రచన - దర్శకత్వం :
తేజ
తారాగణం : రానా, కాజల్, కేథరిన్, పోసాని,
తనికెళ్ళ, అజయ్, జయప్రకాశ్ రెడ్డి, ప్రదీప్ రావత్, సత్యప్రకాష్ తదితరులు
సంగీతం : అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం : వెంకట్ సి.దిలీప్
బ్యానర్ : సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : డి సురేష్ బాబు, కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి
విడుదల: ఆగస్టు 11, 2017
***
దర్శకుడు తేజా టీనేజీ ప్రేమ సినిమాలతో రానురాను ఆదరణ
కోల్పోయి, కొంతకాలం తెర మరుగై రాజకీయ
సినిమాతో ఇప్పుడు దర్శనం చేసుకున్నారు. గతం లో తీసిన వాటిలో ఒక్క ‘నిజం’ అనే సామాజికం తప్ప మిగిలిన దాదాపు పదిహేనూ
టీనేజీ ప్రేమ సినిమాలే. ‘నిజం’ అనే సామాజికంతో వైఫల్యం తర్వాత ఇప్పుడు ‘నేనే రాజు
నేనే మంత్రి’ అంటూ రాజకీయంతో రావడం ఒక
విధంగా సాహసమే. ప్రేమల నుంచి రాజకీయాలకి తన స్టీరింగు తిప్పుకున్న తేజా ఎలా డ్రైవ్
చేశారన్నదానిపైనే ఆయన గమ్యం చేరడం ఆధారపడుంటుంది.
రానా
కూడా ‘ఘాజీ’, ‘బాహుబలి’ ల తర్వాత రాజకీయ పాత్ర పోషించేందుకు పూనుకోవడం, అందులోనూ
అపజయాలతో వున్న తేజకి అవకాశమివ్వడం రెండూ ప్రయోగాలే. ఒకరి సాహసం, ఇంకొకరి ప్రయోగం
కలిసి తయారైన ‘నేనే రాజు నేనే మంత్రి’
గురించి ఇద్దరూ మళ్ళీ ఇది రాజకీయ సినిమా కాదన్నారు- పదిశాతం మాత్రమే రాజకీయం,
మిగిలింది ప్రేమ కథ అన్నారు. ఇది వినడానికి విచిత్రంగా వున్నా, అసలేం చేశారో
ఒకసారి చూద్దాం...
కథ
స్వల్ప వడ్డీకి రుణాలిచ్చే వడ్డీ వ్యాపారి జోగేంద్ర ( రానా) భార్య రాధ ( కాజల్) ని
బాగా ప్రేమిస్తూంటాడు. పెళ్ళయిన మూడేళ్ళకి
తండ్రి కాబోతున్నాననే సంతోషంతో గుడికి తీసుకుపోతాడు. గుడి బయట దీపం వెలిగిస్తూంటే సర్పంచ్ భార్య కోపంతో రాధని
తోసేస్తుంది. దాంతో గర్భంపోయి ఇక పిల్లలు పుట్టని పరిస్థితి వస్తుంది. తాము
సామాన్యులు కాబట్టేగా ఈ పరిస్థితి వచ్చింది, ఇక ముందు ఇలా జరక్కుండా వుండాలంటే
సర్పంచ్ కుర్చీని కైవసం చేసుకోమని రాధ అంటుంది. దీంతో ఎన్నికలో నిలబడి సర్పంచ్
సుబ్బయ్య (ప్రదీప్ రావత్)ని ఓడించేస్తాడు జోగేంద్ర. దీన్ని జీర్ణించుకోలేని
సుబ్బయ్య తనని చంపబోతే అతణ్ణి చంపేస్తాడు జోగేంద్ర. ఈ హత్య నుపయోగించుకుని ఎమ్మెల్యే చౌడప్ప (సత్య ప్రకాష్) జోగేంద్రని
ఇరకాటంలో పెట్టేస్తే అతన్నీ చంపేస్తాడు.
అతడికి సహకరించిన సీఐ (అజయ్) ట్రాన్స్ ఫర్ అయ్యేలా చేస్తాడు. ఉపఎన్నికలో ఎమ్మెల్యే
అయి మంత్రి కూడా అయిపోతాడు. ఇక్కడ హోంమంత్రి సుబ్బారెడ్డి (ఆశుతోష్) తో వైరుధ్యం
వస్తుంది.
ఇలావుండగా
ఓ ఛానెల్ బాస్ కూతురు దేవికారాణి (కేథరిన్) జోగేంద్రని ప్రేమిస్తూ అతడి రాజకీయ చదరంగంలో సహకరిస్తూ
వుంటుంది. దీన్ని రాధా సహించదు. దీంతో ఈ
ఇద్దరి మధ్య నలిగిపోతూంటాడు. మరోవైపు
ఎట్టిపరిస్థితిలోనూ సీఎం అవాలని ప్రయత్నాల్ని తీవ్రతరం చేస్తాడు.
ఈ
ప్రయత్నాల్లో అతడికెదురైన అడ్డంకులేమిటి, రాధ- దేవికలతో వచ్చిన చిక్కులేమిటి, ఇవన్నీ ఏ మలుపులు తీసుకున్నాయన్నదే మిగతా కథ.
ఎలావుంది కథ
ఇది
పక్కా పొలిటికల్ థ్రిల్లర్ జానర్ కింది కొచ్చే కథ. ఇందులో ఎలాటి సందేహమూలేదు. కానీ ఇందులో పది శాతమే
రాజకీయ కథ అనడంలోనే తికమక వుంది. ఆ
తికమక కథని కూడా తిప్పలు పెట్టింది. రాజకీయ పరమ పద సోపాన పటంలో కథానాయకుడి ఆరోహణా
క్రమం చకచకా సగం దాకా సాగి, అక్కడ్నించీ పతనావస్థకి చేరడం 90 శాతం ప్రేమ కథ కోసమే
చేసి వుంటే అది జానర్ మర్యాదని గల్లంతు చేసే పనే. ఎప్పుడైతే జానర్ మర్యాద గల్లంతయ్యిందో
విషయం రిస్కులో పడి యాంటీ క్లయిమాక్స్ కి దారి తీసింది. ఈ యాంటీ క్లయిమాక్స్
బాక్సాఫీసు అప్పీల్ తో విభేదిస్తోంది. యాంటీ క్లయిమాక్స్ తో మెప్పించేందుకు ‘మరో
చరిత్ర’ లోలాగా స్టోరీ క్లయిమాక్స్ కాస్తా ప్లాట్ క్లయిమాక్స్ గా మార్పు చెందే
జగ్రత్తలేవీ తీసుకోలేదు.
కథ
నడక, పాత్రల తీరుతెన్నులూ వగైరా
చూస్తే కోడి రామకృష్ణ తీసిన రాజకీయ
సినిమాల శైలి గుర్తుకొస్తుంది. అయితే సిద్ధహస్థుడైన కోడి రామకృష్ణ ప్రేమల్ని గానీ,
కుటుంబ సమస్యల్ని గానీ జానర్ మర్యాదకి అడ్డురాకుండా రాజకీయ కథల్ని ఒక లాజికల్ ఎండ్
కి తీసికెళ్లారు. విశాల ప్రాతిపదికన ప్రజలకోసం పోరాడే కథానాయకుల్ని చూపించారు.
ప్రస్తుత కథలో కథానాయకుడు తన వ్యక్తిగత స్వార్ధం కోసం మాత్రమే హీరోగా ఎస్టాబ్లిష్
అవాలని ప్రయత్నించాడు. చివరిదాకా తన కోసం పోరాడిన ప్రజానీకాన్ని వదిలేసి భార్యకోసం
వెళ్ళిపోయాడు.
ఎవరెలా చేశారు
రానా
పోషించింది పవర్ఫుల్ పాత్ర ఫస్టాఫ్ లో. ఇంత యాక్టివ్ పాత్ర సెకండాఫ్ మొదలైన
దగ్గర్నుంచీ పాసివ్ రియాక్టివ్ పాత్రగా బలహీనంగా మారిపో
తుంది- రాజకీయ కథలోనూ, దాని
ఉపకథ అయిన ప్రేమ కథలోనూ. పవర్ఫుల్ పాత్రలో రానా ఆశ్చర్య జనకమైన నిర్ణయాలు
తీసుకుంటూ ప్రత్యర్ధుల్ని మట్టు బెట్టడం మనల్ని కళ్ళప్ప గించి చూసేలా చేస్తుంది.
అదే సెకండాఫ్ కొచ్చేసరికి, ప్రధాన శత్రువు
తీసుకునే పవర్ఫుల్ నిర్ణయాలకి గిలగిల లాడే రానాని
కళ్ళు తిప్పుకుని చూసేలా చేస్తుంది. ఇద్దరు అతివల మధ్య రానా నలిగే దృశ్యాలు
సానుభూతిని రాబట్టుకోగల్గినా, ప్రధాన శత్రువుతో బలహీనంగా కన్పించడంతో, రెండిటా ఒకే
రస పోషణ జరిగి పాత్ర ఫ్లాట్ గా మారింది. ఇలా కాకుండా అతివల విషయంలో బలహీనంగానూ, శత్రువు విషయంలో బలంగానూ వుంటే
డెప్త్ వచ్చేది. రానా తిరుగులేని పవర్ఫుల్ నటుడు- అయితే అతడి రాణింపుకి బాహుబలి,
ఘాజీల్లోలాగా సమగ్ర పాత్ర చిత్రణలుండాల్సిన అవసరముంది.
సెంటిమెంట్ల
కాజల్ పాత్ర మరీ సెంటి మెంట్లు ఎక్కువైపోయి సినిమాకి అడ్డదిడ్డంగా కాటుక (కాజల్)
పూసేసింది. గ్లామర్ పోషణ బావుంది. పాటల్లో బాగానే కన్పిస్తుంది. ముక్కోణ ప్రేమలో
త్యాగమనే భారం తనమీదేసుకుని చేసే పని చివరికి రానా చేసే పనిలాగే పిచ్చి పని.
రానాని మోటివేట్ చేసే పాత్ర కాస్తా తనే తీవ్ర నిర్ణయం తీసుకోవడం విస్తుపోయేలా
చేస్తుంది. పాత్ర చిత్రణలకి సంబంధించి ఒక
కొటేషన్ వుంది : పాత్రని పై దాకా చెట్టెక్కించాలి, ఆ తర్వాత రాళ్ళు తీసుకుని
కొట్టాలి. అప్పుడా పాత్ర ఏం చేస్తుందో చూడాలని... అయితే రానా కాజల్ ల లాగా
కూడబలుక్కుని చెట్టు దూకి పారిపోకూడదు!
జైసీ కాజల్ వైసా రానా అయ్యారిక్కడ.
టీవీ
జర్నలిస్టు పాత్రలో కేథరిన్ కి రానా తగిన బుద్ధి చెప్తూ, తనకి జరిగింది ఆమె
చెప్పుకోలేని ‘టెక్నాలజీ’ నుపయోగించడం చాలా బావుంది. ఇలాటి ఆడవాళ్ళకి ఇలాగే బుద్ధి
చెప్పాలి. అయితే ఒక జర్నలిస్టు కాపురాల్లో ది ఆదర్ వుమన్ గా చొరబడ్డం లాజికల్ గా
ఏమీ వుండదు. ఈమె పాత్రకూడా సెకండాఫ్ లో ఇంకేం చెయ్యాలో తోచక మిస్ అయి, క్లయిమాక్స్
లో భారీ జనసందోహాన్నేసుకుని మళ్ళీ జర్నలిస్టు సోకు వెలగబెడుతుంది. ప్రేమాగీమా
ఏమయ్యాయో తెలీదు. ప్రేమ కథకి కూడా న్యాయం జరగలేదు.
‘నక్షత్రం’
లో రేజీనా తండ్రిగా గతవారమే హడలగొట్టిన
శివాజీ రాజా మళ్ళీ ఈసారి కాజల్
ఫాదర్ గా ప్రత్యక్షమయ్యారు. శివాజీ రాజా అప్పుడే పెద్ద పెద్ద హీరోయిన్లకి
తండ్రి అయిపోవడం ఒక ఎట్రాక్షన్. ఇక విలన్ కి పక్కవాద్యం పోసాని, సీఎంగా
తనికెళ్ళ, సీఐగా అజయ్,
జైలర్ గా జయప్రకాశ్ రెడ్డి,
సర్పంచ్ గా ప్రదీప్ రావత్,
ఎమ్మెల్యే గా సత్యప్రకాష్ అంతా రాజకీయ
సన్నివేశాల్ని బాగా బాగా వేడెక్కించడానికి పనికొచ్చారు.
అనూప్
రూబెన్స్ ఈసారి లూప్ లో కొచ్చి సరైన బాణీల్ని అందించారు. సంగీతపరంగా
సినిమాకివ్వాల్సిన సోల్ నంతా ఇచ్చారు. కాకపోతే కథాపరంగా ఆ సోల్ చెదిరిపోయింది.
దిలీప్ కెమెరా వర్క్ కూడా ఉన్నతం. యాక్షన్, ఆర్ట్, ఎడిటింగ్ తదితర సాంకేతిక
విభాగాలన్నీ ఉన్నతంగా వున్నాయి.
తేజా దర్శకత్వంలో ఈసారి కొట్టొచ్చినట్టు
కన్పించేదేమింటంటే, ఎక్కడా ఇది తేజా
సినిమా అన్పించక పోవడం. లేకపోతే ప్రేమ సినిమాల్లో అంతా ఆయనే కన్పించేవారు డామినేట్
చేస్తూ. ఈసారి అంత ఇగో లేదు. తను కాకుండా కథ మాత్రమే, పాత్రలు మాత్రమే కన్పించేట్టు జాగ్రత్తలు తీసుకున్నట్టు
కన్పిస్తుంది.
ఈ
సినిమాకి మరో బలం సంభాషణలు. సంభాషణల రచయితకి సన్నివేశాలతో పనేగానీ, ఆ సన్నివేశాల కూర్పు సరిగానే వుందా, ప్రధాన
పాత్ర బలహీనంగా మారిపోయి, ప్రధాన కథని ఉప
కథ ఆక్రమిస్తూ, ఉప కథే ప్రధాన కథగా
ముగుస్తోందా అన్న బాదరబందీతో పనుండదు. అవి
దర్శకుడు చూసుకుంటాడు. అలాగే డైలాగ్ రైటర్ లక్ష్మీ భూపాల సామెతలు దట్టించి మాటలు
పేల్చుకుంటూ బిజీగా గడిపేశారు. తన పనిని తాను కమర్షియల్ రైటర్ అన్పించుకుంటూ
సమర్ధవంతంగా నిర్వహించారు. పరుచూరి బ్రదర్స్ కూడా రచనలో చేయి వేసి న్యాయం
చేసేందుకు తమ వంతు కృషి చేశారు. ఎవరైనా కృషి మాత్రమే చేయగలరు. ఫలితం మాత్రం
బాక్సాఫీసే చెప్తుంది. ఎలాటి కృషి చేశారనేది మాత్రం అర్ధం గాకుండా వుండిపోతుంది.
చివరికేమిటి
ఫస్టాఫ్
రానా యాక్షన్ తో కళ్ళుతిప్పుకో నివ్వదు. రాజకీయ కథ కొత్త పుంతలు తొక్కుతుంది.
సెకండాఫ్ లో కుటుంబ సెంటిమెంట్ల బారిన పడి ఎత్తుకున్న కథ యూత్ అప్పీల్ కి
దూరమైపోతుంది. విషాద ముగింపు ఇంకో మైనస్ కాగా, దీనికికూడా అర్ధం కన్పించదు. ఇలాటి
ముగింపు అవసరమే లేదు. ఫస్టాఫ్ లో పదవుల కోసం రానా చేసే హత్యాపరంపర – సెకండాఫ్
కొచ్చేసరికి కేవలం విలన్ చేసే అకృత్యాలని తిప్పి కొట్టే ప్రహసనంగా మారిపోతుంది. ఒక
అకృత్యానికి కాజల్ గాయపడినప్పుడైనా విలన్ మీద వేటు వేసే ఆలోచన చేయకపోవడం సెకండాఫ్
సమస్యలన్నిటికీ మూలం. పోతే ఇది సీరియస్ సినిమా. ఇందులో వినోదం పాలు వెతుక్కోకూడదు.