రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, January 17, 2025

1364 : బుక్ రివ్యూ!


  ప్రపంచ సినిమా చరిత్రలో సస్పెన్స్ బ్రహ్మ సర్ ఆల్ఫ్రెడ్ జోసెఫ్ హిచ్ కాక్ (1899-1980) మీద వెలువడినన్ని పుస్తకాలు ఇంకే సినిమా కళాకారుల గురింఛీ వెలువడలేదేమో. వందలాది పుస్తకాలు హిచ్ కాక్ గురించి రాశారు. ఈ పుస్తకాలు విద్యార్ధుల, విమర్శకుల, చరిత్రకారుల నిశిత విశ్లేషణలకి వనరులుగా కొనసాగుతున్నాయి. హిచ్ కాక్ పుస్తకాల రచయిత కాకపోయినా, ఆయన గురించి లెక్కలేనన్ని విశ్లేషణలు, జీవిత చరిత్రలు, ఆయన కళాత్మక శైలుల పరిశీలనలూ మొదలైనవి అధ్యయన గ్రంధాలుగా కోకొల్లలుగా వెలువడ్డాయి. ఆల్ఫ్రెడ్  హిచ్ కాక్ పేరు చెబితే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు వెంటనే గుర్తుకు వస్తాయి. ప్రపంచ సినిమా చరిత్రలో మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ గా ప్రఖ్యాతుడైన ఆయన సినిమాలు కేవలం  వినోద సాధనలగానే గాక, ఆలోచనలకి గట్టి ఆహారం అందిస్తాయి. మన దేశంలో కూడా హిచ్ కాక్ సినిమాల్ని విరగబడి చూశారు, చూస్తున్నారు, ఇంకా  చూస్తారు. అయితే విచిత్రమేమిటంటే, మన దేశంలో ఇంత  ప్రఖ్యాతుడైన హిచ్ కాక్ మీద ఒక్క పుస్తకమూ వెలువడక పోవడం. 1925 నుంచి సినిమాలు తీయడం మొదలెట్టిన హిచ్ కాక్ మీద విదేశాల్లో 2015 లో కూడా పుస్తకాలు రాసి హిచ్ కాక్ ని స్మరించుకుంటున్నారు. ఈ నేపధ్యంలో మన దేశంలో తొలిసారిగా -ముఖ్యంగా తెలుగు ప్రచురణా రంగం నుంచి హిచ్ కాక్ కెరియర్ కి శత సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అన్నట్టు, 2024 డిసెంబరులో ఒక పుస్తకం వెలువడింది- అదే మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్ కాక్ అనే వివిధ తెలుగు సినిమా ప్రముఖులు రాసిన వ్యాసాల సంకలనం.

        సీనియర్ జర్నలిస్టు, రచయిత పులగం చిన్నారాయణ, రైల్వే ఉన్నతాధికారి రవి పాడి కలిసి ఈ సంకలనాన్ని ముందుకు తెచ్చారు. దీని వెనుక ఎంత కృషి జరిగిందన్నది వీరి మాటల్లోనో పుస్తకంలో చదవొచ్చు. 45 మంది దర్శకులు, 7 గురు రచయితలు, 10 మంది జర్నలిస్టుల నుంచి అడిగి రాయించుకుని శ్రమ కోర్చి సేకరించిన 62 వ్యాసాలు ఈ హార్డ్ కవర్ ఎడిషన్లో కొలువుదీరాయి. ఇది మన దేశంలో ల్యాండ్ మార్క్ పుస్తకమవుతుందని చెప్పొచ్చు.
       
528 పేజీలున్న ఈ పుస్తకంలో విఖ్యాత దర్శకులు సింగీతం శ్రీనివాసరావు
, వంశీ గార్ల దగ్గర్నుంచీ, సుధీర్ వర్మ, సాగర్ చంద్ర గార్ల వరకూ45 మంది దర్శకులు, సత్యానంద్ గారి నుంచీ గోపీమోహన్ గారి వరకూ 7 గురు రచయితలూ, ప్రభు గారి దగ్గర్నుంచీ చల్లా భాగ్యలక్ష్మి గారి వరకూ 10 మంది జర్నలిస్టులూ రాసిన విశిష్ట ఆర్టికల్స్ ని ఇందులో పొందుపర్చారు.
       
45 మంది దర్శకులు రాసిన వ్యాసాల్లో హిచ్ కాక్ సినిమాల్లో వారు గమనించిన హిచ్ కాక్ ట్రీట్ మెంట్ నీ
,  టెక్నిక్ నీ, టెక్నాలజీనీ పాఠకుల దృష్టికి తేవడమన్నది  ఇక్కడ గమనించాల్సిన విషయం. ఒక్కో దర్శకుడు ఒక్కో హిచ్ కాక్ సినిమా తీసుకుని విశ్లేషించారు. ఇతర దర్శకుల్లా కాకుండా హిచ్ కాక్ కేవలం ఒక్క సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ కే కట్టుబడి వరుసగా 53 సస్పెన్స్ థ్రిల్లర్లు తీస్తూ పోవడం వల్లే కళలో ఆయన్ని నిష్ణాతుడిగా గుర్తించి మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ అని కీర్తించడం మొదలెట్టారు. ఇంకే దర్శకుడికీ ఈ బ్రాండింగ్ ఏర్పడలేదు. అటు సాహిత్యంలో చూస్తే అప్పట్లో సర్ అర్ధర్ కానన్ డాయల్,  అగథా క్రిస్టీ, ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్, జేమ్స్ హేడ్లీ ఛేజ్ మొదలైన ప్రఖ్యాత రచయితలు వారు క్రైమ్- సస్పెన్స్ థ్రిల్లర్ నవలలు రాసే మాస్టర్స్ ఆఫ్ క్రైమ్ -సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్పించుకున్నారు. ఇంకో జానర్ లో కూడా వేలు పెట్టి వుంటే ఈ గుర్తింపు వచ్చేది కాదు. అయితే హిచ్ కాక్ వరసగా సస్పెన్స్ థ్రిల్లర్లే తీసినా దేనికది ప్రత్యేకంగా వుండేలా చూస్తాడు. ఒకే మూసలో చుట్టేయకుండా, ఏ కథకా ట్రీట్ మెంట్ నీ, టెక్నిక్ నీ, టెక్నాలజీని కొత్తగా మధించి మన కందిస్తాడు.
       
అందుకే 45 మంది దర్శకులు విశ్లేషించిన సినిమాల్లో ఏ సినిమాని హిచ్ కాక్ ఏ ట్రీట్ మెంట్ తో
, టెక్నిక్ తో, టెక్నాలజీతో ప్రత్యేకం చేశాడో చెప్పారు. కథా కథనాలు, పాత్రచిత్రణలూ వివరిస్తూనే, మేకింగ్ లో హిచ్ కాక్ తీసుకున్న నిర్ణయాల్ని వివరించారు. ఉదాహరణకి-సింగీతం శ్రీనివాసరావు అమావాస్య చంద్రుడు’,‘మయూరి’, పుష్పక విమానం’, అపూర్వ సహోదరులు’,  ఆదిత్య 369’, మేడమ్ వంటి ప్రయోగాత్మకాలు కూడా తీసి హిట్ చేశారు. ఈ ప్రయోగాలు చేసే తత్వం తనకి హిచ్ కాక్ తత్వం నుంచే అబ్బిందని, హిచ్ కాక్ రియర్ విండో ని విశ్లేషిస్తూ పేర్కొన్నారు.
       
ఈ సినిమాలో హిచ్ కాక్ ఒక సన్నివేశానికిచ్చిన బ్యూటీఫుల్ ట్రీట్ మెంట్ ని వివరిస్తూనే
, ఒక అపార్ట్ మెంట్ లో జరుగుతున్న సంఘటనలని హీరో తన అపార్ట్ మెంట్లోంచి బైనాక్యులర్ తో చూస్తూ తెలుసుకునే విషయాలే ప్రేక్షకులకి తెలియాలి తప్ప, కెమెరా ఆ ఎదుటి అపార్ట్ మెంట్లోకి వెళ్ళి వేరే చూపించకూడదన్న శిల్పానికి ఎలా కట్టుబడ్డాడన్నది వివరంగా చెప్పారు. కథ హీరో చూసే బైనాక్యులర్ నుంచి మాత్రమే ప్రేక్షకులకి తెలియాలన్న ఛాలెంజీని స్వీకరించడం హిచ్ కాక్ మెథడ్ అన్నారు. హిచ్ కాక్ తీసిన ఇంకా చాలా అనితర సాధ్యమైన షాట్ల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ విలువైన వ్యాసం పూర్తిగా చదవాల్సిందే.
       
దర్శకుడు వంశీ
సైకో తీసుకుని కథ చెప్పారు. చివర్లో ఈ కథ సినిమాగా తయారవడానికి తెరవెనుక జరిగిన ఆసక్తికర కథ చెప్పారు. రేలంగి నరసింహారావు మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ చిన్న కథా వస్తువు తీసుకుని బాగా స్క్రీన్ ప్లే చేసి, మంచి డైలాగ్స్ తో, మంచి ఫోటోగ్రఫీతో హిచ్ కాక్ తెరకెక్కించారని చెప్పారు. ముఖ్యంగా మొదటిరెండు సీన్లు చిత్రించిన విధానం గురించి, తర్వాత హీరో పట్ల  హీరోయిన్ ప్రదర్శించే రెండు షేడ్స్ గురించి తెలిపారు. పూరీ జగన్నాథ్ వచ్చేసి టు క్యాచ్ ఏ థీఫ్ సినిమా విశేషాలు చెప్పారు. 1955 లో ఎలాటి డ్రోన్ గానీ, నేటి సదుపాయాలు గానీ లేని కాలంలో హిచ్ కాక్ ఛేజింగ్ దృశ్యాల తీయడం, తక్కువ లైటింగ్ తో గొప్ప విజువల్ లగ్జరీ ప్రదర్శించడం గొప్పగా వున్నాయన్నారు. నిజానికి నాడు హిచ్ కాక్ చేసిన టెక్నికల్, టెక్నాలాజికల్ ప్రయోగాలు నేటి సినిమాలకి బడ్జెట్ ఆదా చేసే మార్గాలే. కానీ ఎంత మంది పాటిస్తారు.
       
హరీష్ శంకర్
డయల్ ఎమ్ ఫర్ మర్డర్ గురించి రాస్తూ, ఇందులో కథ చెబుతూ హిచ్ కాక్ అంచెలంచెలుగా సస్పెన్స్ ని రివీల్ చేస్తూ వెళ్ళిన విధానాన్ని హైలైట్ చేశారు. ఇంద్రగంటి మోహన కృష్ణ వెర్టిగో ని విశ్లేషించారు.  ఇందులో ప్రధానాకర్షణగా వున్న ఎడిటింగ్ గురించి వివరించారు. మన విమర్శకులు సినిమాల్లో ల్యాగ్ వుందనీ, స్లోగా వుందనీ చెబుతారనీ చెబుతూ, వీళ్ళలో చాలా మందికి గతికీ, వేగానికీ తేడా తెలియదని చురక వేశారు. వెర్టిగో లో హిచ్ కాక్  గతి (pace) ని ఎంత బాగా మేనేజ్ చేశాడో చెప్పుకొస్తూ, అతి వేగం ఎక్కడా వుండదనీ, అలాగని నెమ్మదిగా వుండదనీ, కెమెరా గానీ, ఎడిటింగ్ గానీ అస్సలు కంగారు పడవనీ, గతి గురించి అర్ధమయ్యేట్టు చెప్పారు. ఇక ఎంఎల్ నరసింహం హిచ్ కాక్ మూకీల కాలంలో 1925- 1929 మధ్య తీసిన 9 మూకీ సినిమాలని నవరత్నాలుగా పేర్కొంటూ జనరల్ నాలెడ్జిగా   అందించారు.

       
ఇంకా శివనాగేశ్వరరావు
, చంద్ర సిద్ధార్థ, వి ఎన్ ఆదిత్య, మెహర్ రమేష్, వర ముళ్ళపూడి, వీర శంకర్. జనార్ధన మహర్షి, దేవీ ప్రసాద్, సాగర్ చంద్ర మొదలైన దర్శకులు హిచ్ కాక్  సినిమాల్లో తాము గమనించిన విశేషాల్ని రికార్డు చేశారు. ఇవన్నీ ఉపయోగపడేవే. ప్రతి ఒక్కరూ సినిమాల గురించి ఏకరువు పెడుతూ, వాటి తెర వెనుక విశేషాలు కూడా అందించారు. దీంతో పుస్తకానికి ఒక సమగ్రత వచ్చింది. ఈ తెర వెనుక విశేషాలు చాలా ఆసక్తికరంగా వుంటాయి.
       
రచయితలు  సత్యానంద్
, గోపీ మోహన్, దశరధ్, వి ఐ ఆనంద్ తదితరులు హిచ్ కాక్ సినిమాల్లో భయం, మనస్తత్వాలు, భావోద్వేగ తీవ్రత, సంగీతం, వస్త్రాలంకరణ, సాంకేతిక అంశాలు, రైటింగ్, మేకింగ్, అప్ గ్రేడింగ్ ల గురించి వివరంగా చర్చించారు. జర్నలిస్టు ప్రభు హిచ్ కాక్ ఇచ్చిన ఇంటర్వ్యూల భాగాల్ని ఒక చోట కూర్చారు. ఇంకా జలపతి, వడ్డి ఓం ప్రకాష్, చల్లా భాగ్యలక్ష్మి, జోస్యుల సూర్య ప్రకాష్ వంటి ప్రముఖ  జర్నలిస్టులు  హిచ్ కాక్ కి సంబంధించి ఇతర అంశాలపై దృష్టి సారించారు.  పోతే, ఈ పుస్తకానికి మల్లాది వెంకట కృష్ణ మూర్తి రాసిన ముందు మాట ఆయన శైలిలో ఒక నాస్టాల్జియా! 
       
ప్రతి వొక్కరూ చదవాల్సిన పుస్తకం.  ఓటీటీల్లో విభిన్న సినిమాలు చూస్తున్న ప్రేక్షకులు వాటిని థీమాటికల్ గా అర్ధం జేసుకోవాలంటే
, హిచ్ కాక్ ఆవిష్కరించిన సినిమా కళనీ తెలుసుకోవాల్సిందే. హిచ్ కాక్ తెలిస్తే అన్నీ తెలిసినట్టే. ఈ పుస్తకం మొదటి ముద్రణ  అమ్ముడైపోయి రెండో ముద్రణకి సిద్ధమైంది. వెంటనే మీ కాపీలు బుక్ చేసుకోండి.

—సికిందర్
మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్ కాక్
పేజీలు : 528, వెల : రు. 650/-
లభించు చోట్లు :
అక్షౌహిణి మీడియా, హైదరాబాద్    
889 779 8080
నవోదయ బుక్ హౌజ్, హైదరాబాద్
9000 413413
సాహితి ప్రచురణలు, విజయవాడ
81210 98500
అమెజాన్ లో కూడా అందుబాటులో వుంది. 
ఈ క్రింది లింకు ద్వారా పొందవచ్చు: 

Sunday, January 12, 2025

1327 : రివ్యూ!



 దర్శకత్వం : ఎస్. శంకర్ 

తారాగణం :  రామ్ చరణ్కియారా అద్వానీ, అంజలి, ఎస్ జె సూర్య, జైరాం, శ్రీకాంత్, సముద్రకని, బ్రహ్మానందం, సునీల్, రాజీవ్ కనకాల తదితరులు
కథ : కార్తీక్ సుబ్బరాజ్, స్క్రీన్ ప్లే : వివేక్ వేల్మురుగమ్, మాటలు : సాయినాథ్ బుర్రా తమన్ ఎస్, ఛాయాగ్రహణం : తిరు, కూర్పు : షమీర్ మహమ్మద్ రూబెన్
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వరా క్రియెషన్స్, నిర్మాత : దిల్ రాజు
విడుదల : జనవరి 10, 2025



***
        నిర్మాత దిల్ రాజు, రామ్ చరణ్, శంకర్ ముగ్గురూ కలిసి ఈ సంక్రాంతి వినోదంగా గేమ్ ఛేంజర్ అందించారు. కొన్నేళ్ళుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పానిండియా మూవీ ఇది. అటు ఇండియన్ 2’, ఇటు గేమ్ ఛేంజర్ పానిండియా బిగ్ బడ్జెట్లు రెండిటినీ ఏకకాలంలో భుజానేసుకుని శంకర్ పడ్డ శ్రమ ఫలితంగా మొదటిది పరాజయంపాలవగా, ఈ రెండోది పండక్కి బాక్సాఫీసు పరీక్షకి నిలబడింది. శంకర్ తీసిన మొదటి తెలుగు సినిమా అని ప్రచారం జరిగి, శంకర్ గతంలో అందించిన తెలుగు డబ్బింగులకి అఖండ విజయాలు సమకూర్చి పెట్టిన తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకుంటూ, ఎలాటి తెలుగు ఒరిజినల్ అందించాడన్నది ఈ కింద చూద్దాం... 

కథ 

రామ్ నందన్ (రామ్ చరణ్) కొత్తగా వైజాగ్ కలెక్టర్ గా అపాయింటై అవినీతి పరుల అంతు చూస్తూంటాడు. ఈ క్రమంలో రాజకీయ వ్యవస్థని ఢీ కొంటాడు. ముఖ్య మంత్రి సత్యమూర్తి (శ్రీకాంత్) చిన్న కొడుకు మోపిదేవి (ఎస్ జె సూర్య) చేస్తున్న అక్రమాల్ని ఎదుర్కొంటూ వుంటాడు. మోపిదేవి పోషిస్తున్న ఇసుక మాఫియాని పట్టుకోవడం, రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం, నిబంధనలు పాటించని మాల్స్ ని కూల్చేయడం వగైరా రామ్ నందన్ ప్రక్షాళనా కార్యక్రమంలో వుంటాయి. తను సీఎం కావాలనే కోరికతో వున్న మోపిదేవి కిదంతా ఇబ్బందిగా వుంటుంది. రామ్ నందన్ తో సంఘర్షించడం మొదలెడతాడు.  
       
మొదట రామ్ నందన్ ఐపీఎస్ కావాలనుకున్నాడు. అయితే కాలేజీలో అతడి కోపాన్నీ
, దాంతో అతను సృష్టిస్తున్న అశాంతినీ గమనించి దీపిక (కియారా అద్వానీ), ఇంత కోపంతో ఐపీఎస్ అయితే ఇంకేం చేస్తాడోనని భయపడి, అతను ఐఏఎస్ అయితేనే ప్రేమిస్తానని చెప్పేస్తుంది. రామ్ నందన్ కోపాన్ని తగ్గించుకుని, ఐఏఎస్ పూర్తి చేసి  ఇలా కలెక్టర్ గా వచ్చాడు. ఆమె డాక్టర్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రామ్ నందన్  మోపిదేవి మనుషుల్ని మాస్ అరెస్టులు చేయడంతో గొడవ ముదురుతుంది. ఒక సభలో సీఎం సత్యమూర్తి ప్రసంగిస్తూండగా మోపిదేవి, రామ్ నందన్ లు ఘర్షణ పడతారు. ఇద్దరి మీదా చర్యలు తీసుకుంటాడు సత్యమూర్తి, ఆ తర్వాత చనిపోతూ తన వారసుడిగా రామ్ నందన్ ని ప్రకటిస్తాడు.
       
ఇప్పుడు రామ్ నందన్ సీఎం అవకుండా మోపిదేవి ఎలా అడ్డుకున్నాడు
, రామ్ నందన్ అతన్నెలా ఎదుర్కొన్నాడూ అన్నది మిగతా కథ.

ఎలా వుంది కథ 

శంకర్ ఇలా తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకుంటాడనుకోలేదు. కసి తీర్చుకోవడమే ఇది. తెలుగోళ్ళ లెవలింతే అన్నట్టు వుంది వరస. అసలు పానిండియాకి ఇలాటి కథ గేమ్ ఛేంజర్ అవుతుందని ఎలా అనుకున్నాడో తెలియదు. గేమ్ ఛేంజర్ అవ్వాలంటే ఒక కొత్త ట్రెండ్ ని సృష్టించ గలగాలి. ఆ ట్రెండ్లో మరిన్ని అలాటి సినిమాలు వస్తూండాలి. రాజకీయ సినిమాలకి సంబంధించి 1989 లో కోడి రామకృష్ణ  తీసిన అంకుశం అలా గేమ్ ఛేంజర్ అయింది, ట్రెండ్ సెట్టర్ అయింది. ఆ తర్వాత 1991 లో ఆయనే తీసిన భారత్ బంద్ కూడా గేమ్ ఛేంజరే, ట్రెండ్ సెట్టరే. ఈ రెండిటినీ జనం విరగబడి చూశారు. ఈ రెండు సినిమాలతోనే సీఎం ని వెన్నుపోటు పొడిచి దింపే కథలు మొదలయ్యాయి. కోడి రామకృష్ణకి ఇన్స్ పిరేషన్ అప్పట్లో సీఎం గా వున్న ఎన్టీ రామారావుని గద్దె దింపి సీఎం అయిన నాదెండ్ల భాస్కరరావు ఉదంతమే. ఇలా రాజకీయ స్పృహతో తీసి ప్రేక్షకుల్ని వెర్రెత్తించారు.
       
కానీ కొత్త కొత్త రాజకీయ రంగుల్ని స్మార్ట్ ఫోన్లలో చూస్తూ తిరుగుతున్న నేటి జనాలకి
, ఏ రాజకీయ స్పృహ లేకుండా పురాతన, అరిగిపోయిన అదే పాత మూస ఫార్ములాని తీసి, గేమ్ ఛేంజర్ అనుకోవడానికి శంకర్ కెలా ధైర్యం వచ్చిందో...ఈ కథ ఇచ్చిన కార్తీక్ సుబ్బరాజ్ ఎంత ధైర్యాన్ని నూరిపోశాడో. ఆ ధైర్యం అలా అలా దిల్ రాజు, రామ్ చరణ్ ల వరకూ ప్రాకిపోయింది. పానిండియాప్రాణాల మీదికొచ్చింది. 
       
స్ట్రిక్టు ఐఏఎస్ అధికారులు- స్వార్ధ రాజకీయనాయకులు ఈ ఇద్దరి మధ్య సంఘర్షణ ఎప్పుడూ వుండేదే. అయితే కొత్తగా ఈ రంగంలో ఏం జరుగుతోందీ చూపించగలిగితే అది రాజకీయ స్పృహతో కూడిన కొత్త కథవుతుంది. నార్త్ లో ఒక స్ట్రిక్టు ఐఏఎస్ ఆఫీసర్ 50 సార్లు ట్రాన్స్ ఫర్ అయ్యాడంటే ఇందులో ఎంత కథ వుందో తెలిసిపోతోంది. నార్త్ లోనే ఇంకో ఐఏఎస్ 29 సార్లు బదిలీ అయ్యాడు. సింపుల్ గా ఇలాటి ట్రాన్స్ ఫర్ల బాధితుడైన ఐఏఎస్ హీరో
, చూసి చూసి ఆ రాజకీయనాయకులందరి రాజకీయ జీవితమే లేకుండా చేసే ప్రణాళికని ఎన్నికల ఆధారంగా రచించి ఫినిష్ చేస్తే అదొక సమకాలీన మెసేజ్ లా వెళ్తుంది. సినిమా పరంగా ఎంతో కొంత గేమ్ ఛేంజర్ అన్పించుకునే అవకాశముంటుంది. కానీ ఛేంజోవర్ లేకుండా అదే పాత మూసగా సీఎం పదవి కోసం  ఇద్దరూ పోరాడుకునే కథ చేస్తే  ఎవరిక్కావాలి? ఇకనైనా సినిమా కథలు పాత సినిమాల్లోంచి దిగి వచ్చి, చుట్టూ లోకంలో జరుగుతున్నవాటిలో స్నానించి కొత్తబట్ట కట్టకపోతే ఇంతే సంగతులు. 

2. కలెక్టరా
, సీబీఐ ఆఫీసరా?
        కానీ ఐఏఎస్ రామ్ నందన్ ఇలా చేయలేదు. చూసి చూసి వున్న పాత రొటీన్ మూస ఫార్ములా టెంప్లెట్ పాత్రగానే కొనసాగాడు. సినిమా ప్రారంభమే కలెక్టర్ గా జాయినవడానికి వస్తూ కాలేజీలో తన క్లాస్ మేట్స్ గ్యాంగుతో ఫైట్ చేసి, ఓ పాటేసుకుని వచ్చి జాయినవుతాడు. రావడం రావడం అవినీతి పరులమీద పోరాటం ప్రకటిస్తాడు. కొత్తగా తొలి పోస్టింగుగా జాయినయ్యే ఏ కలెక్టరూ ఇలా చేయడు. ముందు తానొక జిల్లా కలెక్టరుగా ప్రజా జీవితాన్నీ, ప్రభుత్వ అభివృద్ది పథకాలనీ సమీక్షించకుండా, ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని తీర్చకుండా కలెక్టరుగా రావడం రావడం, ఎప్పుడు చూసినా పదే పదే అవినీతి పరుల్ని పిలిచి అవే దర్బార్లు నిర్వహించడం, వాళ్ళతో బాహాబాహీకి దిగి అరెస్టులు చేయడం వంటివి పాత్ర చిత్రణని చీలికలు పేలికలు చేసేసింది. ఎలా వున్నాడంటే అవినీతి కేసుల్ని విచారించడానికొచ్చిన సీబీఐ అధికారిలా వున్నాడు. 
       
ఫస్టాఫ్ ఈ బిగినింగ్ విభాగంలో అతడి పాత్ర పరిచయం సమగ్రంగా చేయకుండా
, ప్రజలతో అతడి మానవీయ కోణం ఎస్టాబ్లిష్ చేయకుండా, ఏకోన్ముఖంగా విద్రోహులతో కొట్లాటలే పెట్టడం వల్ల- పూర్తిగా ఫస్టాఫ్ విషయపరంగా భావోద్వేగాల్లేని డొల్ల కథనంగా తయారయ్యింది. తాను ప్రేమిస్తున్న దీపికాకి కోపాన్ని తగ్గించుకుని ఐఏఎస్ గా తిరిగి వస్తానని చెప్పినవాడు- తిరిగి వచ్చి అదే కోపంతో దాడులు మొదలెట్టాడంటే ఎలాటి పాత్ర చిత్రణ అనుకోవాలి. 
       
మోపి దేవి అనేవాడు సీఎం రెండో కొడుకు. సీఎం కొడుకు చేస్తున్న అక్రమాల్ని సీఎం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం కూడా చెయ్యడు కలెక్టర్ రామ్ నందన్. ఈ కథని రెగ్యులర్ రాజకీయ సినిమాగా పూర్వంలా తీసే వీలు ఇప్పుడుందా
? తెలంగాణా విడిపోయాక ఆంధ్రప్రదేశ్ తక్షణ అవసరాలేమిటి? కనీసం రాజధానిని సవ్యంగా నిర్మించుకునే రాష్ట్రభక్తి కూడా లేకుండా, దోపిడీలు సాగించే దుర్బుద్ధి ఏమిటని పోరాడితే  ఒక ఎమోషనల్ పాయింటైనా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఏ ఎమోషనూ లేకుండా రాజకీయ సినిమా ఎలా తీస్తారు. తెలుగు సినిమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దాని ఖర్మానికి వదిలేసినట్టుంది. తెలుగులో ఈ కథ తీస్తున్నప్పుడు తెలుగు సంస్కృతిని దృష్టిలో పెట్టుకున్నామని చెప్పాడు శంకర్. సంస్కృతి ఒకటే సరిపోతుందా?
       
ఇలా ఫస్టాఫ్ గంటా 20 నిమిషాలూ బిగినింగే ముగియకుండా
, ఇంటర్వెల్ వరకూ సాగదీస్తూ సాగదీస్తూ కలెక్టర్ -మోపిదేవిల సంఘర్షణలే చూపిస్తూ పోవడంతో, విషయం లేని వ్యవహారంగా, బడ్జెట్ వృధాగా తయారయ్యింది మేకింగ్. చివరికి ఇంటర్వెల్లో సీఎం చనిపోతూ వారసుడిగా రామ్ నందన్ ని ప్రకటించడంతో –ఇక సీఎం పదవి కోసం రామ్ నందన్, మోపిదేవిల పోరాటం మొదలవుతుందనే అర్ధంలో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇదే ఇంతాలస్యంగా వచ్చిన ప్లాట్ పాయింట్ వన్! 

3. ఫ్లాష్ బ్యాక్ అందచందాలు
        సెకండాఫ్ ప్రారంభంలో రామ్ నందన్ తండ్రి అప్పన్న ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. అప్పన్న స్నేహితుడు (సముద్ర కని)  రామ్ నందన్ చిన్నప్పుడు అతడికి తెలియకుండా జరిగిన విషయంతో ఈ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. అప్పన్న (రామ్ చరణ్) భార్య పార్వతి (అంజలి) తో, కొడుకు రామ్ నందన్ తో పల్లెటూర్లో జీవిస్తూంటాడు. మైనింగ్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం మొదలెట్టి రాజకీయ పార్టీ పెడతాడు. అయితే అప్పన్నకి నత్తి కారణంగా ఎన్నికల సభలు జరపలేడని, తన ప్రతినిధిగా సత్యమూర్తి (శ్రీకాంత్ ) ని నియమిస్తే, ఆ సత్యమూర్తి అప్పన్నని చంపి ఎన్నికలు గెలిచి తాను సీఎం అయిపోతాడు. ఇదంతా రామ్ నందన్ కి చిన్నప్పుడు తెలియదు. ఇప్పుడు తండ్రి మిత్రుడు చెప్తూంటే కళ్ళు తెరుస్తాడు. తెరిచి ఏం చేస్తాడు? ఏమీ చేయడు. చేసే అవకాశాన్ని దర్శకుడు లాగేశాడు. 
       
ఇక్కడ దర్శకుడు చాలా గజిబిజి చేశాడు. అసలు ఇంటర్వెల్లో సీఎం సత్యమూర్తి హాస్పిటల్లో చనిపోలేదు
, పదవి కోసం కొడుకు మోపిదేవియే చంపేశాడు. చనిపోతూ సత్యమూర్తి తన వారసుడిగా రామ్ నందన్ ని ప్రకటించి మోపిదేవికి దెబ్బ కొట్టాడు. ఇప్పుడు అప్పన్న ఫ్లాష్ బ్యాక్ పూర్వ రంగంలో ఈ ఇంటర్వెల్ దృశ్యాన్ని చూస్తే, తను అప్పన్నని చంపి సీఎం అయినందుకు ప్రాయశ్చిత్తంగా రామ్ నందన్ ని ఆ సీఎం పదవిని అప్పజెప్పినట్టు అన్పిస్తుంది. కానీ ఈ ప్రాయశ్చిత్తం ఎప్పుడు కలిగింది? కొడుకు తన ప్రాణాలు తీస్తేనా? తీయకపోతే రామ్ నందన్ ని వారసుడిగా ప్రకటించే వాడా? కాబట్టి కొడుకు మీద కక్షతోనే తప్ప, తాను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంతో కాదని తెలిసిపోవడం లేదూ?
       
రెండోది
, రామ్ నందన్ కి తన తండ్రి మరణానికి కారకుడు సీఎం  సత్యమూర్తి అని అతను చనిపోయిన తర్వాత గానీ తెలియక పోవడం పాత్ర చిత్రణ పరంగా ఎంత తెలివి తక్కువ తనం? ఈ విషయం తెలియకుండా సత్యమూర్తికి రామ్ నందన్ తనే తల కొరివి పెట్టడం ఎంత ఫూలిష్ కథనం? తండ్రి ఫ్లాష్ బ్యాక్ తెలుసుకున్నాక, తండ్రి హంతకుడికి తాను తలకొరివి పెట్టాడని తెలుసుకుని కూడా కిమ్మనకుండా వుంటాడు. 
       
మూడోది
, తండ్రి హత్యకి ప్రతీకారం తీసుకోవాల్సిన వాడు హీరో వుండగా, ఇంకెవరో (ఇక్కడ మోపిదేవి) ఆ హంతకుణ్ణి చంపేసి పోతే హీరోగారి కథ ఏమైపోవాలి? నాల్గోది, అసలు తన తండ్రి హంతకుడ్ని(సీఎం సత్యమూర్తి) ఇంటర్వెల్లో అతడి కొడుకు మోపిదేవియే చంపాడని రామ్ నందన్ కి ఎక్కడా తెలియకుండానే ఈ సెకండాఫ్ కథ కూడా ముగిసి పోతుంది! పాపం పూర్ పాసివ్ రామ్ నందన్... 
       
దీంతో అయిపోలేదు. తన భర్త అప్పన్నని సీఎం సత్యమూర్తియే చంపాడని భార్య పార్వతికి కూడా తెలీదు. తెలిస్తే కొడుకు రామ్ నందన్ ని సత్యమూర్తిని శిక్షించడానికి ప్రేరేపించేది. పాపం అమాయకురాలు ఇంటర్వెల్ సీన్లో సీఎం సత్యమూర్తి సభలో ప్రసంగిస్తూంటే వచ్చేసి
, పాలలో కల్తీ జరుగుతున్న విషయం లేవనెత్తి పోరాట వనితగా నిలుస్తుంది. ఈ పోరాటం కాదమ్మా, అసలు నీ భర్తని చంపిన వాడు ఈ సత్యమూర్తియే, ఇందుకు నువ్వు బరిసె సత్యమూర్తిని  తీసుకుని ఒక్క పోటు  పొడవాలని ఎవరు చెప్పాలి? దర్శకుడు చెప్పలేడు. ఎందుకంటే దర్శకుడికి తన కథ తనకే అర్ధంగానంత కన్ఫ్యూజింగ్ గా వుంది. 
       
దీంతో కూడా అయిపోలేదు- రామ్ నందన్ తండ్రి ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాక
, నిజాలు తెలుసుకున్నాక, సత్య మూర్తి ప్రకటన ప్రకారం సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతాడు!! ఇంతకంటే పాత్రని కిల్ చేయడం వుండదు. తండ్రిని చంపిన వాడు సీఎం పదవిని తనకి దానంగా ఇవ్వడమేమిటని- ఆ సత్యమూర్తి కొంపా గోడూ ధ్వంసం చేసి, అతడి ఇద్దరు కొడుకుల్ని ఖతం చేసి కథ ముగించకుండా - ఆ సీఎం గద్దె నెక్కి కూర్చోవాలనుకోవడమేమిటి? పోనీ తండ్రి చనిపోతూ, ఎప్పటికైనా నా కొడుకు సీఎం అయి నీ సంగతి చూస్తాడని సత్యమూర్తికి  ఛాలెంజి విసిరాడా, తను ఆ గద్దె నెక్కి కూర్చోడానికి?
       
దీనికి మోపిదేవి అడ్డుపడి తనే సీఎం అవుతాడు. వెంటనే రామ్ నందన్ ఎన్నికల అధికారిగా అవతారమెత్తి అసెంబ్లీకి ఎన్నికలు ప్రకటించేస్తాడు! ఇదేమంటే
, తనకి ఈ అధికారముందంటాడు. మోపిదేవి ఎమ్మెల్యే కాకుండా సీఎం అయితే ఆరు నెలల్లోగా ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికవాల్సుంటుంది. అప్పుడు ఆరునెలల్లోగా ఎప్పుడు ఉప ఎన్నిక జరపాలన్నది కేంద్ర ఎన్నికల కమిషన్ ఇష్టం. ఈ నిర్ణయం తీసుకోవాల్సింది ఢిల్లీ లోని చీఫ్ ఎలక్షన్ కమిషనర్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా అసెంబ్లీనే రద్ధు చేసి మొత్తం రాష్ట్రమంతటా మధ్యంతర ఎన్నికలు ప్రకటించలేడు. మోపిదేవి అప్పటికే మంత్రి కాబట్టి ఉప ఎన్నిక కూడా అవసరం లేదు. కానీ రామ్ నందన్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా మాత్రమే వచ్చేసి అసెంబ్లీకి ఎన్నికలు ప్రకటించేస్తాడు!
        
ఈ స్క్రిప్టులో చట్టాలు కూడా ఇష్టమొచ్చినట్టు రాసుకున్నారు. ఇక ఇక్కడ్నుంచి మొదలవుతుంది సెకండాఫ్ చివరి వరకూ ఎన్నికల రభస. అసలు ఎన్నికల రభసే ప్రధానంగా చేసి చూపించిన సినిమాలేవీ హిట్ కాలేదు. సుమారు గంట సేపు సాగే ఈ రభస చివరికి రామ్ నందన్ సీఎం అవడంతో ముగిసి శుభం పడుతుంది. ఇంతకంటే సెకండాఫ్ లో ఇంకేం లేదు. మధ్యలో రామ్ నందన్ తల్లితో ఒక లాజిక్ లేని ట్రాజడీ వుంటుంది. ఈ మొత్తం కథకి వుండాల్సిన భావోద్వేగాలనే ప్రధాన ఎలిమెంట్ లేకుండానే రోడ్డు రోలర్ తో చదును చేసినట్టు ఫ్లాట్ గా సాగిపోతుంది కథనం. 

నటనలు- సాంకేతికాలు
 రామ్ చరణ్ విభిన్న పాత్రలు పోషించిన పానిండియా ప్రొడక్టు ఇది. కాలేజీ స్టూడెంట్ గా, కలెక్టర్ గా, ఎన్నికల అధికారిగా, సీఎం గా, తండ్రిగా అన్నీ తానై తన టాలెంట్ ని నిరూపించుకోవాలని ప్రయత్నం చేశాడు. ఒక క్యారక్టర్ మీద కథ నిలబడక పోవడంతో – ఎపిసోడ్లు గా కథ కూడా మారిపోయింది. ఒక క్యారక్టర్ తో ఒక ఎపిసోడ్, ఇంకో క్యారక్టర్ తో ఇంకో ఎపిసోడ్ ... ఇలా క్యారక్టర్ వారీ ఎపిసోడ్లుగా కథ మారిపోవడంతో డాక్యుమెంటరీలా తయారయ్యింది. నటించడం సిన్సియర్ గానే నటించాడు, కానీ పాత్రలో భావోద్వేగాలు, బలం, సరైన కథా లేకపోవడంతో తన కష్టమంతా వృధా అయింది. పాటల్లో రక్తి కట్టించాడు. అది వేరే విషయం. హీరోయిన్ తో రోమాన్స్ ఫస్టాఫ్ లో కాసేపే, సెకండాఫ్ లో హీరోయిన్ తో ఒక సీను, ఒక సాంగ్ అంతే. ఇక యాక్షన్ సీన్లు ఫస్టాఫ్ లో అడపాదడపా వచ్చినా, సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ వల్ల, ఎన్నికల రభస వల్లా  చాలా సేపు మర్చిపోయినట్టున్నాడు దర్శకుడు. 
       
హీరోయిన్ కియారా అద్వానీ డాక్టర్ పాత్ర. డాక్టర్ గా చేసేదేమీ వుండదు. రామ్ చరణ్ తో సాంగ్స్ కోసం వచ్చిపోతూంటుంది. అంజలి సీరియస్ పాత్ర బాగానే  నటించింది గానీ పాత్ర చిత్రణ సహకరించలేదు. విలన్ గా ఎస్ జే సూర్యది నాటు పాత్ర
, ఘాటు నటన. ఇక శ్రీకాంత్, సముద్ర కని, రాజీవ్ కనకాల తదితరులు, కమెడియన్ సునీల్ ప్యాడింగ్ కోసమన్నట్టు వున్నారు.  
       
తమన్ పాటలు ఏమోగానీ
, శంకర్ మాత్రం వాటి చిత్రీకరణ ఆర్భాటంగా చేశాడు. సాంకేతికంగా ఎంత హంగామా చేయాలో అంతా చేశాడు. సాయినాధ్ బుర్రా మాటలు యావరేజి. దిల్ రాజు ప్రొడక్షన్ విలువలు అమోఘం. సినిమాలో విషయం మాత్రం అన్యాయం. 

చివరి కేమిటి
       సమస్య ఎక్కడొచ్చిందంటే రామ్ చరణ్ కలెక్టర్ గా వచ్చినప్పుడు పాత్రకి సర్కిల్ ఆఫ్ బీయింగ్ లేదు. దీంతో పాత్ర, కథ ఏమాత్రం ఆసక్తి కల్గించక, ఫ్లాట్ గా మారింది. ఇదే అంకుశం లో రాజశేఖర్ పోలీసు పాత్రకి తనని కని కుప్ప తొట్లో పారేసిన గతం తాలూకు మానసిక గాయంతో బలమైన సర్కిల్ ఆఫ్ బీయింగ్ వుంటుంది. దీంతో ఆ పాత్ర బలంగా మనసుల్లో నాటుకుపోయింది. రామ్ చరణ్ కి ఎప్పుడో సెకండాఫ్ లోతండ్రి తాలూకు ఫ్లాష్ బ్యాక్ వున్నా ఆ ఫ్లాష్ బ్యాక్ నిరర్ధకం. ఆ ఫ్లాష్ బ్యాక్, తండ్రి పాత్ర లేక పోయినా వచ్చే నష్ట మేం లేదు. దాని బదులు ఫస్టాఫ్ లో స్టూడెంట్ గా హీరోయిన్ తో ఫ్లాష్ బ్యాక్ ఎత్తి పారేసి, రామ్ చరణ్ పాత్రకి వేరే బాధాకర సర్కిల్ ఆఫ్ బీయింగ్ ని క్రియేట్ చేసి వుండొచ్చు. ఇది లేకపోవడం వల్లే పాత్ర సమగ్ర పరిచయం లేదని చెప్పుకున్నాం పైన. 
        
రామ్ చరణ్ పాత్రకి ఫస్టాఫ్ లో ఒక్క సర్కిల్ ఆఫ్ బీయింగ్ ని క్రియేట్ చేసి వుంటే
, ఈ కథతో వున్న అన్ని సమస్యలూ తీరిపోయేవి- నేటి ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితిని ఎత్తి  చూపే కథగా కాకపోయినా, ఓ మాదిరి ఫర్వాలేదనిపించుకునే నిర్మాణ మన్పించుకునేది.

—సికిందర్


Wednesday, January 1, 2025

1326 : మూవీ నోట్స్


 

మానసిక సంఘర్షణతో కూడిన డ్రామాలు, మాసిక సంఘర్షణతో కూడిన థ్రిల్లర్లు  రెండూ వేర్వేరు జానర్లు. వీటిలో మొదటి దానిలా రెండోది తీస్తే బెడిసి కొడుతుంది. ఒక సమస్యతో తేల్చుకోలేని మానసిక సంఘర్షణగా మొదటిది వుంటే, ఒక సమస్యతో విపరీతంగా ప్రవర్తించడంగా రెండోది వుంటుంది. ఇదీ డ్రామాకీ, థ్రిల్లర్ కీ వున్న తేడా. దర్శకురాలు డాక్టర్ గోగినేని హరిత తీసుకున్నది థ్రిల్లర్ జానర్. అంటే సైకలాజికల్ థ్రిల్లర్. ప్రమాదకరమైన ష్కీజోప్రీనియా అనే మనో వ్యాధి గురించి థ్రిల్లర్. ఈ వ్యాధితో రోగి అఘాయిత్యాలకి పాల్పడొచ్చు. దీనికి చికిత్స లేదు. ఈ జానర్ సస్పెన్సునీ, థ్రిల్స్ నీ, హార్రర్ నీ డిమాండ్ చేస్తుంది. ఈ మూడూ లేకుండా, పోనీ ఒక డ్రామాగా మానసిక సంఘర్షణ కూడా లేకుండా, ‘ఫియర్అనే మూవీ తీస్తే ఇది ఏ కోవకి చెందుతుంది? ఏ కోవకీ చెందని  వ్యర్ధ ప్రయత్నంగా తేలుతుంది. 
     
థ చూస్తే- సింధూ, ఇందూ (రెండు పాత్రలూ వేదిక పోషించింది) అనే కవల పిల్లలు. బాల్యంలో అనుభవమైన ఓ రెండు సంఘటనల కారణంగా సింధూలో ఓ మానసిక రుగ్మత పెరిగిపోతుంది. ఆ రుగ్మత కారణంగా భయభ్రాంతులకి లోనవుతూ వుంటుంది. ఎప్పుడూ ఓ అపరిచిత వ్యక్తి తనని వెంటాడుతున్నట్టు భ్రమిస్తూంటుంది. చిన్నప్పుడు  స్కూల్‌లో సంపత్ (అరవింద్ కృష్ణ) అనే తోటి విద్యార్థికి  క్లోజ్ అవుతుంది. ఇది సింధూ సోదరి ఇందూకి నచ్చదు. అతడికి దూరంగా వుంచాలని ప్రయత్నిస్తూంటుంది. ఇక సంపత్ కనపడకుండా పోయాడని తీవ్ర మానసిక రుగ్మతకి లోనవడంతో మానసిక చికిత్సాలయంలో చేర్పిస్తారు తల్లిదండ్రులు. ఆ మనోవ్యాధిని ష్కీజోప్రీనియాగా నిర్ధారిస్తాడు సైకియాట్రిస్టు (అనీష్ కురువిల్లా). అప్పట్నించీ 13 ఏళ్ళూ ఆమె ఆ చికిత్సాలయంలోనే వుండి పోతుంది. ఇదీ కథ. 
       
ఈ కథలో చిన్నప్పటి ఆ రెండు అనుభవాలేమిటంటే
, అన్నం తినకపోతే ఆమె తల్లి బూచాడు వస్తాడని భయపెడుతుంది. ఆ బూచాడి భయం ఆమెకి దెయ్యంలా పట్టుకుంటుంది. రెండో అనుభవం, సంపత్ గురించి సోదరితో తలెత్తిన టెన్షన్ కారణంగా కోపం వచ్చి ఆమెని నెట్టేస్తే కిందపడి గాయపడింది. దాంతో భయపడిపోయింది. ఈ భయం కూడా కలిసి ఆమె ష్కీజోప్రీనిక్ గా మారిందన్న మాట!
       
బూచాడొస్తాడని భయపెడితే జీవితాంతం ఆ భయంతో బ్రతకడం మనమెక్కడా చూడం.
షోలేలో గబ్బర్ సింగ్ తన గురించి ఇలా చెప్పుకుంటాడు- పిల్లలు నిద్రపోకపోతే తల్లులు నిద్రపో, లేకపోతే గబ్బర్ వస్తాడని భయపెడ్తారని. ఈ లెక్కన ఆ భయపడ్డ పిల్లలందరూ ష్కీజోప్రీనిక్కులవ్వాలి! చిన్నప్పుడు ఇలా భయపెట్టడం యుగాలుగా సాగుతోంది. ఇది ప్రమాదకరమైతే ఎప్పుడో ఆపేసే వాళ్ళు తల్లులనే జీవులు. 
       
తన వల్ల సోదరి గాయపడిన సంఘటన కూడా మనోవ్యాది పుట్టడానికి సరిపోని  కారణమే. ఇలాటి బలహీన కారణాలున్నప్పుడు సంఘర్షణ కూడా బలహీనంగానే వుంటుంది. ఆమె సంఘర్షణ తనని ఎవరో వెంటాడుతున్నాడనే. మరో వైపు సంపత్ కావాలని గొడవ చెయ్యడం. ఆ సంపత్ లేడు
, రాడు, అది నీ భ్రమ అంటూ వుంటాడు సైకియాట్రిస్టు. 
   
ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ కి  డైనమిక్ కథా ప్రపంచం వుండాలి. ఇదే ఇక్కడ మిస్సయ్యింది.  కథనంలో ఎక్కడా సస్పెన్స్, థ్రిల్, టెన్షన్, ఫియర్, పోనీ యాక్షన్ కూడా లేదు. కథ నేలబారుగా ఫ్లాట్ గా సాగుతూంటుంది. ప్లాట్ పాయింట్స్ అనేవి కనిపించవు. కథ సైకలాజికల్ థ్రిల్లర్‌ అయితే, పాత్ర సైకలాజికల్ డ్రామాలో లాగా పాసివ్ గా వుంది. ఎలా మొదలైన పాత్ర అలాగే, అదే వేదనతో కథని ముగిస్తుంది. 
       
ష్కీజోప్రీనియాతో హాలీవుడ్ నుంచి వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్లున్నాయి. వాటిని గమనించి ఈ సినిమా తీసినట్టు లేదు దర్శకురాలు.  కథలో విషయం లేకపోగా
, ఈ కథని మూడు టైమ్ లైన్లలో చెప్పడం ఇంకో సమస్య. హీరోయిన్ చిన్నప్పటి టైమ్ లైను, పెద్దయ్యాక రెండు టైమ్ లైన్లు. పెద్దయ్యాక ఈ రెండు టైమ్ లైన్లలో ఏది ఫ్లాష్ బ్యాక్, ఏది ప్రెజెంట్ అర్ధం కాని కన్ఫ్యూజన్ కూడా!
       
మొదటి సినిమా అనేది ఎన్నో ఏళ్ళు ప్రయత్నాలు చేస్తే నిర్మాతలతో దక్కే ఒక ఛాన్సు. చాలా రిస్కుతో కూడిన ఛాన్సు. దాంతో అన్నీతామే చేయగలమనుకుని అప్పుడే కథ- మాటలు- స్క్రీన్ ప్లేలు అన్నీ రాసేసే మేధావులమనుకుంటే- ఫలితం కూడా ఎలా వుంటుందంటే- మళ్ళీ ఇంకో ఛాన్సు కోసం జీవితాంతం ప్రయత్నిస్తూనే వుండాలి! మొదటి ఛాన్సు మేధావితనాన్ని కోరుకోదు
, అనుభవజ్ఞుల తోడ్పాటుని కోరుకుంటుంది.
—సికిందర్