రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, May 24, 2022

1170 : స్పెషల్ ఆర్టికల్

 

    చార్య స్క్రీన్ ప్లే సంగతులు రెండవ భాగంలో ఒక చోట ఇలా చెప్పుకున్నాం - “ రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ లో  దివ్య శక్తులున్న ఆర్క్ ని దోచుకుందామని చూసే జర్మన్ నాజీల కేం గతి పట్టింది చివరికికాబట్టి  అమ్మవారితో వొక సూపర్ నేచురల్ హై పవర్ యాక్షన్ సీను కాగల కమర్షియల్ సందర్భాన్ని చేజార్చుకున్నారు. స్టార్ సినిమా కథకి థింక్ బిగ్ అనుకుంటే సరిపోదు, థింక్ హై అనుకోవాలి. రాస్తూంటే ఆ హై వచ్చేస్తూ వుండాలి” అని.

       చార్య ఆడలేదు. తర్వాత విడుదలైన సర్కారు వారి పాట బ్రేక్ ఈవెన్ కోసం స్ట్రగుల్ చేస్తూ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలా జరగడానికి కారణమేమిటి? రొటీన్ గా ఏ స్థాయిలో తెలుగు సినిమాలుంటున్నాయో అదే సోకాల్డ్ సేఫ్ జోన్ లో మళ్ళీ తీయడం. అంతకి మించి పైకి ఎదగకపోవడం. ఊహని విస్తరించక పోవడం. నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్ళక పోవడం. ప్రేక్షకులకి సరికొత్త అనుభవాన్నివ్వకపోవడం. చూసిందే చూపించే అదే రొటీన్, మూస, పాత ఫార్ములా - వీటినే నమ్ముకుని వుండడం. ఇలా బాక్సాఫీసు దగ్గర పరాభవాలెదురవుతున్నా మారకపోవడం. కరెన్సీ నోట్లు మారిపోయాయి, సినిమాలు మారడం లేదు. పాత నిల్వ సరుకు చూపిస్తూ కొత్త కరెన్సీ నోట్లు కోరుకుంటున్నాయి.   

        “... స్టార్ సినిమా కథకి థింక్ బిగ్ అనుకుంటే సరిపోదుథింక్ హై అనుకోవాలి. రాస్తూంటే ఆ ‘హై’ వచ్చేస్తూ వుండాలి అన్న కనువిప్పు ఇది వరకు ఈ వ్యాసకర్తకి లేదు. ఆచార్య స్క్రీన్ ప్లే సంగతులు  రాస్తూంటే అనుకోకుండా ఈ కనువిప్పు కల్గింది. కనువిప్పవడంతో ఆలోచన మొదలయ్యింది. మంచి సినిమాలు, చెడ్డ సినిమాలు అన్నీ ఆలోచింపజేస్తాయి క్వాలిటీ పరంగా. కనుక థింగ్ బిగ్ ఫిజికల్లీ యువర్స్ అనీ, థింక్ హై స్పిరిచ్యువల్లీ యూనివర్సల్ అనీ అర్ధం జేసుకుంటే సరిపోతుంది. అంటే థింక్ హై థింక్ బిగ్ కంటే విస్తారమైనదీ, శక్తిమంతమైనదీ అన్నమాట. థింక్ బిగ్ గురించి చాలా మోటివేషనల్ పుస్తకాలూ వీడియోలూ వున్నాయి. థింక్ హై అని గూగుల్ చేస్తే ఈ పేరుతో ఒక సాంగ్ మాత్రమే కన్పిస్తోంది.

ఐతే స్టార్ సినిమాలు థింక్ బిగ్ గా కూడా రావడం లేదు. స్టార్ సినిమాల్లో థింక్ బిగ్ అనేది టెక్నాలజీ పరంగా మాత్రమే వుంటోంది తప్ప కంటెంట్ పరంగా అదే సోకాల్డ్ సేఫ్ జోన్లో మూస తరగతే. మామూలు హీరోల సినిమా కథలే స్టార్ సినిమాలకుంటున్నాయి. కనుక థింక్ బిగ్ ని ఫిజికల్ అయినందుకు టెక్నాలజీకీ, థింక్ హై స్పిరిచ్యువల్ అయినందుకు కంటెంట్ కీ ఆపాదిస్తే, ఈ  ఫిజికల్- స్పిరిచ్యువల్ రెండిటి కాంబినేషన్ తో మంచి ఫలితాలు సాధించ వచ్చు. ఆఫ్టరాల్ స్క్రీన్ ప్లే అంటే తెరమీద చూపెట్టే మనిషి మానసిక లోకమే కాబట్టి- అంటే కాన్షస్ - సబ్ కాన్షస్ మైండ్ ల ఇంటర్ ప్లేనే కాబట్టి, ఇది స్పిరిచ్యువలే కాబట్టి, థింక్ హై ఇక్కడ కార్యాచరణలోకొస్తోంది.

దీనికేం చేయాలి?
        స్టోరీ ఐడియాల్ని వాడుకలో వున్న నిల్వ సరుకు నుంచి పుష్ చేసి ఇన్నోవేట్ చేయడమే. ఇమాజినేషన్ ని పుష్ చేసి, లేదా యాంటీగా ఆలోచించి, కొత్త పుంతలు తొక్కించడమెలా అన్నది ఇప్పుడు చూద్దాం.

        ఒక స్టోరీ ఐడియా లేదా కాన్సెప్ట్ ఎప్పుడు థింక్ బిగ్ అవచ్చు, ఎప్పుడు థింక్ హై అవచ్చు? హాలీ వుడ్ లాగ్ లైన్స్ (స్టోరీ ఐడియాలు) సెర్చి చేస్తూంటే ఏ క్వయిట్ ప్లేస్ అనే మూవీకి సంబంధించిన లాగ్ లైన్ థింక్ హైకి తార్కాణంగా కన్పిస్తోంది. చూస్తే ఇది 2018 లో 17 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో స్మాల్ మూవీ, కానీ బాక్సాఫీసు వచ్చేసి 341 మిలియన్ డాలర్ల గ్రాండ్ ఈవెంట్ గా వుంది!

        ఆలోచించాలి- ఎక్కడ 17, ఎక్కడ 341?మామూలుగా అయితే 17 మిలియన్ డాలర్ల ఈ స్మాల్ బడ్జెట్ మూవీకి లాగ్ లైన్ లేజీగా ఇలా వుండొచ్చు- అణుయుద్ధానంతరం నరమాంస భక్షక గ్రహాంతర జీవుల్ని తప్పించుకోవడానికి ఓ కుటుంబం ఇంట్లో తలుపులేసుకుని బందీ అయిపోయింది. ఈ స్టోరీ ఐడియా హైకాన్సెప్ట్ - బిగ్ బడ్జెట్ మూవీ స్క్రీన్ ప్లేకి కూడా బాగానే అన్పించ వచ్చు.  గ్రహాంతర జీవుల నుంచి రక్షించుకునే కథ. గ్రహాంతర జీవుల మీద ఎన్నో సినిమాలొచ్చాయి, ఇది డిఫరెంట్ గా ఏముంది? రొటీన్ గా ఏ స్థాయిలో ఇలాటి సినిమాలుంటున్నాయో అదే  సోకాల్డ్  సేఫ్ జోన్ లో ఇదీ వుందని లాగ్ లైన్ చూస్తే తెలిసిపోతోంది. ఇంతకి మించి పైకి ఎదగ లేదు. ఊహని విస్తరించుకో లేదు. నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్ళ లేదు. ప్రేక్షకులకి సరికొత్త అనుభవాన్నివ్వలేదు. చూసిందే చూపించే అదే రొటీన్, మూస, పాత ఫార్ములా - వీటినే నమ్ముకుని వుంది. కాబట్టి ఈ ఐడియాతో  ఎంత హైకాన్సెప్ట్ - బిగ్ బడ్జెట్ మూవీ తీసినా మూడో రోజుకల్లా కలెక్షన్స్ డ్రాప్ అవుతాయి.

        ఎందుకంటే ఇది టెక్నాలజీ పరంగా మాత్రమే ఫిజికల్లీ థింక్ బిగ్ కాబట్టి. కంటెంట్ పరంగా థింక్ హై ఆత్మ దీనికి లేదు కాబట్టి. థింక్ హై ఆత్మతో వుంటే కలెక్షన్స్ ని పిండుకుంటుంది. ఇదే చేసింది ఏ క్వయిట్ ప్లేస్’.

        ఏ క్వయిట్ ప్లేస్ లాగ్ లైన్ అసలేమిటంటే, అణుయుద్ధానంతరం వినికిడి శక్తి ఎక్కువున్న గుడ్డి నరమాంస భక్షక గ్రహాంతర జీవుల్ని తప్పించుకోవడానికి, ఓ కుటుంబం ఏ మాత్రం అలికిడి లేకుండా, ఎట్టి పరిస్థితిలో నోట్లోంచి మాట బైటికి రానివ్వకుండా తలుపులేసుకుని ఇంట్లో బందీ అయిపోయింది

        ఈ లాగ్ లైన్లో ఎంత సస్పెన్స్ వుంది, ఎంత థ్రిల్ వుంది. కేవలం రొటీన్ గా చూపించే గ్రహాంతర జీవులని గుడ్డి జీవులుగా చేసి, అధిక వినికిడి శక్తిని కల్పించడంతో కథే మారిపోయింది. కళ్ళు లేకపోయినా శబ్దం వింటే చంపేస్తాయి. నెక్స్ట్ లెవెల్ కెళ్ళిపోయింది కథ. తెలిసిన స్టోరీ లైనునే మెలిదిప్పితే కొత్త లైను అయిపోతుంది. ఇదే థింక్ హై టెక్నిక్.

        అశోకవనంలో అర్జున కళ్యాణం రొటీన్ లైనే. 33 ఏళ్ళు వచ్చినా హీరోకి పెళ్ళికాకపోవడం, పెళ్ళి ప్రయత్నాలు చేసుకోవడం కథ. ఈ లైనుతో ఇదివరకు సినిమాలొ చ్చేశాయి. ఈ కొత్త సినిమా కొత్తగా ఏం చూపించి బాక్సాఫీసు దగ్గర నిలబడింది? ఫ్లాప్ గానే మిగిలింది.

         33 ఏళ్ళు వచ్చినా పెళ్ళి  కానివాడు తనలాంటి ఇతరుల పెళ్ళిళ్ళు  చేయబూనాడు  అని లాగ్ లైన్ వుంటే కొత్త సినిమా అవుతుంది. రొటీన్ కి యాంటీగా ఆలోచించినప్పుడు థింక్ హై అవుతుంది. తన పెళ్ళి కోసం తను పాట్లు పడేవాడు కింది స్థాయి క్యారెక్టర్, తన పెళ్ళి కాకపోయినా ఇతరుల పెళ్ళిళ్ళు  చేసేవాడు పై స్థాయి క్యారెక్టర్. క్యారక్టర్ పై స్థాయిలో వుంటే కథ కూడా పై స్థాయిలో వుంటుంది.

రొటీన్ పాయింట్లు అనేవి నిల్వ సరుకు. నిల్వ సరుకుని వేడి చేసి అందిస్తే వర్కౌట్ అయ్యే రోజులు కావివి. అశోక వనంలో అర్జున కళ్యాణం కూడా పాత లైనుకి వేడి చేసిన  ఫ్రెష్ గా అన్పించే సీన్లే. ఫలితం ఏమైంది? స్టోరీ ఐడియాల్ని హై థింకింగ్ తో కథగా మార్చినప్పుడే నిజమైన ఫ్రెష్ సీన్లు వస్తాయి.

        స్టోరీ ఐడియా థింక్ హై గా వుండాలంటే ఈ  నాల్గిటిని కూడా థింక్ హైగానే   ఆలోచించాలి :  హీరో, హీరో గోల్, కాన్ఫ్లిక్ట్, సొల్యూషన్. రెగ్యులర్ హీరో, రెగ్యులర్ హీరో గోల్, రెగ్యులర్ కాన్ఫ్లిక్ట్, రెగ్యులర్ సొల్యూషన్ లతో సినిమాలుంటాయి. ఈ రెగ్యులర్ కి వ్యతిరేకంగా ఆలోచించినప్పుడు హీరో, గోల్, కాన్ఫ్లిక్ట్, సోల్యూషన్ హై లెవెల్లో కొత్తగా మారిపోతాయి. రిజర్వాయర్ డాగ్స్' లో దొంగలు దోపిడీ ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ విఫల మవుతుంది. అప్పుడు తమలో ఒకడు పోలీస్ ఇన్ఫార్మర్ వున్నాడని అనుమానిస్తారు. ఇది రెగ్యులర్. తమలో ఒకడు గాంధేయ వాది వున్నాడని అనుమానిస్తే? దొంగలందరూ  గాంధేయ వాదులుగా మారిపోతే? ఇదేదో కొత్త కామెడీ అవుతుంది. ఉన్నదానికి వ్యతిరేకం (యాంటీ) గా ఆలోచిస్తే థింక్ హై అయిపోతుంది. కాకపోతే యూనివర్సల్ స్పిరిచ్యువల్ టచ్ ఇవ్వాలి. గాంధేయ వాదులుగా మారడం యూనివర్సల్ స్పిరిచ్యువల్ టచ్చే. తన పెళ్ళి కాకుండా ఇతరుల పెళ్ళిళ్ళు చేయడం యూనివర్సల్ అప్పీలున్న స్పిరిచ్యూవల్ టచ్చే...

—సికిందర్


Sunday, May 22, 2022

1169 : సండే స్పెషల్

    సలు రాయాలంటే ముందు వామప్ (warm up) అవాలి. జిమ్ము కెళ్ళి బరువు లెత్తబోతే, జిమ్ ట్రైనర్ వచ్చేసి ముందు నీ బాడీని వామప్ చేసుకోమంటాడు. అంటే ఎకాఎకీన ఎత్తబోయిన బరువు శరీరం మీద పడి కండరాలు షాక్ కి గురవకుండా, నువ్వీ బరువెత్తబోతున్నావూ అని ముందస్తుగా కండరాలకి కౌన్సెలింగ్ చేసుకోవడమన్నమాట. కానీ రూములో రైటర్ రాయడానికి కూర్చున్నప్పుడు  మాత్రం అలాటి వామప్పులూ ఏవీ వుండవు. స్క్రిప్టు  రాయడం మొదలెట్టాడంటే వరసబెట్టి  సీన్లే రాసేస్తూంటాడు. జిమ్ములోలాగే రాయడానికి రూములో కూడా వామప్ చేసుకోవడం మనస్కరించదు. రాస్తున్న విషయానికి సంబంధించి ఏ విషయ సేకరణా (వామప్) వుండకపోతే, ఏ క్షేత్ర స్థాయి పరిస్థితుల పరిశీలనా (వామప్) వుండక పోతే, ఏవో వూహలు అల్లేసుకుంటూ తలోకంలో తాము ఆత్మకథ రాసుకోవడమే.  క్షేత్ర స్థాయిలో అంటే - పంపిణీ రంగంలో, ప్రేక్షక రంగంలో- జయాపజయాల కదనరంగంలో- ఇతర భాషా రంగాల్లో - పరిస్థితులేమిటో తెలుసుకోకుండానే గొప్ప వ్యాపారాత్మక  సినిమా స్క్రిప్టు రాయడం ఎలా సాధ్యం?

    బ్యాడ్ రైటింగ్ అంతా వామప్ కి ఎగనామం పెట్టే దగ్గరే మొదలవుతుంది. ఒక వస్తువు కొనాలన్నా నాల్గు చోట్ల వాకబు చేసి కొంటాం. కానీ  ఒక స్క్రిప్టు రాయాలంటే ఏ వాకబూ వుండదు. ఇప్పుడు నేనీ స్క్రిప్టు రాస్తున్నాను, దీన్నిప్పుడు ప్రేక్షకులు చూస్తారా, ప్రేక్షకులు ఎలాటివి చూస్తున్నారు, ఎలాటివి చూసి చూసి విసిగి పోయారు, కొత్తగా ఏం కోరుకుంటున్నారు, అసలు సినిమా ప్రేక్షకులుగా ఇప్పుడెవరున్నారు, మొదటి రోజు మొదటి ఆటకి వచ్చే ప్రేక్షకులెవరు, వాళ్ళ అభిరుచులేమిటి, వాళ్ళ అభిరుచులకి ఏ సామాజికార్ధిక పరిస్థితులు దోహదం చేస్తున్నాయి, ఏ సామాజికార్దిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని నేను రాయాలి, నేను రాయాలంటే సదా స్మరించుకోవాల్సిన  యూత్ అప్పీల్ అంటే ఏమిటి, ఆ యూత్ అప్పీల్ కి అబ్బాయిలే వున్నారా, అమ్మాయిలు కూడా వుంటున్నారా ప్రేక్షకుల్లో, ఎంత మంది అమ్మాయిలు  కొత్త దర్శకుల స్మాల్, మీడియం బడ్జెట్ సినిమాలకి వస్తున్నారు, రాకపోతే అబ్బాయిల కోసమే వేటిని దృష్టిలో పెట్టుకుని ఏ కల్చర్లో, ఏ జానర్లో  స్క్రిప్టులు రాయాలి...


        అసలు తెలుగు సినిమాల విజయాల రేటెంత, ఏ  సినిమాలు ఎందుకు ఫ్లాపవుతున్నాయి, ఎందరు కొత్త దర్శకులు వస్తున్నారు, వాళ్ళందరూ ప్లాపై వెళ్లిపోతూంటే నాకూ అదే పరిస్థితి వస్తుందా, అలా నాకు భయం వేయడం లేదా, ఎందుకు వేయడంలేదు, నా సొమ్ము కాదనా, ఫ్లాపవుతున్న వాళ్ళు చేస్తున్న తప్పులేమిటి, వాటిని నేనెలా నివారించుకోవాలి, వాళ్ళల్లో రచయితే వాళ్లకి శత్రువై పోతున్నాడా, అలాటి రచయితే  నాలో కూడా వున్నాడా,  ఐడియా నుంచీ డైలాగ్ వెర్షన్ దాకా నాకు తెలిసిందెంత, నా చుట్టూ వుండి సలహాలిచ్చే నా ఏజి గ్రూపు వాళ్ళ విషయ పరిజ్ఞానమెంత,  నూటికి నూరు శాతం ఫ్లాప్స్ ఖాయంగా ఏడాది కేడాది కళ్ళెదుట కన్పిస్తున్నప్పుడు నేను హిట్టివ్వగలనని ఏ ప్రాతిపదికన నమ్ముతున్నాను, అసలు నేను చేస్తున్న సబ్జెక్టు ప్రాతిపదికేమిటి, ప్రపంచంలో సినిమాలెన్ని రకాలు, కమర్షియల్ సినిమాలు, వరల్డ్ (ఆర్ట్) సినిమాలు అనే రెండు రకాలున్నాయని నాకు తెల్సా, వీటిలో మొదటి రకమే తెలుగులో పనికొస్తాయని నేనెప్పుడైనా ఆలోచించానా, స్క్రిప్టు కావల సినిమా ప్రపంచానికి సంబంధించి నా జనరల్ నాలెడ్జి ఎంత, నా స్క్రిప్టుకి శాస్త్రీయంగా స్ట్రక్చర్ లోవుంటూ అలరించే కమర్షియల్ సబ్జెక్టు ఎంచుకుంటున్నానా, లేక స్ట్రక్చర్ లేకుండా అశాస్త్రీయంగా వుంటూ తెలుగు ప్రేక్షకులకి సహన పరీక్షపెట్టే వరల్డ్ (ఆర్ట్)  మూవీస్ లాంటి ప్రయోజనంలేని సబ్జెక్టు చేస్తున్నానా,  నిర్మాత డబ్బుతో నా కళా తృష్ణ తీర్చుకోవడానికి వరల్డ్ (ఆర్ట్) మూవీ బాపతు స్క్రిప్టు రాసి నేనూ బరితెగించి నా వూళ్ళో ముఖం చూపించుకోలేని సినిమా అజ్ఞాని అనిపించుకోబోతున్నానా  ఒకవేళ...

        సినిమాలెక్కువగా ఎందుకని ఓన్ రిలీజ్ చేసుకోవాల్సి వస్తోంది, విషయం లేకపోతే  ఓన్ రిలీజ్ తప్పదా, ఓన్  రిలీజ్ అంటే ఆశలు వదులుకోవడమేనా, నిర్మాత ఓన్ రిలీజ్ కి సిద్ధపడక మూల పడేస్తే నా గతేంటి, ఇంకో సినిమా అవకాశం వస్తుందా, అసలీ కష్టాలెందు కొస్తున్నాయి, స్క్రిప్టు రాయడానికి ముందు తగు విధంగా వామప్ చేసుకోక పోవడం వల్లేనా...

        భారతదేశంలో మొత్తం ఎన్ని ప్రాంతీయ -  ఉపప్రాంతీయ సినిమా రంగాలున్నాయో -  అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలేమిటో నాకేమైనా తెలుసా, తెలుసుకోవడానికి ప్రయత్నించానా, ఎవరితోనైనా చర్చించానా, తుళు (టులు వుడ్) - బడుగ- కొంకణి - మీరట్ (మాలీవుడ్) - నాగపురి (ఝాలీవుడ్ ) -సంథాలీ (ఝాలీవుడ్) - డోగ్రీ- లడఖీ (పహారీవుడ్) - అస్సామీ (జాలీవుడ్) – ఒరిస్సా (ఓలీవుడ్) - చత్తీస్ ఘర్ (చోలీవుడ్)- గుజరాత్ (ఘోలీవుడ్) - భోజ్ పురి... ఇలా 30 దాకా ప్రాంతీయ, ఉప ప్రాంతీయ సినిమా పరిశ్రమలున్నాయని నాకెప్పుడైనా తెలుసా, ప్రాంతీయ- ఉపప్రాంతీయ సినిమాలంటేనే ఒకప్పుడు సామాజిక సమస్యలతో కూడిన వాస్తవిక (ఆర్ట్) కథా చిత్రాలే అయినప్పటికీ  అవన్నీ గత రెండు దశాబ్దాల కాలంలో ప్రపంచీకరణతో కొత్త తరం ప్రేక్షకులందుకున్న సరికొత్త అభిరుచులతో, జీవనశైలులతో పక్కా కమర్షియల్- మాస్- రోమాన్స్- కామెడీ – యాక్షన్ సినిమాలుగా మారిపోయి- సొమ్ములు చేసుకుంటున్న పరిణామ క్రమాన్ని నేనెప్పుడైనా గ్రహించానా...

        ఈ లోతట్టు ప్రాంతీయ - ఉప ప్రాంతీయ సినిమాలు చూసే ప్రేక్షకుల్లోనే ఇంత మార్పు వచ్చిందంటే, నేనింకా తెలుగు ప్రేక్షకులు నేను తీసే నాన్ కమర్షియల్ వరల్డార్టు సినిమాలు చూస్తారని ఎందుకు అనుకుంటున్నాను, తక్కువ మార్కెట్  గల ప్రాంతీయ -ఉపప్రాంతీయ రంగాల్లో తక్కువ బడ్జెట్లతో కమర్షియల్ సినిమాలు తీసి మూడు నాల్గు రెట్లు లాభాలెలా గడిస్తున్నారో ఎప్పుడైనా పరిశీలించానా, ఝార్ఖండ్ లో సినిమాలు తీస్తే రెండు కోట్లు సబ్సిడీ ఇస్తున్నారనీ -బాలీవుడ్ మేకర్లు ఝార్ఖండ్ బాట పడుతున్నారనీ నాకేమైనా తెల్సా, మొత్తం సినిమా వ్యవస్థని పరిశీలించకపోతే, అవగాహనా లేకపోతే  నేను మూవీ మేకర్ నెలా అవుతాను, స్క్రిప్టు రాయడానికి నేనేం పనికొస్తాను...

        నేను రాయబోయే సబ్జెక్ట్ ఏమిటి, దాని గురించి ఏం రీసెర్చి చేశాను, ప్రేమ సినిమా తీయాలన్నా సబ్జెక్టుని బట్టి రీసెర్చి తప్పని సరని నాకేమైనా తెల్సా,  దేని మీద ఆధారపడి సబ్జెక్టుకి ఐడియా అనుకుంటున్నాను, చూసిన తెలుగు సినిమాల నుంచి మృతప్రాయమైన మూస ఫార్ములా ఐడియాలు తీస్తున్నానా, లేక చుట్టూ ప్రపంచంలోకి చూసి మరింత డైనమిక్ గా  నాన్ ఫార్ములాయిక్ ప్రాక్టికల్ ఐడియాలు తీస్తున్నానా, ఒకప్పటి సినిమాల్లోలాగే ఇప్పుడు కుటుంబాలున్నాయా, ప్రేమలున్నాయా, పరిస్థితులున్నాయా...

        నేను రాసే సీన్లు -  డైలాగులు వచ్చిన సినిమాల్లో వచ్చినంత మంది వాడేసిన ఎంగిలి – టెంప్లెట్ సీన్లేనా -  డైలాగులేనా - లేక సొంతంగా నేనేమైనా సృష్టించి నాదంటూ వొక ముద్ర వేస్తున్నానా, నేను చూడడానికి - సినిమాగా తీయడానికి - విజువల్ గా స్క్రిప్టు రాస్తున్నానా, లేక చదువుకోవడానికి - చదువుకుని దిండు కింద పెట్టుకోవడానికి  మాత్రమే వ్యాసంలాగా స్క్రిప్టు రాస్తున్నానా,  నా సబ్జెక్టు ఏ జానర్ కిందికొస్తుంది, ఆ జానర్ మర్యాదలు నాకేమైనా తెల్సా, లేక గుండుగుత్తగా కలిపి కొట్టేస్తున్నానా, నేనేనుకున్న ఐడియా రఫ్ గా  మనసులోనే వుందా,  లేక స్పష్టంగా ముందు దాన్ని కాగితం మీద వర్కౌట్ చేశానా, నా ఐడియాలో కథే వుందా, లేక కమర్షియల్ సినిమాలకి పనికిరాని  గాథ వుందా, నా కమర్షియల్ ఐడియాని మూడు వాక్యాల్లో స్క్రీన్ ప్లే పాయింటాఫ్ వ్యూలో నిర్మించుకున్నానా, నిర్మించుకున్నాక స్క్రీన్ ప్లే పాయింటాఫ్  వ్యూలో సినాప్సిస్ రాసుకున్నానా, రాసుకున్నాక దాని ఆధారంగా వన్ లైన్ ఆర్డర్ వేస్తున్నానా, లేక ఇవన్నీ డుమ్మాకొట్టి పని దొంగలా మొక్కుబడి స్క్రిప్టు రాసి - రెండు కోట్లు బడ్జెట్ ఆశిస్తూ నిర్మాతల చుట్టూ తిరుగుతూ విఫలయత్నాలు చేస్తున్నానా...

        అసలు నాకు సినాప్సిస్ రాయడం వచ్చా, ఎప్పుడైనా నేనొక సినిమా చూసి ఒక పేజీలో క్లుప్తంగా  దాని కథ రాయగలిగానా, రెండు నిమిషాల్లో ఎవరికైనా ఆ సినిమా కథ  చెప్పగల్గానా, అసలు నేను అసిస్టెంట్ అవకముందు - అయ్యాకానూ -  ఏనాడైనా వివిధ జానర్లలో నా ఊహా శక్తినీ, నా కల్పనా శక్తినీ, నా సృజనాత్మక శక్తినీ  పరీక్షించుకుంటూ, సింగిల్ పేజీ మినీ కథలు రాసుకున్నానా...నేను ఇంటలిజెంట్ రైటర్నా, లేక లేజీ - అవుట్ డేటెడ్ రైటర్నా...

        ఇవీ వామప్ కి బారులు తీరే ప్రశ్నాస్త్రాలు. ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకోలేకపోతే స్క్రిప్టు రాయాలనే ఆలోచన వృధా అనుకోవాలి. ఈ వామప్ చేసుకున్నాకే స్క్రిప్టు రాయడం మొదలెట్టడానికి రెండో మెట్టు- స్క్రీన్ ప్లే సంగతులు తెలుసుకోవడం. వామప్ చేసుకోకపోతే  స్క్రీన్ ప్లే సంగతులు కూడా అనవసరం. అవి తెలుసుకుని ప్రయోజనం లేదు.

సికిందర్

 

 

Saturday, May 14, 2022

1168 : స్క్రీన్ ప్లే సంగతులు- 2


 

చార్య ప్రధాన కథలో ఫస్టాఫ్ లో ఫస్ట్ యాక్ట్, సెకండ్ యాక్ట్ -1 ఇంటర్వెల్ వరకూ వచ్చాయి. ఇంటర్వెల్ తర్వాత సెకెండాఫ్ లో సెకెండ్ యాక్ట్ -2 తో మిగిలిన ప్రధాన కథ ప్రారంభమవాలి. అయితే ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ మిగిలిన ప్రధాన కథ కాకుండా ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమయ్యింది. ఫ్లాష్ బ్యాక్ అనేది ప్రధాన కథ అవదు. ప్రధాన కథ అర్ధమవడానికి అవసరమైన పూర్వపు బ్యాక్ గ్రౌండ్ సమాచారాన్ని అందించే డేటా బ్యాంక్ మాత్రమే. అంటే ఇంటర్వెల్లో ఆగిన ప్రధాన కథ, ఫ్లాష్ బ్యాక్ నుంచి కావాల్సిన  సమాచారం తోడుకుని, ఆ ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాకే తిరిగి ప్రారంభమవుతుందన్న మాట. ఈ ఫ్లాష్ బ్యాక్ సుదీర్ఘంగా గంటా 5 నిమిషాల పాటూ వుంటుంది. దీని తర్వాతే ప్రధాన కథ మిగిలిన భాగం, అంటే సెకెండ్ యాక్ట్ -2 ప్రారంభమవుతుంది. ఫ్లాష్ బ్యాక్ గంటా 5 నిమిషాలు తీసుకున్నాక ఇక సినిమాకి మిగిలింది 15 నిమిషాలే. ఈ 15 నిమిషాల్లోనే సెకెండ్ యాక్ట్-2, థర్డ్ యాక్ట్ రెండూ కలిసి సర్దుకోవాలన్న మాట. అంటే దాదాపూ సెకెండ్ యాక్ట్ -2 లేనట్టే. అంటే దీనర్ధం ఇది మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్నమాట!

      ప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూద్దాం : కొన్నేళ్ళ క్రితం ధర్మస్థలిలో సిద్ధ (రామ్ చరణ్) ధర్మాన్ని కాపాడుతూ పెరుగుతాడు. దొంగతనం చేసి పారిపోతున్న దొంగని పట్టుకుని ధర్మం నేర్పి సంస్కరించాలనుకుంటాడు తప్ప శిక్షించడు. దొంగని కూడా మీరూ అంటూ గౌరవిస్తాడు. సిద్ధ ధర్మ స్థలిలోనే విద్యాలయంలో విద్యనభ్యసిస్తూ వుంటాడు. అక్కడే యంగ్ బసవ (సోనూ సూద్) విద్యార్థిగా వుంటాడు. ఇద్దరూ కుస్తీ నేర్చుకుంటారు. బసవ ధర్మాధర్మాల గురించి సిద్ధని రెచ్చగొడతాడు. సిద్ధ రియాక్షన్ చూపించగానే, ఏం లేదు ధర్మస్థలిలో అధర్మం పెరిగిపోతే ఎలా రియాక్ట్ అవుతావో చూడాలనుకున్నానని అంటాడు బసవ.


 సిద్ధ పూజారి (తనికెళ్ళ భరణి) కూతురు నీలాంబరిని (పూజా హెగ్డే) ప్రేమిస్తూంటాడు. ఇలావుండగా మైనింగ్ మాఫియా రాథోడ్ (జిశ్శూ సేన్ గుప్తా) తమ్ముడు (సౌరవ్ లోకేష్) వచ్చి పెద్దలకి ప్రతిపాదన చేస్తాడు. ధర్మస్థలి ఆదాయం మరింత పెరగాలంటే ఇక్కడ పరిశ్రమలు రావాలని అంటాడు. ధర్మస్థలి పెద్ద ఆదన్న(నాజర్) ఇతడి ఉద్దేశాన్ని పసిగట్టి తిరస్కరిస్తాడు. దీంతో బసవ రాథోడ్ తమ్ముడితో చేతులు కలిపి తవ్వకాలు మొదలెట్టిస్తాడు. సిద్ధ దీన్ని ఎదుర్కొంటాడు. తర్వాత రాథోడ్ తమ్ముడికి మరోసారి ధర్మాన్ని బోధిస్తాడు.

      ధర్మస్థలి ప్రజా బలం ఘట్టమ్మ ఆలయమేనని రాథోడ్ నమ్మి,  బుల్డోజర్ తో నేలమట్టం చేయిస్తూంటే అడ్డుకున్న సిద్ధ గాయపడి, నదిలో కొట్టుకుపోయి ఏఓబీ (ఆంధ్రా ఒరిస్సా బోర్డర్) లో నక్సల్ దళానికి దొరుకుతాడు.

      ఇంటర్నల్ ఫ్లాష్ బ్యాక్ :  ఇప్పుడు సిద్ధ పుట్టుర్వోత్తరాలు తెలుస్తాయి. సిద్ధ నక్సల్ శంకరన్న కొడుకు. పోలీసు కాల్పుల్లో తల్లిదండ్రులు చనిపోయారు. దాంతో కామ్రేడ్ ఆచార్య పాదఘట్టం తీసికెళ్ళి అదన్న కప్పగించాడు. సిద్ధ అక్కడే పెరిగి పెద్దవాడయ్యాడు. సిద్ధ ఎలా పెరుగుతున్నాడో ఓ కన్నేసి వుంచాడు ఆచార్య. 

      తిరిగి మెయిన్ ఫ్లాష్ బ్యాక్ :  ఇప్పుడు సిద్ధని చూసుకుని గర్విస్తాడు ఆచార్య. సిద్ధని దళంలో చేర్చుకుంటాడు. ఇద్దరూ కలిసి ఇంకో చోట రాథోడ్ దురాక్రమణని ఎదుర్కొంటారు. ఆ సందర్భంగా సిద్ధకో మ్యాప్ దొరుకుంటుంది. దాని ఆధారంగా రాథోడ్ పాద ఘట్టంని కూడా టార్గెట్ చేశాడని ఆచార్యకి చెప్తాడు. అంతలో రాథోడ్ అనుచరులు చేసిన  దాడిలో చనిపోతాడు. ఇప్పుడు ఆచార్య సిద్ధ కోరిక ప్రకారం, ధర్మ స్థలిని రాథోడ్ బారి నుంచి కాపాడేందుకు వచ్చి వడ్రంగి వేషంలో వుంటున్నాడన్న మాట (ఫ్లాష్ బ్యాక్  ఓవర్).

ఆచార్య గోల్ గల్లంతు
        ఇంటర్వెల్ సీన్లో ఆచార్య బసవకి చెప్పిన -

దివ్య వనమొక వైపు
తీర్ధ జల మొక వైపు
నడుమ పాద ఘట్టం

-కోడ్ లాంగ్వేజీని వివరించే ఉద్దశంతో ఈ ఫ్లాష్ బ్యాక్ అనుకోవాలి. ప్రధాన కథతో ఫస్టాఫ్ లో ఫోకస్ లేకపోయినా, సెకెండాఫ్ లోనైనా సక్సెస్ కోసం కనీస కృషి చేసినట్టు కనపడదు. ఫస్టాఫ్ నుంచీ కథ మొత్తంలో ఆచార్య గోల్ (లక్ష్యం) ఏమిటో పైకి చెప్పకుండా దాచారు. ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాకే అతను చనిపోయిన సిద్ధ కోరిక నెరవేర్చే ఉద్దేశంతో ధర్మస్థలికి వచ్చినట్టు గోల్ తెలుస్తుంది. ఇలా చివరి వరకూ గోల్ ని దాచిపెడితే కథెలా అర్ధమవుతుంది? ఇలా ఏ సినిమాలోనూ చూడం. హీరోకి ఫస్టాఫ్ లోనే గోల్ ని ఎస్టాబ్లిష్ చేసేసి, కథేమిటో చెప్పేసి, విషయం అర్ధమయ్యేలా కథ నడిపిస్తారెవరైనా.

        ఇలా ఆచార్య గోల్ ని దాచిపెట్టి చిట్టచివరికి రివీల్ చేయడాన్ని స్ట్రక్చర్ అనుమతించదు. అనుమతించి వుంటే ఆచార్య ఫ్లాప్ కాకూడదు. స్క్రీన్ ప్లే పేజీకి 90 లక్షలు బడ్జెట్ ని డిమాండ్ చేస్తున్నప్పుడు శ్రీలంక సంగతిలా కాకూడదు సినిమా. శ్రీలంక ప్రధాని రాజపక్సే పాతాళమంటుతున్న ఆర్ధికవ్యవస్థని కప్పిపుచ్చడానికి మతవాదాన్ని రెచ్చగొడుతూ ఆనందించాడు. చివరికి స్వమతస్తులే దివాలా తీసి భారీ యాక్షన్ సీన్సుతో, బ్లాస్టింగ్స్ తో మతోన్మాద రాజపక్సేని పూర్వపక్షం చేశారు. త్రేతాయుగంలో మనం చూడని లంకా దహనాన్ని పానిండియా లెవెల్లో చూపించారు. అసలు విషయాన్ని దాచిపెట్టి వేరే విషయాలతో కథ నడిపితే దేశమైనా, సినిమా అయినా ఇంతే.

సస్పెన్సుకి రెండు పొరలు

గత వ్యాసంలో పేజీకి 90 లక్షలు బదులు సున్నా తగ్గి 9 లక్షలు అని పడుతూ పోయినట్టుంది. ఈ విషయాన్ని ప్రముఖ రచయిత ఒకరు దృష్టికి తెస్తే ఈ సవరణ. ఆచార్య పై ఫ్లాష్ బ్యాక్ అంతా ధర్మస్థలి ప్రజలకి చెప్పడం పూర్తి చేసి, ధర్మస్థలికి ఇలా ఇందుకు తను వచ్చానంటాడు. ఎందుకు? మాఫియాలకి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ప్రాణాలర్పించిన సిద్ధ కోరిక తీర్చేందుకు.

        సిద్ధ కోరిక తీర్చాలనే తన గోల్ ని ఇప్పుడు ఈ కథ చివర్లో వెల్లడిస్తున్నాడు ఆచార్య. ఇలా చివరి వరకూ గోల్ ని దాచిపెట్టడం సస్పెన్స్ కూడా అవదు. సస్పెన్స్ కర్మకి వుంటుంది, క్రియకి  వుంటుంది, కర్తకి వుండదు. సస్పెన్స్ అనే అంశం రెండు పొరలతో కప్పి వుంటుంది. మొదటి పొర ఎందుకు?’ అన్న ప్రశ్నతో, రెండో పొర ఎలా?’ అన్న ప్రశ్నతో. ఈ రెండు పొరలూ అలాగే కప్పి వుంచితే ఏ సస్పెన్సూ అనుభవం కాదు. అందుకని ముందు ఎందుకు?’ అన్న పొరని విప్పి చూపించెయ్యాలి.

        ఆచార్య ఎందుకొచ్చాడు? సిద్ధ కోరిక తీర్చేందుకు వచ్చాడని వెంటనే మొదటి పొర విప్పేయాలి. దీంతో గోల్ తెలుస్తుంది. అప్పుడు ఆ కోరిక ఎలా తీరుస్తాడో- ఆ గోల్ ఎలా పూర్తి చేస్తాడో- ఎలా?’ అన్న ఈ రెండో పొర విప్పకుండా, సస్పెన్సుతో కథనంలో చూపిస్తూ పోవాలి. ఇలా కాక - ఎందుకు? ఎలా? - అనే పొరలు రెండూ  మూసి పెడితే కథేమిటో తెలియదు, పాత్ర నిలబడదు.

కోరికా? పగా?
        ఈ మొదటి పొర విప్పడం కూడా సకాలంలో ఫస్ట్ యాక్ట్ ప్లాట్ పాయింట్ -1  దగ్గర జరగాలి. అక్కడ జరగకుండా సెకండ్ యాక్ట్ - 2 చివర్లో వచ్చే, ప్లాట్ పాయింట్-2 దగ్గర చెప్తే లాభం లేదు. ప్లాట్ పాయింట్ - 2 అనేది, ప్లాట్ పాయింట్ - 1 దగ్గర ఏర్పాటు చేసిన సమస్యకి / గోల్ కి పరిష్కారం చూపే టర్నింగ్ పాయింటు మాత్రమే.

        కానీ ఇక్కడ తను ఎందుకొచ్చాడో సకాలంలో పొర విప్పకపోవడం ఒక సమస్య అయితే, అసలు సమస్య - సిద్ధ కోరిక తీర్చడానికి తను వచ్చినట్టు చెప్పడంతో వచ్చింది. సిద్ధ కోరిక తీర్చడమేమిటి? సిద్ధ చావుకి పగదీర్చుకోవాలి గాని! భాష తేడా వల్ల కథే మారిపోతుంది.

        కోరిక తీర్చడం- పగ దీర్చుకోవడం రెండూ వేర్వేరు భాషలు, ఎమోషన్లు. మొదటిది ప్రో, రెండోది యాంటీ. మొదటి దాంట్లో యాక్షన్ లేదు, రెండో దాంట్లో యాక్షన్ వుంది. రాథోడ్ బారి నుంచి ధర్మస్థలిని కాపాడాలన్న సిద్ధ కోరిక తీర్చే సాత్విక ఆలోచనతో వచ్చాడు కాబట్టే, ఆ నిదామైన ధోరణిలో వడ్రంగిలా బస చేసి సెటిల్డ్ గా వున్నాడు. ఏవేవో వేరే గొడవల్ని పరిష్కరిస్తూ కాలయాపన చేశాడు. పాత్ర మానసికంగా ఎలా వుంటే అలాగే ప్రవర్తిస్తుంది. ఆచార్య సిద్ధ కోరిక తీర్చాలన్న సాత్విక భావంతో వున్నాడు గనుకే, ఫస్టాఫ్ అంతా అలా శాంత మూర్తిలా పాసివ్ రియాక్టివ్ పాత్రగా గా కనిపించాడు. వాడిన భాష వల్ల కథే మారిపోతుంది.

        అదే సిద్ధ చావుకి పగదీర్చుకోవాలన్న పౌరుషంతో - యాక్షన్ తో వచ్చి వుంటే, అసలు ధర్మస్థలికే రాడు. మొదట శత్రువు లెక్కడున్నారో వేటాడి వేటాడి అక్కడే చంపేసి ధర్మస్థలికి వచ్చి ముగింపు పలక వచ్చు. అనుచరుడు శత్రువుల చేతిలో చనిపోతే, నక్సల్ క్యారక్టర్ అనేవాడు, అనుచరుడి కోరిక తీర్చాలని తీరిగ్గా వచ్చి ధర్మస్థలిలో బస చేస్తాడా, లేక తక్షణం పగదీర్చుకునే యాక్షన్లోకి దిగుతాడా? ఇదీ పాయింటు. క్రితం వ్యాసంలో చెప్పుకున్నట్టు ఈ విధంగా స్క్రీన్ ప్లే కమర్షియల్ గా లేదు, ఇలా లాజికల్ గా కూడా లేదు.

సిద్ధ ఫ్లాష్ బ్యాక్ స్ట్రక్చర్

ఏ ఫ్లాష్ బ్యాక్ అయినా త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ తోనే వుంటుంది. అంటే ఫస్ట్ యాక్ట్, సెకెండ్ యాక్ట్ -1, సెకెండ్ యాక్ట్ -2, ఎండ్ అనే నాల్గు విభాగాలూ వుంటాయన్న మాట. ఇందులో ఫస్ట్ యాక్ట్ లో సిద్ధని పరిచయం చేశారు అతనెవరో చెప్పకుండా. అతనెవరో, ఎవరికి పుట్టాడో ఇప్పుడే చెప్పకపోవడం మంచిదే. కానీ తనెవరూ అన్న ప్రశ్నతో బాధ  అతడికున్నట్టు మనకి తెలియాలి. ఇది క్యారక్టర్ పరంగా కథా బలాన్నీ, సస్పెన్సునీ పెంచడానికే. క్యారక్టర్ భావోద్వేగాల్ని సిల్వర్ స్క్రీన్ మీద స్ప్రెడ్ చేయడానికే. పైగా ఈ ఫ్లాష్ బ్యాక్ లో భాగంగా తర్వాత వచ్చే ఇంటర్నల్ ఫ్లాష్ బ్యాక్ లో ప్రేక్షకుల్ని భోరున ఏడ్పించేందుకే- అందుకని ఇప్పుడు సిద్ధని అతడి జన్మ రహస్యం వెంటాడుతున్నట్టు వుండాలి. ఇలా లేకపోవడంతో ఇంటర్నల్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఫ్లాట్ గా తేలిపోయింది.

        ఫ్లాష్ బ్యాక్ ప్రారంభంలో సిద్ధ దొంగని పట్టుకునే యాక్షన్ సీను చూపించి, ధర్మం పట్ల అతడి పాజిటివ్ వైఖరి చెప్పారు. అతనెప్పుడూ ధర్మం గురించి మాట్లాడడం చాదస్తంగా వుంది, యూత్ అప్పీల్ లేదు. నేనున్న చోట నకరాలు పనికిరావు అంటూంటే యూత్ క్యారక్టర్ అసెర్టివ్ గా, ఆసక్తికరంగా వుండేది. తను యాక్టివ్ క్యారెక్టరే, కానీ మాట్లాడే భాష చాదస్తపు భాష. ఆచార్య పాసివ్ రియాక్టివ్ క్యారక్టర్. భాష పాసివ్ క్యారక్టర్ భాష.

        అయితే సిద్ధ దొంగని పట్టుకునే సీరియస్ యాక్షన్ సీను కాస్తా కామెడీగా తేలింది. ఆ దొంగోడు నగ కొట్టేసి పరుగెత్తు కెళ్ళి బస్సెక్కి కూర్చుంటాడు. అతను కూర్చున్న విండోకి వూచ వుండదు. ఇటు పక్క అటు పక్క విండోస్ కి వూచ వుంటుంది. దొంగ కూర్చున్న విండోకే వూచ ఎందుకుండదంటే, మన రామ్ చరణ్ దొంగని పట్టుకు లాగితే అమాంతం విండోలోంచి బయటకొచ్చి పడాలని - ఆ విధంగా తెలివిగా అక్కడ వూచ కట్ చేశాడు యాక్షన్ డైరెక్టర్. యాక్షన్ డైరెక్టర్ కుట్ర తెలియక ఆ విండో దగ్గరే కూర్చున్నాడు దొంగ! మొత్తం మీద అమ్మవారి దయవలన ధర్మం బస్సు నాల్గు చక్రాల మీద నిలబడింది.

        సిద్ధని  గురుకుల మహా విద్యాలయం విద్యార్థి గానూ పరిచయం చేసి, సహ విద్యార్ధిగా బసవని చూపించారు. ఇక్కడ ఇద్దరి కుస్తీ చూపిస్తూ, ధర్మం పట్ల ఇద్దరి వ్యతిరేక భావాలతో సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన ప్రారంభించారు.
   
 ఆ తర్వాత సిద్ధ ప్రేమికురాలిగా  ఇంకో పాత్ర నీలాంబరి (పూజా హెగ్డే) ని పరిచయం చేశార ఈమెని ఫస్టాఫ్ లో పూజారి కూతురుగా పరిచయం చేశారు. ఇప్పుడు సిద్ధ ప్రియురాలు. దీని తర్వాత సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన తీవ్రత పెంచుతూ  మైనింగ్ మాఫియా రాథోడ్ తమ్ముడు (సౌరవ్ లోకేష్ ) ని పరిచయం చేశారు పరిశ్రమ పెట్టాలన్న ప్రతిపాదనతో. దీన్ని ధర్మస్థలి పెద్ద ఆదన్న (నాజర్) తిరస్కరించడంతో, రాథోడ్ తమ్ముడితో బసవ చేతులు కలపడాన్నీ, తవ్వకాలు జరపడాన్నీ చూపించి మొత్తానికి సమస్యని ఏర్పాటు చేశారు. ఈ సమస్యని ఎదుర్కొనే సిద్ధతో ప్లాట్ పాయింట్ - 1 కొచ్చి, సిద్ధకి మాఫియాల్ని ఎదుర్కొనే గోల్ ని ఏర్పాటు చేసి - ఫస్ట్ యాక్ట్ ని ముగించారు. విచిత్రమేమిటంటే ఇలా ఈ ఫస్ట్ యాక్ట్ తో ఇక్కడ కన్పిస్తున్న స్ట్రక్చర్,  ఫస్టాఫ్ లో ఆచార్య పాత్రతో ప్రధాన కథకి లేదు. ఇది గమనించాం. 
కానీ సడలిన సెకెండ్ యాక్ట్
        ఫ్లాష్ బ్యాక్ ఫస్ట్ యాక్ట్ స్ట్రక్చర్ లో వుంటే, ఇక సెకెండ్ యాక్ట్ తో మళ్ళీ స్ట్రక్చర్ సమస్య. ఆస్కార్ విన్నర్ దేర్ విల్ బి బ్లడ్ సెకెండ్ యాక్ట్ -2 లో ఒక సీనుంటుంది. కథానాయకుడు డానీ తన మిత్రుడ్ని చంపేసి పాతి పెట్టాక, తెల్లారి అడవిలో సేద దీరుతున్న అతడి దగ్గరికి విలియం బాండీ అనే వృద్ధుడు వచ్చే సీను. క్లోజప్స్ తో ఎక్సెలెంట్ సీను. తను డానీ చేసిన హత్యని చూశాడు. దాంతో ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చాడు. డానీ నాస్తికుడుగా వుంటూ మతాన్ని ఎలా పడితే అలా అవమానిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు మర్యాదగా వచ్చి మతాన్ని ఒప్పుకుని పాపినని క్షమాపణ వేడుకుంటావా, లేక జైలుకి పోతావా?’ అని బ్లాక్ మెయిల్ చేస్తాడు బాండీ. నాస్తిక ఆస్తిక సంఘర్షణలో డానీని స్ట్రాంగ్ గా ఇరకాటంలో పెట్టేసే సీను.

        దీని ప్రస్తావన ఇక్కడెందుకంటే, పైన చెప్పుకున్న సిద్ధ పాత్ర  ఫస్ట్ యాక్ట్ ముగిసి, సెకండ్ యాక్ట్ ప్రారంభ దృశ్యంలో, ఇలాగే అడవిలో విశ్రమించిన రాథోడ్ తమ్ముడి దగ్గరికి వస్తాడు.  టెంపుల్ దగ్గరే అర్ధమయ్యేలా చెప్పాం. నీకు అర్ధమయ్యేవరకూ చెప్పడం నా ధర్మం. ఆపదొస్తే దాన్నీ ఎదుర్కొంటాం అంటాడు. ఇంతే సీను. అనేసి వెళ్ళిపోతాడు. ఈ సీనుతో ఏం సాధించినట్టు? ఈ సీన్లో మరి రాథోడ్ తమ్ముడి రియాక్షన్ ఏమిటో చూపించలేదు. ఇతడి సజెషన్ లో సిద్ధని లాంగ్ షాట్ లో నించోబెట్టి షాట్ తీశారు.

        తీసిన షాట్ పాత్ర మానసిక స్థితిని బయటపెడుతుంది. సిద్ధని లాంగ్ షాట్ లో అలా చూపించారంటే, అతను కమిట్ మెంట్ లేక, రాథోడ్ తమ్ముడికి దూరం దూరంగా ఏదో చెప్పేసి వెళ్లిళ్ళిపోవడానికి వచ్చిన తేలిక అర్ధాన్ని తెలుపుతుంది ఈ షాట్. అదే బలమైన సంకల్పంతో వచ్చుంటే, రాథోడ్ తమ్ముడికి దగ్గరగా, క్లోజప్ లో కొచ్చి- కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ మాట్లాడేవాడు పౌరుషంతో. ఇది ప్రేక్షకులపైన ఇంపాక్ట్ చూపిస్తుంది.

        అసలు ఈ సీను కథని ముందుకు ఏం నడిపించింది? ధర్మం గురించి మాట్లాడే సిద్ధ సీనుకుండే ధర్మాన్ని ఎలా మర్చిపోయాడు? పేజీకి 90 లక్షలు ఖర్చు  పెట్టిస్తున్నావు, ఇలా వచ్చి ఓ మాట చెప్పేసి నేను వెళ్ళిపోయే సీనుతో ఏం సాధిద్దామని? సీను కథని ముందుకు నడిపించే విషయంతో నైనా వుండాలి, లేకపోతే పాత్ర గురించి కొత్త విషయం చెప్పడానికైనా వుండాలి కదా? రెండూ లేకపోతే ఈ సీనుని బయ్యర్ కెలా అమ్ముదామనుకుంటున్నావు? ముందు సీను ధర్మం పాటించి తర్వాత ఎదుటి వాడికి ధర్మం గురించి చెప్పు-  అని తప్పకుండా సిద్ధ తనని సృష్టించిన కథకుడితో అనాలనుకుని వుంటాడు.

   ఫస్ట్ యాక్ట్ ని బాగానే నిర్మించి, సెకెండ్ యాక్ట్ ప్రారంభంలోనే కథకుడు దారి
తప్పాడు. టెంపుల్ దగ్గర చెప్పిన విషయమే చెప్పడానికి ఈ మరో సీనెందుకు?  సెకెండ్ యాక్ట్ ధర్మం ప్రకారం ఏర్పాటైన సమస్య గురించి హీరో విలన్ల మధ్య సంఘర్షణ తీవ్రత పెరుగుతూ వుండాలిగా? అలాటి సీన్లు పడాలిగా?

         
దేర్ విల్ బి బ్లడ్ లో వెనుకటి హత్య జరిగిన సీను పరిణామాలతో ఎలా కొత్త సీను కథని ముందుకు నడిపించింది? ఇప్పుడు డానీ గనుక మతాన్ని ఒప్పుకోకపోతే, వూచలు లెక్కెట్టే లాక్ వేశాడు బాండీ బ్లాక్ మెయిల్ చేస్తూ. ఇలాటిదేదో రాథోడ్ తమ్ముడికి సిద్ధ ఎందుకు చేయకూడదు? భూ కబ్జాలతో ముందు కెళ్ళ కుండా రాథోడ్ తమ్ముడ్ని స్ట్రాంగ్ గా ఇరకాటంలో పెట్టేసే సీనెందుకు కాకూడదిది? పరస్పరం హీరో విలన్లు ఎత్తుగడలతో దెబ్బతీసుకునే యాక్షన్ రియాక్షన్ల సంకుల సమరమేగా సెకెండ్ యాక్ట్ బిజినెస్ అంటే?

బుల్డోజర్ ట్రబుల్

ఈ ఫ్లాష్ బ్యాక్ సెకెండ్ యాక్ట్ నైనా దాని డ్యూటీ ప్రకారం జరగనిచ్చివుంటే, ఫస్టాఫ్ నిరాశ నుంచి తేరుకో గలరు ప్రేక్షకులు. ఎంతో కొంత సక్సెస్ అయ్యేది కూడా సినిమా. ఇక సిద్ధ- రాథోడ్ తమ్ముడి సీను తర్వాత - ధర్మస్థలి ప్రజా బలమంతా ఘట్టమ్మ ఆలయమేనని రాథోడ్ నమ్మి, బుల్డోజర్ తో ఆలయాన్ని కూల్చే సీను వస్తుంది. చాలా మంచి కథనం. స రీగ్గా ఉపయోగించుకుంటే కమర్షియల్ గా బలంగా హైలైట్ అవగల సీను. సినిమా ప్రారంభంలో ప్రిన్స్ మహేష్ బాబు వాయిసోవర్ ప్రకారం - పూర్వ కాలంలో సిద్ధవనంలో ఓ రాక్షస మూక దండెత్తి వస్తే, యోగుల తపో బలంతో ఘట్టమ్మ వారు ప్రత్యక్షమై ఆ రాక్షస మూకని సంహరించిందని గుర్తుండే వుంటుంది.

        ఇప్పుడా ఘట్టమ్మవారు ఏమైంది? చరిత్ర రిపీటవుతున్నట్టు ఇప్పుడు రాక్షస మూకగా మైనింగ్ మాఫియా వచ్చి పడితే, అదీ ఆలయాన్ని కూల్చడానికి తన మీదికే బుల్డోజర్ తో దండెత్తి వస్తే, ఏం చేస్తోంది అమ్మవారు? తన రక్షణ ప్రజలకి వదిలేసి ఎందుకు వూరుకుంది? తన శక్తులు చూపించి- ఆ బుల్డోజర్ ని ముక్కలు చేసి, మళ్ళీ ఎవరూ బుల్డోజర్ పేరెత్తకుండా, కన్నెత్తి చూడకుండా, బ్రిటిష్ ప్రధాని ఇండియా వస్తే బుల్డోజర్ ఎక్కి ఫోజులు కొట్టకుండా - ఎత్తి అవతలికి విసిరి పారేయదా? హాల్లో ఈలలూ చప్పట్లూ మోగించుకోదా? నో కమర్షియల్ జోష్, నో? 

        ది ఎమరాల్డ్ ఫారెస్ట్ లో చూద్దాం :  ఇందులో అడవిని నరుక్కుంటూ బుల్డోజర్ వస్తూంటే, భయంతో దూరంగా నక్కి చూస్తున్న గిరిజనుల్లోంచి పిల్లవాడు - అదేంటని అడిగితే - మనమేదో  పాపం చేశామని దేవుడు దెయ్యాన్ని పంపుతున్నాడని అమాయకంగా అంటాడు గిరిజనుడు. అది బుల్డోజర్ అని అతడికి తెలీదు. దాన్నెప్పుడూ అతను చూడలేదు. అతను చెప్పే ఈ డైలాగ్  వైరల్ అయ్యిందానాడు.

        రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ లో  దివ్య శక్తులున్న ఆర్క్ ని దోచుకుందామని చూసే జర్మన్ నాజీల కేం గతి పట్టింది చివరికి? కాబట్టి  అమ్మవారితో వొక సూపర్ నేచురల్ హై పవర్ యాక్షన్ సీను కాగల కమర్షియల్ సందర్భాన్ని చేజార్చుకున్నారు. స్టార్ సినిమా కథకి థింక్ బిగ్ అనుకుంటే సరిపోదు, థింక్ హై అనుకోవాలి. రాస్తూంటే ఆ హై వచ్చేస్తూ వుండాలి.

        ఇలా కాకుండా ఆలయం మీద బుల్డోజర్ తో రొటీన్ గా మాఫియాల దాడి, దాన్ని రొటీన్ గా ప్రజలెదుర్కోవడం, ఆ రొటీన్ పోరాటంలో సిద్ధ నదిలో పది కొట్టుకు పోవడం... వల్ల ఒనగూడిన నాటకీయ ప్రయోజనం కూడా లేదు. మాఫియాల్ని చిత్తు చేసి అమ్మవారు సిద్ధని నదిలో విసిరి పారేస్తే అర్ధముంటుంది. నీ పని ఇక్కడ కాదు, ఇంకో చోట నీ అవసరముందన్న అర్ధంలో.

    ఈ కీలక యాక్షన్ సీసులో ఎమోషనల్ బ్యాకప్ లేకపోగా ఫీల్ కూడా లేకపోవడం గమనించవచ్చు. రాత్రి పూట సడెన్ గా బుల్డోజర్ తో ఎటాక్ జరుగుతుంది. ఇలా కాకుండా అడవిలో దూరం నుంచి ఏదో వస్తున్న ఇంజన్ శబ్దం, అది వింటున్న ప్రజలు అప్రమత్తమవడం, రానురాను ఆ శబ్దం దగ్గరవుతూ టెర్రర్... టెర్రర్ ఫీలింగ్... చూస్తే చీకట్లో  రాక్షసిలా బుల్డోజర్! ఇలాటి మైక్రో లెవెల్ థింకింగ్ మేకర్ పట్ల గౌరవాన్ని పెంచుతుంది.

        సార్, నేను పెట్టే ప్రతి కోటికీ సినిమాలో పది రూపాయలు లాభం వచ్చేట్టు సీన్లు రాయండి సార్- ఒక్కో సీను ఒక్కో సినిమా అనుకోండి సార్ -అని బయ్యర్ బాధతో లేఖ రాసే పరిస్థితి రాకూడదు. సినిమా అనేది స్టార్ కోసం, మేకర్ కోసం, నిర్మాత కోసం, ప్రేక్షకుల కోసమూ కాదు- బయ్యర్ కోసం. సినిమాల సీరియల్ బాధితుడు అతనే.

ఇంటర్నల్ ట్రబుల్ 
        ఇప్పుడు ఇంటర్నల్ ఫ్లాష్ బ్యాక్ సంగతి. ఇక సిద్ధ ఆంధ్రా ఒరిస్సా బోర్డర్ లో నదిలో కొట్టు కొచ్చి దళానికి దొరికాక ఇంటర్నల్ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఇందులో సిద్ధ నక్సల్ శంకరన్న కొడుకనీ, పోలీసు కాల్పుల్లో తల్లిదండ్రులు చనిపోయారనీ, దాంతో కామ్రేడ్ ఆచార్య పాదఘట్టం తీసికెళ్ళి అదన్న కప్పగించాడనీ,  సిద్ధ అక్కడే పెరిగి పెద్దవాడయ్యాడనీ ఫ్లాట్ గా సీన్లు చెప్తాయి.

        ఈ సీన్లు ఫస్ట్ పర్సన్ లో సిద్ధ పాయింటాఫ్ వ్యూలో అతను గుర్తు చేసుకుంటున్న తన జన్మ రహస్యంగా వుండి వుంటే సీన్లకి డెప్త్ తో, షాక్ ఎలిమెంట్ తోడయ్యేది. తనెవరు?- అని మొదట్నుంచీ వెంటాడుతున్న ప్రశ్నని రేకెత్తెస్తూ వచ్చి వుంటే, ఆ సెటప్ చేసిన ప్రశ్న ఇలా పవర్ఫుల్ గా, ఎమోషనల్ గా పే ఆఫ్ అయ్యేది. ఒక రహస్యం బయటపెట్టినప్పుడు అది కదిలించకపోతే రహస్యమే కాదు. ఈ ఇంటర్నల్ ఫ్లాష్ బ్యాక్  లో చిరంజీవిని సీజీతో ముప్ఫైలలో వున్న యువకుడుగా చూపించారు.

        ఇక తిరిగి మెయిన్ ఫ్లాష్ బ్యాక్ కి వచ్చినప్పుడు, ఆచార్య- సిద్ధల మధ్య బాండింగ్ కూడా బలహీనంగా వుంది. ఇప్పుడు సిద్ధ మానక స్థితి ఏమిటి? తన జన్మరహస్యం తెలుసుకోవడంతో అన్ని చింతల నుంచీ విముక్తి పొంది వుంటాడు. కొత్త సిద్ధగా ప్రకాశిస్తాడు. తనేదో ధర్మ స్థలిలో అక్కడేదో ధర్మం కోసమంటూ అల్ప విషయాలకి  ప్రాధాన్యమిస్తూ జీవితాన్ని అంకితం చేశాడు. కానీ తన తల్లిదండ్రులు అంతకన్నా విశాల దృక్పథంతో నక్సలైట్లుగా ప్రాణాలర్పించడం తెలిశాక, మెలోడ్రామా పెంచుతూ- తన తల్లిదండ్రులు వాడిన తుపాకులు అడుగుతాడు- ఆ తుపాకులు పట్టుకుని, రాథోడ్ తో మిగిలున్న తల్లిదండ్రుల ఆశయాన్ని పూర్తి చేయడానికి దళాన్ని లీడ్ చేస్తూ దండెత్తుతాడు... ఈ తరహాలో సిద్ధ పాత్ర సాగవచ్చు.        

        అంతేగానీ ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాక, ఆచార్య సిద్ధని దళంలో చేర్చుకోవడం కాదు. ఇలా చేస్తే సిద్ధ పాసివ్ క్యారక్టరై పోతాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ సిద్ధ కథ మాత్రమే. అతనే కథా నాయకుడు. యాక్టివ్ క్యారెక్టర్ గానే వుండాల్సి వుంటుంది. ఆచార్య చేర్చుకోవడం కాదు, తనే దళంలో చేరి, వద్దని వారిస్తున్నా ఆచార్య సహా దళాన్ని తానే లీడ్ చేస్తే యాక్టివ్ క్యారక్టర్ గా వుంటాడు. ఇలా ఫ్లాష్ బ్యాక్ కి ఫస్ట్ యాక్ట్ ముగిస్తే-

        ఇక సెకెండ్ యాక్ట్ లో సిద్ధ చేస్తున్న సాహసం ఆచార్యకి ఇగో సమస్యలు తేవచ్చు. దీంతో ఘర్షణ వైఖరి. సిద్ధని పట్టుకుని కొట్ట వచ్చు కూడా. సిద్ధ ఆగడు. డ్రామా ఇంకా రగిలి పతాకస్థాయికి చేరుతుంది. చివరికి రాథోడ్ గ్యాంగ్ చేతిలో ప్రాణాలు కోల్పోతాడు సిద్ధ. ఇలా సెకెండ్ యాక్ట్ ముగిస్తే-

        ఇప్పుడు ఇక్కడ సిద్ధ చావుకి రాథోడ్ మీద ఆచార్యకి యాక్షన్ తో పగ రగలడమే గానీ మరోటి కాదు! ఇది ఫ్లాష్ బ్యాక్ కి థర్డ్ యాక్ట్. దీంతో ముగింపు.

ఇక ముగిద్దాం

ఆచార్య ఇలా ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పాక, ఇప్పుడు ప్రధాన కథ సెకెండ్ యాక్ట్ -2, థర్డ్ యాక్ట్ కలిసిపోయి వస్తాయి. ఆచార్యతో కలిసి ప్రజలు రాధోడ్ నీ, బసవనీ, వాళ్ళ  ముఠానీ దంచి కొట్టి చావగొట్టడమే!

        ఫస్టాఫ్ లో ఫస్ట్ యాక్ట్, సెకెండ్ యాక్ట్ -1  స్క్రీన్ ప్లేని  అన్ ప్రొఫెషనల్ గా తయారుచేస్తే, సెకండాఫ్ లో ప్రధాన కథ సెకెండ్ యాక్ట్ - 2 నే లేకుండా చేశారు. పోనీ ఫ్లాష్ బ్యాక్ నీ స్ట్రక్చర్ లోపెట్టి బలీయం చేయలేదు  సెకెండాఫ్ సక్సెస్ కి. కూలంకషమైన సినాప్సిస్ తయారుచేసుకుంటూ లోపాల్ని సవరించుకోకుండా, ఏకంగా వన్ లైన్ ఆర్డర్ వేస్తే ఇంతకి మించి ఏమీ జరగదు.

—సికిందర్
    

Sunday, May 8, 2022

1167 : స్క్రీన్ ప్లే సంగతులు -2


  స్టాఫ్ కథ : ప్రిన్స్ మహేష్ బాబు వ్యాఖ్యానంతో ప్రారంభం - ఓ 800 సంవత్సరాల క్రితం సిద్ధవనం అడవుల్లో గిరిజన గూడెం వుండేది. వందమంది జనాభా. జీవధార నది ప్రవహించేది. అక్కడ యోగులు, మహర్షులు ఎక్కువ సంచరించే వాళ్ళు. తపస్సులు చేసుకునే వాళ్ళు. ఆ గిరిజన గూడేనికి పెద్ద దిక్కుగా వుండే వాళ్ళు. గిరిజనులకి ధర్మం నేర్పారు. అంతేగాక సిద్ధవనం మూలికలతో వాళ్ళకి ఆయుర్వేదం నేర్పి గొప్ప నాగరికతకి బీజం వేశారు. ఎన్ని విపత్తు లొచ్చినా ఈ అడవిని విడిచి పెట్టకూడదని వాళ్ళకి సృష్టి రహస్యాన్ని బోధించారు.

      లా వుండగా ఓ రాక్షస మూక దండెత్తి వచ్చింది. యోగుల తపో బలంతో అమ్మవారు ప్రత్యక్షమై రాక్షస మూకని సంహరించింది. అలా ఘట్టమ్మ అమ్మవారు అక్కడే వుండి పోయింది. జీవధార అవతలి వైపు నిలబడి సిద్ధవనంకి కాపలాగా వుంది. గిరిజనులు అమ్మవారికి గుడి కట్టుకున్నారు. ఆ ప్రాంతానికి పాద ఘట్టం అని పేరుపెట్టారు. ఆ పాదఘట్టం నెమ్మదిగా పెరిగి ఇప్పుడు ధర్మస్థలి అయింది. ఈ ధర్మస్థలిలో ప్రస్తుతం అధర్మ కలాపాలు జరుగుతున్నాయి...

        ఇదీ కథా ప్రారంభం, పరిచయం. ఋషులు గిరిజనులకి ఆయుర్వేదం నేర్పితే?’ అన్న ప్రశ్నతో ఈ కథ చేస్తే ప్రయోగాత్మకమయ్యేది.  What if?  (ఇలా జరిగితే?) అన్న ప్రశ్నని ఆధారంగా  చేసుకుని హాలీవుడ్ లో సినిమాలు తీస్తూంటారు. ఎవరూ చూడలేని చనిపోయిన వ్యక్తుల్ని ఒక బాలుడు చూస్తూంటే?’ అన్న ప్రశ్నతో సిక్స్త్ సెన్స్’, మనం చూస్తున్న ప్రపంచం నిజానికి కంప్యూటర్ ప్రతి సృష్టి అయితే?’ అన్న ప్రశ్నతో మ్యాట్రిక్స్ మొదలైనవి.

        ఇలా ఇప్పుడు ఋషులు గిరిజనులకి ఆయుర్వేదం నేర్పితే?’ అన్న ప్రశ్న కూడా వూహా గానమే అవుతుంది. లేనిది, జరగనిది కల్పన చేసి చూపడం. నిజంగా ఆసక్తి రేపే వూహాగానమే  ఇది. ఋషులేమిటి, అడవిలో వున్న మూలికలతో గిరిజనులకి ఆయుర్వేదం నేర్పడమేమిటి? అలా ఆయుర్వేదం నేర్చుకున్న గిరిజనులు అప్పటికే తమకి తెలిసి వున్న మూలికా వైద్యంతో కలిపి ఇంకేం చేసి వుంటారు? ఇలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అయ్యే  అవకాశముంది. సరదాగా వూహాగాన మాత్రంగా. అంతేగానీ, వాస్తవంలో ఇలా జరిగే అవకాశం లేదు. అసహజ కథ అవుతుంది. అయింది కూడా. అడవిలో వున్న మూలికలు, దాంతో మూలికా వైద్యం ఋషుల కంటే పూర్వమే గిరిజనులకి తెలుసు. మరి అడవిలో వున్న మూలికలతో గిరిజనులకి ఋషులు ఆయుర్వేదం నేర్పడమేమిటి?

నమ్మించని నేపథ్యం

ఋషులు శూద్రులకి శాస్త్రాలు నేర్పడం, సృష్టి రహస్యాలు చెప్పడం, ధర్మాన్ని బోధించడం - ఇదంతా వాస్తవ దూరమైన సెటప్. పైగా మూల వాసులైన గిరిజనులకి ఈ శాస్త్రాలకంటే పూర్వం నుంచీ వాళ్ళ వైద్య పద్ధతులు, జీవన విధానం, విశ్వాసాలు వాళ్ళకున్నాయి. ఇంకో కల్చర్ ని తమ మీద రుద్దితే ఒప్పుకోరు. వాళ్ళ ప్రపంచంలోకి వెళ్ళి ఇంకెవరూ ఏం నేర్పాలన్నా, మార్చాలన్నా నేర్చుకోరు, మారరు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం - ప్రభుత్వ సమగ్ర గిరిజానాభివృద్ధి సంస్థ వైఫల్యం.

        కాబట్టి ఋషులు- గిరిజనులు- సిద్ధవనం, ఆయుర్వేద వృత్తి- అమ్మవారు- పాద ఘట్టం, జీవధార, ధర్మస్థలి - ఈ నేపథ్యమంతా, పాత్రలన్నీ అసహజంగా అన్పిస్తాయి. అసలు ఇదంతా దేనికి? ఈ బిల్డప్ కథకేం ఉపయోగపడింది? అక్కడున్న గిరిజనుల భూములు మైనింగ్  మాఫియాలకి కావాలి - ఇంతేగా స్క్రిప్టుని వొలిచి చూస్తే కథ? ది ఎమరాల్డ్ ఫారెస్ట్ (1985) లో అమెజాన్ అడవుల్లో ప్రభుత్వం డామ్ కట్టే ప్రయత్నం చేస్తే దాన్నెదుర్కొనే రెడ్ ఇండియన్స్ (గిరిజనులు) కథ సూపర్ హిట్ కాలేదా? ఈ మాత్రం సూటి కథ వుంటే సరిపోదా ఆచార్య కి?

        మైనింగ్ మాఫియాకి కావాల్సింది గిరిజనుల అటవీ ప్రాంతం. చెట్లు చేమలు, నీరు, వనరులు, వ్యవసాయంతో కూడిన గిరిజనుల జీవికని లాగేసుకునే దుష్కృత్యం. గిరిజనుల జీవికని లాగేసుకోవడానికి మించిన ఎమోషనల్ అప్పీల్ కథ కింకెక్కడుంటుంది? ఆ భూముల మీద సిద్ధవనం, పాదఘట్టం, ధర్మస్థలి, ఆయుర్వేదం - ఇవన్నీ ఋషులు రుద్దిన పరాయి హంగులే. ఇవి వున్నా లేక పోయినా గిరిజన పాత్రలతో ఎమోషనల్ అప్పీల్ వుండదు. ప్రేక్షకులూ ఫీల్ కారు.

         అల్లూరి సీతారామరాజు లో - విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వం మద్రాసు అటవీ చట్టాన్ని పరమ ఆటవికంగా అమలు చేస్తూ గిరిజనుల పొట్ట కొడుతూంటే కదా -అల్లూరి పోరాటానికి దిగింది? కేవలం జీవిక కోసం, పొట్ట కోసం అడవుల్ని నమ్ముకుని వుంటున్న ఆదివాసుల్ని నిరాశ్రయుల్ని చేయడమనే  - జీవిక లాగేసుకుని వాళ్ళ పొట్ట కొట్టడమనే - అన్యాయానికి మించిన పరాకాష్ట ఇంకోటుంటుందా?

కథా ప్రయోజనంతో వాస్తవికత

జీవికని లాగేసుకోవడాన్ని ఇంకో సెటప్ లో చూద్దామా అప్డేట్ చేసి సమకాలీనంగా మార్కెట్ యాస్పెక్ట్, యూత్ అప్పీల్, ఎకనమిక్స్ వగైరాలతో కలిపి? అడవుల్లో తిప్పతీగ అని వన మూలిక వుంటుంది. దీన్ని ఆయుర్వేద ఔషధ తయారీలో ఉపయోగిస్తూంటారు. మహారాష్ట్రకి చెందిన ఒక గిరిజనుడు ఈ తిప్పతీగెని పండిస్తూ కోట్లు ఆర్జిస్తున్నాడు. ఆయుర్వేద కంపెనీలు ఈ తిప్ప తీగె సాగుని కొనుగోలు చేస్తున్నాయి. కరోనా మహమ్మారి అధికం కావడంతో ప్రతీ ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే పనిలో పడ్డారు. దీంతో తిప్ప తీగెలకి డిమాండ్ పెరిగింది. ఇంతేగాక, కరోనా మహమ్మారి వల్ల ఎంతోమంది ఉపాధిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  గిరిజనుడు తిప్పతీగల సాగుచేస్తూ ఎంతో మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాడు.

         పై స్టోరీ ఐడియా లాజికల్ అప్రోచ్ తో లేదూ? గిరిజనులు తమది కాని ఆయుర్వేద వైద్య వృత్తిని చేపట్టకుండా, ఆయుర్వేద ఔషధ ఉత్పత్తిలో తోడ్పడే వన మూలికని సాగుచేస్తూ, సోదర ఆయుర్వేద శాస్త్రానికి చేయూతనందిస్తున్న లాజికల్ అప్రోచ్? ఉత్తమ - సామాజిక ప్రయోజనం గల కథా రచన?

        ఇలాటి అటవీ భూమిని మైనింగ్ మాఫియా లాక్కుంటే ఎంత మంది పొట్టకొట్టి నట్టవుతుంది...??? దీనికెంత యూనివర్సల్ అప్పీల్ వుంటుంది? కదిలించే ఈ సూటికథ చేయకుండా- విశ్వసనీయత లేని స్టోరీ ఐడియాతో- సమస్య మీద ఫోకస్ లేక- ఫస్టాఫ్ కథాకథనాలూ ఫోకస్ చెదిరి - అత్యంత బలహీన స్క్రీన్ ప్లే చేశారు.

వాయిసోవర్ అయోమయం

        ప్రారంభంలో ప్రిన్స్ మహేష్ బాబుకి వాయిసోవర్ కోసం రాసిన స్క్రిప్ట్ సినిమా చూస్తూంటే అయోమయంగా వుంటుంది. సిద్ధవనం, పాదఘట్టం, జీవధార, ధర్మస్థలి, ఘట్టమ్మ గుడి- ఈ ప్రాంతాలేమిటి, ఏ ప్రాంతం ఏ ప్రాంతానికేమవుతుంది, ఆ ప్రాంతం ఈ ప్రాంతమైతే, ఈ ప్రాంతం ఏ ప్రాంతమవుతుంది- ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఒకటేనా, ఒకటి కాకపోతే ప్రాణాంతకమా - ఇదంతా పరాయీ కరణ చెందిన గిరిజన ప్రాంతమా- చరిత్రలో ఆదివాసుల మీద ద్రవిడ, ఆ తర్వాత ఆర్య వలస వాదమా? ఈ వలస వాదం ఓకే అయితే, ఇక నయా వలస వాదులమని మైనింగ్ మాఫియాలూ ఆ ప్రాంతం మీద హక్కుదార్లే అవుతారా?

        అన్నట్లు సందట్లో సడేమియాగా ఒక ముస్లిం క్యారక్టర్ వుంటుంది. అంటే ఆర్యుల తర్వాత ముస్లింల వలస వాదమా, ఇంకొకటి తగ్గింది- ఇంగ్లీషు క్యారక్టర్. ఇది కూడా వుండి వుంటే బ్రిటిష్ వలస వాదంతో ఆమూలాగ్ర చరిత్ర పుటలు రికార్డయ్యేవి.

        ఇలా బోల్డు కన్ఫ్యూజన్. ఇలా వుంది కథా ప్రారంభం. ఈ కథ ఓ రొటీన్ మాస్ కథయితే ఈ వలసల మీదికి దృష్టి పోదు. ఈ కథని చిరంజీవి నక్సల్ పాత్ర  డ్రైవ్ చేస్తుంది కాబట్టి - ఆ పాత్ర దృక్కోణంలో వలసల మీదికి దృష్టి పోతుంది, జానర్ మర్యాద కొద్దీ. ఈ ప్రాంతంలో గిరిజనులు కాకుండా అసలు వీళ్ళంతా ఎవరూ  - అన్న మార్క్సిస్టు కళ్ళతో చూడదా చిరంజీవి పాత్ర?

తర్వాతి కథ
        పై చారిత్రక నేపధ్యంలో ఇప్పుడు ధర్మ స్థలి మునిసిపాలిటీ టౌనుగా వుంటుంది. గిరిజనులకి సిద్ధ గురుకుల మహా విద్యాలయం కూడా వెలస్తుంది. ఇంకో సంగీత పాఠశాల వుంటుంది. ఇక్కడ నీలాంబరి (పూజా హెగ్డే) సంగీతం నేర్పుతూంటుంది. ఘట్టమ్మ వారి ఆలయానికొక పూజారి (తనికెళ్ళ భరణి) వుంటాడు. ఇతను ప్రతీయేటా అమ్మవారి రథోత్సవం జరిపిస్తూంటాడు. మరో పక్క మందీ మార్బలంతో గిరిజనుడు వేద (అజయ్) ఆయుర్వేద కేంద్రం నడుపుతూంటాడు. ఆయుర్వేదంలో ఇతడి ప్రఖ్యాతి తెలుసుకుని ఓ యూనివర్సిటీ నుంచి ప్రముఖులు వచ్చి కలుస్తారు.

        ఇలా వుండగా, మునిసిపల్ ఛైర్మన్ బసవ (సోనూ సూద్) అని వుంటాడు. ఇతను ధర్మస్థలిలో అక్రమాలు చేస్తూంటాడు హత్యలు సహా. సిటీలో రాథోడ్ (జీశ్శూ సేన్ గుప్తా) అని మైనింగ్ మాఫియా వుంటాడు. ఇతను బసవ ద్వారా మొత్తం ఈ గిరిజన ప్రాంతాన్ని కబళించాలని చూస్తూంటాడు. తాజాగా తనిఖీకొచ్చిన ప్రభుత్వ బృందాన్ని చంపించేస్తాడు బసవ. ఇక అమ్మవారు కాపాడదాని వేద విలపిస్తూంటే, ఖడ్గ ధారియై ఆచార్య (చిరంజీవి) వచ్చేస్తాడు.

        వచ్చి వడ్రంగి పనులు చేస్తూంటాడు నేస్తం నాగులు (వెన్నెల కిషోర్) ఇంట్లో బస చేసి. తనెవరో బయట తెలియకుండా రహస్యంగా వుంచుతాడు. ఓబులు అనే బసవ అనుచరుడు వేదని వేధించి గుండెల మీద తంతే, ఆ కాలు విరగ్గొట్టేస్తాడు ఆచార్య. కాలు విరిగిన ఓబులుకి వేద వైద్యం చేయడాన్ని గమనిస్తాడు ఆచార్య. శత్రువుకైనా వేద వైద్యం చేస్తాడని తెలుసుకుంటాడు.

        సిటీలో రాథోడ్ పార్టనర్స్ తో సమావేశమై సిద్ధవనం అడవులు కబ్జా చేసే విషయం మాట్లాడతాడు. వేరే అడవుల్లో ఆచార్య ఏం చేశాడో తెలుసుగా అని ఓ పార్టనర్ అంటాడు. అడవుల్లో రాథోడ్ అనుచరుల్ని ఆచార్య కామ్రేడ్ ఆచార్యగా చంపుతున్న దృశ్యం పడుతుంది. దీంతో ఆచార్య నక్సల్ అని మనకి అర్ధమవుతుంది. ఇది గుర్తు చేసుకుని ఆచార్య మీద మరింత  రగిలిపోతాడు రాథోడ్.

        ధర్మస్థలిలో నీలాంబరి ఒక చిన్నపిల్లకి సంగీతం నేర్పడం గురించి మాట్లాడుతూంటే, నీలాంబరిని గుర్తు పట్టినట్టు చూస్తాడు ఆచార్య. ఒక దేవఘట్టమ్మ అనే గిరిజన అమ్మాయిమీద జరుగుతున్న అత్యాచార యత్నాన్ని ఎదుర్కొని, దుండగుల్ని చిత్తుగా తంతాడు ఆచార్య. ఈ అత్యాచార యత్నం సిద్ధ గురుకుల మహా విద్యాలయంలో జరుగుతుంది. ఇది సిద్ధ (రామ్ చరణ్) చదువుకున్న పవిత్ర విద్యాలయమని దుండగులకి చెప్తాడు ఆచార్య. సిద్ధ ధర్మస్థలి కోసం చేసిన త్యాగం మీకు తెలీదంటాడు. సిద్ధ స్లోమోషన్ దృశ్యం పడుతుంది. దీంతో సిద్ధ గురించి కొంత మనకి తెలుస్తుంది.

        సంగీతం నేర్చుకుంటున్న చిన్నపిల్ల ఫ్లూటు కొనిమ్మంటే తన తండ్రి కొనివ్వడం లేదని ఆచార్యకి చెప్పుకుంటుంది. ఆచార్య పెట్టెలోంచి ఒక ఫ్లూటు తీసిస్తాడు. ఆ ఫ్లూటుని నీలాంబరి గుర్తుపట్టి తండ్రియైన పూజారితో వచ్చి ఆచార్యని అడుగుతుంది. ఆ ఫ్లూటు సిద్ధదని చెప్తాడు ఆచార్య. సిద్ధ మీకు తెలుసాంటే తెలుసంటాడు.

        సిద్ధ వెళ్ళిపోయినప్పట్నుంచీ బసవ ఆగడాలు పెచ్చుమీరిపోయాయనీ, రేపు అమ్మవారి రథోత్సవం వుందనీ, ఈ రథోత్సవాన్ని ప్రారంభించడానికి ఎప్పటిలాగే బసవ వస్తాడనీ, ఇది భరించలేకపోతున్నాననీ ఆచార్యకి చెప్పుకుంటాడు పూజారి.

       ఆచార్య రథోత్సవ ప్రారంభోత్సవంలో చాటుగా బసవ చేతుల్ని గాయపర్చి అడ్డుకుంటాడు. తన చేతుల్ని గాయపర్చిందెవరో అర్ధంగాక వాణ్ని పట్టుకోమని ఆదేశిస్తాడు బసవ.

        బసవ దగ్గరికి రాథోడ్ వచ్చి ప్లాన్ మాట్లాడతాడు. ఏదో వొక తప్పు చేయించి ఇక్కడి ప్రజల్ని వెళ్ళగొట్ట మంటాడు. బసవ ఆయుర్వేద మందుల్లో విషం కలిపి జనం ప్రాణాల మీదికి తెస్తాడు. దీంతో వేద దోషిగా నిలబడతాడు. బసవ అనుచరుల దాడిలో వేద చనిపోతాడు. దీంతో ధర్మస్థలి ఖాళీచేసి ప్రజలు వెళ్ళి పోతూంటారు. ఆచార్య ఆపి బసవ అనుచరుల మీద దాడి చేస్తాడు. బసవ దగ్గరి కెళ్ళిపోయి తను కామ్రేడ్ ఆచార్యనని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. ఇక సిద్ధ ఎంటరవుతున్నట్టు దృశ్యం పడుతుంది. సిద్ధ సిద్ధం అని అక్షరాలు పడి, ఇంటర్వెల్ తో ఫస్టాఫ్ కథ ముగింపు కొస్తుంది.

నాన్ కమర్షియల్ స్క్రీన్ ప్లే

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో ప్రేక్షకులు ఎంతో వూహించుకుంటారు. ఇద్దరూ కమర్షియల్ కథాకథనాలతో వూహించని వీక్షణానుభవాన్నిస్తారని ఆశిస్తారు. కానీ మొదటి పదీ పదిహేను నిమిషాల్లోనే కథ నడక చూసి అట్టర్ ఫ్లాపని చెప్పేసే స్థితిలో దీని స్క్రీన్ ప్లే వుంది. సినిమా విడుదలైన మొదటి పదిహేను నిమిషాల్లోనే అట్టర్ ఫ్లాపైన పరిస్థితి ఆచార్య ది.

        ఆచార్య బడ్జెట్ 140 కోట్లు అనుకుంటే, స్క్రీన్ ప్లే కోసం రాసిన ప్రతి వొక్క పేజీ సుమారు 9 లక్షల రూపాయల విలువ చేయాలి. పేజీకి 9 లక్షల రూపాయల విలువైన  వ్రాత యేం రాశారబ్బా అన్పించి గుండె ఝల్లుమంటుంది. ఏ పేజీలోనూ రక్తి కట్టించే, ఆసక్తిపర్చే విషయం ఒక్కటీ లేదు- మార్కెట్ యాస్పెక్ట్ పరంగానూ, క్రియేటివ్ యాస్పెక్ట్ పరంగానూ. 140 కోట్ల బడ్జెట్ కి బాక్సాఫీసు 70 కోట్లే వచ్చింది. అంటే రాసిన పేజీలు బడ్జెట్లో సగమే రాబట్టాయి. రాసిన ఒక్కో పేజీ 9 లక్షల బడ్జెట్ ని డిమాండ్ చేస్తే, రాబట్టింది 4.5 లక్షలే. ఇదీ క్రియేటివిటీ స్థాయికి సూచిక.

        ఫస్టాఫ్ స్క్రీన్ ప్లేకి స్ట్రక్చర్ అనేది కన్పించదు. ఫస్ట్ యాక్ట్ ఎలా వుండాలి, ఎంత వుండాలి స్పృహ లేదు. ప్లాట్ పాయింట్ వన్ ఎక్కడుండాలి, అదెలా వుండాలి లేదు. యాక్టివ్ క్యారక్టర్ పాత్రచిత్రణ లేదు. సీన్స్ డైనమిక్స్ తో, కాజ్ అండ్ ఎఫెక్ట్ తో కదలవు. సీన్స్ కి విజువల్ రైటింగ్ లేదు. స్టోరీ మేకింగ్ లేదు, ప్రింట్ మీడియాకి పనికొచ్చేట్టు స్టోరీ రైటింగే వుంది. అదీ పాసివ్ గా వుంది. డైలాగులూ పాసివ్ గా వున్నాయి (పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా, అందరూ ఆచార్య అంటూంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో), సన్నివేశాల్లో, ఫైట్స్ లో ఎమోషనల్ అప్పీల్ ఎక్కడా కన్పించదు. నవరసాలు మొత్తం కాకపోయినా కొన్నైనా లేవు. ప్రణయ, హాస్య రసాల్లేక యూత్ అప్పీల్ లేదు, అసలేమీ లేదు. కథనంలో ఇంకో తేడా ఏమిటంటే కథకుడు ప్రేక్షకులకి కథ చెప్తున్నట్టు వుండదు, తనలో తాను మాట్లాడుకుంటున్నట్టు, గొణుక్కుంటున్నట్టు వుంటుంది! పరికించి ఏ దృశ్యమైనా చూడండి, ఇదే అనుభవమవుతుంది. ఆత్మాశ్రయ ధోరణీయే ఈ కథా ధార, జీవధార నదీ వార.

ఫస్ట్ యాక్ట్ పరిస్థితి
        ఫస్ట్ యాక్ట్ కథనంలో ధర్మస్థలి మునిసిపాలిటీ అన్నారు గానీ అది పంచాయితీ స్థాయిలో కూడా లేదు.  సిద్ధ గురుకుల మహా విద్యాలయం వుంటుంది గానీ విద్యార్థులుండరు. ఇంకో సంగీత పాఠశాల వుంటుంది గానీ నేర్పేది కర్ణాటక సంగీతమే, గిరిజన పాటలు, నాట్యాలూ కాదు.

        1976 లో కృష్ణంరాజు, బాపు దర్శకత్వంలో  నటించి నిర్మించిన సూపర్ హిట్ గిరిజన కథ, భక్తకన్నప్ప లో పాటలన్నీ గిరిజన సాహిత్యమే- ఒకటి తప్ప. అన్నీ ఇప్పటికీ హిట్టే. సాంప్రదాయ కళల బాపుగారు కమ్యూనిస్టు దృక్పథపు గిరిజన సినిమా భక్తకన్నప్ప తీశారు. డైలాగుల్లో కమ్యూనిజమే వుంటుంది. పాత్రల పేర్లు కూడా గిరిజనుల పేర్లే వుంటాయి. కృష్ణం రాజు పాత్ర పేరు తిన్నడు. గిరిజనుడు కాబట్టి హిందూ దేవుళ్ళని నమ్మడు, నాస్తికుడు. కానీ ఆచార్య లో ఆయుర్వేద మందులు తయారు చేసే అజయ్ నటించిన గిరిజన పాత్రకి వేద అని ఆర్యన్ నామం! గిరిజనుల సంస్కృతి అనే జానర్ మర్యాదని హైందవ ఆచారాలతో కప్పిపుచ్చేశారు.

         భక్తకన్నప్ప లో గిరిజనుల మీద కుట్రలు చేసే పాత్రలుగా కైలాస నాథ శాస్త్రి (రావు గోపాలరావు), కాశీనాథ శాస్త్రి (సారధి) అని చూపించడానికి మొహమాటపడలేదు బాపూ రమణలు.

        ఆచార్య ప్రారంభ దృశ్యాల్లో ఆయుర్వేదంలో వేద గడించిన ఖ్యాతి తెలుసుకుని యూనివర్సిటీ నుంచి ప్రముఖులు వచ్చి కలిసే సీను, రాధేశ్యామ్ ప్రారంభ దృశ్యాల్లో రోదసీ శాస్త్రవేత్తలు జ్యోతిష పండితుడు (కృష్ణం రాజు) ని కలిసే సీనూ ఒకటే.  

        ధర్మస్థలి చరిత్ర చెప్పి, కొన్ని పాత్రల్ని పరిచయం చేసి, మునిసిపల్ ఛైర్మన్ గా బసవ అనే విలన్ దురాగతాల్ని ఎస్టాబ్లిష్ చేసి- 15వ నిమిషంలో ఆచార్య పాత్రలో చిరంజీవిని ప్రవేశ పెడితే అది ఫస్ట్ యాక్ట్ అయిపోతుందా?

        ఫస్ట్ యాక్ట్ అవ్వాలంటే 1. కథా నేపథ్యం ఏర్పాటు, 2. పాత్రల పరిచయం, 3. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, 4. సమస్య ఏర్పాటు- ఇవీ జరగాలి. వీటిలో మొదటి రెండే జరిగాయి. మూడోదీ నాల్గోదీ  లేకుండా కథానాయక పాత్ర ఎంటరైపోయింది. ఇలా ఫస్ట్ యాక్ట్  అసంపూర్ణంగా వుంది కాబట్టే చిరంజీవి ఎంట్రీ ఇంత పేలవంగా వుంది. ఫస్ట్ యాక్ట్ ముగిసిన ఈ ప్లాట్ పాయింట్ వన్ సీన్లో, అతను మామూలు మనిషిలా నడుచుకుంటూ ధర్మస్థలికి వచ్చి, వడ్రంగిగా నాగులు ఇంట్లో  బస చేస్తాడు...

        ఓ మైగాడ్! అసలేం చేయాలనుకున్నారు మెగా స్టార్ స్క్రీన్ ప్లేతో? స్క్రీన్ ప్లేలో స్టార్ ప్లే లేకుండా? ఎన్ని టెంప్లెట్లు తెచ్చి కలిపి కిచిడీ చేయాలనుకున్నారు? పేజీకి 9 లక్షలు ఖర్చు పెట్టిస్తూ చిరంజీవిని అరిగిపోయిన పాత ఫ్యాక్షన్ సినిమా టెంప్లెట్ లో చూపాలనుకున్నారా?

        వున్న వూళ్ళో ఏదో జరిగి అజ్ఞాతవాసంలో కెళ్ళిపోయిన హీరో, ఇంకేదో వృత్తి చేసుకుంటూ జీవించే లాంటి అరిగిపోయిన పాత ఫ్యాక్షన్ టెంప్లెట్? ఇలా వొక గతాన్ని వుంచుకుని, ధర్మ స్థలికొచ్చి వడ్రంగి పనితో ఆచార్య అజ్ఞాత వ్రతం? ఫస్ట్ యాక్ట్ స్ట్రక్చర్ ని దెబ్బతీస్తూ బలవంతంగా, పేలవంగా కథలోకి ఎంట్రీ? ఇందుకే ఇది నాన్ కమర్షియల్ ఎంట్రీగా దెబ్బకొట్టింది. ఇక్కడే సినిమా అట్టర్ ఫ్లాప్ అన్పించుకుంది. ఫస్ట్ యాక్ట్ ని సరీగ్గా సెటప్ చేయకపోతే కథలో ఇంకేదీ సెట్ కాదు. ఇది అలనాటి విఖ్యాత హాలీవుడ్ దర్శకుడు బిల్లీ వైల్డర్ హెచ్చరిక! ఫస్ట్ యాక్ట్ ని సరీగ్గా సెటప్ చేయకపోతే కథలో ఇంకేదీ సెట్ కాదంతే!

        ఫస్ట్ యాక్ట్ బిజినెస్ లో మూడో టూల్ ఏమిటి? సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన. ఈ కథకి ఏమిటా సమస్య? మైనింగ్ మాఫియా భూములాక్రమించే కుట్ర. ఆల్రెడీ ఆఫ్ స్క్రీన్ లో ఈ ప్లానుతో బసవతో బాటు మాఫియా రాథోడ్ వున్నాడు. గతంలో వేరే అడవుల్లో ఆచార్య కామ్రేడ్ గా ఇలాటిదే రాథోడ్ ప్లానుని విఫలం చేశాడని- రాథోడ్ పార్టనర్స్ మీటింగులో - మున్ముందు కథలో వెల్లడవుతుంది కూడా.      

        ఇలాంటప్పుడు ఫస్ట్ యాక్ట్ లో బసవ పాత్ర ఎలా వుండాలి? ధర్మ స్థలిని ఖాళీ చేయించే బెదిరింపులతో, దౌర్జన్యాలతో ప్రారంభమవాలి. అంతేగానీ పూజారి వాపోతున్నట్టు మద్యం, వ్యభిచారం, హత్యలు వంటి చిల్లరపనులతో ధర్మస్థలిని అధర్మ స్థలిగా మారుస్తూ కాలక్షేపం చేయడం కాదు- వెంటనే థింక్ బిగ్ అన్నట్టు ధర్మస్థలినే కాజేసే ఎజెండానే అమలు చేయడం. అంటే ఫస్ట్ యాక్ట్ ఎత్తుగడే ధర్మ స్థలిని కాజేసే కుట్రతో డైరెక్టుగా పాయింటు కొచ్చేయడం. 

        అప్పుడు ఇది కథ అన్పించుకుంటూ బలంగా వుంటుంది. ఫస్ట్ యాక్ట్ బిజినెస్ లో మూడో టూల్ ఏమిటనుకున్నాం? సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన చేయడం... ఏమిటా సమస్య? మొత్తం సిద్ధవనంలో భూమూలాక్రమించే కుట్రని ధర్మస్థలితో ప్రారంభించడ మనుకుందాం...

        అప్పుడు  బసవ ఒకటొకటే చేసుకొస్తూ ఫస్ట్ యాక్ట్ చివర్లో ధర్మస్థలికి బ్యాంగ్ ఇవ్వబోవచ్చు. ప్రజల హాహాకారాలు చెలరేగుతాయి- ఇంకొన్ని క్షణాల్లో ధర్మ స్థలిని లేప్పారేస్తాడు- సరీగ్గా అప్పుడు ఆచార్య ఎంట్రీ ఇచ్చి బిగ్ యాక్షన్ కి తెర తీయొచ్చు...

కమర్షియల్ ఈవెంట్

        ఇలా ఫస్ట్ యాక్ట్ ని ముగిస్తూ ఈ ప్లాట్ పాయింట్ వన్ లో - బసవని ఆచార్య ఎదుర్కొనే బిగ్ యాక్షన్ కి తెరతీయడం. ప్రేక్షకులు ఎవరెవరి జేబుల్లో ఎన్నెన్ని డబ్బులున్నాయో, అవన్నీ బుకింగ్స్ లో నిలువు దోపిడీ లిచ్చుకునే  అల్ట్రా బిగ్ యాక్షన్ కమర్షియల్ ఈవెంట్!

        ఆచార్య స్క్రీన్ ప్లే సంగతులు మొదటి వ్యాసంలో చెప్పుకున్నట్టు, చిరంజీవి పాత్రని లెజెండ్ కి తక్కువ చేసి చూపిస్తే సినిమా క్యాలిబర్ ని తగ్గించడమే. అతను గుట్టు చప్పుడు కాకుండా కూర్చునే ఫ్యాక్షన్ క్యారక్టర్ కాదు- గుండెల్లో గుబులు పుట్టించే లెజెండ్ క్యారక్టర్. ప్లాట్ పాయింట్ వన్ ఘట్టంలో, ప్రాంతాన్ని కాజేసే బసవ కుట్ర అమలవడం, దాన్ని మెరుపులా వచ్చేసి లెజెండ్ ఆచార్య ముక్కలు చేయడం జరిగితే - పాయింటు ఎస్టాబ్లిష్ అయిపోయి- కథ కూడా ప్రారంభమైపోతుంది నస పెట్టకుండా!

        ఫస్ట్ యాక్ట్ కి స్ట్రక్చర్ లేకపోవడం వల్లేకదా ఇంటర్వెల్లో కూడా పాయింటు ఎస్టాబ్లిష్ కాక, కథే ప్రారంభం కాలేదు...? ఫస్ట్ యాక్ట్ ని సరీగ్గా సెటప్ చేయకపోతే కథలో ఇంకేదీ సెట్ కాదంతే...

        ప్లాట్ పాయింట్ వన్ లో హీరో విలన్లు ముఖా ముఖీ అవకపోతే కథేమిటో ఎలా అర్ధమవుతుంది? విలన్ వల్ల ఏర్పడ్డ సమస్యని జయించే లక్ష్యం (గోల్) హీరో కెలా ఏర్పడుతుంది?

        లెజెండ్ మూవీస్ ఓపెన్ వార్ తో వుంటాయి. ఆచార్యలాగా చాటుగా విలన్ చేతులు గాయపర్చడం లాంటి దాగుడు మూతలతో వుండవు. ఇటీవల పోప్ ఫ్రాన్సిస్ ఒక మాటన్నాడు - నాటో దేశాలు రష్యా గుమ్మంలో కుక్కల్లా మొరగడం వల్లే యుద్ధం వచ్చిందని. ఆచార్య అలా యుద్ధం ప్రారంభించాలి- ఓపెన్ వార్. అంతేగానీ రష్యన్ అధ్యక్షుడు పుతిన్ రహస్యంగా యుక్రేన్ వెళ్ళి వడ్రంగిలా బసచేసి - చాటుగా వుండి యూక్రేన్ అధ్యక్షుడు జెలెంస్కీ  చేతులు కసిక్కున రక్కి రక్కి పారెయ్యాలని చూళ్ళేదు. యూక్రేన్ ని (ధర్మస్థలిని) నాటో దేశాల్లో (మైనింగ్ మాఫియాలో) కలిపేసి నాకే ఎసరు పెడతావా అని ఓపెన్ గా బాంబులు కురిపించడం మొదలెట్టాడు...

సెకెండ్ యాక్ట్ -1 పరిస్థితి
        ఆచార్య వడ్రంగిగా బస చేశాక సెకెండ్ యాక్ట్ -1 ప్రారంభమై, ఒకదాని వెంటే ఇంకోటి నాల్గు ఎపిసోడ్లతో ఇంటర్వెల్ వరకూ సెకెండ్ యాక్ట్ -1 వుంటుంది. బసవ అనుచరుడు ఓబులు వేదని తన్నాడని ఆచార్య వాడి కాలు విరగ్గొట్టడం. దేవఘట్టమ్మ అనే గిరిజన అమ్మాయిమీద అత్యాచార యత్నాన్ని ఎదుర్కోవడం,  రథోత్సవంలో చాటుగా ఆచార్య బసవ చేతుల మీద కత్తితో గీరడం (ఇది రాస్తున్నప్పుడల్లా నవ్వొస్తోంది), బసవ ఆయుర్వేదంలో విషంకలిపి ధర్మస్థలిని ఖాళీ చేయించే కుట్రని ఎదుర్కొని ఆచార్య బసవకి వార్నింగ్ ఇవ్వడం.

        ఈ నాల్గు ఎపిసోడ్లూ పొడిపొడిగా వెళ్ళి పోతాయి. దేనికీ ఎమోషనల్ అప్పీల్ లేకపోవడమే గాక, ఏవీ చిరంజీవి చేయాల్సిన ఎపిసోడ్లుగా వుండవు. విలన్ తో నేరుగా యుద్ధం ప్రారంభించి ఒకదాని తర్వాతొకటి బిగ్ యాక్షన్ బొనంజాలు ప్రేక్షకులకివ్వకుండా, చిన్న చిన్న విషయాలతో సరిపెట్టాడు. వేద ని తన్నినందుకు రియాక్ట్ అవ్వాలంటే, వేదతో ఆచార్యకి బాండింగ్ వుండాలి. అప్పుడు యాక్షన్లోకి దిగితే ఎమోషనల్ అప్పీలుంటుంది. గిరిజనురాలి మీద అత్యాచారాన్ని ఎదుర్కొనేప్పుడు కూడా ఆమె ఎవరో ఆచార్యకి తెలీక పోవడం వల్ల, ప్రేక్షకులు నిర్లిప్తంగా చూడడం. అసలు ఆమె స్థానంలో వుండాల్సింది నీలాంబరి (పూజా హెగ్డే) పాత్ర! అప్పుడే ఎమోషనల్ అప్పీళ్ళూ ఈలలూ చప్పట్లూ.

        దుండగులతో ఫైట్ చేస్తూ, గిరిజనురాలిని అమ్మవారి పాట పాడమంటాడు... గిరిజనురాలి నోటి వెంట సంస్కృత శ్లోకాలు ఫైట్ ని ఎలివేట్ చేయకపోగా ఎలిమినేట్ అయ్యేలా చేశాయి. గిరిజనుల మీద అడుగడుగునా సాంప్రదాయవాదం సవారీ చేయడం.

        ఇక... ఇక...రథోత్సవంలో ఆచార్య దాక్కుని... బసవ చేతుల్ని...LOL! LOL!! LOL!!!... మెగా స్టార్ తో ఇంత సిల్లీగానా? ఎన్ని పేజీలు రాశారో ఈ సీను, అన్ని 9 లక్షలు అంతేగా?

        ఇక బసవ ఆయుర్వేదంలో విషంకలిపి ధర్మస్థలిని ఖాళీ చేయించే కుట్రని ఎదుర్కొని ఆచార్య బసవకి వార్నింగ్ ఇవ్వడం. ఈ ఇంటర్వెల్ సీన్లో మొదటిసారి ఇప్పటికీ ముఖాముఖీ అవడం! ఇలా ఎందుకు చేస్తున్నావని బసవ అంటే-

దివ్య వనమొక వైపు
తీర్ధ జల మొక వైపు
నడుమ పాద ఘట్టం

-అని ఆచార్య సమాధానం. బసవకి ఏదో అర్ధమవుతుంది. ఏమిటది? ఏమో! దాంతో- రామ్ చరణ్ విజువల్స్ తో సిద్ధ సిద్ధంఅని చప్పిడి భాషలో ఇంటర్వెల్. ఇలా ఫస్టాఫ్ కథ ఇంటర్వెల్లో ఏం ఎస్టాబ్లిష్ అయిందో తెలియకుండా పోయింది.

        సెకండ్ యాక్ట్ -1 ధర్మం ప్రకారం ఏర్పాటైన సమస్యతో హీరో విలన్ల మధ్య యాక్షన్ - రియాక్షన్ల సంఘర్షణ జరగాలి. ఇంటర్వెల్లో కూడా సమస్యే ఏర్పాటు కాకపోతే సమస్యతో హీరో విలన్ల పోరాటం ఇంకెక్కడ వుంటుంది. ఇలా ఫస్ట్ యాక్ట్ ధర్మంతో బాటు, సెకండ్ యాక్ట్ -1 ధర్మమూ లేక - ధర్మస్థలి సంగతేమో గానీ - ముందు స్క్రీన్ ప్లే అధర్మ కార్యకలాపాలతో నిండిపోయింది.

పాత్రోచితానుచితాలు

ఆచార్య సిద్ధ గురించి చెప్తున్నప్పుడు సిద్ధ మాంటేజ్ వేయడం, రాథోడ్ ఆచార్యని తల్చుకున్నప్పుడు, ఆచార్య నక్సల్ గెటప్ లో కామ్రేడ్ గా చేసే యాక్షన్ మాంటేజ్ వేయడం ఏమీ వర్కౌట్ కాలేదు.  ఆచార్య క్యారక్టర్ యాక్టివ్ క్యారక్టర్ కాకపోవడం చాలా పెద్ద లోపం. పైన చెప్పుకున్న నాల్గు ఎపిసోడ్లలో ఏం జరుగుతోందో ఇంకొకళ్ళు చెప్తే గానీ తెలీని పాసివ్ రియాక్టివ్ క్యారక్టర్ గా వున్నాడు ఆచార్య. కల్తీ ఆయుర్వేదంతో నేరం మీద పడి ప్రజలు వూరు ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఎదురు పడేవరకూ, జరిగిన అంత పెద్ద సంఘటన ఆచార్యకి తెలీనే తెలీదు. ఆచార్య ధర్మస్థలిలో కాక ఇంకెక్కడ వుంటున్నట్టు?

        పిల్ల అడిగిందని పిల్లన గ్రోవి ఇచ్చేస్తాడు. అది సిద్ధ జ్ఞాపకంగా తను వుంచుకున్న పిల్లన గ్రోవి. ఎలా ఇచ్చేస్తాడు? కథా సౌలభ్యం కోసం అలా ఇప్పించేశాడు కథకుడు. అప్పుడా పిల్ల దగ్గర పిల్లన గ్రోవిని నీలాంబరి చూడాలి, ఆమె వచ్చి సిద్ధ మీకు తెలుసాని ఆచార్యని అడగాలి. అప్పుడు సిద్ధ- నీలాంబరిలు ప్రేమికులని మనకి తెలియాలి - ఇందుకోసం ఈ రాంగ్ సీను. నీలాంబరి కూడా ఆ పిల్లన గ్రోవిని పిల్లకిచ్చేస్తే ఏమీ ఫీల్ కాదు. పట్టనట్టే వుంటుంది. అలావుంది సిద్ధ మీద ఆమె ప్రేమ.  

        సిద్ధ ఆచార్యకి అంత కావాల్సిన వాడైతే, ఏ రాత్రైనా కనీసం ఒక్కసారి ఆచార్య పిల్లనగ్రోవి వూదాలి. అది విని నీలాంబరి రావాలి- ఇక్కడ మనస్సుని హత్తుకునే సీను పడాలి. ఆ పిల్లన గ్రోవి ఆమె సొంతమవాలి. హత్తుకునే సీన్లు, కదిలించే సీన్లు ఈ సినిమాలో ఆశించకూడదు.

        ఇక విలన్ల వ్యవహారం. మెగాస్టార్ కి ప్రత్యర్ధిగా ఆఫ్టరాల్ ఓ మునిసిపల్ ఛైర్మన్ ఏమిటి? ఏనాటి సినిమా ఇది. వెనుక పెద్ద మాఫియా వున్నాడు కదా అనొచ్చు. ఆపరేటివ్ విలన్ మునిసిపల్ ఛైర్మన్ బసవేగా? ఇక ఆచార్య నక్సల్ పాత్ర నక్సల్ భావజాలంతో వుండదు. సీక్రెట్ గా వుంటున్న ఫ్యాక్షన్ హీరోలాగా ఫీలవుతూంటాడు...

—సికిందర్