రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, November 21, 2015

సు'కుమారీయం' !







దర్శకత్వం :  పల్నాటి  సూర్య ప్రతాప్ 

కథ-  స్క్రీన్ ప్లే : సుకుమార్ 
తారాగణం : రాజ్ తరుణ్
, హెబ్బా పటేల్, హేమ తదితరులు 
మాటలు : పొట్లూరి వెంకటేశ్వర రావు
, 
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
, ఛాయాగ్రహణం : ఆర్ రత్నవేలు 
బ్యానర్ : పి ఎ మోషన్ పిక్చర్స్
 
నిర్మాతలు :
  విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి
విడుదల :  20 నవంబర్ 2015 

                     ***


         ప్రేమ కథల్ని సైకలాజికల్ గా ఏదో మలుపు తిప్పి కొత్తగా చెప్పాలన్న తపన గల దర్శకుడు సుకుమార్ ఈసారి నిర్మాతగా మారి కొత్త దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. తను ఒక న్యూ ఏజ్ - మెట్రో లవ్ స్టోరీ లాంటి దాన్ని స్క్రీన్ ప్లే చేసి అందించారు. ఓ రెండు సినిమాలు- ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్తా మావాలతో యూత్ లో పాపులరైన హీరో రాజ్ తరుణ్ - తమిళ నటి హెబ్బా పటేల్ ల కాంబినేషన్ లో మొహమాట పడకుండా అడల్ట్ కంటెంట్ ని దట్టిస్తూ రియలిస్టిక్ ప్రేమకథ కోసం ప్రయత్నించారు. ఈ ప్రయత్నం  దర్శకుడు మారుతీ తీసిన ఓ రెండు మూడు అడల్ట్  కామెడీలకీ, లేదా మొన్న వచ్చిన తమిళ ‘త్రిష లేదా నయనతార’ అనే  అల్ట్రా అడల్ట్ కామెడీకీ తేడాగా ఏమైనా ఉందా- లేక ఏదో డేరింగ్ ప్రయత్నం  పేరుతో పర్వెర్టెడ్ సెక్స్ గా తయారయ్యిందా ఈ కింద చూద్దాం..

        సిద్దూ (రాజ్ తరుణ్) కేటరింగ్ కోర్సు చదివి ఆవారాగా తిరుగుతూ,  సింగపూర్ లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూంటాడు. అతడి తల్లి (హేమ) ఓ నర్సు. భర్త వేరే సంబంధం పెట్టుకున్నాడని ఇరవై ఏళ్ళ క్రితం అతణ్ణి వదిలేసి ఆమె కొడుకుతో ఉంటోంది. సిద్దూ కి ముగ్గురు ప్రెండ్స్ వుంటారు. చిల్లర దొంగ తనాలు చేసి బతికేస్తూంటారు. తాగుళ్ళు తిరుగుళ్ళూ అన్నీ జరిగిపోతూంటాయి. వాళ్ళు నేరాలు చసి అండర్ గ్రౌండ్ కి వెళ్లి పోయినప్పుడల్లా తను అన్నం తీసికెళ్ళి అందిస్తూ సాయంగా ఉంటాడు. 

        ఇలా వుండగా ఈ కాలనీలోకి ముంబాయి నుంచి కుమారి (హెబ్బా పటేల్) అనే ఒక బి గ్రేడ్ ఛోటా మోడల్ వచ్చి తాత తో కలిసి సెటిలవుతుంది. సిద్దూని చూడగానే క్లోజ్ అవుతుంది. లవ్యూ చెప్పేస్తుంది. ఆమె విపరీత ప్రవర్తన
, హద్దులు మీరిన మాటలూ అతణ్ణి తికమక పెట్టేస్తాయి. చొరవ చేసి ఆమె కిస్ కూడా చేసేసరికి, తన ముందు ఎక్స్ పోజ్ కూడా చేసేసరికి - సిద్దూ ఫ్రెండ్స్ హెచ్చరిస్తారు. ఆమెకి చాలా మంది బాయ్ ఫ్రెండ్ వుండి  ఉంటారనీ, క్యారక్టర్ మంచిది కాదనీ నూరి పోస్తూంటారు. ఇతర అబ్బాయిల్ని జస్ట్ ఫ్రెండ్స్ అని ఆమె తెగ తిరిగేస్తూంటుంది. ఆమె ఎలా కన్పించినా, ఎవరేం చెప్పినా సిద్దూ ఆమెని ప్రేమించేస్తాడు. కానీ అనుమానం తీరక ఆమె క్యారక్టర్ ని పరీక్షించబోయి దొరికిపోతాడు. దీంతో ఆమె ఛీ కొడుతుంది. నన్ను ప్రేమించే మెట్యూరిటీ నీకు లేదని గుడ్ బై కొట్టేస్తుంది.
 

        హర్టయిన  సిద్దూ ఆమెకో చాలెంజి విసిరి, ఆ మేరకు వేరే అమ్మాయితో తిరగడం మొదలెడతాడు. మనం ప్రేమించే మనిషి వేరొకరితో తిరిగితే ఎలా వుంటుందో ఆమె తెలుసుకోవాలని ఇలా చేస్తూంటాడు. ఈ పంతాలు పట్టింపులూ రకరకాల మలుపులకి దారితీస్తాయి. పరిస్థితి విషమంగా మారుతుంది. అప్పుడు ఆమె గతం గురించి తెలుసుకున్న సిద్దూ మనసుమార్చుకుంటాడు. ఇంతలో ఒక అనూహ్య సంఘటన జరుగుతుంది. చివరికి వీళ్ళిద్దరూ ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ.

ఎలావుంది కథ 
        యూత్ కి కనెక్ట్ చేయాలని తపన పడ్డ కథ. మారుతీ సినిమాలతో ద్వంద్వార్థ, ఏకార్ధ రోమాంటిక్ కామెడీలు యూత్ లో చెడ్డ పేరు తెచ్చుకుని అంతరించిపోయిన నేపధ్యంలో, మొన్నే ‘త్రిష లేదా నయనతార’ అనే మరో అడల్ట్ మూవీనీ మట్టి కరిపించిన పూర్వరంగంలో, సుకుమార్ అనే బ్రాండింగ్ తో వచ్చినందుకు కొంతవరకూ ప్రేక్షకులు ఔదార్యం చూపించగల బోల్డ్- సెక్స్- కండోమ్స్ సహిత అడల్ట్ కథ. ఆధునికత అంటే అవధుల్లేని విశృంఖలత్వమనే ధోరణికి ఎక్కువగా లోబడి సాగే కథ. ఇంటలెక్చువల్ గా దర్శకుడి నుంచి పైస్థాయి వ్యక్తీకరణల్ని డిమాండ్ చేసే కథ. ఎప్పుడైతే మెచ్యూరిటీ అనే పాయింటు హీరో హీరోయిన్లని విడదీసిందో, అది కథకుడి/ దర్శకుడి మెచ్యూరిటీని కూడా సవాలు చేయడంతో, చేతులెత్తేసి ఈజీ సొల్యూషన్ కోసం  రొటీన్ ఫార్ములా బాట పట్టే గాయపడ్డ రియలిస్టిక్  కథ. సమస్యని పరిష్కరించడానికి విధి లేనట్టు అరిగిపోయిన ఫాల్స్ డ్రామాతో- ఒకింత మెల్ షావెనిజంతో-  అకారణంగా హీరోయిన్ని శిక్షించి సంతృప్తి పడే కథ.  హిందీలో క్రేజ్ సంపాదించుకున్న  ప్యార్ కా పంచనామాలాంటి రియలిస్టిక్ రిలేషన్ షిప్స్ తో ఉండాల్సిన కథ మరోవైపు సీరియెస్ నెస్ ఎక్కువైపోయి- రోమాంటిక్ కథలాగాక, డార్క్ మూవీగా  మారిపోయిన హెవీ, స్లో నేరేషన్ కథ. ఇలాటి డార్క్ మూడ్ తో పవన్ కళ్యాణ్ నటించిన ఫ్లాప్ మూవీ ‘పంజా’ ఈ సందర్భంగా గుర్తుకు రాకమానదు.

ఎవరెలా చేశారు.
        రాజ్ తరణ్ కిది భిన్నమైన పాత్రే.. మొదటి రెండు సినిమాలకంటే అర్బన్ ఫ్లేవర్ వున్న పాత్ర పోషించాడు. పాత్రకి తగ్గట్టే నటనని డౌన్ ప్లే చేసినా, సెకండాఫ్ కొచ్చేసరికి మారిపోయిన ఫార్ములా సరళికి తగ్గట్టే తనూ ఫార్ములా హీరో పాత్రగా మారిపోవాల్సి వచ్చింది. కొన్ని ఫీల్, సెంటిమెంట్స్ వున్న సీన్స్ లో ఓవరాక్టింగ్ కి దూరంగా వున్నాడు. రెండు మాస్ పాటలతో ప్రేక్షకులకి హుషారెక్కించాడు. తనకంటే హీరోయినే ఎక్కువ ఫన్నీగా ఉంటూ, తను ప్రేక్షక మాత్రుడిగా వుండి పోవడంతో కామెడీ ఏదైనా వుంటే అది హీరోయిన్ ఖాతాలోనే పడిపోయింది. 

        హీరోయిన్ హెబ్బా పటేల్ టైటిల్ రోల్ కి సరీగ్గా సరిపోయేఫిజిక్ నీ, మేనరిజమ్స్ నీ  సంతరించుకుని- కుమారి అనే క్యారక్టర్  గుర్తుండి పోయేలా చేసింది. ఓ పట్టాన అర్ధంగాని సంక్లిష్ట అమ్మాయి పాత్ర  ఇది. ఈ పాత్ర డిమాండ్ చేసే భిన్న మూడ్స్ నీ, విభిన్న షేడ్స్ నీ చాలా అనుభవమున్న నటిలా నటించేసింది.  మంచిదో చెడ్డదో, ఈ రకంగానైనా  తెలుగు సినిమాల్లో కరువైపోయిన బలమైన హీరోయిన్ పాత్ర కొరత తీరిపోయింది. దీనికి సుకుమార్ నీ, ఇందుకు ఒప్పుకున్నా హీరో రాజ్ తరుణ్ నీ అభినందించాలి. 

        దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, రత్నవేలు ఛాయాగ్రహణం ఈ సినిమా కథ డిమాండ్ చేసే డార్క్ మూడ్ నే  క్రియేట్ చేశాయి. కొత్త దర్శకుడి  విషయానికొస్తే, ఈయన వెనుక అన్నిటా సుకుమార్ చేయి వున్నట్టన్పిస్తుంది. సుకుమార్ ముద్రతోనే మూవీ కన్పిస్తుంది. దీంతో కొత్త దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ పాత్ర ఎంతో తెలిసే అవకాశం లేకుండా పోయింది.


(స్క్రీన్ ప్లే సంగతులు రేపు!)
-సికిందర్  





Sunday, November 15, 2015

జువాలజీ !








దర్శకత్వం : వి. వి.వినాయక్ 


తారాగణం :  అఖిల్ అక్కినేని, సాయేషా సైగల్, బ్రహ్మానందం, మహేష్ మంజ్రేకర్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, జయప్రకాష్ రెడ్డి తదితరులు.

సంగీతం : అనూప్ రూబెన్స్, ఎస్ ఎస్ తమన్,  ఛాయాగ్రహణం : అమోల్ రాథోడ్ 
కథ : వెలిగొండ శ్రీనివాస్, మాటలు : కోన వెంకట్ 
బ్యానర్ : శ్రేష్ట్  మూవీస్, నిర్మాతలు : నితిన్, సుధాకర్ రెడ్డి 
***

    మధ్య ఏ నట వారసుడి ఎంట్రీ కీ జరగనంత ప్రచారార్భాటంతో ఈ వారం ప్రేక్షకుల ముందు కొచ్చిన  అఖిల్,  అక్కినేని వంశం నుంచి మూడో తరం యువ నటుడిగా, తన పేరే టైటిల్ గా పెట్టుకుని తెలుగు తెరకి పరిచయమయ్యాడు. ( ఏడాది పసి వాడుగా వున్నప్పుడు ‘సిసింద్రీ’ అనే సూపర్ హిట్ లో నటించాడు, మొన్నే ‘మనం’లో అరనిమిషం పాటు అప్పీయరెన్స్ ఇచ్చాడు).  సాధారణంగా వారసుల పరిచయ సినిమాలు ప్రేమ కథలై వుంటాయి. అలాటిది అఖిల్  ఏకంగా ఓ భారీ స్థాయి సోషియో- ఫాంటసీ యాక్షన్ మూవీకే తెరతీయడం సాహసమే. పైగా దీన్ని సాటి స్టార్ నితిన్ నిర్మించడం ఇంకో అపూర్వ ఘటన. తను ఏం తీసిపోనట్టు  అక్కినేని నాగార్జున కూడా   టాప్ డైరెక్టర్ వివి వినాయక్ చేతుల్లో కుమారుడు అఖిల్ ని పెడుతూ ఆయనకీ సవాలు విసిరారు. ఇలా అఖిల్, నితిన్, నాగార్జున, వినాయక్ లందరికీ ఇది చాలా ప్రతిష్టాత్మక వ్యవహారంగా మారడమే గాక, ఇందరేసి సెలెబ్రిటీలంతా  ఒకచోట కూడి ఏం చేశారబ్బా అన్న క్యూరియాసిటీని  కూడా అమాంతంగా ప్రేక్షకులకి పెంచేసి,  ఇక దీంతో దీపావళిని ఎంజాయ్ చేయండంటూ చేతులు జోడించారు. ప్రేక్షకులు ఆనందోత్సాహాలతో థియేటర్లకి పరుగులు  పెట్టారు. ఆ తర్వాతేమయ్యారు? ఏమన్నారు? అఖిల్ నీ, సినిమానీ కొనియాడారా,  లేక పండగ మూడ్ అంతా పాడుచేసుకుని ఎటో వెళ్ళిపోయారా- మళ్ళీ తెలుగు సినిమాల వైపు రాకూడదంటే రాకూడదని ఒట్టేసుకుని? 

         సందేహం లేదు, వరుసగా తెలుగు సినిమాలిలాగే భారీ స్థాయిలో వచ్చి రాక్షస బల్లుల్లా ప్రేక్షకుల్ని ఇంకా బెదర గొడుతూనే వుంటాయి. రాక్షస బల్లుల్ని రాజహంసల్లా మార్చే దెలా? మార్చేదెవరు? అసలా మార్చే ఆలోచనంటూ వుందా? నెవ్వర్, ముందు  క్వాలిటీ రైటింగ్ అనేది తెలిస్తే కదా మార్చే ఆలోచన వచ్చేది.  ఏ జవాబుదారీ తనమూ లేకుండా, ఎంత అరాచకంగా పది రూపాయల బ్యాడ్ రైటింగ్ వుంటే దానికి అన్ని కోట్లు కట్టి మరిన్ని పదుల కోట్లు కూడా ధారబోసి ఒక రాక్షస బల్లిని తయారు చేసుకుంటున్నప్పుడు, వేరే ఆలోచనలకి టైముండదు! అర్జెంటుగా ఒక అట్టర్ ఫ్లాపు తీయడానికి టైం చాలా చాలా ఇంపార్టెంట్! ఫ్లాపయ్యాక విశ్లేషణలు చేసుకోవచ్చు, ముందు జాగ్రత్తల జోలికి మాత్రం వెళ్లొద్దు!
    బ్యాడ్ రైటింగ్ తోనే బిగ్ నేమ్స్!!

గోళమే గందరగోళం 
      పూర్వకాలంలో ఎప్పుడో కొందరు ఋషులు భూగోళం బాగోగుల కోసం,  ‘జువా’ అనే ఒక గోళాన్ని తయారు చేసి తీసికెళ్ళి భూమధ్య రేఖ దగ్గర ఓ ఆఫ్రికన్ గూడెం లో పడేస్తారు. సూర్యగ్రహణాలు  పూర్తయ్యాక వెలువడే తొలి సూర్య కిరణాలు చాలా ప్రమాదకరమని వాళ్ళు నమ్ముతారు. కనుక ఆ తొలి సూర్య కిరణాలు ఈ ‘జువా’ గోళం మీద పడితే వాటి దుష్ప్రభావం నుంచి భూగోళం తప్పించుకుంటుందని శాస్త్రం చెప్తారు (ఓజోన్ పొర ఏం చేస్తున్నట్టో మరి). అలా ఆ గోళాన్ని గూడెం వాసులు తరతరాలుగా కాపాడుకొస్తూంటారు. దీని గురించి తెలుసుకున్న ఖత్రోచ్చి అనే ఒక రష్యన్ సైంటిస్టు (ఖత్రోచ్చి అనేది రష్యన్ పేరు కాదు, ఇటాలియన్ పేరు. బోఫోర్స్ కేసుతో ఒట్టోవియో ఖత్రోచ్చి పేరు పాపులరయ్యింది. ఖత్రోచ్చి అంటే ఇటాలియన్ లో ‘నాలుగు కళ్ళు’)-   దాన్ని కాజేసి ప్రపంచాన్ని ఆడించాలని కుట్ర పన్నుతాడు. ఆ గోళం అతడి గ్యాంగ్ చేతిలో పడకుండా, బోడో అనే గూడెం వాసి ఒకడు తీసుకుని పారిపోతాడు. వాణ్ణి వెతికి పట్టుకునే పనిలో వుంటుంది ఆఫ్రికన్ గ్యాంగ్.

        ఇక్కడ్నించీ  ఇంకో కథలో కొస్తే, ఇక్కడ  సిటీలో అఖిల్ ( అఖిల్) అనే అనాధ,  స్ట్రీట్ ఫైట్లూ బెట్టింగులూ అవీ చేస్తూ డబ్బులు సంపాదిస్తూంటాడు. ఈ అనాధకి చదువు సంధ్యల్లేవు ( శుభమా అంటూ డీసెంట్  కుర్రాడి లుక్ తో రంగ ప్రవేశం చేస్తూ అఖిల్ కూడా ఇతర హీరోల్లాగే అక్షరజ్ఞానం లేని ఆవారా అనాధ పాత్రకి బలైపోక తప్పలేదు-  ఇక్కడ్నించే మొదలు సంపూర్ణ బ్యాడ్ రైటింగ్ గ్రహణం! దీని గ్రహణా ననంతర కిరణాలకి బాక్సాఫీసే భస్మమైపోయింది! కాపాడేందుకు ఏ గోళాలూ ఇక  ఋషులు కూడా  కనిపెట్టలేరు- టైటిల్లో  ట్యాగ్ లైను గా పెట్టిన ‘ది పవరాఫ్ జువా...’  కాస్తా  ది పవర్ ఆఫ్ జువాలజీగా మారిపోయింది- స్క్రిప్టాలజీని పూర్తిగా నిషేధిస్తూ..)  ఇతను చూడగానే మెడిసిన్ చదివే దివ్య ( సాయేషా సైగల్) అనే డబ్బున్న అమ్మాయిని ప్రేమించేస్తాడు. ఆ అమ్మాయి కాలేజీకి తెచ్చుకుని ఏంచక్కా చిన్నపిల్లలా  ఆడుకునే పెంపుడు కుందేలుకి వెటర్నరీ డాక్టరుగా మారిపోయి గుండాపరేషన్ కూడా  చేసేసి ఔరా అన్పిస్తాడు. ఇంత చిన్న మెడికోకి అప్పటికే పెళ్లి కూడా సెటిలైపోయి వుంటుంది (ఈ కాలం అమ్మాయైతే ఈ వయసులో పెళ్లిని పుట్ బాల్ ని తన్నినట్టు తన్ని తన చదువూ భవిష్యత్తూ చూసుకుంటుంది ముందు).  ఆ పెళ్లిని కూడా చెడగొడతాడు. దీంతో ఆమె తన పరువే  పోయినట్టు ఫీలయిపోయి- వేరే అమ్మాయితో పారిపోయిన ఆ పెళ్లి కొడుకు ( వెన్నెల కిషోర్) అంతు చూడాలని సాక్షాత్తూ స్పెయిన్ కే  వెళ్ళిపోతుంది. ఇది తెలిసి, తను అర్జెంటుగా  స్ట్రీట్ ఫైట్లు చేసి ఓ రెండు లక్షలు ఆపరేషన్ కి అవసరమున్న ఇంకో ఆవిడకిచ్చి  కన్నీళ్లు కార్పించి, మిగిలిన రెండు లక్షలతో తనుకూడా స్పెయిన్ కెళ్ళి పోతాడు - తను పెళ్లి చెడగొట్టిన అమ్మాయిని ప్రేమించేందుకు. 

        అక్కడ ఇతడ్ని చూసి ఇంకింత ద్వేషిస్తుంది. ఆపాటికి తన పెళ్లి చెడగొట్టడంలో ఇతడి హస్తం కూడా వున్నట్టు తెలుసుకుంటుంది. ఇంతలో  ఆ ‘జువా’ గోళ రహస్యం ఈమెకి తెలుసన్న సమాచారంతో ఖత్రోచ్చి గ్యాంగ్ వచ్చిపడి  ఈమెని కిడ్నాప్ చేస్తారు. ఆ గ్యాంగ్ ని పట్టుకోవడానికి ఆఫ్రికా వెళ్తాడు అఖిల్. ఇక అక్కడ ఆమెని ఎలా కాపాడుకున్నాడు, ఆ గోళం ఏమయ్యింది, దాన్ని  శత్రువులకి దొరక్కుండా గూడేనికి తెచ్చి పడేశాడా  అన్నవి మిగతా కథలోని విశేషాలు.

ఎలావుంది కథ

      హాలీవుడ్ లో దీన్ని హై కాన్సెప్ట్ స్టోరీగా భావించి కళ్ళకద్దుకుని అద్భుతాలు చేస్తారు. కానీ ‘అఖిల్’ సృష్టికర్తలు ఈ కాన్సెప్ట్ విలువని గుర్తించలేకపోయారు. ఇది పేరుకే సోషియో ఫాంటసీ, చూపించేదంతా రొటీన్ మూసఫార్ములా లవ్ స్టోరీ.  డజను అట్టర్ ఫ్లాపులు చవిచూసి వున్న హీరో నితిన్, ట్రెండీ లవ్ స్టోరీస్ లో నటిస్తూ  అనూహ్య విజయాలు సాధించడాన్ని చూస్తున్నాం.  అలాటిది నిర్మాతగామారి ఇంత  పాత మూస ప్రేమగోలని నిర్మించడం షాకిస్తుంది. కథలో సూర్య తాపం- గోళం- కుట్ర గట్రా  యాంగిల్ ఎక్కడా ప్రేక్షకులని ఆకట్టుకునే, అసలు అర్ధమయ్యే ప్రసక్తే లేదు. తెలుగులో ఏ  ఫాంటసీలు  తీసినా అవి ప్రేక్షకులకి కనెక్ట్ అవుతూనే వచ్చాయి. ప్రస్తుత ఫాంటసీ లాజిక్ కూడా లేని తూతూ మంత్రపు కబుర్లుగానే తేలిపోయింది.  


ఎవరెలా చేశారు      అఖిల్ ని స్టార్ హీరోగా ఒక డెమో ఇప్పించే ఉద్దేశంతో ఈ సినిమా తీసినట్టు అన్పిస్తుంది తప్పితే మరొకటి కాదు. గతంలో కొందరు వారసుల విషయంలో ఇలాగే  జరిగింది.  ఈ ప్రయత్నంలో అఖిల్ ని అప్పుడే మాస్ హీరోగా ప్రెజెంట్ చేయడానికీ వెనుదీయలేదు. మాస్ పాత్రలు, ఫైట్లూ పాటలూ బాగా చేస్తాడని చూపించాలన్న ఆతృతే ఎక్కువ కన్పిస్తుంది. అఖిల్ నటించగలడు, అయితే ఇంకా చాలా పాలిష్ అవ్వాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా అవసరమైన కామెడీలో తను మైనస్. దీన్ని సరిదిద్దుకోవాలి. మంచి స్క్రీన్ ప్రెజెన్స్ వుంది. తెరమీద కనపడితే ఒక బ్యూటీని తీసుకు రాగలడు. అయితే తను నటనలో ఇంకా శిక్షణ పొందేటప్పుడు యాక్టివ్ పాత్రంటే ఏమిటో, పాసివ్ పాత్రంటే ఏమిటో కూడా విధిగా తెలుసుకోవాలి. ఎక్కడా పాసివ్ పాత్ర ఛాయలు కనపడని యాక్టివ్ పాత్ర చిత్రణలుండేట్టు జాగ్రత్త తీసుకోవాలి. పాసివ్ పాత్రలతో సినిమాలు తీస్తున్నామని దర్శకులూ రచయితలూ ఇంకెన్నాళ్ళకీ తెలుసుకోలేరు. అదో ఖర్మ, అంతే. తను వాళ్ళ ట్రాప్ లో పడకుండా చూసుకోవాలి.  ఈ సినిమా ఇంత వరస్ట్ గా తయారయ్యిందంటే మొట్ట మొదటి కారణం, తెలీక తను పనికిరాని పాసివ్ పాత్రని పోషించడమే!

        కొత్త హీరోయిన్ సాయేషా  సైగల్  అఖిల్ కి సరీగ్గా సరిపోయిన జోడీ. ఇద్దరి మధ్యా  రోమాన్స్ గనుక ట్రెండీ గా వుండి వుంటే, ఈమె తమన్నా అంత క్రేజ్ ఈ ఒక్క సినిమాతో నే సంపాదించుకుని వుండేది. నిత్యా  మీనన్ కూడా ట్రెండీ లవ్ స్టోరీస్  తోనే యువ హృదయాల్లో తిష్ఠ వేసిందన్నది మరువ కూడదు. సాయేషా ఈ ఒక్క సినిమాతో కనుమరుగయ్యే గ్లామర్ బొమ్మ మాత్రం కాదు. ఇక బ్రహ్మానందం  కామెడీ రెండు మూడు సీన్లలో అదీ ఆఫ్రికన్ జాతి వాళ్ళతో మాత్రమే ఫర్వాలేదు. అయితే మళ్ళీ కన్ఫ్యూజ్ కామెడీయే తనకి శరణ్యమైంది అన్ని సినిమాల్లో లాగే. ఇంకో సహాయ పాత్రలో వెన్నెల కిషోర్ కామెడీ కూడా పెద్దాగా వర్కౌట్ కాలేదు. ఓ సీనులో మాత్రమే వచ్చిపోయే  సప్తగిరి సైతం డిటో. మెడికల్ కాలేజీ డీన్ గా రాజేంద్ర ప్రసాద్  డి కూడా ఫస్టాఫ్ లో చాలా త్వరగా ముగిసిపోయే పాత్రే. ఇక విలన్ గా తెలిసిన మహేష్ మంజ్రేకర్ తండ్రి పాత్రలో సాఫ్ట్ రోల్ లో కన్పిస్తాడు గానీ, అద్భుతాలేం చెయ్యడు.

       మ్యూజికల్ గా- అనూప్ రూబెన్స్, ఎస్ ఎస్ తమన్ ల సంగీతం లో బాణీలు హుషా రెక్కిస్తాయి. వీటికి జానీ సమకూర్చిన డాన్సులు చెప్పుకోదగ్గవి. మణిశర్మ నేపథ్య సంగీతం ఆయన మూస ధోరణిలోనే వుంది. రవి వర్మ ఫైట్స్ ఫర్వాలేదు, అలాగే అమోల్ రాథోడ్ కెమెరా వర్క్ కూడా. గ్రాఫిక్స్ వర్క్ అంతా డార్క్ లో యాక్షన్ సీన్స్ కి సంబంధించి మాత్రమే చేశారు. హీరో హీరోయిన్ల రోమాన్స్ కి సంబంధించి కనువిందు చేసే ఎలాటి ఫాంటసికల్ సీజీ వర్క్ కూడా చేయలేకపోయారు.

స్క్రీన్ ప్లే సంగతులు 
      ఎవరైనా కమర్షియల్ సినిమా స్క్రీన్ ప్లే రాయడం ఎలా మొదలెడతారు- కథని అనుకునా? పాత్రని అనుకునా? తరచూ మనకి విన్పించే స్టేట్ మెంట్స్ ఏమిటంటే-  కథే హీరో అని! కథని నమ్ముకోవాలని! సినిమాలో కథ కనపడాలని! ఇలాటివి నమ్మి తీస్తున్నందువల్లేనేమో  అట్టర్ ఫ్లాపవుతున్నాయి సినిమాలు. 


       కథే హీరో ఎలా అవుతుంది? కథనే ఎలా నమ్ముకుంటారు?  కథ మాత్రమే సినిమాలో ఎలా కనపడుతుంది? కథకి  అంత  గొప్ప స్వతంత్రత వుంటుందా? అంత సొంత అస్తిత్వం దానికుంటుందా? దానికదే కథ పుట్టుకొచ్చేస్తుందా? ఎవరో పుట్టిస్తే పుట్టే కథ హీరో ఎలా అవుతుంది? ఆ ఎవరో ఒక హీరోపాత్ర అయినప్పుడు- ఆ హీరో పాత్ర పుట్టించకుండా కథెలా పుడుతుంది? తనెలా హీరో అయిపోతుంది కథ, హీరోపాత్రని వదిలేసి ? తనెలా సినిమా అంతటా పర్చుకుని కనపడుతుంది కథ, హీరో పాత్ర లేకుండా? కథ లేకుండా హీరో ఉండొచ్చు, హీరో లేకుండా కథ ఉంటుందా? ఎవరిక్కావాలి కథ? అవగాహన వున్న రచయిత/ దర్శకుడు అయితే కథ ఆలోచించడమన్న ఆలోచననే తీసి అవతలకి విసిరేసి పాత్రని పట్టుకుంటాడు. పాత్రని పట్టుకుని సాగిపోతూంటాడు. ఎంతసేపూ అతణ్ణి దొలిచేసేది పాత్ర నడకే. కథ నడక కాదు. ఆస్కార్ అవార్డులు పొందుతున్న  సినిమాలన్నీ పాత్రల వల్ల అవార్డులు పొందుతున్న సినిమాలే. పాత్ర లేకపోతే  సోదిలోకి కూడా రాదు కథ. 

        దురవగాహనతో ఇచ్చేసే స్టేట్ మెంట్లు కొంపలు ముంచుతాయి. అలాటి స్టేట్ మెంట్ల  ప్రకారమైతే ఆర్ట్ సినిమాలకి పని కొచ్చే  కథలే  పుడతాయి. అక్కడ కథే హీరో, ఎందుకంటే హీరో అనే వాడు ఆ కథల్లో ఉత్త పాసివ్ గా ఉంటాడు కాబట్టి. వాణ్ణి కథ నడుపుడుతుంది కాబట్టి. అందుకని కమర్షియల్ సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని స్టేట్ మెంట్లు అంటూ ఇస్తే- క్యారక్టర్ని నమ్ముకోవాల నాలి. గొప్ప క్యారక్టర్స్ ని క్రియేట్ చేయాలనాలి. సినిమా అంతటా ఆ క్యారక్టర్సే కనపడి జీవితమంతా వెంటాడాననాలి. ఈ తేడా గుర్తించి ఈ భాష మాట్లాడితే తప్ప తెలుగు సినిమాలు యాక్టివ్ పాత్రలతో కాస్తయినా బాగుపడవు.

        ప్రస్తుత సినిమా ఈ భాష మాట్లడ్డం లేదు. దీనికి పాత్ర గురించి ఏ పట్టింపూ లేదు, అసలు పాత్రచిత్రణల గురించే తెలీదు. ఎంతసేపూ కథతోనే పని. చాలా ఆశ్చర్యం. కథని పట్టుకుని కమర్షియల్ స్క్రీన్ ప్లే ఎలా రాస్తారో అంతు పట్టని విషయం. అసలు వన్ లైన్ ఆర్డర్ దశలోనే పాత్రతో కాకుండా కథతో ఆర్డర్ ముందుకే  కదలదు  కదా- అది ట్రీట్ మెంట్ (స్క్రీన్ ప్లే) దాకా ఎలా వచ్చి, డైలాగ్ వెర్షన్ కీ వెళ్తుందో! ఏమిటో ఆ రైటింగ్ మర్మం!
ఈ స్క్రీన్ ప్లేకి  ఒక పాసివ్ పాత్రని పట్టుకుని వన్ లైన్ ఆర్డర్ వేశామని ఎలా అనుకుంటారు. పాత్రని పట్టుకుని ప్రయాణించకుండా  రాతపని ముందుకు ఎలా కదుల్తుందో, కదల్చడానికి మనసెలా ఒప్పుతుందో- సరైన రాసే మనసు అయితే ఆ ప్రయత్నానికి అడుగడుగునా అడ్డు పడుతుంది. డీ ఫాల్ట్ గా ఈ మనసు ఎక్కువమంది ప్రేక్షకులకి వుంటుంది. ఇందుకే ఫ్లాప్ చేస్తూంటారు సినిమాల్ని. 

        యాక్టివ్ పాత్రతోనే స్ట్రక్చర్ చెట్టపట్టా లేసుకుని వుంటుంది, పాసివ్ పాత్రతో స్ట్రక్చర్ వుండదు. ఆర్ట్ సినిమాకి ఏ స్ట్రక్చరూ  వుండదు. గతంలో చెప్పుకున్నదే మరోసారి చెప్పుకుంటే, తెలుగులో భారీ బడ్జెట్లతో తీస్తున్న సినిమాలు నిజానికి కమర్షియల్ ముసుగేసుకున్న ఆర్ట్ సినిమాలే. ప్రేక్షకులు డబ్బులు చెల్లించుకుని మోసపోతున్నారు.

***
      ఒకటి కాదు రెండూ కాదు, ‘అఖిల్’ అవస్థకి మూడు ప్రధాన కారణాలు : 1) పాసివ్ సుడిగుండంలో హీరో పాత్ర మునకలేయడం, 2) పాసివ్ హీరోకి విలన్ కూడా దిక్కు లేకుండా పోవడం, 3) కాన్సెప్ట్ ని  వదిలి ఈ రోజుల్లో ఏ మాత్రం అవసరంలేని ప్రేమగోలని ప్రధానం చేసుకుని పాసివ్ హీరో కాలక్షేపం చేయడం. ఇవన్నీ కూడబలక్కుని స్ట్రక్చర్ లేకుండా చేశాయి. 
        దీనికి ఒక ప్రింటెడ్ అప్లికేషన్ ఫారం నింపినట్టు- అనేక సినిమాల్లో పాతబడిపోయిన విధానమే-  సినిమా ప్రారంభం కాగానే ఒక ఓపెనింగ్ బ్యాంగ్, హీరో కన్పించగానే ఒక ఫైట్, ఫైట్ అయిపోగానే హీరో గ్రూప్ సాంగ్, సాంగ్ అయిపోగానే లవ్ ట్రాక్.. ఇలా శ్రమ లేని ఈ ఈజీ టెంప్లెట్ లో రొటీన్ గా కథనాన్ని పడేసుకుంటూపోతే అదే స్క్రీన్ ప్లే అయిపోయింది. వందల సినిమాల్లో చూసిన వరసే మళ్ళీమళ్ళీ రిపీట్ చేయడం. 

        జువా గోళం కాన్సెప్ట్- కాన్సెప్ట్ తో సంబంధం లేకుండా హీరో హీరోయిన్లు ఎలా వుంటారు? కాన్సెప్ట్ కి పొసగని వృత్తుల్లో/విద్యల్లో వాళ్ళెలా వుంటారు. వాళ్ళిద్దరూ గ్లోబల్ వార్మింగ్ రీసెర్చి విద్యార్థులై వుంటే, గ్లోబల్ వార్మింగ్ మీద సిటీలో సదస్సు జరుగుతూంటే, ఆ జువా గోళాన్ని గాలిస్తున్న బ్యాడ్ రష్యన్ సైంటిస్టు అందులో పాల్గొని వీళ్ళకి పరిచయమైతే...ఇలా వుంటుంది కాన్సెప్ట్ కి లోబడ్డ కథనమైతే.  దీని బదులు సంబధంలేని, ఏ మాత్రం ఆసక్తి కల్గించని  స్ట్రీట్ ఫైట ర్, మెడికల్ స్టూడెంట్ పాత్రల్ని పెట్టుకుని, చూసిచూసి విసిగిపోయిన మూసఫార్ములా ప్రేమ కథకి  తెర తీశారు.     

        2011 లో వినాయక్ తీసిన ‘బద్రీనాథ్’ లోనూ ఇదే తతంగం. దేవాలయాల మీద టెర్రరిస్టుల దాడులు- అంటూ గొప్పగా కథ ప్రారంభించి, దాన్నెదుర్కొనే వీరుడిగా హీరోని నియమించి- తీరా హీరోయిన్ ఎంటరవగానే ఆమె వెంటపడే పాత మూస ప్రేమ కథగా మార్చేశారు. హీరోయిన్ మేనత్త, ఆమె గ్యాంగ్ విలన్లు. చివరికి వాళ్ళే తెగబడి దేవాలయం మీద దాడి చేస్తారు. విదేశీ ఆక్రమణదార్ల మీదా, టెర్రరిస్టుల మీదా అంత కోపాన్ని వెళ్ళగ్రక్కుతూ చేసిన కథా ప్రారంభం- స్వమతస్థులే తెగబడి దేవాలయాల మీద దాడులు చేసే కథగా మారిపోతే ఏమనాలి? స్వమతస్థులే వచ్చి పడి  తెగ నరుకుతున్నప్పుడు, ఇంకా అన్యమతస్థుల మీద ఆరోపణ లేమిటో అర్ధంగాని గందరగోళం! ఇలా వుంటాయి మన సినిమాల హై కాన్సెప్టులు! అసలు ఏం మొదలుపెట్టి ఏం చెప్తున్నామో స్పృహయినా లేకపోతే  ఎలా! సృహగల ప్రేక్షకులు దీన్ని ఫ్లాప్ చేశారు.

        ఇదే ‘అఖిల్’ సమస్య కూడా. పోతే బ్యాక్ గ్రౌండ్ లో జువా గోళం కోసం కుట్ర జరుగుతోందన్న సంగతి ఎప్పుడో ఎండ్ విభాగంలోగానీ హీరోకి తెలీదు. ఇంతసేపూ అతను ఇందుకోసం ఉన్నాడో తనకే తెలీతనంతో ప్రేమకథకి నగిషీలు చెక్కు కుంటూ ఉంటాడు. ఇంటర్వెల్లో గ్యాంగ్ హీరోయిన్ని కిడ్నాప్ చేశారని తెలిసినా, ఎందుకు చేశారో తెలుసుకోవడానికి ప్రయత్నించడు. తన ప్రేమగోల తనదే. ప్రేమలో హీరోయిన్ తండ్రి విలన్ కాదు. బ్యాక్ గ్రౌండ్ లో గోళం కోసం వున్న విలన్ క్లయిమాక్స్ వరకూ మళ్ళీ తెరపైకి రాడు. హీరోకి విలన్ తో మిడిల్లో స్పర్శే వుండదు. ఒక విలన్ ఉన్నట్టే వుండదు కథనం. ఇదీ దీని దుస్థితి.

***
      బేసిక్స్ కూడా తెలియకుండా, ఒకవేళ తెలిసినా మనకెందుకులే అన్నట్టుగా చేసుకుపోతే ఇలాగే తయారవుతుంది స్క్రిప్టు. ఇంకా ‘బద్రీనాథ్’ లో చేసిన తప్పే మళ్ళీ చేస్తామంటే  బాక్సాఫీసు చూస్తూ వూరుకుంటుందా? కాన్సెప్ట్ రన్ అవడమంటే ‘స్వామిరారా’ లో చూపించినట్టుగా సినిమా సాంతం అదే త్రెడ్ గా కొనసాగడం, దాన్ని అంటి పెట్టుకుని  సందర్భవశాత్తూ రోమాన్సు సాగడం. హీరో పాత్ర యాక్టివ్ గా వుండడం. యాక్టివ్ ఏమిటో పాసివ్ ఏమిటో తూర్పు పడరమలు తెలియనితనంతో రాసేవి స్క్రీన్ ప్లేలు కావు- దురద పుట్టే స్కిన్ డిసీజ్ లు! స్క్రిప్టాలజీ కాకుండా జువాలజీ జిల!


-సికిందర్
           

       
   
       


   
   
   
















     -సికిందర్
















Tuesday, November 10, 2015



కథ- దర్శకత్వం : రాజ కిరణ్
తారాగణం : కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర, రావు రమేష్, సప్తగిరి, ధన్ రాజ్, జయప్రకాష్ రెడ్డి
స్క్రీన్ ప్లే : కోన వెంకట్, వెలిగొండ శ్రీనివాస్, మాటలు : రాజ్
సంగీతం : కమ్రాన్, కెమెరా : రవికుమార్ శానా, ఎడిటింగ్ : ఉపేంద్ర
బ్యానర్ : జీ మీడియా, నిర్మాతలు : ఎ. చినబాబు, ఎం, రాజశేఖర్
విడుదల : 6 నవంబర్, 2015

***
దెయ్యాలు నవ్వించే హార్రర్ కామెడీల ట్రెండ్ లో ‘గీతాంజలి’ అనే హిట్ తీసిన దర్శకుడి మరో ప్రయత్నం ‘త్రిపుర’. ఓ మర్డర్ మిస్టరీని కూడా కామెడీని జోడించి ప్రకటించు కున్నట్టు హార్రర్ థ్రిల్లర్ గా  చెలామణి చేయవచ్చా? అన్న ప్రశ్నని  రేకెత్తిస్తూ తెరకెక్కిన ఈ సినిమాలో, మళ్ళీ కలలు నిజమయ్యే సైకలాజికల్ అంశమంటూ కూడా జోడించి, కాక్ టెయిల్ జానర్ గా తయారు చేశారు. ప్రధానంగా మర్డర్ మిస్టరీ, ఇంకో కలలు నిజమయ్యే సైకలాజికల్ పాయింటు, చివర్లో పిసరంత హార్రర్, మధ్య మధ్యలో వీటితో సంబంధం లేని కామెడీ అన్న కలగూరగంపగా తయారైన  ‘త్రిపుర’ లో,  టైటిల్ పాత్ర పోషిస్తూ కలర్స్ స్వాతి కొంతకాలం గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాత్రపరంగా కాస్త లావెక్కినట్టు కన్పించే స్వాతి తో మొత్తం గా సినిమా ఎలా తెరకెక్కిందో ఈ కింద చూద్దాం..

 కథేమిటి
        కాస్త కొంటెతనం, ఇంకాస్త అల్లరి ఎక్కువున్న పల్లెటూరి అమ్మాయి త్రిపుర ( కలర్స్ స్వాతి). టెన్త్ చదివిన ఆమెకి పెళ్లి సంబంధాలు తప్పి పోతూంటాయి. ఆమెకో మానసిక సమస్య వుంటుంది. ఆమె కేదైనా కల వస్తే అది మంచిదైనా చెడ్డదైనా నిజమవుతుంది. దీంతో  గ్రామ ప్రజలు తమ ‘జాతకాలు’ చెప్పించుకోవడానికి ఇంటి ముందు క్యూ కడుతూంటారు. విసిగిపోయిన ఆమె తండ్రి ఇలా కాదని సైకియాట్రిస్టుకి  చూపించేందుకు హైదరాబాదుకి తీసుకొస్తాడు. కలల మీద పరిశోధన చేసే  సీనియర్ డాక్టర్ ( రావు రమేష్)  త్రిపుర కేసు తీసుకుని మరో డాక్టర్ నవీన్ (నవీన్ చంద్ర) కి  అప్పగిస్తాడు. త్రిపురకి ట్రీట్ మెంట్ చేస్తున్న నవీన్ ఆమెని ప్రేమించడం ప్రారంభిస్తాడు. మొదట ఆమె తండ్రి ఒప్పుకోకపోయినా తర్వాత ఒప్పుకుని పెళ్లి జరిపించేస్తాడు. త్రిపురని తీసుకుని హైదరాబాద్ లో కాపురం పెడతాడు నవీన్. త్రిపురకి ఆ కలలు రావడం మానవు. నవీన్ కో ఫాం హౌస్ వుంటుంది. ఆ ఫాం హౌస్ కెళ్ళిన బ్రోకర్ చనిపోవడాన్ని ఆమె కలలో చూస్తుంది. అంతేగాక  తను నవెన్ ని పొడిచినట్టు కూడా కల వస్తుంది. నవీన్ ఆందోళన చెందుతాడు.

        ఆ ఫాం హౌస్ ని అమ్ముడుపోవాలంటే,  అందులో మనం వారం పాటు  వుండాలని నవీన్ త్రిపురతో ఆ ఫాం హౌస్ లో మకాం వేస్తాడు. అప్పుడు త్రిపురకి కన్పించకుండా పోయిన నవీన్ కొలీగ్ ఈషా (పూజ)  కేసు గురించి తెలుస్తుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీఐ,  నవీన్ ని అనుమానిస్తూంటాడు. త్రిపుర అదగె ప్రశ్నలకి  నవీన్ ఏ సమాధానమూ చెప్పకుండా దాట వేస్తూంటాడు. ఇక తనే ఈషా గురించి తెలుసుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తుంది...
ఈషా అసలేమైంది, ఈమె అదృశ్యానికీ నవీన్ కీ వున్న సంబంధం  ఏమిటి, చివరికి సీఐ చేస్తున్న దర్యాప్తు ఏ  మలుపులు  తిరిగింది...మొదలైన సందేహాలు తీరాలంటే మిగతా కథ వెండి తెర మీద చూడాల్సిందే. 

ఎలావుంది కథ
        ఇదొక ప్యూర్ మర్డర్ మిస్టరీ. కథా ప్రారంభంలోనే ఒక హత్య జరుగుతుంది. కానీ ఆ శవం దెయ్యమై రాదు. దాదాపు రెండు గంటల సమయం గడిచిపోయాక,  సెకండాఫ్ లో మాత్రమే  సప్తగిరీ-  -జయప్రకాశ్ రెడ్డి ల ఓ కామెడీ సీన్లో  పనిమనిషి రూపం లో వున్న దెయ్యం కన్పిస్తుంది. ఆతర్వాత ముగింపులో ఓ సీన్లో  రెండు నిమిషాల్లో తన పగ దీర్చుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి  ముందే చెప్పుకున్నట్టు ఇది హార్రర్ కథా కాదు, హార్రర్ థ్రిల్లర్  అంతకన్నా కాదు. కేవలం ఓ హత్య చేసిన హంతకుడెవరన్న మిస్టరీ కథగానే ఇది తేలుతుంది. దీనికి హీరోయిన్ కలల్తో సంబంధం పెట్టారు గానీ- ఆ కలలకి మర్డర్ మిస్టరీతో గానీ అసలు మర్డర్ జరగడానికి గానీ ఎ సంబంధమూ లేదు. దర్శకుడు నీలకంఠ తీసిన ‘మాయ’, కన్నడ హీరో ఉపేంద్ర తెసిన ‘న్యూస్’ ఏ కసూత్రతతో తీసిన కేవలం ‘కలల’ కథలుగానే వుంటాయి. ‘త్రిపుర’ కి అనేక జానర్ల అతుకులు వేయడంతో ఈ బరువంతా మోస్తూ గమ్యం లేని ప్రయాణం చేస్తున్నట్టు తయారయ్యింది సినిమా. అందుకే నిడివి కూడా రెండున్నర గంటలు తెగసాగింది.

ఎవరెలా చేశారు 

       కలర్స్ స్వాతి మొదట్లో కన్పించిన తెలివైన కొంటె పిల్లగా తర్వాత కన్పించదు. పాత్రలో పెప్ లేకపోవడం వల్ల, అదొక టైటిల్ పాత్రగా, టైటిల్ ని బట్టి అన్పించే  హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా అన్పించదు. కథ హీరోయిన్ దా, హీరోదా అన్న సందిగ్ధత ఒకటి. ప్రధాన పాత్రగా తనకున్న కలల సమస్యతో కథని నడిపించాల్సిన స్వాతి, అదేమీ పట్టకుండా పాసివ్ గా మారిపోవడంతో నటన కూడా ఆ మేరకు డల్ గానే తయారయ్యింది. పెళ్ళవగానే అమాయక గృహిణి పాత్రగా ఆమె మారిపోవడం ఈ సినిమాకి నష్టదాయకమే. పెళ్ళవక ముందు ఉన్నంత ఫన్నీగానే ఆమె కొనసాగివుంటే ఇది ఏదో రకమైన కామెడీ అన్పించుకునేది. కేవలం కమెడియన్లు కామెడీ చేసినంత మాత్రాన ఏ సినిమాయైనా కామెడీ సినిమా అన్పించుకుంటుందా? 

        నవీన్ చంద్ర ది  చాలా సాఫ్ట్ రోల్. కాకపోతే ఎక్స్ ప్రెషన్స్  పలకని ఫేస్ తో ఎప్పుడూ ఒకేలా చూస్తాడు, నటిస్తాడు. రావు రమేష్ వుండే రెండు మూడు సీన్లలో ఎటువంటి ప్రభావమూ చూపలేదు. కలల మీద పరిశోధన చేస్తున్నప్పుడు నిజానికి ఎ పాత్రకి హీరోయిన్ తో చాలా పని వుండాలి. నామ్ కే వాస్తే లెక్చర్లు ఇచ్చి వెళ్ళిపోయే పనైతే ఈ పాత్రే అవసరం లేదు.  పరిశిఒశన చేస్తున్నప్పుడు నిజానికి హీరోయి పాత్రతో తనకి చాలా పని వుండాలి. ఇక కథతో సంబంధంలేని ఫుల్ లెన్త్ కామెడీ తో సప్తగిరీ, సెకండాఫ్ లో వచ్చి కామెడీ చేసే జేపీ- శకలక శంకర్ ఈ ముగ్గురే సినిమా పెట్టే సహన పరీక్ష నుంచి కాస్త రిలీఫ్ నిస్తారు.

       ఇకపోతే ఈ సినిమాకి కోన వెంకట్, వెలిగొండ  శ్రీనివాస్ లు స్క్రీన్ ప్లే రాశారు. ఏ  టైపు కథనేది స్పషత లేకపోవడం వల్ల  కాబోలు స్క్రీన్ ప్లే బలహీనంగా తయారయ్యింది. ఒక్క ముక్కలో ఇది మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే. దాదాపు రెండు గంటలు గడించిన తర్వాత గానీ, నడుస్తున్న కథ పాయింటుకి వచ్చి అసలు కథ ప్రారంభం కాదు. మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేల్లో ఇంతసేపూ నడిచేది కేవలం ఉపోద్ఘతమే నన్నమాట. ఏఎ ప్రాథమిక అంశం తెలుసుకోకుండా రాసుకుపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. ఇలాటి స్ట్రక్చర్ తో వచ్చిన సినిమాలు హిట్టయిన సందర్భాలు లేవు. ఇక రాజా రాసిన డైలాగుల్లో కామెడీ డైలాగులు బావున్నాయి.

        చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి వంటి సీనియర్లు పాటలు రాసినప్పటికీ అవి కమ్రాన్ సంగీతంలో అలరించే బాణీల్లో లేకుండాపోయాయి. అసలు పాటలు ఈ  సినిమాకి అక్కరలేదు. ఈ తరహా సినిమాకి కెమెరా వర్క్ లో లైటింగ్ తో తీసుకు రావాల్సిన ఎఫెక్స్ట్ తీసుకురాలేక ఫ్లాట్ లైటింగ్ తో సరిపెట్టారు. 

స్క్రీన్ ప్లే సంగతులు 


Thursday, November 5, 2015

లవ్ 'మ్యాటర్'




రచన- దర్శకత్వం : ఆధిక్  రవిచంద్రన్

తారాగణం : జివి ప్రకాష్ కుమార్, ఆనంది, మనీషా యాదవ్, సిమ్రాన్, రోబో శంకర్, జ్యోతి లక్ష్మి, విటివి వెంకటేష్, అతిధి నటులు: ఆర్య, ప్రియా ఆనంద్, ఆధిక్ రవిచంద్రన్  
మాటలు : శశాంక్ వెన్నెలకంటి, సంగీతం : జివి ప్రకాష్ కుమార్,  కెమెరా : రిచర్డ్ ఎం.  నాథన్, ఎడిటింగ్ : ఆంథోనీ ఎల్. రూబెన్ 
బ్యానర్ :  రుషి మీడియా , నిర్మాత : సిజె జయకుమార్ 
విడుదల : 5 అక్టోబర్, 2015

           యువ సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ ఇంకో వైపు హీరోగా నటిస్తూ బిజీ అయిపోయాడు. కొన్ని సినిమాల్లో అతిధి పాత్రలు పోషిస్తూ వచ్చిన ఇతను, ఈ సంవత్సరం జనవరిలో ‘ప్రేమకథా చిత్రమ్’  తమిళ  రీమేక్ అయిన ‘డార్లింగ్’ లో హీరోగా నటించి మంచి  హిట్ ఇచ్చాడు. తిరిగి వెంటనే  ‘త్రిష ఇల్లానా నయనతార’  లో కూడా హీరోగానే  నటించి ఇంకో హిట్టిచ్చాడు. ఇదే ఇప్పుడు ‘త్రిష లేదా నయనతార’  గా తెలుగులో డబ్బింగ్ అయ్యింది. కొత్త దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ ఈ సినిమాతో ఒక అడల్ట్ కామెడీని అందించాడు. యువతరం ప్రేమల్ని కాస్త పచ్చిగానే  చూపిస్తూ అమ్మాయిల్ని ఎలా ప్రొజెక్ట్ చేశాడో ఈ కింద చూద్దాం... 

కథేమిటి
    జీవా ( ప్రకాష్ కుమార్), రమ్య (ఆనందిని), ఆదితి ( మనీషా యాదవ్) లు ఒకే ఆస్పత్రిలో పుట్టి ఒకే స్కూల్లో చదువుకుంటారు. జీవాకో  బాబాయ్ (విటివి వెంకటేష్ ) వుంటాడు. అమ్మాయుల విషయంలో కలిగే సందేహాలన్నిటినీ ఇతడితో తీర్చుకుంటుంటాడు జీవా. ఇంటర్మీడియేట్ లో చేరాక ఓ వారం పాటు ఆదితి బెంగళూరు వెళ్తుంది. దీంతో క్లాస్ మేట్  ప్రోద్బలంతో  రమ్య కి క్లోజ్ అవుతాడు జీవా. కానీ ప్రేమిస్తున్నానని చెప్పే ధైర్యం చాలదు. ఆ పని ఆమె చేసేస్తుంది.ఇద్దరూ ప్రేమలో పడి  ఓ రాత్రి షికార్లు తిరిగి వస్తారు. తెల్లారి ఈ విషయం క్లాస్ మేట్ కి చెప్తాడు జీవా . క్లాస్ మేట్ ఊరంతా  టాంటాం చేస్తాడు. దీంతో అవమానం ఫీలయిన రమ్య జీవాకి ఛీ కొట్టేసి తెగతెంపులు చేసుకుంటుంది. అతనేం చెప్పినా విన్పించుకోకుండా చదువుకోవడానికి హైదరాబాద్ వెళ్ళిపోతుంది. ఆందోళనలో వున్న జీవాకి ఆదితి నుంచి ఫోన్ రావడంతో వెంటనే ఆమెని ప్రేమించడం మొదలెడతాడు.  

    ఆదితి తాగుడు మరుగుతుంది. మానెయ్యమంటే అలాగేనని ప్రామీజ్ చేస్తుంది. కానీ పబ్ లో మళ్ళీ తప్ప దాగి కన్పించేసరికి హర్ట్ అవుతాడు. తాగిన మైకంలో అతణ్ణి అవమానించి వెళ్ళ గొడుతుంది. ఈమెని కూడా మర్చి పోవడానికి ఇప్పుడు రాజమండ్రిలో వైన్ షాపు నడుపుతున్నబాబాయ్ దగ్గరి కెళ్ళి పోతాడు. తీరా అక్కడి కెళ్ళే సరికి అక్కడే జాబ్ చేస్తూ వుంటుంది రమ్య. వెంటనే అతడికి మళ్ళీ  ఆశ చిగురిస్తుంది. మూడేళ్ళ  తర్వాత కూడా ఇంకా ద్వేషిస్తున్న ఆమెని ప్రేమించేట్టు చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఈ ప్రయత్నాలు ఎలా సాగాయి. ఎవరెవరు తోడ్పడ్డారు, రమ్య ప్రేమలో పడిందా లేదా, పడితే ఈ ప్రేమ ఇంకే మలుపు తిరిగిందనేది మిగతా కథ.

ఎలావుంది కథ 
       యూత్ ని, ముఖ్యంగా అబ్బాయిల్ని దృష్టిలో పెట్టుకున్న కథ ఇది. దండిగా ద్వందార్ధాలు దట్టించి అడల్ట్ -సెక్స్ కామెడీగా వదిలారు. అబ్బాయిల క్రేజ్ ని సొమ్ము చేసుకోవడానికి అమ్మాయిల్ని నెగెటివ్ గా చూపిస్తూ, విరివిగా కామెంట్లు చేశారు. అమ్మాయిలు అహం తప్ప ఇంకేదైనా కోల్పోవడానికి సిద్ధంగా ఉంటారని చూపిస్తూ, కన్యలు  ఎప్పుడో డైనోసార్ల కాలం నుంచే లేరని చెప్పిస్తారు. కేవలం కామోద్రేకాల్ని రెచ్చగొట్టి అబ్బాయిల జేబులు కొల్లగొట్టాలన్న దృష్టితోనే ఈ కథ వుంది తప్ప- ఆనాడు డా. దాసరి నారాయణరావు తీసిన ‘నీడ’ లాంటి అబ్బాయిల్ని హెచ్చరించే కథ మాత్రం కాదు. తెలుగులో దర్శకుడు దాసరి మారుతీ ఈ పంథాలోనే వెళ్లి ఫుల్ స్టాప్ పెట్టుకున్నలాంటి కథనే, తమిళ దర్శకుడు తన ఎంట్రీకి వాడుకున్నాడు. తమిళ మారుతీ అన్పించుకున్నాడు.

ఎవరెలా చేశారు 
     ఒకటి మాత్రం ఒప్పుకోవాలి. ఇలాటిదే మన తెలుగు సినిమాలో నైతే యువ హీరోలు నానా ఓవర్ యాక్షన్లూ, వెకిలి తనాలూ చేసి భరించ లేకుండా చేసేవాళ్ళు. కనీసం ఈ పని చెయ్యనందుకు హీరో ప్రకాష్ కుమార్ ని అభినందించాలి. సహజత్వం పేరుతో పచ్చిగా నటించాడు తప్పితే  ఓవరాక్షన్ చేయలేదు. దిసీజ్ జీవీ ప్రకాష్ కుమార్ అన్న ఇగో ప్రదర్శించలేదు. గల్లీల్లో తిరిగే అతి సాధారణ కుర్రాడు ఎలా ఉంటాడో, ఆ తీరులో కన్పిస్తూ మంచి ఈజ్ తో నటించాడు. ఇంతా చేసి అబ్బాయిలకి ఏం చెప్పాడన్నది అలా ఉంచితే, ఓ అమ్మాయి ఛీ కొడితే ఇంకో అమ్మాయి వెంట పడే ఠికానా లేని పాత్రగా మాత్రంప్రేక్షకులకి కన్పిస్తాడు. తనే సంగీతం వహించిన ఈ సినిమాలోని పాటలు మాస్ ధోరణిలో అన్నీ డప్పు పాటలే కావడం ఉద్దేశపూర్వకంగా చేసినట్టుంది. అంటే మధ్య తరగతిలో కూడా మరీ స్లమ్ డాగ్ మిలియనీర్ లాంటి బస్తీ కుర్రాడన్నమాట. 

    హీరోయిన్లలో ఆనందిని తెలుగులో మారుతీ తీసిన ‘బస్టాప్’ లో హీరోయినే. గ్లామర్ పాత్రలకి కాకుండా ఇలా నటనకి అవకాశం వున్న  మధ్యతరగతి అమ్మాయి పాత్రలు ఆమెకి బాగా సెట్ అవుతాయని అన్పిస్తుంది చూస్తూంటే. ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పుడు మెయిన్ హీరోయిన్ మర్యాదగానే వుండాలి కాబట్టి ఆ ఫార్ముల ప్రకారం ఒద్దికగా నటించింది గానీ, పాత్ర అసలుకైతే అంత పవిత్రమైనదేం  కాదు.

    రెండో హీరోయిన్ ఫాస్ట్ గా వుండే మనీషా యాదవ్ కూడా అమ్మాయిల్ని నెగెటివ్ గా చి త్రించడానికి ఉపయోగ పడిన మరో నటి. తాగుడు  సీన్లలో తడబడకుండా నటించేసింది. మెయిన్ హీరోయిన్ ఆంటీ గా సిమ్రాన్, సెకండ్ హీరోయిన్ బామ్మగా జ్యోతి లక్ష్మీ నటించారు. చివర్లో అతిధి పాత్రలో తమిళ స్టార్ ఆర్య వచ్చి కాస్సేపు హడావిడి చేస్తాడు.

    ఈ సినిమాకి రిచర్డ్ ఎం. నాథన్ కెమెరా వర్క్ చెప్పుకోదగ్గది. చిన్న బడ్జెట్ సినిమాని కూడా రిచ్ గా చిత్రీకరించాడు.
రామ జోగ‌య్య‌శాస్త్రి, వెన్నెల‌కంటి, శ్రీమ‌ణి, రాఖీ పాటలు రాశారు. శశాంక్ వెన్నెల కంటి మాటలు రాశారు.

చివరి కేమిటి
     దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ కేవలం సెక్స్ కంటెంట్ తో యువ ప్రేక్షకుల్లో అబ్బాయిల్ని ఆకర్షించడానికి ఈ సినిమా తీశాడు తప్పితే ఎలాంటి మంచి చెప్పడానికీ  కాదు. ఇదీ ఒకందుకు నయమే- బూతంతా చూపించి చివర్లో నీతి  చెప్పడం కంటే! ఆ మాటకొస్తే, గతవారమే  విడుదలైన కునాల్ ఖేమూ నటించిన హిందీ ‘గుడ్డూ కా గన్’ మరీ  ఘోరమైన సెక్స్ కామెడీ. అయితే తమిళ దర్శకుడు  హీరోని అతి పవిత్రుడుగా, హీరోయిన్లని మాత్రం  క్యారక్టర్స్ లేని అమ్మాయిలుగా చూపించిన  ఏకపక్ష కథనంలో,  ఆ అమ్మాయిలపట్ల చివరికెలాటి సానుభూతినీ సృష్టించ లేకపోయాడు, సెక్స్ బొమ్మలుగానే చూపించి రెచ్చగొట్టడం తప్పితే! తమిళంలో దీన్ని హిట్ చేశారంటే అది హీరోగా నటించిన ప్రకాష్ కుమార్ వల్ల కావచ్చు. కానీ తెలుగులో ప్రకాష్ కుమార్ కి ఆదరణ సంగతెలా వున్నా, ఇలాటి కేవలం బూతు సినిమాలంటే  మారుతి తీసిన రెండు మూడు సినిమాలతోనే మొహం మొత్తింది ప్రేక్షకులకి. తిరిగి అదే బాపతు ఇప్పుడు ప్రత్యక్షమయింది యువ ప్రేక్షకుల ఎదుట!          

    ‘లవ్ అంటేనే  ఆ మ్యాటర్, ఆ మ్యాటర్ ఉంటేనే లవ్’ అని హీరోయిన్ చేత అన్పించి తేల్చిన దర్శకుడు, ఆ ప్రకారం హీరోని ఆ మ్యాటర్ లోకి ఎందుకు దించలేదో, దించకూడదో అర్ధం గాదు. మళ్ళీ ఈమెని ఛీ కొట్టి వెళ్ళిపోయిన వాడు ఇంకో అమ్మాయి కనపడగానే ఆమె వెంట ఎలా పడతాడో అర్ధంగాదు - డైనోసార్ ల కాలం నుంచీ కన్యలు లేరని బాబాయ్ కూడా తేల్చాక! ఈ లెక్కన ఈ పవిత్రుడైన అబ్బాయి ఆత్మహత్య చేసుకోవాలి. ఒక అర్ధం పర్ధంలేని పెర్వర్షన్ తో కూడిన ఇలాటి సినిమాల కంటే ‘గుడ్డూ కా గన్’ లాంటి సెక్స్ పిచ్చోడి పాట్లనీ, వాడికి జరిగే శాస్తినీ కామెడీగా చూపించే సినిమాలు బెటర్.                     
                                           

-సికిందర్


Tuesday, November 3, 2015

పంకజ్ స్పీక్స్!







      బాలీవుడ్ నటుడు, దర్శకుడు, షాహిద్ కపూర్ తండ్రి,  పంకజ్ కపూర్ గురించి తెలియని వారుండరు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకంటే ఆయన సమాంతర సినిమాలకి పెట్టింది పేరు. ‘గాంధీ’, ‘జానేభీ దో యారో’, ‘మండీ’, ‘ఫైండింగ్ ఫ్యానీ’  లాంటి 30 కి పైగా సమాంతర సినిమాల్లో నటించి, విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్నారు. రెండు సార్లు జాతీయ అవార్డులు పొందారు. ఏక కాలంలో ఇటు సినిమాలతో బాటు అటు నాటక రంగంలోనూ, టీవీ రంగంలోనూ అసమాన ప్రతిభని చాటుకుంటున్నారు. 2011 లో షాహిద్ కపూర్- సోనమ్ కపూర్ లు హీరో హీరోయిన్లుగా ‘మౌసమ్’ అనే ప్రేమకథకి రచన- దర్శకత్వం వహించారు. బాబ్రీమసీదు కూల్చివేత దగ్గర్నుంచీ, గోథ్రా అల్లర్ల వరకూ సాగే కథాకాలంతో ఆ సున్నిత ప్రేమకథ లాజిక్ లోపించి ఆయన పేరుని మసకబార్చింది. మంచి సాహితీ ప్రియుడు కూడా అయిన పంకజ్ కపూర్ తో ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ప్రతినిధి షర్జీత్ అహ్మద్ హైదరాబాద్ లో చేసిన  తాజా ఇంటర్వ్యూ ని ఇక్కడ అందిస్తున్నాం..

మీరెలాటి కథలు చదవడానికి ఇష్ట పడతారు?
       
రీడింగ్ ని నేను చాలా ప్రేమిస్తాను. అన్నీ చదువుతాను- నాటకాలు, నవలలు, కథానికలు, స్క్రిప్టులు, కవిత్వం...ప్రతీదీ చదువుతాను. అప్పుడప్పుడు ఓ ఏడాది పాటూ అసలేమీ చదవని సందర్భాలు కూడా వుంటాయి. తిరిగి చదవడం మొదలెట్టానంటే ఇక ఆర్నెల్ల పాటూ సమయమంతా చదవడంతోనే గడిచిపోతుంది. నాకైతే ఇంగ్లీషు, హిందీ, పంజాబీ కవిత్వాల్లో  చాలా బ్యూటీ కన్పిస్తుంది. ఇక నా మీద ప్రభావం చూపించిన రచయిత లెవరని మీరడిగారంటే, ఆ లిస్టు పెద్దదే. సాదత్ హసన్ మంటో, ప్రేమ్ చంద్, స్టీఫాన్ జ్విగ్, సోమర్సెట్ మామ్, విలియం షేక్స్ పియర్, నికోలాయ్ ఓస్ట్రోవ్స్కీ, డాస్టోవ్స్కీ, చెఖోవ్...ఇలా ఎందరో. మనం స్నేహం చేస్తూ పెరిగే మిత్రులు, పేరెంట్స్, టీచర్స్, నాటకరంగ, సినిమారంగ నిర్మాతలూ దర్శకులూ వీళ్ళందరితో కూడా నేను ప్రభావితుణ్ణయ్యాను. గత నలభై ఏళ్లుగా ఈ వ్యక్తులతో సాన్నిహిత్యం, చదివిన సాహిత్యం,  ఈ రెండిటి ప్రభావాల సమాహారమే ఇప్పుడు మీ ముందున్న నేను. 

ఇవ్వాళ రచన చేయాలనుకుంటున్న యువతరం సినిమాలకి రాసేందుకే ఎక్కువ ఇష్ట పడుతున్నారు. ఓ గొప్ప నవల రాసే ఆలోచనే చేయడం లేదు. ఈ ట్రెండ్ ని సాహితీవేత్తలు  నిరసిస్తున్నారు, మీరే మంటారు?
       
యువతరం చాలా టాలెంట్ తో వుందని అనుకుంటున్నాను. వాళ్ళు రాసేందుకు మనం ప్రోత్సహించాలి.  కొన్నితరాలుగా, ఓ మూడు నాల్గు దశాబ్దాల క్రితం వరకూ కూడా,  ఎక్కువ మంది మన రచయితలు వేరే వృత్తులు చేసుకునే వారు. ఎందుకు? కథలు రాసుకుంటూ బతకలేమని వాళ్లకి తెలుసు. రచనా రంగంలో అప్పట్లో డబ్బు లేదు. నేటి తరం చాలా అదృష్ట వంతులు. రాస్తూ కూడా జీవించడానికి వాళ్లకి రచనా రంగం అనేక ఆదాయ మార్గాలతో కూడిన ద్వారాలు తెర్చి పెట్టింది. సినిమాలు కావచ్చు, నాటకాలు కావచ్చు, టీవీ కావచ్చు, పత్రికలూ కావచ్చు- సినిమాలకి రాస్తే ఇంకాస్తా  బాగా స్థిర పడవచ్చని వాళ్ళనుకుంటే తప్పేమిటి? సాదత్ హసన్ మంటో కూడా సినిమాలకి రాశారు. ఇస్మత్ చుగ్తాయి కూడా రాశారు. తర్వాత సాదత్ హసన్ మంటో  సినిమాల్లో కంటే పుస్తకాలు రాస్తే ఎక్కువ డబ్బొస్తోందని పుస్తకాలు రాయడం వైపు మొగ్గారు. అదిప్పుడు మారింది. ఇప్పటి తరం సినిమాలకి రాసి ఎక్కువ గడించ వచ్చనుకుంటే వాళ్ళని రాయనియ్యాలి. వాళ్ళు రాస్తున్నంత వరకూ, అదీ నిష్ఠగా రాస్తున్నప్పుడు ప్రోత్సహించాలి. రాసి బతకడానికి ఏ మీడియాని ఎంపిక చేసుకోవాలో వాళ్ళ సొంత విషయం. సినిమా రచయిత అన్పించుకున్నంత మాత్రాన గౌరవమేమీ తగ్గిపోదు. పుస్తకాలు రాసినంత క్రియేటివిటీయే  సినిమాలకి రాయడానికీ అవసరం. ఇక సినిమాలకి రాయడం తక్కువ స్థాయి వ్యాపకమని  సాహితీ వేత్తలెవరైనా అంటే అననీయండి. ఓ సినిమా ఆఫర్ వచ్చిందంటే  వాళ్ళు కూడా అటే  జంప్ చేస్తారని కచ్చితంగా చెప్పగలను. 

సినిమా రివ్యూలు రాసే క్రిటిక్స్ గురించి మీరే మంటారు?
       
నా మాటలు వాళ్లకి రుచించక పోవచ్చు. అయినా చెప్తాను. నా వయసుకీ, అనుభవానికీ ఇలా అనే అర్హత నాకుంది. ఎవరీ క్రిటిక్స్ అనే వాళ్ళూ? వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏమిటి? సినిమాల్ని జడ్జ్ చేసే హక్కు వాళ్ళ కెవరిచ్చారు? వాళ్ళని ఎవరైనా ఎలా నమ్మాలి? సినిమా మేకింగ్ లో ఏమేం జరుగుతాయో, ఏమేం చేస్తే ఒక సినిమా తయారవుతుందో వాళ్ళకేమైనా ఐడియా ఉంటుందా? పాత్రని పట్టుకుని నటుడు ఎలాటి ఆపసోపాలు పడతాడో వాళ్లకి తెలుసా? సినిమాలకి రివ్యూలు రాయడానికి పూనుకునే ముందు, ప్రతీ క్రిటిక్ మూవీ మేకింగ్ నీ, యాక్టింగ్ నీ విధిగా నేర్చుకోవాలి. కనీసం పదేళ్ళు ఫిలిం మేకర్లతో, ఆర్టిస్టులతో అసోషియేట్ అవ్వాలి. ఇలా ఎందుకంటున్నానంటే, క్రిటిక్స్ కో వాయిస్ వుంటుంది. అది ప్రేక్షకుల్లోకి  వెళ్తుంది. అయితే ఈ వాయిస్ ఎక్కువగా అజ్ఞానంతో కూడుకుని ఉంటోంది. సినిమా నిర్మాణం ఎలా జరుగుతుందో నాలెడ్జ్ ఏమీ లేకుండా, వాళ్ళు జడ్జ్ చేసేస్తారు, ప్రేక్షకులు ప్రభావిత మవుతారు! ఈ ధోరణి సినిమా నిర్మాణంలో పాలుపంచుకునే వాళ్ళందరికీ అవమానమే, అన్యాయమే. 

అంటే శిక్షణ పొందిన ఫిలిం మేకర్లకే రివ్యూలు రాసే హక్కుందంటారా?
        విమర్శకి నేను ఓపెన్ గా వుంటాను. కానీ క్రిటిక్ చేయాల్సిన పనేమిటంటే, నిర్మాణాత్మక విమర్శ చేయడం. ఏవో సొంత అభిప్రాయాలూ జడ్జ్ మెంట్ లతో ఫలానా సినిమా ప్రేక్షలుకు చూడాలో వద్దో చెప్పేయడం అన్యాయం. నిర్మాణాత్మక విమర్శ ఎప్పుడు చేయగల్గుతారు? ఆలోచించండి, దానికంటూ  కూడా సినిమా పరిజ్ఞానం ఉండాలిగా? పైగా కమర్షియల్ సినిమాల్ని ఒక రకంగా, ఆర్ట్ సినిమాల్ని ఇంకో రకంగా నిర్ణయించుకుని  రివ్యూలు రాసేస్తున్నారు. ఒక కమర్షియల్ సినిమాలో కథే లేకపోయినా దానికి నాల్గు స్టార్స్ ఇవ్వడానికి వాళ్ళే మాత్రం సంకోచించడం లేదు. అదే ఆర్ట్ సినిమాకి ఆ రేటింగ్ ఇవ్వాలంటే అదింకా బాగా తీయాలని అంటారు. ఇదెక్కడి న్యాయం?
       
ఇక దురదృష్టవశాత్తూ, ఒక పెద్ద పత్రికో, టీవీ ఛానెలో వీళ్ళని నియమించుకుంటే దేవుళ్ళుగా  ఫీలయిపోతారు. ఆ మీడియా సంస్థ స్థాయి తమకూ వచ్చేసిందను కుంటారు. ఇక అన్నీ తమకే తెలిసినట్టు గంట కూర్చుని రాసేస్తారు. వాళ్ళనీ  వాళ్ళ రివ్యూలనీ అసలెవ్వరూ ఇష్ట పడ్డం లేదన్న వాస్తవాన్ని కూడా అంగీకరించరు. లోపాలు ప్రతీ మనిషి లోనూ వుంటాయి. ఇంకో అవకాశం ఇచ్చి చూడాలి. పొరపాట్లేమైనా వుంటే ఎత్తి చూపొచ్చు, అలాగే సినిమాలో బావున్న దేమిటో కూడా ప్రేక్షకులకి చెప్పాలి.

***