రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, January 24, 2019

729 : లవర్ నుంచీ ఎఫ్ 2 దాకా...


      ఫ్యామిలీ సినిమాలు నాల్గు విడుదలై నాల్గూ ఫ్లాపయ్యాయి. మాస్, యాక్షన్, కామెడీ మొదలైన కథల్లో లాజిక్ లేకపోయినా భరించవచ్చు గానీ మానవ సంబంధాలతో, కుటుంబ సంబంధాలతో వుండే ఫ్యామిలీ కథల్లో లాజిక్ లేకపోతే భరించడం కష్టం. ఈ సంబంధాలు ప్రేక్షకులు నిత్యజీవితంలో పర్సనల్ గా అనుభవించేవి కనుక లాజిక్కులు తెలిసిపోయి వుంటాయి. వాటిని దాటవేయడం కుదరదు. ఒక విషయంలో పుట్టే ఇగోలకి సరైన కారణం చూపకపోతే  ఆ కథ నిలబడదు. ఇందుకే నమ్మదగ్గ డ్రామాలు సృష్టించాలంటే 1946 లో లజోస్ ఎగ్రీ అనే నాటక రచయిత రాసిన ప్రసిద్ధ గ్రంథం ‘ది ఆర్ట్ ఆఫ్ డ్రమెటిక్ రైటింగ్’ చదువుకోవాలని, 72 సినిమాల బాలీవుడ్ రచయిత రాబిన్ భట్ (మహేష్ భట్ సోదరుడు) చెప్పేవాడు. ఈ గ్రంథం నాటకాలకి సంబంధించిందే అయినా సినిమాలకెంతో ఉపయోగపడుతుంది. నెట్ లో పీడీఎఫ్ ఉచిత డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఒకటేమిటంటే, తెలుగులో స్క్రీన్ ప్లేలకి సంబంధించి ఎలాటి పుస్తకాలూ లభ్యం కావు. అందుకని కాస్త ఇంగ్లీష్ పరిజ్ఞానం కూడా కలిగి వుంటే గ్లోబల్ సమాచారం  అరచేతిలో వుంటుంది. ఇంగ్లీష్ పరిజ్ఞానం లేకపోయిందా, గల్లీ సినిమాలు తీసే స్థాయిలోనే వుండిపోతారు మిడిమిడి జ్ఞానపు సొంత దుకాణం పెట్టుకుని. 
          నాల్గు ఫ్యామిలీ సినిమాల సంగతులు ఈ కింద చూద్దాం...
1. విజేత 
కళ్యాణ్ దేవ్, మాళవికా నాయర్, రాకేశ్ శశి (కొత్త దర్శకుడు) 
మార్కెట్ యాస్పెక్ట్ :  కాలం చెల్లిన ఫ్యామిలీ కథ - ఫ్లాప్
క్రియేటివ్ యాస్పెక్ట్ : కాలం చెల్లిన కథాకథనాలు - ఫ్లాప్
          కాలం తీరిన ఫ్యామిలీ జానర్ కథ. ఇలాటి కథలు గతంలో కుప్పలు తెప్పలుగా వచ్చాయి. అదే టెంప్లెట్ లో  దీన్నీ తీశారు. తెలుగులో ఫ్యామిలీ సినిమాలంటే పాత ఫార్ములా టెంప్లెట్టే ఇంకా పనిచేస్తుందన్న అపోహతో వున్నారు. ఇవాళ్టి  కుటుంబ సమస్యలు, రూపు రేఖలు మారిపోయాయన్న మార్కెట్ యాస్పెక్ట్ పట్టడం లేదు. దీంతో క్రియేటివ్ యాస్పెక్ట్ కూడా అదే మూసలో  వుంటోంది. ఇలా ఇది ఇంకో కాలం చెల్లిన కుటుంబ కథయ్యింది. తండ్రి కల కొడుకు తీర్చే పాయింటు యూనివర్సల్ అప్పీలున్నదే. కానీ ఇలా కొత్త యువదర్శకుడు కూడా వచ్చి  దీన్నింకా ముసలి కథగానే తీస్తానంటే తనకే  అవమానకరం. ఎంత ఫ్యామిలీ డ్రామా తీయాలన్నా ఈ రోజుల్లో యూత్ అప్పీల్ అనే ఆక్సిజన్ తప్పని సరి. ప్రేక్షకులు చూసుకోవడానికి ఇలాటి పాత ఫ్యామిలీ సినిమాలు  చాలావున్నాయి. ఎక్కడా కొత్త దర్శకుడు తీసిన ఫ్రెష్ సినిమాలా అన్పించదు. తెలుగు సినిమా అంటే ఫస్టాఫ్ కామెడీతో కాలక్షేపం చేయడం, సెకండాఫ్ లో మాత్రమే కథని అందుకోవడం లాంటి రొటీన్ టెంప్లెట్ తప్ప, తను కనబరచిన తేడా ఏమీ లేదు. ఫస్టాఫ్ అంతా  హీరో ఆవారాగిరీతో కథలేకుండా కామెడీగా కాలక్షేపం చేశాక, వచ్చే మలుపుతో సెకండాఫ్ లోనే కథ వస్తుంది. తండ్రి కల హీరో నెరవేర్చే కథ. ఈ కథనం కూడా తెగుతూ అతుకుతూ సాగుతుంది. చివరి పది నిమిషాల్లోనే  గాడిలో  పడుతుంది. చివరి పది నిమిషాలు ప్రేక్షకుల్ని కట్టి పడేయగల్గితే చాలు,  మిగతా విషయం ఎలా వున్నా మర్చిపోతారనే స్కీము ఒకటి పాటిస్తున్న సినిమాలున్నాయి. ఈ స్కీము కూడా వర్కౌట్ కాలేదు. 

2. శైలజా రెడ్డి అల్లుడు
నాగచైతన్య, అనూ ఇమ్మాన్యూయేల్, మారుతి (7 సినిమాల దర్శకుడు)
మార్కెట్ యాస్పెక్ట్ : కాలం చెల్లిన అత్తాఅల్లుళ్ళ కథ - ఫ్లాప్
క్రియేటివ్  యాస్పెక్ట్ : అత్తాఅల్లుళ్ళ పాత ఫార్ములాకి ఇగో ప్రాబ్లం అంటూ జోడింపు - ఫ్లాప్

          భలేభలే మగాడివోయ్లో మతిమరుపు అనే మానసిక సమస్యని  నేచురల్ స్టార్ నాని పాత్రకి కల్పించి, అచ్చమైన, జానర్ స్పెసిఫిక్  రోమాంటిక్  కామెడీగా తీసి, సూపర్ హిట్ చేసుకున్నారు దర్శకుడు మారుతి. తర్వాత ఫ్రెష్ స్టార్ శర్వానంద్ తో మహానుభావుడుని మరో మానసిక సమస్య అంటూ ఇంకో రోమాంటిక్ కామెడీగా తీసి, మాదిరి హిట్ చేసుకున్నారు. ఇందులో ఒసిడి - అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ - అంటూ తనేదో ఇంటలిజెంట్ పాయింట్లు తీస్తాడన్నట్టు పబ్లిసిటీ చేసి, తీరా చూపించింది - అవకతవకగా - ఒసిడి అనే మానసిక సమస్య గాకుండా - కేవలం పరిసరాల అపరిశుభ్రత పట్ల ఎలర్జీ ఫీలయ్యే ఓ సాధారణ స్థితినే! ఇలా ప్రేక్షకుల్ని ఏమార్చి మానసిక సమస్యల ఫార్ములా వర్కౌట్ చేసుకోవచ్చని - అక్కినేని స్టార్ నాగ చైతన్యతో ఇగోఅనే ఇంకో మానసిక సమస్యంటూ శైలజా రెడ్డితీశారు. అయితే ఇలా మానసిక సమస్యల’ సోకాల్డ్  కథలతో మారుతీ టాలెంట్  మహానుభావుడు’ తో క్వాలిటీ తగ్గినట్టు, ఇప్పుడు ‘శైలజా రెడ్డి’ తో అసలుకే అడుగంటి పోయింది. 

         
కథలో రెండు వేర్వేరు కోణాలున్నాయనుకున్నారు : అత్తా అల్లుళ్ళ ఫార్ములా, ఇగో పాయింటు. కానీ రెండూ ఒకటే. అత్తా అల్లుళ్ళ ఫార్ములా అంటేనే ఇగోలు. పాత అత్తా అల్లుళ్ళ సినిమాల్లో ఇగోలే వుండేవి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇగో సమస్య వేరే అన్నట్టు బిల్డప్ ఇవ్వడమేమిటి – ఇవాళ్టి  ప్రేక్షకుల్ని ఏమార్చడం కాకపోతే. పైగా ఇగోలు  వుండాల్సిన పాత్రల మధ్య లేకపోవడం ఒకటి. ఉన్న ఇగోలకి కూడా సరైన కారణాలుండవు. పదేపదే ఇగోలున్నాయని డైలాగుల్లో ఊదర గొట్టుకోవడమే. ఇక తల్లీ కూతుళ్ళ మధ్య ఇగోల వల్ల ఐదేళ్లుగా మాటల్లేక పోవడానికి కారణమైన సంఘటన కూడా ఒప్పించేదిగా లేకపోవడం ఈ ఫ్యామిలీ డ్రామాని కృతకంగా మార్చేసింది. ఈ మొత్తాన్నీ టెంప్లెట్ లో పెట్టి ఈజీ స్క్రీన్ ప్లే’ లాగించేశారు. 

3. హేపీ వెడ్డింగ్
సుమంత్ అశ్విన్, నిహారికా కొణిదెల, లక్ష్మణ్ కె (కొత్త దర్శకుడు)
మార్కెట్ యాస్పెక్ట్ : ఫ్యామిలీలో టెంప్లెట్ రోమాంటిక్ డ్రామా – ఫ్లాప్
క్రియేటివ్ యాస్పెక్ట్ :  ఆద్యంతం పెళ్లి వీడియో – ఫ్లాప్  
         
రెండు దశాబ్దాలుగా తెలుగు ప్రేమ సినిమాలు తీయాలంటే రెండే రకాలు దొరుకుతాయి - తీస్తే అల్లం ప్రేమ సినిమాలు, మళ్ళీ తీస్తే బెల్లం ప్రేమ సినిమాలు. నరేంద్ర మోడీ ఎంతో ఆలోచించి ఇచ్చిన సరికొత్త రెండు వేల రూపాయల నోట్ల కట్టలు నిప్పంటించి. కనీసం ఈ కొత్త నోట్లు చూసైనా మనం కొత్తగా తీసి కొత్త నోట్లని గౌరవించాలని అన్పించదేమో. కొత్త నోట్లన్నీ పాత ప్రేమల హోమ గుండంలో భస్మాతి భస్మం. విడిపోయి కూడా కారాలు మిరియాలు నూరుకుంటున్న రాజకీయ తెలుగు రాష్ట్రాల్లో ప్రేమికులకి ఇంకేం సమస్యల్లేనట్టు, అవే అల్లం ప్రేమలు, అవే బెల్లం ప్రేమలు తీసి చేతిలో పెట్టడం. ఈ పప్పు బెల్లాలు మాకెందుకురా నాయనా, మేం చిన్న పిల్లలం కాదు, ఇంకేం మ్యాటర్ లేదా అంటే - మా మ్యాటరింతకన్నా ఒక్క మిల్లీ మీటర్ ఎక్కువంటే ఎక్కువ అస్సల్లేదని కస్టమర్ ని హీనంగా చూసి, అల్లం బెల్లాల గంప నెత్తికెత్తుకోవడం. అయితే ప్రేమ చెప్పలేక పోవడం, కాకపోతే ఏవో అపార్ధాలతో విడిపోవడం - ఈ రెండు రకాలే తెలుగు ప్రేమ సినిమాలనే చీరెల అమ్మకం.   ప్రతీ కొత్త దర్శకుడూ ఈ చీరె లమ్ముకుంటూ అడ్డంగా ఫ్లాపవువుతూనే వున్నాడు. అయినా టెంప్లెట్ షేక్స్ పియరెవరో ఇచ్చినట్టున్న గొప్ప ప్రణయ ప్రబంధంలా వుందని  నెత్తిన పెట్టుకుంటున్నారు.  

          ఇలా ప్రస్తుత ఫ్యామిలీలో కూడా - సినిమా మొదలై ముగిసేదాకా నడిచే వెడ్డింగ్ డ్రామాలో-
 హీరోయిన్ నిర్ణయం తీసుకుని ప్రేమ చెప్పలేక పోవడమే నాన్చుడు కథంతా. దీనికి ముందే ఇలాటిదే నాన్చుడు  కాదలివచ్చి అట్టర్ ఫ్లాపయ్యింది.  మెంటల్  మదిలోకూడా డిటో. హేపీ వెడ్డింగ్ కూడా ఇదే రెండు దశాబ్దాల ప్రేమ సినిమాల సువర్ణాక్షర సాంప్రదాయాన్ని తుచ తప్పకుండా పాటించి, మార్నింగ్ షోతో సరిపుచ్చుకుంది. 

4. శ్రీనివాస కల్యాణం 
నితిన్, రాశీ ఖన్నా, సతీష్ వేగ్నేశ (4 సినిమాల దర్శకుడు)
మార్కెట్ యాస్పెక్ట్ : ఫ్యామిలీ పేర నడి వయసు ప్రేక్షకులు టార్గెట్ ఆడియెన్స్ – ఫ్లాప్
క్రియేటివ్ యాస్పెక్ట్ : కాన్సెప్చ్యువల్ బ్లండర్ - ఫ్లాప్
         
ఫ్యామిలీ అంతా కూర్చుని చక్కగా చూసేట్టు వుంది, పెళ్లి తంతులో అంతరించి పోయిన చాలా ఆచారాలని మళ్ళీ గుర్తు చేస్తూ. త్రేతాయుగంలో శ్రీ రాముడి పెళ్లి, ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడి పెళ్లి, కలియుంలో శ్రీ వెంకటేశ్వరుడి పెళ్ళీ చూపించి  - దేవుళ్ళే పెళ్ళి తంతుకి అంతంత ప్రాముఖ్యాన్నీ పవిత్రతనీ కల్పిస్తే, వీటిని ముందుకు తీసికెళ్ళడం మన ధర్మమని చెప్పే డాక్యుమెంటరీ వరకూ బావుంది. దీని మార్కెట్ యాస్పెక్ట్ కోసం నలభైల్లో పడ్డ ఫ్యామిలీ ప్రేక్షకుల మీద ఆధార పడ్డారని స్పష్ట మవుతూంటుంది. కాబట్టి ఎక్కడా పాయింటు చుట్టూ యూత్ అప్పీల్ తో కూడిన పాత్రలు గానీ, కథాకథనాలు గానీ కన్పించవు. మళ్ళీ ఇదీ పెద్దవయసు పాత్రల చేతిలో బలయ్యే, యువ పాత్రల బలహీన కథ. ఒక స్టార్ గా ఈ సినిమా నితిన్ దైనప్పుడు, నితిన్ కోసం వచ్చే యూత్ కేమీ లేదిందులో. క్యారెక్టర్ గల్లంతు. ఎప్పుడైతే ప్రేమ కథలో ప్రేమికుల పెళ్లి పెద్దల చేతికెళ్ళి పోతుందో, ఇక ప్రేమికుల పాత్రలు గల్లంతే నని ఇక్కడ కూడా రుజువైంది. నితిన్ పాత్ర పూర్తిగా పాసివ్ - డల్ పాత్ర. సెకండాఫ్ లో పెద్దవాళ్ళ పెళ్లి హడావిడీ కామెడీల మధ్య దాదాపూ కన్పించడు, చివర్లో పెళ్ళిళ్ళ మీద లెక్చరిచ్చేప్పుడు అదో బ్యాక్ ఫైర్ అయిన వ్యవహారం.  

         
లెక్చరే కాన్సెప్ట్ ని చెడగొట్టింది. ఫస్టాఫ్ లో హీరోయిన్ తండ్రి పాత్ర ప్రకాష్ రాజ్ తో ఒప్పందంలో భాగంగా, విడాకుల పత్రాల మీద ముందస్తు సంతకం పెట్టినందుకు, ఇప్పుడు పెళ్లి పీటల మీంచి లేచిపోయి ఎమోషనలై  పోతాడు. దర్శకుడు విడాకుల పత్రాల్ని ప్రీ మారిటల్ అగ్రిమెంట్ అంటూ, ఇది అమెరికాలో వుందనీ, ఇప్పుడు ఇండియా కొచ్చిందనీ చెప్తూ దీని మీద రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇండియాలో ఇది ఎప్పట్నించో వుంది. కానీ  దర్శకుడు చెప్పిన అర్ధంలో కాదు. పెళ్ళికి ముందు విడాకుల పత్రాల మీద సంతకాలు బ్లాక్ మెయిలింగ్ కి పనికొచ్చే ఉద్దేశంతోనైతే  ఎక్కడా వుండదు (ప్రకాష్ రాజ్ పాత్ర ఈ పనికే ఉపయోగించుకుంటుంది). ఒకవేళ ఎప్పుడైనా విడాకులంటూ తీసుకుంటే, అప్పుడు పంపకాలేమిటన్న, పిల్లల సంరక్షణేమిటన్న వాటి గురించే అవగాహనా పత్రంలా అది వుంటుంది తప్ప మరెందుకూ కాదు. ఇది  కోర్టులు ఒప్పుకుంటాయి. ఇది వధూవరులు ఇద్దరికీ తెలిసే చేసుకుంటారు. దీన్నికథ కోసం వక్రీకరించారు. సినిమా కథంటే సబ్ చల్తా హై అన్నట్టన్నమాట. దేవుళ్ళని సాక్షులుగా చూపిస్తూ పెళ్ళి సాంప్రదాయాల పాటింపు గురించి ఇంత కథ ఎత్తుకుని, ఇలా వక్రీకరణలు చేసి కథ అల్లడం! ఇలా సంతకాలు చేయాలని ఏ దేవుళ్ళు చెప్పారో.

          కూతురికి (హీరోయిన్ కి) చెప్పకుండా ఆమె తండ్రి (ప్రకాష్ రాజ్) వాళ్ళిద్దరికి సంబంధించిన  ఒప్పందం మీద హీరో చేత సంతకం ఎలా చేయించుకుంటాడు? హీరో కూడా అసలీ ఒప్పందాన్ని ఎలా ఒప్పుకుంటాడు? అసలే చిన్నప్పట్నుంచీ నానమ్మ చెప్పే పెళ్లి పావిత్ర్యపు సుభాషితాలు అకళింపు చేసుకుని పెరిగిన వాడు – ప్రకాష్ రాజ్ ప్రతిపాదనని చించి అవతల పారెయ్యాలి. చించి అవతల పారేసి, ఈ ఇంటర్వెల్ పాయింటుకి వేరే కథ అల్లుకోమని కథకుడికి చెప్పాలి. 

         పెళ్లిని అతి పవిత్రంగా భావించే హీరో, ముందస్తు విడాకుల అగ్రిమెంట్ తో పెళ్లి పవిత్రతని ఎలా చెడగొడతాడు? హీరో లక్ష్యం ఏమిటి? సాంప్రదాయాలకి అనుగుణంగా హీరోయిన్ తండ్రి తలవంచేలా చేయడమేగా? అలాంటప్పుడా అగ్రిమెంటు సంతకం చేయకుండా చించేసి, కౌంటరుగా తానే షరతు విధిస్తే సరిపోయేది. పాత్ర యాక్టివ్ పాత్రగా నిలబడేది. కాన్సెప్ట్ దక్కేది. క్లయిమాక్స్ మెరుగయ్యేది. ఇంకా చాలా విషయాలు బాగు పడేవి.

సికిందర్