రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, July 13, 2015

మహాయజ్ఞం!

స్క్రీన్ ప్లే – దర్శకత్వం : ఎస్ ఎస్ రాజమౌళి
తారాగణం: ప్రభాస్‌, రానా దగ్గుబాటి, తమన్నా, అనుష్కా, రమ్యకృష్ణ, రోహిణి,  సుదీప్, నాజర్, ప్రభాకర్, అడివి శేష్, సత్యరాజ్ తదితరులు
కథ : వి. విజయేంద్రప్రసాద్‌, మాటలు : సి హెచ్ విజయ్ కుమార్, జి అజయ్ కుమార్
పాటలు : రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరాం, శివ శక్తి దత్తా, ఇంద్రగంటి సుందర్, చైతన్య ప్రసాద్, నియోల్ సీన్, ఆదిత్య,  సంగీతం : ఎం ఎం కీరవాణి, ఛాయాగ్రహణం : కె.కె. సెంథిల్‌ కుమార్‌,
కళ: సాబు సిరిల్,  కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు,  నృత్యాలు : శంకర్, దినేష్ కుమార్, ప్రేమ్ రక్షిత్, జానీ, వస్త్రాలంకరణ : రమా రాజమౌళి, ప్రశాంతి త్రిపురనేని,  పోరాటాలు : పీటర్‌ హెయిన్స్‌,
వీ ఎఫెక్స్ దర్శకుడు : ఆదిల్ అదీలీ, యానిమేటర్ : శ్రీమనేందు భట్టా, డీఐ కలరిస్టు : బివిఆర్ శివకుమార్, శబ్ద గ్రహణం :  జస్టిన్ జోస్,
బ్యానర్ :
ఆర్కా మీడియా, సమర్పణ : కె. రాఘవేంద్రరావు,
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
 విడుదల : 10 జులై 2015

*
తెలుగులో హైకాన్సెప్ట్ మూవీస్ ఎప్పుడూ ఫాంటసీలుగా వుండడం పరిపాటే. ఐతే ఈసారి అత్యాధునిక టెక్నాలజీ ప్రసాదిస్తున్న వరాల్ని అందిపుచ్చుకుని ఫాంటసీతోనే అంతర్జాతీయ స్థాయికి ఎదగ గల్గింది మేకింగ్ పరంగా తెలుగు సినిమా. జాతీయ స్థాయిలోనే గుర్తింపు లేని తెలుగు సినిమాల దైన్యాన్ని పటాపంచలు చేస్తూ గర్వించదగ్గ గ్లోబల్ స్థాయికి తీసి కెళ్ళింది  ‘బాహుబలి’. దక్షిణ మెగా బడ్జెట్ సినిమాలకి ఏకైక గుత్తేదారుగా చెలామణీ అవుతున్న శంకర్ కంచుకోటని కూడా బద్దలు చేస్తూ రాజమౌళి రావడం, రాజమౌళి సినిమాల్లో నటించేందుకు తమిళ స్టార్లూ క్రేజ్ పెంచుకోవడం చూస్తే, శంకర్ కి గాభరా పుట్టించే ఘట్టంగానే నమోదవుతుంది ఈ చారిత్రిక బ్లాక్ బస్టర్ విడుదల. 

          ఈ మెగా వెంచర్ కి సాగిలపడి అసంఖ్యాక  ప్రేక్షకులూ  టికెట్టు ఒక్కింటికి వేలరూపాయలు ధారబోసి మెగా- రిచ్  ప్రేక్షకుల క్లబ్ లో చేరిపోయారు దర్జాగా. రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వచ్చేసి తెలుగు వాళ్ళంటే మాద్రాసీలు కాదనీ, తెలుగు జాతి అని ఒకటి ప్రత్యేకంగా ఉందనీ, ఉత్తరాది ప్రజానీకానికి  చాటి చెప్తూ తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిపెట్టినట్టూ - రాజమౌళి కూడా వచ్చేసి ప్రపంచ దేశాలకి తెలుగు సినిమా అనేదొకటుందనీ, దాని విశ్వరూపం ఈ రేంజిలో ఉంటుందనీ ఎనౌన్స్ చేస్తున్న అరుదైన సందర్భమిది. తెలుగు ఫీల్డులోకి అడుగు పెట్టడానికి ఇంకా మీన మేషాలు లెక్కిస్తున్న హాలీవుడ్ కంపెనీలు కూడా ఇహ హడావిడి పడేంత  బడా బాక్సాఫీసు అంకెల సంరంభమిది.
          దేశంలో బాలీవుడ్, కోలీవుడ్ లతో బాటు,  టాలీవుడ్ లో కూడా ఇంతవరకూ రికార్డుల కెక్కిన కలెక్షన్ల మైలు రాళ్ళని పెకిలించేసి, కొత్త శిలాక్షరాలు రాస్తున్న ఈ మహా చిత్రరాజం గంగ వెర్రులెత్తించిన ప్రచారార్భాటం తో కమర్షియల్ గా మెగా సక్సెస్సే. మేకింగ్, మార్కెటింగ్ వ్యూహాలు రెండూ ఫలించాయి. అయితే ఇంతటి ఈ మహా చిత్రరాజాన్ని చూసిన, ఇంకా చూస్తున్న ప్రేక్షకుల కడుపులు నిండి పోతున్నాయా? మేకింగ్ పరమైన క్రియేటివిటీకి మెస్మరైజ్ అవుతూనే మాటర్ పరమైన క్రియేటివిటీకీ దాసోహమవుతున్నారా? ఇంతటి మహాచిత్ర రాజం కాస్తా మహోజ్వల చిత్రరాజంగా ప్రమోటవడానికి మాటర్ పరమైన క్రియేటివిటీ ఇంకా ఒనగూడాల్సి ఉందా? ఒకవేళ రెండు భాగాల ‘బాహుబలి’ ఈ మొదటిభాగంలో అలాటి రసాత్మక సౌందర్యం మిస్సయి వుంటే వచ్చే యేడు రాబోయే రెండో భాగంలో దీన్నీ ఆశించవచ్చా? ఏమో మనకేం తెలుసు? 
          అంతవరకూ ఈ మొదటి భాగంలో  విషయమేమిటో చూడ్డమే మన పని!కథేమిటంటే...

      అరణ్యాల్లో బతికే శివుడు ( ప్రభాస్) కి ఎక్కడో ఆకాశమంతెత్తున్న నీటి కొండ (జలపాతం) మీద ఏముందో  చూడాలన్న కోరిక చిన్నప్పట్నుంచీ వుంటుంది. ఆ జలపాతం కింద కొండజాతి వాళ్ళ మధ్య పెరిగిన అతడికి తన జన్మ రహస్యం తెలీదు. మాహిష్మతి రాజ్య వారసుడుగా పుట్టీ పుట్టగానే జరుగుతున్న కుట్ర నుంచి తప్పిస్తూ నాన్నమ్మ శివగామి ( రమ్యకృష్ణ) ఆ పసిబిడ్డగా వున్న అతణ్ణి తీసుకుని పారిపోతూ జలపాతం ధాటికి తట్టులేక ప్రాణాలు విడుస్తూ దేవుణ్ణి ప్రార్ధిస్తుంది. తెల్లారి ప్రాణం లేని ఆమె చేతిలో బతికున్న పసిబిడ్డ కొండజాతి వాళ్లకి దొరుకుతుంది. శివుడు అని నామకరణం చేసి పెంచుకుంటుందామె ( రోహిణి). 

          ఊహ తెలిసినప్పట్నించీ శివుడు ఆ నీటి కొండ మీద ఏముందో చూడాలని విఫలయత్నాలు చేస్తూంటాడు. కుండపోతలా కురిసే ఆ జలపాతం కొండచరియ అనేక సార్లు ఎ క్కుతూ జారి పడుతూంటాడు. అలా ఒకసారి జారి పడ్డప్పుడు మనిషి మొహం ఆకారంలో వున్న చిప్ప ఒకటి కొండమీంచి వచ్చి పడుతుంది.  దాంతో ఇసుకలో బొమ్మ చేసి చూస్తే అది అమ్మాయి రూపం దాలుస్తుంది. దీంతో కొండ పైన అమ్మాయి ఉందని నిర్ధారణ అవుతుంది. ఇంకాగలేక కొండెక్కేస్తూంటే పాడుకుంటూ ఆ అమ్మాయి అవంతిక (తమన్నా) ప్రత్యక్షం!
            అవంతిక ఒంటి చేత్తో శత్ర్రువుల్ని చితగ్గొట్టే వీరవనిత.  ఈమె ప్రేమలో పడిపోయిన శివుడు ‘కళాత్మకం’  గా ప్రేమిస్తూంటాడు. ఈమెకో లక్ష్యం వుంటుంది-అది మాహిష్మతి రాజ్యంలో బందీగా వున్న తన కుంతల రాజ్యపు స్త్రీ దేవసేన ( అనుష్కా) ని విడిపించుకోవడం. ఈమెని తనతో ప్రేమలో, ఆ తర్వాత పడకలో పడేట్టు చేసుకున్న శివుడు ఈమె లక్ష్యాన్ని తన లక్ష్యంగా తీసుకుని, దేవ సేనని విడిపించుకోవడానికి మాహిష్మతి రాజ్యంలోకి రహస్యంగా ప్రవేశిస్తాడు. అక్కడ ఒక సంఘటనలో అతణ్ణి చూసిన బానిసలు బాహుబలీ అని హోరెత్తిస్తారు.
       ప్రజల్ని బానిసలుగా చేసి క్రూరంగా పాలిస్తున్న మాహిష్మతి రాజ్యాధిపతి భల్లాల దేవుడు ( రానా) ఈ బాహుబలి భజనతో  చిర్రెత్తి పోతాడు.  అక్కడే పాతికేళ్ళూ తను బందీగా ఉంచిన దేవసేనని శివుడు తీసుకుని పారిపోవడంతో రెచ్చిపోయి సైన్యాన్ని ఎగదోస్తాడు. ఆ పోరాటంలో భల్లాల దేవుడి నమ్మిన్న బంటు కట్టప్ప ( సత్యరాజ్) శివుణ్ణి చంపబోతూ గుర్తు పట్టి ఆగిపోతాడు. ఇలా ప్రతీ వాడూ తనని గుర్తు పట్టి బాహుబలీ  అని ఎందుకంటున్నారో అర్ధంగాక, ‘నేనెవర్నీ?’ అని నిలదీస్తాడు శివుడు.
          శివుడు ఎవరు? బాహుబలి అసలెవరు? దేవసేనతో సంబంధ మేమిటి? భల్లాలదేవుడు ఎందుకామెని బంధించాడు? శివగామి పాత్రేమిటి? మొదలైన ప్రశ్నలకి సమాధానాలు  ఇక్కడ్నించీ సాగే కథలో తెలుస్తాయి. 
ఎవరెలా చేశారు?
   ఈ ద్విపాత్రాభినయంతో ప్రభాస్ ఏం చేయడానికీ ఇంకా ఈ రెండు భాగాల కథలో పాత్రల పరంగా కొలిక్కి రాలేదు. పాత్రలింకా రసకందాయంలో పడలేదు. పోషించిన శివుడు- బాహుబలి ద్విపాత్రాభినయాల్లో పాత్రల పరంగా ఎమోషనల్ గా ప్రభాస్ ఎలా ఎక్కడ ప్రేక్షకులతో కనెక్ట్ అవగలడో రెండో భాగంలోనైనా  చూపిస్తారేమో ఎదురుచూడాలి. శివుడిగా మొదటి భాగంలో కొండెక్కా లన్న అబ్సెషన్ తో సాహసకృత్యాలు, అవంతిక తో ప్రేమకలాపాలు, మంచుకొండల్లో పోరాటం, శివలింగాన్ని జలపాతం దగ్గరికి మోసే, భల్లాల దేవుడి వంద అడుగుల విగ్రహం కింద పడిపోకుండా కాపాడే, దేవసేనని తీసుకుని పారిపోయే ఘట్టాల్లో -  ఇంకా పాత్ర ఎస్టాబ్లిష్ కాకపోవడం వలన నటన ప్రేక్షకులు ఫీలయ్యేట్టు ఏమీ లేదు. 
          ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ప్రభాస్ పోషించిన బాహుబలి రెండో పాత్ర కూడా నలభై నిమిషాలపాటు సాగే భీకర యుద్ధ దృశ్యాల్లో వీరోచితంగా పాల్గొన్నాక ఆగిపోవడం చేత, మిగతా ఫ్లాష్ బ్యాక్ ని రాబోయే రెండో భాగం సినిమా కోసం అట్టి పట్టడం వల్ల, ఈ పాత్ర కూడా ఎస్టాబ్లిష్ అవక, ఈ సీనియర్ పాత్రలో కూడా ప్రభాస్ తన నటనతో కనెక్ట్ కాలేక పోయాడు.
        ఈ మొదటి భాగం లో అసంపూర్ణంగా వున్న ఫ్లాష్ బ్యాక్, రెండో భాగంలో పూర్తయితే గానీ ప్రభాస్ నటించిన శివుడుతో బాటు - బాహుబలి పాత్రలు రెండూ ఏమిటో అర్ధంగావు, ఎస్టాబ్లిష్ కూడా కావు.  అంతవరకూ ప్రేక్షకులతో దోబూచులాటలే. పాత్రల్ని ప్రేక్షకులు ప్రేమించాలంటే, ఇన్వాల్వ్ అవ్వాలంటే ముందు ఆ పాత్రలేమిటో  అర్ధమవ్వాలి. కనుక ఎస్టాబ్లిష్ కాని ఈ ద్విపాత్రాభినయాల్లో నటనల గురించి, టాలెంట్ గురించీ అప్పుడే ఏమీ మాట్లాడుకోలేం. మిగతా అన్ని పాత్రలూ అవసరానికి మించిన ఎక్స్ పొజిషన్ తోఅర్ధమవుతూ, ప్రధాన కథలో ప్రభాస్ శివుడి పాత్ర, ఫ్లాష్ బ్యాక్ లో బాహుబలి పాత్ర రెండూ మాత్రం అర్ధోక్తిలో ఉండిపోవడంతో,  ఎటూ న్యాయం చేసే అవకాశం దక్కలేదు ప్రభాస్ కి!  
          వచ్చే రెండో భాగంలో ఈ రెండు పాత్రలకి లక్ష్యాలేర్పడితే తప్ప ఇవి ఎమోషనల్ గా ఆడియెన్స్ తో కనెక్ట్ అయ్యే పరిస్థితి లేదు. అప్పుడుగానీ ప్రభాస్ ఏం ప్రూవ్ చేశాడో చెప్పగలం.
          అడవి దున్నతో  దుమ్మురేపుతూ పోరాటంలో పాల్గొని ఎంట్రీ ఇచ్చిన రానా కూడా డిటో. ఈ పాత్ర చిత్రణ కూడా అర్ధాంతరంగానే ముగియడంతో ఇదేమిటో ‘బాహుబలి -2’ లోగానీ తేలేట్టులేదు. అప్పటివరకూ ఎంత గుర్తుండి పోయేలా నటించాడో,  నటనల్లో ఎన్ని మార్కులు పడతాయో రానా కూడా వెయిట్ చేయాల్సిందే. 
          కానీ అనూష్కా పోషించిన డీగ్లామరైజుడు దీవసేన పాత్ర, రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర, సత్యరాజ్ పోషించిన కట్టప్ప పాత్ర - ఈ మొదటి భాగంలోనే సంఘర్షణలో పడ్డాయి కాబట్టి వీటికో వెయిట్ వచ్చి ఎమోషనల్ గా కనెక్ట్ అవగల్గాయి. ఈ పాత్రలకి లక్ష్యాలు కూడా వుండడం చేత వీటిపై మనకి సానుభూతి పుడుతుంది. ఈ సానుభూతిని రాబట్టుకునే నటనలతో చక్కగా రాణించారు ముగ్గురూ.
          మహా యుద్ధంలో కాలకేయుడి పాత్రలో ప్రభాకర్ అప్పుడే పుట్టి అప్పుడే నశించే పాత్ర. మాహిష్మతి వర్గాలతో వెర్బల్ గా సంపర్కం లోకి వెళ్ళే ఆలోచన కూడా చేయకుండా ఏకపక్షంగా కావలసినంత రాక్షసత్వంతో విర్రవీగిపోయాడు. యుద్ధ కారణాలకి తగిన నేపధ్య బలం లేకపోవడంతో ఈ పాత్ర కాగితం పులిలా తేలింది.  
         అందరికంటే ఎక్కువ లక్ష్యం వుండి కార్యాచరణలో ఉన్న పాత్ర తమన్నాది మాత్రమే. ఈ సంఘర్షణతో ప్రేక్షకులని ఆకట్టుకోగలిగే స్థితిలో ఈమె పాత్ర వుండడం చేత, పాత్ర అర్ధమైపోయి రెండో పార్టు దాకా ఆగనవసరం లేకుండా నటనలో మార్కులు కొట్టేసింది. ఈ సినిమా మొత్తం మీద పూర్తిగా ఎష్టాబ్లిష్ అయిన పాత్ర ఇదొక్కటేనని చెప్పాలి.
          అయితే ఈమె పాత్రచిత్రణలో కూడా లొసుగులు లేకపోలేదు. ఫైనల్ గా దేవసేనని విడిపించే ఆపరేషన్ని నాయకుడు ఈమెకి అప్పగిస్తున్నప్పుడు, ఈమెకి తెలియకుండా ఈమె చేతిమీద శివుడు పొడిచిన పచ్చ బొట్టు చూసి- ఈమె నిబద్ధతని ప్రశ్నిస్తాడు. అప్పుడీమె ఈ షాకులోంచి తేరుకుని, తనకి ప్రేమలో పడే ఉద్దేశం లేదని ప్రతిజ్ఞ చేస్తుంది. కానీ అక్కడ్నించీ ఆపరేషన్ కి బయల్దేరాక శివుణ్ణి వెతుక్కుంటుంది. అతడితో ప్రేమలో పడి  సర్వస్వం అర్పించుకుని ఆపరేషన్ సంగతే మర్చిపోతుంది. ఆ ఆపరేషన్ ని శివుడు మీదేసుకుని బయల్దేర తాడు. ఇంత ఫూలిష్ గా ఈమె ఎలా ప్రవర్తించినట్టు? ఇప్పుడు నాయకుడికి ఎలా మొహం చూపిస్తుంది? ఆ నాయకుడు ఊరుకుంటాడా? అతడి దృష్టిలో శివుడెవరు ఆపరేషన్ కి వెళ్ళడానికి?

***
      ఇక సాంకేతికాంశాల్లోకి వెళితే, విజువల్ వండరే గానీ, మ్యూజికల్ పండుగ కాదు. కీరవాణి చేతిలో బాణీలు ఎందుకో ఈసారి క్యాచీగా పలకలేకపోయాయి. మళ్ళీ ఓ ‘మగధీర’ మ్యాజిక్ ని ఈ ‘బాహుబలి’ అనే పెద్దన్న లాంటి సినిమా ( ‘మగధీర’ కి పెద్దన్న’ బాహుబలి’) నుంచి కూడా ఆశిస్తారెవరైనా. కానీ ఈ ఇద్దరి బాణీలకీ పురుడు పోసిన కీరవాణి ఒక్కరికే న్యాయం చేయగల్గారు. ఇవ్వాళ్ళ కూడా పెద్దన్నని త్రోసిరాజని చిన్నోడు  ‘మగధీర’ క్యాచీ పాటలు ఇంకా మెదులుతూనే వున్నాయి.   సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం, ఆదిల్ అదీలీ గ్రాఫిక్స్ సృష్టి – మహా జలపాతం, మంచు కొండల ఉత్పాతం, యుద్ధ దృశ్యాలూ వంటి చిత్రణల్లో  ఈ ఇద్దరి పనితనం హాలీవుడ్ బాసుల్ని ఒకసారి ఇటు చూసేలా చేస్తాయి. కళాదర్శకుడు సాబు సిరిల్ మహా కట్టడాలు హాలీవుడ్ ‘బెన్హర్’ కేం తీసిపోవు. పీటర్ హెయిన్స్ కొరియోగ్రఫీలో నిమిషనిమిషానికీ  మారిపోయే యుద్ధ తంత్రాల వార్ సీన్స్  ని ఏకధాటిగా నలభై నిమిషాల పాటూ నిలబెట్టడం ఒకెత్తు.  ‘బెన్హర్’ లో రధప్పందాల దృశ్యాల చిత్రీకరణని తలపించే ఈ యుద్ధ దృశ్యాల్లో కంటిన్యూటీ పరమైన లోపాలూ లేకపోలేదు. సినిమా ప్రారంభంలో జలపాతంలో చనిపోయిన శివాగామి ఎత్తి పట్టుకున్న చేతిలో పసిబిడ్డ సీను మెలోడ్రామా కాబట్టి అందులో లాజిక్ చూడనవసరం లేదు. అలాగే నీటిలో వున్న అవంతిక చేతి మీద ఆమెకి స్పర్శ తెలియకుండా, నీటిలో కరిగిపోయే రంగులతో శివుడు పచ్చ బొట్టు ఎలా పొడుస్తాడో కూడా మెలోడ్రామా మాటున చెల్లిపోయే లాజిక్కే. కానీ సన్నివేశాల్లో కంటిన్యూటీ దెబ్బతింటే ఆస్వాదనకి లాజిక్ అడ్డుపడుతుంది. ఎడిటింగ్ లో కూడా సవరించలేనంత కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ యుద్ధ సన్నివేశాల్లో చొరబడిపోయాయి. 


        ఈ ఉర్రూతలూగించే యుద్ధ దృశ్యాలూ వెరసి చూస్తున్నంత సేపూ ఇంకా ఇంకా చూడాలన్న ఆసక్తి రేపే దృశ్య వైభవం యావత్తూ ఈ ‘బాహుబలి’ సొంతం. మేకింగ్ లో ఇది క్రియేటివ్ వండర్, సందేహం లేదు. ఇండియాలోనే ఇలా ఇంకో దర్శకుడూ నిర్మాతా సాహసించలేని మహత్కార్యానికి  ఒక తెలుగు దర్శకుడూ నిర్మాతలూ పూనుకోవడం చూసైనా మిగతా దేశమంతా గర్వించాలి తప్పదు. శేఖర్ కపూర్ అన్నట్టు ‘బాహుబలి’ లాంటి సినిమాలు తీసే దర్శకులు బాలీవుడ్ లోనే లేరు.స్క్రీన్ ప్లే సంగతులు

           ఒక పెద్ద కథని రెండు భాగాలుగా చేసి, రెండు సినిమాలుగా తీస్తునప్పుడు మొదటి సినిమాని కేవలం రెండో సినిమాకి పైలట్ గా తీయవచ్చా? ఇలా ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? లేదని అనేక విభజిత భాగాల సినిమాలు చెప్తున్నాయి. మొదటి భాగం సినిమా కూడా ఒక పూర్తి స్థాయి సినిమా కుండే కథా నిర్మాణం తోనే వుంటుంది. కాకపోతే ఒక పూర్తి స్థాయి సినిమా ఎక్కడ ఇంటర్వెల్ తో ఆగుతుందో, ఆ ఇంటర్వెల్ నే ముగింపుగా చేసుకుని  మొదటి భాగంగా తీసే సినిమా ముగియవచ్చు. అంటే అర్ధం అప్పటికి తిరుగులేకుండా కథ మిడిల్ విభాగంలో పడితీరాలన్న మాట- అప్పుడే మొదటి భాగాని కి అర్ధంపర్ధం.

            అలాకాకుండా బిగినింగే మొదటి భాగమంతా ఆక్రమిస్తూ, స్క్రీన్ ప్లే లో ఆ బిగినింగ్ విభాగం కూడా ముగియకుండానే, బిగినింగ్ కే  బ్రేక్ ఇచ్చేసి సినిమాని ముగిస్తే, మొత్తం తీసిన మొదటి భాగమంతా అర్ధం లేకుండా పోతుంది. చూశామంటే ఏదో అద్భుత దృశ్యవైభవాన్ని గాంచామని
 అన్పిస్తుందంతే, అద్భుత దృశ్య కావ్యాన్ని మాత్రం కాదు!
          ఒక పూర్తి స్థాయి సినిమా కథని మిడిల్ లోకి తీసికెళ్ళకుండా,  బిగినింగ్ కే బ్రేక్ ఇచ్చి, ఇంటర్వెల్ వేస్తే ఎంత అర్ధరహితంగా వుంటుందో ఊహించండి.
          ‘శివ’ అనే సినిమాని నాగార్జున సైకిలు చెయిన్ తెంపి తిరగబడే బిగినింగ్ ముగింపు ఘట్టాన్ని అక్కడ పెట్టకుండా, సెకండాఫ్ లో ఎక్కడో పెట్టుకుని ఇంకెప్పుడో  మిడిల్ ప్రారంభిస్తాం మా ఇష్టమని, ఇంటర్వెల్ దాకా బిగినింగ్ దృశ్యాల్నే సాగలాగి, ఓ సరదా కాలేజీ సీన్ మీద ఇంటర్వెల్ వేసి వుంటే  ఎలా ఉండేదో- రెండు భాగాల సినిమాల్లో మొదటి భాగం ముగింపు కూడా అలాగే తయారవుతుంది. 
          ‘బాహుబలి’ మొదటి భాగంలో మనకు చూపించిందంతా  కథగా ఇంకా ప్రారంభం కాని బిగినింగ్ కథా విభాగం ( మొదటి అంకం లేదా ఫస్ట్ యాక్ట్) మాత్రమే.. ఇది కూడా ఇంకా బ్యాలెన్సు పెట్టి సినిమాని ఆకస్మికంగా ముగించడమే. ఇన్ని గంటలు నడిచినా  ( రెండు గంటల నలభై నిమిషాలు) మిడిల్ కథా విభాగం ( రెండో అంకం లేదా సెకండ్ యాక్ట్) లోకి ఈ మొదటి భాగం సినిమా ఇంకా వెళ్ళనే లేదు. అంటే అసలు కథ ప్రారంభమే కాలేదు. ప్రారంభించిన పాత్రల పరిచయం, కథా నేపధ్య పరిచయం, సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన, అంతిమంగా సమస్య ఏర్పాటు అనే నాల్గు బిగినింగ్ విభాగపు టూల్స్ లో మొదటి రెండే ప్రయోగించారు ఈ సినిమా సాంతం. ఇంకా సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన, అంతిమంగా సమస్య ఏర్పాటు అనే మిగిలిన రెండు టూల్స్ జోలికే వెళ్ళ లేదు. ఇలా బిగినింగ్ బిజినెస్ కూడా మొదటి భాగంలో పూర్తి కాలేదు. ఈ లెక్కన కథని సమగ్రంగా తీయడానికి రెండు కాదు, మూడు భాగాలుగా తీయాల్సి వస్తుందేమో!

***
   స్క్రీన్ ప్లే ఎపిసోడ్లుగా ఇలా సాగుతుంది..మొదట శివుడి పాత్ర పరిచయం కొండెక్కాలన్న కోరికతో కలిపి ఒక ఎపిసోడ్,  తర్వాత అవంతిక పాత్ర పరిచయం ఆమెకున్న లక్ష్యాన్ని యాక్షన్ తో చూపిస్తూ ఒక ఎపిసోడ్, ఆ తర్వాత కట్టప్ప పాత్ర పరిచయం అస్లం ఖాన్ (సుదీప్) పాత్రతో కలిపి  ఒక ఎపిసోడ్, దీని తర్వాత భల్లాల దేవుడి పాత్ర పరిచయం దున్నతో పోరాటంతో ఒక ఎపిసోడ్, మళ్ళీ దీని తర్వాత దేవసేన పాత్ర పరిచయం పుల్ల లేరుకోవడంతో ఒక ఎపిసోడ్..ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా ఈ పాత్రల పరిచయాలు విడివిడి ఎపిసోడ్లు మాదిరిగా ( సీన్లని జంబ్లింగ్ చేయ వీలుకాని పరిమితులుండే రంగస్థల నాటకాల్లో లాగా) నడుస్తుంది కథనం. దీని వల్ల హీరోగా వున్న శివుడి పాత్ర ప్రాధాన్యం తగ్గిపోవడమే కాకుండా, స్క్రీన్ మీద దాని నిడివి కూడా తగ్గిపోయింది ఫస్టాఫ్ లో.         


        ఫస్టాఫ్ లో అవంతిక ఎపిసోడ్ లో ప్రభాస్ శివుడి పాత్రకి లక్ష్యాన్ని ఏర్పాటు చేశారు. అంటే కథ మిడిల్ లో పడిందన్నట్టా? కాదు, ఎందుకంటే ఆ లక్ష్యం అతడికి ఎదురైన సమస్య వల్ల ఏర్పడింది కాదు, ఆమె అనుభవిస్తున్న సమస్యలోంచి పుట్టింది. అలా ఆమె లక్ష్యాన్ని తను సాధించడానికి ( దేవసేనని విడిపించడానికి ) బయలేదేరాడు. ఈ సెకండ్ హేండ్ గోల్ ఎన్టీఆర్ నటించిన ‘ఊసరవెల్లి’ లోనూ ఉన్నదే. తన కుటుంబాన్ని హతమార్చిన హంతకుల్ని హతమార్చ మంటుంది తమన్నా. తనది కాని సమస్యతో ఈ సెకెండ్ హేండ్ గోల్ తీసుకుని నటించిన ఎన్టీఆర్ పాత్రా ఆ తర్వాత  ఆ సినిమా ఏమయ్యాయో తెలిసిందే. 
          హీరో పాత్ర మరో పాత్ర గోల్ ని తీసుకుని తన గోల్ గా సాగిపోవచ్చు. అదెప్పుడంటే, ఆ మరో పాత్ర మరణించి నప్పుడు. మరణిస్తూ ఆ పాత్ర తన అసంపూర్ణ లక్ష్యాన్ని పూర్తి చేసి సమస్యని పరిష్కరించ మంటుంది. అప్పుడా లక్ష్యాన్ని హీరో పాత్ర స్వీకరించినప్పుడు ‘హేండ్ ఆఫ్’ క్యారక్టర్ గా మారుతుంది. దీనివల్ల ఎమోషన్ ఏమీ తగ్గకపోగా పెరుగుతుంది. ఎటొచ్చీ లక్ష్యాన్ని అందజేసిన పాత్ర కథలో వుండకూడదు. 
          కానీ ఇందుకు భిన్నంగా ‘ఊసరవెల్లి’ లోనూ మళ్ళీ తగుదునమ్మా అని ‘బాహుబలి’ లోనూ, రెండు సినిమాల్లోనూ ఇలాటి తమన్నా పాత్ర కథలో అలాగే కంటిన్యూ అయింది (తమన్నా పాత్ర లక్ష్యం శివుడు తీసుకుని వెళ్లి పోవడంతో తమన్నా పాత్ర ఇప్పటికి కనుమరుగైనా, రెండో భాగంలో ఈ కంటిన్యూటీ ఉండొచ్చని భావించవచ్చు). 
          దీంతో ఇంతా చేసి ఈ మాగ్నం ఓపస్ లాంటి సినిమాలో ప్రభాస్ శివుడి పాత్ర కాస్తా కేవలం సహాయ పాత్రగా మారిపోయిందా అన్న ఫీలింగ్ నివ్వడంతో బాటు, ఈ సెకండ్ హేండ్ గోల్ వల్ల పెరగాల్సిన హీరో క్యారక్టర్ ఆర్క్ పెరగకుండా చప్పున చల్లారి పోయింది! ఇది హై కాన్సెప్ట్ మెగా బడ్జెట్ మూవీ లక్షణమా?          

***
                                       
      దీని తర్వాతే వుంది అసలు షాక్. శివుడు అలా వెళ్లి దేవసేనని కాపాడు కొచ్చాక, ఆ లక్ష్యం పూర్తయి పోయింది సెకండాఫ్ ఆరంభంలోనే! ఇంకేముంది, కథ ముగిసినట్టేనా? అంటే కాదు – ఎందుకంటే, ఓపెన్ చేసిన మ్యాన్ హోల్ మూతలు ఇంకా వేయాల్సినవి చాలా వున్నాయి. అవంతిక ఎపిసోడ్ కి లాగే మిగిలిన భల్లాల దేవా, దేవా సేన, కాటప్పల ఎపిసోడ్లకీ ముగింపు లివ్వాల్సి వుంది. అవంతిక ఎపిసోడ్ కి మాత్రమే భరతవాక్యం పలుకుతూ హీరో లక్ష్యం పూర్తయినట్టు సెకండాఫ్ ఆరంభం లోనే చూపించడంతో – ఓస్ ఇది ప్రధాన కథ కాదనీ, ఇంకేదో ఉంటుందనీ ఆడియెన్స్ ఎక్స్ పెక్టేషన్స్ మీద చన్నీళ్ళు పోసినట్టయ్యింది. 

          అంటే, ఇంటర్వెల్ కి ముందు  ఫస్టాఫ్ లో ఒకానొక ఘట్టంలో తమన్నా పాత్ర లక్ష్యాన్ని  హీరోకి బదలాయిస్తూ అదే ప్రధాన లక్ష్యంగా డైలాగు సహితంగా బిల్డప్ ఇవ్వడం చాలా పొరపాట న్న మాట! దీనివల్ల ఏం జరిగిందంటే, అంతలోనే ఆ లక్ష్యం పూర్తయ్యాకా ఆడియెన్స్ ని చీటింగ్ చేసి నట్టయింది. బాబూ, ఈ కథ దేవసేనని కాపాడ్డం గురించి కాదురా నాయనా అని పరిహసించి నట్టయింది.
          ఇలా ఎందుకు జరిగిందంటే, ఏం విత్తితే అదే మొలకెత్తుతుందన్నట్టు - ఇంతవరకూ ఈ ఎపిసోడ్లమయమైన కథనం దాని సహజ లక్షణం కొద్దీ స్టాప్ అండ్ స్టార్ట్ కథన టెక్నిక్ నే డిమాండ్ చేసింది. ఫలితంగా అప్పుడే పుట్టిన హీరో లక్ష్యం అప్పుడే పూర్తయి ఆ కథనం ‘స్టాప్’ అయ్యింది, ఇక మరో పాయింటు తో మరో కథనాన్ని ‘స్టార్ట్’ చేయాలి. అలా ‘స్టార్ట్’ అయిందే ‘నేనెవర్నీ?’ అన్న శివుడి ప్రశ్నతో మొదలైన ఫ్లాష్ బ్యాక్ అనే మరో ఎపిసోడ్!
          ఫస్టాఫ్ లో అలా డైలాగు సహితంగా హీరోకి ప్రధాన లక్ష్యంకాని సెకండ్ హేండ్ లక్ష్యాన్ని ప్రకటించకుండా, కేవలం ఆవంతిక పాత్ర లక్ష్య సాధనలో సహాయపడే పాత్రగానే శివుడితో  కథనం నడిపి వుంటే ఆడియెన్స్ కి చీటింగ్ ఫీలింగ్ కలక్కుండా వుండేది. ఒక సినిమాలో ఒక హీరోకి ఒకే లక్ష్యం వుంటుందనేది, మధ్యంతర లక్ష్యాలుండవనేది కామన్ సెన్సే తప్ప అంతరిక్ష సైన్సు కాదుగా?

***

***      మరి హీరోకి అసలంటూ తనదైన లక్ష్యం ఎప్పుడు ఏర్పడినట్టు? ఈ మొదటి భాగం లో ఏర్పడే అవకాశమే లేదు. సెకండాఫ్ ఆరంభంలో లో దేవసేనని విడిపించాకా, ‘నేనెవర్ని?’ –అన్న ప్రశ్నతో మొదలైన ఫ్లాష్ బ్యాక్ పూర్తయితే గానీ, అప్పుడు తానెవరో తెలుసుకున్న హీరో తన లక్ష్యం ఏమిటో తెలుసుకో గలుగుతాడు. కానీ ఈ ఫ్లాష్ బ్యాక్ కూడా సెకండాఫ్ లో పూర్తయితే కదా! కాబట్టి ఇలా మొదటి భాగంలో హీరోకి లక్ష్యం ఏర్పడకుండా పోయింది. సినిమా ముగించినా బిగినింగ్  విభాగం ఫ్లాష్ భాక్ తో సహా ఇంకా బ్యాలెన్సు వుండి పోవడంతో! 
          ఇప్పుడు సినిమా అనే కళారూపానికి అత్యంత ప్రధానమైన కథాత్మ, ఫీల్, ఆత్మిక దాహం, రసాత్మక అనుభవం- ఏదైనా కావొచ్చు- వీటి గురించి మాటాడుకుంటే-  ఏ సినిమా కథకైనా బిగినింగ్ విభాగం ముగిసి ఒక సంఘర్షణతో, ఒక సమస్యతో పోరాటం లక్ష్యంగా మిడిల్ విభాగం ప్రారంభం కానంత వరకూ ఆడియెన్స్ తాదాత్మ్యం చెందలేరు. పాత్రతో కనెక్ట్ కాలేరు. స్క్రీన్ ప్లే కి గుండె కాయలాంటి మిడిలే లేకపోయాక ఇంకే దృశ్య వైభవాలూ ఆ లోటుని భర్తీ చేయలేవు. 
          ఆడియెన్స్ పట్టుకు ప్రయాణించడానికి ఒక పాయింటూ ఏర్పాటుకాక, ఆ పాయింటు వల్ల ఉత్పన్నమయ్యే భావోద్వేగాలూ అనుభవించలేకా, detached గా ఉండిపోవాల్సి వచ్చింది. టీవీ సీరియల్ చూసినట్టుందని ఒక ప్రేక్షకుడు వ్యాఖానించడానికి కారణమిదే. ఇంత ప్రతిష్టాత్మకమైన సినిమాని పట్టుకుని టీవీ సీరియల్ చూసినట్టుందని చెప్పుకునే పరిస్థితా!
          ఈ సినిమాలో ట్రాయ్, థోర్, 300, లార్డ్ ఆఫ్ ది రింగ్స్, అవతార్ ల వంటి హాలీవుడ్ ఫాంటసీల ఛాయలున్నాయని ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ పత్రికలు కోడై కూస్తున్నాయి. ఏ ఛాయలు లేకుండా ఏ సినిమా వుండదు. దీన్నలా ఉంచితే, దర్శకుడు రాజమౌళి ఏవో సినిమాల మేకింగ్ మంత్రా కి ప్రభావితుడై నట్టుగానే, ‘బెన్హర్’ లాంటి కొన్ని సుదీర్ఘ నిడివి గల సినిమాల కథా నిర్మాణాన్ని కూడా గమనించి వుండాల్సింది. మూడున్నర గంటల నిడివిగల బెన్హర్ ని రెండు భాగాలు చేసి విడుదల చేయలేదు. ఏకమొత్తంగా రిలీజ్ చేశారు. సినిమా ఇంత నిడివి వుంది కదా అని సకాలంలో కథలోకి వెళ్ళకుండా కాలక్షేపం చేశారా? లేదే? మొదటి పావు గంటలోపే  పాత్రల పరిచయం, హీరో లక్ష్యం వగైరాలతో కూడిన బిగినింగ్ విభాగాన్ని ముగించేసి కథలోకి ( మిడిల్ విభాగం లోకి) వెళ్ళిపోయారు. హీరో ప్రాణమిత్రుడనుకున్న వాడు తల్లినీ చెల్లినీ కారాగారం పాల్జేసి తనని  దేశాంతరం పట్టించడంతో ముగుస్తుంది బిగినింగ్ విభాగం. ఈ ప్రతీకార భావం తో రగిలిపోయే హీరో సఘర్షణతో ఇక ప్రారంభమవుతుంది మిడిల్ విభాగం. ఇది సుదీర్ఘంగా సెకండాఫ్ లో రథప్పందాల ఘట్టం దాకా సాగి ముగుస్తుంది. రథప్పందాల్లో ఆ మిత్ర ద్రోహిని ఓడించి పగదీర్చుకోవాలన్న పరిష్కార మార్గంతో హీరో ఉద్యుక్తుడవడం తో ఎండ్ విభాగం (క్లయిమాక్స్) ప్రారంభమౌతుంది.
          ఇక్కడ ఎందుకని మిడిల్ విభాగానికి అంత నిడివి ఇచ్చివుంటారు ? సినిమాకి ఇదే గుండెకాయ కాబట్టి. మిడిల్ విభాగంలోనే కథాత్మ, ఫీల్, తదాత్మ్యత, రసాత్మకత ఏర్పాటై ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు కాబట్టి. వీటి ప్రభావంతో హీరోని తమ వాణ్ణిగా చేసుకుంటారు కాబట్టి. అదనంగా ‘బెన్హర్’ లో ఇంకో హంగు జత చేశారు. అది ప్రేక్షకుల ఆత్మిక దాహానికి సంబంధించి. ఈ కల్పిత కథలోనే ఏసుక్రీస్తు పాత్రనీ లీలామాత్రంగా చూపిస్తూనే  భక్తి రసంతో కూడా ప్రేక్షకులు ఊగిపోయేలా చేశారు!
          కృష్ణ నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ లోనూ ఈ ఆధ్యాత్మిక కోణాన్ని కల్పించడం ఆశ్చర్య  పరుస్తుంది. అది విప్లవ సినిమా. విప్లవ సినిమాలో భక్తి రసమేమిటి? లేకపోతే  సినిమా డ్రైగా అన్పించేట్టుంది. కనుక వీరత్వమున్న అల్లూరి పాత్రకి దైవత్వాన్ని కూడా ఆపాదించి ప్రేక్షకుల్ని భక్తి రసంతో కూడా ఓలలాడించారు. ఇప్పుడు ఈ సీజీ, వీ- ఎఫెక్స్ ల టెక్నాలజీల కాలంలో జానపదాలో పౌరాణికాలో తీస్తున్నప్పుడు, కథా కథనాల పరంగా కాస్త పాత క్లాసిక్స్ ని గైడ్ గా వాడుకుంటే తప్పేమిటి?

***
          ముట్టుకో కూడని పాసివ్ పాత్రలతో కథల్ని, ఎండ్ సస్పెన్స్ కథనాల్ని, ఇంటర్వెల్లో కథ మధ్యకి విరిగిందని కూడా తెలుసుకోకుండా సెకండాఫ్ సిండ్రోమ్ రచనల్ని; ఎంత కాలం గడిచినా, ఇంకెన్ని ఫ్లాపులు పోగు పడినా, మిడిల్ విలువని గుర్తించకుండా అదే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలనీ యధేచ్చగా రాసేయడం అలవాటైనప్పుడు మార్పేం వస్తుంది? ఒకసారి ఈ పక్క  పటం చూడండి-

 మొదటి బొమ్మలో 1, 2, 3 అనే వృత్తాలు బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాల్ని సూచిస్తాయి. వీటి సైజుల్ని బట్టి స్క్రీన్ ప్లే లో వీటి పరిమాణం ఎంతుంటుందో తెలుస్తోంది. మధ్యలో మిడిల్ కేంద్రంలో MP అని గుర్తు వుంది. ఇది మిడ్ పాయింట్ లేదా ఇంటర్వెల్ ఘట్టం. ఇది ఆమోదనీయమైన, సార్వజనీన వృత్తాల ఏర్పాటు. 
          రెండో బొమ్మ చూస్తే, బిగినింగ్ వృత్తం దీర్ఘ వర్తులాకారంగా సాగి – మిడిల్ వృత్తం భూభాగాన్ని సగానికి కబ్జా చేస్తూ ఇంటర్వెల్ ఘట్టాన్ని తాకింది. ఇంటర్వెల్ తర్వాత తనకి మిగిలిన సగ భూభాగంతోనే సరిపెట్టుకుంది మిడిల్ వృత్తం. ఎండ్ వృత్తం డిస్టర్బ్ కాలేదు. ఇది ఆమోదనీయం కాదు, కానీ ఫస్టాఫ్ –సెకండాఫ్ తరహా స్క్రిప్ట్ లకి అలవాటు పడిపోయిన సినిమాలకి దీంతోనే ఆడింది ఆటగా సాగిపోతోంది.
          మూడో బొమ్మలో చూస్తే, బిగినింగ్ వృత్తం ఇంకా చెలరేగి, ఇంటర్వెల్ తర్వాత మిడిల్ కి ఆ కాస్తా మిగిలిన సగ భూగంలో సగాన్నీ మింగేస్తూ సెటిలయ్యింది. దీంతో విధిలేక మిగిలిన సగం మిడిల్ వృత్తం వెళ్లి సర్దుబాటు కోసం ఎండ్ భూభాగం మీద దాడి చేసి కావలసినంతా దురాక్రమించేసింది.  కుయ్యోమని ఎండ్ మూల్గింది. దీన్నే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అంటారు. మిడిలే  వుండదు, వున్నా ఎక్కడో క్లయిమాక్స్ దగ్గరికి జరిగిపోయి బిక్కుబిక్కుమంటూ దాక్కుని వుంటుంది- ఇలావున్నాకా ఇంకా చెప్పుకోవడానికి కథేం వుంటుంది. కథంటే మిడిలే కదా? ఈ సమస్యే ‘బాహుబలి’ ది- రెండో భాగం కూడా విడుదలయ్యాక ఒక పూర్తి స్క్రీన్ ప్లేగా చూసినప్పుడు మాత్రమే!

           ఐతే ముందే చెప్పుకున్నట్టు, మొదటి భాగం సినిమా అంతా నడిచినా ఇంకా బిగినింగ్ ముగియలేదు కాబట్టి- ఈ బిగినింగ్- అంటే మొదటి భాగం ముగింపులో ఫ్లాష్ బ్యాక్ ఎక్కడికైతే వచ్చి ఆగిందో- అది సినిమా రెండో భాగం ప్రారంభం నుంచీ కొనసాగుతుందన్న మాట. ఆ ఫ్లాష్ బ్యాక్ బ్యాలెన్స్ భాగం, సినిమా రెండో పార్టులో వచ్చే  ఫస్టాఫ్ లో ఇంటర్వెల్ లోపు ఎక్కడో పూర్తవ్వచ్చన్న మాట! . అప్పుడు గానీ హీరోకి ఏం చేయాలో లక్ష్యం ఏర్పడి మిడిల్ ప్రారంభం కాదన్న మాట!

***
          క మొదటిభాగం ఆకస్మిక ముగింపు విషయాని కొద్దాం. షోమాన్ రాజ్ కపూర్ కూడా ఇలాటిదే సుదీర్ఘమైన నిడివిగల సినిమా తీశాడు ‘బెన్హర్’ ని మించీ. ఆ సినిమా ‘మేరా నామ్  జోకర్’. దీని నిడివి నాల్గుంపావు గంటలు!  దీన్ని రెండు భాగాలుగా చేసి మాత్రం విడుదల చేయలేదు. రెండు ఇంటర్వెల్స్ ఇచ్చి చూపించాడు. ‘బాహుబలి’ ని కూడా ఇలా ఒకే సినిమాగా రెండు ఇంటర్వెల్స్ తో విడుదల చేసి వుంటే ఎంత బావుండేదో! 
         కానీ మార్కెటింగ్ వ్యూహం అనేదొకటి వుంది. ఇకముందు హాలీవుడ్ లో కూడా విడుదలయ్యే  కొన్ని సినిమాలకి మార్కెట్ వ్యూహమే ప్రధానంగా రెండుమూడు భాగాలుగా చేయబోతున్నారు. ఐతే పాపులరైన నవలల ఆధారంగా తీస్తున్న సినిమాల విషయంలోనే ఈ వ్యూహం.  పాపులరైన నవలల మీద గల క్రేజ్ నుంచి  వీలైనంత సొమ్ము పిండుకోవాలని ఆ నవలల్ని  రెండుమూడు భాగాలుగా చేసి,  ఊరిస్తూ ఊరిస్తూ ఒకటొకటిగా తీసి సినిమాలు విడుదల చేస్తారన్న మాట.  ‘ట్విలైట్’ సాగా మూవీస్, ‘హంగర్ గేమ్స్’ పార్టుల వారీ సినిమాలూ ఈ వ్యూహంతో వచ్చినవే. ఇంకా ‘ఎవెంజర్స్’ రెండో భాగాన్ని కూడా రెండో భాగం, మూడో భాగం గా విడదీసి తీస్తున్నారు.  ‘జస్టిస్ లీగ్’ కూడా రెండు భాగాలుగా వస్తోంది.

          వీటి మొదటి భాగాల్ని ఎలా తీస్తున్నారన్నదే ప్రశ్న. ఎలా ముగిస్తున్నారన్నదే సమస్య. గతంలో – 2003 లో ‘పల్ప్ ఫిక్షన్’ కల్ట్ ఫిలిం ఫేమ్ క్వెంటిన్ టరాంటినో ‘కిల్ బిల్’ తీయాలనుకున్నప్పుడు,  ఆ పెద్ద కథని ఒకే సినిమాగా తీయలేమని- రెండుగా కథని విభజించాడు. రెండూ దేనికది స్ట్రక్చర్ సర్దుబాటు అయ్యే విధంగా జాగ్రత్త తీసుకుని తీశాడు! 
          ఇది హీరోయిన్ ఉమా థర్మాన్ ప్రతీకార కథ. ఒక కిల్లింగ్ స్క్వాడ్ లో పని చేస్తున్న ఈమె ఆ స్క్వాడ్ బాస్ బిల్ అనే వాడి చేత గర్భం ధరిస్తుంది. దాంతో బిడ్డ కోసం తానీ వృత్తి మానేయా లనుకుంటుంది. ఇది చెప్తే బిల్  చంపేస్తాడు గనుక పారిపోయి వేరే నగరంలో ఇంకొకర్ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతూంటుంది. అప్పుడు బిల్ గ్యాంగ్ తో సహా ఊడిపడి ఆ పెళ్లి వేడుకలోమారణ కాండ సృష్టిస్తాడు.  చావుబతుకుల్లో వున్న ఉమా ని వదిలేసి వెళ్ళిపోతాడు. నాల్గేళ్ళూ  కోమాలో వున్న ఉమా కోలుకున్నాక- గర్భంలో వున్న తన బిడ్డ ఏమయ్యిందో అర్ధంగాక తల్లడిల్లుతుంది. పెళ్లి వేడుకలో పెళ్లి కొడుకు సహా తన వాళ్ళందర్నీ చంపేసిన బిల్ మీద – అతడి గ్యాంగ్ మీదా పగ పెంచుకుంటుంది. 
          ఒకొక్కర్నీ చంపడం మొదలెడుతుంది. తప్పించుకుంటున్న బిల్ సినిమా ముగింపులో తన మీద తిరుగులేని ప్లాన్ వేసిందని తెలుసుకుని- ‘అసలు దీని కూతురు బతికుందని దీనికి తెలుసా?’  అని ట్విస్ట్ ఇస్తాడు! ఈ పిచ్చెత్తించే ట్విస్టే మొదటి భాగం ముగింపు!
          ఒక లాజికల్ గానూ ఎమోషనల్ గానూ సమగ్రంగా, పరిపూర్ణంగా ప్రశ్నార్ధకంగా నిల్చిన cliffhanger moment ఇది!   గడ్డు పరిస్థితిని సృష్టించి, హీరోయిన్ కి ఇంకింత సమస్య –ఈసారి మాత్రుత్వపు భావోద్వేగాల సంకటంలో పడేసి వదిలేసిన పరిపక్వాని కొచ్చిన ముగింపు! ఆమెకి తెలియని నిజంతో కళ్ళు తెరిపించడం! ఇక కన్న కూతురా? ప్రతీకార కాంక్షా? ఏది ఎంపిక చేసుకోవాలి తను? 
          దీంతో ప్రేక్షకులకి ఎంత ఉత్కంఠ రేగిందంటే, రెండో భాగం చూడాలి- కొత్త కథతో రెండోభాగం వెంటనే చూడాలి- అంటూ  టరాంటినోని ఫోన్ కాల్స్ తో ఉక్కిరి బిక్కిరి చేశారు!
          ఏంటిది! ఏం చేశాడు మాస్టర్ స్టోరీ టెల్లర్ టరాంటినో?
        సింపుల్ గా స్ట్రక్చర్  కి నిబద్ధుడయ్యాడు. స్ట్రక్చర్  కి నిబద్ధుడైన వాడు మరపురాని సినిమాల్ని నిర్మిస్తాడు. మొదటి భాగంలో పెళ్లి వేడుకల్లో బిల్ సృష్టించిన మారణ కాండతో బిగినింగ్ ముగించి, హీరోయిన్ కి ప్రతీకార భావం రగిలించి, ఆ  చివరిదాకా మిడిల్ నడిపి- ఆ మిడిల్ కి పైన చెప్పిన క్లిఫ్ హేంగర్ ట్విస్ట్ ఇస్తూ ముగించాడు మొదటి భాగాన్ని. ట్విస్ట్ అనేది కథకి  ( మిడిల్ విభాగానికి ) ఇవ్వాలే గానీ,  పరిచయానికి (ఇంకా సాగదీసిన బిగినింగ్ విభాగానికి ) కాదని తెలియ చెప్పాడు.  ఇక మలిసగం మిడిల్ తో రెండో భాగం ‘కిల్ బిల్’ ఇంకింత ఆసక్తికరంగా మొదలవుతుందన్నమాట! అంతేగానీ, ‘బాహుబలి’ లోలాగా మలిసగం బిగినింగ్ విభాగంతో బలహీనంగా కాదు!
          ‘బాహుబలి’ మొదటి భాగం ముగింపుని ఇంకా ముగియని బిగినింగ్ కే ఇవ్వడంతో,  విషయపరంగా మూవీ ఫ్లాట్ గా మిగిలింది. చివర్లో ఫ్లాష్ బ్యాక్ ని ఆపి, సడెన్ గా- ఉరుము లేని పిడుగులా-  బాహుబలికి తానే  వెన్నుపోటు పొడిచాననీ విజువల్ వేస్తూ నమ్మినబంటు కట్టప్పతో చెప్పించడం ద్వారా ట్విస్ట్  ఇచ్చామనుకున్నారేమో. అది పరిపక్వతకి రాని ట్విస్ట్. దానికి క్లిఫ్ హేంగర్ మూమెంట్ ఎఫెక్టు లేదు. అందులో ఆత్రుత, ఉత్కంఠ, రెండో భాగం ఇప్పుడే చూడాలన్న ఆసక్తి- నీటి కొండ మీద ఏముందో చూడాలన్న శివుడికి లాంటి లాజికల్- ఎమోషనల్ తహతహా ఏవీ లేకుండా పోయాయి. లేకపోగా ప్రేక్షకుల్ని తెల్లబోయేట్టు చేసింది ఈ ట్విస్ట్ తో ముగింపు!

          ఇలాటి మహాచిత్రరాజాలకి మేకింగ్ కోసమే కాకుండా హైటెక్ సాంకేతికుల అవసరం రైటింగ్ కి కూడా ఉండాలేమో!  


సికిందర్