రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, May 9, 2016

తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్- 13


న్ని సినిమా కథలూ ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే పుడతాయి. దీని కంటే ముందు జరిగేదంతా ప్రిపరేషన్- సెటప్. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర, సోల్  - హీరో - గోల్ : ఈ త్రిముఖాలని మిళితం చేసుకుని కథ పుడుతుంది. కథ పుట్టాక ఈ త్రిముఖా లేర్పడవు. కథ పుడుతూనే ఈ త్రిముఖాలతో పుడుతుంది. ప్లాట్ పాయింట్ వన్ కథ పుట్టడం బిగ్ బ్యాంగ్ లాంటిది. ఇంటర్వెల్ బ్యాంగ్ వుంటే ఉండొచ్చు, కానీ దానికంటే ముందు బిగ్ బ్యాంగ్ వుంటుంది ప్లాట్ పాయింట్ వన్ దగ్గర. ఈ బిగ్ బ్యాంగ్ (మహా విస్ఫోటనం) లోంచే కథ త్రిముఖాలతో పరివ్యాప్త మవుతుంది. విశ్వంలో మహా విస్ఫోటనం జరక్క ముందు కాలం లేదు, స్పేస్ లేదు, భౌతిక- రసాయన సూత్రాలూ లేవు, ప్రాణి పుట్టడానికి అవసరమైన సోల్ కూడా లేదు. వీటన్నిటినీ  మహా విస్ఫోటనంలోంచే మోసుకుంటూ విశ్వం ఏర్పడింది. ప్రకృతి సూత్రాలనేవి ఆల్రెడీ మహావిస్ఫోటనానికి ముందే ఆ బిందువులో సాఫ్ట్ వేర్ గా ఏర్పడి వున్నాయి. అలాగే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర నుంచి కూడా త్రిముఖాలని అన్ని సూత్రాలతో  మోసుకుంటూ కథ పుడుతుంది. స్క్రీన్ ప్లే మిడిల్ విభాగంలో వాటిని వెదజల్లుతుంది.

          ప్పుడదొక కథా ప్రపంచం. అంటే ప్రేక్షకుల మానసిక ప్రపంచం. వాళ్ళ మానసిక ప్రపంచపు మెకానిజంనే తిరిగి వాళ్లకి వెండితెర  తెర మీద చూపించడం. ఏమిటా మానసిక ప్రపంచపు మెకానిజం? 1.వెలుపలి మనసు- 2. అంతరాత్మ - మధ్యలో ఇగో. అంటే బిగినింగ్- మిడిల్- మధ్యలో హీరో. ఇక్కడ కీలకం హీరో. అంటే ఇగో. మనిషికుండే ఇగోకి హీరోపాత్ర ఎంత సరిపోలినట్టుగా చిత్రిస్తామో, అంత ప్రేక్షకులకి ఆ హీరో పాత్ర దగ్గరవుతుందని జేమ్స్ బానెట్ అంటారు. అదే హీరో పాత్ర ఇంకేదో పాత్రకి రోల్ మోడల్ గా వుంటే ఇంకా బలంగా నాటుకుంటుందని కూడా అంటారు.

          ఇక్కడే జోసెఫ్ క్యాంప్ బెల్ ఎంటరవుతారు. ప్రపంచ పురాణాల మైథాలజిస్టు అయిన ఈయన,  కథల్లో హీరో ప్రయాణం ఎలాగెలా కొనసాగుతుందో వివరించారు. క్లయిమాక్స్ వరకూ ఈ దశలు పన్నెండు వుంటాయి. మన ప్రస్తుత టాపిక్ ఈ ప్రయాణం గురించి కాక, వెలుపలి మనసుకీ అంతరాత్మకీ ( బిగినింగ్, మిడిల్లకి) కలిపి లాక్ వేయడమే కనుక,  ఇందుకు సంబంధించి క్యాంప్ బెల్ దగ్గర నుంచి మూడో మజిలీ, నాలుగో మజిలీ మాత్రమే తీసుకుని వీటిని ఎలా అన్వయించాలో చూద్దాం. 

         బిగినింగ్ విభాగం ప్లాట్ పాయింట్ వన్ దగ్గర హీరోకి సమస్య ఎదురయ్యాక, అతను ఓ పట్టాన దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం కాడు. ఈ మజిలీని refusal of the call  అన్నారు క్యాంప్ బెల్. కురుక్షేత్రంలో అర్జునుడు ఓ పట్టాన యుద్ధం చేయడానికి సిద్ధపడలేదు. కృష్ణుడు ఒప్పించాల్సి వచ్చింది. ఈ ఒప్పించే పాత్రకి సంబంధించిన మజిలీని meeting with the mentor  అన్నారు క్యాంప్ బెల్. ఈ mentor  చేసే ఉపదేశంతో ఇక సమస్యని ఎదుర్కోవడానికి కార్యరంగంలోకి- మిడిల్లోకి- దూకుతుంది హీరో పాత్ర.    ఇక్కడ ఈ మజిలీ ఒక mentor  ఎవరో చేసే ఉపదేశంతోనే వుండాలని లేదు. (ఈ mentor గా కమెడియన్ కూడా ఉంటాడు కథని బట్టి) కళ్ళు తెరిపించే ఏదైనా సంఘటన కావొచ్చు, అనుభవం కావొచ్చు, అంతరాత్మ ప్రబోధం కావొచ్చు... సమస్య జోలికి వెళ్ళ వద్దనుకున్న హీరో ఇంటిని ప్రత్యర్ధులు తగలబెట్టే సంఘటన జరగ వచ్చు. అప్పుడు సమస్యలోకి దూకక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది హీరోకి. ఇదీ meeting with the mentor  మజిలీ. 

          జేమ్స్ బానెట్ కూడా ఇందుకే అన్నారు- హీరో పాత్ర ఇంకేదో పాత్రకి రోల్ మోడల్ గా వుంటే ఇంకా బలంగా నాటుకుంటుందని. హీరోలో అర్జునుడు కన్పిస్తూంటే అంతకంటే ఇంకేం కావాలి. ఇలాటి పాత్రల్ని మిథికల్ క్యారక్టర్స్ అంటారు. ఇవే ఎక్కువ ఆకట్టుకుంటాయి. ఎందుకంటే ఇవి ప్రేక్షకుల ఆత్మిక (సోల్) దాహాన్ని తీరుస్తాయి. రాముడు, కృష్ణుడు, సీత, రాధ, రావణుడుల వంటి ఎన్నో పౌరాణిక పాత్రలు ప్రతిఫలించే సినిమాలెన్నో ఇందుకే వస్తూంటాయి.  హాలీవుడ్ లో  ఒకప్పుడు కౌబాయ్ పాత్రలు ఆత్మిక దాహాన్ని తీర్చేవి. తర్వాత సూపర్ మాన్, స్పైడర్ మాన్ లాంటి పాత్రలు తీర్చసాగాయి..

          ఇంతకీ స్క్రీన్ ప్లే లో refusal of the call  మజిలీ ఎందుకేర్పడుతుంది? ఎందుకేర్పడాలి? ఇక్కడ హీరోని ఇగోగా చూస్తే సమాధానం దొరుకుతుంది. ఇగో వెలుపలి మనసుని ఏలుకుంటూ మజా చేస్తుంది. స్క్రీన్ ప్లే బిగినింగ్ విభాగం (వెలుపలి మనసు) లో హీరోల పాత్రలు ఇందుకే ఆ వారాగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూంటాయి. వెలుపలి మనసులో ఎంజాయ్ చేసే ఇగోకి నీతులు చెప్పే అంతరాత్మ అంటే వొళ్ళు మంట. దాని వైపే చూడదు. ఇందుకే బిగినింగ్ విభాగంలో ఇంట్లో తిట్లు తింటున్నా  ఆవారా హీరోకి బాధ్యతలు పట్టవు.  బాధ్యతల జోలికి వెళ్తే ఈ మజా పోతుందన్న బాధ. ఇగో కూడా వెలుపలి మనసుతో  మజా వదులుకోలేకే అంతరాత్మకి దూరంగా వుంటుంది- తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతీ అన్నట్టు. ఇగో కి తాను పరిష్కరించాల్సిన సొంత సమస్య లున్నాయని తెలుసు. కానీ వాటి జోలి కెళ్లదు, వాయిదా వేస్తూంటుంది. లేదా సరైన సమయంలో సరైన నిర్ణయమంటూ రాజకీయ కాలక్షేపం చేస్తూంటుంది. 

          ఇగోకి ఈ దశ refusal of the call  మజిలీ. ఇది ప్లాట్ పాయింట్ వన్ లోపే వుంటుంది. దీని పర్యవసానంగా meeting with the mentor  మజిలీ ఏర్పడితేనే ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. సినిమాల్లో ఈ రెండు మజిలీలూ మిస్సవుతున్నాయి. దీంతో చాల సినిమాల్లో ప్లాట్ పాయింట్ వన్ లో పస లేకపోగా, మిడిల్ కూడా బలహీనంగా తయారవుతోంది.

     ‘షోలే’ లో గబ్బర్ సింగ్ ని పట్టుకోవడానికి తోడు దొంగలైన అమితాబ్, ధర్మేంద్ర లని సంజీవ్ కుమార్ ఇంటికి పట్టుకొస్తే, వాళ్లకి ఈ పోరాటంలో ఏమాత్రం ఆసక్తి లేక డబ్బు కొట్టేసి పారిపోవాలనుకుంటారు. ఇది refusal of the call  మజిలీ. అప్పుడు జయబాధురి కళ్ళబడి సిగ్గు తెచ్చుకున్నప్పుడు,  meeting with the mentor  మజిలీ. అప్పుడా తర్వాత గబ్బర్  తన ముఠా తో వచ్చి వూరి పడి  మీద దాడి చేసినప్పుడు, అతణ్ణి ఎదుర్కోవడా నికి సిద్ధపడ్డం ప్లాట్ పాయింట్ వన్ కి అంకురార్పణ.         

        కానీ ‘శివ’ లో ఎలా వుంటుందంటే, జేడీ చేష్టల్ని చూస్తూ ఓపిక పట్టి వుండే  నాగార్జున, అమలని జేడీ డాష్ ఇస్తే రియాక్టయి కొడతాడు. దీంతో ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడుతుంది. ఇక్కడ మొదట్నించీ నాగార్జున ఫ్రెండ్స్,  జేడీ సంగతి చూడాల్సిందేనని చెప్పేదీ వుండదు, నాకెందుకని నాగార్జున పట్టించుకోకుండా refusal of the call  మజిలీ ఏర్పడేదీ వుండదు. లేదూ  పట్టించుకోవాల్సిందేనని ఏదో విధంగా meeting with the mentor  మజిలీ ఏర్పడేదీ వుండదు.

          ఈ రెండు పరిస్థితుల్ని జాగ్రత్తగా గమనించాలి. ‘షోలే’  బిగినింగ్ లో ఇగో లక్షణాలు ప్లే అవుతూంటే,  ‘శివ’ లో హీరో మాత్రమే ప్లే అవుతున్నాడు, ఇగోతో పని లేకుండా. అంటే ఇది తప్పని కాదు, సిడ్ ఫీల్డ్ ప్రకారం ఒప్పే. కానీ సిడ్ ఫీల్డ్  విధానంకూడా అమలుకాని దయనీయ స్థితి తెలుగు సినిమాల్లో వుంటున్నందుకే జోసెఫ్ క్యాం బెల్ నీ, జేమ్స్ బానెట్ నీ ఆశ్రయించాం. వీళ్ళ స్థాయిలో కథ చేసుకుంటే, దాన్ని ఇతరులు కోతలు పెట్టి ఎంత తగ్గించినా  అది  ‘శివ’ లాంటి సిడ్ ఫీల్డ్  కి స్థాయికి  తగ్గదన్న నమ్మకంతో. ఇలాకాక సిడ్ ఫీల్డ్ స్థాయిలోనే కథ చేసుకుంటే, కోతలు పడ్డప్పుడు అది కూడా అన్యాయమై పోవచ్చు. కష్టపడి తోడేసుకుని పెరుగు తయారు చేసుకుంటే, దాంట్లో నీళ్ళు కలిపి మజ్జిగ తయారు చేసుకునే దాకా పోవచ్చు- ఇంకా నీళ్ళు కలిపి మజ్జిగని కూడా నాశనం చేసుకోక పోవచ్చు. 

           డిటెక్టివ్ సాహిత్యంలో సర్ ఆర్ధర్ కానన్ డాయల్  డిటెక్టివ్ పాత్ర షెర్లాక్ హోమ్స్ కూడా మొదటే ఏ కేసూ తీసుకోడు. కొమ్మూరి సాంబశివరావు నవలల్లో డిటెక్టివ్ యుగంధర్ కూడా కేసు మొదట తీసుకోవడానికి అయిష్టంగా ఉంటాడు. ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్ లాయర్ పాత్ర పెర్రీ మేసన్ కూడా ఇంతే. ప్రేమ కథలో  దేవదాసు కూడా ఇంతే-  తనని చేపట్టమని అర్ధరాత్రి వచ్చే పార్వతిని  డొంకతిరుగుడు కారణాలు చెప్పి తిరస్కరిస్తాడు.  స్టార్ వార్స్, మ్యాట్రిక్స్, రైడర్స్ ఆఫ్ ది  లాస్ట్ ఆర్క్, లార్డ్ ఆఫ్ ది  రింగ్స్, స్పైడర్ మాన్, హేరీ పాటర్ సిరీస్, సైలెన్స్ ఆఫ్ ది  లాంబ్స్, ఎంటర్ ది  డ్రాగన్, జాస్, ప్రిన్సెస్ బ్రైడ్, కాసా బ్లాంకా, ఆల్మోస్ట్ ఫేమస్, అవతార్, షేక్స్ పియర్ ఇన్ లవ్, థెల్మా అండ్ లూయీస్, స్కార్లెట్ లెటర్...ఇలా ఎన్నో సినిమాల్లో  తప్పనిసరిగా
refusal of the call  మజిలీ భాగంగా వుంటుంది.



          ‘శివ’ లో లాగే , మొన్న వచ్చిన థ్రిల్లర్ ‘క్షణం’ లోకూడా హీరోకి refusal of the call  మజిలీ వుండదు. హీరోయిన్ పిలిచి తన కూతురు కన్పించడం లేదనగానే వెతకడం ప్రారంభిస్తాడు. ‘24’  లో విలన్ సూర్య వాచీ కోసం ప్రకటన వేసినప్పుడు హీరో సూర్య స్పందించడానికి జంకుతాడు. (ఇది refusal of the call  మజిలీ). పక్క కమెడియన్ పాత్ర ప్రోత్సహించడంతో ముందు కెళ్ళడానికి సాహసిస్తాడు  (ఇది meeting with the mentor  మజిలీ).

         
సర్వసాధారణంగా ‘శివ’ లో లాగా ఈ రెండు మజిలీలు లేకుండా తెలుగు సినిమాలు వస్తూంటాయి. కురుక్షేత్రంలో అర్జునుడు మాత్రం ఈ రెండు మజిలీలు లేకుండా ముందు కెళ్లడు . ఎందుకంటే మనిషి ఇగోనే అలా వుంటుంది.  జేమ్స్ బాండ్ లాంటి సాహసోపేత పాత్ర అలా ముందూ వెనుకా చూడకుండా దూకేస్తాడనీ, ఆ పాత్రలు ఇగో భయసందేహాల్ని అధిగమించి వుంటాయనీ అంటారు. కానీ  ఇంకా బిగినింగ్ విభాగంలోనే  ‘శివ’ లాంటి పాత్ర జేమ్స్ బాండ్ లక్షణాలతో ఎలావుంటుంది? ‘క్షణం’ లో మాత్రం?

          కాబట్టి ఈ సైకలాజికల్ లాక్ ని కూడా ప్రధానంగా  తీసుకుని ప్లాట్ పాయింట్ వన్ ని పూర్తి  చేయాల్సివుంటుంది. అంటే ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే ఈ లాక్ వేయాలన్న మాట. అప్పుడు బిగినింగ్ కీ మిడిల్ కీ (వెలుపలి మనసుకీ అంతరాత్మకీ) కలిపి లాక్ వేసినట్టు వుంటుంది. ఇలా లాక్ వేయడం పాత్రని ఇగో లక్షణాలతో చూస్తేనే సాధ్యమవుతుంది...



-సికిందర్






Sunday, May 8, 2016

స్పెషల్ ఆర్టికల్ ...

విడుదలయ్యే సినిమాల  గురించి అసలేం తెలుసుకోకుండా సినిమాలు  చూస్తే  ఎలాటి ప్రయోజనాలుంటాయి రైటర్స్ కి? ఈ ప్రశ్నని తాజాగా గతవారం విడుదలైన ‘24’ మీద ప్రయోగిస్తూ, అసలా సినిమా గురించి ప్రింట్, విజువల్, ఆడియో సమాచారాన్నంతటినీ బ్యాన్ చేసుకుని, వాటి వైపు చూడకుండా,  సినిమా గురించి ఏమీ తెలీని అమాయకుడిలా ఈ వ్యాసకర్త ఆ సినిమా కెళ్తే, ఒక అద్భుత ప్రపంచం ఆవిష్కారమైంది. అంటే సగటు ప్రేక్షకుడి పాయింటాఫ్ వ్యూలో కాదు ఆ  అద్భుత ప్రపంచం.. దాని కథా కథనాలు, పా త్రలు, నటనలు, పాటలు, ఫైట్లు వగైరా విషయపరమైన సమాచారానికి సంబంధించి అనుభవమైన ఎడ్యుకేషన్. సినిమాల గురించి ముందస్తు సమాచారంతో, అంచనాలతో ఒక అభిప్రాయం ఏర్పరచుకుని చూడడం వేరనీ, అసలేం తెలుసుకోకుండా ప్రత్యక్ష ప్రమాణం (direct perception) తో చూడడం వేరనీ తెలిసొచ్చింది…


        అంటే సినిమాలకి పబ్లిసిటీ  ఉండకూడదని కాదు. కచ్చితంగా అవసరమే. ప్రేక్షకుల్ని బలవంతంగా ఆకర్షించడానికి పబ్లిసిటీ వుండాల్సిందే.  వద్దన్నా అంత బలవంతంగా ఆకర్షిస్తే తప్ప,  ఇవ్వాళ ఇన్నేసి వివిధ దృశ్య మాధ్యమాల ప్రభావంలో కొట్టుకు పోతున్న ప్రేక్షకులు ఓ పట్టాన సినిమాల్ని పట్టించుకునేలా లేరు. కాబట్టి బలవంతంగా బరితెగించి వాళ్ళని ఆకర్షించాల్సిందే. తాళ్లూ సంకెళ్ళూ వేసి వాళ్ళని థియేటర్లకి లాగాల్సిందే. 

        కానీ ఒక వృత్తిలో వున్న రైటర్స్ వినియోగాదరుల్లా కాకుండా (ప్రేక్షకులుగా కాకుండా) ఉత్పత్తిదారుల్లా వుంటే బావుంటుంది, ఇంకో వృత్తిలో వున్న రివ్యూ రైటర్స్ కూడా వినియోగదారుల్లా కాకుండా (ప్రేక్షకులుగా  కాకుండా)  ఉత్పత్తిదారుల్లా వుంటేనే బావుండొచ్చు. సినిమాల గురించి ముందస్తు అంచనాలూ అభిప్రాయాలూ అనేవి ట్రేడ్ పండితుల సంగతి.  రైటర్స్ కి దీంతో పనిలేదు పనికిరాని టైం పాస్ కి తప్ప. సినిమాలు చూసే ముందు రాబోయే సినిమాల గురించి అంచనాలు, ముందస్తు అభిప్రాయాలూ అనేవి రైటర్స్ ఏర్పర్చుకోకుండా వుండాలంటే, విడుదలయ్యే ముందు ఆ  సినిమాల పబ్లిసిటీ వైపు కన్నెత్తి  చూడకూడదు. ఆ ఫస్ట్ లుక్ లో హీరో గెటప్ చూడకూడదు, ట్రైలర్స్ లో పంచ్ డైలాగులు వినకూడదు, కథేమిటో తెలుసుకోకూడదు, విజువల్స్ చూడకూడదు, మేకింగ్ ఎలా వుందో చూడకూడదు, ఆడియో అస్సలు వినకూడదు, పోస్టర్లు, పత్రికల్లో ప్రకటనలూ కూడా చూడకూడదు. సినిమాలు చూసే ముందు రివ్యూలు కూడా చదవకూడదు, సినిమా ఎలా వుందని ఎవర్నీ అడక్కూడదు, చర్చలు పెట్టకూడదు. ఇవన్నీ ప్రత్యక్ష ప్రమాణ పధ్ధతి  అందించే ప్రయోజనాలకి విఘాతం  కల్గిస్తాయి. 

       టీవీ ఛానెల్స్ లో వంటావార్పూ ప్రోగ్రాముల్లో యాంకర్ కి తనేం రుచి చూడబోతోందో ముందు అస్సలు తెలీదు. చూద్దామన్నా మార్కెట్ లో ఆ వంట తాలూకు శాంపిల్ కూడా దొరకదు, పబ్లిసిటీ కూడా వుండదు. ఆ వంటతను వండి పెట్టనంత వరకూ ఆ వంటకం రుచే, రూపు రేఖలే తెలీవు ఆమెకి. పరీక్షా హాల్లోకి వెళ్ళే వరకూ ప్రశ్నాపత్రం ఎలా వుంటుందో  తెలీనట్టూ, ఆ వంటతను వండి పెట్టాకే రుచి చూసి- అపుడు అన్ని ప్రోగ్రాముల్లో  ఒకే ఎక్స్ ప్రెషన్ తో, ఒకేలాంటి  డైలాగుతో  -అబ్బ,  ఎంతబావుందో-  అంటుంది. ఇంతకి  మించి  వాళ్లకి వేరియేషన్స్ వుండవు. అన్ని వంటల రుచికీ  ఒకటే  లైబ్రరీ షాట్ కామెంట్ -కం -ఎక్స్ ప్రెషన్ ఇంటర్ ప్లే. అలాటి యాంకర్స్ జీవితంలా వుండాలి రైటర్స్ జీవితం. వంట చేస్తూంటే- ఈయన  బాగా వండుతున్నాడు, దీని గురించి నేను బాగా చెప్పాలి-  అని ఏ యాంకరూ అనుకోదు బహుశా. కానీ సినిమా చూస్తూ - మా హీరో సార్  బాగా నటించేస్తున్నారు, సినిమా చాలా బావుంది- అనే భజన  భక్తి భావంతో రైటర్ నిరభ్యంతరంగా అనుకోవచ్చు. అతడిష్టం. దీంతో ప్రత్యక్ష ప్రమాణం మాత్రం ఏర్పడదు. అది ముందు ఏర్పరచుకున్న అభిప్రాయంతో అనుపలబ్ది (non - perception) ప్రమాణం అవుతుంది.

        ప్రత్యక్ష ప్రమాణం వర్కౌట్ అవాలంటే- దాని ప్రయోజనాల గొప్ప తెలియాలంటే- చూడబోయే సినిమా గురించి పబ్లిసిటీకి కళ్ళూ చెవులూ మూసుకుని, జీరో నాలెడ్జితో, ఒక ఏమీ తెలీని అమాయకుడిలా రైటర్ వెళ్లి సినిమాలు చూడాలి. జీరో నాలెడ్జి ఎందుకంటే, రైటర్ ఒక హీరోకో, నిర్మాతకో, దర్శకుడికో కథ చెప్పబోయే ముందు వాళ్ళా కథ గురించి జీరో నాలెడ్జి తోనే , ఫ్రెష్ మైండ్ తోనే  వుండి వింటారు కాబట్టి.  అలాటి జీరో నాలెడ్జితో, ఫ్రెష్ మైండ్ తోనే  రైటర్ కూడా సినిమాలు చూడాలని కమిటవాలి. ప్రేక్షకులు పబ్లిసిటీ చూసి పూర్తి నాలెడ్జితో బుద్ధిపూర్వకంగా  సినిమాల కెళ్తే, రైటర్ అప్పుడే  బస్సు దిగి సిటీ చూస్తున్న పల్లెటూరి వాడిలా, జీరో నాలెడ్జితో యాంత్రికంగా వెళ్ళాలి. థియేటర్ దగ్గరి కెళ్లి సినిమా చూసి వస్తున్న ప్రేక్షకులతో, - సినిమా ఎలా వుంది బాబూ- అని  ఎగ్జిట్ పోల్ సర్వే  కూడా నిర్వహించకూడదు. ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షో అవగానే రిజల్ట్ కోసం ఆదరాబాదరా ఫోన్లు కూడా చేయకూడదు- అది తన కథతో వచ్చిన సినిమా అయితే తప్ప. ఇక చూడదల్చుకోని చిన్నా చితకా సినిమాలతో ఈ నిషేధాలు  అవసరమే  లేదు. 


       సినిమా ట్రైలర్స్ కూడా కథ తెలిసిపోయే విధంగా ఉంటున్నాయి. లేదా ఫలానా టైపు సినిమాగా  తెలిసిపోయేట్టు ఉంటున్నాయి. ట్రైలర్స్ అన్నీ ఆ సినిమాలో  హీరో చుట్టే  వుంటాయి. హీరో పంచ్  డైలాగ్- ఒక ఫైట్- ఒక పాట. ఒక్కో పంచ్ డైలాగుతో ఒక్కో ట్రైలర్ విడుదల చేస్తూంటారు. ఇవి వినీ వినీ థియేటర్ కి వెళ్లి చూసేసరికి ప్రేక్షకులకి ఏం థ్రిల్ మిగిలి వుంటుందో గానీ, రైటర్లు సర్ప్రైజ్ లిమెంట్ ని కోల్పోతారు. కథాగమనంలో వచ్చే డైలాగులు అప్పటికప్పుడు ఆ ప్యాకేజీలో- దాని నేపధ్యంతో పాటు కలిపి  చూసి- అక్కడి కక్కడే  ఎలా వర్కౌట్ అయ్యిందో గమనించడం వేరు, విడిగా ముందే డైలాగులు  వినీవినీ ఒక అభిప్రాయంతో వెళ్లి కథాగమనంతో పాటూ చూసి ఆ డైలాగు వర్కౌట్ అయిన విధం  పసిగట్టడం వేరు. ‘షోలే’ లో ఒక అమ్జాద్ ఖాన్ డైలాగులో, ‘ముత్యాలముగ్గు’ లో ఒక రావుగోపాలరావు డైలాగులో బయట ఎన్నెన్ని సార్లు విన్నా, తెర మీద మళ్ళీ మళ్ళీ చూడాలన్పించడానికి కారణం- ఆ డైలాగులకి దడి కట్టిన అత్యుత్తమ పాత్ర చిత్రణలు, వాటి అనితరసాధ్యమైన డ్రమెటిక్ నేపధ్యాలూ.  రైటర్లు ఎన్ని లక్షల సార్లు ఈ డైలాగులు విన్నా, సినిమా చూసినప్పుడల్లా ఒక్కో కొత్త కోణం, ఒక్కో కొత్త భావం స్ఫురిస్తూనే వుంటుంది తప్పకుండా. 

        హాలీవుడ్ సినిమాల ట్రైలర్స్ కి  సాధారణంగా ఒక పద్ధతిని అవలంబిస్తారు. అవి స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లాగే వుంటాయి. బిగినింగ్ లోంచి హీరో ఎవరో తెలిపే కొన్ని కట్స్, మిడిల్లోంచి హీరో ఎదుర్కొనే సమస్యలోంచి కొన్ని కట్స్, చివర ఎండ్ లోంచి చాలా ఎక్సైటింగ్ యాక్షన్ కట్సూ తీసుకుని,  గొప్ప సస్పన్స్ నీ, ఇంటరెస్ట్ నీ  క్రియేట్ చేస్తారు-  
వీటిని ఫాలో అవుతూ మూడు ఆడియో, విజువల్, వెర్బల్ క్యూస్ (సంకేతాలు) తో సినిమా చూడాలన్న ఆత్రుత, ఆందోళనా  ఇంకా  పెంచేస్తారు. వాళ్ళు విషయపరంగా  ఆడియెన్స్ ని టీజ్ చేస్తారు, తెలుగులో కేవలం  హీరో విన్యాసాల పరంగా టీజర్స్ చూపిస్తారు.
  
        సినిమా చూస్తున్నప్పుడు ‘విషయం’  ఎలాగెలా రివీల్ అవుతూ ఎక్కడెక్కడ ఎలాగెలా   ఆసక్తిరేపే బీట్స్ తో వర్కౌట్ అయిందో,  రైటర్ ఒక ఉత్పత్తి దారుడి మెంటాలిటీ తో  ఫస్ట్ హేండ్ నాలెడ్జి తో గమనించాలంటే, ముందు నుంచీ పబ్లిసిటీ కి ఏమాత్రం ఎక్స్ పోజ్ కాకూడదు.

‘24’ అనే గతవారం విడుదలైన సూర్య నటించిన  సైన్స్ ఫిక్షన్ సినిమా  విషయంలో, ఈ వ్యాసకర్త ఈ ప్రయోగాన్నే దృష్టిలో పెట్టుకుని, సినిమా గురించి జీరో నాలెడ్జితో  పరీక్షకెళ్ళే విద్యార్థిలా వెళ్లి చూస్తే. ఒక కొత్త అనుభవం ఎదురయ్యింది- ఇంతకాలంగా  సినిమాలు చూస్తూ వస్తున్న తీరుతో అనుభవం వేరు, ఇప్పుడు వేరు. ఇంతకాలం ముందుగానే  సినిమా గురించిన  సమాచారం మెదడు కెక్కించుకుని చూడ్డంవల్ల యాంత్రికంగా చూసినట్టు అన్పిస్తే, ఇప్పుడు ఏమీ తెలుసుకోకుండా చూస్తూంటే ఎడిటింగ్ టేబుల్ దగ్గరో, ఫస్ట్ కాపీ వచ్చినప్పుడో, ఇంకెలాటి మీడియా ఓవర్ లోడ్ ప్రారంభం కాకముందే ఒరిజినాలిటీతో చూస్తున్న ఫీలింగ్.  

DISTRACTED? NO WORRIES!  Courtesy: www.fulfilmentdaily.com

 ఒక్క సైన్స్ ఫిక్షన్ అని మాత్రమే ఈ సినిమా గురించి తెలుసు తప్ప, ఇందులో సూర్య ది త్రిపాత్రాభినయమని కూడా తెలీదు. విషయమేమేటో  ప్రత్యక్ష ప్రమాణంతో మనం తెలుసుకుని ఆ మంచీ చెడ్డలు అనుభవించాలి తప్ప, ఇతరత్రా తెలుసుకున్న ఉపమాన ప్రమాణం (comparison- perception) ముందు పెట్టుకుని, పోల్చుకుంటూ సెకెండ్ హేండ్ విశ్లేషణ చేసుకోవడం తగదని తెలిసొచ్చింది. ముందు తెలుసుకున్న సమాచారం ఏమీ లేకపోవడంతో,  ఫ్రెష్ గా ఏకాగ్రత అంతా చెక్కుచెదరకుండా చూస్తున్న సినిమా మీదే కేంద్రీకృతమై వుంది. దీని ఏ ట్రైలర్ లోని విజువల్సూ అడ్డు పడలేదు. దీని ఏ ఆడియో పాటా గుర్తుకు రాలేదు. అంతా ఎలైస్ ఇన్ వండర్ లాండ్ లాంటి ప్రపంచం. త్రిపాత్రాభినయమనీ తెలీదు, ‘24’ అంటే అర్ధమేమిటో ఏమిటో తెలీదు, విజువల్స్ ఎలా ఉంటాయో తెలీదు, పాటలెలా ఉంటాయో తెలీదు...ఏమీ తెలీదు! ఇప్పుడే ప్రత్యక్ష ప్రమాణంతో తెలుసుకోవవడం. అప్పుడప్పుడు దర్శకులు తాము రాసుకున్న కథలు విన్పిస్తూంటారు. వాటి గురించి ముందుగా మనకేమీ తెలీదు. చెప్తున్నప్పుడే తెలుస్తూంటుంది. ఫలానా అతను  ఫలానా ఈ విధంగా వున్న కథ చెప్తాడు,  వినండి-  అని ఎవరైనా అంటే, ఓహో అలాటి కథా అనే అంచనానో అభిప్రాయమో ముందుగానే మనకేర్పడిపోతుంది. అతను కథ చెప్తున్నప్పుడు చెప్తున్నదాంతో ముందుగా ఏర్పడ్డ ఇంప్రెషన్ అడ్డుతగులుతూ తులనాత్మక పరిశీలనకి  దారి తీస్తూ వుంటుంది. ఇదే వద్దనేది.

రైటర్ అనేవాడు ఎలాటి ఇన్ పుట్స్  లేకుండా సినిమాలు చూస్తూంటే, తను నిర్మాతకో దర్శకుడికో హీరోకో కథ చెప్తూ, తన కథ గురించి ముందుగా ఏమీ తెలీని వాళ్లకి ఎలాటి థ్రిల్లో నిల్లో కలిగించగలడో, సరీగ్గా అలా తను సినిమాలు చూస్తున్నప్పుడూ అలాటి ఒరిజినాలిటీతో థ్రిల్లో నిల్లో  వినియోగదార్లయిన ప్రేక్షకులకంటే ఉత్పత్తి దారుగా ఎక్కువ ఫీలవగలడు. 

        అలా చూసిన సినిమాలకి నోట్స్ రాసి పెట్టుకుంటే అవే వాటి ఫస్ట్ హేండ్ ఇన్ఫర్మేషన్ గా తర్వాత రాస్తున్న కథలకి రిఫరెన్సుగా ఏర్పడతాయి. మరొకటేమిటంటే, ఇలా ప్రత్యక్ష ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చూస్తూంటే, రాసుకుంటున్న స్క్రిప్టు మీద కూడా ఇంకా దేని ప్రభావమో పడకుండా ఒరిజినాలిటీతో, సొంత బ్రాండింగ్ తో తొణికిస లాడుతుంది. స్వావలంబన చేకూరుతుంది. ఎవర్నో గురువుగానో, గైడ్ గానో పెట్టుకునే అవసరమే వుండదు. రైటర్స్ కి గురువులూ గైడ్సూ వుండరు, ఎందుకంటే 
వాళ్ళే సమాజానికి గురువులూ  గైడ్సూ  కాబట్టి!

-సికిందర్

PS. ఇప్పటికీ ఈ వ్యాస కర్తని అడుగుతూంటారు- ఆ సినిమా టీజర్ చూశారా, ఈ సినిమా ట్రైలర్ చూశారా అని. చూడలేదంటే విచిత్రంగా చూస్తారు. ఆ మధ్య ఒక వెబ్సైట్ కి టీజర్ రివ్యూలూ, ట్రైలర్ రివ్యూలూ రాయాల్సి వచ్చినప్పుడు చూడడమే తప్ప, మళ్ళీ ఎప్పుడూ చూడలేదు. సినిమాలు చూసేముందు ఏ రివ్యూలూ చదవలేదు, టాక్ ఏమిటో తెలుసు
కోలేదు. మనకి అనవసరం. ఎవరేమనుకున్నా ఏమీ తెలీని అజ్ఞానిలా జీరో నాలెడ్జితో వెళ్లి ప్రత్యక్ష ప్రమాణంతో చూడ్డమే అవసరం!
(2.7.20)

Friday, May 6, 2016

షార్ట్ రివ్యూ!

రచన, దర్శకత్వం : విక్రమ్‌ కె. కుమార్
తారాగణం : సూర్య (త్రిపాత్రాభినయం), సమంత, నిత్యా మీనన్‌,
శరణ్య,  అజయ్‌
, గిరీష్‌ కర్నాడ్‌, సుధ, తదితరులు.
మాటలు : శశాంక్ వెన్నెలకంటి, పాటలు : చంద్రబోస్, సంగీతం : ఏఆర్ రెహమాన్,  ఛాయాగ్రహణం:  ఎస్. తిరు, కూర్పు : ప్రవీణ్ పూడి, కళ : సుబ్రతా చక్రవర్తి, అమిత్ రే,  మేకప్ : ప్రీతీ శీల్ సింగ్, క్లోవర్ వూటన్, సౌండ్ ఎఫెక్ట్స్ : ఇక్బాల్, డిటిఎస్ : లక్ష్మీ నారాయణ్, యాక్షన్ : అన్బరివ్

బ్యానర్‌ : 2 డి ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : సూర్య
విడుదల : మే 6, 2016
***
నం’  ఫేం విక్రంకుమార్ తాజాగా సూర్యతో ‘24’ అంటూ మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి తెర తీశాడు. కుటుంబ కథా చిత్రాల్ని దేనికది విభిన్నంగా ఎలా తీయవచ్చో మరోసారి అనితరసాధ్యమైన తన రీసెర్చి సహిత స్క్రిప్టుతో చాటి చెప్పాడు. ‘కాలం’ అతడి కుటుంబ కథల నేపధ్యమైనప్పుడు,  ‘మనం’ లో  అది మూడు తరాల చరిత్రలా చెప్పాడు. ఇప్పుడు ‘24’ లో చరిత్ర బదులు సైన్స్ ఫిక్షన్ చెప్పాడు. కాలంలో వెనక్కి ప్రయాణించే  26 ఏళ్ల నాటి సంఘటన కెళ్లి అక్కడ సైకోథెరఫీ చేశాడు.  మరీ ‘నాన్నకు ప్రేమతో’ లోలాంటి సోకాల్డ్ సైన్స్ ఫిక్షన్ లా కాకుండా, సగటు ప్రేక్షకుడూ వినోదించే తీరులో  సైన్స్ ఫిక్షన్ ని సింప్లిఫై చేశాడు. ఈ సినిమాలో సూర్య భాషలో చెప్పాలంటే, ఇమాజినో ఫీలియా చేశాడు!

          ‘గజినీ’ అనే విజయవంతమైన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తర్వాత ‘సెవెంత్ సెన్స్’ అనే సైన్స్ ఫిక్షన్  యాక్షన్ తో భంగపడ్డ తమిళ స్టార్ సూర్య,  మరోసారి సైన్స్ ఫిక్షన్ కి- అదీ నిర్మాతగానూ మారి సాహసించడం గొప్ప విషయమే. సైన్స్ ఫిక్షన్ తో వుండే రిస్కు తెలిసింత్తర్వాత కూడా దానికి జోలికెళ్లడం కొరివితో తలగోక్కోవడమే. ఐతే విక్రం కుమార్ చేతిలో  స్టీరింగ్ అంటూ ఉన్నాక సురక్షితంగా నిర్మాతలూ ప్రేక్షకులూ ఆనందతీరాలకి చేరతారనేది మరోసారి రుజువయ్యింది- ఈ  ‘24’ గడియారం 24 క్యారట్ల బంగారమే అయ్యాక.
          ఓసారి దీని కథాకమామిషేమిటో చూద్దాం...

కథ
     సైంటిస్టు శివకుమార్ (సూర్య) ఏళ్లతరబడి శ్రమించి ఒక మ్యాజిక్ వాచీ కనిపెడతాడు. ఇది కాలంలో 24 గంటల వరకూ వెనక్కి తీసికెళ్తుంది. ఈ విజయాన్ని భార్య ప్రియ (నిత్యామీనన్) తో పంచుకుందామనుకునేంతలోనే  శివకుమార్ కవల సోదరుడు ఆత్రేయ( సూర్య -2)  వాచీకోసం దాడి చేసి ప్రియని చంపేస్తాడు. ఏడాది నిండని కొడుకు మణి (సూర్య -3) తో పారిపోతున్న శివకుమార్నీ చంపేస్తాడు. ఈ దాడికి ముందు కొడుకుని ట్రైన్లో ఒకావిడకి అప్పగిం చేస్తాడు శివకుమార్. 


       26 ఏళ్ల తర్వాత ఇప్పుడు మణి పెంపుతల్లి సత్యభామ ( శరణ్య) తో ఉంటూ, వాచీ షాపు నడుపుతూంటాడు.  అటు ఆనాడు తమ్ముణ్ణి చంపి ప్రమాదం పాలై,  కాలు పడిపోయి కోమాలో కెళ్లిపోయిన ఆత్రేయ లేచి కూర్చుంటాడు. తన పరిస్థితికి తట్టుకో లేకపోతాడు. తన దగ్గర ఒక తాళం చెవి వుంటుంది. దాని పెట్టె మాత్రం దొరకడం లేదు. పడిపోయిన తన కాలు ఇక రాదని డాక్టర్ చెప్పేసరికి ఒక ఆలోచన చేస్తాడు. తమ్ముడు కనిపెట్టిన ఆ మ్యాజిక్ వాచీ ఎక్కడున్నా సరే దాన్ని సంపాదించుకుంటే, కాలంలో 26 ఏళ్ళు వెనక్కి వెళ్లి, ఆనాడు తనకి జరిగిన ప్రమాదం జరక్కుండా చూసుకుంటే, కాలు తిరిగి వచ్చేస్తుందని అసిస్టెంట్ మిత్ర (అజయ్) తో చెప్తాడు. తన దగ్గరున్న పనికి రాని ఆ తాళం  చెవిని విసిరి పారేస్తాడు. 

        ఆ తాళం  చెవి మణి  దగ్గరికి చేరుతుంది. తన దగ్గర ఎప్పుడూ తెరచుకోని ఓ పెట్టెని దాంతో తెరిచి చూస్తే  దాంట్లో మ్యాజిక్ వాచీ వుంటుంది. ఆ వాచీ పట్టుకుని కాలంతో ఆడుకుంటూ ఉంటాడు. 24 గంటల వరకూ వెనక్కి వెళ్లి,  జరిగిన సంఘటనలని తనకి నచ్చే విధంగా మార్చుకుని ఆనందిస్తూ ఉంటాడు. ఆ వాచీతో కాలాన్ని కూడా స్తంభింపజేసి, తన పనులు చేసుకుంటూ ఉంటాడు. తనకి పరిచయమైన సత్య (సమంతా) అనే అమ్మాయిని ప్రేమలోకి దింపడానికి కూడా ఆ వాచీతో రకరకాల గిమ్మిక్కులూ చేస్తాడు.

        ఈ వాచీ కోసం ఆత్రేయ ప్రకటన వేయించినప్పుడు మణి వెళ్లి కలిస్తే, కథ అడ్డం తిరుగుతుంది. మణికి కొత్త ప్రశ్నలు తలెత్తుతాయి. తనెవరు, అసలెవరికి పుట్టాడూ  అన్న ప్రశ్నలతో కాలంలో వెనక్కి వెళ్లేందుకు అతడికా వాచీ కావాలి. తన ఆరోగ్యం బాగు చేసుకుని, తను చూడని 26 ఏళ్ల కాలాన్నీ  చూసేందుకు ఆత్రేయకీ ఆ వాచీ కావాలి- ఇప్పుడు ఇద్దర్లో ఆ వాచీ ఎవరికి దక్కుతుంది, ఎవరు గెలుస్తారు, ఈ ప్రయాణంలో ఎవరేం తెలుసుకుంటారు, ఇంకెవరెవరి జీవితాలు బాగుపడ్డాయీ అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ 

     కథకుడి ఆలోచనలు బావుంటే కథలన్నీ బాగానే వుంటాయి. అసాధ్యమైన కథలు కూడా సుసాధ్యాలైపోతాయి. ఓ కుటుంబం- పోనీ ఓ రెండు కుటుంబాల కథకి కూడా సైన్స్ ఫిక్షన్ ని జోడించి చెప్పవచ్చన్న ఆలోచనే హైకాన్సెప్ట్ మూవీస్ స్థాయికి తీసి కెళ్తుంది. ఒక అన్యాయమైపోయిన సైంటిస్టు కుటుంబం, ఇంకో పెంపుడు కొడుకు కోసం తన కుటుంబానికే దూరమైపోయిన ఆవిడ జీవితం...సైంటిస్టు కుటుంబానికి న్యాయం చేకూర్చాలంటే ఇక్కడ్నించీ జీవితంలో వెనక్కి వెళ్ళాలి, తన కుటుంబానికి దూరమైన ఆవిడకి న్యాయం చేయాలంటే ఇక్కడ్నించీ జీవితంలో ముందు కెళ్ళాలి. పైకి యాక్షన్ కథలా పరుగెత్తే ఈ కథ ఊహించని విధంగా కుటుంబాల కథలుగా పొరలు విప్పుకుంటూ సాగుతుంది. ఈ కుటుంబాల  కథకి సైన్స్ ఫిక్షన్ నేపధ్యమైతే, కుటుంబాల  కథని నడిపించేది మాత్రం  సంభ్రమాశ్చర్యాల సస్పెన్స్, థ్రిల్ల్, మిస్టరీ ఎలిమెంట్స్ తో కూడిన కథనమే. వీటికి బలమైన భావోద్వేగాల కవరింగ్. బంధాలూ బంధుత్వాలూ అన్నీ కలిసిపోతూ ఒకే బిందువులో బందీ లైపోతారు అందరూ- మనమంతాఒకే బిందువు లోంచి ఉద్భవించిన వాళ్ళమన్న సత్యాన్ని అన్యాపదేశంగా స్థాపిస్తూ.

ఎవరెలా చేశారు
      తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన సూర్య ఈ సినిమాని ప్రతీ క్షణం నిలబెట్టాడు. ముఖ్యంగా ఆత్రేయ పాత్రలో కోరుకున్న దానికోసం అర్రులు చాచే అతడి అభినయం- యాక్షన్లో కొంత, చక్రాల కుర్చీకి బందీ అయిపోయి నిస్సహాయంగా మరికొంతా -ఉద్విగ్నభరితంగా  సీన్లని హైలైట్ చేస్తాయి.  చక్రాల కుర్చీలో తల వాల్చేసి అతను కూర్చునే విధం విఖ్యాత శాస్త్రవేత్త - చక్రాల కుర్చీకి అంకితమైపోయిన స్టీఫెన్ హాకింగ్ ని గుర్తుకు తెస్తుంది. చాలా విచిత్రం- అసలు సైంటిస్టు పాత్రేమో మామూలుగా వుంటే, విలన్ పాత్ర హాకింగ్ ని గుర్తు తెస్తూ సైంటిస్టులా కూర్చోవడం!


        సూర్య మూడో పాత్ర వాచీ మెకానిక్ గా ఎంటర్ టైన్ చేసేపాత్ర. సమంతా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కాలంతో అతను పాల్పడే చేష్టలన్నీకొత్తరకం  కామెడీ సీన్లని సృష్టిస్తాయి. ఆమెకోసం క్రికెట్ మ్యాచ్ ని కూడా తన వాచీలో ఆప్షన్ తో ఫ్రీజ్ చేసేసి-  ఇటు బాల్ ని అటు పెట్టి- ఫలితాన్ని మార్చేస్తాడు.  ప్రేమలో ‘రోమాన్సో ఇమాజినో ఫీలియా’ అనే కల్పిత థియరీ చెబుతూ నమ్మిస్తూంటాడు.  ఇలాటి క్రియేటివ్ గిమ్మిక్కులెన్నో ప్రదర్శిస్తాడు. సమంతా కూడా మరీ అమాయకత్వంతో కొత్తగా కన్పిస్తుంది.

        సూర్య సైంటిస్టు పాత్ర, నిత్యామీనన్ సంక్షిప్త పాత్రా కూడా గుర్తుండి  పోతాయి. మూలస్థంభంలాంటి పెంపుడు తల్లి పాత్రలో  ఒకప్పటి హీరోయిన్ శరణ్య ఫస్టాఫ్ లో చాలా ఈజ్ తో నటించుకుపోతుంది- సెకండాఫ్ లో అసలు తనెవరో, ఆనాడు క్షణంలో తన జీవితం ఎలా మారిపోయిందో చెప్పాల్సి వచ్చే ఘట్టంలో కంట తడిపెట్టించక మానదు. 

        టెక్నికల్ గా అత్యున్నత స్థాయిలో వున్న ఈ హై కాన్సెప్ట్ మూవీకి చాలా లో-  కేటగిరీ సంగీతాన్నిచ్చింది ఏఆర్ రెహ్మనే. ఇంత  సినిమాలో ఒక్క క్యాచీ పాట కూడా ఇవ్వలేకపోవడం శోచనీయమే. సాహిత్యం కూడా కుదర్లేదు. ఛాయాగ్రహణం  అంతర్జాతీయ స్థాయిలో వుంది. గ్రాఫిక్స్, కళాదర్శకత్వం, యాక్షన్ సీన్లూ  క్లాసిక్ లుక్ ని తీసుకొచ్చాయి. 

        దర్శకుడు విక్రం కుమార్ ప్రతీ ఒక్క విభాగం మీదా స్పష్టమైన అవగాహనతో, కమాండ్ తో కన్పిస్తాడు. మెగా దర్శకుడు శంకర్ కి దీటుగా తనూ ఎదిగివస్తున్నాడు- హృదయాలని కదిలిస్తూనే వినోదపర్చే  హైకాన్సెప్ట్  సినిమాలతో. కమర్షియల్ సినిమాలని కూడా క్వాలిటీతో కూడిన ఇంటలిజెంట్ రైటింగ్ తో ఆకట్టుకోవచ్చనీ, అయితే దీనికి రీసెర్చి అవసరమనీ తన సినిమాల ద్వారా ప్రకటిస్తూ- ఒక్కో సినిమాతో ఒక్కో మెత్తు ఎక్కుతున్నాడు. రీసెర్చి లేకుండా కొత్త సబ్బు కూడా తయారు కాదు. 

స్క్రీన్ ప్లే సంగతులు
    మొదటి అరగంట సమయంలో యంగ్ సూర్యకి పెట్టె తాళం చెవి దొరికి, పెట్టె లోంచి వాచీ తీస్తున్నప్పుడు ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడుతుంది. ఇక్కడ క్లాస్- మాస్ ప్రేక్షకులు ఈలలూ కేరింతలతో హోరెత్తించేస్తారు. ఈ ప్లాట్ పాయింట్ వన్ బ్యాడ్ సూర్యతో చాలా డిస్టర్బింగ్ ఇంటర్వెల్ కి దారి తీస్తుంది. తర్వాత పరిణామాల క్రమంలో, బ్యాడ్ సూర్యకి యంగ్ సూర్య ఇచ్చింది డూప్లికేట్ వాచీ అని బయట పడినప్పుడు ప్లాట్ పాయింట్ టూ ఏర్పడుతుంది. ఇక్కడా క్లాస్ మాస్ ప్రేక్షకులందరూ హోరెత్తించేస్తారు. ఈ వ్యాసకర్త అనుభవంలో ఇలాటి దెప్పుడూ చూడలేదు- ప్లాట్ పాయింట్ వన్ దగ్గర, మళ్ళీ  ప్లాట్ పాయింట్ టూ దగ్గరా ప్రేక్షకులు ఇలా రెస్పాండ్ అవడం. దిసీజ్ వాట్ ఏ స్క్రీన్ ప్లే డిమాండ్స్. ప్లాట్ పాయింట్స్  రెండూ ప్రేక్షకుల్లో పట్టలేని ఎమోషన్స్ ని పుట్టించే మూలస్థంభాలుగా ఉన్నప్పుడే ఆ స్క్రీన్ ప్లేకి ఎదురుండదు. లేకపోతే మూలస్థంభాలకి అర్ధమే లేదు. మకర జ్యోతిని చూడ్డానికి శబరిమలై వెళ్తారు, ప్రభల్ని చూడ్డానికి కోటప్ప కొండకి వెళ్తారు- ప్లాట్ పాయింట్స్ చూసి తరించడానికి సినిమాకి రావాలి ప్రేక్షకులు! 


        ఈ సైన్స్ ఫిక్షన్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ స్క్రీన్ ప్లేకి డెప్త్ కోసం హిడెన్ ట్రూత్ అనే టూల్ బాగా ఉపయోగపడింది. మిడిల్ (సబ్ కాన్షస్ మైండ్) అంటేనే నిగూఢ రహస్యాల్ని కలిగి వుండి అవి బయట పడ్డం కాబట్టి- అదిక్కడ బాగా ప్లే అయ్యింది. కాలంలో వెనక్కి వెళ్లి జరిగిన తప్పుల్ని సవరించుకు వచ్చి జీవితాల్ని మార్చుకోవడమంటే- సైకలాజికల్ గా పాస్ట్  లైఫ్ రిగ్రెషన్ అనే ట్రేట్ మెంట్ అనొచ్చు. హిప్నాటిజం లో కూడా గతంలోకి తీసికెళ్ళి అక్కడున్న మానసిక నిషేధాల్ని తొలగించి మనసికారోగ్యాన్ని చేకూరుస్తారు.  కాలంలో వెనక్కెళ్ళే  కథలతో ఇలాటి సినిమాలు కూడా ఇలా సైకోథెరఫీ చేస్తాయి. ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ అనే ఆస్కార్ విన్నర్ లో,  టీనేజి కొడుకు పాత్ర కాలయంత్రంలో కొన్నేళ్ళు వెనక్కి ప్రయాణించి, అక్కడ టీనేజీ లవర్స్ గా వున్న తన తల్లిదండ్రుల్ని చూస్తాడు. ఆ లవ్ లో  ప్రధాన సమస్య తండ్రికి ఆత్మవిశ్వాసం లేకపోవడం. మన యంగ్ హీరో దాన్ని తొలగించి, తన కాబోయే తండ్రిని హీరోలా కాబోయే తల్లితో కలిపి,  తిరిగి ప్రస్తుత కాలంలోకి వచ్చేస్తాడు. ఇక్కడ చూస్తే,  జీవితంలో పరాజితుడుగా ఇన్నేళ్ళూ గడిపిన తండ్రి,  మంచి ఆత్మవిశ్వాసంతో సంపన్నుడై  తల్లిని సుఖ పెడుతూ ఉంటాడు.

     ఇలాటిదే జరుగుతుంది ‘24’ లోనూ. యంగ్ సూర్య 26 ఏళ్ళు కాలంలో వెనక్కి వెళ్లి ఆ సంఘటన జరిగిన నాడు,  ఏడాది నిండని పసివాడుగా తల్లిదండ్రుల్ని చూసుకుంటాడు. సంఘటనని రివర్స్ చేసి పెదనాన్న ఆత్రేయని తన నాన్న చంపేసేలా చేస్తాడు. ట్రైన్లో తల్లి దండ్రులతో ప్రయాణిస్తూ పెంపుడు తలిని చూస్తాడు. కానీ ఇప్పుడామె పెంపుడు తలిగా జీవుతం త్యాగం చేసుకునే అవసరం లేదు. ఆనాడు ఆమె తనని ఎత్తుకుని ట్రైన్ దిగి, పెళ్ళిసంబంధం వాళ్ళకి షాకిచ్చి. వాళ్ళకి చెప్పుకోలేక దగా పడింది. ఇప్పుడలా జరక్కూడదు...పెళ్లి చూపులకి వచ్చిన కన్నెపిల్లలా వాళ్ళ ముందు  ట్రైన్ దిగాలి తనూ...
       

           “If it can be written, or thought, it can be filmed.”
           Stanley Kubrick



-సికిందర్ 
cinemabazaar.in


















Thursday, May 5, 2016

షార్ట్ రివ్యూ!

రచన-  దర్శకత్వం : అనిల్‌ రావిపూడి


తారాగణం : సాయి ధరమ్‌ తేజ్‌, రాశీ ఖన్నా, మాస్టర్ మిహైల్‌ గాంధీ, రవికిషన్‌, రాజేంద్రప్రసాద్‌, సాయికుమార్‌, మాస్టర్‌, వెన్నెల కిషోర్‌, రాజేష్‌, పృధ్వీ, ప్రభాస్‌ శ్రీను, పోసాని కృష్ణమురళి, శ్రీనివాస రెడ్డి,
సంగీతం: సాయి కార్తీక్‌, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌
బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
సమర్పణ: దిల్‌ రాజు, నిర్మాత: శిరీష్‌
విడుదల : మే 5, 2016
***
        నిర్మాత దిల్ రాజు నుంచి కమర్షియల్ సినిమా అంటే అవే రీసైక్లింగ్ కథలు తప్ప కొత్తదనం ఆశించడానికి వీలుండడం లేదు.  ఆయన ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కూడా రీపీటయ్యే సీన్లతో అక్కడక్కడే తిరుగుతూంటాయి. ఇలా ఇంకెంత కాలం జరుగుతుందో తెలీదుగానీ, ప్రస్తుతం మెగా వారసుళ్లో ఒకడైన సాయి ధరమ్ తేజ్ తో తీసిన ‘సుప్రీమ్’  ఇంకో అడుగు ముందుకేసి, వచ్చిన హిందీ సినిమానే తిరగేసి తీసినట్టు భజరంగీ భయ్యాలా తయారయ్యింది. ఎందుకని ఒరిజినాలిటీని తను ప్రోత్సహించడో తనకే తెలియాలి. ఎంత కాలమిలా చూసిందే చూపించుకుంటూ పోగలడు తను? 


       ‘పటాస్’ అనే హిట్ తీసిన దర్శకుడు అనిల్ రావిపూడి కూడా కొత్తదనం జోలికిపోని రీసైక్లింగ్ మాస్టరే. తన రీసైక్లింగ్స్  కూడా చాలా రఫ్ గా, నాటుగా వుంటాయి. ఈ సారి ఈ రీసైక్లింగ్ కి హిందీ ‘భజరంగీ భాయిజాన్’ దొరికినట్టుంది- ఇంకేముంది  తన రొడ్డ కొట్టుడుకి  అంతే లేకుండా పోయింది.

        సాయి ధరమ్ తేజ్ కూడా రొడ్ద కొట్టుడు సినిమాలే తనకి పనికొచ్చే మాస్ కమర్షియల్స్ అనుకుంటే పొరబడినట్టే. కలర్ఫుల్ కమర్షియల్ ఎంటర్ టెయినర్స్ వేరు, రొడ్ద కొట్టుడు నాటు సినిమాలు వేరు. మాస్ ‘భజరంగీ భాయిజాన్’, క్లాస్  ‘భజరంగీ భాయిజాన్’ అని వేర్వేరుగా  వుండవు. మైండ్ ని అప్లయ్ చేస్తూ కలర్ఫుల్ కమర్షియల్ ఎంటర్ టెయినర్ గా ఒకటే  ‘భాజరంగీ భాయిజాన్’ వుంటుంది.
        ఇప్పుడు రీసైక్లింగ్ చేసిన ‘భజరంగీ భాయిజాన్’ ఇదిగో ఇలా వుంది..

కథ 
     బాలు ( సాయి ధరం తేజ్) క్యాబ్ నడుపుకుంటూ, తాగుబోతు తండ్రి ( రాజేంద్ర ప్రసాద్) ని పోషించుకుంటూ ఉంటాడు. ప్రేక్షకుల ‘ఆనందంకోసం’  హీరో తాగని లోటుని తండ్రిని తాగుబోతుగా చేసి తీర్చాలి అన్నట్టుగా వుంది. బాలుకి క్యాబ్ నడుపుకోవడం, కండబలం ప్రదర్శించడం  తప్ప ఇంకెందులోనూ ప్రవేశం వుండదు. శ్రీదేవి (రాశీ ఖన్నా) అని కొత్తగా ఎస్సై ఉద్యోగంలో జాయినవుతుంది. ఈమెకి ఇంటి నిండా బంధువులుంటారు. ఎస్సై టెస్టులో అన్నిట్లోనూ ఫెయిలైన ఈమెని ఈ బంధువులందరూ డబ్బుపోసి లంచాలిచ్చి ఉద్యోగం వేయించారు. ఇప్పుడీమె లంచాలు పుచ్చుకుని ఆ డబ్బు ఇచ్చెయ్యాలని ఇబ్బంది పెడుతూంటారు. ఈమెతో బాలు  ప్రేమలో పడతాడు. ఇలా వుండగా,  రాజన్ (మాస్టర్ మిహైల్ గాంధీ) అనే ఒక ఎనిమిదేళ్ళ పిల్లాడు పేవ్ మెంట్ మీద బతుకుతూంటే బాలు చేరదీసి ఇంటికి తెస్తాడు. రాజన్ చాలా చలాకీ పిల్లాడు. వయసుకి మించిన మాటలు మాట్లాడతాడు. ఒకరోజు పీకో (రవి కిషన్) అనే వాడు గ్యాంగు తో వచ్చేసి రాజన్ ని కిడ్నాప్ చేసి తీసికెళ్లి పోతాడు. 

        రాజన్ కథేమిటంటే, వీళ్ళకి అనంతపురంలో కొన్ని వేల ఎకరాలతో ఒక ట్రస్టు వుంది. ఈ ట్రస్టు ని నారాయణరావు (సాయి కుమార్ ) నడుపుతూంటాడు. ఒక కార్పొరేట్ బ్రోకర్ విక్రం సర్కార్ (కబీర్ సింగ్) అనే అతను ఈ భూముల మీద కన్నేసి నకిలీ పత్రాలతో కొట్టేయాలని చూస్తాడు. కేసు విచారించిన కోర్టు, నారాయణరావుకి ముప్పై రోజులు గడువు ఇస్తుంది. ఈ లోగా ఈ ట్రస్టు వారసులెవరో ఒరిజినల్ పత్రాలతో వచ్చినట్టయితే, ట్రస్టు భూములు నారాయణరావుకే  వదిలిపెడతామని అంటుంది. దీంతో  వారసుడి వేటలో నారాయణ రావు లండన్ వెళ్తే అక్కడ విక్రం సర్కార్ వాళ్ళని చంపేస్తాడు. ఒరిజినల్ పత్రా లతో వాళ్ళ కొడుకు రాజన్ నారాయణరావుకి దొరుకుతాడు. రాజన్ ని ఇండియా తీ సుకువస్తూంటే ఢిల్లీలో తప్పిపోతాడు. అలా తప్పిపోయిన రాజనే హైదరాబాద్ లో బాలు దగ్గర ఉంటున్నాడు. ఇప్పుడు బాలు దగ్గర్నుంచి సర్కార్ అనుచరుడు పీకో ఎత్తుకుపోయాడు. ఇప్పుడా రాజన్ ని పట్టుకుని, గడువులోగా అనంతపురం  చేర్చే బాధ్యత బాలు మీద పడుతుంది. ఇదీ కథ.

ఎలావుంది కథ 
     ‘భజరంగీ భాయిజాన్’ లో  తప్పిపోయిన బాలిక అయితే, ఇక్కడ బాలుడు. ‘భజరంగీ భాయిజాన్’ లో ఆ బాలికని పాకిస్తాన్ చేర్చే  బాధ్యత  హీరో తీసుకుంటే, ఇక్కడ బాలుణ్ణి అనంతపురం చేర్చే బాధ్యత హీరో తీసుకుంటాడు. ‘భజరంగీ భాయిజాన్’ లో  బాలికతో సల్మాన్ ఖాన్ కి బలమైన ఎమోషనల్ కనెక్ట్ వుంటే, ఇక్కడ బాలుడితో
సాయి ధరమ్ తేజ్ కి ఎలాటి మానసిక బంధమూ వుండదు. ‘భజరంగీ భాయిజాన్’ లో బాలిక బాధ్యతని ఓ పట్టాన తీసుకోడు సల్మాన్. అతడికి అంత ఎమోషనల్ కనెక్ట్ ఎప్పుడేర్పడుతుందంటే, అప్పగించిన బ్రోకర్ ఆమెని వేశ్యా గృహంలో అమ్మేస్తూంటే! అప్పుడు తిక్కరేగిపోయి ఆ బాలికని భుజానేసుకుని తనే పాకిస్తాన్ బయల్దేరతాడు సల్మాన్!

        సాయి ధరమ్ తేజ్ కి బాలుడితో ఈ గోల్ సాధించడానికి ఇలాటి ఎమోషన్ ఏమీ లేదు. కథకి ఈ కేంద్రీయ శక్తి అయిన ఎమోషన్ రొడ్డ కొట్టుడు కథనంతో లోపించడంతో మొత్తం కథే  అర్ధరహితంగా మారిపోయింది. వెంట పడుతున్న గ్యాంగ్స్ ని హీరో ఎదుర్కొంటూ వెళ్ళడమనే ఉత్త లైఫ్ లెస్ యాక్షన్ గా మారిపోయింది.

ఎవరెలా చేశారు
       డాన్సులూ ఫైట్లూ ఎవరైనా చేస్తారు- ఇదంతా హార్డ్ వేర్. కానీ నటన అనే సాఫ్ట్ వేర్ మాటేమిటి? సాయి ధరమ్  తేజ్ కి ఈ సినిమా కథానాయకుడిగా ప్రేక్షకుల హృదయాలని తడిమే ఒక్క సున్నిత భావప్రకటనైనా  దక్కిందా అంటే లేదనే చెప్పుకోవాలి. కామెడీ చేయడం, హీరోయిజంతో  డైలాగులు విసరడం...ఇదే నటన అనుకుంటే సాయి ధరమ్  తేజ్ పునరాలోచించుకోవాలి. మాస్ జనం కోసమే నటించాలన్నా, వాళ్ళు తమ వాడ నుకోవాలంటే కూడా వాళ్ళ హృదయాల్ని సున్నితంగా తడమగల్గాలిగా? ఏదీ ఆ సాఫ్ట్ వేర్? ఎంతసేపూ హార్డ్ వేరేనా! సాఫ్ట్ వేర్ ఉంటేనే కదా హార్డ్ వేర్ రాణిస్తుంది. 

        హీరోయిన్ రాశీఖన్నాది జాలిపడాల్సిన పాత్ర పాపం. చేతకాని ఎస్సైగా కామెడీగా బావుందే అనుకుంటున్నంతలో, సెటప్ చేసిన ఆమె సమస్య (ఇంట్లో డబ్బు వొత్తిడి) పే ఆఫ్ కాక, రాజన్ రాకతో మొత్తానికే అడ్రసులేని కరివేపాకు పాత్ర అయిపోయింది. రాజన్ అన్వేషణలో హీరో ఒరిస్సా పోతూ ఈమెని కూడా తీసుకుపోతాడు ఎస్సైగా సాయపడుతుందని. అక్కడ పోలీస్ స్టేషన్ లో ఒక మాట సాయం  తప్ప ఈమె  ఇక సెకండాఫ్ లో  చేసేదేమీ ఉండదు. హీరోకి విలన్ కారు నంబర్ తెలిసినప్పుడు  ఒరిస్సా ఆర్టీఏ శాఖ వెబ్సైట్లో ఆ నంబర్ కొడితే అడ్రసు దొరికిపోతుంది. క్యాబ్ డ్రైవర్ గా ఇది తనకి తెలిసే వుండాలి. అలాంటప్పుడు హీరోయిన్ ని ఇందుకోసం కారు డిక్కీలో వేసుకుని (!) ఒరిస్సా దాకా వెళ్ళాల్సిన పనేలేదు.

        చైల్డ్ ఆర్టిస్టు మిహైల్ గాంధీ టాలెంట్ ని కూడా దర్శకుడు సరీగ్గా విని యోగించుకోలేదు. పాత్ర తీరు తెన్నుల్ని మార్చేస్తే తప్ప టాలెంట్ ని సరీగ్గా వినియోగించుకునే అవకాశమే లేదు. మెయిన్ విలన్ కబీర్ సింగ్ అయితే చివరి సీను వరకూ హీరోకి కన్పించకుండా సోలోగా అరుపులు అరుస్తూంటాడు ఎక్కడో వుండి. రెండో సారికూడా బాలుణ్ణి పట్టుకోవడంలో అనుచరులు విఫలమైనప్పుడు, తను దిగాల్సింది యా క్షన్లోకి! ఇలా దర్శకుడు ఈ పాత్రని కూడా కుదేలు చేయడంతో ఛోటా  విలన్ తో అవే యాక్షన్ సీన్లు పదేపదే రిపీట్ అవుతూ సెకండాఫ్ ని తినేశాయి. 

        ప్రధానపాత్ర ధారుల  సంగతే ఇలా వుంటే,  ఇక మిగత పాత్రధారులు ఎవరెలా నటించారో చెప్పుకోవాల్సిన విషయమే కాదు. 

        ప్రొడక్షన్ విలువలు ఏమంత రిచ్ గా లేవు. ఛాయాగ్రహణానికైతే లైటింగే  కొరవడింది. డీటీఎస్ ని ఎఫెక్టివ్ గా చేద్దామంటే ఎఫెక్ట్స్, బిజిఎం కూడా తోడ్పడాలని ఆలోచించలేదు. మొదటి పాట నుంచి మొదలెడితే అన్నిపాటలూ సన్నివేశ బలం లేకుండానే వచ్చిపోతూంటాయి. 

        రచన, దర్శకత్వం, మేకింగ్ ..ఇలా అన్ని విభాగాల్లో రొడ్డ కొట్టుడు మాత్రమే ఎజెండాగా పెట్టుకుని, సినిమా పేరుతో  వీర వాయింపుడు వాయించే ఇలాటి నమూనా ఈ మధ్యకాలంలో రాలేదు
చివరి కేమిటి?
      అర్ధంపర్ధం లేని కామెడీ, అర్ధం పర్ధం లేని సెంటి మెంట్లు, అర్ధం పర్ధం లేని ప్రేమలూ, ఎక్కడా కనెక్ట్ కాని కథా కథనాలూ,  ఇవే సినిమా అని దబాయిస్తే చెప్పడానికేమీ వుండదు. కనీసం ఆ పిల్లవాడి కథకైనా ఏం చేస్తే హత్తుకుంటుందో ఆలోచించలేదు.  ఎక్కడో  సెకండాఫ్ లో పిల్లవాడి కథ విప్పేటప్పటికి వాడిమీద ఇంటరెస్ట్ అప్పటికే చల్లారిపోయి వుంటుంది ప్రేక్షకులకి. సినిమా ఓపెనింగ్ ట్రస్టు భూముల గొడవతో ఒక అర్ధంలేని ఉపోద్ఘాతంగా చేసేకన్నా. అక్కడే ఆ పిల్లవాడి దురదృష్టాన్ని యాక్షన్ సీన్ తో ఎష్టాబ్లిష్ చేసి వుంటే అది ఆద్యంతమూ మంచి హోల్డ్ గా వుండేది. కానీ రొడ్డ కొట్టుడు ముందు ఆలోచన, సునిశితత్వం, వివేకం ఇవేవీ పనిచెయ్యవు. మొన్నే దిల్ రాజు విడుదల చేసిన ‘పోలీస్’ లో  ఆరేళ్ళ కూతురి పాత్రని  ఎంత దివ్యంగా చూపెట్టారో, దానికి రెండు రెట్లు ఎక్కువ దివ్యంగా ‘సుప్రీమ్’  లో  అల్టిమేట్ గా పిల్లవాడిని చూపించారు!

-సికిందర్
http://www.cinemabazaar.in