రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, March 5, 2022

1141 : రివ్యూ!


 

రచన - దర్శకత్వం : బాలాజీ సయ్యపురెడ్డి
తారాగణం : కిరణ్అబ్బవరం, నువేక్ష, కోమలీ ప్రసాద్, శ్రీకాంత్అయ్యంగార్, సూర్య, రోహిణీ తదితరులు
సంగీతం: జిబ్రాన్, ఛాయాగ్రహణం : రాజ్కె. నల్లి
నిర్మాతలు: సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, ప్రమోద్, రాజు
విడుదల : మార్చి 4, 2022
***

        కిరణ్ అబ్బవరం కొత్తగా వస్తున్న యువ హీరో. రాజుగారు- రాణివారు’, ఎస్ ఆర్ కళ్యాణ మండపం లతో పరిచయమయ్యాడు. చేతినిండా సినిమాలతో బిజీగా వున్నాడు. కథలు బాగా వింటాడని, నిర్ణయాలు బాగా తీసుకుంటాడని, మేకింగ్ లో కూడా ఇన్వాల్వ్ అవుతాడని పేరుంది. ఈ నేపథ్యంతో ఇప్పుడు సెబాస్టియన్ పీసీ 524 అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందు కొచ్చాడు. ఐతే విడుదలకి ముందే ట్రైలర్ కథ మొత్తం తెలిసిపోయేలా కట్ చేశారు. ఇందులో తను ఇన్వాల్వ్ కాలేదేమో. అయితే సినిమా చూస్తే ట్రైలర్ ఎలా కట్ చేసినా ఒకటే నన్పిస్తుంది. ఈ సారి కొత్త దర్శకుడు బాలాజీ సయ్యపురెడ్డితో కిరణ్ అబ్బవరం ఆశయం నెరవేరిందా లేదా చూద్దాం...

కథ

సెబాస్టియన్ (కిరణ్ అబ్బరం )  అనే అతడికి బాల్యం నుంచీ రేచీకటి సమస్య వుంటుంది.  ఈ విషయం ఎవరికీ చెప్పనని చిన్నప్పుడే తల్లి మేరీ  (రోహిణి) కి మాటిస్తాడు. అతను కానిస్టేబుల్ అవాలని మేరీ పట్టుదల. దీంతో కంటి సమస్యని దాస్తూ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరతాడు. ఈ క్రమంలో తన సమస్య గురించి ప్రేమిస్తున్న హేలీ (నువేక్ష) కి, ఓ ఫ్రెండ్ కి, ఓ డాక్టర్ కి మాత్రమే చెప్తాడు. ఈ సమస్యతో సరిగా ఉద్యోగం చేయలేక తరచూ బదిలీ అవుతూంటాడు. అలా ఫైనల్ గా మదనపల్లి పోలీస్ స్టేషన్లో చేరి ఎస్సై (శ్రీకాంత్ అయ్యంగార్) కి  భజన చేస్తూ నైట్ డ్యూటీలు పడకుండా చూసుకుంటాడు. ఓరోజు మాత్రం నైట్ డ్యూటీ చేయాల్సి స్తుంది. అప్పుడు నీలిమ (కోమలీ ప్రసాద్) అనే  వివాహిత త్య రుగుతుంది. రేచీకటి కారణంగా ఆమెని కాపాడలేక పోతాడు. అంతేగాక హత్యాస్థలంలో హంతకులు సాక్ష్యాధారాలు మాయం చేస్తున్నా చూడలేకపోతాడు. దీంతో సస్పెండ్ అవుతాడు. ఇలా వుండగా హత్యతో తను ప్రేమిస్తున్న హేలీ కి సంబంధమున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు సస్పెండ్ అయిన సెబాస్టియన్ కేసులో ఎందుకు, ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు? ఇన్వాల్వ్ అయి తెలుసుకున్న నిజాలేమిటి? హంతకులెవరు? ఇవీ మిగతా కథలో తెలిసే విషయాలు.

ఎలా వుంది కథ


       
కామన్ సెన్స్ తో చూస్తే ఇలాటి కథ వుండేందుకు అవకాశం లేదు. ఎందుకంటే రేచీకటి (నిక్టలోపియా) ని నయం చేసే చికిత్స వుంది. ఇప్పుడు కాదు, పూర్వమెప్పట్నుంచో వుంది- ప్రాచీన కాలంలో మూలికలతో మొదలై. ఓ నాల్గు కారణాలతో రేచీకటి కంటి చూపు సమస్య వస్తుంది. ఈ నాల్గూ చికిత్స తీసుకుంటే హాంఫట్ అయిపోతాయి. ఇలా చికిత్స వుండి, రేచీకటి (చీకట్లో చూడలేని) సమస్యని తొలగించుకునే అవకాశమున్నాక, హీరోకి ఈ సమస్యని ఆపాదిస్తూ కథ చేస్తే హాస్యాస్పదంగా వుంటుంది.  హీరో గారికి ఇది కూడా తెలియదురో- కామన్ సెన్సు లేదనుకుంటారు ప్రేక్షకులు.

        ఒకవేళ ఇలాగే కథ చేయదల్చుకుంటే
, హీరోని ఇలాగే చూపించి- చివరికి బల్బు వెలిగిన ఎస్సై శ్రీకాంత్ అయ్యంగార్ చేత- రేయ్ ఫూల్
, ఇంత అజ్ఞానమేంట్రా నీకూ...నీ రేచీకటితో ఇన్ని తిప్పలు పడుతూ  కేసు సాల్వ్ చేస్తావా? రేచీకటికి చికిత్స వుందటరా - వెళ్ళి బాగు చేయించుకో ఫో - అని ఒక్కటి పీకి వుంటే, ‘ఔనా? చికిత్స వుందా?’ అని హీరో షాక్ తింటే - కామిక్ రిలీఫ్ తో బాటు, కథ ఇలా చేయడం జస్టిఫై అయి వుండేది. అయితే ఇలా చేయడానికి అసలంటూ రేచీకటి గురించి సమాచారం సేకరించి వుండాలి కథకుడు.

        ఈ పాయింటుతో హాలీవుడ్ సినిమాలు ఎందుకు రాలేదో వూహించ వచ్చు. ఇది పాయింటే కాదు గనుక. తమిళంలో రెండు వచ్చాయి - శివాజీ గణేశన్ - కెఆర్ విజయ లతో
తవపుదువలన్ (1972) అనే డ్రామా; సిక్సర్  అనే రోమాంటిక్ కామెడీ (2019). కన్నడలో ఒకటి వచ్చింది-  అంధగార అనే థ్రిల్లర్ (2018).

        ఇక ఈ క్రైమ్ జానర్ కథకి ఏ జానర్ మర్యాదా లేదు. క్రైమ్ జానర్లో ఈ కథ పోలీస్ ప్రొసీజురల్ సబ్ జానర్ కిందికొస్తుంది. కానిస్టేబులైన హీరో ఇన్వెస్టిగేట్ చేస్తాడు కాబట్టి. హీరో కామిక్ పాత్రతో కథ ప్రకారం చూస్తే
, కంటి చూపు లోపంతో ఇతడి ఇన్వెస్టిగేషన్ అవకతవకగా నవ్విస్తూ-  మరో వైపు తన లోపాన్ని అధిగమించే తపనతో యాక్సిడెంటల్ గా కిల్లర్స్ దొరికిపోవడమనే హిలేరియస్ ఎంటర్ టైనర్ గా, యూత్ అప్పీల్ ని పిండుకోవాలి, అలా బాక్సాఫీసుని దండుకునే ప్రయత్నం చేయాలి. కానీ జరిగిన నేరాన్ని చూపించాక దాన్నెలా సాల్వ్ చేయాలో తెలియలేదు కథకుడికి/దర్శకుడికి. అసలే కామన్ సెన్సు లేని కథ అనుకుంటే, దానికి నాన్ సెన్సికల్ కథనం తోడయ్యింది. సెకండాఫ్ అంధకారంగా మారింది. 

నటనలు - సాంకేతికాలు
కిరణ్ అబ్బవరం కానిస్టేబుల్ పాత్రకి సరిపోతూ రేచీకటి సమస్యతో ఫస్టాఫ్ వరకూ వినోదాన్ని పోషించగల్గాడు. సెకండాఫ్ లో కానిస్టేబుల్ పాత్రనీ, రేచీకటినీ, వీటితో వినోదాన్నీ మర్చిపోయాడు. సెకండాఫ్ కథేమిటో తెలియకుండా పోతే ఏం నటించ గలడు. చాలా కృత్రిమంగా వుంది. పైగా ఫస్టాఫ్ లో తను అనుమానించిన హీరోయిన్నే కిస్సులు కూడా పెడుతోంటే ఏం క్యారక్టర్ అనుకోవాలి, ఏం కథనుకోవాలి. ఇంకా చనిపోయిన తల్లి గారి ఆత్మే మాటిమాటికి కనబడుతూ హిత బోధ చేస్తూంటే - ఈమెకి ఈ కథతో సంబంధమేంటనుకోవాలి. సెకండాఫ్ ప్రేక్షకులకి ఎంత సహన పరీక్ష పెట్టాడో  తెలుసుకుని, ఇలాటిది జరక్కుండా చూసుకోవాలి అబ్బవరం.

హీరోయిన్లిద్దరూ వేసిన పాత్రలు, నటనలు కూడా చెప్పుకోదగ్గవి కావు. ఎస్సైగా శ్రీకాంత్ అయ్యంగార్ ఓ మాదిరి. ఇక సంగీత సాహిత్య సాంకేతికాల గురించి చెప్పుకోవడాని కేమీ లేదు.


చివరికేమిటి

ఫస్టాఫ్ హీరో పాత్ర పరిచయం ప్రేమలు, రేచీకటితో పాట్లు, ఇవి సాగుతూ హత్య, దీంతో డ్యూటీ సరిగ్గా చేయలేదని సస్పెన్షన్, హత్యతో ప్రేమిస్తున్న హీరోయిన్ కి సంబంధముందని తెలియడం, ఇంటర్వెల్. ఇక సెకండాఫ్ రెండేళ్ళూ గ్యాప్. ఎందుకంటే, హత్య కేసులో సరైన సాక్ష్యాధారాల్లేవని కేసు కొట్టేసింది కోర్టు. కథలో ఈ రెండేళ్ళ గ్యాప్ ని భర్తీ చేయడానికి కథనంతో విఫలయత్నాలు. అప్పుడు హీరో మేల్కొంటాడు. కేసు కోర్టు కొట్టేసినప్పుడే ఎందుకు మేల్కొని రంగంలోకి దూకలేదు? ఇలాటి జవాబు లేని ప్రశ్నలతో హీరో లాజిక్ కి అందని సిల్లీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ పోతాడు. హత్యకి కారణం కూడా బలంగా వుండదు.
        సస్పెన్స్, థ్రిల్ అనే వాటికి ఇక్కడ ఆస్కారం లేదు. రోమాంటిక్ కామెడీలు ఎలాపడితే అలా తీసేసినట్టు, క్రైమ్ -సస్పెన్సులు కూడా తీసెయ్యొచ్చన్న అవగాహనతో వస్తే ఈ జానర్ అంత మంచి ఛాన్సు నివ్వదు. రోమాంటిక్ కామెడీలే తీసుకోవడం మంచిది.

—సికిందర్

Friday, March 4, 2022

1140 : రివ్యూ!


 రచన- దర్శకత్వం: తిరుమల కిషోర్ 
తారాగణం : శర్వానంద్, రశ్మిక, రాధిక, ఖుష్బూ, ఊర్వశి, ఝాన్సీ, వెన్నెల కిషోర్, రవిశంకర్, సత్య, ప్రదీప్ రావత్ తదితరులు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ , ఛాయాగ్రహణం : సుజిత్ సారంగ్
నిర్మాత: సుధాకర్ చెరుకూర
విడుదల : మార్చి 4, 202
***

        2017 లో మహానుభావుడు తర్వాత నుంచి హిట్లు లేక 5 వరస పరాజయాలు పూర్తి చేసుకున్న శర్వానంద్, ఇక రిపీట్ టైటిల్ తో ఆడవాళ్ళూ మీకు జోహార్లు అంటూ వచ్చేశాడు. ఒకే రకమైన సినిమాలు తీసే దర్శకుడు తిరుమల కిషోర్ తో ఇక పక్కా హిట్ అన్న నమ్మకంతో రంగంలోకి దిగాడు. 1981 లో కె బాలచందర్ తీసిన ఆడవాళ్ళూ మీకు జోహార్లు సామాజిక కథ. కృష్ణం రాజు, జయసుధ, సరిత, భానుచందర్, చిరంజీవి (అతిధిపాత్ర) నటీనటులు. అది హిట్టయ్యింది. మరి అదే టైటిల్ ని రిపీట్ చేస్తూ శర్వానంద్ అందిస్తున్న ఈ తాజా కనుక ఎలావుంది? ఈసారైనా హిట్ దక్కిందా? తెలుసుకుందాం.

కథ  

చిరంజీవి (శర్వానంద్) కళ్యాణమండపం నడుపుతూ వుండే 36 ఏళ్ల బ్రహ్మచారి. అతడికి తల్లి  (రాధికా శరత్ కుమార్) తో పాటు ఇంట్లో చాలా మంది ఆడవాళ్ళు వుంటారు. వీళ్ళ కారణంగా పెళ్ళి కాదు. ఏ సంబంధం వచ్చినా వాళ్ళకి అమ్మాయి నచ్చదు. కాలం గడిచిపోతూంటుంది. ఓ రోజు ఆద్య (రశ్మికా మందన్న) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా ప్రేమిస్తుంది. అయితే తన తల్లి కారణంగా పెళ్ళి చేసుకోలేనంటుంది. ఆమె తల్లి వకుళ (ఖుష్బూ) కి పెళ్ళిళ్ళంటే ఇష్టం లేదు. ఎందుకిష్టం లేదు? ఏమిటామె కథ? చిరంజీవి ఆమెని ఎలా ఒప్పించి ఆద్యని పెళ్ళి చేసుకున్నాడు? ఇదీ మిగతా కథ...

ఎలావుంది కథ

ఇంటినిండా లేడీస్, అందులో ఓ పెళ్ళి కథ అనే హమ్ ఆప్కే హై కౌన్ లాంటి కథ. రకరకాల హమ్ ఆప్కే హై కౌన్ లు ఆల్రెడీ ప్రేక్షకులు చూసేశారు. ఇదే దర్శకుడు తీసిన నేనూ శైలజ చూశారు. ఇందులో హీరోయిన్ ఇంటికి హీరో వెళ్తాడు సమస్య చక్కదిద్దడానికి. ప్రస్తుత సినిమాలో కూడా ఇదే పని మీద హీరోయిన్ ఇంటికి హీరో వెళ్తాడు. తేడా ఏమిటంటే, నేనూ శైలజ లో హీరోయిన్ కి పెళ్ళి నిర్ణయమై వుంటుంది. ఆమె తండ్రికోసం హీరోని కాదనుకుంటుంది. ప్రస్తుత సినిమాలో హీరోయిన్ పెళ్ళయే పరిస్థితి వుండదు. ఈమె తల్లి కోసం  హీరోని కాదనుకుంటుంది. ఒక టెంప్లెట్ సక్సెస్ అయిందని దాన్నే మార్చి చూపించడం, అది నటించడానికి హీరో ఒప్పుకోవడం, ప్రేక్షకుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా జరిగిపోతూంటుంది.

        కానీ ఏ కథయినా, అదే ఎన్నిసార్లు తీసినా, కథలా వుంటే పర్వాలేదు. వర్కౌట్ అయిన టెంప్లెంట్ నే వాడేసి, కథ లేకుండా చేస్తే- కేవలం ఆడవాళ్ళ బృందంతో గ్లామర్ షో గా మార్చేస్తే- కథ మర్చిపోయి ప్రేక్షకులు కళ్ళప్పగించి చూస్తారనుకోవడం వర్కౌట్ కాదు. ఈ మూవీలో కథని, దానికి సంబంధించిన సంఘర్షణని, భావోద్వేగాలని, మెలోడ్రామాని, సముచిత పరిష్కారాన్నీ ఆశించకుండా, కేవలం నవ్వుకోవడాలతో గ్లామర్ షో కోసం చూడాలనుకుంటే చూడొచ్చు.

నటనలు సాంకేతికాలు

శర్వానంద్ బరువెక్కి బొద్దుగా మారడం ఇంటినిండా ఆడవాళ్ళు పెట్టిన తిండి వల్లే కావచ్చన్న అభిప్రాయం కలుగుతుంది. శర్వానంద్ ముందుగా ఫిజిక్ పట్ల జాగ్రత్త వహించకపోతే ఫ్లాపుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. పాత్రగా చూస్తే శర్వానంద్ చేయడానికేమీ లేదు. పాత్ర ఎదుర్కోవడానికి సరైన సమస్యే లేనప్పుడు, సంఘర్షణే లేనప్పుడు, పాత్ర ఏముంటుంది? ఇంట్లో ఆడవాళ్ళతో కామెడీ, రశ్మికతో రోమాన్స్, ఖుష్బూతో వుండీ లేని ఎమోషన్స్. సాంగ్స్ తో ఎంటర్టైన్మెంట్. అయితే ఇంత లైటర్ వీన్ పాత్రేసినప్పుడు, ముగింపులో కూడా ఓ హేపీ మూడ్ తో ప్రేక్షకుల్ని ఇంటికి పంపాల్సింది. ఇది జరగలేదు. కథంటూ వుంటే అందులోంచి ఏమైనా లాగి ముగింపుతో రంజింప జేయవచ్చు.

        రశ్మిక గ్లామర్, కాస్ట్యూమ్స్, స్టయిలింగ్ లతో మైమరపించే ప్రయత్నం చేసింది. హీరోయిన్ పాత్రకి ఐక్యూ తప్ప ఏమున్నా చూసేసేందుకు అలవాటు పడ్డారు కాబట్టి, రశ్మిక సక్సెస్ ఫుల్ గా కథా కథనాలనే బరువు బాధ్యతల నుంచి తప్పించుకోగల్గింది.  

        ఇక ఇతర నటీనటులు, ఆడవాళ్ళ బృందం షరా మామూలే. ఖరీదైన పట్టుచీరెలూ నగలతో మనం షాపింగ్ మాల్ కి టూర్ వెళ్ళినట్టు అన్పింపజేస్తారు. ఎవరికెవ రేమవుతారో బంధుత్వాలు కూడా గుర్తు పెట్టుకోవడం కష్టమైపోతుంది. ప్రదీప్ రావత్ కామెడీ చేయబోయాడు గానీ, అది కామెడీలా లేదు.

        దేవిశ్రీప్రసాద్ కూడా మనసు పెట్టి సంగీతం చేయలేదు. మొదటి రెండు పాటలు  కాస్త  ఫర్వాలే దన్పిస్తాయి. మాస్ పాటల్ని దంచి కొడుతూ క్లాస్ పాటలతో టచ్ కోల్పోతున్నాడేమో తెలీదు. సుజిత్ సారంగ్ కెమెరా, ప్రొడక్షన్ విలువలు రశ్మిక గ్లామర్ తో పోటీపడుతూ వున్నాయి. సినిమాల్లో ప్రొడక్షన్ విలువలున్నంత రిచ్ గా విషయం వుండదు.

        ఫస్టాఫ్ శర్వానంద్ కి పెళ్ళి కుదరని కామెడీలూ, రశ్మిక తో రోమాన్స్. ఆమె తల్లి కారణంగా పెళ్ళి చేసుకో ననడంతో పూర్తవుతుంది. ఈ కాన్ఫ్లిక్ట్ కాని కాన్ఫ్లిక్ట్ తో సెకండాఫ్ ప్రారంభమైతే, కాన్ఫ్లిక్ట్ కాని ఈ కాన్ఫ్లిక్ట్ తో కూడా సంబంధం లేని ఫ్యామిలీ ప్రదర్శన వుంటుంది. కథే లేదు, వున్న కథ లోకీ వెళ్ళరు ఇంత మంది ఆడవాళ్ళూ కలిసి. శర్వానంద్ రశ్మిక తల్లి ఖుష్బూ కంపెనీలో చేరడం, పెళ్ళిళ్ళతో ఆమెకున్న  అభ్యంతరం గురించి ఒక్క మాటలో చెప్పే ఫ్లాష్ బ్యాక్ రావడం, సినిమా కొలిక్కి రావడం...

        ఈ సినిమాలో ఆడవాళ్ళని  చూస్తే జెలసీ పుడుతుంది. వీళ్ళకేనా జోహార్లు, వీళ్ళు చెప్పాలనుకున్న కథకి కాదా?

—సికిందర్

Tuesday, March 1, 2022

1139 : బుక్ రివ్యూ

        స్క్రీన్ ప్లే పుస్తకాల్లో థియరీ గురించే వుంటుందని  తెలిసిందే. ఈ థియరీకి  క్లాసిక్ సినిమాలే ఉదాహరణగా వుంటాయి తప్ప, థియరీ ప్రకారమే వుంటూ చాలా సినిమాలు ఎందుకు ఫ్లాపవుతున్నాయో వుండదు. 100 అద్భుత చిత్రాలు, 50 స్వర్ణ యుగ సినిమాలంటూ థియరీని వివరించని పుస్తకాలూ ఓ పక్క రెగ్యులర్ గా వస్తూంటాయి. ఇవి సినిమా లవర్స్ కి తప్ప, మేకర్స్ కి ఏ మేరకు ఉపయోగ పడతాయో తెలీదు. సినిమాల్ని విశ్లేషించి, థియరీ ప్రకారమే ఇదిగో ఇందుకు హిట్టయ్యింది, ఇందుకు ఫ్లాపయ్యిందీ అంటూ మేకర్స్ కి ఉపయోగపడే పుస్తకాలు దాదాపూ దొరకవు. థియరీ రాయడం ఈజీ, వున్న అదే థియరీని తిరగేసి మడతేసి రాస్తే ఇంకో కొత్త పుస్తకమై పోతుంది. ఇలా ఇదొక మల్టీ మిలియన్ డాలర్ బిజినెస్ అయింది. కానీ స్క్రీన్ ప్లే ఎనాలిసిస్ రాయడం అంత తేలిక కాదు. అయితే స్క్రీన్ ప్లే ఎనాలిసిస్ తెలియకుండా మంచి మేకర్ కాలేరు. క్రియేటివ్ పవర్స్ సొంతమవవు. క్రియేటివ్ పవర్స్ అంటే - వూహా శక్తి, కల్పనా శక్తి, ఈ రెండిటితో ఒక రూపమిచ్చే సృజనాత్మక శక్తి  - ఒనగూడాలంటే విమర్శనాత్మక, విశ్లేషణాత్మక శక్తులు మొదట సమకూరాలి.

        ళ్ళీ ఇక్కడ విమర్శ వేరు, విశ్లేషణ వేరు. విమర్శించే వ్యక్తికి విశ్లేషణ వచ్చి వుండాలని లేదు. సినిమాలో ఏది ఎందుకు బాగాలేదో వివరించకుండా, బాగాలేదు అని విమర్శ రాసేసి వెళ్ళిపోతాడు. విమర్శలకి గురవుతాడు. విశ్లేషించే వ్యక్తి థియరీని దృష్టిలో పెట్టుకుని ఏది ఎందుకు బాగాలేదో, బావుందో చెప్తాడు. విమర్శకైనా విశ్లేషణకైనా థియరీ తెలిసి వుండాలి. ఎటు తిరిగీ థియరిస్టుల దగ్గరికే వస్తాం. థియరీ కేవలం స్ట్రక్చర్ చెప్తుంది. కానీ ఈ స్ట్రక్చర్ తో క్రియేటివిటీ తెలియకపోతే సినిమా ఏమవుతుంది? ఇది తెలుసుకోవడానికే ఈ పుస్తకాన్ని పరిచయం చేసుకుంటున్నాం...

        గుడ్ స్క్రిప్ట్స్, బ్యాడ్ స్క్రిప్ట్స్ అన్న పుస్తకం 1998 లో వెలువడింది. సినిమా రచయితా, యూనివర్సిటీలో స్క్రీన్ ప్లే ప్రొఫెసరూ అయిన థామస్ పోప్ రాసిన ఈ పుస్తకం, 2005 లో మన దృష్టి కొచ్చింది. దీంతో మొట్ట మొదటిసారి ఎవ్వరూ చెప్పని ‘ఎండ్  సస్పెన్స్ కథల గుట్టు తెలిసింది. థియరీతో ఇది తెలియదు, సినిమాల విశ్లేషణతో తెలుస్తుంది. ఈ పుస్తకంలో వున్నది థామస్ పోప్ చేసిన సినిమా విశ్లేషణలే. ఇందులో హిట్టయిన, ఫ్లాపయిన 25 సినిమాల్ని గుడ్ స్క్రిప్ట్స్, బ్యాడ్ స్క్రిప్ట్స్ గా విభజించి, గుట్టు మట్లు వివరించాడు. Learning the Craft of Screen writing Through 25 of  the BEST and WORST Films in History’ అన్నది పుస్తకం ఉప శీర్షిక.

        (మనం కూడా ఇలాటి పుస్తకమొకటి  రాయాలని ఉద్రేక పడ్డామప్పుడు. గుడ్ స్క్రిప్ట్స్ అనీ, బెస్ట్ ఫిలిమ్స్ అనీ పేరు పెట్టి రాస్తే ఫర్వాలేదు గానీ; మరీ బ్యాడ్ స్క్రిప్ట్స్ అనీ, వరస్ట్ ఫిలిమ్స్ అని కూడా తగిలించి పుస్తకమేస్తే ప్రాణాలు దక్కవని మానుకున్నాం).

        257 పేజీల ఈ పుస్తకం రెండు భాగాలుగా వుంది : స్ట్రక్చర్ పరంగా,క్యారక్టర్ పరంగా. ఒక్కో సినిమా బావుండడానికైనా, లేకపోవడానికైనా, కారణమైన క్రియేటివ్ అభివ్యక్తి ఎలా పని చేసిందో విస్పష్టంగా పొందుపర్చి వుంది. ఫ్లాష్ బ్యాక్స్ కథనమనే క్రియేటివ్ అభివ్యక్తితో సిటిజన్ కేన్’, స్ట్రక్చర్ పునరావిష్కరణకి పల్ప్ ఫిక్షన్’, తప్పుడు సెకండ్ యాక్ట్ కి ది జివెల్ ఆఫ్ ది నైల్’, సెకండ్ యాక్ట్ లో పాసివ్ విలన్ పాత్రకి పిజ్జీస్ ఆనర్’, విలన్ గా యాంటీ హీరోకి కాసా బ్లాంకా’, హీరోగా విలన్ కి ది డే ఆఫ్ ది జాకాల్’…  ఇలా 25 సినిమాల విశ్లేషణతో స్క్రీన్ ప్లే రచన భోదించడం వుంది.  అవసరమైన చోట్ల వన్ లైన్ ఆర్డర్ తో వివరించడం కూడా వుంది.       

        సినిమా విజయానికి అందరూ బాధ్యులే. పరాజయానికి మాత్రం ఎవరూ బాధ్యత తీసుకోరు. దర్శకుడి ఖాతాలో పడేసి పోతారు. ఆ దర్శకుడికి రెండేళ్ళూ ఇంకో సినిమా వుండదు. మిగిలిన వాళ్ళు అవకాశాలతో ముందు కెళ్ళి పోతారు. అయితే కర్మ ఫలం తప్పదని, దర్శకుణ్ణి బాధ్యుడుగా చేసిన వాళ్ళూ అనుభవిస్తారనీ తెలిపే దృష్టాంతాలుంటాయి. ఇలా ఒక సినిమా స్క్రిప్టు తయారవడానికి ముందూ తర్వాతా జరిగే సంగతులు కూడా పుస్తకంలో వినోదాన్ని అందిస్తాయి. కథ వెనుక కథ ఏం జరిగిందో ఇంటర్వ్యూలు కూడా చేసి ఈ విశ్లేషణలు చేశాడు రచయిత.

        పాసివ్ పాత్రలు, పాసివ్ యాక్టివ్ పాత్రలు, సెకండాఫ్ సిండ్రోములు, మిడిల్ మటాషులు, ఎండ్ సస్పెన్సులు, పాత్ర చిత్రణ లోపాలూ  వంటి ఎన్నో సమస్యలు స్ట్రక్చర్ థియరీ నేర్చుకుంటే తెలీవు. ఇవి స్ట్రక్చర్ కి లోబడి కథ నడిపే నేర్పుకి సంబంధించిన సమస్యలు. క్రియేటివిటీ సమస్యలు. క్రియేటివిటీ కార్యకారణ సంబంధంతో వుంటుంది. ఇలా అనుకుని రాస్తే, అలా జరుగుతుంది, అలా జరిగితే అది ఇలా జరగడానికి కారణమవుతుందనే యాక్షన్ రియాక్షన్ల పరంపరతో కథనం సాగిపోతూ వుంటుంది. కారణం సరైనదైతే కార్యం సవ్యంగా వుంటుంది. లేకపోతే అపసవ్యంగా మారి మరిన్ని అపసవ్యాల్ని సృష్టిస్తుంది. ఇవన్నీ ఈ పుస్తకం చదివితే తెలుస్తాయి. ఏం చేయవచ్చో, ఏం చేయకుండా జాగ్రత్త పడొచ్చో తెలుసుకోవడానికి ఈ పుస్తకం మంచి రిఫరెన్సుగా వుంటుంది.

        పుస్తకం అమెజాన్లో వుంది. ధర రూ 4,342. 00 పైసలు అని వుంది. ఈఎంఐ లు కూడా వున్నాయట. ఈపాటికి హార్ట్ స్ట్రోకు వచ్చేసి వుంటుందని తెలుసు. పీడీఎఫ్ లింకులున్నాయి, నిర్భయంగా వుండొచ్చు. 2005 లో పంజాగుట్టలో బాంబే నుంచి వచ్చి పెట్టిన బుక్ ఎగ్జిబిషన్లో 500 రూపాయలకి దొరికింది.

—సికిందర్ 

 

Sunday, February 27, 2022

1138 : సందేహాలు- సమాధానాలు


Q :   స్క్రీన్ ప్లే త్రీయాక్ట్ స్ట్రక్చర్ పుస్తకాలు గానీ, లేదా వీడియోలు గానీ స్క్రీన్ ప్లే నేర్చుకోవడానికి పనికొస్తాయంటారా? ఎందుకంటే మీరు స్ట్రక్చర్ గురించి ఎక్కువ రాస్తుంటారు. నేను ఈ మధ్య దీని మీద దృష్టి పెట్టాను. ఇది ఎంతవరకూ ఉపయోగపడుతుంది?  
—జి. కృష్ణ, అసిస్టెంట్

A :   అలా ఉపయోగపడదు. కేవలం స్ట్రక్చర్ తో స్క్రీన్ ప్లే తయారవదు. స్ట్రక్చర్ కేవలం స్క్రీన్ ప్లేకి స్థిరపడిన త్రీయాక్ట్స్ నమూనానే ఇస్తుంది. దాంట్లో ఆయా యాక్ట్స్ ప్రకారం కథ చేసుకోవాలి. దీంతో అయిపోదు. ఈ నమూనా లోపల కథకి తగ్గ క్రియేటివిటీ అవసరపడుతుంది. ఈ క్రియేటివిటీకి - అంటే కథ చెప్పే తీరుకి- రూల్స్ లేవు. ఒక్కొక్కరి క్రియేటివిటీ ఒక్కో విధంగా వుంటుంది. ఎన్ని విధాలుగా క్రియేటివిటీ వున్నా స్ట్రక్చర్ కి లోబడే వుండాలి. ఈ క్రియేటివిటీ ఏమిటనేది స్ట్రక్చర్ లో వుండే వివిధ సినిమాలు చూస్తూంటే తెలుస్తుంది. సినిమాలకి పని చేస్తూంటే తెలుస్తుంది. ప్రాక్టికల్ గా అనుభవం కానిది రాదు. స్ట్రక్చర్ ఓ థియరీ మాత్రమే. క్రియేటివిటీ ప్రాక్టీసుని కోరే యాక్టివిటీ. స్ట్రక్చర్ అస్థిపంజరమైతే, క్రియేటివిటీ రక్తమాంసాలు. ఈ రెండూ కలిస్తేనే స్క్రీన్ ప్లే. ఉత్త స్ట్రక్చర్ స్క్రీన్ ప్లే కాదు, ఉత్త క్రియేటివిటీ స్క్రీన్ ప్లే కాదు.

        సినిమాలు స్ట్రక్చర్ లో లేకుండా ఫ్లాపవడం వల్లే గుర్తు చేయడానికి స్ట్రక్చర్ గురించి రాయాల్సి వస్తోంది. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ పుస్తకాల్లో, వీడియోల్లో క్రియేటివిటీ గురించి చెప్పరు. ఇంగ్లీషులో వచ్చే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ పుస్తకాలని, వీడియోల్నీ యథా తధంగా తెలుగులోకి దింపేసి చెలామణీ చేయడం కూడా భావ్యం కాదు. మన సినిమాల కథా కథనాలు వేరు. హాలీవుడ్ పుస్తకాల్లోని స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ని మన నేటివిటీకి కస్టమైజ్ చేసుకుంటేనే, అది నిజమైన మన స్క్రీన్ ప్లే అవుతుంది.

Q :   భీమ్లా నాయక్’, అయ్యప్పనుమ్ కోషియమ్ ల గురించి మీరు రాసిన రివ్యూలో వాటిలో  కథకు న్యాయం జరగలేదన్నారు. ఇగోకు, ఆత్మగౌరవానికి మధ్య పోరాటం ఇంకెలాముగియాలంటారు? ఒక అసోసియేట్ గా ఇది తెలుసుకోవడం నా కవసరమని అడుగుతున్నాను. మీరు చెబితేనే బావుంటుందని భావిస్తున్నాను.
కె. రవికాంత్, అసోసియేట్

A :   ఒకరి మీదే ఆధారపడకుండా ఇంకొందర్ని కూడా అడగాలి. అయినా ఈ రెండు సినిమాలు సక్సెస్ అయ్యాక వీటి గురించి ఈ చర్చ అవసరం లేదు. సెకండాఫ్ కథ కాని కథతో డీజే టిల్లు హిట్టయ్యాక దాన్ని కూడా విశ్లేషించ లేదు. ఈ సినిమాల చుట్టూ ఏర్పడిన మూడ్ ని దృష్టిలో పెట్టుకుని వీటిని అలా వదిలేయడమే మంచిది. ఆత్మగౌరవం - ఇగో అనే సైకలాజికల్ పాయింటుకి ది గ్రీన్ మైల్’, జో సమ్ బడీ అనే హాలీవుడ్ సినిమాలు, ది ఇన్సల్ట్ అనే లెబనాన్ మూవీ చూసి ఏమైనా నేర్చుకుంటే నేర్చుకోవచ్చు.

Q :  ఈ మధ్య రెగ్యులర్ గా రివ్యూలు ఇస్తున్నందుకు సంతోషం. నాకు వలిమై చూస్తే నవ్వొచ్చింది. ఫస్టాఫ్ కి, సెకండాఫ్ కి కథ పోలికే లేదు. తెలుగులో ఫ్లాపయ్యింది. కథల్ని అనుకున్న కాన్సెప్ట్ ప్రకారం ఎందుకు తీయడం లేదు. ఇంత భారీ బడ్జెట్ తో ఎందుకు రిస్క్ తీసుకుంటున్నారు?
—బిజిఎస్. రావు, రచయిత

A :  దర్శకుడి కథ ఎన్నో రకాలుగా మారిపోతూంటుంది. మార్చేసిన వాళ్ళు కనపడరు. అది మీదేసుకుని దర్శకుడే విలన్లా కనబడతాడు మనకి. వలిమై దర్శకుడి ఎన్ని ఇంటర్వ్యూలు చదివినా అతను కథలో మార్పుల గురించి మాట్లాడలేదు. తెరవెనుక ఏమేం జరిగాయో మనకి తెలీదు. అపహాస్యపు కథకి అట్టహాసపు బడ్జెట్ ఏ లా ఆఫ్ ఎట్రాక్షన్ ప్రకారం జరిగిందో విశ్వానికే తెలియాలి. ఇంకో వైపు ఒక కొత్తవాడు ఎంతో మంచి స్క్రిప్టు పట్టుకుని కోటి రూపాయల బడ్జెట్ కోసం తిరుగుతున్నా విశ్వం కనికరించదు. అసలు విశ్వం తానేమిటో తెలుసుకోవడానికి మనమే ఒక మార్గమని సైంటిస్టు కార్ల్ సాగన్ అంటాడు. కాబట్టి బడ్జెట్లు, రిస్కులు టాపిక్ పక్కన పెడదాం.

        వలిమై లాంటి హైపర్ యాక్షన్ తీయాలంటే దాని కాన్సెప్ట్ లేదా ఐడియా, మార్కెట్ యాస్పెక్ట్ చూసుకుని, ఆ తర్వాతే వీటిని బట్టి క్రియేటివ్ యాస్పెక్ట్ చూసుకోవాలి. ఒక విలన్ నిరుద్యోగుల్ని బానిసలుగా చేసుకుని, వాళ్ళతో నేరాలు చేయిస్తూ సామాజిక బెడదగా మారడమనే కాన్సెప్ట్- యూత్ అప్పీల్ తో మంచి మార్కెట్ యాస్పెక్ట్ వున్న కొత్త కథ. యూత్ అప్పీల్ లేకుండా ఏ సినిమా నిలబడదు. ఇలాటి కాన్సెప్ట్ ని సెకండాఫ్ లో నిరుద్యోగుల్ని పక్కన బెట్టేసి, హీరో కుటుంబ కథగా, హీరో తమ్ముడే విలన్ తో చేతులు కలిపే, అరిగిపోయిన పాత టెంప్లెట్ కథగా మార్చెయ్యడంతో- ఫస్టాఫ్ లోని కాన్సెప్ట్, మార్కెట్ యాస్పెక్ట్, యూత్ అప్పీల్ అన్నీ గల్లంతయ్యాయి. కుటుంబాన్ని కాపాడుకుని చివరి సీన్లో హీరో, ఆ దారితప్పిన నిరుద్యోగులకి ఓ లెక్చరిచ్చి ముగిస్తే, దారి తప్పిన నిరుద్యోగుల మీద కథైపోయింది! ఆ నిరుద్యోగులే హీరోకి సమస్యైపోయి, హీరో నిరుద్యోగులూ సంఘర్షించుకునే యాక్షన్ స్టోరీని క్రియేటివ్ యాస్పెక్ట్ డిమాండ్ చేస్తూంటే, ఇంకేదో కథ చూపించారు.

—సికిందర్


Friday, February 25, 2022

1137 : రివ్యూ!

దర్శకత్వం : సాగర్ కె చంద్ర
తారాగణం : పవన్ కళ్యాణ్
, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్, రావు రమేష్, మురళీ శర్మ, బ్రహ్మానందం, రఘుబాబు, తనికెళ్ళ భరణి తదితరులు
కథ : సాచి
, రచన : త్రివిక్రమ్, సంగీతం : తమన్, ఛాయాగ్రహణం : రవి కె చంద్రన్
బ్యానర్ : సితార ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాత : సూర్యదేవర నాగవంశీ
విడుదల : ఫిబ్రవరి 25
, 2022

***

                ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఎట్టకేలకు విడుదలయ్యింది. మలయాళం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ గా పవన్- రానా దగ్గుబాటిల కాంబినేషన్ లో మాస్- ఫ్యాన్స్- మసాలా బాక్సాఫీసు నజరానాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ రీమేక్ ఎలా వుందో చూద్దాం...

కథ

    భీమ్లా నాయక్ (పవన్ కళ్యాణ్) కర్నూలు జిల్లా మఠకేశ్వర్ మండలం, తెలంగాణా సరిహద్దులోని పోలీస్ స్టేషన్లో నిజాయితీ పరుడైన సబ్ ఇన్స్ పెక్టర్. ఒక రాత్రి డానియేల్ శేఖర్ (రానా) అనే మాజీ సైనిక హవల్దార్ తెలంగాణా లోని నల్లపట్లకి అటవీ ప్రాంతంలో  వెళ్తూంటాడు. అతను కారులో నిషేధ ప్రాంతంలో మద్యం రవాణా చేస్తున్నాడని పట్టుకుని నిర్బంధిస్తాడు భీమ్లా. కారులో ఆ  మద్యం సీసాలు తనకు కోటాలో వచ్చాయనీ, తను మాజీ సైనిక హవల్దార్ ననీ డానియేల్ ఎంత చెప్పినా విన్పించుకోడు. అడ్డుకున్న పోలీసుల్ని కొట్టినందుకు వూరుకునేది లేదంటాడు. దీంతో డానియేల్ అహం దెబ్బతిని ఎదురు తిరుగుతాడు. భీమ్లా కూడా ఆత్మగౌరవం కోసం తిరగబడతాడు. డానియల్ సైన్యంలో మాజీ హవల్దారే గాక, ఓ పెద్ద రాజకీయ నాయకుడి (సముద్ర ఖని) కొడుకని భీమ్లాకి తెలీదు. బెయిల్ మీద బయటికి రాగానే నీ సంగతి చూస్తానని డానియేల్ హెచ్చరిస్తాడు. ఇద్దరి మధ్య ఘర్షణ అంతకంతకూ పెరుగుతూ పోయి ప్రాణాలు తీసుకునే శత్రువులుగా మారిపోతారు. ఇక వీళ్ళ మధ్య తగువు ఎలా పరిష్కారమయిందనేది మిగతా కథ.

ఎలావుంది కథ

    మలయాళంలో నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ (కోషీ - మాజీ హవల్దార్ పాత్ర), బిజూ మీనన్ (అయ్యప్పన్- ఎస్సై పాత్ర) ఇద్దరూ పేరున్న నటులే. మలయాళంలో ఇద్దరికీ విపరీతమైన ఫాలోయింగ్ వుంది. ఏ ఒక్కర్ని తక్కువ చేసి చూపించినా ఆ అభిమానులతో ఇబ్బందే. అందుకని ఎవరి గెలుపూ, ఎవరి ఓటమీ లేనిఇదమిత్థమైన ఒక ముగింపూ కూడా లేని కథగా మలయాళంలో ఇది తెరకెక్కింది. దీంతో నటులుగా వాళ్ళ ఇమేజులకి న్యాయం జరిగిందేమో గానీ, కథకి న్యాయం జరగలేదు. కథ ప్రకారం వాళ్ళ మధ్య ఇగో వర్సెస్ ఆత్మగౌరవం సమస్యని వాళ్ళే తేల్చుకోకుండా, మధ్యలో పై అధికారుల జోక్యంతో శాంతించే, పాత్రౌచిత్యాల్ని దెబ్బ తీసే తీరు వుంది.  

        అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవల్ని పై అధికారులూ నాయకులూ కల్పించుకుని ఎప్పుడో ఆపి వుండొచ్చు. సాధారణంగా ఇదే జరుగుతుంది. మొదట్నుంచీ జరిగేవన్నీ జరగనిచ్చి, చిట్టచివరికి మధ్యలో దూరి కథని ఆపారు అధికారులు. కథ ఆగింది కానీ ముగియలేదు. పాపులర్ నటుల ఇమేజుల్ని కాపాడేందుకు కథతో ఇలా చేయాల్సి వచ్చింది దర్శకుడికి. 

        తెలుగులో పవన్ కళ్యాణ్ కీ, రానాకీ సమాన స్థాయి ఇమేజులు, ఫ్యాన్ బేసులు లేవు. అయినా ముగింపుని మార్చలేదు. పేలవంగానే ముగించారు. ఇక కృత్రిమత్వం, ఫార్ములా, మూస అనేవాటికి దూరంగా కేరళ గ్రామీణ నేటివిటీ కోసం కృషి చేశాడు మలయాళ దర్శకుడు సాచీ. ఈ హాట్ కథకి ప్రతిగా కూల్ కలర్స్ వాడి నేత్రానందం కల్గించాడు. పాటలు లేవు. నేపథ్య సంగీతం మాత్రం ట్రైబల్ ట్యూన్స్ కుదరక కుదేలయింది. మాటలు సింథటిక్, డిజైనర్, మూస, పంచ్, టెంప్లెట్ ధోరణుల నుంచి రిలీఫ్ గా, నిజజీవితంలో మనుషులు మాట్లాడుకున్నట్టు వుంటాయి.  ఫైట్లు మనుషులు పోరాడుకున్నట్టు వుంటాయి. దాదాపు మూడు గంటల నిడివే ఈ స్వల్ప కథకి, అత్యల్ప కాన్ఫ్లిక్ట్ కీ బాగా ఎక్కువ. ఒక దశ కొచ్చేటప్పటికి చిన్న విషయానికి ఇంత సాగదీయడం అనవసర మన్పించే కథ. నాయకులూ ఉన్నతాధికార్లూ ఆ ఇద్దర్నీ కూర్చోబెట్టి క్లాసు తీసుకుంటే, ఎప్పుడో ముగిసిపోయే గొడవ. కథకి ప్రారంభంలో చూపించే పాశుపతాస్త్రంతో పోలిక వర్కౌట్ కాని పరిస్థితి ఇంకో పక్క. ఇంతకి ముందు చెప్పుకున్నట్టు ఎమోషనల్ ప్రేక్షకులతో బాటు, ఇద్దరు నటుల ఫ్యాన్స్ తో దీనికింత సక్సెస్ వచ్చి వుంటుంది.

    తెలుగులో పవన్ కళ్యాణ్ కోసం రీమేక్ చేశారు. ఫస్టాఫ్ పెద్దగా మార్చకపోయినా, సెకండాఫ్ లో పవన్ హీరోయిజం కోసం, మాస్ బేస్ కోసం చాలా మార్పులు చేశారు. ఇవి శృతిమించకుండా వుండడం రీమేక్ ని కాపాడింది. పింక్ రీమేక్ వకీల్ సాబ్ అంత కిచిడీ మసాలా చేయకుండా రక్షించారు. ఒరిజినల్లో పాటల్లేవు, రీమేక్ లో పవన్ కి మాస్ సాంగ్స్ వున్నాయి. ఒరిజినల్ మూడు గంటలు సాగితే, రీమేక్ ని రెండున్నర గంటల్లో ముగించడం మంచి పద్ధతి. ఒరిజినల్ పూర్తి రియలిస్టిక్ అయితే, రీమేక్ సెమీ రియలిస్టిక్.

        అహానికీ ఆత్మగౌరవానికీ మధ్య ఘర్షణ చెలరేగినప్పుడు, యూనివర్సల్ పాజిటివ్ ఎమోషన్ అయిన ఆత్మగౌరవమే గెలవాలి. టామ్ హాంక్స్ నటించిన ది గ్రీన్ మైల్ లో అహంభావియైన పోలీసు అధికారి టామ్ హాంక్స్ వల్ల జైల్లో బందీ అయిన నల్లజాతీయుడు, చివరికి నిర్దోషి అని రుజువైనా, మరణ శిక్ష విధించమనే ప్రాథేయ పడతాడు. తన మానమర్యాదలు ఇన్ని ఖండనలకి గురయ్యాక ఇక జీవించలేనంటాడు. ఆత్మగౌరవంతో చనిపోతాననే అంటాడు. టామ్ హాంక్స్ తలవంచుకునే పరిస్థితి. గొప్ప ముగింపు, గొప్ప మెసేజ్. ఇది ఆస్కార్ కి నామినేట్ అయింది.

నటనలు సాంకేతికాలు

    అలాగని పవర్ స్టార్ ఒన్ మాన్ షో చేయలేదు. ఫస్టాఫ్ లో రానాని చేసుకోనిచ్చాడు. సెకండాఫ్ లో తను స్వారీ చేశాడు. పాత్ర హూందాతనాన్ని కాపాడుతూనే. అక్కడక్కడా సంభాషణలతో ఫ్యాన్స్ ని రెచ్చగొడుతూ. ఒరిజినల్లో బిజూ మీనన్ పోషించిన పాత్రకి కమర్షియల్ హంగుల్లేవు, పక్కా సహజత్వం. పవన్ కి పక్కా కమర్షియల్. అయితే ఈ కమర్షియాలిటీ నీటుగా, ఆరోగ్యకర వినోదంగా వుండడం చెప్పుకోవాల్సిన విషయం. ఒక రియలిస్టిక్ ని తీసుకుని, జాగ్రత్తగా కమర్షియల్ చేస్తే తెలుగులో నీటైన సినిమాల రాక ప్రారంభమవుతుంది. మలయాళం ఒరిజినల్ లేకుండా భీమ్లా నాయక్ ని వూహించలేరు. ఒకవేళ వూహించినా నీటుగా తీయలేరు. రచ్చ పిచ్చ కచ్చా మసాలా ఐపోతుంది. ఓ బాధ్యతగల పొలిటీషియన్ గా పవన్ ఇలా కాకుండా చూసుకున్నాడు.

        రానా ఇగోయిస్టిక్ నటన కూడా నిలబెట్టింది మూవీని. రానా పుట్టిందే ఇలాటి పాత్రల కోసం. ఆల్రెడీ నేనే రాజు నేనే మంత్రి తో చేశాడు. ఇప్పుడు మరింత బాగా చేశాడు. ఫస్టాఫ్ లో ప్రతీ సన్నివేశాన్నీ రగిల్చిన తర్వాత, సెకండాఫ్ లో పవన్ తో బ్యాలెన్సు కుదరక తగ్గాడు. సెకండాఫ్ పవన్ ది. తనని సస్పెండ్ చేయించిన రానా అంతు చూసే రెగ్యులర్ హీరోగా పాత్ర మారడం వల్ల. మలయాళ కథలో హీరోలెవరూ లేరు, పాత్రలే వున్నాయి, వాళ్ళతో కథే వుంది.   పవన్, రానాల ఫైట్ ఒక ప్రధానాకర్షణ. ఈ ఇద్దరిదీ ఇగో- ఆత్మగౌరవాల పోరాటమన్నట్టే వుంటుంది గానీ, క్యారక్టర్ ఆర్క్స్ ఇంతకి మించి పెరగవు. అసలు తామేమిటో తెలుసుకుని ఎదగరు. పవన్ పోలీసు, రానా మాజీ సైనికుడు. తామిద్దరూ కొట్టుకుంటే పోయేది దేశం పరువు - ప్రజల ముందు తమ పరువూ అని గుర్తించరు. ఈ లోపం మలయాళంలో కూడా వుంది.

    ఇక నిత్యామీనన్ (పవన్ భార్య పాత్ర) గొడవల్లో బాగా ఇన్వాల్వ్ అయి పవన్ ని డ్రైవ్ చేసే పాత్రకూడా. కానీ చివర్లో ఈ పాత్ర కనిపించదు. సీఐ గా మురళీశర్మ, రాజకీయ నాయకుడుగా సముద్రఖని, బార్ ఓనర్ గా రావురమేష్ కన్పిస్తారు ఆ పాత్రలకి తగ్గ న్యాయం అనుభవంతో చేస్తూ.

        తమన్ పాటలు, బీజీఎమ్ బావున్నాయి - భీమ్లా నాయక్ సామాజిక వర్గపు సాహిత్యంతో. కథలో సామాజిక వర్గ స్పృహ లేదు. పవన్ స్టార్ మరింత పూర్తి స్థాయి పొలిటీషియన్ అన్పించుకుంటూ, సూర్య తీసిన జైభీమ్ లాంటిది తీయగల్గినప్పుడు వుండొచ్చేమో వర్గ స్పృహ.

        రవి కె చంద్రన్ కెమెరా వర్క్ కిచ్చిన గ్రేడింగ్ అంత ప్రభావశీలంగా అన్పించదు ఇలాటి కథకి. పైన చెప్పుకున్నట్టు ఒరిజినల్లో ఈ హాట్ కథకి కాంట్రాస్ట్ గా కూల్ కలర్స్ వాడి నేత్రానందం కల్గించాడు సాచీ. దర్శకుడు సాగర్ కె చంద్ర అప్పట్లో ఒకడుండే వాడు కి ఇచ్చిన గ్రేడింగ్ దానికి సరిపోయింది. ఇక చెప్పుకోవాల్సింది దర్శకుడి గురించే. అప్పట్లో ఒకడుండే వాడు రియలిస్టిక్ మేకింగ్ స్టయిల్ నే తన శైలితో ముందుకి తీసుకు పోతూ ఒక ఐడెంటిటీ నేర్పర్చుకున్నాడు. ఇది మంచి విషయం. ఇవన్నీ కలుపుకుని భీమ్లా నాయక్ బాక్సాఫీసుకి మర్యాదైన వినోదాల విందు, ఒరిజినల్లోని భావుకత మినహా.

—సికిందర్