రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, November 27, 2022

1250 : రివ్యూ!


 (దేశవిదేశ పాఠకులందరికీ నమస్కారం. సినిమాలు చూస్తూనే వున్నా రాయాలంటే రైటర్స్ బ్లాక్ లాంటిది అడ్డుపడి ఇప్పుడు రిలీజ్ చేసింది. ఇక నుంచి రెగ్యులర్ గా ఆర్టికల్స్ అందుబాటులోకి వస్తాయి. ఈ రోజు మసూద రివ్యూ, రేపు స్క్రీన్ ప్లే సంగతులు అందుకోండి!)

రచన- దర్శకత్వం : సాయికిరణ్
తారాగణం : సంగీత, బాంధవీ శ్రీధర్, తిరువీర్, కావ్యా కళ్యాణ్ రామ్, అఖిలా రామ్, శుభలేఖ సుధాకర్, సత్యప్రకాష్, సత్యం రాజేష్, తదితరులు.
సంగీతం : ప్రశాంత్ విహారి, ఛాయాగ్రహణం బి. నగేష్ 
బ్యానర్ : స్వధర్మ్ ఎంటర్ టైమెంట్స్
నిర్మాత : ఎన్ రాహుల్ యాదవ్
విడుదల : నవంబర్ 18, 2022
***
          ళ్ళీ రావా’, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే రెండు హిట్లు తీసిన నిర్మాత రాహుల్ యాదవ్ మూడో ప్రయత్నం మసూద హార్రర్ జానర్లో ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు ముందు కొచ్చింది. హార్రర్ సినిమాలు చూసి భయపడే ప్రేక్షకులింకా వున్నారా అంటే లేరనే చెప్పేంతగా హార్రర్ కామెడీలు హాస్యమాడాయి. ఈ పరిస్థితిలో ఒక సీరియస్ హార్రర్ తీసేందుకు సాహసం కావాలి. మసూద తీసిన కొత్త దర్శకుడు ఈ సాహసం చేశాడు. మసూద చూసిన కొందరు వర్ధమాన దర్శకులు నిజంగా భయపడ్డామని కితాబు  నిచ్చారు. మళ్ళీ పాత రోజుల్ని గుర్తు చేసేలా ఈ హార్రర్ అంత భయపెట్టించేలా వుందా? ఈ విషయం పరిశీలిద్దాం...

కథ

హైదరాబాద్ లో లో నీలం (సంగీత) ఒక సైన్స్ టీచర్. డబ్బుల కోసం వేధించే భర్త అబ్దుల్ (సత్య ప్రకాష్‌) కి దూరంగా వుంటూ కూతురు నాజియా(బాంధవి శ్రీదర్) ని చదివించుకుంటూ వుంటుంది. పక్క ఫ్లాట్ లో వుండే సాఫ్ట్ వేర్ గోపీ (తిరువీర్) ఈ తల్లీకూతుళ్ళకి సహాయంగా వుంటాడు. ఆఫీసులో మినీ (కావ్యా కళ్యాణ్ రామ్) ని ప్రేమిస్తాడు. ఒక రోజు నాజియా వింతగా ప్రవర్తిస్తుంది. దెయ్యం ఆవహించినట్టు అన్పించే సరికి భయపడి హాస్పిటల్ కి తీసికెళ్తారు నీలం, గోపీ. నీలం కి ఎవరో పీర్ బాబా గురించి చెప్పడంతో సైన్స్ టీచర్ అయిన తను, తాంత్రిక విధ్యల్ని నమ్మాల్సి వచ్చి పీర్ బాబా(శుభలేఖ సుధాకర్) కి కూతుర్ని చూపిస్తుంది. నాజియాని మసూద అనే ప్రేతాత్మ ఆవహించినట్టు పసిగట్టిన పీర్ బాబా- మసూద ఎవరో తెలుసుకోమని గోపీని పురమాయిస్తాడు. గోపీ చిత్తూరు దాకా వెళ్ళి మసూద అలియాస్ మసూదాబీ గురించి ఆరా తీస్తే, కొన్ని భయంకర నిజాలు తెలుస్తాయి.

ఎవరీ మసూదాబీ? చిత్తూరు జిల్లాలోని ఆ గ్రామంలో కొచ్చి ఎందుకు మీర్ తాజ్ అనే వ్యవసాయ దారు ఉమ్మడి కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది? ఆమెకి హైదరాబాద్ లో నాజియా కేం సంబంధం? ఆమె ప్రేతాత్మని తుదముట్టించేందుకు పీర్ బాబాతో, నీలంతో  కలిసి గోపీ చేసిన ప్రాణాంతక సాహసాలేమిటి? ఇవన్నీ మిగతా కథలో తెలుసుకోవచ్చు. 

ఎలావుంది కథ

హార్రర్ సినిమాలంటే భయంపోయేలా హార్రర్ కామెడీలొచ్చి హాస్యమాడాయి ఇంత కాలం. మళ్ళీ సీరియస్ హార్రర్ తిరిగి వచ్చి భయపెట్టేందుకు థియేటర్స్ లో రెడీగా వుంది. ముస్లిం చేతబడి కథ కావడంతో పూర్తిగా కొత్తదనాన్ని ఫీలయ్యేలా చేసే మసూదకొత్త దర్శకుడే తీశాడా అన్నట్టుగా వుంది టెక్నికల్ గానూ. దీన్ని చూసి భయపడినట్టు చెప్పుకున్న వర్ధమాన దర్శకుల మాట నిజమే. మళ్ళీ ఇరవై ఏళ్ళ క్రితం మహేష్ భట్ తీసిన హిందీ రాజ్ (రహస్యం) సూపర్ హిట్ సీరియస్ హార్రర్ ని గుర్తు చేసేలా వున్న మసూద –కథాకథనాల రీత్యా  ముస్లిం పాత్రలతో పూర్తి స్థాయి చేతబడి నేపథ్యంతో కొత్తదనాన్ని సంతరించుకోవడంతో-  దీనికి పానిండియాకి వెళ్ళగల అర్హతలు కూడా వుండొచ్చు.

ఐతే నిడివి అతిగా వుంది రెండు గంటలా 40 నిమిషాలూ. ఫస్టాఫ్ గంటకే ముగించినా సెకండాఫ్ గంటన్నరకి పైగా లాగారు. ఫస్టాఫ్ నీలం- నాజియా- గోపీ- మినీల సాధారణ జీవితం, ఇందులో గోపీ- మినీల లవ్ ట్రాక్, తర్వాత నాజియాకి ప్రేతాత్మ ఆవహించడంతో కథ మొదలవుతుంది. మధ్యలో లవ్ ట్రాక్ అనేది అంతగా బావుండదు. ఇక ఫ్రేతాత్మ ఆవహించాక కూడా కథ ఇంకో మలుపు తీసుకోకుండా ఇంటర్వెల్ వరకూ కేవలం ప్రేతాత్మతో భయపెట్టే సీన్లే రిపీటవుతూంటాయి. ఇంటర్వెల్లో కూడా ప్రేతాత్మ భయపెట్టే ఇంకో రిపీట్ సీనుతోనే సాదాగా వుండి తేలిపోతుంది.

సెకండాఫ్ ప్రారంభంలో కథ ఇంకో మలుపు తీసుకుని, మసూదాబీ హార్రర్ ఫ్లాష్ బ్యాక్ తో భయపెట్టడం మొదలెడుతుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో చిత్తూరు జిల్లా గ్రామంలో మంత్రగత్తె మసూదాబీ చేతబడి ఘోరాలు ఇదివరకు వచ్చిన సినిమాలకి భిన్నంగా, బీభత్సంగా వుంటాయి. ఫ్లాష్ బ్యాక్ తర్వాత పీర్ బాబా -నీలం, గోపీలకి ఒక చాదర్ ఇచ్చి, మసూదాబీ కంకాళం మీద కప్పమనే విరుగుడు మంత్రంతో సుదీర్ఘ క్లయిమాక్స్ మొదలవుతుంది.

ఈ క్లయిమాక్సే హద్దులు దాటి సాగుతూ సాగిపోతూ వుంటుంది. బీభత్స భయానక రసం అదేపనిగా ఎక్కువైపోతే భయపెట్టడం పోయి విసుగుపుట్టించే ప్రమాదం కూడా వుంది. నటనలు, కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అత్యంత ప్రభావశీలంగా వుండడంతో ఈ ప్రమాదం కాస్త తప్పిందనుకోవాలి. అయినా ఎడిట్ చేసి 20 నిమిషాలు తొలగిస్తే బెటర్.

నటనలు- సాంకేతికాలు

హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించి క్యారక్టర్ ఆర్టిస్టుగా మారిన సంగీత -తల్లి పాత్రలో నటన, ఎక్స్ ప్రెషన్స్, కూతురి కోసం స్ట్రగుల్, పక్క ఫ్లాట్ గోపీతో బాండింగ్, అతడితో కలిసి చిత్తూరు అడవుల్లో నైట్ పూట క్లయిమాక్స్- ప్రతీ చోటా దృష్టి నాకర్షిస్తుంది.

కూతురుగా బాంధవీ శ్రీధర్ ప్రేతాత్మ ఆవహించిన హార్రర్ సీన్లు, క్లయిమాక్స్ లో అందర్నీ చంపుతూ చేసే బీభత్సం టెర్రిఫిక్ గా నటించింది. గోపీగా తిరువీర్ అమాయకుడిగా, భయస్థుడిగా ఫస్టాఫ్ లో పాత్ర అంతగా లేకపోయినా- సెకండాఫ్ లో కథని తానే డ్రైవ్ చేసే యాక్టివ్ పాత్రగా మారిపోతాడు. మాస్ హీరోయిజాలు లేని సహజ నటనతో ఆకట్టుకుంటాడు. ఇంకా చిత్తూరు జిల్లా గ్రామంలో ఉమ్మడి కుటుంబంలోని ముస్లిం పాత్రలూ, హైదరాబాద్ లో పీర్ బాబా హవేలీ లోని ముస్లిం పాత్రలూ తెలుగు సినిమాకి కొత్త బ్యాక్ డ్రాప్ నిస్తాయి.

ఇక టక్ చేసుకుని వుండే మోడరన్ పీర్ బాబాగా శుభలేఖ సుధాకర్, అసిస్టెంట్ అల్లావుద్దీన్ గా సత్యం రాజేష్ కూడా పాత్రల్లో బలం లేక సాధారణంగా కన్పిస్తారు. అయితే క్లయిమాక్స్ లో పీర్ బాబా ప్రత్యక్షంగా పాల్గొనకుండా చాదర్ ఇచ్చి నీలం, గోపీలని పంపేసి వూరుకోవడం, ఎక్కడో నమాజు చేయడం ద్వారా ప్రేతాత్మని అంతమొందించా లనుకోవడం ఏ మాత్రం కుదర్లేదు. నీలం- గోపీలే ప్రాణాలకి తెగించి చాదర్ కప్పి ప్రేతాత్మని అంతమొందిస్తారు.

ఇక మసూదాబీగా నటించిన అఖిలారామ్ కి అందరి కంటే ఎక్కువ ప్రశంసలు దక్కుతాయి. దెయ్యంగా మొహంలో చూపించిన భావాలు ల్యాండ్ మార్క్ ఎక్స్ ప్రెషన్స్ గా నిలుస్తాయి. అయితే బురఖాలో వున్నప్పుడు డూప్ ని వాడినట్టు ఎత్తుగా, బలిష్టంగా కన్పిస్తుంది. పది మందిని ఫైట్ లో విరగదీస్తుంది కూడా. అఖిలారామ్ ని చూస్తే ఈ రేంజి ఫైట్ ఆమెకి సాధ్యం కాదు. అసలు బురఖాలో వున్నది మేల్ ఆర్టిస్టో- లేదా ఫైటరో అయివుండాలి.

చవకబారు తనం లేకుండా రిచ్ విజువల్స్, టైట్ గ్రాఫిక్స్, స్లిక్ ఎడిటింగ్, స్పెషల్ ఎఫెక్ట్స్ తో సౌండ్ డిజైన్, నేపథ్య సంగీతం, కెమెరా వర్క్ మాత్రం కళ్ళు తిప్పుకోకుండా చేస్తాయి. అయితే 80 శాతం షూట్ చేశాక, నచ్చక రీషూట్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే స్క్రిప్టు కూడా మార్చుకుని వుండాల్సింది. ఇది మామూలు సీరియస్ హార్రర్ కాదు- హార్డ్ హిట్టింగ్ హార్డ్ కోర్ హార్రర్. చావులు, రక్తాలు, ఆర్తనాదాలు, బీభత్సం, జుగుప్సా యదేచ్ఛగా చూపించేశాడు కొత్త దర్శకుడు సాయి కిరణ్. తొలిసారిగా ముస్లిం చేతబడి నేపథ్యమనేది ఈ మూవీ యూఎస్పీ అనాలి.

—సికిందర్

Friday, November 18, 2022

1249 : రివ్యూ!

రచన -దర్శకత్వం : రాజ్ విరాట్
తారాగణం : నందు విజయ్ కృష్ణ, రష్మీ గౌతమ్, కిరీటి దామరాజు, రఘు కుంచె తదితరులు
సంగీతం: ప్రశాంత్ విహారి, ఛాయాగ్రహణం : సుజాతా సిద్ధార్థ్
నిర్మాతలు: ప్రవీణ్, బోసుబాబు, ఆనంద్ రెడ్డి, మనోహర్ రెడ్డి
విడుదల : నవంబర్ 4, 2022
***
        నందు విజయ్ కృష్ణ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు ఫలించడం లేదు. సహాయ పాత్రలు కూడా నటిస్తున్నాడు. తన దగ్గర ఏ పాత్రయినా నటించగల టాలెంట్ వుంది గానీ మంచి అవకాశాలు రావడం లేదు. ఇటీవల సవారీ లో హీరోగా నటించాడు గానీ అది మరీ బి గ్రేడ్ సినిమాలాగా వుంది. తిరిగి ఇప్పుడు బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ వచ్చాడు. ఇందులో యాంకర్ రేష్మీ గౌతమ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. దీనికి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీసిన రాజ్ విరాట్ కొత్త దర్శకుడు. ఈ ముగ్గురూ కలిసి టైటిల్ తో పోటీపడుతూ నిజంగా బ్లాక్ బస్టర్ బొమ్మ తీశారా లేదా చూద్దాం...

కథ

మత్స్యకారుడైన పోతురాజు (విజయ్ కృష్ణ) దర్శకుదు పూరీ జగన్నాథ్ వీరాభిమాని. కథ రాసి పూరీ జగన్నాథ్ చేత సినిమా తీయించాలని పగటి కలలు కంటూ వుంటాడు. ఆ కథ పట్టుకుని పోతూ యాక్సిడెంట్ కి గురవుతాడు. ఆ కథ ఓ నిర్మాత చేతిలో పడుతుంది. అతను చదువుతాడు. అది పోతురాజు కథ.

పోతురాజు వూళ్ళో నేస్తాలని వేసుకుని వీధి పోరాటాలు చేస్తూ ఆవారాగా తిరుగుతూంటాడు. నయాపైసా కట్నం లేకుండా ప్రేమిస్తున్న వాడితో చెల్లెలి పెళ్ళి జరిపిస్తాడు. వాణి (రేష్మీ గౌతమ్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈమెకి ఎవరైనా కొట్టుకుంటూ వుంటే చూసి ఆనందించడం సరదా. ఈమె కోసం జనాలని కొట్టడం ప్రారంభిస్తాడు. ఇంతలో ఒకడు డాన్సింగ్ స్కిల్స్ చూపించే సరికి వాడి వెంట పడుతుంది వాణి. వాడి సంగతి చూస్తాడు. మరింతలో గతంలో తన తండ్రి చనిపోయిన కారణం తెలుస్తుంది పోతురాజుకి. దీంతో తండ్రిని చంపిన వాళ్ళ మీద పగబడతాడు. ఇదీ కథ.

ఎలావుంది కథ

అర్ధం పర్ధం లేని కథ. బొమ్మ బ్లాక్ బస్టర్ కాదుకదా అట్టర్ ఫ్లాప్ అవడానికి కూడా కొన్ని అర్హతలుంటాయి. షార్ట్ ఫిలిమ్స్ తీసిన దర్శకులతో ఇదే సమస్య. రెండు గంటల నిడివిగల కథ చేసుకోవడానికి యాక్ట్స్ తెలీవు. పైగా ఈ కొత్త దర్శకుడు సినిమా అనగానే ఇంకా అరిగిపోయిన మూస ఫార్ములా కథనే  తయారు చేసుకున్నాడు. అందర్నీ కొట్టే ఆవారా హీరో, నిస్సహాయ తండ్రి, చెల్లెలి పెళ్ళి, హీరోయిన్ తో లవ్ ట్రాక్, తండ్రి మరణానికి రివెంజ్... ఇదీ వరస!

ఇంకా విచిత్రమేమిటంటే, ఆవారా హీరో రాసుకున్న ఈ ఆత్మకథ నిర్మాతకి నచ్చి  రికమెండ్ చేయడానికి పూరీ జగన్నాథ్ దగ్గరికి వెళ్ళడం! అయితే పూరీ జగన్నాథ్ బ్రతికిపోయాడు. నిర్మాత ఆయన రూమ్ దగ్గరికి వెళ్ళగానే, ఆయన పర్మిషన్ ఇవ్వలేదేమో, అందుకని కట్ చేసి శుభం వేసేశాడు దర్శకుడు. 

కథ కోసం క్రియేట్ చేసిన రూరల్ వాతావరణం, మత్స్యకారుల జీవితం, సంస్కృతి, కుల దైవాలు, వీటి తాలూకు సంగీతం...ఇవి మాత్రం చక్కగా చిత్రీకరించాడు. ఇంకోటేమిటంటే దృశ్యాల టేకింగ్ కూడా రెగ్యులర్ సినిమాల్లాగా గాకుండా, నోయర్ జానర్ లో ఆఫ్ బీట్ సినిమా శైలిలో చేశాడు. తనకి ఏదో కొత్త టెక్నిక్ ని ఫాలో అవ్వాలన్న ఉత్సాహముంది. అయితే మోడరన్ టెక్నిక్ కి పాత చింతకాయ కథ వల్ల ఫలితం తారుమారైంది. .

కొత్త దర్శకులు కథ దగ్గర  విఫలమవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ కథని చాలాకాలం శ్రమించి తయారు చేసుకుని వుంటారు. ఆ కథే వాళ్ళ కెరీర్ కి పునాది వేస్తుందనే నమ్మకంతో కృషి చేస్తారు. అయినా ఆ కథతో తీసిన సినిమా ఫ్లాపయ్యిందంటే కథా కథనాల గురించి చాలా బేసిక్స్ తెలియకుండానే కృషి చేశారన్నమాట. మొదటి సినిమాతో ఫ్లాపయిన దర్శకుడు ఇక ముందుకు కొనసాగడం కల్ల. రాబర్ట్ మెక్ కీ అన్నట్టు, తాననుకున్న కథే కథనుకుంటే దటీజ్ షిట్!

ఒకప్పుడు యూత్ సినిమాల ట్రెండ్ లో మిడిల్ మటాష్ అనే కొత్త రోగంతో సినిమాలు చూశాం. అంటే క్లయిమాక్స్ వరకూ కథే ప్రారంభం కాకుండా ఒకటే కామెడీలతో బిగినింగే నడిచి, మిడిల్ మాయమైపోతుంది. క్లయిమాక్స్ దగ్గర అప్పుడు మిడిల్ ప్రారంభమై- అంటే కథ ప్రారంభమై- ప్రేమలో ఏదో సిల్లీ ప్రాబ్లంతో ఐదు పదినిమిషాలు సంఘర్షణ జరిగి- ఆ కాస్తా మిడిల్ ముగిసిపోయి- ఎండ్ తో పరిష్కారమై పోతుంది సమస్య. ఇందుకే దీన్ని మిడిల్ మాటాష్ స్క్రీన్ ప్లే- అంటే కథ లేని స్క్రీన్ ప్లే అనాలి.
        
ఈ కొత్త దర్శకుడితో ఇదే జరిగి వుండాలి. బహుశా ఆనాడు యూత్ సినిమాలు చూస్తూ పెరిగిన జీవితం. ఆ ప్రభావంతో ఈ మిడిల్ మాటాష్ స్క్రీన్ ప్లే. ఆ నాటి యూత్ సినిమాల చీడ పీడ కథనాలు నేటికీ దర్శకులవుతున్న వాళ్ళని చెడగొడుతున్నాయి. ఈ విషయం అనేకసార్లు బ్లాగులో ప్రస్తావించుకున్నా- ఇంకా ఇలాగే సినిమాలు తీస్తున్నారు. చాలా మంచి విషయం. ఇలాగే తీసి నిర్మాతలకి బుద్ధి చెప్పాలి.

ఇందులో ఫస్టాఫ్ నుంచీ సెకండాఫ్ వరకూ హీరో అల్లరి, ఫైట్లు, ప్రేమలూ ఇవే వుంటాయి కథే ప్రారంభం కాకుండా. సెకండాఫ్ సగం గడిచాక తండ్రి పాత్రతో ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమై, హత్య, రివెంజీ వీటితో ముగిసిపోతుంది. అంటే మొదట్నుంచీ ఈ కథనం దేని గురించో తెలియడానికి అకస్మాత్తుగా రివెంజీ పాయింటు వచ్చే ప్లాట్ పాయింట్ టూ వరకూ ఆగాలి. ఇదీ కథ అని ఇప్పుడు తెలుస్తుంది. ఈ కథ ప్రారంభించడానికి గంటన్నరకి పైగా బిగినింగ్ ని సాగదీశాడు. ఇక తండ్రి మరణానికి ఒక పూర్తి విషాద గీతమే వేశాడంటే ఏ కాలంలో వున్నాడో అర్ధం జేసుకోవచ్చు.

నటనలు-సాంకేతికాలు

రఫ్ ఆవారా పాత్రలో విజయ్ కృష్ణ నటన చూస్తే ఏ పాత్రయినా నటించేయగలడనేది స్పష్టమవుతుంది. అయితే ఆవారా కదాని మరీ ఓవరాక్షన్ కూడా చేశాడు. ఈ పాత్ర పూరీ జగన్నాథ్ అభిమాని అయినప్పుడు, పూరీ జగన్నాథ్ తీసిన సినిమాల్లో వివిధ హీరోల యాక్టింగ్ ని ఇమిటేట్ చేసినా బావుండేది వినోదానికి.

విషయాల్ని తేలికగా తీసుకుని ఎంజాయ్ చేసే పాత్రలో రేష్మీ గౌతమ్ మంచి ఈజ్ తో నటించింది. తన వల్ల సీన్లకి గ్లామర్ వచ్చింది. ఇంకా ఒకరిద్దరు తప్ప నటీనటులందరూ కొత్త వాళ్ళే. అందరూ రూరల్ శ్రామిక వర్గ పాత్రల్ని సహజంగా నటించేశారు.

పైన చెప్పుకున్నట్టు, కంటెంట్ లేకపోయినా టెక్నికల్ గా ప్రయోగం చేయాలన్న ప్రయత్నం వరకూ సఫలమైంది. ప్రశాంత్ విహారి సంగీతం, సుజాతా సిద్ధార్థ్ ఛాయాగ్రహణం, ఎడిటింగ్, యాక్షన్ సీన్స్ వగైరా కొత్తదనాన్ని ప్రదర్శించాయి. అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ అవడానికి ఇవి చాలవు. సినిమాలోనే నిర్మాత పాత్ర చేత దర్శకుడు తనే చెప్పించినట్టు- కథ -కథలా అన్పించే బలమైన కథ కావాలి!

—సికిందర్

 

Saturday, November 12, 2022

1248 : రివ్యూ!


రచన - దర్శకత్వం : గుర్మీత్ సింగ్
తారాగణం : కత్రినా కైఫ్, సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్, జాకీ ష్రాఫ్ తదితరులు
సంగీతం : తనిష్క్ బాగ్చీ, ఛాయాగ్రహణం : కె.యు.మోహనన్
బ్యానర్ : ఎక్సెల్ ఎంటర్టయిన్మెంట్
నిర్మాతలు : ఫర్హాన్ అఖ్తర్, రీతేష్ సిధ్వానీ
విడుదల : నవంబర్ 4, 2022

***

కథ
          పంజాబ్ కి చెందిన మేజర్ (సిద్ధాంత్ చతుర్వేది), తమిళనాడుకి చెందిన గెలీలియో అలియాస్ గుల్లూ (ఇషాన్ ఖట్టర్) లు హార్రర్ సినిమాలు చూస్తూ పెరిగి, దెయ్యాలపై ఆసక్తి పెంచుకుని ఘోస్ట్ బస్టర్స్ గా మారాలనుకుంటారు. కానీ దెయ్యాల్ని వదిలించే వృత్తి అంతగా సాగక, తమ రాకా దేవుడ్నిసాయం అడుగుతారు. ఎక్కడో కొండని తవ్వినప్పుడు దొరికిన ఆ విగ్రహానికి రాకా దేవుడుగా పేరు పెట్టుకుని కొలుస్తూంటారు. ఇంతలో రాకా కళ్ళలో వెలుగు పోతుంది. రాకా కళ్ళల్లో వెలుగులు నింపడానికి కరెంటు పెట్టబోతే షాక్ కొట్టి ఆత్మల లోకాని కెళ్ళిపోతారు.

అక్కడ చాలా ఆత్మల మధ్య రాగిణి (కత్రినా కైఫ్) అనే దయగల ఆత్మ వుంటుంది. ఆమె ఒక డీల్ చెబుతుంది. భూమ్మీద అనేక ఆత్మలు తమకి జరిగిన అన్యాయాలకి దుఖిస్తూ మోక్షం పొందలేక పోతున్నాయనీ, మేజర్- గుల్లూలు ఆ అన్యాయాలు చేసిన వాళ్ళని శిక్షించి, ఆత్మలకి విముక్తి కలిగేలా చేస్తే చాలా డబ్బు ఇస్తాననీ అంటుంది రాగిణి ఆత్మ.

తమ ఇద్దర్నీ సైన్యంలో మేజర్ గా ఒకర్ని, గెలీలియో లాంటి సైంటిస్టుగా ఇంకొకర్నీ చూడాలన్న తమ తండ్రుల కోరికలు తీర్చలేక పోయినందుకు- ఇంత కాలం తమని పెంచి పోషించడానికి అయిన ఖర్చు 5 కోట్లు ఇచ్చేయాలనీ తండ్రులు డిమాండ్ చేస్తున్నందున, రాగిణి డీల్ కి ఒప్పుకుంటారు.

అయితే రాగిణి ఇచ్చే డబ్బులో కొంత భాగాన్ని బాధిత ఆత్మల కుటుంబాలకి అందించాలి. తద్వారా ఆత్మలు సంతృప్తి చెందాకే మోక్షాన్ని పొందుతాయి. ఇదెక్కడి పీకులాట అనుకుంటూ కళ్ళు తెరవగానే ఈ లోకంలో కొచ్చి పడతారు.

ఇక రాగిణి శిష్యులుగా డీల్ ప్రకారం, సాయం కోరే ఆత్మల ఫోన్ కాల్స్ రిసీవ్ చేసు కోవడానికి ఫోన్ భూత్ అనే కంపెనీని స్థాపిస్తారు. రాగిణి తోడ్పాటుతో ఇది బ్రహ్మాండంగా నడుస్తూంటుంది. ఇది శాస్త్ర శక్తి సోల్ ఎంటర్ప్రైజెస్ కంపెనీని నడుపుతున్న తాంత్రికుడు ఆత్మా రామ్ (జాకీష్రాఫ్) దృష్టిలో పడుతుంది. ఇతను ఆత్మలు మోక్షం పొందకుండా పట్టి బంధిస్తూంటాడు. దీంతో పరస్పర వ్యతిరేక శక్తులుగా అవతరించిన రాగిణి శిష్యులూ, ఆత్మారామ్ ఇక కొట్టుకోవడం ప్రారంభిస్తారు.

అసలు ఈ డీల్ ఇవ్వడానికి రాగిణికి సొంత కారణముంటుంది. తను మరెవరో కాదు,  దివంగత రాజు రాజా దుష్యంత్ సింగ్ తోబాటు కారు ప్రమాదంలో మరణించిన అతడి ప్రేమికురాలు. ఈ కారు ప్రమాదం వెనుక ఎవరున్నారు? ఇది కథకి ఇంకో కోణం.

ఎలావుంది కథ

హార్రర్ కామెడీలు ఆదరణ కోల్పోయిన కాలంలో న్యూఏజ్ హార్రర్ కామెడీ అంటూ డిఫరెంట్ మేకింగ్ తో, సరికొత్త అనుభవాన్నివ్వాలని తలపెట్టిన ప్రయత్నం మంచిదే. అయితే ఈ ప్రయత్నం ఫస్టాఫ్ పై వివరాలతో కథని ఎస్టాబ్లిష్ చేసేంత వరకే. సెకండాఫ్ కొస్తే  వస్తున్న చాలా సినిమాల్లో లాగే కథ కంచికి బాక్సాఫీసు బెగ్గింగ్ కి. హీరో రొటీన్ గా యమ లోకాని కెళ్ళే కథల్లా కాకుండా ఆత్మల లోకాని కెళ్ళడం, లోక కళ్యాణం కోసం డీల్ చేపట్టడం, ఆధునిక కాలపు పోకడలతో కొత్త కథే.

అయితే దీన్ని అడ్డుకునే తాంత్రికుడితో సంఘర్షణ కొచ్చేసరికి సరుకు అయిపోయినట్టు సెకండాఫ్ సిల్లీగా మారింది. జోకులతో స్టాండఫ్ కామెడీగా మారిపోయి సంఘర్షణ చెదిరి పోయింది. కేవలం రాగిణి ఆత్మని తాంత్రికుడు సీసాలో బంధించి మాయం చేసే మలుపు తప్ప సెకండాఫ్ లో విషయం లేదు. ఇక ముగింపు పాత రొటీనే. తాంత్రికుడ్ని చంపడానికి హీరోలు అతడి గుహలోకి ప్రవేశించడం, పని పూర్తి చేయడం వగైరా.

దర్శకుడు కేవలం న్యూ ఏజ్ యూత్ సినిమాలాగా తీయాలని విజువల్స్ కి, స్టయిల్ కీ ఇచ్చిన ప్రాధాన్యం కథకి పూర్తిగా ఇవ్వలేదు. విభిన్నంగా చేసిన మేకింగ్, విషయపరంగా డొల్లగా మారడంతో బూడిదలో పోసిన పన్నీరైంది. ఇంకో కాలం తీరిన హార్రర్ కామెడీ గా మాత్రం ఇది మిగిలింది.

నటనలు -సాంకేతికాలు

ఈ హార్రర్ కామెడీలో కత్రినా కైఫ్ కామెడీ కుదరలేదు.  ఆమె రాజుని ప్రేమించిన ప్రేమికురాలిగా హూందా తనంతోనే ఎక్కువగా వుంది. 2011 లో 'మేరే బ్రదర్ కీ దుల్హన్' లో ఆమె చేసిన కామెడీ పాత్రతోనే సూపర్ హిట్టయ్యింది. అలాటి కామెడీ ఇందులో ఆశించలేం. న్యూ ఏజ్ యూత్ సినిమా అన్నాక యూత్ ఫుల్ గానే నటించాలి. పైగా వయసు పైబడడం ఒకటి. ఆత్మల లోకంలో ఒక పాట కూడా డల్ గా వుంది. ఫస్టాఫ్ లో హీరోలతో రెండు మూడు కామెడీలు- వాళ్ళ రియాక్షన్స్ తోనే పేలాయి.

యంగ్ హీరోలిద్దరూ చాలా కామెడీలు చేశారు- అయితే ఫస్టాఫ్ వరకే. సెకండాఫ్ లో సిట్యుయేషనల్ కామెడీలు చేయడానికి తగిన కథ లేక, స్టాండప్ కామెడీలతో - జోకులతో లాక్కొచ్చారు. స్టాండప్ కామెడీలకి యూట్యూబ్ లో ఎక్కువ అభిమానులున్నారు. ఆ కమెడియన్లు వేరు.

ఇక జాకీష్రాఫ్ తాంత్రికుడి దుష్టపాత్రలో సెకండాఫ్ చేయడానికేమీ లేదు. అందరి సమస్య, సినిమా అసలు సమస్య సెకండాఫే. ఈ సినిమాకి ఒకరు కాదు, నలుగురు సంగీత దర్శకులు చేసిన ఐదు పాటల్లో ఒకటే ఫర్వాలేదు. సాంకేతిక విలువలకి బాగా ఖర్చు పెట్టారు పేరున్న నిర్మాతలు. నిర్మాతల్లో ఫర్హాన్ అఖ్తర్ ప్రముఖ దర్శకుడు కూడా. వేరే దర్శకుడికి అవకాశమిచ్చి సినిమా నిర్మించినప్పుడు ఫలితమిలా వుంది.

—సికిందర్


Thursday, November 10, 2022

1247 : రివ్యూ!


 

రచన- దర్శకత్వం : జయతీర్థ
తారాగణం : జైద్ ఖాన్,  సోనాల్ మోంటెరో, సుజయ్ శాస్త్రి, దేవరాజ్, అచ్యుత్ కుమార్ తదితరులు
సంగీతం బి. అజనీష్ లోక్‌నాథ్, ఛాయాగ్రహణం : అద్వైత గురుమూర్తి
బ్యానర్ : ఎన్ కె  ప్రొడక్షన్స్
నిర్మాతలు : తిలకరాజ్ బల్లాల్, ముజమ్మిల్ అహ్మద్ ఖాన్
విడుదల : నవంబర్ 4,  2022
***
        న్నడ సినిమాలు జాతీయంగా హిట్టవుతున్న నేపథ్యంలో మరో కన్నడ మూవీ  బనారస్ కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో యువ ప్రేక్షకుల వినోదం కోసం థియేటర్లని అలంకరించింది. కర్ణాటక ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ కుమారుడు జైద్ ఖాన్ ఈ మూవీతో హీరోగా రంగప్రవేశం చేశాడు. మిస్టీరియస్ రోమాంటిక్ డ్రామాగా ప్రచారం చేసిన దీనికి జయతీర్ధ దర్శకుడు. ఇతను చెప్పే మిస్టీరియస్ రోమాంటిక్ డ్రామా ఏమిటో చూద్దాం...

కథ

సిద్ధార్థ్ (జైద్ ఖాన్) బీఎస్సీ ఫైనల్ స్టూడెంట్. ఇతను ధని (సోనాల్ మోంటెరో) ని కలిసి తను భవిష్యత్తులోంచి వచ్చానని, తామిద్దరికీ పెళ్ళయ్యిందనీ అంటాడు. ఇతను చెబుతున్న టైమ్ ట్రావెల్ విషయాలకి ఆసక్తి పెంచుకుని స్నేహం చేస్తుందామె. ఆమెతో చనువు పెంచుకుని ఒక రోజు ఆమె గదిలోకి వెళ్ళి నిద్రపోతున్న ఆమె ఫోటో తీస్తాడు. ఆ ఫోటో ఫ్రెండ్స్ కి చూపించి తను బెట్ గెలిచానని అంటాడు. ఓ అమ్మాయిని బెడ్రూంలో ఫోటో తీసి చూపించాలన్న బెట్ అది. ఒక ఫ్రెండ్ ఆ ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పెట్టేస్తాడు. దీంతో అవమానంగా ఫీలైన ధని అదృశ్యమైపోతుంది. ఆమెని వెతుక్కుంటూ బనారస్ (వారణాసి) చేరుకుని ఆమెకి సారీ చెప్పాలని ప్రయత్నిస్తాడు సిద్ధార్థ్. చాలా బెట్టు చేసి చివరికి క్షమిస్తుంది.

ఇద్దరూ ప్రేమించుకుంటారు. బనారస్ లో ఆమె బాబాయ్ దగ్గర వుంటోంది. అయితే ప్రేమలో పడ్డాక సిద్ధార్థ్ టైమ్ లూప్ లో పడిపోతాడు. అతడి జీవితంలో ఒకే రోజు జరిగిన సంఘటనలే రిపీట్ అవుతూంటాయి. ఈ కాల వలయంలోని బయటపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తాడు. ఇలా ఇందులో విజయం సాధించి తిరిగి మామూలు జీవితంలోకి వచ్చాడా? ఇద్దరి ప్రేమ సుఖాంతమయ్యిందా? ఇదీ మిగతా కథ.

ఎలా వుంది కథ

ఇటీవలి ఒకే ఒక జీవితం లాగా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో కథ ప్రారంభమైందనుకుంటాం. కానీ టైమ్ ట్రావెల్ కాకుండా  టైమ్ లూప్ కాన్సెప్ట్ గా మారిపోతుంది. గడుపుతున్న రోజు తెల్లారితే తేదీ మారకుండా, మళ్ళీ అదే తేదీతో రిపీటయ్యే, అవే సంఘనలు జరిగే, టైమ్ లూప్ కాన్సెప్ట్ గా మార్చి చేసిన కథ పూర్తిగా విఫలమైంది.

సిద్ధార్థ్ ఫస్టాఫ్ లో ధనిని ట్రాప్ చేసి ఫోటో తీశాక, తప్పు తెలుసుకుని మాయమై పోయిన ఆమెని బనారస్ వెళ్ళి పట్టుకుని, సారీ చెప్పే ప్రయత్నంతోనే ఫస్టాఫ్ గంటా 20 నిమిషాలు గడిచి పోతుంది. ప్రారంభంలో టైమ్ ట్రావెల్ ని ప్రస్తావించి చెప్పిన కథంతా, టైం ట్రావెల్ జోలికి ఎంతకీ వెళ్ళకుండా, చీప్ రోటీన్ లవ్ స్టోరీగా సాగుతుంది. పాతగా అన్పించే సీన్లు, పేలవమైన డైలాగులు, నత్తనడక కథనం.

సారీ చెప్పడానికి రిపీటవుతూ వుండే అవే సీన్లు, బనారస్ లో పుణ్య క్షేత్రాల టూరింగ్ అన్నట్టు సాగుతాయి. ఇక వచ్చే మూడు పాటలైతే భరించడం కష్టం. ఆమె మీద పూర్తి భక్తి పాట ఒకటి పెట్టేశారు ఈ రోజుల్లో. ఇది రోమాంటిక్ డ్రామానా, సైన్స్ ఫిక్షనా, భక్తి సినిమానా అర్ధం గాకుండా వుంటుంది.

ఈ మధ్య నార్త్ పుణ్యక్షేత్రాల నేపథ్యంలో సినిమాలు తీస్తే నార్త్ లో - రాజకీయాల పుణ్యమాని మత భక్తి పెరిగిపోయిన ప్రేక్షకులతో బాక్సాఫీసు బద్ధలవుతోందనే ఒక నమ్మకంతో సినిమాలు తీస్తున్న ట్రెండ్ మొదలైంది. కానీ మొన్న  రామ్ సేతుతో, ఇవ్వాళ  బనారస్ తో పథకం పారలేదు.

ఫస్టాఫ్ గంటా 20 నిమిషాల తర్వాత ఎలాగో పాయింటుకొచ్చి (పాయింటు మార్చి), సెకండాఫ్ ని దర్శించుకుంటే, మళ్ళీ ఈ గంటా 10 నిమిషాలూ టైమ్ లూప్ కాన్సెప్ట్ తమ మీదపడి విలవిల లాడతారు ప్రేక్షకులు. విల విల లాడడానికి ప్రేక్షకులు లేరనేది వేరే విషయం-మనలాంటి కొందరు అమాయకులు తప్ప. టైమ్ లూప్ లో చిక్కుకున్న సిద్ధార్థ్ కి ఆ వొక రోజే మళ్ళీ మళ్ళీ రిపీటవుతూంటుంది. కొన్ని మార్పులతో అవే సీన్లు మళ్ళీ మళ్ళీ చూస్తూ పోవాలి. ఇలా నాల్గు సార్లు జరిగాక లూప్ లోంచి బయటపడతాడు. బ్రతుకు జీవుడా అని మనం కూడా.

ఫస్టాఫ్ ఒక సినిమా, సెకండాఫ్ వేరే సినిమా చూస్తున్నట్టు వుంటుంది. ఈ టైమ్ లూప్ లో దృశ్యాలు కూడా సస్పెన్స్, హింస, రక్తపాతంతో వుంటాయి. పుణ్య క్షేత్రంలో రక్తపాతం. ప్రేమ కథతో వయొలెన్స్. మిస్టీరియస్ రోమాంటిక్ డ్రామా అంటే ఇదే. ఈ టైం లూప్ దృశ్యాల వల్ల సెకండాఫ్ లో హీరో హీరోయిన్ల రోమాన్సుకి చోటే లేకుండా పోయింది. చక్కగా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సెంటిమెంటల్  ప్రేమ కథేదో నడుపుకోక, టైమ్ లూప్ అంటూ సెకెండాఫ్ వేస్ట్ చేశాడు. దీన్ని పానిండియా రిలీజ్ చేశారు.

నటనలు- సాంకేతికాలు

కొత్త హీరో జైద్ కష్టపడి ఎలాగో నటించాడు. జైద్ బనారస్ ఎలా వెళ్తాడని సినిమాని బాయ్ కాట్ చేసేంత దృష్టి పడలేదు బాయ్ కాట్ బ్యాచులకి. వాళ్ళు షారూఖ్ ఖాన్ ని బాయ్ కాట్ చేస్తూ బిజీగా వున్నట్టున్నారు. అయితే అన్ని గుళ్ళు గోపురాలు తిరిగే జైద్ ఒకసారైనా బొట్టు పెట్టుకోలేదేమిటా అన్పించొచ్చు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకైన జైద్ సేఫ్ గా సేఫ్ గా సినిమాతో బయటపడ్డాడు. అయితే ఇలాటి అర్ధం కాని ప్రయోగాలు కాకుండా అర్ధమయ్యే సినిమాలు నటిస్తే మంచిది.

హీరోయిన్ సోనాల్ మోంటెరో సాంప్రదాయ పాత్ర పోషించింది. చూడ్డానికి బాగానే వుంది. పాత్రకి చదస్తాలు చాలా వున్నాయి. యువ ప్రేక్షకుల్ని ఇవి ఆకట్టుకోవు. అయితే సెకండాఫ్ లో కన్పించే సమస్యే లేదు చివర్లో తప్ప. సెకండాఫ్ టైం లూప్ లో పడి హీరో కొట్టుకోవడంతోనే సరిపోయింది.

కెమెరా వర్క్ అంత అద్భుతమేం కాదు. బడ్జెట్ పరిమితుల వల్ల వారణాసి లొకేషన్స్, విజువల్స్ సాదాగా వున్నాయి. పాటలు, నేపథ్య సంగీతం మాత్రం అపస్వరాలు పలుకుతున్నట్టు వున్నాయి. మొత్తం మీద దర్శకుడు జయతీర్ధ చేయించిన ఈ తీర్ధయాత్ర రెండున్నర గంటల తీరని వ్యధగా చెప్పుకోవచ్చు. 

—సికిందర్