Q : ఒక పాత్ర గోల్ ని మరొక పాత్ర తీసుకునే కథలకు ఎలాంటి స్క్రీన్ ప్లే చేసుకోవాలో, ఎలాంటి సన్నివేశాలు రాసుకోవాలో వివరిస్తారా. ఉదాహరణకు ఒక బలహీనమైన వ్యక్తికి గొప్ప గోల్ ఉంటుంది. అతని ఆశయం గొప్పదే గాని, అది సాధించే బలం అతనికి ఉండదు. ఈ పరిస్థితుల్లో మరొక బలమైనవాడు ఆ గోల్ తీసుకుంటాడు. ఇలాంటి కథలకు మార్కెట్ యాస్పెక్ట్ ఎలా ఉంటుంది? ఎలాంటి పాత్రలు రాసుకోవాలి? ఈ టైప్ కథనానికి రెఫరెన్సు సినిమాలు ఏమైనా ఉన్నాయా? (నాకు తెలిసి తమిళ్ లో కత్తి అనే సినిమా ఉంది).. వీలైనంత విపులంగా, సమగ్రంగా దీని గురించి వివరించగలరు...
―ఎపి, AD
―ఎపి, AD
A : సాధారణంగా జోసెఫ్ క్యాంప్ బెల్ ప్రతిపాదించిన మోనోమిథ్ స్ట్రక్చర్ (అన్ని మతాల పురాణాల్లో వుండే కామన్ కథా నిర్మాణం) లో ఫస్ట్ యాక్ట్ అంటే, బిగినింగ్ విభాగం వరకే గార్డియన్ పాత్రనేది వుంటుంది. ఇది హీరో పాత్రని గోల్ వైపు మోటివేట్ చేస్తుంది. బిగినింగ్ విభాగంలోనే హీరో పాత్ర గోల్ ని తిరస్కరించే ‘రెఫ్యూజల్ ఆఫ్ ది కాల్’ అనే దశ వస్తుంది. అప్పుడు గార్డియన్ పాత్ర పూనుకుని గోల్ వైపు మోటివేట్ చేస్తుంది. ఆ తర్వాత స్వతంత్రంగా గోల్ ని సాధించేందుకు హీరో పాత్ర ముందుకెళ్ళి పోతుంది.
ఇలా ముందుకెళ్ళి నప్పుడు సహాయ పాత్రల తోడ్పాటు తీసుకుంటుందేమో గానీ, గోల్ మాత్రం తన చేతిలోనే వుంచుకుంటుంది. ఇంకెవరికీ అప్పగించదు. ఇదొక విధానం.
ఈ విధానం కాలక్రమంలో అంతరించి పోయింది. 1970 - 80 లలో హాలీవుడ్ సినిమాలు మోనోమిథ్ ని అనుసరిస్తూ వచ్చాయి. అప్పటి వరకూ కథలకి ప్రాచీన అరిస్టాటిల్ విధానాన్నే పాటించేవి. అరిస్టాటిల్ త్రీ యాక్ట్ స్ట్రక్చర్ నాటకాల్లోంచి వచ్చింది. మోనోమిథ్ తో వచ్చిన మొదటి హాలీవుడ్ సినిమా జార్జి లూకాస్ తీసిన ‘స్టార్ వార్స్’. మోనోమిథ్ లో హీరో పాత్ర గోల్ ని సాధించేందుకు ఎన్ని దశల్ని దాటుతుందో (12) అన్ని దశలూ ‘స్టార్ వార్స్’ లో వుంటాయి. మోనోమిథ్ తో సినిమాలు బరువైన కథలతో భారంగా, బారెడు సాగుతూ వుంటాయి. అప్పటి చాలా సినిమాలు ఇలా వున్నవే.
1980 లలో సిడ్ ఫీల్డ్ వచ్చి, పురాణాల కథా నిర్మాణమెందుకని, హీరో పాత్ర ప్రయాణపు దశల్ని ఐదుకి కుదించాడు. ప్లాట్ పాయింట్ -1, పించ్ -1, మిడ్ పాయింట్, పించ్ -2, ప్లాట్ పాయింట్ -2 అన్నవి. దీంతో కథలకి, పాత్రలకి వేగం పెరిగింది. 1990 లనుంచీ నేటి దాకా హాలీవుడ్ సినిమాలు సిడ్ ఫీల్డ్ పారడైం తోనే వస్తున్నాయి.
ఇందులో హీరోకి ‘రెఫ్యూజల్ ఆఫ్ ది కాల్’ దశ వుండదు. దీంతో హీరోని మోటివేట్ చేసే గార్డియన్ పాత్ర వుండదు. పాత్రల్ని, కథని తగ్గించి స్పేడు పెంచే విధానమిది. సిడ్ ఫీల్డ్ నమూనాలో ‘శివ’ లో చూస్తే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర జేడీని శివ కొట్టి, గోల్ ని స్వీకరించడా నికి ఎవరూ మోటివేట్ చేయరు. అతనే యాక్టివేట్ అవుతాడు. ఐతే ఇటీవల ‘టైగర్ జిందా హై’ మోనోమిథ్ తోనే వుంది. ఇందులో రెఫ్యూజల్ ఆఫ్ ది కాల్ దశ, మోటివేట్ చేసే గార్డియన్ పాత్రా వుంటాయి. కానీ ఇటీవలే వచ్చిన హాలీవుడ్ ‘అలీటా’ లో మోనోమిథ్ తో కథని, పాత్రల్ని ఎంత గందరగోళం చేశారో చూశాం.
కాబట్టి మీ ప్రశ్నకి సమాధానం మోనోమిథ్ లో దొరకదు. ఇక్కడ హీరో పాత్రని గార్డియన్ పాత్ర గోల్ కి మోటివేట్ చేయడం వరకే వుంటుంది. మీ ప్రశ్న ప్రకారం, బలహీన వ్యక్తికి గొప్ప గోల్ వుండి, అది సాధించే బలం లేనప్పుడు, మరొక బలమైనవాడు ఆ గోల్ ని తీసుకోవడం మూడు సందర్భాల్లో జరుగుతుంది. స్పోర్ట్స్ జానర్లో, రోమాంటిక్ లేదా యాక్షన్ జానర్లో, ట్రాజడీ జానర్లో. వీటికి అరిస్టాటిల్ త్రీ యాక్ట్స్ గానీ, సిడ్ ఫీల్డ్ పారడైం గానీ నప్పుతాయి.
స్పోర్ట్స్ జానర్లో హీరో పాత్రే మోనోమిథ్ లోని గార్డియన్ పాత్రవుతుంది. కాకపోతే కథ సాంతం పొడిగించిన గార్డియన్ పాత్రవుతుంది. ఆ క్రీడాకారుణ్ణి లేదా క్రీడాకారిణిని మోటివేట్ చేస్తూ గోల్ నెగ్గేలా చూసే పూర్తి స్థాయి గార్డియన్ పాత్ర. ‘దంగల్’ లో అమీర్ ఖాన్, ‘గురు’ లో వెంకటేష్ పాత్రల్లాంటివి. ఇవి బయటి సినిమాల్లో మేల్ + మేల్ క్యారక్టర్స్ తో వుండొచ్చే మోగానీ, ఇండియాలో మేల్ + ఫిమేల్ గా వుంటేనే వర్కౌటవుతాయి. మేల్ గార్డియన్ అయితే, ఫిమేల్ క్రీడాకారిణి. మేల్ + ఫిమేల్ మధ్య వుండే రసోత్పత్తిని మేల్ + మేల్ మధ్య ఏం అనుభవిస్తారు గనుక ప్రేక్షకులు.
రోమాంటిక్ లేదా యాక్షన్ జానర్లో కూడా మేల్ + ఫిమేలే వర్కౌటవుతుంది. ‘బ్రోచేవారెవరురా’ లో హీరోయిన్ కి గోల్ వుంది, కానీ బలహీనురాలు. ఆమె గోల్ నెరవేర్చేందుకు హీరో పూనుకోవడం వుంది. మీరన్నట్టు బలహీన పాత్రకి గోల్ అన్నప్పుడు, ఆ బలహీన పాత్ర హీరో పాత్ర కాకూడదు. హీరో పాత్రని బలహీనంగా మార్చి, దాని గోల్ ని ఇంకే పాత్రో తీర్చడంగా చేస్తే, అది కమర్షియల్ సినిమా లాంగ్వేజీకి విరుద్ధం. ఈ లాంగ్వేజీ బాక్సాఫీసుకి అర్ధం గాక బోసి పోయి వుంటుంది. ఆల్రెడీ బాక్సాఫీకుకి దాని లాంగ్వేజీ ప్రోగ్రాం చేసి వుంది. దాన్ని పనిమాలా మార్చకూడదు.
కాబట్టి బలహీన పాత్ర ఫిమేల్ అయివుండి, దాని గోల్ తీర్చే పాత్ర (ఇది కూడా గార్డియన్ పాత్రే) హీరో పాత్రయినప్పుడు, ఈ మేల్ + ఫిమేల్ కెమిస్ట్రీ రసోత్పత్తినీ, యూత్ అప్పీల్ నీ పుట్టిస్తుంది. ఐతే ఈ ఫిమేల్ పాత్ర హీరోయినే అయి వుండాలి. హీరోయిన్ కాక, హీరో అమ్మో, అక్కో, చెల్లో, వదినో ( సిస్టర్ సెంటిమెంటుతో బాటు ఇప్పుడు వదిన సెంటిమెంటు కూడా వల్లకాటికి పోయింది) అయితే రసోత్పత్తి జరగక, యూత్ అప్పీల్ గేట్లు తెరుచుకుని పారిపోతుంది. ఇక బలహీన పాత్ర మగ పురుగులైన అన్నో, తమ్ముడో, ఫ్రెండో అయితే మేల్ + మేల్ = ఢమాల్ అవుతుంది. కమర్షియల్ సినిమా కథంటే ఆడా మగా మధ్య రసోత్పత్తి గావించి ప్రేక్షకులకి గాలం వేయడమే.
కానీ పెద్ద వయసు పాత్రలతో, చిన్నపిల్లల పాత్రలతో స్వేచ్ఛ తీసుకోవచ్చు. తాత కోసమో, తండ్రి కోసమో, లేదా పిల్లల కోసమో హీరో పాత్ర గోల్ తీసుకోవడం యూనివర్సల్ లాంగ్వేజీ. ఈ సెంటిమెంట్స్ కి ఢోకా వుండదు.
ఇక ట్రాజడీ జానర్లో హీరో పాత్ర చచ్చిపోతూ దాని గోల్ ని ఇంకో పాత్రకి అందిస్తుంది. ఇలా గోల్ ని ఇంకో పాత్రకి అందించి నిష్క్రమించడం వల్ల ఈ హీరో పాత్రని ‘హేండోవర్’ పాత్రంటారని ‘డ్రమెటికా – న్యూ స్టోరీ థియరీ’ సిద్ధాంత కర్తలు పేర్కొన్నారు. ఇలా ‘మనుషులు మారాలి’ లో శోభన్ బాబు పాత్ర చనిపోతే, దాని గోల్ ని శారద పాత్ర తీసుకున్నట్టు, ‘ఎర్ర మందారం’ లో రాజేంద్ర ప్రసాద్ పాత్ర చనిపోతే, దాని గోల్ ని యమున పాత్ర తీసుకున్నట్టు ఈ కథలుంటాయి. ఇప్పుడు చూస్తూ చూస్తూ హీరో పాత్రని చంపుకుని కథలెవరు చేస్తారు. కాబటి ఇది ఇప్పటి మార్కెట్ యాస్పెక్ట్ కాదు.
పైన చెప్పుకున్న రెండూ (స్పోర్ట్స్ జానర్ ఉదాహరణ, రోమాంటిక్ / యాక్షన్ జానర్స్ ఉదాహరణ) ఇప్పటి మార్కెట్ యాస్పెక్ట్ తో వుంటాయి. వీటిలో పేర్కొన్న కాంబినేషన్స్ తో పాత్రల్ని నిర్ణయించుకోవాలి. ఇక కథలకి ఎలాంటి స్క్రీన్ ప్లే చేసుకోవాలో, ఎలాంటి సన్నివేశాలు రాసుకోవాలో ఎలా చెప్పగలం. అది మీ క్రియేటివిటీ. కానీ గోల్ వున్న, లేదా పైన చెప్పుకున్నట్టు వేరే పాత్ర గోల్ ని తీసుకున్న, హీరో పాత్రతో ఏ కథతోనూ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో మార్పేమీ వుండదు. అవే బిగినింగ్ మిడిల్ ఎండ్ విభాగాలూ, వాటిలో పైన చెప్పుకున్న సిడ్ ఫీల్డ్ ఐదు దశలూ వుంటాయి. ఏ కమర్షియల్ కథకైనా ఇంతే. ఇవి ‘బ్రోచేవారెవరురా’ లో వుండడం వల్ల అలావుంది, ‘నిను వీడని నీడను నేనే’ లో లేనందువల్ల ఇలా వుంది.
Q : నాకున్న అవకాశంతో నేను కొత్త హీరోతో మాత్రమే చిన్న బడ్జెట్
సినిమా తీయగలను. ఇది వర్కౌట్ అవుతుందా?
లేక ఒక సినిమా తీసి ఇంటికి వెళ్లి పోతానా? ఈ మధ్య కొత్త హీరోలతో వస్తున్న చిన్న
సినిమాలను గమనిస్తే భయమేస్తోంది. అవి అడ్రసు లేకుండా పోతున్నాయి. నా పరిస్థితి
కూడా ఇంతేనా?
―టివిఎస్, Asso Dir.
―టివిఎస్, Asso Dir.
A : ప్రేక్షకులు కొత్త మొహాల్ని చూడాలంటే పేరున్న దర్శకులు, పేరున్న బ్యానర్లు వుండాలి. కొత్త దర్శకులు కొత్త మొహాలతో రావాలంటే పేరున్న బ్యానర్లోనో, పేరున్నదర్శకుల నిర్మాణంలోనో రావాలి. కొత్త దర్శకుడు చిన్న బడ్జెట్లో కొత్త హీరోతో చేస్తే పేరున్న డిస్ట్రిబ్యూటర్లు టేకప్ చేయాలి. మొదటిది పక్కన బెడితే, మీకు రెండోది కుదిరేట్టు లేదు కాబట్టి, మూడోది ప్రయత్నించవచ్చు. దీనికి కంటెంట్ బావుండాలి. ఇది కూడా సాధ్యం కాకపోతే, కొత్త నిర్మాతతో చిన్న సినిమాకి ఒకటే మార్గముంది. కొత్త హీరోలని పక్కన బెట్టి, హీరోయిన్ తో సినిమా చేసుకోవాలి. కొత్త దర్శకుడి చిన్న సినిమాలో కొత్త హీరోల మొహాలు చూడలేని ప్రేక్షకులు, హీరోయిన్ ఎంత కొత్తదై నా చూడ్డానికి వస్తారు. అంటే హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్టు చేసుకోవాలి. అలాగని ఏడ్పుల సబ్జెక్టు కాదు, మీగురించి ఆలోచిస్తే వచ్చిన కొత్త అయిడియా ఇది. పనికొస్తుందేమో చూడండి. కనీసం మీరు మార్కెట్ ని పరిశీలించి అడుగు ముందుకేస్తున్నారు. ఏ పరిశీలన లేకుండా గొర్రె దాటుగా కొత్త కొత్త హీరోలతో చెత్త చెత్త సినిమాలు తీసి పడేసి ఇంటికెళ్ళి పోతున్న మార్కెట్ స్పృహ లేని మండూకాల కంటే మీరు నయం.
Q : ‘దొరసాని’ రివ్యూలో
మీరు తెలంగాణా సినిమా అంటే ఇంకా ఆర్ట్ సినిమా కాదన్నారు. మరెలా వుండాలి?
వివరించగలరు.
―మకరందం, AD
―మకరందం, AD
A : ముందు సినిమా దర్శకుడో రచయితో కావాలనుకున్నవాడు సినిమా చరిత్ర విధిగా చదువుకుని రావాలి. సినిమా చరిత్రలో నిర్మాణాల పరంగా ఎక్కడెక్కడ ఏమేం జరిగాయి, పరిణామాలూ పర్యవసానాలూ వాటి పరిష్కారాలూ ఏమేం చోటు చేసుకున్నాయో తెలుసుకుని వుండాలి. ఇండియాలో వుంటూ ఇండియా చరిత్ర తెలియక పోవడం ఎలాటిదో, సినిమాల్లో వుంటూ సినిమా చరిత్ర తెలియక పోవడం అలాటిది. కనీసం మనం ఓ కంపెనీలో చేరాలన్నా దాని పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుని గానీ చేరం. సినిమాల్లో చేరాలంటే మాత్రం ఏమీ తెలుసుకోకుండా ఎగేసుకుని వచ్చి దూరిపోవడమే.
ఆర్ట్ సినిమాల చరిత్ర గురించి ‘దొరసాని’ రివ్యూలోనే రాసి ఇలా ఇప్పుడెందుకు తీయకూడదో చెప్పాం. ఇంకా వివరాలు కావాలంటే ప్రాంతీయ సినిమాల గురించిన వ్యాసాలున్నాయి : ఈలింక్ క్లిక్ చేసి సంచిక డాట్ కాం లో ‘సినీ విశ్లేషణ’ శీర్షిక లోకి వెళ్ళండి. ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ సినిమాలు ఎలా మార్పు చెందాయో తెలుస్తుంది. తెలుసుకున్నాక తెలంగాణా ప్రాంతీయ సినిమా ఎలా వుండాలో మీకో అవగాహన ఏర్పడుతుంది. ఆర్ట్ సినిమాలు దేశవ్యాప్తంగా 1980 లలోనే భూస్వామ్య వ్యవస్థతో బాటే అంతరించిపోయి, ఒక దశాబ్దం తర్వాత దాని కొత్త రూపాలు వచ్చాయి, వస్తున్నాయి. కానీ తెలంగాణా సినిమా అంటే ఈ తరం మేకర్లు కూడా ఇంకా కాలగర్భంలో కలిసిపోయిన ఆర్ట్ సినిమాలనే దగ్గరే ఇరుక్కుపోయి దెబ్బ తింటున్నారు - చరిత్ర పుటలు తేలీక!
Q : నావి మూడు
సందేహాలు : ‘నిను వీడని నీడను నేను’ మూవీ గురించి మీది సహా అందరూ మంచి పాయింట్ బట్
మిస్ చేసుకున్నారని రివ్యూస్ రాశారు. సో ఆమూవీ స్క్రీన్ ప్లే సంగతులు రాయగలరు,
చాలా హెల్ప్ అవుతుంది.
2. సందేహాలు సమాధానాలకి ఆదివారం టైం ఫిక్స్ చేయండి. ఆలోపు అందరూ ప్రశ్నలు అడుగుతారు. ఒక టైం అనుకుంటే కదా ఎవరైనా దాన్ని ఫాలో అయేది. 3. ఏ జానర్ మర్యాద ఏంటి దాని రూల్స్ ఏమిటి, అలా అన్ని జానర్స్ ఆర్టికల్స్ లింక్స్ పెట్టగలరు.
A : మీ మొదటి సందేహంలో మొదటి వాక్యం అర్ధం గాలేదు. రెండో వాక్యానికి జవాబు - ‘నివీనీనే' స్క్రీన్ ప్లే సంగతులు రేపు రాయబోతున్నాం. 2. దేశవిదేశాల నుంచి విశేషంగా పాఠకులున్నా ప్రశ్నలు పంపాలని రూలేం లేదు. కాబట్టి దీనికి రెగ్యులర్ శీర్షికంటూ ఎప్పుడూ ఆలోచించలేదు. దాదాపు సందేహాలు బ్లాగులో ఇస్తున్న వ్యాసాల్లోన్నే తీరిపోతున్నపుడు ఇంకా ప్రశ్నల అవసరముండదు. కాబట్టి దీని గురించి ఎక్కువ ఆలోచించడం అనవసరం. ఇలా అప్పుడప్పుడు వచ్చే ప్రశ్నలతో ఇర్రెగ్యులర్ శీర్షికే బెటర్. ఎక్కువగా తమ కథలతో నేరుగా సంప్రదిస్తూంటారు. 3. మీరడిగిన జానర్ మర్యాద లింక్స్ ఈ కింద ఇచ్చాం.
―సికిందర్