రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, August 29, 2015

మిషన్ పాసిబుల్!



దర్శకత్వం : కబీర్ ఖాన్
తారాగణం : సైఫలీ ఖాన్, కత్రినా కైఫ్, సవ్యసాచి చక్రవర్తి, మహ్మద్ జీషాన్ ఆయూబ్,
సొహైలా కపూర్, షానవాజ్ పట్వర్ధన్,
సంగీతం : ప్రీతమ్, నేపధ్య సంగీతం : జూలియస్ పఖియం, ఛాయాగ్రహణం : ఆశీమ్  మిశ్రా,  కూర్పు : ఆరిఫ్ షేక్  - ఆదిత్య బెనర్జీ
కథ : హుసేన్ జైదీ,  స్క్రీన్ ప్లే : కబీర్ ఖాన్- పర్వేజ్ షేక్, మాటలు : కబీర్ ఖాన్ - కౌసర్ మునీర్
బ్యానర్ : నాడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్ టెయిన్ మెంట్
నిర్మాతలు : సాజిద్ నాడియావాలా,  సిద్ధార్థ్ రాయ్ కపూర్
విడుదల : 28 ఆగస్ట్ 2015
*
త నెల్లోనే ‘భజరంగీ భాయిజాన్’ అనే సూపర్ హిట్ ని అందించిన దర్శకుడు కబీర్ ఖాన్ నుంచి వెంటనే ఈ నెల ‘ఫాంటమ్’ వచ్చేసింది.. మొదటిది ఇండో- పాక్ ల మధ్య స్నేహం కోసం,
రెండోది పాక్ లో వున్న 26/11 ముంబాయి దాడుల సూత్రధారిని చంపడం కోసం.
మొదటి దాన్ని పాక్ ఆదరించింది, రెండో దాన్ని పాక్ కోర్టు నిషేధించింది. ఫర్వాలేదు- అక్కడి ప్రేక్షకులు దీన్ని చూడకపోయినా మునిగిపోయిందేమీ లేదు, కానీ భారత ప్రజల భావోద్వేగాలతో ముడిపడి వున్న 26/11 ఉదంత సూత్రధారి అంతాన్ని భారతీయ ప్రేక్షకులు
చూసే ఆనందించాలి. ఇది థియేటర్లలో వెల్లడవుతూనే వుంది- హఫీజ్ సయీద్
పాత్రధారిని సైఫలీ ఖాన్ కాల్చి చంపుతున్నప్పుడు ప్రేక్షకులనుంచి
వస్తున్న రెస్పాన్స్. ఈ ఘటన నిజమవుతుందో లేదో కాలమే చెప్తుంది-
అందాకా ప్రేక్షకుల్ని ఇలాగైనా సంతృప్తి పర్చాలి కదా!

          హాత్మా గాంధీ మీద హత్యాయత్నంతో కమల్ హాసన్ ‘హేరామ్’,  దావూద్ ఇబ్రహీం ని పాక్ నుంచి పట్టి తెచ్చే రిషీకపూర్  ‘డి- డే’ లాంటి కాల్పనిక  చరిత్రల్లాంటిదే ‘ఫాంటమ్’ కూడా. కాకపోతే 26/11 తాజా సమకాలీన ఉదంతం కావడంతో, ఫ్లాష్ ఫార్వర్డ్ మోడ్ లో  ఇది ప్రేక్షకుల తాజా కచ్చిని  బాగా తీర్చుతుంది.

          ఏ తరహా సినిమా అయినా అంతిమంగా న్యాయ స్థాపన జరిగి ప్రేక్షకుల కచ్చి తీర్చి నప్పుడే గొప్ప సక్సెస్ అవుతుంది. ‘ఫాంటమ్’ అంత గొప్ప సక్సెస్ అయ్యే లక్షణాలున్న సినిమా అనలేం, కానీ  26/11 ముష్కరుడ్ని చంపడమనే కిల్లర్ ( అంటే కత్తి లాంటి ) బాక్సాఫీసు అప్పీల్ వున్న  పాయింటుతో,  ఈ పరిమిత బడ్జెట్ మూవీ దర్శకుడి విఫల ప్రయోగం మాత్రం కాబోదు.

          సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టాలంటే ఆ దేశంలో కోవర్ట్ ఆపరేషన్సే శరణ్యమని ఉపదేశించే ఈ స్పై థ్రిల్లర్ అసలెలా వుందో చూద్దాం..

‘రా’ రమ్మంది! 
       దనియాల్ ఖాన్ ( సైఫలీ ఖాన్) దేశ దిమ్మరిలా తిరుగుతూంటాడు. గతం అతణ్ణి బాధిస్తోంది. తను సైన్యంలో వున్నప్పుడు జరిగిన ఒక సంఘటనని పై అధికారులు అపార్ధం జేసుకుని కోర్ట్ మార్షల్ చేసి సైన్యం లోంచి తొలగించారు. సైన్యంలో ఫాంటమ్ (అదృశ్య శక్తి )  గా పెరుతెచ్చుకున్నప్పుడు గర్వించిన తన తండ్రి కూడా ఇప్పుడు తన మొహం చూడ్డం లేదు. సైనికాధికారిగా తండ్రి వుంటే, తనిలా తన మీద పడ్డ నింద కూడా తొలగించుకునే మార్గం లేక ఇంటా బయటా వెలి వేసిన వాడిలా తిరుగుతున్నాడు.

          ఇతడి మీద భారత గూఢచార సంస్థ రీసెర్చి అండ్ ఎనాలిసి వింగ్ ( ‘రా’ ) దృష్టి పడుతుంది. వెతికి పట్టుకుంటారు. ‘రా’ బాస్ రాయ్ ( సవ్యసాచి చక్రవర్తి) కోవర్ట్ ఆపరేషన్ ప్లాన్ చేశాడు. ఇటీవల నేపాల్ సరిహద్దులో పట్టుపడ్డ పాక్ టెర్రరిస్టు వెల్లడించిన ప్రకారం లష్కరే తయ్యెబా ( ఎల్ ఈ టి ) మరో 26/11 తరహా దాడిని ప్లాన్ చేస్తోంది. ఈ దాడుల్ని ముందే తిప్పి కొట్టలేమా, రొటీన్ గా అప్రమత్త హెచ్చరికలు జారీ చేసి ఊరుకుంటే సరిపోతుందా- అని కొత్తగా చేరిన అపర చాణుక్యుడు లాంటి చలాకీ సుమీత్ ( మహ్మద్ జీషాన్ ఆయూబ్) అనడంతో ఆలోచనలో పడ్డ రాయ్- హోం మంత్రికి తన ఐడియా చెబితే ఇంతెత్తున లేచాడు హోంమంత్రి. పాకిస్తాన్ లోకెళ్ళి లష్కర్ నాయకుడు హరీజ్ సయీద్ ( పాక్ హైకోర్టు ఈ సినిమాని నిషేధించడంతో హడావిడిగా హఫీజ్ సయీద్ పేరుని హరీజ్ సయీద్ గా మార్చారు) ని చంపడానికి అనుమతించేది లేదని తేల్చి చెప్పేశాడు. దీంతో ప్రభుత్వానికి తెలియకుండా ప్రైవేటుగా ఈ ఆపరేషన్ కానిచ్చేద్దామని సుమీత్ కూడా ధైర్యం చెప్పడంతో రాయ్ ఇందుకు సమకట్టాడు.

          ఈ ఆపరేషన్ కి ఒప్పుకునేది లేదంటాడు దనియాల్. పది మంది వెధవలు ముంబాయిలో జొరబడి చంపితే, మనం కూడా వెధవలుగా వాళ్ళ దేశంలో చంపి రావాలా? - అని ప్రశ్నిస్తాడు. అపర చాణక్యుడు చాకచక్యంగా అతణ్ణి ఒప్పించేస్తాడు- అతడిమీద నింద తొలగించుకునే మార్గం ఇదేనని.

          2008 నవంబర్ 26న ముంబాయి మీద టెర్రర్ దాడులు జరిపి 166 మందిని బలిగొన్న లష్కర్ నాయకుడు హరీజ్ సయీద్ తో బాటు, అనుచరులు సాజిద్ మీర్, డేవిడ్ కోల్మన్ హెడ్లీ, జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ లని మట్టుబెట్టడానికి రంగం సిద్ధమయింది. బాస్ రాయ్ రెండు కండిషన్లు పెడతాడు- ఒకటి : వీళ్ళ చావులు ఇండియా మీదికి అనుమానాలు  రాకుండా యాక్సిడెంటల్ మరణాలుగా వుండాలి, రెండు : వూర కుక్కకి కూడా ఈ కోవర్ట్  ఆపరేషన్ గురించి  పొక్కకూడదు!

          ఇక్కడ్నించీ మొదలవుతుంది లండన్, చికాగో, సిరియా, పాకిస్తాన్ దేశాల్లో శత్రు సంహారం. లండన్ లో ఒక ఎన్జీవో తరపున పనిచేసే నవాజ్ మిస్త్రీ ( కత్రినా కైఫ్) పరిచయమవుతుంది. ఆమె ద్వారానే అక్కడ సాజిద్ మీర్ ని ట్రేస్ చేసి హతమారుస్తాడు. చికాగో వెళ్లి అక్కడ జైల్లో వున్న డేవిడ్ హీడ్లీ ని చంపేస్తాడు. ఈ రెండు మరణాలు పాక్ గూఢచార సంస్థ ఐఎస్సై దృష్టి కొస్తాయి. దీంతో దనియాల్ పాక్ హై కమిషనర్  ని కాంటాక్ట్ చేసి తనెవరో చెప్పేస్తాడు. భారత సైన్యం తనని అవమానించింది గనుక, పగ దీర్చుకునేందుకు  లష్కర్ సహాయం కోసం ఇదంతా చేస్తున్నానని చెప్పేస్తాడు. హై కమిషనర్ నుంచి ఈ సమాచారమందుకున్న ఐఎస్సై చీఫ్,  అతడి బ్యాక్ గ్రౌండ్ ని చెక్ చేసి,  సిరియాలో వున్న లష్కర్ నాయకుల్ని కలుసుకునేందుకు ఏర్పాటు చేస్తాడు.

          సిరియాలో లష్కర్ నాయకుణ్ణి కలుసుకున్నప్పుడు అకస్మాత్తుగా సిరియా సైన్యం ( ఐఎస్?) దాడులు  జరుపుతుంది. ఆ నాయకుడు చచ్చిపోతాడు. ఇక పాకిస్తాన్ లోకి వెళ్లేందుకు వేరే మార్గం లేక, ఎన్జీ వో ప్రతినిధిగా తనే తీసికెళ్తుంది నవాజ్, దనియాల్ ని.

          ఇక్కడ లష్కర్ చీఫ్ హరీజ్ సయీద్ స్వేచ్ఛగా తిరుగుతూంటాడు. ఐఎస్సై అతణ్ణి  షేక్ సాబ్ అని పిలుచుకుంటూ, జెడ్ గ్రేడ్ సెక్యూరిటీ కూడా కల్పించి మర్యాదలు చేస్తూంటుంది. మరో నిందితుడు జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ లాహోర్  జైల్లో ఉంటాడు. ఇతడికి రోజూ ఇంజెక్షన్ ఇవ్వడానికి ఓ డాక్టర్ వెళ్తూంటాడు. ఇతడి క్లినిక్ ని చూసుకునే ఓ పెద్దావిడ ( సొహైలా కపూర్) వుంటుంది. ఈవిణ్ణి  ట్రాప్ చేస్తుంది నవాజ్.

          హరీజ్ సయీద్ ని దనియాల్ వాచ్ చేస్తూంటాడు. హరీజ్ నీ, జకీవుర్ నీ  ఒకే సమయంలో చంపేసి దేశం విడిచి పారిపోవాలని ప్లాన్ చేస్తారు ఇద్దరూ.

          ఇదీ విషయం. ఈ ప్లాను పారిందా, బెడిసిందా? ఆ దేశం లోంచి ఎలా పారిపోయి వచ్చారు? పారిపోతున్నప్పుడు మార్గ మద్యం లో ఏమేం జరిగాయి? ఇద్దరూ ప్రాణాలతో వున్నారా? సముద్ర జలాల్లో ఏం జరిగింది? ఇద్దరి మధ్యా చిగురించిన ప్రేమ ఫలించిందా? దుర్మతుల చావుల్ని సెలెబ్రేట్ చేసుకునే అవకాశం ఇండియాకి కలిగిందా?

          ఇవన్నీ ఎవరికి వారు ఈ స్పై థ్రిల్లర్ చూసి తేల్చుకోవాల్సిన ప్రశ్నలు.

ఎవరెలా చేశారు?
         సైఫలీ ఖాన్ కిది జారుడు బల్ల పాత్ర. గొప్ప నటులు కాని వాళ్లకి ఇలాటి పాత్రలే వర్కౌట్ అవుతాయి. జారుడు బల్ల పాత్రల వల్ల హై వోల్టేజి యాక్షన్ ఎపిసోడ్లతో ఎమోషన్స్ పలికించే అవసరమే రాదు, ప్రత్యర్థులు తిరగబడకుండా కుక్క చావు చస్తూంటే స్ట్రగుల్ పడాల్సిన అవసరమే రాదు, యాక్షన్ హంగామాలో రోమాన్స్ కి చోటు కూడా లేకుండా చేస్తే ఆ ఫీలింగ్స్ పలికించే అగత్యమూ వుండదు. జారుడుబల్ల మీద అలా జారుకుంటూ పోతూ ఉండడమే. ఎదురొచ్చేది ఏమీ వుండదు. అంతా ఒన్ మాన్ షో.  ఒన్ వేలో ఒకటే యాక్షన్- అవతలి వైపు నుంచి నో రియాక్షన్.  విలన్లు తమకేం జరుగుతోందో తెలియకుండా సడెన్ గా చస్తూంటే- నటించలేని హీరో పాత్ర వేసిన జారుడు బల్ల ఆర్టిస్టుకి బాగానే ఉండొచ్చు గానీ, కథనంలో పస వుండదు. హీరోకి దీటుగా విలన్ కూడా వుండి - చావడానికి ముప్పుతిప్పలు పెడుతూంటే- చంపడానికి హీరో పడే పాట్లతో తో చూడ్డానికి ఓ కథలా ఉండొచ్చు.

          సైఫ్  చాలా సేఫ్. సినిమా సాంతం ఒకే ఒక్క ఎక్స్ ప్రెషన్ తో లాగించేశాడు. గట్టిగా అరిచి కూడా డైలాగులు చెప్పలేడు గనుక, లష్కర్ పెద్ద ముష్కరుడ్ని చంపుతున్నప్పుడు కూడా - ‘ఇండియాకి  ఏం కావాలని అన్నావ్ కదా.. ఇండియాకి న్యాయం కావాలి..’ అన్న స్టేట్ మెంట్ లాంటి ఒక డైలాగుతో సింపుల్ గా సరిపెట్టేశారు.

          ఈ సినిమాలో పాయింటుకి పట్టం గట్టాలి తప్ప సైఫలీ నటనకి కాదు. కత్రినా కైఫ్ ది ఇంకో బాధ. ఈ సినిమాలో ఎందుకు నటిస్తున్నానా అన్నట్టే విసుగ్గా కన్పిస్తూంటుంది. తను అర్జెంటుగా బరువు తగ్గాల్సిన అవసరముంది. సినిమా మొత్తం మీద తను చేసిందేమిటంటే,  సైఫలీ వెంట ఎక్కడికి పడితే అక్కడికి పరుగెత్తడమే, అలా పరిగెత్తుతూ వుండడమే. ఒక్క ఫైట్ కూడా చేయకుండా చాలా కష్టం తప్పించుకుంది తను.

షానవాజ్ పట్వర్ధన్ 
         హఫీజ్ సయీద్ పాత్ర వేసిన షానవాజ్ పట్వర్ధన్ అచ్చం అదే పోలికలతో వుండి, మ్యానరిజమ్స్ ని బాగా ఇమిటేట్ చేశాడు. జకీవుర్ రెహ్మాన్ పాత్ర కేవలం చనిపోయేటప్పుడే సీన్లో కొస్తుంది- కాబట్టి ఆ ఒక్క షాట్ లో ఆ నటుడు చావు నటించడానికి పెద్దగా కష్టపడలేదు. చికాగోలో హెడ్లీ పాత్ర వేసిన నటుడు కూడా హెడ్లీ పోలికలతో వుండడం విశేషం. ఇక ఇప్పుడిప్పుడే కమెడియన్ గా పాపులరవుతున్న, ‘రా’ ఉద్యోగి సుమీత్ పాత్ర వేసిన జీషాన్ ఆయుబ్ ఒక్కడే ఈ సీరియస్ యాక్షన్ మూవీకి కాస్త కామిక్ రిలీఫ్.

మహ్మద్ జీషాన్ ఆయుబ్ 

          పాటలకి చోటు లేదు. ట్రైలర్స్ లో ఊరించిన ‘ఆఫ్ఘన్ జలేబీ’ ఐటెం సాంగ్ ఓ బిట్ వచ్చి కట్ అయిపోవడం నిరాశే  ప్రేక్షకులకి. ఇంకో పాట సందర్భానుసారం బ్యాక్ గ్రౌండ్ లో వస్తుంది. పాకిస్తాన్ లో పెళ్లి పాట బ్యాక్ గ్రౌండ్ లో యాక్షన్ వుంటుంది.

          మరోసారి ‘భజరంగీ భాయిజాన్’  ఫేమ్  ఆశీమ్ మిశ్రా ఛాయాగ్రహణాన్ని ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు. యాక్షన్ సీన్స్, యాక్షన్ సీన్స్ లో ఆయా దేశాల దళాలుగా పాల్గొన్న ఆర్టిస్టులూ పకడ్బందీగా కన్పిస్తారు. లాహోర్ ఒక బజారు సెట్, నేపధ్య వాతావరణం పాకిస్తాన్ ని ప్రతిసృష్టి చేసినట్టే వుంటుంది. అలాగే లెబనాన్ లో వేసిన సిరియా భూభాగం సెట్ కూడా. వాడిన ఆయుధాలు, మందుగుండు సహా ఆథెంటిగ్గా కన్పిస్తాయి. చివర్లో జలాంతర్గామి రావడం ఒకెత్తు.

          కబీర్ ఖాన్ మేకింగ్ లో కథాపరంగా ఎన్నో  లోటు పాట్లున్నా, టెక్నికల్ గా కాలుష్యం లేకుండా నీటుగా వుంది. ‘భజరంగీ భాయిజాన్’ లాగే హృదయాల్ని బరువెక్కిస్తూ ముగించడం దీనికి కూడా అవసరమే- ఇది నిజ సంఘటన కాబట్టి -అలాటి మనోభావాలతో ముడిపడి వుంది కాబట్టి.

 స్క్రీన్ ప్లే సంగతులు 
          న్వెస్టిగేటివ్ జర్నలిస్టు హుసేన్ జైదీ రాసిన నవల ‘ముంబాయి ఎవెంజర్స్’ ఆధారంగా తీసిన సినిమా అని బాగా ప్రచారం జరిగింది. ఆర్నెల్ల క్రితమే ఈ నవల విడుదలయ్యింది, కానీ గత సంవత్సరమే సినిమా షూటింగ్ ప్రారంభమయ్యింది. దర్శకుడు కబీర్ ఖాన్ కి ఈ సినిమా అయిడియా వచ్చాకే దాన్నాథారంగా జైదీ నవల రాయడం ప్రారంభించాడు. కాబట్టి నవలకీ సినిమాకీ ఎక్కడా పోలిక కన్పించదు - పాత్రలతో సహా. సినిమా పేరు చెప్పుకుని నవలకి బారీ అడ్వాన్సు కూడా తీసుకున్నాడు జైదీ. నవలలో ఈ ఆపరేషన్ ని ‘రా’ చేపట్టదు. ఒక రిటైర్డ్ కల్నల్ ఆరుగుర్ని సమీకరించి 26/11 దాడుల కారకులని సంహరించడం మొదలెడతాడు. ఆ కుట్ర దారుల్లో సినిమాలో లేని మసూద్ అజర్ పాత్ర కూడా వుంటుంది. మసూద్ అజర్ 1999 వరకూ జమ్మూ కాశ్మీర్ జైల్లో ఖైదీగా  వున్నాడు. అప్పుడు కాందహార్ విమాన హైజాక్ ఉదంతం లో ఎన్డీయే ప్రభుత్వం తీసికెళ్ళి హైజాకర్స్ కి అప్పగించిన టెర్రరిస్టుల్లో మసూద్ కూడా వున్నాడు. అలా అప్పగించిన మసూదే 2001 లో పార్లమెంట్ మీద దాడికి పాల్పడ్డాడు. 26/11 ముంబాయి దాడుల్లో కూడా ఇతడి హస్తముందని అరెస్టు చేసింది అప్పట్లో పాక్ ప్రభుత్వం. ఈ పాత్ర సినిమాలో ఎందుకనో లేదు. ఉండాల్సిన పాత్ర- ‘రా’ టార్గెట్ చేయాల్సిన పాత్ర. పార్లమెంట్ మీద దాడిని ‘రా’ అంత సులభంగా ఎలా మర్చిపోతుంది?

        ఒక యదార్థ సంఘటనని సినిమాగా తీస్తున్నప్పుడు ఆ స్క్రీన్ ప్లే- డాక్యుమెంటేషన్ లా తయారయ్యే ప్రమాదముంది. ఇదే ముంబాయి దాడుల మీద రాం గోపాల్ వర్మ 2013 లో  ‘ఎటాక్స్ ఆఫ్ 26/11’ తీసినప్పుడు, అది సగం డాక్యూ డ్రామాలాగా, మిగతా సగం తను చేసిన ఫిక్షన్ లాగా తయారయ్యింది. టీవీ ఛానెళ్ళలో అప్పట్లో లైవ్ గా ప్రపంచం యావత్తూ చూసేసిన ముంబాయి టెర్రర్ దాడుల దృశ్యాల్నే డాక్యూ డ్రామా చేసి మళ్ళీ చూపించాల్సి వచ్చింది వర్మకి. ఇక్కడ నావెల్టీ కోల్పోయాక, పట్టుబడ్డ టెర్రరిస్టు కసబ్ తో మిగతా సగం ఇష్టానుసారం కల్పన చేసి అతడికి ఉరితో ముగించాల్సి వచ్చింది. పాక్ తో స్నేహ సంబంధాలు ఎలాటివో, టెర్రరిస్టులకి నీతి పాఠాలు అలాటివే కాబట్టి, కసబ్ పాత్రకి వర్మ ఎంత చెప్పినా ప్రేక్షకులే కన్విన్స్ కాలేకపోయారు. అప్పట్లో ఆ దాడుల నేపధ్యంలో పాపులర్ డిమాండ్ ఎలా వుందంటే- ఛానెళ్ళ సాక్షిగా అంత మారణహోమం సాగించిన వాడికి ఇంకా వేరే సుదీర్ఘ విచారణగానీ, సాక్ష్యాధారాలుగానీ అవసరం లేకుండా - నేరుగా శిక్షించెయ్యాలనేది.

          వర్మ ఇది పట్టించుకోలేదు. పట్టించుకుని వుంటే- పట్టుబడ్డ కసబ్ పాత్రని బహిరంగంగా- ఇంకా కావాలంటే- బాధితుల ఇల్లిల్లూ తిప్పి- ఆ తర్వాత కాల్చి చంపేలా చిత్రణ చేసి ఉండేవాడు. సినిమా అనేది సోషల్ కామెంటే తప్ప, సోషల్ డాక్యుమెంటేషన్ కాదు. సినిమాగా తీయబోతే యదార్థ సంఘటనలు ‘కథ’ కాలేక, ‘గాథ’ గా మారిపోయే ప్రమాదముంది. పదిమంది టెర్రరిస్టులు ముంబాయిలోకి జొరబడి మారణహోమం సాగించారు, ఒక్క కసబ్బే సజీవంగా దొరికాడు, వాడి మీద విచారణ జరిపి దోషిగా తేల్చి ఉరి తీశారు- అని జరిగింది జరినట్టు చెబితే అది సినిమా ఎందుకవుతుంది? అది సినిమాకి పనికిరాని ‘గాథ’ అవుతుంది. ఇదుగో ఫలానా సంఘటన ఇలా మొదలై ఇలా కొనసాగి ఇలా ముగిసిందీ..అని స్టేట్ మెంట్ మాత్రంగా చెప్పి వదిలేసేదే గాథ. వర్మ ఈ పనే చేశారు. అలాకాక, అలా దొరికిన వాడికి ఇంకా విచారణ ఎందుకు, వెంటనే శిక్ష! - అనే ఆర్గ్యుమెంట్ ని క్రియేట్ చేసివుంటే ఇంటరెస్టింగ్ కథయ్యేది. సినిమాకి పనికొచ్చేది ఆర్గ్యుమెంట్ సహిత ఆలోచనాత్మక  యాక్టివ్ కథే తప్ప, స్టేట్ మెంట్ మాత్రమైన పాసివ్ గాథ కాదు.

***

       హాలీవుడ్ లో గాథల్ని కథలుగా మార్చేస్తారు. సమస్యలకి శాశ్వత  పరిష్కారాలు చూపిస్తారు. అందుకే అమెరికా గూఢచార సంస్థ సీఐఏ హాలీవుడ్ రచయితల్ని సంప్రదిస్తూ వుంటుంది. బిన్ లాడెన్ పట్టుబడితే అతన్నేం చేయాలన్న ధర్మ సందేహం కలిగి లారెన్స్ రైట్ అనే రచయితని సీఐఏ సంప్రదిస్తే- ఎన్ కౌంటర్ మాత్రం చేయవద్దన్నాడు రైట్. లాడెన్ దాడుల బాధితులు ఏ ఏ  దేశాల్లో వున్నారో ఆ దేశాలన్నిటా అతణ్ణి  తిప్పుతూ, ఆ బాధితులు విసిరే ప్రశ్నలకి అతను జవాబు చెప్పక తప్పని పరిస్థితి కల్పించాలి- అతను ఏ షరియా చట్టాలనైతే నమ్ముతాడో, వాటి ప్రకారమే అతడి స్వదేశం సౌదీ అరేబియాలో విచారణ జరిపించి, బహిరంగంగా అక్కడే శిర విచ్ఛేదం గావించాలి- అప్పుడే  అతడి వర్గ ప్రజలు అతణ్ణి అమరుణ్ణి చేస్తూ మరింతమంది పిల్ల లాడెన్లుగా పుట్టుకురాకుండా, శాశ్వతంగా పరిష్కారమవుతుంది సమస్య - అని సలహా ఇచ్చాడు లారెన్స్ రైట్.

          వాస్తవంలో ఇలా జరగలేదనేది వేరే సంగతి. సినిమావాళ్ళని ప్రభుత్వాలెందుకు పట్టించుకుంటాయి- ఫలానా వాణ్ణి ఎన్ కౌంటర్ చేయక పోతే వాడేమని నోరు విప్పుతాడో  తెలీదు. వాడు తామే పెంచి పోషించిన ‘పామే’ అయితే కచ్చితంగా కాటేస్తాడు. ప్రభుత్వాల బంటుగా మారిన వాడు ప్రభుత్వాల చేతిలోనే కథ ముగించుకుంటాడు.  

***

           
          వర్మలా కాకుండా కబీర్ ఖాన్ చేతిలో పూర్తి చరిత్ర లేదు. వర్మకి కసబ్ వరకే చరిత్ర. కబీర్ కి కసబ్ వెనకాల కుట్రదారులతో కలిపి పూర్తి చరిత్ర. ఈ చరిత్ర ఇంకా ముగియలేదు. ఈ చరిత్ర కుట్ర దారుల సంహారంతో సమగ్రంగా ముగియాలనే పాపులర్ డిమాండ్ వుంది. వర్మ తన కాలపు పాపులర్ డిమాండ్ ని తీర్చలేదు. కబీర్ తన కాలపు పాపులర్ డిమాండ్ ని తీర్చ బూనినప్పుడు, అది తెగింపుతో  ‘ఫాంటమ్’ కథయ్యింది. ఐతే ఇలా పూర్తికాని చరిత్రకో ముగింపు నిస్తున్నప్పుడు- అది పూర్తయిన చరిత్రలాగే భావించుకుని పప్పులో కాలేసుకుంటే, ఇలా డాక్యుమెంటేషన్ లాగే వుంటుంది సినిమా.        

          ఇదేం గాంధీ గారి చరిత్ర కాదు- అలాగే తీయడానికి. చరిత్ర హీనులు బతికే వున్నారు. వాళ్ళతో కాల్పనిక చరిత్ర చేస్తున్నప్పుడు సృజనాత్మక స్వేచ్ఛకి  సంకెళ్ళుండవు. ఆ పాత్రలతో యాక్షన్ రియాక్షన్ ల ఎలుకా- పిల్లి చెలగాటాలకి కావాల్సినంత స్కోపుంటుంది.

          1962 లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చార్లెస్ డీగాల్ మీద జరిగిన హత్యాయత్నాన్ని పురస్కరించుకుని ఫ్రెడరిక్ ఫోర్సిత్ రాసిన పాపులర్ ఇన్వెస్టిగేటివ్ నవల  ‘ది డే ఆఫ్ ది జాకాల్’, దీని ఆధారంగా ఇదే పేరుతో తీసిన సినిమా- ఒక గైడ్ లా వుంటాయి. చంపాలనుకుంటున్న కిల్లర్ చిక్కుల్లో పడకపోతే అది థ్రిల్లర్ అన్పించుకోదు. స్క్రీన్ ప్లే లో ఈ  స్వేచ్చ తీసుకోనందుకే ‘ఫాంటమ్’ వేడి పుట్టని డాక్యుమెంటేషన్ లా మారింది.           

            వేడి పుట్టకపోగా, చెప్పిన పాయింటుకి వ్యతిరేక దిశగా సాగుతుంది  స్క్రీన్ ప్లే. చెప్పిన పాయింటు - విషయం కుక్కకి కూడా పొక్క కూడదనేది ఒకటైతే, యాక్సిడెంటల్ మరణాలుగా  వుండాలని రెండో కండిషన్. వీటినే ఉల్లంఘిస్తూ కథ నడపడం ప్రేక్షకుల్ని తక్కువ అంచనా వేయడమే.

          హీరో లండన్లో సాజిద్ మీర్ నీ, చికాగోలో డేవిడ్ హెడ్లీ నీ హతమార్చాక పాకిస్తాన్ వెళ్ళే ప్రయత్నంతో మిడిల్ విభాగంలో పడుతుంది కథ.

          ఈ పాకిస్తాన్ కి వెళ్ళే వ్యూహమే తప్పుగా వుంటుంది. పై రెండు హత్యలూ చేశాకా లండన్లో పాక్ హైకమిషన్ కి హీరో ఫోన్ చేసి- వాళ్ళిద్దర్నీ చంపింది తనే అని తనకి జరిగిన అన్యాయం చెప్పుకుని, లష్కర్ తో చేతులు కలిపి ఇండియా మీద పగ దీర్చుకోవడానికే ఇలా చేశానంటాడు. తనని లష్కర్ తో కలిపి పాక్ వెళ్లేందుకు తోడ్పడాలంటాడు.  ఇలా గోప్యత గురించి  ‘రా’ బాస్ పెట్టిన కండిషన్ని తనే ఉల్లంఘిస్తాడు. తీరా సిరియా వెళ్లి లష్కర్ నాయకుణ్ణి కలుసుకుంటే అక్కడ జరిగిన దాడిలో ఆ నాయకుడు చనిపోయాక- హీరోయినే హీరోని పాక్ కి తీసికెళ్తా నంటుంది.

          ఈ పనేదో ముందే చేయొచ్చుగా? తన వెంట వున్న హీరోయిన్ దేశదేశాల్లో యుద్ధరంగాల్లో వైద్య సేవలందించే ఎన్జీవో ప్రతినిధి అయినప్పుడు- హీరో ఆమెతోనే ప్లాన్ చేసి పాక్ కి వెళ్ళ వచ్చుగా? అనవసరంగా పాక్ హైకమిషనర్ దగ్గర బండారం బయట పెట్టుకోవడమెందుకు? హీరోయిన్ తో తనే ప్లాన్ చేస్తే సిరియా వెళ్ళే పనే ఉండదుగా ? స్క్రీన్ ప్లే లో సీన్లు, బడ్జెట్లో ఆ షూటింగ్ ఖర్చులూ తప్పేవిగా?

          ఐఎస్సై కి ఎలాగూ లండన్, చికాగో మరణాలతో అనుమానాలు రావడం ఖాయం- అవెంత యాక్సిడెంటల్ మరణాలైనా. ఒక కేసుతో సంబంధం వున్న వాళ్ళు ఒకరొకరుగా యాక్సిడెంటల్ గా  మరణిస్తూంటే- మధ్యప్రదేశ్ లో దుమారం రేపుతున్న వ్యాపమ్ స్కామ్ లాగే భగ్గుమనడం ఖాయం. కాబట్టి ‘రా’ బాస్ అలా యాక్సిడెంటల్ మరణాలు గా కన్పించాలని కండిషన్ పెట్టడంలో కూడా అర్ధంలేదు. అసలు అంత రహస్యంగా చంపాలనుకోవడం ‘రా’ ఈ ప్రైవేట్ ఆపరేషన్ నిర్ణయానికి రావడానికి దారితీసిన చర్చలకే విరుద్ధం. అవతలి దేశం వాళ్ళు ఇలా తెగబడుతూంటే మనమేదో విదేశాంగ విధానమంటూ పప్పుసుద్దల్లా కూర్చుంటున్నామని  చర్చించుకున్నారు. అలాంటప్పుడు చాటు మాటుగా చంపిరావాలనుకోవడం  కూడా పిరికితనమే అవుతుంది. చంపించింది ఇండియానే  అని పాక్ ఎలా ఆరోపిస్తుంది? ఏ ఆధారాలు చూపిస్తుంది? టెర్రరిస్టుల మీద సాక్ష్యాధారాలు ఇండియా అందిస్తూంటే తను చేస్తున్నదేమిటి? కాబట్టి పాక్ కి భయపడాల్సిన పని లేదు.

          పైగా పాక్ కి వెళ్లేముందు, హీరోనే అంటాడు హీరోయిన్ తో- ‘సాజిద్ మీర్ అనే వాడే లేడని పాక్ వాదిస్తున్నప్పుడు, వాడి చావుకి ఎవర్ని ఎలా బాధ్యుల్ని చేస్తుంది?’ అని.

***
          బిగినింగ్ ని ముగిస్తూ హీరో మిడిల్లోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసే ఈ మొదటి మూలస్థంభం విషయంలో నస వుండకూడదు. ఇక్కడ హీరో పాకిస్తాన్ ఎలా వెళ్ళాలనేది ప్రాబ్లం. ఈ ప్రాబ్లం కి క్లియర్ కట్ సొల్యూషన్ లేకపోతే ఈ మొదటి మూలస్థంభం బలహీనపడి- సెకండాఫ్ లో రెండో మూలస్థంభాన్నీ,  కథ ముగింపునీ బలహీనం చేసేస్తుందని అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం.

          షార్ప్ గా ఆలోచించే గూఢచార పాత్రగా హీరోని అన్నిటా చూపిస్తున్నప్పుడు, పాక్ కి వెళ్లేందుకు  ఎన్జీవో ప్రతినిధి అయిన హీరోయిన్ తో అంతే షార్ప్ గా ముందెప్పుడో ప్లాన్ చేసుకోవచ్చు. పాక్ హైకమిషనర్ తో డొంక తిరుగుడు వ్యవహారం చేసి, మళ్ళీ హీరోయినే శరణ్యం అనేకాడికి రావడం అవివేకం.  ఒక స్క్రీన్ ప్లే ట్యూటర్  ఇంటర్నెట్ లో ఈ మొదటి మూలస్థంభం దగ్గర ఉండాల్సిన విధం గురించి, షార్ప్ టిప్ ఎలా ఇచ్చాడో చూడండి-  Don’t waste time. Never wander. Maximize script economy and get into your story quick – at the last possible moment – so you can move the story forward immediately, while always staying creative with character, world, and situation. ఇలా కాకుండా ఏం  చెయ్యాలా అని మొదటి మూలస్థంభం చుట్టూ గూఢచారి అయిన హీరో తిరుగుతూ, స్క్రీన్  టైం వేస్ట్ చేసుకుంటూంటే చూడ్డానికి బావోదు.

          ఇదే దర్శకుడు ‘భజరంగీ భాయిజాన్’ లో ఈ మూలస్థంభాన్ని  ఎంత పకడ్బందీగా, సృజనాత్మకంగా- అందులోని విశేషాలు ఎంత కొట్టొచ్చినట్టుగా ఉండేట్టు సృష్టించాడో ఆ సినిమా స్క్రీన్ ప్లే సంగతుల్లో చూశాం.

          ప్రస్తుత సినిమాలో ఈ మూల స్థంభం నిజానికి సెకండాఫ్ లో ప్రధాన నిందితుడు హరీజ్ సయీద్ ని మట్టుబెట్టేందుకు ఆక్సిజన్ని ఇచ్చేది. చరిత్ర తెలిసిన ప్రేక్షకులకి ఇతర నిందితుల చావులు అంత ముఖ్యంకాదు, ప్రధాన నిందితుడి చావే చాలా ముఖ్యం. ఈ సినిమాకి కిల్లర్ బాక్సాఫీస్ అప్పీల్ ఇదే. కాబట్టి స్క్రీన్ ప్లేకి ప్రధాన కథ ఇదే. హీరోకి మెయిన్ విలన్ ఇతనే. కనుక ఈ మెయిన్ విలన్ని మొదటి మూలస్థంభానికి ఎటాచ్ చేయకుండా, హీరో గోల్ కి ఎమోషన్ కల్పించడం ఎలా సాధ్యమవుతుంది? ఎమోషన్ లేకపోతే గోల్ ఏం బావుంటుంది?

          ఎక్కడో చావబోయే సమయంలోనే మెయిన్ విలన్ని ( హరీజ్ సయీద్ ని) ఓపెన్ చేయకుండా, ముందుగా  మొదటి మూలస్థంభం దగ్గరే  ఆడియెన్స్ కి అతణ్ణి  పరిచయం చేసి వుండాలి. కనీసం అతడి ప్రసంగాల క్లిప్పింగ్స్ చూస్తూ హీరో ఆవేశపడేట్టయినా వుండాలి. ఇంకా అవసరమైన ఎక్స్ పొజిషన్ మెయిన్ విలన్ గురించి ఇక్కడే ఇచ్చి వుంటే, అతణ్ణి చంపే సీను అంత చప్పగా వుండేది కాదు. మొదటి మూలస్థంభం దగ్గర్నుంచీ పోగుబడ్డ హీరో కసి తీర్చుకునే విధం ఇంకా బలంగా వచ్చేది. ఇదేమీ లేకపోయినా ప్రేక్షకులు మంచి రెస్పాన్సే ఇచ్చారంటే ఆ మెయిన్ విలన్ గురించి చరిత్రలో ముందే తమకి తెలిసివుండడం వల్లే. కానీ అంత సేపూ ఆ మెయిన్ విలన్ తో ఉండాల్సిన డైనమిక్స్ మిస్సయి చప్పటి కథనాన్నే చూడాల్సి వచ్చింది.

***

          ‘రా’ బాస్ పెట్టిన కండిషన్లో  యాక్సిడెంటల్ మరణాలుగా వుండాలన్నది కూడా సెకండాఫ్ లో గల్లంతయ్యింది. విడివిడిగా జకీవుర్ రెహ్మాన్, హరీజ్ సయీద్ ల చావుల్ని బహిరంగ హత్యలుగానే చేసేస్తారు హీరో హీరోయిన్లు. ఇలా సెటప్స్ అండ్ పే ఆఫ్స్ అనే ప్లాట్ టూల్స్  ‘రా’ బాస్ విషయంలోనే కాదు- హీరోయిన్ విషయంలో కూడా విఫలమయ్యింది.  

          హీరోయిన్ పాత్ర ఎంత నిర్లక్ష్యంగా వుందంటే- ఈమె జైల్లో వున్న జకీవుర్ రెహ్మాన్ ని చంపడానికి ఓ క్లినిక్ లో పనిచేసే నర్సు  బీబీజాన్ అనే పెద్దావిడని మచ్చిక చేసుకుంటుంది. ఈవిడ కొడుకుని లష్కర్ లో చేర్పించుకుని అతడి చావుకు కారకులయ్యారు టెర్రరిస్టులు. అప్పట్నించీ లష్కర్ పట్ల ద్వేషమున్న ఆమెని  జకీవుర్ ని చంపేందుకు ఒప్పిస్తుంది హీరోయిన్.  వాళ్ళ డాక్టర్ ప్రతీరోజూ జకీవుర్ కి ఇంజెక్షనివ్వడానికి జైలు కెళ్తూంటాడు. ఆ ఇంజెక్షన్ మార్చెయ్యమని చెప్తుంది హీరోయిన్. ఈ సహకారం అందిస్తే ఆమెని సురక్షితంగా ఇండియా తీసికెళ్ళి పోతామని వాగ్దానం చేస్తుంది. ఇదీ ‘సెటప్’.

          దీని ‘పే ఆఫ్’ ఎలా జరిగిందంటే- ఆవిడ మార్చేసిన ఇంజెక్షన్ తో జకీవుర్ చచ్చాడు, అప్పటికే  ఐఎస్సై కి తెలిసిపోయి ట్రేస్ చేస్తూ వచ్చేస్తున్నారు, హీరోయిన్  ఆ క్లినిక్ బయటే కాపేసింది. ఐఎస్సై వాళ్ళు క్లినిక్ లోకి వచ్చేసి ఆవిణ్ణి పట్టేసుకున్నారు- ఈ ఊహించని ఘటనకి ఆవిడ కాల్చుకుని చనిపోయింది, హీరోయిన్ మెల్లిగా అక్కడ్నించీ జారుకుంది.. ఇదీ ఆ సెటప్ కి పే ఆఫ్!

          హీరోయిన్ అక్కడ కాపేసి ఏం చేస్తున్నట్టు? జైల్లో పని జరిగిపోతే పెద్దావిడకి ప్రమాదముంటుందని తెలీదా? ఐఎస్సై వాళ్ళు  వచ్చేస్తూంటే ఆమెని తీసుకుని పారిపోకూడదా? అలా చేయలేనప్పుడు వాగ్దానం చేయడమెందుకు?  

          ఇక హీరో ర్యాలీ నిర్వహిస్తున్న హరీజ్ సయీద్ ని టార్గెట్ చేసి చంపే ఘట్టంతో మిడిల్ ముగుస్తుంది.

***

          హీరోకి యాంటీగా ఏ విలనూ లేకపోయినా, ఐఎస్సై వుంటుంది. ఐఎస్సై ఫస్టాఫ్ లో- మొదటి మూలస్థంభం దగ్గర పాక్ హైకమిషనర్ ని హీరో కెలుక్కోవడం వల్ల రంగంలో కొస్తుంది. అప్పట్నించీ ఆ సంస్థ అతడి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాలతోనే రెండో మూలస్థంభం దాకా గడిపేస్తుంది!  ఫస్టాఫ్ లో మొదటి మూలస్థంభం దగ్గర యాక్టివేట్  అయ్యే ఐఎస్సై, హీరో ఫలానా దగ్గరున్నాడని రెండో మూలస్థంభం దగ్గరికి చేరుకునే సరికే,  ఆ రెండో మూలస్థంభం దగ్గర హీరోగారు బిల్డప్ తో  మెయిన్ విలన్ ని  భూస్థాపితం చేస్తూంటాడు!!

          ప్రతీదీ లేటే. ఇందుకే ఏ డైనమిక్సూ లేకుండా పోయాయి. హీరో గోల్ కి అడ్డంకులు సృష్టించే ఒక్క విలన్ లేకపోతే  లేకపోయాడు- కనీసం  ఐఎస్సై  అయినా సకాలంలో హీరోని ట్రేస్ చేసి, అతడి ప్లాన్ ని అడుగడుగునా విఫలం చేస్తూంటే,  అప్పుడది మిడిల్ విభాగం బిజినెస్ అయ్యేది. ఈ బిజినెస్ లేకుండా మిడిల్ విభాగం ఎలా వుంటుంది?

          ఇదంతా పక్కన బెడితే,  ఇక్కడ్నించీ-  అంటే మెయిన్ విలన్ చచ్చాక ముగిసిన మిడిల్ విభాగం దగ్గర్నుంచీ - ఎండ్ విభాగంలో ఒక ఇంటరెస్టింగ్ ప్లే తెరపై కొస్తుంది  స్క్రీన్ ప్లే టెక్నిక్ పరంగా. అది డబుల్ క్లయిమాక్స్ ధమాకా!

          సాధారణంగా కథలకి ఒకే క్లయిమాక్స్ వుంటుంది. అది స్టోరీ క్లయిమాక్స్ కావొచ్చు, లేదా ప్లాట్ క్లయిమాక్స్ కావొచ్చు. ఎక్కువగా స్టోరీ క్లయిమాక్స్ తోనే వుంటాయి కథలు. ప్లాట్ క్లయిమాక్స్ కెళితే యాంటీ క్లయిమాక్సులు వస్తాయి కాబట్టి.  కె. బాలచందర్ తీసిన ‘మరోచరిత్ర’ అలాటి ప్లాట్ క్లయిమాక్స్ వున్న కథ. ‘మరోచరిత్ర’ లో స్టోరీ క్లయిమాక్స్ - ప్రేమికులిద్దరూ ఏడాది ఎడబాటు తరవాత కుడా ఇంతే బలంగా ప్రేమల్ని కలిగి వుంటే అప్పుడు పెళ్లి చేస్తామన్న పెద్దల మాట ఆధారంగా పుడుతుంది. ఇది మొదటి మూలస్థంభం దగ్గర ఎస్టాబ్లిష్ అవుతుంది (ఎక్కడైనా స్టోరీ క్లయిమాక్స్- లేదా పాయింట్ అనేది ముందే ఎష్టాబిష్ చేసి కథ నడుపుతారు). కాబట్టి ఈ కథ ముగింపు ఊహించేదే.  ప్రేమికులు ఈ పరీక్ష నెనగ్గకుండా ఉంటారా- కాకపోతే ఎన్ని అవాంతరాలు ఎదుర్కొంటారో అన్న సస్పెన్సే కథని డ్రైవ్ చేస్తుంది.

          కానీ ఆ ప్రేమికులు పరీక్ష నెగ్గలేకపోతారు. కారణం- ఆ స్టోరీ క్లయిమాక్స్ ని క్యాన్సిల్ చేస్తూ ప్లాట్ క్లయిమాక్స్ ముందుకొచ్చేసింది. ఈ ప్లాట్ క్లయిమాక్స్ అంతసేపూ కథనం లోంచి పు ట్టింది. ఆ కథనం లో హీరో ఒకడికి, హీరోయిన్ మరొకడికీ శత్రువులయ్యారు- దీని పే - ఆఫ్ గానే  అలా శత్రువుల చేతిలో చనిపోయారు. ఇదీ ప్లాట్ క్లయిమాక్స్ అంటే.

          ఇలా కథలకి ఏదో ఒక క్లయిమాక్స్ మాత్రమే ఉంటుందని పైన అనుకున్నాం కదా? ఇప్పుడు ప్రస్తుత సినిమాలో రెండూ వున్నాయి- స్టోరీ క్లయిమాక్స్, ప్లాట్ క్లయిమాక్స్!

          26/11 కుట్ర దారుల్ని చంపదమన్నది స్టోరీ క్లయిమాక్స్. ఇది మిడిల్ ముగింపులో హరీజ్ సయీద్ ని చంపడంతో పూర్తయ్యింది. దీంతో కథ పూర్తయినట్టే. ఇంకో రెండు నిమిషాలు సమప్ చేసి ముగించేస్తారు సాధారణంగా. కానీ ఇక్కడ పొడిగించారు. ఎండ్ విభాగమంతా ప్లాట్ క్లయిమాక్స్ కి కేటాయించారు. హీరో విలన్లందర్నీ చంపేసినా, కథాక్రమంలో ఐఎస్సై అనే శత్రువుని వెంట తగిలించుకున్నాడు. కాబట్టి ఆ కథనం పూర్తి కాలేదు. ఆ కథనం తో ఎండ్ విభాగం మొదలవుతుంది. ఐఎస్సై ని తప్పించుకుని హీరో హీరోయిన్లు స్వదేశం ఎలా పారిపోయి వచ్చారనేది ప్లాట్ క్లయిమాక్స్ గా వుంటుంది. ‘మరో చరిత్ర’ విషయంలో అనుకున్నట్టే -ఏముందిలే ఎలాగో తప్పించుకొచ్చేస్తారు- అనుకుంటాం. కానీ ప్లాట్ క్లయిమాక్స్ ఎప్పుడూ యాంటీ క్లయిమాక్స్ కే దారి తీస్తుందని మరువకూడదు. ఇక్కడా ఇదే జరుగుతుంది.

          ఇందుకే ఈ సినిమా ముగింపు హృదయాల్ని బరువెక్కిస్తుంది. బహుశా ఇదే బరువు స్టోరీ క్లయిమాక్స్ కి కూడా పెడితే, అదీ ఇదీ కలిసి ప్రేక్షకులకి హెవీ అయిపోతాయని తలచారేమో తెలీదు. ఇందుకే హరీజ్ సయీద్ మరణానికి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వలేదేమో తెలీదు. ‘బొబ్బిలి పులి’ లో కూడా డాక్టర్ దాసరి నారాయణరావు, సినిమా  క్లయిమాక్స్ వరకూ  సీను కొక్క డైలాగు మాత్రమే తేలికగా ఉండేట్టు చూసి, ప్రధానమైన క్లయిమాక్స్ లో అవసరమైన హెవీ డైలాగులన్నీ పేల్చేశారు.

          మొత్తానికి  ‘ఫాంటమ్’ అనే  సెమీ- రియలిస్టిక్ కాల్పనిక చరిత్ర,  కథా కథనాలపరంగా పడుతూ లేస్తూ ఇలా బాక్సాఫీసు గట్టెక్క గల్గిందెలాగో!


సికిందర్

         

         

         
         





.




40 కోట్ల కథ!

కిక్-2 రివ్యూ తరువాయి భాగం
          ‘కిక్-2’ కీ,  ‘జోకర్’ కీ  ఈ పోలికలు కాకతాళీయమనైతే అన్పించవు. రెండిటికీ మాతృక హాలీవుడ్ లో నైతే లేదు. శిరీష్ కుందర్ విఫలమైన ఒరిజినల్ అయిడియానే ‘జోకర్’. ఈ విఫలమైన ఐడియా ‘కిక్-2’ కి బ్యాక్ డ్రాప్ గా దర్శనమివ్వడమే విచిత్రం.     
          ‘కిక్- 2’ ఫస్టాఫంతా బాధితులుగా వున్న బీహార్ గ్రామస్తులు, హీరోని అక్కడికి  రప్పించుకునే ప్రయత్నాలతో గడిపాక- ఇక హీరోయిన్ కోసం హీరో వచ్చేస్తున్నాడని ఇంటర్వెల్ ఘట్టం లో తెలిశాక- అతడికి విషయం చెప్పకుండా విలన్ తో ఎలా లాడాయి పెట్టాలో మాట్లాడుకునే ప్లానుతో ఇంటర్వెల్ పడుతుంది.

          పై పేరాలో విషయం మిడిల్ విభాగం బిజినెస్సే.  ఫస్టాఫ్ లో హీరో ఇక్కడ ల్యాండ్ పని ముగించుకుని యూఎస్ కి తిరుగు ప్రయాణ మవుతున్నప్పుడు, హీరోయిన్ మీద ప్రేమని గుర్తించి వెనుదిరగడంతో-  బిగినింగ్ ముగిసిపోయి మిడిల్లో పడినట్టే కథ.  ఈ క్రమంలో ఇక్కడ్నించీ ఇంటర్వెల్ సీనులో  గ్రామస్తులు ప్లాన్ మాటాడుకోవడం వరకూ అదంతా మిడిల్ బిజినెస్ అయిన సమస్యతో సంఘర్షణ లో భాగమే- ఆ ఇంటర్వెల్ ఘట్టంలో పసలేకపోయినా.

          ఇలా ఫస్టాఫ్ అంతా స్ట్రక్చర్ లోనే  ఉంటూ సాఫీగా సాగాక- ఇంటర్వెల్ తర్వాత నుంచీ మొదలవుతుంది పరమ గందరగోళం.  ఇంటర్వెల్ కి ముందు మొదలైన మిడిల్ ఇంటర్వెల్ తర్వాత కంటిన్యూ కాదు (చిత్ర పటం  చూడండి).  మళ్ళీ బిగినింగే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ్నించీ సరీగ్గా 45 నిమిషాల వరకూ గ్రామస్తులు రకరకాల వేషాలు కట్టి  హీరోకి విషయం బయట పడకుండా- ‘జోకర్ స్టయిల్లో చేసే మ్యాడ్ కామెడీ తో నిండిపోతుంది.  సమస్య చెప్పకుండా హీరోకి విలన్ తో లడాయి పెట్టడానికి రెండు మూడు ఎత్తుగడలు వేస్తారు, విఫలమయ్యే ఆ ఎత్తుగడలూ బలహీనమే.  ఈ కామెడీతో గ్రామస్తులే యాక్టివ్ గా వుంటారు, విషయం  తెలీని హీరో పాసివ్ గా మారిపోతాడు.



          ఫస్టాఫంతా ఆవులిస్తే పేగులు లెక్కెట్టి మనుషులతో ఆడుకునే హీరో కాస్తా, ఇప్పుడు నోట్లో వేలు పెట్టినా కొరకని అమాయకుడిలా మనుషుల చేతుల్లో ఆటబొమ్మై పోతాడు.

          ఈ 45 నిమిషాల కథా ఎందుకు ఆడియెన్స్ కి  బోరు కొట్టిందంటే, మిడిల్లో పడ్డాక అంతవరకూ నడిచే కథనం మిడిల్ విభాగం స్ట్రక్చర్ కాకపోవడం వల్ల. కథనం యూ టర్న్ తీసుకుని బిగినింగ్ కి వెళ్ళడం వల్ల. మిడిల్ విభాగం స్ట్రక్చర్ లో, సమస్య తెలుసుకున్న హీరో దాంతో సంఘర్షిస్తూ ఉంటాడు నిజానికి . కాబట్టి సినిమా సెకండాఫ్ లో ఈ మేరా స్ట్రక్చర్లో వున్నది మిడిల్ విభాగం బిజినెస్ కాదు- పక్కా బిగినింగ్ బిజినెస్సే!!

          ఎలాగంటే,  స్ట్రక్చర్ ప్రకారం బిగినింగ్ బిజినెస్ లో అప్పుడప్పుడే హీరో యాక్టివేట్ కాడు.  అదింకా కథా పరిచయ విభాగమే కాబట్టి, ఇతర పాత్రల కామెడీతోనో,  తన సరదాలతోనో గడుపుతూ- ఆ బిగినింగ్ ముగింపులో సమస్యలో పడ్డాక మాత్రమే దాంతో  సంఘర్షిస్తూ మిడిల్ ని ప్రారంభిస్తాడు కాబట్టి. ఈ స్వభావమే ఇక్కడి కథనంలో జొరబడింది.

          బిగినింగ్ విభాగంలో హీరో పాసివ్ గా ఉండొచ్చు కథని బట్టి. కానీ సమస్యలో పడ్డాక మిడిల్లో యాక్టివ్ కాకపోతే అది ఆర్ట్ సినిమా అవుతుంది.

          ఇలా ఫస్టాఫ్ లోనే  మిడిల్ లో పడ్డ కథ,  సెకండాఫ్ ప్రారంభం కాగానే మళ్ళీ ఇంకో  45 నిమిషాలూ బిగినింగ్ బిజినెస్ తోనే  సాగడంతో - రెండు బిగినింగ్ ల మధ్య ఇరుక్కున్న మిడిల్ తో ఇది శాండ్ విచ్  స్క్రీన్ ప్లే కూడా అయ్యింది.

          ఏ రైటర్ కైనా, డైరెక్టర్ కైనా, ప్రొడ్యూసర్ కైనా బిగ్ స్టార్ అంటే తమని కాపాడేవాడు. ఫాలో ది లక్కీ మాన్ అని బిగ్ స్టార్స్ వెంట ఎందుకు పడతారు? అలాంటిది ఆ స్టార్ పాత్ర స్క్రిప్టులో కుదేలు అవుతోంటే కూడా చూసుకోకపోతే అప్పుడది ఫాలో ది లక్కీ స్టార్ కాదు, కిల్ ది లక్కీ స్టార్ అయిపోతుంది.

***
‘కిక్- 2’  స్క్రీన్ ప్లే తీరు ! 

          ఈ 45 నిమిషాల నేపధ్య వాతావరణాన్ని అలాగే వుంచి, దీనికి మిడిల్ స్వభావాన్ని ఆపాదిస్తూ శాండ్ విచ్ అవకుండా కాపాడుకోవచ్చు. కానీ అలా జరగలేదు. గ్రామస్తులు హీరోకి తెలీకుండా విలన్ తో లడాయి పెట్టించాలని చేసే అన్ని ప్రయత్నాలూ విఫలమవడమనే బిగినింగ్ బిజినెస్ స్వభావం నుంచి మిడిల్ బిజినెస్ కి మరల్చాలంటే, వాళ్ళు చేసే ఆ ఒక్క ప్రయత్నంతోనే సక్సెస్ అయిపోవాలి. ‘షోలే’ లో హీరోలని గ్రామానికి తీసుకొచ్చిన ఠాకూర్ ఆ ఒక్కరాత్రే వాళ్ళకి తెలీకుండా వాళ్ళ మీదికి వస్తాదుల్ని ఎగదోసి, వాళ్ళ శక్తి సామర్ధ్యాలని పరీక్షిస్తాడు. అంతేగానీ కామెడీగా ఉంటుందని అదేపనిగా ఆ పరీక్షలు పెడుతూ కూర్చోడు.

          హీరోని గ్రామానికి రప్పించడానికి అంత మాస్టర్ ప్లాన్ వేసి సక్సెస్ అయిన వాళ్ళు. విలన్ తో లడాయి పెట్టడం లో తుస్సు మనడమేమిటి? మొదటి ప్రయత్నం లోనే సక్సెస్ అయి వుంటే, అది వాళ్ళ ఎత్తుగడేనని వెంటనే హీరో తెలుసుకుంటే, అతనలా యాక్టివ్ పాత్రగానే మిడిల్ ని నడిపేవాడు. ఎప్పుడైతే పాత్రని వదిలేసి కథని పట్టుకుని ప్రయాణిస్తారో అప్పుడా కథకీ ఓ దిక్కూ దిశా వుండదు, పాత్రకీ చీమూ నెత్తురూ వుండవు.

***
          అయితే  ఈ 45 నిమిషాల సమస్య కి గోల్ పరంగా హీరో పాత్రకున్న అడ్డంకిని మాత్రం తొలగించలేం. ఏం చేసినా హీరో గోల్ కృతకంగానే వుంటుంది. హీరోయిన్ గోల్ తనకి ఎమోషన్ వున్న గోల్ గా హీరో మార్చుకోవడం సాధ్యం కాదు. ఈ కథలో హీరోయిన్ హీరో భార్య కూడా కాదు, పోనీ ఆమె చనిపోను కూడా లేదు. ‘ఊసరవెల్లి’ లో ఎలాగైతే హీరోయిన్ గోల్ ని తన గోల్ అనుకుని సెకెండ్ హేండ్ పోరాటం ఎలా చేహాడో-  అదే జరగక తప్పదిక్కడ.

          ‘ఊసరవెల్లి’  విదేశీ సినిమా ‘వెంజెన్స్’కి కాపీ అని తెలిసిందే. అందులో గోల్ హీరోదే. అతడి కుటుంబాన్నీ విలన్స్ హతమార్చారు. కాబట్టి వాళ్ళని చంపాలన్న అతడి గోల్ కి అన్ని ఎమోషన్సూ వున్నాయి. ఈ హీరో పాత్రని ‘ఊసరవెల్లి’ లో హీరోయిన్ పాత్రగా మార్చేసి హీరో ని ఆమె కిరాయి మనిషిగా మార్చేశారు. అలాగే  ‘జోకర్’ లో తండ్రి రోగాన పడ్డాడనుకుని ఆ వూరొచ్చిన హీరో - అది నాటకమని తెలుసుకుని, అతడి అసలు గొడవ పట్టించుకుని- తన స్వగ్రామం ఉనికిని ప్రపంచానికి తెలియజేసే గోల్ తో, అమెరికాలో చేస్తున్న పరిశోధనని ఇక్కడే చేస్తాడు. ఇలా ఇక్కడ సమస్యతో హీరో గోల్  కి సంబంధం నేరుగా వుంది.

          ‘కిక్ -2’ లో దీన్ని తెచ్చి, ‘ఊసరవెల్లి’ లో లాగే - హీరోయిన్ గోల్ గా మార్చేసి హీరోని పోరాడామన్నారు. ఇలా ఈ రెండు సినిమాలతో ఎన్టీఆర్- రవితేజా ఇద్దరూ ఒకే దర్శకుడి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించినట్టయ్యింది. అంత పెద్ద స్టార్లేమిటి, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడమేమిటీ అంటే - అదే మరి సురేంద్ర రెడ్డి గిమ్మిక్కు!

          ఇలా సెకెండావ్ కి విలువలేకుండా పోయాక, బడ్జెట్ లో సగం వృధా అయినట్టే. బడెట్లో సగమే వసూళ్లు వచ్చాయని రిపోర్టులు వస్తూండడం ఇందుకే.

సికిందర్