రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, November 28, 2023

1386 : బాక్సాఫీసు సమాచారం


వంబర్ లో  స్మాల్, మీడియం రేంజి సినిమాలకి పూర్తి ఓపెన్ మార్కెట్ లభించింది. నవంబర్ లో ఒకే ఒక్క పెద్ద సినిమా విడుదల కావడంతో ఈ అరుదైన అవకాశం లభించింది స్మాల్, మీడియం రేంజి మూవీస్ కి. ఆ పెద్ద సినిమా నవంబర్ చివరి వారంలో విడుదలైన ఆది కేశవ. విడుదలైన 20 స్మాల్, మీడియం రేంజి సినిమాల్లో 16 స్మాల్ కాగా, 4 మీడియం. కొత్త వాళ్ళతో 16 స్మాల్ సినిమాలన్నీ సహజంగానే ఫ్లాపయ్యాయి. ఇవి ఫ్లాప్ అని స్క్రిప్టుకి శ్రీకారం చుట్టినప్పుడే తెలిసిపోతుంది. ప్రతీనెలా ఇవి చాలా కమిట్ మెంటుతో ఫ్లాపవ్వాలని ప్రయత్నిస్తూంటాయి. 4 మీడియం రేంజిలో ఒకటి హిట్టవుతూ అవుతూ ఆగిపోయింది. మిగిలిన 3 హిట్టయ్యాయి. ఇక ఒకే ఒక్క పెద్ద సినిమా అట్టర్ ఫ్లాపయ్యింది. అది విష్ణు తేజ్ తో సితారా ఎంటర్ టైంమెంట్స్ నిర్మించిన ఆది కేశవ. ఇది దారితప్పి 2023 లో వచ్చింది. అలాగే ఫ్లాపయిన మీడియం మూవీ మంగళవారం’. హిట్టయిన మీడియం సినిమాలు కీడా కోలా’, మా ఊరి పొలిమేర 2’, కోట బొమ్మాళి పి ఎస్- నవంబర్ లో హిట్టయినవి ఈ మూడు మీడియం రేంజి సినిమాలే. ఎందుకు హిట్టయ్యాయి?

       
 కీడా కోలా తొలి తెలంగాణా గ్యాంగ్ స్టర్ సినిమా. కొంత కాలం క్రితం భారీ స్థాయిలో తెలంగాణ గ్యాంగ్ స్టర్ సినిమా తెలపెట్టాడు ఓ తెలంగాణ సినిమా తీసిన తెలంగాణ దర్శకు డు. అది ముందుకెళ్ళలేదు. దాని స్థానంలో తొలి తెలంగాణ గ్యాంగ్ స్టర్ సినిమాగా కీడాకోలా విడుదలైంది. తరుణ్ భాస్కర్ నటిస్తూ దర్శకత్వం వహించాడు. గ్యాంగ్ స్టర్ సినిమాలు చాలా వస్తూంటాయి. విచిత్ర పాత్రలతో గ్యాంగ్ సినిమాగా రావడం దీని ప్రత్యేకత. విచిత్ర పాత్రలు, వింత కథనాలు. దీనికి కామెడీ జోడిస్తే ఒక డిఫరెంట్ క్రైమ్ కామెడీ అయిపోయింది. ఇలా వొక ఔటాఫ్ బాక్స్ సినిమాని ఆదరించారు ప్రేక్షకులు.
        
మా ఊరి పొలిమేర 2 చేతబడి కథతో సినిమా. మా ఊరి పొలిమేర 1 ఓటీటీలో విడుదలై హిట్టవడంతో, ‘2’ కూడా తీస్తే హిట్టయ్యింది. దీనికి దర్శకుడు అనిల్ విశ్వనాథ్.  మసూద’, విరూపాక్ష చేతబడి సినిమాలని హిట్ చేసిన ప్రేక్షకులు దీన్నీ హిట్ చేశారు. రూరల్ థ్రిల్లర్స్ విషయానికొస్తే, చేతబడి సినిమాలు, గ్రామదేవతల సినిమాలు హిట్టవుతున్నాయి. దెయ్యాలతో హార్రర్ సినిమాలు పాతబడిపోయిన చోట ఇలాటివి సక్సెస్ అవుతున్నాయి. అంటే ఫియర్ ఫ్యాక్టర్ ఎప్పుడూ వర్కౌటయ్యే ఫార్ములా. కాకపోతే జానర్ మార్చాలి. ఇదే జరిగింది మా ఊరి పొలిమేర రెండు భాగాలతో.
       
కోట బొమ్మాళి పిఎస్ పోలీసు థ్రిల్లర్. పోలీసుల్ని పోలీసులు పట్టుకోవడమే కథ కావడంతో ఇదో కొత్తదనం. శ్రీకాంత్ నటించిన ఈ థ్రిల్లర్ కి దర్శకుడు తేజ మార్ని. ఈ మలయాళ రీమేక్ లో ఇంకా ఎన్నికల రాజకీయాల, కుల సంఘర్షణల కోణాలు జతపడడంతో సామాజికంగా ప్రేక్షకులకి దగ్గరగా వెళ్లింది. మూస ఫార్ములాకి భిన్నంగా ఇది రియలిస్టిక్ జానర్ కావడంతో మార్పుని కోరుకుంటున్న ప్రేక్షకులు దీన్ని హిట్ చేశారు. ఇది కూడా ఔటాఫ్ బాక్స్ సినిమానే.
        
అంటే ఒకప్పుడు అసాధారణ కథలతో ఔటాఫ్ బాక్స్ సినిమాలు తీయడానికి భయపడ్డ నిర్మాతలకి ఈ సినిమాల రిజల్టుతో ప్రేక్షకుల గ్రీన్ సిగ్నల్ లభించినట్టే. కీడా కోలా’, కోటబొమ్మాళి పిఎస్ రెండూ ఔటాఫ్ బాక్స్ సినిమాలే. ఇలా ఈ రెండు ఔటాఫ్ బాక్సులు, ఒకటి దెయ్యాలకి బదులు చేతబడి ప్రేక్షకులకి కొత్తదనాన్ని అందించి హిట్టయ్యాయి.
        
ఇక మంగళవారం. ఇది కూడా ఔటాఫ్ బాక్సే. బంపర్ ఓపెనింగ్స్ వచ్చాయి. కాకపోతే ఓవర్ బడ్జెట్ ని అందుకోలేక ఆగిపోయింది. 7-8 కోట్లలో తీయాలిన సినిమా 12 కోట్లకి పెంచారు. అజయ్ భూపతి దర్శకత్వంలో ట్రెండింగ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ నటించిన ఈ మూవీ నింఫోమేనియాక్ పాత్ర కథ. ఇలాటిది తెలుగులో ఇంతవరకూ రాలేదు. దీనికి గ్రామదేవత కథ జోడించారు. కాంతారా హిట్టయినప్పట్నుంచీ గ్రామ దేవతలు సినిమాల్లోకి వచ్చేస్తున్నారు. దీన్ని లాజికల్ సస్పెన్సు తో క్రైమ్ థ్రిల్లర్ గా బాగానే తీశారు. రివ్యూలు కూడా ప్రోత్సాహకరంగా వచ్చాయి. అయితే ప్రేక్షకులు మోయలేనంత ఓవర్ బడ్జెట్టయి పోయింది. ఔటాఫ్ బాక్సుకి ఇంత బడ్జెట్ అవసరం లేదని ఇది చెప్తుంది.
        
ఆదికేశవ టైటిల్ తో సహా 1990 లలో రావాల్సిన సినిమా. దర్శకుడితో సహా దారితప్పి 2023 లో వచ్చింది. వస్తే వచ్చింది, దీన్ని ఫన్నీ యాక్షన్ థ్రిల్లర్ గా తీసినా బావుండేది. దర్శకుడు ఎన్. శ్రీకాంత్ రెడ్డి అంత శ్రమ తీసుకోదల్చుకోలేదు. కొత్త స్టార్ వైష్ణవ్ తేజ్, డాన్సింగ్ స్టార్ శ్రీలీలలు వుండగా పాత సీమ ఫ్యాక్షన్ కథకే కొత్త శోభ వచ్చేస్తుందనుకుని చుట్టి పారేశాడు. ప్రేక్షకుల్ని తేలిగ్గా తీసుకుని ఇలాటి పాత మూస సినిమాలు తీస్తే పరిణామాలు తీవ్రంగా వుంటాయని ఈ సినిమా తీర్పు చెప్పింది. ఈ పెద్ద సినిమా టీజర్ చూసే ప్రేక్షకులు పసిగట్టేసి కామెంట్లు పెట్టారు. ఈ భారీ ఫ్లాపు అగ్ర నిర్మాతల రాంగ్ ప్రొడక్షన్.
—సికిందర్
       

 

 

 

Monday, November 27, 2023

1385 : కొత్త సమాచారం


 

        పెద్ద బ్యానర్‌ల నుంచి  వెలువడే సూపర్ స్టార్ సినిమాలు చూడడానికి ఒక వారం లేదా అంతకు తక్కువ రోజుల ముందు అడ్వాన్స్ బుకింగుల కోసం ఇంకెంత మాత్రం వేచి చూడాల్సిన అవసరం లేదు. ఒక నెల ముందుగానే కొనుగోలు చేయవచ్చు, కొన్నిసార్లు ఆరు వారాల ముందు కూడా. ఇది కొత్త ట్రెండ్. ఇది బెడిసి కొట్టిన సందర్భాలూ లేకపోలేదు. ఉదాహరణకి ప్రభాస్ నటిస్తున్న సాలార్ కి అమెరికాలో ఆరు వారాల ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించి, తర్వాత క్యాన్సిల్ చేసిన విషయం తెలిసిందే.కారణం ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు  పూర్తి కాకపోవడమే. ఫలితంగా అడ్వాన్స్ బుకింగులతో వసూలైన మొత్తం 400 k డాలర్లు (రూ. 3,33,25,900) వెనక్కి ఇచ్చారు. సెప్టెంబర్ 28 విడుదల తేదీగా ప్రకటించి ఆగస్టులో అడ్వాన్స్ బుకింగులు ప్రారంభించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో విడుదల జనవరికి వాయిదా వేశారు. ఇలా సూపర్ అడ్వాన్స్ బుకింగుల స్కీము బెడిసికొట్టింది.


        ప్పుడు అమల్లో వున్న వాక్-ఇన్‌ బుకింగ్స్, లేదా కౌంటర్ బుకింగ్స్, లేదా రెగ్యులర్ అడ్వాన్స్ బుకింగ్స్ వంటి మార్కెటింగ్ టూల్స్ వున్నప్పటికీ, నిర్మాతలు తమ సినిమాల పట్ల మరింత బజ్ క్రియేట్ చేయడానికి సూపర్ అడ్వాన్స్ బుకింగుల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే కచ్చితంగా ప్రకటించిన తేదీకి సినిమా విడుదల చేయగలిగితేనే దీన్ని చేపట్టాలి. ఈ కమిట్ మెంట్ తప్పితే ఇతర నిర్మాతల సినిమాల విషయంలో కూడా విశ్వసనీయత దెబ్బ తింటుంది. మొత్తానికే ఈ కొత్త మార్కెటింగ్ టూల్ మూలన బడుతుంది.

        
నెల ముందు, అరు వారాల ముందు, సూపర్ అడ్వాన్స్ బుకింగులు ఓపెన్ చేస్తే మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లలో దాదాపు 30-40 శాతం ముందుగానే రాబట్టుకునే అవకాశముంటుంది. సూపర్ అడ్వాన్స్ బుకింగ్‌లు ఓ ప్రధాన  ట్రెండ్‌గా మారబోతున్నాయి. సినిమాపై ప్రేక్షకుల ఆసక్తిని అంచనా వేయడానికి నిర్మాతలు, థియేటర్ల యజమానులు ఇద్దరికీ ఇది ఉపయోగకరమైన టూల్ కాగలదు. ప్రేక్షకులు అత్యధిక ఆసక్తితో ఎదురుచూసే సినిమాలకి, వాటి అడ్వాన్సు బుకింగ్స్ కీ మధ్య బలమైన సంబంధం వుంది. పెద్ద సినిమాల విషయంలో అడ్వాన్స్ బుకింగ్స్ ని  చాలా ముందుగానే తెరవడం చాలా ప్రయోజనకరంగా వుంటుందని, ఇలా అడ్వాన్సు రెస్పాన్స్ ఆధారంగా షో షెడ్యూళ్ళని సర్దుబాటు చేయడానికి కూడా వీలవుతుందనీ మల్టీప్లెక్స్ యాజమాన్యాలే చెప్తున్నాయి.

       
ఇంత ముందుగా టికెట్స్ ని బుక్ మై షో
, పేటీఎం వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.సమయంలో కౌంటర్ బుకింగ్స్ అందుబాటులో వుండవు. సూపర్ అడ్వాన్స్ బుకింగ్ తేదీల్ని నిర్మాతలు, సినిమా థియేటర్ యజమానులు నిర్ణయిస్తారు. సోషల్ మీడియాలో - ముఖ్యంగా ట్విట్టర్ లో, ఇన్‌స్టాగ్రామ్‌లో- నిర్మాతలు, స్టార్లు ప్రమోషన్లు చేస్తారు. ఈ డిజిటల్ ప్రచారానికయ్యే ఖర్చు మొత్తం మార్కెటింగ్ బడ్జెట్‌లో 25 శాతం వుంటుంది. భారీ బజ్ క్రియేటయిన సినిమాల సూపర్ బుకింగ్‌లు ప్రారంభ వారాంతంలో 35-40 శాతం వరకూ వుండొచ్చు.
        
ఉదాహరణకి, ఈ బుకింగ్ మోడల్లో అవతార్: ది వే ఆఫ్ వాటర్, పఠాన్’, జవాన్ వంటి సినిమాల సూపర్ అడ్వాన్స్ బుకింగ్‌లు వాటి బాక్సాఫీసు కలెక్షన్స్ కి గణనీయంగా దోహదపడ్డాయి, ఆదాయం రూ. 35-40 కోట్లకు చేరుకుందంటే ఈ టూల్ ఎంత బలమైనదో గమనించ వచ్చు. ఇలా బలమైన సూపర్ అడ్వాన్స్ బుకింగ్‌లు నిర్దిష్ట సినిమాల చుట్టూ పాజిటివ్ హైప్ ని, అంచనాలనీ సృష్టిస్తాయి. ప్రేక్షకుల్లో ఉత్సాహాన్నీ  నింపుతాయి. అక్టోబర్‌లో విడుదలైన తమిళ హిట్ లియో విషయంలో, విక్రయించిన మొత్తం టిక్కెట్లలో రెగ్యులర్ అడ్వాన్స్ బుకింగ్స్ 30 శాతంగా వున్నాయి. ఇదే నెల, నెలన్నర ముందు సూపర్ బుకింగ్స్ తెరిచి వుంటే, ఇంకా ముందుగానే నిర్మాతల జేబులో ఈ మొత్తాలు పడేవి.

        
ఖచ్చితంగా చెప్పాలంటే, రెగ్యులర్ అడ్వాన్స్ బుకింగ్‌లు, సూపర్ అడ్వాన్సు బుకింగులు ముఖ్యంగా సినిమా వీరాభిమానుల్ని బలంగా ఆకర్షిస్తాయి. అధికంగా యువత, సాంకేతిక పరిజ్ఞానమున్న ఇతరులూ- ముఖ్యంగా సూపర్ హీరో ఫ్రాంచైజీలు, లేదా సీక్వెల్‌ల వంటి భారీ అంచనాలు గల సినిమాలపై ఆసక్తి కలిగి వుంటారు. దీనికి విరుద్ధంగా, కాస్త వేచి చూసే వాక్-ఇన్‌లు, రివ్యూలు చూశాకే వచ్చే ప్రేక్షకులు, మౌత్ టాక్ తెలుసుకుని వచ్చేవాళ్ళూ, అప్పటికప్పుడు సినిమా చూడాలని మూడ్ పుట్టి వచ్చే వాళ్ళూ వుంటారు. వీళ్ళ శాతమే ఎక్కువ వుంటుంది. పెరుగుతున్న ట్రెండ్‌గా, సూపర్, రెగ్యులర్ అడ్వాన్స్ బుకింగ్‌లు ముఖ్యంగా మొదటి శ్రేణి నగరాల్లో జనాదరణ పొందుతున్నాయి.
        
మధ్య, చిన్న తరహా సినిమాలకి ఆన్-ది-స్పాట్ బుకింగులే శరణ్యం. తెలుగులో తీసుకుంటే, మ్యాడ్, కీడా కోలా వంటి సినిమాలకి ఆకట్టుకునే అడ్వాన్స్ బుకింగులు లేనప్పటికీ, ఇవి బాక్సాఫీసు విజయాల్ని సాధించాయి. బుక్ మై షో ఆన్ లైన్ బుకింగ్ ప్లాట్ ఫారం ది సినీ ఫైల్స్ పేరుతో ఇటీవల ప్రారంభించిన వినియోగదారుల సర్వే నివేదిక ప్రకారం, జనరేషన్ జడ్ యువతలో, అలాగే జనరేషన్ ఎక్స్ యువతలో 74 శాతం మంది తమ అభిరుచులతో కనెక్టయ్యే సినిమాల కోసం మూడు రోజుల ముందుగానే ప్లాన్ చేసి,కన్ను వేసి వుంచుతున్నారు. మిగతా 26 శాతం మంది ఇప్పటికీ ఆ రోజుకి అనుకుని సినిమా కెళ్తున్నారు. ఇంకా, 35 శాతం జనరేషన్ జడ్ యువత ఫస్ట్ డే- ఫస్ట్ షో ఉన్మాదంతో తులతూగుతున్నారు.
       
పైన చెప్పుకున్నట్టు సూపర్ అడ్వాన్సు బుకింగులతో ఒకటే సమస్య. నెల
, నెలన్నర ముందుగానే బుకింగ్స్ తెరవాలనుకున్నప్పుడు విడుదల తేదీ పట్ల ఖచ్చితమైన నమ్మకముండాలి. పోస్ట్ ప్రొడక్షన్ వాయిదాలు పడే పరిస్థితులు లేకుండా చూసుకోవాలి. థియేటర్లూ బుక్ చేసుకుని వుండాలి. ఇవి గనుక సాధ్యమైతే బయ్యర్ల నుంచి వచ్చే అడ్వాన్సులే గాకుండా, ప్రేక్షకుల నుంచి కూడా 30-40 శాతం అడ్వాన్సుగా  వచ్చిపడతాయి.

***

Sunday, November 26, 2023

1384 : రివ్యూ


 రచన - దర్శకత్వం: తేజ మార్ని

తారాగణం : శ్రీకాంత్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్ కుమార్, రాహుల్ విజయ్, మురళీ శర్మ, పవన్ తేజ్, బెనర్జీ తదితరులు 
 సంగీతం: రంజిన్ రాజ్, ఛాయాగ్రహణం: జగదీష్ చీకటి
సహ నిర్మాతలు: భాను కిరణ్ ప్రతాప, రియాజ్
నిర్మాతలు: బన్నీ వాస్, విద్యా కొప్పినీడి  
విడుదల : నవంబర్ 24, 2023
***
కథ

    రవి (రాహుల్ విజయ్) పోలీసుద్యోగంలో చేరతాడు. అదే స్టేషన్లో కుమారి (శివానీ రాజశేఖర్) కానిస్టేబుల్ గా  పని చేస్తూంటుంది. రామకృష్ణ (శ్రీకాంత్) ఏఎస్సైగా వుంటాడు. కుమారి, రామకృష్ణలు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. రామకృష్ణ కూతురికి క్లాసికల్ డాన్స్ నేర్పిస్తూ ఆమె అందులో పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ వుంటాడు. ఒక రోజు కుమారి బంధువుఆమె సామాజిక వర్గ పార్టీ కార్యకర్త మున్నా (పవన్ తేజ్) అనే అతనుపోలీస్ స్టేషన్లో బీభత్సం సృష్టిస్తాడు. ఏఎస్సై రామకృష్ణ లాకప్ లోవేస్తే ఫోన్లు చేయించుకుని విడుదలై పోతాడు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు పోలీసులకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు.

ఇంకో రోజు
రామకృష్ణ, రవి ఓ పెళ్ళికి హాజరై బాగా తాగుతారు. జీపు డ్రైవ్ చేయడానికి రామకృష్ణ మేనల్లుడ్ని తెచ్చుకుంటాడు. అదే జీపులో కుమారి  ఎక్కుతుంది. దారి మధ్యలో యాక్సిడెంట్ జరుగుతుంది. జీపు డ్రైవ్ చేసిన రామకృష్ణ మేనల్లుడు పారిపోతాడు. ఆ యాక్సిడెంట్ లో పార్టీ కార్యకర్త చనిపోతాడు. దీంతో ఆ పార్టీ  ఆందోళన చెలరేగుతుంది.
        
ఏపీ లోని ఆ నియోజక వర్గం టెక్కలిలో ఉప ఎన్నిక వుంది. ఆ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 50 వేలు వున్నాయి.  దీన్ని దృష్టిలో పెట్టుకుని యాక్సిడెంట్ చేసిన సిబ్బందిని అరెస్ట్ చేయమని హోమ్ మంత్రి జయరామ్ (మురళీ శర్మ) ని రంగంలోకి దించుతుంది అధికార పార్టీ ప్రభుత్వం.
        
దీంతో రామకృష్ణ, రవి, కుమారి ముగ్గురూ పరార్ అవుతారు. మరోవైపు ఎన్నికల్లో పార్టీని గెలిపించడం కోసం నిందితుల్ని 48  గంటల్లో అరెస్ట్ చేస్తామని హోమ్ మంత్రి జయరాం శపథం చేస్తాడు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ఎస్పీ రజియా అలీ (వరలక్ష్మీ శరత్ కుమార్) కి ఆ బాధ్యత అప్పగిస్తాడు డిజిపి.
        
వేట మొదలవుతుంది. దొరక్కుండా ప్రదేశాలు మారుస్తూ పరారీలో వుంటారు ముగ్గురూ. ఇలా ఎక్కడిదాకా, ఎంతకాలం పరుగుదీశారురజియా అలీ టీం వాళ్ళని పట్టుకోగలిగిందామధ్యలో తలెత్తిన వూహించని పరిణామమేమిటిచేయని నేరానికి నేరస్థులుగా ముద్రపడిన పోలీసులు ముగ్గురూముఖ్యమంత్రి ఓట్ల రాజకీయానికెలా బలయ్యారు... ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

    ఇది  2011 లో కేరళలో జరిగిన ఉదంతం. నల్గురు పోలీసులు ఒక టాక్సీలో పెళ్ళికి వెళ్ళి వస్తూంటే యాక్సిడెంట్ జరిగి ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఆగ్రహం పెల్లుబికింది. ఆ నల్గురు పోలీసుల మీద ఎస్సీ/ఎస్టీ చట్టం కిందహత్య కేసు కింద అరెస్టు చేయమని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో నల్గురూ అజ్ఞాతంలో కెళ్ళిపోయి బెయిల్ కోసం ప్రయత్నించారు. 100 రోజుల తర్వాత సుప్రీం కోర్టులో బెయిలు లభించింది. ఇప్పుడు పన్నెండేళ్ళు గడిచిపోయినా కేసు ఇంకా తేలలేదనేది వేరే సంగతి.
       
ఈ ఉదంతాన్ని సినిమాకి అనుకూలంగా మార్చి 2021 లో మలయాళంలో
నాయాట్టు (వేట) తీశాడు దర్శకుడు మార్టిన్ ప్రకట్. దీన్ని తెలుగులో కోట బొమ్మాళి పిఎస్ గా రీమేక్ చేశారు. నాయాట్టు’ చూస్తే ది కథ కాదు. జీవితంలో కథలుండవుగాథలే వుంటాయి. గాథల్ని సినిమాలుగా తీస్తే ఆడవు గనుక కథగా మార్చి తీస్తారు. ఐతే గాథలా వున్న నిజ సంఘటనని అనుకోకుండా గాథగానే తీసి విజయం సాధించారు ‘నాయాట్టు’ తో. ఇదో ప్రత్యేకత.
        
అయితే ఒక సామాజికవర్గ కోణంలో చేసిన ఈ గాథ కాన్సెప్ట్ పరంగా తెలుగులోనూ డొల్లగా మారిందని చెప్పక తప్పదు. ఎత్తుకున్న కుల కోణాన్ని నిజాయితీగా చెప్పలేక అపహాస్యం చేసిన వరస కన్పిస్తుంది. గాథ అయివుండీయాంటీ క్లయిమాక్సుతో మ్యాన్ హంట్ థ్రిల్లర్ గా నిలబడిన రచనకాన్సెప్ట్ పరంగా చొరవ చూపలేక చతికిల బడిందని ఒప్పుకోవాలి.
       
మ్యాన్ హంట్ థ్రిల్లర్ జానర్ గాథగా కొన్ని లోపాలతో
 చీకటి వెలుగుల హ్యూమన్ డ్రామాగా ఇది థ్రిల్ చేసే మాట నిజమేఅయితే కాన్సెప్ట్ పరంగా అసందర్భంగా వుంది. ఒక సామాజిక వర్గపు కాన్సెప్ట్ తీసుకుని అర్ధం లేని గాథ చేశారు. అదే సామాజిక వర్గం వర్సెస్ అదే సామాజిక వర్గం వర్సెస్ అదే సామాజిక వర్గం అన్నట్టు బలాబలాల సమీకరణ చేసి పాత్రల్ని ఎడాపెడా వాడేశారు.
        
యాక్సిడెంట్ చేసి పారిపోయిన పోలీసులు ముగ్గుర్లో ఇద్దరు  రామకృష్ణ, కుమారి- ఓ సామాజిక వర్గం సభ్యులైతే, యాక్సిడెంట్ లో చనిపోయిన వాడూ అదే సామాజిక వర్గానికి చెందిన వాడు. ఇక యాక్సిడెంట్ చేసి పారిపోయిన అదే సామాజిక వర్గానికి చెందిన పోలీసుల్ని, పట్టుకోవాలని రచ్చ రచ్చ చేసేదీ అదే సామాజిక వర్గానికి చెందిన పార్టీ! ఇది చోద్యంగా లేదూ?
       
అంటే
, యాక్సిడెంట్ చేసి పారిపోయిన పోలీసుల్లో ఇద్దరు మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే కదా- మీ వాళ్ళని పట్టుకుని శిక్షించాలని అంత పట్టుదల మీకేంటయ్యా- అని హోమ్ మంత్రి ఈ గొడవని కొట్టి పారేయొచ్చు. వాళ్ళ  ఓట్ల గురించి అధికార పార్టీ ఆందోళన చెందే అవసరమే లేదు. అంటే సినిమా తీయడానికి కథే లేదు. మలయాళంలో జరిగిన ఈ పొరపాటుని తెలుగులో సరిదిద్దుకుని వుండొచ్చు. పారిపోయిన పోలీసులు వేరే సామాజిక వర్గం అంటే సరిపోయేది. బలాబలాల సమీకరణ అర్ధవంతంగా వుండేది. కేరళలో జరిగిన నిజ కేసులో పారిపోయిన పోలీసుల మీద ఎస్సీ/ ఎస్టీ కేసు పెట్టారంటే వాళ్ళు ఇదే సామాజిక వర్గం కాదని కదా?
       
ఒరిఓజినల్లో ఇంకే మార్పులు చేయకుండా
, తెలుగు మూస మసాలాలు వాడకుండా, ముగింపు కాస్త మార్చి, ఉన్నది వున్నట్టు రియలిస్టిక్ జానర్లో తీశారు. దీంతో మూస సినిమాలకి భిన్నంగా ఇది కనిపిస్తుంది. నేటి తెలుగు సినిమాల్ని మూస ఫార్ములాలు కాకుండా ఇలా రియలిస్టిక్ గా తీసినా ఆడతాయని కోట బొమ్మాళి పిఎస్ రీమేక్ ద్వారా గుర్తిస్తే మంచిదే.

నటనలు – సాంకేతికాలు


        మలయాళంలో జోజు జార్జి పాత్రని శ్రీకాంత్ పోషించాడు. అయితే ఈ ఏఎస్సై పాత్రకి గతంలో గ్రేహౌండ్స్ ఆపరేషన్స్ స్పెషలిస్టుగా పని చేశాడని అదనపు హంగు ఇచ్చారు. శ్రీకాంత్ రాజకీయాలకి బలైన ఈ పోలీసు పాత్రని సహజత్వంతో నటించాడు. తనని వేటాడే పోలీసులతో హైడ్రామా, తన వాళ్ళతో ఫ్యామిలీ డ్రామా దృశ్యాలకి బలాన్నిచ్చాడు.
       
శ్రీకాంత్ కి ఎదుటి పాత్ర వరలక్ష్మీ శరత్ కుమార్ ఎస్పీ పాత్ర. ఎత్తుకి పైయెత్తులు ఈ ఇద్దరి మధ్యే వుంటాయి. ఈ కరుడుగట్టిన పోలీసు పాత్రని పవర్ఫుల్ గా పోషించింది. కానిస్టేబుల్ గా శివానీ
, ఇంకో కానిస్టేబుల్ గా రాహుల్ విజయ్ లు బాధిత పాత్రల్ని తగు భావోద్వేగాలతో నటించారు. ఈ చదరంగపు ఆట ఆడే హోమ్ మంత్రిగా మురళీ శర్మ తన మార్కు నటనతో ఓకే.
       
కథ జరిగే శ్రీకాకుళం లొకేషన్స్
,  ఆంధ్రా- ఒరిస్సా బోర్డర్ దృశ్యాల్ని కెమెరామాన్ జగదీష్ ఒరిజినల్ మూవీకి తీసి పోనివిధంగా దృశ్యీకరించాడు. రియలిస్టిక్ జానర్ టోన్ లో, లైటింగ్ తో దృశ్యాల్ని క్యాప్చర్ చేశాడు. అలాగే రంజిన్ రాజ్ సంగీతంలో ఒక హిట్టయిన పాట, నేపథ్య సంగీతం బలంగా వున్నాయి. ఎడిటింగ్, యాక్షన్ కొరియోగ్రఫీ, కాస్ట్యూమ్స్, కళా దర్శకత్వం అన్నీ మంచి క్వాలిటీతో వున్నాయి.

చివరికేమిటి
          ఈ రీమేక్ తో దర్శకుడు తేజ మార్ని సక్సెసయ్యాడు. పోలీసు వ్యవస్థని వాడుకునే రాజకీయ వ్యవస్థ, అందులో బలయ్యే పోలీసులు, ఓటు బ్యాంకు రాజకీయాలు, ఓటర్ల పాత్ర- ఈ అంశాల్ని స్పృశిస్తూ చివర ఓ సందేశంతో మలయాళ ఒరిజినల్ని అనుసరించి మేకింగ్ చేశాడు. అయితే ఒక రాష్ట్రపు రాజకీయ -పోలీసు- ఎన్నికల వాతావరణానికి చెందిన కథ తెచ్చుకుని కృత్రిమంగా తెలుగులో అద్దేకన్నా, నేటివిటీ గల ఒరిజినల్ తెలుగు నేల కథల్ని సృష్టిస్తే వాటితో బలంగా ఫీలయ్యే అవకాశముంటుందేమో ఆలోచించాలి. 
—సికిందర్

 



Saturday, November 25, 2023

1383 : రివ్యూ


రచన- దర్శకత్వం శ్రీకాంత్ రెడ్డి ఎన్.
తారాగణం : పంజా వైష్ణవ్ తేజ్, శ్రీ లీల, అపర్ణా దాస్, సదా, రాధికా శరత్ కుమార్, జోజు జార్జి, సుమన్, జయప్రకాష్, తనికెళ్ళ భరణి తదితరులు  
సంగీతం: జి.వి.ప్రకాష్ ,ఛాయాగ్రహణం: డడ్లీ 
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
బ్యానర్స్ : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
విడుదల : నవంబర్ 24, 2023  
***

        సూపర్ హిట్  'ఉప్పెన' తో హీరోగా పరిచయమైన మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత నటించిన కొండ పొలం’, రంగ రంగ వైభవంగా రెండూ హిట్ కాలేదు. ఇప్పుడు మూడో ప్రయత్నంగా ఆదికేశవ తో పూర్తి మాస్ లుక్ తో మెప్పించే ప్రయత్నం చేస్తూ ముందు కొచ్చాడు. ఈ ప్రయత్నానికి ట్రెండింగ్ లో వున్న హీరోయిన్ శ్రీలీతోడయ్యింది. ఇంకా ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్ టైన్మెంట్స్ భరోసా లభించింది. దీనికి శ్రీకాంత్ రెడ్డి కొత్త దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. మరి ఇన్ని ఆకర్షణలున్న ఆదికేశవ అంతే ఆకర్షణీయంగా, కొత్తగా వుందా? ఈ సినిమా చూస్తే లభించే వినోదం ఎలా టిది? ఈ విషయాలు పరిశీలిద్దాం.

కథ

హైదరాబాద్ లో బాలు (వైష్ణవ్ తేజ్) ఆవారాగా తిరుగుతూంటాడు. ఎక్కడైనా అన్యాయం జరిగితే సహించడు. తీవ్రంగా కొడతాడు. తండ్రి (జయప్రకాష్)  తిడితే ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి  వెళ్తాడు. అక్కడ చిత్ర (శ్రీ లీల) ఆ మల్టీ నేషనల్ కంపెనీకి సీఈవో గా వుంటుంది. అక్కడ సెలెక్ట్ అవుతాడు. చిత్రకి  బాలు బాగా నచ్చుతాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇది ఇష్టం లేని ఆమె తండ్రి వేరే సంబంధం చూస్తున్నట్టు ప్రకటిస్తాడు. ఇంతలో రాయలసీమ నుంచి ఎమ్మెల్యే మహా కాళేశ్వర్ రెడ్డి (సుమన్), అతడి అన్న (తనికెళ్ళ భరణి) వచ్చి, బాలు తల్లిదండ్రులు (రాధిక శరత్ కుమార్, జయప్రకాష్) వీళ్ళు కాదని,  బాలు అసలు పేరు రుద్ర కాళేళ్వర రెడ్డి అనీ చెప్తారు. అతడి తండ్రి మహాకేశ్వర రెడ్డి ఓ ప్రమాదంలో చనిపోయాడనీ, ఇప్పుడు అతడి అక్క (అపర్ణా దాస్) ప్రమాదంలో వుంనీ చెప్తారు. దీంతో బాలు రాయలసీమకి ప్రయాణం కడతాడు.
       
ఇంతకీ బాలు గతం ఏమిటి
? అతడి అసలు తల్లిదండ్రులు ఎందుకు దూరం చేసుకున్నారు? ప్రమాదంలో తండ్రి ఎలా చనిపోయాడు? అక్క ఎవరితో ప్రమాదంలో వుంది? బాలు రాయలసీమ వెళ్ళి ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించుకున్నాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఇంకా ఈ రోజుల్లో ఇలాటి సీఫ్యాక్షన్ సినిమా తీయడం సాహసమే. ఇటీవల మాస్ మసాలా సినిమాలు హిట్టవుతున్నాయనీ, అందుకే తీశామనీ అనుభవమున్న నిర్మాతలు చెప్పారు. వాళ్ళ అంచనా ఎంత నిజమో బి, సి సెంటర్లలో ప్రేక్షకులే చెప్తారు. మాస్ మసాలా తీయొచ్చు. కానీ ఏనాడో వర్కౌట్ అయిన ఫ్యాక్షన్ సినిమాని ఇప్పటి మాస్ సినిమాగా తీస్తే ఎలా? అవే పాత్రలు, అవే చుట్టరికాలు, అదే కథ, అవే దృశ్యాలు, అదే టెంప్లెట్ కథనం, అవే కాలం చెల్లిన పౌరుషాలు, పోరాటాలు, నటనలు- దీన్ని బీసీ సెంటర్లలో ప్రేక్షకులైనా ఆదరిస్తారా? మాస్ మసాలా తీయడానికి ఇంకా వేరే కథలు లేవా? కొత్త దర్శకుడు వచ్చి పాత చింతకాయ అందిస్తాడా ప్రేక్షకులకి? టీజర్ రిలీజయినప్పుడే వైష్ణవ్ తేజ్ ఫ్యాన్స్, నెటిజన్స్ ఇదెలాటి సినిమానో తెలిసిపోయి ట్రోలింగ్ చేసి విలువ తీశారు కదా?
       
దర్శకుడికి కామెడీ తీయడంలో పట్టువున్నట్టు అన్పించే ఎంటర్టయిన్మెంట్ ఫస్టాఫ్ లో ఈ అరిగిపోయిన కథని మర్చిపోయేలా చేస్తుంది. సెకండాఫ్ లో కూడా ఈ అరుగుదలని మర్చిపోయేలా చేసే ఫన్నీ యాక్షన్ మూవీ తీస్తే బావుండేదేమో
? కానీ తానేమీ శ్రమపడ దల్చుకోక వచ్చిన ఫ్యాక్షన్ సినిమాల్లో నిల్వ సరుకునే సీన్లుగా పేర్చుకుంటూ పోయాడు. ఈ పాత వాసనని మర్చిపోయేలా చేయడానికి కాబోలు, విపరీత హింస జొప్పించి యాక్షన్ సీన్లు తీశాడు. క్లయిమాక్స్ లోనైతే మరీ బీభత్సం, జుగుప్స!
విద్యార్థితో స్కూల్ టీచర్ అసభ్యంగా ప్రవర్తిస్తే హీరో చెయ్యి నరికేస్తాడు. అక్కతో అసభ్యంగా ప్రవర్తించాడని ఇంకొకడ్ని దారుణంగా నరికి చంపుతాడు. ఇక విలన్నయితే చెప్పనవసరం లేదు. సినిమాలో హింస వర్కౌట్ కాలేదు, భావోద్వేగాలైతే తెచ్చి పెట్టుకున్నవి. ఫస్టాఫ్ లో కొన్ని కామెడీ సీన్లు తప్పిస్తే కొత్తదనం ఏమీ లేదు.

నటనలు- సాంకేతికాలు

వైష్ణవ్ తేజ్ కి ఇలాటి మాస్ మసాలా క్యారక్టర్ సూట్ కాదు. తను పెద్ద హీరోకాబట్టి ఒక మాస్ సినిమా కూడా చేయాలన్న ఆతృత తప్పితే, చేస్తే ఏమవుతుందన్న ఆలోచన లేదు. ఇంకా ఫ్యాక్షన్ కథతో నరకడమే మాస్ పాత్ర అనుకుంటే చేసేదేం లేదు. ఫస్టాఫ్ లో శ్రీలీలతో కామెడీ, సాంగ్స్ ఇంతవరకే తనకి సూటయ్యేది.
       
శ్రీలీల కూడా డాన్సులతో క్రేజ్ సంపాదించుకుందని
, సరైన పాత్రలేని సినిమాల్లో డాన్సులే చేస్తూ పోతే ఆ క్రేజ్ కూడా పోతుంది. మల్టీనేషనల్  కంపెనీ సీఈవో పేరుకేగానీ చేసిందేమీ లేదు. మధ్యమధ్యలో కొన్ని లవ్ సీన్స్, సాంగ్స్ తప్ప. ఇక ఫ్యాక్షన్ విలన్ గా నటించిన మలయాళ నటుడు జోజు జార్జి పూర్తిగా వృధా. వైష్ణవ్ తేజ్ కి తన వూర మాస్ పాత్ర లాగే, సాఫ్ట్ గా వుండే జోజు జార్జి కి క్రూర విలన్ పాత్రకూడా సూట్ కాలేదు. ఇక మిగతా తారాతోరణం
అపర్ణా దాస్, సదా, రాధికా శరత్ కుమార్, సుమన్, జయప్రకాష్, తనికెళ్ళ భరణి అందరికీ దక్కింది సినిమాలో చూపించిన జాతర ప్రసాదమే.     

ఈసారి ఎందుకో జివి ప్రకాష్ కుమార్ పాటలు బాగా కొట్టాడు. పాత ఫ్యాక్షన్ సినిమాకి అతను బాగా ఇన్స్పైర్ అయినట్టున్నాడు. ఈ మ్యూజిక్కి సినిమాని మాంచి యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ గా తీయాల్సింది. శ్రీలీల డాన్సులకి మాత్రం ఈ మ్యూజిక్ వుండాల్సిందే.
       
డడ్లీ ఛాయాగ్రహణం
, మిగతా ప్రొడక్షన్ విలువలూ బావున్న ఈ ఆదికేశవ కొత్త దర్శకుడికి ఆదిలోనే హంసపాదు అన్నట్టు వుండకుండా వుండాల్సింది.

—సికిందర్