్రాసు ఒక్కటే కాదు, ఇంకో చేతిలో తల్వార్ కూడా వుంటుంది. ఆ తల్వార్ మనమే- పోలీసులం. గత అరవయ్యేళ్ళుగా ఆ తల్వార్ తుప్పు పట్టిపోయింది. దాన్ని శుభ్రం చేయాల్సిన బాధ్యత నీదే- అని.
ధనీరామ్ శుభ్రపడ్డాడు. డాక్టర్ రమేష్ మీద తప్పుడు కేసు పెట్టారని నమ్ముతూంటాడు అశ్విన్ కుమార్. ఫోరెన్సిక్ టీముతో రీ- ఇన్వెస్టిగేషన్ చేయిస్తాడు. కాంపౌండర్ కన్హయ్యానీ, వాడి ఇంకో మిత్రుణ్ణీ నార్కో టెస్టుకి గురిచేసి కొత్త విషయాల్ని రాబడతాడు. ఆ రాత్రి ఖేంపాల్ గదిలో వీళ్ళిద్దరూ మద్యం తాగుతూ వున్నట్టు, శృతి గదిలోకెళ్ళి ఆమెని అనుభవించాలని చూసినట్టూ, ఖేంపాల్ అడ్డుపడితే అతణ్ణి చంపేసి టెర్రస్ మీద పడేసినట్టూ, తమని చూసిన శృతిని కూడా చంపేసినట్టూ తేలుతుంది ఆ టెస్ట్ లో.
కొత్తగా వచ్చిన సీడీఐ డైరెక్టర్ జేడీ కుమార్ ( శిశిర్ శర్మ) కి ఈ దర్యాప్తు నచ్చదు. అశ్విన్ కనుగొంటున్న విషయాలు అతను నమ్మడు. దీనికి తోడు ప్రమోషన్ ని ఆశిస్తున్న అశ్విన్ సహ అధికారి వేదాంత్, అశ్విన్ కి ద్రోహం తలపెట్టడంతో, అతడితో కలబడతాడు అశ్విన్. వెంటనే అశ్విన్ ని సస్పెండ్ చేసేస్తాడు జేడీ కుమార్.
మళ్ళీ కొత్తగా దర్యాప్తుని
అశ్విన్ మాజీ బాస్, రిటైరైన పాల్ (అతుల్ కుమార్) కే అప్పగిస్తాడు జేడీ కుమార్. పాల్ జేడీ కి
అనుకూలంగానే డాక్టర్ రమేష్ నీ, అతడి
భార్యనీ నిందితులుగా నిర్ధారిస్తూ రిపోర్టిస్తాడు. ఇతడి రిపోర్టుకి ఆధారం ఆడ పనిమనిషి
ఇచ్చిన సాక్ష్యం. ఇప్పుడు కేంద్ర మంత్రి జోక్యం చేసుకుంటాడు. రెండు టీములూ ఆయన
ముందు హాజరై వాదనలతో వేడెక్కిస్తాయి. అశ్విన్ పనివాళ్ళని- పాల్ భార్యాభర్తల్ని
హంతకులుగా తేల్చడం గందరగోళంగా అన్పించి క్లోజర్ కి వేసుకోమంటాడు కేంద్ర మంత్రి. ఛార్జి
షీటు దాఖలు చేయాల్సిన సీడీఐ, కేసులో సరయిన సాక్ష్యాధారాలు లభించనందున మూసేయాల్సిందిగా పిటిషన్ వేసుకుంటుంది. జడ్జి
చీవాట్లు పెట్టి, భార్యాభర్తల మీద చార్జిషీట్ వేసి కేసు నడపమంటుంది. అలా కేసు నడిచి,
డాక్టర్ దంపతులిద్దరూ దోషులుగా తేలి యావజ్జీవ శిక్షతో జైలుకి తరలిపోతారు. ఈ కేసు
తప్పుల తడక అంటూ హైకోర్టు కి అప్పీల్ చేసుకుంటారు.
***
నిజజీవితంలో ఈ కేసు సుప్రీం కోర్టు దాకా
పోవచ్చు. తుది తీర్పు వెలువడకుండానే కేసు పట్ల ఒక స్టాండ్ తీసుకుంటూ సినిమా
తీయడంతోనే వచ్చింది ఇబ్బంది. ఇతర పాత్రలు ఏమైనా ప్రతిపాదించవచ్చు- కానీ ప్రధాన పాత్ర ఏం చెప్పిందన్నదే లెక్క కొస్తుంది.
అశ్విన్ కుమార్ పనివాళ్ళని నిందితుల్ని చేయడమే సబబు అన్పించదు. ఇలా చేయడం వల్లే ఒక వర్గం ప్రజలు పనివాళ్ళని కించ పర్చే కామెంట్లు
చేస్తూ మీడియా కెక్కారు సినిమా పబ్లిసిటీలో
భాగంగా. వాళ్ళది వ్యవస్థీకృత రంగం కాదు కాబట్టి, వాళ్లకి సంఘాలూ నాయకులూ లేరు కాబట్టి
సరిపోయింది. లేకపోతే ఈపాటికి పనివాళ్ళు
వీధి కెక్కి యజమానులు రోడ్డున పడేవాళ్ళు.
1950 లో అకిరా కురసావా తీసిన ‘రోషోమన్’ అనే ప్రసిద్ధ సినిమా వుంది. జరిగిన ఒక హత్య గురించి చూసిన నల్గురూ నాల్గు విధాలుగా చెప్పుకొచ్చే కథనం. వీటిలో నిజమేదో ప్రేక్షకులకే వదిలేస్తాడు దర్శకుడు. ఏ సాక్ష్యం వైపూ ప్రేక్షకుల్నిలీడ్ చేయడు. అదే తను నమ్ముతున్నానని కూడా చెప్పడు. ఒక ప్రశ్నగానే ముగించేస్తాడు కథని. అదీగాక ఆ వాంగ్మూలాలు అబద్ధాలు అన్పించేట్టుగా కూడా చిత్రించడు. ఆ వాంగ్మూలాలతో అబద్ధాల ఆట, రాజకీయ చదరంగం, ఎత్తుకు పై ఎత్తులేయడం లాంటి గిమ్మిక్కులకి కూడా పాల్పడడు. ‘తల్వార్’ లో ఇవే వున్నాయి. దర్శకురాలే కేసుని తిమ్మిని బొమ్మిని చేస్తూ రాజకీయం చేసినట్టుగా తయారయ్యింది. కురసావా చూపించదల్చుకుంది - నీషే ఫిలాసఫీకి వెండితెర రూపాన్నే అని మనకర్ధమౌతుంది. నిజాలనేవి లేనే లేవనీ, కేవలం భాష్యాలే ఉంటాయనీ అన్నాడు నీషే (There are no facts, only interpretations-Frederick Niche).
1950 లో అకిరా కురసావా తీసిన ‘రోషోమన్’ అనే ప్రసిద్ధ సినిమా వుంది. జరిగిన ఒక హత్య గురించి చూసిన నల్గురూ నాల్గు విధాలుగా చెప్పుకొచ్చే కథనం. వీటిలో నిజమేదో ప్రేక్షకులకే వదిలేస్తాడు దర్శకుడు. ఏ సాక్ష్యం వైపూ ప్రేక్షకుల్నిలీడ్ చేయడు. అదే తను నమ్ముతున్నానని కూడా చెప్పడు. ఒక ప్రశ్నగానే ముగించేస్తాడు కథని. అదీగాక ఆ వాంగ్మూలాలు అబద్ధాలు అన్పించేట్టుగా కూడా చిత్రించడు. ఆ వాంగ్మూలాలతో అబద్ధాల ఆట, రాజకీయ చదరంగం, ఎత్తుకు పై ఎత్తులేయడం లాంటి గిమ్మిక్కులకి కూడా పాల్పడడు. ‘తల్వార్’ లో ఇవే వున్నాయి. దర్శకురాలే కేసుని తిమ్మిని బొమ్మిని చేస్తూ రాజకీయం చేసినట్టుగా తయారయ్యింది. కురసావా చూపించదల్చుకుంది - నీషే ఫిలాసఫీకి వెండితెర రూపాన్నే అని మనకర్ధమౌతుంది. నిజాలనేవి లేనే లేవనీ, కేవలం భాష్యాలే ఉంటాయనీ అన్నాడు నీషే (There are no facts, only interpretations-Frederick Niche).
‘తల్వార్’ అనే టైటిల్ తో పోలీస్ వ్యవస్థ నిర్వాకమెలా వుంటుందో చెప్పాలనుకున్నారు. పోలీసుల నిర్వాకంవల్లే నిజ కేసు అలా తయారయ్యింది. ఒక కేసుని పట్టుకుని వాళ్ళ అసమర్ధత, వాళ్ళ రాజకీయాలు, పోటాపోటీలు ఎలావుంటాయో చక్కగా చూపించారు సినిమాలో. అశ్విన్ కుమార్ వచ్చాక పోలీస్ ప్రొసీజర్ ని కూడా సశాస్త్రీయంగా చూపించారు. ఈ కేసులో మూడురకాల సాక్ష్యాలతో పోలీసుల పరిస్థితి ఇదీ- అనే రోషోమన్ ఎఫక్ట్ తో ముగించేస్తే సరిపోయేది. కాన్సెప్ట్ ఇదయినప్పుడు కాన్సెప్ట్ తో సంబంధంలేని నిందితుల నిర్ధారణ తతంగానికి తెరతీయాల్సిన అవసరం లేదు. కేసుతో పోలీసులే గందరగోళంగా వున్నప్పుడు ఫలానా వాళ్ళు నిందితులనడం అర్ధరహితమే. ఒకే కథలో ఈ రెండూ పరస్పరం పొసగని పాయింట్లు. అయినా ఒకే ఒరలో రెండు తల్వార్లు దూర్చారు- ‘హవా’ లో తల్లి కథగా నడుస్తున్న సినిమా కాస్తా ఆమె పిల్ల కథగా ముగిసినట్టు- పోలీసుల మీద చర్చ కాస్తా పనివాళ్ళ మీదికి మళ్ళిపోయింది. పోలీసులు బతికిపోయారు ఇలాకూడా- పనివాళ్ళు బలైపోయారు చివరికి.
***
దీనికి పాపం దర్శకురాలి బాధ్యత లేదనుకోవాలి. ఆవిడ విశాల్ భరద్వాజ్ ని నమ్ముకున్నారు. ఆయన ఏం రాస్తే అదే తీశారు. ఈ సారెందుకో విశాల్ భరద్వాజ్ రాయడానికి రెండు తల్వార్లు పెట్టుకున్నారు. ఒక తల్వార్ తో తీస్తే ఇన్ స్పైర్ అయి రెండో తల్వార్ తో ఇంకెవరూ తీయకుండా రెండు తల్వార్లనీ తనే వాడేసుకున్నారు. కానీ భరద్వాజ్ ఎంత ప్రయత్నించినా పనివాళ్ళ తల్వార్ తుప్పు పట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే వాళ్ళ పనే తోమి శభ్రంగా ఉంచుకోవడం! ఈ సినిమా ద్వారా కేసు మీదా, పోలీసుల తీరు మీదా ప్రశ్నాస్త్రాన్ని సంధించాల్సింది కాస్తా తీర్పులతో మీడియా దర్బార్ లతో పోటీపడ్డారు- మీడియా పుట్టించిన సినిమాయే కాబట్టి!
ఇర్ఫాన్ ఖాన్ ఈ సినిమాకి ఎస్సెట్. ఏ సినిమాకైనా అతను ఎసెట్టే. కానీ భార్య పాత్రలో టబు ఒక పంటి కింద రాయి. బయట యాక్షన్ లో వుండే హీరోకి ఇంటి దగ్గర సమస్యల్లో వుండే, లేదా సమస్యలు సృష్టించే భార్య వుండడం హాలీవుడ్ మూస. అదిక్కడ జొరబడకూడదు. జొరబడి వీళ్ళ విడాకుల గొడవని తీర్చిందీ లేదు. అర్ధాంతరంగా ముగిసే వ్యవహారం.
ఇతర పాత్రల్లో ప్రతీ ఒక్కరూ ఈ సినిమాకి హైలైట్. ఎలా నటింప జేసుకోవాలో, నటుల చేత ఎలా మాట్లాడించుకోవాలో ఈ సినిమా చూసి ఇంకా తెలుగు దర్శకులు నేర్చుకోవాల్సింది వుంది. ఈసారి మేఘనా గుల్జార్ ఇంకాస్త మంచి రియలిస్టిక్ సృష్టి తో ముందుకొస్తారని ఆశిద్దాం.
-సికిందర్.