రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, December 8, 2017

561 : రివ్యూ!


రచన - దర్శత్వం : గౌతమ్
తారాగణం : సుమంత్, ఆకాంక్షా సింగ్, కిరణ్, కార్తీక్, సాత్విక్, ప్రీతీ తదితరులు
సంగీతం
:  శ్రణ్ రద్వాజ్,   ఛాయాగ్రణం : తీష్ ముత్యాల
బ్యానర్ :   స్వర్మ్ ఎంటర్టైన్మెంట్
నిర్మాత : రాహుల్ యాదవ్ క్క
విడుదల : డిసెంబర్ 8, 2017
***
కథ 
          కార్తీక్ (సుమంత్), అంజలి (ఆకాంక్ష) లు రాజోలులో తొమ్మిదో తరగతి చదువుతూ ప్రేమలో పడతారు. దీంతో ఇద్దరి ఇళ్ళల్లో పేరెంట్స్  గొడవపడతారు. అంజలి తల్లి కార్తీక్ ని ఫెడీ మని కొడుతుంది. అప్పుడు అంజలి వయసుకి మించిన ఇష్టాలు పెంచుకోకూడదని కార్తీక్ కి బ్రేకప్ చెప్పేసి పేరెంట్స్ తో ముంబాయి వెళ్ళిపోతుంది. పదమూడేళ్ళ తర్వాత హైదరాబాద్ లో మళ్ళీ కార్తీక్ ని చూస్తుంది.  ప్రేమని వ్యక్తం చేస్తుంది. ప్రేమని మనసులో దాచుకున్న కార్తీక్ ఓకే చెప్తాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటారు. సరీగ్గా పెళ్లి సమయానికి అంజలి వచ్చి, ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేసి వెళ్ళిపోతుంది. అంజలి ఎందుకిలా చేసింది? కార్తీక్ ని చేసుకోవడం ఆమెకి ఎందుకిష్టం లేదు? ఇది తెలుసుకోవాలంటే మిగతా ‘కథ’ వెండి తెర మీద చూడాల్సిందే.

ఎలావుంది కథ
         కథ కాదు, గాథ. అందులోనూ రోమాంటిక్ డ్రామా జానర్. కాబట్టి కథల్లోలాగా సమస్య – సంఘర్షణ – పరిష్కారం అనే కోణంలో దీన్ని చూడకూడదు. ప్రధాన పాత్రలైన ఇద్దరు ప్రేమికుల మధ్య సంఘర్షణ ఆశించకూడదు. కథల్లో లాగా ఆ సంఘర్షణకి ఒక పరిష్కారం కోసం వెతక్కూడదు. కథల్లోలాగా టెన్షన్ టెంపో థ్రిల్ లాంటివి చూడకూడదు. కథల్లోలాగా పాయింటు ఏమిటని అన్వేషించకూడదు. కమర్షియల్ సినిమాల కథల కుండే ఇవేవీ వుండని, పక్కా  గాథ కుండే లక్షణాలతో, పాత్రల దయనీయ స్థితికి జాలి పడుతూ -  ఈ పాసివ్ పాత్రల్ని మనం కూడా పాసివ్ గా చూస్తూ పోవాల్సిన డ్రామా. దీనినే లైటర్ వీ(ణ)న్ స్టోరీ అనీ, ఫీల్ గుడ్ మూవీ అనీ అంటున్నారు. రెండు వారాల క్రితమే  ‘మెంటల్ మదిలో’ అనే ఇలాటిదే ఫీల్ గుడ్ మూవీ వచ్చి వుండకుండా వెళ్ళిపోయింది రివ్యూల్లో ఎంత వూదరగొట్టినా! (ఆ రివ్యూ రాయలేక ఈ వ్యాసకర్త వూరుకున్నాడు). 

     ఐతే ఈ గాథలో సమస్య ప్రేమికురాలిదే  అయినప్పటికీ ఆ సమస్యకి ఓ అర్ధం కన్పించని చిత్రణని చూస్తాం. 14 ఏళ్ల కౌమార్యంలో ఎట్టకేలకు వయసుకి మించిన ఇష్టాలు పెంచుకోకూడదని తెలుసుకోగల్గిన తనే, పెద్దయ్యాక 27 ఏళ్ల వయసులో వయసుకి తగ్గ మెచ్యూరిటీతో ఎందుకుండదో అర్ధం గాదు. నీ తండ్రి ఎలాంటి వాడో నువ్వు చేసుకోబోయే వాడూ అలాటి వాడేనని తల్లి నూరిపోసినంత మాత్రాన,  నమ్మేసి పెళ్లి వద్దనుకుని వెళ్లి పోతుందా? మళ్ళీ,  ఇది నేను –అది వాడూ  అని తండ్రి ఏదో తేడా చెప్పినంత మాత్రాన,  చేసుకుంటున్న వేరే పెళ్లి వదిలేసి వచ్చేసి, ఏడ్చి తనే శుభం కార్డు వేసుకుంటుందా? ఫారిన్లో ఉద్యోగాలు చేసిన, లోకాన్ని చూసిన పాత్రలు ఇంకా 2000 – 2005 మధ్య నాటి లైటర్ వీ(ణ)న్ టీనేజీ ప్రేమ సినిమాలు వదిలి బయటికి రావా? వ్యవహార దక్షత తెలీని,  ఇలాటి అపరిపక్వ పాసివ్ కేండిడేట్స్ కి  కూడా కంపెనీలు ఉద్యోగాలిస్తున్నాయా? 

 ఎవరెలా చేశారు
      అప్పుడప్పుడు వీలు చూసుకుని వచ్చే సుమంత్ కి దేంతోనూ సంబంధం వుండదు. ఇమేజీ, ట్రెండ్, పోటీ, హిట్టు – ఫ్లాపు, డిమాండు  దేంతోనూ సంబంధం లేని  ఏకైక అదృష్ట జాతకుడుగా తను వుంటున్నాడు. ఈసారి ప్రేమ సినిమా నటించాడు. గొప్పతనం ఏమిటంటే-  దర్శకుడూ, కెమెరా మాన్ కలిసి తనని అత్యంత అందగాడుగా అప్డేట్ చేసి చూపించారు. సినిమా ఎవరికెంత గుర్తున్నా గుర్తులేకపోయినా, ఈ గ్లామరస్ ప్రెజెంటేషన్ తో తను గుర్తుండిపోతాడు. పాత్రకూడా జంటిల్ మాన్ లాగా నీటుగా బిహేవ్ చేయడం అదనపు ఆకర్షణ. పాత్రలో తనేం చేశాడనేది, ఔత్సాహిక ప్రేమికులకి ఏం సందేశ మిచ్చాడనేది అనవసరం. పాసివ్ గా బతకాలని చెప్పుండొచ్చు. ఔత్సాహిక లవర్ బాయ్స్ దీన్ని కళ్ళ కద్దుకుని పాటించనూ వచ్చు. 

          అయితే సుమంత్ కన్పించని, సుమంత్ చిన్నప్పటి సీన్లతో చిక్కు రావొచ్చు. మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్  రూపంలో ఫస్టాఫ్ – సెకండాఫ్ అంతా అనంత వాహినిగా వస్తూ వుండే చిన్నప్పటి దృశ్యాల్లో సుమంత్ కాకుండా బాలనటుడు సాత్వికే కన్పిస్తూంటాడు, బాలనటి ప్రీతీయే కన్పిస్తూంటుంది. ఫస్టాఫ్ లోనైతే సుమంత్ – హీరోయిన్ ఆకాంక్షల కంటే ఈ బాలనటుల ఫ్లాష్ కట్సేఎక్కువ సంఖ్యలో డామినేట్ చేస్తూంటాయి. దర్శకుడు వీళ్ళకిచ్చిన స్క్రీన్ స్పేస్ – ముగింపు వరకూ కూడా – అసలు హీరో హీరోయిన్లకి ఇవ్వకపోవడం వెనుక,  పూర్తిగా సుమంత్ భుజాల మీద సినిమా బరువంతా వేస్తే వర్కౌట్ కాదేమోనన్న అనుమానం వుందేమో తెలీదు. 

        హీరోయిన్ ఆకాంక్ష అత్యంత అందగత్తె. ఈ మధ్యవచ్చిన కొత్త హీరోయిన్లందరిలో కంటే  ఏ క్లాస్ బ్యూటీ క్వీన్. క్వీన్ లాంటి గ్రేస్ ఉట్టిపడుతూ వుంటుంది. పాత్రగా ఏం చేసిందనేది తర్వాతి సంగతి. ఔత్సాహిక లవ్ గాళ్స్ ఫాలో అయి దెబ్బతిన్నా నష్టం లేదు. ఆకాంక్ష తీర్చుకున్నట్టు వుంటుంది తృప్తిగా.

          కానీ బాల నటుడు సాత్విక్ పుట్టు నటుడు. సుమంత్ కంటే మాంచి కిక్కిచ్చే నటనతో వుంటాడు. అయితే ఇతడికి బాలనటి ప్రీతి మ్యాచ్ కాదు. ఈమె బలమైన బాడీతో, సాత్విక్ కి అక్కలా వుంటుంది. సాత్విక్ బక్కపలచన, ఎత్తు తక్కువ. 

          టెక్నికల్ గా మంచి విలువలతో వుంది. సతీష్ ముత్యాల కెమెరా వర్క్ సినిమాలో విషయమెలా వున్నా, దృశ్యాల్ని చాలా అందంగా చూపించింది. అలాగే మ్యూజిక్ దీనికింకో హైలైట్. నేపధ్యంలో మాంటేజెస్ కి వచ్చే పాటల్లో, మొత్తం బిజిఎంలో
శ్రణ్ రద్వాజ్ ఇచ్చిన ట్రెండీ బీట్స్ లేకపోతే ఈ గాథ ఒక నిమిషం  కూడా చూడలేని పరిస్థితి వుండేది.

చివరికేమిటి 
       కొత్త దర్శకుడు గౌతంకి యూత్ ఫుల్ ప్రెజెంటేషన్ తెలుసు. మంచి నటనలు రాబట్టుకోవడం, అర్ధవంతమైన దర్శకత్వం వహించడం లాంటి బేసిక్స్ తెలుసు. కాకపోతే తెలిసో తెలీకో కథ కాకుండా గాథ తీయడం,  మళ్ళీ తెలిసో తెలీకో దీన్ని ఎండ్ సస్పెన్స్ చేయడం, ఎండ్ సస్పెన్స్ చేయడంతో మళ్ళీ తెలిసో తెలీకో స్క్రీన్ ప్లేని మిడిల్ మటాష్ చేయడం....చకచకా జరిగిపోయాయి (నూటికి నూరు శాతం ఇవన్నీ తెలియకే చేసుకుపోతారు, ఎలాటి సందేహం అక్కర్లేదు). 

          ఇలా  గాథ, ఎండ్ సస్పెన్స్, మిడిల్ మటాష్ అనే  స్ట్రక్చరేతర క్రియేటివ్ విఫల యత్నాలుండగా, ఇక మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ అనే ఇంకో అపశృతి వీటన్నిటి మీదా స్వారీ చేసింది. మళ్ళీ ఈ మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకుల్లో రెండు కథా (కథకాదు, గాథ) కాలాలు. ఒకటి 1999 నాటి బాల ప్రేమికుల గాథ, ఇంకోటి 2012 నాటి పెద్దయ్యాక కలుసుకుని విడిపోయేప్పటి గాథ. 

          ఈ రెండు కాలాల ఫ్లాష్ బ్యాకుల నేపధ్యంలో 2017 లో నడుస్తుంది అసలు వర్తమాన గాథ – ప్రెజెంట్ టైం ‘స్టోరీ’.  ఈ బహువిధ  కమర్షియలేతర విన్యాసాలతో తెరమీద కదిలే దృశ్యాలు చాలా తికమక పెట్టేస్తాయి. 1999 -2012-2017...ఇలా త్రికాల గాథలు ఖండ ఖండాలుగా త్రిశూలాల్లాగా వచ్చి పడుతూండడంతో,  శివశివా అనుకుని ఏదీ పట్టుకోలేని  నిస్సహాయ స్థితిలో శివుడికే వదిలేస్తాం. దర్శకుడు తను కథ చెప్పడంలో గొప్ప నేర్పు గల వాడని టాలెంట్ ప్రదర్శించుకోదలిస్తే అది ఇమ్మెచ్యురిటీ అన్పించుకుంటుంది. అతి టాలెంట్ అన్పించుకుంటుంది. నిలువెల్లా బ్యాడ్ రైటింగ్ అన్పించుకుంటుంది.  చివరి వరకూ ముక్కలుముక్కలుగా వచ్చే బాల్యపు గాథ తాలూకు దృశ్యాల్ని  గుర్తు పట్టి ఫాలో అవచ్చు- ఎందుకంటే వాటిలో వున్నది బాల నటులు కాబట్టి ప్రత్యేకం గా కన్పిస్తాయి. కానీ పెద్దయ్యాక సుమంత్ – ఆకాంక్ష లతో వచ్చే 2012 - 2017 కాలాల సీన్లలో ఏవి ఫ్లాష్ బ్యాకు సీన్లో, ఏవి ప్రెజెంట్ టైం సీన్లో  ‘క్షీర నీర న్యాయం’ చేస్తూ చూడ్డం సినిమా చూడ్డం అన్పించుకోదు. శ్రమకోర్చి కథని వెతుక్కుంటూ జోడించుకుంటూ చూడాల్సిన అగత్యానికి లోనుజేయడం దేనికి? 

          సింపుల్ గా చిన్నప్పటి కథని మొదట్లోనో, ఓ ఫ్లాష్ బ్యాకులోనో పూర్తిగా చూపించేసి, పెద్దయ్యాక మొత్తం ఒకే గాథగా చూపిస్తే వచ్చే నష్టమేమిటి? స్క్రీన్ ప్లే అంటే ఇదే కదా? పై విధంగా చేసుకొచ్చిందంతా  స్క్రీన్ ప్లే ఎందుకవుతుంది? అది స్క్రీన్ ప్లే లేని ఒట్టి వ్యక్తిగత క్రియేటివిటీ కదా? స్క్రీన్ ప్లేలేని వ్యక్తిగత క్రియేటివిటీ ఎలా వుంటుందో చెప్పడానికి ఇది నిదర్శనం కాదా? 

          2017 లో పెళ్లి ఏర్పాటుతో ప్రారంభించారు. హీరోయిన్ వచ్చి ఈ పెళ్లి  ఇష్టం లేదని చెప్పి వెళ్లి పోవడం అనే ముడి వేశారు గాథకి. ఎందుకిష్టం లేదనే ప్రశ్నకి సమాధానం చివరి వరకూ చెప్పకుండా ఆపారు. అంటే ఎండ్ సస్పన్స్ అయింది. దీంతో గాథ మిడిల్ మటాష్ అయింది. మిడిల్ లేకుండా పోయింది. ఎలాగంటే, చివరి దృశ్యాల్లో ఆ ప్రశ్నకి సమాధానం చెప్పేవరకూ కాలక్షేపం చేసింది 1991, 2012 కాలాల మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులతోనే. ఏదైనా మిడిల్ మిగిలిందంటే,  ఆపైన ఎండ్ కి దక్కిందంటే, 2017 లో బొటాబొటీ దృశ్యాల్లోనే. అసలు గాథ 2017 నాటి దృశ్యాలే అవుతాయి గానీ, 1991, 2012 లనాటి దృశ్యాలు కావు. ఫ్లాష్ బ్యాకులెప్పుడూ అసలు గాథ – లేదా  కథ కాబోవు. అవెప్పుడూ బిగినింగే, ఉపోద్ఘాతమే. స్క్రీన్ ప్లే రచనలో ఇవి ఎలిమెంటరీ పాఠాలు. ఇది కూడా తెలుసుకోక పోతే ఎలా?

          ఇక విషయపరంగా చిన్ననాటి ప్రేమ ‘కథ’ - తొమ్మిదో తరగతి చదువుతున్న పిల్ల, పిల్లాడి మధ్య ఆ ప్రేమలు చాలా ‘ఫీల్’ తో ఆకట్టుకుంటాయని కాబోలు దర్శకుడి ఉద్దేశం. ఈ వయసు పిల్లలు ఈ సినిమా చూసి – స్కూల్లో పిల్లకి ఎలా లైనెయ్యాలో, ఎలా లవ్ చెప్పాలో - పిల్ల కూడా ఎలా తపించిపోవాలో – ఇంకో పిల్ల రోమియోగాడు  ఎలా అడ్డుతగలాలో సినిమా సాంతం గుర్తుచేస్తూ వేస్తూ  పోయిన దృశ్య ఖండికలు అపూర్వంగా, అనిర్వచనీయంగా, ‘నా  బూతూ - నో భవిష్యత్’ గా వున్నాయి. బాలవికాసానికి బలవర్ధక ఔషధం అనుకోవచ్చు.


సికిందర్



Thursday, December 7, 2017

560 : రివ్యూ!


దర్శకత్వం : చరణ్ ఎల్. 
తారాగణం : సప్తగిరి, కశిష్ వోహ్రా, సాయికుమార్, శివప్రసాద్ తదితరులు 
కథ –స్క్రీన్ ప్లే : సుభాష్ కపూర్, మాటలు : పరుచూరి బ్రదర్స్, సంగీతం: బుల్గానిన్, ఛాయాగ్రహణం : సారంగం, నిర్మాత : డా రవికిరణ్
బ్యానర్ : సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రి లి.
విడుదల : డిసెంబర్ 7, 2017

***
          మాస్ హీరోగా మారేందుకు ప్రయత్నిస్తున్న కమెడియన్ సప్తగిరి ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ అనే పాసింజర్ తో హీరోయిజాన్ని అందుకోలేక,  ‘సప్తగిరి ఎల్ ఎల్ బి’ తో ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ ఎక్కేయాలని  సిద్ధమయ్యాడు. ఆ బుల్లెట్ ట్రైన్ అందిందాలేదా తర్వాత చూద్దాం, కానీ ఈ ప్రయత్నంలో ఆధారంగా పట్టుకున్న ‘జాలీ ఎల్ ఎల్ బి’ అనే హిందీ ఒరిజినల్ ని ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్’  ఎక్కించింది మాత్రం వాస్తవం. హైదరాబాద్ జనం మెట్రోనే ఎక్కలేక అవస్థలు పడుతున్నారు. సప్తగిరి ‘జాలీ ఎల్ ఎల్ బి’ తో  ముందు మెట్రో ఎక్కగలిగితే భవిష్యత్తులో బుల్లెట్ ట్రైన్ సంగతి చూడొచ్చు. మాస్ హీరోయిజం అంత వీజీగా విజిలేసి రాదు మరి.

         
కొత్త దర్శకుడు ఎంత సీనియర్ కో - డైరెక్టర్ అయితే అంత నీరసంగా వుంటుంది వ్యవహారం. అదీ రీమేకే తొలి ప్రశ్నా పత్రమైనప్పుడు అగ్ని పరీక్షయి పోతుంది. ప్రశ్నా పత్రంలో అసలు ప్రశ్నేమిటో అర్ధంగాకపోతే, లేదా అర్ధమై అర్ధాన్ని మార్చేసుకుని తెలిసిన జవాబే  రాసుకుందామనుకుంటే,  రిజల్టు దానికి తగ్గట్టుగానే వస్తుంది. ప్రశ్నా పత్రానికి అటు తమిళంలో ఒక జవాబు కన్పిస్తున్నప్పుడు, అదైనా చూసి కాపీ చేయకపోతే మరీ కష్టంగా వుంటుంది వ్యవహారం.

          దేశంలో న్యాయ వ్యవస్థ మీద ఒక ఇంటలిజెంట్ సెటైర్ కాస్తా తెలుగులో తెలుగు ప్రేక్షకుల కోసమని, సప్తగిరి వీర మాసిజం కోసమనీ నిగ్రహం తప్పి ఎలా మూస ఫార్ములాగా తయారయిందో ఓసారి చూద్దాం... 

కథ 
       పల్లెటూళ్ళో వుండే సప్తగిరి (సప్తగిరి) ఎల్ఎల్ బి చేసి వూళ్ళో పంచాయితీలు గెలుస్తూ, టౌన్లో కేసులు ఓడిపోతూ వుంటాడు. వృత్తిలో ఎదిగి, మరదల్ని పెళ్లి చేసుకుని, జీవితంలో సుఖపడాలంటే ఇలా కాదని హైదరాబాద్ మకాం మారుస్తాడు. అక్కడ కోర్టులో ఒక హై ప్రొఫైల్ కేసు చూస్తాడు. ఆ కేసులో కారు ప్రమాదం చేసి పేవ్ మెంట్ మీద నిద్రపోతున్న ఆరుగురు యాచకుల్ని చంపిన కేసులో నిందితుడి  మీద కేసు సులభంగా వీగిపోయేట్టు చేస్తాడు రాజ్ పాల్ (సాయికుమార్) అనే బడా లాయర్. తనకి పేరూ డబ్బూ రావాలంటే ఇదే దెబ్బ అని సప్తగిరి దీని మీద పిల్ వేసి మళ్ళీ విచారణ జరిగేట్టు చూస్తాడు. దీంతో లాయర్ రాజ్ పాల్ ఆగ్రహానికి గురవుతాడు. అన్ని అవినీతులకీ పాల్పడి రాజ్ పాల్ ఈ కేసు గెలిస్తే ఇప్పుడు సప్తగిరి అడ్డుకోవడంతో ముప్పు తిప్పలు పెట్టడం ప్రారంభిస్తాడు. దీన్ని ఎదుర్కొంటూ సప్తగిరి విడుదలై పోయిన నిందితుణ్ణి దోషిగా ఎలా రుజువుచేశాడనేదే మిగతా కథ. 

ఎలా వుంది కథ 
       1999 లో సంజీవ్ నందా హిట్ అండ్ రన్ కేసుని ఆధారంగా చేసుకుని  2013 లో హిందీలో అర్షద్ వార్సీ – అమృతారావ్ – బొమన్ ఇరానీ – సౌరభ్ శుక్లా లతో న్యాయవ్యవస్థ మీద సుభాష్ కపూర్ తీసిన ‘జాలీ ఎల్ ఎల్ బి’ అనే హిట్టయిన సున్నిత హాస్య వ్యంగ్యాస్త్రం ప్రస్తుత కథకి మాతృక. దీన్ని  2016 లో ఉదయనిధి స్టాలిన్ – హంసిక – ప్రకాష్ రాజ్ – రాధారవి లతో  ఐ. అహ్మద్ దర్శకత్వంలో తమిళంలో 'మనిథన్' గా రీమేక్  చేశారు. తెలుగులో కథ- మాటలు- స్క్రీన్ ప్లే అని తన పేరే వేసుకున్నాడు దర్శకుడు చరణ్! నిజానికి ఈ కథ, మాటలు, స్క్రీన్ ప్లే సుభాష్ కపూర్ వి. తెలుగులో అనువాదమయ్యాయి అంతే. ఇక హిందీ వున్నంత వాస్తవికంగా, సున్నితంగా, సెన్సిబుల్ గా తమిళ రీమేక్ వుంటే – తెలుగులో కొచ్చేసరికి సప్తగిరి మసాలా అలా వుంచి, అసలు కాన్సెప్టునే మార్చేశారు. న్యాయవ్యవస్థతో సామాన్యుడి బాధలుగా వున్న ఒరిజినల్ ని కాస్తా, రైతు జీవితాల ఘోషగా మార్చేశారు. న్యాయవ్యవస్థ మీది కంటే,  రైతు జీవితాల ఏకరువే తెలుగు ప్రేక్షకులకి బాగా అర్ధమవుతుందని అనుకున్నారో, లేక ఒరిజినల్ లోని పాయింటు అసలు అర్ధం గాలేదో – మొత్తానికి తెలుగుకి ఒక అర్ధవంతమైన ఫ్రెష్ కథ లేకుండా చేశారు. హిందీలో తీసిన వాళ్ళు, దాన్ని తమిళంలో తీసిన వాళ్ళూ అంత వివేకం గల వాళ్ళు కారనేమో. 

          ఒరిజినల్  కాన్సెప్ట్ ఏమిటి-  నేరన్యాయవ్యవస్థలో బిచ్చగాళ్ళు మనుషులే కారన్న భావం ప్రబలడాన్ని ప్రశ్నించడం. రోడ్డు ప్రమాదం చేసి బిచ్చగాళ్ళని చంపేస్తే అదేమంత పెద్ద విషయం కాదన్నట్టుగా, వాళ్ళు పురుగులతో సమానమన్నట్టుగా వ్యవస్థలు పనిచేయడాన్నే చూపిం
చిందీ ఒరిజినల్. అట్టడుగు బిచ్చగాళ్ళ ప్రాణాలకి  కాంట్రాస్ట్ గా అత్యున్నత ధనికుడి మదం చూపించారు. ప్రాణం విలువని నిర్ణయిస్తున్న ఈ  ఆర్ధికపరమైన అంతరంతోనే  కాన్సెప్ట్ కి అర్ధం వుంటుంది. ఇలాకాకుండా దీన్ని రైతుల జీవితాలు వర్సెస్ ధనికుల ఆగడాలుగా మార్చేయడంతో సామాజిక గొడవై పోయింది!  సున్నితమైన ఒరిజినల్ కాన్సెప్టు బలై పోయింది. ఏమో, ఇలా వుంటేనే తెలుగు ప్రేక్షకులు బాగా అర్ధం జేసుకోగలుగుతారేమోనని మనం అర్ధంజేసుకోవాలేమో! 


ఎవరెలా చేశారు 
      అసలుకి ఇదొక కమెడియన్ నటించాల్సిన కథేనా అని ఎలిమెంటరీ ప్రశ్న వచ్చేస్తుంది. హిందీలో, తమిళంలో కమెడియన్లు దీని కథానాయకులుగా లేరు. అలాగని వాళ్ళు కమర్షియల్ హీరోలూ కారు. అందుకని వాళ్ళు పోషించిన పాత్రలు అంత సహజత్వంతో వున్నాయి. సప్తగిరి వచ్చేసి ఈ పాత్ర పోషించే సరికి మొత్తం వాతావరణమే మారిపోయింది. ఫీల్, టోన్, సున్నితత్వం, సహజత్వం అన్నీ గూడ్సు బండెక్కేశాయి. సప్తగిరికి అర్జెంటుగా మాస్ హీరో ప్రతాపం చూపించుకోవాలని ఉబలాటం. ఇక ఉబలాటం కొద్దీ ఊగులాట. వంకర్లు తిరిగిపోవడం, పిల్లి మొగ్గ లేయడం, కితకితలు పెట్టుకోవడం, దొంగోడి మారు వేషాలెయ్యడం, వీర ఫైట్లు చేయడం, ఫారిన్ కెగిరిపోయి హీరోయిన్ తో  డ్యూయెట్ వేసుకోవడం, ఇది చాలనట్టు పాత ఎన్టీఆర్, ఏఎన్నార్ ల స్టయిల్లో బెల్ బాటమ్స్ వేసుకుని స్టెప్పు లేయడం – అన్నిట్లో తను ఫస్ట్ అని తనని తాను  ప్రమోట్ చేసుకుంటున్నట్టు రెచ్చిపోవడం - ఇదంతా చేయడానికి ఎక్కడో బతుకుతున్న హిందీ ఒరిజినల్ ని తెచ్చుకుని బలి చేయనవసరం లేదు. ఈ పాటి కథ ఇక్కడే తనే రాసుకోవచ్చు. ఇలా తీసిన దీన్ని సుభాష్ కపూర్ కి కూడా చూపించి ఇన్స్ పైర్ చేయాల్సిన అవసరం  తప్పకుండా వుంది.  

        చివరి కోర్టు దృశ్యాల్లో తను రక్తి కట్టించి వుండొచ్చు. అంతవరకే తన గురించి ఇక్కడ చెప్పుకోవాల్సింది. కానీ ఈ రక్తి కట్టించిన దృశ్యాలు కూడా రైతుల గురించి - కాన్సెప్టుని ఇంకో దారి పట్టిస్తూ. 

       ఇక్కడ కాన్సెప్టు గురించి తప్ప ఒరిజినల్ తో వేరే పోలికలు తేకూడదు. హిందీకి ఆ నటులు (అర్షద్, బొమన్, సౌరభ్) కరెక్టు. వాళ్లతో తెలుగులో పోల్చనవసరం లేదు. ఈ దృష్ట్యా తెలుగుకి బడా లాయర్ పాత్రలో సాయికుమార్, జడ్జి పాత్రలో శివ ప్రసాద్ లు తమ పాత్రలకి చాలా చాలా న్యాయం చేశారు. ఒక్క న్యాయం చేయలేకపోయింది - మాస్ హీరోయిజపు యావకొద్దీ – సప్తగిరి మహాశయుడే. నటనంటే గూడ్సు బండి సరుకనుకుంటే ఇలాగే వుంటుంది. బుల్లెట్ ట్రైను ఇలా తప్పిపోతుంది. 

          హీరోయినమ్మ కశీషమ్మ కషాయపు బొమ్మ.  బుల్గానిన్ సంగీతం పిట్ట కొంచెం కూత ఘనమన్నట్టుంది. ఒక చిన్నపాటి సరళమైన కథని చెవులు చిట్లే రణగొణ ధ్వనులతో చూడాలా? ఇక పాటలకి కట్టిన ట్యూ న్లేమిటో అస్సలు మాస్ హీరోయిజానికి పనికిరావు. సారంగం కెమెరా వర్క్ సగటుగానే వుంది. 

చివరికేమిటి 
       తెలుగుకి కలిపిన దృశ్యాలు, ముఖ్యంగా పల్లెటూళ్ళో ఓపెనింగ్,  సప్తగిరి ఎంట్రీ లాంటివి చాలా  పురాతన సినిమా చూస్తున్నట్టు వుంటాయి. ఒరిజినల్ హిందీ – వాస్తవిక ధోరణిలో ఫ్రెష్ గా, కళ్ళకి కొత్తగా అన్పిస్తే, ఈ రీమేక్ జానర్ మర్యాదని కూడా కాపాడు కోకుండా రొటీన్ కమర్షియల్ మాస్ లాగా,  మూస ధోరణిలో చిత్రీకరించేశారు. కొత్త దర్శకుడు పాత వాసనతోనే తీశాడు. మాస్ హీరోగా సప్తగిరి కోరిక ప్రకారం సప్తగిరిని  ఎంత ఓవర్ యాక్షన్ తో, ఎంత ఒన్ మాన్ షోగా చూపించాలా అన్న ధ్యాసే సరిపోయింది మొత్తమంతా. సినిమాలో విషయంతో కాదు, సప్తగిరికి వేషాలతో కనెక్ట్ అవ్వాలన్న స్కీముతో చేసిన ఈ  ఓవరాక్షన్ హంగామా అన్నిటినీ తొక్కేస్కుంటూ వెళ్ళిపోయింది. ఇక అనుకున్నట్టు మాస్ ప్రేక్షకుల్ని  ఎంత తొక్కుతుందో, బాక్సా ఫీసుని ఇంకెంత  తొక్కుతుందో  ఎవరికి  వాళ్ళే చూసుకోవాలి.


సికిందర్
         



         





560 : రివ్యూ!


Wednesday, December 6, 2017

559 : టీనేజి నోయర్ స్క్రీన్ ప్లే సంగతులు -2

   ఎంపైర్ మేగజైన్ ఎంపిక చేసిన 500 గొప్ప చలన చిత్రాల్లో 449 వ స్థానం సంపాదించుకున్న ‘బ్రిక్’ కథ టీనేజి నోయర్ అనే కొత్త జానర్ ని ప్రతిపాదించింది. అంతవరకూ తొలితరం ఫిలిం నోయర్, మలితరం నియోనోయర్ సినిమాలన్నీ సీనియర్ పాత్రలతో  థ్రిల్లర్స్ గా వుండేవి. ‘బ్రిక్’ వచ్చేసి టీనేజి పాత్రలతో, టీనేజర్ల ప్రపంచాన్ని ఆవిష్కరించే, టీనేజి థ్రిల్లర్ గా యౌవనాన్ని సంతరించుకుంది. ఇందులో బ్రెండన్ హై స్కూల్ విద్యార్థి. అక్కడ హై స్కూల్ అంటే ఇక్కడ మన జ్యూనియర్ కాలేజి. ఇతను తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎమిలీ మృత దేహాన్ని కనుగొనడంతో కథ ప్రారంభమవుతుంది. ఈమె చనిపోక ముందు ఒక కాల్ చేసి, ప్రమాదంలో వున్నాననీ, రక్షించమనీ కోరింది. బ్రిక్ అనీ,  టగ్ అనీ, పిన్ అనీ, పూర్ ఫ్రిస్కో అనీ  ఏవో మాటలు పలికి అర్ధాంతరంగా కట్ చేసింది. బ్రెండాన్ ఆమె శవాన్ని దాచిపెట్టి, ఈ నాలుగు మాటల కర్ధాన్నీ,  వాటితో ఆమె మరణానికి గల సంబంధాన్నీ కనుగొనాలని అన్వేషణ మొదలెడతాడు.   

         
అన్వేషణలో హైస్కూల్లో ఐదుగురు అనుమానితులుగా కనిపిస్తారు. హైస్కూల్లో డ్రగ్స్ సరఫరా చేసే ‘పిన్’ కి ఏజెంట్లుగా పనిచేస్తున్న విద్యార్ధులు లారా, కారా, టగర్, బ్రాడ్, డోడ్ అనే వాళ్ళు. వీళ్ళ ప్రమాదకరమైన నెట్ వర్క్ ల్ తలదూర్చి ఎమిలీ హత్యకి కారణాలు తెలుసుకుని,  ప్రతీకారం తీర్చుకుంటాడు. క్లాస్ మేట్ బ్రయిన్ తోడుగా వుంటాడు. 

పాత్రలు 
బ్రెండన్ – ఎమిలీ – లారా – కారా 
       1. బ్రెండన్ :  కథానాయకుడు. ఒంటరి టీనేజర్. సీనియర్ నోయర్ హీరోలకి తీసిపోని టీనేజి నోయర్ హీరో, టీనేజి డిటెక్టివ్. సిగరెట్లు, మందు తాగని పాత్ర ఇతనొక్కడే. ఇతడి పాత్రోచిత చాపం (క్యారక్టర్ ఆర్క్) చూస్తే - ఇతను వేసుకునే ఫ్రెష్ గా వుండే వైట్ షర్టు పోనుపోనూ మాసిపోతుంది, చివరికి రక్తంతో ఎర్రబారిపోతుంది. డిటెక్టివ్ ల కుండే మెళకువలతో ఫ్రెండ్ బ్రయిన్ ఇచ్చే సమాచారంతో ఎమిలీ హత్యా శోధన చేస్తూంటాడు. కఠినంగా మాట్లాడతాడు.
          2. బ్రయిన్ : బ్రెండన్ ఫ్రెండ్. మాస్టర్ బ్రెయిన్. స్కూల్లో ఎవరేమిటో క్షుణ్ణంగా  తెలిసినవాడు. బ్రెండన్ కి సమాచారం చేరవేస్తూ, అనుమానితుల మీద నిఘా వేసి వుంటాడు.
          3. ఎమిలీ : కథానాయిక. బ్రెండన్ కి బ్రేకప్ చెప్పేసే, డ్రగ్ రాకెట్ లో ఇరుక్కుని ప్రాణాల  మీదికి తెచ్చుకునే టీనేజర్.
          4. లారా : వాంప్ పాత్ర. దుర్బుద్ధితో కథానాయకుడిని తప్పుదోవ పట్టిస్తూ వుండే తేనే పూసిన కత్తి.
          5. కారా : డ్రగ్ గ్రూపులో గ్లామర్ గర్ల్.
          6. టగ్ అలియాస్ టగర్ : స్కూల్లో డ్రగ్ ఏజెంట్, పిన్ కుడి భుజం.
          7. డోడ్ : ఎమిలీ కొత్త  బాయ్ ఫ్రెండ్.
          8. బ్రాడ్ :  ఫుట్ బాల్ ప్లేయర్, డ్రగ్స్ బానిస. 
          9. ది పిన్ : విలన్. డ్రగ్ రాకెట్ బాస్.
          10. ట్రూమన్ : హై స్కూల్ వైస్ ప్రిన్సిపాల్.

బ్రయిన్ - టగ్ - ది పిన్ -  డోడ్ - బ్రాడ్
***
            బ్రిక్స్క్రీన్ ప్లే 111 పేజీలుంది.  ఈ షూటింగ్ స్క్రిప్టులో ‘బ్లడ్ సింపుల్’ లో వున్నట్టు నిగూఢార్థాల వివరం లేదు. పాత్రల స్థితిగతులు, స్థల వర్ణనలు, వాతావరణ సృష్టి మాత్రమే వున్నాయి. ఈ టీనేజి నోయర్ లో  సాంప్రదాయ నోయర్ ఎలిమెంట్స్ అన్నిటినీ వాడుకోలేదు.  అంటే, 1. చారుస్కూరో లైటింగ్, 2. హై కాంట్రాస్ట్ , లాంగ్ షాడోస్3. డీప్ ఫోకస్, 4. ఎక్స్ ట్రీం హై,  ఎక్స్ ట్రీం లో- యాంగిల్స్, 5. టైట్ క్లోజప్స్,  6. కాంప్లెక్స్ షాట్స్,  7. కాంప్లెక్స్ మీసాన్సెన్ షాట్స్, 8. ఎసెమిట్రికల్ కంపోజిషన్, 9. బార్స్ డయాగోనల్, ఫ్రేమ్స్ వితిన్ ఫ్రేమ్స్, 10.  లాంగ్ ట్రాక్ షాట్స్11. అబ్ స్క్యూర్ సీన్స్12. డచ్ యాంగిల్స్ఇన్వర్టెడ్ ఫ్రేమ్స్13. వాటర్ అండ్ రిఫ్లెక్షన్స్14.మిర్రర్స్, 15. మోటిఫ్స్  మొదలైనవన్నీ లేవు. 

        ఇక్కడ క్లిక్ చేయండి  చిత్రీకరణ పరంగా ఈ కాలానికి కూడా సరిపోయే కొన్ని ఎలిమెంట్స్ నే వాడుకున్నారు. నోయర్ సాంప్రదాయంలో నేరస్థ ప్రపంచాన్ని చిత్రించదానికి వాడుకునే లో- యాంగిల్ షాట్స్, హై యాంగిల్ షాట్స్ నీ,  కొన్ని చోట్ల ఆందోళనకర పరిస్థితికి డచ్ యాంగిల్స్ నీ  వాడారు. లైటింగ్ తో నీడల్ని సృష్టించే టెక్నిక్ అనేక చోట్ల వుంది. పాత్రలతో చారుస్కూరో లైటింగ్ కూడా వుంది. చీకటిని ఎక్కువ ఆశ్రయించకుండా,  ఎక్కువగా ప్రకాశవంతమైన వాతావరణంతో వుండడం నోయర్ రూల్స్ ని బ్రేక్ చేయడమే. నోయర్ మూవీస్ నగర వాతావరణంలో, సంపన్న వర్గాలు  రాత్రి వేళల్లో పాల్పడే అనైతిక  బాగోతాలతో వుంటాయి. ఎలాటి మాస్ పాత్రలు గానీ, వాతావరణం గానీ కన్పించవు. రిచ్ క్యారక్టర్స్ తో క్లాస్ లుక్ తో వుంటాయి. ‘బ్రిక్’ కూడా టీనేజికి మారినప్పటికీ అదే రిచ్ క్యారక్టర్స్ తో క్లాస్ లుక్ తో వుంటుంది గానీ, నగర వాతావరణానికి బదులు టౌను వాతావరణానికి మారుతుంది. అదీ సాంప్రదాయ సెటప్ అయిన సంపన్న నివాస భావనాల్నుంచి హై స్కూలుకి మారిపోతుంది. ఈ ప్రొడక్షన్ డిజైన్ నోయర్ జానర్ మర్యాదల్ని జాగ్రత్తగా పునర్నిర్వచించినట్టు వుంటుంది. 

       నోయర్ మూవీస్ డిటెక్టివ్ ప్రధాన పాత్రగా వుంటాయి. అతను దారితప్పిన సంపన్నుల భరతం పట్టడమో, లేక ఆ సంపన్నులే తన భరతం పడితే పీక్కోలేక పోవడమో జరుగుతుంది. ‘బ్రిక్’  లో హీరో డిటెక్టివ్ అంటే వృత్తిగతంగా కాదు, డిటెక్టివ్ లా పనిచేసుకుపోయే పాత్ర మాత్రమే. ఇబ్బందుల్లో పడే హీరోయిన్, ఇబ్బందులు పెట్టే వాంప్ హీరోయిన్, ఒక విలన్, అతడి అనుచరులూ అనే సాంప్రదాయ సెటప్ అంతా వుంది. ఇక నోయర్ కథనాల్లో వాడే స్వగతం అనే వాయిసోవర్ ఇక్కడ లేదు. కలర్స్ విషయానికొస్తే లైట్ బ్లూ, గ్రే,  వైట్ టింట్స్  కనిపిస్తాయి. ముదురు రంగులు లేకపోవడంతో యూత్ ఫుల్ లుక్ తో వుంటుంది. లొకేషన్స్ నిర్జనంగా వుంటూ ఒకలాంటి మిస్టీరియస్ ఫీల్ ని కలగజేస్తూంటా యి. ఇక డైలాగుల విషయానికొస్తే సాంప్రదాయ హార్డ్ కోర్ నోయర్ డైలాగులే వుంటాయి, కాకపోతే ఇప్పుడు వాడే మాటలు కలిసివుం
టాయి. ఫిలిం నోయర్ డైలాగుల ఒక డిక్షనరీయే వుంది. నాటి  1930- 40 కాలపు  హాలీవుడ్ ‘మహా రచయితలు’ సృష్టించిన గమ్మత్తైన పదాలు. అలాటి భాష నేటి హై స్కూలు పాత్రలు మాట్లాడడాన్ని జాగ్రత్తగా సింక్ చేశాడు దర్శకుడు - రచయిత రియాన్ జాన్సన్. దీంతో ఈ భాషే ఒక ఆకర్షణ అయింది ఈ టీనేజి నోయర్ కి. 

          టీనేజి నోయర్ యూనివర్సల్. ఈ గ్లోబలైజేషన్ యుగంలో హద్దులు చెరిగిపోయాయి. ఎక్కడైనా ఏ భాషలో నైనా తీయవచ్చు. కాకపోతే అభిరుచి అవసరం. ఏ రుచీపచీ లేని పోసుకోలు కబుర్ల సినిమాలు తీయడానికి అలవాటు పడ్డ వాళ్లకి ఇదెలా తీయాలో ఎక్కదు. తీస్తే మాత్రం చుక్కెదురు లేదు. లేకపోతే ఇంకెన్నాళ్ళు ఇలా వొట్టి పోయిన రోమకామాలతో, దెయ్యం కేకలతో దివాలా తీయిస్తూ పోతూంటారు. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతూపోతున్న ఆధునిక  థియేటర్లలో అవే  లేకి ప్రేమలు! అవే వెకిలి దెయ్యాలు!! పల్లెటూళ్ళలో కూడా పనికిరాని పోకడలతో సినిమాలు తీసి ఆధునిక కాలపు 
థియేటర్ల పరువు మట్టిపాలు చేయడం !!!

(సశేషం)
సికిందర్

  




Saturday, December 2, 2017

టీనేజి నోయర్ స్క్రీన్ ప్లే సంగతులు -1


       నిర్మాణాత్మకంగా డార్క్ మూవీస్ తీయడమెలా అన్న శీర్షికన ఇంతకి ముందు ఈ జానర్ లో నియో నోయర్ మూవీగా 1984 లో విడుదలైన ‘బ్లడ్ సింపుల్’  గురించి కూలంకషంగా తెలుసుకున్నాం. అది ఆనాటి  అడల్ట్ క్రైం అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈనాటి టీనేజీ క్రైంతో నియో నోయర్ ఎలా వుంటుందో పరిశీలిద్దాం. నోయర్ సినిమాలు ఇతర రెగ్యులర్ సినిమాలకంటే, ఆర్ట్ సినిమాలకంటే కూడా, వాటికంటూ ఏర్పాటైన కొన్ని ప్రత్యేక నియమాలకి లోబడి ఎంత కళాత్మకంగా వుంటాయో ఇదివరకే చెప్పుకున్నాం. ఇప్పుడు ఇదే కోవలో టీనేజీ నియో నోయర్ ‘బ్రిక్’  ని విశ్లేషించుకోవడం మొదలెడదాం. ఈ వ్యాసపరంపర ఎన్నాళ్ళు కొనసాగుతుందో ఇప్పుడే చెప్పలేం. ‘బ్లడ్ సింపుల్’ కనీసం ఆరునెలలు కొనసాగింది.  2005 నాటి ‘బ్రిక్’ ఒక ఆశ్చర్యకర క్రియేషన్. అందుకే ఇది ఎన్నో అధ్యయనాలకి మూలమైంది ‘బ్లడ్ సింపుల్’ లాగే. దర్శకుడు రియాన్ జాన్సన్ ఒక షార్ట్ ఫిలిం తీశాక, 1997 లో ‘బ్రిక్’  స్క్రిప్టు రాశాడు. అప్పుడతడికి 24 ఏళ్ళే. ఈ వయసులోనే అతను జానర్ ని అధ్యయనం చేసి తొలిసినిమాతో అద్భుతాన్ని సాధించాడు.

          రియాన్ జాన్సన్ స్క్రిప్టు రాశాక ఆరేళ్ళు ప్రయత్నించాడు నిర్మాతల కోసం. స్క్రిప్టుని ముందు నవలగా రాశాడు. చాలా పూర్వం అంటే 1930 లలో బ్లాక్ అండ్ వైట్ లో ఫిలిం నోయర్ పేరుతో  ప్రారంభమైన ఈ జానర్  సినిమాలకి మూలాలు  ఆనాటి డెషెల్ హెమెట్ రాసిన హార్డ్ కోర్ డిటెక్టివ్ నవలల్లో వున్నాయన్న  సంగతి  తెలిసిందే. ‘బ్లడ్ సింపుల్’ కోసం కోయెన్ బ్రదర్స్ కూడా ఈ నవలల్లోనే జానర్ ని పట్టుకున్నారు. రియాన్ జాన్సన్ కూడా హెమెట్ నవలల్ని అధ్యయనం చేశాడు. హెమెట్ కల్పించిన  నోయర్ వాతావరణాన్ని, సంభాషణల్లో భాషనీ  స్క్రీన్ ప్లేలో పట్టుకోవాలంటే, ముందుగా హెమెట్ లాగా ‘బ్రిక్’ ని నవలగా రాసుకోవాలని నవల పూర్తిచేశాడు. ఆ నవలలోకి దింపిన నోయర్ వాతావరణాన్నిఆధారంగా చేసుకుని స్క్రీన్ ప్లే రాశాడు ( ఈ నవలా, స్క్రీన్ ప్లే రియాన్ జాన్సన్ వెబ్ సైట్లో పొందవచ్చు). 

       నిర్మాతలు ముందుకు రాకపోవడానికి, కొత్త కుర్రాడు ఇంత నియో నోయర్ భారాన్ని ఎత్తుకుంటున్నాడే అన్న భయమే కారణం. లాభం లేక మిత్రుల సహాయంతో ఐదులక్షల డాలర్ల అతి తక్కువ బడ్జెట్ తో,  2005 లో పూర్తి చేసి విడుదల చేస్తే, 39 లక్షల డాలర్లు వసూలు చేసింది. ఎనలేని కీర్తి ప్రతిష్టల్ని ఆర్జించి పెట్టింది. ఆధునిక నోయర్ సినిమాలకి ఒక గైడ్ లా మారింది. జాన్సన్ కనబర్చిన అనూహ్య సృజనాత్మక చమత్కారమేమిటంటే, ఇంకా హెమెట్ డిసైడ్ చేసిన జానర్ ని అడల్ట్ క్రైం నోయర్ గానే తీయనవసరం లేదు - హెమెట్ ని నేటి కాలపు ఆధునిక హైస్కూల్ నోయర్ రూపంలోకి,  యువతరపు థ్రిల్లర్ గానూ  అప్ డేట్ చేయ వచ్చనేది. కాబట్టి ‘బ్రిక్’ అప్డేట్ అయిన హెమెట్ అన్నమాట. 

          ‘బ్రిక్’ అంటే ఇటుక అని వేరే చెప్పనవసరం లేదు. ఈ మూవీలో ‘బ్రిక్’ కి అర్ధం ఏమిటంటే,  ఇటుకలాంటి ఘన రూపంలో వున్న హెరాయిన్ డ్రగ్ అన్నమాట. ‘బ్రిక్’ 11సార్లు వివిధ అవార్డుల్ని కూడా గెల్చుకుంది.  ఈ విజయం తర్వాత జాన్సన్ ది బ్రదర్స్ బ్లూ, లూపర్ తీశాడు. తాజాగా తీసిన ‘స్టార్ వార్స్ – ది లాస్ట్ జేడీ’ డిసెంబర్ ఎనిమిదిన విడుదలవుతోంది. ఇంతకీ ‘బ్రిక్’ కథేమిటి?  వచ్చే వ్యాసంలో చూద్దాం.

(సశేషం)

-సికిందర్  

Friday, December 1, 2017

557 : రివ్యూ!



రచన - దర్శత్వం: బి.వి.ఎస్‌. వి
తారాగణం : సాయిధమ్ తేజ్, మెహరీన్ పీర్జాదా, ప్రకాష్, కోట శ్రీనివాసరావు, నాగబాబుప్రన్న, సుబ్బరాజు, సత్యం రాజేష్, దితరులు
సంగీతం
: ఎస్‌.ఎస్‌.న్, ఛాయాగ్రహణం : కె.వి.గుహన్
బ్యానర్ : అరుణాచ
క్రియేషన్స్, నిర్మాత: కృష్ణ
విడుదల : డిసెంబర్ 1, 2017

***
     
తిక్క, విన్నర్, నక్షత్రం అనే మూడు వరస ఫ్లాపులతో అయోమయంలో పడ్డ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్,  ఈసారి దర్శకుడిగా మారిన బివిఎస్ రవితో దేశభక్తిని ప్రయత్నించాడు. కాకతాళీయంగానే దేశభక్తి మీద వరసగా సినిమాలొస్తున్నాయి. సీజన్ బావుంది. ‘జవాన్ – ఇంటికొక్కడు’ కూడా సరైన సమయంలో వచ్చింది. అయితే ముందుగా దేశభక్తి ఎవరికుండాలి? దాంతో ఏం చేయాలి, ఏం చేయకూడదు?  దేశభక్తి పేరు చెప్పి ఏదైనా చేసుకుపోవచ్చా? ఇది కూడా భావస్వాతంత్ర్యంలో భాగమేనా? ఈ భావస్వాతంత్ర్యంతో దేశభక్తిని ఎలా చూపించారో చూద్దాం...

కథ 
        హైదరాబాద్ లోని డిఆర్ డిఓ లో ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నాల్లో వుంటాడు జై (తేజ్). అతడి కుటుంబంలో తల్లిదండ్రులు, అన్నా వదినెలు, వాళ్ళ పిల్లలు వుంటారు. బయట భార్గవి (మెహరీన్) అనే వూరూపేరూ లేని అమ్మాయిని ప్రేమిస్తూంటాడు. డిఆర్ డిఓ ఒక ఆక్టోపస్ అనే క్షిపణి వ్యవస్థని  రూపొందిస్తుంది. దాన్ని కాజెయ్యాలని మాఫియాలు పథకమేస్తారు. ఇది జైకి తెలుస్తుంది. ఆక్టోపస్ ని  ఢిల్లీకి తరలిస్తున్నప్పుడు మాఫియాలు దాడి చేస్తారు. జై వాళ్ళని చంపి, ఆక్టోపస్ ని కాపాడి అందరి ప్రశంసలూ పొందుతాడు. కానీ మాఫియా కేశవ్ (ప్రసన్న) జై మీద పగబడ్తాడు. జై కుటుంబాన్ని నాశనం చేస్తానని సవాలు చేస్తాడు. ఇప్పుడు కుటుంబాన్ని కాపాడుకోవడానికి జై ఎలా సంఘర్షించాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ 
      దేశభక్తి ఇవ్వాళ హాట్ ఎమోషనల్ టాపిక్ గా వుంది. ఎందుకోమరి. సరిహద్దులో యుద్ధం కూడా లేదు. దేశద్రోహం పురాతన విషయం. ఇప్పుడు దేశభక్తితోనే పరవశించాలిగానీ,  దేశద్రోహం మీద రగల కూడదనే ధోరణిలో ఈ కథకూడా వుంది. విద్రోహులు ఏ దేశ ద్రోహానికైనా పాల్పడనీ, అది పెద్దగా పట్టించుకోకుండా, హీరో గారి దేశభక్తిని మాత్రమే గొప్పగా చాటే  అవకాశం  ఇవాళ్టి దేశభక్తి సినిమాలు కల్పిస్తున్నాయి. అంతేగానీ,  ‘దిల్ దియా హై జాన్ భి దేంగే యే వతన్ తేరే లియే’ లాంటి దేశభక్తి పాట మోగిస్తూ టెర్రరిజం మీద సుభాష్ ఘాయ్ తీసిన పవర్ఫుల్  ‘కర్మ’ లాంటిది ఇవ్వాళ తెలుగులో ఆశించకూడదు. శాసించిందే చూడాలి. సరిహద్దులో పోరాడితే అది దేశభక్తి, దేశం లోపల పోరాడితే అది పౌరవిధి అనే నిర్వచనాన్ని మార్చి ఈ కథ కూడా చూపిస్తుంది. సైనికుడిగా ‘బొబ్బిలిపులి’లో ఎన్టీఆర్ దేశంలోకొచ్చి అన్యాయాల్ని ఎదుర్కోవడానికి,  ఎవరికీ పట్టని పౌర బాధ్యతే తోడ్పడింది. పౌరులు తీసుకోవాల్సిన బాధ్యతని సైనికుడు తీసుకుంటే అది దేశభక్తి అవదు. పౌరుల చెంపమీద కొట్టినట్టు, ఒక మనిషిగా  పౌర బాధ్యతని గుర్తుచేయడం.  కానీ నేటి దేశభక్తి సినిమాలు పౌర బాధ్యతల్ని చూపించకుండా, పాత్రలకి దేశభక్తిని పులిమి వదల
డంతో - మొత్తంగా అవెలా తయారవుతున్నాయంటే – తలా తోక లేని కథలై పోతున్నాయి. 

ఎవరెలా చేశారు 
        సాయి ధరమ్ తేజ్ చాలా చేయగలడు. చేయించుకోవడం లేదు. సీనియర్ స్టార్లు చేసేసిన అప్పటి కాలంలో పనికొచ్చిన తీరు తెన్నులతోనే టెంప్లెట్ పాత్రలు,  నటనలు చేస్తే ఇప్పటి యంగ్ స్టార్ల ప్రత్యేకత ఏముంటుంది. బాలీవుడ్ లో ఈ పరిస్థితి లేదు. కాలాన్ని బట్టి కొత్త స్టార్లు వుంటున్నారు. తేజ్ ఈ జవాను కాని జవాను పాత్రలో మూసలోనే కన్పిస్తాడు. ‘కంచె’ లో వరుణ్ తేజ్ ట్రెండ్ లో కన్పిస్తాడు. రోమాన్సు, డాన్సులు,  పోరాటాలు సరే, తేజ్ వీటిలో ఫస్టు. డైలాగ్ డెలివరీ కూడా ఓకే. ఈ కష్టాన్నంతా పోషిస్తున్న పాత్రలే మింగేస్తున్నాయి. యాక్షన్ సీన్లే పాత్రని నిలబెట్టలేవు. పాత్రలో విషయముంటేనే నిలబడతాయి. దేశభక్తితో గానీ, ఇంటి సెంటిమెంటుతో గానీ, పౌరబాధ్యతతో గానీ తనేం చేశాడో చూస్తే – అన్నీ కలగాపులగమై ఏవేవో సీన్లు నటించి ఎటూ కాకుండా పోయాడు. పౌరబాధ్యత ఒకటే తన పాత్రయి వుంటే - ఆ పాత్ర నడిపించే కథ కూడా దార్లో పడేది. కథకి అతీతంగా పాత్రని చూస్తే సమస్యలు తప్పవు. 

          హీరోయిన్ మెహరీన్ పాత్రేమిటో, ఏం చేస్తూంటుందో, ఎక్కడ వుంటుందో, ఈమె కసలు ఆధార్ కార్డుందా, రోహింగ్యా అక్రమ వలసదారా అన్నట్టు వుంటుంది. ఒక ప్రేమ సన్నివేశం, ఒక పాట సందర్భం వచ్చినప్పుడల్లా వచ్చేసి ఆ డ్యూటీ పూర్తి చేసుకుని వెళ్ళిపోతుంటుంది. చాలా పాత మోడల్ ఫార్ములా టెంప్లెట్ హీరోయిన్ పాత్ర ఈ కాలం లోకొచ్చిపడి వెంటాడుతోంది. ఈమెకి వీసా, పాస్ పోర్టు, ఈ సినిమా టికెట్ కూడా లేవు. సెకండాఫ్ కాసేపటికి తనకే బోరు కొట్టినట్టు-  నీకు నేను డిస్టర్బుడుగా వున్నాను - అని హీరోతో అనేస్తుంది. ఓ పాటేసుకుని ఇక సినిమా వదిలేసి వెళ్ళిపోతుంది. నిజమే,  కథకుడికి ఈమె చాలా డిస్టర్బింగ్ గానే వుంది. అనవసరంగా నిర్మాత మీద భారం మోపాడు.  

          విలన్ పాత్రధారి ప్రసన్న ఓ మోస్తరు. తమన్ ఇంటర్వెల్ ముందు ఓ పాట, ఇంటర్వెల్ తర్వాత ఇంకో పాటా బాగా ఇచ్చాడు. గుహన్ కెమెరా వర్క్ లో ప్రత్యేకతలేం లేవు. డిజిటల్ వచ్చాక ఛాయాగ్రాహకుల ముద్రలు డీఐ తో ఒకే నమూనా కింద మారిపోయాక. ప్రొడక్షన్ విలువలు బావున్నాయి. 

చివరి కేమిటి?
        భావస్వాతంత్ర్యమే! దేశభక్తి కథ దేశభక్తి కథలా తీయకూడదా? లేదు, భావస్వాతంత్ర్యమనే హక్కుందిగా  – దాంతో ఎలాగైనా తీసుకోవచ్చు. దేశభక్తి కథలో దేశభక్తితో సంబంధం లేని చైల్డ్ సెంటి మెంటు పెట్టే భావస్వాతంత్ర్యం, ఫ్యామిలీ సెంటిమెంటు పెట్టే భావస్వాతంత్ర్యం, ఫ్రెండ్ షిప్ ని పెట్టే భావస్వా
తంత్ర్యం, టెంప్లెట్ ప్రేమని పెట్టే భావస్వాతంత్ర్యం, టెంప్లెట్ పాటలు పెట్టుకునే భావస్వాతంత్ర్యం, కథనే టెంప్లెట్ లో పడేసే  భావస్వాతంత్ర్యం.... భావస్వాతంత్ర్యం, భావస్వాతంత్ర్యం,భావస్వాతంత్ర్యం! అన్ని భావస్వాతంత్ర్యాలూ వుంటాయ్ నేటి తెలుగు దేశభక్తి సినిమా అంటే. 

          బివిఎస్ రవి తను ఇన్ని భావస్వాతంత్ర్యాలూ ప్రకటించుకోకపోతే ఏమైపోతుందో ఏమోనని– ఫ్యామిలీ వుండాలి, చైల్డ్ వుండాలి, లవ్ వుండాలి, ఫ్రెండ్ షిప్ వుండాలి,  క్లాస్ వుండాలి,  మాస్ ఫోక్ సాంగ్ కూడా వుండాలని  కంగారు పడిపోయి అన్నీ పెట్టేస్తూ పోతే –దేశభక్తి  మీద సినిమా తీయడమెందుకు? 

          ఒక్క పౌర బాధ్యత అనే ఏకసూత్రతని పట్టుకుని వుంటే,  ఈ దేశభక్తి ఎక్కడో వుండేది. విజువల్ మీడియా అసలు కిటుకేమిటంటే,  గొంతు చించుకుని దేశభక్తిని తెర మీద పారించాల్సిన అవసరం లేదు. అది థర్డ్ క్లాస్ దేశభక్తి అన్పించుకుంటుంది. ఈ పాటికి థియేటర్లలో జనగణమణకి ప్రేక్షకులందరికీ దేశభక్తి జీర్ణమయ్యే వుంటుంది. కేంద్ర ప్రభుత్వం బివిఎస్ రవిని ఈ బాధ్యతనుంచి ఎప్పుడో తప్పించినట్టే. ఇక ఆయన చూసుకోవాల్సింది, ఉన్న కథ ప్రకారం పాత్ర పౌరబాధ్యతలు నిర్వర్తిస్తోందా లేదా అనేదే. అప్పుడు  అంతర్లీనంగా దానికదే  ఫస్ట్ క్లాస్ దేశభక్తి ప్రవహిస్తుంది. సరిహద్దులో  సైనిక పాత్రలు కాక,  ఏ పాత్ర పడితే ఆ పాత్ర, ఎక్కడబడితే అక్కడ  దేశభక్తి అంటూ చెలరేగే హక్కుంటుందా? రవి కథలో పాత్రకి పౌర బాధ్యత లేదని కాదు, అది కొనసాగలేదు. కొనసాగి వుంటే మొత్తం కథా కథనాలూ దారిలో పడేవి. 

          ఇదెలాగో చూద్దాం. ఆక్టోపస్ ని మాఫియాలు కాజేస్తున్నారని తెలుసుకున్న హీరో,  ఆ పథకాన్ని తన తెలివి తేటలతో చిత్తు చేస్తాడు. ఇది పౌరబాధ్యత. ఫస్టాఫ్ లో అప్పటికి అతను డిఆర్ డిఓ లో చేరలేదు. అయితే ఈ పౌరబాధ్యత నిర్వర్తించడానికి చిన్నప్పట్నుంచీ అతను దేశభక్తి పరాయణుడని చూపించుకు రానవసరం లేదు. ఒక సగటు యువకుడిగా ప్రాణాలకి తెగించి అతను ఆ పౌరబాధ్యత నిర్వర్తిస్తే ఎక్కువ ప్రభావశీలంగా వుంటాడు. లేకపోతే దేశభక్తి అనే బ్యాగేజీ పాత్రని చెడగొడుతుంది. చెడగొట్టింది కూడా. ఇప్పటికి ఈ దేశభక్తి బ్యాగేజితో తనేదో అందరి కంటే భిన్నమైన వాణ్ణనీ, తనకున్నట్టు కొన్ని హంగులుంటేనే దేశభక్తి గల వారవుతారన్నట్టూ  ఇచ్చుకున్న బిల్డప్పులతో – సరే – ఎలాగో ఒక పౌరబాధ్యతంటూ పూర్తి చేశాడు. 

          తర్వాతేం చేశాడూ, ఆ పౌరబాధ్యతే మర్చిపోయి బేలగా తయారయ్యాడు. నీకొంప కొల్లేరు చేస్తానని అదే మాఫియా ఎక్కడ్నించో బెదిరిస్తూంటే పౌరబాధ్యత గుర్తుకురాలేదు. ఫస్టాఫ్ లో తన పౌరబాధ్యతతో టెక్నాలజీనుపయోగించి కుట్ర రహస్యాలు తెలుసుకున్న తనే, ఇప్పుడు అదే మాఫియా బెదిరిస్తూంటే వెంటనే పట్టుకునే ప్రయత్నం చేయాలనుకోడు. పైపెచ్చు- రారా,  నేను నా ఇంటిని కాపాడుకుంటాను, ఎవరింటిని వాడు కాపాడుకున్నోడే నిజమైన  జవాను - లాంటి థర్డ్ క్లాస్ హీరో డైలాగులేవో చెప్తాడు. ఈ ప్లేటు ఫిరాయింపు తోనే  సెకండాఫ్ మొత్తం దెబ్బతినిపోయింది.

          ఈ కథ రూపకల్పనలో అసలు జరిగిందేమిటో మనం వూహించగలం. ఇన్ని తప్పులకి బీజం ఎక్కడ పడిందో చూడగలం. ఎప్పుడైనా కథనాన్ని దాని కథ నిర్ణయిస్తుందా,  లేక కథకుడు ముందే వూహించుకున్నచట్రం నిర్ణయిస్తుందా? ఈ రెండోది జరిగినందుకే ఇంత కలగాపులగపు కథ. ఈ దేశభక్తి కథని ‘హీరో ఇంట్లో విలన్ మకాం వేయుట’ అనే కాలం తీరిన చట్రంలో, హీరో విలన్ ఇద్దరూ ఫ్రెండ్స్ అయి వుండాలనే  సెటప్ తో ముందే ఫిక్స్ అయిపోయాడు కథకుడు. అక్కడ్నించీ కథనల్లడంమొదలెట్టాడు. అప్పుడేమైందంటే – హీరో విలన్ ఫ్రెండ్స్ అనడానికి చిన్నప్పట్నించీ వాళ్ళ కథ నెత్తుకున్నాడు (ఓరిబాబో! ఇంకెన్నాళ్ళూ  ఈ చిన్నప్పట్నించీ స్పూన్ ఫీడింగ్ చేసే ముసలి చాదస్తపు చైల్దిష్ కథలూ!). హీరో దేశభక్తి  కలవాడనీ, విలన్ వ్యతిరేకి అనీ చెప్పడానికి ఈ పదినిమిషాల చిన్నప్పటి దృశ్యాలు. అప్పుడు ఈ మాఫియా విలన్ ని హీరో ఇంట్లో ప్రవేశపెట్టి డ్రామా చేస్తే, ఇతను చిన్నప్పటి ఫ్రెండ్ అని తెలియని హీరోతో అద్భుతమైన  కథవుతుందనుకున్నాడు కథకుడు. అలా ఇది ప్రాచీనకాలపు శ్రీనువైట్ల – కోన వెంకట్ బ్రాండ్ సింగిల్ విండో స్కీము అను ఏకగవాక్ష కుహరమైంది. ఏ హీరో అయినా- లేదా ఏ విలన్ అయినా, సెకండాఫ్ అనే సింగిల్ విండోలోంచి జారుకుంటూ వెళ్లి అవతల విలన్ ఇంట్లోనో, హీరో ఇంట్లోనో  ధబీమని పడే ఢమరుక నాదమేగా! 

          ఇలా హీరో విలన్ ఫ్రెండ్ షిప్, దానికి సింగిల్ విండో స్కీము అని ముందనుకుని, ఈ దేశభక్తి కథని అందులో నాగుల చవితి పాలులా పోశాడు కథకుడు. జానర్ మర్యాద లేదు, ఏమీ లేదు. ఇలా చేస్తేనే బాక్సాఫీసు మర్యాద వుంటుంది. అజిత్ నటించిన ‘వివేకం’ అనే టెర్రర్ వ్యతిరేక ఆపరేషన్ కథని ఇంటర్వెల్ తర్వాత హీరో,  అతడి ఫ్రెండ్ మధ్య మిత్రద్రోహ కథగా మార్చేస్తే ఏం జరిగింది? అదే ఇక్కడా జరిగింది. 

         ఇక జవాను కథ అనగానే వాడి కుటుంబానికి ముప్పు వచ్చే టెంప్లెట్ కూడా తప్పనిసరి కదా. నిన్నే  ఇది ‘ఆక్సిజన్’ లో చూశాం. మొన్నే"గరుడవేగ' లో చూసాం, అటు మొన్నే  ‘పటేల్ సర్’ లోనూ చూశాం.  కాబట్టి ఈ జవానుకీ ఓ కుటుంబం ఏర్పాటయ్యింది. టెంప్లెట్ ప్రకారం ఆ కుటుంబానికి మాఫియాతో ముప్పు అనే ఫార్ములా  ఒనగూడింది. ఇక విడిగా వేలాడే రోహింగ్యా హీరోయిన్ గ్లామర్ పోషణకి ఎలాగూ వుంటుంది. టెంప్లెట్  వరసలో ఏఏ పాట వుండాలో అవన్నీ వున్నాయి. చిన్నప్పటి హీరోతో చైల్డ్ సెంటిమెంటే గాక, ఇప్పుడున్న కుటుంబంలోనూ ఇద్దరు పిల్లలతో  ఆ సెంటిమెంటూ  భర్తీ అవుతోంది. ఈ విధంగా ఆక్టోపస్ అనే దేశరక్షణ మిసైల్ కథ సర్వాంగ సుందరంగా తయారయ్యింది - అది తప్ప, 

          ఆక్టోపస్ ని ఏదో దేశభక్తి అంటూ కరివేపాకులా వాడుకున్నారు. రక్షణ శాఖని హాస్యాస్పదంగా చూపించారు. ఇది కూడా దేశభక్తే నేమో. హీరోకి  సెకండాఫ్ లో డి ఆర్ డి ఓ లో జాబ్  వస్తుంది. వెళ్లి ఆక్టోపస్ చూసివచ్చేస్తాడు. మళ్ళీ జాబ్ కి వెళ్తున్నట్టే కన్పించడు. అసలు చెప్పుకుంటున్నట్టు సైంటిస్టు లానే వుండడు. 

          ఆక్టోపస్ ని ఢిల్లీ తీసుకు పోతూంటే మాఫియా దాడి చేస్తే, తిరిగి దాన్ని హైదరాబాద్ కే తెచ్చేశారా? ఎందుకు? రక్షణ శాఖ రూలు ప్రకారం దాన్ని విమానంలో తీసికెళ్ళక అంత దూరం రోడ్డు మార్గాన తీసుకెళ్లడం కథా  సౌలభ్యం కోసమేనా? 

          ఇప్పుడు కథ ప్రకారమే  కథనం చేస్తే ఎలా వుండచ్చో చూద్దాం – ఆక్టోపస్ కథే వుంటుంది. మరే కథా వుండదు. అవసరం లేదు, ఆ కథలు చూసుకోవడానికి వాటి జానర్స్ లో వేరే సినిమాలుంటాయి. ఇక్కడ అవ్వా కావాలీ బువ్వాకావాలీ అంటే కుదరదు.  ఏక సూత్రతతో ఒక క్లీన్ సింగిల్ యాక్షన్ లైన్ అవసరం -  హాలీవుడ్ హై కాన్సెప్ట్ ప్రకారం. మిగిలిన నకరాలన్నీ బంద్ చేసుకోవాలి. ఆక్టోపస్ కథ కేంద్రంగా పౌరబాధ్యత అనే యాక్షన్ లైన్ తో అంతర్లీనంగా దేశభక్తో మరోటో దానికదే విలీనమవుతుంది. 

          ఆక్టోపస్ అపహరణ ప్రయత్నం జరిగితే రక్షణ శాఖ చేతులు ముడుచుకు కూర్చోదు. ఆ దళాలన్నీ మాఫియాల్ని ఏరేయడానికి రంగంలోకి  దిగుతాయి. చీమల దండులా  పెరిగిపోతూ మాఫియాలూ వూరుకోరు. ఆక్టోపస్ చేజిక్కించుకోవడానికి దాడుల్ని ఉధృతం చేస్తాయి.  మొత్తంగా  స్పీల్ బెర్గ్ ‘రైడర్స్ ఆఫ్ ది  లాస్ట్ ఆర్క్’ సినేరియా. అందులో దైవశక్తి పూనిన ఆర్క్ కోసం జరిగే పోరాటంలాగే అత్యంత మహత్తుగల ఆక్టోపస్ కోసం హోరాహోరీ. కేవలం అద్భుత రసప్రధానంగా ఏకసూత్రతతో యాక్షన్. ఇక ఫ్యామిలీస్ చూడాలంటారా- ఉన్న హీరోయిన్ని ‘రైడర్స్ ఆఫ్ ది  లాస్ట్ ఆర్క్’ లోలాగా సరీగ్గా చూపిస్తే చాలు- ఇంకే కుటుంబాలూ పేరంటాలూ  అవసరం లేదు ఈ జానర్ కథలో.

-సికిందర్
https://www.cinemabazaar.in