రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, January 7, 2018

582 : స్పెషల్ ఆర్టికల్






స్క్రీన్ ప్లేలంటే స్ట్రక్చర్లే ! - విలియం గోల్డ్ మాన్ (రెండు ఆస్కార్ల రచయిత)
‘స్ట్రక్చర్’  పాఠాలు వచ్చేసి సినిమా రచనా పాఠాల్ని అనేక విధాలా మార్చేశాయి - హోవర్డ్ రాడ్మన్ (రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా మాజీ ప్రెసిడెంట్)
       మెరికన్ సినిమా రచనా చరిత్ర కొన్ని ప్రాచీనాధునిక సాంప్రదాయ శైలుల్ని కలుపుకుంటూ  ప్రామాణిక ‘హాలీవుడ్ స్ట్రక్చర్’ గా ప్రఖ్యాతి చెందింది. మూడు  ప్రధాన గ్రంథాలు  హాలీవుడ్ స్క్రిప్టుల మీద తిరుగులేని పట్టు సాధించాయి. అవి వరుస క్రమంలో అరిస్టాటిల్ రచించిన ‘పొయెటిక్స్’, జోసెఫ్ క్యాంప్ బెల్  రాసిన ‘ది హీరో విత్ ఏ థౌజండ్ ఫేసెస్’, సిడ్ ఫీల్డ్ వెలువరించిన ‘ది ఫౌండేషన్స్ ఆఫ్ స్క్రీన్ రైటింగ్’ అన్నవి.  స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ మీద ఇంకా అనేక మంది పుస్తకాలు రాశారు, రాస్తూ వున్నారు. వాళ్ళందరూ ఈ మూడు ప్రధాన వనరులైన గ్రంథాలలోని విషయాన్నే అటుతిప్పి ఇటుతిప్పి రాస్తూంటారు. ప్రారంభంలో సినిమా రచయితలు  అరిస్టాటిల్ నుంచి భారీగా అరువు తెచ్చుకుని,  నాటక సంవిధానాన్ని వెండి తెరకి మార్చుకోగలిగారు. పాత్ర,  దాని అంతర్గత భావోద్వేగాల ఆధారంగా సాగే రచనా ప్రక్రియకంటే ఉన్నతమైన కథనం - చర్యా ప్రతి చర్యల ( ప్లాట్ అండ్ యాక్షన్) ప్రతిఫలనాన్ని అరిస్టాటిల్ నుంచి వారసత్వంగా పొందారు. కథనంతో పొదుపూ ఐక్యతలనేవి ఇలా సాధ్యం చేసుకోవడం వల్ల, ఒకే పాత్ర చుట్టూ అది సృష్టించుకునే మంచీ చెడ్డ పరిస్థితుల చిత్రణ సులభమైంది.

           రిస్టాటిల్ నుంచి అంది పుచ్చుకున్న వారసత్వ లక్షణాలన్నిటిలో, ఆయన అధిక ప్రాధాన్యమిచ్చే కార్యకారణ సంబంధం (కాజ్ అండ్ ఎఫెక్ట్) తో, పరస్పర సంబంధముండే చర్యలతో కూడిన కథా నిర్మాణాన్ని స్వీకరించడమే ప్రామాణిక హాలీవుడ్ స్క్రిప్ట్ డిజైన్ మీద గొప్ప ముద్ర వేసింది. ఈ లక్షణాల్ని అంది పుచ్చుకోలేని కళ ఆర్ట్ సినిమాలుగా, అవాంట్ గార్డ్ సినిమాలుగా ప్రధాన స్రవంతి సినిమాల కావల వుండిపోయింది. కల్పన చేసిన దృశ్యాలు, పాత్రలు, సంభాషణలూ  అవెంత సౌందర్యాత్మకంగా వుండి ప్రేక్షకుల్ని అలరించే వైనప్పటికీ, స్థల కాల సంఘటనల ఐక్యతకి భంగం కల్గించేవైతే,  వాటిని తీసివేయడం అరిస్టాటిల్ నుంచే హాలీవుడ్ నేర్చుకుంది. 

          ఇక్కడ ఆసక్తి కల్గించే ఇంకో అంశమేమిటంటే, పరమ పవిత్రంగా భావించే స్ట్రక్చర్ నియమాలని అరిస్టాటిల్ నుంచే హాలీవుడ్ తీసుకున్నప్పటికీ, అరిస్టాటిల్ తో సంబంధంలేని, ఆయనకి  క్రెడిట్ ఇవ్వనవసరం లేని,  ‘త్రీయాక్ట్ స్ట్రక్చర్ మోడల్’  అనేదాన్ని హాలీవుడ్ స్వయంగా రూపొందించుకోవడం. వాస్తవానికి అరిస్టాటిల్ ఇన్ని యాక్ట్స్ (అంకాలు) వుండాలని సంఖ్యాపరంగా ప్రతిపాదించనూ లేదు, బోధించనూ లేదు. కేవలం బిగినింగ్ – మిడిల్ – ఎండ్ లుగా విభజించి,  ఈ విభాగాల క్షుణ్ణమైన అధ్యయనం చేసి సూత్రాలు మాత్రమే చెప్పాడు. 

          దీన్ని నాటకాలకి తీసుకున్నప్పుడు, ఒక్కో విభాగంలోని దృశ్యాల వారీగా సెట్స్ మార్చాల్సి వచ్చినప్పుడల్లా,  తెరదించక తప్పేది కాదు. అలా సెట్స్ మార్పుకి తెరదించి నప్పుడల్లా -  ఇది ఒకటో నంబరు అంకం, ఇది రెండో నంబరు అంకం అంటూ  కొన్నేసి దృశ్యాలకి కలిపి ఒక్కో నెంబరు  ఇచ్చుకుంటూ పోయేవారు. ఇలా గరిష్టంగా ఎనిమిది వరకూ  ఈ అంకాలు (యాక్ట్స్) వుండేవి. సెట్స్ మార్చుకోవడానికి  వెసులుబాటుగా ఈ అంక విభజన అమల్లోకి తెచ్చారే తప్ప, రచనా ప్రక్రియతో సంబంధం లేదు. ప్రొడక్షన్ పరమైన ఏర్పాటిది. 

      సినిమాలకి ఇన్నిసార్లు తెరదించే అవసరం వుండదు  కాబట్టి, అరిస్టాటిల్ స్ట్రక్చర్ లో   బిగినింగ్ - మిడిల్ - ఎండ్ లలో,  బిగినింగ్ దృశ్యాలన్నీ కలిపి మొదటి  అంకం, మిడిల్ దృశ్యాలన్నీ కలిపి రెండో  అంకం, ఎండ్ లో వచ్చే దృశ్యాలన్నిటినీ కలుపుకుని మూడో  అంకంగా విభజించి, ఒకే విరామమిస్తూ - త్రీ యాక్ట్ స్ట్రక్చర్ గా డిజైన్ చేశారు. అయితే అరిస్టాటిల్ అంకాల వారిగా విభజన చేసి చెప్పకపోయినా, బిగినింగ్ -మిడిల్ – ఎండ్ మొత్తానికీ కలిపి రెండే దశ లన్నట్టు చెప్పాడు. మొదటి దశ సమస్య అయితే, రెండో దశ పరిష్కారం.

          ఇక జోసెఫ్ క్యాంప్ బెల్ విషయానికొస్తే, ఆయన ప్రపంచ పురాణ కథలన్నీ ఒకే సాధారణ నమూనాతో  వుండడాన్ని వెలుగులోకి తెచ్చాడు. అవన్నీ పురాణ పాత్ర లక్ష్యం కోసం చేసే ప్రయాణంగా వుండడం, ఆ ప్రయాణం అన్నిట్లో ఒకే నమూనాతో వుండడాన్నీ గమనించాడు. ఆ ప్రయాణాన్ని మూడు దశలుగా  విభజించాడు. ఆ మూడు దశల్ని 17 మజిలీలుగా లేదా,  కథా గమనాలుగా విభజించాడు. స్థూలంగా నమూనాని ఇలా తెలియజేశాడు : పురాణ పాత్ర (హీరో) తానుంటున్న సాధారణ నిత్య జీవిత ప్రపంచంలోంచి,  దివ్యశక్తులుండే అసాధారణ ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. అక్కడుండే దుష్ట శక్తులతో పోరాడి, దివ్యశక్తుల్ని హస్తగతం చేసుకుని,  తనవాళ్ళకి తెచ్చి అందిస్తుంది. దీన్ని ఆయన మోనో మిథ్ నిర్మాణ మన్నాడు. ఈ మోనో మిథ్ అనే 17 మజిలీల నమూనాలో పురాణాల నాటకీయ, మానసిక, ఆధ్యాత్మిక కార్యకలాపాలని వివరించాడు. దీన్ని హీరోస్ జర్నీ అన్నాడు. 

          1949 లో జోసెఫ్ క్యాంప్ బెల్ కనుగొన్న ఈ దృష్టాంతం,  పురాణాల పరంగా, సాంస్కృతికంగా,  ప్రపంచ మానవాళిని ఒక్కటి చేసే 20వ శతాబ్దపు అద్భుతంగా అభివర్ణించారు పండితులు. అయితే విషయాన్ని సైద్ధాంతికంగా తేల్చిన ఆయన అధ్యయనం, ఆచరణకి దూరంగా వుండి పోయింది. భావి రచయితలకి దీన్ని సీన్ల వారీగా ఎలా చెప్పాలో అర్ధం గాలేదు. మోనోమిథ్ ఒక నమూనాయే అయినా, అది ఒక దిశగా ప్రయాణించే నమూనా కాదు. ఆయన నమూనాని వర్కింగ్ ఫార్ములాగా మార్చబోయిన రచయితలకి,  ఆ నమూనాలోని అనుభూతిని  పట్టుకోవడం కష్టమైపోయింది.  

          జార్జి లుకాస్,  జోసెఫ్ క్యాంప్ బెల్ మొదటి శిష్యపరమాణువయితే  కాకపోవచ్చు. కానీ ఆధునిక సినిమాకి ఆయన క్యాంప్ బెల్ ని అడ్జెస్టు చేసి చూపించిన వాళ్ళల్లో అగ్రగణ్యుడు. ‘స్టార్ వార్స్’  ని లుకాస్ ఆధునిక పురాణ కథలా తీయాలనుకున్నాడు. దీనికి క్యాంప్ బెల్ నమూనా విలువైన రోడ్ మ్యాప్ అవుతుందని భావించాడు. తన మేధాశక్తితో దాన్ని సినిమాకి అడ్జెస్టు చేసి చూపించి అతి పెద్ద హిట్ కొట్టాడు. దీంతో ఇతర మేకర్లు క్యాంప్ బెల్ నమూనాలో అద్భుత సక్సెస్ ఫార్ములా దాగుందని గుర్తించి, ఆ మేరకు ప్రయత్నాలు మొదలెట్టారు. 1985 కల్లా డిస్నీ స్టూడియో ఎగ్జిక్యూటివ్  క్రిస్టఫర్ వోల్గర్ ఈ ఫార్ములాని స్క్రీన్ ప్లేలకి సులభతరం చేశాడు. అప్పటికే మోనోమిథ్ ఎంత పాపులర్ అయిందంటే,  వచ్చే స్క్రిప్టులు ఆ ఫార్ములాలో వున్నాయా లేదా అని చూసేవారు. వోల్గర్ ఈ ఫార్ములాలోని పదిహేడు మజిలీల్ని 12 కి కుదిస్తూ (కొందరు చెడగొట్టాడని అంటారు), అందులోని మానసిక, ఆధ్యాత్మిక కోణాలని నామరూపాల్లేకుండా చేసి, కమర్షియల్ విలువల సినిమాటిక్ స్ట్రక్చర్ గా ముందుకు తెచ్చాడు. ఆ పుస్తకానికి ‘ది రైటర్స్ జర్నీ’ అని పేరుపెట్టాడు.



         ఇలా క్యాంప్ బెల్ మోనోమిథ్ ని మిమిక్రీ చేయడంతో వచ్చిన చిక్కేమిటంటే,  పౌరాణిక కథనం ఫక్తు కమర్షియల్ స్ట్రక్చర్ గా మారి నాణ్యత తగ్గిపోవడం. అయితే మోనో మిధ్ ని వున్నదున్నట్టు అనుసరిస్తే అసహజ స్ట్రక్చర్ ఏర్పడుతుందని వోల్గర్ హెచ్చరిం
చాడు. అయితే మోనోమిథ్ కి సబబైన ప్రత్యాన్మాయ మార్గాలని అన్వేషించకుండా,  వోల్గర్ వంటి స్క్రీన్ ప్లే పండితులు మోనోమిథ్ నే ప్రచారం చేస్తూ,  రచయితలకి దాన్నే బోధిస్తూ, సక్సెస్ గ్యారంటీ ఫార్ములా అని ప్రేరేపిస్తూ,  తమ కెరీర్స్ ని నిర్మించుకున్నారు.

          ఇక సిడ్ ఫీల్డ్ రాకతో హాలీవుడ్  స్క్రీన్ ప్లే త్రిమూర్తుల చిత్రపటం పూర్తయింది. ఆయన  1979 లో పుస్తకాన్ని రాశాడు. శాస్త్రాల్నీ పండితుల్నీ చూసి స్క్రీన్ ప్లే అంటే ఏమిటో అని భయపడే వాళ్ళకి సినిమా స్క్రిప్టు రచనని నేలకు దించి, సామాన్య రచయతకి సైతం అర్ధమయ్యే భాషలో, వర్క్ బుక్  ని రూపొందించాడు. విప్లవాత్మకంగా ఆయన కథల సంక్లిష్ట కథన తీరుతెన్నుల్ని సాపు చేసి ఒక్క చిత్రపటంతో,  తనదైన పారడైమ్ (భూమిక ) గా చూపించాడు. సినిమా రచనని సుబోధకం చేసి,  అన్ని సందేహాలనీ భయాందోళనల్నీ దూరం చేశాడు. తను కూడా త్రీ యాక్ట్ స్ట్రక్చరే చెప్పాడు. కాకపోతే ఏ యాక్ట్ ఎంత నిడివి వుండాలో తికమక పడే వాళ్ళకి కొలతలు చెప్పడమే అపూర్వమైనది.  బిగినింగ్ పావువంతు, మిడిల్ సగం, ఎండ్ పావు వంతూ వుండాలని చెప్పాడు. అంటే కాల పరంగా బిగినింగ్ 30 నిమిషాలు, మిడిల్ 60 నిమిషాలు, ఎండ్ 30 నిమిషాలు, అంటే పేజీల్లో  బిగినింగ్ 30 పేజీలు , మిడిల్  60 పేజీలు, ఎండ్ 30 పేజీలు వుండాలనీ చెప్పి సంచలనం సృష్టించాడు (సిడ్ ఫీల్డ్ నమూనాని 2002 లో ఆంధ్రభూమి ‘వెన్నెల’ ద్వారా ఫుల్ పేజీ వ్యాసం రాసి పరిచయం చేసినప్పుడు టాలీవుడ్ లో కూడా సంచలనం రేగింది. కానీ అంతలోనే అదంతా మర్చిపోయి తిరిగి షరా మామూలు 90 శాతం ఫ్లాపుల ధోరణిలో సుఖవంతంగా రాసుకోసాగారు – సి). సిడ్ ఫీల్డ్ నమూనాకి స్క్రీన్ ప్లే పండితులు మండిపడ్డారు. సినిమా కథల్ని కొలతలతో బంధించి ఎలా రాస్తారని, అప్పుడవి అచ్చులో పోసినట్టు ఒకేలా వుంటాయని విమర్శించారు. కానీ సిడ్ ఫీల్డ్ విజయవంతమైన సినిమాల్లోనే ఇది వుందని తెలియజేశాడు. సినిమాలు రాస్తున్న, తీస్తున్న వాళ్లకి కూడా తెలీదు, తాము ఇవే కొలతలతో స్క్రిప్టులు రాస్తున్నామని. 

            సిడ్ ఫీల్డ్ ప్రపంచవ్యాప్తంగా వర్క్ షాపులు నిర్వహిస్తూ ఇలా బోధించే వాడు – త్రీయాక్ట్ స్ట్రక్చర్. ఇందులో మొదటి యాక్ట్ అంటే బిగినింగ్ సెటప్ అంటారు. ఇది 30 పేజీలూ సాగుతుంది. కానీ  25 వ పేజీకల్లా మొదటి ప్రధాన మలుపు ప్లాట్ పాయింట్ వస్తుంది. 31 వ పేజీ నుంచి రెండవ యాక్టు ప్రారంభమవుతుంది. అంటే మిడిల్. ఇక్కడ సంఘర్షణ మొదలవుతుంది. ఇది 60 పేజీలు  వుంటుంది.  అంటే ఇక్కడికి 30 + 60  = 90 పేజీలు  పూర్తవుతాయి. కానీ 85 వ పేజీకల్లా రెండవ ప్రధాన మలుపు అంటే ప్లాట్ పాయింట్ టూ వస్తుంది.  ఈ మిడిల్ అరవై పేజీల మధ్యలో ఒక చోట మిడ్ పాయింట్ వస్తుంది. ఇక మూడో యాక్టు అంటే ఎండ్,  చివరి దాకా 30 పేజీలు వస్తుంది... ఇలా ఈ ఒక్కో విభాగంలో ఏమేం జరగాలో, కథనం ఎలాగెలా కొనసాగాలో,  సిడ్ ఫీల్డ్ చెప్పినంత వివరంగా, సామాన్య భాషలో, సులభ శైలిలో  చరిత్రలో ఇంకెవరూ  చెప్పలేదు, అరిస్టాటిల్ కూడా. 

       సిడ్ ఫీల్డ్ సంచలనంతో డజన్ల కొద్దీ స్క్రీన్ ప్లే పుస్తకాలు వచ్చాయి. అవన్నీ సిడ్ ఫీల్డ్ చెప్పినదాన్నే అటూ ఇటూ తిప్పి చెప్పినవే. ఇందులో రాబర్ట్ మెక్ కీ ప్రముఖుడు. సిడ్ ఫీల్డ్ భూమిక తప్పని ఆయన చెప్పింది సిడ్ ఫీల్డ్ కి నకలుగానే వుంటుంది. ఆయన బిగినింగ్ 30, మిడిల్ 70, ఎండ్ 18 పేజీలుండి, రెండు పేజీలు  ఉపసంహారం వుండాలని చెప్పాడు. సిడ్ ఫీల్డ్ ప్రభావంతో మునుపెన్నడూ లేని విధంగా అందరూ పేజీల లెక్కకొచ్చారు. కాకపోతే తామేదో నిరూపించుకోవాలని లెక్కలు మార్చి చెప్పారు. రాబర్ట్ మెక్ కీ పేజీలని అటూఇటూ మార్చి చూపించింది సిడ్ ఫీల్డ్ పారడైమ్  2 . 0 నే!

          హాలీవుడ్ బిగ్ బడ్జెట్ బ్లాక్ బస్టర్ల స్క్రిప్టులు కాన్షస్ గా దాదాపు సిడ్ ఫీల్డ్ భూమిక లోకి,  అవే లెక్కలతో వచ్చేశాయి.  ఈ భూమిక ప్రేక్షకుల సహనశక్తిని  పరీక్షించకుండా మేనేజ్ చేయడానికి వ్యాపార  దృష్టితో రూపొందించినట్టు అన్పిస్తుంది. ఇంత సులువైన మార్గం హాలీవుడ్ కి ఇంకేముంటుంది?

ప్రొ. ఆండ్ర్యూవ్ కెన్నెత్






581 : స్పెషల్ ఆర్టికల్




            సినిమా ఎందుకు ఆడిందో, ఏది ఎందుకు ఆడలేదో శాస్త్రీయ దృష్టితో పరిశీలించేకంటే, కొన్ని స్థిరపడిపోయిన నమ్మకాలతో పై పైన అంచనాకొచ్చేయడమే సర్వసాధారణంగా జరిగే పని. ఈ పై పై అంచనాలతో అసలు స్క్రీన్ ప్లే సంగతులు మరుగున పడిపోయి, మళ్ళీ అవే పైపై అంచనాలతో  అవే సినిమాలు అలాగే పైపైన తీసేయడం జరుగుతోంది. అంతా పైపైనే వుంటుంది గానీ లోపలేమీ వుండదనుకోవడం పొరపాటు. లోపల ఎండ్ సస్పన్స్ వల్ల ఫ్లాపవచ్చుగానీ, పైన హీరో బాగా నటించక కాదు. లోపల స్ట్రక్చర్ బావుండి హిట్టవచ్చు గానీ,  పైన కామెడీ బావుండడం వల్లకాదు. లోపల పాసివ్ పాత్ర వల్ల సినిమా పోవచ్చు గానీ,  పైన పాత కథ వల్ల కాదు. హిట్టు ఫ్లాపులకి పైకి తోచే ఏవో మంచి చెడ్డలే కారణమైతే,  అవి సవరించుకుని తీస్తూ వుంటే సక్సెస్ రేటు పెరగాలి నిజానికి. కానీ ప్రతీ ఏటా 90 శాతం ఫ్లాపులే. ఇక ఈ అంచనాల, నమ్మకాల, సొంత అభిప్రాయాల మంత్రం ఎక్కడ పనిచేస్తున్నట్టు. పది శాతమే సక్సెస్ రేటు అనే శాశ్వతత్వం 2017 లో కూడా వదల్లేదు. విడుదలైన 161 పెద్దా చిన్నా సినిమాల్లో 17 మాత్రమే గట్టెక్కి, మిగిలిన 144 కూడా 144 సెక్షన్ విధించినట్టు కనిపించకుండా పోయాయి. ప్రతీఏటా ఇలా 144 సెక్షన్ విధించుకోవడానికే ఈ అంచనాలు, నమ్మకాలు, సెంటిమెంట్లూ పనికొస్తున్నాయన్నట్టుంది. థియేటర్లు 144 సెక్షన్ విధించినట్టే ప్రేక్షకుల్లేక వెలవెల బోతున్నాయి. ఈ సెక్షన్ 144 ని ఎప్పుడు ఎత్తి వేస్తారా అని ఆశతో చూడ్డం కూడా వృధా. నమ్మకాలంచనాల వంచనలు వదిలి పోనంత వరకూ ఇంతే. 

          హాలీవుడ్ సక్సెస్  రేటు 40 – 50 శాతం మధ్య వుంటోంది. 2017 లో 50 శాతం నమోదైంది. 743  సినిమాలు విడుదలైతే వాటిలో 84 సినిమాలు (11 %) బడ్జెట్ మీద రెట్టింపు కంటే ఎక్కువ  వసూళ్లు సాధించాయి. మరో 84 సినిమాలు (11%) బడ్జెట్ మీద వంద నుంచి 200 శాతం కలెక్షన్లు రాబట్టాయి. ఇంకో 207 సినిమాలు ( 28%) బడ్జెట్ మీద స్వల్ప లభాలార్జించాయి. 251 సినిమాలు (34%) బడ్జెట్ కి స్వల్ప నష్టాలతో వున్నాయి. 66 సినిమాలు (9 %)  పెట్టుబడి వందకి వంద శాతం నష్టపోయాయి. 51 (7%) పూర్తిగా నష్టపోవడమే గాక చేతినుంచి అదనంగా పడ్డాయి. ఇలా పూర్తిగా దెబ్బ కొట్టినవి  9 + 7 = 16 శాతమే. కానీ టాలీవుడ్ లో 90 శాతం!

          ఆడని సినిమాలకి ఇతరత్రా భర్తీ చేసుకుని,  నాట్ బ్యాడ్ సేఫ్ అనే సూత్రం ఒకటి అమలుచేస్తున్నారు. మళ్ళీ అలాటి సినిమా ఇచ్చిన ఆ దర్శకుడికి, కొన్నిసార్లు ఆ కొత్త దర్శకుడికీ మళ్ళీ తామే సినిమా ఇస్తున్నారు. సినిమా బాక్సాఫీసు దగ్గర ఫెయిలయ్యాక ఫెయిలైనట్టే లెక్క. శాటిలైట్ హక్కులు, అమెజాన్ హక్కులు, డబ్బింగు హక్కులూ  తెచ్చుకుని నష్టాన్ని భర్తీ చేసుకుని, వీలయితే లాభమే తెచ్చుకుని,  నాట్ బ్యాడ్ సేఫ్ అని సినిమా పెర్ఫార్మెన్స్ కి ఆపాదించడం చెడ్డ సాంప్రదాయం. బాక్సాఫీసు దగ్గర ప్రేక్షకుల్ని రాబట్ట లేకపోయిన దర్శకుడు ఫ్లాప్ దర్శకుడే. అతను తీసిన ఫ్లాప్ ఇతరత్రా భర్తీ చేసింది కాబట్టి అతడి మీద  మమకారం పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఇతరత్రా భర్తీ అవుతుందన్న భరోసాతో, అలసత్వంతో మళ్ళీ ఫ్లాపే తీస్తాడు తప్ప తన టాలెంట్ ని మెరుగుపర్చుకునే ఆలోచన చెయ్యడు. గత రెండు నెలల్లో విడుదలైన రెండు సినిమాల విషయంలో ఇదే జరిగింది. నాట్ బ్యాడ్ సేఫ్ సూత్రంతో ఇద్దరు కొత్త ఫ్లాప్ దర్శకులకి కొత్త ప్రాజెక్టులు. ఇలా నాట్ బ్యాడ్ సేఫ్ డైరెక్టర్లు కూడా వస్తే ఇంకేం శాస్త్రం, అస్త్రం వుంటాయి.  అదే నమ్మకాలంచనాల వంచనల ముంచివేతలు ఇంకా పెరుగుతాయి. 

          హాలీవుడ్ లో 40 – 50 సక్సెస్ రేటు వుందంటే,  వాళ్ల దగ్గర నమ్మకాలంచనాల వంచనలు పనిచెయ్యవు. శాస్త్రం దగ్గరికి రావాల్సిందే. ఎంత పెద్ద స్టూడియో అయినా,  ఆ స్ట్రక్చర్ సంగతి చూసుకోమంటాయి. అదే ససమయంలో కొన్ని స్టూడియో నమ్మకాలు కూడా పెట్టమంటాయి. దీంతో ఢోకా వుండదు. కానీ – స్ట్రక్చరేంటో అర్ధంగాక, నమ్మకాలు పెడితే పెట్టండి, లేకపోతే పొమ్మంటేనే వస్తోంది సమస్య. దీంతో ఇందుకు తగ్గట్టే  రాసేవాళ్ళు, తీసేవాళ్ళూ తయారవుతారు. యుద్ధప్రాతిపదికన 90 శాతం ఫ్లాపులు తీస్తూంటారు. ఈ మృత శిశు జననాల జాడ్యాన్ని అరికట్టే డాక్టర్లు లేరా అంటే, మంచి పురుడు పోయాలనుకునే  స్క్రిప్టు డాక్టర్లున్నారుగానీ, సర్జన్లు లేరు. సర్జన్ అయితే సిజేరియన్  చేసైనా కాపాడి తీరాలనుకుంటాడు. 

          సమస్య ఎక్కడ వచ్చిందంటే,  పూర్తిగా నమ్మకాలూ పనిచెయ్యవు, పూర్తిగా శాస్త్రమూ పనిచెయ్యదు. ఈ రెండిటిని కలుపుకు పోవడం దగ్గర వచ్చింది సమస్య. హాలీవుడ్ లో కలుపుకుని పోతారు కాబట్టి ఆ సక్సెస్ రేటు. మనకి శాస్త్రాల్లేవు, వున్నవి నమ్మకాలే. శాస్త్రాల్ని హాలీవుడ్ నుంచి తెచ్చుకోవాల్సిందే. తెచ్చుకున్నా వున్నదున్నట్టు అమలు చేయలేరు. చేస్తే తెలుగు సినిమాలు కాక, హాలీవుడ్ సినిమాలు తయారవుతాయి. ఆ స్క్రీన్ ప్లే శాస్త్రాలు అక్కడి సినిమాలకి, అక్కడి ఫిలిం స్కూళ్ళకి. ఆ శాస్త్రాలు చదివి, ఫిలిం స్కూళ్ళల్లో పాసై వచ్చినా,  మళ్ళీ స్థానిక నేటివిటీతో అంటుకట్టాల్సిందే. స్థానిక అభిరుచులకి తగ్గట్టుగా వాటిని మల్చుకుని,  కస్టమైజ్ చేసుకోవాల్సిందే. స్వతంత్రంగా ఆ శాస్త్రాలు, కోర్సులూ పనిచెయ్యవు. 

          హాలీవుడ్ లో శాస్త్రాలూ నమ్మకాలూ చెట్టపట్టాలేసుకోవడం సినిమాలు పుట్టినప్పట్నించే వుంది. నమ్మకాలనేవి కేవలం క్రియేటివిటీకి సంబంధించిన సాధనాలే  తప్ప వాటికవే నిర్మాణాలు, అంటే స్ట్రక్చర్ కాదు. స్ట్రక్చర్ వేరు, నమ్మకాలతో కూడిన క్రియేటివిటీ వేరు. కథనమే క్రియేటివిటీ అనుకోవడం వల్ల సినిమాలు గల్లంతవుతున్నాయి. కథనంలో ఓనమాలు తెలియకపో
యినా చేతిలో వున్న క్రియేటివిటీయే కథన చాతుర్యమనుకుని సినిమాలు తీసేస్తున్నారు. కథనమనేది సృజనాత్మక (క్రియేటివ్) ప్రక్రియ కాదు. అది స్ట్రక్చర్ సంగతి. ఈ స్ట్రక్చర్ కి కొన్ని నియమాలున్నాయి, క్రియేటివిటీకి నియమలుండవు (నమ్మకాలకేం నియమలు, ప్రమాణాలు వుంటాయి). దీని గురించి ఈ బ్లాగులో కొన్ని సార్లు వివరించుకున్నాం. కథకి ముందు ఒక స్ట్రక్చర్ తో కూడిన కథనం ఏర్పాటయ్యాకే,  ఎవరికి  తోచిన క్రియేటివిటీ (నమ్మకాలు, అంచనాలు, సొంత అభిరుచులు) తో వాళ్ళు నగిషీలు చెక్కుకోవచ్చు. 

          ఈ అవగాహన హాలీవుడ్ లో ముందు నుంచీ వుంది కాబట్టే స్ట్రక్చర్ కి అంతటి విలువ. ముందు నాటకాలని  గమనించారు. ఆ నాటకాలు అలా రక్తి కట్టడానికి వాళ్లేసిన మంత్రమేమిటని పరిశీలించారు. అరిస్టాటిల్ తేలాడు. రెండో శతాబ్దపు గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ అప్పట్లో నాటక శాస్త్రాన్ని వివరిస్తూ రాసిన ‘పొయెటిక్స్’ గ్రంధం  నాటకాలకి ప్రామాణికమైందని  తెలుసుకున్నారు. దాన్నుంచీ అరిస్టాటిల్ చెప్పిన అంక విభజన సహిత కథా క్రమాన్ని సంగ్రహించి  హాలీవుడ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కి వాడుకోసాగారు. కొంతకాలం గడిచాక జోసెఫ్ క్యాంప్ బెల్ రాసిన పరిశోధనాత్మక గ్రంధం  ‘హీరో విత్ ఏ థౌజండ్ ఫేసెస్’ ని  స్క్రీన్ ప్లేల కుపయోగించుకోసాగారు. మరికొంత కాలం గడిచాక,  సిడ్ ఫీల్డ్ రాసిన ‘ది ఫౌండేషన్ ఆఫ్ స్క్రీన్ రైటింగ్’ ని అనుసరిస్తూ స్క్రీన్ ప్లేలు రాసుకుంటూ ఇప్పటికీ కొనసాగుతున్నారు. 

          ఇలా ఈ ముగ్గురు పండితులు హాలీవుడ్ స్క్రీన్ ప్లేల పితామహులుగా మూడు కాలాలు ప్రభావితం చేస్తూ వచ్చిన నేపధ్యంలో,  వీరిపైన ప్రత్యేక వ్యాసం రేపు చూడగలం.
సికిందర్

 

         
         
         

         


















Friday, January 5, 2018

580 : సందేహాలు - సమాధానాలు



Q :  మీ బ్లాగు రెగ్యులర్ గా చదువుతూంటాను. ఎంతో ఆసక్తి కరంగా, విజ్ఞాన దాయకంగా వుంటాయి మీ రచనలు. నాకు సినీ పరిభాషలో ట్రీట్ మెంట్ అంటే ఏమిటో అర్థం కాదు. ఎప్పుడో మీరు చెప్పే వుంటారు కానీ మిస్ అయ్యాను. వీలైతే తెలియబర్చగలరు.
డా. డి.వి.జి. శంకరరావు, విజయనగరం

A :  ఒక కథ అనుకుని కథలో సీను తర్వాత సీను రావాలో ఒక వరస క్రమంలో ఒకటి రెండు లైన్లలో 60, 70 సీన్లకి రాసుకుంటూ పోతారు. దీన్ని లైన్ ఆర్డర్ అంటారు. ఇలా అనుకుందాం :
          1. గెస్ట్ హౌస్ లో సమావేశం : తనకు కంపెనీలో 40శాతం వాటా, ప్రజలకు ఉద్యోగాల్లో 10 శాతం వాటా డిమాండ్ చేస్తాడు ఎమ్మెల్యే. ఇదెక్కడి  గొడవని కెవిపికి ఫోన్ చేస్తారు ప్రమోటర్లు.
          2.
పాడుబడ్డ స్కూల్లో పిల్లలమధ్య, పిల్లల యూనిఫాంలో చిన్న పిల్లాడిలా వున్న హీరోని చూసి షాక్ అవుతాడు హెడ్ మాస్టర్. స్కూలు రిపేరు నిధులు మింగినందుకు రేపటి నుంచి పిల్లలు నీ ఇంటికే వచ్చి చదువు కుంటారని ఆర్డరేస్తాడు హీరో. 

          ఇలా నెంబర్లు వేసుకుంటూ ప్రతీ సీనూ రాసుకున్నాక, ఒక్కో సీను తీసుకుని ఆ సీనులో జరిగే బిజినెస్ అంతా వివరంగా రాయడం మొదలెడతారు. ఈ రాసేటప్పుడు సీను ప్రారంభం (బిగినింగ్) మధ్యమం (మిడిల్ ), ముగింపు (ఎండ్) వుండేట్టు చూసుకుంటారు.  ఒక్కో సీనుకి ఎన్ని పేజీలైనా రాసుకోవచ్చు. తెర మీద ఎలా రన్ అవ్వాలో అలాగే రాసుకుంటారు. పేజీ పైన సీను నెంబర్ వేసి, ఎక్కడ తీయాలో,  ఏ సమయం తీయాలో రాస్తారు. ఈ కింద ఒక సీను చూద్దాం:

సీన్ : 60
ఎక్స్/ రోడ్స్ / నైట్

ఖాళీగా వున్న రోడ్ల మీద JP వెంట నడుస్తున్నారు అమిత్, సూరి, సత్తి, జ్యూనియర్లు దుడ్డు కర్రలు పట్టుకుని - ఇలా మీతో నడుస్తూంటే ఎంత హాయిగా వుంది. మీరు కనపడరు గానీ గొప్పోళ్ళురా! నన్ను భలేగా కాపాడేశారు. కానీ డేంజర్రోయ్ మీరూ...  ఏకుమేకై పోతున్నారు. పార్టీ  ఫండ్స్ అంటూ  జోక్యం చేసుకుని వేలం పాటేస్తున్నారు.  పైగా పార్టీ టికెట్లకి డబ్బులొస్తున్నాయా అని అడిగేదాకా వెళ్ళిపోయారు.  ఒవరై పోతున్నార్రా. ఇందాకా ఏమన్నావు రా? పార్టీని సొంతం చేసుకుంటారా? ఎంత యాక్టింగ్ అయినా మాటలెందుకు వచ్చాయిరా? మనసులో కుట్ర లేకపోతే? ఏంటి? కాబట్టి మీ గురించి ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. రాజకీయాల్లో ఎవర్నీ నమ్మకూడదు. మీలాంటి కుర్ర నాయాల్ని అస్సలు నమ్మ కూడదు. మీ జనరేషను మా ఓల్డ్ జనరేషన్ని తోసిపారేసి అధికారం చేజిక్కుంచుకోవాలని చూస్తున్నారు. నా సీక్రెట్స్ ని కూడా సీక్రెట్స్ గా వుంచి చావలేదుగా మీరూ...అగండ్రా ఆగండి, మిమ్మల్నీ...అంటూ రివాల్వర్ తీసి టపటప కాల్చిపడేశాడు. చెల్లాచెదురుగా పడిపోయారు నల్గురూ.

     
JP ఆగిపోయి తన చేతిలోని రివాల్వర్నే ఆశ్చర్యంగా చూస్తున్నాడు- వండర్ గా వుందే... ఈ సమయంలో నా రివాల్వర్ పేలిందేంటి?  నీ రివాల్వర్ నా చేతిలో వుందేంటి?అంటున్నాడు. కింద అలాగే పడిపోయి  తన చేతిలో రివాల్వర్ని నొక్కినొక్కి  చూస్తున్నాడు అమిత్. పేలడమే  లేదు.  ఫకాలున నవ్వాడు JP-ఒరే, నాది అడిగితే నీది నా కిచ్చేశావ్ రా! గుడ్ లక్ ఎవరి వైపు వుండాలో వాళ్ళ వైపు వుండక ఛస్తుందా, ఏంటి?’ అని పగలబడి నవ్వసాగాడు. 
 షాకింగ్ గా చూస్తున్నారు  నల్గురూ.

          ఇలా రాసుకుంటే సీనులో  బిజినెస్ మొత్తం కళ్ళకి కట్టినట్టు విజువలైజ్ అవుతుంది. దీన్ని  ట్రీట్ మెంట్  అంటారు. ఒక సీను ఎలా రన్ అవ్వాలో ట్రీట్ చేయడమే ట్రీట్ మెంట్. ఇదంతా స్క్రీన్ ప్లే పనే.  మొదట అంకెలు వేసుకుని వన్ లైన్ ఆర్డర్ రాయడం దగ్గర మొదలు పెట్టేదే స్క్రీన్ ప్లే పని.   దీన్ని పూర్తి చేశాక దీన్ని బట్టి ఫైనల్ గా డైలాగ్ వెర్షన్ రాయడంతో మొత్తం స్క్రిప్టు వర్క్ పూర్తవుతుంది. ఇంతే, ఇంత కంటే మరేమీ లేదు.

Q :  ఒకప్పటి సినిమాల్లాగా ఇప్పుడెందుకు రావడం లేదంటారు ?
 
కె. వనజా రావు, హైదరాబాద్ 

A :   ఎందుకంటే, తీసుకునే ఆహారాన్నిబట్టి సినిమాలుంటాయి. అప్పట్లో అలాటి ఆహారం తీసుకునే వాళ్ళు  కాబట్టి అలాటి సినిమా లొచ్చాయి. ఇప్పుడు కరివేపాకులో కూడా పస లేదు. నలిపి చూసినా వాసనా రాదు, రుచీ వుండదు. ఈ పిచ్చి ఆకుల్ని మానిపారేసి చారు తింటున్నాం. ఇప్పటి తిండిని బట్టే ఇప్పటి సినిమాలు, అంతే.


సికిందర్



      q