రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, April 1, 2016

రచన- దర్శకత్వం : పవన్ సాదినేని
తారాగణం : నారా రోహిత్ , నందిత, ధన్యా బాలకృష్ణ, పోసాని, మురళీశర్మ, అజయ్, రవిబాబు, జీవా తదితరులు
సంగీతం : శ్రవణ్,  ఛా యాగ్రహణం : వసంత్
బ్యానర్ : విజన్ ఫిలిం మేకర్స్,  నిర్మాత : డా. విబి రాజేంద్రప్రసాద్
విడుదల : ఏప్రెల్ 1,  2016
***
          కప్పుడు నారా రోహిత్ అంటే భిన్నమైన కథలకి అవకాశమిస్తాడని పేరుండేది. బాణం, రౌడీ ఫెలో, అసుర లాంటి ప్రయోగాత్మక  సినిమాలతో తనదంటూ ఒక రూటు ఏర్పాటు చేసుకున్నాడని ఆనందిస్తున్నంతలోనే,  తిరోగమించి రొటీన్ మసాలాల, పాత మూస ఫార్ములాల బాటపట్టాడు! న్యూ జనరేషన్ నుంచి, ఎవరికీ పట్టని  ఓల్డ్ జనరేషన్ సినిమాలకి యూ టర్న్ తీసుకున్నాడు. సెల్ ఫోన్స్ కూడా ఇవ్వాళ 4 జి కి అప్డేట్ అవుతూంటే,  తను  ఎక్కడో 2 జి సినిమాల దగ్గరే ఉండిపోవాలని ఉబలాటపడుతున్నాడు!


       రెండు వారాల క్రితమే ‘తుంటరి’ తో సహనాన్ని పరీక్షించాక, తిరిగి ఇప్పుడు ‘సావిత్రి’ అంటూ పరమ చాదస్తంతో ‘సి’ సెంటర్లో కూడా ఆడని విషయంతో పరీక్ష పెట్టాడు ప్రేక్షకుల్ని. తన ఫిజిక్ పట్ల శ్రద్ధ ఎలా చూపడంలేదో, అలా సినిమాల ఎంపిక లోనూ అలసత్వం ప్రదర్శిస్తున్నట్టు తోస్తోంది  చూస్తూంటే. ప్రస్తుతం ‘సావిత్రి’ తో నైతే ఈ అలసత్వం పరాకాష్టకి  చేరింది!  ఇలా ఇంత భయపెట్టేస్తే, అసలే తగ్గిన తన ప్రేక్షకులు, ఇంకో తన సినిమాకి అసలు తొంగి చూస్తారా అని సందేహం!  

          గతంలో ‘ప్రేమ- ఇష్క్- కాదల్’  అనే ప్రేమ సినిమా తీసిన దర్శకుడు పవన్ సాదినేని ఇప్పుడు అతి చాదస్తపు, పాతవాసనల  సినిమాని, పాత దర్శకుడెవరో  తీసినట్టు తీసి అవతల పడేశాడు.

కథ
        సావిత్రి ( నందిత) ఓ పెళ్లి పందిట్లో పుట్టిన కారణంగా తను కూడా  త్వరగా పెళ్లి చేసుకుని అలాటి పెళ్లి సందడి  చూసుకోవాలన్న ఆరాటంతో వుంటుంది. పెళ్లి తప్ప ఇంకో ఆలోచనే వుండదు ఆమెకా  పల్లెటూళ్ళో. ఆమె తండ్రి (మురళీ శర్మ)  పెద్ద కూతురి ( ధన్యా బాలకృష్ణ ) పెళ్లి చేశాక,  ఇక సావిత్రికి కూడా సంబంధం చూస్తాడు. ఇదిలా వుండగా నానమ్మ తో కలిసి సావిత్రి షిర్డీ బయల్దేరుతుంది. ఈ రైలు ప్రయాణంలో ఆమెకు రిషి  ( రోహిత్) పరిచయమవుతాడు. ఇతను  ఎం బీ బీ ఎస్ చదివి(!)  ఆవారా తిరుగుళ్ళు తిరుగుతూ తల్లి చేత చివాట్లు తింటూంటాడు (ఇంతే కదా తెలుగు సినిమాల్లో, సైంటిస్టు కూడా ఆవారానే!).   ఇప్పుడు సావిత్రిని చూడగానే ప్రేమలో పడి  వెంటపడతాడు. ఒక ప్రేమ జంట పారిపోయి వచ్చి ఇదే రైలెక్కుతుంది. వీళ్ళ కోసం ఒక ముఠా వెంటపడుతుంది.  ఆ ముఠా బారి నుంచి ఆ జంటని కాపాడి, సావిత్రికి తన ప్రేమని వ్యక్తం చేస్తాడు రిషి. ఆమె తిప్పి కొడుతుంది. తమతో వున్న జంట కేమైందో కళ్ళారా చూసిన సావిత్రి, పెద్దలు కుదిర్చిన సంబధమే చేసుకుంటానంటుంది. రిషి నేరుగా వెళ్లి ఆమె తండ్రితో మాట్లాడతాడు.  అప్పటికే ఆమె తండ్రి సంబంధం చూసిన కుర్రాడు ఆ సంబంధం రద్దు చేసుకుంటాడు. ఇప్పుడు రిషిని కోప్పడి పంపించేస్తాడు సావిత్రి తండ్రి. సావిత్రిని ఎలాగైనా చేసుకుంటానని రిషి పంతం పడతాడు. ఇదీ కథ. 

ఎలావుంది కథ?
          ‘1980 – ఒక పాత పెళ్లి కథ’ అంటూ తీస్తే ఎలా వుంటుందో అలావుంది కథ.   ఇంత పురాతనమైన కథని ఈ రోజుల్లో ప్రేక్షకుల చేత ఒప్పించగలనని దర్శకుడు భావించడం చాలా తెగింపు. ఇంకా మూడు పదుల దర్శకుడే యూత్ సినిమాని ఈ తీరున పెళ్ళిళ్ళ చాదస్తంతో తీస్తే, ఇంకెవరు తెలుగు సినిమాని కాపాడతారన్నట్టుంది. దేశంలో ఎక్కడైనా ఇవ్వాళ యూత్ వీలైనంత ఎక్కువ కాలం సింగిల్ గా గడిపేద్దాం అనుకుంటున్నారు. ఈ సింగిల్ లైఫ్ లో పెళ్ళిళ్ళ గోల కాదు కదా, సీరియస్  ప్రేమలకి కూడా దూరంగా వుంటున్నారు. కేవలం కెరీర్ మైండెడ్ గా కొనసాగుతూ ఫ్లర్టింగ్ తో టైం పాస్ చేసేద్దామనుకుంటున్నారు. బాలీవుడ్ చేసిన  సర్వే రిపోర్టే ఇదంతా వెల్లడిస్తోంది- ఈ నేపధ్యంలో యూత్ సినిమాల్ని బాలీవుడ్ ఏనాడో పునర్నిర్వచించుకుని,  ఆ పోకడలతో తీస్తూ తిరిగి యూత్ ని తన వైపుకు తిప్పుకుంటోంది.

          తెలుగులో ఇలాటిది చేస్తే పాపం అనుకుంటున్నారు మూఢ నమ్మకాల జీవులు. అందుకు బాక్సాఫీసు దగ్గర అనుభవిస్తూనే వున్నారు.  తాము చూసిన అవే నాల్గు పాత తెలుగు సినిమా కథల్ని రీసైక్లింగ్ చేస్తూ, ఇదిగో ఇలాటి ‘సావిత్రి’ లాంటివి తీసి వీటికి  లేని మార్కెట్ పైన ఘరానాగా రుద్ది చేతులు దులుపుకుంటున్నారు. 

ఎవరెలా చేశారు
         
వర్నీ ఒక్క నిమిషం పాటు భరించడమే కష్టం. ఉన్న పదీ పదిహేను మందిలో ఇంటర్వెల్ కే సగం మంది ప్రేక్షకులు పరార్. రోహిత్ కాదుకదా, నందిత కాదుకదా, కమెడియన్లు కాదుకదా, ఇంకే సూపర్ స్టార్లు నటించినా వాళ్ళని కూడా భరించలేం ఈ సినిమాలో. కెమెరా, సంగీతంల సంగతి చెప్పనక్కర్లేదు. కథలాగే అన్నీ చప్పగా వున్నాయి. దర్శకుడి టేకింగ్, స్క్రీన్ ప్లే, మేకింగ్ ప్రతీదీ నాసిరకంగా వున్నాయి. 

చివరికేమిటి?
          ఏమీ లేదు, దర్శకుడు తన మూడు పదుల వయసులో ముప్పై పదుల సినిమా తీశాడు. ముదుసలులు కూడా చూసి తమ పాతజ్ఞాపకల్లో విహరిస్తారా అంటే, వాళ్ళు కూడా అప్పుడెపుడో ఓ రాజుని ఓ రుషి శపించినట్టు- యువదర్శకుణ్ణీ, రోహిత్ నీ ‘వృద్ధులైపోండి!’ అని దీవించేట్టున్నారు. 

          పోతే, గంట సేపు ట్రైన్ లోనే సాగే  సీన్లని తీయడానికి ఎన్ని తిప్పలో. కాస్సేపు ట్రైను ముందుకు పోతున్నట్టు, ఇంకాస్సేపు వెనక్కి పోతున్నట్టు చెట్లూ చేమలూ కదుల్తూ కన్పిస్తాయి. పోనిద్దాం- గత డిసెంబర్ లోనే గోపీచంద్ నటించిన ‘సౌఖ్యం’ లోనే ఈ తిప్పలు పడగా లేంది ఇదెంత!!


-సికిందర్
http://www.cinemabazaar.in/

PS :  సినిమాల్ని సమాజం ఫాలో అవదు,
సినిమాలే సమాజాన్ని ఫాలో అవుతాయి. 

Wednesday, March 30, 2016

సాంకేతికం...

ఎస్ రఘునాథ్ వర్మ 
                                                                                                   
      ఈ డిజిటల్ యుగంలో సినిమా క్రాఫ్టులు ఇంకా 24 శాఖలకే పరిమితమైలేవు. ఇప్పుడు 24 క్రాఫ్ట్స్  అనేందుకు కాలం చెల్లిపోయింది. గ్రాఫిక్స్, డీటీఎస్, డిజిటల్  ఫిలిం మేకింగ్, డీఐ  టెక్నాలజీ...ఇలా బహుముఖాలుగా విస్తరిస్తున్న కొత్తకొత్త  క్రాఫ్ట్స్ సంఖ్య పెరుతూ పోతోంది. డిజిటల్  ఇంటర్మీడియేట్ (డీఐ) విషయానికి వస్తే, అది డీఐ  ప్రభావమని తెలీక కొందరు సినిమా రివ్యూ రచయితలే ‘ఫోటోగ్రఫీ’ అద్భుతంగా వుందని రాసేసి ఆనందిస్తున్నారు. కంటికి కన్పించిందే నిజం కానవసరం లేదెప్పుడూ. కళలు వచ్చేసి ఓవర్ లాప్ అవుతున్న ఈ ఆధునిక సందర్భంలో, గ్రాఫిక్స్ ని చూస్తే  అది కళా దర్శకత్వమని అన్పించ వచ్చు. డీఐ ని చూస్తే అద్భుత ‘సినిమాటోగ్రఫీ’ లానూ తోచవచ్చు. గ్రాఫిక్స్ పార్టు కూడా దానికదే వైభావోపేతమనీ అన్పించవచ్చు.
      అసలు జరుగుతున్న దేమిటంటే, ఆ గ్రాఫిక్స్ చేసిన దృశ్యాలకి కూడా డీఐ చేయడం. గ్రాఫిక్స్ తో సృష్టించిన, బయట షూట్ చేసిన,  దృశ్యాల రంగుల్నీకాంతుల్నీద్విగుణీకృతం చేసే ప్రక్రియ డీఐ టెక్నాలజీ తో సమీప భవిష్యత్తులో ఒక్కటి గ్యారంటీగా జరగబోతోంది- ఈస్ట్ మన్ కలర్ రాకతో ఎలా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వెలవెలబోయాయో, డీఐ చేయని కలర్ సినిమాలు కూడా అలా కళావిహీనంగా కన్పిస్తాయి. తద్వారా అటువంటి సినిమాలకి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు. అయితే-


          ‘చెన్నై లో థియేటర్లన్నీ  డిజిటల్ ప్రొజెక్షన్ కి మారిపోయాయి. కాబట్టి అన్ని తమిళ సినిమాలకీ డీఐ అవసరమవుతోంది. ఒకప్పుడు ఇక్కడ 130 సినిమాలు నిర్మిస్తే, వంద వరకూ డిజిటల్ ఫార్మాట్  లో ఉండేవి. తెలుగులో 30 మాత్రమే ఉండేవి. ‘హేపీడేస్’ తో తెలుగులో చిన్న సినిమాలకి కూడా ప్రారంభమైన డీఐ ప్రక్రియ మెల్ల మెల్లగా ఇంకా లోబడ్జెట్ సినిమాలన్నిటికీ ప్రాకిపోయింది’ అని చెప్పుకొచ్చారు చెన్నైలో ప్రముఖ డిఐ కలరిస్టుగా వ్యవహరిస్తున్న సోమల రఘునాథ్ వర్మ అలియాస్ రఘు. 

          ఐతే తనకి ఎనలాగ్ (ఫిలిం) ఫార్మాటే మంచి ఆట స్థలంగా వుండేదన్నారు. ఎందుకంటే, ఫిలిం మీద అక్ష రేఖ (టాప్- బాటమ్ ల మధ్య స్పేస్) ఎక్కువ కాబట్టి, డిఐతో ఆడుకోవడానికి అదో మంచి ప్లే గ్రౌండ్ గా ఉండేదన్నారు. ఫిలింమీద సూపర్ 35 కెమెరాతో షూటింగులు  మొదయ్యాక డీఐ తప్పని సరైందన్నారు.

          ‘ఏ మాయ చేశావే’ సినిమా చూస్తున్నంత సేపూ కళ్ళు తిప్పుకోలేకపోయారు ప్రేక్షకులు. అటు దీని తమిళ మాతృక చూసిన తమిళ ప్రేక్షకుల పరిస్థితీ ఇంతే. డీఐ వల్ల వీటికి  జతకలిసిన దృశ్యాత్మక నాణ్యత అలాంటిదన్నమాట. మళ్ళీ ఈ వైభవాలు తెలుగు, తమిళం రెండు చోట్లా వేర్వేరు రంగుల పొందికతో, కాంతుల ప్రసరణలతో వున్నాయని మన కెవరైనా చెప్పారా? ఆ రహస్యం రఘు  విప్పారు. తెలుగు తమిళ ప్రాంతీయ అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకుని, తెలుగుకి గాఢమైన రంగులతోనూ, తమిళానికి లైట్ కలర్స్ తోనూ  డీఐ చేశామన్నారు.

          మరి ఇలా కెమెరా మాన్ కష్టపడి తనక్కావలసిన లైటింగ్ ఏర్పాట్లూ అవీ చేసుకుని, తను సంతృప్తి పడి షూట్ చేసుకొచ్చిన దృశ్యాల మీద కలరిస్టుగా మీరు చేయి చేసుకుంటే, కెమెరామాన్ ఒరిజినాలిటీ కనుమరుగైపోతుందికదా అంటే- అలా జరగదన్నారు. పై పెచ్చు కెమెరా మాన్ లే తమ వర్క్ అద్భుతంగా  కన్పించేందుకు నిర్మాతలకి డీఐ ని సిఫార్సు చేస్తున్నారన్నారు. దీంతో గ్రాఫిక్స్ నిపుణుల్లాగే తామూ ప్రీ ప్రొడక్షన్ దశ నుంచీ, సినిమా నిర్మాణంలో పాలుపంచుకోవాల్సి వస్తోందన్నారు. 

          ఇదిలా వుంటుంది : ఒక సినిమాకి ఓ లొకేషన్ ని నిర్ణయిస్తే, రఘు  ఆ లొకేషన్ కి వెళ్లి పాత్రలకి తగ్గ కాస్ట్యూమ్స్ తో టెస్ట్ షూట్ చేయిస్తారు. డిఐ తర్వాత ఈ దృశ్యాలు తెర మీద ఎలా కనపడవచ్చో ముందుగానే అంచనా వేసుకుని, అవసరమైన మార్పు చేర్పులు లోకేషన్లోనే చేసుకుని షూట్ చేస్తారు.

          దృశ్యాల్ని డీఐ చేశాక కెమెరా మాన్ కి నచ్చక పోతే, మరో మూడు నాల్గు ఆప్షన్స్ చేసి చూపిస్తామన్నారు. వాటిలో  కెమెరా మానే తనకి కావాల్సింది ఎంపిక చేసుకుంటాడ న్నారు. 

          ‘డీఐ కేవలం కలరిస్టుకి సంబంధించిన  ఇండివిడ్యువల్ క్రియేటివిటీ, అయినప్పటికీ  కెమెరా మాన్ తో  మ్యూచువల్ చఅండర్ స్టాండింగ్ తో పోతాం’ అని స్పష్టం చేశారు.

          ఓ  తెలుగు సినిమా- ‘ఆవకాయ్ బిర్యానీ’  అనుకుందాం - అందులో అవుట్ డోర్ లొకేషన్స్  కి చేసిన డీఐ (రఘు కాదు) కృత్రిమంగా పెయింటర్ వేసిన నిశ్చల చిత్రాల్లా వుందెందుకనీ అని అడిగితే - అది కెమెరామాన్ జడ్జ్ మెంట్ కావొచ్చన్నారు. లొకేషన్లకి వాటిదైన నేటివ్ ఫీల్ వుంటుందనీ, ‘ఏ మాయ చేశావే’ లో దాని హైదరాబాద్ నేటివిటీకి ఒక లాంటి ఫీల్ తో, ఈ సినిమాలోనే కేరళ దృశ్యాల నేటివిటీకి దాని ఫీల్ తో, చివరికి అమెరికా దృశ్యాలకి అక్కడి నేటివ్ ఫెల్ తోనూ డీఐ చేశానన్నారు.

          చిత్తూరు జిల్లా పుత్తూరుకి చెందిన రఘు,  ఎస్వీ యూనివర్సిటీలో బీసీఏ, ఎంబీఏ కోర్సులు చేశారు. గ్రాఫిక్స్ ని ఇంటి దగ్గరే సాఫ్ట్ వేర్స్ అవీ తెప్పించుకుని స్వయంగా నేర్చుకున్నారు. 2005 లో చెన్నై వెళ్ళిపోయి ఏవీఎం స్టూడియోలో ఎడిటర్ గా చేరారు. అదే సంవత్సరం ముంబాయి వెళ్లి ప్రసాద్ లాబ్స్ లో డిఐ విభాగంలో కన్ఫర్మిస్టుగా  చేరారు. తన పనితీరు నచ్చి యాజమాన్యం చెన్నై ప్రసాద్ లాబ్స్  డీఐ విభాగానికి కలరిస్టుగా నియమించింది. డీఐ విభాగానికి కలరిస్టే చీఫ్.  పది మంది కన్ఫర్మిస్టులు ఆయన కింద పనిచేస్తారు. ఫిలిం వున్నప్పుడు వీళ్ళు నెగెటివ్ ని డిజిటల్ బిట్లుగా స్కానింగ్ చేసి, ఫ్రేముల్ని మ్యాచ్ చేసి, డీఐకి అనువుగా మార్చి, కలరిస్టుకి అందించే వాళ్ళు. వీళ్ళ కింద లైన్ ప్రొడ్యూసర్ ఉంటాడు. ఇతను షెడ్యూలింగ్, కెమెరా మాన్ తో కలరిస్టు మిలాఖత్ ఏర్పాట్లూ అవీ చూస్తాడు. 

          ప్రస్తుతం చెన్నైలో జెమిని ఎఫ్ఎక్స్  డిఐ విభాగంలో కలరిస్టుగా – క్వాంబెల్  పాబ్లో వర్క్ స్టేషన్  మీద సినిమాలకి  సోయగాలు అద్దుతున్న రఘుని, ‘మీ దృష్టిలో గొప్పగా డిఐ చేసిన హాలీవుడ్ మూవీ ఏదో చెప్పండి?’ అంటే,  ‘అన్నీ గొప్పవే!’ అని తప్పించుకున్నారు.

-సికిందర్
(ఆంధ్రజ్యోతి- 2010) 

'ఊపిరి' స్క్రీన్ ప్లే సంగతులు -2


ఇంటచబుల్స్ తో  తెలుగు రీమేక్ కి  ఊపిరులూదడానికి అవసరమైన వరల్డ్ మూవీ స్క్రీన్ ప్లే గురించి  గత వ్యాసంలో  చెప్పుకున్న ‘కిష్టెన్ క్యాచో’  మోడల్ ని ఏమాత్రం అతిక్రమించలేదు, ఆ ఫ్రేములోనే వుంచారు. చాలా షాట్లు కూడా మార్చకుండా అవే తీశారు. అలాగే కథ మొత్తానికీ సెకండ్ యాక్ట్ లో కొత్త ఎలిమెంట్ గా మెరిసిన అదృశ్య ప్రేమికురాలి (శ్రియ) పాయింటునే విధిగా కీలకం చేసి, దాంతో ఫోర్త్ యాక్ట్ ని  ‘ఇంటచబుల్స్’ తరహాలోనే ముగించారు. 
          తే ఒరిజినల్ లో ప్రతీ యాక్ట్ లోనూ వున్న ప్రారంభ ముగింపుల  ఘటనలకి, ఆయా  యాక్ట్స్ లో సాగిన బిజినెస్సులకీ,  తెలుగులో బెల్ట్ షాపుల చందాన అదనపు బిజినెస్సూ, ఘటనలూ క్రిక్కిరిసి క్యూ కట్టాయి. ఉన్న 4 దశల ( యాక్ట్స్) కథలో 40 బెల్ట్ షాపులు వాటి  దారులు అవి  వెతుక్కున్నాయి. ఇక్కడే వరల్డ్ మూవీ సంస్కారానికీ, తెలుగు రీమేక్ సంస్కారానికీ – ఆ మాటకొస్తే మొత్తం తెలుగు సినిమాల సంస్కారానికీ తేడా తెలిసిపోతోంది. దర్శకుడు కూడా నిన్నటి వరకు మాస్ దర్శకుడుగా పేరొందడ మొకటి. 

          సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఈ  రీమేక్ ని తెలుగు- తమిళం రెండు భాషల హీరోలతో చేశారు.  దీంతో తెలుగులో అక్కినేని నాగార్జున పెద్దరికాన్ని కాపాడే, అటు తమిళంలో కార్తీ ఇమేజిని కూడా కాపాడే రెండంచుల కత్తిని సానబట్టారు. ఈ సానబట్టడం సమంగా జరక్క, కార్తీ కోసం తమిళ కత్తి వాడిగా తేలి, ప్రేక్షకుల మెడ మీద వేలాడేట్టు తయారయ్యింది ఓ గంట పాటు.

          ఒరిజినల్ కేవలం గంటా 45 నిమిషాల నిడివితో కావలసినంత సంతృప్తిని కల్గిస్తే,  రీమేక్  వచ్చేసి రెండు గంటలా 40 నిమిషాలు సాగినా ఇంకా ఇంకా సాగదీసుకోవాలన్న బలమైన కోరికతో వుంది. ఓపెన్ చేసిన బెల్ట్ షాపులు ఎలా మూయించాలో తెలీక వచ్చిన సమస్య ఇది. ఇక్కడ మొన్న విడుదలైన ‘కళ్యాణ వైభోగమే’ కూడా గుర్తుకు రాక మానడం లేదు... అందులో కూడా పెద్దవాళ్ళు క్లాసు పీకే బెల్ట్ షాపు ఓపెన్ చేసి, ఇక  ఎలా ముగించాలో తెలీక సాగదీస్తూ సాగదీస్తూ అనేక బెల్ట్ షాపులు తెరచి, రెండు గంటలా 38 నిమిషాల వరకూ వెళ్ళారు. బెల్ట్ షాప్ ఓపెన్ చేస్తున్నామని తెలీక పోతే ఇంతే, కాలాన్ని అతిక్రమించిన మాయదారి కత్తులు ప్రేక్షకుల కుత్తుకల మీద కసకస వేలాడ్డమే.

          కథా ప్రారంభం కార్తీ జైలు నుంచి పెరోల్ మీద విడుదల అవడంతో అవుతుంది. దొంగతనాల నేరం మీద  రెండేళ్ళు జైలు శిక్ష పడింది. నాల్గు నెలలు పెరోల్ మీద విడుదలైనట్టు చూపారు. ఇలా ఒరిజినల్లో లేదు. ఒరిజినల్లో సెకండ్ యాక్ట్ లో, ఫిలిప్ ఫ్రెండ్ ఒకడు,  సేవకుడు డ్రిస్ గురించి చెప్తూ,  వీడు  జైలు కెళ్ళొచ్చిన  దొంగ అన్న సంగతి దృష్టికి తెస్తాడు. ఇప్పటి వరకూ డ్రిస్ గతంలో దొంగ అని ప్రేక్షకులకి కూడా తెలీదు. ఇది కొంచెం డిస్టర్బింగ్ గా వుంటుందిక్కడ. కావాలనే చేశారు దర్శకులు.  ఇక్కడ ఈ మాట అన్పించడం ద్వారా  ‘ఫోర్ షాడోవింగ్’ అనే టెక్నిక్  ని ప్రయోగించారు. అంటే ముందేదో జరగబోతోందన్న ఆదుర్దా కల్గించారు. ఇప్పుడు దొంగోడని తెలిసిన ఇతను,  ఈ బిలియనీర్ ఇంట్లోఇంకేం చేయబోతాడో అన్న పాత్రరీత్యా  సస్పెన్స్ పుట్టింది. తెలుగులో ఇంతమంచి కథనాన్ని కిల్ చేశారు. చూపించడమే కార్తీ దొంగ అని ఓపెన్ చేసేస్తూ  క్యారక్టర్ కి షేడ్ లేకుండా, చప్పగా  తయారు చేశారు.

          ఇదలా వుంచితే, అసలు పెరోల్ గొడవేమిటి? సాధారణ దొంగకైనా పెరోల్ ఎప్పుడు లభిస్తుంది?  చట్టంలో వుండే ఆ తొమ్మిదీ పది కారణాల్లో ఒక్కటీ ఇక్కడ కార్తీకి వర్తించవు. కుటుంబ సంబంధాలు/ సామాజిక సంబంధాలు అనే కారణంపై కూడా విడుదల చెయ్యాలన్నా- అసలు కుటుంబ సంబంధాలే  లేవే? తల్లికి అసహ్యం, తమ్ముడికి ధిక్కారం, చెల్లెలికి ఛీత్కారం. ఇక సామాజిక సంబంధాలేమున్నాయని  అవికూడా కొనసాగించుకోవడానికి? ఈ మేరకు పోలీసు ఎంక్వైరీ  రిపోర్టు అందితే, పెరోల్ అప్లికేషన్నే కొట్టేస్తారుగా?

          ఇక నాల్గు నెలలపాటు పెరోల్ గడువు సంగతి. ఏడాది మొత్తం మీద నాల్గో ఐదో వారాలు పెరోల్ కి అనుమతిస్తారేమో. అది కూడా ఒకేసారి కాదు. రెండు విడతలుగా. ఒకసారి రెండు వారాలు, ఇంకోసారి మూడు వారాలు. అంతేగానీ ఏకంగా నాల్గు నెలలు పెరోల్ మీద వదిలేసే చట్టం లేనేలేదు. ఎంత డబ్బూ పలుకుబడీ వున్నా సంజయ్ దత్ కే సాధ్యం కాలేదు. అతడి పెరోల్ ఉల్లంఘనలన్నీ చాలా వివాదాస్పదమయ్యాయి. 

          ఇలా  పెరోల్ మీదున్న కార్తీని,  నాగార్జున తనతో పాటు పారిస్ కి బయల్దేరదీస్తూ,  ఇతడి మ్యాటర్ చూడమంటాడు సెక్రెటరీతో. ఏముంటుంది చూడ్డానికి. పెరోల్ మీద వున్న వాడు యాభై మైళ్ళ పరిధి దాటి వెళ్ళకూడదు. పారిసైనా, ఇంకే విదేశమైనా యాభై మైళ్ళ పరిధిలో వుండదు. పాస్ పోర్టే రాదు. పెరోల్ కండిషన్స్ వుంటాయి. విదేశాలు  వెళ్ళే కోరికలు పెట్టుకుంటే  పెరోల్ క్యాన్సిల్ చేసి జైల్లో కుక్కేస్తారు.

          కార్తీ పెరోల్  మీద  వచ్చాడంటే అతనింకా శిక్షకాలం  పూర్తి  చెయ్యని క్రిమినలే. పెరోల్ మీద వచ్చిన వాణ్ణి నాగార్జున కూడా చట్ట ప్రకారం ఉద్యోగంలో పెట్టుకోలేడు. ఇక కథ చివర్లో, నాగార్జున కార్తీని పంపించేశాక, కార్తీ వెళ్లి ఎంచక్కా క్యాబ్ డ్రైవర్ ఉద్యోగంలో చేరిపోతాడు. డ్రైవింగ్  లైసెన్స్ ఎక్కడిది? జైలర్ అప్పుడే ఇచ్చేశాడా? క్యాబ్ డ్రైవర్ గానే కాదు, నాగార్జున దగ్గర వున్నప్పుడు కూడా  ఆయన్ని కూర్చో బెట్టుకుని కార్లు తెగ నడిపేస్తూంటాడు. 

          ఒరిజినల్లో డ్రిస్ తను చేసిన తప్పుకి జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. ప్రభుత్వమిచ్చే నిరుద్యోగ భృతికి కూడా అర్హుడయ్యాడు. ఎవరైనా సమాజంలో అతడికి ఇంకో అవకాశమిచ్చి పనిలో పెట్టుకోవచ్చు. లాజికల్ గా ఆ పనే  చేశాడు ఫిలిప్. తెలుగులో ఇంకో పని కూడా చేస్తారు కార్తీ, అతడి లాయర్ అలీ. సత్ప్రవర్తన సర్టిఫికేట్ తెచ్చుకుంటే శిక్షాకాలం తగ్గుతుందని, కార్తీని అనాధాశ్రమంలో సేవకీ, వృద్ధాశ్రమంలో సపర్యలకీ తిప్పుతాడు అలీ! సత్ప్రవర్తన అనేది జైల్లో ఉన్నప్పడు చూసి సర్టిఫై చేస్తారు. పెరోల్ మీద బయట ఆబోతులా వదిలి పెట్టేసి ఎవడో ఇచ్చిన పనికిమాలిన సర్టిఫికేట్స్ తెచ్చుకోమనరు. 

          ఇలా లాజిక్కులు తీస్తే కథేముంటుంది అనొచ్చు. అసలు కార్తీ ని  పెరోల్ మీద చూపించి సాధించిందేమిటి? కథకైనా పాత్రకైనా వొరిగిందేమిటి? క్యారక్టర్ బిల్డప్ కైనా పనికొచ్చిందా? అడుగడుగునా  లాజిక్ పరమైన ప్రశ్నలు రేకెత్తించడం తప్ప. ఒరిజినల్ దర్శకులు కూడా ఇలా చేసి వుంటే ఈ రీమేక్ కి అవకాశమే వుండేది కాదు- ఎందుకంటే, అక్కడి ఇంటలిజెంట్ ప్రేక్షకులు ఆ ఒరిజినల్ ని ఎప్పుడో తిప్పికొట్టేసే  వాళ్ళు.


విషాదాలే వినోదాలు?


    కార్తీ తల్లి (జయసుధ) పాత్ర సంగతి.
     ఈమెకి ముగ్గురు పిల్లలు. కార్తీ, ఇంకో కొడుకు, కూతురూ. చిన్న ఉద్యోగం ఏదో చేస్తూ కుటుంబ భారమంతా మోస్తోంది. ముఖంలో సుఖ సంతోషాలుండవు. పెద్ద కొడుకు కార్తీ అంటే అస్సలు పడదు. ఆవారాగా తిరుగుతూ దొంగతనాలు మరిగి జైలు కెళ్ళి  వచ్చాక (పెరోల్ మీద) తింటున్న అన్నం మీంచి కూడా లేపేసి వెళ్ళ గొట్టేస్తుంది. ఏదో చెప్పబోతే, చేతులు జోడించి దండం పెడుతూ ఇంట్లోంచి వెళ్లి పొమ్మంటుంది. ఈ చేతులు జోడించి దండం పెట్టడమనే చర్య చాలా అఫెండింగ్ గా వుంటుంది చూడ్డానికి, హెవీగా వుండే సంగతలా వుంచి.

          మనం చూస్తున్నది ‘ఆ నల్గురు’ అనే సినిమా కాదు, ‘కలికాలం’ కూడా కాదు, ‘సూరిగాడు’ అసలే కాదు. అలాటి సినిమాల్లో ఉండాల్సిన సీను ఇక్కడ జొరబడి మూడ్ చెడ  గొట్టడ మేమిటి? ఇది నాగ్ - కార్తీ ల మధ్య  ఒక ఫన్నీ జాయ్ రైడ్ తో కూడిన, ఫీల్ గుడ్ జానర్ మూవీ. ఈ హాస్య రస- అద్భుత రస ప్రధాన కథలో ఇంత కరుడుగట్టిన విషాద దృశ్యాలేమిటి? 

          కార్తీ కి పెట్టిన ఈ ఇంటి కథ ఒక మినీ ‘అంతు లేని కథ’ లా వుంటుంది. తను ఆవా రా సరే,  తమ్ముడు ‘అంతులేని కథ’ లో రజనీ కాంత్ లాంటి వాడు, చెల్లెలు శ్రీ ప్రియ లాంటింది. ఇక తల్లి (జయసుధ)  జయప్రదలాంటిది! వీళ్ళతో ఫ్యామిలీ డ్రామా అంతా ‘అంతులేని కథ’ -1976 బ్లాక్ అండ్ వైట్ స్టయిల్లో వుంటుంది.  కార్తీకి ఈ ప్యాకేజీ తమిళానికి అవసరం కాబట్టేమో,  అక్కడి కె. బాలచందర్ తీసిన ‘అంతులేని కథ’ నే ఆశ్రయించినట్టుగా   వుంటుంది కలెక్షన్ల కోసం.

          సరే, పెద్ద కొడుకు దొంగే అనుకుందాం, చిన్న కొడుకు ఇంకా అసహ్యంగా కన్పించే డ్రగ్స్ బానిస. కూతురు తల్లి చాటున రంకు నేర్చిన పిల్ల.  చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకోబోతూంటే అడ్డుపడిన అన్న (కార్తీ) విలువ తీస్తూ మాటాడుతుంది. ప్రేమించిన వాడి పేరెంట్స్ తో మాటాడి పెళ్లి జరిపిస్తానని కార్తీ మాటిచ్చి, ఆ పేరెంట్ (తనికెళ్ళ) దగ్గరి కెళ్తే అతను హేళన చేస్తాడు. నాగార్జున కి ఇది తెలుస్తుంది. మిత్రుడు ప్రకాష్ రాజ్ ని తనికెళ్ళ దగ్గరికి పంపిస్తాడు. తనికెళ్ళ నాగార్జున దగ్గర కాంట్రాక్టులు పొంది పెరిగిన వాడు. ప్రకాష్ రాజ్ క్లాస్ పీకేసరికి  వచ్చి నాగార్జున కాళ్ళ మీద పడి  పెళ్లికి ఒప్పుకుంటాడు తనికెళ్ళ. నాగార్జున చేసిన ఈ సహాయం కార్తీ కి తెలియాలి కాబట్టి అందుకనుగుణంగా సీను.

          ఆ వెంటనే తనికెళ్ళ వెళ్లి కార్తీ తల్లికి దండాలు పెట్టి ముహూర్తం పెట్టుకోవడం. అన్న చేసిన ఘన కార్యం చెల్లెలికి  తెలియాలి కాబట్టి అదింకో సీను. ఇంద్రుడూ చంద్రుడూ అని ఫోన్లోనే పొగిడేసి అవతల పారేస్తుంది. ఇంకా కార్తీ చేసిన ఘనకార్యం ద్వేషించే  తల్లికి కూడా తెలియాలి కాబట్టి ఆ రకమైన సీన్ల క్రమం...ఇలా చైన్ రియాక్షన్ లా ఒక అంశం చుట్టూ సీన్లు పెరుగుతూ వుంటాయి- బెల్ట్ షాపుల్లా! ఇంతకీ కూతురి  అసలు నంగనాచితనం  ఆ తల్లికి ఏమాత్రం తెలియదు. ఆమె పెళ్లి చేసుకుని పారిపోయి వుంటే ఆ తల్లి ఢామ్మని గుండె పగిలి చచ్చే పనే. కొడుకుల కంటే కూడా ఈ కూతురే డేంజరస్ డైనమైట్  అన్నమాట. అయినా ఈ చిహ్నాలు మహా తల్లి పసిగట్టనే పసిగట్టదు. 

          ఒకరు కాదు ఇద్దరు కాదు, పిల్లలు ముగ్గురూ  ఇలా తయారయ్యారంటే, ఆమె ఎంత చక్కటి మహా తల్లో తెలిసిపోతోంది. దీనికి బాధ్యత వహించాల్సింది పోయి, లోకం ఎప్పుడూ తన సైడే ఉంటుందన్న అపోహతో వుంటుంది.  చాలా మంది తల్లిదండ్రులు ఇలాగే  ఎస్కేప్ అవుతూంటారు, వాళ్ళల్లో ఈమె ఒకత్తి.

          కథ చివర్లో ఇంకో విషయం చెప్తాడు నాగార్జునకి కార్తీ ( ఇంకో బెల్ట్ షాపుకి ముహూర్తం!). ఈ  తల్లి అసలు తన కన్న తల్లే  కాదట. చిన్నప్పుడు తన తల్లి చనిపోతే ఆమె చెల్లెలు – అంటే ఈ తల్లి (తనకి పిన్ని) పెంచుకుందట. భర్త కూడా చనిపోయి పిన్ని కష్ట పడుతూంటే చూడలేక, నాల్గోతరగతిలోనే చదువు మానేశాడట. ఇక్కడ కార్తీకి ఫుల్ మార్కు లెయ్యొచ్చు- అంత చిన్న వయసులో ఇంత పెద్ద మనసుతో ఆలోచించినందుకు!

          అయితే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న  పిల్లాడు చదువు మానేసిన మానసిక కారణమేంటో తెలుసుకుని చక్కదిద్దాల్సిన బాధ్యత పెంపుడు తల్లికి లేదా? అక్క కొడుకే కదా. అక్క కొడుకుని తన సొంత పిల్లలకంటే హీనంగా ట్రీట్ చేయడమేంటి? డ్రగ్ బానిసగా అసహ్యంగా వున్న సొంత కొడుకుని పల్లెత్తు మాటనకుండా, అక్క కొడుకుని శత్రువులా చూడ్డమేమిటి? ఇదేనా  చనిపోయిన అక్క పట్ల మర్యాద? ఈ అక్క కొడుకు చిన్నప్పుడు చదువు మానేసిన కారణం చెప్తే ఎక్కడ పెట్టుకుంటుంది మొహం?

          ఇలా జరక్కుండా  పాత్ర అదృష్ట మేమిటంటే, కూతురి రంకు, పెద్దకొడుకు చిన్నప్పటి పెద్ద మనసూ  తెలుసుకోకుండానే అసమగ్ర పాత్రచిత్రణ పాలబడి ముగిసి పోవడం! ఇవి తెలిస్తే సూసైడే!!


కాన్సెప్ట్ ఏమిటి?

           నాగార్జున పాత్రకి కూడా బెల్ట్ షాపుంది...
          ఐదేళ్ళ క్రితం పారిస్ లో ప్రమాదం పాలయినప్పుడు,  ప్రేమిస్తున్న అనూష్కా శెట్టికి కావాలని దూరమయ్యాడు నాగార్జున. కానీ ఆమె ఎక్కడున్నా పెళ్లి చేసుకుని సుఖంగా వుండాలని కోరుకుంటూ జీవిస్తున్నాడు. అసలామె  అలావుందా లేదా అన్న శంకతోనే వున్నాడు. తన మనశ్శాంతిని ఆనాడే పారిస్ లోనే కోల్పోయాడు. కనుక పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని తిరిగి ఇప్పడు పారిస్ కెళ్తే,  అక్కడే కనపడుతుంది అనూష్కా కూతురితో, భర్త (అడివి శేష్) తో కలిసి. నాగార్జున పరిస్థితికి చలించి, ఇన్నాళ్ళూ అపార్ధం జేసుకున్నందుకు బాధ పడుతుంది అనూష్కా. ఆమె పిల్లా పాపలతో సుఖంగా వున్నందుకు నాగార్జున పూర్తి మనశ్శాంతిని పొంది తిరిగొచ్చేస్తాడు.

          ఒరిజినల్లో ఫిలిప్ కి పెళ్ళయి వుంటుంది. ఆ ప్రమాదంలో భార్య చనిపోయి వుంటుంది. ఇపుడు ఐదేళ్ళ తర్వాత ఇంకా ఆ బాధతో లేడతను.  ఇది అతడి  పాత్ర చిత్రణకి  చాలా అవసరం. ఎందుకంటే, వికలాంగుడైన తను పక్షిలా ఎగరాలనుకోవడమే ఇక్కడ  కాన్సెప్ట్. పక్షుల్ని కూడా చూపిస్తూంటారు. భార్య గురించి బాధ పడుతూ కూర్చుంటే ఈ కోరిక కలగక పోవచ్చు. కథ వేరే దారి పడుతుంది. ఒకవైపు భార్య గురించి బాధ పడుతూ- ఇంకో వైపు పక్షిలా ఆనందంగా షికార్లు కొట్టాలనుకోవడం పాత్రని అర్ధ రహితంగా మారుస్తుంది. ఏదో ఒకటే వుండాలి. ఆ ఒకటి పక్షిలా ఎగరాలనుకోవడమే కాన్సెప్ట్  ప్రకారం! కాబట్టి భార్య గురించిన ఎమోషనల్ బ్యాగేజీ లేకుండా చూశారు పాత్రకి. 

          నాగార్జునకి అనూష్కా గురించిన ఎమోషనల్ బ్యాగేజీ ఒక వైపు, చక్రాల కుర్చీకి బందీ  అయిపోయీ అయిపోయీ స్ట్రెస్ పేరుకుపోయి రిలీఫ్ పొందాలన్న ఆరాటం మరో వైపూ.  ఈ స్ట్రెస్ అనూష్కా సుఖ సంతోషాల గురించా, పక్షిలా ఎగరాలనుకోవడం గురించా పోగుపడింది? ( పావురాల్ని చూస్తూంటాడు తదేకంగా). కన్ఫ్యూజింగ్ గా లేదూ పాత్ర? ఒరిజినల్లో లాగే ఇక్కడ కూడా   ఆ ప్రమాదంలో ‘భార్య’ అయిన అనూష్కా చనిపోయి వుంటే,  పాత్ర కాన్సెప్ట్ ప్రకారం పక్షిలా ఎగరాలన్న ఒకే కోరికతో ( ఏకసూత్రతతో) స్పష్టంగా వుండేది. పోగొట్టుకున్న చోటే  వెతుక్కోవడమనే  ఫిలాసఫీ ఒకటి మళ్ళీ. ఆ పోగొట్టుకున్న చోట మనశ్శాంతి పొందితే స్ట్రెస్ దూరమైపోతుందా?  స్ట్రెస్ దాని గురించా,  పక్షిలా ఎగరాలనుకోవడం గురించా? చాలా కన్ఫ్యూజింగ్. ఒరిజినల్లో తెలివిలేకుండా అలా  పాత్రని సృష్టించి వుంటారా! 

          అసలు నాగార్జున లాంటి సీనియర్ పాత్రకి – బిలియనీర్ కి- పెళ్ళయి భార్యని పోగొట్టుకున్న నేపధ్యమే గౌరవప్రదంగా వుంటుంది. ఇంకా పెళ్ళే కాలేదంటే, సంసార సుఖం అనుభవించకుండానే ఇలా పనికిరాకుండా అయిపోయాడంటే, పాత్ర చులకన అవడమే గాక, పాత్ర తాలూకు విషాదం డబుల్ అవుతుంది. కథలో విషాద ఛాయల్ని వీలైనంత తగ్గించడానికి కదా ప్రయత్నించాలి? వొరిజినల్లో లేని విషాదాన్ని ఎందుకు పెంచినట్టు?

          జోకేమిటంటే, కార్తీని కూడా పోగొట్టుకున్న చోటే వెతుక్కోమని వాళ్ళమ్మ దగ్గరికి పంపడం! వాట్ అమ్మ? హూజ్  దట్ అమ్మా? ఈ అమ్మ దగ్గర కార్తీ ఏం పోగొట్టుకున్నాడని? నథింగ్. ఆమె వున్నా లేకపోయినా ఒకటే. పోగొట్టుకుంటే కన్న తల్లిని పోగొట్టుకున్నప్పుడే అన్నీ  పోగొట్టుకున్నాడు! ఇంకే అమ్మా భర్తీ చేయలేదు.


        అసలు కాన్సెప్ట్ వదిలేసి ఏదో  పోగొట్టుకుని వెతుక్కునే గొడవేమిటి?
దర్జాగా పబ్ లో ( కేవలం నాగ్- కార్తీల మెయిన్ ట్రాకు ఫన్ లో) మాంచి  మజాగా కిక్కు ఎక్కుతూంటే,  మధ్యలో ఈ బెల్ట్ షాపుల గొడవేమిటి చీప్ లిక్కర్ తో?


మాస్టర్ స్ట్రోక్స్ మిస్!

      ‘ఇంటచబుల్స్’  అసలు ఐడియా ఏమిటంటే,  ఒక ఫ్రీ బర్డ్ లా చక్రాల కుర్చీ లోంచి ఎగిరిపోవాలనుకుంటున్న వికలాంగుణ్ణి, ఇంకో ఆల్రెడీ ఫ్రీ బర్డ్ లా తిరుగుతున్న ఆవారాగాణ్ణీ,  పట్టుకుని ఎదురెదురుగా కాంట్రాస్ట్ గా పెట్టి,  వీళ్ళేం చేస్తారో చూడ్డం!  రాయడానికే చాలా ఇంటరెస్టింగ్ గేమ్ లా ఉత్సాహ పర్చే స్క్రీన్ ప్లే ఇది.  కాన్సెప్ట్ ఇంత స్పష్టంగా క్యాచీగా, క్రేజీగానూ  వుంది. తెలుగులో ఇదంతా మిస్సయి పోయింది- కారణం,  ఒరిజినల్ లో ఈ పాత్రల్ని ఇలా ఎందుకు సృష్టించి, ఇలాగే ఎందుకు నిర్వహించారో అంతరార్ధాన్ని పసిగట్టక పోవడం!  కథని పక్కదారి పట్టించి, హాస్యాస్పదంగా తెలుగు- తమిళ ప్రేక్షకుల కోసమని బోలెడంత కుటుంబ విషాదాలతో నింపేసి, అసలు పాయింటుని గల్లంతు చేసేయడం!!

          62 కోట్ల సినిమాకి  కాన్సెప్ట్ ని ఇంత  మిస్ మేనేజ్ మెంట్ చేసుకోవాలా! ఏ లెవెల్లో కథలు ఆలోచిస్తున్నట్టు? ఇవ్వాళ  తమిళంలో ఈ సినిమాని ప్రేక్షకులు పట్టించుకోవడం లేదటే, విషాద కథలతో కాన్సెప్ట్ గల్లంతయ్యే కాదూ? కొత్త కాన్సెప్ట్స్ కి అక్కడెప్పుడూ ఆహ్వానమే కదా! 

          ఒరిజినల్లో ఒక వుడ్ బీ ఫ్రీబర్డ్ – ఇంకో ఆల్రెడీ ఫ్రీబర్డ్ ల మధ్య సయ్యాట కాబట్టే-  కథ పక్క దార్లు పట్టకుండా డ్రిస్ ని కుటుంబ డ్రామా నుంచి డిటాచ్డ్ గా వుంచారు. మొదట్లో తల్లి వెళ్ళి పొమ్మంటే వెళ్ళిపోయే సీనే తప్ప మళ్ళీ ఆ తల్లి కూడా కన్పించదు. చెల్లెలి ట్రాకే లేదు. యజమాని పిలిప్,  డ్రిస్ కోసం  ఒకే ఒక్క త్యాగం చేస్తాడు- అదీ థర్డ్ యాక్ట్ లో.  డ్రిస్ తమ్ముడేదో ప్రాబ్లంతో రావడం చూసి, ఇంటి కెళ్ళి సమస్యలు తీర్చుకోమని డ్రిస్ ని తన దగ్గర్నుంచి పంపేయడం ఫిలిప్ చేసుకునే త్యాగమే. 

          చివర్లో ఈ తమ్ముడి సమస్య తప్ప, డ్రిస్ పాత్రకి ఇంకే బరువూ పెట్టలేదు. పైగా అతడి స్వభావాన్ని కూడా దేనికీ బాధ పడని ఫన్నీ-  హేపీ గో లక్కీ టైప్ క్యారక్టర్ గా వుంచారు. థర్డ్ యాక్ట్ తో ఫిలిప్ తన గురించి ఆలోచించి ఇంటికి వెళ్లి పొమ్మంటే, ఫోర్త్ యాక్ట్ లో ఫిలిప్  భావిజీవితం గురించి డ్రిస్ ఆలోచించి,  ప్రేమించినమ్మాయితో కలిపేస్తాడు. ఇది పరస్పరం ఇచ్చుకున్న మాస్టర్ స్ట్రోక్స్ . ఫిలిప్ తన త్యాగంతో డ్రిస్ కి ఓ మాస్టర్ స్ట్రోక్ ఇస్తే, వూరుకోకుండా ప్రేమించినమ్మాయితో ఫిలిప్ ని కలిపేస్తూ డ్రిస్ తనదైన స్టయిల్లో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చి వెళ్లి పోయాడు. విజువల్ మీడియా  అయిన  సినిమాకి చాలా ప్లస్ అయ్యే  ఈ డైనమిక్స్ ని అర్ధం జేసుకోలేదు తెలుగులో.

          ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తే మాస్టర్ స్ట్రోక్ అన్పించుకోదు. కార్తీ చెల్లెలి పెళ్ళికి నాగార్జున ఒకసారి సహాయం చేశాక, మళ్ళీ చివర్లో కార్తీ తమ్ముడు గురించి ఆలోచించి కార్తీని ఇంటికి పంపేస్తే అది మళ్ళీ మాస్టర్ స్ట్రోక్ అవదు. రిపిటీషన్ – పునరుక్తి అవుతుంది. దీని ఎఫెక్ట్ ఫీల్ కాం. 


       అలాగే కార్తీ ఒకసారి నాగార్జునని  పారిస్ లో అనూష్కాతో కలిపి, మళ్ళీ వూళ్ళో ప్రేమించినమ్మాయితో కలిపితే మాస్టర్ స్ట్రోక్ అన్పించుకోదు- ఒక ప్రేక్షకుడు ఇలా కామెంట్ చేశాడు కూడా థియేటర్లో - 'వీడు బ్రోకర్లా వున్నాడురా'  అని!  చెల్లెలి ట్రాక్ ఇంత నష్టం చేసింది మెయిన్ ట్రాకుకి. చివరి అరగంట సేపూ దారీ తెన్నూలేక కార్తీ కుటుంబ విషాదమే హెవీగా మారిపోయి- హేవీగానే సినిమా ముగిసి, హేవీగానే మనం బయటికి రావాల్సిన అవసరమేమిటి? ఇది నాగ్- కార్తీ ల మధ్య కథా? కార్తీ - అతడి ఫ్యామిలీ మధ్య కథా? చాలా కన్ఫ్యూజింగ్!

          ఒరిజినల్లో హెవీ లేకుండా సింపుల్ గా డ్రిస్ వచ్చేసి, తనదైన  మాస్టర్ స్ట్రోక్ ఇచ్చి వెళ్లిపోతూంటే,  అప్రయత్నంగా మన కళ్ళు చెమరుస్తాయి, అంతే. ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతాం-  ఇప్పుడు మళ్ళీ జీరోకొచ్చిన ఈ నిరుద్యోగి తనకేం భవిష్యత్తు  వుందని అంత  ధీమాగా వెళ్తున్నాడని ప్రశ్న వేధిస్తూంటే  ముగుస్తుంది సినిమా. 

          క్లాసిక్ ఎండింగ్. ఎవరి మీద చివరి షాట్ వుంటుందో అతనే  కథకి  హీరో. ఒరిజినల్లో డ్రిస్సే హీరో. తెలుగులో మొహమాటాలకి పోయి ఇద్దర్నీ హీరోలుగా చేసేందుకు విఫలయత్నం చేశారు. చివరి షాట్ నాగ్- శ్రియాల మీద తీశారు. ఇది తేలిపోయింది. ఎందుకంటే కథ ప్రకారం, నాగ్ జీవితంలోకి వచ్చిన వాడు కార్తీ. జీవితంలోంచి వెళ్లి  పోవడా న్ని కూడా అలాగే రికార్డ్ చేస్తూ అతడిపైనే ముగించాలి!  అప్పుడొక స్పష్టమైన ‘స్టోరీ లైన్’ గా కనపడుతుంది మూవీ. 

క్రేజీ  కెమిస్ట్రీకే పట్టం! 
       నాగ్  – కార్తీల మధ్య ప్రతి సన్నివేశమూ బాగా వర్కౌట్ అయ్యింది. కార్తీ ది  స్వాభావికంగానే స్మైలింగ్ ఫేస్ కావడంతో ఆవారా పాత్ర కలర్ ఫుల్ గా మారింది. ఒరిజినల్లో ఈ పాత్ర పోషించిన ఒమర్ సైది మెస్మరైజింగ్ బాడీ లాంగ్వేజ్. స్పీడు కూడా ఎక్కువే. అతనలా ఆకట్టుకుని గుర్తుండి పోతాడు. 

          కార్తీ – నాగ్ ని అన్నయ్యా అని పిలుచుకోవడానికి అనుమతి కోరడం బాండింగ్ ని మరింత బలీయం చేసింది. నాగ్ కూడా తను రోగి కనుక ఏడుస్తూ పాసివ్ గా వుండిపోకుండా,  చక్రాల కుర్చీలోనే యాక్టివ్ క్యారక్టర్ గా వుండడంతో- వీళ్ళిద్దరి బ్రోమాన్స్ చాలా ఫన్నీగా మారింది. ఇద్దరివీ యాక్టివ్ పాత్రలే. మధ్యలో నాగ్ సెక్రెటరీగా తమన్నా వుంది. చూసిన ఫస్ట్ షాట్ లోనే ఈమెకి  రోమాంటిక్ గా ఎటాచ్ అయిపోతాడు కార్తీ. ఒరిజినల్లో ఈ ట్రాక్ లేదు. అయితే తెలుగులో ఈ ట్రాక్ ని చాలా అండర్ ప్లే చేశారు. ఇంకో దర్శకుడైతే కార్తీ తమన్నాల  మధ్య లవ్ ట్రాక్ చాలా అవసరమనుకుని, ఆ  సీన్లూ పాటలతో ఫస్టాఫ్ అంతా నింపేసి, సెకండాఫ్ లో  తిరిగి నాగ్  దగ్గరికి కథని తెచ్చి, కాలం  చెల్లిపోయిన ‘ఫార్మాట్’ ని పట్టుకుని వేలాడే వాడేమో!  

          వంశీ పైడిపల్లి ఈ నిగ్రహం తప్పలేదు. బంగళాలో ఉన్నంత వరకూ కథకి నాగ్ – కార్తీల ట్రాకే ముఖ్యమనుకుని లవ్ ట్రాక్ ని పూర్తిగా పక్కన పెట్టారు. లేకపోతే అమ్మాయి వెంట అబ్బాయి పడే లవ్ ట్రాక్ ని ఈ రోజుల్లో ఇంకా ఎవరు కేర్ చేస్తారు. అక్కడక్కడ మాత్రమే తమన్నాని కార్తీ గిల్లు తూంటాడు. చివర్లో ‘అద్దం’ సీను కూడా హిలేరియస్ వుంది. అలాగే ఒరిజినల్లో నామమాత్రంగా వున్న డ్రిస్  పెయింటింగ్ పిచ్చిని తెలుగులో బాగా వాడుకుని కార్తీకి ఒక పెద్ద ట్రాక్ గా డెవలప్ చేశారు. దీని ముగింపులో ప్రకాష్ రాజ్ తో  మంచి ఫినిషింగ్ టచ్ ని కూడా ఇచ్చారు. ఇలా ఇక్కడ ఫినిషింగ్ టచ్ ని హైలైట్ చేసినట్టే, ముగింపులో నాగ్- కార్తీ మధ్య పరస్పర మాస్టర్ స్ట్రోక్స్ ని  హైలైట్ చేయడం కూడా అత్యవసరమని పైన ఇందాక చెప్పుకున్నది. 

          ఇలా కథ నాగ్  – కార్తీల మధ్య నాగ్ బంగళాలో  కథ తిరుగుతున్నంత సేపూ అదనంగా డెవలప్ చేసిన సీన్లు  సహా బ్రహ్మాండంగా వుంది. ఎప్పుడయితే కథ బయటి కె ళ్తూంటుందో,  ఆ కార్తీ కుటుంబ విషాదాలతో, పెరోల్ ప్రహసనాలతో బెల్ట్  షాపులు పెరిగి- చక్కటి పబ్ లాంటి నాగ్  బంగాళాలో అసలు ఫన్నంతా- కిక్కంతా దిగిపోయే పరిస్థితి ఎదురయ్యింది. భరించలేని  కాక్ టెయిల్ – టార్చర్-  పబ్ లో ఎంజాయ్ చేస్తున్న కాస్ట్లీ డ్రింక్  చీప్ లిక్కర్ తో కల్తీ!

          ఇవాల్టి ప్రేక్షకులకి తక్కువ బరువున్న కథతో , తక్కువ బరువు గల పాత్రలతో, అక్కడక్కడా మాత్రమే భావోద్వేగాల్ని స్పృశిస్తూ, వినోదాత్మకంగా  పరుగులు తీసే సినిమా కదా చూపించాలి. కష్టాలూ బాధ్యతలూ ఉండొచ్చు. వాటికి  కుయ్యోమంటూ మూల్గుతున్నట్టు ఎప్పుడో ఎవరో స్థాపించిన ఇంకా అదే రొటీన్ నిరాశావాదంతోనే  చూపించకుండా, ఆ కష్టాల్నీ బాధ్యతల్నీ బాద్షాలా తీర్చేసుకునే ఆశావహ దృక్పథపు చిత్రీకరణలు కదా ఈ కాలపు జీవనసమరానికి అవసరం?  సినిమా అనేది ఈ రోజుల్లో పాజిటివ్ లుక్ తో  హేండ్సమ్ గా వుండాలి.


-సికిందర్




         


         










Monday, March 28, 2016

స్క్రీన్ ప్లే సంగతులు!

డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో ఒక సీనియర్ వేసిన ప్రశ్న:  నిన్న మీరు ‘రన్’ బాగా లేదన్నారు, ఇవ్వాళ ‘ఊపిరి’ బావుందని రాశారు. మాకు ‘ఊపిరి’ కూడా నచ్చలేదు...అని. ఎందుకు నచ్చలేదంటే, అందులో ‘కాన్ ఫ్లిక్ట్’ (సంఘర్షణ) లేదు గనుక నచ్చ లేదని సమాధానం.  
       
లాటి అభిప్రాయమే ఇంకో ఇద్దరు దర్శకత్వ ప్రయత్నాల్లో వున్న వాళ్ళు, ఇంకో ఇద్దరు ముగ్గురు ఛోటా రచయితలూ వ్యక్తం చేశారు. కానీ ‘రన్’ షార్ట్ రివ్యూ లోనే రాశాం ఏ దేమిటో. అయినా వివరించాల్సి వచ్చింది- ‘రన్’ ఒక ఇండీ ఫిలిం అని. దాన్ని బుద్ధిజీవులెవరూ రీమేక్
చేయరని. అందుకే అదలా తయారయ్యిందని. 


            ‘ఊపిరి’ షార్ట్ రివ్యూలో కూడా రాశాం : ఒక వరల్డ్ మూవీకి ఇది రీమేక్ అనీ, వరల్డ్ మూవీస్ కథల్లో  కాన్ ఫ్లిక్ట్అనేది  వుండదనీ, కనుక ఆ వరల్డ్ మూవీస్  మూసలోనే  ‘ఊపిరి’ నీ చూడాలనీ...ఇది కూడా మళ్ళీ వివరించాల్సి వచ్చింది.  
           అసలు ఇంత రాశాక కూడా ఈ ప్రశ్నలెందు కొస్తున్నాయంటే, రాసిన దాన్ని విశ్వసించలేక, కేవలం ప్రపంచంలో సినిమాలన్నీ తెలుగు మసాలా సినిమాల మూసలోనే  వుంటాయని గట్టిగా నమ్మడం వల్లనేమో! అలా వుండకపోతే  అది సినిమాయే కాదనుకోవడం వల్లనేమో! జానర్లే కాకుండా సినిమాలు వివిధ నమూనాల్లో ఉంటాయన్న పరిశీలన లేకపోవడంవల్ల కూడా కావొచ్చు! సరే, ఇదలా వుంచుదాం.
          తెలుగులో అడపాదడపా ‘మిడిల్ మటాష్’ సినిమాలని  చూస్తూ వచ్చాం. అంటే  కథలో వుండే  బిగినింగ్ విభాగాన్నే క్లయిమాక్స్ దాకా సాగదీసి, అక్కడో  చిన్న ప్రాబ్లమేదో పెట్టేసి, అప్పుడు మిడిల్ లోకొచ్చేసి, ఆ మూడో సీన్లోనే ఓ డైలాగుతో ఆ ప్రాబ్లంని అంతే సులువుగా తీర్చేసి, ఎండ్ కొచ్చేసే స్ట్రక్చర్ అన్న మాట. 
           కథలో 50 శాతంగా  వుండాల్సిన మిడిల్, 5 శాతానికి కుంచించుకు పోవడంవల్ల దాన్ని  ‘మిడిల్ మటాష్’ స్ట్రక్చర్  అన్నాం. ఇలాటి అవగాహన లేని  స్ట్రక్చర్ తో వచ్చిన సినిమాలన్నీ సహజంగానే అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ముఖ్యంగా 2000 – 2005 మధ్య యూత్ సినిమాల పేరుతో వెల్లువెత్తినవన్నీ- ఈ మధ్యే వచ్చిన 40 కోట్ల బిగ్ బడ్జెట్  ‘కిక్- 2’ సహా!  మిడిల్ పీక నొక్కేస్తూ ఏం చేస్తున్నారో తెలుసుకోక  చేసిన  స్క్రిప్టుల కారణంగా కొన్ని వందల కోట్ల రూపాయాలు నిర్మాతలు అన్యాయంగా నష్టపోయారు! మిడిల్ పీక నొక్కితే, అది నిర్మాతల  డబ్బు నొక్కేస్తుందని ఇప్పటికీ తెలుసుకోవడం లేదు. డబ్బు పెట్టేవాడుంటే స్క్రిప్టు రాయడానికి ఏ ఎడ్యుకేషనూ అవసరం లేదన్నట్టు వుంటోంది కల్చర్. ఇది కూడా అలావుంచుదాం. 
          ఇలా మిడిల్ మటాష్  స్ట్రక్చరే  ఒక భస్మాసుర హస్తమనుకుంటే, ఇపుడసలు స్ట్రక్చరే  లేకుండా ‘ఊపిరి’ సవాలు విసురుతోంది! ఇదెలా సాధ్యం?  సాధ్యమే. మిడిల్ మటాష్ కి సమాధానమే. తీసిన మిడిల్ మటాష్ సినిమాల్ని, ఇంకా ఎవరైనా తీస్తూంటే ఆ  మిడిల్ మటాష్ సినిమాలన్నిటినీ,  వరల్డ్ మూవీస్ విజన్ లో పెట్టి తీస్తే స్ట్రక్చర్ తో పనే లేదు. తెలియాల్సింది  స్ట్రక్చర్ లేకుండా ఎలా తీయాలన్నదే.
          ‘ఊపిరి’ తెలుగు సినిమాలకి సంబంధించి ఇది మొట్టమొదటి తేడాగల అనుభవం- స్ట్రక్చరే  లేకుండా స్క్రీన్ ప్లే హిట్టవడం!
          ఇంగ్లీషు భాషేతర సినిమాలు ‘వరల్డ్ సినిమా’ అయినప్పుడు, ఇవన్నీ స్ట్రక్చర్ దగ్గర హాలీవుడ్ తో విభేదిస్తూ- వెక్కిరిస్తూ కూడా  వుంటాయి. హాలీవుడ్ ఒక్కటే ఒక వైపు, మిగతా వరల్డ్ సినిమాలన్నీ ఒక వైపు. ఎంటర్ టైన్మెంటే పరమావధిగా  హాలీవుడ్  స్ట్రక్చర్ కి కాన్ ఫ్లిక్టే (సంఘర్షణే) ప్రధానమనుకుంటే, ఈ ‘కాన్ ఫ్లిక్ట్’ (conflict) తోనే బిగ్ కమర్షియల్ సినిమాలు వసూళ్లు సాధిస్తాయని నమ్మితే, వరల్డ్ సినిమాలు వచ్చేసి స్ట్రక్చరే, కాన్ ఫ్లిక్టే   అవసరం లేని వాస్తవికతా ధోరణులతో కూడిన ఆర్ట్ సినిమాల నుంచి పరిణామం చెందుతూ చెందుతూ  వస్తున్న కళా రూపాలై వున్నాయి. అలాటి కళారూపాల్లో ఒకటి ‘ఊపిరి’ 
బజారు మనిషితో బిలియనీర్
    ‘ఇంటచబుల్స్’  2011 లో విడుదలై కనకవర్షం కురిపించిన ఫ్రెంచి మూవీ. ఇది ఫిలిప్ పోజో డీ బోర్గో అనే ఒక బిలియనీర్ నిజ కథ. ఇతను సరదాగా భార్యతో పారా గ్లయిడింగ్ కి వెళ్లి ప్రమాదం పాలయ్యాడు, భార్య చనిపోయింది, తను శరీరం చలనం కోల్పోయాడు. ఆ భార్యతో పిల్లలు కూడా లేరు. కాలక్రమంలో ఇతడికి అబ్దెల్ సెలో అనే అల్జీరియన్ సంతతికి చెందిన ఫ్రెంచి ముస్లిం సేవకుడుగా కుదిరాడు. యజమానిని కంటికి రెప్పలా చూసుకున్నాడు. వీళ్ళిద్దరి ఆసక్తికర అనుబంధం మీద తీసిన డాక్యుమెంటరీని చూసిన జంట దర్శకులు ఆలివర్ నకషే, ఎరిక్ టోల్డెనో  ఇద్దరూ కలిసి, ‘ఇంటచబుల్స్’  సినిమా తలపెట్టారు. ఇది ఫ్రాన్స్ లో అతి పెద్ద హిట్టయ్యింది. ప్రపంచ వ్యాప్తంగానూ విజయం సాధించింది. పోతే, ఫిలిప్ కి సేవకుడుగా అబ్దెల్ సెలో ఇప్పటికీ కొనసాగుతూనే వున్నాడు.
        సినిమాలో ఫిలిప్ పాత్రని  44 సినిమాల సీనియర్ ఫ్రెంచి నటుడు ఫ్రాంకోయిస్ క్లజెట్  పోషిస్తే, అబ్దెల్ సెలో  పాత్రని 70 ఫ్రెంచి సినిమాల్లో నటించిన నల్లజాతి ముస్లిం కమెడియన్ ఒమర్ సై పోషించాడు. 
 1]
         
గంటా 45 నిమిషాల నిడివి గల ఈ ఒరిజినల్ సినిమా కథ ఇలా వుంటుంది...పారా గ్లయిడింగ్ లో గాయపడి చక్రాల కుర్చీలో  బందీ అయిపోయిన ఫిలిప్ తనకి సపర్యలు చేసేందుకు పనివాడి కోసం ఇంటర్వ్యూలు తీసుకుంటాడు. ఎందరో వస్తారు, ఒక్కరూ నచ్చరు. తన స్థితికి  జాలిపడి పలకరించే వాళ్ళని చూసీ చూసీ విసిగిపోయాడు. ఈ పనివాళ్ళు కూడా జాలి చూపిస్తే భరించలేడు. ఐతే ఇంటర్వ్యూ లో పిలవని పేరంటంలా వచ్చి జొరబడిపోయిన  షోకిల్లా రాయుడు డ్రిస్ అనే నల్లజాతీయుడ్ని చూసి ముచ్చట పడ్డాడు. ఇతగాడికి జాలీదయా మన్నూ మశానంలాంటి సెంటిమెంట్లు ఏవీ లేవు, అలాగని ఈ ఉద్యోగం కోరుకునీ రాలేదు. కేర్ లెస్ గా ఇంటర్వ్యూ ఇస్తే రిజెక్ట్ చేస్తారని, ఈ రిజెక్షన్  చూపించుకుని మరికొన్నాళ్ళు ప్రభుత్వమిచ్చే నిరుద్యోగ భృతిని నొక్కచ్చని ప్లానేసుకుని వచ్చాడు. బుక్కై పోయాడు ఫిలిప్ కి తెగ నచ్చేసి. 

          డ్రిస్ ది పేద కుటుంబం. తల్లి పోషిస్తోంటే ఆవారా తిరుగుళ్ళు తిరుగుతున్నాడు. దొంగతనం చేసి ఆర్నెల్లు జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. తమ్ముడు వేరే క్రిమినల్స్ తో తిరుగుతున్నాడు. ఈ నేపధ్యంలో ఇప్పుడు తల్లి ఇంట్లోంచి వెళ్లిపొమ్మనే సరికి, పెట్టే బేడా సర్దుకుని ఫిలిప్ దగ్గరికి వచ్చేశాడు.
2]
         
డ్రిస్ ది  దేనికీ బాధపడే మనస్తత్వం కాదు. ఎంత కష్టకాలంలోనూ  ఇతడి నవ్వొ చ్చే చేష్టలు చూస్తే వీడొక మనిషేనా అన్పించేలా వుంటాడు. లోకంలో తన పట్ల కోపం, వ్యతిరేకత, ఛీత్కారం అన్నీ వున్నా, లేవనే భావించుకుంటాడు. లోకమంతా తనతో బాగానే వుందను
కుంటాడు. ఆత్మాభిమానం దెబ్బతింటే, తనని తాను ప్రేమించుకోవడం ఎక్కువ చేసుకుని, ఆ గాయం చేసే ఎమోషనల్ బ్లీడింగ్ ని సత్వరం నివారించుకుంటాడు. ఎమోషన్స్ ని ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకుని ఫ్రెష్ గా ఉంటాడు, జీవితాన్ని ఎంజాయ్ చేస్తూంటాడు. కథలో ఇతడి పాత్ర చిత్రణ ఒక క్యారక్టర్ స్టడీ...మనం ఎలా జీవించాలో  మనకి మతిపోయేలా నేర్పుతూంటాడు.

          ఐతే ఇతడి వ్యక్తిత్వ ప్రభావం బిలియనీర్ ఫిలిప్ మీద పడదు. ఫిలిప్ వ్యక్తిత్వం ఫిలిప్  దే. ఎలాగైతే తనపట్ల జాలి చూపిస్తే సహించడో, అలా తనని తాను చూసుకునీ కుంగిపోడు. చక్రాల కుర్చీలోనూ రాజసంగా ఉంటాడు. తనక్కావల్సింది మానసిక ఆసరా కాదు, భౌతిక సహాయం. దీన్ని  డ్రిస్ నానా కంగాళీతనంతో సరఫరా  చేస్తున్నాడు. ఫిలిప్ ఎవరైతే నాకేంటి, నేను తాగే సిగరెట్ ఇతనూ తాగాలి అని ఎంగిలి సిగరెట్ నోట్లో పెట్టేసే గడుసుతనం డ్రిస్ ది. ఇతడి చేష్టల్ని స్పోర్టివ్ గా తీసుకుని ఎంజాయ్ చేస్తూంటాడు కాళ్ళు చేతులు పనిచేయని ఫిలిప్ కూడా. 

          ఈ సెటప్ లో ఫిలిప్ తనపనులు తాను చేసుకోలేని ఎంత నిస్సహాయుడో తెలిసిన తర్వాత డ్రిస్ అనుక్షణం అంటిపెట్టుకుని వుండడం ప్రారంభిస్తాడు. వ్యక్తిగత జీవితంలో కూడా జోక్యం చేసుకుని ఫిలిప్ దత్త పుత్రికని అదుపులో పెట్టేలా చూస్తాడు. ఫిలిప్ బిజినెస్ ఉత్తరాలే గాకుండా, ఒకమ్మాయి రాసే వ్యక్తిగత లేఖల్ని కూడా చదివి విన్పిస్తాడు. ఫిలిప్ కొన్ని లక్షలు పోసి ఒక అర్ధం కాని మోడరన్ ఆర్ట్ పెయింటింగ్ కొనడం చూసి,  తనూ అలాటి పిచ్చి పెయింటింగ్ ఒకటి వేసి పారేసి అమ్మి పెట్టమంటాడు. ఫిలిప్ దాన్ని తన మిత్రుడికి అంట గడతాడు. ఫిలిప్ ని బయట షికార్లకి కూడా తీసుకుపోతాడు డ్రిస్. అతడి బర్త్ డేకి  హోటల్లో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడు ఆడి పాడేసి.  

          ఇక  ఫిలిప్ ని ఆ ఉత్తరాలు రాసే అదృశ్య ప్రేమికురాలితో  కలపాలని బలవంతంగా ఒప్పించి తీసుకుపోతాడు డ్రిస్. తన స్థితికి ఆమె ఎలా రియాక్ట్ అవుతుందోనన్న భయంతో ఆమెని  చూడకుండానే, కలవకుండానే వచ్చేస్తాడు ఫిలిప్.

3]
         
క మనం ఈ వీకెండ్ పారా గ్లయిడింగ్ కి వెళ్దామని తన సొంత విమానంలో డ్రిస్ ని తీ సుకుపోతాడు ఫిలిప్. ఇద్దరూ ఆ పారా గ్లయిడింగ్ ని ఎంజాయ్ చేశాక, డ్రిస్ తమ్ముడు వచ్చేసి, డ్రిస్ ని రహస్యంగా కలుసుకుని ఏదో చెప్పుకోవడాన్ని పసిగట్టిన ఫిలిప్, ఇక నువ్వింటి కెళ్ళి నీ ఇంటి సమస్యలు తీర్చుకో, ఎల్లకాలం నా చక్రాల కుర్చీని లాగుతూ వుండిపోతావా అనేసరికి- మొదటిసారిగా డ్రిస్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అతను వెళ్లిపోతూంటే ఫిలిప్  పరివారమంతా ఎంతో బాధపడతారు.

          ఇంటి కొచ్చి డ్రిస్ క్రిమినల్స్ తో తమ్ముడి సమస్య తీరుస్తాడు, తమ్ముడు ఇక మారిపోతాడు. డ్రిస్ ఉద్యోగ ప్రయత్నంలో వుంటాడు. కానీ అటు చూస్తే డ్రిస్ లేని లోటు ఫిలిప్ ని బాధించడం మొదలెడుతుంది. ఇంకే సేవకుడు వచ్చినా నచ్చడు. గడ్డం మీసాలు పెరిగిపోయి విరాగిలా తయారవుతాడు. అతడింట్లో పనిచేసే ఒకావిడ డ్రిస్ ని  కలుసుకుని, మళ్ళీ నువ్వు రావాల్సిందే నంటుంది. డ్రిస్ వచ్చి ఫిలిప్ అవతారం చూసి పకపకా నవ్వేసి - ‘ఇదేంటి మీరు అబ్రహాం లింకన్ అయిపోయరా? ఫ్రాయిడ్ లా అయిపోయారా? విక్టర్ హ్యూగోలా తయారయ్యారే?’ అని తన సహజ ధోరణిలో ఆటలు పట్టిస్తాడు అడ్డంగా గడ్డమూ మీసాలూ చూసి.

4]
         
రాత్రి ఫిలిప్ ని తీసుకుని రిలీఫ్ కోసం స్పీడ్ డ్రైవింగ్ చేసి పోలీసులకి పట్టుబడి, తెలివిగా బయటపడి- తెల్లారే సరికి సముద్ర తీరాన ఒక హోటల్ కి తీసుకుపోతాడు. అక్కడ ఫిలిప్ గడ్డం రకరకాలుగా గీసి ఆడుకుంటూ, తిరిగి పూర్వస్థితికి నీటుగా షేవింగ్ చేసి, సీటులో కూర్చోబెట్టి,  బై చెప్పేసి వెళ్ళిపోతాడు. ఒకమ్మాయి వచ్చి ఫిలిప్ ఎదురుగా కూర్చుంటుంది- ఈ అమ్మాయి మరెవరో కాదు, ఆ అదృశ్య ప్రేమికురాలే. బయట్నించి అద్దంలోంచి ఈ దృశ్యం చూస్తూ, మరోసారి ఫిలిప్ కి బై చెప్పేసి,  వెళ్లి పోతూంటాడు తన భవిష్యత్తులోకి డ్రిస్ ..?
          తనకేం భవిష్యత్తు వుందని? కానీ లెక్క చెయ్యడు, బతికేయగలడు.

కథా? గాథా? 
నిజజీవితంలో ఫిలిప్, అబ్దెల్ సెలో 
       దీ కథ. ఈ కథలో స్ట్రక్చర్ ఏముంది?  స్ట్రక్చర్ అంటే కథకి ఓ  బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలూ, ప్లాట్ పాయింట్సూ, ప్రధాన పాత్రా, దానికో సమస్యా, ఆ సమస్యతో సంఘర్షణా, ఆ సమస్యని సాధించాలన్న లక్ష్యమూ...ఇవీ.

          ఇవేవీ లేని కథ ఇదని పైన చదువుకుంటూ వస్తే తెలిసిపోతోంది. ఆర్టు సినిమాల్లో ఇవేవీ వుండవు, అంటే స్ట్రక్చర్ వుండదు. అసలు ఆర్టు సినిమాల్లో వుండే వాటిని కథలని కూడా అనకూడదేమో?  కథ అంటే ఒక పాయింటు పట్టుకుని ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదించేది. పాయింటే వుండనప్పుడు ఆర్గ్యుమెంటే తలెత్తదు గనుక, ఆర్ట్ సినిమాల్లో వుండేవి కథలనుకోనవసరం లేదు. కథలు కావు కాబట్టే స్ట్రక్చర్ కూడా వుండడంలేదు వీటిలో. కేవలం ‘కథ’ లకే స్ట్రక్చర్ వుంటుంది. ‘గాథ’ లకి వుండదు గనుక ఆర్ట్ సినిమాల్లో వుండేవి ‘గాథ’ లే అనుకోవాలి. ‘గాథ’ ల్లో ఆర్గ్యుమెంట్ వుండదు, స్టేట్ మెంట్ మాత్రమే వుంటుంది. ‘నేనిలా వుంటే నాకిలా జరిగి, ఇలా ముగిసిందీ’ అన్న చందాన ఓ స్టేట్ మెంట్ ఇచ్చేసి ముగుస్తాయవి. ‘నేనిలా వుంటే ఇలా  పోరాడి ఇలా ప్రూవ్ చేసుకున్నానూ’- అన్న పద్ధతిలో  గాథలుండవు. ‘పోరాడాను’ అనేసరికే ఆర్గ్యుమెంట్ వచ్చి జొరబడిపోతుంది. అది కథై కూర్చుంటుంది. వాడుక సౌలభ్యం కోసం గాథని కథ అనుకోవాలేగానీ, నిజానికివి కథలు కావు.

          కాబట్టి వరల్డ్ మూవీస్  అన్నీ గాథలతో స్ట్రక్చర్ లేని ఆర్ట్ సినిమాలే. మరి స్ట్రక్చర్ అవసరం లేదని గాథని ఎలా చెప్పాలి? అడ్డగోలుగా చెప్పాలా?లేదు, దీనికీ ఓ విధానముంది. దీన్ని చైనీయులు/జపనీయులు  కనిపెట్టారు. దీని పేరు ‘కిష్టెన్ క్యాచో’ (
Kishotenketsu). ఈ ఇంగ్లీషు అక్షరాలని కూడ బలుక్కుంటూ పలక్కండి- జన్మలో పదం రాదు. ఏ ప్రముఖ డిక్షనరీ వెబ్ సైట్లోనో ఈ అక్షరాలని ప్రొనన్సియేషన్  బాక్సులో కొట్టండి- యూట్యూబ్ ఓపెనై, రికార్డెడ్ వాయిస్ తియ్యగా ‘కిష్టెన్ క్యాచో’ అని పలుకుతుంది. తెలుగులోకి మార్చుకుని  ‘కిష్టన్న క్యాచ్ పట్టాడు’ అనుకుంటే కలకాలం గుర్తుండిపోతుంది. నిజంగా ఇదేదో కొత్త విధానాన్ని క్యాచ్ పట్టడమే కదా  ఇక్కడ నేర్చుకుంటోంది.  

         
Ki : Introduction
          Sho : Development

         
Ten : Twist (complication)
         
Ketsu : Conclusion (reconciliation)
         
ఇంతే!

4 యాక్ట్స్ తో ఫన్ 
       కమర్షియల్ సినిమా కథల్లో త్రీ యాక్ట్స్ ( బిగినింగ్, మిడిల్, ఎండ్) లా కాకుండా,  ఇక్కడ 4 యాక్ట్స్ (అంకాలు)  వుంటాయి. త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ లోనైతే బిగినింగ్ లో పాత్రల పరిచయం, సమస్య ఏర్పాటు, మిడిల్ లో ఆ సమస్యతో సంఘర్షణ, ఎండ్ లో పరిష్కారం అనే పద్ధతి వుంటుంది.

          ఇక్కడ 4 యాక్ట్స్ విధానంలో ఇవేవీ వుండవు. ఇందులో ఫస్ట్ యాక్ట్ లో కథా పరిచయం,  పాత్రల పరిచయం, వాటి సామాన్య ప్రపంచమూ వుంటాయి.

          సెకండ్ యాక్ట్ లో  పాత్రలు పరస్పరం సంపర్కంలోకి వస్తాయి. వాటి ప్రపంచం మారుతుంది. ఆయా పాత్రల గురించి మరిన్ని విషయాలు బయటపడతాయి. ఒక కొత్త ఎలిమెంట్ వచ్చి చేరుతుంది. ఇంతేగాక రకరకాల సంఘటనలతో ఆ పాత్రలు మరింత దగ్గరై ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడుతుంది. 

          థర్డ్ యాక్ట్ లో ఎమోషనల్ కనెక్ట్ తో పాత్రలు  మరింత ముందుకు సాగుతాయి.  చివర్లో ఒక ట్విస్టు వస్తుంది.
          ఫోర్త్ యాక్ట్ లో  సెకండ్ యాక్ట్ లో ప్రవేశపెట్టిన ఎలిమెంట్ తో పరిష్కారం వుంటుంది.
          ఇక్కడ ఆగి ఒకసారి పరిశీలించుకుంటే-

          మిడిల్ మటాష్ లో క్లయిమాక్స్ కి జస్ట్ ముందు- ఓ సమస్య/సంఘర్షణతో పిసరంత మిడిల్ ని పెట్టి దాన్ని పరిష్కరిస్తారని పైన చెప్పుకున్నాం. అంటే క్లయిమాక్స్ దగ్గర  ఏర్పడే ట్విస్టు( సమస్య/సంఘర్షణ)  మాత్రమే పరిష్కరించదగ్గ పాయింటు అవుతుంది.
4 యాక్స్ట్ తో కూడిన వరల్డ్ మూవీస్ లో ఇలాకాకుండా, సెకండ్ యాక్ట్ లో ( ఇంటర్వెల్ కి పూర్వం) ప్రవేశ పెట్టే ఎలిమెంటు నే ముందుకు తెచ్చి ముగించడం వుంటుంది. ఈ తేడా గుర్తించాలి. కనుకనే మిడిల్  మటాష్ కంటే,  కిష్టెన్ క్యాచో స్కీన్ ప్లేలే నయంగా వుంటాయి. 

నాలుగు స్థంభాల ఆట

           ప్పుడొకసారి  ‘ఇంటచబుల్స్’ ని  ‘కిష్టిగాడి’  వలలో ‘క్యాచ్’ పట్టి  చూద్దాం...
          ఇంకోసారి పైన చెప్పుకున్న కథా సంగ్రహంలో కెళ్దాం :  కథా  సంగ్రహాన్ని నాల్గు భాగాలుగా ఇచ్చాం. మొదటి భాగం ఫస్ట్ యాక్ట్ అనుకుంటే, ఫిలిప్ చక్రాలకుర్చీకి బందీ అయినట్టు, చూపించబోతున్న కథ దీని గురించే అన్నట్టు ‘కథాపరిచయం’ చేశారు. ఫిలిప్ పాత్రతో బాటు అతడి పరివారం, డ్రిస్ పాత్రతో పాటు  అతడి కుటుంబం, ఈ మొత్తం పాత్రల సామాన్య ప్రపంచమూ చూపించారు. ఇంటర్వ్యూ డ్రిస్ వచ్చి వెళ్ళడం, ఇంటి దగ్గర తల్లి వెళ్లి పొమ్మనడం, ఇక ఫిలిప్ దగ్గర చేరేందుకు డ్రిస్ బయల్దేరడమూ చూపించి ఫస్ట్ యాక్ట్ ని ముగించారు.

          సెకండ్ యాక్ట్ : కథాసంగ్రహం రెండో భాగంలో కొస్తే,  ఫిలిప్ ఇల్లూ అనే కొత్త ప్రపంచంలోకి డ్రిస్ ని ప్రవేశపెట్టి , పని బాధ్యతలు చేపట్టినట్టు చూపించారు. ఫిలిప్, డ్రిస్ ఇద్దరి స్వభావాల్ని మరికొంత విడమర్చి చూపించారు, ఇద్దరి మధ్యా సాన్నిహిత్యాన్ని పెంచుతూ ఎమోషనల్ కనెక్ట్ ఇచ్చారు. లెటర్స్ చదివించడం  ద్వారా కొత్త ఎలిమెంట్ ని ప్రవేశ పెట్టారు. ఆ కొత్త ఎలిమెంట్ ‘అదృశ్య ప్రేమికురాలు’. వీళ్ళ సంబంధానికి వాస్తవ  రూపమివ్వాలన్న ఆలోచన డ్రిస్ కి  కల్పించడం ద్వారా ఆ ప్రయత్నం చేయిస్తూ- ఆమెతో కలవడానికి ఫిలిప్ జంకి వెళ్లిపోవడంతో ఈ యాక్ట్ ని ముగింపుకి తెచ్చారు. 


         థర్డ్ యాక్ట్ లో,  కొంత డిస్టర్బ్ అయిన ఫిలిప్ కి  రిలీఫ్ కోసమన్నట్టు,  పారా గ్లయిడింగ్ కి డ్రిస్స్ తో బయల్దేరదీశారు. అక్కడ డ్రిస్ తమ్ముణ్ణి వాడి సమస్యతో ప్రవేశపెడుతూ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఇంటి సమస్యలు తీర్చుకోమని ఫిలిప్ అనడంతో, అక్కడ్నించి డ్రిస్  నిష్క్రమణతో   ఈ యాక్ట్ ని ముగించారు. 


          ఫోర్త్ యాక్ట్ అనేది సెకండ్ యాక్ట్ లో ఎలిమెంట్ కి సమాధానమనే సూత్రం ప్రకారం, డ్రిస్ ఆ అదృశ్య ప్రేమికురాలిని ఫిలిప్ తో కలపడాన్ని  చూపిస్తూ  సుఖాంతం చేశారు.

(మిగతా రేపు!)
-సికిందర్

http://www.cinemabazaar.in




Saturday, March 26, 2016

తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్- 10








(స్ట్రక్చర్ నేర్చుకునే ఆసక్తి పరులందరికీ జరుగుతున్న జాప్యానికి  మరొక్కసారి సారీ చెప్పుకుంటూ, ఈ పదవ భాగం నుంచీ వ్యాస పరంపరని తిరిగి కొనసాగిస్తూ, ఇక క్రమం తప్పకుండా వారంవారం అందించి ముగిస్తామని ఇంకోసారి ప్రామీస్ చేస్తూ...మరొక్కసారి స్వాగతం!)

తెలుగుసినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వ్యాసాల్లో భాగంగా ‘శివ’ ని ఆధారంగా చేసుకుని బిగినింగ్ విభాగ రచన గురించే చెప్పుకున్నాం. ఇంకా మిడిల్ విభాగాన్ని ప్రారంభించేముందు, మిడిల్ ఏ సైజులో, ఏ నిష్పత్తుల్లో ఉండాలో, వుండనప్పుడు ఫలితలెలా వుంటాయో  గత రెండు వ్యాసాల్లో చెప్పుకొచ్చాం. ఒకరు తయారు చేసే కథల మీద ఎక్కువగా  మిడిల్ విభాగం మీదే ఇతరుల చేతులు పడతాయి. అందువల్ల మిడిల్ విభాగపు స్ట్రక్చర్ చెదిరిపోయే అవకాశాలే ఎక్కువ వుంటాయి. దీన్ని రచయితలు ఆపలేకపోవచ్చు.  రాజీ పడడమో, లేదా కథ వెనక్కి తీసుకోవడమో ఏదో ఒకటి చేయాలి తప్ప మరో మార్గం లేదు. అలా కాకుండా కథ మీద ఎన్ని అమృత హస్తాలు పడ్డా పూర్తిగా చెడిపోకుండా  కాపాడుకునే రహస్యమేదైనా వుందా అన్న అన్వేషణలో భాగంగా గత వ్యాసం(ఫిబ్రవరి 4, 2016) వెలువరించాం. ఇక తర్వాతి భాగం కొనసాగిద్దాం.

       సినిమా కథెప్పుడూ రచయిత భావ స్వేచ్ఛ కాదు. దర్శకుడి భావ స్వేచ్ఛ కావొచ్చు, అరుదుగా నిర్మాత భావస్వేచ్ఛ కావొచ్చు. అయితే ఈ భావ స్వేచ్ఛతో వుండే  ప్రమాద మెంతవరకూ అంటే, దాంతో పైపై నియమాల ఉల్లంఘన జరిగేంతవరకూ మాత్రమే. ఈ నియమాల అడుగున కథకో ఆత్మ వుంటుంది. ఆ ఆత్మని దెబ్బతీసే దాకా భావ స్వేచ్ఛ పోదు. చాలా మందికి కథకి ఆత్మ ఉంటుందనే తెలీదు. కాబట్టి ఆ లోతులదాకా  వాళ్ళ ఆలోచనలు సాగవు. ఒకవేళ ఆత్మ వుంటుందని తెలిసిపోయి, దానిమీద కూడా చేతులేద్దామనుకుంటే, అది సాధ్యంకాని పద్ధతిలో లాక్ వేస్తామన్న మాట. ఆత్మకి లాక్ వేసేస్తాం. అయినా కూడా  తాలిబన్ మర్కటాలు బామియాన్ బుద్ధ  విగ్రహాల్ని కూల్చినట్టు, ఆ లాక్ ని కూడా పేల్చేసి కథా సౌధాన్ని కూల్చే సాంస్కృతిక విద్రోహానికి పాల్పడుతూంటే మాత్రం, కథని ఎత్తుకుని పారిపోయే పూర్తి రాజ్యాంగ హక్కు ప్రతీ రచయితకీ  ఎలాగూ వుంటుంది.

          మిడిల్ విభాగంలో కథాత్మకి ఈ లాక్ వేసే రహస్యాన్నే  మనం తెలుసుకోబోతున్నాం. రహస్యాన్ని ఇంత ఓపెన్ గా చెప్పేస్తే వాళ్లకి తెలిసి పోతుంది కదా, అప్పుడేం లాభమని అన్పించవచ్చు. వాళ్ళు కూడా తెలుసుకుంటేనే  బావుంటుందని..  తాలిబన్లు అన్పించుకోవడం ఎవరికీ ఇష్టముండదన్న నమ్మకంతో.

          సినిమా కథని మౌఖికంగానే చెప్పే సాంప్రదాయం కొనసాగుతోంది. రచయిత తన స్నేహితులకి, అదే రచయిత  దర్శడికి, దర్శకుడు నిర్మాతకి, ఆపైన హీరోకీ మౌఖికంగానే కథ చెప్పుకుంటారు. చదువుకోమని ఫైలు ఇచ్చేసి రావడం వుండదు.  ఇలా ఒకరి నుంచి  ఒకరికి మౌఖికంగా చేరే కథ మారకుండా ప్రసారమవుతూ వుంటుంది. మౌఖికంగా చెలామణిలో వున్నంతవరకూ ఢోకా వుండదు. ఓవరాల్ గా అది ఓకే అయ్యి, ఆతర్వాత రాత పనిలో కొచ్చే టప్పటికి రోజుకో రకంగా మారిపోతూ వుంటుంది. ఎన్ని చేతులు పని చేస్తే అన్ని రకాలుగా మారిపోతూ వుంటుంది. ఇందుకే స్టీఫెన్ కింగ్ కూడా అన్నాడు- మిలియన్ డాలర్లు పెట్టి నా నవల కొనుక్కుని, దాంతో సంబంధంలేని సినిమా ఎందుకు తీస్తారో అర్ధం కాదని!  

          కాబట్టి తెలుగు సినిమా రచయితలు  ఈ ప్రపంచంలో తామొక్కరే బాధితులమని ఆత్మస్థైర్యం  కోల్పోనవసరం లేదు, హాలీవుడ్ లో కూడా తమలాంటి బాధితులు తోడుగా వున్నారు.

          కథల్ని క్రియేట్ చేయలేని వాళ్ళే ఎక్కువ. వాళ్ళే కథలమీద గొప్ప గొప్ప వ్యాఖ్యానాలూ విమర్శలూ చేస్తారు. కథల్ని  ముందు పెట్టుకుని డిస్కస్ చేస్తారు, డిసెక్షన్ చేస్తారు, మొత్తంగా డిమాలిష్ చేస్తారు. డిస్కషన్స్ కి వచ్చేవాళ్ళు చాలా మంది ఒక్క  కథ రాయలేరుగానీ, పేపర్ మీద ఓ రైటర్ మెదడులోంచి బయటికి తీసి అక్షర రూపమిస్తే, అది ముందు పెట్టుకుని జడ్జీ లైపోతారు, అలా కాదు ఇదిలా వుండాలని మార్చేస్తూంటారు. పైగా నిర్ణయించే హోదాలో వున్న తామే గొప్ప వాళ్ళమని ఫీలైపోతూ, ఆ రైటర్ ని హీనంగా చూస్తారు, అతణ్ణి తప్పించేస్తారు. కోటి రూపాయల సినిమా అయినా పుట్టడానికి కారణమైన రైటర్ ఎక్కడో నించుని, తను వేసిన బీజం మీద జరుగుతున్న తమాషానీ, దాంతో వాళ్ళ కోరికల్నీ జాలిగా చూస్తూంటాడు. 

          కనుక సున్నిత  హృదయులు కథలు రాసుకుని ఇక్కడికి రానక్కర్లేదు. పత్రికకి కథ ఇస్తే దాన్ని విడివిడిగా పాఠకులు చదువుకుంటారు. సినిమాని ఒకే సారి థియేటర్ కి వెయ్యిమంది చొప్పున, కొన్ని వందల థియేటర్లలో కొన్ని లక్షలమంది ఏకకాలంలో చూస్తారు. ఏమాత్రం తేడాగా వున్నా అన్ని లక్షలమంది  గోలగోల చేసి ఒకే సారి తిప్పి కొడతారు. సినిమా వాళ్లకి నిత్యం ఈ భయం వెన్నాడుతూంటుంది. పత్రికలకి ఈ సమస్య వుండదు. పత్రికల్లో ఆ ఒక్క కథే కాకుండా ఇంకా కొన్ని కథలూ, శీర్షికలూ వుంటాయి. బాగా లేని కథ కల్గించే  అసంతృప్తిని  ఇవి కవర్ చేస్తాయి. సినిమా వాళ్ళకి కవర్ చేసుకోవడానికి ఏమీ మిగలదు, నెత్తి  మీద గుడ్డ తప్ప. అందుకని వాళ్ళ దృష్టి కోణం లోంచి కూడా చూడాలి. సమంజసమైన వాళ్ళ అభద్రత వీలైనంత ఎక్కువమందితో  సలహాసంప్రదింపుల్ని కోరుతుంది కథల మీద. వచ్చిన చిక్కేమిటంటే వాళ్ళందరూ  నిష్ణాతులు కారు. లేకపోతే ఇంత చేసినా ఏటేటా 90 శాతం సినిమాలెందుకు ఫ్లాపవుతాయి? 

          కాబట్టి, హిచ్ కాక్  చెప్పినట్టు సినిమా తీయడమంటే 90 శాతం పేపర్ వర్కే,  90 శాతం ఫ్లాపులు తీయడం కాదు! ఇక్కడేం జరుగుతోందంటే, హృదయంలోంచి వచ్చిన, ఓ సుముహూర్తాన సబ్ కాన్షస్ మైండ్ అందించిన, దాన్ని నల్గురూ  మౌఖికంగా చెప్పుకుని ఆనందించిన కథే, పేపర్ మీదికి వచ్చేటప్పటికి ఒరిజినాలిటీని కోల్పోయి రకరకాలుగా మారిపోతోంది! 

          నిజంగా సినిమా రంగం చాలా విచిత్రమైనది. సమాజానికి రివర్స్ గేర్ లో వుంటుంది! మానవ చరిత్రలో చూసుకుంటే, కథలు మౌఖికంగా చెప్పుకుంటూ పోతున్నంత కాలం రకరకాలుగా మారిపోతూ ఉండేవి, అవే రాతల్లో  కొచ్చేటప్పటికి మారకుండా స్థిరంగా  వుండిపోతున్నాయి శతాబ్దాల కాలం. లిపి రెండంచుల కత్తి అన్నమాట!

          తాజాగా ఇటీవల భూటాన్ రచయిత్రి  కంజాంగ్ చోడెన్ ఒక ఇంటర్వ్యూ లో పేర్కొన్న దాని ప్రకారం, భూటాన్ లో కథా సాహిత్య మనేది గత యాభై ఏళ్ళు గానే ప్రచురిత మవుతోంది. యాభై ఏళ్ల క్రితంవరకూ శతాబ్దాల పాటు కథలు జనం నోళ్ళలోనే నానేవి. ఒకతరం నుంచి ఇంకో తరానికి మౌఖిగంగానే వ్యాప్తి చెందేవి. ఒక కథని ఎవరో ఒక గ్రామంలో పుట్టిస్తే అది విని పక్క గ్రామంలో ఇంకెవరో తనదైన  కళాపోషణతో ఇంకోలా చెప్పే వాడు. ఇది విని ఇంకొకడు ఇంకోలా చెప్పేవాడు. పాయింటు ఒకటే, వ్యాఖ్యానాలు వేర్వేరుగా ప్రచారమయ్యేవి. శతాబ్దాల పాటు ఇదే జరుగుతూ వచ్చింది.  ఏ కథ పుట్టినప్పుడు ఎలా ఉండేదో ఎవరికీ తెలీదు. ఈ కథల్ని ఇలాగే  మౌఖిక రూపంలో వదిలేస్తే కొన్నాళ్ళకి  అంతరించిపోతాయని, ఇంగ్లీషులో వాటిని రాసి రికార్డు చేశారు రచయిత్రి. అప్పటినుంచి ఇవి మారకుండా స్థిరంగా ఉండిపోయాయి. మహాజనుల మౌఖిక  స్టోరీ డెవలప్ మెంట్  ప్రక్రియకి ఇక ఫుల్ స్టాప్ పడింది. భూటాన్  లో పిల్లలు ఈ ప్రింటైన జానపద, పురాణ కథలే ఇప్పుడు చదుకుంటున్నారు.

          మరో వైపు చూస్తే,  హాలీవుడ్ స్క్రీన్ ప్లే పండితుడు జేమ్స్ బానెట్ జానపద కథలు అక్షర రూపం దాల్చడంతో ఆ సంపదకి తీరని హానియే  జరిగిందని  అభిప్రాయపడ్డారు. 1970 లలో జేమ్స్ బానెట్ రచయితనవుదామని హాలీవుడ్ వచ్చారు. గొప్ప క్వాలిటీతో స్క్రిప్టులూ నవలలూ రాద్దామనుకున్నారు. కొన్నేళ్ళు స్క్రిప్టు లేవో రాసి, ఇక గొప్ప నవల రాద్దామనుకుని ఆర్నెల్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆరునెలల్లో  600 పేజీలు రాసినా ఆ కథ అంతు చిక్కడంలేదు. దీంతో గొప్ప కథని సృష్టించాలంటే తనకున్న శక్తి చాలదని, ముందు అసలు కథంటే ఏమిటో తెలుసుకుంటేనే రాయగలనని అనుకుని, ఇంకో మహా ప్రయాణానికి ఒడిగట్టారు. ప్రయాణం కట్టేటప్పుడు పదేళ్ళు పడుతుందని ‘కాసాబ్లాంకా’ రచయితకి చెప్పి వెళ్లారు. 

          ఇరవై ఏళ్ళ వరకూ పత్తా లేరు. ఈ ప్రయాణంలో ఎక్కడెక్కడున్నారో తెలీదు. కథంటే ఏమిటో తెలుసుకోవాలన్న పట్టుదలతో రుషిలా మారిపోయి, ప్రపంచ పురాణాలు ( హిందూ పురాణాలు సహా) , జానపద కథలే కాకుండా, వందలాది సినిమాలూ  పరిశీలించారు, పరిశోధించారు. సంఘర్షణ పడ్డారు, చివరికి తను  కనుగొన్నది రాసుకుని బయటికి వచ్చారు. 1999లో దాన్ని ప్రచురించారు. అదే
‘Stealing Fire From The Gods’  (దేవతలనుంచి దివ్యమంత్రాన్ని తస్కరిద్దాం!) అన్న కథలకి బైబిల్లాంటి గ్రంథం. ప్రపంచ వ్యాప్తంగా యూనివర్సిటీల్లో కోర్సుల్లో  బోధిస్తున్న పాఠ్యాంశం. అంతర్జాతీయంగా  రచయితల, దర్శకుల కళ్ళు తెరిపించిన స్క్రీన్ ప్లే శాస్త్రం. 

          మొట్టమొదట లిపి లేని కాలంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో  పుట్టిన జానపద కథలు మౌఖికంగా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతూ, నిరంతరం మార్పు చెందుతూ ఉండేవి. అవి అరేబియన్ నైట్స్ కథలైనా కావొచ్చు, కాశీ మజిలీ కథలైనా కావొచ్చు- ఏ భాషల్లో ఏవైనా  కావొచ్చు. లిపి లేని కాలంలోప్రజల నోళ్ళల్లో నానుతూ ఆయా కాలాలకి తగ్గ జ్ఞాన సంపదతో, అనుభవాలతో, విలువలతో కొత్త కొత్త రూపాలు సంతరించుకుంటూ మహాప్రయాణం సాగిస్తున్న అవి, లిపిని కనుగొనడంతో ఇక మార్పు చెందని శిలాక్షరాలుగా బందీ అయిపోయాయి. ఇవ్వాళ్ళ మనం చదువుతున్న జానపద కథలు మారే ప్రసక్తే లేదు. ఒక కాలంలో ఆగిపోయిన ఈ కథలవల్ల, ఇంకోనష్టం కూడా జరిగింది. అదేమిటంటే, మా నవ జాతి నేటి కాలంలో ఎదుర్కొంటున్న వివిధ కొత్త సమస్యలకి అవి ఏ మాత్రం సైకోథెరఫీ చేయలేకపోతున్నాయి. ప్రతీ జానపద కథా సైకో థెరఫీ చేస్తూనే  పుట్టింది. సైకో థెరఫీ కోసం, మానసిక రుగ్మతల్ని తొలగించుకోవడం కోసం ఇవి పుట్టాయి. పుట్టిన ప్రతీ జానపద కథా ప్రపంచంలో ఒకే కథా నిర్మాణంతో పుట్టింది. బిగినింగ్, మిడిల్, ఎండ్ అనే పద్ధతిలో. ఏ పద్ధతిలో, లేదా నిర్మాణంలో  కథ చెప్తే మానవ మస్తిష్కం స్వీకరించగలదో, మానవ మస్తిష్కానికే  తెలుసు కాబట్టి, ఆ కథ చెప్పే విధాన ప్రక్రియని యధాలాపంగా మానవ మస్తిష్కమే సరఫరా చేస్తూ వస్తోంది యుగాలుగా. జన్యువుల ద్వారా మానవకోటికి ఈ విద్య తరతరాలుగా సంక్రమిస్తూ వస్తోంది.

          ఇంతకీ ఈ బిగినింగ్, మిడిల్, ఎండ్  నిర్మాణంలో అంతస్సూత్ర మేమిటి? ఏది వీటిని  కలిపి వుంచుతోంది? కథంటే సైకో థెరఫీ గనుక, ఆ సైకాలజీ లోంచే, మానసిక అవసరాలకోసమే,  కాన్షస్ -  సబ్ కాన్షస్ మైండ్స్ ని మధించి పుట్టింది కథనేది. నిత్యం స్వర్గంలాంటి కాన్షస్ లో తారట్లాడుతూ, అటు నిగూఢ రహస్యాల మహా సముద్రంలాంటి సబ్ కాన్షస్ లోకి వెళ్లేందుకు, కనీసం తొంగి చూసేండుకూ జంకుతుంది మన టక్కరి  ఇగో.  అలాటి జిత్తులమారి ఇగో ని,  సబ్ కాన్షస్ లోకి బలవంతంగా నెట్టి,  దాని భయాలన్నీ తీర్చి ఒడ్డున చేర్చడమే ఏ కథ పరమార్ధమైనా!

          మనం ఇగోని హీరోగా చేసి దాన్ని బిగినింగ్ ( కాన్షస్ మైండ్) సుఖ సంతోషాల నుంచి, మిడిల్ ( సబ్ కాన్షస్) లోకి నెట్టి, అక్కడి శక్తులతో సంఘర్షింప జేసి, విజేతగా ఎండ్ ( తిరిగి కాన్ష మైండ్) లోకి తీసుకొచ్చేస్తామన్న మాట. కాబట్టి కథంటే  సబ్ కాన్షస్ లో ఇగో చేసే జర్నీ. రచయితలకి మానసిక శాస్త్ర పరిచయంలేకపోతే, కనీసం తమ సొంత మైండ్ ఎలా పనిచేస్తుందో తమకే తెలియకపోతే  రాణించడం కష్టం.  ప్రపంచంలో ఏదైనా మైండ్ లోంచే, మైండ్ రిసీవ్ చేసుకునే స్ట్రక్చర్ తోనే, మైండ్ కోసమే పుడుతోంది. ప్రజలకి ఓ కథ / సినిమా నచ్చ లేదంటే అది సైకో థెరఫీ చేసే మైండ్ లోంచి పుట్టలేడనే అర్ధం. అంటే కాన్షస్- ఇగో- సబ్ కాన్షస్ ల ఇంటర్ ప్లే తో రాయలేదనే అర్ధం! సినిమా స్క్రీన్ ప్లే అంటే కాన్షస్- సబ్ కాన్షస్ ల ఇంటర్ ప్లే అని సశాస్త్రీయంగా నిరూపించాడు జేమ్స్ బానెట్. ఈ పుస్తకాన్ని  ప్రతివొక్కరూ విధిగా చదివి అర్ధం జేసుకోవాలి!  ఉచితంగా పీడీఎఫ్ ప్రతిని కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

-సికిందర్