స్క్రీన్ ప్లే - దర్శకత్వం : దేవ కట్టా
తారాగణం : మంచు విష్ణు, ప్రణీత, జెడి చక్రవర్తి, రాజారవీంద్ర
నాగినీడు తదితరులు
మాటలు: బివిఎస్ రవి, కథ: 24 ఫిలింఫ్యాక్టరీ,
సంగీతం: అచ్చు, కెమెరా: సతీష్ ముత్యాల,
ఫైట్స్: విజయన్
బ్యానర్ : 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , నిర్మాత : మంచు విష్ణు
విడుదల : 4 సెప్టెంబర్, 2015
***
టాలీవుడ్ ఎప్పుడూ టూ లేటే. కొత్తదనం, భిన్న ప్రయోగం, వెరైటీ అనేవి ఇతర భాషల్లో కన్పిస్తేనే తెలుగులో అనుమతిస్తారు హీరోలు. ఒరిజినల్ గా తెలుగులో అలాటి వెరైటీ, భిన్నప్రయోగం, కొత్తదనం వున్న సబ్జెక్టు ఏ దర్శకుడు వెళ్లి చెప్పినా నవ్వి పోతారు- వెళ్ళు వెళ్ళవయ్యా నేనే దొరికానా కొంపలు ముంచడానికీ- అని తరిమేస్తారు. అలాటిదే ఏ తమిళంలోనో ఓ హిట్ కన్పిస్తే వెంటనే దాన్ని సొంతం చేసేసుకుంటారు నటించడానికి. కాబట్టి తెలుగు సినిమా దర్శకులు ఒరిజినాలిటీ జోలికెళ్ళక అవే పాత మూస కథలు తయారు చేసుకుని తిరగడానికి కారకులెవరో ఈ పాటికి తెలిసిపోయే వుంటుంది..హీరోలు ప్రేక్షకులకి ఒక కొత్త దనాన్ని అందించడానికి ఎప్పుడో అవతలి భాషల్లో వచ్చినప్పుడే టూ లేటుగా తెల్లారాలి...అరవ సినిమాల్లో అరువు వెరైటీ పట్టుకొచ్చి ఇదే మా సాహసం అని ప్రకటించుకోవాలి. అప్పుడు దర్శకులు నవ్వాలో ఏడవాలో తెలీక తూర్పుకి తిరిగి దణ్ణం పెట్టుకోవాలి!!
కానీ మంచు వారసులు వేరు. అప్పుడప్పుడైనా వెరైటీ నివ్వడానికి
ప్రయత్నిస్తున్నారు. మంచు విష్ణు ఇప్పటికే
‘రౌడీ’, ‘అనుక్షణం’, ‘ఎర్ర బస్సు’, ప్రస్తుతం ‘డైనమైట్’ లాంటి తెలుగు ఒరిజినల్ వెరైటీలతో బాటు తమిళ రీమేకులూ
ఇస్తున్నాడు. మంచు మనోజ్ ‘నేను మీకు తెలుసా’, ‘వేదం’, ప్రస్తుతం ‘ఎటాక్’ లాంటి
తెలుగు వెరైటీలు, మంచు లక్ష్మి ‘గుండెల్లో గోదారి’, ‘చందమామ కథలు’, ‘దొంగాట’ లాంటి
తెలుగు వెరైటీలూ ఇస్తున్నారు. ఈ ముగ్గురూ మళ్ళీ ఒకరిద్దరు తమిళ డైరెక్టర్ ల వైపు, తమిళ రీమేకుల
వైపూ మొగ్గారనేది కూడా నిజమే.
తమిళ టాప్ దర్శకుడు ఎ ఆర్ మురుగ దాస్ అసిస్టెంట్ ఆనంద్ శంకర్ అనే ఇంజనీరు, న్యూయార్క్ ఫిలిం
అకాడెమీ విద్యార్థి చేసిన తొలి విజయవంతమైన ప్రయత్నం ‘అరిమా నంబి’ ని తెలుగులో మంచు
విష్ణు హీరోగా, దేవకట్ట దర్శకుడుగా, ‘డైనమైట్’
గా రీమేక్ చేసినప్పుడు, ఇది కొత్తదనంతో ఉందా, రొటీనే అన్పించుకుందా ఈ కింద
చూద్దాం.. ఎంత కొత్త ట్రీట్ మెంట్ తో, టెక్నాలజీతో తీసినా విషయపరంగా ఈ థ్రిల్లర్
స్థిరపడ్డ పాత మూసలోనే వుంటే, తీసి ప్రయోజనం ఉంటుందా?
మెక్ గఫిన్ మంత్రం?
ఓ డిజిటల్ మార్కెటింగ్ సెల్ఫ్ ఎంప్లాయెడ్ యూత్ నని చెప్పుకునే
శివాజీ ( విష్ణు) అనే అతను నడి రాత్రి
రోడ్డు మీద ఒకమ్మాయిని టీజ్ చేస్తున్న గ్యాంగ్ కి బుద్ధి చెప్పి, అనామిక అనే
స్టూడెంట్ (ప్రణీత) దృష్టిలో పడతాడు. ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపి ఫోన్ నంబర్ కూడా తీసుకుంటుంది.
రెండో రోజే పబ్ లో వైన్ పుచ్చుకోవడంతో మొదలై, ఆమె ఫ్లాట్ లో వోడ్కా సేవనంతో ప్రేమగా
మారుతుందా పరిచయం. అప్పుడు అకస్మాత్తుగా ఓ గ్యాంగ్ ఎటాక్ చేసి ఆమెని కిడ్నాప్ చేసి
తీసికెళ్ళి పోతారు.
శివాజీ ఆమెని రక్షించడంలో విఫలమై పోలీసులని
ఆశ్రయిస్తాడు. పోలీసు అధికారి ( నాగినీడు)
వచ్చి చూస్తే శివాజీనే అనుమానించేలా వుంటుంది పరిస్థితి. ఫ్లాట్ లో కిడ్నాప్
జరిగిన వాతావరణమే వుండదు. సెక్యూరిటీ గార్డ్ మాటలు కూడా దీనికి బలం చేకూరుస్తాయి. ఈ
మిస్టరీ ఛేదించడానికి ఇక తనే పూనుకుంటాడు శివాజీ. అనామిక తండ్రి (పరుచూరి వెంకటేశ్వర రావు) ఓ ఛానెల్ కి బాస్
అని తెలుసుకున్న శివాజీ, అతడి ఇంటి కెళ్ళే సరికి కిడ్నాప్ గ్యాంగ్ తో బాటు, ఒక సీఐ
అక్కడికొచ్చి ఛానెల్ బాస్ ని
బెదిరిస్తారు. కూతురు క్షేమంగా తిరిగి రావాలంటే తన దగ్గరున్న మెమెరీ కార్డు
ఇచ్చేయాలని.
ఆ మెమరీ కార్డులో కేంద్ర మంత్రి రిషీదేవ్ ( జేడీ చక్రవర్తి) కి
సంబంధించిన రహస్య ముంటుంది. అది ప్రసారం చేయకుండా తమ కిచ్చేయాలని బెదిరిస్తారు. ఆ
మెమరీ కార్డు ఛానల్ ఎడిటర్ దగ్గరుందంటాడు ఛానెల్ బాస్. ఘర్షణపడి ఆ బాస్ ని చంపేసి-
తెల్లారే ఎడిటర్ ని కూడా చంపేసి మెమరీ కార్డుతో పారిపోతాడు గ్యాంగ్ లీడర్ (రాజా
రవీంద్ర ).
శివాజీ ఆ గ్యాంగ్ ని వెంటాడి అనామికని విడిపించుకోవడంతో బాటు,
ఆ మెమరీ కార్డుని చేజిక్కించు కుంటాడు. అప్పుడా గ్యాంగ్ లీడర్ ని చంపేసిన
మినిస్టర్ అసలు గ్యాంగ్ నేరుగా రంగంలోకి దిగుతుంది. లాభంలేక స్వయంగా మినిస్టర్ రిషీదేవే వచ్చేసి పోలీసులని తన ఆదుపాజ్ఞల్లోకి తెచ్చుకుని,
శివాజీ- అనామికలని చంపించేసి మెమరీ కార్డు సాధించుకోవాలని ఆపరేషన్ మొదలెడతాడు.
ఇదీ విషయం. ఒక మెమరీ కార్డ్- ఒక ఛానెల్ బాస్- ఒక మంత్రి- ఇంకో
హీరో -అనే ఫార్ములా చట్రంలో ఎన్నో సినిమాలు వచ్చేశాయి. మరి ఈ సినిమాలో ఏమిటి తేడా?
ఆ తేడా కోసం ఏమైనా ప్రయత్నించారా అన్నది స్క్రీన్ ప్లే సంగతుల్లో చూద్దాం.
ఎవరెలా చేశారు
ఒరిజినల్లోని హీరోలాగే తన లుక్ ఉండాలనీ, అలాగే నటించాలనీ రిమేక్ హీరో
అనుకోవాలని లేదు. కానీ మాతృకలో ఒరిజినల్ గా సృష్టించిన ( హిట్టయిన) పాత్రకి
కొన్ని మూలాలు వుంటాయి. వాటి ఆధారంగానే పాత్ర, ఆ పాత్ర చిత్రణ, దాంతో అలాటి ఫీల్
వున్న కథా ఏర్పడతాయి. సినిమాకి ఫీల్ ని తీసుకొచ్చేది కథ కాదు, హీరో పాత్ర చిత్రణ. హీరోయే
కథకి ఫీల్ ని తీసుకొస్తాడు. యాక్షన్ సినిమాలకి ఫీల్ ని తన శారీరక దారుఢ్యంతో మాత్రమే
హీరో తీసుకు రాలేడు. కేవలం శారీరక దారుఢ్యంతో
ప్రేక్షకులతో కనెక్ట్ కాలేడు. ఇది
రాం గోపాల్ వర్మ హిందీలో తీసిన ‘జేమ్స్’ తో రుజువయ్యింది. శారీరక దారుఢ్యానికి
మించిన పాత్ర మూలాలుంటాయి. ఆ మూలాల్లో జీవం వుంటుంది. ఆ జీవం ఒరిజినల్లో ఈ పాత్ర
పోషించిన నడిగర్ తిలగం శివాజీగనేశన్ మనవడు విక్రం ప్రభు పాత్రకి వుంది. అతను సామాన్యుడు.
తమిళంలో టైటిల్ ( అరిమా నంబి) కూడా ‘జంటిల్మన్ -కానీ సింహమంత శక్తిగల వాడు’
అన్న అర్ధంలో వుంది. జంటిల్మన్ అనడంలోనే అతడి జీవితం తెలిసిపోతోంది. అలాటి వాడు -
వెరీ బ్యాడ్ బ్యాడ్ మ్యాడ్ పొలిటికల్ వరల్డ్ తో పెట్టుకోవాల్సి రావడం ఒక ఐరనీయే. ఈ
కాంట్రాస్ట్ -అంటే, బలవంతుడైన రాజకీయ నాయకుడితో సామాన్యుడైన ఒక జంటిల్మన్ తలపడడం
అనే సమీకరణే ఒరిజినల్ కి తీసుకొచ్చిన
తిరుగులేని ఫీల్.
రీమేక్ లో ఈ సమీకరణని
పట్టించుకోలేదు. ఇక్కడ రాజకీయ నాయకుడూ
బలవంతుడే, హీరో కూడా బలవంతుడే- దీంతో హీరో సృష్టించుకోవాల్సిన ఫీల్ కీ, సానుభూతికీ
స్థానం లేకుండా పోయింది. ఫీల్ లేని
యాక్షన్ హంగామాగా సాగిపోయింది మంచు విష్ణు నటన సాంతం.
ధైర్యం గురించి ఓషో రజనీష్ ఒక ఆసక్తికర పరిశీలన చేశాడు : భయం లేకపోవడం ధైర్యం కాదు, ధైర్యవంతులు నిలువెల్లా పిరికిపందలు తప్ప మరేం కాదు. ధైర్యం, పిరికితనం ఈ రెండూ భయమనే ఒకే నాణానికి రెండు ముఖాలు. కాబట్టి భయాన్ని తొలగించుకుంటే పిరికితనమూ ధైర్యమూ రెండూ వుండవు. ఈ రెండూ లేని స్థితినే మనిషి సాధించాలి. అలాగే, ధైర్యమంటే భయం లేకపోవడం కాదు. అది తనలోని భయానికి పకడ్బందీగా రక్షణ కల్పించుకోవడం. భయమనేది తొలగిపోతే అసలు భయపడడమే వుండదు. భయపడని వ్యక్తి ఇంకెవర్నీ భయాందోళనలకి గురి చెయ్యడు. అలాగే ఎవరూ తనని భయపెట్టడాన్ని అంగీకరించడు!
పై పరిశీలన సినిమాల్లో హీరోలకీ, విలన్ల కీ ఇద్దరికీ వర్తిస్తుంది. పాత్రలు జీవంతో ఉండాలంటే ఇలాటి పరిశీనలు తప్పని సరి కావొచ్చు. కాబట్టి మంచు విష్ణు పాత్ర తొలినుంచీ అంత దారుఢ్యంతో ధైర్యశాలిగా వుందంటే, లోలోపల ఏవో భయాలు వుండే తీరాలి. ఏమిటవి? దీన్ని ఆ పాత్రకి కల్పిస్తే పాత్రచిత్రణలో లోపం తొలగిపోయి- ఫీల్ పుట్టుకొచ్చే అవకాశం వుండేది.
మంచు విష్ణు తన పాత్ర విలక్షణం గా కన్పించడం కోసం, చేతిమీద లాంగ్ టాటూ పొడిపించుకోవడం, బ్యాంకాక్ లో ఫ్రీ స్టయిల్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం, ఐరన్ బాడీ తో కొమ్ములు తిరిగిన ఫైటర్ గా కన్పించడం ఇదంతా పాత్ర మూలాల్ని చెరిపేశాయి.
మాతృక తీసిన దర్శకుడు ఈ పాత్రని ఇలా ఊహించి ఉండడు. కనుకే సామాన్యం గా కన్పించే విక్రం ప్రభుని
తీసుకున్నాడు. విక్రం ప్రభు ఏమీ ఈ పాత్రకోసం ఫైటర్ గా తర్ఫీదు పొంది రాలేదు. ఒక
మర్యాదస్తుడైన, మృదుభాషి అయిన బాయ్ ఫ్రెండ్ పాత్ర, కరుడు గట్టిన యాక్షన్ హీరోగా
ఎందుకు మారాల్సి వచ్చిందో క్యారక్టర్ ఆర్క్ సహితంగా చూపిస్తూ సాగే చిత్రణ
ఇది. ఇక్కడ్నించీ ఫీల్ పుట్టింది.
మంచు విష్ణు పాత్ర ఎలా వున్న హీ- మాన్ స్టేచర్ తో అలాగే సాగి ముగుస్తుంది.
క్యారక్టర్ ఆర్క్ లేదు. లేనప్పుడు ఫీల్ లేదు. కేవలం మరమనిషిలా యాక్షన్ హంగామా
సృష్టించడమే. ఇది సగం సినిమాకి హాని
చేసింది, మిగతా సగం హాని ఎక్కడ జరిగిందీ స్క్రీన్ ప్లే సంగతుల్లో చూద్దాం.
సినిమా ప్రారంభమే రోడ్డు మీద అమ్మాయిని టీజ్ చేస్తూంటే, హీరోయిన్ కాపాడే వాళ్ళే లేరా అన్నప్పుడు, హీ- మాన్ లా హీరో ఎంట్రీ ఇచ్చి, డైలాగులు కొట్టి, ఆ గ్యాంగ్ ని తన్నడమనే, దాంతో హీరోయిన్ ప్రేమలో పడ్డమనే, ఏమాత్రం ఆసక్తి కల్గించని పాత మూసగా వుండడం విచారకరం.
దీనికి ప్రతిగా తమిళంలో,
హీరో ఫ్రెండ్స్ తో కలిసి పబ్ లో డీసెంట్ గా డ్రింక్ చేస్తూ కబుర్లాడుతూంటే
హీరోయిన్ రావడమనే క్లాస్ ప్రారంభంగా వుంటుంది. సూటిగా చెప్పాలంటే తమిళంలో క్లాస్
క్యారక్టర్ కాస్తా, తెలుగులో అదే పాత మూస మాస్ క్యారక్టర్ గా మారిపోయింది. మరి
అన్ని మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్
వున్నవాడు ఆ రంగంలోనే కృషి చేయకుండా,
డిజిటల్ మార్కెటింగ్ కి ఎందుకు వచ్చాడో
పొంతన వుండదు. తమిళంలో హీరో బీ ఎం డబ్ల్యూ
కార్ల షోరూం లో పనిచేస్తూంటాడు. ఆ ఉద్యోగం కోసం అతను కండలు పెంచుకుని రాలేదు.
దర్శకుడు దేవకట్టా- హీరో కారు వెంట లూజ్ గా పరిగెడుతూంటే
చూడ్డానికి బావుండదు కనుక, మంచు విష్ణుకి
ఆ ఎత్తున ఫిజికల్ ట్రైనింగ్ సజెస్ట్ చేశామన్నారు. నిజానికి గర్ల్ ఫ్రెండ్
ని ఎత్తుకుపోతూంటే, ఆ షాక్ లోంచి తీరుకుని,
సామాన్యుడైన హీరో అలా లూజ్ గా పరిగెత్తడమే సబబు. అప్పుడే అతను
వీర హీరో ఐపోలేదు- కథాక్రమంలో దానికింకా సమయం వుంటుంది.
ఫ్లాట్ లో తను బాత్రూం లో వున్నప్పుడు అవతలి గదిలో కిడ్నాప్
జరుగుతోంటే, హీరో పరుగెత్తుకొచ్చి ఏంచేయాలో తోచక అటూ ఇటూ కొంత కాలయాపన చేస్తాడు.
తమిళంలో ఆ పాత్రకి అది సరిపోయింది. తెలుగులో మార్చిన మంచు విష్ణు పాత్రకీ అదే
చిత్రణ ఎలా సరిపోతుంది- నడిరోడ్డు మీద ఒకమ్మాయిని టీజ్ చేస్తూంటే అంత కండబల
ప్రదర్శనతో బుద్ధి చెప్పిన వాడు, తన గర్ల్
ఫ్రెండ్ ని అదే మెరుపు వేగంతో కాపాడుకో లేడా? ఇక్కడే పాత్ర ఫెయిలయ్యింది.
కాబట్టి సినిమా ప్రారంభ దృశ్యాన్ని అనాలోచితంగా మార్చినట్టే
తెలిసిపోతోంది. హీరో పాత్రకి అలా ఎంట్రీ ఇచ్చాక, ఇక అలాగే ముందుకెళ్ళ లేని ఉచ్చులో
పడ్డట్టయ్యింది. ఒక సినిమాని రీమేక్
చేసేప్పుడు ఆ ఒరిజినల్ దర్శకుణ్ణి కూర్చో బెట్టుకుని, అతడి గొడవేంటో ఎందుకలా
తీశాడో, ఆ తీయడం వెనుక మతలబు లేంటో, రెసిపీ ఏంటో అంతరార్ధం తెలుసుకుని- తీస్తే
మంచిదేమో!
మొత్తానికి ఫైట్లూ డాన్సులూ టార్గెట్ చేసుకుని మాత్రమే మంచు
విష్ణు ప్రేక్షకుల్ని మెప్పించడానికి ప్రయత్నించాడు.
హీరోయిన్ ప్రణీతది గ్లామర్
పాత్ర. హీరోతో బాటు శత్రువుల నుంచి తప్పించుంటూ వుండే యాక్షన్ పాత్ర. అలాగని
ఫైట్లు లేవు, గుర్తుంచుకోవడానికి ఒక్క సీనూ లేదు.
డిటో తమిళం.
ఇక సతీష్ ముత్యాల ఛాయాగ్రహణం లో
కొత్తదనమేమీ లేదు. మాతృకలో ఆర్డీ రాజశేఖర్
ఫీల్ ని మెయిన్ టెయిన్ చేస్తూ సృష్టించిన విజువల్ ట్రీట్ వేరు. సినిమాకి
విజయన్ మాస్టర్ హెవీ డ్యూటీ యాక్షన్ దృశ్యాలే హైలైట్. బివిఎస్ రవి మాటలు రెండు
మూడు బలమైన సన్నివేశాల్లో పకడ్బందీగా వున్నాయి.
స్క్రీన్ ప్లే సంగతులు
తమిళంలో హిట్టయిందల్లా బంగారం కాదు. దాంట్లోనూ బోలెడు మైనస్ లుంటాయి. ‘డైనమైట్’ మాతృక ‘అరిమా నంబి’ విషయ పరంగా రొటీన్ యాక్షన్ థ్రిల్లరే. దేనికోసం యాక్షన్ అనేది పాతకాలం నుంచీ వస్తున్న వ్యవహారమే. ఒక సీడీ కోసమో, టేప్ కోసమో, ఇంకా దేని కోసమో విలన్లూ హీరోలూ సాగించే పోటాపోటీ వేట అనే ఫార్ములా, ఫార్ములా సినిమాలంత పాతదే. ఇంత పాత దనాన్ని కూడా తమిళ ప్రేక్షకులు మోశారంటే ఆ హీరో కల్గించిన ఫీల్ వల్ల కావొచ్చు. ఎమోషన్ బలంగా వుంటే రొటీన్ ఫార్ములా కూడా సక్సెస్ కి లొంగి వస్తుంది. తమిళంలో ఇదే జరిగి వుంటుంది. లేకపోతే విషయపరంగా సవాలక్ష లోపాలున్న ఈ సినిమా హిట్ కాకూడదు.
తెలుగులో అలాటి ఫీల్ ని క్రియేట్ చేయకపోవడంవల్ల ఆ లోపాలే కొట్టొచ్చి
నట్టు పైకి తేలి, సెకండాఫ్ ని దెబ్బతీశాయి. స్క్రీన్ ప్లేలో ప్రధానంగా కథనపరమైన ఒక
లోపం, ఫస్టాఫ్ లో అడ్డుకట్ట వేయకపోవడం వల్ల, సెకండాఫ్ లో బయట పడి బలహీనపర్చింది.
ఆ లోపం ప్లాట్ డివైస్ గా వాడుకున్న మెమరీ కార్డుని అ నాదిగా
వస్తున్న పద్ధతిలోనే ప్రయోగించడం.
మెమరీ కార్డ్ అనే ప్లాట్ డివైస్ తో మార్పు లేని అదే ఫార్ములా
కథనం చేయడం.
ఈ మెమరీ కార్డుతో గొడవ ఎంతసేపు ఆసక్తిని నిలుపుతుంది?
ఏం సస్పెన్సుని సృష్టిస్తుంది?
ఓ మంత్రి హత్య చేశాడు.. ఆ సీడీ హీరోకి దొరికింది.. ఆ సీడీ కోసం మంత్రి అనుచరులు వెంట బడ్డారు..
కొట్టుకున్నారు.. చంపుకున్నారు.. తప్పించుకున్నారు.. ఆ సీడీ ని చివరికి
ప్రపంచానికి బట్టబయలు చేశాడు హీరో.. మంత్రి కటకటాల వెనక్కి పోయాడు- బాపతు సినిమాలు
ఎన్ని సార్లు చూడలేదు?
పోనీ ఆ సీడీ లో ఏముందో సస్పెన్స్ కోసం అట్టి పెట్టుకుని,
చిట్ట చివరికి రివీల్ చేసినప్పుడు, ఆ రహస్యం ఎంత షాకింగ్ గా వుండాలి? అంత షాకింగ్ గా
ఉన్నప్పుడే అంత సేపూ ఆ సీడీ కోసం సాగిన రొటీన్ కథనాన్ని అది మరిపించ గల్గుతుంది. ఇలాటిదేమీ లేకుండా రొటీన్ కథనాన్నే
నడిపించి, మళ్ళీ చప్పగా తేలే రొటీన్ రహస్యాన్నే రివీల్ చేస్తే, షాక్ వేల్యూ
ఏముంటుంది? మొత్తం సినిమానే చప్పగా
తేలిపోతుంది.
బహుశా తమిళ మాతృకకి
1995 లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తందూరీ మర్డర్ కేసు స్ఫూర్తి
కావొచ్చు. భార్య నైనా సహానీ అక్రమసంబంధం పెట్టుకుందన్న అనుమానంతో కాంగ్రెస్
ఎమ్మెల్యే సుశీల్ శర్మ పిస్తోలుతో కాల్చి
చంపి, ఆ శవాన్ని న్యూ ఢిల్లీ లోని ఓ రెస్టారెంట్ కి తీసికెళ్ళి, తందూరీ చికెన్
చేసే పొయ్యిలో వేసి బూడిద చేశాడు. ప్రస్తుత సినిమాలో కేంద్ర మంత్రి ఢిల్లీలో ప్రియురాల్ని చంపి, గ్యాస్ స్టవ్
ప్రమాదం సృష్టించి నేరాన్ని కప్పి పుచ్చుతాడు.
ఈ రొటీన్ పాయింటే క్లయిమాక్స్ లో ఆ మెమరీ కార్డులో రివీలవుతుంది. కొత్తదనం
లేదు, షాక్ వేల్యూ లేదు.
ఈ సినిమాలో ఇంటర్వెల్ కి ముందు హీరో చేతి కొచ్చే ఆ మెమరీ కార్డులో అసలేముందో తెలిసేది క్లయిమాక్స్ లోనే. దీంతో అంతవరకూ
సెకండాఫ్ మళ్ళీ ఆ మెమరీ కార్డు కోసం సాగే హోరాహోరీ రిపీట్ అవుతూ- రోల్ అవుతూ-
సాగతీతగా సాగుతూనే వుంటుంది. తీరా అది
రివీల్ అయ్యేసరికి ఉస్సూరుమని పాత విషయమే!
అలా రివీల్ అయినప్పుడు షాకింగ్ గా ఉండాలంటే ఏం చేయాలి? సీన్
రివర్సల్ చేయాలి. సపోజ్, ఆ దృశ్యాలు సాక్షాత్తూ హీరో తండ్రినే మంత్రి చంపుతున్నవై
యుంటే ఎలావుంటుంది? అదీ సీన్ రివర్సల్ తో షాక్ వేల్యూ అంటే! కథలో ఏం జరిగినా హీరోకే జరగాలి. హీరోకే రివర్స్ అవాలి.
అప్పుడే దాని ఎఫెక్ట్ ప్రేక్షకుల మీద వుంటుంది. ప్రేక్షకులు డైరెక్టుగా హీరోని
ఫాలో అవుతూ సినిమా చూస్తారు కాబట్టి- హీరోకి అలాటి అనుభవాలు ఎదురవ్వాలి. విలన్ ని
ఫాలో కాని ప్రేక్షకులు అతడి వ్యక్తిగత జీవితంలో ఏం జరిగినా రియాక్ట్ కారు. దానికి
హీరోతో సంబంధం ఉన్నప్పుడో, లేదా విశాల ప్రాతిపదికనవిలన్ మానవాళికే ముప్పు తలపెట్టినప్పుడో, విలన్
పట్ల ప్రేక్షకులు రియాక్ట్ అవుతారు.
కనుక ఈ సినిమాలో చూపించినట్టు- ఎవరో మంత్రి ప్రియురాలు చస్తే ప్రేక్షకులెందుకు
కేర్ చేస్తారు? హూ ఈజ్ షీ ఆఫ్టరాల్? హీరో చెల్లెలు కూడా కాదు.
ఒకవేళ సీన్ రివర్సల్ నచ్చనప్పుడు- ఈ ప్లాట్ డివైస్ ( మెమరీ
కార్డు) తో మొత్తం స్కీమునే మార్చెయ్య వచ్చు. ఏమిటా స్కీము? అదే మెక్ గఫిన్
టెక్నిక్!
***
మెక్ గఫిన్ టెక్నిక్...
డిటెక్టివ్, క్రైం, అడ్వెంచర్ కథా
సాహిత్యాల్లో 19వ శతాబ్దం నుంచే ఆంగ్లంలో ఈ ప్లాట్ డివైస్
ప్రయోగం వుంది. సినిమాల్లో సస్పన్స్ బ్రహ్మ ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ దీన్ని ప్రవేశపెట్టి
మార్గదర్శకుడయ్యాడు. 1935 లో తీసిన ‘39 స్టెప్స్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ లో
‘మెక్ గఫిన్’ ని ప్రయోగించాడు. ఈ మెక్ గఫిన్ ఏమిటో,
దీని పూర్వాపరాలేమిటో, ఆతర్వాత 1939 లో కొలంబియా
యూనివర్శిటీలో ఒక సుదీర్ఘమైన లెక్చరే ఇచ్చాడు.
ప్రయోగం వుంది. సినిమాల్లో సస్పన్స్ బ్రహ్మ ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ దీన్ని ప్రవేశపెట్టి
మార్గదర్శకుడయ్యాడు. 1935 లో తీసిన ‘39 స్టెప్స్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ లో
‘మెక్ గఫిన్’ ని ప్రయోగించాడు. ఈ మెక్ గఫిన్ ఏమిటో,
దీని పూర్వాపరాలేమిటో, ఆతర్వాత 1939 లో కొలంబియా
యూనివర్శిటీలో ఒక సుదీర్ఘమైన లెక్చరే ఇచ్చాడు.
మెక్ గఫిన్ అనే చొప్పదంటు పేరు ఆ ఎలిమెంట్ గురించి
పిచ్చాపాటిగా ఓ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు పుట్టింది. హిచ్ కాక్ వృత్తాంతం
ప్రకారం- ఇద్దరు వ్యక్తులు రైల్లో
ప్రయాణిస్తూంటారు. ఒకతను ‘ఏంటోయ్, ఆ బ్యాగేజీ ర్యాక్ లో ఆ ప్యాకేజీ
ఏంటదీ?’ అని అడుగుతాడు. ‘అదా, అదీ మెక్ గఫిన్ లేవో, నోర్మూసుకో’ అంటాడు
రెండో అతను. ‘నోర్మూసుకోవాల్నా? మెక్ గఫిన్నా? మెక్ గఫిన్ ఏంటయ్యా బాబూ, కాస్త
ఎక్స్ ప్లెయిన్ చేసి చావు- అలాగే నోర్మూసుకుంటా’ అంటాడు మొదటి అతను.
దీనికి రెండో అతను -‘అదిగో- ఓ..అక్కడా ...అక్కడ స్కాటిష్ హైలాండ్స్ లేవూ, ఆ
స్కాటిష్ హైలాండ్స్ లో సింహాల్ని పట్టే ఉచ్చు లాంటిదన్నమాటలే మెక్ గఫిన్ అంటే ’ అని వివరిస్తాడు.
‘పోవోయ్, ఎటకారమా? స్కాటిష్ హైలాండ్స్ లో సింహా లెక్కడ చచ్చాయని?’ అని
మొదటి అతను ఇంతెత్తున లేస్తాడు. ‘లేవుకదా? మరయితే మెక్ గఫిన్ కూడా లేనట్టే,
నోర్మూసుకుని కూర్చో!’ అని దబాయిస్తాడు రెండో అతను. అంటే తేలిందేమిటంటే,
మెక్ గఫిన్ అనేది ఉత్తుత్తి బూచి అన్నమాట.
గబ్బర్ సింగ్ లేకపోయినా, అదిగో గబ్బర్ సింగ్ వస్తాడు- అని పిల్లల్ని భయపెట్టడం
లాంటిదన్నమాట!
ఐతే కథల్లో నిజం చెయ్యడం గురించే బూచిని ప్రయోగిస్తారు.
ఉదాహరణకి- ఒక కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారికి నేర
స్థలంలో ఒక ఆధారం కన్పిస్తున్నా దానిమీద దృష్టి పెట్టలేదు అనుకుందాం, ప్రేక్షకులు
కూడా దాన్ని పట్టించుకోకుండా- ఆ అధికారి కనుగొన్న ఇంకేదో క్లూనే పట్టుకుని ఫాలో
అవుతున్నారనుకుందాం...కేసు నడిచీ నడిచీ ఆ క్లూ ఎంతకీ పనికి రాకపోయేసరికి- అప్పుడా అధికారికి నేర
స్థలంలో ఉపేక్షించిన ఆ ఆధారం తళుక్కున మెరిసిందను కుందాం- అదే కీలకసాక్ష్యాధారం!
కేసుకి అదే అవసరమని అప్పుడు తెలిసి రావడమనే ప్లేనే -మెక్ గఫిన్ టెక్నిక్! విలువ
లేనిది అనుకున్నదే తర్వాత విలువ సంతరించుకోవడం! కాకపోతే దీన్ని జాగ్రత్తగా ప్లే
చేయాలి- ప్రేక్షకులకి ఏమాత్రం అనుమానం రాకూడదు.
సినిమాల్లో ఈ ‘బూచి’ ని ఫస్ట్ యాక్ట్ ( బిగినింగ్) లో ప్రేక్షకులకి
అనుమానం రాకుండా ప్రయోగించి, థర్డ్ యాక్ట్ (ఎండ్) లో తెరపైకి తీసుకొచ్చి
గొప్ప ట్విస్టు ఇస్తారు.
***
మెక్
గఫిన్ ని ప్రయోగించినప్పుడు దాన్ని ప్రేక్షకులు కేర్ చేయకూడదని హిచ్ కాక్ అంటాడు.
మెక్ గఫిన్ ని రివీల్ చేసినప్పుడు అది డైనమైట్ లా పేలాలని జార్జి
లుకాస్ అంటాడు.
నిజానికి ‘డైనమైట్’ సినిమా టైటిల్ ఈ మెక్ గఫిన్ ని దృష్టిలో
పెట్టుకునే పెట్టాల్సింది..
అప్పుడీ సినిమా కథనం ఇలా ఉండొచ్చు : హీరోయిన్ కిడ్నాపయ్యింది,
ఆమె తండ్రి మర్డరయ్యాడు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో హీరోకి తెలీదు, హీరోయిన్ ని
రక్షించుకుని, కిడ్నాపర్ ని చంపినప్పుడు ఆ లాడ్జిలో అక్కడే పడున్న బ్లాక్ చిప్ ని చూసుకోలేదు (మెక్
గఫిన్ ప్రయోగం) , ప్రేక్షకులు కూడా గమనించలేదు...ఇంటర్వెల్ తర్వాత, హీరో
కారణాలు అన్వేషిస్తూంటే అతణ్ణి చంపడానికి గ్యాంగ్ వెంటపడింది, తనకేం సంబంధమో అర్ధం
గాలేదు, ప్రాణాలు కాపాడుకుంటూ హీరోయిన్ తో పారిపోవడం చేశాడు, ఎప్పుడో లాడ్జి సీను
మెదిలింది, అక్కడికి పరిగెత్తాడు, అక్కడ పడున్న మెమరీ చిప్ ని చేజిక్కించుకున్నాడు
(మెక్ గఫిన్ రివీల్), కారణాలు అర్ధమయ్యాయి, ఇప్పుడా కార్డులో ఏముందో
చూడాలి- చూస్తే అందులో విషయం చాలా షాకింగ్ గా వుంది.. క్లయిమాక్స్ ప్రారంభమయ్యింది...
అంటే మెమరీ కార్డుని అంతసేపూ దాచి పెట్టడం వల్ల, దానికోసం
రొటీన్ వేటగా ప్రేక్షకులకి బోరు కొట్టదు. అది క్లైమాక్స్ లోనే రివీలయ్యి, కొత్త
ట్విస్టుతో కొత్త విషయాన్ని మోస్తూ, ఆడియెన్స్ కి కొత్త హుషారు పుట్టిస్తుందన్న
మాట!
ఎన్నో గొప్పవైన థ్రిల్లర్స్ లో ఈ మెక్ గఫిన్ చుట్టే
కథలల్లుతారు- లార్డ్ ఆఫ్ ది రింగ్స్, రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్, పల్ప్ ఫిక్షన్,
స్టార్ ట్రెక్, మిషన్ ఇంపాసిబుల్ మూడు పార్టులూ.. ఇలా చాలా వున్నాయి.
నిజజీవితంలో మెక్ గఫిన్- ఉదాహరణకి ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న
షీనా బోరా మర్డర్ కేసులో వుంది.
మూడేళ్ళ క్రితం రాయ్ గఢ్ అడవుల్లో ఒక సగం కాలిన శవం దొరికింది. అనాధ శవంగా దాన్ని ఖననం చేశారు. షీనాబోరా అనే యువతి తల్లి ఇంద్రాణీ ముఖర్జీయా తన కూతురు అమెరికాలో సెటిలయ్యిందని చెప్పుకొచ్చింది ఈ మూడేళ్ళూ. ఒక అక్రమ ఆయుధాల కేసులో ఆమె కారు డ్రైవర్ ని పోలీసులు ప్రశ్నిస్తున్నప్పుడు, షీనా బోరాని గురించి కక్కేశాడు ఆ డ్రైవర్. మూడేళ్లక్రితం తనూ, షీనా బోరా తల్లి, ఆమె రెండో భర్తా కలిసి షీనా బోరాని చంపి రాయ్ గఢ్ అడవుల్లో తగులబెట్టామని చెప్పేశాడు. షాకయ్యారు పోలీసులు- మూడేళ్ళ క్రితం ఆ డెడ్ బాడీని మెక్ గఫిన్ అనుకున్నారు! అదే ఇప్పుడు షీనా బోరా శవంగా రివీలయ్యింది! మెక్ గఫిన్ చక్కగా ప్లే అయ్యిందిక్కడ నిజజీవితంలో!
మూడేళ్ళ క్రితం రాయ్ గఢ్ అడవుల్లో ఒక సగం కాలిన శవం దొరికింది. అనాధ శవంగా దాన్ని ఖననం చేశారు. షీనాబోరా అనే యువతి తల్లి ఇంద్రాణీ ముఖర్జీయా తన కూతురు అమెరికాలో సెటిలయ్యిందని చెప్పుకొచ్చింది ఈ మూడేళ్ళూ. ఒక అక్రమ ఆయుధాల కేసులో ఆమె కారు డ్రైవర్ ని పోలీసులు ప్రశ్నిస్తున్నప్పుడు, షీనా బోరాని గురించి కక్కేశాడు ఆ డ్రైవర్. మూడేళ్లక్రితం తనూ, షీనా బోరా తల్లి, ఆమె రెండో భర్తా కలిసి షీనా బోరాని చంపి రాయ్ గఢ్ అడవుల్లో తగులబెట్టామని చెప్పేశాడు. షాకయ్యారు పోలీసులు- మూడేళ్ళ క్రితం ఆ డెడ్ బాడీని మెక్ గఫిన్ అనుకున్నారు! అదే ఇప్పుడు షీనా బోరా శవంగా రివీలయ్యింది! మెక్ గఫిన్ చక్కగా ప్లే అయ్యిందిక్కడ నిజజీవితంలో!
స్క్రీన్ ప్లే ని ఒక శాస్త్రంగా అంగీకరించగల్గితే, అదొక
మహాసముద్రం. నిత్యం దాన్ని మధిస్తున్న వాళ్ళకే ఇలాటి స్క్రిప్టింగ్ సమస్యలకి విశ్వసనీయ పరిష్కార
మార్గాలు దొరుకుతాయి. కానీ టాలీవుడ్ లో అధ్యయనం కంటే కూడా తాటాకు చప్పుళ్ళెక్కువ కదా! ఇలాటివి ఒప్పుకోరు!
ఇక ఒక ఇన్వెస్టిగేషన్ ఆధారిత థ్రిల్లర్ అన్నాక, లాజిక్ తో చెలగాటం
కుదరదు. లాజిక్ అవసరం లేదనుకుంటే వేరే మసాలా యాక్షన్స్ తీసుకోవచ్చు. కానీ మెదడుకి
మేతపెట్టే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్
పక్కా ప్రోఫెషనలిజాన్ని డిమాండ్ చేస్తాయి. లాజిక్ ని ఎగేస్తూ ఇష్టానుసారం
తీస్తామంటే ఆ దర్శకుడి మేధస్సు మీద జాలి కలుగుతుంది.
ఒరిజినల్లో వున్న లాజికల్ దోషాలు రీమేక్ లోనూ దొర్లాయి
:
1. ఫ్లాట్ లో కిడ్నాపే జరగనట్టు సీన్ని క్రియేట్ చేయడంలో సీఐ
ఉద్దేశమేమిటి? అంతగా హీరో కంప్లెయింట్ చేస్తే తను మేనేజ్ చేసుకోలేడా మిస్ లీడ్
చేస్తూ? ఊరికే ఏదో మిస్టీరియస్ బిల్డప్ కోసం అనవసరమైన సీను క్రియేట్ చేశారా?
2. కేంద్ర మంత్రి
గ్యాంగ్ తో సీఐ ఎప్పుడు, ఎందుకు కలిశాడు? ఢిల్లీలో కేంద్ర మంత్రి రెగ్యులర్
గ్యాంగ్, హైదరాబాద్ లో లోకల్ గ్యాంగ్ ని
మెమరీ కార్డ్ కోసం నియమించుకున్నాక, ఈ సీక్రెట్ ఆపరేషన్ (తన గుట్టు) ఎందుకు పోలీసులకి తెలిసేట్టు చేసుకోవాలి?
3. సెకండ్ హాఫ్ లో
కేంద్రమంత్రి తనే స్వయంగా రంగంలోకి దిగుతూ, ఇందులో పోలీసులు వద్దనుకున్నాం-
ఇప్పుడు వాళ్ళే అవసరమయ్యారని అనడమేమిటి? ప్రారంభంలోనే సీఐ లింకప్ అయ్యాడని తెలీదా?
4. బ్యాంకు సంఘటనలో
గ్యాంగ్ కారు రాంగ్ పార్కింగ్ చేసి వుంటే, ట్రాఫిక్ పోలీసులు దాని టైరుని లాక్ చేస్తారు. ఆ గ్యాంగ్ ని హీరో కారెక్కించుకుని
పారిపోయేటప్పుడు, ఆ టైర్ లాక్ తీయకుండా ఎలా స్టార్ట్ చేసి పోనిచ్చాడు?
5. హీరో తమని హైజాక్ చేసి తీసుకుపోతూంటే, కేవలం ముక్కు వరకూ
కర్చీఫ్ కట్టుకున్న అతణ్ణి, అదీ ఒకే
డ్రెస్సులో ఉంటున్న అతణ్ణి- గ్యాంగ్ గుర్తు పట్టలేరా?
6. బ్యాంకులో డబ్బు తెచ్చుకోవడానికి కిడ్నాపర్
కారు దిగుతూంటే అనుచరుడు కూడా వస్తానన డమేమిటి? ‘ఎందుకురా?’ అని కిడ్నాపర్
అడిగితే, ‘వూరికే’ అని- కారుదిగి పోవడమేమిటి? కారు దిగుతూ రివాల్వర్ని కారు డాష్
బోర్డులో పెట్టడమేమిటి? ఆ సమయంలో అది దగ్గర పెట్టుకుని ఉండాలికదా? డాష్ బోర్డులో
పెడితే మూత ఓపెన్ అయి, రివాల్వర్ రివీల్ అవడం పోలీసులు చూడ్డం కోసమా? ఆ రివాల్వర్
అనుచరుడి దగ్గరే వుంటే, హీరో వాళ్ళని హైజాక్ చేయడం కుదరదని ఇలా లాజిక్ ని కిల్
చేశారా? హాస్యాస్పదంగా లేదూ?
7. గండిపేటలో నివాస ముండే ఛానెల్ బాస్ ఇంటి ప్రాంతాల యాక్షన్ సీన్ జరిగితే,
హీరో పోలీసులకి కాల్ చేసి, పెద్దమ్మ
గుడిదగ్గర, రోడ్ నంబర్ 36 (జూబ్లీ హిల్స్) - అంటాడేమిటి?
8. లాడ్జి సంఘటనలో ఫోన్ మాట్లాడానికి కిడ్నాపర్ డాబా పైకి
వెళ్తాడు, హఠాత్తుగా లాడ్జి బిల్డింగ్ లో హీరోతో భారీయెత్తున కాల్పులతో చాలా సేపూ
యాక్షన్ జరుగుతుంది. అది ముగిసి హీరో హీరోయిన్ తో పారిపోయాక, డాబా మీదే వున్న కిడ్నాపర్
ఫోన్ సంభాషణ ముగించి కిందికి దిగి వచ్చి, జరిగింది అప్పుడే తెలిసినట్టు చూస్తాడేమిటి? అంతసేపూ అన్ని
శబ్దాలు వినపడనే లేదా? అతను యాక్షన్ లో పాల్గొంటే కథ మారిపోతుందని ఇలా లాజిక్ ని
ఎగేశారా?
9. కిడ్నాపర్ ఆ మెమరీ కార్డు సంపాదించి ఇవ్వడానికి ఢిల్లీ
గ్యాంగుతో రెండు కోట్ల రూపాయలకి బేరం మాటాడుకున్నాడు..అలాటి విలువైన కార్డు లాడ్జి
లో టేబుల్ మీద నిర్లక్ష్యంగా పారేసి, ఫోన్ మాట్లాడడానికి డాబా పైకి వెళ్తాడా?
హీరోకి ఆ కార్డు దొరకాలి కాబట్టి రెండుకోట్ల మొనగాడు కిడ్నాపర్ ని దద్దమ్మగా
చేశాడా దర్శకుడు?
10 ఫస్టాఫ్ లో ఇంకో మూడు గంటల్లో హైదరాబాద్ లో ఉంటానన్న కేంద్ర
మంత్రి, సెకండాఫ్ లో ఎప్పుడో 30 గంటలు గడిచాక అంత బిల్డప్ తో మొనగాడులా రావడం
నవ్వు తెప్పించడం లేదూ? సీన్స్ కి విశ్వసనీయత లేకపోతే ఇలాగే వుంటుంది.
11. కేంద్రమంత్రి హైదరాబాద్
కొచ్చి, పోలీస్ కంట్రోల్ రూమ్ లో మానిటరింగ్ చేస్తూ, కమిషనర్ సహా అందర్నీ పరిగెట్టిస్తూ,
హీరో హీరోయిన్ల కోసం వేటాడడం ఎలా సాధ్యం? ఈ తమాషా ప్రపంచం చూస్తూ కూర్చుంటుందా?
మీడియా కూడా చేతులు ముడుచుకు కూర్చుంటుందా?
12. కేంద్ర మంత్రి ఒకణ్ణి షూట్ చేయమంటే, ఆ పోలీస్ అధికారి అదేదో తన హయ్యర్ అఫీషియల్
ఆర్డర్ అయినట్టు షూట్ చేసేస్తాడేమిటి? నగర పోలీసులు కేంద్రమంత్రి ప్రైవేట్ సైన్యం
అయిపోయారా?
13. హీరో ఆ మెమరీ కార్డులో మ్యాటర్ ని యూ ట్యూబ్ లో అప్-లోడ్ చేయకుండా, సిటీ మొత్తం
45 నిమిషాలు ఇంటర్నెట్ కట్ చేయమని ఆదేశిస్తాడు కేంద్రమంత్రి. ఎంటిదిది? సినిమాటిక్
లిబర్టీకి కి కూడా హద్దుండాలి కదా?
14. అంత విలువైన మెమరీ కార్డుని సంపాదించుకున్న హీరో, దాన్ని
హీరోయిన్ కిచ్చేప్పుడు, నోట్ బుక్ పేజీల మధ్య పెట్టేసి అందించడమేమిటి? అది జారి
ఎక్కడైనా పడిపోదా? పాకెట్ లో పెట్టుకోమని జాగ్రత్త చెప్పవచ్చు కదా? అలా చెప్తే ఆ
తర్వాత ఆ కార్డు పోగొట్టుకునే సీను వుంటుంది కాబట్టి - ఆ సీను కుదరదనా కామన్
సెన్సుని ఎగేశారు?
15. అనుకున్నంతా అయ్యింది... ఆ నోట్
బుక్ పేజీల మధ్య అలాగే మెమరీ కార్డు పెట్టుకుని, హీరోయిన్ హీరోతో తప్పించుకుంటున్నప్పుడు-
ఎస్కలేటర్ మీద అది జారిపడి- ఎస్కలేటర్ పళ్ళ మధ్య ఇరుక్కుని - కసబిసా చితికిపోయింది!
ఇంతతెలివి తక్కువ చైల్డిష్ హీరో హీరోయిన్లకి, ఇంత భారీ యాక్షన్- అడ్వెంచర్ అవసరమా?
16. అంతిమంగా, కేంద్ర మంత్రిని స్టేడియం లో బంధించి హీరో ఏం సాధించాలనుకు
న్నాడు? గన్ పాయింట్ మీద అతణ్ణి బెదిరిస్తూ, నేరం ఒప్పుకోకుంటే చంపేస్తానని
అంటాడు- ఇదంతా గ్రాండ్ గా నేషనల్ ఛానెల్స్ లో టెలికాస్ట్ అయ్యేలా ఏర్పాటు చేసుకుని. అలా బెదిరించి
చెప్పించిన వాంగ్మూలం కోర్టులో చెల్లదని తెలీదా? కేంద్ర మంత్రికి శిక్ష పడే మాటేమో
గానీ, అతను నేరం ఒప్పుకోకపోతే చంపేసి- ఆ టెలికాస్టింగ్ కి తను మాత్రం హంతకుడిగా మొత్తం
దేశానికీ- ఆ తర్వాత చట్టానికీ ఖాయంగా దొరికిపోతాడు హీరో! ఇంత తెలివి తక్కువగా హీరో తన ఉచ్చు తనే
బిగించుకున్నాడు తప్ప- ఏం జరిగినా కేంద్ర మంత్రికి పోయేదేం లేదు. అతననుకుంటున్న
ప్రధానమంత్రి పదవిలోకి కులాసాగా వచ్చేస్తాడు.
17. ఆ బెదిరింపూ- చంపడాలూ మిస్సయి- ఇంకెక్కడికో మారుతుంది
స్థలం. అక్కడ హీరో మీద పైచేయి సాధించిన కేంద్రమంత్రి, అతన్ని చంపబోతూ- నేనే ఆ మర్డర్
చేశాను ఏం చేస్తావ్-లాంటి డైలాగులేవో చెప్తాడు- అక్కడ టెలికాస్టింగ్ లేదన్న ధైర్యంతో.
తర్వాత బటన్ కెమెరాతో హీరో ఆ మాటలు రకార్డు చేశాడని తేలుతుంది. అయినా కూడా అది
కోర్టులో చిల్లికాణీకీ పనికి రాదు. అప్పుడూ కేంద్ర మంత్రి సెంట్ పర్సెంట్ సేఫే! అలాటి
వీడియో రికార్డింగ్ ( స్టింగ్ ) ఆపరేషన్స్ ఏసీబీ, సీబీఐ లాంటి ప్రభుత్వ సంస్థలు చేస్తేనే
కోర్టుల్లో చెల్లుబాటు అవుతాయి. మీడియా చేసినా పనికిరావు.
18. అసలా కేంద్ర మంత్రి మీద ఛానెల్ బాస్ ఆ సాక్ష్యం ఎలా
సంపాదించాడు? ఏదో రేవ్ పార్టీ జరుగుతోంటే సీక్రెట్ కెమెరాలు పెట్టి రికార్డ్
చేశామన్నాడు. కానీ ఆదృశ్యాలు చూస్తే, కేంద్రమంత్రి ప్రియురాలి ఫ్లాట్ లో జరిగినవి.
19. సరే, ఎక్కడ రికార్డు చేసినా, ఎలా సంపాదించినా, కేంద్ర
మంత్రి తో అంతటి జాతీయ ప్రాధాన్యంగల వీడియోని వెంటనే ప్రసారం చేయకుండా ఎందుకు దాచి
పెట్టుకున్నాడు ఛానెల్ బాస్? ప్రసారం చేస్తే ఈ సినిమా కథ ఉండక, రీమేక్ కీ అవకాశం
ఉండదనా?
―సికిందర్