రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, September 8, 2017

508 : రివ్యూ!

ర్శత్వం: కృష్ణ మారిముత్తు
తారాగణం: నాగచైతన్య, లావణ్యా త్రిపాఠీ, శ్రీకాంత్, రావు మేష్, రేవతి, మురళీశర్మ, ప్రియర్శి, వివర్మ దితరులు
కథ –స్క్రీన్ ప్లే : డేవిడ్ ఆర్. నాథన్, మాటలు : అబ్బూరి రవి, సంగీతం
: వివేక్ సాగర్. ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మిరెడ్డి
బ్యానర్ : వారాహి చిత్రం, నిర్మాత: నీకొర్రపాటి
విడుదల : సెప్టెంబర్ 8, 2017

***

        ‘జోష్’ తో మొదలు పెడితే,  ‘దాదా,  ‘బెజవాడ’, ‘ఆటోనగర్ సూర్య’ ,  ‘దోచేయ్', 'దడ',  ‘సాహసం శ్వాసగా సాగిపో’....అంటూ నాగచైతన్య యాక్షన్ సినిమాలతో చేస్తున్న విశ్వప్రయత్నాలు ఇప్పుడు ‘యుద్ధం శరణం’ దగ్గరికొచ్చాయి. ఇక్కడితో స్వామి శరణం అనుకుని ఆపేస్తే మంచిదేమో  ఆలోచించుకోవాల్సిన బాధ్యత అతనిపైనే వుంది. తమిళం నుంచి దర్శకుడు, రచయితా వచ్చిందే స్వామిశరణం  అన్పించడానికి అయివుండొచ్చు. దర్శకుడు క్లాస్ మేట్  అయినంత మాత్రాన యుద్ధం శరణం శివోహం అన్పిస్తాడని అన్పించడం లేదు. 

          మొన్నే విడుదలైన కృష్ణ వంశీ ‘నక్షత్రం’ వుండగా, ఇప్పుడు అలాంటిదే  ‘యుద్ధం శరణం ‘ ఏమవసరం. కృష్ణవంశీ తన లాంటిదే తీస్తున్నారని నాగ చైతన్యకి ఎలా తెలుస్తుం దనొచ్చు. దేశంలో ఏం జరుగుతోందో తెలుసుకోని వాళ్ళంతా ఒకరికి తెలీకుండా ఒకరు పోటీలు పడి ఒకలాగే వుండే సినిమాలు ఇలాగే తీసేసి తర్వాత తెల్లబోతారు. దేశంలో టెర్రర్ దాడులు  జరగడం ఆగిపోయాయని కృష్ణ వంశీ తెలుసుకోకుండా మరో చాట్ భండార్ పేలుళ్లతో చుక్కలు చూపించినట్టే, నాగచైతన్య కూడా అదేబాటలో లేని  మహా యుద్ధం చేశారు. ఈ యుద్ధం చేసి  పర రాష్ట్రాల్లో శరణు జొచ్చేలా చేశారు ప్రేక్షకుల్ని. నాగచైతన్య మరో యాక్షన్ మూవీతో వస్తే తెలుగు రాష్ట్రాలు విడిచి వెళ్ళిపోతారు ప్రేక్షకులు. 

          ఇంతకీ ఏమిటీ ‘యుద్ధం శరణం’?  మళ్ళీ హైదరాబాద్ నగరంలో పాత పేలుళ్ళ కథనే ఎలా తీశారు? ఏ కొత్తదనం చూపించారు?  కొత్త తమిళ దర్శకుడు దర్శకత్వంలో చూపిన ప్రతిభ ఏమిటి? నాగచైతన్య నటనలో మార్పేమిటి? లావణ్యా
త్రిపాఠీ ఎందుకుంది? ఇవన్నీ తెలుసుకుందాం....

కథ 
       అర్జున్ (నాగ చైతన్య) ఉద్యోగం చేయకుండా స్వయంకృషితో ఒక గాలిలో ఎగిరే డ్రోన్ ని తయారు చేస్తూంటాడు. డాక్టర్ లయిన అతడి తల్లిదండ్రులు (రావురమేష్ – రేవతి) పేదలకి వైద్యం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటారు. అర్జున్ కి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కూడా వుంటారు. ఇలా వుండగా, అర్జున్ పేరెంట్స్ దగ్గర అంజలి (లావణ్యా త్రిపాఠీ ) వచ్చి ట్రైనింగ్ లో చేరుతుంది. ఆమెని ప్రేమిస్తాడు అర్జున్. ఈ విషయం పేరెంట్స్ కి చెప్పాలనుకుంటాడు.

          ఒక మఫియా నాయక్ (శ్రీకాంత్) వుంటాడు. ఒక మంత్రి ( వినోద్ కుమార్ ) వుంటాడు. ఇతను బాగా స్కాములు చేసి ఇరుక్కునే పరిస్థితి వస్తుంది. దృష్టి మళ్ళించడానికి నాయక్ తో కలిసి నగరంలో బాంబు దాడులు జరిపిస్తాడు. ఆ రాత్రే సినిమా కెళ్ళిన అర్జున్ పేరెంట్స్  శవాలై దొరుకుతారు. చూస్తే బాంబు దాడుల్లో చనిపోయినట్టు వుండరు. అసలేం  జరిగింది? వీళ్ళు ఎలా చనిపోయారు? ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనేవి మిగతా కథకి దారి తీసే ప్రశ్నలు. 

ఎలావుంది కథ?
     కథలా లేదు. చెన్నై పారిస్ సెంటర్ పరోటాలా కూడా లేదు. అన్నిటికీ మించి నిర్మాత కొర్రపాటి కానుకలా లేదు. ఈ సంవత్సర
మంతా ఇలాటి రివెంజి కథలే. దీనికి అదే బాంబు దాడులు తోడయ్యింది. ఇవ్వాల్టి వార్త రేపుండని రోజుల్లో ఇంకా ఐదేళ్ళ నాటి నగర బాంబు దాడుల కథలతో ఇంకేం చెప్పాలనుకుంటున్నారో తెలీదు. దీనికి పరిష్కారం కూడా చంపడమే. చంపడం ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం కాదు. అందుకే ఇంకిన్ని ఇలాటి కథలు పుట్టుకొస్తు
న్నాయి. ఇంకెవరైనా ఈ బాంబు దాడుల కథతో తీస్తే, ఒక శాశ్వత పరిష్కారమార్గం చూపిస్తే - ఈ కథలతో సినిమాలు తీసి చేతులు కాల్చుకోవడం ఇంకాగిపోతుంది. సమస్య శాశ్వత పరిష్కారం రేంజికి చేరింతర్వాత,  ఇంకొకరు ఇంకో పరిష్కారం చెప్పే అవకాశం వుండదు. కథల మీద పురాణాల ప్రభావం చాలా వుంటుంది. కానీ పురాణాలని తప్పుగా అర్ధంజేసుకుని ఒక సామాజిక సమస్యకి చంపడమే పరిష్కారమనుకుంటే మాత్రం, ఇక చెల్లుబాటయ్యే పరిస్థితిలేదు.

ఎవరెలా చేశారు
       నాగచైతన్య చాలా కష్ట పడ్డాడు. సెకండాఫ్ లో ఒఠ్ఠి యాక్షన్ సీన్సులో వూపిరి తీసుకోకుండా పోరాటాలు చేసేందుకు  ఫస్టాఫ్ లో పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాడు. ఆంధ్రా  వెళ్ళే బస్సులో కోదాడలో రెండో డ్రైవర్ నిద్ర లేచి డ్యూటీ ఎక్కినట్టు, నాగచైతన్య  సెకండాఫ్ కి ఫ్రెషప్ అయ్యాడు. అసలు ఫస్టాఫ్ లో కన్పించింది తనేనా అని డౌటు. అంత పేలవంగా ఎలా వుంటాడు హుషారైన నాగచైతన్య?  పాత్రలో దమ్ములేకపోతే ఇంతే. పాత్రకి బాక్సాఫీసు అప్పీల్ వుందా? ఎంత సేపూ పేరెంట్స్ కథే అయిపోతే, ఇక యూత్ అప్పీల్ - బాక్సాఫీసు అప్పీల్ ఏమైపోతాయి. ఈ రోజుల్లో ముసలి వాళ్ళయిన పేరెంట్స్ కథ ఎవరిక్కావాలి? ‘చుక్కల్లో చంద్రుడు’, ‘కొంచెం ఇష్టం- కొంచెం కష్టం’ లతో అనుభవమయ్యిందిగా?  హీరోయిన్ తో హీరో గ్లామరస్ గా వుండే కథ కావాలి. బాంబు దాడుల్లో హీరోయిన్ మిస్సయితే ఆ హీరోయిన్ కోసం పడే తపనలోనే  అన్ని అప్పీల్స్ వుంటాయి బాబూ!  సెకండాఫ్ లో హీరోయిన్ ని పూర్తిగా పక్కన పడేసి, ఇంకా చనిపోయిన పేరెంట్స్ ఫ్లాష్ బ్యాకులే వేసుకుంటూ కూర్చుంటే థియేటర్లో ఎవరు కూర్చుంటారు. పైగా అక్కా చెల్లెళ్ళని కాపాడే గొడవే అయిపోతే, అది కమర్షియల్ పాత్రెలా అయింది?  ఫ్యాన్స్ ని కూడా ఏం మెప్పించింది? ఎన్ని పిడివాదాలు చేసినా కమర్షియల్ సినిమా కథంటే హీరో హీరోయిన్ల కథే! 

          నాగచైతన్యకి కథ మీద అవగాహన లేకపోయినా, కనీసం పాత్ర కమర్షియల్ గా లేదని అర్ధంజేసుకుని తిప్పికొట్టినా ఇంత నిరాశ ఎదురయ్యేది కాదు. ఇక హీరోయిన్  లావణ్యా
త్రిపాఠీ పాత్రకే దిక్కులేదు, కొన్ని షాట్స్ లో ఆమె నోరు తెరచి ఏదో అనే లోపే  బ్యాడ్ ఎడిటింగ్ చేసి నోర్మూయించారు. తమిళ కమర్షియల్(? ) దర్శకుడికి హీరో హీరోయిన్లు అస్సలు పట్టలేదు- ఎంత సేపూ పేరెంట్స్ పాత్రల్లో రావు రమేష్, రేవతిల తెచ్చిపెట్టుకున్న ఆనంద డోలికలతోనే వుయ్యాలూ
గడం సరిపోయింది. పక్క వాద్యాలుగా పనీపాటా లేనిఅక్కా చెల్లెళ్ళు. 

            మాఫియాగా శ్రీకాంత్ ప్రత్యేకతేం లేదు, శాడిస్టు గెటప్ తో ప్రత్యేకతలేం వుంటాయి. ఇది ఆయనకి తెలియంది కాదు. కాకపోతే విలన్ గా వేసి చాలా కాలమవడంతో ఇదే కొత్తగా అన్పించి వుంటుంది. ఈ మధ్య  ఎన్ఐఏ పాత్రలు కొత్త ఫ్యాషన్ అయిపోయాయి. వాళ్ళ అధికార పరిధులేమిటో  వాళ్ళకే తెలీక సందట్లో సడేమియాలాగా సినిమా అంతా తిరిగే పాత్ర లు. ఈసారి  సీబీఐ జేడీ లక్ష్మినారాయణ,  మురళీ శర్మ రూపంలో ఎన్ఐఏ జేడీ శాస్త్రిగా మారిపోయారు. ఈ శాస్త్రి గారి దర్యాప్తేమిటో, మతలబు ఏంటో మనకసలేం అర్ధంగాదు. ఈయన పక్క అసిస్టెంటుగా ఆశ్చర్యపోతూ వుండే రవివర్మ! 

          పాటలు, ఛాయాగ్రహణం, ఇతర సాంకేతిక విలువల గురించి చెప్పుకోవడాని కేం లేదు. సెకండాఫ్ దాదాపు అంతా మసక చీకట్లోనే యాక్షన్ దృశ్యాలుంటాయి రిలీఫ్ లేకుండా. 

          దర్శకత్వం పూర్ గా, చాదస్తంగా వుంది. పేలవమైన ఫ్యామిలీ డ్రామా దృశ్యాలు పాత  సినిమల్లోలాగా వుంటాయి. రచయిత  అబ్బూరి రవి లేని కథకి లేపనాలు పూసి బలవంతంగా, అయిష్టంగా మాటలు రాసినట్టు తెలిసిపోతూంటుంది. ఇక ‘జంటిల్ మేన్’  అనే  సినిమాకి కథ  అందించిన డేవిడ్ ఆర్. నాథన్ రాసిన కథ, దానికి తయారు చేసిన స్క్రీన్ ప్లే అనే పదార్ధం తెలుగువాడి పాలిట తీరని శోకంలా వున్నాయి. 

చివరికేమిటి 
      చాలా చైల్డిష్. కనీస ప్రమాణాలతో చూసినా ఏ కోశానా సినిమా అనిపించని అమెచ్యూరిష్  వ్యవహారం. దర్శకుడు నేర్చుకోవా
ల్సింది చాలా వుంది. ఇంటర్వెల్ పడ్డాకైనా కథేమిటో తెలియాలన్న ఓనమాలు తెలీని స్థితిలో వున్నాడు. పేరెంట్స్ ని విలన్ ఎందుకు చంపాడో చెప్పకుండా, ఇంటర్వెల్లో హీరోనీ, అక్కా చెల్లెళ్ళని కూడా ఎందుకు చంపాలని దాడి చేస్తున్నాడో చెప్పకుండా, హీరోకీ ఏ విషయమూ  తెలీక, క్లయిమాక్స్ అంత భారీ స్థాయిలో జరుగుతున్న యాక్షన్ ఎపిసోడ్ మధ్యలో - ఇంటర్వెల్ వేసేసే చమత్కార మేమిటో అర్ధంగాదు.

          బాంబు దాడులు జరిగి, హీరో పేరెంట్స్ ని వెతుక్కోవడంతో కథ మొదలవుతుంది. అతడికి పేరెంట్స్ గుర్తుకు రాగానే ఫ్లాష్ బ్యాక్ లో కెళ్ళి పోతాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో బోలెడు ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఉత్తుత్తిగా నవ్వుకోవడాలూ అయ్యాక, హీరోయిన్  పరిచయం. ఇక ఆమెతో  లవ్ ట్రాక్, పాటలు.  సడెన్ గా ఫ్లాష్  బ్యాక్ లోంచి మళ్ళీ ప్రెజెంట్ కి...మళ్ళీ పేరెంట్స్ ని వెతుక్కోవడం. మళ్ళీ రాఖీ సీనుతో  ఇంకో ఫ్లాష్ బ్యాక్. లవ్...లవ్ కోసం ప్రయత్నాలు...మనకి అర్ధంగాని దేమిటంటే- పేరెంట్స్ ని వెతుక్కునే వాడికి ప్రేమలు ఎలా గుర్తు వచ్చి ఎంజాయ్ చేస్తాడనేది. ఇలా పొంతన లేకుండా వుంటుంది ఫ్లాష్ బ్యాకుల వ్యవహారం. అంటే ఈ కథ  పేరెంట్స్ కథగా  కాకుండా, హీరోయిన్ గురించిన కథ అయివుండాలన్న మాట- అప్పుడు ప్రెజెంట్ టైం కథ, డ్రీం టైం కథా అతికినట్టు వుంటాయి.

          ఇక సెకండాఫ్ లో అంత పెద్ద బాంబు దాడుల సంఘటన పక్కకెళ్ళి పోవడం కూడా జరుగుతుంది. ఇంతా చేసి ఆ పేరెంట్స్ చనిపోయింది బాంబు దాడుల్లో కాదు, వేరే కారణంతో వేరే విధంగా విలన్ చంపాడు. అదేమిటంటే ఒక హత్యని వాళ్ళు కళ్ళారా చూడ్డం. చాలా సిల్లీ. ఇది హీరో అన్వేషించే  మర్డర్ మిస్టరీగా మారుతుంది. ఈ క్రైం స్టోరీ మేనేజి మెంట్ కూడా చైల్డిష్ గా వుంటుంది. ఇలా బాంబు దాడుల కథని కూడా విరిచేసి, అందులోంచి ఇంకో కథని లాగడంతో  అంతా కలగాపులగమైపోయింది. 

          ఇదంతా ఇంత ఖర్చు చేసి సినిమాగా తీయడానికంటే ముందు,  పేపర్ మీదే తెలిసిపోయే జాతకం. నిర్మాత సాయి కొర్రపాటి దీన్ని అర్ధం జేసుకోలేదు.


సికిందర్ 
cinemabazaar.in

Tuesday, September 5, 2017

507 : డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు -15

            ప్రతీ పదహారేళ్ళ కోసారి  భూమి గుండ్రంగా తిరిగి అక్కడికే వస్తుంది : ‘బ్లడ్ సింపుల్’ రీ - రిలీజ్ అవుతుంది. 1984 లో తీసిన ‘బ్లడ్ ‘సింపుల్’ ని  కోయెన్ బ్రదర్స్ 2000 లో ఒకసారి, 2016 లో మరోసారి రీ - రిలీజ్ చేశారు. మొదటిసారి డైరెక్టర్స్ కట్ పేర రీ - రిలీజ్ చేశారు. అప్పటికి పదహారేళ్ళ క్రితం 1984 లో తీసిన ఈ నియో నోయర్ థ్రిల్లర్ లో ఇప్పుడు చూస్తే తమకే సిల్లీగా అన్పించిన కొన్ని షాట్స్ ని  తొలగించి, మూడు నిమిషాల నిడివి తగ్గించారు. గత సంవత్సరం రెండోసారి  రీ - రిలీజ్ చేసినప్పుడు 4 కె రిజల్యూషన్ కి అప్ గ్రేడ్ చేశారు. దీని ట్రైలర్ ని ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు

           
విషయానికొస్తే సీనులో డ్రామా అంటే  ఘర్షణ పడడమే కాదు, ఏడ్పులే కాదు, మౌనం వహించడం కూడా. అది వ్యూహాత్మక మౌనమైనా, అమాయకత్వపు మౌనమైనా మౌనం మౌనమే -  సంఘర్షణ పుట్టిస్తుంది.  డ్రామా అంటే సంఘర్షణే.  సంఘర్షణ కాబట్టి మౌనంకూడా టెన్షన్ పుట్టిస్తుంది. డ్రామా అంటే మాటకు మాట పెద్ద పెద్ద డైలాగులే కాదు, ఆలోచనాత్మకమైన తక్కువ మాటలు కూడా డ్రామా క్రియేట్ చేస్తాయి. సీనులో బలమైన డ్రామా పుట్టడానికి వెనుకటి సీన్లలో పోగుపడుతూ వచ్చిన  పూర్వ డ్రామాయే తోడ్పడుతుంది. ఇక డ్రామాలో కూడా కథని ముందుకు నడిపించే పరిణామమేదో చోటు చేసుకోవాలి తప్పక. ఈ దృష్ట్యా ‘బ్లడ్ సింపుల్’ లో ఒక కీలక దృశ్యాన్ని పరిశీలిద్దాం..

27. అమాయకంగా మాట్లాడే ఎబ్బీతో రే తికమక పడడం 
     ఎబ్బీ నిద్రలో వుంటుంది. ఆఫ్ స్క్రీన్ లో తలుపు తీసి మూసిన శబ్దమవుతుంది. ఓ క్షణం తర్వాత మైలగా వున్న చెయ్యి ఫ్రేములో కొచ్చి, నుదురు మీద వాలుతున్న ఆమె శిరోజాల్ని సున్నితంగా తప్పిస్తుంది. 

       ఎబ్బీ ఇటు వొత్తిగిలి ఆఫ్ స్క్రీన్ లో చూస్తుంది. లాంగ్ షాట్ లో బాత్రూం దగ్గర నిలబడి కన్పిస్తాడు రే, టవల్ తో చేతులు తుడుచుకుంటూ.  ఆమె ‘హాయ్ రే’ అని పలకరిస్తుంది. పలకడు. అటు పక్కనున్న చైర్ దగ్గరకెళ్ళి కూర్చుంటాడు. ఫేడవుట్.   

            ఇంతే. ఈ చిన్న సీనులో పైకి చూస్తే రే ఎబ్బీ దగ్గరి కొచ్చాడు, ఇక ఆమెతో విషయం చర్చించడానికి కూర్చున్నాడు అన్నట్టు మాత్రమే వుంది. కానీ సీనులో ప్రతీ షాటూ లోతైన ఎన్నో సంగతులు చెప్తోంది.
 సీనులో సంఘర్షణేమీ లేదు. కానీ తుఫాను ముందటి ప్రశాంతత వుంది. సీను  ప్రేమగా ప్రారంభమై సంఘర్షణకి సిద్ధం చేస్తూ ముగిసింది. ముగింపు ఫేడవుట్ అయింది. దాదాపు ఇంకే సీనులోనూ  ఫేడవుట్- బ్లాకవుట్ కన్పించదు. ఇక్కడ  వాళ్ళిద్దర్నీ చూపించి బ్లాకవుట్ చేయడంలో ఉద్దేశం బోధపడుతూనే వుంది. వాళ్ళ సంబంధం  ఇక మరోమారు వికటించబోతోందని.  ఈ బ్లాకవుట్  దీనితర్వాతి సీనుకి స్మూత్ ట్రాన్సిషన్ గా కూడా వుంది. 

            ప్రస్తుత సీను ప్రారంభంలో నిద్రలో వుంటుంది ఎబ్బీ. ఇలావున్నప్పుడు తలుపు తీసి మూసిన చప్పుడు, తర్వాత ఫ్రేములోకి రే చెయ్యి వచ్చి ఆమె ముంగురులు సవరించడమూ జరుగుతాయి. ఎందుకు సవరించాడు? ఇంతకి ముందే ఫోన్ బూత్  నుంచి మాట్లాడితే,  ఆమె కేర్లెస్ గా పొడిపొడిగా మాట్లాడడం,  ఓకే సీయూ అని కట్ చేయడం, అప్పుడు తనొక బకరా అయ్యాడా అన్న ఫీలింగ్ కలగడమూ అన్న ఎమోషనల్ బ్యాగేజీ తో వున్నాడు కదా రే?  కానీ ఇదొక ఫీలింగు మాత్రమే. రుజువులేదు.  ప్రేమలో అపోహలకి తావు లేదు. 

            ఇప్పుడు రే చేయి ఫ్రేములోకి క్లోజప్ లో వచ్చి ఆమె ముంగురులు సవరించడమనే షాట్ - వెనక్కి వెళితే బిగినింగ్ విభాగం 11 వ సీనులోని  షాటుని బలపరుస్తోంది.  బిగినింగ్ విభాగం 9 వ సీనులో ఇద్దరికీ మాటా మాటా పెరిగి విడిపోయే పరిస్థితిని గమనించాం.  అప్పుడామె సరెండరైపోయి 11 వ సీనులో నిద్రపోతున్న రే దగ్గరి కెళ్ళి నిలబడినప్పుడు,  ఇలాగే రే చెయ్యి ఫ్రేములో క్లోజప్ లోకొచ్చి ఆమెని అందుకోవడాన్నీ చూశాం. అప్పుడు దీనర్ధం ఆమెకి అభయ హస్తమివ్వడంగా చెప్పుకున్నాం. ఇక విడిపోబోమని చేస్తున్న వాగ్దానం.

            ఇప్పుడు చూస్తే  హత్యానేరంతో మైలపడిన అతడి చేయి సరీగ్గా 11 వ సీను షాటు లాగే ఫ్రేములో క్లోజప్ లోకొచ్చి,  ఆమె కేశాలు తప్పించడం,   11 వ సీను లోని ‘అభయహస్తం’ షాటుని బలపరుస్తున్నట్టుంది. ప్రేమ పట్ల అప్పటి కమిట్ మెంట్ ఇప్పుడు కూడా చెక్కుచెదరడం లేదని చెబుతున్నట్టుంది. గత 11 వ సీనులోని  షాటులో ఆమెని అందుకున్న చేయి మైల పడలేదు.  హత్య తో చేయి ఇప్పుడు మైలపడినా,  అదే మారని ప్రేమతో అతను తాకుతున్నాడు. అతను రావడం రావడం నిలదీయాలనుకుని  రాలేదు. అలా వస్తే ఆ నీలదీతతో అప్పుడే గొడవ మొదలయ్యేది.  సీను ప్రారంభం గొడవతోనే మొదలై,  ముగింపు కూడా గొడవతోనే వుంటే అది మంచి సీను కాదు, స్ట్రక్చర్ కాదు. ఎలాగంటే, ఇందులో మిడిల్ - ఎండ్ మాత్రమే కన్పిస్తాయి, బిగినింగ్ వుండదు.

            పైగా వాళ్ళ రిలేషన్ షిప్ పరంగా చూసినా అర్ధవంతంగా వుండదు. అందుకని రిలేషన్ షిప్ లో తొందరపాటు తనం తగదన్న ఉద్దేశంతో ఈ సీను ప్రశాంతంగా మొదలయ్యింది. దీంతోబిగినింగ్ సమకూరింది. ఒక హాలీవుడ్ స్క్రీన్ ప్లే ట్యూటర్ అంటాడు - ఒక్కో సీను రెండొందలసార్లు తిరగరాయాలని!  ఒక సీను అనాటమీ ఎలా  వుంటుందంటే లక్ష కోణాల్లో ఆలోచించాల్సి వుంటుంది. అప్పుడుగానీ రక్త మాంసాలేర్పడవు. కథాత్మ పరివ్యాప్తం కాదు.

            మగత నిద్రలో వున్న ఆమె పట్ల ప్రేమని రే ఇలా ప్రకటించాక, ఆమె స్పందన కూడా చూపించారు. సీనులో ఈ బిగినింగ్ విభాగంలో ఇరువైపులా పూర్తి సమాచారమివ్వకపోతే  మిడిల్ నడవదు. అతను ఆమె పట్ల ఇంకా చెరగని ప్రేమని ప్రకటిస్తే,  ఆమె స్పందనేమిటో కూడా వ్యక్తమవాలి. ఆమె మనసేమిటో మనకి తెలియజేయకుండా (సమాచారమివ్వ కుండా) ఇద్దరి మధ్యా సంఘర్షణ మొదలెడితే అతను అర్ధమవుతాడుగానీ, ఆమె అర్ధంగాక  సీనులో ఇన్వాల్వ్ కాలేం, డ్రామాని ఫీలవలేం. 

            ఆమె స్పందన గురించి  కోయెన్ బ్రదర్స్ స్క్రిప్టులో రాయలేదు గానీ, షాటులో చిత్రీకరించారు. కేవలం ఒకేవొక్క భంగిమతో ఆమె మనసు అద్భుతంగా చెప్పేశారు. ముంగురులు సవరిస్తూంటే అతనొచ్చాడని గ్రహించి,  ఆమె బోర్లా తిరిగి తలెత్తి బాత్రూం వంక చూస్తూండే ఒక్క షాట్ తో  అంతా చెప్పేశారు. ఈ షాట్లో ఆమె చాలా ముద్దుగా సంతోషంగా కన్పిస్తుంది - సరీగ్గా ఇంటికొచ్చిన యజమాని కేసి వొళ్ళు పులకించిపోతూ పెంపుడు కుక్క మెడ చాచి ఎలా చూస్తుందో అలా. చాలా మైండ్ బ్లోయింగ్ షాట్ ఇది! 

            వెనుక  11 వ సీనులో ఇద్దరికీ గొడవయ్యాక, ఆమె సరెండర్ అయిందనే భావంతో  ఎలా టిల్ట్ డౌన్ షాట్ లో అతడి బానిసలా కూర్చున్నట్టు కనిపిస్తుందో, అలా ఇక్కడ ఈ షాట్ లో విశ్వాసంగల కుక్క అన్నట్టు  భంగిమ పెట్టి కన్పిస్తుంది. ఇప్పటికొచ్చి కూడా అతడి ప్రేమ తగ్గలేదు, ఆమె విధేయతా మాసిపోలేదు. 

            ఇదీ రెండు పాత్రల గురించి సీను బిగినింగ్ లో ఇస్తున్న ఇన్ఫర్మేషన్. అతడిది అదే ప్రేమ, ఆమెది అదే విశ్వాసం. ఆమెకి భర్త మార్టీ చనిపోయాడని తెలీదు, మార్టీని ఆమే చంపడానికి ప్రయత్నించిందని  అతను అనుకుంటున్నాడు. ఉపరితల పరిస్థితి ఇది. దీని ఆధారంగా వాళ్ళ ప్రేమలు, విశ్వాసాలూ పరీక్షనెదుర్కోబోతున్నాయి...

            ఇంకొక ముఖ్యమైన ఎలిమెంట్ స్క్రిప్టులో రాయలేదు. చిత్రీకరణలో వుంది. అది నీడ. ఆమె ఆ భంగిమలో అతడి కోసం బాత్రూం వైపు విశ్వాసంగా  చూస్తున్నప్పుడు, ఎదురుగా  అటు పక్క ఓ ఖాళీ కుర్చీ, టేబుల్ వుంటాయి. ఆ ఖాళీ కుర్చీ నీడ గోడమీద పడుతూంటుంది. టేబుల్ ముందు  ఆ ఖాళీ కుర్చీ చనిపోయిన ఆమె భర్త మార్టీ సింబాలిజం. 

            అంటే – నువ్వు ఆశగా రే కోసం ఇలా చూస్తున్నావ్ గానీ, నీ భర్త ఇక లేడన్న సంగతి ఆ ఖాళీ కుర్చీని చూసి తెలుసుకో! నీ భర్త ఇప్పుడు నీడలా మారిపోయాడని కూడా ఆ నీడని చూసి తెలుసుకో! నిన్ను వెంటాడే నీడ! – అని చెప్పడమన్నమాట. ఈ నీడని ఇక్కడి వరకే ఎస్టాబ్లిష్ చేసి వదిలెయ్యలేదు. ఈ వెంటాడే నీడగా మార్టీ,  తర్వాత ఆమెకి పీడ కలలో కన్పించబోతున్నాడు. పీడ కలలు కూడా నోయర్ సినిమాల ఎలిమెంట్స్ లో భాగం.  

            ఇక రే బాత్రూం లోంచి రాగానే పలకరిస్తుంది. అతను  మాటాడకుండా వెళ్లి అదే మార్టీకి సింబాలిజమైన కుర్చీలో కూర్చుంటాడు మాస్టర్ లా. ఇప్పుడు తనే ఆమెకి మాస్టర్ అన్నట్టుగా. ఆమెకింకా తెలీదు పాపం మార్టీ చనిపోయాడని!
            దీంతో ఫేడ్ అవుట్ అవుతుంది. చీకటి. సంబంధం వికటించడానికి వాతావరణం సిద్ధం.  

28 డే / ఇం. విస్సర్ ఫ్లాట్  - ఫేడ్ ఇన్ 
       ఇలా రాశారు :  తీగ క్లిక్ మన్నశబ్దంతో  కెమెరా డ్రాప్ అవుతున్నపుడు, ఆరెంజి కలర్ సేఫ్ లైటు వ్యూలో కొస్తుంది. ఇంకా డ్రాప్ అవుతున్నపుడు,  మెటల్ డార్క్ రూమ్ ట్రేలో మంటల్లో నెగెటివ్ లు తగలబడుతూంటాయి. 

            అదే ఎల్లో సూటుతో వున్న విస్సర్ చేయి ఫ్రేములోకొస్తుంది. చేతిలో బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్ వుంటుంది. అది ట్రే మంటల్లో పడుతుంది. ఆ ఫోటో మార్టీకి విస్సర్ చూపించిన ఎబ్బీ -  రేల మర్డర్ ఫోటో మరో కాపీయే. అయితే ఇందులో సృష్టించిన బుల్లెట్ రంధ్రాలు, రక్తం సరీగ్గా కుదరలేదు. ఇంకో కాపీ మంటల్లో వేస్తాడు. దీంట్లో ఎబ్బీ - రేల మీద బుల్లెట్ రంధ్రాలుంటాయి గానీ, రక్తం వుండదు. ఇంకో ప్రింటు వేస్తాడు. ఇది ఎబ్బే - రేలు నిద్రపోతూండగా తీసిన ఒరిజినల్ ఫోటో. 

            ఫ్రేములోకి విస్సర్ చేయి వస్తుంది. ఆ చేతిలో మార్టీని ‘చంపి’  ఆఫీసులోంచి పట్టుకొచ్చిన కవరుంటుంది. అందులోంచి ఫోటోఅనుకుని లాగితే ప్లకార్డు బయటపడుతుంది. దాని మీద -“
All Employees Must Wash Hands Before Resuming Work." అని అక్షరా లుంటాయి. 

            లో- యాంగిల్ క్లోజ్ షాట్ లో విస్సర్. దాన్ని విస్తుపోయి చూస్తూ. క్షణం తర్వాత  ఫ్రేములో అతడి చేయి పైకి లేచి పెదాల మధ్య సిగరెట్ పెడుతుంది. చేయి కిందికి వెళ్లి జేబులో వెతుకుతుంది. చేయి ఫ్రేములోకి జంప్ బ్యాక్ అవుతుంది. చేతిలో లైటర్ వుండదు. ఆందోళనగా కోటు జేబులు వెతుకుతాడు. లైటర్ వుండదు. ఫ్రేములోంచి తప్పుకుంటాడు. 

            ఈ సీనుకి గత సీనుకీ ఫేడ్ అవుట్, ఫేడ్ ఇన్ లని ట్రాన్సిషన్ కి బ్రిడ్జింగ్ టూల్ గా వాడుకున్నారు. రెండు సీన్లకీ జంప్ లేకుండా స్మూత్ ట్రాన్సిషన్. ఎలాగంటే,  గత సీనులో ఎబ్బీ - రే ల మధ్య చీకట్లు అలుముకోబోతున్న అర్ధంలో బ్లాకవుట్ (ఫేడ్ అవుట్ ) అయి, ఈ సీనులో ఫేడ్ ఇన్ అవడాన్ని చూస్తే ఇక్కడ ఇది డార్క్ రూమ్. ఆ రోజుల్లో నెగెటివ్ లని కడిగే డార్క్ రూమ్. రెండు సీన్లకీ ఈ ట్రాన్సిషన్ అబ్బింది.

            ఇక ఈ సీనులో విస్సర్  భాగోతమంతా బయట పడింది. ఫేక్  ఫోటోలు సృష్టించిన భాగోతం. ఇప్పుడు ఈ ఆధారాల్ని నిర్మూలిస్తున్నాడు మంటల్లో. మార్టీని ‘చంపి’ అతడి దగ్గర్నుంచి ఎత్తుకొచ్చిన ఫోటో అనుకుని కవరు తెరిస్తే – వెక్కిరిస్తూ మార్టీ పెట్టిన ప్లకార్డు బయట పడింది. మార్టీ ఆ ఫోటోని సేఫ్ లో దాచేసి ఈ మాయ చేశాడని మనకి తెలుసు. ఇప్పుడు తను ఫూలయ్యాడని విస్సర్ కి తెలిసి వచ్చింది. ఆందోళనతో సిగరెట్ వెలిగించుకోబోతే లైటర్ లేదు. ఇదింకో బ్యాంగ్. దీంతో పరిగెత్తాడు.

            వెనుక విస్సర్ మార్టీ ని చంపే సీనులో,  మార్టీ విస్సర్ కివ్వాల్సిన డబ్బు కట్ట ముందు పెట్టినప్పుడు, విస్సర్ దానికేసి చూసే విధానం జవాబు దొరకని ప్రశ్నలా వుండిపోయింది. కళ్ళల్లో మెరుపుతో కాక, చాలా ఉదాసీనంగా చూస్తాడు డబ్బుకేసి. ఎందుకలా చూశాడబ్బా అని ఈ వ్యాసం రాస్తున్నప్పుడు కూడా వెంటాడుతూనే వుంది. విస్సర్ పాత్ర పోషించిన మైకేల్ ఎమ్మెట్ వాల్ష్ గురించి ఇప్పుడు చదివాక ఆ చూపులకర్ధం తెలిసివచ్చింది. 

          ‘బ్లడ్ సింపుల్’ షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రతీవారం మొదటి రోజు తన పేమెంట్ ఇస్తూండాలని  కోరాడట వాల్ష్. ఆ నోట్ల కట్టలు వారమంతా జేబుల్లో పెట్టుకుని నటించేవాడట. అలా నోట్ల కట్టలు జేబుల్లో పెట్టుకుని  నటిస్తూంటే, విస్సర్ పాత్రకుండే డాబు దర్పం ఆటోమేటిగ్గా తన కొచ్చేసేవట. దీంతో మార్టీ ఇచ్చిన డబ్బుకేసి అలా ఎందుకు ఉదాసీనంగా చూశాడో మనకి అర్ధమైంది. కోయెన్ బ్రదర్స్ ఇచ్చిన నోట్ల కట్టలు జేబుల్లో నిండుగా వుండగా  కడుపు నిండిన వాడు అలా కాక ఇంకెలా చూస్తాడు.

            ఇప్పుడు 82 ఏళ్ల  వాల్ష్  మొత్తం 114 సినిమాల్లో,  ఓ వంద టీవీ సిరీస్ లో నటించాడు. ‘బ్లడ్ సింపుల్’ కి పూర్వమే 38 సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ‘ఛేంజ్ ఇన్ ది ఏర్’ లో నటిస్తున్నాడు.

29.  మార్టీ శవాన్ని తొలగించానని, ఇక ఫర్వాలేదనీ రే అంటూంటే ఎబ్బీకి అర్ధంగాకపోవడం
       ఇలా రాశారు : క్లోజ్ షాట్ లో రే కునికి పాట్లు పడుతూ వుంటాడు.  ఆఫ్ స్క్రీన్ లో డోర్ వేసిన శబ్దానికి కళ్ళు తెరుస్తాడు. బాత్రూం లోంచి ఎబ్బీ వస్తూ అంటుంది, బెడ్ మీద నిద్ర పోకూడదా అని. నిద్ర పట్టేలా లేదంటాడు. నీకెలా నిద్ర పట్టిందో ఆశ్చర్యంగా వుందంటాడు. నువ్వు ఓకేనా అంటాడు. తను ఓకే అంటుంది. బెడ్ దగ్గరి కెళ్ళి కూర్చుంటూ, మార్నింగ్ నువ్వు కాల్ చేశావుగా అంటుంది. ఔనంటాడు. ఇంకేమైనా అంటాడేమోనని  చూస్తుంది. ఫైనల్ గా అంటాడు, అంతా ఓకేనని నీకు చెప్పేందుకే  కాల్ చేశానని. అన్నీ చక్కబెట్టేశానని. ఇప్పుడిక  రిలాక్స్ అవచ్చనీ.

            ఏంటీ నువ్వనేదని  అంటుంది. తనకి  అంతా తెల్సనీ, నైట్  బార్ కెళ్ళాననీ అంటాడు.  ఎలర్ట్ అయి చూస్తుంది. ఏం జరిగింది, మారీస్ వున్నాడా అంటుంది. ఉన్నాడు గానీ తనని చూడలేదంటాడు, ఎవరూ చూడ లేదంటాడు. చైర్ లోంచి లేచి అనీజీగా అటూ ఇటూ తిరుగుతాడు. చలిగా వుందేమిటని అంటాడు. నెర్వస్ గా అతణ్ణి చూస్తూంటుంది. ఏం జరిగిందని మళ్ళీ అంటుంది. మొత్తం క్లీన్ చేశా,  కానీ అది కాదు ఇప్పుడు ఇంపార్టెంట్ అంటాడు. దేనికోసమో చూస్తూ నెర్వస్ గా తిరుగుతూంటాడు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామనేది ఇంపార్టెంట్ అంటాడు. కల్లబొల్లి కబుర్లు చెబుతూ వుండలేమంటాడు. బాగా ఆలోచించుకోవడానికి కొంత టైం  తీసుకోవాలంటాడు. ఏదో అనబోతుంది. అతనే అంటాడు, నీకు షూట్ చేయాలని లేకపోతే   ఎవరికీ గన్ గురి పెట్టవద్దని,  షూట్ చేస్తే పూర్తిగా చచ్చేలా షూట్ చెయ్యాలనీ. 

            ఇది చెప్పి ఇంకింత అసహనంగా తిరుగుతూంటాడు దేని కోసమో. చంపాల్సిన వాణ్ణి పూర్తిగా చంపక పోతే వాడు లేచి చంపే ప్రయత్నం చేస్తాడని అంటాడు. బాగా డస్సి పోయి ఆగిపోతాడు. చలికోటు ఎక్కడుందని అడుగుతాడు. అసలేం జరిగిందని గట్టిగా అడుగుతుంది. కిటికీ వైపు నడుస్తాడు. సూర్య కిరణాలు అతణ్ణి చుట్టు  ముడతాయి. అది ఇంపార్టెంట్ కాదనీ, మనిద్దరం  చేశామా లేదా అన్నదే ఇంపార్టెంట్ అనీ అంటాడు. నాకోసం నువ్వూ,  నీకోసం నేనూ చేసుకున్నా మంటాడు. వంగి  కిటికీ వారగా పడేసి వున్న పాత బట్టల్ని చూస్తూంటాడు. అదీ ఇంపార్టెంటు అంటాడు. నువ్వేమంటున్నావో ఏమీ తెలీడం లేదని అంటుంది. గిరుక్కున తలతిప్పి చూస్తాడు. మౌనంగా  వుండిపోతాడు. దేని గురించి నువ్వంటున్నావ్ రే,  ఫన్నీగా నేనేమీ చేయలేదే అంటుంది. 

            ఏంటీ ఏంటన్నావ్? అంటాడు తీవ్ర స్వరంతో. ఆమె సహనం కోల్పోతుంది. తెల్లారి ఐదింటికి కాల్ చేస్తావ్, ఏదో అంటావ్, ఇక్కడి కొచ్చి జొరబడిపోయి ఏంటో చెప్పకుండా భయపెట్టేస్తావ్, ఇక చాలు నీ దబాయిపు,  అనేస్తుంది కోపం పెరిగిపోయి. 

            రే కేసి కెమెరా ట్రాక్ చేసి విండో బ్యాక్ డ్రాప్ లో అతణ్ణి ట్రాప్ చేస్తే, స్తబ్దుగా నిలబడి పోయి వుంటాడు. చాలా సేపటిదాకా మాటల్లేకుండా వుండిపోతాడు. అప్పుడు, నాతో  అబద్దం చెప్పకు  ఎబ్బీ అంటాడు. 

            పూర్తిగా ఆమెకి ఓర్పు నశించిపోయి, అబద్ధమెలా చెప్తాను అసలు విషయమేంటో తెలీకపోతే అని కసురుతుంది. ఫోన్ రింగవడంతో ఆమె ఆగిపోతుంది.  మోగుతున్న ఫోను వంకే చూస్తుంది. క్షణమాగి,  నా ఉద్దేశం మీరూ మీరూ కొట్లాడుకుంటే నాకవసరమని...
అంటూ మళ్ళీ ఆగిపోతుంది.

            ఫోను మోగుతూనే వుంటుంది. ఒకర్నొకరు చూసుకుంటారు. ఫోనెత్తమంటాడు. క్లోజ్ షాట్ లో టెలిఫోన్. ఫ్రేములోకి ఎబ్బీ చేయి వచ్చి దాన్నందుకుంటుంది. పలుకుతుంది. రెస్పాన్స్ వుండదు.  ఫ్యాను తిరుగుతున్న శబ్దం ఒకటి విన్పిస్తూంటుంది. చెవి మార్చి బాగా వినడానికి ప్రయత్నిస్తుంది. అప్పట్లో రే ఇంట్లో ఆమె ఫోనెత్తినప్పుడు వచ్చిన ఫ్యాను శబ్దం లాంటిదే ఇప్పుడూ వస్తూంటుంది. అప్పట్లాగే ఇప్పుడూ ఫోన్ కట్ అవుతుంది. 

            రే వైపు చూసి, అతనే అని అంటుంది. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్యా నిశ్శబ్దం. ఎవరు? అంటాడు రే. మార్టీ అని అంటుంది. మళ్ళీ ఇద్దరి మధ్యా నిశ్శబ్దం.

            లాంగ్ షాట్. రే ఏడ్వలేక నవ్వుతాడు. ఉన్నట్టుండి నవ్వాపేస్తాడు. ఏంటి మీ ఇద్దరి గొడవా అంటుంది. ఓకే,  నువ్వు మళ్ళీ కాల్ చేసుకో అదెవరైనా,  అని డోర్  వైపు కదుల్తాడు. నీకు నేను అడ్డుండనంటాడు. జేబులోంచి ఎబ్బీ రివాల్వర్ తీసి అక్కడ పెడతాడు. అతన్నే చూస్తూంటుంది విభ్రమంగా.  రివాల్వర్  మర్చిపోయావ్, అని డోర్ తీసుకుని వెళ్ళిపోతాడు.

***

       ఇదీ సీను.  ఈ సీను కూడా మామూలుగా – బిగినింగ్ - మొదలై సంఘర్షణ జరిగి – మిడిల్ - దానికి పరిష్కారంతో – ఎండ్ - ముగిసింది. గత సీన్లో ఏర్పాటయిన ఇద్దరి ప్రేమలూవిశ్వాసాల గురించిన సమాచారం మనచేతిలో వుంది. ఇప్పుడు ఇద్దరూ తమతమ దృక్పథాల నుంచి సీను ఎలా నడిపారో చూస్తున్నాం. సీను రే ఒక్కడే నడిపాడు. అతనే ముగించుకుని వెళ్ళిపోయాడు. పంతాలకి పోయి ఇద్దరూ నడిపితే గజిబిజి అవుతుంది.


            ఈ సీను ప్రధానోద్దేశం,  టెలిఫోన్ బూత్ లో ఎబ్బీ మీద రేకి కలిగిన అనుమానం చుట్టూకథ  నడిపి నిగ్గు తేల్చడం. రేకి సంబంధించినంత వరకూ ఇది ముందు తేలాలి. ఆ తర్వాతే మిగతా విషయాలు. కాబట్టి ఈ అనుమానం  నిగ్గు తేలే వైపే  సీను డ్రైవ్ కన్పిస్తోంది. 

             ఈ సీనులోకి ఇద్దరూ రావడానికి ముందున్న పరిస్థితి గమనిస్తే, మార్టీ కి ఏం జరిగిందో, రే ఏం చేశాడో ఎబ్బీకి తెలీదు. రే కి తెల్సు. మార్టీ ని ఆమే సగం చంపి వదిలేసిందని అనుకుంటున్నాడు. అసలేం జరిగిందన్న సమాచారం ఎబ్బీ దగ్గర లేదు. రే చేతిలో వుంది. అందుకని అతనేమంటున్నాడో అర్ధంగాక నోట మాట రాక వుండిపోతోంది. దీన్ని ఆమె మౌనంగా తీసుకుంటున్నాడతను. పైగా ఫోన్ బూత్ బకరా ఫీలింగ్ కూడా పనిచేస్తోంది. ఆమె మౌనం, ఏమీ తెలీనట్టు వుండడం అతణ్ణి ఉద్రేకానికి లోనుజేస్తున్నాయి. దీంతో సంఘర్షణ పుడుతోంది. ఒకరి మౌనం పుట్టిస్తున్న సంఘర్షణ. మౌనంతో ఇలా అర్ధవంతమైన సంఘర్షణ పుడుతూంటే,  ఇద్దరి ఆరోపణలు ప్రత్యారోపణలతో భారీ గొడవ సృష్టించనవసరం లేదు. 

            ఆమె బెడ్ మీద నిద్రపోకూడదా అంది. ఈ మాట ఎందుకు అనిపించాలి? ఆమెతో ప్రేమకొద్దీ అన్పించినట్టే వుండొచ్చు. కానీ ఈ డైలాగు ఉద్దేశం  ప్రేక్షకులకి అతడి మారిన మనసుని తెలియజేయడం కోసమని సంకల్పించారు దర్శకులు.  అవును, అంత అలసిపోయి వచ్చి బెడ్ మీద ఎందుకు నిద్రపోకూడదు? ఎందుకంటే, ఫోన్ బూత్ ఎఫెక్ట్ అతడి మీద పనిచేస్తోంది. అది కాదనుకుని ఎంత ప్రేమగా ఆమె శిరోజాలు సవరించినా సమాధాన పడలేకపోతున్నాడు. ఆమె బెడ్ ని పంచుకోలేక చైర్ లో ఇలా కునికిపాట్లు పడుతున్నాడు.

            ఈ ఓపెనింగ్ షాట్ లో అతను కూర్చున్న విధానం గమనిస్తే, మార్టీ గుర్తుకొస్తాడు. ఈ టేబుల్ - చైర్, గోడమీద చైర్ నీడా  గురించి అర్ధాలు వెనక సీనులో చెప్పుకున్నాం. ఇప్పుడు చూస్తే  ఆమె జీవితంలోఖాళీ అయిన మార్టీ స్థానంలో కూర్చున్నట్టుంటాడు రే. ఈ కూర్చోవడం కూర్చోవడం కూడా - స్క్రిప్టులో రాయలేదు గానీ  - కాలెత్తి టేబుల్ మీద  పెట్టి కూర్చుంటాడు. ఇది మార్టీ అలవాటే.

            అంటే, ఫోన్ బూత్ బకరా ఫీలింగు సంగతి తేల్చుకోవాలని ‘బాస్’ లా ఇలా కూర్చున్నాడన్న మాట. కథా ప్రారంభంలో ఎబ్బీ రేతో మోటెల్లో వుండగా, ఆమె సంగతి తేల్చుకోవాలని బార్లో మార్టీ ఇలాగే కూర్చున్నాడని గమనించాం.

            ఈ క్రమంలో నడిచే సంభాషణలో అతను  డైరెక్టుగా అడిగెయ్యకుండా ఎన్ని హింట్స్ ఇస్తున్నా  ఆమె అర్ధం జేసుకోలేకపోతోంది. అతనేదో అపార్ధం జేసుకుని ఇలా అంటున్నాడని కూడా ఆమెకి తెలీదు. కాబట్టి అపార్ధాన్ని  తొలగించాలన్న ఆలోచనే రాదు. పరిస్థితి తల్చుకుంటే అతడికి చలి పుట్టుకొస్తోంది. చలి కోటు అడుగుతాడు. తర్వాత కిటికీలోంచి పడుతున్నఎండలో నించుంటాడు.  అక్కడ పడున్న బట్టల్ని చూస్తాడు. అక్కడే అట్టపెట్టె వుంటే అందుకుంటాడు. మళ్ళీ పడేస్తాడు (స్క్రిప్టులో రాయలేదు).  ఈ పిచ్చి పన్లు ఎందుకు చేస్తున్నట్టు? టెన్షన్ తో చేస్తున్నట్టు అన్పించవచ్చు, కానీ కాదు. టెన్షన్ తో పిచ్చిపన్లు ఎవ్వరూ చెయ్యరు. ఇది సైకాలజీ. టెన్షన్ పుట్టించిన సమస్యకి పరిష్కారంగానే ఏదో చేస్తారు తమకే తెలీకుండా. తర్వాత ఆ  చేసిందే నిజమవుతుంది. ఎవ్విరీ థింగ్ ఈజ్ రిలేటెడ్.

            ఆ బట్టల్ని చూడడం, పెట్టె ఎత్తుకోవడం ఇదంతా సబ్ కాన్షస్  ప్రేరక చర్యలు. ఈమెతో విడిపోబోతున్నావ్, ఇంకో వూరెళ్ళి పోబోతున్నావ్ - అని చెప్తోంది అతడి సబ్ కాన్షస్ మైండ్. తదనుగుణంగా ఈచర్యలకి దారితీయిస్తోంది. అతనే  పసిగట్టడం లేదు. సబ్ కాన్షస్ మైకు పెట్టి మాట్లాడదు. గుసగుసలాడుతుంది.  ఈ గుసగుసలు విన్పించుకునే స్థితిలో దాదాపు ఎవ్వరూ వుండరు. అందుకే సహజాతంతో ప్రవర్తించే జంతువులకన్నా మనుషుల జీవితాలిలా అఘోరిస్తూంటాయి.

            సబ్ కాన్షస్ హెచ్చరించినట్టే ఈ సీన్లో చివరికి  ఆమెకి బై చేప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తర్వాత వచ్చే సీన్లో ఏం చేశాడూ? తన ఫ్లాట్ లో అట్ట పెట్టెల్లో బట్టలు సర్దుకుంటూ కూర్చున్నాడు! ఆమె వచ్చి అడిగితే వూరెళ్ళి పోతున్నానన్నాడు – ఎవ్విరీ థింగ్ ఈజ్ రిలేటెడ్!  దటీజ్ సబ్ కాన్షస్ మైండ్!

            మనిషి జీవితం ఎన్ని డైమెన్షన్స్ తో వుంటుందో అవన్నీ ఇలా సహజంగా, సజీవం గా, రక్త మాంస - ఆత్మ సహిత కథనంగా  చూపిస్తున్నారు కోయెన్ బ్రదర్స్. కథ  అంటే కాన్షస్ -  సబ్ కాన్షస్ మైండ్ ల ఇంటర్ ప్లే అని చెప్పాడు జేమ్స్ బానెట్. కథంటే అవసరాన్నిబట్టి సబ్ కాన్షస్ మైండ్ నడిపించే పాత్రలని కూడా ఇలా చెప్తున్నారు కోయెన్ బ్రదర్స్.

            ఇంకా ఆమె వైపు చూస్తే, రే బార్ కెళ్ళానన్నప్పుడు, అక్కడ మారీస్ వున్నాడా అని గబుక్కున అనేస్తుంది ఎబ్బీ. మారీస్ ఎందుకు గుర్తొచ్చాడు? అంటే ఆమె అంత ఎలర్ట్ గా వుంది. వెనకటి ఫస్టాఫ్ ఒక సీన్లో బార్ కెళ్ళి , ఇకముందు రే వస్తే మార్టీ ఇతనూ గొడవపడకుండా చూడమని మారీస్ ని కోరిన విషయం గమనించాం. అందుకే ఇప్పుడు అలా అడిగేసింది.

            ఇక సీను ముగిసే కొద్దీ ఇంకో రెండు ఆమె ఖర్మకొద్దీ జరిగాయి అతడికి చిక్కదానికి. అతనసలే  ఆమె మీద అనుమానంతో వచ్చాడు. ఆ అనుమానాన్ని నిజమయ్యేట్టు ఆమె వైపు నుంచి జరుగుతున్నాయి. మళ్ళీ ఏం చేసింది -
దేని గురించి నువ్వంటున్నావ్ రే,  ఫన్నీగా నేనేమీ చేయలేదే అనేసింది. తెగతెంపుల కిది ఇంకో మెట్టు!

            ఫస్టాఫ్ బిగినింగ్ విభాగం 7 వ సీనులో చూద్దాం. ఈసీనులో రే మార్టీ దగ్గరకి జీతం డబ్బుల కోసం వెళ్ళినప్పుడు-మాటా మాటా పెరిగిపోయి మార్టీ ఇలా అంటాడు అక్కస్సుగా-

            “దేనికి నవ్వుతావ్? ఫన్నీ గైలా కన్పిస్తున్నానా? యెదవలా  కన్పిస్తున్నానా? నో నో నో నో- ఫన్నీగా వున్నది నేను కాదు, ఫన్నీగా వున్నది నీ లవర్. నేను మీ ఇద్దరి మీద నిఘా పెట్టించాను చూడూ అదీ ఫన్నీ. ఎందుకంటే నువ్వు కాకపోతే అదింకొకడితో పడుకునేదే,  కాబట్టీ అదీ ఫన్నీ. నీకింకా చాలా ఫన్నీగా ఎప్పుడన్పిస్తుందంటే, ఏంటీ రే నువ్వు మాట్లాడుతున్నదీ... ఫన్నీగా నేనేం  చేశాననీ? అని అమాయకంగా అది మొహం పెట్టి అంటుంది చూడూ, అప్పుడూ!” – అని.

            ఇప్పుడు ఈ విషమ పరిస్థితిలో సరీగ్గా ఎబ్బీ ఇలాగే అనేసింది – దేని గురించి నువ్వంటున్నావ్ రే,  ఫన్నీగా నేనేమీ చేయలేదే!” – అని.

            దొరికిపోయింది! తెగతెంపులకి దొరికిపోయింది!  చేతులారా అనుమానం పూర్తిగా బలపర్చుకుంది - తను ఇంకెవర్నో చూసుకుని రేని బకరా చేస్తోందనుకుంటున్న అనుమానాన్ని!

            ఇక చిట్ట చివరి చరణం కూడా అందుకుంది రిలేషన్ షిప్. ఫోన్ కాల్ వచ్చింది. వెనక 9 వ సీనులో ఫోన్ కాల్ వల్లే పరస్పర అనుమానాలతో చెడింది. అప్పుడు మార్టీ చేశాడు. ఇప్పుడెవరు చేశారు? నీడలా మారిపోయిన మార్టీ దెయ్యమై కాల్ చేస్తున్నాడా అప్పుడే?  ఇది హార్రర్ కథ కాదు కాబట్టి ఇలా వూహించలేం, విస్సర్ చేసి వుంటాడు. మనోడు డిస్టర్బ్ అయి వున్నాడు. లైటర్ లేదు, ఫోటో లేదు. రెండూ బార్లోనే వుండి వుంటాయి. బార్ కెళ్ళి వెతకాలంటే ముందు వీళ్ళిద్దరూ ఎక్కడున్నారో తెలుసుకోవాలి. వీళ్ళు బార్లోనే వుంటే, లేదా తను వెళ్ళినప్పుడు వస్తే ప్రాబ్లం అయిపోతుంది. అందుకని ఇలా కాల్ చేసి వుంటాడు. ఇదే  ఎబ్బీ కొంప ముంచింది. అప్పుడూ ఇప్పుడూ తనే ఎత్తింది. అప్పుడు మార్టీ మాటలు విన్పించకుండా ఫ్యాను శబ్దమే విన్పించింది. ఇప్పుడు కూడా  ఫ్యాను శబ్దమే విన్పించడంతో ‘మార్టీ’ అనేసింది రే తో!

            ఐపోయింది. ఈమాటతో ఏడ్వలేక నవ్వాడు. అబద్ధం కూడా చెప్పడం రావడం లేదీమెకి. ప్రియుణ్ణి కవర్ చేసుకోవడానికి తను చంపేసిన మార్టీ అంటోంది. ఐపోయింది అనుమానం తీరిపోయింది. తను బకరానే! 

            ఇంతసేపూ వీళ్ళిద్దరి విడివిడి షాట్సే జాగ్రత్తగా మెయింటెయిన్ చేశారు. ఇప్పుడు చరమగీతం పాడేశాక వైడ్ షాట్ లో ఓపెన్ చేశారు.  ఇద్దరూ ఇటు చివర ఒకరు, అటు  చివర ఒకరు నిలబడి వుంటారు. ఇంతసేపూ ఇలాగే  వుండి వుంటారు. మనకి చూపించలేదు. వాళ్ళ మధ్య ఆఖరి ఆశ కూడా హుష్ కాకీ అయిపోవడంతో ఇంకేం లేదన్న అర్ధంతో దూరాలు చూపించే  వైడ్ షాట్ వేశారు. షాట్స్ కథని ఫాలో అవడమంటే ఇదే (పై ఫోటో చూడండి).

            అదెవరో మళ్ళీ కాల్ చేసుకో-  అనేసి వెళ్ళిపోయాడు ఆమె రివాల్వర్ అక్కడ పెట్టేసి. ఆమె కసలిదంతా ఏమిటో ఏమీ తెలీదు. ఈ సీను లో ఇక్కడ వర్ణించడం కుదరలేదు గానీ, క్లోజప్స్ లో వీళ్ళిద్దరి భావప్రకటనలు ఖచ్చితంగా వీడియో చూసి ఫీలవ్వాల్సిందే, స్టడీ చేయాల్సిందే- సృజనాత్మకంగా, సాంకేతికంగా.  


(సశేషం)

-సికిందర్ 

Saturday, September 2, 2017

506 : రివ్యూ



               దర్శకత్వం  :  అశ్వినీ అయ్యర్ తివారీ
తారాగణం : ఆయుష్మాన్ ఖురానా, కృతీ సానన్, రాజ్ కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠీ, సీమా పహ్వా, స్వాతీ సెమ్వాల్, రోహిత్ చౌదరి తదితరులు
రచన : నీతేష్ తివారీ - శ్రేయాస్ జైన్ - రజత్ నోనియా, సంగీతం : తనిష్క్ బాగ్చీ తదితరులు, ఛాయాగ్రహణం : గవెమిక్ యూ ఆరే
బ్యానర్ : బీఆర్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్
నిర్మాతలు : రేణూ రవిచోప్రా, వినీత్ జైన్, రజత్ నోనియా
విడుదల : ఆగస్టు 18, 2017
                            ***
      హిం
దీ రోమాంటిక్ కామెడీలు మధ్యతరగతి  పాత్రల గురించి వున్నప్పుడు ఎప్పుడూ హిట్టవుతున్నాయి : క్వీన్, టోటల్ సియపా, బ్యాండ్ బాజా బరాత్,  తను వెడ్స్ మను, టూ స్టేట్స్ మొదలైనవి. పాత్రలు నిజ జీవితాలకి దగ్గరగా వుంటూ సున్నిత హాస్యాన్ని ఆశ్రయించడంతో చక్కిలిగింతలు పెడుతూంటాయి. పైగా ఈ రోమాంటిక్ కామెడీలు తెలుగులో లాగా సగం నుంచి ఏడ్పించే రోమాంటిక్ డ్రామాలుగా మారకుండా, జానర్ మర్యాదనెరిగి జాయ్ ఫుల్ గా హిట్టయినవే వుంటాయి. ప్రస్తుతం ఇలాటిది మరొకటి చేరింది. ‘బరేలీకీ బర్ఫీ’ స్వీట్ రోమాంటిక్ కామెడీ ఇప్పటికే స్లీపర్ హిట్ గా నిల్చి రిలీజైన పెద్ద సినిమాల్ని వెనక్కి నెట్టేసింది.  స్లీపర్ హిట్ అంటే ఓ చిన్న సినిమా చాపకింద నీరులా తనపని తాను చేసుకుపోయి ఇతర సినిమాల కొంప ముంచడం. ఇలాటి స్లీపర్ హిట్  ‘బీబీ’ ఇతర బెర్తులన్నీ ఖాళీ చేయించి మొత్తం తనే ఎలా పాగా వేసిందో ఒకసారి కింద చూసుకుంటూ వెళదాం...
కథ
      బిట్టీ మిశ్రా (కృతీ సానన్) బరేలీలో విద్యుత్ శాఖలో పనిచేస్తూంటుంది. ఒక్కతే కూతురవడంవల్ల ఏం చేసినా తల్లిదండ్రులు  (పంకజ్ త్రిపాఠీ, సీమా పహ్వా) చూసీ చూడనట్టుంటారు. మందూ సిగరెట్లు నాన్ వెజ్ లాగిస్తుంది. బ్రేక్ డాన్స్ చేస్తుంది, ఇంగ్లీషు సినిమాలు చూస్తుంది. పెళ్లి చేద్దామంటే ఒక్కరికీ ఈమె నచ్చదు.  ఒక నచ్చినవాడు ఓవరాక్షన్ చేస్తే తను వర్జిన్ కాదు పొమ్మంటుంది. పారిపోతాడు. తనని తనలాగా అంగీకరించేవాడు దొరకడు. తల్లిదండ్రులకి దిగులు పట్టుకుంటుంది. వాళ్ళ బాధ చూడలేక ఒకరోజు బిట్టీ ఇంట్లోంచి పారిపోతుంది. ఒక నవల కొనుక్కుని ట్రైన్ లో చదువుకుంటూ పోతుంది. ట్రైను దిగి ఇంటి కొచ్చేస్తుంది. ఫ్రెండ్ రమ (స్వాతీ సెమ్వాల్) తో చర్చిస్తుంది. ‘బరేలీకీ బర్ఫీ’ అని ప్రీతమ్ విద్రోహి అనేవాడు రాసిన గొప్ప నవల్లో హీరోయిన్ పాత్ర అచ్చం తనలాగే వుందని చెప్తుంది. తన భావాలే వున్నాయనీ,  అంటే ఈ రచయిత విద్రోహి అంత  అభ్యుదయభావాలు గల వాడనీ, ఇతణ్ణి ఓసారి కలుసుకోవాలనీ  అంటుంది. ఇద్దరూ ఆ నవల ప్రచురణకర్త చిరాగ్ దుబే (ఆయుష్మాన్ ఖురానా) దగ్గరికెళ్ళి,  రచయిత ప్రీతమ్ విద్రోహి అడ్రసు అడుగుతారు.

          ప్రచురణకర్త చిరాగ్ దుబే ప్రేయసి ఇంకొకణ్ణి  పెళ్లి చేసుకుని చెక్కేసింది ఐదేళ్ళ క్రితం. దీంతో బాగా పిచ్చెక్కి  ‘బరేలీకీ  బర్ఫీ’ అని ప్రేమ నవల తనే రాసి పారేశాడు. కానీ దీన్ని తన పేరుతో ఫోటో వేసుకుని ప్రచురిస్తే పెళ్ళయిన  ప్రేయసి ఇబ్బంది పడుతుందని,  ఒక బకరా కోసం చూశాడు. పిరికి పిరికిగా, బెదురు బెదురుగా మాట్లాడే ఫ్రెండ్ ప్రీతమ్ విద్రోహి (రాజ్ కుమార్ రావ్) రూపంలో బకరా  దొరికాడు. అతణ్ణి ఫోటో తీయించి అతడి పేరుతో నవల వేసేశాడు. దీని పరిణామాలు వూహించుకుని  బకరా విద్రోహి వూరొదిలి పారిపోయాడు.

          ఇప్పుడు బిట్టీ వచ్చి నవల రాసింది  విద్రోహియే   అనుకుని అడ్రసు అడిగేసరికి ఇరుకున పడతాడు చిరాగ్. బిట్టీ స్పష్టంగా చెప్పేస్తుంది, విద్రోహి భావాలు తనకి నచ్చాయనీ,  అతణ్ణి ప్రేమిస్తున్నాననీ. కానీ నవల రాసింది తను. అంటే ఈమె తనతోనే  ప్రేమలో పడిందని రూఢీ అయి తనూ ప్రేమలో పడతాడు చిరాగ్. విద్రోహితో కలిపితే చిరాగ్ ని మంచి ఫ్రెండ్ లా  చూస్తానంటుంది బిట్టీ. ఇక తప్పక – చిరాగ్ ఫ్రెండ్ మున్నా (రోహిత్ చౌదరి) తో కలిసి వెతికి వేరే వూళ్ళో  చీరల షోరూంలో జోరుగా పనిచేస్తున్న విద్రోహిని పట్టేసుకుంటాడు.  విషయం  చెప్పి, బిట్టీ తో గల్లీ గూండాలా ప్రవర్తించాలనీ, ఆమె మనసు అడ్డంగా విరిచేసి, ఇంప్రెషన్ ని చెడగొట్టి,  డిప్రెషన్ లో పడెయ్యాలనీ విద్రోహిని బ్లాక్ మెయిల్ చేస్తాడు చిరాగ్. ఇదీ విషయం.

ఎలావుంది కథ
         ది ఇంగ్రెడియెంట్స్ ఆఫ్ లవ్’ (2012) అనే ఫ్రెంచి నవల కాధారం. రోమాంటిక్ కామెడీ జానర్. పాత హృషికేష్ ముఖర్జీ, బాసూ భట్టాచార్యల  మధ్యతరగతి రోమాంటిక్ కామెడీల శైలిలో వుంది. అదే సమయంలో సల్మాన్ ఖాన్ - మాధురీ దీక్షిత్ -  సంజయ్ దత్ లు నటించిన  ‘సాజన్’ (1991) ని గుర్తుకు తెచ్చే కథతో కూడా వుంది. ఒకరి  పేరుతో ఇంకొకరు నవలో కవిత్వమో రాస్తే ఏర్పడే మిస్టేకెన్ ఐడెంటిటీ లాంటి అనేక సార్లు అనేక భాషల్లో వచ్చిన  పాయింటుతోనే వుంది. సున్నిత హాస్యంతో సహజత్వానికి దగ్గరగా వుంది. సోషల్ మీడియాలో చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటున్న ఈ రోజుల్లో ఓపిగ్గా నవలంతా చదివి ప్రేమించడం పాత చాదస్తంలా  వున్నా, ఫ్రెంచి నవల రాసిన నికోలస్ బరో కథాకాలాన్ని ఈ  నెట్ యుగంలో -  2012 లోనే పారిస్ నేపధ్యంగా ఏర్పాటు చేశాడు. నవల పాపులరైంది. పాత అభిరుచుల పట్ల క్రేజ్ ఇంకా తగ్గలేదనీ, తగ్గబోదనీ  తెలియజేయడం ఇలా రాసే ఉద్దేశం కావొచ్చు. ఇది కనెక్ట్ అయింది. 

ఎవరెలా చేశారు
       ‘నేనొక్కడినే’, ‘దోచేయ్’ లలో నటించిన కృతీ సానన్ హిందీలో పాపులరవుతోంది. స్లీపర్ హిట్ గా నిల్చిన ‘బీబీ’ లో ఆమెది హీరోల పక్కన డాన్సులేసే రొటీన్ గ్లామర్ డాల్ పాత్ర కాదు, ప్రధాన పాత్ర. ఈ పాత్రలో బరేలీ గాళ్ గా జీన్సు కుర్తాల ఆహార్యంతో అతి సాధారణంగా వుంటుంది, కానీ మానసికంగా బలమైన దృక్పథంతో  వుంటుంది. తన మాటే నెగ్గాలని ఎవర్నీ హర్ట్ చెయ్యదు, పేరెంట్స్ ని కూడా ఇబ్బంది పెట్టదు. పరిమితంగా తాగుడూ తిండి విషయాల్లో  తండ్రి కూడా అభ్యంతర పెట్టడు. తండ్రినే సిగరెట్ అడుగుతుంది. ఒక్కతే  కూతురని మూస ఫార్ములా సినిమాల్లోలాగా అలరల్లరి చెయ్యదు. ఇలాటి పాత్ర అందర్నీ నవ్వించాలనీ, చిలిపి పనులు చేయాలనీ  మూస ఫార్ములా రూలుండే పాత్రచిత్రణ కాదు. ‘మిలి’ లో జయబాధురి ఒకటే అల్లరల్లరి చేస్తుంది. అందర్నీ నవ్విస్తూ ఆడిస్తూ పాడిస్తూ ఓవర్ గా తిరుగుతుంది. ‘మైనే కహా ఫూలోసే’  అని పూల చెట్లతో పాట కూడా వేసుకుంటుంది. కృతీ సానన్ పాత్ర నేటి తరహా మధ్యతరగతి యువతుల భావాలని ప్రతిబింబించే, నియంత్రించే, ఆకాశానికి నిచ్చెనలెయ్యని, కోరికలే గుర్రాలు కాని, వ్యసనాల్ని దుర్య్వసనాలుగా చేసుకోని, ఒక సెన్సిబుల్ పట్టణ ప్రాంతపు హాస్య పాత్ర. 

          రోమాంటిక్ కామెడీలు జానర్ మర్యాదతో వుంటే పాత్రలెంత డైనమిక్ గా వుంటాయంటే – రొటీన్ అపార్థాలుండవు, రొటీన్ విడిపోవడాలుండవు, రొటీన్ మానసిక సంఘర్షణలూ, ప్రేమల్లో ఫీల్ కోసం ప్రయత్నాలూ, గజిబిజి పాత్రచిత్రణలూ – నస అంతా వుండదు. నిజానికివన్నీ రోమాంటిక్ డ్రామాల కుండాల్సిన లక్షణాలు.   తెలీక రోమాంటిక్ కామెడీల్లోఇరికించేసి జానర్ మర్యాదని దెబ్బ తీస్తూంటారు. సినిమాలంత అడ్డగోలు కళ మరొకటి కన్పించదు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎవరిష్టం వచ్చినట్టు  వాళ్ళు చేసుకుంటూ పోయే స్వేచ్ఛ వున్నా  ‘ఖళ!’ ఇదొక్కటే (ఈ శతాబ్దంలో తెలుగులో జానర్ మర్యాదని దెబ్బ తీయని ఒకే ఒక్క రోమాంటిక్ కామెడీ  ‘అమీతుమీ’. మిగిలినవన్నీ  రోమాంటిక్ కామెడీలని పొరబడి తీసిన సోకాల్డ్ రోమాంటిక్ డ్రామాలే). 

          రోమాంటిక్ కామెడీల్లో ప్రేమలకోసం పోటాపోటీలుంటాయి. ఎత్తుకు పై ఎత్తులుం
టాయి, చేతగాక ఏడ్పు లుండవు. రోమాంటిక్ కామెడీలు జీవితంలో గెలవడం గురించి  చెప్తాయి. అందుకే పాశ్చాత్య దేశాల్లో సైకాలజీ స్టూడెంట్స్ కి ఎన్నో హాలీవుడ్ రోమాంటిక్ కామెడీలు పాఠ్యాంశాలుగా వున్నాయి. రోమాంటిక్ కామెడీలు ఆరోగ్యకర మానసిక స్థితికి సూచికలుగా వుంటాయి.  ప్రేమికులిద్దరూ ఒకరు ఎక్కువా ఇంకొకరు తక్కువా అన్నట్టు వుండరు. సమ వుజ్జీలుగా వుంటారు. పరస్పరం ఐయాం ఓకే – యూఆర్ ఓకే అన్న సమానస్థాయి ఆరోగ్యకర ‘అడల్ట్’ మెంటాలిటీతో వుంటారు. ఐయాం ఓకే - యూఆర్ నాట్ ఓకే అన్న  ఒకరు పెత్తనం చెలాయించే ‘పేరెంట్’ మెంటాలిటీతో వుండరు.  అలాగే యూఆర్ ఓకే – అయాం నాట్ ఓకే అన్న ఆత్మవిశ్వాసం లేని ‘చైల్డ్’ మెంటాలిటీతో అసలుండరు. 

          రోమాంటిక్ కామెడీల్లో  అసలు ప్రేమల గురించి కథ నడపకుండా, ప్రేమల కోసం ప్రయత్నాల గురించి, ఎత్తుగడల గురించీ  వీలైనంత హాస్యంగా కథ నడపడం వుంటుంది. ఎత్తుగడలు ప్రేమికుల మధ్య వుండవచ్చు, లేదా ప్రేమికులిద్దరూ కలిసి ఇతర పాత్రలతో  తలపడొచ్చు. రోమాంటిక్ కామెడీల్లో యాక్టివ్ పాత్రలే వుంటాయి. చిట్ట చివర్లో - చిట్ట చివర్లో మాత్రమే – చిట్ట చివర్లో మాత్రమే – ఈ యాక్టివ్ పాత్రలు కాస్త ఫీలవడం, డ్రామా పండించడం  వుంటాయి, అంతే. దీంతో అపార్థాలు, విడిపోవడాలు, మానసిక సంఘర్షణలూ, ప్రేమ ఫీలింగులు,  బలహీన పాత్రచిత్రణలూ, ఏడ్పులు, ప్రేక్షకుల కళ్ళల్లో గిరగిరా కన్నీళ్ళూ  అంతా  కొట్టుకుపోయి – మళ్ళీ కొత్తగా నీరొచ్చిన హుసేన్ సాగర్ లా చైతన్యంగా వుంటాయి రోమాంటిక్ కామెడీలు. హృషికేష్ ముఖర్జీ, బాసు భట్టాచార్య, జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, ఇటీవల మోహనకృష్ణ ఇంద్రగంటి ఇలాగే  తీశారు జానర్ మర్యాద చెడకుండా. 

          ఈ కోవలో కృతి పోషించిన బిట్టీ పాత్ర లక్ష్య సాధనకి  - ఇంకా జానర్ ప్రకారం -  హాస్య
రస పోషణకీ అడ్డుపడే ఎలాటి ఫీలింగ్స్, బరువైన సన్నివేశాలకీ  తావివ్వదు. ప్రేమలో పడి ఫీలవుతూ, బాధపడుతూ, విరహగీతాలు పాడుతూ కూర్చుంటే, రోమాంటిక్ కామెడీలో ఫన్నీ ఎత్తుగడలతో ప్రేమ అనే లక్ష్యాన్ని సాధించడం కుదరదు. ఒక ఎత్తుగడ ఫెయిలయితే ఇంకేం చేయాలా అని ఫన్నీ గా ఆలోచించి అది చేసేస్తుంది. 

      మధ్యతరగతి తల్లి పాత్రలో సీమా పహ్వా ఒక ప్రత్యేకాకర్షణ. తన హాస్య పాత్రని కన్న బిడ్డలా ముద్దు చేసుకుంటూ పోషించింది. చాలా స్వీట్ ఛార్మ్ వున్న లేడీ. ఇంటికెవరైనా కుర్రాడొస్తే ముందు పెళ్లయిందా అనడుగుతుంది. అయిందంటే వెంటనే వెళ్లిపొమ్మంటుంది. కాలేదంటే కూర్చో బెట్టి షర్బత్ ఇచ్చి కబుర్లాడుతుంది, కూతురికి ఏ కోణంలో  సరిపోతాడా అని.

          తండ్రి పాత్రలో
పంకజ్ త్రిపాఠీ తిరుగుతున్న ఫ్యానుతో మాట్లాడి కూతురి పెళ్లి బెంగ తీర్చుకుంటూ వుంటాడు. హీరో ఫ్రెండ్ పాత్రలో రోహిత్ చౌదరి ఇంకో మంచి హాస్యపాత్ర. ఇక సామాన్యంగా కన్పించే  హీరో పాత్రలో ఆయుష్మాన్ ఖురానా టాలెంటెడ్ నటుడు. ఒక ప్రేమకి పెళ్ళయిపోయి, రెండో ప్రేమ ఇలా వచ్చీ తనదిగా చెప్పుకోలేని ఇరకాటాన్ని డీసెంట్ గా పోషించాడు. పెళ్ళయిపోయిన ప్రేయసిని గుర్తు చేసుకుంటూ అంతటి నవల రాసినా, ఈ అయిదేళ్ళల్లో చదివి ఫిదా అయిపోయింది హీరోయిన్ ఒక్కతే. మిగిలిన కాపీలన్నీ చాట్ బళ్ల దగ్గర పొట్లాలు చుట్టడానికీ, ఇళ్ళల్లో ఆడవాళ్ళు రద్దీలో విసిరి పారెయ్యడానికీ పనికొచ్చాయి.  తన ప్రేమ కథ అంత చెత్తగా వుందన్న మాట. ఇప్పుడు హీరోయిన్ తో విద్రోహి గాడు తన ఫ్రెష్ ప్రేమని కూడా కొల్లగొట్టేయకుండా పడే పాట్లు అన్నీఇన్నీ కావు. పిరికి విద్రోహిని గల్లీ గూండాలాగా ట్రైనింగ్ ఇచ్చి తయారు చేసి, అతడి మీద హీరోయిన్ ప్రేమని చెడగొట్టించే ప్రయత్నాలు చేత్సే, ఆవి తన మెడకే చుట్టుకుని, విద్రోహిగాడు  నిజంగానే విద్రోహిగా మారిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. తట్టుకోలేక తన్నుకు చస్తాడు. 

       ఐతే ఆయుష్మాన్ ది కుట్రలు చేసే యాంటీ హీరోగా మారిపోయే పాత్ర. పిరికి రాజ్ కుమార్ రావ్ జాలీగా హీరోయిన్ ని ప్రేమలో పడేసుకుని హీరోగా మారిపోయే పాత్రగా కొనసాగుతుంది. కథ ఎలా ముగుస్తుందో అంతుపట్టకుండా వుంటుంది. ఈ సస్పెన్స్ కాస్తా చివర ఆయుష్మాన్ మీద శాడ్ సాంగ్ పెట్టి, ఫీల్ కల్గించడంతో చెడిపోయి, హీరోయిన్ ఇతడికే  దక్కుతుందని స్పష్టమైపోతుంది. ఇతడి మీద శాడ్ సాంగ్ బదులు, రాజ్ కుమార్ మీద హీరోయిన్ తో రోమాంటిక్ సాంగ్ వుండి వుంటే,  అతడి విజయయాత్రకి పెప్ వచ్చి, సస్పెన్స్ మరింత పెరిగేది- ముగింపు తెలిసిపోకుండా. 

         అసలు రాజ్ కుమార్ రావ్ దే కామెడీ అంతా. పిరికి వాడైన తనకి గూండాలాగా ట్రైనింగ్ ఇప్పించిన హీరో ముందు నంగినంగి గా పిల్లిలా మాట్లాడి, హీరోయిన్ దగ్గరికి వెళ్ళే సరికి మాంచి  బేస్ వాయిస్ తో పులిలా మాట్లాడే డబుల్ యాక్షన్ కామెడీ ఆయువుపట్టు సినిమాకి. నిజానికి అతడి ఫేసుకి ఏ అమ్మాయీ ప్రేమలో పడదు – మొహం చూసి అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే ఈ దేశంలో సగం మంది కుర్రాళ్ళు సన్నాసులుగా మిలిపోతారని అంటాడు - బాగా ధైర్యవంతుడిగా గ్లామర్ పెరిగాక. హీరోయిన్ తండ్రి దగ్గరికి రిచ్ మాన్ లా వచ్చి- నేనెంత  రిచ్ అంటే,  ధన్తేరాస్ కి మీ స్వీట్ షాపు కొనేసి మీకే గిఫ్టుగా ఇచ్చేంతగా – అని కోతలు కోస్తాడు. తను రచయిత అనుకుని ప్రేమిస్తున్న హీరోయిన్ని హీరో కోసం దూరం చేయడానికి గూండాలా షాకింగ్ దృశ్యాలు చూపిస్తాడామెకి. ట్రాఫిక్ లో అడ్డంగా బైక్ ఆపేసి, పాన్ షాపు దగ్గర దర్జాగా సిగరెట్ కాలుస్తూ - గోలెడుతున్న వాహనదారుల్ని గూండాగిరీతో - అరేవో - అనే ఒక్క గంభీరమైన డైలాగుతో అవాక్కయ్యేలా చేసే సీను  -  ఇవన్నీ, ఇలాటి వింకెన్నో సిట్యుయేషన్స్ హైలైట్ గా వుంటాయి.  నవల్లో అంత శృంగార రసం ఒలకబోసి,  ఇలా గంభీరరసం పలికిస్తున్నావేంటని  హీరోయిన్ ఒకటే ఆందోళన. 

          దర్శకురాలు అశ్వినీ అయ్యర్ తివారీ ‘దంగల్’  దర్శకుడు నీతేష్ తివారీ భార్య. మొదటిసారిగా 2012 లో ‘వాట్స్ ఫర్ బ్రేక్ ఫాస్ట్’ అని తీసిన షార్ట్ ఫిలిం కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. తర్వాత ‘నిల్ బటే సన్నాటా’ (సున్నాని సున్నాతో భాగిస్తే సున్నా) అనే హిట్ మూవీ తీశారు. దీన్నే తమిళంలో అమలా పౌల్ – సముద్రకని లతో  ‘అమ్మా కణుక్కు’ గా ధనుష్ నిర్మాతగా రీమేక్ చేశారు. ప్రస్తుత కామెడీకి నీతేష్ తివారీ రచన చేశారు మరో ఇద్దరితో కలిసి. టైటిల్ లాగే తన దర్శకత్వం బర్ఫీ తిన్నంత స్వీట్ గా వుంది. మధ్యతరగతి మందహాసాన్ని మనోహరంగా తెరకెక్కించారు.

           ‘జిగార్తండా’ ఫేమ్ గవెమిక్ యూ ఆరే ఛాయాగ్రహణంలో యూపీలోని బరేలీ పట్టణం చాలా కనువిందుగా  దృశ్యం కట్టింది. తనిష్క్ బాగ్చీ సహా ఇంకో ముగ్గురు సంగీతదర్శకుల పాటలు ఫర్వాలేదు. హాస్యంగా జావేద్ అఖ్తర్ వాయిసోవర్ అప్పుడప్పుడు వస్తూ కథకి ఇంకింత కిక్ నిస్తూంటుంది. 

చివరికేమిటి 
     జానర్ మర్యాద! జానర్ మర్యాదో రక్షితి రక్షితః - అంతే. జానర్ మర్యాద తప్ప ప్రేక్షకుల నాడిని ఇంకేదీ పట్టేసుకోదు. ఇడ్లీ ఇడ్లీ లాగే వుండాలిగానీ, సగం తిన్నాక పిండిలా వుండకూడదు. ఇది కుకింగ్ మర్యాద.  సినిమా కథలకి వాటి జానర్ మర్యాద ఎందుకు వుండకుండా పోతోందంటే, కుకింగ్ తెలీని కింగులు గరిటెలూ కత్తిపీటలూ పట్టుకు తిరగడంవల్ల. ఇంటి దగ్గర కూరేదో దాని జానర్ మర్యాదతో కుకింగ్ చేయలేదని విసిరి కొట్టే తామే, సినిమాల్ని అజానరీయంగా కుకింగ్ చేసి, అనాగరికంగా తీసి ప్రేక్షకుల మెప్పు పొందగలమనుకోవడం వల్ల.

          ఈ పరిస్థితుల్లో  ‘బరేలీకీ బర్ఫీ’ రోమాంటిక్ కామెడీ జానర్ లో ఏం నేర్పుతుందో పైన తెలుసుకున్నాం. ఇక స్క్రీన్ ప్లే సంగతుల విషయానికొస్తే, విద్యుత్ శాఖలో ఉద్యోగినిగా హీరోయిన్ పాత్ర, ఆమె స్వభావం, పెళ్లి సమస్యా పరిచయమయ్యాక, ఆమె నవల చదివి రచయితతో ప్రేమలో పడి హీరోని కలుసుకునే ఘట్టంతో ప్లాట్ పాయింట్ వన్  వస్తుంది. ఇక్కడామె తన లక్ష్య సాధన కోసం రచయితతో కలపమని హీరోని కోరుతుంది. 

          ఇక్కడొక తేడా వుంది. సమస్య హీరోయిన్ ది, ప్రధాన పాత్ర తనూ, సమస్యని సాధించుకునే లక్ష్యం ప్రత్యక్షంగా తనకే వుండాలి, ఇలా కాకుండా ఇంకో పాత్రకి అప్పజేప్పేస్తే ప్రధాన పాత్రగా తనేమైపోవాలి? 

          ‘మనుషులు మారాలి’ లో ఫ్యాక్టరీ యాజమాన్యంతో లక్ష్యం కోసం పోరాడే శోభన్ బాబు ప్రధాన పాత్ర సగంలో చనిపోతుంది. అప్పుడిది హేండాఫ్ పాత్రయింది. అంటే, కథలో తన లక్ష్య సాధన దిశగా ఓ మజిలీ చేరుకుని, మరో పాత్రకి బాధ్యతని అప్పగిస్తూ నిష్క్రమించడమన్న మాట. శోభన్ పాత్ర చనిపోయాక భార్య పాత్రలో శారద ఆ లక్ష్యాన్ని అందిపుచ్చుకుని పోరాడుతుంది. 

          ఇలా ‘బర్ఫీ’ లో హీరోయిన్ ది కూడా హేండాఫ్ పాత్రయింది. ఆమె కథ నడిపిస్తే ఈ కథ రాణించదు. ఆమే వెళ్లి నవల రాశాడనుకుంటున్న సెకెండ్  హీరోని కలుసుకుంటే అప్పుడే కథ ముగిసిపోతుంది, అతను కాదని తెలిసి. ఇందులో కథెక్కడుంది? హేండాఫ్ పాత్రగా మారితేనే హీరో ఉనికిలో కొచ్చి, అతడి టక్కుటమరాలతో నాటకీయతా, కథా, కామెడీ అన్నీ పుట్టుకొస్తాయి. 

          ఇక్కడ ఇంకో గమ్మత్తేమిటంటే, ‘బ్లడ్ సింపుల్’ లాంటి ప్లాట్ పాయింట్ వన్ ట్విస్టు ఏర్పడడం. హీరోయిన్ నవల అచ్చేసిన హీరో దగ్గరికి వచ్చింది. నవల రాసిన వాణ్ణి కలపమంది. హీరో కలపడు.  ఎందుకంటే, నవల తనే రాసి వాడి పేర అచ్చేశాడు ఖర్మ కొద్దీ. ‘బ్లడ్ సింపుల్’ లో మార్టీ, విస్సర్ ని కలుసుకుని తనభార్యనీ, ఆమె ప్రియుణ్ణీ చంపమన్నాడు. విస్సర్ చంపడు. వాళ్ళని చంపితే ఏమొస్తుంది, మార్టీనే చంపితే చాలు. మార్టీ వల్ల ఏర్పడిన ఈ ప్లాట్ పాయింట్ వన్ లోంచి  విస్సర్ తనదైన ప్లాట్ పాయింట్ వన్ ని లాగాడు. పైకి వాళ్ళని చంపుతానని చెప్పి, మార్టీ నే చంపే రహస్య ఎజెండాతో వెళ్ళాడు.

         ఇలాగే  ‘బర్ఫీ’ లో హీరోయిన్ వల్ల ఏర్పడిన ప్లాట్ పాయింట్ వన్ లోంచి హీరో తనదైన ప్లాట్ పాయింట్ వన్ ని లాగాడు. సెకండ్ హీరోని నేరుగా హీరోయిన్ తో కలపకుండా, ఆమె మనసు విరిచేసే టాస్క్ సెకెండ్ హీరోకి  ఇస్తూ, సీక్రెట్ ఎజెండా పెట్టుకుని ముందుకు కొనసాగాడు. కాకపోతే ఇది ముందే మనకి తెలుస్తుంది, విస్సర్ మనకి తెలియనివ్వడు. 

          ఇలా  హేండాఫ్ పాత్ర అయిన హీరోయిన్  నుంచి కథని తను తీసుకుని, వర్కింగ్ కథా నాయకుడయ్యాడు హీరో. రానురానూ ఈ వర్కింగ్ హీరో యాంటీ హీరోగా మారిపోతాడు. ఇది క్యారక్టర్ గ్రోత్. 

          ప్లాట్ పాయింట్ వన్ తర్వాత ప్రారంభమయ్యే మిడిల్ లో అతడి యాక్షన్ ప్లాన్ ఇలా వుంటుంది : మొదట విద్రోహి అడ్రసు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడీ, సోషల్ మీడియాలో సొల్లు రాయడం  ఏవీ లేవని బుకాయించి, లెటర్స్ రాయడం ఒక్కటే మార్గమని - తను మెసెంజర్ లా వుంటాననీ  ఆమెతో అంటాడు. ఆమె రాసే ఉత్తరాలు తీసుకుని, తనే విద్రోహి పేర అందమైన కవిత్వంతో జవాబులు రాసి అందిస్తూంటాడు. చీర కట్టి దిగిన ఆమె ఫోటో ఒకటి అడిగి తీసుకుని, ముందు పెట్టుకుని వర్ణనలు రాస్తాడు. 

          ఇదంతా ఈమెకి బోరు కొట్టి అతణ్ణి కలిపి తీరాల్సిందే నని పట్టుబడుతుంది. అప్పుడు  రెండో సీక్వెన్స్ మొదలవుతుంది. ఫ్రెండ్ తో కలిసి విద్రోహి ఇంటికి వెళ్తే,  సిటీలో హై - ఫై జాబ్ చేస్తున్నాడని మదర్ అంటుంది. ఒక చిన్న టీవీ, ఒక ఫ్యానూ హై - ఫై జాబ్ చేస్తూ పంపినవే నని గర్వంగా  చూపిస్తుంది. కంపెనీ అడ్రసు అడిగితే  విజిటింగ్ కార్డు చూపించి చటుక్కున దాచేసుకుంటుంది. ఆ కంపెనీకి వెళ్తే హై - ఫై జాబ్ చెస్తూన్న విద్రోహి వుండడు. ఇంకా వెతికి
తే చీరల షోరూంలో వుంటాడు.

      ఇదంతా ఫస్టాఫ్ కథ. ఇక సెకండాఫ్ మిడిల్ టూలో విద్రోహిని బ్లాక్ మెయిల్ చేస్తాడు. తనకి సహకరించకపోతే జాబ్ సంగతి మదర్ కి చెప్పేస్తానని బెదిరించి, అమాయక ప్రాణిని గల్లీగూండాలాగా తయారు చేసి హీరోయిన్  మీదికి ఎగదోస్తాడు. ఇదొక సీక్వెన్స్. తర్వాతి సీక్వెన్స్ లో అటు హీరోయిన్ తో, ఇటు వర్కింగ్ హీరోతో నలిగిపోయి ఇక తిరగబడతాడు విద్రోహి. గుట్టు విప్పేస్తానని వర్కింగ్ హీరోనే బ్లాక్ మెయిల్ చేసి తనని ప్రేమిస్తున్న హీరోయిన్ ని సెట్ చేసుకుని సవాలు విసురుతాడు. ఇదంతా మిడిల్ విభాగం బిజినెస్ ప్రకారం వర్కింగ్ హీరోగా వున్న హీరోకి ప్రత్యర్ధితో సహజంగా జరిగే – జరిగి తీరాల్సిన యాక్షన్ రియాక్షన్ ల ఇంటర్ ప్లేనే (సంఘర్షణ). మిడిల్ వన్ లో హీరోయిన్ తో ప్లే, మిడిల్ టూ లో విద్రోహితో ప్లే. 

          ఇలా యాంటీ హీరోగా మారిన వర్కింగ్ హీరోకి చివరికేం జరగాలో అదే జరుగుతుంది. ఓడిపోతాడు. అప్పుడు హీరోగా మారిన  సపోర్టింగ్ క్యారక్టర్ విద్రోహి ఏం నిర్ణయం తీసుకుని సమస్యని కొలిక్కి తెచ్చాడనేది ఎండ్ విభాగం. కథల్లో గేమ్ ప్రారంభించే యాంటీ  హీరో చేతుల్లో ముగింపు  వుండదు. ఇంకో పాత్ర చేతిలోనో, చట్టం చేతుల్లోనో వుంటుంది. అలా వర్కింగ్ హీరో అయినప్పటికీ యాంటీ హీరోగా మారడం వల్ల ముగింపు అతడి చేతిలో లేకుండా పోయింది. ఇక్కడ హీరో చివరికి పాసివ్ అయ్యాడని కన్ఫ్యూజవకూడదు. ఇతను హీరోయే (ప్రధాన పాత్రే)  కాదనీ, కేవలం వర్కింగ్ హీరోయేననీ, అందులోనూ యాంటీ హీరోగా మారేడనీ గుర్తిస్తే కన్ఫ్యూజనుండదు. 

          ప్రధాన పాత్ర (హీరోయిన్) హేండాఫ్ పాత్రగా మారి,  తన లక్ష్యాన్ని వర్కింగ్ హీరోకి అప్పగిస్తే,  ఆ వర్కింగ్ హీరో మానిప్యులేట్ చేస్తూ యాంటీ హీరోగా మారిపోయి, లక్ష్యాన్ని దెబ్బతీసే కథలు తక్కువ వుంటాయి. ఇలాటి  అరుదైన పాత్రచిత్రణని పట్టుకోవడంతో ఈ రోమాంటిక్ కామెడీ మోస్టు డైనమిక్ గా తయారయ్యింది.


-సికిందర్
cinemabazaar.in