రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, December 22, 2016

నాటి సినిమా!




ణిరత్నం కళ్ళకి ఎల్లలు లేవు. అనంతమైన సృజన సీమ కనబడుతుంది ఎదరంతా...  ముంబాయి నేరమయ జగత్తు- దాని అధినాయకుడు, తమిళ సినీ రాజకీయ రంగాలు- ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు, శ్రీలంక అంతర్యుద్ధం-అందులో పసి బాలిక జీవితం, కాశ్మీర్ తీవ్రవాదం- ఎదురులేని దేశభక్తి, ఈశాన్య రాష్ట్రాల సంక్షోభం- అనంతమైన ప్రేమ శక్తి, హిందూ ముస్లిం కల్లోలం- దగాపడ్డ జీవితాలు, పార్లమెంటరీ వ్యవస్థ - యువ నాయకత్వం, కార్పొరేట్ రంగం- కరకు నిజాలు,  మహాభారతం- పురాణ పాత్రల పునఃసృష్టి, రామాయణం- దుష్ట పాత్ర  సమకాలీనం... ఇలా కొత్త కొత్త సీమలు  తన చలచిత్ర రాజాలకి రసమయ పోషకాలు. ఒక వరసలో ఇదంతా ఇండియన్ ఫైలాసఫీయే. దటీజ్ కాల్డ్ భారతీయాత్మ. స్నేహ సౌభాతృత్వాల, వినోద విజ్ఞానాల నిర్వచనాల సమ్మేళనాలు...

        ణిరత్నం సృజనాత్మక శక్తి దాని పరిధిని ఎక్కడ్నించి ఎక్కడిదాకా విస్తరించుకుందో  పై పేరా చెబుతుంది. నడిచిన, నడుస్తున్న చరిత్రని పక్కనబెట్టి సినిమా తీయడం అతడికి చేతగాదు. ఎవరైనా ప్రేక్షకులు కోరుకుంటున్న సినిమాలే తాము తీస్తున్నామని చెప్పుకుంటే, అది శుద్ధ అబద్ధమంటాడు అకిరా కురసావా. అలా తీసి మెప్పించిన వాళ్ళు ఈ భూమ్మీద లేరంటాడు. దర్శకుడు తానుగా నమ్మి ఫీలై, తనకోసం తీసుకున్న సినిమాలే ప్రేక్షకుల్లో కొత్త ఎవేర్నెస్ ని కలిగించి నిలబడ్డాయంటాడు. మిగిలినవన్నీ చెత్త బుట్ట దాఖలయ్యా యంటాడు. 

        మణిరత్నం ఫీలయ్యాడంటే అది తమిళమా, తెలుగా, హిందీయా, సింహళమా చూడడు. ఎక్కడ ఏ చరిత్ర పుడితే అక్కడికి సాగిపోతాడు. తన కాల్పనిక కళా జగత్తులో  మొదలంటా దాన్ని ఇమిడ్చేస్తాడు. ఒక బలమైన, రసవత్తరమైన డాక్యు డ్రామాగా మార్చేస్తాడు. చెన్నై నుంచీ చెచెన్యా దాకా ప్రేక్షక లోకం దాసోహ మవ్వాల్సిందే. టైం మ్యాగజైన్ కూడా పట్టించుకుని 100 అత్యుత్తమ  చలన చిత్రాల పట్టికలో చేర్చాల్సిందే. భారత ప్రభుత్వ, తమిళనాడు- ఆంధ్ర  రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలేకాదు, ఫిలిం ఫేర్, ఎడిన్ బర్గ్, బెర్లిన్, జెరూసలెం, లాస్ ఏంజిలిస్, జింబాబ్వే, వెస్ట్ చెస్టర్, మాంచెస్టర్ గీంచెస్టర్  మొదలైన సవాలక్ష అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో అవార్డుల కుంభవృష్టి కురవాల్సిందే. మిచిగాన్ యూనివర్సిటీ, ఎడిన్ బర్గ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ లు తమతమ  సిలబస్సుల్లో పాఠాలు రాసుకోవాల్సిందే. 

        సత్యజిత్ రే తర్వాత ఇంతలా భారతీయాత్మని ఆవిష్కరిస్తున్న దర్శకుడు తనే. ఎవర్ని ఆదర్శంగా తీసుకుని సినిమా తీసినా,  అంతిమంగా అందులో భారతీయాత్మ ప్రతిబింబించక పోతే అస్సలొప్పుకోదు  అంతర్జాతీయ సమాజం. కురసావాని మణిరత్నం ఆదర్శంగా తీసుకున్నప్పుడు,  ఇతరుల్లా  ఇండియన్ సినిమా అంటే పొడి పొడి ఫారిన్ పోకడల పేకాటగా మార్చెయ్యలేదు. ఈ పేకాటలోనే పడి కొట్టుకు పోతున్న యువదర్శకులు మణిరత్నంని ఆదర్శంగా తీసుకుంటున్నదీ లేదు. మణిరత్నం తర్వాత మహా శూన్యం ఏర్పడే ప్రమాదం మాత్రం పొంచి వుంది. 

        కురసావా మీద అచ్చయిన ఒక పుస్తకంలో, ‘కురసావా తాను రాజకీయ తత్త్వపు దర్శకుడిగా కాక,  సామాజిక తత్త్వం గల దర్శకుడిగానే వుండిపోవడాని కిష్టపడతాడు’ అన్న వాక్య ముంటుంది. నిజమే, రాజకీయ తత్త్వమేమిటి? అదెక్కడ ప్రజా సమస్యల్ని నిష్పాక్షిక దృష్టితో  చూస్తుందని? ఇందుకే మణిరత్నం కురసావాని ఆదర్శంగా తీసుకున్నాడు. ప్రజాసమస్యల పట్ల నిష్పాక్షిక దృష్టితో చూసే సామాజిక తత్త్వాన్ని గొప్ప మానవతా వాదంతో అలవర్చుకుని నిండుగా కన్పిస్తాడు. ఒక సారెప్పుడో ‘బొంబాయి’ తీసినప్పుడు అందులో పక్షపాతం చూపించుకుని వివాదాస్పదుడు కావడం, మరోసారి ‘గురు’ లో అవినీతికి పట్టంగట్టి హాస్యాస్పదం కావడమూ వంటి ఒకటీ రెండూ తప్పడుగుల్లేక పోలేదు. 

       విశాల ప్రాతిపదికన  ‘నాయకుడు’, ‘రోజా’, ‘బొంబాయి’, ‘దళపతి’, ‘దిల్సే’, ‘ఇద్దరు’, ‘అమృత’, ‘యువ’, ‘గురు’ ల్లాంటి ప్రబోధాత్మకాలు తీస్తూనే, మళ్ళీ ‘ఘర్షణ’, ‘దొంగా దొంగా’, ‘మౌన రాగం’, ‘సఖి’, ‘గీతాంజలి’...వంటి గిలిగింతలు కూడా పెడుతూ గిరికీలు కొట్టాడు. ఇక్కడ కూడా తన గట్ ఫీలింగ్స్ నే నమ్మాడు. మనం వుంటాం, మన ప్రేయసి మీద మనం కవిత్వాలు రాసుకుంటే ఇతరులకి భేషుగ్గా వుంటుంది, అదే ఇతరుల ప్రేయసుల మీద రాస్తే వీపు వాచిపోతుంది. సృజనాత్మకత ఎప్పుడూ పర్సనల్ గోడు. ‘గీతాంజలి’ ని సృజియిం చినప్పుడు అది మణిరత్నం పర్సనల్ గోడు. ఇందుకే అందరికీ- అంతమందికీ అంత బాగా నచ్చింది. 

        తెలుగులో మణిరత్నం దర్శకత్వం వహించిన ఏకైక మణిరత్నం ‘గీతాంజలి’. కాస్త తమిళ వాసనలు వేసినా మొత్తంగా ఇది దృశ్య వైభవాల సంగీత సౌరభం. 1989 లో ‘శివ’ తర్వాత నాగార్జున కిది మరో  సంచలనాత్మక విజయం. ఆనాడే కాదు, రెండు దశాబ్దాల తర్వాతా  దీనిది కాలదోషం పట్టని మనసులో మాట. శాశ్వత సత్యాలకి కాలదోషం పట్టదు. కాకపోతే పట్టించుకునే నాథులే తక్కువ. నిన్నంటూ  చేజారిపోయి, రేపనేది చేతుల్లో లేకపోయాక,  మిగిలేది ఈ రోజు అనే వర్తమానమే. దీన్నెలా గడిపామన్న  దానిపైనే  అంత్యకాలపు తృప్తి  ఆధారరపడుతుంది. ఒక టీవీ ఛానెల్లో 2012 లో అప్పట్లో రాబోయే (?) ప్రళయం గురించి చర్చ పెడితే, చాలామంది ఇక జీవితంలో ఏం సాధించి ఏం లాభమనే నైరాశ్యాన్నే ప్రకటించారు. వాళ్లకి ‘ గీతాంజలి’ చూపించాలి. ఇప్పుడు మరణం ఖాయమైపోయిన ఎయిడ్స్ రోగులు కోకొల్లలుగా కన్పిస్తారు. వాళ్ళకీ ‘గీతాంజలి’ ఇచ్చే మెసేజ్ తో నమ్మకం కల్గించాలి. 

        ఏదో నయంకాని గుండె జబ్బు, ఇంకో మూలగ క్యాన్సరూ అన్నవి ‘గీతాంజలి’ లో కేవలం మనల్ని ఎప్పుడైనా చుట్టు ముట్టే అవకాశమున్న అరిష్టాలకి వాడుకున్న సింబల్సే. కాలంతోపాటు ఈ అరిష్టాల రూపాలు మారవచ్చు. వాటికి మనమెలా రెస్పాండ్ అవ్వాలన్నది ‘గీతాంజలి’ ని చూసి అర్ధం జేసుకోకపోతే ఈ జన్మ దండగ. 

        హ్యాపీగా గడపాలని కమిటైతే పచ్చిక బయళ్ళైనా, స్మశానవాటికలైనా ఒకటేనని, అల్లరల్లరిగా తిరిగే గీతాంజలి వైఖరి లోనే చెప్పాలనుకున్న విషయమంతా వుంది. స్మశానం  లో సమాధులు భయాలకి  గుర్తులు. సద్గురు జగ్గీ వాసుదేవ్ చెప్పినట్టూ, ఈ భయాలనేవి కలుపు మొక్కల్లాంటివి. వాటికవే పెరిగిపోతాయి. పోషణా సంరక్షణా వాటికక్కర్లేదు. అలాటి వాటిని పీకి అవతల పడెయ్యడానికి ప్రయత్నించం సరికదా, ఎంతో ఆశపడి వాటిమధ్య నాటుకున్న ఆశయమనే గింజ మొలకెత్తి మహావృక్ష మయ్యేందుకూ శ్రమించం. గీతాంజలిని చూస్తే, తాను మరణిస్తున్నానని తెలిసీ, ఆ మరణమనే సమాధుల మధ్య అపరాత్రైనా తను నాటిన సంతోషాల మొక్కనే, ఆటా పాటగా పోషించుకుంటూ, వున్న జీవితాన్ని దిలాసాగా ఎంజాయ్ చేసేస్తోంది!

        ఈ బ్యాక్ డ్రాప్ లోకి వస్తాడు ప్రకాష్ (అక్కినేని నాగార్జున). సిటీలో వుండే ఇతను తనకి నయంకాని మూలగ క్యాన్సర్ సోకిందని తెలుసుకుని, శేష జీవితాన్ని శాంతంగా గడిపేందుకు ఊటీ వస్తాడు. ఇక్కడ గీతాంజలిని వైఖరిని చూశాక తనకి  కొత్తలోకాలు తెర్చుకుంటాయి- ‘రేపటి గురించి బెంగలేదు, ఈ రోజే నాకు ముఖ్యం, ఇలాగే వుంటాను’ అనే ఈమె స్పోర్టివ్ నెస్ తో ఇక పోటీపడక తప్పని స్థితి. తీరా తను ఎప్పటి చలాకీ మనిషిగా మారేక, చూస్తే ఏముంది- ఆమె గుట్టంతా బయటపడింది! ఆమె గుండె కాయని మృత్యువు కబళించి వుంది...

       రివర్స్ లో తనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డ అతడి గుట్టు కూడా ఈమెకి తెలిసిపోయి, పెద్ద దుమారమే రేపుతుంది. నువ్వొద్దు వెళ్లిపొమ్మంటుంది. నువ్వెక్కడో బతికే వున్నావన్న ఆశతో తృప్తిగా చనిపోతానంటుంది.  తర్వాత్తర్వాత చూస్తే, నీ చేతుల్లోనే చనిపోతానంటుంది. పుని స్త్రీగా తనువు చాలించాలనే ఇండియన్ సెంటిమెంటుని ప్లే చేశా డిక్కడ మణిరత్నం- ‘రోజా’ లో సతీ అనసూయ సెంటిమెంటులాగే. ఎత్తుకున్న కథ ప్రకారమైతే వీళ్ళిద్దరూ చనిపోవాలి. ఈ నమ్మకంతోనే ప్రేక్షకుల్ని వుంచుతాడు మణిరత్నం. కానీ ప్రేక్షకులు అలా నమ్మినట్టుగానే ముగిస్తే అది తను ఫీలైన సినిమా ఎలా అవుతుంది? అందుకని ఆ స్టోరీ క్లయిమాక్స్ ని మూసేశాడు. ప్లాట్ క్లయిమాక్స్ ని పైకి లాగాడు. వాళ్ళిద్దర్నీ నిక్షేపంలా వుంచి, ఎప్పుడు ఈ లోకం వీడి పోతారో తెలీదనీ, కానీ అప్పటిదాకా ఇలా కలిసే జీవిస్తారనీ చెప్పి ముగిస్తాడు. 

        సంతోషాలకే కాదు, ఆ సంతోషాల్ని కల్లోలపర్చే గాయపడ్డ ప్రేమలకి కూడా కట్టుబడి వుండాలని పరోక్షంగా చెప్పే మణిరత్నం ఎక్కడా అతికి పోడు. నటనలు, మాటలు, సెంటిమెంట్లూ  చాలా మితంగానే వుంటాయి. డబ్బింగ్ కింగ్ రాజశ్రీ మాటలు రాశారు. ఊటీ అందాలూ, వీటికి పిసి శ్రీరాం హై పవర్ ఛాయాగ్రహణమూ  విషయాన్నిడామినేట్ చేస్తు నట్టు వున్నా- కథా బలం, పాత్రల బలం కలిసి దానికి మ్యాచ్ అవడంతో, రసాస్వాదనకి అడ్డంకిగా వుండవు. పాత్రల్లో నాగర్జున, గిరిజలు ఆ పాత్రలకోసమే పుట్టినట్టుంటారు. నాగార్జున తల్లి దండ్రులుగా సుమిత్ర, విజయ్ చందర్ లు, నానమ్మగా రాధాబాయి కన్పిస్తారు. సినిమా ప్రారంభంలో యూనివర్సిటీ ఛాన్సెలర్ గా సీనియర్ నటి షావుకారు జానకి కన్పిస్తారు.

      ఇక సుత్తి వేలు- డిస్కో శాంతిల కామెడీ ట్రాకు మాత్రం మణిరత్నాన్ని చూసి నవ్వా లన్పించేలా వుంటుంది. ఈ ఫెయిలైన కామెడీని ఇప్పుడు సీడీల నుంచి తొలగించి మంచి పనే చేశారు. 

        భాగ్యలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ లో సి ఎల్ నరసారెడ్డి నిర్మించిన ఈ ప్రేమకావ్యానికి అందిన బహుమతులెన్నో. రాష్ట్రప్రభుత్వ నంది అవార్డులు ఏడు దక్కాయి. ఉత్తమ వినోదాత్మక కథా చిత్రంగా జాతీయ అవార్డు  ఒకటి లభించింది. తమిళ, మళయాళ భాషల్లో అనువాదమై హిట్టయ్యింది. హిందీలో మాత్రం దీపక్ ఆనంద్ ‘యాద్ రఖేగీ దునియా’ గా ఫ్రీమేకు చేస్తే ఫ్లాపయ్యింది. 

        ఇప్పుడు సంగీతం విషయానికొద్దాం. వేటూరి- ఇళయరాజా- బాలసుబ్రహ్మణ్యం- జానకి- చిత్ర బృందం కలిసి సృష్టించిన ఈ మ్యూజికల్ జగత్తంతా ఆచంద్ర తారార్కమనాలి. ప్రతీపాటా స్వీట్ హిట్టే. అందులో ‘ఓం నమః’ అనే పాట చిత్రీకరణకి ప్రయోగం చేశాడు మణిరత్నం. నాగార్జున -గిరిజలని నించున్న చోటే నించో బెట్టి రౌండ్ ట్రాలీ వేసి సింగిల్ షాట్ గా తీసిన క్రియేటివిటీ చాలా సంచలనం. ఇప్పుడు చూస్తే యూ ట్యూబ్ లో ‘వేరీజ్ మై మనీ’, ‘రష్యన్ ఆర్క్’ లలాంటి సింగిల్ షాట్  సినిమాలు కన్పిస్తాయి- కానీ ఈ రెండున్నర నిమిషాలకి మించవివి!


-సికిందర్
(జనవరి 2010, ‘సాక్షి’)
http://www.cinemabazaar.in




       


 



Wednesday, December 21, 2016

రివ్యూ!





నిర్మాణం- దర్శకత్వం : ఆదిత్యా చోప్రా

తారాగణం : రణవీర్ సింగ్, వాణీ కపూర్, అర్మాన్ రాల్హాన్, ఆకాష్ ఖురానా, ఆయేషా రజా జూలీ ఆర్డాన్ తదితరులు
కథ- స్క్రీన్ ప్లే : ఆదిత్యా చోప్రా, మాటలు : శరత్ కటారియా, సంగీతం : విశాల్- శేఖర్, ఛాయాగ్రహణం : కనామే ఒనోయమా
బ్యానర్ : యశ్ రాజ్ ఫిలిమ్స్,
విడుదల : 9 డిసెంబర్,  2016
***
సెంటిమెంటల్ సినిమాల ఆదిత్యా చోప్రా స్వయంగా రోమాంటిక్ కామెడీకి దర్శకత్వం వహిస్తూ ‘బేఫిక్రే’  (కేర్ ఫ్రీ) తీసినప్పుడు ఇది కాలేజీ యూత్ ని కిర్రెక్కించేలా తయారయ్యింది. యూత్ నాడిని పట్టుకుని ఎక్కడా దేనికీ హద్దుల్లేని, పరిమితుల్లేని  ఆల్ ఫ్రీ- కేర్ ఫ్రీ లవ్ ని కలర్ఫుల్ గా తెరాయమానం చేశాడు. హీరో రణవీర్ సింగ్, హీరోయిన్  వాణీ కపూర్ లు ఈ ‘ ‘రోమెడీ’ (రోమాంటిక్ కామెడీ) ని హాట్ హాట్ గా రగిలించి – క్యారక్టర్స్ ని పండించి, నవ్వించి, కవ్విస్తూ కొలిక్కి తెచ్చిన విధం ఎట్టిదంటే....


కథ 
     ఢిల్లీ కరోల్ బాగ్ కుర్రాడు ధరమ్ పని వెతుక్కుంటూ పారిస్ చేరతాడు. తనకి తెలిసిన విద్య కామెడీ షోలు చేయడమే. ఒక నైట్ క్లబ్లో ఏకపాత్రాభినయాలు చేస్తూ నవ్విస్తూంటాడు.  అక్కడే షైరా (వాణీ కపూర్) పరిచయమై చెట్టపట్టా లేసుకుంటారు. ఆమె తల్లిదండ్రుల్ని  వదిలి పెట్టి అతడితో సహజీవనం చేయడం మొదలెడుతుంది. ఇద్దరికీ పెద్దగా ప్రేమలంటూ పట్టింపుల్లేవు. ఆ సహజీవనంలో ఓ రోజు తేడా వస్తుంది. ఆమె వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక ఫ్రెండ్స్ గా కలిసివుందామనుకుంటారు. అసలు ముందు ఫ్రెండ్ షిప్ చేయకుండా కలవడం వల్లే అది ఉత్త మోహానికి దారి  తీసిందనీ, అదే ముందు ఫ్రెండ్ షిప్ చేసి వుంటే ప్రేమ పుట్టి వుండేదనీ గుర్తిస్తారు. ఇప్పుడు తమ రిలేషన్ షిప్ ని మర్చిపోయి ఫ్రెండ్స్ గా వుంటున్నప్పుడు  ఒక ఇన్వెస్ట్ మెంట్  బ్యాంకర్ (అర్మాన్ రాల్హాన్) కి ఆమె కనెక్ట్ అవుతుంది. క్రిస్టీన్ (జూలీ ఆర్డాన్) అనే ఫ్రెంచ్ అమ్మాయికి ధరమ్ కనెక్ట్ అవుతాడు. బ్యాంకర్ తనకి ప్రేమిస్తూ కూర్చునే టైం లేదనీ, పెళ్లి చేసుకుందామనీ తొందర పెడతాడు. ఆమె ధరమ్ సలహా అడుగుతుంది. చేసుకొమ్మంటాడు. ఆమె పెళ్లి చేసుకుంటూంటే,  పోటీ పడి తనూ క్రిస్టీన్ ని పెళ్లి చేసుకోబోతాడు- ఈ పెళ్ళిళ్ళు అయ్యాయా, ఏం చేసుకున్నారు, ఏం తెలుసుకున్నారు, ఎలా ముగించుకున్నారు.... అనేది మిగతా కథ. 

ఎలావుంది కథ
      నస పెట్టకుండా   సాఫీగా వుంది. నేటి తరాన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ టేస్టులకి  పట్టం గడుతూ వుంది. మనస్సుని కాదనుకుని ఎంతైనా స్వేచ్ఛాయుత జీవితాలు గడుపుకోవచ్చు, ఒకనాటికి ఆ మనస్సుకి  చెప్పుకోవాల్సి వస్తుందన్న సున్నితమైన థీమ్ తో వుంది. ఇందులో తెలుగు యూత్ సినిమాల్లో లాగా హాస్యాస్పదంగా పెద్ద పాత్రల చాదస్తాలు, జోక్యాలు, ఏడ్పులూ, క్లాసులు పీకి ప్రేమికుల మధ్య సమస్య పరిష్కరించడాలూ వంటి నాన్ సెన్స్ లేకుండా చాలా రిలీఫ్ నిచ్చేలా వుంది. హీరోయిన్ కి పేరెంట్స్ వున్నా,  తండ్రి ఒకసారి – మన చేతుల్లో వీళ్ళు పెరగరు, వీళ్ళ చేతుల్లో మనం పెరగాలని  విజ్ఞతతో అనేసి వూరుకుంటే, చివర్లో డైలెమాలో పడ్డ  హీరోయిన్ తో తల్లి చెప్పే ఒక మంచి మాటని  కూడా తలకిందులు చేసేస్తూ, హీరోతో కలిసి  నిర్ణయం తీసుకుంటుంది హీరోయిన్. ఫలితంగా ఫ్రెంచి చర్చిలో రెండు పెళ్ళిళ్ళ గలాభా, గందరగోళం, పెద్ద కిష్కింధ కాండా  జరిగి- ఒక కామిక్ స్ట్రోక్ తో ముగుస్తుంది.  ఎత్తుకున్న జానర్ కి న్యాయం చేస్తూ, ఎక్కడా బరువెక్కించని పూర్తి స్థాయి సరదా రోమాంటిక్ కామెడీ ఇది. 

ఎవరెలా చేశారు
      క్యారక్టర్  ఒక్కోసారి చాలా పెద్ద పని చేసి పెడుతుంది. రొటీన్ గా వుండే కమర్షియల్ సినిమా క్యారక్టర్లు కేవలం ప్రేమల్లో పోకిరీ తనాలూ, హీరోయిన్ని ఏడ్పించి లొంగ దీసుకోవడాలూ మొక్కుబడిగా చేసుకు పోతూంటాయి. రణవీర్ సింగ్ పాత్ర ఇక్కడ చాలా పెద్ద పని చేసి పెట్టింది. చాలా ఇంటరెస్ట్ పుట్టిస్తుంది. అతడి ముఖాన్ని, చేష్టల్ని  మర్చిపోలేకుండా చేసి పెట్టింది. ఇంకా పద్నాల్గేళ్ళు నిండని లేత కుర్రాడు చూపులు ఎలా చూస్తాడో, మూతి విరుపులు ఎలా ప్రదర్శిస్తాడో, ఎలాటి చేష్టలు పోతాడో, అలిగితే ఎలా వుంటాడో, సరీగ్గా వీటిని ప్రెజెంట్ చేస్తూ కేర్ ఫ్రీగా దున్నుకుంటూ పోయాడు రణవీర్. చిన్న కుర్రాడిలా పెట్టే అతడి మూతిని, చూపుల్నీ అస్సలు మర్చిపోలేం. మనస్తత్వం కూడా అలాటిదే. ఈ క్షణం అలిగితే మరుక్షణం నవ్వేస్తాడు. మనసులో ఏదీ దాచుకోడు. ప్రేమంటే పెద్దగా తెలీదు. పెళ్ళంటే కూడా తెలీకుండా పోటీకోసం  పెళ్ళికి సిద్ధపడతాడు. ఈ రకం క్యారక్ట రైజేషన్ ఈ రోమాంటిక్ కామెడీని చాలా కలర్ఫుల్ గా మార్చేసింది. 

     హీరోయిన్ వాణీ కపూర్ కూడా అతడికేం తీసిపోని తెగువతో నటించేసింది. హీరో కే మాత్రం తీసిపోని, తగ్గని, స్వత్రంత్రతా కోల్పోని తత్త్వాన్ని కొట్టొచ్చినట్టూ గ్లోరిఫై చేసింది. ఈమె పేరెంట్స్ పాత్రల్లో ఆకాష్ ఖురానా, ఆయేషా రజాలవి చాలా అదుపులో వుండే పొదుపైన పాత్రలు. 

     ఈ రోమాన్స్ కి దీటుగా పారిస్ నగరాన్ని పగలూ రాత్రీ వైభవంగా చూపించారు. ఈ హాట్ రోమాన్స్ కి పోటీ పడే బీట్స్ తో పాటలూ వున్నాయి. టెక్నికల్ గా అంతర్జాతీయ స్థాయిలో వుంది. విశృంఖల శృంగారం అక్కడక్కడా వుంది. కానీ ఒక్క బూతు మాటా లేదు.  డబల్ మీనింగులతో కామెడీ చేయడాలు లేదు. డైలాగుల్లో వాడిన భాష కూడా అర్బన్ యూత్ వాడే పదాలతో వుంది.

చివరికేమిటి 
        మేం యూత్ కి ఫలానా ఈ మెసేజ్ తో సీనిమా తీశామని పాత స్టయిల్లో పబ్లిసిటీ చేసుకోవడాలు చూస్తూంటాం. యూత్ కి మెసేజ్ ఇచ్చేదేమిటి? వాళ్ళు దేశాలు దాటిపోతున్నారు. సినిమా ఫీల్డు దాటకుండా కూర్చుని మెసేజి లివ్వడమేమిటి? ఆదిత్యా చోప్రా కేవలం అనుభవాలు చూపించి వదిలేశాడు. అనుభవాల్లోంచి యూత్ వాళ్ళే నేర్చుకుంటారు. కావాల్సిందల్లా అచ్చు గుద్దినట్టు వాళ్ళ జీవితాల్ని, అనుభవాల్నీ చూపించడం. పెద్దగా విషయం లేకుండానే విషయమున్నట్టు తోచే ఈ రోమాంటిక్ కామెడీ బాలీవుడ్ వేసిన ఒక ముందడుగు. 1995 లో ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ కి దర్శకత్వం వహించిన ఆదిత్యా చోప్రా, ఇంకో రెండే సినిమాలకి దర్శకత్వం వహించి, నిర్మాతగా 40 సినిమాలు నిర్మించి, ఇప్పుడు ఈ యూత్ ఫుల్ రోమాంటిక్ కామెడీకి రచన- దర్శకత్వమూ వహిస్తూ అత్యంత ట్రెండీ చిత్రీకరణ జరపడం గొప్ప విషయమే.


-సికిందర్
http://www.cinemabazaar.in/










Monday, December 19, 2016



        కొందరు అడుగుతూంటారు- తెలుగు సినిమాల స్క్రిప్ట్స్ ఎక్కడ దొరుకుతాయని. తెలుగులో కాదుకదా ఏ దేశభాషలోనూ ఏ సినిమా స్క్రిప్టూ ఎక్కడా దొరకదనేవి రికార్డయిన సత్యం. హాలీవుడ్ అంత అభివృద్ధి పథంలో లేదు మన దేశ సినిమా రచనా రంగం. హాలీవుడ్ లో స్క్రిప్టులు ప్రింటయి వస్తాయి. నెట్ లో వాటి పీడీఎఫ్  లు లభిస్తాయి ఉచితంగా. తెలుగు సినిమా స్క్రిప్టులకి ఈ సదుపాయం లేదు. షూటింగ్, ఎడిటింగ్, డబ్బింగ్ ఈ మూడూ పూర్తయ్యే వరకే వుంటాయి. సినిమా విడుదలయ్యాక ఎటుపోతాయో ఎవరికీ తెలీదు. వాటి అవసరం కూడా అంతగా ఫీలవరు. ఒకవేళ ఏ సినిమా ఆఫీసులోనైనా ఏదైనా స్క్రిప్టు అదృష్టవశాత్తూ వుంటే దాన్నిచదవడం బ్రహ్మ కైనా సాధ్యం కాదు. స్క్రిప్ట్ అంటే డైలాగ్ వెర్షనే కాబట్టి- అది షూటింగ్ దగ్గర్నుంచీ డబ్బింగ్ వరకూ రకరకాల కొట్టివేతలతో,  మార్పుచేర్పులతో  గజిబిజిగా తయారై వుంటుంది. కాబట్టి చదవడం సాధ్యం కాదు. డైలాగ్ వెర్షన్ కాకుండా, చక్కగా ఒక కథలా చదువుకోవడానికి- దాన్ని విశ్లేషించుకోవడానికీ ట్రీట్ మెంట్ ( స్క్రీన్ ప్లే) కాపీ ఏదైనా వుం టుందా అంటే, అదీ ఇంతే. దాన్నుంచి డైలాగ్ వెర్షన్ రాస్తున్నప్పుడే ఆ కాగితాలు చెత్త బుట్టలోకి చేరిపోతూంటాయి. కాబట్టి తెలుగు సినిమాల స్క్రిప్టులు చూసి, చదివి స్క్రిప్టులు రాయడం నేర్చుకుందామనుకుంటే కుదరని పని.

          పని ఇంగ్లీషు వచ్చి వుంటే హాలీవుడ్  స్క్రిప్టులతో సులభ సాధ్యమవుతుంది. హాలీవుడ్ స్క్రిప్టులు  అసంఖ్యాకంగా లభిస్తాయి. ఇంకోటేమిటంటే, ఇవి రాసినప్పుడు ఎలా వుంటాయో తీశాక కూడా అలాగే వుంటాయి- రాసింది రాసినట్టే తీస్తారు కాబట్టి. కనుక ఈ స్క్రిప్టులు ముందు పెట్టుకుని ఆ సినిమాలు చూస్తూంటే ఎక్కడా తేడా కొట్టదు. ఒక్కడైలాగూ మారదు. అందుకే నేర్చుకోవడానికి ఈ స్క్రిప్టులు బాగా కలిసివస్తాయి.

        అసలు స్క్రిప్టులు చదివి నేర్చుకోవడం ఎందుకు? సినిమాల్ని చూస్తున్నప్పుడు కంటే వాటిని చదుతున్నప్పుడు లోతుగా బాగా అర్ధమవుతాయి. స్ట్రక్చర్ బాగా అర్ధమవుతుంది. స్ట్రక్చర్  తెలియకుండా ఈ స్క్రిప్టులు చదివి నేర్చుకుందామనుకుంటే కుదరదు. స్ట్రక్చర్ తెలిస్తేనే దాన్ని స్క్రిప్టులో గుర్తు పడుతూ, విశ్లేషించుకుంటూ, అర్ధం చేసుకుంటూ నేర్చుకోవడానికి సాధ్యమవుతుంది. పైగా స్ట్రక్చర్ లో ఏ ప్లాట్ పాయింటు ఎక్కడ వచ్చిందో, క్యారక్టర్ ఆర్క్ ఏఏ సీన్లలో ఎలా కొనసాగిందో, బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలు ఎలా వున్నాయో, మొదలైన స్ట్రక్చర్ సంబంధ ఎలిమెంట్స్ ని  ఆ స్క్రిప్టులు మీద మార్క్ చేసుకుంటూ, నోట్స్ రాసుకుంటూ పోవచ్చు. ఇది రిఫరెన్స్ గా బాగా పనికొస్తుంది. 

          అసలు థ్రిల్లర్స్ స్క్రిప్టులు చదవితే ఇంకా బాగా క్రాఫ్ట్ నేర్చుకోవచ్చు. ఎందుకంటే వాటి కథనాల్లో  థ్రిల్స్, యాక్షన్, సస్పెన్స్,  టెంపో, స్పీడు, ట్విస్టులు, ప్లే, పాత్రల ఎత్తుగడలు, కార్యకారణ సంబంధాలు, లాజిక్, అంచెలంచెలుగా బయటపడే మిస్టరీ,  ఇవన్నీ – వీటన్నిటి మీదా  పట్టు సాధించే వీలు కలుగుతుంది. అంతేగాక 
సమయస్ఫూర్తి, సిక్స్త్ సెన్స్ పెరుగుతాయి. మొత్తంగా బ్రెయిన్ షార్ప్  అవుతుంది. ఒకసారి బ్రెయిన్  షార్ప్ అయ్యిందంటే అదలాగే ఉండిపోతుంది. ఇలా  స్క్రిప్టుల్ని క్షుణ్ణంగా అభ్యసించి  పట్టు సాధించ గలిగితే, ఇంకే జానర్ స్క్రిప్టు నైనా ఈజీగా, పకడ్బందీగా  రాసెయ్య గల్గుతారు. 

        స్టీవెన్ స్పీల్ బెర్గ్ తన కెరీర్ ప్రారంభ దినాల్లో తీసిన క్లాసిక్ థ్రిల్లర్ ‘ది రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ స్క్రీన్ ప్లే స్క్రిప్టు ఒక మంచి ఉదాహరణ. అలాగే కోయెన్ బ్రదర్స్ మాస్టర్ పీస్ ‘ఫార్గో’ కూడా.  ఇలాటివి దృష్టికొచ్చినవి ఏవి వుంటే వాటిని ఉచితంగా డౌన్ లోడ్ చేసుకుని స్టడీ మొదలెట్టుకోవచ్చు. స్ట్రక్చర్ నేర్చుకుని ఆ స్ట్రక్చర్ ప్రకారం సినిమాలు చూడ్డం వేరు, స్క్రిప్టులు చదవడం వేరు. ఈ కింద ఇస్తున్న రెండు లింకులు ప్రయత్నించండి, ఆల్ ది బెస్ట్. 
       www.dailyscript.com/scripts/RaidersoftheLostArk.pdf
                                        www.coenbrothers.net/scripts/fargo.pdf


-సికిందర్ 

అధ్యయనం - అభిరుచి
            కాలాలు మారిపోవచ్చు. మనుషులు మారవచ్చు. సంక్షోభాలు ఎదురవచ్చు. కానీ కొన్ని అలవాట్లుఅభిరుచులు మారవు. ఈ కోవకు చెందిన అభిరుచి పుస్తకాలు చదవడం. కొన్ని దశాబ్దాల కిందటితో పోలిస్తే పుస్తకాలు ఇప్పుడు ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయి. అక్షరాస్యత పెరిగింది. చదివేవాళ్ళ సంఖ్యా అనేక రెట్లు ఇనుమడించింది. చదువు లేకుండా ఏ రంగంలోనూ రాణించే అవకాశం లేదు. అసలు చదవకుండా నవనవోన్మేషంగా జీవించడమూ సాధ్యం కాదు. ఒక దశ నుంచి మరో దశకు ఎదగాలన్నానిర్వర్తించే వృత్తివ్యాపకాల్లో ముందుకు వెళ్ళాలన్నా అధ్యయనం బతుకులో భాగం కావాలి. 

            నిజానికి ఎవరయినా చదివి తీరాల్సిన క్లాసిక్స్‌ ప్రతి జాతికీ ఉంటాయి. ఎవరు ఎలాంటి వృత్తి వ్యాపకాల్లో ఉన్నప్పటికీ వాటిని చదవాలి. రామాయణమహాభారతాలుపంచతంత్ర కథలుభగవద్గీతమేఘసందేశంబృహత్కథ వంటివి భారతీయ క్లాసిక్స్‌. వీటిలోని కొన్ని అంశాలతో విభేదించినా చదవడం మంచిది. శతాబ్దాల మానవ ప్రయాణంలో పరంపరానుగతంగా వస్తున్న సంప్రదాయాల్లోని మేలిమిని తెలుసుకోడానికి ఉపకరించే క్లాసిక్స్‌ ప్రతి ఒక్కరు అధ్యయనం చేయాలి. ఈరకమైన అభిరుచిని పెంపొందించే దిశగానే బాల్య కౌమారల్లోని విద్యా సిలబస్‌ రూపొందాలి. చదివే అభిరుచుల్ని కల్పించే లక్ష్యంతో పాఠశాలల్లో స్టోరీ పీరియడ్‌ లాంటివి ఏర్పాటు చేయాలి.
            ఇంటర్నెట్‌ విస్తరణమొబైల్స్‌ వాడకం పెరిగినప్పటికీ పుస్తకాల ప్రాధాన్యం చెదిరిపోదు. శాస్త్రసాంకేతిక రంగాల్లో వేగంగా వస్తున్న మార్పులు అధ్యయన అవసరాల్ని మరింత పెంచుతున్నాయి. అందుకని ఎప్పటికప్పుడు నైపుణ్యాల్ని పెంచుకోడానికి అధ్యయనం తప్పనిసరి. జీవనయానంలోని ప్రతి దశలోనూ వ్యక్తి మనో వికాసానికి పుస్తకాల అధ్యయనం తోడ్పడుతుంది. జీవితాన్ని సృజనాత్మకంగా మలుచుకోడానికినిత్యనూతనంగా గడపడానికి ఉపకరిస్తుంది. కనుకనే వయసుతో నిమిత్తం లేకుండా అధ్యయనం అనివార్యమైన అవసరం.

(Navatelangana- Sunday editorial- Courtesy: KP Ashok Kumar)

Sunday, December 18, 2016

నాటి సినిమా!



     అక్కడ తాజ్ మహల్ గుండెని తడిమింది. వివశుడై అతను- ‘మా ఆవిడకో పాట పాడాలనుంది’ అన్నాడు నాటకీయంగా మెలిదిరిగిపోతూ. ఆవిడా అంతే  వాత్సల్యంతో ఆలింగనం చేసుకుందతణ్ణి. గాఢంగా చుంబించింది. వూరుకోకుండా అతనూ అమాంతం ఒళ్లోకి లాక్కుని ఆమెని అంతే దీటుగా చుంబించాడు. ఆగలేక ప్రేమదాసులా మోకరిల్లి ఆమె సుకుమార హస్తాల్ని పెదాలకి తాటించాడు సుతి మెత్తగా...


        క్లిక్ క్లిక్ మన్నాయి కెమెరాలొక్కసారిగా...

        ట్ -కట్- ఇదేదో తాజ్ మహల్ ఎదుట ‘మేఘసందేశం’ రవీంద్రబాబూ పార్వతిల ప్రణయ ఘట్టాన్ని తెరకెక్కించడం కాదు. అంత అదృష్టవంతురాలు కాలేదు పార్వతి. కరుడు గట్టిన రవీంద్ర బాబు కళాపిపాస ధాటికి ఆమె సంసార సుఖమంతా ఏనాడో ముక్కలయ్యింది. నా కళా- నా నాయికా అంటూ వేరే కాంతతో వెళ్ళిపోయాడతను. అలా శూన్యంలోకి చూస్తూ ఓడెళ్ళి పోయిన రేవులా మిగిలింది తను. ఆమె తాజ్ మహల్ కుప్పకూలింది...


        పాత్రల్ని అందరూ సృష్టిస్తారు. నూటికో కోటికో ఒక్కరే సైంటిఫిగ్గా మల్చగల్గుతారు.  సైకోఎనాలిస్ తెలిసి సజీవ సృష్టులు గావిస్తారు. కీకారణ్యంలా మారిపోయిన కళా ప్రాంగణంలో కాకులే ఎక్కువ. మరి కాకులకేం తెలుసు సైకోఎనాలిస్. పాత్రల మానసిక సంఘర్షణని పొల్లుపోకుండా ఔరా అన్పించేట్టు కల్పన చేసే వాళ్ళని భూతద్దం పెట్టి గాలించుకోవాలి. రాయడానికి కూర్చున్న ప్రతిసారీ ఏ క్షణంలోనైనా ప్రేక్షకుల్ని కోల్పోయే ప్రమాదం పొంచి వుంటుందని అంటాడొక స్క్రీన్ ప్లే పండితుడు. రాయడమనేది అనుక్షణం మెదడూ మనసుల లడాయే అయితే, ముందు మనసుతో రాసేసి ఆ తర్వాత మెదడుకి పనిచెప్పి  తిరగ రాసుకోమంటాడింకో స్క్రీన్ ప్లే నిపుణుడు. పాత్రల, సన్నివేశాల పరిపుష్టికి ఇంతకంటే వేరే మార్గం లేదు. ఇదిగో, ఈ రెండు డైమెన్షన్ల మాస్టర్ డైరెక్టర్ గా మనకి మహోన్నతంగా దర్శనమిస్తాడు ‘మేఘసందేశం’ లో డాక్టర్ దాసరి నారాయణరావనే వ్యవస్థ. ఎలాగైతే 19 వ శతాబ్దపు నవలాకారుడు హెన్రీ జేమ్స్ ఒక సైంటిస్టులా కూర్చుని పాత్రల్ని నగిషీ చెక్కేవాడో, అలాటి సైకియాట్రిస్టు అంశతో కథనీ పాత్రల్నీ మధించే ఎక్స్ పర్ట్ రైటర్ గా, డైరెక్టర్ గా మంత్రముగ్ధుల్ని చేస్తాడు మనల్ని దాసరి ఈ సినిమాతో. 

        అనంతాకృతుల్ని  వక్రీభవించే కెలిడియో స్కోపు దాసరి మస్తిష్కం. ఎప్పుడే ఆకృతిని ఆర్టుగా కూడేసి బయస్కోపు చూపిస్తాడో తెలీదు. మనం బీ రెడీగా వుండాలి ఆయన చేసే ఆర్టిస్టికల్ బొంబార్డ్ మెంట్ ని కాచుకోవడానికి! ‘నీడ’ లాంటి కొత్త ప్రయోగం దగ్గర్నుంచీ ‘తాండ్ర పాపారాయుడు’  లాంటి భారీ చారిత్రాత్మకం వరకూ, ఏదైనా ఎప్పుడైనా అవలీలగా సృష్టించేయగలడు. ఇన్నని చెప్పలేని అద్భుతాల ఖని ఆయన మస్తిష్క సాగరమంతా. 



        అక్కినేని రవీంద్ర బాబు, జయసుధ పార్వతి, జయప్రద పద్మ, జగ్గయ్య జగన్నాథం పాత్రలు దాసరి కలంలో జన్మ పోసుకున్న మంచి స్టడీ మెటీరియల్ అభిజ్ఞులకి. అంతవరకూ తన మాటే వేదంగా వూళ్ళో పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న రవీంద్రబాబు, ఏమైందో ఏమో వూళ్ళోకి మేజువాణి పద్మ రాకతో కవిగారై కూర్చున్నాడు. ఆమె నాట్యమూ తన కవిత్వమూ జత కట్టేసి పురులు విప్పుకున్నాయి. కుర్రకారు ఆమెవల్ల చెడిపోతున్నారని వాళ్లకి కాపలాగా వెళ్ళిన తనే, ఆమెకి దాసుడై పోయి పరువు ప్రతిష్టలన్నీ పోగొట్టుకున్నాడు. ఇది చూసి హతాశురాలైంది భార్య పార్వతి. వారం రెండు మూడు రోజులు పూజలూ ఉపవాసాలతో గడిపే తనకీ అరిష్టమేమిటో అంతుపట్టలేదు.  అన్నని ఆశ్రయించింది. అన్న జగన్నాథం మేజువాణి పద్మని దూషించి వెళ్లిపొమ్మన్నాడు వూళ్ళోంచి. ఆమె వెళ్ళిపోవడం వెర్రెత్తించేసింది రవీంద్ర బాబుకి. విపరీతంగా  ఆమె మీద కవిత్వం రాసుకుంటూ సంసారం గింసారం పట్టకుండా కూర్చున్నాడు. ఇలా కాదని జగన్నాథం, ఆ కవితల్ని పుస్తకంగా వేయించి ఘనసన్మానం కూడా జరిపించాడు-  ఇలాగైనా తిరిగి మనుషుల్లో పడతాడని. ఊహు, అది జరిగితేగా! మళ్ళీ ఆ సభలో పద్మ కళ్ళబడగానే మేకపిల్లలా చెంగు చెంగు మని వెళ్లిపోయాడామె వెంట. 

        ఇక విధిలేక పార్వతి అతణ్ణి వొదులుకుంది. కూతుర్ని తీసుకుని అన్నతో వెళ్ళిపోయింది. పద్మ కోసం పిచ్చివాడై పోయిన రవీంద్ర బాబుకి ఆమె దక్కిందా? కాల చక్రం సర్రున తిరిగి కూతురు పెళ్లీడు కొచ్చి పెళ్లి ఆహ్వానం అందితే వెళ్ళాడా? ముదిమి వయసులోనైనా తిరిగి భార్యని కలుసుకోగలిగాడా? ఇవన్నీ ప్రశ్నలు. 


        రవీంద్రబాబు శంకరాభరణం శంకరశాస్త్రి లాంటి వ్యవహారదక్షుడు గానీ, స్థిత ప్రజ్ఞుడు గానీ కాదు. శంకరశాస్త్రిలా సరిగమలతో బాటూ సంసారమూ సమాజమూ పట్టించుకోవాలన్న బాధ్యత లేనివాడు. దేవదాసు లాంటి పారనాయిడ్ పర్సనాలిటీ. ఆత్మవినాశక తత్త్వం. పక్క మీద భార్య ఎంతో ఆశతో చూసినా, అటు తిరిగి ప్రేయసి  జ్ఞాపకాల్లో స్వైరవిహారం చేసే జడుడు, మానసిక వ్యభిచారి. ఏ వేళలోనూ  భార్య అంటే ప్రేమే వుంది - కానీ నువ్వూ కావాలి, నీతో పాటూ నా కళా సాంగత్యానికి ఆమె కూడా కావాలనీ ధైర్యంగా చెప్పుకోలేని చేతకానితనం. 



      మనమిందాక తాజ్ మహల్ ముందు వివరించుకున్న సన్నివేశం మరింకెవరిదో కాదు- ఒక మహా నటుడు, అటెన్ బరో ‘గాంధీ’ లో మహాత్మా గాంధీ పాత్రని అద్వితీయంగా పోషించిన బెన్ కింగ్స్ లే, అతడి భార్య డెనీలా లావెండర్ లదే. ‘తాజ్’ అనే మరో సినిమాలో షాజహాన్ గా నటించేందుకు ఇండియా వచ్చిన కింగ్ స్లే, నిజ జీవితంలో ప్రెస్ కెమెరాల సాక్షిగా తాజ్ ముందు భార్యతో ఆడిన సరసంలో అతడి లోని పరిపూర్ణ కళాకారుడు బయటపడి థ్రిల్లవుతాం. కళాపిపాస వుంటే వుంటుంది- దాంతో పాటూ  అంతే రంజుగా సంసార సుఖమూ వుండాలి. ఈ అదృష్టాన్ని పొందగలిగీ దూరంగా వుండిపోయాడు పాపం రవీంద్రబాబు. రివర్స్ ఇమేజిలో శంకరశాస్త్రికి కళాకారుడి రూపం ఈ దాసరి అపూర్వ సృష్టి. 

        ఇందుకు భిన్నం పార్వతి. ఓ పాత కథ వుంది. అందులో ఓ రాజు తన ధర్మం కోసం అలక్ష్మిని ఇంటికి తీసుకొస్తే, ఇంటి లక్ష్మి తానుండ లేనని వెళ్ళిపోతుంది. ఇదే పరిస్థితి పార్వతిది. అయితే హూందాగా ప్రవర్తిస్తుంది ఈ దుస్థితిలో కూడా. ఇందులో అసలు పద్మ తప్పేంటని అన్ననే అడుగుతుంది. జెండర్ కి పైస్థాయిలో ఆలోచించే మనిషని ఇట్టే తెలిసిపోతుంది. భర్త ‘నువ్వు ఆడదానివేగా?’ అని ఎత్తి పొడిచినప్పుడు, ఏమనాలో తెలీక వెక్కి వెక్కి ఏడుస్తుంది. తను ఆడదే, కానీ అర్ధం చేసుకున్న ఆడదాన్నని ఎలా చెప్పాలి? అందుకే పద్మతో- ‘నేనెందుకో తగిన దాన్ని కాలేకపోయాను, మీ వల్ల ఆయన గొప్ప వారయ్యారు, అందువల్ల మీరు  నాతో  పాటు వచ్చెయ్యండి’ అని అనగల్గింది. 



      పద్మ నిమిత్తమాత్రురాలు. కోరి రవీంద్ర బాబు ప్రేమ కవిత్వం రాస్తే, సహజంగానే ఆమె సాని మనసు అందులో ముక్తిని వెతుక్కుంది. కానీ పార్వతికి అన్యాయం చేయలేక వెళ్ళిపోయింది. అయినా అతను  వెంటపడి వస్తే తనేం చేస్తుంది. అతణ్ణి కవిగా చేసేందుకే పార్వతి త్యాగం చేసుకున్నాక- ఆ బాధ్యత ఇప్పుడు తను తీసుకోక తప్పదుగా!

        ఇక జగన్నాథం బాధ్యత మీదేసుకున్న కార్యశీలి.  ఇందాక పాక్షికంగా ప్రస్తావించుకున్న పాతకథలో రాజుగారు తెచ్చుకున్న అలక్ష్మీ వల్ల లక్ష్మితో పాటూ నారదుడూ వెళ్లి పోతాడు. ఇక్కడ నారదుడు లాంటి జగన్నాథం చెల్లెల్ని తీసుకుని వెళ్ళిపోయాడు.


        ఈ టచింగ్ సైకలాజికల్ డ్రామాని అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, జయప్రద, జగ్గయ్యలు పకడ్బందీగా పోషించారు. దాసరి విజన్ మార్చుకుని కొత్త పంథాలో,  అతితక్కువ సంభాషణలతో, అతి మధుర సంగీత సాహిత్యాలతో, క్లాసిక్ హోదాకి చేర్చిన చలనచిత్ర రాజమిదే. రమేష్ నాయుడు సంగీతం, సెల్వరాజ్ ఛాయాగ్రహణం, పసుమర్తి నృత్యాలూ  ...ఎప్పుడో కీర్తి ప్రతిష్ఠలందుకున్నాయి  కూడా.

డైలాగ్ డిస్ ప్లే 
అక్కినేని :
        “చేశారని అనుకోవడం వేరు, చేశారని తెలియడం వేరు.”
        “మతి చెడి మనసు చెడినప్పుడు పుట్టిన పిచ్చి గీతలు  నా హృదయంలో చోటు చేసుకున్న ఈ చీకటి రాతలు, ఈ కవితలు...”
        “ఆమె పరిచయం నాలో అజ్ఞాత కళాకారుణ్ణి  పైకి తీసుకొచ్చింది.”
జయసుధ :
        “రెండు పడవల మీద ప్రయాణం చేసే సాహసం మీకున్నా, చూసే సాహసం నాకు
లేదు.”
 జయప్రద :
        “చెడి ఇక్కడి కొచ్చారేమోగానీ ఇక్కడికొచ్చి చెడ్డ వాళ్ళెవరూ లేరు.”
 జగ్గయ్య :
        “ఏ శక్తో ఆవహిస్తే గానీ ఏ వ్యక్తీ హఠాత్తుగా మహాకవి కాలేడు.”
        “మగవాడు ఆడదాన్ని కాదన్నా మగవాడుగా బతకగలడు, కానీ మగవాడు కాదన్న ఆడదాన్ని ఆడదానిగా బతకనివ్వరమ్మా”


మూడింటా మేటి!
       అక్కినేనితో సినిమా అంటే ఆశువుగా కథలొచ్చేస్తాయి దాసరికి. ‘ప్రేమాభిషేకం’, ‘బహుదూరపు బాటసారి’, ‘బుచ్చిబాబు’, ‘శ్రీవారి ముచ్చట్లు’ ... ఇలా ఎన్నో. 1979లో ‘శంకరాభరణం’ ఘనవిజయంతో అలాంటి సినిమా తనెందుకు తీయకూడదన్న ఆలోచన వచ్చింది దాసరికి. స్వాభావికంగా శాస్త్రీయ సంగీత పక్షపాతియైన తను అలాటి ‘మేఘసందేశం’ కి శ్రీకారం చుట్టారు. అందరూ డైలాగుల దాసరి అనడం చూసి తక్కువ డైలాగులతో డిఫరెంట్ గా తీయాలన్న పట్టుదలా  వచ్చింది. కథ విని, వెంటనే ఓకే చేశారు అక్కినేని. సంగీత దర్శకుడిగా రమేష్ నాయుడు రంగంలోకి వచ్చారు. అప్పుడు పాటల విషయం  వచ్చేసరికి, దేవులపల్లి కృష్ణ శాస్త్రి మెదిలారు. అప్పుడాయన లేకున్నా, ఆయన రాసిన గీతాల్ని వెలికి తీసి ప్రజానీకానికి పరిచయం చేయాలన్పించింది దాసరికి. అలా- ఆకులో ఆకునై... ముందు తెలిసేనా...  వంటి కృష్ణ శాస్త్రి గీతాలు తీసుకున్నారు. వేటూరి చేత-  ఆకాశ దేశాన... ప్రియే చారుశీలే...  వంటి పాటలు రాయించారు. మరి అక్కినేనికి పాడే దెవరు? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విదేశాల్లో వున్నారు. పైగా  ‘శంకరాభరణం’ లో ఆయన పాడేశారు. ఇంకెవరైనా కొత్త గాయకుణ్ణి తన తరపు నజరానాగా ప్రేక్షకులకి అందించాలన్పించింది దాసరికి. అప్పుడు అడుగు పెట్టిందే గాన గంధర్వుడు కేజే ఏసు దాస్. ఇక ఏసుదాస్ గళం గలగలలతో  ఆ పాట లెక్కడ తాకాయో వేరే చెప్పనవసరం లేదు. పి. సుశీల సరే, ఆమెకి కూడా ఏసుదాస్ తో పాటుగా జాతీయ ఉత్తమ గాయని అవార్డు లభించింది. పాడనా వాణి కల్యాణిగా...అని బాలమురళీ కృష్ణ కూడా మరో పాట పాడి తెరాభినయం చేశారు కూడా. ఒకేసారి దాసరికి నాల్గైదు సినిమాలు చేసే సత్తా వున్నా, ‘మేఘసందేశం’ పూర్తయ్యేవరకూ మరో సినిమా జోలికి పోలేదు. ఇది తెలుగులో ఏ సినిమాకీ దక్కని 27 అవార్డులూ గెల్చుకుంది. ఇప్పుడూ దాసరి చాలా బిజీ. ఈ విశేషాలు చెప్పడానికి ఆయన అసిస్టెంటూ దర్శకుడూ అయిన నందం హరిశ్చంద్రరావు ముందు కొచ్చారు ఉత్సాహంగా. ఈయన కృష్ణం రాజు, జయప్రదలతో ‘సర్దార్’, జయసుధతో ‘దుర్గాదేవి’ లు తీయడమేగాక, ‘చిరునవ్వుల వరమిస్తావా’ లో తమిళ స్టార్ విక్రంని పరిచయం చేసిన ఘనత కూడా దక్కించుకున్నారు.


-సికిందర్
(డిసెంబర్ 2009, ‘సాక్షి’)
http://www.cinemabazaar.in







Saturday, December 17, 2016

రివ్యూ!



దర్శకత్వం : ఇ. సత్తిబాబు
తారాగ‌ణం: పృథ్వీ, నవీన్‌చంద్ర, సలోని, శృతిసోధి, సన, జయప్రకాష్‌ రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్‌ శ్రీను, ధన్‌రాజ్‌ తదితరులు
కథ, మాటలు: నాగేంద్రకుమార్‌ వేపూరి, కథా విస్తరణ: విక్రమ్‌రాజ్‌, డైలాగ్స్‌ డెవలప్‌మెంట్‌: క్రాంతిరెడ్డి సకినాల, సంగీతం: శ్రీవసంత్‌, ఛాయాగ్రహణం: పి. బాల్‌రెడ్డి, బ్యానర్ : శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్‌
నిర్మాత: కె.కె.రాధామోహన్‌
విడుదల : 16-12-2016
***

         
క్యారెక్టర్ ఆర్టిస్టు పృథ్వీని హీరోగా చేస్తూ ఆయన శైలిలో కామెడీ తీశారు. పృథ్వీ అంటే పేరడీలకి ప్రసిద్ధి కాబట్టి మరోసారి ఆ కోణాన్ని చూపెడుతూ వెరైటీగా సినిమాలో సినిమా చూపించారు. ఈవీవీ శిష్యుడు, అరడజను సినిమాలు తీసిన దర్శకుడు ఇ. సత్తిబాబు దీని రూపకర్త. ‘అధినేత’, ‘బెంగాల్ టైగర్’ లవంటి ఐదు సినిమాలు తీసిన కేకే రాధా మోహన్ నిర్మాత. ‘మర్యాదరామన్న’ ఫేమ్ సలోని హీరోయిన్. టైటిల్ వచ్చేసి ‘మీలో ఎవరు కోటీశ్వ రుడు’. ఇలా అనేక ఆకర్షణలతో ప్యాకేజీ చేసిన ఈ తాజా కమర్షియల్లో తాజాదనమెంత? సినిమాలో సినిమా చూపించాలన్న  వెరైటీ ఆలోచన ఎంతవరకు ఫలించింది? హీరోని వేరియే షన్ స్టార్ అంటూ కామెడీ చేసిన ఈ పేరడీలో ఎంటర్ టైన్మెంట్ ఎంత? ఇవన్నీ ఈ కింద తెలుసుకుందాం.
 

కథ 

     రాత్రి పూట తాగి రోడ్డున పడ్డ తనని ఏమీ చేయకుండా ప్రశాంత్ (నవీన్ చంద్ర) అనే అతను క్షేమంగా ఇంటిదగ్గర దిగబెట్టాడని తెలుసున్న ప్రియ (శృతీ సోధి), తనని అతనేమీ చేయకపోవడం తన ఆడతనానికే అవమానంగా భావించుకుని అతడి వెంట పడుతూంటుంది – తనని ఏమైనా చెయ్యమని రెచ్చగొడుతూ. ఆమె డబ్బు గలది. అతను సామాన్యుడు. చదువుకుంటున్న అతను  ఆమెని దూరం పెడుతూంటాడు. ఒకానొక సందర్భంలో ఆమెని ప్రేమించడం మొదలెడతాడు. కానీ అంతస్తుల తేడాలు చూపించి సంపన్నుడైన ఆమె తండ్రి ఏబీఆర్ (మురళీ శర్మ) పెళ్ళికి తిరస్కరిస్తాడు. అప్పుడు డబ్బుతో శాశ్వత ఆనందం లభించదని, తాత్కాలిక సంతోషమే లభిస్తుందనీ - ఓడి గెలిచిన వాడికే ఆనందం అంటే ఏమిటో అర్ధమవుతుందనీ తన ఐడియాలజీ విన్పిస్తాడు ప్రశాంత్. విన్పించి, ఏదైనా వ్యాపారం చేసి నష్టపోతే మీకే తెలుస్తుందంటాడు. దీంతో ఆలోచనలో పడ్డ ఏబీఆర్, కొత్త వ్యాపారం పెట్టి నష్టపోవడానికి సిద్ధపడి- అలాటి నష్టపోయే ఐడియా ఇచ్చిన వాళ్లకి కోటి రూపాయలు బహుమతి ప్రకటిస్తాడు. తాతారావు (పోసాని) అనే సినిమాలు తీసి నష్టపోయిన నిర్మాత ఈ అవకాశాన్ని కొట్టేస్తాడు. ఒక దరిద్రగొట్టు  దర్శకుడు రోల్డ్ గోల్డ్ రమేష్ (రఘుబాబు) అనే వాడితో పది కోట్లతో సినిమా తీస్తే,  పూర్తిగా నష్టపోవడం ఖాయమన్న ఇతడి ఐడియా ఏబీఆర్ కి నచ్చి,  సినిమా తీయించడం మొదలెడతాడు. తాతారావు- రమేష్ లు కలిసి చిన్న చిన్న వేషాలేసుకునే వీర బాబు (పృథ్వీ) ని వేరియేషన్ స్టార్ గా పరిచయం చేస్తూ, సమంత (సలోని) ని హీరోయిన్ గా తీసుకుని సినిమా తీసి విడుదల చేస్తారు. ఆ సినిమా ఏమిటి? అది తీసి ఏబీఆర్ నష్టపోయడా? లాభాలార్జించాడా? ప్రశాంత్ చెప్పిన ఆనందం ఎలా పొందాడు? కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నాడా లేదా?...అన్నవి మిగతా కథలో తెలిసే  అంశాలు.  
ఎలావుంది కథ?
       డబ్బున్న వాడిదగ్గర ఆనందం ఉండదనీ, కేవలం తాత్కాలిక సంతోషమే వుంటుందనీ, డబ్బు లేనివాళ్ళు మాత్రమే ఆనందంతో హాయిగా జీవిస్తారన్న ఒక మూఢ విశ్వాసం హీరో చేసే సమర్ధింపుగా ఈ కథకి మూలం. కానీ మనం ఆలోచిస్తే ఇది తిరోగమన వాదమని ఇట్టే అర్ధమైపోతుంది. ఎలాగంటే, ఇలాటి  మూఢ విశ్వాసంతో పేదవాళ్ళు పేదవాళ్ళుగానే వుండి పోతారు. వాళ్ళ దృష్టిలో డబ్బు పాపిష్టిది గానే వుండిపోతుంది. డబ్బు (లక్ష్మి) పాపిష్టిది కాదు, కేవలం డబ్బుతో వ్యవహరించే కొందరు మనుషులే పాపిష్టి వాళ్ళు కావొచ్చు. అలాకూడా మనుషుల్ని జడ్జి చేయకూడదు. డబ్బుతో ముడి పెట్టి మనుషుల్ని నెగెటివ్ గా జడ్జి చేసినంత కాలం ఆ డబ్బు (లక్ష్మి) మన దగ్గరికి కూడా రాదు. ఆర్ధిక సంస్కరణల పుణ్యమా అని దేశం ఆర్ధికంగా కళకళ లాడుతున్న వేళ నోట్ల రద్దుని అడ్డుపెట్టుకుని, ఒక నంబర్ వన్ జాతీయ ఆంగ్ల ఛానెల్ ‘డర్టీ క్యాష్’ అంటూ డబ్బుని తిట్టడం మొదలెట్టింది. చాలా అధ్వాన్నంగా ఉంటోంది డబ్బుని అర్ధం జేసుకోవడం. సమస్య మనుష్యుల్లో వుంటే, డబ్బుని చూపించి ఇలాటి కథలు చేయడంవల్ల –చివరికి చెప్పాలనుకున్నది కూడా స్పష్టంగా చెప్పలేకపోతారు- ఈ కథలో లాగే. చివరికి డబ్బుగల ఏబీఆర్ పాత్రకి ఆనందం ఎలా లభించిందో మనకి అర్ధంకాని విధంగా చెప్పి ముగించారు. అతను హీరో చెప్పిన ఆనందాన్ని అర్ధంజేసుకోవడం పోయి, అతణ్ణి ప్రేమిస్తున్న కూతురి ప్రేమని అర్ధం జేసుకున్నట్టుగా  తయారయ్యింది కథ. 

ఎవరెలా చేశారు 
      పృథ్వీ తన ట్రేడ్ మార్క్ నటనే కనబర్చాడు. అయితే బయట వీరబాబుగా, సినిమాలో మహేష్ బాబు పాత్రగా వేరియేషన్ చూపించి వుంటే బావుండేది. స్టార్స్ ని అనుకరిస్తూ డైలాగులు కొట్టే ఫార్మాలిటీని ఇంకోసారి మొక్కుబడిగా పూర్తి చేశాడు. మహేష్ పాత్రగా తాను జ్యూనియర్ ఇంటర్ చదవడమన్నది- నాటి హీరోల మీద మంచి సెటైరే. ఆ వయసులో స్టూడెంట్ గా నటించడమన్నది తెలుగు హీరోలకి ఒకప్పుడు అలవాటే. కాకపోతే ఇక్కడ మైనం పాటి భాస్కర్ రాసిన సెటైర్ గుర్తొచ్చేలా వుంది పృథ్వీ మహేష్ బాబు పాత్ర ఎంట్రీ. ఇరవై ఏళ్ల క్రితం మైనంపాటి భాస్కర్ రాసిన సెటైర్లో,  యాభై ఏళ్ల తెలుగు హీరో ఇంట్లోకి పిల్ల మొగ్గేసి తల్లిని కావిలించుకుని- ‘అమ్మా నేను బియ్యే పాసయ్యా!’ అంటాడు. పృథ్వీ కూడా ఇంట్లోకి జంప్ చేసి-  ‘అమ్మా నేను టెన్త్ పాసయ్యా!’ అంటాడు!!

        పృథ్వీ టీనేజి హీరోగా నటించే సినిమా టైటిల్ ‘తమలపాకు’. తండ్రిగా తిట్టి కొట్టే పాత్రలో జయప్రకాష్ రెడ్డి  ఉంటాడు. వీళ్ళిద్దరూ పాత సినిమాల్లోని అతి డ్రామాని ప్రకటిస్తారు. పృథ్వీ సరిగ్గా చదువుకోడం లేదనో, హీరోయిన్ వెంట తిరుగుతున్నాడనో జయప్రకాష్  రెడ్డి చావగొట్టినప్పుడల్లా-  ‘ఒక్కగానొక్క  చిన్న కొడుకండీ’ అంటూ తల్లిపాత్ర చేసే ఓవరాక్షన్ కూడా మంచి సెటైరే పాత సినిమాల మీద (ఈ కాలంలో యూత్ సినిమాల పేరుతో  ఇంకా వస్తున్న ‘నాన్న- నేను- నా బాయ్ ఫ్రెండస్’ లాంటి పాత డ్రామెడీలకి కూడా సెటైర్లు ఈ చిత్రణలు).  

       
కానీ పృథ్వీ ఇటీవల ‘మనవూరి రామాయణం’ లో నటించినంత ప్రతిభావంతంగా నటించి ఇక్కడ ముద్ర వేయలేకపోయాడు. కారణం, ఒక విజన్ లేకుండా ‘తమలపాకు’ సినిమాకథా కథనాలు సాగడమే. పోతే చాలాకాలం తర్వాత సలోని కన్పించింది గానీ ఆమె పాత్రకూడా కృతకమే. ఇక పోసాని- రఘుబాబులది భరించడం కష్టమైపోయే కామెడీ. ఎందుకు వీళ్ళిద్దరు అంత  గొంతు చించుకుని అరుస్తూ మాట్లాడతారో అర్ధంగాదు. ప్రేక్షకులు చెవిటి వాళ్లనా? వీళ్ళ వాయిసులు నరాల మీద సుత్తి మోతలు. జయప్రకాష్  రెడ్డి గొంతు అయితే పక్కా శబ్దకాలుష్యమే. ఇలా శబ్ద సౌందర్యం లేకుండా డబ్బింగులు చేస్తే ఏదో చీప్ క్వాలిటీ  సినిమా చూస్తున్నట్టు వుంటుంది. నిర్మాత రాధామోహన్ ఇదివరకు కాస్త సాంకేతిక విలువలున్న సినిమాలు తీసిన వాడే. 

        మురళీ శర్మ  సీన్స్ ని రక్తి కట్టించగలడు గానీ, ఆ పాత్రకి దర్శకుడు న్యాయం చేయగలగాలి. అదిక్కడ జరగలేదు. చివరికి హీరో ఫిలాసఫీని ఏమర్ధం జేసుకున్నాడో తెలీదు. తను చెత్తగా తీసి నష్టపోవాలనుకున్న సినిమా తనకే  గొప్పగా ఏదో నేర్పిందనుకుంటాడు- ఏమిటది? మనకైతే అర్ధంగాలేదు. బిజినెస్ లో నష్టపోయి, ఆ నష్టంలోంచి బిజినెస్ ని లాభాల బాట పట్టిస్తే, ఆ విజయం ఇచ్చే ఆనందం అసలైన ఆనందమని, అది కలకాలం వుంటుందనీ హీరో ఫిలాసఫీ (?) గా మనం అర్ధం జేసుకోవాలి. దీని ప్రకారం మురళీశర్మ పాత్రకి ముగింపు లేదు. తను తీసిన ‘తమలపాకు’ సినిమాలో హీరోయిన్ కి హీరో కిడ్నీ దానమిచ్చి బతికించుకుంటే- అది ధనిక పేదా తేడాల్ని తుడిచి పెట్టేసిందని ఫీలైపోయి, కూతురి పెళ్ళికి ఎస్ అనేస్తాడు. దీనికీ హీరో ఎంకరేజి చేసిన ఫిలాసఫీకీ సంబంధమేమిటి?

        పైగా హీరో చివరికి- ఆ సినిమా కథ తానే రాసి ఇచ్చానని ట్విస్ట్ ఇస్తాడు. ఇది మరీ చోద్యంగా వుంది. మురళీ శర్మ ఏదో చెత్త సినిమా తీసి నష్టపోవాలనుకుంటే, అది హీరో ఫిలాసఫీ ప్రకారం కరెక్టే అనుకుంటే, హీరో గొప్ప కథ ఇచ్చి మురళీ శర్మ కళ్ళు తెరిపించాలనుకోవడ మేమిటి తన ప్రేమకోసం? చక్కగా ఏ టైటానిక్కో, లైలా మజ్నూనో, మరో చరిత్రనో చూపించి కళ్ళు తెరిపిస్తే సరిపోతుంది కదా? సంతోష ఆనందాల వేరియేషన్స్ చెప్పి మురళీ శర్మని అంత శ్రమ పెట్టడమెందుకు? మురళీ శర్మ నేర్చుకోవాల్సింది ఒకటైతే, సోషలిజం నేర్పడమేమిటి?

        హీరోగా నవీన్ చంద్రది నామమాత్రపు పాత్ర. నటన కూడా ఏమీ మార్పు లేకుండా అదే చాలా పూర్ నటన. అసలున్నాడో లేడో అన్నట్టుంటాడు ఈ సినిమాలో కూడా. ఇక హీరోయిన్ శృతీ సోధిలో అతిగా నార్త్ ఇండియన్ నెస్ నేటివిటీకి చెల్లుచీటీ రాసేసింది. సాంకేతిక విలువలూ సంగీత సాహిత్యాల గురించి చెప్పుకోవాల్సిందేమీ లేదు. 

చివరికేమిటి?
        థ, స్క్రీన్ ప్లే, మాటలే కాకుండా, మళ్ళీ కథా విస్తరణ, డైలాగ్స్ డెవలప్ మెంట్ అంటూ రాత పనిని ఇంత విభజించుకుని కూడా,  ఇందరూ  కలిసి అసలు కాన్సెప్ట్ ని రీసెర్చి చేసినట్టు కన్పించడం లేదు. ఫలానా ఈ కాన్సెప్ట్ తో ఏఏ సినిమాలు వచ్చాయో పరిశీలించుకున్నట్టు లేదు. సినిమాలో ‘తమలపాకు’ అనే ఇంకో సినిమా చూపించాలనుకోవడం బాగానే వుంది. ఆ ‘తమలపాకు’ చెత్త సినిమాగా తీస్తున్నారు కాబట్టి హాస్యాస్పదంగా అవే పాత – కాలం చెల్లిన పాత్రలూ –కథా- సన్నివేశాలూ  కలిపికొట్టి ప్రేక్షకుల మీద రుద్దితే, కోరుకున్న అట్టర్ ఫ్లాపు వస్తుందనుకోవడం మంచి అయిడియాతో కూడిన కాన్సెప్టే.  పనిలోపనిగా సినిమాలమీద, సినిమా రంగం మీదా సెటైర్స్ కూడా వేసుకోవచ్చు. కానీ ఇది వర్కౌట్ కాలేదు. కారణం, అసలీ కాన్సెప్ట్ ని ఎలా ప్రెజెంట్ చేయాలో గ్రహించకపోవడం.

          విద్యా బాలన్- నసీరుద్దీన్ షా లతో ‘డర్టీ పిక్చర్’ తీశారు. అది ఏనభై లనాటి సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తీశారు. ఆనాడు సినిమాలు ఎలా తీసేవాళ్ళో, వయసు మళ్ళిన హీరోలు హెవీ మేకప్పులేసుకుని, విచిత్ర కాస్ట్యూమ్స్ వేసుకుని,  ఎలా గెంతే వారో;  అప్పటి పాటలూ మ్యూజిక్ (బప్పీ లహరీ టైపులో) ఎలావుండేవో, హీరోయిన్ల కట్టుబొట్టు ఎలా ఉండేవో- నవ్విస్తూ అచ్చు గుద్దినట్టు తీసి అవతల పడేశారు. పెద్ద హిట్ చేశారు నేటి కాలపు ప్రేక్షకులు కూడా. అలాటి వయసుమళ్ళిన ఓవరాక్టింగ్ హీరోగా నసీరుద్దీన్ షా ఎలా ఉన్నాడో పృథ్వీ చూసివుంటే, లేదా అప్పటి హీరోయిన్ గా- డాన్సర్ గా - విద్యాబాలన్ ఎలా వుందో సలోని  చూసివుంటే- మొత్తంగా టీం అంతా ఈ సినిమా చూసి వుంటే,  ఈ కాలానికి ఆ కాలపు సినిమా చూపిస్తూ గతాన్ని గొప్పగా రీక్రియేట్ చేసి వుండేవాళ్ళు. క్రియేటివిటీ అనేది సినిమాలో సినిమా చూపిస్తున్నాం కాదా అనుకోవడం దగ్గరే ఆగిపోయిందిక్కడ. ఎలా క్రియేట్ చేయాలనే దాని  గురించి ఇన్నోవేషన్ లేదు- అదీ సమస్య. మొదటి అరగంట హీరో హీరోయిన్ల ప్రేమట్రాకు పసలేని పరమ బోరు. అరగంట తర్వాత మురళీ శర్మ  ఐడియా కోసం ప్రకటన  ఇచ్చే ప్లాట్ పాయింట్ వన్ తో మనకి కొత్త హుషారు వస్తుంది గానీ, అది పోనుపోనూ శిరోభారంగా పరిణమిస్తుంది...


-సికిందర్ 
cinemabazaar.in