రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, April 15, 2019

804 : స్క్రీన్ ప్లే సంగతులు - 2

      

        ఈ కథలో హీరోయిన్ పాత్రకి ఏర్పాటు చేసిన పెళ్లి ఫోబియా కాస్తా కథకుడికి కథతోనే  ఫోబియా అన్నట్టుగా తయారయింది. కథని సరీగ్గా ఆలోచించాలంటే లైటర్ వీన్ ప్రేమ సినిమాలు అలవాటు చేసిన ఒకనాటి వెన్నాడే భయం. పాత్రతో ఆలోచిస్తే కథ వస్తుందా, లేక కథతో ఆలోచిస్తే కథ వస్తుందా...ఎలా ఆలోచించి తీస్తే ఏమవుతుందో ఆ నాలెడ్జిలోకి వెళ్ళాలంటేనే భయంభయం.  పైపైన అలా అలా రాసేసి లైటర్ వీనుగా తీసేస్తే చాలా సుఖం సుఖం. ఇవి రెండ్రోజులు కూడా సరీగ్గా ఆడడం లేదని వారం వారం తెలుస్తూనే వున్నా ఇంకా అలాగే తీస్తూ ఖుషీ ఖుషీ. ట్రైలర్స్ కి వచ్చే యూట్యూబ్ వ్యూస్ లెక్కేసుకుని ఎంతో హేపీ హేపీ. థియేటర్స్ లో పట్టుమని పదిమంది ప్రేక్షకులు లేకున్నా మీట్స్ సక్సెస్ మీట్స్. ఓ పదేళ్ళ క్రితం వరకూ ప్రేక్షకుల్లేక సగానికి సగం థియేటర్లు మూతబడిపోయిన పరిస్థితుల్లోంచి - ఉత్తరాది కార్పొరేట్ కంపెనీల పుణ్యమాని వూరూరా మల్టీప్లెక్సులు వెలుస్తూ, దీటుగా ప్రేక్షకులూ పెరిగిపోయి -  ప్రదర్శనా రంగం భళ్లున తెల్లారినట్టు విస్తరిస్తే -  దీన్నందుకుని లాభపడాలన్న ఆలోచన లేక, అవే అనామక సినిమాలతో అదే కురచ పరిధిలో పడకేసి, లైటర్ వీను అనే సిగార్ లైటర్ తో ఫ్యూచర్ ని ఎంచక్కా తుదముట్టించడం!

         ఇంకో వందేళ్ళ తర్వాత  ఎలాగూ సిగార్ లైటింగ్ దర్శకత్వాల్లో సెట్స్ మీద తగులబడిపోయే స్క్రిప్టు కాగితాలే  సినిమాలుగా మారబోతాయనే కాబోలు - 1919 లో ఏరికోరి దక్షిణదేశపు మొదటి చలనచిత్రంగా  ‘కీచక వధమ్’ నిర్మించారు. ఇప్పుడు 2019 లో వచ్చేసి ఈ కీచక వధమ్ శత వత్సర జ్ఞాపికగా, ‘సూర్యకాంతం’ కూడా శత వ్రక్కలై  వచ్చింది బాక్సాఫీసు వధమ్ గా. 

          కిందటి వ్యాసంలో ప్లాట్ పాయింట్ వన్ వరకు వచ్చాం. అభిషేక్ మళ్ళీ పెళ్లి రికార్డు వేసిన ఫలితంగా సూర్యకాంతం బిక్కచచ్చి కన్పించకుండా వెళ్లి పోయింది. ఆమెకున్న పెళ్లి ఫోబియాకేం చేయాలో అది చేయకుండా అభిషేక్ ఫూలిష్ గా మాట్లాడడంతో ఈ ప్లాట్ పాయింట్ వన్ కి అర్ధం లేకుండా పోయింది. కీచకుడు ఇలాగే పెళ్లి చేసుకొమ్మని వేధిస్తూంటే పంచభర్తృక ద్రౌపది వెళ్లి భీముడికి చెప్తే, గదుచ్చుకుని కీచుమన్పించాడు కీచకుడ్ని భీముడు. ఫోబియాకన్యక సూర్యకాంతంని పెళ్లి చేసుకొమ్మని వేధిస్తున్న అసలు అభిషేక్ ని వదిలేసి బాక్సాఫీసునే భస్మీపటలం చేశాడు కథకుడు సిగార్ లైటింగుచ్చుకుని.  

         
తనని పెళ్లి చేసుకొమ్మని వేధిస్తున్న అభిషేక్ నే తిరిగి ప్రేమించి, అతడి ఎంగేజ్ మెంట్ ని చెడగొట్టే ‘అదర్ వుమన్’ గా సూర్యకాంతాన్ని రప్పించి ఇంటర్వెల్లో కథనే వధించాడు. భీముడు గదతో వెళ్ళాడు, సూర్యకాంతం పాప్ కార్న్ తో వచ్చింది. వచ్చి అభిషేక్ కి షాకిచ్చింది. అతడి నోట్లో పాప్ కార్న్ కుక్కి, “రీఫిల్ చేసుకురా, సెకండాఫ్ ఇంకా ఇంటరెస్టింగ్ గా వుంటుంది” అంది. 

          స్క్రీన్ ప్లే అదిరింది... ఇక సెకండాఫ్ సూపర్ ... లాంటి తెరమీద ప్రేక్షకులకి అవసరంలేని సొంత బాకాలూదుకోవడం ఇక్కడా వుంది. సినిమాలోకి (కథలోకి) కథకుడు / దర్శకుడు  వచ్చి కామెంట్ చేయడం చీప్ టేస్టని తెలీదు.  సెకండాఫ్ ఎందుకు ఇంటరెస్టింగ్ గా అన్పించిందో గానీ, ఫస్టాఫ్ మహా ఫ్లాట్ గా వుంది.  చూస్తే సెకండాఫ్ ప్రారంభంలోనే ఇప్పుడేం చేయాలో అర్ధంగావడం లేదని ఇద్దరు నటులు నెత్తిన తెల్లగుడ్డ లేసుకోవడం వుంది.

***
      కథలో ప్రధాన పాత్ర ఎవరన్న స్పష్టత లేకపోవడం చాలా సమస్యలకి దారి తీసింది. అభిషేకా, సూర్యకాంతమా, ఎవరు ప్రధాన పాత్ర ? ఇటీవలి ‘శుభలేఖ+లు’ కూడా ఈ స్పష్టత లేకనే ఫ్లాపయింది. ఇది కూడా హీరో, హీరోయిన్ ఎవరూ ఒక ప్రధాన పాత్రంటూ కాని హోల్ సేల్ ఫ్యామిలీ డ్రామా. హీరోహీరోయిన్లని పాసివ్ పాత్రలుగా మార్చేసి అట్టర్ ఫ్లాపయింది.  ‘సూర్యకాంతం’ కూడా ఒక ప్రధాన పాత్రంటూ లేని కలగూరగంప ట్రయాంగులర్ డ్రామాగా తయారయింది. హీరో హీరోయిన్ల పాసివ్ పాత్రల నసగా మారి అట్టర్ ఫ్లాపయింది. 

          ఒక ప్రధాన పాత్ర - అది ఎదుర్కొనే సమస్య - దానికి పరిష్కారం అనే సూటి గీత కథా పథకం మాత్రమే సినిమా కథవుతుంది. ఈ సూటి గీత హీరో, హీరోయిన్ - ఇద్దరికీ కనబడదు. ప్రేక్షకులకి తెలిసిన హీరోయిన్ గా నిహారిక వుండగా, తెలియని హీరో మీద కథ చేయాలనుకోరు. నిహారిక పాత్రదే కథవ్వాలి. ఆమే ప్రధాన పాత్రవాలి. అప్పుడు ఆమెకున్న  ఫోబియా - దాంతో సంఘర్షణ - పరిష్కారం - ఈ గీత మీద ఆమె కథ వుండాలి. ఇలా వుండదు. హీరోనే ప్రధాన పాత్ర అనుకున్నా, ఫోబియా గల ఆమెతో తనకి  సమస్య- ఆమెతో సంఘర్షణ -  ఫోబియాకి పరిష్కారం - ఈ గీత మీద కథ వుండాలి. ఇలా కూడా వుండదు. అసలు ఫోబియానే ఎత్తి పారేస్తే ఏ గీత మీద ఎవర్ని ప్రధాన పాత్రగా చేసుకుని కథగా వుంటుంది? 

          ఇందుకే ప్లాట్ పాయింట్ వన్ కూడా అర్ధం లేకుండా వుంది. ఆమె మదర్ చనిపోతే,  నీకు అండగా వుంటాను లైఫ్ లాంగ్ అనగానే భయపడి ఆమె జంప్ అయింది. ఇలా ఇదివరకు అన్నప్పుడు కూడా భయపడి జంప్ అయింది. అప్పుడతను ఆమె మదర్ ని కలిస్తే కూతురి ఫోబియా గురించి చెప్పింది. అయినా ఆ ఫోబియా కథేదో నడపకుండా కథకుడు ఇప్పుడు కథతో సంబంధం లేని అదే పెళ్లి యావ పెట్టడంతో ప్లాట్ పాయింట్ వన్ ఫ్లాప్ అయింది. ఒకవేళ ఆమె కన్పించక పోవడమే అతడి సమస్య అనుకున్నా, అలా అతనే ప్రధాన పాత్రనుకున్నా, ఈ సమస్యతో సంఘర్షించిందీ లేదు. గిల్టీ ఫీలయ్యిందీ లేదు. ఆమెని వెతికిందీ లేదు. ఏడాది పాటు కన్పించకుండా పోయినా ఫర్వాలేదనుకుని, వేరే అమ్మాయితో పెళ్ళికి సిద్ధ పడ్డాడు. అంటే ప్రధాన పాత్రగా సమస్యకి సంబంధించి అతడికి గోల్ కూడా లేదు. 

      ఇలా ప్రధాన పాత్ర కాకపోతే ప్రత్యర్ధి పాత్రవాలి. అంటే అతను ఏదైనా చర్యకి పాల్పడి వుండాలి. దానికామె బెదిరిపోయి పారిపోయి వుండాలి. ఇది బయటపడితే అతడికే ప్రమాదంగా వుండాలి. అందుకే ఆమెని వెతక్కుండా తేలుకుట్టిన దొంగలా వుండిపోవాలి. తను పాల్పడిన చర్య బయటపడకుండా చూసుకోవడమే తన గోల్ గా వుండాలి. ఇలా కూడా లేదు. కాబట్టి ప్రత్యర్ధి పాత్ర కూడా కాదు. ప్రధాన పాత్ర కాక, ప్రత్యర్ధి పాత్రా కాక, ఓ పాసివ్ సహాయ పాత్ర అయ్యాడు. 

          ఇక సూర్యకాంతంతో జరిగిన కథ పూజకి చెప్పేసి, ఆమెతో ఎంగేజ్ మెంట్ అనుకుంటున్నప్పుడు,  సూర్యకాంతం వచ్చేస్తుంది. ఇది ఇంటర్వెల్. ఈ సీన్లో అభిషేక్ షాక్ అవుతాడు. పిల్లిలా మారిపోతాడు. బెంబేలెత్తి పోతాడు. ఎందుకో? ఆమెని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడా? ఆమే ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆమెదగ్గర ఫోటోలు, చాట్స్, కాల్స్ ఏమైనా వున్నాయా? వుంటే పూజకి చెప్పేశాక ఇక భయమెందుకు?
నీ పాస్ట్ గురించి నేనేం చేయలేను, కానీ నీ ప్రెజెంట్, ఫ్యూచర్ మొత్తం నాదే నంటూ పూజా అభయమిచ్చాక  ఇంకా భయమెందుకు? ఏముందనిప్రేక్షకులు ఈ ఇంటర్వెల్ సీనుకి సీట్లకి అతుక్కుపోయి టెన్షన్ అనుభవించాలి. హీరో అలా కిందా మీదై పోతాడెందుకు? ఏముందని ఇంటర్వెల్ కి ఈ బిల్డప్? ఈ మాత్రానికి సెకండాఫ్ ఇంకా ఇంటరెస్టింగ్ గా వుంటుందని సూర్యకాంతం సెలవివ్వడం.

***
       కన్పించకుండా పోయిన ఈ ఏడాది కాలమంతా సూర్యకాంతం ఎక్కడుంది? ఏం చేసి బతికింది? ఫోబియా తగ్గి ఎవర్నైనా ప్రేమించిందా? పెళ్లి చేసుకుందా? అవి విఫలమై ఏమీ ఎరగనట్టు తన దగ్గరికి తిరిగి వచ్చిందా? ఎన్ని పెళ్ళిళ్ళు  లేదా ప్రేమలు ముక్క చెక్కలయ్యాయి? ఎవరైనా ఆత్మహత్యలు చేసుకున్నారా? ఏడాది అజ్ఞాతంలో వున్న ఈమె మారిటల్, లీగల్ స్టేటస్సులేమిటి? మెంటల్ కేసులు సహా ఎన్ని పోలీసు కేసులున్నాయి? ఎవర్నైనా చంపి తప్పించుకొచ్చిందా - ఈ సందేహాలు అభిషేక్ కి రావు. మనకొస్తే మన ఖర్మ. పైపైన రాసేసి తీసేసే లైటర్ వీను రాతతీతల బాధితులుగా...

          ఇంతకీ సంవత్సరం పాటు సూర్యకాంతం ఎక్కడికి అదృశ్యమై ఏం చేసిందో అదొక ఆగథా క్రిస్టీ సిండ్రోమా? ప్రఖ్యాత క్రైం రచయిత్రి ఆగథా క్రిస్టీ అదృశ్యమైన ఆ పదకొండు రోజులూ  ఎక్కడుందో ఏం చేసిందో, ఎలా తిరిగి వచ్చిందో ఎప్పటికీ తేలని మిస్టరీ. సూర్యకాంతం అగథా క్రిస్టీ దగ్గరికెళ్ళి కూడబలుక్కుని వచ్చిందా? వన్నియర్ ఆగి వెళ్ళు, అప్పుడు వాడు పెళ్లి చేసుకుంటూ వుంటాడు, వెళ్లి చెడగొట్టు-  అని పిచ్చి సలహా కాంతం కిచ్చిందా క్రిస్టీ? ఇది క్రిస్టీ కాంతం కుట్రా? 

          ఇక సెకండాఫ్ కథనేం చేయాలో అర్ధంగాక పాత్రల నెత్తిన తెల్ల గుడ్డ లేయించాక, పాత మూస ఫార్ములా డ్రామా మొదలు. ఇద్దరు హీరోయిన్లతో హీరో ఒకర్ని దాస్తూ ఇంకొకరితో తంటాలు. ఇంటర్వెల్ కే హీరో సూర్యకాంతాన్ని చూసి భయమూ, ఆ ఇంటర్వెల్లూ ఫాల్స్ అన్పించాక, మళ్ళీ ఇదొకటి. 

       ఇలా వుంటే, తర్వాత సూర్యకాంతం గురించి అభిషేక్ పూజ ముందు ఓపెనై పోయాక, పూజ కూడా  ఫూలిష్ గా ప్రవర్తిస్తుంది. తన కాబోయే భర్త మాజీ ప్రియురాలు సూర్యకాంతాన్ని ఎంటర్ టైన్ చేస్తుంది. ఎందుకు? జెలసీ పుట్టించి నెత్తి మీదికి తెచ్చుకోవడానికా? అయితే తమ ఎంగేజ్ మెంట్ రింగ్ సూర్యకాంతం చేతే సెలెక్ట్ చేయించమని కూడా అభిషేక్ ని కోరుతుంది. ఎందుకు? తనని పరిహసిస్తున్నట్టు ఫీలై సూర్యకాంతం పంతానికి పోవడానికా? ఆమెలో మళ్ళీ అభిషేక్ తో పెళ్లి మీద ఆశలు రేకెత్తించడానికా? నీ ప్రెజెంట్, ఫ్యూచర్ మొత్తం నాదేనంటూ అభిషేక్ కి చెప్పుకున్న పూజ,  తన చాప కిందికే నీళ్ళు తెచ్చుకునే పిచ్చి ప్రవర్తన. ఇదీ పాత్ర చిత్రణ. 

          అలా అభిషేక్ పూజకి తొడిగేందుకు పూజ కోరికమేరకు తనే రింగు సెలెక్టు చేసిన సూర్యకాంతం, ఎంగేజ్ మెంట్ సమయంలో తన వేలికే  పెట్టుకుని, తీయరాక  సీన్ క్రియేట్ చేస్తే -  ఈ ఎంగిలి సంబంధం వద్దని పూజమ్మ పేరెంట్స్ వెళ్ళిపోక, ఆ రింగునే కూతురికి తొడిగించి సెలబ్రేట్ చేసుకోవడం. ఉంగరం సెలెక్షన్ పథకం ఇలా కడదేరి, ఎంగిలి ఉంగరంతో మిగిలిన పిచ్చి పూజ - నీ ప్రెజెంట్
, ఫ్యూచర్ మొత్తం నాదేనన్న డైలాగుని బానిస డైలాగుగా ప్రూవ్ చేసుకోవడం.

***
         ‘నీ పాస్ట్ గురించి నేనేం చేయలేను. కానీ నీ ప్రెజెంట్, ఫ్యూచర్ మొత్తం నాదే’ అని డిక్లేర్ చేసుకున్న అమ్మాయి,  ఆ మాజీ ప్రియురాల్ని తన ప్రేమ ఎరీనాలోకి రానిస్తుందా? ఇలా వుంటాయి చెప్పే మాటలు, చేసే పనులు. సినిమాలో కథ వున్నట్టు అన్పించాలంటే పాత్రల మధ్య సంఘర్షణ పుట్టాలి. ఇక్కడ పాత్రలు మూడూ చెట్టపట్టా లేసుకుంటే సంఘర్షణ ఎలా పుడుతుంది. సినిమా ఎలా అవుతుంది. 

          ఈ ఉంగరం ఎపిసోడ్ కంటే  ముందే సూర్యకాంతం అభిషేక్ కి చెప్పేస్తుంది -  ఎంగేజ్ మెంట్ సంగతి తెలిసే తను బ్రేక్ చేయడానికి వచ్చానని. అయినా ఆమెని పూజతో కలుపుతాడు. ఉంగరం షాపింగ్ కి తీసికెళ్తాడు. ఇలా గజిబిజిగా వుంటాయి పాత్రలు, కథనం. సెకండాఫ్ ఏమీ అర్ధం గావడం లేదని నెత్తిన తెల్లగుడ్డ లేసుకోవడం కరెక్టే. 

           
ఇలా ఎంగేజ్ మెంటయిన జంటని సూర్యకాంతం టూర్ పంపుతుంది. తనూ అక్కడికి వెళ్లి డిస్టర్బ్ చేస్తుంది. ట్రూత్ గేమ్ అని ఆడతారు. ఈ ట్రూత్ గేమ్ లో పూజ అడిగిన ప్రశ్నకి తను తిరిగి వచ్చి రెండు సార్లు ప్రపోజ్ చేశాననీ, ఇక్కడి కొచ్చిందే వాళ్ళిద్దరి సంబంధాన్ని బ్రేక్ చేయడానికనీ చెప్పేస్తుంది సూర్యకాంతం. 

          ఎందుకు బ్రేక్ చేయడానికి వచ్చింది సూర్యకాంతం. ఇందులో అభిషేక్ చేసిన తప్పేమిటి? అభిషేక్ ప్రపోజ్ చేస్తే ఏడాది కన్పించకుండా పోయిన తను ఇప్పుడు వచ్చి అభిషేక్ ని ప్రేమిస్తున్నానంటే ఎలా కుదురుతుంది? అసలు తన ఫోబియా ఏమైంది? ట్రీట్మెంట్ తీసుకుని నయం చేసుకుందా? అభిషేక్ మీద ఇంటరెస్ట్ వుంటే ఇన్నాళ్ళూ తనెందుకు కాల్ చేయలేదు? తను ఇక రాదనుకుని అతను  పెళ్లి చేసుకుంటూంటే ఎలా వచ్చి బ్రేక్ చేస్తుంది? అతడి పేరెంట్స్ అమాయకులు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎవతివే నువ్వని తరిమి కొట్టే వాళ్ళు. దీన్ని పాత్ర అనాలా? అసలు సూర్యకాంతం క్యారక్టర్ బయోగ్రఫీ ఏమిటి? 

        ట్రూత్ గేమ్ లో సూర్యకాంతం అలా అన్నాక, పూజ రియాక్ట్ అవకుండా అభిషేక్ కే బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతుంది! అభిషేక్ ప్రెజెంట్, ఫ్యూచర్ తనదేనని చెప్పుకున్న తను- ఇదే మాట సూర్యకాంతం కి చెప్పి అమీతుమీకి సిద్ధపడక జారుకుంటుంది. పాత్రలు అవి అన్న మాటలకే ఎక్కడా కట్టుబడవు. ఇక సంఘర్షణ ఎలా పుడుతుంది? ఇంత పేలవంగా ఇక్కడ ప్లాట్ పాయింట్ టూ వుంది. ఈ తప్పుడు ప్లాట్ పాయింట్ టూని సరిదిద్దడమెలా? 

          మొదట్లో సూర్యకాంతం ఫ్లాష్ బ్యాక్ విన్నాక - నీ ప్రెజెంట్, ఫ్యూచర్ నాదేనని పూజా చెప్పి వుండకూడదు. ఆమె ఆప్పుడు అభిషేక్ సిన్సియారిటీనీ, కమిట్ మెంట్ నీ అనుమానించి వుండాలి. అతడి పట్ల అపనమ్మకంతో వుండాలి. అతడే నమ్మకం కల్గించాలి. ఎట్టి పరిస్థితిలో నా ప్రెజెంట్, ఫ్యూచర్ నీదేనని అతను భరోసా ఇచ్చి వుండాలి. ఈ భరోసా ఇప్పుడు కన్పించక పూజ బ్రేకప్ చెప్పుకుని వెళ్ళిపోతే అర్ధముంటుంది. 

          పూజ బ్రేకప్ చెప్పేశాక అభిషేక్ లో అంతర్మథనం. సూర్యకాంతం వైపు మొగ్గు చూపడం. ఆమె పేరెంట్స్ తో తను మాట్లాడతానని వెళ్ళడం. అక్కడ తన పొరపాటు ఒప్పుకుని అభిషేక్, పూజలని కలపడం, ఇంతే. అంతలోనే మనసెందుకు మార్చుకుందో తెలీదు. లైటర్ వీనుగా మార్చుకుంది. ఇక అపూర్వ త్యాగమయిగా ఉత్తర మిచ్చి వెళ్లిపోతే,  అభిషేక్ వెతికి పట్టుకురావడం. ఇంట్లో కలుపుకోవడం. పూజని పెళ్లి చేసుకోవడం. ఆ ఇంట్లోనే  సూర్యకాంతం హేపీగా సెటిలైనట్టు ఎండ్. 

        పాపం, ఎలాటి సమస్యలతో సూర్యకాంతం ప్రేక్షకులకి పరిచయమైందో, అవి పరిష్కారమై జీవితం బాగుపడకుండా అలాగే మిగిలిపోయింది! సొంతిల్లు ఏమైందో. ఆ ఇంట్లో అమ్మమ్మ సూర్యకాంతం పటాలేమయ్యాయో,   అలాటి లెజెండ్ కిలాటి మనవరాలు ఈసురోమని మిగిలింది!

సికిందర్

Tuesday, April 2, 2019

803 : స్క్రీన్ ప్లే సంగతులు




            మిడిల్ కథనం : అభిషేక్ (రాహుల్ విజయ్) పెళ్లి చేద్దామనుకుంటారు తల్లిదండ్రులు. పూజ  (పెర్లెన్ భేసానియా) తో పెళ్లి చూపులు ఏర్పాటవుతాయి. పరస్పరం నచ్చుతారు. త్వరలో నిశ్చితార్ధం పెట్టుకుందామనుకుంటారు. అభిషేక్, పూజలు కలుసుకోవడం మొదలెడతారు. కాల్స్ మాట్లాడుకుంటారు. సినిమాలకెళ్తారు. లంచ్ కెళతారు. ఇక నిశ్చితార్థానికి తేదీ అనుకుంటారు. అప్పుడు అభిషేక్ పూజతో మాట్లాడాలంటాడు. అప్పుడామెకి ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు తన పూర్వ ప్రేమ సూర్యకాంతం (నిహారిక) గురించి. 

          ఫ్లాష్ బ్యాక్ లో బిగినింగ్ కథనం : సూర్యకాంతంని చూసి వెంటపడతాడు అభిషేక్. ఆమె కేర్ చేయదు. మాటమీద నిలబడదు. తప్పించుకునే రకం. ఎప్పుడెలా వుంటుందో తెలీదు. ఎప్పుడు మాయమైపోయి ఎప్పుడొస్తుందో తెలీదు. విచిత్రంగా అన్పిస్తున్న ఆమెకి అలాగే లవ్ చెప్తాడు. సమాధానం తర్వాత చెప్తానని మాయమై పోతుంది. అభిషేక్ ఆమె ఇంటికెళ్ళి తల్లి (సుహాసిని) ని కలుస్తాడు. కూతురి గురించి చెప్పుకొస్తుందామె. దాని చిన్నప్పుడు తనూ భర్తా బాగా కొట్లాడుకుని దానికి మనశ్శాంతి లేకుండా చేశారు. విడాకులు తీసుకుని ఇంకా గాయపర్చారు. ఇల్లంటే నాల్గు గోడలు కాదు, ఒక కుటుంబం. ఆ కుటుంబాన్ని ఇవ్వలేకపోయారు. దీంతో బయటే ఎక్కువ గడుపుతోంది. ఎప్పుడు తోస్తే అప్పుడు టూర్స్ కెళ్ళిపోతుంది. పెళ్ళంటే, భార్యాభర్తల సంబంధమంటే నమ్మకం పోయింది...ఇలా చెప్పుకుని బాధపడుతుంది సూర్యకాంతం తల్లి. 

        అయితే తనకి ఎవరి గురించీ చెప్పని ఆమె అభిషేక్ గురించి చెప్పేదనీ, అందుకని ఆమెతో క్లోజ్ గా వుంటున్న అతణ్ణి ఒక ప్రామీస్ చేయమనీ అంటుంది. తను ఎన్నాళ్లుంటుందో తెలీదు ...అది తిరిగిరావడానికి ఒక మనిషీ, వుండడానికి ఒక ఇల్లూ వుండేలా చూస్తావా అని. సరేనంటాడు. 

          సూర్యకాంతం తిరిగి వస్తుంది. ఇప్పుడంటాడు - నాకు తెలిసి ప్రేమా పెళ్ళీ వీటితో నీకేం ప్రాబ్లం లేదు, ఫ్రీడం లేకపోతేనే నీకు ప్రాబ్లం. ఆ ఫ్రీడం నీకిస్తాను, నాకు నచ్చినట్టు నువ్వుండనవసరం లేదని ఆమెతో అంటాడు. అప్పుడు కూడా ఆమె ఏమీ చెప్పదు. ఇంతలో గుండెపోటుతో తల్లి చనిపోతుంది. ఇక సూర్యకాంతంని తన ఇంటికే  తీసుకుపోతాడు. ఆ కుటుంబ సభ్యుల మధ్య బాధని మర్చిపోయి మామూలు స్థితికి వస్తుంది. ఆనందంగా గడుపుతుంది. అప్పుడంటాడు – ‘పర్సనల్ లాస్ జరిగినప్పుడు ఏంచెప్పాలో అర్ధంగాదు. బాగా ఆలోచించాను, అప్పుడర్ధమైంది. చెప్పడం కాదు, చెయ్యాలీ అని. నేను నీకు ప్రామీస్ చేస్తున్నా. నీ బాధని పోగొట్టలేనేమో గానీ, నువ్వు పర్మిషనిస్తే ఆ బాధతో ఫైట్ చేసే సంతోషాన్నిస్తాను లైఫ్ లాంగ్’ అని. 

          ఆమె హగ్ చేసుకుని, తనని ఇంటిదగ్గర డ్రాప్ చేయమంటుంది, అమ్మ గుర్తుకొస్తోందని అంటుంది. ఆమెని ఇంటిదగ్గర డ్రాప్ చేశాక మాయమైపోతుంది (ప్లాట్ పాయింట్ వన్).  

          మిడిల్ కథనం కంటిన్యూ : వస్తుందని ఎదురు చూస్తాడు. ఏడాది అవుతున్నా రాదు. దీంతో పూజతో సంబంధానికి ఒప్పుకున్నాడు. ఇదంతా విన్న పూజ అంటుంది – ‘నీ పాస్ట్ గురించి నేనేం చేయలేను. కానీ నీ ప్రెజెంట్, ఫ్యూచర్ మొత్తం తనదే’నని. 

          ఇక ఎంగేజి మెంట్ ఏర్పాట్లు చేసుకుంటూ వుండగా రాత్రి పూట అభిషేక్ కి భయానక అనుభవాలవుతాయి. ఇంట్లో దెయ్యం వున్నట్టు అన్పిస్తుంది. చూస్తే సూర్యకాంతం... సూర్యకాంతం వచ్చేసింది....అభిషేక్ షాక్ తింటాడు. అతడి నోట్లో పాప్ కార్న్ కుక్కి,  “రీఫిల్ చేసుకురా, సెకండాఫ్ ఇంకా ఇంటరెస్టింగ్ గా వుంటుంది”  అంటుంది (ఇంటర్వెల్). 

          మిడిల్ -2 కథనం :
సూర్యకాంతం వచ్చేసిందని అభిషేక్ తల్లిదండ్రులకి కూడా తెలిసిపోయి గోల పెడతారు. ఇప్పుడు పూజని కాదని దీన్ని చేసుకుంటావా అంటారు. కాదంటాడు. సూర్య కాంతం గురించి పూజకి తెలుసాని ఫ్రెండ్ అడుగుతాడు. తెలుసంటాడు. పూజ గురించి సూర్యకాంతంకి తెలుసాని తండ్రి అడుగుతాడు. తెలియదంటాడు. ఎంగేజి మెంట్ గురించి సూర్యకాంతంకి తెలుసా అంటే తెలీదంటాడు. ఇలా తెలుసు, తెలియదుల మధ్య ఇప్పుడేం చేయాలో కూడా తెలియదంటాడు. ఫ్రెండ్, తండ్రీ నెత్తిన తెల్లగుడ్డ లేసుకుంటారు. 

      ఇక పూజని కలిసినప్పుడు సూర్యకాంతం నుంచి ఫోన్ రావడం, సూర్యకాంతంని  కలిసినప్పుడు పూజనుంచి కాల్  రావడం...ఇటూ అటూ అబద్ధాలు  చెప్పి తప్పించుకోవడం...ఇద్దరితో దాగుడుమూతలాడడం... చివరికి పూజకి తెలిసిపోయి మందలిస్తుంది, దాచిపెట్టకుండా తనతో సిన్సియర్ గా వుండమంటుంది. సూర్యకాంతాన్ని కలపమంటుంది. అప్పుడు చెప్పేస్తాడు సూర్యకాంతంకి తన ఎంగేజ్ మెంట్ గురించి. తనకి తెలుసంటుంది. తెలిసే బ్రేక్ చేయడానికి వచ్చానంటుంది. లోలోపల బాధ పడుతుంది. తర్వాత పూజా సూర్యకాంతం కలుసుకుంటారు. ఎంగేజి మెంట్ రింగ్ సూర్యకాంతం చేతే  సెలెక్ట్ చేయించమంటుంది పూజ. 

          ఆ రింగ్ ఎంగేజిమేంట్ లో పెట్టుకుని నానా హంగామా చేస్తుంది సూర్యకాంతం.  బయట మందు కొట్టి ఆటో డ్రైవర్లతో ఐటెం సాంగేసుకుంటుంది. అభిషేక్ ఆమెకి  నచ్చజెప్పుకోవడం ప్రారంభిస్తాడు. ఆమె వాళ్ళిద్దర్నీ టూర్ పంపుతుంది. అక్కడికెళ్ళి వాళ్ళిద్దరి మధ్య తనూ వూడి పడుతుంది. సరదాగా గడుపుతారు. ట్రూత్ గేమ్ ఆడుకుంటారు. ఆ గేమ్ లో పూజ అడిగిన ప్రశ్నకి నిజం చెప్పేస్తుంది సూర్యకాంతం - తను తిరిగి వచ్చి రెండు సార్లు ప్రపోజ్ చేశాననీ, ఇక్కడి కొచ్చిందే వాళ్ళిద్దరి సంబంధాన్ని బ్రేక్ చేయడానికనీ చెప్పేస్తుంది. దీంతో హర్టయిన పూజ అభిషేక్ తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతుంది (ప్లాట్ పాయింట్ టూ). 

          ఎండ్ కథనం : ఏమీ అర్ధంగాక తండ్రికి ఫోన్ చేస్తాడు అభిషేక్. నువ్వే అలోచించి నిర్ణయం తీసుకోమంటాడు తండ్రి. అభిషేక్ సూర్యకాంతంకి సరెండర్ అయిపోతాడు. మీ ఇంట్లో నేను మాట్లాడి కన్విన్స్ చేస్తానని వెళ్తుంది. అటూ ఇటూ పేరెంట్స్ ఎదుట తన గురించి చెప్పుకుని, ఈ పెళ్ళికి అడ్డు రానని చెప్తుంది. పూజకో లెటర్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇంటికొచ్చి ఆ లెటర్ చూసుకున్న అభిషేక్ సూర్యకాంతం ని వెతికి పట్టుకుంటాడు. నువ్వు మా ఇంట్లోనే మాతోనే వుండాలని, మా పెళ్లి చూడాలనీ తీసుకుపోతాడు...(అయిపోయింది)
***
     ఈ స్క్రీన్ ప్లే లో కథ పేరుతో వున్న కథ బిగినింగ్, మిడిల్, ఎండ్ లుగా విభజన జరిగి చక్కగా ఇమిడి వుంది. మొదలెట్టిన కథ ఒకటైతే, నడిపిన కథ స్ట్రక్చర్ చెడి, పాత్రలూ చెడి ఇంకొకటిగా వుంది. ఇది ఫ్లాష్ బ్యాక్ తో మిడిల్ - బిగినింగ్ - మిడిల్ - ఎండ్ లుగా నాన్ లీనియర్ కథనంగా వుంది. కథ వచ్చేసి షార్ట్ ఫిలిమ్స్ కి, లేదా వెబ్ సిరీస్ కి సరిపోయే కంటెంట్ తో వుంది మూడే మూడు పాత్రలతో. మూడు పాత్రల సినిమాయేతర కంటెంట్ ని సినిమాగా వెండితెర మీద మౌంట్ చేయడం అత్యాశే. ఎంతో బలమైన కంటెంట్ వుంటే గానీ,  అదీ బిగ్ స్టార్స్ తో  బాజీ రావ్ మస్తానీ, గౌతమీ పుత్ర శాతకర్ణి లాంటి మూడు పాత్రల కథలు హిట్ కాలేదు. నిహారిక లాంటి చిన్న హీరోయిన్, విజయ్, పెర్లేన్ లాటి కొత్త హీరోహీరోయిన్లతో ఇంత లైటర్ వీన్ కథ నిలబలేక తేలిపోయింది.  

          ఉన్న ఈ లైటర్ వీన్ కథకూడా ఏమాత్రం ఆసక్తి కల్గించని, ట్రెండ్ ముగిసిన-        అరిగిపోయిన ముక్కోణ ప్రేమ కథ. పైగా ఇది రెండు గంటల సినిమా నిడివికి చాలని కథ. ఈ కథని ఒకచోట కాకపోతే ఇంకో చోట మూడు చోట్ల ముగించెయ్యొచ్చు. ముగుస్తున్న చోటల్లా పొడిగిస్తూ పోయారు. షార్ట్స్ కి, వెబ్స్ కి సరిపోయే కథని చూయింగ్ గమ్ లాచేసి సాగదీస్తూ  పోయారు.

          పైగా ఈ కథ ఇప్పటి రియలిస్టిక్ ట్రెండ్ కి భిన్నంగా మూస ఫార్ములా డ్రామాల కాలంలో వుంది. ఈ కారణంగా యూత్ అప్పీల్ ని కోల్పోయింది. కానీ కాన్సెప్ట్ వచ్చేసి పెళ్ళంటే భయపడే, కమిట్ మెంట్ ఫోబియా లేదా గామోఫోబియా గల హీరోయిన్ సమస్యగా ఇవాళ్టి పోకడనే ఎత్తుకున్నారు. ఈ పోకడని, యూత్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లంని, ఇప్పటి తాజా కథగా ఎలా డీల్ చేయాలో తెలియనట్టు – ఈ పాయింటు తీసేసి, అదే అరిగిపోయిన రొటీన్ ముక్కోణ ప్రేమ చట్రంలో బిగించి వదిలేశారు. దీంతో ప్రాబ్లం ఒకటి, నడిపిన కథ ఒకటిగా తయారయ్యింది. 

          దీన్ని స్క్రీన్ ప్లే రాయకముందే ఐడియా దశలోనే ఇన్ని లోపాలున్నాయి. ఐడియా దశలోనే ఇంకో పెద్ద లోపమేమిటంటే, ఇదే పాత్ర కథో నిర్ణయించుకోలేక పోవడం. సూర్యకాంతమా, అభిషేకా ఎవరి కథ ఇది? ఇది తెలుసుకోకపోవడం వల్ల ఐడియా దశలోనే ఈ కథ ఫెయిల్ అయింది. రెండూ పాసివ్ పాత్రలై, ఎవర్ని ప్రధాన పాత్రగా తీసుకుని కథని ఫాలో కావాలో తెలియని గందరగోళ పరిస్థితేర్పడింది. పైగా ఇప్పటి మార్కెట్ కి యూత్ అప్పీల్ వుండే రోమాంటిక్స్ తో  రోమాంటిక్ కామెడీ కాకుండా, యూత్ అప్పీల్ వుండని సీరియస్ రోమాంటిక్ డ్రామాగా చేశారు. ఇలా ఐడియా దశలోనే ఆపెయ్యాల్సిన కథ ఇది.

***
          తెలుగు సినిమా కథల్ని పైపైన రాసేసి, పైపైన తీసేసే ఒక మూఢ నమ్మకం రోమాంటిక్ కామెడీలు ప్రారంభమైన కాలంనుంచీ కొనసాగుతోంది. లైటర్ వీన్ ప్రేమకథలు ఇవే. ఎక్కడాకూదా కథ లోతుల్లోకి, పాత్రల లోతుపాతుల్లోకి వెళ్లి ఆలోచించకుండా, పైపైన ఏదో కథ అల్లేయడమే సినిమా అనే తేలికభావం చెలామణి కావడంతో కథల గురించి ఏమీ తెలియని అపరిపక్వతతో సినిమాలు తీసేవాళ్ళు వచ్చేస్తున్నారు. ఇలా సూర్యకాంతం కథ కూడా రాయడంలో అపరిక్వతా, లేక కావాలని అపరిపక్వ పాత్రల్ని తీర్చిదిద్దారా అన్నట్టు కథా కథనాల్లో సాంతం ఇమ్మెచ్యూరిటీ  నాట్య మాడుతూ వుంటుంది. అడుగడుగునా పాత్రల ఆలోచనలు, మాటలు, నిర్ణయాలు చాలా సిల్లీగా, బుద్ధిలేని తనంగా వుంటాయి. 

          మిడిల్ కథనంతో ప్రారంభం అభిషేక్
- పూజల పెళ్లి చూపులు ఓకే అవడం, ఇక షికార్లు తిరగడం అలా వుంచి ఈ పాత్రల పరిచయాలు కూడా వుండవు. వీళ్ళ చదువులు, కెరీర్స్ ఏవీ మనకి తెలీవు. పాత్రలకి ఒక ఉద్యోగం సద్యోగం అన్నట్టు వుండదు. ఈ కథకి ఇద్దరు లవర్స్ వుండాలి, వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఏమిటనేది అనవసరం - పైపైన రాసేసి తీసేసే ఇలాటి లైటర్ వీన్ ప్రేమ సినిమాకి అన్నట్టు వుంటుంది. కాబట్టి ఇవి నేటి యువ ప్రేక్షకులు ఐడెంటిఫై చేసుకోగల రియలిస్టిక్ పాత్రలు కావు. మూలాలు లేని పాత మూస ఫార్ములా డ్రామా పాత్రలు. 

          పెళ్లి చూపులు ఏర్పాటయ్యే నాటికీ అభిషేక్ పూర్వ రంగం ఏమిటి, తర్వాత అతనే చెప్పుకునే ఫ్లాష్ బ్యాక్ ప్రకారం?  సూర్య కాంతం అనే అమ్మాయిని ప్రేమించి లవ్యూ చెప్తే, ఆమె ఏ సంగతీ చెప్పకుండా ఏడాది కాలంగా కన్పించకుండా పోయింది. ఈ పూర్వరంగంలో ఇప్పుడామెని మర్చిపోయి, పూజతో పెళ్లి చూపులకి సిద్ధపడ్డాడు. ఆమెతో షికార్లు తిరిగాడు. ఇక  ఎంగేజిమేంట్ అనుకునే సరికి పూజతో మాట్లాడాలని చెప్పి అర్జెంటుగా ఆమెకి తన గతం చెప్పుకున్నాడు.

          ఎందుకు చెప్పుకున్నాడు? సూర్యకాంతంతో ఫిజికల్ రిలేషన్ షిప్ తో వున్నాడా? లేనప్పుడు ఎందుకు చెప్పుకున్నాడు? సూర్యకాంతం తనని రిజెక్ట్ చేసి పోయినట్టే వున్నప్పుడు, తను చేసిన తప్పుకూడా లేనప్పుడు, పనిమాలా పూజకి ఎందుకు చెప్పుకున్నాడు? ఎందుకు చెప్పుకోవాలంటే ప్రేక్షకులకి ఫ్లాష్ బ్యాక్ కథ తెలియాలి కాబట్టి. ప్రేక్షకులకి బ్యాలెన్స్ వుండిపోయిన కథ తెలియడానికి పాత్ర ఇలా దిగజారాలన్న మాట. ఫ్లాష్ బ్యాక్ కి లీడ్ ఇలా వుందన్న మాట.

***
        ఇక ఫ్లాష్ బ్యాక్ గా వచ్చే బిగినింగ్ కథనంలో సూర్యకాంతం పాత్ర కూడా పనీపాటా లేనట్టు వుంటుంది. అభిషేక్ తో ఈమె వింత ప్రవర్తనకి కారణం పెళ్ళంటే భయమనే కమిట్మెంట్ ఫోబియా లేక గామో  ఫోబియా. ఆ మధ్య ‘ఇండియా టుడే’ యువతరంలో ఒక జాడ్యంలా విస్తరిస్తున్న ఈ ఫోబియా గురించి రాసుకొచ్చింది. ఈ ఫోబియాకి వేర్వేరు కారణాలుంటాయి. సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేయడాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఈ ఫోబియాతో వుంటారు. అమ్మాయిలతో తిరుగుతారు గానీ పెళ్లనేసరికి పరారవుతారు. అమ్మాయిలూ వయసు మీద పడుతున్నా కెరీరే ముఖ్యమనుకుని పెళ్లిని వాయిదా వేస్తూంటారు. ఇలా రకరకాల కారణాలుంటాయి. ఇవి కాక,  కొన్ని అనుభవాల వల్ల పెళ్ళికి నో అంటారు. చిన్నప్పడు మానసికంగా దెబ్బతింటే కూడా ఈ పరిస్టితి రావచ్చు. ఇలా రకరకాల కారణాలతో గామో  ఫోబియాని చిత్రిస్తూ, బాలీవుడ్ నుంచి కుప్ప తెప్పలుగా సినిమాలు వస్తున్నాయని రాసింది ‘ఇండియా టుడే’. 

          ఇటీవలే అనురాగ్ కాశ్యప్ తీసిన హిట్ ‘మన్మర్జియా’ కూడా వచ్చింది. ఇవన్నీ రియలిస్టిక్ లవ్ ఎంటర్ టైనర్లు. హాలీవుడ్ నుంచైతే ఇక చెప్పర్లేదు. ఇవి చూసి, ‘సూర్యకాంతం’ ని  చూస్తే - శవ్వ శవ్వ – నవ్వొస్తోంది! బెటర్ టు వాచ్ ‘వివాహబంధం’ లో సూర్యకాంతమ్మని. 

          రియలిస్టిక్ గా తీయాల్సిన మోడరన్ ప్రాబ్లంని, ముసలి చాదస్తాలు పెట్టుకుని అరిగిపోయిన మూస ఫార్ములాగా తీసినట్టుంది. సరే, ఇలా ఠికానా లేని సూర్యకాంతంకి ప్రేమిస్తున్నట్టు చెప్తాడు అభిషేక్. ఆమె మాయమైపోతుంది. అప్పుడామె తల్లిని కలిస్తే అసలు విషయం చెప్తుంది. దాని చిన్నప్పుడు తమ భార్యాభర్తల తగాదాలూ, విడాకులూ, ఇదంతా చూసి గాయపడి అదిలా తయారయ్యిందని...పెళ్ళంటే నమ్మకం పోగొట్టుకుందనీ. ఇంటి పట్టున వుండక టూర్లు వెళ్లిపోతుందనీ. 

          ఇక్కడ ఈ తల్లిగారిని చూస్తే ఏమిటంటే, ఒక్కగానొక్క కూతుర్ని బాగుపర్చే చర్యలేమీ తీసుకోలేదు. గాలికి వదిలేసి బాధపడుతూ కూర్చుంది మంచి డబ్బూ, ఎడ్యుకేషనూ వున్న  మదరమ్మ గారు. లాజిక్ అవసరం లేని మూస ఫార్ములా కథ కదా. 

          ఇదంతా చెప్పి ఒక కీ డైలాగు చెప్తుంది మదర్ - ఎవరి గురించీ చెప్పని కూతురు అభిషేక్ గురించి చెప్పేదని. అంటే ఏమిటర్ధం? అభిషేక్ అంటే సాఫ్ట్ కార్నర్ వున్నట్టే కదా? కానీ దీన్ని గుర్తించి ఆ మేరకు ఏ మాత్రం ప్రవర్తించడు. ఇక మదర్ ప్రామీస్ చేయమంటుంది. తను ఎన్నాళ్లుంటుందో తెలీదనీ,  అది తిరిగిరావడానికి ఒక మనిషీ, వుండడానికి ఒక ఇల్లూ వుండేలా చూడమనీ అంటుంది. అంటే కూతురిలాగే ఫోబియాతో తిరుగుళ్ళు తిరిగి వస్తూ వుండి పోవాలన్న మాట జీవితాంతం. అలా తిరిగి వస్తూంటే ఇంట్లో ఒక మనిషి వుండాలన్న మాట వెల్కం చెప్పడానికి. మదరమ్మకి కూతురి భవిష్యత్తు గురించి ఇటువంటి  బెస్ట్ ప్లాన్స్ వున్నాయి. కూతురు సైకియాట్రిక్  కేస్ అని ఇక గుర్తించే ప్రసక్తే లేదు, ట్రీట్మెంట్ ఆలోచనే లేదు. గోడకి మహానటి సూర్యకాంతం ఫోటోలన్నీ పెట్టుకుని వుంటుంది. ఆమె తన ఆమ్మట. ఆ అమ్మ సూర్యకాంతమ్మ దిగివస్తే నాల్గు దులుపుళ్ళు దులిపి తరిమి తరిమి కొడుతుంది. అప్పుడు రోడ్డున పడి తిరిగేది ఆ కూతురు కాదు, ఈ మదర్.

          ఇలాటి మదర్ పిచ్చి పిచ్చి మాటలకి అలాగేనని మాటిస్తాడు. ఈ మాట ప్రకారమైనా నడుచుకోడు తర్వాత. ఇలా సెటప్స్ వుంటాయి గానీ వీటి కొనసాగింపుల కోసం చూస్తే పే ఆఫ్స్ వుండవు. ఎక్కడిదక్కడే వదిలేస్తూ కథనం నడుస్తూంటుంది.     
     
          ఇప్పుడు ఇక్కడ ఇలా సూర్యకాంతం పాత్ర ఫోబియాతో వెల్లడయ్యాక, దీనికి డెప్త్ గురించిన ఆలోచన రాలేదు. ఎందుకు రాలేదంటే, లాజిక్ గీజిక్ పక్కన బెట్టి పైపైన రాసేసి తీసేయాలి కాబట్టి. లేకపోతే అభిషేక్ కంటే ముందు, అభిషేక్ తో పాటూ, సూర్యకాంతంకి ఇంకా చాలా మంది తగిలివుండాలి లవ్ కోసం వెంటపడి. సూర్యకాంతం లాంటి ఎక్సెంట్రిక్ పాత్రని ఇలా కదా విస్తరించి చూపాలి? ఈ విస్తరణ లేకే మూడు పాత్రల వెబ్ సిరీస్ కి పనికొచ్చే కథ కురచదై పోయింది సిల్వర్ స్క్రీన్ కి. 

          ఇక సూర్యకాంతం టూర్ నుంచి వచ్చాక ఫూలిష్ గా ప్రపోజ్ చేస్తాడు అభిషేక్. గొప్ప సైకాలజీ తెలిసిన వాడిలా మాట్లాడతాడు, ‘నాకు తెలిసి ప్రేమా పెళ్ళీ వీటితో నీకేం ప్రాబ్లం లేదు, ఫ్రీడం లేకపోతేనే నీకు ప్రాబ్లం. ఆ ఫ్రీడం నీకిస్తాను, నాకు నచ్చినట్టు నువ్వుండనవసరం లేదు’ అంటాడు!

          ఏమిటిది? ఇతడికేదో తెలిసిందట ఆమె మనసు. ఇంతకి ముందు ప్రపోజ్ చేశాడంటే ఆమె ఫోబియా గురించి తెలీదు. ఇప్పుడు ఫోబియా గురించి మదర్ చెప్పాక కూడా ఆ ఫోబియాతో ముడిపడిన పెళ్లిని ప్రపోజ్ చేయడమేమిటి? పైగా ‘నాకు తెలిసి ప్రేమా పెళ్ళీ వీటితో నీకేం ప్రాబ్లం లేదు, ఫ్రీడం లేకపోతేనే నీకు ప్రాబ్లం’ అంటాడు. చిన్నప్పుడు మానసికంగా దెబ్బతిని ప్రేమలూ పెళ్ళిళ్ళూ అనే వాటి మీదే నమ్మకం పోగొట్టుకుందని మదర్ చెప్పాక కూడా ఇంకేదో తెలిసిందని ఇలా మాట్లాడతాడు. ఆమె ప్రాబ్లం ఫ్రీడం గురించా? ఫ్రీడం ఇస్తే తీరిపోతుందా? అంటే ఆమెని పెళ్లి చేసుకుంటాడు, ఆమె ఎలాగైనా టూర్లు తిరిగి వచ్చే ఫ్రీడం వుంటుందన్నమాట. ఆమె సమస్య ఫోబియా అనేది కథకి అడ్డమని తీసి అవతల పారేశాడన్న మాట. 

          చిన్నప్పటి మానసిక గాయాలతో పెళ్లి ఫోబియాతో వున్నామెని ముందా ఫోబియాలోంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయకుండా, పెళ్లి కక్కుర్తి ఏమిటి? పెళ్ళంటూ ఇంకా బెదరగొట్టడమేమిటి? ఆ ఫోబియాలోంచి బయటికి తీసుకొచ్చే పద్ధతులున్నాయి. కామెడీగా చేస్తాడో ఇంకెలా చేస్తాడో వాడిష్టం. ఆమెకి నయమయ్యాక ఆమె నోటి నుంచే రావాలి  పెళ్ళనే మాట! 

          మధ్యలో మదర్ చనిపోవడమొకటి. ఇక ఒంటరిదైన సూర్యకాంతాన్ని తన ఇంటికే తీ సుకుపోయి, ఆ బాధలోంచి బయటికొచ్చేలా చేస్తాడు. ఒక మాంటేజ్ సాంగ్ ఆమె నవ్వుతూ తుళ్ళుతూ వున్న దృశ్యాలతో వుంటుంది. ఇదయ్యాక మళ్ళీ గోల మొదలెడతాడు. ఈసారి ఇంకా ఫూలిష్ గా, ‘పర్సనల్ లాస్ జరిగినప్పుడు ఏంచెప్పాలో అర్ధంగాదు. బాగా ఆలోచించాను, అప్పుడర్ధమైంది. చెప్పడం కాదు, చెయ్యాలీ అని. నేను నీకు ప్రామీస్ చేస్తున్నా. నీ బాధని పోగొట్టలేనేమో గానీ, నువ్వు పర్మిషనిస్తే ఆ బాధతో ఫైట్ చేసే సంతోషాన్నిస్తాను లైఫ్ లాంగ్” అనేసి!

       మళ్ళీ ఇదేమిటి? ఆమె పర్సనల్ లాస్ లోంచి బయటికే  వచ్చేసింది, వాకౌట్ చేసే సింది, ఆనందంగా వుందిప్పుడు. మళ్ళీ పర్సనల్ లాస్ అంటూ పుండుని గెలుకుతాడేమిటి? కోతి పుండు బ్రహ్మ రాక్షసి చేయాలనా? పర్సనల్ లాస్ జరిగినప్పుడు ఏంచెప్పాలో అర్ధంగాదా?  బాగా ఆలోచిస్తే అప్పుడర్ధమైందా? చెప్పడం కాదు, చెయ్యాలీ అని అర్థమైందా? చేశాడుగా ఆమెని  - అంత మాంటేజ్ సాంగ్ వేసి హ్యాపీగా. ఇంకేంటి? మళ్ళీ ప్రామీస్ చేస్తున్నాడా? ఆమె  బాధని పోగొట్టలేడేమో గానీ, ఆమె పర్మిషనిస్తే ఆ బాధతో ఫైట్ చేసే సంతోషాన్నిస్తాడా లైఫ్ లాంగ్? ఇదన్న మాట. చివరి కొచ్చేసి లైఫ్ లాంగ్ అంటున్నాడంటే పెళ్లి కక్కుర్తే. పెళ్లి కక్కుర్తితోనే ఇలా అర్ధం పర్ధం లేకుండా మాట్లాడుతున్నాడు. 

          అప్పుడామె ఫోబియాటో వుంటే తెలీక లవ్ చెప్పాడు, ఇప్పుడు ఫోబియాటో బాటు ఆమె మదర్ కూడా చనిపోయి వుంటే పెళ్ళంటున్నాడు. ఎంతసేపూ తన కక్కుర్తే. ఈ దెబ్బకి ఆమె పారిపోయింది. మళ్ళీ కన్పించకుండా చెక్కేసింది. అయ్యో మదర్ కి ప్రామీస్ చేసి ఇలా చేశానే, ఎక్కడుందో వెతకాలని ప్రయత్నించడు. మొగుడు వస్తాడని ఎదురు చూస్తూ కూర్చునే పెళ్ళాంలా కూర్చుంటాడు. తను అంత ఫూలిష్ గా మాట్లాడినందుకు వుందో సూసైడ్ చేసుకుందో కూడా పట్టదు. ఇది చాలా హాస్యాస్పదమైన ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం.
(మిగతా రేపు)

సికిందర్

Sunday, March 31, 2019

805 : స్క్రీన్ ప్లే సంగతులు



     
     చాలా కాలం తర్వాత తెలుగు రోమాంటిక్ కామెడీకి / డ్రామాకి  స్క్రీన్ ప్లే సంగతులు రాయబోతే అదే పరిస్థితి. అదే సినిమా. అవే సంగతులు. అదే వదలని అనారోగ్యం. ఏ మాత్రం మార్పు లేదు, రాదు కూడా. ప్రేమ సినిమా అనగానే ఇంకా ఇరవై ఏళ్ళనాటి ‘నువ్వే కావాలి’ మార్కు ప్రేమ తీసేయడం. దీనికి మానసిక కారణాలున్నాయి. ఇప్పటి నయా మేకర్లు వాళ్ళ టేనేజిలో ఏవైతే చూస్తూ పెరిగారో ఆ టీనేజీ ప్రేమ సినిమాలు తప్ప వేరే వూహించలేని క్రియేటివ్ బానిసత్వానికి లోనయ్యారు. ఖర్మకాలి తమ కింది తరానికి చెందిన మేకర్ల లాగా అన్ని జానర్ల సినిమాలు చూస్తూ పెరగలేదు. అప్పట్లో భక్తి నుంచి చరిత్ర దాకా, కుటుంబం నుంచి సామాజికం దాకా, హాస్యం నుంచీ హార్రర్ దాకా, లవ్ నుంచీ ట్రాజడీ దాకా, క్రైం నుంచీ కౌబాయ్ దాకా అన్ని రకాల  సినిమాలూ తీసేవాళ్ళు. అవి చూస్తూ పెరిగిన అప్పటి మేకర్లు అటువంటి వైవిధ్యాన్ని ప్రదర్శించే వాళ్ళు. కొత్తతరం వచ్చేసరికి ఈ వైవిధ్యమంతా ఎగిరిపోయి సినిమా అంటే కేవలం టీనేజి ప్రేమ సినిమాలొక్కటే అన్నట్టు తయారయ్యింది. ఇవే చూస్తూ పెరిగి ఇవే తీయాలి కాబోలని నయా మేకర్లు వారం వారం  ఇప్పటికీ అవే రోమాంటిక్ కామెడీలు, డ్రామాలూ తీసి మీద పడేస్తున్నారు.


          తీస్తే అపార్ధాలతో ప్రేమికులు విడిపోవడం, లేదంటే ప్రేమని వెల్లడించలేక పోవడం, ఇంకా లేదంటే  ముక్కోణ ప్రేమ! ఈ మూడు మూస ఫార్ములాలే ప్రేమ సినిమాలు ఈ ఇంటర్నెట్ రోజుల్లో కూడా. ప్రేక్షకులు ఉత్త దద్దమ్మలనుకుంటున్నారు. ఇవే తీసే నిర్మాతలు కూడా ఇలాగే తయారయ్యారు. వారంవారం రెండు చేతులూ వాటంగా కాల్చుకుని హాహాకారాలు చేస్తూ వెళ్ళిపోవడం. ఇవే తీసే నయా మేకర్లు - ఇలాగే చేతులు కాల్చుకునే నిర్మాతలు... ఇదే ఇప్పటికి కూడా హిట్ కాంబినేషన్. వీళ్ళూ వీళ్ళూ ఏం చేసుకుంటే మనకెందుకని ప్రేక్షకులు కూడా వీళ్ళ సినిమాలకి డుమ్మాకొట్టి ఇంట్లో కూర్చుంటున్నారు. ప్రేమ సినిమాలు థియేటర్లలో, ప్రేక్షకులు వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో. 

          ఈ నయా మేకర్లు వాళ్ళ టీనేజీ దగ్గరే ఆగిపోయి అవే ప్రేమ సినిమాలు అలాగే తీస్తూంటే, వీళ్ళతో పాటే పెరిగిన టీనేజీ ప్రేక్షకులు, ఆ తర్వాత టీనేజీ ప్రేక్షకులు, ఇంకా తర్వాత టీనేజీ ప్రేక్షకులూ వాళ్ళవాళ్ళ సాధనాలు మార్చుకుంటూ కాలంలో చాలా చాలా ముందుకెళ్ళి పోయారు. సినిమా స్క్రీన్ల నుంచి టీవీ స్క్రీన్ లకి, టీవీ స్క్రీన్ ల నుంచి కంప్యూటర్ స్క్రీన్లకి, కంప్యూటర్ స్క్రీన్ ల నుంచి స్మార్ట్ ఫోన్ల స్క్రీన్ ల కొచ్చి -  ఎడా పెడా ఎలా మారుతున్న ప్రపంచాన్ని అలా మారుతున్నట్టే హాట్ హాట్ గా చూసి పారేస్తున్నారు. గ్లోబల్  ప్రేక్షకులై పోతున్నారు. నయా మేకర్లు మాత్రం నడుం వంగిపోయిన ముసలమ్మల్లా ముక్కిపోయిన భావాలతో గల్లీ సినిమాలు తీస్తూ అలాగే నవ్వుల పాలవుతున్నారు. గ్లోబల్ ప్రేక్షకుడు - గల్లీ దర్శకుడు. వీళ్ళిద్దరికీ ఎలా పొసగుతుంది? 

          ఇలా ‘సూర్యకాంతం’ అనే ముక్కోణ ప్రేమకి ఇప్పటి మార్కెట్ యాస్పెక్ట్ లేదు, క్రియేటివ్ యాస్పెక్ట్ అసలే లేదు. ప్రేమ సినిమాలతో నేటి మార్కెట్ యాస్పెక్ట్ ఏమిటి? వీణ సినిమాలైన ఏడ్పుల ప్రేమ డ్రామాలు కాదు, యూత్ అప్పీల్ తో గిటార్ సినిమాలైన రియలిస్టిక్ రోమాంటిక్స్. నేటి యూత్ సినిమా గిటార్ వాయించాలి, వీణ వాయిస్తూ కూర్చోవడం కాదు. నేటి యువ ప్రేక్షకులు అంటున్న వాళ్ళల్లో చిన్నా చితకా ప్రేమ సినిమాలకి గర్ల్స్ లేరు, కొందరు బాయ్సే వుంటారు. బాయ్స్ ని దృష్టిలో పెట్టుకునే తీయాలి. నేటి యూత్ అప్పీల్ తో వుండే టేస్టులు రెండే రెండు -  ఎకనామిక్స్, రోమాంటిక్స్. ఈ రెండూ కూడా బాయ్స్ ని దృష్టిలో పెట్టుకునే. ‘హుషారు’ అనే కొత్త వాళ్లతో యూత్ సినిమా, బాయ్స్ ని దృష్టిలో పెట్టుకునే ఎకనమిక్స్ చుట్టూ తీశారు. పెద్ద స్లీపర్ హిట్టయ్యింది. నయా మేకరనే వాడు బకరా అవకూడదంటే ముందు కామర్స్ తెలిసిన వాడై వుండాలి. అప్పుడే సగం సక్సెస్ అయినట్టు. మిగతా సగం క్రియేటివ్ యాస్పెక్ట్. దీని గురించిన స్క్రీన్ ప్లే సంగతులు రేపు చూద్దాం...


804 : ఆధునిక స్క్రీన్ ప్లే సంగతులు


మిడిల్ -1 కథనం :
         
ఇటీవలి తన గతాన్నీ, ఇంకా జీవితపు లోతట్టు గతాన్నీ జంక్ యార్డులో భూస్థాపితం చేసేసి ఇక కొత్త జీవితాన్ని వూహించుకుంటూ డెబొరా పనిచేస్తున్న ‘బో డైనర్’ కొస్తాడు బేబీ. డెబొరాని ప్రేమలో పడెయ్యాలని ఎలాటి వెర్రి వేషాలూ వేయడు. నీటుగా బిహేవ్ చేస్తాడు. తన మదర్ లాగా డెబొరా సింగర్. పైగా తన మదర్ ఈ రెస్టారెంట్ లోనే పని చేసింది. తను ఇక్కడికే రావడానికి కారణమిదే. మొదటిసారి డెబొరా అతడి పేరడుగుతుంది. అతను కూడా మొదటిసారి ఆమె పేరు అడిగి తెలుసుకుంటాడు. తను బేబీ, ఈమె డెబ్బీ. అన్నట్టు బేబీ మీద ఎన్ని పాటలొచ్చాయి, డెబొరా మీద ఎన్ని పాటలు వచ్చాయీ తెలుసుకుందామనుకుంటారు. మ్యూజిక్ షాప్ కెళ్ళి డెబొరా మీద పాట వెతికి ఆమెకి విన్పిస్తాడు. 

          అదే పాట ఫ్లాట్ కెళ్ళి పెట్టుకుని డాన్స్ చేస్తాడు. తండ్రి జోసెఫ్ టీవీలో న్యూస్ చూస్తూంటాడు. గాయపడిన ఆ నేవీ ఉద్యోగి మాట్లాడుతూంటాడు. తన నేరానికి సంబంధించిన ఈ వార్త చూసి బేబీ చానెల్ మార్చేస్తాడు. నోట్ల కట్ట తీసి ‘సీక్రెట్ లాకర్’ లో పడేస్తాడు. ఇది చూసిన జోసెఫ్ బేబీకి ఒక బ్రోషర్ చూపిస్తాడు. ఆ గుడ్ ఫెల్లాస్ పిజ్జా బ్రోషర్ చూసి - నీకు పిజ్జా తినాలన్పిస్తోందా? -  అని సైన్ లాంగ్వేజిలో అడుగుతాడు బేబీ. నాకు పిజ్జా తినాలనిపించడం కాదురా, నువ్వెళ్ళి పిజ్జా డెలివరీ బాయ్ గా చేరు - అని సైన్ లాంగ్వేజిలో మందలిస్తాడు జోసెఫ్. వెళ్లి గుడ్ ఫెల్లాస్ లో పిజ్జా డెలివరీ డ్రైవర్ గా చేరతాడు బేబీ.  

సమస్య ప్రారంభం :
     ఆ రాత్రి  ఒక రిచ్ రెస్టారెంట్ కి డెబ్బీని తీసికెళ్ళి ఆమెతో కలిసి డ్రింక్ చేస్తాడు బేబీ. కబుర్లు చెప్పుకుంటూ వుండగా, అదే రెస్టారెంట్ లో వున్న డాక్ తనని గమనిస్తూ వుండడాన్ని చూస్తాడు. లేచి గబగబా వెళ్లి కలుస్తాడు. మనం  చేయాల్సిన దోపిడీ జాబ్స్ ఇంకా చాలా వున్నాయి, నువ్వు పన్లోకి రావాలి - అంటాడు డాక్. ఇక రాలేనంటాడు బేబీ. నీ గర్ల్ ఫ్రెండ్ క్షేమంగా వుండాలని లేదా ఏమిటి నీకు - అని బెదిరిస్తాడు డాక్. ఈ బెదిరింపుకి ఏమీ చేయలేక సరేనంటాడు బేబీ. అప్పుడామెని ఇంటి దగ్గర డ్రాప్ చేసినప్పుడు కిస్ పెడుతుంది.

          మర్నాడు బేబీని పోస్టాఫీసుకి తీసికెళ్తాడు డాక్. అక్కడ రెక్కీ నిర్వహించాలంటాడు. ఎన్ని కెమెరాలున్నాయి, ఎక్కడెక్కడున్నాయి, ఎన్ని కౌంటర్స్ ఓపెన్ వున్నాయి, ఎందరు టెల్లర్స్  వున్నారు, ఎందరు గార్డ్స్ వున్నారు చూసి రమ్మంటాడు. అనుమానాస్పదంగా కన్పించకుండా ఎనిమిదేళ్ళ తన మేనల్లుడిని వెంట తీసుకుపొమ్మంటాడు. వాడితో వెళ్లి  రెక్కీ నిర్వహించి వచ్చి సమాచారమిస్తాడు బేబీ. 

       ఇక గోడౌన్ కి తీసికెళ్ళి  పాత గ్యాంగ్ నే చూపిస్తాడు డాక్. బడ్డీ, బ్యాట్స్, డార్లింగ్. బడ్డీ, డార్లింగ్ లు పెళ్లి చేసుకున్నారు. డాక్ పోస్టాఫీస్ జాబ్ వివరిస్తాడు. ప్రభుత్వ వెల్ఫేర్ స్కీములో భాగంగా ఆ నెల పంపే మనియార్డర్ల సొమ్ము దోపిడీ జాబ్. 250 మనీయార్డర్ల కవర్లు, ఒక్కో కవర్లో 700 డాలర్లు, మొత్తం విలువ 175,000 డాలర్లు. రేపు మధ్యాహ్నం దోచుకుని రావాలి. అన్ని జాగ్రత్తలూ చెప్తాడు.

ప్లాన్ ఉల్టా పల్టా : 
          ఆ రాత్రి డెబ్బీకి కాల్ చేసి లాంగ్ డ్రైవ్ ని ప్రపోజ్ చేస్తాడు బేబీ. ఆమె సరేనంటుంది.  అదే నైట్ బుచర్ అనే గన్ డీలర్ దగ్గర ఆయుధాలు కలెక్ట్ చేసుకోమంటాడు డాక్. బేబీ గ్యాంగ్ ముగ్గుర్నీ తీసుకుని బయల్దేరతాడు. మధ్యలో బ్యాట్స్ దిగి ఫుడ్ కొనుక్కు రావడానికి వెళ్తాడు. అప్పుడు అతడి మీద బడ్డీకి కంప్లెయింట్ చేస్తుంది డార్లింగ్. వీడు తనని అదోలా చూస్తున్నాడని. లేపెయ్యమంటావా అంటాడు బడ్డీ. బ్యాట్స్ దొంగిలించిన ఫుడ్డుతో వస్తాడు. 

          బేబీ వాళ్ళని బుచర్ గోడౌన్ కి తీసికెళ్తాడు. స్పెక్ట్స్ పెట్టుకుని, ఇయర్ ఫోన్స్ తో వున్న బేబీని చూసి - ఎవడు వీడు? - అంటాడు బుచర్ అనుచరుడు. మా బేబీ బాయ్ - అంటాడు బ్యాట్స్. చెవులకి ఈ తీగెలేంటి? పోలీసోడా? - అడుగుతాడు బుచర్ అనుచరుడు. ట్యూన్సు....వాడి ట్యూన్సు -  అంటాడు బ్యాట్స్. నువ్వు పోలీసువి కాదంటావా? - బేబీనే  అడుగుతాడు అనుచరుడు. నేను పోలీసుని కాదనే అంటాను - అంటాడు బేబీ. బిజినెస్ లోకి దిగి చద్దామా? -  అంటాడు బడ్డీ విసుగ్గా.  

        టార్పాలిన్ లాగి అవతల పడేసి రకరకాల ఆయుధాలు, బాంబులూ చూపిస్తూ - జంటిల్మెన్ అండ్ లేడీస్...వేడి వేడిగా ఫ్రెష్ గా వచ్చాయి...ఏవి కావాలంటే అవి ఏరుకోండి...పేమెంట్ ఎలా చేస్తారు? – అనడుగుతాడు బుచర్. 
          ఆ ఆయుధాల పెట్టెల మీద ఎపిడి అని అక్షరాలుండడం చూసి - బుల్లెట్స్ తో పేమెంట్ చేయొచ్చా? - అంటాడు బ్యాట్స్. ఎలా? – అంటాడు బ్యాట్స్. ఇలా! -  అని గన్ తీసి మొహం మీద పేలుస్తాడు బ్యాట్స్. కింద పడి చచ్చిపోతాడు బుచర్. 

          వెంటనే బుచర్ అనుచరులు రియాక్ట్ అయి ఫైర్ చేస్తారు. పెట్టెల్లోని ఆయుధాలందు
కుని బేబీ సహా బడ్డీ, బ్యాట్స్, డార్లింగ్ లు ఎదురు కాల్పులు జరుపుతారు. అసలు నువ్వెందుకు వాణ్ణి షూట్ చేశావని బ్యాట్స్ మీద అరుస్తాడు బడ్డీ. వీళ్ళు పోలీసులని తెలియట్లేదా ఎపిడి అక్షరాలూ?- అంటాడు బ్యాట్స్. అట్లాంటా పోలీస్ డిపార్ట్ మెంట్. బుచర్ అనుచరులందర్నీ చంపేసి పారిపోతారు...
***
           ఈ మిడిల్ -1 కథనం 20 సీన్లతో వుంది. 25 నిమిషాల నిడివి. బుచర్ ని కలవమని డాక్ చెప్పడం ఇంటర్వెల్ కి దారితీసే పించ్ -1 సీను. మిడిల్ -1, మిడిల్ – 2 లు రూలు ప్రకారం స్క్రీన్ ప్లేలో సమస్యతో సంఘర్షించే ఏరియా. కథానాయకుడు, ప్రతినాయకుడుల మధ్య యాక్షన్ రియాక్షన్ల కథనపు సెగ్మెంట్. ఇదీ అలవాటుగా మనం చూసేది. దీన్ని మార్చేశారు.  


          బిగినింగ్ లో ప్లాట్ పాయింట్ వరకూ కథానాయకుడైన బేబీది,  ప్రతినాయకుడైన డాక్ తో బాకీ తీర్చే ప్రీ పెయిడ్ గోల్ అని చెప్పుకున్నాం. ఈ ప్రీ పెయిడ్ గోల్ పూర్తయ్యాక అతడికింకే  సమస్యా లేదు. రీచార్జి చేసుకుని బిగినింగ్ లో లీడిచ్చిన గర్ల్ ఫ్రెండ్ తో రోమాన్స్ సాగించుకోవడమే, ఆమెతో లాంగ్ డ్రైవ్ వెళ్ళడమే వున్నాయి ఒక ఫ్రీ బర్డ్ గా. అందుకని ఓ పది నిముషాలు డెబ్బీతో పరిచయం ప్రేమగా మారే సీన్లు వస్తాయి. తను వృత్తిని మార్చుకుని పిజ్జా డెలివరీ డ్రైవర్ గా చేరే సీన్లూ వస్తాయి. ఇలా హాయిగా గడిచిపోవడమేనా మిడిల్ బిజినెస్ అంటే? ఎక్కడో ఒక చోట సమస్య మొదలవ్వాలి. ఏదోవొక గోల్ హీరోకి ఏర్పడాలి. లేకపోతే కథ పుట్టదు, సాగదు.

          మిడిల్ ఏరియాలో మందు పాతరలా తెలియని సమస్య దాగి వుండొచ్చు. మిడిల్ అంటేనే సబ్ కాన్షస్ మైండ్. సబ్ కాన్షస్ మైండ్ అంటేనే నిగూఢ రహస్యాల సముద్రం. ఎక్కడే వాస్తవాలు, జీవిత సత్యాలు, ఎదుర్కోవాల్సిన నైతిక విలువలుంటాయో తెలీదు. దిగి ఈత కొడితేనే తెలుస్తాయి. మామూలుగా, రొటీన్ గా ప్లాట్ పాయింట్ వన్ దగ్గర హీరోకి పోస్ట్ పెయిడ్ గోల్ ఏర్పడినప్పుడు, ఆ గోల్ ని సాధించేందుకు తెలిసి మిడిల్ అనే మహాసముద్రంలోకి దూకి సంఘర్షిస్తాడు. తెలియక దూకితే? రొటీన్ ని బద్దలు కొడితే? 

       ఇదే ఇక్కడ ప్లాట్ పాయింట్ వన్ తో క్రియేటివిటీ. ఇందుకే మిడిల్ ఇంత డిఫరెంట్, ఇంత ఫ్రెష్. బాకీ తీర్చే గోల్ పూర్తయిన బేబీ ఫ్రీ బర్డ్ లా ముందుకెళ్ళి పోతున్నాడు. ఇప్పుడే సమస్యలూ లేవు. డెబ్బీతో లైఫ్ ని ఎంజాయ్ చేయడమే. దీనికో ప్లానింగ్ లేదు, గోల్ వుంటేనే ప్లానింగ్. ఏదీ ప్లాన్ చేయవద్దంటాడు ఓషో రజనీష్ కూడా. 

          ప్లాన్ చేస్తే ఫ్రస్ట్రేషన్ కి లోనవుతావంటాడు. ప్లాన్ చేస్తే ఏవో ఆశలు పెట్టుకుంటావ్, ఆ ఆశలు తీరడం కోసం పనిచేస్తావ్. ఆశలే ఫ్రస్ట్రేషన్ కి మూలం, ప్లానింగే  ఆశలకి మూలం. కాబట్టి ఈ విష వలయంలో పడవద్దంటాడు. పని చేసుకుంటూ పో, ప్లానింగ్ ప్రకృతి చూసుకుంటుంది. నీ పనికి నీకేది ఎలా ఇవ్వాలో ప్రకృతికి బాగా తెలుసు. ప్రకృతి నీకిచ్చేది పరిపూర్ణంగా చాలా బ్యూటిఫుల్ గా అన్పిస్తుంది. ఎందుకంటే నువ్వుముందు ఎలాటి ఆశలూ పెట్టుకోలేదు. ఇలాకాక నువ్వు ప్రకృతికి అడ్డుపడి అపసోపాలూపడి  నువ్వనుకున్నది  సాధించినా, ఆశించినట్టు లేక నీకే  అసంతృప్తిగా వుంటుంది. కాబట్టి ప్లాన్ చేయవద్దంటాడు. ప్లానింగ్ ని ప్రకృతికి వదిలేయమంటాడు...

          బేబీ కూడా ఏ ప్లానూ గోలూ లేకుండా జామ్మంటూ వెళ్ళిపోతున్నాడు. కుదిరితే డెబ్బీతో గుప్పెడు ప్రేమ, కుదరకపోతే గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఇంకో ప్రేమ. బేబీగాడికి కైసాభీ చల్తాహై. అయితే ఒకటుంది. పనితో ప్లానింగ్ పెట్టుకోవద్దన్నారని అడ్డమైన పనులూ చేస్తే కాదు. చేస్తున్న పని దోషం లేనిదై కూడా వుండాలి. అప్పుడే ప్రకృతి సహకరిస్తుంది. బేబీ డ్రైవర్ డాక్ బాకీ తీర్చినంత మాత్రానా ఇప్పుడు చేస్తున్న పని దోషం లేనిదై పోయిందా? చట్టం సంగతి? చట్టానికి పడ్డ బాకీ సంగతి?  డాక్ తో కలిసి నేరాలు చేసి, ఇప్పుడా వృత్తి మానేసి మంచిగా బతుకుతానంటే ఎలా? ముందు చేసిన నేరాలకి శిక్ష అనుభవించి, చట్టంబాకీ తీర్చుకుంటేనే కదా ఆశిస్తున్న మంచి జీవితానికి అర్ధంపర్ధం. కాబట్టి బేబీ తలపెట్టిన పనికి ప్రకృతి చట్టం రూపంలో ఎంటరై తన ప్లానింగ్ తను చేసుకుపోతోంది  - బేబీకి లాంగ్ డ్రైవ్ కాదు, ముందు బాగా లాంగ్ జైలు జీవితం, ఆ తర్వాతే జవరాలి ఆధరాల తేనియల పానీయాలు - ఎరోటిక్ డ్రింక్!

      ప్రేమలో కూడా దోషంతో వున్నాడు. తన నేర జీవితాన్ని ఆమెనుంచి దాచాడు. ఇది కూడా తేలాలి. ఈ నేపధ్యంలోనే మిడిల్ ప్రయాణంలో మందు పాతరలు ఏర్పాటవు తున్నాయి. అవి మళ్ళీ డాక్ రూపంలో పైకి తేలాయి. బేబీ కి గర్ల్ ఫ్రెండ్ వుండడం చూసి,  లేని ఆలోచనలు డాక్ లో మొలకెత్తాయి. ఇప్పుడు వీణ్ణి బ్లాక్ మెయిల్ చేసి వాడుకోవచ్చు. అలా డెబ్బీకి హాని చేస్తానని బెదిరించి బేబీని లొంగదీసుకున్నాడు. 

          మామూలుగా బేబీ మారాలనుకుంటే డాక్ బాకీ తీర్చేశాక, పోలీసులకి లొంగి పోవచ్చు. అలా లొంగిపోతే డాక్ ని కూడా బయట పెట్టక తప్పదు. అప్పుడు డాక్ ఖచ్చితంగా చంపేస్తాడు. కానీ చేసిన నేరాలకి బేబీతో బాటు డాక్ కి కూడా శిక్ష పడాల్సిందే. బేబీ ఇదంతా ఆలోచించలేదు. డెబ్బీతో లైఫ్ కోసమే ప్రయాణం కట్టాడు. కానీ పరిస్థితులు ఆటోమేటిగ్గా ఆ వైపుకే దారితీయిస్తాయి...ఇది ప్రకృతి న్యాయం. బేబీని మళ్ళీ ఇరికించి బేబీతో బాటు డాక్ ని కూడా శిక్షించే పని పూర్తి చేయడం. వీలయితే బేబీ చేతే డాక్ ని శిక్షించడం. ఆ తర్వాత బేబీని చట్ట పరిధిలోకి తేవడం. దీనికి డెబ్బీని ఎరగా వేయడం. బ్యాక్ గ్రౌండ్ లో ఈ ప్లానింగ్ అంతా చేసుకుపోతోంది ప్రకృతి. ఒకసారి నేర ప్రపంచంలోకి ఎంటరయ్యాక శిక్షతోనే అందులోంచి విముక్తి. ఇది బేబీకి తెలియడం లేదు. జీవితం అర్ధంగావడం లేదనీ, తమకే ఇలా ఎందుకు జరుగుతోందనీ వాపోయే మనుషులుంటారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లో ఎన్టీఆర్ పాత్ర కూడా ఇలాగే వాపోతుంది (ఇది ఎన్టీఆర్ పాత్రకి చేసిన అన్యాయపు కల్పన. అన్ని పౌరాణిక పాత్రలేసి, అంత జీవితానుభవాన్ని గడించిన ఎన్టీఆర్ తన జీవితం తనకి అర్ధంగావడం లేదని వాపోవడమా? ఈ కల్పన ఎన్టీఆర్ కే అవమానం)

          జీవితం అర్ధంగాక పోవడమేమిటి, తమకే ఇలా ఎందుకు జరుగుతోందనీ వాపోవడ మేమిటి - బుద్ధిని వాడి ఒకసారి వెనక చేసిన చేష్టలు గుర్తు చేసుకుంటే అన్నీ అర్ధమవుతాయి. ఎనకటి చేష్టలని బట్టే ఎకసక్కెంగా తయారైన జీవితం. ఎవ్వరూ కారకులు కాదు. తాము పత్తిత్తులు అనుకుంటేనే అర్ధంగాదు జీవితం. బేబీగాడి ఇప్పటి పరిస్థితి ఇదే. 

          మరిప్పుడు బేబీ డ్రైవర్ గోల్ ఏమిటి? పోస్ట్ పెయిడ్ గోల్? ఏదైతే ఎరగా మారిందో దాన్ని కాపాడుకోవడమే గోల్. డెబ్బీని ఇందులోంచి కాపాడుకోవడమే గోల్. బేబీ ప్రయాణిస్తున్న మిడిల్ లో హిడెన్ గోల్.
                                             ***
        స్ట్రక్చర్ తో ఈ క్రియేటివిటీలో అర్ధం జేసుకోవాల్సిందేమిటంటే, ప్లాట్ పాయింట్ వన్ లో ప్రీపెయిడ్ గోల్ పూర్తయినా,  ఆ తర్వాత మిడిల్ లో ఎక్కడో దాగి పోస్ట్ పెయిడ్ గోల్ వుంటుందనీ. ప్రీ పెయిడ్ గోల్ తాత్కాలికమే. పోస్ట్ పెయిడ్ గోల్ స్క్రీన్ ప్లేలకి శాశ్వత టూల్. ఇది లేకపోతే స్క్రీన్ ప్లే లేదు. కాకపోతే ఈ క్రియేటివిటీలో ప్లాట్ పాయింట్ వన్ నుంచి దూరం జరిగి దాక్కుని వుంది. అది ఝలక్ ఇస్తూ ఎప్పుడో బయటపడుతుంది. డెబ్బీ తో రోమాన్స్ లో వున్న బేబీకి డాక్ ఇచ్చిన ఝలక్కే ఇప్పుడామెని కాపాడుకోవాలన్న గోల్. ఇందుకోసం ముందు డాక్ కి లొంగిపోయాడు. ఇక చట్టంతో, ప్రేమతో దోషాల్ని కడిగేసుకునే వైపుకు పాత్ర ప్రయాణం. 

          పోస్టాఫీసు జాబ్ అప్పగించాడు డాక్. దీనికి ఆయుధాల కోసం బుచర్ దగ్గరి కెళ్ళినప్పుడు అంతా తలకిందులైంది. బుచర్ అండ్ గ్యాంగ్ పోలీసులేనని కనిపెట్టిన బడ్డీ కాల్చి పారేశాడు. దీంతో ఆత్మరక్షణకోసం బేబీ కూడా కాల్పులు మొదలెట్టాడు. పోలీసులందర్నీ చంపేశాడు. ఇప్పుడు డైరెక్టుగా చట్టంతోనే (పోలీసులతోనే) ఘోరంగా ఇరుక్కున్నాడు బేబీ డ్రైవర్!

సికిందర్