రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, January 26, 2020

911 : సందేహాలు -సమాధానాలు


Q: సినిమా కథలకి స్ట్రక్చర్ ఎంతవరకు అవసరం? స్ట్రక్చర్ లేకుండా కథలు చేయలేమా? శ్రీనివాస్ ఆర్, సహ దర్శకుడు
A: చేసుకోవచ్చు. సినిమా కథకి కొలమానాలేవీ లేవు. ఇలా అనుకుంటేనే నిర్భీతిగా తోచినట్టూ రాసుకోవచ్చు. ఫిలిం ఇనిస్టిట్యూట్స్ లో స్క్రీన్ ప్లే కోర్సులూ, బయట స్క్రీన్ ప్లే వర్క్ షాపులూ ఇదంతా దండగ వ్యవహారం. కెమెరాతో చిత్రీకరించాలంటే, ఎడిటింగ్ చేయాలంటే, గ్రాఫిక్స్ చేయాలంటే, పాటలు కూర్చాలంటే దేనికీ కొలమానా లవసరం లేదు, శాస్త్రం లేకుండానే అన్నీ చేసుకో వచ్చు. ఆఫీసు కూడా వాస్తు శాస్త్రం లేకుండా పెట్టుకోవచ్చు.  వీళ్ళెవరైనా ఇలా కాదని శాస్త్ర ప్రకారం చెప్తూంటే హేళన చేసి పంపొచ్చు.   

Q: గోల్ హీరోది కాకుండా ఎవరి బలవంతం మీదో, బ్లాక్ మెయిల్ వల్లో పని చేయాల్సి వచ్చినప్పుడు ప్లాట్ పాయింట్ - 1 దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లక్ష్యం హీరోది కాదు కాబట్టి ఎమోషన్ జెనరేట్ అవ్వదు కదా? ఇలాంటి కథలకు స్క్రీన్ ప్లే లు చేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించగలరు. అలాగే దీనికి రిఫరెన్స్ గా తీసుకోదగిన సినిమాలు కూడా తెలుపగలరు.
పీ., సహకార దర్శకుడు
 
A: మీరనే దాన్ని బట్టి ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే హీరో బ్లాక్ మెయిల్ వల్లో, బలవంతం వల్లో తత్సంబంధ గోల్, అంటే తనది కాని, తన మీదపడ్డ గోల్ ని తీసుకునే సమస్య ఏర్పాటవుతుంది. అప్పుడా బ్లాక్ మెయిల్ లేదా బలవంతపు పట్టులోంచి ఎలా బయట పడాలన్నదే యాక్టివ్ హీరో ప్రయత్నంగా కథ నడుస్తుంది. అంతే తప్ప మీదపడ్డ గోల్ గురించి కాదు. పాసివ్ హీరో అయితే ఆ వొత్తిళ్ళకి (బ్లాక్ మెయిల్, బలవంతం) లొంగి, ఈసురోమని ఏడుస్తూ మీద పడ్డ గోల్ పూర్తి చేసి దండం పెడతాడు. ఈ తేడా గమనించండి. సమస్య ఏర్పాటయింది తన మీద పడ్డ గోల్ గురించి కాదు, తను ఇరుక్కున్న పరిస్థితి (బ్లాక్ మెయిల్, బలవంతం) గురించి. అందువల్ల ఎమోషన్స్ వీటి చుట్టే వుంటాయి. ఈమధ్య ఒక కథలో రోడ్డు పక్క వెయిట్ చేస్తున్న ఎవరో అమ్మాయిని కారొచ్చి గుద్దేస్తే, అక్కడున్న లేత హీరో భయపడి పారిపోతాడు. ఈ కేసులో తను ఇరుక్కుంటాడేమోనని భయపడుతూ వుంటాడు. సాక్ష్యాధారాలూ తనకి వ్యతిరేకంగా వుంటాయి. దీన్నుంచి తను బయటపడాలంటే, యాక్సిడెంట్ చేసి ఆ అమ్మాయిని చంపిందెవరో పట్టుకోవడానికి వయసు చాలని లేత హీరో చచ్చినట్టూ బయల్దేరాలి. అయితే ఈ కథలో ఆ అమ్మాయితో హీరోకి కనెక్షన్ లేనప్పుడు ఎమోషన్ లేదుకదా అనే ప్రశ్న వచ్చింది. ఎమోషన్, కథా ఎవరో తెలియని అమ్మాయి చనిపోవడం గురించి కాదని ఈ లైను చెప్తేనే తెలిసిపోతోంది. ఇది ఫార్ములా కథైతే ఆ అమ్మాయి హీరోకి తెలిసిన అమ్మాయే అయివుండి, అయ్యో చనిపోయింది కదా అనే ఫార్ములా ఎమోషన్ కనెక్ట్ అయి, ఆ చంపిన వాణ్ణి పట్టుకుని శిక్షించే పస లేని, ప్రేక్షకులకి ఇంకా అవసరం లేని, రొటీన్ ఫార్ములా రివెంజి కథయి పోతుంది. ఇది రియలిస్టిక్ కథ. జీవితంలో ఒక్కోసారి మనకి సంబంధం లేని సంఘటనల్లో ఇరుక్కునే అనుభవా లెదురవుతూంటాయి. ఇందులోంచి ఎలా బయట పడాలన్న ప్రయత్నమే హీరో వాస్తవిక కథ. ఇది బయటపడడం  గురించి కథ, పగదీర్చుకోవడం గురించి కాదు.

        ‘మజ్బూర్లో, అమితాబ్ బచ్చన్ తను బ్రెయిన్ ట్యూమర్ తో చనిపోతానని తెలిసి, కుటుంబం కోసం హంతకుడి డీల్ ఒప్పుకుంటాడు. ఐదు లక్షలు తీసుకుని, హంతకుడు చేసిన హత్యని తన మీదేసుకుని, ఉరికంబం ఎక్కబోతాడు. ఇంతలో జైల్లో బ్రెయిన్ ట్యూమర్ కి చికిత్స జరిగిపోవడంలో చావాల్సిన వాడు బతికి, ఇక ఉరి కంబం ఎక్కడం ఇష్టం లేక, జైల్లోంచి పారిపోయి హంతకుణ్ణి పట్టుకుంటాడు. ఇందులో అమితాబ్ మొదటి ఎమోషన్ కుటుంబ సంక్షేమం, తర్వాతి ఎమోషన్ హత్యలోంచి బయటపడ్డం. మొదటి ఎమోషన్ తో వున్న గోల్ హంతకుడి డీల్ ఒప్పుకుని అది పూర్తిచేయడం, రెండో ఎమోషన్ తో వున్న గోల్ హంతకుడి మీద తిరగబడ్డం.
        కాబట్టి బ్లాక్ మెయిల్, బలవంతం అన్నవి అన్యాయాలే గనుక, వీటితో మొదలయ్యే గోల్స్ తిరుగుబాటుతోనే ముగుస్తాయి. గోల్ ఎలిమెంట్స్ నాల్గు వుంటాయని తెలిసిందే : 1. కోరిక, 2. పణం,3. పరిణామాల హెచ్చరిక, 4. ఎమోషన్. ప్లాట్ పాయింట్ వన్లో సమస్యని ఏర్పాటు చేసినప్పుడు, అక్కడున్న గోల్ లో ఈ నాల్గూ సమకూరాయా లేదా సరి చూసుకుంటే సరిపోతుంది.

Q: 1. కొత్త జానర్ సినిమాలు ప్రయత్నించ వచ్చంటూ ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ టీనేజి లవ్ స్టోరీ గురించి ఏదో ఒక ఆర్టికల్ రాశారు. ఇంకా వేరే జానర్స్ ఏం ప్రయత్నించవచ్చో వివరించండి. సినిమాలు వివరించ నవసరం లేదు, ఉదాహరణ లివ్వండి చాలు. 
       2. కొత్త దర్శకులు వెబ్ సిరీస్ కూడా ప్రయత్నించ వచ్చంటారా, లేక సినిమాలకే పరిమితం కావాలంటారా? ఈ మధ్య బాగా పేరున్న దర్శకులు కూడా వెబ్ సిరీస్ ఎక్కువ చేస్తున్నారు కదా?
       
3. మీరు ఎప్పుడో బ్లాగులోనే అన్నట్టు గుర్తు. దర్శకుడు అవాలంటే రెండు మూడు కథలు తయారు చేసుకుని తిరగ వద్దని, ఒకే కథతో గట్టిగా ప్రయత్నించాలని. దీని మీద ఇంకోసారి వివరణ ఇవ్వండి. ఎందుకంటే, బయట ప్రాక్టికల్ గా నిర్మాతలు లేదా హీరోలు ఇది కాదు, ఇంకెక్కడైనా చెప్పండని అంటున్నారు. ఇది నా ఫ్రెండ్స్ కే జరిగింది.
        4. ప్రతి ఆదివారం సందేహాలు - సమాధానాలు కొనసాగించమని ఇదివరకే కోరితే మీరు పట్టించుకోలేదు. ఏదైనా అలవాటు చేయాలి. వరుసగా రెండు వారాలు ఇచ్చి చూడండి, అందరూ ప్రిపేర్ అయి ప్రశ్నలు పంపుతారు. ఒక ఆరోగ్యకరమైన చర్చ జరుగుతుంది. పది మందికి మంచే జరుగుతుంది కదా? ఆలోచించండి. ప్రతి ఆదివారం ఈ శీర్షికలో ఫలానా జానర్ మూవీస్ చూడండని మీరు మూవీస్ చెప్పడమో, లేదా ప్రశ్నలు అడిగిన వారు ఎవరైనా ఈ భాషలో సినిమాలు బావున్నాయి చూడమనో, షేర్ చేసుకోవడమో జరిగితే బాగుంటుంది కదాని చిన్న ఆలోచన.  
          నోట్ : ఏదో ఒక ఫ్రెండ్ తో రెగ్యులర్ గా మాట్లాడడం అన్న థాటే తప్ప, మేమింకా నేర్చుకోలేదు మీరింకా నేర్పండని అనడం లేదు. ఇది గమనించండి. థాంక్యూ. 
రవి, సహకార దర్శకుడు 

A: 1. హీరోయిక్ బ్లడ్ షెడ్అనేది హాంగ్ కాంగ్ కొత్త యాక్షన్ జానర్ కి పెట్టిన పేరు. జాన్ వూ దర్శకత్వంలో “ఏ బెటర్ టుమారో” తో బాటు మరికొన్ని వచ్చాయి. హాంగ్ కాంగ్ లో తీసే రెగ్యులర్ మార్షల్ ఆర్ట్స్ సినిమాలని కాసేపు పక్కన పెట్టి, ఈ కొత్త జానర్ ని ప్రయతించి సక్సెస్ అయ్యారు. ఈ జానర్ లో వచ్చిన సినిమాలు చూసి, వీటి కథా కథనాలతో, పాత్ర చిత్రణలతో, మేకింగ్ తో ఈ జానర్ కి సమకూర్చిన ప్రత్యేక జానర్ మర్యాదలేమిటో స్టడీ చేయండి. ఈ జానర్ మర్యాదలు తీసేసి రొటీన్ తెలుగు మాడిన మసాలా చేయాలనుకుంటే దీని జోలికి పోనవసరం లేదు. దీని రిఫరెన్స్ లేకుండానే ఇప్పుడు తీస్తున్నలాటి తెలుగు మాడిన మసాలాలు యధా విధిగా తీసుకోవచ్చు.

        ఫ్యామిలీ ఓరియెంటెడ్ అడ్వెంచర్ జానర్ : తెలుగులో వచ్చే స్టార్ సినిమాలేమిటి? ఫ్యామిలీల కోసమని అవే కథలు, అవే పాత్రలు, అవే కామెడీలు, టెంప్లెట్ లో అటు మార్చి ఇటు మార్చి అవే దర్శకత్వాలతో అలాగే తీయడమేగా? వీటికి మళ్ళీ రివ్యూలు. పాపం ఫ్యామిలీ ప్రేక్షకులు! చూసిందే చూసి చూసి చూస్తూనే... వుంటారు యుగాంతం దాకా. హాలీవుడ్ లో “ఫ్యామిలీ ఓరియెంటెడ్ అడ్వెంచర్” జానర్ సినిమాలతో దీనికి చెక్ పెట్టొచ్చు. కల్ట్ క్లాసిక్ “ది ప్రిన్సెస్ బ్రైడ్” లాంటివి చూసి, ఫీల్ తో సహా వీటి జానర్ మర్యాదలేమిటో గుర్తించండి. వీటిని పట్టుకొచ్చి మళ్ళీ అదే మసాలా ఫ్యామిలీ స్టార్ సినిమాలుగా మార్చేస్తే లాభం లేదు. 
          కామెడీలో కొన్ని సబ్ జానర్స్ వున్నాయి గానీ అవి తెలుగులో పనికి రావు. అలాగే రోమాన్స్ లో ‘చిక్ ఫ్లిక్’ అనే గర్ల్స్ కామెడీలున్నాయి. ఇవి కూడా తెలుగుకి కుదరకపోవచ్చు. కానీ ‘గై ఫిలిమ్స్’ అనే హాలీవుడ్ జానర్ వుంది. యాక్షన్ లో ఈ జానర్ విభిన్నంగా వుంటుంది కొన్ని ప్రత్యేక జానర్ మర్యాదలతో. దీన్ని ప్రయత్నించ వచ్చు. తెలుగు కమర్షియల్ సినిమాలకి హాలీవుడ్, హాంకాంగ్, కొరియన్ జానర్సే ఇమిడిపోతాయి. వరల్డ్ మూవీ జానర్స్ పనికిరావు. కొంపలు ముంచుతాయి.
           2. ఏదో ఒక రంగాన్ని ఎంచుకుని అందులో కృషి చేస్తే మంచిది. సినిమా అనుకుంటే సినిమాల వైపే వుండాలి. సినిమా దర్శకత్వ అవకాశం ఇక రాదని ఫైనల్ గా సినిమాలకి గుడ్ బై చెప్పేస్తే, అప్పుడు వెబ్ సిరీస్ దర్శకత్వం వైపు వెళ్తే వెళ్ళొచ్చు గానీ, అక్కడా స్ట్రగుల్ చేయాల్సిందే. సినిమాల్లో అసిస్టెంట్ గా పని చేస్తూ దర్శకత్వం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, అసిస్టెంట్ గా కూడా గ్యాపులు వస్తూంటాయి. ఆ గ్యాపులో వెబ్ సిరీస్ కి అసిస్టెంట్ గా అవకాశం లభిస్తే వెళ్ళొచ్చు. ఇటు యధావిధిగా సినిమా దర్శకత్వ  ప్రయత్నాలు చేసుకోవడానికి వీలుంటుంది. లక్ష్యం చెదరదు. గ్యాప్ అనేది ఆర్ధిక సమస్యల్ని సృష్టించవచ్చు. అందుకని స్థిరపడే వరకూ ఏదో ఒక ఆదాయ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆన్ లైన్లో ఎన్నో జాబ్స్ వుంటాయి. రోజుకో గంట కేటాయిస్తే సరిపోతుంది. అప్పులు మాత్రం చస్తే చెయ్యకూడదు. అప్పుల బాధలు క్రియేటివిటీని దెబ్బ తీస్తాయి. ఇక పేరున్న దర్శకులు వెబ్ సిరీస్ చేస్తున్నారంటే పేరుంది కాబట్టి చేస్తున్నారు. 

           3. కథ విన్నాక ఇది కాదు, ఇంకెక్కడైనా చెప్పండని అంటున్నారంటే ఇంకో కథ వుంటే చెప్పమని కాదు. అలా ఎన్నటికీ  జరగదు. ఒక అభ్యర్ధికి ఒక్క అవకాశమే ఇస్తారు. అది నచ్చకపోతే ఇంకోటి చెప్తామంటే అవకాశమివ్వరు. కనుక ఒకటి కాకపోతే ఇంకొకటి విన్పించవచ్చన్న ఆప్షన్స్  పెట్టుకుని రెండు మూడు కథలతో వెళ్ళడం అవివేకం. రెండు మూడు చోట్ల ప్రయత్నిస్తూంటే, ఎక్కడ ఏ కథ చెప్పవచ్చో నిర్ణయించుకుని, అక్కడ ఆ కథ మాత్రమే చెప్పడానికైతే, రెండు మూడు కథలు తయారు చేసుకోవచ్చు. అరుదుగా ఒకే చోట రెండు మూడు సార్లు అవకాశ మివ్వచ్చు. ఒక స్టార్ కి రెండు సార్లూ రెండు కథలు చెప్పి విఫలమయ్యాడు పేరున్న దర్శకుడే. అయినా ఆ స్టార్ మూడో అవకాశమిస్తున్నాడు. వ్యక్తిగత సంబంధాల్నిబట్టి వుంటుంది. అసలు వైఫల్య కారణాల్లో ముందు మొదటి దాని మీద దృష్టి పెట్టాలి. రాంగ్ హీరోకి, లేదా రాంగ్ నిర్మాతకి విన్పిస్తున్నారా? ఎవరు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోకుండా విన్పించి లాభంలేదు. బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటే ఈ సమస్య వుండదు. ఎవరు ఏ టైపు కథలు వింటున్నారు, ఏ టైపు కథలు కాదంటున్నారు, ఈ సమాచారం ఒక పక్క సేకరించుకుంటూ వుంటే టైం వేస్ట్ కాదు.
         4. దీని గురించి చెప్పడానికేమీ లేదు, అంతా తెలిసిందే. ప్రశ్నలు వస్తే ప్రతీ ఆదివారం శీర్షిక నిర్వహించడానికి అభ్యంతర మేదీ లేదు.
సికిందర్




       





Sunday, January 19, 2020

910 : సందేహాలు - సమాధానాలు


       Q : ఈ సంక్రాంతి సినిమాల రివ్యూస్ రాస్తున్నారా? వాటి మీద విశ్లేషణలేమైనా వస్తాయా? మీరు రెగ్యులర్ గా రివ్యూలు రాస్తున్నారు కాబట్టి అడిగాను.
రవి,అసిస్టెంట్
A : సంక్రాంతి సినిమాల రివ్యూలేమయ్యాయని కొందరు మెసేజిలు పంపారు. వెరీ సారీ. జనవరి 2 న ఈ బ్లాగు పుట్టిన రోజన్న విషయం కూడా గుర్తులేదు. బ్లాగు జనవరి 2, 2014 న ప్రారంభమయింది. ఇక చాలా పని భారం వల్ల సంక్రాంతి సినిమాలు చూడాలన్న ధ్యాసే లేదు. అయినా స్టార్ సినిమాలంటే ఫ్యామిలీల కోసమని అటుతిప్పి ఇటుతిప్పి అలాగే తీస్తారన్న విషయం తెలిసిందే. ఇంకా విశ్లేషణలు రాయడానికేముంటుంది. వాటిలోంచి మీరు నేర్చుకునేదేముంటుంది. మారకుండా అలాగే వుండే టెంప్లెట్ సినిమాలకి రాసిందే రాయడం, మీరు చదివిందే చదవడం. ఈ ఒకే టైపు విశ్లేషణలతో బ్లాగు నిండిపోయి వెరైటీ లేకుండా పోయింది. ఈ విషయం చాలా సార్లు చెప్పాం. నేర్చుకోదగ్గవి వస్తే రాద్దాం. సరదాకి రివ్యూలు రాయడం మానేద్దాం. సరదాకి చదవడం మీరూ మానేయండి. మామూలుగా వెబ్ సైట్స్ లో వచ్చే రివ్యూలు చదివేస్తే మీకు సరిపోతుంది, ఆ సినిమాలకి ఆపాటి సమాచారం చాలు. ‘కొత్త డైరెక్టర్ కహానీ’ శీర్షికన కొత్త దర్శకుల చిన్న సినిమాలకి విశ్లేషణలు రాసినా ఆయా కొత్త దర్శకులు తప్పొప్పులు తెలుసుకుని, ముందుకు సాగగలరన్న ఆశైనా ఆ విశ్లేషణలు రాయడానికి పురిగొల్పుతోంది. అందుకని అవి రాస్తున్నాం. ఇక రెగ్యులర్ రివ్యూల గురించి : ఆ మధ్య రెగ్యులర్ గా రివ్యూలు ఒక వెబ్ సైట్ కోసం రాయాల్సి వచ్చింది, ఆ వెబ్సైట్ ఈ మధ్య ఆగిపోతే చేసేదేముంది. 

Q : ప్రధాన పాత్ర తను నిర్ణయాలు తీసుకోకుండా, పక్కన వున్న పాత్ర చెప్పినట్టు తన గోల్ కోసం ప్రయత్నించడం కరెక్టేనా? ఇలా మనకు ఓల్డ్ మూవీస్ లో వుంటుంది. అంటే మెయిన్ క్యారక్టర్ అలా చేస్తే అది యాక్టివ్ క్యారక్టరా, పాసివ్ క్యారక్టరా?
రవి, అసిస్టెంట్
A : మీరు చెప్పిన ఓల్డ్ మూవీస్ సహా ఇలాటి చిత్రణలు ఎవైనా వుంటే ఒక రూపంలో అవి మోనోమిథ్ స్ట్రక్చర్లో చేసిన కథలై వుంటాయి, ఇంకో రూపంలో గాథలై వుంటాయి, మరింకో రూపంలో పూర్తి స్థాయి పాసివ్ పాత్ర కథలై వుంటాయి. మోనోమిథ్ అంటే పురాణాల ఆధారంగా జోసెఫ్ క్యాంప్ బెల్ చెప్పిన ఆనాటి స్ట్రక్చర్. అరిస్టాటిల్ తర్వాత హాలీవుడ్ అనుసరించిన స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ లో మొత్తం కథా ప్రయాణంలో ప్రధాన పాత్రకి 12 మజిలీలు, అంటే దశలు వుంటాయి. ఈ కథలు నిదానంగా, తీరుబడిగా నడుస్తాయి. ఆ కాలానికి అవి సరిపోయాయి. ఈ స్ట్రక్చర్ ని దర్శకుడు దేవకట్టా నేటి తెలుగు సినిమాకి అనుసరించే ప్రయత్నం చేశారు. మోనోమిథ్ లో బిగినింగ్ విభాగంలో ‘రెఫ్యూజల్ ఆఫ్ ది కాల్’ అనే మూడో దశ వస్తుంది. అంటే గోల్ తీసుకోవడానికి ప్రధాన పాత్ర తిరస్కరించడం. దీంతో ఒక ‘మెంటర్’ క్యారక్టర్ వచ్చి నచ్చజెప్పే నాల్గో దశ వస్తుంది. దీని తర్వాత ప్రధాన పాత్ర గోల్ తీసుకునే ఐదో దశ, అంటే ప్లాట్ పాయింట్ వన్ వచ్చి, బిగినింగ్ విభాగం ముగిసి -  మిడిల్ విభాగం ప్రారంభమవుతుంది. పైన చెప్పుకున్నట్టు ఇవి తీరుబడిగా సాగే కథలు.


        సిడ్ ఫీల్డ్ వచ్చి, కథల్ని వేగవంతం చేస్తూ మోనోమిథ్ లోని 12 దశల్నీ కేవలం 5 కి కుదించాడు. ఇందులో రెఫ్యూజల్ ఆఫ్ ది కాల్, మెంటర్ దశలు కూడా వుండవు. సిడ్ ఫీల్డ్ పారడైమ్ లో తానుగా ఫీలై నేరుగా తన గోల్ తనే తీసుకుంటుంది ప్రధాన పాత్ర. సిడ్ ఫీల్డ్ పంథాలో ఆమూలాగ్రం వున్న ‘శివ’ లో సైకిలు చైను తో నాగార్జున జేడీని చెడుగుడు ఆడే ప్లాట్ పాయింట్ వన్ లాంటిదన్న మాట. తానేం చేయాలో ఇతరులు చెప్తే విని చేసే వాడు హీరో ఎలా అవుతాడు, పాసివ్ పాత్రవుతాడు, అడ్డా కూలీ అవుతాడు. ఇతరులేం చేయాలో చెప్పేవాడు హీరో అవుతాడు, యాక్టివ్ క్యారక్టర్ అవుతాడు, ముఠా మేస్త్రీ అవుతాడు.
        ఈ మధ్య సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ జిందా హై’ లో కొంత వరకూ మోనోమిథ్ చేశారు. పైన చెప్పిన మూడవ, నాల్గవ దశలుంటాయి. నిజానికి సల్మాన్ ఖాన్ ది ప్రొఫెషనల్ స్పై పాత్ర. ప్రొఫెషనల్ పాత్రలకి పర్సనల్ గోల్స్ వుండవు, ప్రొఫెషనల్ గోల్సే వుంటాయి. కాల్ వస్తే నసపెట్ట కుండా వెళ్లి గోల్ తీసుకుని కార్య క్షేత్రంలోకి దూకెయ్యడమే. జేమ్స్ బాండ్ పాత్రలు కూడా ఇవే. ఇక్కడ ఎవరో గోల్ ఇచ్చారు కాబట్టి పాసివ్ పాత్రలవవు. ప్రొఫెషనల్ గా గోల్ తీసుకోకుండా నస పెడితేనే పాసివ్ పాత్రలవుతాయి. ఒకరికి చేస్తున్న కార్పొరేట్ థ్రిల్లర్ కథలో ప్రొఫెషనల్ అయిన హీరో, ఇలాగే గోల్ తీసుకునేట్టు చిత్రించాం. ముందు సమాచారం లేకుండా, ఎకాఎకీన వచ్చి పడ్డ ఆఫర్ తో, నస పెట్ట కుండా స్పాట్ లో గోల్ తీసుకోవడం.
        ఇక గోల్ తీసుకున్నాకా సాగే మిడిల్ కథనంలో, ఎట్టి పరిస్థితిలో హీరో ఆ గోల్ కోసం ఇతరులు చెప్పినట్టు నడుచుకోకుండా రైటర్ జాగ్రత్త పడాలి. ఏ కథైనా కథానాయకుడికి అది తన కథే. అందుకని తన కథని చచ్చీ చెడీ తనే సొంతంగా నడుపుకోవాలి కథానాయకుడన్నాక. తనకి ఇతర పాత్రలు ఐడియాలిస్తూ నడిపిస్తే అది కథ కాదు, గాథయిపోతుంది. అది యాక్టివ్ పాత్రవదు, పాసివ్ పాత్రయిపోతుంది. యాక్టివ్ పాత్రగా గోల్ తీసుకుని, తర్వాత పాసివ్ పాత్ర అయిపోయే కథనాల బారిని పడకుండా రైటర్ అనుక్షణం అప్రమత్తంగా తన మీద తనే నిఘా వేసి ఉండాల్సి వుంటుంది. ఎందుకంటే తన ఆలోచనల్లోంచే కథనం వస్తుంది గనుక. గోల్ తీసుకుని ముఠా మేస్త్రీగా బయల్దేరిన హీరో మహాశయుణ్ణి, అడ్డా కూలీ చేసే ప్రతికూల ఆలోచనలు చేయకుండా, రైటర్ తన బుద్ధిని సీసీ కెమెరాల నిఘాలో వుంచాలన్న మాట. కథంటే క్యారక్టర్స్ మైండే తప్ప, రైటర్స్ మైండ్ కానే కాదు.
        ఇటీవల జేమ్స్ కెమెరాన్ తీసిన హీరోయిన్ ఓరియెంటెడ్ ‘అలీటా’ అనే సైన్స్ ఫిక్షన్ మోనోమిథ్ స్ట్రక్చరే. హాలీవుడ్ ఏనాడో వదిలేసిన మోనోమిథ్ స్ట్రక్చర్ ని ఇప్పుడెందుకు ఆశ్రయించినట్టు. ఈ స్ట్రక్చర్ లో స్క్రీన్ ప్లే గజిబిజి కూడా అయింది. అలీటా ఏం చేస్తోందో, గోల్ ఏమిటో అర్ధంగాదు, ఎవరి కోసం అడ్డాకూలీగా చేస్తోందో అంతుపట్టదు. గోల్ కోసమే పోరాడుతున్నట్టు కన్పిస్తుంది గానీ, అవి అడుగడుగునా మారిపోయే మల్టీపుల్ గోల్స్. కాసేపు అదంటుంది, కాసేపు ఇదంటుంది. యాక్షన్ మాత్రం జోరుగా చేసుకుంటూ పోతుంది. జస్ట్ పాసివ్ రియాక్టివ్ క్యారక్టర్. బోలెడు యాక్షన్ లో వున్నట్టే కన్పిస్తుంది గానీ, అది యాక్షన్ కాదు, ఒకరి యాక్షన్స్ కి తన వివిధ రియాక్షన్స్. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అశోక్’ లో ఇలాంటిదే పాసివ్ రియాక్టివ్  క్యారక్టర్.
        ఇలా కథని, పాత్రనీ దెబ్బతీసే చాలా ప్రమాదాలు పొంచి వుంటాయి. విరుగుడు ఒక్కటే : రైటర్ సొంత ఆలోచనలు చేయకుండా, ప్రతీ అడుగులో పాత్రలు ఆ క్షణానికి ఏమాలో
చిస్తూ  వుంటాయో, అది పట్టుకుని కథనం చెయ్యడమే. పాత్రలకోసం బయటి నుంచి రైటర్ ఆలోచిస్తే పాసివ్ పాత్రలు పుడుతాయి. కథని రైటరో, డైరెక్టరో సృష్టించడు. పాత్రలే వాటి అనుభవాల్లోంచి, ఆలోచనల్లోంచి సృష్టించుకుంటూ పోతాయి. కథా రచనలో ఇది ప్రాథమిక సూత్రం. ఇదింకా తెలీక పాసివ్ పాత్రలతో ఫ్లాపులు తీస్తున్నారు. తెలుగులో పాసివ్ పాత్రల ఫ్లాపులే ఎక్కువ.

Q : ‘సరిలేరు నీకెవ్వరు’ నానా పటేకర్ ‘ప్రహార్’ కి కాపీ అనడం ఎంతవరకు నిజం? నేను ఇప్పుడే ‘ప్రహార్’ చూశాను. అలా అన్పించలేదు.
టీవీఎస్, అసోషియేట్

A : నానా పటేకర్ దర్శకత్వంలో నానా పటేకర్ ప్రధాన పాత్రగా, మాధురీ దీక్షిత్, డింపుల్ కపాడియాలు ఇతర పాత్రలుగా, 1991 లో నిర్మించిన ‘ప్రహార్’ (అంటే ఎటాక్) ఒక టెంప్లెట్ కథ. అంటే ఆర్మీలో పనిచేసే హీరో స్వస్థలానికి వచ్చి అంతర్గత శత్రువుల్నినిర్మూలించే టైపు కథ. అక్కినేని నాగేశ్వరరావు ‘జై జవాన్’ (1970), ఎన్టీఆర్ ‘బొబ్బిలిపులి’ 1982), చిరంజీవి ‘యుద్ధభూమి’ (1988) కూడా ఈ టెంప్లెట్ సినిమాలే. టెంప్లెట్ ఒకటేగానీ కథలు వేర్వేరు. అయితే ‘ప్రహార్’ రియలిస్టిక్ గా తీశారు. ఇప్పుడీ టెంప్లెట్ పాతబడిపోయింది. ‘సరిలేరు నీకెవ్వరు’ కథ కాపీ కాదు గానీ టెంప్లెట్ పాతది. వరస సినిమాలతో మహేష్ బాబు టెంప్లెట్ స్టార్ అయిపోయాడు ఏం చేస్తాం.

Q : ఈ మధ్య తమిళంలో వచ్చిన ‘వెళ్ళాయ్ పూక్కల్’ లో వివేక్ ది ప్రధాన పాత్ర. ఇందులో ఒక పాత్ర చైల్డ్ హుడ్ ఎపిసోడ్ మొత్తం వేరే పాత్ర గురించి చెప్తున్నట్టు ప్రెజెంట్ కథలో సమాంతరంగా నడిపారు. చివర్లో అది ఇదివరకే జరిగిపోయిన ఫ్లాష్ బ్యాక్ అని రివీల్ చేశారు. ఈ ఫ్లాష్ బ్యాక్ లో చైల్డ్ హుడ్ కథే ప్రెజెంట్ కథలో వున్నపాత్ర కథ. అంటే చిన్నప్పుడామె అలా వుంది కాబట్టే ఇప్పుడిలా ఉందని చెప్పడం కోసం. ఈ తరహా స్క్రీన్ ప్లే ఎక్కడా చూడలేదు. మీకేమైనా తెలిసి వుంటే దీని గురించి వివరించండి.
రవి, అసిస్టెంట్

A : మనకి తెలిసి ఎక్కడా ఎదురుపడలేదు గానీ, మీరు చెప్తూంటే ఒకటి గుర్తుకొస్తోంది : మూడు నాల్గేళ్ళ క్రితం అల్లరి నరేష్ కోసం ఒక అసోసియేట్ కి చేసిన కథలో ఇలాటి ప్రయోగమే అప్రయత్నంగా చేశాం. అప్పట్లో ‘అవుట్ లుక్’ మేగజైన్ లో ఒక రాజకీయనాయకుడి చాలా పూర్వపు అవినీతి లీలలు ఒక కథలాగా వచ్చాయి. అది ఇంటరెస్టింగ్ గా అన్పించి మన కథలో అప్పుడప్పుడు వచ్చే ఫ్లాష్ బ్యాక్స్ గా పెట్టాం. బ్లాక్ అండ్ వైట్ లో వచ్చే ఇవి ఫ్లాష్ బ్యాక్స్ అని తెలుస్తూనే వుంటుంది గానీ, ఎవరి ఫ్లాష్ బ్యాక్సో చెప్పకుండా సస్పెన్స్ తో రన్ చేశాం. చివరికా ఫ్లాష్ బ్యాక్స్ అన్నీ తెచ్చి విలన్ మహాశయుడికి అంటగట్టి, వాడి బండారమే బయటపడి చిందులేసేలా చేశాం. దురదృష్ట వశాత్తూ ఆ అసోసియేట్ చనిపోయాడు.
        ‘వెళ్ళాయ్ పూక్కల్’ కథ వీకీపీడియాలో చదివితే మీరన్న ఫ్లాష్ బ్యాక్స్ విధానముంది. అయితే దీని గురించి రివ్యూల్లో తమిళ సైట్స్ ఏవీ హైలైట్ చేయలేదు. నిజానికి ఇదొక వినూత్న ప్రయోగం. తెలుగులో ఎవరికైనా నచ్చితే క్రియేట్ చేసుకోవచ్చు.

Q : బాలీవుడ్ లో వచ్చేలాంటి ‘బాలా’, ‘డ్రీం గర్ల్’ లాంటి వెరైటీ సినిమాలు తెలుగులో ఎందుకు రావడం లేదు?
రవి, అసిస్టెంట్
A : వెరైటీ సినిమాలకి అవసరమైన వెరైటీగా ఆలోచించే  రైటర్స్ లేకపోవడం వల్ల. ఎంతసేపూ సిటింగ్స్ లో జరిగేదేమిటంటే తెలుగు సినిమాల్ని రిఫరెన్సుగా తీసుకుని కథలు డిస్కస్ చేస్తూంటారు. ఆ తెలుగు సినిమాలో ఆ సీను అలా వర్కౌట్ అయింది కాబట్టి మనకి ఈ సీను ఇలా వర్కౌట్ అవుతుందని పరాధీన మనస్తత్వంతో నమ్మకాలేర్పర్చుకుని, లేదా ధృవీకరించుకుని సంతృప్తి చెందడం, లేదా భరోసా పొందడం. సీన్లే స్వశక్తితో భిన్నంగా ఆలోచించలేనప్పుడు కథలేం ఆలోచిస్తారు. సీన్లు కూడా టెంప్లెట్ సీన్లుగానే వస్తూంటే కథలేం కొత్తగా వస్తాయి. పాత ఫార్ములాల చట్రంలోంచి సీన్లు ఇవతలకి వచ్చి కొత్తగా రూపొందాలంటే వర్తమాన ప్రపంచపు డిమాండ్స్ ని తీర్చాలి. నిన్నటికి నిన్న రాత్రి ఇలాగే ఒక సీను చర్చకొచ్చింది. ప్రాణభయంతో వున్న హీరోయిన్, రక్షణగా వున్న హీరో విడి విడి గదుల్లో వుండే సిట్యుయేషన్. ఇలా వుంటే కాపాడలేననీ, ఇద్దరం ఒకే గదిలో వుండాలనీ అతనంటే, అపార్ధం జేసుకుని ఒప్పుకోదు. తను పడుకున్న గదిలో నిద్రపట్టక భయపడుతూ వుంటుంది. ఈ సిట్యుయేషన్ ని ఎలా ముగింపుకి తేవాలి? వెంటనే చూసిన సినిమాల్లోంచి ఐడియాలు చర్చకొచ్చేశాయి : ఏదో శబ్దానికి హీరోయిన్ తలగడెత్తుకుని లగెత్తు కొచ్చేసింది...సెల్ ఫోన్ అక్కడే వదిలేశానని హీరో గది తలుపు కొట్టింది...దాహమేస్తూంటే వాటర్ బాటిల్ కోసం హీరో గదికొచ్చింది...ఇలా జోరుగా టెంప్లెట్  సీన్ల ఎగుమతి దిగుమతులు.

        రైటర్ పదేళ్ళ పాత వాడు కావొచ్చు, కానీ ఇప్పుడు పుట్టించిన పాత్ర ప్రపంచానికి కొత్త. ఇప్పుడున్న ప్రపంచ డిమాండ్స్ కి తను ప్రతీక. హీరోయిన్ ఫార్ములా హీరోయిన్ గా గాక, ఇవాళ్టి యువతిగా ఈ సిట్యుయేషన్లో ఏమాలోచిస్తుంది? లేదా ఆలోచించాలి? నేనేమిటి భయపడడం? నా భయానికి ఇంకొకరి ఆసరా దేనికి? నా భయాన్ని నా భయం దగ్గరికే వెళ్ళి తీర్చేసుకుంటాను - అనుకుని ఆ అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళిపోయి హోరెత్తుతున్న సముద్రం ముందు ఎసర్టివ్ గా నిలబడుతుంది. అప్పుడు హీరో నిశ్శబ్దంగా వచ్చి, తన దగ్గరున్న రివాల్వర్ని ఆమె కిచ్చేస్తాడు...ఇదీ ఈ సిట్యుయేషన్ కి ముగింపయింది. ఇది మిడిల్లో వచ్చే సీను. మిడిల్లో సీన్లు బిగినింగ్ సీన్లు లాగా వుండవు. మిడిల్ సీన్లంటే క్యారక్టర్ గ్రోత్ లేదా యాక్షన్ కంటిన్యూటీ, ఏదో ఒకటై వుంటాయి. పై సీను హీరోయిన్ క్యారక్టర్ గ్రోత్ తో వుంది. ఇక్కడ పాత టెంప్లెట్ సీను తెచ్చి కామెడీగా పడేస్తే?  
        ఇవాళ్టి  ప్రపంచంలో పుట్టిన పాత్రకి ఇవాళ్టి పురోగతి కావాలి. రైటర్ టెంప్లెట్ ప్రపంచంలో, పాత్ర ఇవాళ్టి ప్రపంచంలో వుంటే బలయ్యేది పాత్రే. ఇలాగే వెరైటీ కథలూ బలై పోతాయి. ‘ఎంత మంచి వాడవురా’ లో వెరైటీ కథే. కానీ జరింగిందేమిటి - పాత మూస టెంప్లెట్ చట్రంలో చాదస్తం. విచిత్రమేమిటంటే, ఇవాళ్ళ కొత్తగా కథకుడైన వాడు కూడా పదేళ్ళు పాత వాడిగా, భావాలతో నడుం వంగిపోయి ఈసురోమని రాయడం. వీడున్న మానసిక ప్రపంచమే వీడి పాత్ర, వీడి కథ, తెలుగు సినిమా వధ!

Q : ‘బొబ్బిలి పులి’ సినిమా రివ్యూ ఇన్ఫర్మేటివ్ గా వుంది...
అశోక్ పి, అసోషియేట్  
A : అందులో ముఖ్యమైనదొకటి మిస్సయ్యింది. అప్పట్లో దీని తర్వాత రాయడానికి చూసిన ముత్యాలముగ్గు, శంకరాభరణం, మేఘ సందేశం, సితారా అనే నాల్గు సినిమాల్లో (నాల్గూ మేటి దర్శకులవే) ఒక సమాన్యాంశం కనపడింది. ఈ నాల్గు పెద్ద హిట్స్ లో డైలాగులు అతి తక్కువ  వుండడం. అప్పుడు అనుమానమొచ్చి ‘బొబ్బిలి పులి’ మళ్ళీ చూస్తే ఇందులో అదే పరిస్థితి. చిన్న చిన్న సీన్లు, ఆ సీన్లలో ఒకటీ రెండు డైలాగులే. ఎందుకిలా చేశారబ్బా అని ఆలోచిస్తే, క్లయిమాక్స్ లో తెలిసింది. ఇరవై నిమిషాల క్లయిమాక్స్ కోర్టు సీన్లో ఎన్టీఆర్ డైలాగుల భారీ తాకిడి వుంటుంది. ఇంతసేపు ప్రేక్షకులు భరించాలంటే మిగతా సీన్లలో డైలాగుల భారం వేయకుండా చూడాలి. అందుకే ఒకటీ రెండూ డైలాగులు. దీనివల్ల రెండు గంటలసేపు తేలికైన మనసుతో సీన్లు చూసిన ప్రేక్షకులకి, ముగింపు డైలాగుల సుదీర్ఘ భారీ మోత అయ్యబాబోయ్ అన్పించదు. డాక్టర్ దాసరి నారాయణ రావు ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకుని డైలాగులతో వ్యూహాత్మకంగా పాల్పడిన క్రాఫ్ట్ ఇది.

Q : సందేహాలు - సమాధానాలు ప్రతి వారం రెగ్యులర్ గా ఇస్తే మాకు ఉపయోగ పడుతుంది.
శ్రీనివాస్ రాయి, కో డైరెక్టర్
A : ఇంకో ఇద్దరు కూడా ఇలాగే రాశారు. నిజానికి స్క్రీన్ ప్లేలకి సంబంధించిన సమస్యలపైన సందేహాలు అడిగే వాళ్ళు తక్కువ. ఎలా అడగాలో తెలియకనో, బ్లాగులో వున్నవ్యాసాలతో అన్నీ తెలిసిపోతున్నాయిగా ఇంకా సందేహాలేమిటనో, ఇంకా లేదా చదివాంగా చాలు, మళ్ళీ అడగడం దేనికనో ఇలా వుంది పరిస్థితి. ఇప్పుడు ప్రతీవారం ఇవ్వాలంటే ఏం చేయాలి? మనమే సందేహాలు రాసి, మనమే సమాధానాలివ్వాలి. ఈ డూప్లికేట్ దందా అవసరమా, ఇంకో పనికొచ్చే పని చేసుకోకుండా? సందేహాలంది నప్పుడే శీర్షిక వస్తుంది. కాకపోతే అడిగిన వాళ్లకి సమాధానాలందడానికి ఆలస్యమవచ్చు. తెలుగులో అడిగే సందేహాల్ని ఇంగ్లీషు లిపిలో  పంపకండి. మళ్ళీ వాటిని తెలుగు లిపిలోకి మార్చాలంటే గూగుల్ ట్రాన్స్ లేట్ కూడా పనికిరాదు. తెలుగులోనే టైపు చేసి పంపండి. లేదా అడిగేదేదో ఇంగ్లీషులోనే అడిగెయ్యండి. అది తెలుగులోకి ట్రాన్స్ లేట్ అవుతుంది.   

సికిందర్



Saturday, January 18, 2020

నాటి సినిమా!

దేశం దుర్మతుల పాలయినప్పుడు, అమాయకులు అన్యాయాలకి బలౌతున్నప్పుడు, ధర్మానికి తానే  రాజు అయి, న్యాయానికి తానే బుద్ధి అయ్యి, ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే అని ఆ గీతాచార్యుడు సాకార రూపంలో ఈ లోకాన అవతరిస్తాడు. ఆ రూపం ‘బొబ్బిలి పులి’ అయినప్పుడు,  ఆ ప్రక్షాళనా  శతఘ్నులు భళ్ళున భళ్ళున అగ్ని వర్షాలు కురిపిస్తాయి!
          ఎస్, ఇందుకే కనక వర్షం కురిసింది!

        స్ట్రాంగ్ క్యారెక్టర్.. స్ట్రాంగ్ స్టోరీ.. చివరికి  ఇవన్న మాట సినిమా సిల్వర్ జూబ్లీ  అవడానికి మూలస్థంభాలు! సినిమా అంటే ఇప్పుడొస్తున్న  పాసివ్ పాత్రలతో పేలవమైన కథనాలతో చుట్టేసే క్రేజీ కాంబినేషన్ల ప్రదర్శన కాదు. డాక్టర్ ఎన్టీ రామారావు - డాక్టర్ దాసరి నారాయణ రావుల కాంబినేషన్ ఇలాటిది కాలేదు. వాళ్ళ బాధ్యతాయుతమైన భాగస్వామ్యంలో  ‘బొబ్బిలిపులి’ అనే పరాకాష్ట ధూర్తజనులకి కొరడా చరుపైంది. అవినీతిని ఏదో లంచం రూపంలో చూపించేసి, చంపడం వేరు. అవినీతి వల్ల భౌతిక నష్టతీవ్రతని పెంచి చూపించి, శత్రువుని వధించడం పూర్తిగా వేరు. మొదటిది ( లంచం ) ప్రేక్షకులు తేలిగ్గా తీసుకున్నే నిత్య వ్యవహారమే. రెండోది ( ప్రాణ నష్టం, ఆస్తి నష్టం) మాత్రం సీరియస్ గా పట్టించుకోవాల్సిన పవర్ ఫుల్ వ్యక్తీ కరణ అవుతుంది. ఇందుకే ‘బొబ్బిలిపులి’ ది  పవర్ఫుల్ స్టోరీ అయింది. ఇందుకే ‘బొబ్బిలి పులి’  ఎన్టీఆర్  నట జీవితానికో కుదుపు నిచ్చిన బ్లాక్ బస్టర్ మాత్రమే కాలేదు, అంతలోనే ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి ఉత్తరీయమిచ్చిన ఉపాఖ్యానం కూడా అయింది.

        ‘బొబ్బిలి పులి’  అనే నాణేనికి ఇలా రెండు ముఖా లేర్పడ్డాయి. ఇందుకు ఉత్తరాది పాత్రి కేయ బృందమూ సాక్ష్యమే. ఓ వైపు ఊరూరా ప్రభంజనం సృష్టిస్తున్న ఎన్టీఆర్ చైతన్య రథ యాత్రా విశేషాల్ని కవర్ చేస్తూనే, మరో వైపు మారు మూల పల్లెల్లో క్రిక్కిరిసిన థియేటర్ లలో ‘బొబ్బిలిపులి’  బాక్సాఫీసు గాండ్రింపుల్ని సైతం  లోకానికి చాటిన చరిత్రా వుంది.

        అపూర్వంగా  ఎన్టీఆర్ నటించిన  ఈ శక్తిమంతమైన పాత్ర తప్ప, మరింకో చర్చనీయాంశం సాక్షాత్తూ షెర్లాక్ హోమ్స్ వచ్చి తన ట్రేడ్ మార్క్ భూతద్ధం పెట్టి గాలించినా ఈ సినిమాలో దొరకదు. కాబట్టి ఒక పాత్ర బలంగా ఎదగడానికి ఏవి దోహద పడతాయో, తెలుసుకోవడమే  మనకి ముఖ్యాంశ మవుతుంది.

        సినిమాల్లో కథే పాత్రని నడిపితే అది  నసపెట్టే పాసివ్ పాత్రవుతుంది. పాత్రే కథని నడిపిస్తే అప్పుడది యాక్టివ్ పాత్ర,  లేదా స్ట్రాంగ్ క్యారెక్టర్ అవుతుంది. స్ట్రాంగ్ క్యారెక్టర్ కి వ్యక్తిగత ఆశయమే వుంటే,  అది అంతవరకే  పరిమితమైన దాని సొంత కథవుతుంది. ఇంకో మెట్టు పైకెళ్ళి ఇతరుల సమస్యల్ని పట్టించుకుంటే అప్పుడది సామాజిక కథగా, పాత్రగా ప్రమోటవుతుంది. మరింకో మెట్టు పైకి చేరుకుని అంతర్జాతీయ సమస్యని తలకెత్తుకుంటే, అప్పుడు విశ్వజనీన కథగా, పాత్రగా పదోన్నతి పొందుతుంది. మరింకో మెట్టు పైకి చేరుకుని అక్కడ పారలౌకిక అంశాల్ని స్పృశిస్తే,  భక్తి లేదా ఆథ్యాత్మిక కథగా, పాత్రగా పరమోన్నతమవుతుంది. కథల, పాత్రల గౌరవ ప్రపత్తులు ఈ ఆరోహణా క్రమంలో వుంటాయి. మెట్లెక్కే కొద్దీ  పెరుగుతూంటాయి.

        1982 లో విడుదలై అఖండ విజయాన్ని సాధించిన ‘బొబ్బిలిపులి’  లో ఎన్టీఆర్ పోషించిన మేజర్ చక్రధర్ పాత్ర  పై ఆరోహణా క్రమంలో రెండో స్థానాన్ని అలంకరిస్తోంది. ఇతరుల సమస్యల్ని పట్టించుకుంటూ సామాజిక పాత్ర అయింది. దుష్టులు ధర్మాన్ని చె రబట్టడం ప్రపంచ వ్యాప్త సమస్యే. దీనిమీద సామాజిక బాధ్యతతో తిరగబడ్డ చక్రధర్  విశ్వ జనీన ఆశయంతో ప్రతీ ఒక్కర్నీ అందుకే కదిలించ గలిగాడు. సినిమాల్లో కనీసం అయిదు కదిలించే సన్నివేశాలుంటే  విజయం ఖాయమని  నటి ఇంగ్రిడ్ బెర్గ్ మాన్ చెప్పినట్టు మూడు  ఆస్కార్ ల రచయిత విలియం గోల్డ్ మాన్ తన పుస్తకంలో రాశాడు. ఐదేం ఖర్మ, అరడజనుకి పైగా కుదిపివేసే సన్నివేశాలు కొలువు దీరాయి ‘బొబ్బిలిపులి’ లో.

      పాజిటివ్ సహిష్ణుతతో మేజర్ చక్రధర్ తన వాళ్ళ పట్ల ఔదార్యం వహించే ప్రతీ  మలుపూ కదిలించే సంఘటనే! అదే పాజిటివ్ సహిష్ణుత రీత్యా నిస్పృహ కి లోనవకుండా, ఆత్మ స్థయిర్యమూ కోల్పోకుండా, ప్రజా కంటకుల మీద దండయాత్ర చేసినప్పటి ప్రతీ ఘట్టమూ  కదిలించే సంఘటనే! 

        ఇలా పరస్పర భిన్నమైన అంతర్గత, బహిర్గత ఆశయాలుండబట్టే  మర్చిపోలేని సజీవ పాత్రయ్యాడు. ఇది యాక్షన్ సినిమాయే అయినా ఇందులో పాత్ర వ్యక్తిగత జీవిత చిత్రణకి కూడా ( దాదాపు 50 సీన్లు) ప్రముఖ స్థానముంది. మనం డబ్బు సంపాదన అనే యాక్షన్లో పడిపోయి  వ్యక్తిగత  జీవితాన్నిపట్టించుకోం. దీని ఫలితాన్ని మానసిక రుగ్మతల రూపంలో అనుభవిస్తున్నాం. జీవించడానికి బయట యాక్షన్ తో బాటు, ఇంటి మీద కాస్త ఎఫెక్షనూ అంత ముఖ్యమే. ఈ సంగతి పైకి చెప్పకుండా అన్ కాన్షస్ గా సైకో ఎనాలిసిస్ చేసేదే పవర్ఫుల్ పాత్ర. కాకి కేం తెలుసు సైకో ఎనాలిస్ అన్నాడో కవి. చరిత్రలో నిలచిపోయిన కొటేషను. కాకి సంగతేమో గానీ, మన టైంపాస్ తెలుగు సినిమా  పాత్రలు కూడా సైకో ఎనాలిస్  చేయగలవని మేజర్ చక్రధర్ నిరూపిస్తున్నాడు.

        సెలవు మీద ఊరొచ్చిన సైనికుడతను. ఇక్కడ ప్రేమించినమ్మాయి ( శ్రీదేవి) తో పెళ్లను కుంటోండగానే  సైన్యం నుంచి అర్జెంటుగా పిలుపు! ఆ పిలుపందుకుని పెళ్లి కంటే దేశ రక్షణే ముఖ్యమనుకుని వెళ్లి పోతాడు. అంతలో తల్లి అస్తమించిన వార్త. విధి నిర్వహణలో తల్లి ఋణం కూడా తీర్చుకోలేని దైన్యం. ఎలాగో ఊరొస్తే, చెల్లెలి (అంబిక)  తొందరపాటు ఫలితంగా కుండ మార్పిడి పెళ్ళిళ్ళు తప్పవు. అసలు ప్రేమించినమ్మాయిని పెళ్లి చేసుకోలేని బాధని కూడా దిగమింగుకుని, మతిస్థిమితం లేని ఈ భార్య (జయచిత్ర) తో రాజీ పడి,  ఇక విధి నిర్వహణకి తిరుగు ప్రయాణమవబోతూంటే, నడిరాత్రి నగరంలో దుష్ట త్రయం (సత్యనారాయణ, రావు గోపాలరావు, రాజనాల)  దగుల్బాజీ తనం నగ్నంగా కళ్ళబడుతుంది!

        ఇక దేశ సరిహద్దుల్లో కాదు విధి నిర్వహణ, ఈ దేశం నడిబొడ్డునే అని కళ్ళు తెర్చి సమరభేరి మోగిస్తాడు దుష్టజాతి మీద! 

      ఇలాటి సైనికుల కథల్లో  రొటీన్ గా కొన్ని స్టాక్ సీన్లు వుంటాయి. వాటిలో ముఖ్యమైనది సరిహద్దులో డ్యూటీ చేస్తూ ప్రియురాలి నుంచి ఉత్తర మందుకోవడం. అలనాటి హీరో బాలరాజ్ సహానీ లా ‘హకీఖత్’ లో   ‘హోకే  మజ్బూర్ హమే ఉస్నే బులాయా హోగా’ అని తల్చుకుని పాట పాడుకోవచ్చు. లేదా జేపీ దత్తా ‘బోర్డర్’  లో లాగా ‘సందేశే ఆతే హై  హమే తడ్పాతే హై’ అని కూడా పాడుకోవచ్చు. మేజర్ చక్రధర్ కూడా ఇలాటి లేఖే ప్రేమించినమ్మాయి నుంచి అందుకుని  ‘ఇది ఒకటో నంబరు బస్సూ’  అని ఎంటర్ టైన్ చేస్తాడు.

        ఇలాటి రోమాంటిక్  హీరో జ్వలిత హృదయుడు అవడానికి రెండు బలమైన సంఘటనలు ఎదురవుతాయి. ఒకటి, సమాజ ద్రోహులు గోడౌన్ లో చక్కర నిల్వల్ని తరలించుకుపోయి అగ్ని ప్రమాదం సృష్టించే  సంఘటన. ఇది ఎప్పుడో రాజేష్ ఖన్నాతో మన్మోహన్ దేశాయ్ తీసిన ‘రోటీ’ లో రేషన్ డీలర్ జీవన్ దాచేసిన సరుకుని సింపుల్ గా పట్టుకోవడం లాంటి సాత్విక సంఘటన కాదు – చాలా నీచమైన తామసిక సంఘటన! 

        ఒక నేరాన్ని దాచడానికి నిప్పెట్టి ఇంకో దుర్మార్గం చేసే రాక్షస చర్య.  అవినీతి అనగానే ఓ లంచం పుచ్చుకునే  సీనుతో సరిపెట్టేసే  సాదా కథనం కాదు. ఆ అవినీతి దుష్పరిణామంగా నష్ట తీవ్రతని భౌతికంగా చూపించే మేజర్ సీను. ఇందుకే దీంతో తలపడి కోర్టులో నిరూ పించలేక, చక్రధర్ పడే వేదన - విజువల్ గా నష్ట తీవ్రతని  చూసి చలించిన ప్రేక్షకులు కూడా అంత ఆవేశంతో రగిలిపోవడానికి వీలయ్యింది.

        ఇలా అమాయక ప్రజల ఆస్తి నష్టానికి కారణమయ్యీ, కోర్టులో దుష్టులు తప్పించుకుంటే, రెండోసారి ప్రాణ నష్టం చూస్తాడు చక్రధర్. ఇదింకా బలమైన సంఘటన. రోడ్డుపక్క నిద్రపోతున్న అభాగ్యుల మీదికి  తాగిన మైకంలో కారు తోలిన దుర్మార్గం కూడా కళ్ళెదుటే కోర్టులో వీగిపోతుంది!

        దీంతో తిరగబడతాడు చక్రధర్. కోర్టులోనే అవినీతి యంత్రాంగాన్ని పట్టుకుని చితకబాది చితకబాది  వదుల్తాడు. కిష్కింధ అవుతుంది కోర్టు.

        ఫిలిం ఈజ్ బిహేవియర్ అంటారు స్క్రీన్ ప్లే పండితులు. పాత్రంటే ఏంటి?  సంఘటనని సృష్టించేది. మరి సంఘటనంటే? పాత్రకి వన్నెచేకూర్చేది...అని అంటాడు 19 వ శతాబ్దపు ప్రసిద్ధ నవలా రచయిత హెన్రీ జేమ్స్.  మనుషులు నాల్గు భౌతిక తత్త్వాల ( అగ్ని, భూమి, వాయు, జల౦) తోనూ, మూడు మానసిక తత్త్వాల ( చర, స్థిర, ద్విస్వభావాలు) తోనూ ఉంటారని అంటారు ప్రాచీన శాస్త్రకారులైన పరాశరుడు, వరాహ మిహిరుడు ప్రభృతులు.

      ఈ పైవన్నీ క్రోడీకరించుకుని,  రక్తమాంసాలతో సజీవంగా అవతరించిందే మేజర్ చక్రధర్ పవర్ఫుల్ పాత్ర!

        కోర్టు లో తిరగబడి ఇలా ప్రకాశించిన చక్రధర్, ఇక బొబ్బిలిపులియై కొండ కోనల్లో స్థావరం ఏర్పాటు చేసుకుని  ప్రజా ద్రోహుల్ని బంధించి హతమారుస్తూంటాడు. ఇదంతా యమలోకం వాతావరణాన్ని స్ఫురింపజేస్తుంది. తనేమో యమధర్మ రాజు, అనుచరులు యమ భటులు, వాళ్ళు పట్టుకొచ్చే జీవులు పాపులు. వాళ్ళకి కఠిన శిక్షలు. మరణ శిక్షలు.

        ప్రపంచ పురాణా లన్నిటినీ కూలంకషంగా పరిశోధించడానికే  జీవితాన్నంతా వెచ్చించిన గ్రేట్ జోసెఫ్ క్యాంప్ బెల్ -  ఓ చిన్న జోకు అయినా, మహా గొప్ప ఫిక్షన్ అయినా అన్నిటి మూలాలూ పురాణాల్లోనే ఉన్నాయని అంటాడు. అందుకే ఒక కల్పిత పాత్రలో వివిధ పురాణ పాత్రల కోణాలూ  కనిపిస్తాయనీ పేర్కొంటూ- ‘ది హీరో విత్ ఎ థౌజండ్ ఫేసెస్’ అన్న ఉద్గ్రంథాన్ని రచించాడు. సశాస్త్రీయంగా ఇలాటి మిథికల్ క్యారెక్టరే మేజర్ చక్రధర్ కూడా! 

        నవలా పాత్రలాగా సినిమా పాత్ర డైలాగులతో కథ నడపలేదు. చేతలతో నడిపితేనే చెల్లుబడి అయ్యేది. చేతలన్నీ  అయ్యాకా మాటలతో ఎంతైనా నడపొచ్చు. ఇలాటి మేకప్ ఉండబట్టే క్లయిమాక్స్ లో చాలా సుదీర్ఘమైన  ఆ వాదోపదావాలతో కూడిన కోర్టు సీనుని విగు పుట్టించకుండా డైలాగులతో లాక్కు రాగలిగాడు చక్రధర్. పైగా తన వాదపటిమకి తగ్గట్టు కథనంలో మొదటి మలుపు ( ప్లాట్ పాయింట్- 1)  దగ్గర స్థాపించిన సమస్య ( ప్రాణ నష్టం) కూడా అంత బలంగానూ వుంది. ప్లా పా- 1 దగ్గర సమస్య ఏర్పాటు బలంగా వుంటే దాంతో పోటీ పడుతూ ఆటోమేటిగ్గా క్లయిమాక్స్ కూడా బలంగా వచ్చేసినట్టే. ఇలాటి కథా పథకం బలం వల్లే సినిమా మొత్తం మీద చివరి కోర్టు సీనుని అంత హైలైట్ గా మార్చగలిగాడు చక్రధర్. 

      అతడి వాదం ఒక్కటే. ఒకే కేసులో ఒక కోర్టుకీ దాని పై కోర్టు కీ పొంతన లేని తీర్పు లేమిటి? శత్రువుని సైనికుడు సరిహద్దులో చంపితే  సత్కారమా? అదే దేశం లోపల నేరస్థుల్ని వధిస్తే మరణశిక్షతో ఛీత్కారమా? నిజంగా సైనికుడు దేశాన్ని ఎప్పుడు కాపాడినట్టు? మర లాంటప్పుడు ఈ మరణశిక్ష తన కెందుకు విధించినట్టు?

        యంత్రాంగం సమాధానం ఇవ్వలేని లేని ప్రశ్నలు.  దేశం మొత్తం మీద ఒక్క సైనిక జవాను మాత్రమే వేయగల కఠిన ప్రశ్నలు. 

        అతడి ఆవేదన మాత్రమే గొప్పది. 

        ప్రాణాల్ని పణంగా పెట్టి దేశాన్ని కాపాడు కొస్తూంటే, పందికొక్కులు దేశంలోపల సర్వ వ్యవస్థల్నీ నాశనం చేస్తున్నాయి.

        స్ట్రాంగ్ క్యారెక్టర్ కి నషాళాన్నంటే అంతే స్ట్రాంగ్ స్టోరీ!

        ఈ పాత్ర చిత్రణతో  తెరమీద మహానటుడు ఎన్టీఆర్ ప్రేక్షకులకి ఊపిరి సలపనీయడు. తెరవెనుక సూత్రధారి దాసరి కూడా కళ్ళు తిప్పుకోనివ్వడు.

        తెలుగు ప్రజల సాంస్కృతిక, రాజకీయ భావజాలాల మీద ‘బొబ్బిలిపులి’ ది చెరగని ముద్ర!


- సికిందర్

(2009- ‘సాక్షి’)
http://www.cinemabazaar.in/

       

Wednesday, January 15, 2020

909 : రైటర్స్ కార్నర్



                          క్లిఫ్ డార్ఫ్ మాన్ - హాలీవుడ్ హిట్  ‘వారియర్’  స్క్రీన్ ప్లే రచయిత...ఈ మూవీ హిందీలో ‘బ్రదర్స్’ గా అధికారిక రీమేక్ అయింది. ఈ రిమేక్ తో క్లిఫ్ కి రచనాపరంగా ఏ సంబంధం లేకపోయినా, ‘వారియర్’ రచయితగా ఆయన క్రిస్ నిటెల్ కిచ్చిన ఇంటర్వ్యూని ఈ సందర్భంగా ప్రచురిస్తున్నాం...
వారియర్’ తో మీ అనుభవం చెప్పండి?
          ‘వారియర్’ 2011 లో విడుదలయ్యింది. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రపంచాన్ని ఫ్యామిలీ డ్రామాతో మిక్స్ చేసి చూపించాం. ఈ స్క్రిప్టు పని పూర్తయి షూటింగ్ కూడా పూర్తయ్యాకా విడుదల తేదీ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. ఈ లోగా రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మె కారణంగా నా మరో స్క్రిప్ట్ అమ్ముడుపోక ఆర్ధిక ఇబ్బందుల్లో పడ్డాను. నా సేవింగ్స్ అన్నీ ఖర్చయిపోయాయి. కారూ ఇల్లూ కూడా పోయి పూర్తిగా దివాళా తీశాను. ఇంకో ఆరు నెలలకి గానీ ‘వారియర్’  విడుదల కాలేదు. అది విడుదలయ్యాక తిరిగి నా ఆర్ధిక పరిస్థితి మెరుగు పడింది.
మీరు రాసిన మొట్టమొదటి కథ?
          నవల. అప్పుడు నాకు పదకొండేళ్ళు. పెన్నుతో కాగితాల మీద రాసుకుని ఆ 50 పేజీలనీ ఫైల్ చేసి పెట్టుకున్నాను. అది తర్వాత చెదలు పట్టిపోయింది.
మీ కళాతృష్ణకి ఎలాటి సినిమాలు, లేదా కథలు మీకు స్ఫూర్తి నిచ్చేవి?
          మొదట్నించీ గ్రీకు పురాణాలంటే ఇష్టం. ఇప్పటికీ వాటికి ప్రభావితుణ్ణి అవుతూనే వుంటాను. ఆ తర్వాత క్లాసిక్ లిటరేచర్ వైపు, క్లాసిక్ సినిమాలవైపూ ఆసక్తి పెరిగింది. నా జీవితంలో నేనేం కావాలో నిర్ణయించుకోవడానికి ఒకే ఒక్క సినిమా చూశాక తెలిసి వచ్చింది. ఆ సినిమా ‘బ్లడ్ సింపుల్’. ఈ సినిమా చూశాక ఇలా రాస్తే సినిమా ఫీల్డులో అగ్ర స్థానానికి చేరుకోవడం సాధ్యమేనని అన్పించింది. ‘ఫౌంటెన్ హెడ్’ నవల చదివినప్పుడు కూడా నాకిలాటి ఫీలింగే కలిగింది.
ఒక అనామక రచయిత తన స్క్రిప్టు  వెలుగు చూడాలంటే ఏం చేయాలంటారు?
          ఇలా చెప్తే సిల్లీగా ఉండొచ్చు- కానీ ఏదైనా బ్రహ్మాండమైన స్క్రిప్టు  రాస్తే అది తప్పకుండా వెలుగు చూస్తుంది. ఎలా వెలుగు చూస్తుందో వివరించలేను గానీ, వెలుగు మాత్రం చూస్తుంది. ఐతే ముందుగా తను ఏ బ్రాండో తెలుసుకోవాలి. ఆ బ్రాండ్ తో తను రాసిన దానికి దగ్గరగా వుండే అలాటి రచయితల్నిగానీ, దర్శకుల్ని గానీ, నిర్మాతల్ని గానీ ఫాలో అవుతూ వుండాలి.  వీళ్ళకి దగ్గరయ్యే  మార్గాలని అన్వేషించాలి. నేటి డిజిటల్ యుగంలో ఇదేం కష్టం కాదు. నేను స్ట్రగుల్ చేస్తున్న కాలంలో ప్రీమియర్ షోలలో చొరబడి సినీ ప్రముఖుల్ని పలకరించే అవకాశం తీసుకునే వాణ్ణి. రైటర్ గా ఇతరులకంటే తనెలా ప్రత్యేకమైన వాడో, ఏ నిర్మాతయినా తన స్క్రిప్టుని ఎందుకు ఓకే చేయాలో చెప్పగలిగి వుండాలి. వాణిజ్య రంగంలో యూ ఎస్ పీ(యూనిక్ సెల్లింగ్ పాయింట్) అని వస్తువులకి వాటిదైన ప్రత్యేకత ఒకటి వుంటుంది. అలాటి యూ ఎస్ పీ తన కేమిటో రైటర్ తెలుసుకోవాలి. అది తనదైన ఒక వాయిస్ అవుతుంది - లేదా శైలి అయి వుంటుంది. సొంత వాయిస్. మరొకరికి అనుకరణ కానిది.
ఏ జీవితానుభవాలు మీ పాత్రలపై ప్రభావం చూపుతాయి?
         
ప్రతీ అనుభవం కూడా. ప్రతీ వ్యక్తితో అనుభవం కూడా. ఒక్కక్షణం అలా కలిసి వెళ్ళిపోయినా సరే, అది కూడా పనికొచ్చే అనుభవమే. నా కుటుంబ సభ్యులతో, మిత్రులతో, బయట ఇతరులతో అన్నీ పనికొచ్చే అనుభవాలే. నేను రాస్తున్నప్పుడు ఏదీ నాకు వ్యర్ధ పదార్ధం కాదు. బహిరంగ ప్రదేశాల్లో కూర్చుని ఇతరులు అనుకునే మాటల్ని వింటాను. అవి ఆసక్తి కరంగా వుంటే రికార్డు చేసుకుంటాను. లేదా నోట్ చేసుకుంటాను. సహజంగా దొర్లే జనం భాష ఇంటలెక్చువల్ గా ఏమీ వుండదు గానీ, ఆ మాటలు లోతుగా ఎక్కడో తాకుతాయి. నేనేం విన్నా, చదివినా నేను రాస్తున్న పాత్రలకి ఎలా అన్వయించాలా అని ఆలోచిస్తాను.
మీ క్యారక్టర్ డెవలప్ మెంట్ ప్రాసెస్ ని వివరించండి?
         
నేనెప్పుడు రాయడానికి కూర్చున్నా దేవుడు నాకు మార్గం చూపించాలని ప్రార్ధిస్తాను. నా అనుభవాల భాండాగారంలో కెళ్ళి క్యారక్టర్స్ ని చూపించమని అడుగుతాను.
.క్యారక్టర్  బయోగ్రఫీలు రాసుకుంటారా?
          రాయను, క్రియేట్ చేసుకుంటాను
మీరు క్రియేట్ చేసే క్యారక్టర్ లతో మీరు ఎమోషనల్ గా ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారు?
          ప్రాసెస్ లో ఇది చాలా కఠినాతి కఠినమైన పని. టార్చర్ కూడా. నేను రాస్తున్నంత కాలమూ ఎన్ని క్యారక్టర్స్ వుంటే వాటన్నిటి  ప్రపంచాల్లో జీవిస్తూ వుండాల్సిందే.


 గొప్ప క్యారక్టర్ ని సృష్టించాలంటే దేన్ని  ప్రాతిపదికగా తీసుకోవాలంటారు?
          జీవితానుభవాన్ని. మనుషుల అసంకల్పిత చర్యల్ని. ఆహారపు టలవాట్లని. ఫిజికల్ బిజినెస్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనమెప్పుడూ చేసే పనుల ద్వారా మన మనసేమిటో బయట పెట్టేస్తూంటాం. ఈ డైకాటమీ- ఆలోచనకీ  చేతకూ మధ్యన వుండే సంబంధాన్ని పరిశీ లిస్తూంటాను- దాన్ని ఎక్స్ ప్లాయిట్ చేస్తాను. నేను సృష్టించిన ఒక స్త్రీ పాత్ర ఆందోళనకి గురయినప్పుడు బొటన వేలుని గట్టిగా పట్టుకుని మెలి తిప్పడమనే డైకాటమీని రాశాను.

రాసే ముందు అవుట్ లైన్ వేసుకుంటారా?
          కొన్నిసార్లు వేస్తూంటాను. కానీ అది నా కిష్టముండదు. అయితే కొన్ని రకాల కథలకి అవుట్ లైన్ అవసరమే.

స్ట్రక్చర్ గురించి మీ అభిప్రాయం?
          అది టెక్నికల్. కొంతవరకూ తప్పనిసరిగా అవసరమే. ఐతే దాన్ని ఎగేసే మార్గాలు ఎప్పుడూ వుంటాయి. నా మైండ్ లో కథకి ఓ బిగినింగ్, మిడిల్, ఎండ్ లేమిటో ముద్రపడి పోయాక, ఆకథని నేనెలాగైనా చెప్పగలను. అది వర్కౌట్ అయితే అది చెప్పడానికి నేనేంచుకున్న స్ట్రక్చర్ ప్రధానమే కాదు. ఇందుకే నేను నవలల్ని నేనెక్కువ ఇష్టపడతాను. అవి స్ట్రక్చర్ లో ఇరుక్కుని వుండవు.

మీరు అభిమానించే సినిమాలు ఏ  స్ట్రక్చర్స్ లో ఉన్నాయంటారు?
          దేనికవే ..అయితే ’గుడ్ ఫెల్లాస్’  స్ట్రక్చర్ ని నేనిష్ట పడతాను. థర్డ్ యాక్ట్ ప్రారంభం దగ్గర  లేదా, సెకండ్ యాక్ట్ ముగింపు దగ్గర్నుంచి ఆ సినిమా ప్రారంభమవుతుంది. అక్కడ్నించీ బయల్దిరిన చోటుకి తిరిగి వస్తుంది. అక్కడి నించీ ఎండ్ వరకూ కంటిన్యూ అవుతుంది. ఎన్నిరకాల స్ట్రక్చర్స్ వున్నా నేను బాగాలవ్ చేసేది  ‘పల్ప్ ఫిక్షన్’  స్ట్రక్చర్ని. అది చాలా బ్రిలియెంట్ స్ట్రక్చర్.

మీ క్యారక్టర్ లు ఎప్పుడైనా వాటి గురించి అవి మాట్లాడుకోవడం జరుగుతుందా?
          అవి తమలో తాము మాట్లాడుకుంటాయి- లేకపోతే వాటికి నేను అన్యాయం చేసినట్టే.
మీకు డైలాగులు ఈజీ గా వచ్చేస్తాయా- లేక బాగా కష్ట పెడతాయా?
          ఏ డైలాగూ అంత ఈజీగా రాదు. బాధాకరమైన ప్రాసెస్ అది.

పాత్రలు వివరణలు ఇచ్చుకోవడాన్ని మీరెలా నివారిస్తారు?
          నివారించలేం. పోలీసులాగా నిఘా పెట్టగలం. పాత్ర ఇచ్చిన ఓ వివరణకి నేను మళ్ళీ మళ్ళీ వెనక్కెళ్ళి చదువుకుంటూ ఆ వివరణ అవసరమా అని ఆలోచిస్తాను. అవసరమే అనుకుంటే, అది మాటల్లో కాకుండా విజువల్ గా - సింబాలిక్ గా చెప్పొచ్చా అని కూడా ఆలోచిస్తాను.

మీ డైలీ రైటింగ్ రొటీన్ గురించి చెప్పండి?
          వ్యాయామం చాలా చేస్తాను. వాటిలో బాక్సింగ్, యోగా వుంటాయి. జిమ్, రన్నింగ్ వుంటాయి.  అప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్ బాడీకీ  మైండ్ కీ  చాలా హెల్ప్ చేస్తుంది. రాసేటప్పుడు ఫోన్ ని స్విచాఫ్ చేసి వేరే రూమ్ లో పెట్టేస్తాను.

స్క్రీన్ రైటర్ల గురించి వుండే అపోహ లేమిటో చెప్పగలరా?
          ఈ వృత్తిని ఇతరులు ఫన్ అనుకుంటారేమో- నిజమే, చాలా ఫన్. రాసిన సినిమాని తెర కెక్కితే దాన్ని చూసుకోవడం ఫన్నే కదా? దాన్ని మించిన ఫన్ ఏముంటుంది. కానీ అదే చూస్తున్న సినిమాని ముందుగా కాగితాల మీదికి ఎక్కించడానికి వుంటుందే- అది నావరకూ ఒక నరకం.

మీ కెరీర్ లో బాగా హైలైటయిన అంశం ఏమిటి?
          ఏమీ లేదు. హైలైట్స్ గురించి ఆలోచించను..నాకో ఫిలాసఫీ వుంది. కోరుకున్న గమ్యానికి ఎప్పుడూ చేరుకుంటూ వుండాలే గాని చేరుకోకూడదని. చేరుకున్నామంటే ఇక అక్కడ చేయడాని కేమీ వుండదు. అక్కడ్నించి బయల్దేరి  వెనక్కి రావడమే.      

మీ రీ - రైటింగ్ ప్రాసెస్ ని వివరిస్తారా?
          అదెప్పుడూ వుండే ప్రాసెస్సే. స్క్రిప్టు ఏ కొద్ది అమ్ముడుపోవాలన్నా అది చాలా  అవసరం. చాలా  సింపుల్ గా నేను దీన్ని డీల్ చేస్తాను. నేను రాస్తున్న సీన్లలో ఒకదాన్ని బాగా ఇష్టపడి పదేపదే రీరైట్ చేసి మెరుగు పరుస్తున్నా ననుకోండి- అప్పుడు ఓ వైపు నుంచి నా మైండ్ చెప్తూనే వుంటుంది- ఫస్ట్ కట్ చేయాల్సింది ఆ సీన్నే అని. సీన్లమీద మమకారాలే అలాటివి. ఆ మమకారాలు లాజిక్ ని చంపేస్తాయి. ఇలా నన్ను నేను ఎడిట్ చేసుకునే సౌమనస్యం నాకుంటే- అప్పుడు ఆ స్క్రిప్ట్ గురించి ఏ స్టూడియో నుంచో, ఏ ప్రొడ్యూసర్ నుంచో బెటర్ మెంట్ నోట్స్ నాకందితే, నేను బాధపడే ప్రసక్తే వుండదు.
***

.