ఏడడుగుల
సంబంధం...ఎన్నో జన్మల అనుబంధం...అన్నాడు ఆనాడు సినిమా కవి. మరి కవులకీ ఇది వర్తిస్తుందేమో? కవులు కాకపోతే నేటి సినిమా రైటర్స్ కీ??....అంటే వాళ్ళ సంసారం
గురించి కాదు, వ్యాపారం గురించి. పైకి ఎన్ని చెప్పుకున్నా సినిమా రైటర్స్ పక్కా
వ్యాపారులే. వ్యాపారం కోసమే వున్నారు. వ్యాపారం లేకపోతే ఎవరైనా వున్నారా? కానీ వ్యాపారి
అన్నాక నేను వాడికి అమ్మను, వీడికి అమ్మను అని కూర్చుంటాడా? కూర్చుంటే వ్యాపారం
సాగుతుందా? కానీ సినిమా రైటర్ అనే వ్యాపారి లేనిపోని ఇగోలతో ఇలాగే చేసి వ్యాపారం
పోగొట్టుకుంటాడు. అందుకే వ్యాపారంతో ఏడడుగులు ఎలా వేయాలో, వేసుకుని ఎలా ఎన్నో
జన్మల బంధంగా ఆ వ్యాపారంతో చెలిమి చేయవచ్చో తెలుసుకోవడానికే ‘ఇలా రాయడానికి ఏడడుగులు’ అనే ఈ సెవెన్ సీటర్
షేర్ ఆటోలో క్రిక్కిరిసిన మార్కెట్లో జర్నీ!!
ఎసైన్ మెంట్ కి రాయడమంటే
కొందరు రైటర్స్ కి కష్ట సాధ్యంగా
వుంటుంది. మీరొక రైటర్ అయివుండి, మీరు స్వతంత్రంగా రాసుకునే వాళ్ళయితే మీ కథ, మీ
ఆలోచనలు, మీ రాత పని మీ వొక్కరివే. పూర్తి చేసిన స్క్రిప్టు కి క్రెడిట్ అంతా మీకే
చెందుతుంది. కానీ మీరొక ఎసైన్ మెంట్ మీద పనిచేయాల్సి వస్తే, సీనుపూర్తిగా
మారిపోతుంది. అప్పుడు మీరెంత మాత్రం మీ సొంత ఒరిజినల్ కథల్నీ, పాత్రల్నీ రాయలేరు.
ముందే నిర్ణయమైపోయిన కాన్సెప్ట్ లు,
క్యారక్టర్లు మొదలైన వాటితో మీరు తలపడాల్సి వస్తుంది. ఈ నిర్ణేతలు నిర్మాతలు
కావొచ్చు, లేదా దర్శకులు కావొచ్చు. వాళ్ళ దగ్గర సోర్స్ మెటీరియల్ గా సొంత ఐడియాలు
వుండొచ్చు, లేదంటే పూర్వపు స్క్రిప్టులు, రిమేక్ చేద్దామనుకున్న సినిమాలు, కాపీ కొడదామనుకున్న
సినిమాలు, హక్కులు కొనుక్కున్న నవలలు, కథానికలు, కామిక్స్; ఇంకా వార్తా కథనాలు,
వీడియో గేములు ...ఇలా ఏవైనా వుండొచ్చు. ఇలా మరొకరి ‘మేధో సంపత్తి’ ని మీరు డెవలప్
చేయాల్సి వచ్చినప్పుడు మీకు స్వేచ్ఛ అనేది వుండదు- ఆ ‘మేధోసంపత్తి’ పరిధిదాటకుండా
బందీలైపోయి, మీ ఆలోచనల్ని పేపర్ మీద పెట్టాల్సి వుంటుంది.
స్క్రిప్టు
ఎసైన్ మెంట్ తో అనుభవం కొన్నిసార్లు బురదనేలలా వుంటుంది, అడుగులు జారిపోతూంటాయి. ఒకవైపు
రాయించుకుంటున్న వాళ్ళ మెప్పుదల, వాళ్ళిచ్చే నగదు మొత్తాలూ ఎంత సంతృప్తి నిస్తాయో;
మరోవైపు ఫ్రస్టేషన్, నిరాశా నిస్పృహలూ అంతే పీడిస్తాయి. అయినా ఇందులోంచి బయటపడలేరు. మీ
కలులు, ఆశలు స్వతంత్ర రైటర్ గా స్థిరపడాలని వుంటే, మీరొక విషయం అర్ధం జేసుకోవాలి : 99 శాతానికి పైగా స్క్రిప్టు
వర్క్స్ అన్నీ ఎసైన్ మెంట్స్ తోనే ముడిపడి వుంటాయి. మీరు స్వతంత్ర రైటర్ గా
మీ సొంత స్క్రిప్టు తో ప్రయత్నాలు
ప్రారంభిస్తే, ఆ ప్రయత్నాల్లోనే వుండిపోయే అవకాశాలే ఎక్కువ. ఎవరు మీ స్క్రిప్టు
నచ్చి ఓకే చేస్తారో, అందుకెంత కాలం
పడుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ మీరు మాత్రం ఫ్రస్ట్రేషన్ తో గడుపుతారు,
ఒంటరి వాళ్ళయి పోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. టాప్ రైటర్లు ఏం చేస్తారో
తెల్సా? చాలామంది ఇతరుల ఐడియాలనే, కాన్సెప్ట్స్ నే డెవలప్ చేస్తూ వుంటారు.
కనుక
ఒక ఎసైన్ మెంటుకి రాయాలంటే మీరేం చేయాలి? ఎసైన్ మెంటుని టీం వర్కుగా చూడకూడదు. టీం
వర్క్ అని చెప్పుకుంటారు గానీ, నిజానికి అది టీం వర్క్ కాదు- అందులో చాలా లుకలుకలుంటాయి.
అందరూ కలిసి ఏ రాగద్వేషాలూ లేని ప్రవర్తనలతో- ఒకే ఉమ్మడి కార్యక్రమం కోసం అంకితభావంతో
పనిచేస్తున్న బృందంలా స్నేహపూర్వక వాతావరణం అక్కడ వుండడకపోవచ్చు. ఒకరు బాగా
ఆలోచిస్తూంటే ఇంకొకరికి పడక పోవచ్చు, టీము స్ఫూర్తి కి విరుద్ధంగా ఒకరు ఇంకొకరి
మీద ఆ నిర్మాతకో, దర్శకుడికో గాసిప్స్ చెప్పి వాళ్లకి క్లోజ్ అవ్వాలని ప్రయత్నించ
వచ్చు- ఆ నిర్మాత గానీ దర్శకుడు గానీ దీన్ని ప్రోత్సహించ వచ్చు. కాబట్టి మా టీం అనీ, మేం
టీం వర్క్ చేస్తున్నామనీ అంటున్నారంటే అది శుద్ధ అబద్ధం. ఏ ఆఫీసులోనైనా వుండే
పాలిటిక్సు ఇక్కడ కూడా టీం వర్క్స్ లో జొరబడిపోతాయి. టీములోనే పాలిటిక్సు చేసుకుని ఒక
సబబైన కనీస కళా సృష్టి చేయడం సాధ్యం కాదు.
ఎసైన్
మెంటుకి ఇదంతా వుండదు. ఎసైన్ మెంటుని మీరెక్కడో పూర్తి చేసి ఇవ్వచ్చు. ఇచ్చాక
ఇతరులు ఇచ్చిన వాటితో మీ వర్కుని మూల్యాంకన చేసి- నచ్చింది తీసుకోవచ్చు, ఏదీ
నచ్చకపోతే మొత్తం తిరస్కరించవచ్చు. ఈ నేపధ్యంలో మీకు బాగా మైనస్ మార్కులు పడిపోయి,
ఇతర చోట్ల నుంచి మీకు ఆహ్వానాలు అందని పరిస్థితి ఏర్పడకుండా వుండాలంటే ఏం చేయాలో, ఇతరుల ఐడియాల్ని డెవలప్ చేస్తూ కూడా అది మీలోని రైటర్ పురోభివృద్ధికి తోడ్పడేలా ఎలా
మల్చుకోవచ్చో ఇక చూద్దాం...
1. కాన్సెప్ట్
పట్ల పాషన్ పెంచుకోండి
ముందుగా
మీరు మొనగాడు అని భావించుకోవడం మానెయ్యాలి. ఇక్కడ మొనగాళ్లెవరూ వుండరు, అందరూ
నేర్చుకునే పోరగాళ్ళే. ఎంత నేర్చుకున్నా
వచ్చేవి ఫ్లాపులే. కాబట్టి ఒక నిర్మాతో మరెవరో చెప్పిన కాన్సెప్ట్ విని వచ్చి- వాడి
మొహం, వాడి కేమైనా తెల్సా? అని బయట కామెంట్లు చేయకండి. మనసులో కూడా ఇలాటి ఆలోచనా
ధోరణి ప్రబలకుండా జాగ్రత్త తీసుకోండి. మీ కాన్సెప్టు లే గొప్పవీ, మీరే పెద్ద గొప్పా అన్న అహాన్ని తగ్గించుకోకపోతే- ఎసైన్ మెంటు కి కాదుకదా, సొంతంగా రాసుకోవడానికి కూడా మీరు పనికి రాకుండా
పోతారు.
మీకు
ఇలా ఒక ఎసైన్ మెంటు వచ్చిందనుకుందాం : అన్ని ఆటంకాల్నీ ఎదుర్కొని వరల్డ్ కప్
గెల్చిన ఫుట్ బాల్ టీం గురించి స్క్రిప్టు
రాయాలి ... అప్పుడు మీకు ఫుట్ బాల్ అంటే పడక- క్రికెట్ పెట్టండి సార్, అద్భుతంగా రాస్తా- అన్నారనుకోండి, మీరు ఇంటికెళ్ళిపోతారు. మీకు
ఫుట్ బాల్ అంటే ఇష్టం లేకపోతే మొదటే మీకు
మైనస్ మార్కు పడిపోతుంది. మీ ముఖభావాలే మిమ్మల్ని పట్టిచ్చేస్తాయి. మీరు రాయాలనుకున్న
దాని పట్ల మీకు పాషన్ వుండి తీరాలి. మీరు సొంతంగా రాసుకుంటే ఎంత పాషన్ తో రాస్తాతో, అంతే పాషన్ ఇతరుల కాన్సెప్ట్స్ పట్ల
వుండాలి. వినగానే కాన్సెప్ట్ విలువని మీరు డిసైడ్ చేయలేరు. మీరొక పాషన్ తో దాన్ని
చేపట్టి ఎలా డెవలప్ చేస్తారో, ఏ తీరాలకి చేరుస్తారో దాన్ని బట్టి విలువ వస్తుంది. కాన్సెప్ట్
మీ చేతి చలవే, మీ చేవ కొద్దీ దాని విలువ.
పాషన్
లేకపోతే ఏ నిర్మాతా ఎసైన్ మెంట్ ఇవ్వరు. కాన్సెప్ట్ చెప్తున్నప్పుడే మీ
రియాక్షన్స్ గమనిస్తూంటారు. కాబట్టి మీరు ముఖాముఖీ గోష్టీ మర్యాద అని ఒకటుంటుందని
తెలుసుకుని దాన్ని పాటించాలి. చెబుతున్నది సంతోషంగా వినాలి. లేకపోతే ఎసైన్ మెంటుకి రావడమెందుకు? చెబుతున్నది
సంతోషంగా విని ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయకపోతే మీకు పాషన్ అనేది పుట్టదు. కాన్సెప్ట్
చెబుతూండగానే ఏ ఏ విధాలుగా దాన్ని ఆసక్తికరంగా మల్చవచ్చో మీ మనసులో రేఖా
చిత్రం ఏర్పడిపోతూండాలి. ప్రొఫెషనల్ రైటర్
అన్పించుకోవాలంటే ఇలాటి వృత్తితత్త్వం వుండాలి. ప్రొఫెషనల్ రైటర్ ఎలాటి దానికి ఏం
కావాలో అది తనలోంచి తీసివ్వాలి. వింటున్నది ఇష్టం లేనట్టు ముఖం పెట్టి కూర్చోవాలనుకుంటే ఇక్కడికి రానవసరం
లేదు, బయటే స్వతంత్ర రైటర్ గా పాట్లు పడవచ్చు.
కాబట్టి
ఎసైన్ మెంటుకి పాషన్ అవసరం. కాన్సెప్టు, సబ్జెక్టు శ్రద్ధగా వినండి. పాయింట్స్
ఏమైనా తడితే రాసుకోండి, వాళ్ళిచ్చే మెటీరియల్ ని పరిశీలించండి, దీన్ని చేసితీరాలన్న పాషన్,
పట్టుదలా పెంచుకోండి. ప్రతీ ఎసైన్ మెంట్
నీ మీ సామర్ద్యానికి ఛాలెంజిగా తీసుకోండి.
అహంతో ఇది చెత్త అనుకుని మానేస్తే ప్రతీ చోటా చెత్తే కన్పిస్తుంది. మీరు
రాసేదెప్పుడు? మీరేమిటో లోకానికి తెలిసేదెప్పుడు?
మీ ఉన్నతభావాలు మనసులో పెట్టుకు తిరగడం, మీ సిద్ధాంతాలేవో వల్లిస్తూ నల్గురిలో
గొప్ప అన్పించుకోవడం- ఈ కార్యక్రమాల వల్ల
ఏమీ లాభం వుండదు. కార్యరూపంలో ఏదీ లేకుండా
మీరలాగే వుండిపోతారు. కూసే వాడు రాయడు, రాసే వాడు కూయడు. ఇది గుర్తుంచుకోండి. లెక్చర్లు
ఇచ్చేవాడు పాఠాలు చెప్తాడుగానీ, ప్రాక్టికల్ గా చేయలేడనే అపహాస్యానికి గురయ్యే స్థితికి చేరుకోకండి.
మీకు
ఫుట్ బాల్ అంటే ఇష్టం లేకపోతే, ఇలాటి కథల్లో మీరిష్ట పడే ఎలిమెంట్స్ ఏవైనా
ఆలోచించి ప్రవేశ పెట్టొచ్చేమో చూడండి. అండర్ డాగ్స్ థీమ్స్ మీద మీ ఆలోచనల్ని ఫోకస్
చేయండి. బ్రదర్ హుడ్ కాన్సెప్ట్స్ పట్ల
మీకు పాషన్ వుండివుంటే, అలాటి కథ ఫుట్
బాల్ కాన్సెప్ట్ కి కలప వచ్చేమో చూడండి.
ప్రొఫెషనల్ రైటర్స్ ఇలాగే చేస్తారు. వాళ్ళు ఇచ్చిన కాన్సెప్ట్స్ లోనే తమ సొంత ఇష్టాల్ని వెతుక్కుని పాషన్ ని పెంచుకుంటారు. పాషన్ పుడితే అది మీకు
ఎసైన్ మెంటుని ఓకే చేయించడమే కాదు; ఆ
నిర్మాతలనుంచి, ఇతరులనుంచీ మీకుసహాయసహకారాలు పెరిగేట్టు కూడా చేస్తుంది. పైగా
కొత్త చోట్ల నుంచి ఆఫర్స్ తెచ్చి
పెడుతుంది.
2. ఏం కోరుకుంటున్నారో తెలుసుకోండి
ఎసైన్
మెంట్ అంటే నిర్మాత కాన్సెప్ట్ చెప్పగానే, ఓకే అనేసి జామ్మంటూ ఎగిరిపోయి మీ సొంత
వెర్షన్ రాసుకు వచ్చెయ్యడం కాదు. దెబ్బతినిపోతారు. వృత్తి తెలిసిన నిర్మాత దీన్ని అంగీకరించడు కూడా. చాలా మంది కొత్త రైటర్లకి పధ్ధతి తెలీక, తెలిసినా అడిగే ధైర్యం
లేక, చివరికి దెబ్బతిని పోతూంటారు. పత్రికా రిపోర్టర్ కి అధైర్యమనేది వుండదు,
ఎంతటి వారినైనా ప్రశ్నలు అడుగుతాడు. లేకపోతే అది వృత్తి ధర్మమే కాదు, వృత్తికి పనికి రాడు.
రైటర్ కూడా అధైర్యంతో ప్రశ్నలు అడగడం మానేస్తే అతనొక రైటరే కాదు. నిర్మాత ఆ కాన్సెప్ట్ ని ఎంచుకోవడానికి ఏవో కారణాలుంటాయి.
ఆ కారణాలతో ఎటాచ్ అవగల రైటర్ అన్వేషణలో
వుండివుంటారు. ఎంతో రీసెర్చి కూడా చేసి వుంటారు. ఎన్నో మీటింగులు కూడా
జరిపివుంటారు. దీన్ని ఎందుకు తెరకెక్కించాలో బాగా వర్కౌట్ చేసి వుంటారు. ఎవరి కోసం
తెరకెక్కించాలో, మార్కెట్ ఎలా చేయాలో స్టడీ చేసే వుంటారు. డిస్ట్రిబ్యూటర్లు ఏదెలా
వుండాలని కోరుకుంటున్నారో కూడా తెలుసుకుని వుంటారు.
కాబట్టి
మీరు కొన్ని ప్రశ్నలు అడక్క తప్పదు. నిర్మాత కేం అవసరమో, ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవడం
మీకవసరం. మీరేం రాయాలో, ఏది రాయకూడదో తెలుసుకోవడానికి కూడా ప్రశ్నించడం అవసరం : దీని
టోన్, అట్మాస్ ఫియర్ ఎలా వుండాలి? స్క్రిప్టు
ఎంత వైవిధ్యంగా వుండాలి? జనరల్ బడ్జెట్ ఏమిటి? భారీ బడ్జెట్టా, లిమిటెడ్ బడ్జెట్లో
పెట్టి రాయాలా? ...ఇలా మీరొక్క అక్షరం రాయడానికి ముందుగా ఇలాటి ప్రాజెక్టు సంబంధ
సందేహాలు తీర్చుకోవడం అవసరం. మీ మనసులో
ఇంకా కథ రూపొందే ముందే ఇది అవసరం. ఈ
ప్రశ్నలు, ఇంకా ఇలాటివి ఇంకొన్ని ప్రశ్నల
వల్లా మీరు ఏ శైలిలో రాయాల్సి వుంటుందో, సెక్సువల్
గా ఎంత ఎక్స్ పోజ్ తో రాయాలో, వయొలెన్స్ ఏ మేరకు వుండాలో, అసలుండ కూడదో, లుక్ ఫీల్
ఎలా వుండాలో, కాస్టింగ్ ఏమిటో, ఎన్ని లొకేషన్స్ అవసరమో, ఎంత భారీతనం వుండాలో, వుండకూడదో...ఈ
సమాచారమంతా మీరు రాయడానికి సేకరించుకున్న వాళ్ళవుతారు.
అసలు
ఆల్రెడీ లొకేషన్స్ నిర్ణయమైపోయి వుండొచ్చు, కొన్ని సెట్స్ కూడా ప్లాన్ చేస్తూండవచ్చు,
కొందరు నటీ నటులతో సంప్రదింపులు కూడా
జరుపుతూండొచ్చు. కనుక నిర్మాత ఏమనుకుంటున్నదీ స్పష్టంగా తెలుసుకోండి. వాటిని
ఖండించకండి. ఎదురు సలహాలివ్వకండి. దేంట్లోనూ జోక్యం చేసుకుని మాటాడకండి. అది మీ
పనికాదు. ఒక వడ్రంగి ఇచ్చిన కలప తీసుకుని చెప్పిన కుర్చీనో బల్లనో తన పనితనంతో
తయారు చేసి ఇస్తాడు. అలాగే ప్రొఫెషనల్
ఎసైన్ మెంట్ రైటర్ కూడా కాన్సెప్ట్ తీసుకుని, పైన చెప్పిన సమాచారం కూడా తీసుకుని,
వాటితో తంటాలు పడాలే తప్ప- తంపులు పెట్టకూడదు. ఆల్రెడీ అన్నీ ఫిక్స్
అయిపోయివుంటాయి, కాబట్టి నోరు మెదపకుండా స్క్రిప్టు రాసుకోవాలి. సమాచారం కూడా
తెలుసుకుని రాయడం వల్ల, చాలా సమయం కలిసివచ్చి, ఏ ఇబ్బందులూ పడకుండా ఫస్ట్ డ్రాఫ్ట్
అందించే అవకాశం వుంటుంది.
3. మీ మ్యాజిక్ మీరే ప్రదర్శించండి
టేక్ కేర్...రైటర్ గా
ప్రశ్నలు అడగొచ్చు కదాని, సబ్జెక్టు గురించి కూడా అడక్కండి. ఇంటికి పోతారు.
రైటర్లు రాయడానికి తగిన స్వేచ్ఛా, స్పేస్ అవసరమని నిర్మాతలకీ తెలుసు. గొంతు మీద
కూర్చుంటే క్రియేటివిటీ రాదనీ తెలుసు. క్రియేటివిటీని
జుర్రుకోవడం కోసం సబ్జెక్టుని పూర్తిగా వెల్లడించరు.
సబ్జెక్టు గురించి మీరడిగిందానికల్లా చెప్పరు. ఒక ప్రొఫెషనల్ ఎథిక్స్ తో వున్న నిర్మాత
మిమ్మల్ని నియమించుకోవడానికి కారణమేమై వుంటుందంటే – ఎక్కడో ఎప్పుడో ఎలాగో మీ
సమర్ధత తన దృష్టిలో పడివుంటుంది. కథ రాయడంలో మీ నేర్పూ శైలీ తెలిసే వుంటుంది. మీ గురించి అన్నీ
తెలుసుకున్నాకే పిలిచి వుంటారని మరవకండి. మీలో ఎంతో కొంత టాలెంట్ వుందని పిలిచాక, తీరా ఆ కాన్సెప్ట్ పట్ల మీరు పాషన్ కనబర్చకపోతే, అక్కడితో
మీ పని కట్ అయిపోతుందనుకోండి, అదివేరే విషయం – కానీ పాషన్ పరీక్షలో మీరు నెగ్గాక, మీ టాలెంట్ ని రాబట్టాలనుకుంటారు.
సబ్జెక్టులో మీ సొంత కథనంతో, ఎలిమెంట్స్ తో, మీ విజువలైజేషన్ ఏమిటో
చూడాలనుకుంటారు. మీమీద గౌరవంతో ఇలా కోరుకుంటారు. అంతేగానీ పరీక్షపెట్టి టార్చర్ చేయడానికి కాదు. మీరు
కాన్సెప్ట్ పట్ల అంత ‘పాషనిస్టు’ అయివుండి
కూడా, ఇది టార్చర్ అని అపార్ధం చేసుకుని పారిపోతే, దావానలంలా ఈ వార్త ప్రాకిపోయి మీ వృత్తికి గోరీ
కట్టేస్తుంది. సెలబ్రిటీలే న్యూస్ మేకర్లు అనుకోకండి- ఇలా చేస్తే బచ్చా రైటర్లు
కూడా న్యూస్ మేకర్లు అవుతారు మూవీ లాండ్ లో.
సబ్జెక్టు గురించి మీరెక్కువ ప్రశ్నలు
అడిగేస్తూంటే, మీ గురించి మీరు రెండు ప్రమాద ఘంటికలు మోగించుకున్నట్టే : ఒకటవ ప్రమాద ఘంటిక -ఎసైంట్ మెంట్ కి తగ్గ
సత్తా మీదగ్గర శూన్యమని మీరే తెలుపుకుంటారు.
అన్నీ నిర్మాతే చెప్పాల్సి వస్తే నిర్మాతే రాసుకోగలడు కదా, మిమ్మల్నెందుకు పిలవడం
దండగ?
రెండో
ప్రమాద ఘంటిక - రాయడానికి కూర్చుంటే ఇది మీ మెడకే ఉచ్చులా బిగుసుకుంటుంది. సబ్జెక్టు
గురించి మీరన్ని ప్రశ్నలు అడుగుతూంటే, సరే అనుకుని నిర్మాత అన్నిటికీ సమాధానాలు
చెప్పేయ వచ్చు. సబ్జెక్టు గురించి మనసులో అనుకుంటున్న ప్రతీదీ మీకు రివీల్ చేసెయ్యొచ్చు.
దీంతో వీటి ఆధారంగా మీరు సంతోషంగా స్క్రిప్టు రాసుకుంటూ పోవచ్చు. అప్పుడు ఒకానొక
క్షణంలో మీకే అన్పిస్తుంది- సబ్జెక్టు గురించి అన్నీ అడిగేసి మీరే గొయ్యిలో
పడ్డారని. మీరు ఫాలో అవడానికి నిర్మాత అన్ని డైరెక్షన్లూ చెప్పేశాక ఇక సొంతంగా మీరు
రాయడానికి మీకేం స్వేచ్ఛ వుంటుంది? మీకంటూ
మీకేం స్పేస్ వుంటుంది? మీరేం క్రియేటివిటీ చూపించగల్గుతారు? రైటర్ల
నుంచి క్రియేటివిటీ పెల్లుబకడానికే ఈ స్వేచ్ఛా,
స్పేస్ లు అవసరం కాబట్టే నిర్మాతలు
సబ్జెక్టుని పూర్తిగా వెల్లడించరు. దీన్ని అపార్ధం చేసుకుంటే ప్రొఫెషనల్ రైటర్
కాలేరు- కోపంతో ఇంట్లో కూర్చోవాల్సిన ఎమోషనల్ రైటర్ అవుతారు. ఎమోషనల్ రైటర్ కి
ఇతరుల కాన్సెప్ట్స్ పట్ల పాషన్ కూడా పుట్టదు.
కాబట్టి
పై రెండు తప్పులూ చేయకండి. వీటి వల్ల మీరు
రైటర్ అవ్వాలన్న కోరికతో ఎప్పటికీ
స్ట్రగుల్ చేస్తూనే వుండిపోతారు.
4. అతి రాతలు రాయకండి
ఇతరుల
కాన్సెప్ట్ ని రాస్తున్నప్పుడు సర్వసాధారణంగా నిర్లక్ష్యంగా రాసేస్తూంటారు. అంటే
పాషన్ లేక కాదు, వుంటుంది. కానీ దాన్ని మీరొక్కరే అనుభవిస్తూ రాసేస్తారు. పాషన్ ని అనుభవించడం ఎంత
అవసరమో, ప్రకటించడం కూడా అంతే అవసరం. పాషన్ ని ప్రకటించడం కూడా చేసినప్పుడు అందులో
నిర్మాత మనోగతం కూడా ప్రతిబింబిస్తుంది. లేకపోతే ఎమౌతుందంటే, ఇచ్చిన సబ్జెక్టునీ, పాత్రల్నీ
అత్యుత్సాహంతో అవసరానికి మించి విస్తరించేసి వీర విహారం చేస్తారు. మీరు వీర
విహారానికి అర్హులని నిర్మాత భావిస్తే, వేరే లగ్జరీ కారు ఏర్పాటు చేస్తారు. గోవా
దాకా యువరాజులా జాయ్ రైడ్ వెళ్లి రావొచ్చు. అంతే గానీ స్క్రిప్టులో ఇష్టానుసారం వీర విహారాలు చేసే అనుమతి మీకు లేదు. నిర్మాత మీ
క్రియేటివిటీకి అంత స్వేచ్ఛా స్పేసూ ఇచ్చారంటే
ఎందుకు? మీదైన స్టయిల్ ని, స్పార్క్ ని, బిలియెన్స్ నీ రంగరించి, సబ్జెక్టులో తనకే
తెలీని డెప్త్ నీ, రహస్యాల్నీ బహిర్గతం చేసి, తను కోరుకుంటున్నదీ, తనకి అవసరమైనదీ
వూహించని తీరులో మీరు ఇవ్వాలనే కదా? కాబట్టి ఇచ్చిన స్వేచ్ఛనీ స్పేసునీ దుర్వినియోగం చేసుకోకండి.
చెత్తగా
రాయకండి. ఫుట్ బాల్ ఆట మీద ఎన్ని సినిమాలు వచ్చి వున్నా, వాటిలో చెత్తకి ఫిదా
అయిపోయి అలాగే రాసెయ్యకండి. చెత్తకి అవకాశం లేకుండా, ఫుట్ బాల్ మీద ఇదివరకు ఎవ్వరూ
రాయని విధంగా రాసి నిరూపించుకోండి.
5. కొత్తతో పాతని కలుపుకు పోండి
నిర్మాతగానీ,
సంబంధీకులు గానీ తమకేం కావాలో ఓవరాల్ పిక్చర్ మాత్రమే చెప్తారు. కాన్సెప్ట్ కి కి లోబడి ఆ ఓవరాల్ పిక్చర్ కి న్యాయం చేసే
విధంగా మీరు రాయాలి. అయితే చెత్త జొరబడకుండా రాయాలనుకున్నప్పుడు సూక్ష్మాంశాల పైన
దృష్టి పెట్టాలి. క్యారక్టర్ షేడ్స్, స్కిల్స్; సబ్ ప్లాట్స్, కొన్ని రొటీన్
సన్నివేశాలు, ఫార్ములా పాత్రలు;
ట్విస్టులు, టర్నింగులు, క్యారక్టర్ బలహీనతలు, సంఘర్షణ, అంతర్గత భయాలు,
కొత్తదనం గల సస్పెన్స్ సీక్వెన్సులు... మీరు దృష్టి పెట్టాల్సిన సూక్ష్మాంశాలలో
ఇవి కొన్ని. వీటివల్ల మీ స్క్రిప్టుకి బలం వస్తుంది. ఏకపక్షంగా మీరేదో కొత్తగా
చెప్పేస్తూ రుద్దకుండా, నిర్మాత ఇష్టపడే ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ ని కూడా కలిపి రాసినట్టయితే మీరొక
పక్కా ప్రొఫెషనల్ రైటర్ అన్పించుకుంటారు.
6.
విజ్ఞతతో వ్యూహ ముండాలి
మీరు
రాయడానికి ముందు డెవలప్ మెంట్ చర్చల్లోగానీ, లేదా మీరు ఫస్ట్ డ్రాఫ్ట్ పూర్తి చేసి
అందించాక గానీ, మీ పోరాట వ్యూహం ఎలా
వుండాలో మీరు నిర్ణయించుకోవాలి. ప్రొఫెషనల్ రైటర్స్ కి అభిప్రాయాలుంటాయని
నిర్మాతలూ నమ్ముతారు. వాళ్ళు రోబోలనీ, చెప్పినట్టల్లా ఆడాలనీ వాళ్ళూ ఆశించరు. సినిమా
నిర్మాణమంటేనే కొలాబరేషన్. ఎందరినో కూడేసి
రూపొందించే వినోద సాధనం. నిర్మాతలు నిర్మాణం చేయాలి, దర్శకులు దర్శకత్వం వహించాలి,
నటీ నటులు నటించాలి. ఇక రైటర్లు రాయాలి. కాబట్టి కథ పట్లా, పాత్రల పట్లా మీకుండే విశ్వాసాల కోసం మీరు నిలబడక తప్పదు, ఆ హక్కు మీకుంది. అయినప్పటికీ పోరాట వ్యూహం విజ్ఞతతో
వుండాలి. కొలాబరేషన్ అంటేనే కాంప్రమైజ్ అని గుర్తుంచుకోవాలి. అంతిమ తీర్పు నిర్మాతదే అని కూడా మర్చిపోకూడదు.
దీన్ని దాటుకుని వెళ్ళలేరు.
అయినా
మీలోని రైటర్ కాంప్రమైజ్ అవడానికి
స్ట్రగుల్ చేస్తూంటే, క్షణికావేశానికి
లోను కాకూడదు. ఎసైన్ మెంట్ ప్రాసెస్ అంటేనే ఇచ్చి పుచ్చుకునేది. మీరే ఎక్కువ ఇచ్చుకునేది.
ఎందుకంటే ఇచ్చుకునేందుకే మిమ్మల్ని పెట్టుకున్నారు. పెట్టుకున్నందుకు మీకు కొంత
ఇచ్చుకున్నారు. కాబట్టి కాంప్రమైజ్ అవ్వాల్సిన ఖర్మ మీకే పడుతుంది. ఈ కళని మీరు ప్రాక్టీసు
చేయాలి. సినిమా ఆడకపోతే మీకేం నష్టం రాదు, ఈ రైటర్ నాశనం చేశాడని ఎవరూ అనరు. ఎసైన్
మెంట్ రైటర్ గా కాన్సెప్ట్ మీది
కానప్పుడు, ఇంకేదీ మీది కానపుడు మిమ్మల్నిదోషిగా చూడరు. ఆ వినాశ కారకులు వేరే
కళ్ళెదుట కన్పిస్తూంటారు. వాళ్ళ కేరీర్స్ కే ఎసరు రావొచ్చు, రైటర్ గా ఇంకో చోట మీరు
చక్కగా రాసుకుంటూ వుంటారు.
ఈ
స్ట్రగుల్ లో ఒక్కటే మీ ఆయుధం : మీరు
పాషన్ తో మీ విశ్వాసాల కోసం నిలబడ్డారే తప్ప,
ఇగోతో కాదని స్పష్టమవుతుంది. ఈ వ్యూహం మీకు అవకాశాలకి దూరం చెయ్యదు, మరింత
దగ్గర చేస్తుంది.
7. వేటుకు సిద్ధంగా వుండండి
సినిమాలు
కొలాబరేషన్ మీడియా గనుక అనుకున్నది అనుకున్నట్టుగా జరగక పోవచ్చు. మంచే జరగొచ్చు,
చెడైనా దాపురించ వచ్చు. దీనికి మొట్టమొదట దెబ్బ పడేది మీరు అపురూపంగా రాసిన మీ స్క్రిప్టు
అనే పవిత్ర గ్రంధం మీదే. మీదే. మీరు ఎసైన్ మెంట్ రైటర్ గా వున్నారంటే, ఎప్పుడైనా
మీ స్థానంలో మరొకరు రావొచ్చనీ, లేదా మీరు రాసింది ఎప్పుడైనా పూర్తిగా మారిపోవచ్చనీ
తెలిసే మీరు వచ్చారని గుర్తు పెట్టుకోండి. స్క్రిప్టు మారిపోవడమనేది ప్రొడక్షన్ సమయంలో ఒక అనివార్య తంతు. మాటిమాటికీ మీరు ఎన్నో
ప్రొడక్షన్ స్క్రిప్టులూ రాయాల్సి
రావొచ్చు. ప్రొడక్షన్ పూర్తయ్యే నాటికి మీరు ఒరిజినల్ గా రాసిన స్క్రిప్టు మీకే
కన్పించకపోవచ్చు.
ప్రొడక్షన్లో
మీరే కాదు, మీతో ఎంతో ఇష్టపడి రాయించుకున్న పాపం ఆ నిర్మాతే ఏమీ చేయలేక
చేతులెత్తేస్తారు. ఎవరైనా సరే ప్రొడక్షన్ లో అప్పటి డిమాండ్స్ ని బట్టి తమ
డిమాండ్స్ ని వదులుకోవాల్సిందే. ఇంతా చేసి ఇలా ఆత్మహత్య చేసుకోవడానికా నేను రాశానూ
అని మొహం పెట్టి కూర్చోకండి. మీ ఆత్మహత్యతో జీవించి వున్న రైటర్స్ పరిస్థితులేమీ బాగు
పడిపోవు. మీకు విగ్రహం పెట్టి జయంత్యుత్స వాలు జరుపుకోరు. ఇగోతో మీరిక్కడ ఒక్క
క్షణం కూడా మనశ్శాంతితో వుండలేరు, పైగా ఇతరులకి దూరమైపోతారు. పాషన్ తో మీరు
ప్రశాంతంగా వుండగల్గుతారు, నల్గురికీ దగ్గరవుతారు.
ఈ
పై ఏడడుగుల్నీ ఆచి తూచి వేస్తూ మీ నడక
సాగించినట్టయితే, మీ కెరీర్ కే ఢోకా వుండదు. నిజానికి రైటర్ గా మీకు అవకాశం రావడమే
గొప్ప. అవకాశాల కోసం ఏళ్లతరబడి ప్రయత్నించే ఎందరో
రైటర్లకి కాకుండా ఈ అవకాశం మీకు దక్కింది. మీరెంతో అదృష్టవంతులు. ఇంత గొప్ప
సినిమా అవకాశంతో మీ స్నేహితుల్లో, మీ బంధువర్గంలో మీరు సగటు మనిషి నుంచి ప్రత్యేక
వ్యక్తి స్థాయికి ఎదిగారు. అందుకని అవకాశాన్ని ప్రేమించండి, పరిస్థితుల్ని
ద్వేషించకండి.