రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...
టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!
Monday, June 5, 2017
బడ్జెట్ మూవీస్ ఎక్కువసృజనాత్మకతని కోరుతాయి. బడ్జెట్ పరిమితుల రీత్యా ఈ సృజనాత్మకత స్క్రిప్టు పరంగానే గాక, ప్రొడక్షన్ పరంగానూ అవసరం. ఇతర అన్ని రకాల స్క్రిప్టుల కంటే బడ్జెట్ మూవీ స్క్రిప్టు రాయడమే కష్టమైన పని. అనేక యాక్షన్ సీన్లు, ఫారిన్ సీన్లు, బోలెడు పాత్రలతో హంగామా, ఆరేసి పాటలూ వగైరా బడ్జెట్ స్క్రిప్టులో కుదరదు. బడ్జెట్ స్క్రిప్టు అంతా కేవలం పాత్రల మధ్య బలమైన కథ తోనే రాణిస్తుంది. ఈ బలమైన కథని తక్కువ పాత్రలతో, తక్కువ లొకేషన్స్ లో, తక్కువ రోజుల్లో షూట్ చేసేటట్టు రూపొందాల్సిందే.
ఇక్కడ బడ్జెట్
మూవీ రచనకీ, బిగ్ కమర్షియల్
రచనకీ తేడా తెలుసుకోవడం అవసరం. బిగ్
కమర్షియల్స్ కి కథల్లో, పాత్ర చిత్రణల్లో ఎన్ని లోపాలున్నా ఇతర
భారీ హంగూ ఆర్భాటాలతో, స్టార్ ఇమేజితో కవరై పోవచ్చు. బిగ్
కమర్షియల్ కి ఒక టెంప్లెట్ లో రచన వుంటుంది. అదిలా వుంటుంది-
ముందుగా ఒక యాక్షన్ సీనుతో హీరో ఎంట్రీ, ఒక గ్రూప్ సాంగ్, ఆతర్వాత హీరోయిన్ని పడేసే కామెడీ లవ్ ట్రాక్, ఆమెతో ఒక టీజింగ్ సాంగ్, హీరోయిన్ లవ్ లో పడ్డాకడ్యూయెట్, అప్పుడు విలన్ ఎంట్రీ, దాంతో ఇంటర్వెల్. సెకండాఫ్ లో హీరోయిన్ అదృశ్యమై విలన్ తో కథ మొదలు, అప్పుడప్పుడు హీరోయిన్ తో సాంగ్స్, అప్పుడప్పుడు విలన్ ఎటాక్స్, చివరికి హీరోయిన్ తో ఒక ఫోక్ సాంగ్, ఇక విలన్ తో క్లయిమాక్స్, ముగింపూ.
ఈ టెంప్లెట్ బడ్జెట్ మూవీస్ కి పనిచేయదు. ఈ టెంప్లెట్ ని పట్టుకుని చాలా బడ్జెట్ మూవీస్ వచ్చాయి. ఫలితంగా అవి బిగ్ కమర్షియల్స్ కి చవకబారు నకళ్ళుగా తేలిపోయాయి. ఈ టెంప్లెట్ లో మొత్తం సినిమాని బిగ్ కమర్షియల్స్ బాగా రిచ్ గా చూపిస్తూంటే, చవకబారు అనుకరణలు ప్రేక్షకులకి దేనికి? బడ్జెట్ మూవీస్ కి దాని కథే వ్యక్తిత్వాన్నిస్తుంది. కథని నమ్ముకున్న బడ్జెట్ మూవీ చెడిపోలేదు. కాకపోతే ఏడాదంతా ‘క్షణం’ అనీ, ‘పెళ్లిచూపులు’ అనీ రెండో మూడో వస్తాయి. చిన్న సినిమాకి కథే బలం అంటూంటారు. దీన్ని ఇంకాస్త విడమర్చి చెప్పుకుంటే, చిన్న సినిమాకి ‘కథలో పుట్టే సమస్య- ఆ సమస్యని పట్టుకుని నటీనటుల నటన’ ఇవే బలం. ఇది మొదటి సూత్రం.
బడ్జెట్ మూవీని టెంప్లెట్ లో కథ నవ్వులపాలు చేస్తుంది. అదే స్ట్రక్చర్ లో కథ ప్రేక్షకులని కట్టి పడేస్తుంది. ఒక బిగినింగ్, ఒక మిడిల్, ఒక ఎండ్ వున్న కథ సాలిడ్ గా వుంటుంది. 60 – 70 సీన్లకి మించకుండా వుంటే పకడ్బందీగా వుంటుంది. ఒక్కో సీను రెండు మూడు పేజీలకి మించకుండా వుంటే కథ వేగం పెరుగుతుంది. వేగం పెరిగినప్పుడు బోరు తొలగి ప్రేక్షకుల ఇన్వాల్వ్ మెంట్ పెరుగుతుంది. ముఖ్య పాత్రలు కూడా నాల్గుకి మించకుండా వుంటే డ్రామా పదునెక్కుతుంది. మైనర్ పాత్రలతో సబ్ ప్లాట్స్ మూడుకి మించకూడదు. ముఖ్య పాత్రలతో కామెడీ సీన్లయినా ఆచితూచి పొదుపుగా డైలాగులు వాడాలి. స్క్రిప్టంతా డైలాగులతో నిండిపోయి వుండకూడదు. ఎడిటింగ్, డబ్బింగ్, ఆర్ ఆర్ బిల్లులు వాచిపోతాయి. అంతే కాదు, దీనివల్ల సెట్ లో ఒక్కోసీను ఎక్కువ సమయం కూడా తీసుకుంటుంది. బాల నటులు, ఒకసీను నటులూ లేకుండా కూడా చూసుకోవాలి. బంధు మిత్రులకి అస్సలు వేషాలివ్వకూడదు. నిర్మాత అస్సలు నటించకూడదు. జంతువులకి కూడా స్క్రిప్టులో స్థానం కల్పించకూడదు. క్రౌడ్ సీన్లు అస్సలు రాయకూడదు. సెక్స్ సీన్లూ, ఎక్స్ పోజింగులూ, డబుల్ మీనింగులు, ఐటెం సాంగులూ పెట్టకూడదు. బడ్జెట్ మూవీ ఎంత క్లీన్ గా వుంటే అంత వ్యక్తిత్వంతో అన్నివర్గాలనీ ఆకట్టుకుంటుంది. లేకపోతే ‘బి’ గ్రేడ్ కి దిగజారి నష్టపోతుంది. ఒకప్పుడు ‘ఏ’ సర్టిఫికేట్ తో ‘బి’ గ్రేడ్ ‘సి’ గ్రేడ్ సినిమాలు కూడా ఆడేవి. ఇప్పుడా కంటెంట్ ని పోర్న్ సైట్స్ లో ఇంకాబాగా చూసేస్తున్నప్పుడు బడ్జెట్ మూవీస్ లో చొరబెట్టడం అమాయకత్వమే.
బడ్జెట్ మూవీస్ కి మూస కథలని బిగ్ కమర్షియల్స్ సొంతం చేసుకున్నాయి. బడ్జెట్ మూవీస్ కి సెక్స్ కంటెంట్ ని పోర్న్ సైట్స్ హైజాక్ చేశాయి. ఇక బడ్జెట్ మూవీస్ కి మిగిలింది మానమర్యాదలతో కూడిన క్వాలిటీ కంటెంటే.
మూడు లైన్లకి మించకుండా ఒక్కో డైలాగు, సీనులో మూడుకి మించకుండా పాత్రలు, మూడు పేజీలకి మించకుండా సీను- ప్లాన్ చేసుకుంటే కథ క్వాలిటీ పెరగడమే గాక, చాలా సొమ్ములు ఆదా అవుతాయి.
‘శాతకర్ణి’, ‘బాజీరావ్ మస్తానీ’ బిగ్ కమర్షియల్స్ అని తెలిసిందే. ఇవి సైతం రెండు మూడు పాత్రల మధ్య పుట్టే బలమైన డ్రామా మీదే ఆధారపడ్డాన్ని గమనించ వచ్చు. ‘శాతకర్ణి’ లో బాలకృష్ణ- శ్రియల మధ్య; ‘బాజీరావ్ మస్తానీ’ లో రణవీర్ సింగ్- ప్రియాంకా చోప్రా – దీపికా పడుకొనెల మధ్య బలమైన డ్రామా కేంద్రంగా ఇవి వుంటాయి. ఇంత భారీ సినిమాలై వుండి కూడా, ఎన్నో ఇతర పాత్రలుండీ కూడా, ఈ రెండు మూడు పాత్రల మధ్య డ్రామా మీదే ఆధారపడి నిర్మాణం జరుపుకున్నాయంటే, బడ్జెట్ మూవీస్ కి ఎందుకు సాధ్యంకాదు? ఈ రెండు బిగ్ కమర్షియల్స్ లో వున్న రోమాంటిక్ డ్రామాలు కట్టి పడేసే విధం చూస్తూంటే- తెలుగులో ఇలాంటి బలమైన రోమాంటిక్ డ్రామాల్ని బడ్జెట్ మూవీస్ గా తీస్తే ఈ రోజుల్లో కూడా ఎందుకు ఆడవనిపిస్తుంది. బడ్జెట్ మూవీస్ కి కావాల్సింది తక్కువ పాత్రలతో బలమైన డ్రామా సృష్టించడమొక్కటే. ఈ డ్రామా ప్రేమ కావొచ్చు, కామెడీ కావొచ్చు, యాక్షన్ కావొచ్చు, ఇంకే జానరైనా కావొచ్చు.
పాత్ర చిత్రణలు
బలమైన డ్రామాకి పాత్ర చిత్రణలే ముఖ్యం. ప్లాస్టిక్ పాత్రలు మొదటి పావుగంట ఇరవై నిమిషాల్లోనే బడ్జెట్ మూవీలో విషయం లేదని తేల్చేస్తాయి. బిగ్ కమర్షియల్స్ లో పెద్ద హీరోల పాత్రల రూపురేఖల్లో బడ్జెట్ మూవీ పాత్రల్ని సృష్టించకూడదు. పాత్రలు నిజజీవితంలో మనుషులకి ఎంత దగ్గరగా అనిపిస్తే అంత క్లిక్ అవుతాయి. అవి సహజంగా మాట్లాడితే ఇంకా బాగా క్లిక్ అవుతాయి. ‘పెళ్లి చూపులు’ విజయరహస్యమిదే. మాస్ కూడా తమలాగే మాట్లాడుతున్న ఆ పాత్రల్ని చూసి కనెక్ట్ అయ్యారు. 1989 లో ‘శివ’ బడ్జెట్ మూవీ కానప్పటికీ దానిలోని సహజ పాత్రలతో, సహజ సంభాషణలతో ఇలాగే కనెక్ట్ అయ్యారు అన్ని వర్గాల ప్రేక్షకులూ.
డిఫరెంటే హిట్!
బడ్జెట్ మూవీస్ డిఫరెంట్ గా వుండే కథలతోనే హిట్టవుతున్నాయి. గతంలోకి వెళ్తే, బడ్జెట్ మూవీస్ మూస కథలతో ఒక్కటీ హిట్ కాలేదు. కారణం మూసకథలకి బిగ్ కమర్షియల్స్ తో రాజీపడ్డారు ప్రేక్షకులు. అక్కడ అంత ఆర్బాటంగా మూస కథల్ని అందిస్తూంటే ఇక్కడ చిన్న సినిమాల్లో కొత్త మొహాలతో చీప్ నమూనాలు చూడ్డమెందుకు? 2000 సంవత్సరం నుంచి పరిశీలిస్తే, బిగ్ కమర్షియల్స్ కి దూరంగా డిఫరెంట్ గా వున్న బడ్జెట్ మూవీసే హిట్టయ్యాయి. చిత్రం, గమ్యం, వినాయకుడు, ఐతే, అనుకోకుండా ఒకరోజు, ఎ ఫిలిం బై అరవింద్, మంత్ర మొదలైనవి. అయితే ఈ పదిహేడేళ్ళ కాలంలో ఇవి ఓ పదిహేను కూడా లేకపోవడం వెనుకబాటు తనమే.
ఇక్కడ గమనార్హమేమిటంటే, ఇవి విడుదలైన సంవత్సరాల్లో ఇంకే మూస బడ్జెట్ మూవీ హిట్ కాలేదు. అన్నీ ఫ్లాప్సే. నువ్వే కావాలి, జయం, ఉయ్యాల జంపాల, హేపీడేస్, పెళ్లి చూపులు, క్షణం, ఈరోజుల్లో, స్వామి రారా లాంటి కొన్ని మాత్రమే రెగ్యులర్ కథలతో బాగా తీసినవి హిట్టయ్యాయి. గత సంవత్సరం మొత్తం 117 బడ్జెట్ మూవీస్ లో క్షణం, పెళ్లి చూపులు రెండే హిట్టయ్యాయి. మిగతావి ఎందుకు హిట్ కావడం లేదంటే అవి పెద్ద సినిమాలకి మూస నకళ్ళు కావడం వల్ల. బడ్జెట్ మూవీ డిఫరెంట్ గా వుంటేనే మనుగడలో వుంటుందని గ్రహించక పోవడం వల్ల. 2000 సంవత్సరం నుంచీ ఈ పరమ సత్యాన్ని గుర్తించక పోవడం వల్ల.
కనుక మూసకి బడ్జెట్ మూవీస్ దూరంగా వుండాల్సిందే. అయితే వూహల్లోంచి కథల్ని సృష్టించబోతే చూసిన బిగ్ కమర్షియల్ సినిమాల్లోని మూసలే మెదులుతాయి. చుట్టూ ప్రపంచంలోకి చూస్తే మాత్రం కొత్త కథలు పుడతాయి. వివిధ టాపిక్స్ మీద ఎక్కువ ఆర్టికల్స్ చదవడం వల్ల కూడా కొత్త పాయింట్లు దొరుకుతాయి. వీటిని బడ్జెట్ మూవీ పరిమితుల్లో సినిమాటిక్ గా మల్చుకోవచ్చు. కొత్త దనం కోసం ప్రయత్నిస్తే నిర్మాతలు దొరకరన్న అనుమానం అవసరం లేదు. ఆ కొత్త దనంలో కన్పించాల్సింది కాసుల గలగలలే. కొత్తదనమున్న కథ చెప్తూంటే అందులో డబ్బులు కన్పిస్తూంటే వదులుకోవడాని ఏ నిర్మాతా ఇష్టపడరు. ఆ డబ్బులు కన్పించేలా కొత్తదనాన్ని తీర్చి దిద్దడానికే అసలు క్రియేటివిటీ అంతా వుపయోగించాలి.
ఆ ఐదు ఎలిమెంట్స్
డిఫరెంట్ గా వుంటూ హిట్టయిన బడ్జెట్ మూవీస్ ని పరిశీలిస్తే, వాటిలో కామన్ గా ఈ ఐదు ఎలిమెంట్స్ కనిపిస్తాయి. 1. హీరోకి స్పష్టమైన లక్ష్యం వుండి యాక్టివ్ పాత్ర అయివుండడం, 2. నేపధ్య వాతావరణం మిస్టీరియస్ గా వుండడం, 3. సబ్ ప్లాట్స్ లేకుండా ప్రధాన కథ మాత్రమే వుండడం, 4. ఏ జానర్ అయితే ఆ జానర్ మర్యాద కాపాడ్డం, 5. డైలాగులు రియలిస్టిక్ గా వుండడం.
ఈ ఐదు ఎలిమెంట్స్ ని కలిపి కథ అల్లితే డిఫరెంట్ గా వున్న బడ్జెట్ మూవీస్ హిట్టయ్యాయి. ఇక ఏ జానర్ కథలు తీసుకోవాలంటే, అప్పటి మార్కెట్లో అమ్ముడుబోయే ఏ జానరైనా తీసుకోవచ్చు. ఏ జానర్ ని తీసుకున్నా ఆ జానర్ మర్యాదని కాపాడాలి. గత రెండు సంవత్సరాలుగా ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది. చిన్న దైనా పెద్ద దైనా జానర్ మర్యాదని కాపాడిన సినిమాలనే హిట్ చేశారు (జానర్ మర్యాద గురించి ఇదే బ్లాగులో వ్యాసాలున్నాయి చదువుకోవచ్చు). కాబట్టి వొళ్ళు దగ్గర పెట్టుకుని జానర్ మర్యాదకి కట్టుబడాలి. నిర్మాత పైత్యమో, నిర్మాత బావమరిది పైత్యమో చొరబెడితే ఇంతే సంగతులు. వాళ్ళూ వుండరు, దర్శకుడూ వుండడు. ఇది గ్యారంటీ.
బడ్జెట్ మూవీకి కంటెంటే కీలకం. ఇంతే కీలకంగా నటీనటుల నటన కూడా అవసరం. ‘కథలో పుట్టే సమస్య- ఆ సమస్యని పట్టుకుని నటీనటుల నటన’ ఇదే బడ్జెట్ మూవీ బాక్సాఫీసు రహస్యం. కాబట్టి నటీనటుల్ని చూసి ఎంపిక చేసుకోవాలి. అన్ని సినిమాల్లో ఒకేలా నటించి, డైలాగులు చెప్పేసే నటీనటుల్ని నివారించాలి. పాత్రని అర్ధం జేసుకుని భిన్న పార్శ్వాలని ప్రదర్శించే రావురమేష్ లాంటి వాళ్ళు బడ్జెట్ మూవీస్ ని కాపాడగలరు తప్ప, కృత్రిమ ఫార్ములా పాత్రలకి అలవాటు పడిన నటులు కాదు.
ఈ వ్యాసం ప్రారంభంలో స్క్రిప్టు పరమైన సృజనాత్మకత గురించి ప్రస్తావించుకున్నాం. ‘శివ’ బడ్జెట్ మూవీ కాకపోయినా అదిప్పుడు బడ్జెట్ మూవీస్ కి ఒక భరోసా. దీని సార్వజనీన స్ట్రక్చర్ ని ఫాలో అయివుంటే ఎన్నో బిగ్ కమర్షియల్స్ ఫ్లాప్ అవకుండా వుండేవి. బిగ్ కమర్షియల్స్ దీన్ని వదిలేసినా బడ్జెట్ మూవీస్ దీంతో బాముకోవచ్చు. ‘శివ’ స్క్రీన్ ప్లే ఆధారంగా ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ శీర్షికన ఈ బ్లాగులోనే రాసిన పదిహేడు వ్యాసాలూ ఒకసారి చదువుకుంటే, బడ్జెట్ మూవీస్ కి పకడ్బందీ స్క్రీన్ ప్లే, పాత్రచిత్రణలూ సమూలంగా తెలుస్తాయి.
ఇక ప్రొడక్షన్ పరంగా బడ్జెట్ మూవీ సృజనాత్మకత ఏమిటో వచ్చే వ్యాసంలో చూద్దాం.
-సికిందర్
Sunday, June 4, 2017
ఇక యాక్షన్ జానర్ లో గత రెండు మూడు వారాల్లోనే వెంకటా పురం, కేశవ, అంధగాడు వచ్చాయి. సస్పెన్స్ తో కూడిన డార్క్ మూవీస్ కంటే సస్పెన్స్ తో కూడిన యాక్షన్ కథలే ఇప్పటి తెలుగు మేకర్లకి బాగా అర్ధమవుతాయని దీన్ని బట్టి అనుకోవాలి. ఐతే ఇవైనా సరైన స్ట్రక్చర్, యాక్షన్ మూవీ డైనమిక్స్, సస్పెన్స్ పోషణ తెలిసి కొత్త పాయింట్లతో తీస్తే మంచిదే. తెలుసుకోకుండా ఇష్టారాజ్యంగా ఇమ్మెచ్యూర్డ్ గా తీస్తూపోతే ఈ యాక్షన్ జానర్ కూడా ఏడాది తిరక్కుండా ప్రేక్షకుల తిరస్కారానికి గురవుతుంది. ఇక్కడ పంచ్ లైన్ ఏమిటంటే, డార్క్ మూవీస్ జానర్ అర్ధమైతే గానీ యాక్షన్ మూవీస్ ని సమర్ధవంతంగా తీయలేరు, దట్సాల్! ఎమ్సెట్ రాయకుండా బీటెక్ చేయలేరు కదా! సో అల్ ది బెస్ట్ టు ఆల్ యాక్షన్ మూవీ మేకర్స్!
-సికిందర్
Saturday, June 3, 2017
రివ్యూ!
రచన – దర్శకత్వం : వంశీ
తారాగణం : సుమంత్ అశ్విన్, అనీషా అంబ్రోస్, మనాలీ రాథోడ్, మానస, వంశీరాజ్, కృష్ణ భగవాన్, రాఘవేంద్ర తదితరులు
సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం :నగేష్ బనెల్లా
నిర్మాణ సంస్థ: మధుర ఎంటర్టైన్మెంట్
నిర్మాత: మధుర శ్రీధర్ రెడ్డి
విడుదల : 2 జూన్,2017
***
వంశీ అంటే గోదావరి, పాపికొండలు, పడవలు, పడుచులు, పోటుగాళ్ళు, గోదావరి యాస, హాస్యం, వ్యంగ్యం, వెటకారం, నాట్యభంగిమల నటనలు, ఇళయరాజా పాటలు. ఇది గతం.
వంశీ అంటే గోదావరి, పాపికొండలు, పడవలు, పడుచులు, పోటుగాళ్ళు, గోదావరి యాస, హాస్యం, వ్యంగ్యం, వెటకారం, నాట్యభంగిమల నటనలు, ఇళయరాజా పాటల్లాంటి పాటలు. ఇది ప్రస్తుతం.
గతం 1980 ల నాటి కాలం, ప్రస్తుతం ముప్ఫయ్యేళ్ళు గడిచిపోయిన టైం లాప్స్.
సినిమాల్లో టైం లాప్స్ తో సీను మారుతుంది. వంశీతో మారలేదు. ఆయన టైం లైన్ లో సీను 1980 ల దగ్గరే ఫ్రీజ్ అయిపోయి వుంటుంది. ఈ సీసులో మన ప్రతిబింబాలెక్కడా అని మారుతున్న తరాల ప్రేక్షకులు వెతుక్కునే పరిస్థితి.
లేడీస్ టైలర్ కొడుకు టైలరింగ్ నుంచి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకోవడానికి మధ్య ఒక దశ వుంది- అది రెడీమేడ్ దుస్తులొచ్చేసి- యారో, పార్క్ ఎవెన్యూ, లెవీస్ లాంటి గ్లోబల్ సంస్థల షోరూములు అసంఖ్యాకంగా వెలసి, ఆడవాళ్ళకి బొథిక్స్ తెర్చుకుని, చేతి వృత్తి టైలరింగ్ తెల్లారిపోయిన దశ. ఈ దశ సినిమా ఫీల్డులో కాస్ట్యూమ్స్ కుట్టే టైలర్స్ కి కూడా వచ్చింది. సినిమా ఫీల్డులో టైలర్స్ ఫ్యాషన్ డిజైనర్ల ధాటికి తట్టుకోలేకపోతే, వూళ్ళల్లో రెడీ మేడ్ దుస్తుల ట్రెండ్ కి దెబ్బతిన్నారు. అంటే లేడీస్ టైలర్ సుందరం కొడుకు గోపాలంకి ఇప్పుడు పాతికేళ్ళనుకుంటే, అతడికి పదేళ్ళొచ్చేటప్పటికే వూళ్ళో టైలరింగ్ వృత్తే వుండి వుండకూడదు. అంటే అతడికి టైలరింగే తెలిసివుండకూడదు. ఈ దశని రికార్డు చేయలేదు వంశీ.
చేసి వుంటే ఇంకో స్థాయిలో వుండేది సినిమా! రియలిస్టిక్ గా, పోనీ సెమీ రియలిస్టిక్ గా వున్నప్పుడే బడ్జెట్ సినిమాకి బలం. రాజేంద్ర ప్రసాద్ 1986 లో నటించిన లేడీస్ టైలర్ ఒక కల్ట్ క్యారక్టర్. అలాటి దానికి నేటి సీక్వెల్ లో స్థానం లేకుండా చేశారు. ప్రారంభంలో జనాభా లెక్కల అతను వచ్చి నప్పుడు ( జనాభా లెక్కల వాడి సీను చూసి చూసి వున్న పాత మూస ఫార్ములా సీను) గోపాలం తండ్రిగా సుందరం పేరు చెప్పి వదిలేశారు తప్పితే- అసలు లేడీస్ టైలర్ సుందరంని ఒక లెజెండ్ గా ఎస్టాబ్లిష్ చేసింది లేదు. అతడి నిలువెత్తు చిత్ర పటం ముందు గోపాలం, ఇతడి మేనమామ పాపారావూ నిలబడి ఒక శపధం చేసి వుంటే కథ ఎత్తుగడ ఎంతో ఉత్సుకత రేపేది, కాన్సెప్ట్ మెచ్యూర్డ్ గా వుండేది. కానీ వంశీ తన కాన్సెప్ట్ ని కేవలం లేడీస్ టైలర్ కొడుకు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనే మెచ్యూరిటీ కన్పించని ఉత్త కామెడీకి సరిపుచ్చేశారు. సామాజిక నేపధ్యాలతో ముడిపడిన వృత్తుల్ని సమాజానికి దూరం చేసి ఫార్ములా కథలు వండితే అది ఇలాటి సినిమాకి బలం కాదు. ఇందుకే ఇది కామెడీగా వుంటూనే శంకరాభరణం, దంగల్ లలాంటి విలువల పరిరక్షణా ధ్యేయం గల బలమైన కాన్సెప్ట్ కాలేకపోయింది.
టైలర్లు
కుట్టుమిషన్ని కనుగొన్న ఎలియాస్ హోవ్ చిత్రపటం పెట్టుకుని పూజిస్తారు. పుట్టిన
రోజు వేడుక కూడా జరుపుకుంటారు. ఆ కుట్టుమిషన్ కార్పొరేటీకరణతో పొట్టకి పనికి
రాకుండా పోయింది. చేతివృత్తుల్ని అల్లకల్లోలం చేస్తున్నకార్పొరేటీకరణ ప్రభంజనం మీద
‘కుబుసం’ లో ‘పల్లె కన్నీరు పెడుతుందో’
పాట గుర్తుండే వుంటుంది. దీనికి టైలరింగ్ అతీతం కాదు.
పాత విలువలకీ కొత్త పోకడలకీ మధ్య సంఘర్షణ ఎప్పుడూ వుంటుంది. ఈ ట్రాప్ లో రచయితలు, దర్శకులు పడితే ముందుకు పోలేరు. సంఘర్షణ పాత్రల మధ్య పెట్టడం వరకే గానీ, వ్యక్తిగతంగా కొత్తా పాతా ఇగోలు పెట్టుకుంటే పాత దగ్గరే ఆగిపోతారు. కళాకారుడికి కొత్తా పాతా లేదు. ఒక్కటే వుంది- న్యూట్రాలిటీ. దీంతో అతను రెండిటినీ మేనేజ్ చేస్తూంటాడు. లేకపోతే శంకరాభరణం, దంగల్ ల లాంటివి క్రియేట్ చేయలేరు. ఈ రెండూ పాత విలువలకీ కొత్త పోకడలకీ మధ్య సంఘర్షణ పెట్టి ఖ్యాతి కెక్కాయి. ఈ సంఘర్షణే లేడీస్ టైలర్ సుందరం, కొడుకు గోపాలం, మేనమామ పాపారావు ఎదుర్కోవాలి నిజానికి.
ఏ కుట్టు మిషన్ తో సుందరం ఆనాడు లేడీస్ టైలర్ గా పాపులరయ్యాడో, ఆ వృత్తి ప్రతిపత్తిని నిలబెట్టాలన్న పట్టుదల పెరగాలి నిజానికి వారసులకి. ఈ పట్టుదల (గోల్) లేకుండా ఈసురోమని అదే అరుగుల మీద అలాగే కూర్చుని (బాక్సాఫీసు అప్పీల్ కి వ్యతిరేకంగా) కుట్టుకుంటూంటే, దీన్ని వదిలేసి నరసాపురంలో ఫ్యాషన్ డిజైనింగ్ షాపు పెట్టాలనుకుంటే వారసత్వానికీ, లెజెండ్ సుందరం విలువలకీ నిలువునా పాతరేసినట్టే!
కాన్సెప్ట్ ఇలా వుండదు- ముందు స్ట్రగుల్ వుండాలి, ఆ తర్వాత రియలైజేషన్ వుండాలి. ఈ వృత్తిలో పరిణామ దశలున్నాయి. వీటిలోంచే కాన్సెప్ట్ పుట్టాలి. సీక్వెల్ అన్నాక మొదటి దాని పాత్ర లోంచే కథ పుట్టాలి. అప్పుడు ట్రాన్సిషన్ బలంగా వుంటుంది (ఇలా జరక్కపోవడం వల్ల జరిగిన ఇంకో అనర్ధమేమిటో కూడా తర్వాత చూద్దాం). గోపాలం తండ్రితో కటాఫ్ అయిపోయి తాడూబొంగరం లేని పాత్రగా ఫ్యాషన్ డిజైనర్ నంటూ పక్కదారి పట్టాడు. కానీ బాధ్యతగల కొడుకుగా తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలనుకుంటే, ఫ్యాషన్ డిజైనింగ్ తో సంఘర్షించే వాడు. తన పాత విలువల్ని ప్రశ్నార్ధకం చేస్తున్న అభివృద్ధితో సంఘర్షించేవాడు. తర్వాత పాత విలువలు అభివృద్ధి నుంచి వేర్పడకుండా కలిసి కొనసాగితే రెండూ మనుగడలో బలంగా, పరిపుష్టంగా వుంటాయని తెలుసుకునే వాడు. శంకరాభరణం, దంగల్ ల లోనిది రొటీన్ గా పాత విలువల విజయమే. కానీ ప్రాక్టికల్ గా అభివృద్ధి మీద పాత విలువలు విజయం సాధించడం సాధ్యంకాదు. పాతవిలువల్ని కాదని అభివృద్ధి ముందుకెళ్ళి పోతుంది, ఆగదు. పాతవిలువలు అభివృద్ధికి చేయందిస్తే అభివృద్ధి విలువలుగల అభివృద్ధి అవుతుంది. ఒంటరి అయిపోకుండా పాతవిలువల పరువుకూడా దక్కుతుంది. విన్ స్టన్ చర్చిల్ చెప్పిందిదే- గొర్రెల మంద అనే నూతన పోకడల్ని పాత విలువలనే ములుగర్రతో పొడుస్తూ వుండకపోతే ఆ గొర్రెలమంద కుదురుగా వుండక చెల్లా చెదురై పోతుందని! కొత్తని తిట్టుకుంటూ ములుగర్రని దాచుకుంటే, ఆ కొత్త అనే గొర్రెలు లారీల కిందా, బస్సుల కిందా పడి చచ్చిపోతాయి! ఇక పాతతరం ఉత్పత్తి చేయలేకా, కొత్త తరం మార్గనిర్దేశం లేక చచ్చిపోయీ ప్రపంచం ఆగిపోతుంది.
ఇలా
ఈ స్ట్రగుల్ కీ రియలైజేషన్ కీ మధ్య గోపాలం కథ నడవాలి. అది కామెడీగానూ
కావొచ్చు, సెటైరికల్ గానూ కావొచ్చు.
ఇక లేడీస్ టైలర్ పాత్రలోంచి దాని సీక్వెల్ ఫ్యాషన్ డిజైనర్ కథ పుట్టకపోవడంతో జరిగిన ఇంకో అనర్ధం ఏమిటంటే, దర్శకుడు లేడీస్ టైలర్ నుంచే ఏమీ నేర్చుకోనట్టే అన్నట్టు తయారయ్యింది. దీంతో సుందరం, గోపాలం ఇద్దరి కథలూ ఒకేలా తయారయ్యాయి.
లేడీస్ టైలర్ కథ :
సుందరం (రాజేంద్రప్రసాద్) మంచి డిమాండ్ లో వున్న లేడీస్ టైలర్. కానీ ఆ పని మీద శ్రద్ధ పెట్టడు. ఏదో అదృష్టం తగిలి ధనవంతుణ్ణి అవుతానని కలలు గంటూంటాడు. ఒక జ్యోతిష్కుడు తగిలి తొడ మీద పుట్టు మచ్చ వున్న అమ్మాయిని చేసుకుంటే బాగా కలిసి వస్తుందని చెప్పేసరికి, అలాటి పుట్టుమచ్చ వున్న అమ్మాయి వేటలో పడతాడు సుందరం. పుట్టు మచ్చ చూడ్డం కోసం ఎందరో అమ్మాయిల్ని మభ్యపెడతాడు. పెళ్ళికోసం వెంట బడుతున్న అమ్మాయిల మధ్య ఇరుక్కుని అప్పుడు తప్పు తెలుసుకుంటాడు. వాళ్ళకి నిజం చెప్పేసి క్షమాపణ వేడుకుంటాడు. తను నిజంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు.
ఫ్యాషన్ డిజైనర్ కథ:
గోపాలం నరసాపురంలో షాపు పెట్టుకుని ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకుంటాడు. పెట్టుబడికి డబ్బులేదు. డబ్బున్న అమ్మాయిని చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడొక జ్యోతిష్కుడు అతడి చేయి చూసి మన్మధ రేఖ వుందనీ, దీంతో ఏ అమ్మాయినైనా లోబర్చుకోవచ్చనీ చెప్తాడు. దీంతో గోపాలం ముందొక అమ్మయిని ప్రేమలో పడేసుకుని, ఆమెకంటే డబ్బున్న అమ్మాయి కన్పించడంతో ఆమె వెంట పడి, ఈమె కంటే ఇంకా ఆస్తి వున్న అమ్మాయి కన్పించేసరికి ఆమె వెంటాపడి అల్లరై, తప్పు తెలుసుకుని నిజంగా ఫీలైన అమ్మాయిని చేసుకుంటాడు.
ఈ రెండు కథలకీ తేడా ఏముంది? లేడీస్ టైలర్ దాని సీక్వెల్ ల్ రెండిటి కథలూ ఒకేలా ఎలా వుంటాయి. తండ్రి చేసిన తప్పే కొడుకు కూడా చేస్తే, తండ్రి నుంచి కొడుకేం నేర్చుకోలేదా? లేక తండ్రెవరో తెలీదా? ఇది సీక్వెల్ లా లేదు. కొన్ని మార్పులతో లేడీస్ టైలర్ కి రీమేక్ లా వుంది. లేడీస్ టైలర్ పాత్రలోంచి సీక్వెల్ కథ పుడితే ఫ్యాషన్ డిజైనర్ వ్యవహారం వేరేగా వుండేది. కథ ముందుకెళ్ళేది. కానీ 30 ఏళ్లుగా ఎక్కడేసిన గొంగళి లాగే వున్నాయి తండ్రీ కొడుకుల కథలు.
మేకింగ్ ని లేడీస్ టైలర్ తో పోల్చలేం. ఆ రోజులు, అప్పుడు వంశీతో కలిసిన ప్రేక్షకుల అభిరుచులూ వేరు. ఇప్పుడు వేరు. ఇప్పుడు వంశీ ఎవరో తెలీదు. మళ్ళీ ఒక కొత్త దర్శకుడుగా కొత్త వాళ్ళతో పోటీ పడుతూ, కొత్త ప్రేక్షకుల ముందుకు రావాలే తప్ప, అవే పాత అభిరుచులు కొనసాగిస్తే కుదురుతుందా? సంజయ్ గుప్తా ఒక తరానికి వర్కౌట్ అయిన తన అభిరుచులతో తీసీ తీసీ, కొంతకాలానికి తన సమయం ఐపోయి, మళ్ళీ లేచి కొత్త తరం అభిరుచులు తనవిగా చేసుకుని, ఇటీవల ‘కాబిల్’ తీసి ఆశ్చర్య పర్చాడు. ఆనాటి తన మేకింగ్ కీ, దర్శకత్వానికీ నేటికీ పోలికే లేదు.
డేవిడ్ ధావన్ కూడా కామెడీలు తీసీ తీసీ, తన కాలం ఐపోయిందన్పించి కనుమరుగై, ఐదేళ్ళ తర్వాత స్టయిలిష్ ‘పార్టనర్’ తో వచ్చి ఒక వూపు వూపాడు.
ప్రకృతి నటించదు.అది మారదు. దాని ముందు నర్తించే మనుషులే మారుతూంటారు. ఒక్కో కాలంలో ఒక్కోలా నర్తిస్తారు. కానీ కోనసీమ, పాపికొండలు, గోదావరీ తీరాల్లో వంశీ పాత్రలు ఇంకా అవే లేడీస్ టైలర్ నాటి నటనలతో, మాటలతో, పాటలతో అడిపాడి అలరించాలనుకుంటాయి. పాత్రలు మామూలుగా నిలబడి మాట్లాడవు, అవి నాట్య భంగిమల్ని ప్రదర్శిస్తూ వెటకారంగా మాట్లాడతాయి. ఈ పాత్రల బృహన్నల సిండ్రోంని ఆనాటి వంశీ అభిమానులైతే అర్ధం జేసుకోగలరుగానీ, కొత్త ప్రేక్షకుడు అర్ధంగాక ఇదేం సినిమారా బాబూ అని సింక్ అవక పక్క సీట్లో నలుగుతూంటాడు.
కామెడీ
కూడా ఒక పంచ్ డైలాగుకి కిందపడి గిల గిలా
కొట్టుకోవడం, లాగి కొట్టినప్పుడల్లా ఎక్కడో వెళ్లి పడ్డమనే ట్రెండ్ ఇంకా వుందా? ఒకతరానికి సమకాలీనత కారణంగా తన అభిరుచులతో సక్సెస్ ఫుల్ గా కనెక్ట్ అవగల్గిన
వంశీ, ఇప్పుడు వచ్చేసి సక్సెస్ కోసం నేటి తరం అభిరుచులతో తను కనెక్ట్ అవ్వాలన్న
విషయం మర్చిపోయారు. ఇంకా నేనే ఇస్తాను నువ్వే తీసుకోవాలని తలంటు పోస్తే ఎలా? పాటలకి
గోదారి తీరాన అవే వెదురు పాకలు, రకరకాల జెండాలు ఇంకానా? పాటలకి అవుట్ డోర్ లో సెట్స్
ఎవరేస్తున్నారిప్పుడు? వెనుక సీట్లో కూర్చున్న నడివయసు ప్రేక్షులకి కూడా
నచ్చలేదిది. సినిమా సాంతం దేనికో ఒకదానికి కామెంట్లు చేస్తూనే వున్నారు.
హీరో సుమంత్ అశ్విన్ నటించింది ఇప్పుడు బాక్సాఫీస్ అప్పీలు గానీ, యూత్ అప్పీలు గానీ ఏమాత్రం లేని వెనుకబడిన పల్లెటూరి పాత్ర. ఇలాటి పాత్రల కాలం ఎప్పుడో తీరింది. గోపాలం అనే పాతకాలం పేరు కూడా యూత్ కి కనెక్ట్ కాదు. సుమంత్ అశ్విన్ గత మూవీ ‘రైట్ రైట్’ లో కూడా ఇదే తప్పు జరిగింది. యూత్ అప్పీల్ లేని పల్లెటూరి బస్సు కండక్టర్ పాత్ర వేశాడు.
ఫ్యాషన్ డిజైనర్ లో ఈ పాత వెనుకబడిన వెలసిపోయిన పాత్రే, సంఘర్షణతో కూడి వుంటే పాత వాసనేయకుండా ఆసక్తికరంగా వుండేది- ఎందుకంటే ఆధునికత్వంతో సంఘర్షిస్తూంటాడు కాబట్టి. ఈ రోజుల్లో ఒక బడ్జెట్ మూవీని సక్సెస్ చేయాలంటే లక్ష కోణాల్లో ఆలోచించాలి. పాత రోజుల్లో సినిమాలకి ఇతర దృశ్య మాధ్యమాల పోటీ లేదు కాబట్టి ఎలా తీసినా నడిచిపోయేది.
సుమంత్ సంఘర్షించడానికి ఎదుటి పాత్ర కూడా లేదు. అమ్మాయిలతో కష్టా లొచ్చేసరికి తనే సమస్యలో పడి తనే మారడంతో తీరిపోతుంది సమస్య. ఇదంతా ప్రేమల గురించి. కానీ ఇటీవల కాలంలో ప్రేమ సినిమాలే ఆడడం లేదు. మార్కెట్ యాస్పెక్ట్ లో చూస్తే దీనికి సేలబిలిటీ లేదు, క్రియేటివ్ యాస్పెక్ట్ చూస్తే పైన చెప్పుకున్న విధంగా వుంది. ఈ రెండు యాస్పెక్ట్స్ ని కాదని ఏ సినిమా నిలబడుతుంది?
- సికిందర్
http://www.cinemabazaar.in
Friday, June 2, 2017
రివ్యూ!
రచన- దర్శకత్వం: వెలిగొండ శ్రీనివాస్
తారాగణం: రాజ్తరుణ్, హెబ్బా పటేల్, రాజేంద్రప్రసాద్, రాజా రవీంద్ర,, ఆశీష్ విద్యార్థి, సాయాజీ షిండే, సత్య, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర< ఛాయాగ్రహణం: బి.రాజశేఖర్
బ్యానర్ : ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
విడుదల: జూన్ 2, 2017
***
ఏకే ఎంటర్
టైన్మెంట్స్ లో వరసగా రెండో సినిమా నటించిన రాజ్ తరుణ్ రోమాంటిక్ కామెడీల నుంచి
దూరంజరిగి కామిక్ థ్రిల్లర్స్ వైపు మొగ్గుతున్నట్టు అన్పిస్తాడు. ఇదే బెటర్. కాకపోతే
ఈ కామిక్ థ్రిల్లర్స్ కూడా పాత వాసనేయడం తన ప్రత్యేకతగా నిలబెట్టు
కుంటున్నాడు. ఈ సినిమాతో దర్శకుడైన రచయిత వెలిగొండ శ్రీనివాస్ కి ఇప్పుడు కావలసిన స్వేచ్ఛ అంతా లభించింది. తాను అనుకున్నది అనుకున్నట్టు తెరకెక్కించే అవకాశం లభించింది. ఈ అవకాశంతో దర్శకుడుగా తానేం తేడా చూపించాడో, రాజ్ తరుణ్ కూడా తన అభిమానులని ఎలా అలరించాడో ఈ కింద చూద్దాం.
కుంటున్నాడు. ఈ సినిమాతో దర్శకుడైన రచయిత వెలిగొండ శ్రీనివాస్ కి ఇప్పుడు కావలసిన స్వేచ్ఛ అంతా లభించింది. తాను అనుకున్నది అనుకున్నట్టు తెరకెక్కించే అవకాశం లభించింది. ఈ అవకాశంతో దర్శకుడుగా తానేం తేడా చూపించాడో, రాజ్ తరుణ్ కూడా తన అభిమానులని ఎలా అలరించాడో ఈ కింద చూద్దాం.
కథ :
పుట్టుకతో
అంధుడైన గౌతమ్ (రాజ్ తరుణ్) అనాధాశ్రమంలో నేస్తాలతో పెరుగుతాడు. ఆ నేస్తాలు
ముగ్గురికీ చూపు తెప్పించే చికిత్సకి అవకాశం రావడంతో తను తప్పుకుని నేస్తాలనే పంపిస్తాడు.
పెద్దయ్యాక రేడియో జాకీ గా పనిచేస్తూ నేత్ర ( హెబ్బా పటేల్ ) అనే కళ్ళ డాక్టర్ తో
ప్రేమలో పడతాడు. తన అంధత్వం బయట పడకుండా నటిస్తూంటాడు. ఓ రోజు ఆమెకి
తెలిసిపోతుంది. అప్పుడు కులకర్ణి (రాజేంద్ర ప్రసాద్) అనే అతను యాక్సిడెంట్ కి గురై
చనిపోవడంతో, అతడి కళ్ళు గౌతమ్ కి మర్చి
చూపు తెప్పిస్తుంది. అప్పటి నుంచీ గౌతమ్ వింతగా ప్రవర్తిస్తూంటాడు. అతణ్ణి కులకర్ణి ఆత్మ పట్టుకుని హత్యలు చేయిస్తూంటుంది. దీంతో పిచ్చెత్తి పోయిన గౌతమ్ తిరగబడతాడు- అప్పుడేం
జరిగిందనేది మిగతా కథ.
ఎలావుంది కథ
వారంవారం
చంపి పగదీర్చుకునే వయొలెంట్ కథలతో యంగ్
హీరోలు క్యూలు కడుతున్నారు. ‘వెంకటాపురం’ తో రాహుల్ టికెట్ తెగింది, తర్వాత వెంటనే మరుసటి వారం ‘కేశవ’ తో నిఖిల్ టికెట్ తెగింది. వారం గ్యాప్ ఇచ్చి ఇప్పుడు రాజ్ తరుణ్ ‘అంధగాడు’ తో తన టికెట్
చించుకున్నాడు. రాబోయే వారాల్లో టికెట్లు పట్టుకుని ఇంకెదరున్నారో తెలీదు. ఇలా యాక్షన్
జానర్ కి మార్పు లేకుండా అదే పాత మోడల్ పగలనే జోడిస్తూ పోవడంతో వరసగా ఈ రొటీన్ నే చూడాల్సి
వస్తోంది. రోమాంటిక్ కామెడీల స్థానంలో ఈ రివెంజి కథలు ఇంకొక ట్రెండ్ గా కొన్నాళ్ళు భయపెడతాయేమో
అన్నట్టుంది. హృతిక్ రోషన్ ‘కాబిల్’ కూడా అంధుడి ప్రతీకారమే గానీ, ఆ కథని కిందా మీదా, వెనకా ముందూ చేసి ఫ్లాష్
బ్యాకులతో గందరగోళం చేసి చెప్పలేదు. అతడికి జరిగిన అన్యాయాన్ని ఇప్పటికిప్పుడు
జరుగుతున్నట్టుగా లైవ్ గానే చూపిస్తూ, వెంటనే
పగదీర్చుకోవడం కూడా ఇప్పటికిప్పుడు జరుగుతున్నట్టు లైవ్ గానే చూపించడంతో దాని ఎమోషన్, డైనమిక్స్ అంత బలంగా
వర్కౌట్ అయ్యాయి. ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యాయి. అన్యాయం ఎప్పుడో చిన్నప్పుడు
జరిగిన చద్దన్నంలా వుంటే, దాని మీద ఎప్పుడో పెద్దయ్యాక హీరోకి ఎంత వేడి వేడి పగని రగిలించినా,
ఈ రోజుల్లో లైవ్ గా ఫీల్ కారు యువప్రేక్షకులు. యూత్ కి ఏదైనా హాట్ హాట్ గా, లైవ్ గానే
వుండాలి, ఏనాటివో గతించిన కాలపు ఫ్లాష్
బ్యాకులు కాదు. కేసులు తెమలడానికి కోర్టుల్లో ఏళ్ల కేళ్ళు పడుతున్నట్టు-
సినిమాల్లో కూడా ప్రతీకారాలు అంత కాలం తీసుకుంటే- వ్యవస్థకీ సినిమాలకీ తేడా
ఏముంటుంది? పాతికేళ్ళ తర్వాత హీరో గారు తీరిగ్గా
పగని రీచార్జి చేసుకుని వస్తానంటే, యువప్రేక్షకులకి ఈరోజుల్లో పిచ్చి పుల్లయ్యలాగే కన్పిస్తాడు. నేటి హిట్ అండ్ రన్ తరానికి ఏదైనా
తక్షణం జరిగిపోవాలి. కానీ వస్తున్న ఈ బాపతు ఫార్ములా రివెంజి డ్రామా- మెలోడ్రామా కథలు
1970 ల నాటివి. ‘కాబిల్’ దీన్ని నవీకరించి కాలానికి తగ్గట్టుగా హిట్ అండ్ రన్
చేసింది.
ఈ సినిమాతో దర్శకుడైన వెలిగొండ శ్రీనివాస్ పాతస్కూలు రచయితే. చాలా పాత సినిమాలనే మార్చి మార్చి రీసైక్లింగ్ చేసిన పాత స్కూలుకి చెందిన వాడే. రచయితగా తనకి స్వేచ్ఛ లేకపోయి వుండొచ్చు. దర్శకుడయ్యాక చాలా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని వుండాలి. కానీ ఈ తేడా ఏమీ కన్పించడం లేదు. యథా రైటర్ కొలువు తథా డైరెక్టర్ పదోన్నతి.
ఎవరెలా చేశారు
రాజ్
తరుణ్ కి అంధుడిగా నటించేంత టాలెంట్ అప్పుడే లేదుగానీ, కళ్ళు వచ్చాక రాజేంద్రప్రసాద్
కోరల్లో చిక్కుకుని విలవిల్లాడే కామెడీయే
అతడికి పట్టింది. హీరోయిన్ హెబ్బా పటేల్ తో అంధుడిగా బయటపడకుండా నటించే విషయంలో కూడా బలహీనమే. ముందుగా రాజ్ తరుణ్
అంధత్వాన్ని నమ్మించగల్గితే అప్పుడీ పాత్రలో ఏమ చేసినా చెల్లి పోతుంది. అంధుడి లానే
అన్పించనప్పుడు అంధ పాత్ర పోషించి
ప్రయోజనం లేదు. ఆ పాత్ర, నటన, ఫస్టాఫ్ లో అంతా కృతకంగా, హడావిడిగా సాగిపోతాయి. ఫీలవడానికేమీ
వుండదు. ఇక తన పాత్ర మూడు ఛేంజ్ ఓవర్స్ తో వుంటుంది : అంధుడుగా, కళ్ళు వచ్చాక
రాజేంద్ర ప్రసాద్ బాధితుడిగా, చివర్లో పగదీర్చుకునే యాంగ్రీ యంగ్ మాన్ గా. వీటిలో
చివరి రెండే తనకి సూటయ్యాయి.
హీరోయిన్ హెబ్బాపటేల్ కూడా డాక్టర్ గా నమ్మించలేకపోయింది. ఆమె డాక్టర్ అంటే ఎవ్వరూ నమ్మరు. యంగ్ నటికి కళ్ళజోడు పెట్టి హీరో అక్క అంటే ఎలా నమ్మమో, హెబ్బా పటేల్ కూడా తెల్లకోటు తగిలించుకున్నంత మాత్రాన డాక్టరై పోదు. మెడికో అవచ్చు.
రాజేంద్రప్రసాద్ తన కొట్టిన పిండి అయిన కామిక్ సెన్సు, టైమింగ్ మొదలైన హాస్యాస్త్రాల్ని సంధిస్తూ అప్పుడప్పుడూ నవ్విస్తాడు. అయితే తన పాత్ర బతికున్నప్పుడు ఎలావుందో అలా కాక, చచ్చాక అంటే ఆత్మగా మారేక, మారాం చేసే చిన్న పిల్లాడిలా రాజ్ తరుణ్ ని వేధించుకు తిని పనిజరుపుకునేలా వుంటే, హాస్యం ఇంకా బాగా వచ్చేది. మార్పు లేకుండా ఎంత సేపూ బెదిరిస్తూనే వుండడం వల్ల ఫన్ తగ్గింది.
ఇతరపాత్రల్లో సైకియాట్రిస్టుగా ఆశీష్ విద్యార్థి, పోలీస్ కమీషనర్ గా సాయాజీ షిండే, లాయర్ గా జయప్రకాశ్ రెడ్డి, అనాధాశ్రయం నిర్వాహకుడుగా పరుచూరి వెంకటేశ్వర రావు, విలన్ గా రాజా రవీంద్ర, హీరో ఫ్రెండ్ గా సత్య రొటీన్ గానే కన్పిస్తారు.
పాటల్లో రెండో పాట, దాని చిత్రీకరణ, నాల్గో పాట, దాని చిత్రీకరణా బావున్నాయి. ఛాయాగ్రహణం, లోకేషన్స్, ఇతర ప్రొడక్షన్ విలువలు రిచ్ గా వున్నాయి.
చివరికేమిటి
థ్రిల్లర్ ని ఫ్లాష్ బ్యాకులతో కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వెంకటాపురం,
కేశవ కూడా ఈపనే చేశాయి. దీనివల్ల వీక్షణాసక్తి సన్నగిల్లుతుంది. ప్రేక్షకులకి ఆలోచనలు రేకెత్తిస్తే మంచిదే గానీ, ఇలా జ్ఞాపకశక్తికి
పరీక్షపెడితే ఫాలో అవడం మానేస్తారు. చివర్లో రాజ్ తరుణ్ సస్పెన్స్ ని విప్పుతూ- అప్పుడలా చేశానంటే ఇందుకు చేశాను, ఇప్పుడిలా
చేస్తే కారణం అదిగో అప్పుడలా జరిగింది- లాంటి సవాలక్ష వివరణ లిస్తూ- మళ్ళీ ఆ సీన్లు
చూపిస్తూ కథని ‘సమప్’ చేసే బరువెత్తుకోవడం
మాస్ మీడియా అయిన సినిమాకి పనికొస్తుందా? జరిగిపోయిన సంఘటనల్ని గుర్తు చేసుకుంటూ,
కార్యకారణ సంబంధాన్నిఊహించులోవాల్సిన మానసిక శ్రమ ప్రేక్షకులకి ఎందుకు? ఇది ‘ఆ ఒక్కడు’ నుంచీ బాగా రిపీటవుతోంది.
ఆ కట్ షాట్స్, మాంటేజెస్, ఫ్లాష్ బ్యాక్స్
తో శిరోభారం కల్గించడం తప్ప ఒరిగేదేమీ లేదు. గందరగోళానికి లోను చేయడం తప్ప మరేమీ కాదు.
ఈ కథే రాజ్ తరుణ్ సెకండాఫ్ దాటి పోయేవరకూ చెప్పే సుదీర్ఘ ఫ్లాష్ బ్యాక్ తో సాగుతుంది. ఇందులో మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ ఫ్లాష్ బ్యాక్ వుంటుంది. ఇవి అయ్యాక, ప్రెజెంట్ లో కొచ్చి, మళ్ళీ రాజ్ తరుణ్ చిన్ననాటి ఫ్లాష్ బ్యాక్ ఎత్తుకుంటాడు. ఇదయ్యాక అన్ని ఫ్లాష్ బ్యాకులనీ తులనాత్మక విశ్లేషణ చేయడం మొదలెడతాడు- ఓ గాడ్! సీదా సాదాగా స్ట్రెయిట్ గా చూపిస్తే బలంగా వుండే ఇంతోటి రివెంజి కథకి ఇన్ని కథన చాతుర్యాలా? ఇంత పాండిత్య ప్రకర్షా?
ఫస్టాఫ్ అంతా మళ్ళీ టెంప్లెట్ లాగే హీరోయిన్తో లవ్ ట్రాక్, గంట గడిచాక రాజేంద్ర ప్రసాద్ రాకతో కథ మొదలవుతుంది. షరామామూలుగా అప్పటించీ హీరోయిన్ మాయమై పోతుంది. కేవలం ప్రేమకి, పాటలకి వుంటుంది.
ఈ కామిక్ థ్రిల్లర్ లా అనిపించే రివెంజి సినిమా ఒక్క రాజేంద్ర ప్రసాద్ వున్న మేరకే చాలా ఆసక్తి కల్గిస్తుంది, వినోద పరుస్తుంది. రాజేంద్ర ప్రసా కి ఆవల, ఈవల అంతా సోసో పాత ఫార్ములా సంగతులే.
- సికిందర్
http://www.cinemabazaar.in
Subscribe to:
Posts (Atom)