వరుస ఫ్లాపులెదుర్కొంటున్న అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ తో విజయాలకి వారధి వేసుకుందామని వచ్చాడు. భక్తి- యాక్షన్ సినిమాల సీజన్ నడుస్తోంది కాబట్టి ప్రేక్షకులు కూడా దీన్ని చూసి తరిద్దామని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కోవిడ్ కి ముందు ప్రారంభమై ఈ దీపావళికి విడుదలవుతున్న దీని కోసం చాలా కష్టపడ్డాడు అక్షయ్ కుమార్, దర్శకుడు అభిషేక్ శర్మ మీద విశ్వాసంతో. అభిషేక్ శర్మ కిది రెండో స్టార్ సినిమా. ఇవి తప్పిస్తే గతంలో తీసిన ఐదు సినిమాలూ చిన్న సినిమాలు. 2018 లో జాన్ అబ్రహాంతో ‘పరమాణు- ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్’ అని భారత దేశం జరిపిన అణుపరీక్ష మీద తీశాడు. ఇది ఫర్వాలేదన్పించుకుంది. ఇప్పుడు రామాయణంలోని రామసేతు మీద భక్తి- యాక్షన్ థ్రిల్లర్ తీశాడు. మరి ఈ ప్రయత్నమెలా వుంది? ఇందులో భక్తిగానీ, యాక్షన్ గానీ అర్ధవంతంగా ఏమైనా వున్నాయా? ఇది తెలుసుకోవడానికి రామేశ్వరం వెళ్దాం...
రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...
టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!
Saturday, October 29, 2022
1238 : రివ్యూ!
రచన- దర్శకత్వం : అభిషేక్ శర్మ
తారాగణం : అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ , నుస్రత్ భరుచా,
సత్యదేవ్, నాజర్ తదితరులు
సంగీతం : డానియల్ బి.
జార్జ్, ఛాయాగ్రహణం : అసీమ్ మిశ్రా
బ్యానర్స్ : కేప్ ఆఫ్
గుడ్ ఫిల్మ్స్, మజాన్ ప్రైమ్, అబడాంటియాఎంటర్టయిన్మెంట్, లైకా ప్రొడక్షన్స్
నిర్మాతలు : అరుణా
భాటియా విక్రమ్ మల్హోత్రా
విడుదల : అక్టోబర్ 25, 2022
***
2017 లో నాస్తికుడైన డా. ఆర్యన్ కులశ్రేష్ఠ (అక్షయ్ కుమార్)
పాకిస్థానీ బృందంతో ఆఫ్ఘనిస్తాన్‌లోని బామియాన్ కి వెళ్తాడు. అక్కడ ఓ భారతీయ
రాజుకి చెందిన పురాతన నిధిని
తవ్వుతున్నప్పుడు తాలిబన్లు దాడి చేస్తారు. ఆర్యన్ ఆ నిధిని చేజిక్కించుకుని
తప్పించుకుంటాడు. ఇటు దేశంలో పుష్పక్ షిప్పింగ్ కంపెనీ యజమాని ఇంద్రకాంత్ (నాజర్)
తన సేతుసముద్రం ప్రాజెక్టులో భాగంగా రామసేతుని కూల్చివేయాలని భారత ప్రభుత్వాన్ని
అభ్యర్థిస్తాడు. దీని వల్ల ఇంధనం ఆదా అవుతుందని, భారత్-శ్రీలంక మధ్య ప్రయాణ సమయం తగ్గుతుందనీ
అభిప్రాయపడతాడు.
ఇది దేశంలో తీవ్ర ఆగ్రహానికి దారి తీస్తుంది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవుతుంది.
ఇంద్రకాంత్‌తో చేతులు కలిపిన ప్రభుత్వం, ఆర్కియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)
సహాయం తీసుకుంటుంది. ఇప్పటికి ఆర్యన్ ఏఎస్ఐ జాయింట్ డైరెక్టర్ జనరల్‌గా పదోన్నతి
పొంది వుంటాడు. ఇతడి లాంటి నాస్తికుడే తమకు సహాయం చేయగలడని ప్రభుత్వం భావిస్తుంది.
రామసేతు సహజసిద్ధమైన కట్టడమని, మానవ నిర్మితం కాదని పేర్కొంటూ నివేదికని
సమర్పించాల్సిందిగా కోరుతుంది. అప్పుడు ఆర్యన్ సమర్పించిన నివేదిక రామాయణంపై కూడా
ప్రశ్న లేవనెత్తుతుంది. ఇది పెను వివాదానికి దారి తీస్తుంది. ఇంద్రకాంత్ కూడా ఆర్యన్
తో జతకట్టి రామసేతువు మానవ నిర్మితం కాదని ప్రపంచానికి నిరూపించమని కోరతాడు.
ఆర్యన్ రామేశ్వరం చేరుకుంటాడు. ప్రాజెక్ట్
మేనేజర్ బాలి (ప్రవేశ్ రాణా), పర్యావరణవేత్త డాక్టర్ సాండ్రా రెబెల్లో
(జాక్వెలిన్ ఫెర్నాండెజ్) ఆర్యన్ మిషన్‌లో సాయం చేయడానికి వస్తారు. వీళ్ళ
పరిశోధనల్లో రాముడు 7000 సంవత్సరాల క్రితం జన్మించాడని, రామసేతు
రాముడి పుట్టుక కంటే ముందే వుంధనీ పేర్కొంటారు. ఇక దీని పర్యవసానాలు ఎలా
ఎదుర్కొన్నాడన్నది, ఫలితంగా నాస్తికుడైన తను రామ సేతుని నిజంగా
రాముడే వానర సైన్యంతో నిర్మించినట్టు నమ్మే ఆస్తికుడుగా ఎలా మారాడన్నది మిగతా కథ.
ఒక నాస్తికుడైన ఆర్కియాలజిస్టు రాముడ్ని నమ్మే భక్తుడిగా ఎలా మారాడన్నది ఈ
కథ. స్పిరిచ్యువల్ థ్రిల్లర్ జానర్
కథ. బాబ్రీ మసీదు కింద రామాలయం లేదనడం ఎలాంటిదో, రామేశ్వరంలో రామసేతు లేదనడం అలాటిది.
సాక్షాత్తూ నాసా అలాటిదేమీ లేదని సాక్ష్యాలు చూపించినా మత విశ్వాసం ముందు అది
దిగదుడుపే. కాబట్టి నాస్తికుడైన ఆర్యన్ ఆస్తికుడుగా మారకపోతే ఈ సినిమా వుండదు, బాయ్
కాట్ అవుతుంది.
అయితే ఈ సినిమా తీసిన దర్శకుడి దార్శనికత ఎలాంటిదంటే అతనే
సెంటిమెంట్లకి పూర్తిగా కట్టుబడడు. ఆటో కాలు ఇటో కాలు వేసి కన్ఫ్యూజ్ చేస్తాడు.
రామేసేతుకథ కోసం రామేశ్వరంలో ఆ కాలు పెట్టకుండా, డామన్
డయ్యూలో పాదం మోపి ఇదే రామేశ్వరం అనుకోమంటాడు. రేపు వేటపాలెం చూపించి వారణాసి
అనుకో మంటాడేమో తెలీదు. రామేశ్వరం
వెళ్ళినా శనీశ్వరం వదలనట్టు, డామన్ వెళ్ళినా అట్టర్ ఫ్లాప్ తప్పలేదు. లొకేషన్
దగ్గరే స్పిరిచ్యువాలిటీ ఆవిరైపోయింది.
రామేశ్వరంని ఎవాయిడ్ చేసినట్టు, రామసేతుతో
సంబంధమున్న శ్రీలంకని కూడా ఎవాయిడ్ చేశాడు. శ్రీలంక బదులు గోవా చేరింది. శ్రీలంకలో
స్థిరపడ్డ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సాండ్రా రెబెల్లో పాత్ర, తను
గోవాకు చెందానని చెప్పుకుంటుంది. ఇలాటివి చాలా వున్నాయి. అసలు రామసేతు మీద సినిమా
తీస్తూ మొదటి అరగంట వేరే సినిమా చూపించే ‘భక్తి’ కూడా వుంది. ఈ అరగంట సేపు అక్షయ్ కుమార్
ఆర్కియాలజిస్టు పాత్ర పరిచయం పేరుతో ఇండియానా జోన్స్ లాగా చేసే వేరే సాహసకృత్యాలే వున్నాయి అసలు కథతో
సంబంధం లేకుండా.
సినిమా అంటే పాత్ర
పరిచయమేనా, కథ కాదా? బహుశా ‘కేజీఎఫ్’ తో ఇన్స్పైర్ అయి క్యారక్టర్ ఎలివేషన్స్ తో ఇలా నింపేద్దామనుకున్నాడు.
ఇది బెడిసి కొట్టింది. ‘కారికేయ2’ లో
కృష్ణుడు పురాణం కాదనీ, చరిత్ర అనీ వాదన తప్ప నిరూపణ లేని
సెంటిమెంట్ కి మోకరిల్లి ముగించినట్టే, ఇక్కడ రామ సేతు
విషయంలోనూ జరిగింది. రామ సేతు మానవ నిర్మితం కాదనీ, అది
లక్షల సంవత్సరాల క్రితం జరిగిన సహజ భౌగోళిక ప్రక్రియ అనీ,
చెప్పిన నాసా పరిశోధనని ఇంకోలా చెప్పి చరిత్రగా మార్చినట్టే,
ఇక్కడా మత విశ్వాసం ఆధారంగానే ముగించారు.
అయితే ఈ
భక్తి భావోద్వేగపు ముగింపుకి రావడానికి చేసుకొచ్చిన పరిస్థితుల కల్పనేమీ లేదు. దీంతో అక్షయ్ కుమార్ నాస్తిక పాత్ర రామభక్తుడయ్యే ఉద్వేగభరిత
సన్నివేశం నిర్జీవంగా
మిగిలింది. కృష్ణం రాజు నటించిన భక్త ‘కన్నప్ప’ లో
నాస్తికుడైన తిన్నడు శివ భక్తుడయ్యే కన్నప్పగా మారే క్రమానికో కథ వుంటుంది. ‘రామ్
సేతు’ దర్శకుడు కనీసం భక్తి సినిమాలైనా ఎలావుంటాయో
చూడకుండా, తనకు తెలిసిన గ్రాఫిక్స్ తో యాక్షన్ దృశ్యాలు
తీసేసినట్టుంది. రామ
సేతుని కనుగొనే యాక్షన్ దృశ్యాలకి చివర ఓ భక్తి దృశ్యం కలిపితే సినిమా అయిపోయింది.
ఎక్కడా కథకి ప్రధానమైన ఆధ్యాత్మిక భావ తరంగాలు కథని డ్రైవ్ చేయవు. ఈ గ్రాఫిక్స్
కూడా నాసి రకంగా, హాస్యాస్పద్సంగా వున్నాయి. సముద్రం, డైవింగ్
దళాలు, రామసేతు సెట్ కూడా ఆకర్షణీయంగా లేవు. రామసేతు
బయటపడుతోందంటే ప్రేక్షకుల వెంట్రుకలు నిక్కబొడుచుకుని కేకలు వేసే ఉద్విగ్న డ్రామా వుండాలి. ఇలాటి కమర్షియల్ చిత్రీకరణ కూడా లేదు.
స్పిరిచ్యువల్ జర్నీ అన్నాక ప్రేక్షకుల్ని బలంగా ఆ లోకంలోకి లాక్కెళ్ళే దర్శకత్వ
ప్రతిభ పూర్తిగా
లోపించింది.
అక్షయ్ కుమార్ పాత్ర బలహీనతలు నటనలో బయట పడతాయి. పాత్ర బలహీనం, కథ
కూడా బలహీనం కావడంతో తన హీమాన్ యాక్షన్ దృశ్యాలు బోరు కొట్టే స్థాయిలో వున్నాయి.
మాస్ ప్రేక్షకులు కూడా ఈలలు వేయలేరు. స్పిరిచ్యువల్ షేడ్స్ రివీలయ్యే సస్పెన్సు తో
కూడిన పాత్ర చిత్రణ అయివుంటే – అక్షయ్ అలా రూపొందించుకుని వుంటే ఈ సినిమా
బెటర్ గా వుండేది. స్టీవెన్ స్పీల్ బెర్గ్ తీసిన ఆర్కియాలజిస్టు ఇండియానా జోన్స్
సినిమాలు ప్రసిద్ధి చెందిన స్పిరిచ్యువల్ థ్రిల్లర్సే కదా?
అక్షయ్ కి తోడుండే యాక్షన్ పాత్రలో తెలుగు
నటుడు, ‘గాడ్ ఫాదర్’
ఫేమ్ సత్యదేవ్ కాస్త కామెడీ చేస్తూ
ఆకట్టుకుంటాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ భరూచాలు సహాయ పాత్రలుగా మిగిలిపోయారు.
విలన్ గా మాత్రం నాజర్ ఒక ఊపు ఊపాడు. చాలా విషాదకరమేమిటంటే, ఛాయాగ్రాకుడు
అసీమ్ మిశ్రా టాలెంట్ అంతా బూడిదలో పోసిన పన్నీరవడం. డానియల్ జార్జ్ నేపథ్య సంగీతం
భక్తిని
రెచ్చగొట్టదు. అంతా రామమయమని రాముడి లీలలు ప్రస్ఫుటమయ్యే - నేపథ్య సంగీతానికి తోడ్పడే చిత్రణలు చేయాలని
ముందసలు దర్శకుడు అభిషేక్ శర్మకి తెలియాలి.
మొత్తానికి రామసేతు చూద్దామని
రామేశ్వరం వెళ్తే డామన్ చేరుకుంటాం. అక్కడ డామన్ దెయ్యాలు కన్పిస్తాయి. కాశీకి పోయాను రామాహరీ అని
అక్కడ్నుంచి బయల్దేరాలి...
—సికిందర్
Friday, October 28, 2022
1237 : రివ్యూ!
రచన - దర్శకత్వం : అశ్వథ్ మారిముత్తు
తారాగణం : విశ్వక్ సేన్, వెంకటేష్, మిథిలా పాల్కర్, ఆశా భట్,
రాహుల్ రామకృష్ణ, మురళీ శర్మ తదితరులు
మాటలు : తరుణ్ భాస్కర్, సంగీతం : లియోన్ జేమ్స్, ఛాయాగ్రహణం విధు అయ్యన్న
బ్యానర్స్ : పివిపి సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాతలు : పరం వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి
విడుదల : అక్టోబర్ 21, 2022
***
ఊర మాస్ హీరో విశ్వక్ సేన్ రూటు మార్చి ‘పాగల్’, ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ వంటి ప్రేమ సినిమాల్లో
నటించి మెప్పించలేక పోయిన తర్వాత, అశ్వథ్ మారిముత్తు అనే
తమిళ దర్శకుడితో మరో ప్రేమ సినిమా ‘ఓరి దేవుడా’ లో నటించాడు. తమిళంలో మారి ముత్తు రెండేళ్ళ క్రితం తీసిన హిట్టయిన ‘ఓ మై కడవులే’ కి ఇది రీమేక్. ఇది కన్నడలో పునీత్
రాజ్ కుమార్ తో ‘లక్కీమ్యాన్’ గా రీమేక్ అయి
హిట్టయ్యింది. ఇప్పుడు తెలుగు రీమేక్ లో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర నటించారు. మరి
రెండు భాషల్లో హిట్టయిన ఈ ప్రేమ సినిమా ఈసారి విశ్వక్ సేన్ తో తెలుగులో ఎలావుంది? ఇందులో వున్న ప్రత్యేకత విశ్వక్ సేన్ కేమైనా
ప్లస్ అయిందా?
అర్జున్ (విశ్వక్ సేన్), అను (మిథిలా
పాల్కర్) స్కూల్ మేట్స్. ఓ రోజు తనని పెళ్ళి చేసుకోమని అర్జున్‌కి ప్రపోజ్ చేస్తుంది. అర్జున్
ఎలాటి సంకోచం లేకుండా
అంగీకరిస్తాడు. కానీ పెళ్ళయ్యాక మొదటి రాత్రి ముద్దు
పెట్టుకోబోతూంటే ఫక్కున నవ్వొస్తుంది. చిన్నప్పట్నుంచీ చూస్తున్న ఆమెతో రోమాంటిక్
గా ఫీల్ కాలేక పోతున్నానని అంటాడు. అయితే ఫీలైనప్పుడే ఫస్ట్ నైట్
చేసుకుందామంటుంది. కానీ ఏడాది తిరిగేసరికి విడాకుల కోర్టులో వుంటారు.
కోర్టులో ఒకడు పరిచయమై విడాకులు జరగవని భవిష్యత్తు చెప్పి, విజిటింగ్ కార్డు ఇచ్చి అదృశ్యమై పోతాడు. అర్జున్ ఆ అడ్రసుకి వెళ్ళేసరికి అక్కడ దేవుడు (వెంకటేష్ ) వుంటాడు, కోర్టులో అదృశ్యమైన వాడు (రాహుల్ రామకృష్ణ) అక్కడే వుంటాడు. దేవుడు అర్జున్ చెప్పుకున్నదంతా విని, నీ జీవితాన్ని మార్చుకోవడానికి సెకెండ్ ఛాన్సు ఇస్తున్నానని చెప్పి, ఒక టికెట్ ఇస్తాడు. ఆ టికెట్ అర్జున్ తోనే వుండాలి, ఎవరికీ దని గురించి చెప్పొద్దు, చెప్తే చస్తావని హెచ్చరిస్తాడు.
ఇప్పుడు ఆ టికెట్ తో అర్జున్ జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు? విడాకులు మానుకుని అనుతోనే వున్నాడా? లేక అనుకోకుండా వచ్చిన స్కూల్ సీనియర్ మీరా (ఆశా భట్)తో ప్రేమలో పడ్డాడా? ఏం జరిగింది? ఎలా పరిష్కరించుకున్నాడు సమస్య? ఇదీ మిగతా కథ.
కోర్టులో ఒకడు పరిచయమై విడాకులు జరగవని భవిష్యత్తు చెప్పి, విజిటింగ్ కార్డు ఇచ్చి అదృశ్యమై పోతాడు. అర్జున్ ఆ అడ్రసుకి వెళ్ళేసరికి అక్కడ దేవుడు (వెంకటేష్ ) వుంటాడు, కోర్టులో అదృశ్యమైన వాడు (రాహుల్ రామకృష్ణ) అక్కడే వుంటాడు. దేవుడు అర్జున్ చెప్పుకున్నదంతా విని, నీ జీవితాన్ని మార్చుకోవడానికి సెకెండ్ ఛాన్సు ఇస్తున్నానని చెప్పి, ఒక టికెట్ ఇస్తాడు. ఆ టికెట్ అర్జున్ తోనే వుండాలి, ఎవరికీ దని గురించి చెప్పొద్దు, చెప్తే చస్తావని హెచ్చరిస్తాడు.
ఇప్పుడు ఆ టికెట్ తో అర్జున్ జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు? విడాకులు మానుకుని అనుతోనే వున్నాడా? లేక అనుకోకుండా వచ్చిన స్కూల్ సీనియర్ మీరా (ఆశా భట్)తో ప్రేమలో పడ్డాడా? ఏం జరిగింది? ఎలా పరిష్కరించుకున్నాడు సమస్య? ఇదీ మిగతా కథ.
ప్రేమ కథలో ఫాంటసీ వుండడంతో కొత్తగా
అన్పించే కథ. ఫాంటసీ అన్నాక లాజిక్ వుండదు. కానీ థ్రిల్, అడ్వెంచర్ వుండాలి. అప్పుడే ఫాంటసీ
అన్పించుకుంటుంది. ఇవి లోపించడంతో పాయింటు మాత్రమే కొత్తగా,
కథనం పాతగా వుంటాయి. తప్పుల్ని సరిదిద్దుకోడానికి
జీవితంలో సెకెండ్ ఛాన్స్ ఎప్పుడూ వుంటుంది, అలా జీవితాన్ని తిరిగి గాడిలో పెట్టుకోవచ్చన్న
పాయింటుకి ఫాంటసికల్ గా పరిష్కారం చెప్పడం బాగానే వుంది గానీ, ఫాంటసీ జానర్ మర్యాదలైన థ్రిల్, అడ్వెంచర్ లతో
కథనముండాల్సింది లేదు.
పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళు- ప్రేమ పెళ్ళిళ్ళు; స్నేహాలు- ప్రేమలు, శ్రమ విలువ - ఆనందం వంటి అంశాలు కూడా గంభీరంగానే చెప్పాడు దర్శకుడు. ఈ ఫాంటసీకి దర్శకుడు పాటించిన ఎలిమెంట్ కామెడీ మాత్రమే. ఇది కూడా హీరోతోనే. హీరోయిన్లని కామెడీకి దూరంగా వుంచాడు.
ఫస్టాఫ్ టైమ్ వేస్ట్ చేయకుండా మొదటి పది నిమిషాల్లోనే పెళ్ళయి పోతుంది. 20 నిమిషం కల్లా విడాకులకొస్తుంది కథ. దీంతో దేవుడి పాత్ర ప్రవేశిస్తుంది. ఇక్కడ్నుంచీ ఇంటర్వెల్ ముందు వరకూ సుమారు 40 నిమిషాలు నస పెడుతుంది. ఎందుకంటే దేవుడు వెంకటేష్ అడుగుతున్న వివరాల్ని విశ్వక్ సేన్ మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులుగా చెప్పుకొస్తూంటాడు. ఇప్పుడు విడిపోవడానికి కారణాలేంటో ఆ కథనం బలహీనంగా వస్తూంటుంది. ఈ బలహీనతని కవర్ చేయడానికా అన్నట్టు, ప్రెజెంట్ స్టోరీలో వెంకటేష్ తన మార్కు డైలాగ్ కామెడీని ప్రయోగిస్తూంటాడు.
పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళు- ప్రేమ పెళ్ళిళ్ళు; స్నేహాలు- ప్రేమలు, శ్రమ విలువ - ఆనందం వంటి అంశాలు కూడా గంభీరంగానే చెప్పాడు దర్శకుడు. ఈ ఫాంటసీకి దర్శకుడు పాటించిన ఎలిమెంట్ కామెడీ మాత్రమే. ఇది కూడా హీరోతోనే. హీరోయిన్లని కామెడీకి దూరంగా వుంచాడు.
ఫస్టాఫ్ టైమ్ వేస్ట్ చేయకుండా మొదటి పది నిమిషాల్లోనే పెళ్ళయి పోతుంది. 20 నిమిషం కల్లా విడాకులకొస్తుంది కథ. దీంతో దేవుడి పాత్ర ప్రవేశిస్తుంది. ఇక్కడ్నుంచీ ఇంటర్వెల్ ముందు వరకూ సుమారు 40 నిమిషాలు నస పెడుతుంది. ఎందుకంటే దేవుడు వెంకటేష్ అడుగుతున్న వివరాల్ని విశ్వక్ సేన్ మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులుగా చెప్పుకొస్తూంటాడు. ఇప్పుడు విడిపోవడానికి కారణాలేంటో ఆ కథనం బలహీనంగా వస్తూంటుంది. ఈ బలహీనతని కవర్ చేయడానికా అన్నట్టు, ప్రెజెంట్ స్టోరీలో వెంకటేష్ తన మార్కు డైలాగ్ కామెడీని ప్రయోగిస్తూంటాడు.
ఇంతా చేస్తే విడిపోవడానికి కారణం కొత్తగా వుండదు. స్కూల్ సీనియర్ మీరా ఎంట్రీతో అనుమానం పెనుభూతమై గొడవ పడతారు భార్యా భర్తలు. ఈ టెంప్లెట్ రొటీనే విడాకులకి కారణమవుతుంది. ఈ విడిపోవా లనుకోవడానికి మొదటి రాత్రి ఎస్టాబ్లిష్ చేసిన రోమాంటిక్ గా ఫీలవలేక పోతున్న మానసిక కారణమే వుండుంటే కొత్తదనం వుండేది. ఒక చోట- ఫ్రెండ్ ని పెళ్ళి చేసుకోకూడదు, పెళ్ళి చేసుకున్నాక భార్యని ఫ్రెండ్ గా చేసుకోవచ్చని అంటాడు కూడా విశ్వక్ సేన్. అతడికి అడ్డు పడుతున్న ఈ సైకలాజికల్ కారణాన్నే పక్కన పెట్టేశాడు దర్శకుడు. దానికి ట్రీట్ మెంట్ తీసుకోకుండా వేరే స్కూల్ సీనియర్ తో తిరగడం, భార్యకి అనుమానాలు కల్గించడం, ఇదంతా పాయింటు వదిలేసి క్యారక్టరైజేషన్ని చెడగొట్టిన వ్యవహారంగా మారింది.
ఇక ఇంటర్వెల్ లో దేవుడుగా వెంకటేష్ టికెట్ ఇవ్వడంతో మాత్రమే డల్ గా వున్న ఫస్టాఫ్ కి కాస్త ఊపొస్తుంది. ఇక సెకండాఫ్ కథ- విశ్వక్ సేన్ టైమ్ ట్రావెల్ చేసి- హీరోయిన్ తో పెళ్ళిని తిరస్కరించి వుంటే ఎలా వుండేదన్న కథనంతో సాగి, స్కూల్ సీనియర్ తో ప్రేమాయణం సాగించి, హీరోయిన్ విలువ తెలిసొచ్చి, ఆమెకోసం ప్రాకులాడే సాధారణ రొటీన్ గానే వుంటుంది. చివరికి వెంకటేష్ జోక్యంతో వూహించినట్టుగానే సుఖాంతమవుతుంది హీరోయిన్ తో.
దేవుడి క్యారక్టర్ తో ఫాంటసీ అనేది పేరుకే. ఎక్కడా ఫాంటసీ చూస్తున్నట్టే వుండదు. దేవుడిచ్చిన టికెట్ తో అద్భుతాలేమీ జరగవు. అడ్వెంచర్, థ్రిల్ మొదలైన ఫాంటసీ జానర్ ఎలిమెంట్స్ వుండవు. విశ్వక్ సేన్ లాంటి హైపరాక్టివ్ హీరో రెక్కలు కత్తిరించేసినట్టు వుంది.
విశ్వక్ సే కిది కొత్త తరహా పాత్ర.
ఐతే తనకున్న ఇమేజికి కామెడీ స్థాయినైనా పెంచుకోవాల్సింది. ఊర మాస్ హీరో అయివుండి
కూడా ఫస్టాఫ్ ని నిలబెట్ట లేక పోవడం విచారకరం. తమిళంలో నటించిన అశోక్ సెల్వన్
సాఫ్ట్ హీరో. అతడికి సరిపోయింది. తెలుగులో
విశ్వక్ సేన్ కి పాత్ర తీరుతెన్నుల్ని మార్చాల్సింది. తమిళంలో అశోక్ సెల్వన్
కామెడీ అరుపులు అరుస్తూంటే బాగానే వుంది. విశ్వక్ సేన్ తో ఇది ఎబ్బెట్టుగా వుంది.
ఇంకోటేమిటంటే విశ్వక్ సేన్ కాస్త స్లిమ్ గా కూడా మారాలి.
హీరోయిన్లిద్దరూ బావున్నారు గానీ, తమిళంలో నటించిన హీరోయిన్లంత కాదు. తమిళంలో విజయ్ సేతుపతి నటించిన దేవుడి పాత్రని వెంకటేష్ నటించడం బాగానే —వుంది. వంక పెట్టడానికి లేదు. అలాగే ఆయన అసిస్టెంట్ గా రాహుల్ రామ కృష్ణ. ఒక పాత్రలో మురళీ శర్మ ఫ్లాష్ బ్యాక్ కథ కదిలిస్తుంది. గమ్మత్తేమిటంటే, ఈ ప్రేమ కథలో హీరోహీరోయిన్లతో కదిలించే సీన్లు అనేవి లేకపోవడం
సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్, ఛాయాగ్రహకుడు విధు అయ్యన్నఇద్దరూ తమిళ ఒరిజినల్ కి పనిచేసిన వాళ్ళే. ఫర్వాలేదు. చివరిగా, రొటీన్ గా వచ్చి పోతున్న ప్రేమ సినిమాలకంటే భిన్నంగా వుండడానికి చేతిలో ఫాంటసీ కాన్సెప్ట్ ని వుంచుకుని కూడా, సద్వినియోగం చేసుకోకపోవడం బాక్సాఫీసుకి ఇబ్బందిగా మారింది.
—సికిందర్
హీరోయిన్లిద్దరూ బావున్నారు గానీ, తమిళంలో నటించిన హీరోయిన్లంత కాదు. తమిళంలో విజయ్ సేతుపతి నటించిన దేవుడి పాత్రని వెంకటేష్ నటించడం బాగానే —వుంది. వంక పెట్టడానికి లేదు. అలాగే ఆయన అసిస్టెంట్ గా రాహుల్ రామ కృష్ణ. ఒక పాత్రలో మురళీ శర్మ ఫ్లాష్ బ్యాక్ కథ కదిలిస్తుంది. గమ్మత్తేమిటంటే, ఈ ప్రేమ కథలో హీరోహీరోయిన్లతో కదిలించే సీన్లు అనేవి లేకపోవడం
సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్, ఛాయాగ్రహకుడు విధు అయ్యన్నఇద్దరూ తమిళ ఒరిజినల్ కి పనిచేసిన వాళ్ళే. ఫర్వాలేదు. చివరిగా, రొటీన్ గా వచ్చి పోతున్న ప్రేమ సినిమాలకంటే భిన్నంగా వుండడానికి చేతిలో ఫాంటసీ కాన్సెప్ట్ ని వుంచుకుని కూడా, సద్వినియోగం చేసుకోకపోవడం బాక్సాఫీసుకి ఇబ్బందిగా మారింది.
—సికిందర్
Sunday, October 23, 2022
1237 : రివ్యూ!
రచన -
దర్శకత్వం : కెవి అనుదీప్
తారాగణం : శివ కార్తికేయన్, మరియా
ర్యాబోషప్క, కార్ల్
హార్ట్, సత్యరాజ్, ప్రేమ్జీ అమరేన్, ఆనందరాజ్
తదితరులు
సంగీతం : ఎస్ థమన్, ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస
బ్యానర్స్ : సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్, శ్రీ వెంకటేశ్వరా సినిమాస్
నిర్మాతలు : డి సురేష్ బాబు, సునీల్ నారంగ్, పి రామ్మోహన్ రావు
విడుదల : అక్టోబర్ 21, 2022
***
‘జాతిరత్నాలు’ అనే
హిట్ కామెడీ తీసిన తెలుగు దర్శకుడు కెవి అనుదీప్, తమిళ
స్టార్ శివ కార్తికేయన్ తో తెలుగు -తమిళ ద్విభాషా చలన చిత్రంగా మరో కామెడీ తీశాడు.
ఇందులో మరియా ర్యాబోషప్క అనే ఉక్రెయిన్ నటి హీరోయిన్. గత నెలలోనే అనుదీప్ కథ
అందించిన కామెడీ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ దారుణంగా
ఫ్లాపయింది. మైండ్ లెస్ కామెడీతో ‘జాతిరత్నాలు’ హిట్టయ్యిందనీ ఇక మైండ్ లెస్ కామెడీలే తీయాలని నిర్ణయించుకున్నట్టుంది. కానీ దీపావళి సందర్భంగా ఇదే రోజు మరో నాలుగు సినిమాలు- జిన్నా, ఓరి దేవుడా, సర్దార్, బ్లాక్ ఆడమ్
కూడా విడుదలయ్యాయి. పోటీ గట్టిగానే వుంది.
తమిళంలో శివ కార్తికేయన్
వరుస హిట్లు ఇస్తున్న స్టార్. ఇప్పుడతను తమిళంలో కార్తీ నటించిన యాక్షన్ థ్రిల్లర్
‘సర్దార్’ తో పోటీలో వెనుకబడ్డాడు. కార్తీ కూడా వరుస
హిట్లు ఇస్తున్న తమిళ స్టారే. తాజాగా ‘పొన్నియిన్ సెల్వన్’ లో నటించాడు. తమిళంలో ‘సర్దార్’ కి మార్నింగ్ షో కే హిట్ టాక్ వచ్చేసింది. ‘ప్రిన్స్’ ట్రైలర్ చూస్తే బలహీనంగా వుంది. మరి సినిమా ఎలావుంది? ఇది తెలుసుకుందాం...
కథ
ఆనంద్ (శివ కార్తికేయన్)
ఓ ఊళ్ళో స్కూలు టీచర్. సోషల్ సబ్జెక్టు చెప్తాడు. సోషల్ నాలెడ్జి ఏమీ వుండదు. స్కూలుకంటే
సినిమాలకి ఎక్కువ వెళుతూ వుంటాడు. తండ్రి విశ్వనాథం (సత్యరాజ్) అభ్యుదయవాది.
కులాంతర వివాహాలు జరిపిస్తూంటాడు. ఎందుకైనా మంచిదని కొడుకు ఆనంద్ చేత హామీ పత్రం
రాయించుకుంటాడు- ఎట్టి పరిస్థితిలో కులాంతర వివాహమే చేసుకోవాలని,
కులంలో అమ్మాయిని ప్రేమించరాదనీ. ఇప్పుడు అదే స్కూల్లో జెస్సికా (మరియా) అనే బ్రిటీష్
జాతీయురాలు ఇంగ్లీషు టీచరుగా వచ్చి చేరుతుంది. ఈమె తండ్రి విలియమ్స్ (కార్ల్
హార్ట్) తాత ఆస్తిపాస్తులు ఇక్కడే వదిలి వెళ్ళడంతో తను ఇక్కడే సెటిలై పోయాడు.
టౌన్లో ఇతడి స్థలం ఒకటి కబ్జా చేయాలన్న పన్నాగంతో ఓ కేడీ భూపతి (ప్రేమ్జీ అమరేన్)
వుంటాడు.
స్కూల్లో కొత్తగా చేరిన టీచర్ జెస్సికా ఇంగ్లీషు అందచందాలు చూసి, ఆనంద్ ఇక సినిమాల కెళ్ళడం మానేసి, బుద్ధిగా స్కూలుకొస్తూ వచ్చిన పని ప్రేమించుకోవడం మొదలు పెట్టుకుంటాడు. అతడి ప్రేమని చూసి ఆమె కూడా ప్రేమలో పడుతుంది. అయితే కులాల్ని, మతాల్నీ అధిగమించి విశాల ప్రాతిపదికన ఆనంద్ ఓ విదేశీయురాలిని ప్రేమించడం గర్వంగా ఫీలైన తండ్రి విశ్వనాధం, ఆమె బ్రిటిషర్ అని తెలిసి ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదని అడ్డం తిరుగుతాడు. ఎందుకంటే స్వాతంత్ర్య పోరాటంలో ఓ బ్రిటిష్ తాత తన తాతని చంపాడు కాబట్టి.
అటు జెస్సికా తండ్రి విలియమ్స్ కూడా ఇండియన్ రక్తంతో సంబంధం వీల్లేదని అడ్డం తిరుగుతాడు. ఇలా ఇద్దరూ అడ్డం తిరిగేసరికి, మధ్యలో ఆనంద్ - జెస్సికాల ప్రేమ ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పుడేం జరిగిందన్నది మిగతా కథ.
స్కూల్లో కొత్తగా చేరిన టీచర్ జెస్సికా ఇంగ్లీషు అందచందాలు చూసి, ఆనంద్ ఇక సినిమాల కెళ్ళడం మానేసి, బుద్ధిగా స్కూలుకొస్తూ వచ్చిన పని ప్రేమించుకోవడం మొదలు పెట్టుకుంటాడు. అతడి ప్రేమని చూసి ఆమె కూడా ప్రేమలో పడుతుంది. అయితే కులాల్ని, మతాల్నీ అధిగమించి విశాల ప్రాతిపదికన ఆనంద్ ఓ విదేశీయురాలిని ప్రేమించడం గర్వంగా ఫీలైన తండ్రి విశ్వనాధం, ఆమె బ్రిటిషర్ అని తెలిసి ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదని అడ్డం తిరుగుతాడు. ఎందుకంటే స్వాతంత్ర్య పోరాటంలో ఓ బ్రిటిష్ తాత తన తాతని చంపాడు కాబట్టి.
అటు జెస్సికా తండ్రి విలియమ్స్ కూడా ఇండియన్ రక్తంతో సంబంధం వీల్లేదని అడ్డం తిరుగుతాడు. ఇలా ఇద్దరూ అడ్డం తిరిగేసరికి, మధ్యలో ఆనంద్ - జెస్సికాల ప్రేమ ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పుడేం జరిగిందన్నది మిగతా కథ.
ఎలావుంది కథ
ఇది పూర్తి స్థాయి కామెడీ కథ. ఒకప్పుడు జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, వంశీ, రేలంగి నర్సింహా రావు మొదలైన దర్శకులు ఫక్తు కామెడీ సినిమాలే తీసే వాళ్ళు. ఈ కాలంలో రోమాంటిక్ కామెడీలు, హార్రర్ కామెడీలు, క్రైమ్ కామెడీలూ అంటూ ప్రేమని, హార్రర్ ని, క్రైమ్ నీ జోడించుకుని సబ్ జానర్ కామెడీలు తీస్తున్నారే తప్ప, ఆ రోజుల్లో ఆ దర్శకులు తీసేలాంటి ఫక్తు కామెడీలు తీయలేక పోతున్నారు. దీనికి కాస్త సృజనాత్మకత, ప్రతిభ కావాలి సామాజిక స్పృహతో బాటు. కనుక ఒక జంధ్యాల, ఈవీవీ, వంశీ, రేలంగి అన్పించుకునే దర్శకులు ముందు కాలంలో కూడా రావడం అసంభవమనుకుంటున్న సమయంలో అనుదీప్ అనే దర్శకుడు వచ్చాడు.
అయితే అనుదీప్ తో సమస్యేమిటంటే, అతను ప్రధాన పాత్ర ఆధారిత కామెడీ తీయడు. ప్రధాన పాత్రని అప్రధానం చేసి, ఇతర పాత్రలతో కలిపేసి గుండుగుత్త కామెడీ తీస్తాడు. ఏ కథైనా, ఎలాటి కథైనా ప్రధాన పాత్రకి గోల్ అంటూ వుంటుంది. ఆ గోల్ ప్రధాన పాత్ర
ఎదుర్కొనే సమస్య, దాంతో పోరాటం,
పరిష్కారమనే త్రీ యాక్ట్ స్ట్రక్చర్ సహిత స్క్రీన్ ప్లేతోనే వస్తుందని అతడికి
తెలుసో లేదో. ఇలా ఈ సార్వజనీన స్క్రీన్ ప్లే స్ట్రక్చరనేది గోల్ తో యాక్టివ్ గా
వుండే ప్రధాన పాత్రతోనే సాధ్యమనీ, గోల్ లేకుండా పాసివ్ గా
వుండే ప్రధాన పాత్రతో విఫలమవుతుందనీ, బేసిక్స్ అతడికి తెలుసో
లేదో తెలీదు.
స్క్రీన్ ప్లేకి స్ట్రక్చర్
నేర్పర్చేదే గోల్ కోసం పోరాడే యాక్టివ్ ప్రధాన పాత్ర. అంతేగానీ, ప్రధాన పాత్ర కోసం స్ట్రక్చర్ ని ఎవరూ కనిపెట్టలేదు. యుగాలుగా రాస్తున్న కథల్లో గోల్ తో వుండే ప్రధాన పాత్రే స్ట్రక్చర్
నేర్పరుస్తూ వస్తోందని గమనించి స్క్రీన్ ప్లే శాస్త్రాలు రాశారు నిపుణులు.
శాస్త్రం ముందు కాదు, పదార్ధమే ముందు. పదార్థాన్ని విశ్లేషిస్తేనే
శాస్త్రం ఏ రంగంలోనైనా.
అనుదీప్ తీస్తున్నవి సిల్లీ కామెడీలే. దీనికాధారం సామాజిక అంశాలే, నేటివిటీయే. సోషల్ కామెంట్ చేసే సదాశయమే. వ్యక్తుల హిపోక్రసీని బయట పెట్టాలన్న తపనే. అయితే ముందు కామెడీ పుట్టడానికి ఆధారమైన అంశం లాజికల్ గా వుంటే, దాని మీద మనిషిలోని సిల్లీ తనంతో ఎంత ఇల్లాజికల్ (అబ్సర్డ్) కామెడీనైనా సృష్టించ వచ్చని అరిస్టాటిల్ మహాశయుడు చెప్పాడు. అనుదీప్ చేస్తున్నదిదే. మంచిదే. అయితే ఈ అబ్సర్డ్ కామెడీని అతను కథతో చేయడం లేదు. సెటైర్లతో విడివిడి స్కిట్స్ తీసి, వాటిని కలిపి అదే కథ అనుకోమంటున్నాడు.
కథ ఎక్కడుంది? ఆనంద్ జెస్సికాతో ప్రేమలో పడ్డం దగ్గరుంది. ఆ తర్వాత ఇంటర్వెల్లో వీళ్ళ తండ్రులు అడ్డుకోవడం దగ్గరుంది. ఇంకా తర్వాత తండ్రులు రాజీపడే క్లయిమాక్స్ లో వుంది. ఈ మూడే కథతో సంబంధమున్న ఘట్టాలు. మిగిలిన వన్నీ వీటితో సంబంధం లేని, వీటి మధ్య పేర్చిన, విడివిడి సెటైరికల్ స్కిట్స్. కేవలం కథకి సంబంధించి ఆ మూడు ప్లాట్ పాయింట్స్ ని పెట్టుకుని, వాటి మధ్య ఫిల్లర్స్ గా స్కిట్స్ వేస్తూ సినిమా నడిపేశాడు.
ఇందుకే హీరో పాత్ర ఆనంద్ కి పని (గోల్) లేకుండా పోయింది. ఇంకా ఓ స్థలాన్ని కబ్జా చేయాలనుకునే పక్క పాత్ర భూపతి కెక్కువ గోల్ వుంది. అతను ఇంగ్లీషు వాడి స్థలాన్నెలా కొట్టేయాలన్న గోల్ తో చివరి దాకా మంచి ఊపు మీద యాక్టివ్ గా వుంటాడు- పైన చెప్పుకున్న ‘ప్రధాన పాత్ర -సమస్య -పోరాటం -పరిష్కారం’ స్ట్రక్చర్ తో యాక్టివ్ క్యారక్టర్ గా! అతను స్థలాన్నైతే కొట్టేయ లేకపోయాడు గానీ, హీరో ఆనంద్ చేతిలో వుండాల్సిన త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ ని మాత్రం కొట్టేసి పాసివ్ గా కూర్చోబెట్టేశాడు.
చెప్పేదేమిటంటే, ఆల్రెడీ తెలుగు హీరోలకి అలంకరిస్తున్న పాసివ్ పాత్రల్ని తీసికెళ్ళి తమిళ హీరోల్ని కూడా పుష్పమాలాంకృతుల్ని చేయడమెందుకని. తెలుగు దర్శకుడు వెళ్ళి వెళ్ళి తమిళాన్ని కూడా తెలుగు కిష్కింధ చెయ్యాలా? 2020 లో తమిళంలో మడోన్ అశ్విన్ అనే కొత్త దర్శకుడు తీసిన ‘మండేలా’ అనే రాజకీయ సెటైర్ లో హీరోగా యోగిబాబు బార్బర్ పాత్ర ఎంత యాక్టివ్ గా వుంటుంది. కథని అతనే సృష్టిస్తాడు, అతనే నడిపిస్తాడు, అతనే ముగిస్తాడు.
హీరోగా ఆనంద్ కూడా చేయాల్సిందేమిటంటే, ప్రేమకి అడ్డుపడుతున్న తండ్రుల వ్యక్తిగత వైరాల్ని వాళ్ళకే వ్యతిరేకంగా వాడుకుని టీచర్ గా బుద్ధిచెప్పడం. లేకపోతే టీచర్ పాత్ర దేనికి? మొదట కామెడీ కోసం టీచర్ని నాలెడ్జి లేని వాడుగా చూపించినా, ప్రేమతో సమస్యలో పడ్డాక ఎదగాలిగా (క్యారక్టర్ గ్రోత్)? ఎదిగి టీచర్ అన్పించుకుంటూ, వూరి సమస్యగా మారిన తన సమస్యని కామెడీగానే, సృజనాత్మకంగా పరిష్కరించుకునే గోల్ తో కొనసాగాలిగా (క్యారక్టర్ ఆర్క్)? కథకి ఉష్ణోగ్రత పెంచాలిగా (టైమ్ అండ్ టెన్షన్ గ్రాఫ్)? ఇవేమీ లేకుండా హీరో అయిపోతాడా?
పైన కథా సంగ్రహం రాసినప్పుడు... ఇలా ఇద్దరూ అడ్డం తిరిగేసరికి, మధ్యలో ఆనంద్ - జెస్సికాల ప్రేమ ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పుడేం జరిగిందన్నది మిగతా కథ... అని పేర్కొన్నాం. ఇప్పుడేం జరిగిందన్నది మిగతా కథ... అన్నామే గానీ, ఇప్పుడేం చేశాడు ఆనంద్?... అని రాయలేదు. ఎందుకంటే ఈ కథలో ఆనంద్ ఏమీ చేయని -గోల్ లేని పాసివ్ పాత్ర కాబట్టి.
అయితే గోల్ తో ఏం చేయాలన్నా ఇక్కడ అసలు సమస్య వుంది. తండ్రుల సమస్యే సమస్య. ఎప్పుడో స్వాతంత్ర్య పోరాటంలో ఇంగ్లీషు తాత తన తాతని చంపాడని ఆనంద్ తండ్రి, ఇండియన్ రక్తంతో సంబంధం వద్దని జెస్సికా తండ్రీ సృష్టించిన సమస్యలో లాజిక్ ఎంత? ఎమోషన్స్ ఎంత? ఇవి కన్విన్సింగ్ గా వుండే పాయింట్సేనా? ఏ మాత్రం అర్ధం లేని, ఎమోషన్లు పుట్టించని, సిల్లీ పాయింట్స్. పైన అరిస్టాటిల్ ని ఉటంకిస్తూ చెప్పుకున్నట్టు - ముందు కామెడీ పుట్టడానికి ఆధారమైన అంశం లాజికల్ గా వుంటే, దాని మీద మనిషిలోని సిల్లీ తనంతో ఎంత ఇల్లాజికల్ (అబ్సర్డ్) కామెడీనైనా సృష్టించ వచ్చు. ఇది దర్శకుడు అనుదీప్ తీసిన స్కిట్స్ కే వర్తిస్తోంది తప్ప కథ పుట్టడానికి కారణమైన ఎమోషన్స్ లేని ప్లాట్ పాయింటుకి కాదు.
తండ్రులు సృష్టించిన సమస్యే ఎమోషన్స్ లేకుండా ఇల్లాజికల్ గా, సిల్లీగా, ఆషామాషీగా వుంటే ఇది సినిమాని నిలబెట్టే ప్లాట్ పాయింట్ అవదు- ఫాల్స్ పాయింటుతో ఫ్లాప్ ప్లాట్ పాయింటవుతుంది. ఆనంద్ దీంతో ఎంత గోల్ పుట్టించుకున్నా అందులో ఎమోషన్ లేక, ఎంత కథ నడిపినా నిలబడేది కాదు. మొట్టమొదట కథకి ఐడియా తట్టినప్పుడు తట్ట నెత్తినెట్టుకుని పరిగెత్తకుండా, అసలా ఐడియా అనేది స్క్రీన్ ప్లేకి స్ట్రక్చర్ నిచ్చే పరిధిలో వుందా లేదా తెలుసుకోక పోతే ఇంతే జరుగుతుంది.
అనుదీప్ స్కిట్స్ కి ఆధారంగా చేసుకున్నవి కులాలు, ఇండో -బ్రిటిష్ వైరం, దేశభక్తి -మానవత్వం మొదలైనవి. వీటిని వ్యంగ్యం చేసి, హాస్యం పట్టించి, ఎంత కడిగెయ్యాలో అంతా కడిగేసుకుంటూ పోయాడు.
‘కులాలు నర్సు చేతిలో వున్నాయి, ఇటు పిల్లని అటు మారిస్తే కులాలే మారిపోతాయి’... ‘దేశాల్ని ఆక్రమించి ఇండిపెండెన్స్ డే అనే ఫెస్టివల్ నిచ్చింది మీరు’... ‘ఇంగ్లీషోడికి ఇంకా ఇండియాలో చోటుందా’... వంటి డైలాగులెన్నో పేలుతూంటాయి. కృత్రిమ -కాపీ పేస్ట్- వాట్సాప్ జోకుల రోమాంటిక్, హార్రర్, క్రైమ్ ప్లాస్టిక్ కామెడీలతో మొహం మొత్తిన వాళ్ళకిది కాస్త ఉల్లాసమే.
ప్రతీ స్కిట్ ఏదో రకంగా హాస్య సంభాషణా బలంతో పేలేదే. నాలుగు స్కిట్స్ హైలైట్ గా వుంటాయి- కూరగాయల షాపు దగ్గర సొరకాయ కామెడీ, ఇంట్లో మొబైల్ కాలర్ ట్యూన్ కామెడీ, పోలీస్ స్టేషన్లో యాంటీ ఇండియన్స్- జనరల్ నాలెడ్జి కామెడీ, చివర్లో దేశభక్తి వర్సెస్ మానవత్వం కామెడీ క్లయిమాక్స్.
మంచి కామెడీ తీయాలంటే ఐక్యూ ఎక్కువుండాలి, ఇంటలిజెంట్ రైటింగ్ వుండాలి. ఇవి ఆద్యంతం స్కిట్స్ లో కన్పిస్తాయి.
నటనలు- సాంకేతికాలు
హీరోగా శివ కార్తికేయన్ కామెడీని చాలా ఈజ్ తో లాగించేశాడు. అతను చాలా సహజంగా సిట్యుయేషన్స్ లో ఇన్వాల్వ్ అయిపోతాడు. తండ్రి పాత్ర పోషించిన సత్యరాజ్ తో కామెడీ సీన్లు ఎక్కువ. సత్యరాజ్ ఇందులో ప్రధాన కమెడియన్ అనుకోవచ్చు. ప్రారంభంలో సరిహద్దులు గీసుకుని కొట్టుకుంటున్న వూరి జనాల కులాల పిచ్చిని కత్తితో చికిత్స చేసి, అదే కత్తితో దేశభక్తి, మానవత్వం గ్రూపులకి చికిత్స చేస్తాడు. కత్తితో ఎవరి చేతి మీద గీరినా రక్తం ఎరుపే నని చూపించడం అతడి హాబీ. తెల్లవాడైన జెస్సికా తండ్రి కూడా చేతి మీద గాటు వేయించుకుని, తనది కూడా ఎరుపు రక్తమే కదా అనుకుంటాడు. ఇలాటి వెర్రిమాలోకాలు వుంటారనేది లాజిక్. దీనిమీద అబ్సర్డ్ కామెడీ. సత్యరాజ్ చెయ్యి నరికేసి చూపిస్తే అది బ్లాక్ కామెడీ.
అలాగే పోలీస్ స్టేషన్ కామెడీలో ఇన్స్ పెక్టర్ పాత్రలో ఆనందరాజ్ నటన. ఇక భూకబ్జాలు చేసే కేడీగా ప్రేమ్జీ అమరేన్ ది కూడా మంచి కామెడీ. ఇవన్నీ ఒకెత్తైతే, జెస్సికా తండ్రిగా నటించిన కార్ల్ హార్ట్ చెప్పుకోదగ్గ నటుడు. ఇక హీరోయిన్ గా నటించిన ఉక్రెయిన్ నటి మరియా ర్యాబోషప్క తెలుగు పాత్రలో పూర్తిగా ఇమిడి పోయింది. ఇక్కడే పుట్టి పెరిగిన బ్రిటిష్ అమ్మాయిగా ఆ సహజత్వం ప్రదర్శించింది. క్లయిమాక్స్ కి ముందు సత్యరాజ్ తో, ఆనాడు బ్రిటన్ చేసిన అన్యాయాలన్నిటికీ క్షమాపణలు చెప్పే భావోద్వేగపూరిత సన్నివేశం కదిలించేదే. స్కూల్ కామెడీ దృశ్యాలు కూడా బావున్నాయి. ఇద్దరు బాలనటులు ఫన్నీగా వున్నారు.
కామెడీలో స్లో పాటలు, ఫ్లోని దెబ్బతీసే మాంటెజెస్ సాంగ్స్ లేకుండా హుషారు నిచ్చే పాటలున్నాయి.
రెండు గ్రూప్ సాంగ్స్ కి భారీ సెట్సే వేశారు. థమన్ సంగీతానికి తగ్గట్టు విజువల్స్
కూడా వున్నాయి. మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం కొన్ని ఔట్
డోర్స్ లో పాలిపోయినట్టు వుంది. ఎందుకలా
డీఐ చేశారో తెలీదు.
పోతే ఇది ద్విభాషా చిత్రమన్నారు
గానీ, ఇందులో తెలుగు నటీనటులెవ్వరూ లేరు. తమిళ సినిమాకి తెలుగు డబ్బింగ్
చేసినట్టుంది. అయితే తీసింది తెలుగు దర్శకుడు కావడంతో తెలుగే అన్పించే
డైలాగులున్నాయి. కథ గురించి ఆలోచించకపోతే స్కిట్స్ ని ఎంజాయ్ చేయొచ్చు కాసేపు.
సినిమాలు ఫస్టాఫ్ బావుంటే, సెకండాఫ్ బావుండడం లేదు. లేదా ఫస్టాఫ్
బాగా లేక సెకండాఫ్ బావుండే సినిమా లొస్తున్నాయి. ‘ప్రిన్స్’ మాత్రం ఫస్టాఫ్- సెకండాఫ్ రెండూ
స్కిట్స్ తో బోరు కొట్టవు. ఇదే స్కిట్స్ తో గాకుండా కథతోనే జరిగి వుంటే బావుండేది.
దర్శకుడి దర్శకత్వంలో వేగం వుంది, పంచ్ వుంది- తీయడానికి కథ లాంటిది తయారు
చేసుకుంటే బావుంటుంది. ఇంతకీ కథంటే ఏమిటి?
—సికిందర్
Wednesday, October 19, 2022
1236 : రివ్యూ!
దర్శకత్వం : అనుభూతీ కశ్యప్
తారాగణం : ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ సింగ్, షెఫాలీ షా, షీబా చద్దా, అభయ్ మిశ్రా, ఇంద్రనీల్ సేన్ గుప్తా
కథ : సౌరభ్ భరత్, విశాల్ వాఘ్; మాటలు : సుమిత్ సక్సేనా; స్క్రీన్ ప్లే : అనుభూతీ కశ్యప్, సుమిత్ సక్సేనా, సౌరభ్ భారత్, విశాల్ వాఘ్
సంగీతం : అమిత్ త్రివేది, ఛాయాగ్రహణం : ఈషిత్ నరేన్
నిర్మాణం : జంగ్లీ పిక్చర్స్
విడుదల : అక్టోబర్ 14, 2022
***
మగ డాక్టర్ గైనకాలజిస్టుగా ఆడవాళ్ళకి వైద్యం చేస్తే ఎలా వుంటుంది? అసాధారణ కథలతో సినిమాలు నటిస్తున్న ఆయుష్మాన్ ఖురానా మరోసారి గందరగోళం సృష్టించడానికి హాస్పిటల్ కామెడీతో విచ్చేశాడు. కొత్త దర్శకురాలు అనుభూతీ కశ్యప్ కొత్త ఐడియాతో అందరూ లేడీ డాక్టర్లూ -లేడీ పేషంట్ల మధ్య మేల్ డాక్టరుగా ఆయుష్మాన్ ని ఇరకాటంలో పడేసి, కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. గైనకాలజిస్టులు లేడీ డాక్టర్లే వుండాలా? మగ డాక్టర్ని మనుషులు భరించరా? మనుషులు
ఇంకా మారరా? డాక్టర్ కి ఆడా మగా జెండర్ ఏమిటి? ఆయుష్మాన్ డాక్టరుగా కొనసాగాలా, లేక తనలోని మనిషిని మేల్కొల్పాలా?... వంటి ప్రశ్నలతో ‘డాక్టర్ జీ’ ని ప్రేక్షకుల ముందుంచింది. ఇదెలా వుందో ఓ సారి చూద్దాం...
ఎంబిబిఎస్ పూర్తి చేసిన డాక్టర్ ఉదయ్ (ఆయుష్మాన్ ఖురానా)
పీడియాట్రిక్స్ లో చేరాలనుకుంటాడు. కానీ భోపాల్ మెడికల్ కాలేజీలో కూడా సీటు
దొరక్కపోవడంతో గైనకాలజీలో చేరిపోతాడు. క్లాస్ రూమ్ లో వీడెవడ్రా అన్నట్టు జ్యూనియర్
లేడీ డాక్టర్లు చూస్తారు. సీనియర్ లేడీ డాక్టర్లు అతడికి ఆడవాళ్ళ బట్టలు తొడిగి ‘పురుడు’ కూడా పోసేసి ర్యాగింగ్ చేస్తారు. జూనియర్లు జోకులతో ఆటలు పట్టిస్తారు.
చీఫ్ డాక్టర్ నందిని (షెఫాలీ షా) ఇవేమీ పట్టించుకోకుండా ఉదయ్ తో ప్రొఫెషనల్ గా
వుంటుంది. హాస్పిటల్లో డ్యూటీలు వేస్తూంటుంది. పురుడు పోయాలంటే భయపడి చస్తున్న
అతడికి జ్యూనియర్ డాక్టర్ ఫాతిమా (రకుల్ ప్రీత్ సింగ్) తోడుండి భయం పోగొడుతుంది.
ఆమెతో స్నేహం చేస్తాడు. తర్వాత ప్రేమలో పడతాడు.
ఇంటిదగ్గర ఉదయ్ కి సోషల్ మీడియాలో
స్టార్ అవ్వాలని ఏ యాప్ పడితే ఆ యాప్ లో చేరిపోయే తల్లి శోభా (షీబా చద్దా) వుంటుంది. ఈమె బూతు యాప్ టిండర్లో కూడా
చేరిపోయేసరికి తలబాదుకుంటాడు ఉదయ్. ఇంకోవైపు ఏళ్ళ తరబడి ఐఏఎస్ చదువుతున్న చెడ్డీ
(అభయ్ మిశ్రా) అనే ఫ్రెండ్ వుంటాడు. వీడు షర్టు వేసుకోకుండా చెడ్డీ మీద అర్ధ
నగ్నంగా వుంటాడు. చెడ్డీ సలహాలిస్తూ వుంటాడు. మరో వైపు ఉదయ్ బంధువు డాక్టర్ అశోక్ (ఇంద్రనీల్ సేన్ గుప్తా) వేరే సలహాలిస్తూంటాడు.
ఇలా హాస్పిటల్లో,
ఇంట్లో కామెడీలు, ఫాతిమాతో ప్రేమ దృశ్యాలతో సాగుతూ సాగుతూ
వుంటుంది. ఇంతకీ కథేమిటి? కథా? అదొకటుంటుందా? దీనికి పనిగట్టుకుని సెకండాఫ్ వెతకాలి.
ఇది హాస్పిటల్ కామెడీ కథ. ఫస్టాఫ్
ఒక కథ కాని కథలా, సెకండాఫ్ ఇంకో కథలా వుండే సెకండాఫ్
సిండ్రోమ్ అనే సుడిగుండంలో పడ్డ రచనా సంవిధాన దుర్విధానం. ఆడవాళ్ళకి వైద్యం చేసే మేల్
గైనకాలజిస్టు కాన్సెప్టు కొత్తదే. దీన్నెలా చెప్పాలో తెలిసేంత సృజనాత్మక వినాశ సామర్థ్యం
లేదు. కొత్త దర్శకురాలితో బాటు ముత్యాల్లాంటి నల్గురు రచయితలూ కలిసి హైలెస్సా అని తలా
ఓ వైపు లాగితే తాళ్ళు తెగాయి. చివరికి నాల్గు దిక్కుల్లో పంచ ముఖాలుగా ఈ కథని
లాగడం పురుడు పోసినంత సులువు కాదని అర్ధమైనట్టుంది, అలా వదిలేశారు.
మంది ఎక్కువైతే పాకం పాయకరావు పేట అవుతుందన్నట్టు డాక్టర్ జీ చెడింది. తెర మీద ఒక మేల్ డాక్టర్ -అందరూ ఫిమేల్ డాక్టర్లు, తెర వెనుక ఒక ఫిమేల్ డైరెక్టర్- అందరూ మేల్ రైటర్లు- మ్యాచింగ్ కుదర్లేదు...
కొత్త కథ, కొత్త పాత్రలు కావడం వల్ల ఫస్టాఫ్ ఆకర్షిస్తుంది ఫన్నీ దృశ్యాలతో. అయితే
ఈ కామెడీలు కూడా అదుపు తప్పి అశ్లీలంగా మారిన దృశ్యాలున్నాయి. నా దగ్గర లేని
దానికి నేనెలా వైద్యం చెయ్యను?- వంటి డబుల్ మీనింగులున్నాయి.
ఒక సీన్లో భార్యని తీసుకుని భర్త వస్తాడు. చీర పైకి లేపమని ఆయుష్మాన్ చూస్తూంటే, మా ఆవిడ్నే రేప్ చేస్తావురా అని ఆయుష్మాన్ ని ఉరికించి ఉరికించి కొట్టే
సీను మాత్రం బాగా పేలింది. ఇలాటి పరిస్థితి ఎదురయ్యే అవకాశమున్నదే.
కానీ సెకండాఫ్ కొచ్చేసరికి సీరియస్
గా మారిపోయి ఇంకో సినిమా చూస్తున్నట్టుంది. నిజానికి ఈ డాక్టర్ పాత్ర లేడీస్ ఓన్లీ అనే కొత్త వైద్య ప్రపంచంలో ఏలా
తనని మార్చుకుని ఇమిడిపోవాలన్న లక్ష్యంతో సాగాలి. దీన్ని హాస్యంగానే చెప్పాలి.
డాక్టర్ కాని డాక్టర్ ‘మున్నాభాయ్ ఎంబిబిఎస్’ మొత్తం హాస్యంగానే సాగుతుంది. అసలు దర్శకురాలు లేవనెత్తిన ప్రశ్నలకైనా సరైన సమాధానాలు చెప్పాలి. కానీ వీటితో సంబంధం
లేని ఏవేవో విషయాలతో, మధ్యలో విఫల ప్రేమ కథతో ఎమోషన్లు, సెంటి మెంట్లు, మెలోడ్రామాలతో లేనిపోయి
గాంభీర్యాన్ని తెచ్చిపెట్టారు. చివర్లో మాత్రం లింగ అసమానతల గురించి, వైద్య నీతి గురించీ
మెసేజి ఇస్తూ ఎలాగో ముగించారు.
ఆయుష్మాన్ ఫస్టాఫ్ వరకూ ఓకే,
సెకండాఫ్ మాత్రం ఫన్ వదిలేసి సీరియస్ గా, విషాదంగా వుండడం
బాక్సాఫీసు అప్పీలులా లేదు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర చాలా మంది లేడీ
డాక్టర్ పాత్రల మధ్య సరీగ్గా ఎస్టాబ్లిష్ కాదు. సెకండాఫ్ లో వేరే బాయ్ ఫ్రెండ్ వున్నాడని
ఆయుష్మాన్ కి గుడ్ బై చెప్పేస్తుంది. చివర్లో ఆ బాయ్ ఫ్రెండ్ తో పెళ్ళికే
కనిపించేది. చీఫ్ డాక్టర్ గా షెఫాలీ షా మాత్రం కాస్త ముద్ర వేస్తుంది తన పాత్రతో.
ఆయుష్మాన్ తల్లిగా సోషల్ మీడియా
స్టార్ అవ్వాలని రొమాంటిక్ గా మారే షీబా చద్దా పాత్ర కూడా మంచిదే. ఇన్నాళ్ళూ భర్త
పోయినా తను కొడుకు కోసం పెళ్ళి చేసుకోలేదు. ఇప్పుడు కొడుకు సెటిలయ్యాక తానూ పెళ్ళి
చేసుకుని సెటిలవ్వాలనే ఆమె ఆలోచన ప్రేమాయణానికే దారి తీస్తుంది. 1989 లో విడుదలైన
సన్నీ డియోల్, శ్రీదేవి, రజనీ కాంత్ ల ‘చాల్ బాజ్’ లో ఫ్యాషన్ పిచ్చిగల సీనియర్ నటి రోహిణీ హట్టంగడి
కామెడీని గుర్తుకు తెచ్చే నటన షీబాది.
ఇక పాటలైతే వున్నాయి గానీ కామెడీ
సినిమా కుండాల్సిన పెప్ లేదు. గుర్తుండవు. భోపాల్ నగరంలో కెమెరా వర్క్ మాత్రం
బాగానే వుంది.
—సికిందర్
Subscribe to:
Posts (Atom)