రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, December 14, 2014

రివ్యూ

ప్రాబ్లం ఫ్లాష్ బ్యాక్ తో! 

 



స్క్రీన్ ప్లే- దర్శకత్వం : కె ఎస్ రవికుమార్
తారాగణం :
రజనీకాంత్‌, సోనాక్షి సిన్హా, అనుష్కా శెట్టి, జగపతిబాబు, బ్రహ్మానందం, కె. విశ్వనాధ్‌, సంతానం, రాధా రవి, దేవ్ గిల్  తదితరులు
రచన: పొన్‌ కుమరన్‌, కె.ఎస్‌. రవికుమార్‌ *  సంగీతం: ఏ.ఆర్‌. రెహమాన్‌ *
ఛాయాగ్రహణం: రత్నవేలు * కూర్పు: సంజిత్‌ * కళ: సాబు సిరిల్‌
బ్యానర్‌: రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. * నిర్మాత :  రాక్‌లైన్‌ వెంకటేష్‌
విడుదల : డిసెంబర్‌ 12, 2014 
సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త  సినిమా వస్తోందంటే ప్రపంచవ్యాప్తంగా పండగే. ఆ పండగ  ఉత్సాహాన్ని ఇనుమడిం పజేయడం ఎప్పటికప్పుడు ఆయన సినిమాల దర్శకులకి గట్టి పరీక్షే. అయితే  స్టార్లతో కొత్త ప్రయోగాలు చేసే శంకర్ లాంటి టాప్ దర్శకుడి విజన్ ని చూడలేకపోతున్న ఇతర టాప్ దర్శకులకి మాత్రమే ఈ పరీక్ష. రజనీకాంత్ తో శంకర్ ఇంకో  ముప్ఫై సినిమాలు తీసినా అవి వేటికవి ముప్ఫై కొత్త రకాలుగానే  ఉండొచ్చు. ఇతరులే మామూలు మాస్ కమర్షియల్స్ తో సక్సెస్ ని ఇద్దామనుకుంటున్నారు. ఈ కోవకి చెందినవాడే దర్శకుడు కె ఎస్ రవికుమార్. రజనీకాంత్ తో గతంలో ముత్తు ( 1995), నరసింహా( 1999)  తీసిన కోవలోనే తిరిగి రజనీ స్టార్ పవర్ ని ఇంకా ఈ కాలంలో కూడా మరో మూస కథకి మాత్రమే పరిమితం చేయాలనుకున్నాడు. 

         మెగా స్టార్ చిరంజీవి కూడా తన 150 వ సినిమాకి ఇలాటి ‘లింగా’ లాంటి పీరియడ్ కథనే ఎంచుకుంటే రజనీ లాగే తప్పులో కాలేసినట్టే. ఈ కాలంలో ఇవి  ప్రేక్షకులెవరికీ పట్టవు. కేంద్రంలో ఆశలు రేపే కొత్త ప్రభుత్వం, స్థానికంగా రాష్ట్ర విభజన నేపధ్యాలు విసురుతున్న అనేక సవాళ్ళకి పరిష్కారాల కోసం ప్రేక్షకులు అసహనంగా ఎదురు చూస్తున్నారు. ఎమోషన్ ఇక్కడుంది ఈ వర్తమానంలో. ఎప్పటివో గతించిపోయిన బ్రిటిషకాలపు కథల్లో కాదు. కాలక్షేపమే  కావాలనుకుంటే ఇతర హీరోల సినిమాలు చాలా వస్తాయి, అవి చూసుకుంటారు. రాజకీయంగా ప్రభావితం చేయగల, ప్రాబల్యమున్న సూపర్, మెగా స్టార్ల నుంచి స్వైరకల్పనల మసాలా సినిమాలకోసం ఎదురు చూడ్డం లేదు. తమిళంలో గత అక్టోబర్లో నేటి ప్రేక్షకుల ఎమోషన్స్ ని సరీగ్గా టార్గెట్ చేసిన  ‘కత్తి’ సమకాలీన సామాజిక సమస్యల్ని అతి  బలంగా చిత్రించి ప్రేక్షకుల భావోద్వేగాల్ని చక్కగా సంతృప్తి పర్చగల్గింది. ఈ అతి పెద్ద సక్సెస్ ని తీసింది విజయ్ లాంటి కమర్షియల్ స్టార్ తో, మురుగ దాస్ లాంటి కమర్షియల్ దర్శకుడే!

     ‘లింగా’ మరోసారి  ఫ్యూడలిజంపట్ల ప్రజల భయభక్తుల్ని చాటే తిరోగమనపు కథ చెప్పింది. ఫ్యూడలిజం మీద ఎనలేని సానుభూతిని, ఫ్యూడలిజమే కొనసాగివుంటే ఎంత బావుండునన్న మమకారాన్నీ చాటింది. ఇది  అశేష రజనీ ఫ్యాన్స్ గా నేటితరపు యువప్రేక్షకులకి అర్ధమయ్యే ‘ఇజం’ కాదు. ఐనా సినిమాలో దీనిదే (దాదాపు రెండు గంటలు) సింహభాగం!

    ఈ ‘ఇజం’ సీరియెస్ నెస్ సినిమాలో సమకాలీనతనీ, వినోదాన్నీ మింగేసింది. ‘ఇజం’ తో హీరోయిజమైనా చూపించివుంటే యువప్రేక్షకులకి హుషారెక్కేది-  రజనీ సినిమా అంటే హుషారే గానీ, బేజారెత్తిన అతడిపాత్ర పడే బాధలూ ఏడ్పులూ కాదుగా? ప్రజలకి తమ బాధలు తీర్చే నాయకుడు కావాలి తప్ప, తన బాధలు చెప్పుకునే నాయకుడు కాదు. అది నాయకుడి లక్షణం కూడా కాదు. త్యాగమనే ప్యాసివ్ హీరోయిజం కంటే,  పోరాటమనే యాక్టివ్ నెస్సే రజనీ స్థాయి సినిమాకి పండుతుంది.

రాజావారు – దొంగోడు!  
      లింగా ( రజనీకాంత్) ఒక దొంగ. ఫ్రెండ్స్ నేసుకుని బంగారు నగలు కొట్టేస్తూంటాడు. ఒక సేటుకి అమ్ముతూంటాడు. అతడికి తనతాత రాజా లింగేశ్వర్ అంటే మంట. రాజభోగా లనుభవించిన అతను తన తండ్రికి ఏమీ ఇవ్వలేదనీ, తను దొంగలా మారడానికి అతనే కారణమనీ అంటూంటాడు. ఒక టీవీ జర్నలిస్టు లక్ష్మి పరిచయమవుతుంది. ఇతన్ని దొంగాగా పట్టివ్వడానికి  ప్రయత్నిస్తూంటుంది తన స్టింగ్ ఆపరేషన్స్ తో. ఒకసారి ఒక స్టార్ హోటల్లో ఒక విలువైన ఆభరణం ఎగ్జి బిషన్ జరుగుతూంటే దాని మీద కన్నేస్తాడు లింగా. అక్కడికి అనుసరించి వచ్చిన లక్ష్మీనీ తన ఆపరేషన్లో ఇన్వాల్వ్ చేసేస్తాడు తెలివిగా లింగా. తీరా ఆ ఆభరణం కాజేసి సీటు కిస్తే,  ఆ సేటు అరెస్ట్ అవుతాడు. ఇక లింగా తన ఫ్రెండ్స్ తో పారిపోవాల్సి వస్తుంది.  అప్పుడు లక్ష్మి అతన్ని సింగనూరు అనే వూరు తీసికెళ్తుంది.

    ఇక్కడికే ఎందుకంటే, ఈ వూళ్ళో లింగా తాత లింగేశ్వర్  కట్టిన దేవాలయం వుంది. 70 ఏళ్ల క్రితం నుంచీ ఇది ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఆ ప్రారంభోత్సవం రాజా లింగేశ్వర్ మనవాడే చేయాలని ఊరి పెద్ద అయిన లక్ష్మీ  తాత ( కె. విశ్వనాథ్) పట్టుదల. ఆ మనవడే లింగా అని  తెలుసుకున్న లక్ష్మి అతడ్ని ఇక్కడికి తీసుకొచ్చిందన్న మాట. 

    ఆనాడు లింగేశ్వర్ ఆలయంలో శివలింగాన్ని ఒక ఖరీదయిన మరకతమణి తో చేయించాడు. ఈ విషయం తెలుసుకున్న లింగా, ఆ లింగాన్ని కొట్టేసేందుకు ప్రయత్నిస్తూ గ్రామస్థులకి దొరికిపోతాడు. దీంతో లక్ష్మీ తాత, రాజా లింగేశ్వర్ ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొస్తాడు.

    1939 లో బ్రిటిష్ ప్రభుత్వంలో రాజవంశీయుడైన లింగేశ్వర్ కలెక్టర్ గా వుంటాడు. ఇతను ఐసీఎస్ కంటే ముందు కేంబ్రిడ్జి యూనివర్శిటీలో సివిల్ ఇంజనీరింగ్ చేశాడు. ఒకసారి సింగనూరు అనే ఊరికొచ్చి, అక్కడ నీటి ఎద్దడి కారణంగా కరువుకాటకాల్నీ, ఆత్మహత్యల్నీ చూసి చలించిపోతాడు. అక్కడ డ్యాం కట్టాలని ప్రభుత్వానికి ప్రతిపాదిస్తాడు. ఆ గ్రామంలోనే భారతీ ( సోనాక్షీ సిన్హా) అనే అమ్మాయి పరిచయమై ప్రేమలో పడుతుంది.

    కానీ ఆ డ్యాం ప్రతిపాదనకి బ్రిటీష్ అధికారి (విలియం ఒరెండ్రాఫ్) అడ్డుతగిలి రైల్వే ట్రాక్ వేస్తానంటాడు. మీ రైల్వే ట్రాకులు మా సంపద దోచుకెళ్ళాడానికే నని ఎదురు తిరిగి, ఆ డ్యాం ని సొంత ఖర్చుతో నిర్మిస్తానని రాజీనామా చేసి వెళ్లి పోతాడు లింగేశ్వర్.

    ఇప్పుడీ డ్యాం ని లింగేశ్వర్ కట్టాడా, కడితే బ్రిటిష్ అధికారివల్ల ఏ ఏ ఇబ్బందు లొచ్చాయి, చివరి కేమయ్యాడు - అన్నవి ఈ ఫ్లాష్ బ్యాక్ లో మిగిలిన అంశాలు.

    ఇలా తాత ఔన్నత్యం గురించి తెలుసుకున్న లింగా మారి పోతాడు. అయితే ఇప్పుడు ఈ డ్యాంని కూల్చే కుట్ర ఒకటి ఎంపీ నాగభూషణం ( జగపతిబాబు) చేస్తున్నాడు. దీన్ని పేల్చేసి, కాలం చెల్లిపోవడం వల్లే అది కూలిపోయిందని చెప్పి కొత్త డ్యాంకట్టే కాంట్రాక్టుతో వేలకోట్లు వెన కేసుకోవాలని అతడి పథకం. ఈ పథకాన్ని లింగా ఎలా తిప్పి కొట్టాడనేది సినిమాకి ముగింపు.

రజనీ షో!

    సాంతం రజనీ షో ఈ సినిమా –మైనస్ రజనీ మార్కు హీరోయిజం, కేరింతలు కొట్టించే డైలాగులు కూడా శూన్యం. దాదాపు రెండు గంటలు సాగే ఫ్లాష్ బ్యాక్ పాత్రే దొంగోడి పాత్రని మింగేసింది. ఫ్లాష్ బ్యాక్ పాత్ర ద్వారా రజనీ కాంత్ లో గంభీర్యాన్నే, ఉదాత్తతనే చూస్తాం. దీని ప్రభావమే దొంగోడి పాత్ర మీద కూడా పడి అది కూడా డౌన్ ప్లే అయింది. మనకి తెలిసి మొట్ట మొదటిసారిగా రజనీ కాంత్ రజనీ కాంత్ లా కాక, ఏ అభిమానీ జీర్ణించుకో లేని ‘పాత్ర’ లా కనపడ్డాడు. రజనీ కాంత్ లో ‘పాత్ర’ని ఎవరూ చూడాలనుకోరు. కేవలం రజనీ కాంత్ నే చూస్తారు. రెండు పాత్రల్నీ ఎంత నీటుగా పోషించినా, ఆ నీట్ నెస్సే రజనీ అనే ఎట్రాక్షన్ కి ఎసరు పెట్టింది. దర్శకుడూ రచయితా కలిసి రజనీ పోషించిన ఉదాత్త పాత్రని ఎంతో పూజించ వచ్చు గాక, అభిమానులు మాత్రం రజనీనే పూజిస్తారు. ఆ వ్యక్తి పూజకి అవసరమైన గుణగణాలని పాత్రలకి పెయింట్ చేయడంలో విఫలమయ్యారు దర్శకుడూ రచయితా.

      హీరోయిన్లిద్దరూ సోనాక్షీ సిన్హా, అనూష్కా శెట్టీ లిద్దరూ ఒళ్ళు చేసి కాస్త ఇబ్బందికరంగానే కన్పిస్తారు. విలన్ గా జగపతిబాబుది సోసో పాత్ర. ఒక పెద్ద డ్యాం ని కూల్చి కొత్త డ్యాం కాంట్రాక్టు పట్టాలనే కుట్ర ఎంత సినిమా అయినా ఒప్పించని విషయం. అతడి కుట్ర కూడా కథనంలో ఎక్కడా కనీస గాభరా పుట్టించే విధంగా కూడా లేదు. కారణం ఫ్లాష్ బ్యాకే అసలు కథని మింగేయడం.
    ఏఆర్ రెహమాన్ సంగీతం, పాటలు కూడా హుషారెక్కించలేక పోయాయి. రత్నవేలు ఛాయగ్రహణం గురించి చెప్పాలంటే, అదొక అనిర్వచననీయమైన అనుభూతి. ఈ లెవెల్లో టాప్ సినిమాటోగ్రఫీ ఇంతవరకూ భారతీయ సినిమాలకి లేదు. రెడ్ డ్రాగన్ 6కె, పాంథమ్ ఫ్లెక్స్ 4కె వంటి అత్యాధునిక హైరిజల్యూషన్ కెమెరాలు వాడిన ఫలితమిది!

స్క్రీన్ ప్లే సంగతులు 
      ఒక సినిమాకి కి ఏది అసలు కథ అవుతుంది? కథ చెబుతూ సందర్భవశాత్తూ ప్రస్తావించుకునే గడచిన కాలపు ఏదైనా ఒక విశేషమా( డ్రీమ్ టైం), లేక వర్తమానంలో నడుస్తున్న కథా (ప్రెజెంట్ టైం)? గతానిదెప్పుడూ కథే   కాదు. అది ప్రస్తుతం ఎత్తుకుని చెప్తున్న, లేదా వర్తమానంలో నడుస్తున్న కథకి అవసరమైన సమచారాన్నిఅందించే వనరు మాత్రమే. ఇలా ఫ్లాష్ బ్యాక్ ( డ్రీమ్ టైం) అనేది ఒక డేటా బ్యాంకే తప్ప, మెయిన్ స్టోరీ కాదు. మెయిన్ స్టోరీ కూడా అవుతుంది- ఎప్పుడంటే- మొత్తం ఫ్లాష్ బ్యాకూ, మెయిన్ స్టోరీ ( డ్రీమ్ టైం- ప్రెజెంట్ టైం) ఒకే పాత్ర వైనప్పుడు. ఉదాహరణకి చిరంజీవి నటించిన ‘ఖైదీ’. ఇందులో మెయిన్ స్టోరీ కంటే ఫ్లాష్ బ్యాక్ నిడివే ఎక్కువ. ( సిల్వెస్టర్ స్టాలోన్ హిట్ ‘ఫస్ట్ బ్లడ్’ కాపీ) అయినా ఫర్లేదు- అది ఒకే హీరో సమస్య కాబట్టి. ఆ హీరో కథనే సమగ్రంగా ఫాలో అవుతున్నాం కాబట్టి. ఇలాకాక, వర్తమానంలో నడుస్తున్న హీరో కథని పక్కన పెట్టి, ఇంకో  పాత్ర ఫ్లాష్ బ్యాక్ ని ఎత్తుకుని సుదీర్ఘంగా చెప్పుకుంటూ కూర్చోవడమంటే, వర్తమాన హీరో కథని దగా చేయడమే. ప్రేక్షకుల వీక్షణా నుభవానికి తీవ్ర భంగం కల్గించడమే.
   ఫ్యాక్షన్ సినిమాల్లో కూడా ప్రెజెంట్ టైం -డ్రీమ్ టైంలు ఆ హీరోవే  అయివుండడం గమనించగలం. ఇలాటి డ్రీమ్ టైం లతో ప్రమాదం వుండదు గానీ, ప్రస్తుత ‘లింగా’ లో లాంటి అవధుల్లేని రెండో పాత్ర  డ్రీమ్ టైం తోనే  సమస్య వస్తుంది. వుంటే గింటే అది సుదీర్ఘంగా వుండకూడదు. ప్రెజెంట్ టైం నీ , హీరో పాత్రనీ అధిగమించకూడదు. అధిగమిస్తే సినిమా చప్పగా తయారవుతుంది.
    ఒక అపూర్వ సూపర్ స్టార్ గా రజనీ కాంత్ పాత్రపరంగా, నటనా పరంగా అన్ని నియమ నిబంధనలకీ అతీతుడే కావొచ్చు, కానీ స్క్రీన్ ప్లే సూత్రాలకి కాదు. కామెడీకి సంబంధించి అరిస్టాటిల్ ఏం చెప్పాడో- ముందు కామెడీ పుట్టడానికి ఆధారభూతమైన సంఘటన లాజికల్ గా వుంటే, దాని మీద నిలబడి ఎలాటి అసంబద్ధ కామెడీ నైనా నడపొచ్చని- అలా ముందు స్క్రీన్ ప్లే అనేది స్ట్రక్చర్ లో వుంటే, ఆ స్ట్రక్చర్ ని ఆధారంగా చేసుకుని కథనంలో ఎన్ని అనూహ్య విన్యాసాలైనా చేసుకోవచ్చు.  రజనీతో ఇదే చేస్తూ వచ్చారు ఇంతకాలం. ఇప్పుడొచ్చి  స్ట్రక్చర్ ని కూలదోసి, స్ట్రక్చర్ కి కూడా రజనీ అతీతుడైనట్టు డ్రీమ్ టైం- ప్రెజెంట్ టైం లతో చెలగాట మాడి బ్యాడ్ టైం ని సృష్టించు కున్నారు. మనవడి కథని ఎత్తుకుని, తాత కథ చెప్పుకొచ్చారు రెండు గంటలపాటూ. 

      ఐతే ఇలా రివర్స్ లో, ఫ్లాష్ బ్యాక్ నే ప్రధాన కథగా మార్చిన స్ట్రక్చరల్ విన్యాసంతో కూడా సినిమాని నిలబెట్ట వచ్చు. కానీ  ‘లింగా’ మేకర్లు తాము ఫ్లాష్ బ్యాక్ తో ఏం చేస్తున్నారో తెలుసుకోలేకపోయారు. ప్రమాదంలో పడబోతున్నామని తెలుసుకుని వుంటే, చేయకూడని ఆ స్ట్రక్చరల్ విన్యాసానికి అనితర సాధ్య రజనీ విన్యాసాలతో చెక్ పెట్టేసే వాళ్ళు!
     ఫ్లాష్ బ్యాక్ లో రజనీ పాత్ర ని అలా పాసివ్ హీరోయిజంతో కాక, బ్రిటిష్ వాడితో అమీతుమీ తేల్చుకునే యాక్టివ్ పాత్రగా – దుమ్మురేపి వదిలేవాళ్ళు. బ్రిటిషర్ ప్రతినాయక పాత్రకి బిల్డప్పే లేక, రజనీ తలపడడానికి ముఠాయే లేక, ప్రతీచోటా రజనీ రాజీ పడిపోయే మనస్తత్వంతోనే  నడిపారు. బ్రిటష్ దోపిడీకి వ్యతిరేకంగా సొంతంగా ప్రజలకి డ్యాం కట్టించి ఇవ్వడానికి కలెక్టర్ పదవికి సైతం రాజీనామా చేసిన ప్పుడే రజనీ బ్రిటిషర్లకి అతీతుడైపోవాలి. అంతేగానీ, ఎలాగో డ్యాం కట్టిన తర్వాత మళ్ళీ ఆ బ్రిటిషర్ బ్లాక్ మెయిల్ కే  తలొగ్గి, సర్వం అతడిపరం జేసి, డ్యాం అతనే కట్టిచ్చినట్టు కూడా రాసిచ్చి, అతడి పేరే పెట్టుకునేట్టు చేసి బికారిలా వెళ్లి పోవడమనే ఫ్లాష్ బ్యాక్ కాన్సెప్టే
పాత్రోచిత్యాన్నీ, తద్వారా కమర్షియల్ గా కథనంలో పుట్టాల్సిన సంఘర్షణనీ  దెబ్బతీసింది. ప్యాసివ్ హీరోయిజం తో పనికిరాని త్యాగ ధనుడన్పించు కోవడంకంటే, ఫిజికల్ యాక్షన్ తో వీరమరణం పొందివుంటే, ఆ ఫ్లాష్ బ్యాక్ నడకే వేరుగా వుండేది!
   పూర్తిగా ఫ్యూడలిజానికి పట్టంగట్టి, ప్రజలతో అడుగడుగునా రజనీకి పూజనీయ పాత్రగా దండాలు పట్టించడమే సరిపోయింది. దాంతో అది ఉదాత్త పాత్రగానే సెటిలయ్యింది. ఈ కాలం చెల్లిన కథా పాత్రా రజనీ ఇమేజినే డౌన్ ప్లే చేశాయి!
   ఈ రైతుల కథే ‘కత్తి’ లో కూడా చెప్పారు. అందులోనూ తమిళ స్టార్ విజయ్ ద్విపా త్రాభినయమే. అయితే అది సమకాలీనంగా. ఒకడు క్రిమినల్, రెండోవాడు రైతుజన బాంధవుడు. ఇతను కుట్రకి బలైతే, ఇతని స్థానంలో క్రిమినల్ విజయ్ వస్తాడు. రైతుల భూములు లాక్కునే కార్పోరేట్ కుట్ర అది. మన చుట్టూ ఇప్పుడు జరుగుతున్నవాటిని ఎత్తి చూపే చిత్రణ ఇది.. బ్యాంకులకి ఐదువేల కోట్లు ఎగ్గొట్టిన బీరు ఫ్యాక్టరీ వాడు సమాజంలో ఫ్రీగా తిరుగుతోంటే, ఐదు వేలు రుణం తీసుకున్న రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి?-లాంటి కదిలించే డైలాగులున్న వర్తమాన కథ చెప్పారు. 2జి స్కాం మీదా, మీడియా అనారోగ్యకర ధోరణి మీదా, ఇంకా చాలా వాటి మీదా  పదునైన డైలాగులు విసురుతాడు హీరో విజయ్. రైతుల సామూహిక ఆత్మహత్యల సీను  ఒక్కటి చాలు ప్రేక్షకులు ఈ సినిమాతో కనెక్ట్ అయిపోవడానికి! రజనీ సర్, వేరార్యూ సర్?

సికిందర్
   








    

Friday, December 12, 2014

ఎడిటింగ్

 కన్నూ చెవీ సంబంధం కాలరాస్తే ఎలా?
 క సందేహం : ఫిలిం ఎడిటింగ్ లో ఫిజికల్ కంటిన్యూటీ ఎడిటర్ కి చాలా ముఖ్యం. షాట్స్ ని సీక్వెన్సులుగా, సీక్వెన్సుల్ని మొత్తం సినిమాగా ఏర్చి కూర్చే ప్రయత్నంలో ఎక్కడో ఒక షాటేదో మిస్సయిందన్పించ వచ్చు . హీరో పలికిన ఒక డైలాగుకి విలన్ రియాక్షన్ పడలేదన్పించ వచ్చు. ఆ  రియాక్షన్ షాట్ కోసం దర్శకుడ్ని సంప్రదిస్తాడు ఎడిటర్. ఇలా కంటిన్యూటీ షాట్స్ ని తర్వాత తీయడాన్నే ప్యాచ్ వర్క్ అంటారు. ఆ వొక్క షాట్ తీయడానికి పది  వేలు ఖర్చయినా, దానివల్ల పది లక్షల కలెక్షన్ పెరగ వచ్చు. బాగానే వుంది,  మరి 35 కోట్లు ఖర్చుపెట్టి ‘ఆరెంజ్’ తీసినప్పుడు, అందులో చివర్లో హీరో రాం చరణ్, హీరోయిన్ జెనీలియాని కలుసుకోబోతూండ గానే, హఠాత్తుగా శుభం పడి, రీలేదో  మిస్సయినట్టు థియేటర్లో  గందరగోళం ఏర్పడింది. అలాంటప్పుడు అది కలెక్షన్లని దెబ్బతీసే కంటిన్యూటీ సమస్యలా తోచి, వెంటనే ప్యాచ్ వర్క్ కి ఆదేశించాలన్పించ లేదా సుప్రసిద్ధ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ కి? ఆ అర్ధాంతరపు ముగింపునలా ఉపేక్షించి , సినిమాకి జరగబోయే భారీ నష్టాన్ని చూస్తూ కూడా ఎందుకు వదిలేసినట్టు?

          దీనికాయన ఇచ్చిన జవాబు : దర్శకుడి లాజిక్ ననుసరించే ముగింపుని అనుమతించామని! రొటీన్ గా ముగించకుండా కాస్త సాంప్రదాయేతరంగా  ఉండాలన్న దర్శకుడి ఆలోచన మేరకే అది జరిగిందని వివరించారు.

          దర్శకుడి విజ్ఞతే శిరోధార్యమైనప్పుడు ఎడిటర్ చేసేదేమీ వుండదు. అయితే ఎడిటింగ్ లో తను ప్రేక్షకుల్లో ఒకడిగా ఫీలయ్యి నిస్సంకోచంగా దర్శకులకి తన అభిప్రాయం వ్యక్తం చేస్తానన్నారు వెంకటేష్. నిజానికి ఈ విమర్శనా  దృష్టే తనని ఎడిటర్ గా చేసిందన్నారు. ‘కూలీ నెం-1’ తీసిన కె. రాఘవేంద్ర రావు దానిమీద తన విశ్లేషణ కోరినప్పుడు, నిర్మొహమాటంగా చెప్పడమే ఆయనకి  నచ్చి ఆ తర్వాత ‘అల్లరి ప్రేమికుడు’ కి ఎడిటింగ్ బాధ్యతల్ని అప్పజెప్పారన్నారు. 1995 లో అలా ఎడిటింగ్ పగ్గాలందుకున్న వెంకటేష్, అంతవరకూ సుప్రసిద్ధుడైన తన తండ్రి ఎడిటర్ మార్తాండ్ దగ్గర సహాయకుడుగా వున్నారు. ఇప్పటికి ఈ పదిహేనేళ్ళ ప్రస్థానంలో 250 తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాలకు ఎడిటర్ గా అగ్రస్థానంలో వుంటున్నారు. 
    మాన్యువల్ ఎడిటింగ్ కాలానికి చెందిన ఈయన మొదట రాఘవేంద్రరావు తిట్టి కొట్టి చెప్పిన పాఠాలెన్నో నేర్చుకున్నారు. తర్వాత రామానాయుడు స్టూడియోలో ఎవిడ్ వ్యవస్థ నెలకొల్పినప్పుడు, నిర్మాత డి. సురేష్ కోప్పడుతూంటే, మాన్యువల్ ని వదిలి వెళ్లి ఎవిడ్ ఎడిటింగ్ నేర్చుకున్నారు. ఇప్పుడు సరికొత్త వెర్షన్ ఎవిడ్ -5 మీద పనిచేస్తున్నారు.

           అయితే చాలా మంది దర్శకులు ఎడిటింగ్ లో వస్తున్న కొత్త టెక్నాలజీని దుర్వినియోగ పరుస్తున్నారని బాధ పడ్డారు వెంకటేష్. ఫ్లాష్ లు, డిజాల్వ్ లు, వైప్ లు, స్ప్లిట్ ఫ్రేములు, ఇష్టారాజ్యంగా వేయిస్తున్నారన్నారు. ఫారిన్ లో షూటింగ్ ఎందుకు చేస్తారు? అక్కడి సుందర దృశ్యాలతో కనువిందు చేయాలనేగా? మరి ఆ వివిధ లోకేషన్స్ లో తీసిన సుందర దృశ్యాల్ని నాలుగేసి బొమ్మలుగా విభజించి, ఒకేసారి తెరమీద స్ప్లిట్ స్క్రీన్ లో వేస్తే  ప్రేక్షకులు వాటినెలా ఆస్వాదిస్తారని ప్రశ్నించారు.


           సరే, ఇప్పుడు పెరిగిపోయిన జీవన వేగం కారణంగా ప్రేక్షకుల అటెన్షన్ స్పాన్ (ఒక దృశ్యం పై ధ్యాస నిలిపే కాలం) కొన్ని సెకన్లకి పడిపోయిందని హాలీవుడ్ సినిమాల్లో కూడా ఎంటీవీ తరహా మైక్రో షాట్స్ తో సినిమాలు తీస్తున్నారు, ఇది సబబేనా అంటే- అది కంటికీ చెవికీ మధ్యన వుండే  4 ఫ్రేముల తేడా థియరీని కాలరాసి, డబ్బులిచ్చుకుని సినిమా కొచ్చిన ప్రేక్షకులకి తలనొప్పి తెప్పించడమేనని ఆయన దుయ్యబట్టారు! ఈ జాడ్యం తెలుగు సినిమాల్లోనూ ప్రబలిందన్నారు. షాట్స్ ని గజిబిజిగా వేయాలని నేటి దర్శకులు కోరుతున్నారన్నారు.


          తన వరకూ సంప్రదాయ స్కూల్ నే అనుసరిస్తున్నానని అన్నారు వెంకటేష్. డాక్టర్ డి. రామానాయుడు తన ప్రతీ సినిమానీ ప్రేక్షకుల మధ్య కూర్చుని- మొదటి రోజు, మూడో రోజు, రెండు వారల తర్వాతా..ఇలా మూడేసి సార్లు చూసి, ఎక్కడ ప్రేక్షకులు ఏడుస్తున్నారు, ఎక్కడ నవ్వుతున్నారు, ఎక్కడ చప్పట్లు కొడుతున్నారూ స్టడీ చేసి రమ్మనేవారు వెంకటేష్ ని. ఈ అనుభవం బగా తోడ్పడింది. అలాగే తన తండ్రి మార్తాండ్ కూడా ఒక విషాద సన్నివేశంలో కళ్ళు చెమర్చేలా  చేయని ఎడిటర్ మంచి ఎడిటరే  కాదని చెప్పేవారన్నారు వెంకటేష్. తను ఏ సినిమా కథ విననీ, తను ఫీలుయిన పద్ధతిలో కథని షాట్స్ గా కూర్చి, దర్శకుడికి చూపించి, అప్పుడు మాత్రమే  మార్పు చేర్పులుంటే చేస్తానని తన పని విధానాన్ని వివరించుకొచ్చారు.


       మరి తన ఎడిటింగ్ వెనకాల ఇంత వృత్తితత్త్వం ఉంటున్నప్పుడు, థియేటర్లలో ప్రొజెక్షన్ బాయ్స్ వాళ్ళ సొంత ఎడిటింగులూ అవీ చేసుకుని, బోరుకోడుతున్న సినిమాల నిడివినీ, కొన్ని భరించలేని పాటల్నీ వాళ్ళే ఎందుకు తీసిపారేస్తున్నట్టు? ఈ ప్రశ్నేఅడిగితే, అక్కడ ఎడిటర్ విఫలమైనట్టేనని ఒప్పుకున్నారు వెంకటేష్. 

       ఫిలిం ఎడిటింగ్ లో ఎమోషనల్ కంటిన్యూటీ చూసుకోవడం కూడా వుంటుంది. దర్శకుడు ఏ ఉద్దేశంతో దృశ్యాన్ని ప్రతిపాదిస్తున్నాడో గ్రహిస్తే, ఆ ప్రకారం షాట్స్ ని ఎంపిక చేసుకుని, ఆ వరసలో  పేర్చుకుంటూ పోయి దృశ్యానికి న్యాయం చేయవచ్చు. శేఖర్ కమ్ముల తీసిన ‘ఆనంద్’ లో కమలినీ ముఖర్జీ భోగి మంటలో ఫోటోలు వేసేస్తూ వుంటుంది. దీన్ని వెంకటేష్ ఎడిట్ చేశాక, దర్శకుడు శేఖర్ కమ్ముల చూసి, ఆమె తన మనసులోంచి చెత్తని తీసి మంటలో పారేస్తున్న అర్ధంలో ఆ దృశ్యం తీశానని వివరించారు. అప్పుడు వెంటనే వెంకటేష్ మరోసారి చూసుకుంటే, ఆమె గుండెల దగ్గర ఫోటోలు పట్టుకుని మంటలో వేస్తున్న షాట్ ఉండనే వుంది! ఇంకాలోచించ కుండా ఆ షాట్ ని కేంద్రబిందువుగా చేసుకుని, మొత్తం దృశ్యాన్ని రీ- ఎడిట్ చేస్తే, ఎమోషనల్ కంటిన్యూటీ అప్పుడు బాగా వచ్చింది!


        ఇప్పుడు ‘నాగవల్లి’, ‘రగడ’, ‘శక్తి’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘మనసారా’ మొదలైన సినిమాల ఎడిటింగ్ పనులతో బిజీగా వున్నారు మార్తాండ్ వెంకటేష్.

సికిందర్
(2010 డిసెంబర్ ‘ఆంధ్రజ్యోతి’ కోసం)
         
                  

Wednesday, December 10, 2014

స్క్రిప్ట్చరైంది...



మరో ఫ్రాక్చర్ టార్చర్!
రచన – దర్శకత్వం : వేమా రెడ్డి
తారాగణం : సుమంత్ అశ్విన్,
రెహానా, వైవా హర్ష, తాగుబోతు రమేష్, చైతన్య కృష్ణ తదితరులు.
సంగీతం : మిక్కీ జె. మేయర్, ఛాయాగ్రహణం : సాయి శ్రీరాం
బ్యానర్ : మహీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.
, ఇలవల ఫిలింస్‌
నిర్మాతలు: సిహెచ్‌. నరసింహాచారి
, ఇలవల నరసింహారెడ్డి
విడుదల : డిసెంబర్‌
05, 2014 , సెన్సార్ :U/A
***
      రుసగా రచయితలు దర్శకులవుతున్నారు. చాలా గ్లామరస్ పోస్ట్ గా దర్శకత్వం మారి పోయింది. ఇప్పుడు హీరో వేషాలకోసం ప్రయత్నించే యూత్ బ్రిగేడ్ లేరు. అరచేతిలో టెక్నాలజీ పుణ్యామా అని కెమెరా లు పట్టుకుని సినిమా దర్శకత్వం మీద కన్నేసి, షార్ట్ ఫిలిం డైరెక్టర్ లైపోతూ కుప్ప తెప్పలుగా వచ్చి పడుతున్నారు. ఎవర్ని చూసినా డైరెక్షన్- డైరెక్షన్ తప్ప మరో మాటేలేదు!
          దర్శకులవుతున్న రచయితలు రచన మీద ఏకాగ్రత చెదిరి ఏవో  తీరాలకి చేరిపోతున్నారు. ఈ వారం కొత్తగా మరో ఇద్దరు రచయితలు దర్శకులయ్యారు. ‘చక్కిలిగింత’ తో ఒకరు, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ తో మరొకరు. షరా మామూలుగా ఇద్దరూ ప్రూవ్ చేసుకోలేకపోయారు. ‘చక్కిలిగింత’ తీసిన వేమారెడ్డి దర్శకుడుగా రాణించాలంటే ముందు తానున్న రచయిత స్థానానికి న్యాయం చేసుకో గల్గాలి. రచనే పేలవంగా వున్నప్పుడు  ఆ మెట్టు మీద కాలేసి దర్శకత్వం మీదికి ఎగబాకడమనేది అత్యాశే అవుతుంది.
          యంగ్ హీరో సుమంత్ అశ్విన్ తో మరో ప్రేమ సినిమా  తీశారు. మార్కెట్లో ఎన్ని రకాల స్మార్ట్ ఫోన్స్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయో అన్ని ప్రేమ సినిమాలు వచ్చిపడుతున్నాయి. ఒకటే రొటీన్  తప్ప తేడా గల ప్రేమ సినిమా అంటూ ఒక్కటీ రావడం లేదు. తేడా అనగానే నిర్మాతలకి భయం. రొటీన్ అనగానే యువ ప్రేక్షకులు పారిపోయి తేడా గల షార్ట్ ఫిలిమ్స్ తీసుకోవడం.  తేడాతో  తొక్కుడు బిళ్ళాట అంత ఈజీ కాకపోయినా, ఈ సంధికాలంలో ఏదో ఒకటి చేయక తప్పదు. లేకపోతే టీవీ సీరియళ్ళు వచ్చేసి  స్త్రీలని సినిమాలకి దూరం చేసినట్టు, సినిమాలకి మిగిలిన ఈ కాస్తా  యువ ప్రేక్షకుల్ని షార్ట్ ఫిలిమ్స్ తన్నుకు పోగలవు!
          ఈ లెక్కింపు లేకుండా వచ్చి పడిందే  ‘చక్కిలిగింత’ అనే మరో రొటీన్. ఐతే దీనికో వెసులు బాటుంది. ఇదేం తేడా కనబర్చక పోయినా, ఇందులో వున్న సింపుల్ పాయింటుతోనే చివరిదాకా కాలక్షేప పాప్ కార్న్ సినిమాగానైనా  తయారు చేయవచ్చు. అయితే దర్శకుడు తన అమ్ముల పొదిలో అస్త్రాల్ని అమాంతం ముందే పారేసుకోవడం వల్ల సగం దాకే వచ్చి ఆగిపోవాల్సి వచ్చింది. మిగతా సగం స్మార్ట్ ఫోన్లో షార్ట్ ఫిలిమ్స్  చూసుకుంటూ గడపడానికి వీలిచ్చింది.
          ముందు కథలోకి వెళ్దాం...
అతడి ప్లాను-ఆమె కౌంటర్ ప్లాను 
   ఆ కాలేజీలో అమ్మాయిలు  అబ్బాయిల్ని వెంట తిప్పుకుంటూ నానా రకాల పనులూ చేయించుకుంటూంటారు. వాళ్ళకి గులాములుగా మారిపోయి ప్రేమించమని అడుక్కుంటూంటారు అబ్బాయిలు. ఎంతకీ ఫలితంలేక విసిగిపోతారు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఆడి (సుమంత్ అశ్విన్) వాళ్లకి ఇలాకాదని క్లాసు తీసుకుంటాడు. అబ్బాయిలే వెంటపడి ఎందుకు అడుక్కోవాలి, అమ్మాయిలే మన వెంటపడి అడుక్కోవాలంటూ హితబోధ చేస్తాడు. కాబట్టి ఇకనుంచి వాళ్ళకి దూరంగా వుండి, వాళ్ళే దగ్గరయ్యేట్టు ప్లాన్ ఇస్తాడు. సడెన్ గా అబ్బాయిలు తమని పట్టించుకోకుండా తిరగడంతో అమ్మాయిల లోకంలో కలకలం రేగుతుంది. ఇలాగైతే ఎలా, మన కెలా గడుస్తుందని అలమటించిపోతూంటే, కొత్తగా ఆ కాలేజీకి  అవంతిక (రెహానా) అనే  అమ్మాయి వస్తుంది. రావడం రావడంఎడారిలా  వున్న అక్కడి  వాతావరణాన్ని చూసి- విషయం తెలుసుకుని- అబ్బాయిలకి ఈ ప్లాన్ ఇచ్చిన వాణ్ణే లవ్ లోకి దింపితే సరి, అంతా దారి కొస్తారని తను నడుం బిగిస్తుంది.
          ఆమెదే పైచేయి అవుతుంది. అతడ్ని ప్రేమలో పడేసేందుకు ఆమె ప్రయోగించిన చిట్కాలు పనిచేసి, ప్రేమ దాసుడై పోతాడు. అందరి ముందూ ప్రేమని ప్రకటిస్తాడు. అమ్మాయిలే అబ్బాయిల వెంట పడాలన్న ప్రకృతి విరుద్ధమైన నీ  కాన్సెప్ట్ ఎంత తప్పో తెలియజేయడానికే ప్రేమ నటించాను తప్ప, నిన్నసలు ప్రేమించలేదని పంచ్ ఇస్తుందామె. కాన్సెప్ట్ విషయంలో ఓటమిని అంగీకరించి,  తనది నిజమైన ప్రేమంటూ మళ్ళీ వెంట పడతాడు. అసలు ప్రేమించని ఆమెని ప్రేమించేట్టు ఎలా చేశాడో ఇక్కడ్నించీ మరో కథ!

ఎవరెలా చేశారు...
         హీరో హీరోయిన్లు, సంగీతదర్శకుడు, ఛాయాగ్రహకుడు, నిర్మాతలు ఈ సినిమాకి ఎస్సెట్స్. ప్రొడక్షన్ విలువల కోసం నిర్మాతలు పాటుపడ్డారు. తమ ప్రొడక్టు కి రిచ్ నెస్ ని తీసుకొచ్చారు.  కథా నిర్మాణానికి (స్ట్రక్చర్) కి తప్ప దాని క్రియేటివ్ హంగులకి కొలమానాలు వుండవు గాబట్టి,  ఎవరి చూపులకి తగ్గట్టు వాళ్లకి అది అద్భుతంగానే  కన్పిస్తుంది. క్రియేటివిటీ  ఎమోషనల్ బాపతు. క్రియేటివిటీ వెనుకాల స్ట్రక్చర్ మేధోపరమైనది. మొదటిది హృదయంతో చూస్తే  రెండోది మెదడుతో చూడాల్సి వుంటుంది. ఈ రెండూ బ్యాలెన్స్ అయితేనే అంతిమంగా ప్రొడక్టు కి విలువ. ఈ సినిమాకి నిర్మాతలు వ్యయం చేసింది హృదయ సంబంధమైన క్రియేటివిటీ పైనే తప్ప, దానికి ఆధారభూతమైన మేధో పరమైన స్ట్రక్చర్ మీద కాదు. అంటే వాస్తు చూడకుండా పైపై నగిషీలు చూసి భవనం కొనడం లాంటిదన్నమాట. 
          హీరో సుమంత్ అశ్విన్ నటనలో ఇంప్రూవ్ అయాడు. అయితే అది ఒక కోణంలోనే. జీవం పోసే విషయంలో కాదు. కమల్ హాసన్ ఏం చేసి జీవం పోసేవాడో చూసి నేర్చుకుంటే బావుంటుంది. కట్టె-కొట్టె-తెచ్చె లాంటి ఫ్లాట్ క్యారక్టర్స్ ని కూడా ఏవో గిమ్మిక్కులు చేసి కలర్ ఫుల్ గా మార్చే వాడు. సుమంత్ అశ్విన్ కేవలం తన పాత్ర  ఏం చేస్తోందనే గాక, ఎలా చేస్తే తనకో బ్రాండ్ ఏర్పడుతుందో ఆలోచించి చేస్తే, కనీసం నటనలోనైనా డిఫరెంట్ హీరో అన్పించుకుని క్రేజ్ సృష్టించుకో వచ్చు. కమల్ హాసన్ కేవలం నటించడం మాత్రమే చేయలేదు, క్రేజ్ ని కూడా సృష్టించు కున్నాడు. రొటీన్ ప్రేమ సినిమాలకి  ఫ్రెష్ నెస్ ని తీసుకురావడానికి ఇదొక మార్గం కూడా కావొచ్చు.
          హీరోయిన్ రెహానా చలాకీగా పాత్రని పోషించు కొచ్చింది. ఆమె ఎక్స్ ప్రెషన్స్ తోనే చాలా చెప్పింది. గ్లామర్ కి తక్కువైనా నటనలో ఎక్కువే ఆ వయసుకి. కానీ దర్శకుల ధోరణి కొద్దీ సినిమాకొక కొత్త హీరోయిన్ రావడం - పోవడం జరుగుతున్న కాలంలో, రెహానా దర్శకుల దృష్టిలో పడి మరికొన్ని  సినిమాల్లోనటించే అవకాశాలు తక్కువే. చిన్న బడ్జెట్ సినిమాలకి చెప్పుకోదగ్గ టాప్ డైరెక్టర్ లేనట్టే, లీడింగ్ హీరోయిన్ కూడా లేదు. ఇదీ టాలీవుడ్ ట్రెండ్.
          మిక్కీ జె. మేయర్ కి ఈసారి స్వరాలు కుదిరి పాట లప్పుడు కూర్చో బెట్టగలిగాడు. ఛాయాగ్రహణం...జయంత్ పానుగంటి మాటలు ఓమాదిరిగా వున్నాయి. సినిమా టైటిల్ కి తగ్గట్టు చక్కిలిగింతలు పెట్టి వుండాలి డైలాగులు. టైటిల్ కీ చూపించిన సినిమాకీ సంబంధం లేదనేది వేరే విషయం. టేకింగ్ పరంగా, షాట్ కంపోజింగ్ పరంగా దర్శకుడు మంచి టెక్నీషియనే. అయితే మంచి స్క్రిప్టు చేతిలో వున్నప్పుడు ఈ టెక్నికల్ అంశాలకి సార్ధకత చేకూరుతుంది.

స్క్రీన్ ప్లే సంగతులు          
      ఒక సినిమా తీసి ఒప్పించాలంటే ఇవ్వాళ బయటి ప్రపంచంలో పుట్టుకొస్తున్న కొత్త కొత్త పోకడల్ని  కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన మానసిక శ్రమ పెరిగిపోతోంది. పెరగాలి కూడా. లేకపోతే ప్రపంచం ముందుకు, సినిమాలు వెనక్కీ వెళ్ళిపోతాయి. డిజిటల్ టెక్నాలజీ సినిమాలకెంత కలిసి వచ్చిందో, అంతే సమానంగా సినిమాల కావల సమాజంలో ప్రేక్షకుల చేతికీ అందివచ్చింది. ఇప్పుడు ప్రేక్షకుడే సినిమా తీసేస్తున్నాడు!
          సినిమా టెక్నాలజీ అతి చవకలో అరచేతిలో ఇమిడిపోయే సాధనంగా మారిపోవడంతో, యువత కోరికలు గుర్రాలవుతున్నాయి, వాటికి  ఆకాశమే హద్దు అవుతోంది. ఇలా తమలో దాగివున్న సృజనాత్మకతని వెల్లడించుకునే మార్గంగా షార్ట్ ఫిలిమ్స్ అనే కొత్త స్ట్రీమ్ అంది వచ్చింది. ఎప్పుడూ కాల్పనిక సాహిత్యం పట్ల ఆసక్తి చూపని యువత, షార్ట్ ఫిలిమ్స్ పుణ్యామాని ఇప్పుడు ఏకంగా కథా రచనకి శ్రీకారం చుట్టేస్తున్నారు! ఇదెంతో ఆహ్వానించదగ్గ పరిణామం. డిటెక్టివ్ సాహిత్యం వచ్చేసి ఒకప్పుడు రిక్షావాడిలో సైతం పఠనాసక్తిని పెంచినట్టు- షార్ట్ ఫిలిమ్స్ వల్ల  యువతలో కథా రచనా, నటనా, దర్శకత్వం, నిర్మాణమూ  అనే బహుముఖీన  క్రియేటివ్ ద్వారాలు బార్లా  తెరచుకుంటున్నాయి.
          నిత్యం కుప్పలు తెప్పలుగా యూ ట్యూబ్ లో అప్ లోడ్ అవుతున్న తెలుగు షార్ట్ ఫిలిమ్స్ ని చూస్తే ఇప్పటి యువత  ఆలోచనా ధోరణి తెలుస్తుంది. వాళ్ళు ఇంకా మూసలో వస్తున్న తెలుగు సినిమాల కథా కమామీషుల్ని దాటుకుని చాలా ముందు కెళ్ళి పోయారు. సినిమా ప్రేమలకి నిరసనగా అన్నట్టుగా  ఇప్పటి తమ ప్రేమలు అసలెలా వున్నాయో వాస్తవికంగా, ఆధునికంగా  చూపించేస్తున్నారు. వీళ్ళ ముందు మన సినిమా దర్శకులు వెలవెల బోతున్నారు. ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’, ‘క్యాంపస్ సెలెక్షన్’, ‘అద్వైత’ ..ఇలా ఎన్నెన్నో ‘షార్ట్స్’ రచనలో, డెప్త్ లో, దర్శకత్వంలో సినిమాలకే పాఠాలు నేర్పే స్థితికి వచ్చాయంటే అతిశయోక్తి కాదు. యూత్ నాడిని ఇవి పట్టుకున్నంతగా సోకాల్డ్ ప్రేమ సినిమాలు పట్టుకోవడంలేదు. ఇది చెప్పినా అర్ధం చేసుకునే స్థితిలో లేరు. ప్రమాద ఘంటికలు మాత్రం మోగుతున్నాయి. ఈ షార్ట్స్ ని ఎంతమంది యూట్యూబ్ లో చూస్తారని కొట్టిపారేస్తే కూడా కాదు. విలేజి కుర్రాడు సెల్ ఫోన్లో చూసుకోవడానికి నికి కొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. గంట కూర్చుని వరుసగా మూడు నాల్గు షార్ట్స్ చూసిన కుర్రాడికి ఇంకే ప్రేమ సిన్మాకూ వెళ్ళబుద్ధి కాదు.
          ఈ నేపధ్యంలో ఇంకా హీరో హీరోయిన్ల మధ్య అదే అరిగిపోయిన పాత ఛాలెంజిల ఫార్ములా ప్రేమ కథ చూపించు కొచ్చారు. దీనికి కూడా స్ట్రక్చర్ లేదు. లేకపోవడం వల్ల ఇది ఇంటర్వెల్ కే ముగిసిపోయింది. ముగిసిపోయిన కథలోంచి ఇంకో కథ లాగి సెకండాఫ్ నడిపించారు. అందుకే మొదలెట్టింది లగాయత్తూ ద్వితీయార్ధం కుప్పకూలింది.
          హీరో ఒక నియమం పెట్టుకున్నాడు. అమ్మాయిల వెంట అబ్బాయిలు పడకుండా, అమ్మాయిలే అబ్బాయిలకి ప్రేమని ప్రతిపాదించాలని... హీరోయిన్ వచ్చింది, హీరోని ప్రేమలోకి దింపి అతడి నియమాన్ని పటాపంచలు చేసింది. ఉపసంహారంగా ఆడా మగా మధ్య కెమిస్ట్రీ గురించి ఇంత పొడుగు లెక్చ రిచ్చింది. ఓటమిని ఒప్పుకున్నాడు, ఇంటర్వెల్లో ఐపోయింది కథ. ఇంకేంటి?
          అయినా-  నన్ను ప్రేమలో పడేసి నిజంగానే నాలో ప్రేమని పుట్టించావంటూ ఇంకో రాగం ఎత్తుకున్నాడు హీరో. ఇంకా ఇదెవరి క్కావాలి?  సినిమా ప్రారంభ దృశ్యాల్లోనే ఎత్తుకున్న పాయింటుకి ఇంటర్వెల్లో నే జడ్జ్ మెంట్ ఇచ్చేశాక, మళ్ళీ అందులోంచి ఇంకో పాయింటు లాగి కథ నడిపితే అది స్ట్రక్చర్ లో వున్న స్క్రీన్ ప్లే అవుతుందా?
          ఆ ఎత్తుకున్న మొదటి పాయింటుతోనే సినిమా సాంతం నడిపించడం ఎలా అసాధ్యమో, సెకండాఫ్ లో ఎత్తుకున్న రెండో  పాయింటు తో సెకండాఫ్ నడపడం కూడా అంతే  అసాధ్యం. ఇది ప్రత్యక్షంగా కన్పిస్తోంది. తనలో వున్నది కూడా ప్రేమేనని హీరోయిన్ ఒప్పుకోవడానికి ఎన్ని రంగులు మారుస్తూ ఎంత నస పెట్టింది? చివరికి ఎంత బేలగా ముగింపు పలికింది?
          ఒక సినిమా కథకి ఒకే పాయింటు వుంటుందనేది, పాత్రకి ఒకే లక్ష్య ముంటుందనేది, రెండేసి పాయింట్లు, రెండేసి లక్ష్యాలూ ఒకే ఒరలో ఇమడవనేది, స్క్రీన్ ప్లే రచనలో ఎలిమెంటరీ పాఠం కదా! ఇలా ఇంటర్వెల్లో కథ ముగింపు కొచ్చిన, ఫ్రాక్చర్ అయిన స్క్రీన్ ప్లేల గురించి ఇదే బ్లాగ్ లో ఈ మధ్యే విడుదలైన రెండు  సినిమాల రివ్యూల్లో తెలియజేశాం. అవి ‘రేసుగుర్రం’, ‘రభస’ అనే బిగ్ బడ్జెట్ సినిమాలు. ఇంకా వెనక్కెళ్తే ‘ఊసరవెల్లి’, ‘అశోక్’ లలోనూ ఇదే ఇంటర్వెల్ లో ముగింపు సిండ్రోమ్! ఈ నాల్గింటిలోనూ  మూడు సురేందర్ రెడ్డి దర్శకత్వం లోనివే కావడం గమనార్హం. ఫ్రాక్చర్ స్క్రీన్ ప్లే (ఎఫ్సీ) ల దర్శకుడిగా సురేందర్ రెడ్డికి అవార్డు ఇవ్వొచ్చు. ఎఫ్సీల దర్శకుడు సురేందర్ రెడ్డి తీసిన  ‘రేసుగుర్రం’ రచయితే ప్రస్తుత ‘చక్కిలిగింత’ కి మరో ఎఫ్సీ దర్శకుడు కావడం సహజంగానే జరిగే పరిణామం.
          మరో ఎఫ్సీ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. అతను ‘రభస’ అనే ఎఫ్సీకి ముందు అలాటిదే ఇంటర్వెల్లో ముగిసిన కథతో, ఫ్రాక్చర్ అయిన స్క్రీన్ ప్లే తో,  రామ్ హీరోగా ‘కందిరీగ’ తీసిన చరిత్ర వుంది. ఈ సంవత్సరం బోయపాటి శ్రీను తీసిన ‘లెజెండ్’ కూడా ఫ్రాక్చరైన స్క్రీన్ ప్లేనే. మరి ఇలాటి స్క్రీన్ ప్లే లతో ‘రేసుగుర్రం’, ‘కందిరీగ’, ‘లెజెండ్’ హిట్టయి, మిగిలిన ‘అశోక్’, ‘ఊసరవెల్లి’, ‘రభస’ ఎందుకు ఫ్లాప్ అయ్యాయంటే, ‘రేసుగుర్రం’, ‘కందిరీగ’, ‘లెజెండ్’ లు క్యారక్టర్స్ లో పస వల్ల ఫ్రాక్చర్స్ ని అధిగమించగల్గాయి (‘రభస’ రివ్యూని ఒకసారి బ్రౌజ్ చేయండి).
          ‘చక్కిలిగింత’ హీరో పాత్రకి స్క్రీన్ ప్లే పగుళ్ళకి ప్లాస్టరింగ్ చేసేంత క్యారక్టర్ సరుకు లేదు. అందుకు పెద్ద మేస్త్రీ అయి వుండాలి. ‘కందిరీగ’, ‘లెజెండ్’ ‘రేసుగుర్రం’ హీరోలు  పాత్రలు కుదిరిన, చేయి తిరిగిన కమర్షియల్ మాస్ మేస్త్రీలు.

మరేం చేసివుండాలి?
         ఒకరు  తీసిన కథలో లోపాలు కొన్ని చెప్పి దిద్దుబాటు చేసే ప్రయత్నం చేయవచ్చుగానీ, ఈ కథని ఇలా తీయాలని చెప్పే హక్కు ఎవరికీ లేదు. కొన్ని అరుదైన సందర్భాల్లో చెప్పకపోతే, సమీక్షే ప్రశ్నార్ధకంగా, అసంపూర్ణంగా మిగిలిపోవచ్చు. ఇంత చెప్పావ్, మరేం చేయాలో చెప్పవయ్యా అని నిలదీసే అవకాశం కూడా వుంది.  కాబట్టి తప్పో ఒప్పో ఇది చెప్పుకుని ముగిద్దాం.
          ఇప్పటి సినిమాలకి మానసిక సంఘర్షణలు కాక, ఫిజికల్ యాక్షనే  అవసరం. ఒక లాయర్ కోర్టులో లా పాయింట్లు వాదించడం గాక, యాక్షన్ లోకి దిగి  మర్డర్ కేసు సాధించడమే విజువల్ మీడియాకి అవసరం. మానసికంగా పెట్టుకున్న  ‘పెంట’ కి, హీరో  అడుగడుగునా మంటల్లో పడి  మలమల మాడిపోవడం చాలా అవసరం. అమ్మాయే  అబ్బాయి వెంట పడాలన్న  హీరో పెట్టుకున్న  రూలు ప్రకృతి సూత్రాల పట్ల ఒక పోగాలపు క్రైమ్ గా ఎష్టాబ్లిష్ చేస్తే, దానికి పనిష్మెంట్ గా అతడ్ని రకరకాల ఇబ్బందులకి గురి చేయవచ్చు. ప్రేమని గర్ల్ ఫ్రెండ్ ప్రపోజ్ చేయకపోవచ్చు, కానీ ప్రపోజ్ చేసే అమ్మాయిలు వేరే చాలా మంది వుంటారు. మనవాడి పైత్యం ఊరంతా తెలిసిపోయి- ప్రపోజ్ చేసే వేశ్యలు, ఆంటీలు, పెళ్లి కాని ప్రౌఢలు, క్రిమినల్ ఆలోచనలున్న గొప్పింటి అమ్మాయిలూ అందరూ వెంట పడతారు. పీకలోతు కష్టాలు, చెప్పుకోలేని చెడ్డ అనుభవాలు. పోలీస్ కేసులు, అరెస్టు వారెంట్లు, చక్కటి కాలేజీ కుర్రాడు కాస్తా, తెలివిమాలిన రూలు పెట్టుకుని,  కరుడుగట్టిన క్రిమినల్ గా ముద్రేసుకుని పారిపోవడాలూ (క్యారక్టర్ ఆర్క్ అంటే ఇదే, ఇది లేకపోతే కథనంలో మజా రాదు)...అంతా కడుపుబ్బ నవ్వించే కామెడీతో. హీరోయిన్ వుంటుంది, తన ఆడతనపు సహజాతం కొద్దీ ప్రపోజ్ చేయకుండా, అతడ్ని కష్టాల్లోంచి బయట పడేస్తూ... ఇంటర్వెల్లో ఏదైతే చక్కటి అభిభాషణ చేసిందో- అది చిట్టచివరికి, అనుభవమైతే గానీ తత్త్వం బోధపడని హీరోకి క్లాసు పీకుతుంది.
          ‘థండర్ ప్యాంట్స్’ (2002) అనే చిన్న పాయింటు తో కామెడీ,  ఎక్కడ్నించి మొదలై విస్తరించుకుంటూ మతులు పోగొడుతూ ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుందో ఒకసారి చూస్తే, రెండున్నర గంటల సినిమాకి చాలని చొప్పదంటు పాయింటుతో ‘చక్కిలిగింత’ ని ఎలా చక్కదిద్దవచ్చో కథా పథకం తెలుస్తుంది. ఇంగ్లిష్ సినిమాల్ని ప్రధానంగా క్యారక్టర్ ఆర్క్ తో, టైం అండ్ టెన్షన్ థియరీతో ఆద్యంతం రక్తి కట్టిస్తారని గమనించాలి.

  సికిందర్

      




Sunday, November 23, 2014

సాక్షి


బెన్ హర్ కొత్త రీమేక్ 

ప్రసిద్ధ హాలీవుడ్ చలన చిత్ర నిర్మాణ సంస్థ ఎం.జి.ఎం. వారి సింహం ప్రతి సినిమా ప్రారంభంలోనూ గర్జిస్తుంది. కానీ ‘బెన్ హర్’ చిత్రంలో ఆ సింహం గర్జించలేదు. అయినా ఐదున్నర దశాబ్దాలుగా ‘బెన్ హర్’ విజయ ఢంకా గర్జన వినిపిస్తూనే ఉంది. ఆస్కార్ చరిత్రలో మొట్టమొదటిసారిగా 11 అవార్డుల్ని గెలుచుకున్న ఈ క్లాసిక్ చిత్రం తన చరిత్రని తనే విస్తరించుకుంటూ ఇంకో బెన్ హర్‌గానూ అవతరించబోతోంది. ఈ సందర్భంలో బెన్ హర్ గురించి ‘వివరం’గా...


     ఒక సినిమా ఒక్కో తరం సోపానమెక్కుతూ కాలదోషాన్ని కాచుకోవడమంటే మాటలు కాదు. అలాంటిది అవలీలగా రెండు తరాలూ దాటుకుని, నేటి మూడో తరం ప్రేక్షకుల ఆదరాభిమానాల్ని అంతే బలంగా చూరగొనడం ‘బెన్ హర్’కే చెల్లింది. కేవలం ఒక సినిమా మాత్రంగానే ఇది కాలవాహికలో ప్రయాణిస్తూ పోవడం లేదు - సర్వాంతర్యామిలా సర్వరూపాలూ ధరించేస్తూ, మనం తొడుక్కునే బట్టల దగ్గర్నుంచి గృహోపకరణాలు, ఆభరణాలు, కారొప్పొడి, పళ్ల పేస్టు, కళ్లద్దాలు, కాఫీ పొడి, వీడియో గేమ్స్, కామిక్సు... బ్లూరే వెర్షన్సు... ఐ ట్యూన్ డౌన్ లోడ్సు... వగైరా వగైరాలకు ఒక బ్రాండ్‌నేమ్‌గా తరాల తారతమ్యం లేని గమ్యంగా అప్రతిహతంగా పురోగమిస్తోంది.

      ప్రేమానురాగాలు, కుటుంబ - స్నేహ సంబంధాలు, ప్రతీకారాలు, మత విశ్వాసాలు వంటి సార్వజనీన భావోద్రేకాలే బెన్ హర్‌ని సమకాలీనం చేస్తున్నాయని ఇంకా వేరే చెప్పుకోనవసరం లేదు. ప్రత్యేకించి మత విశ్వాసాల గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఏసుక్రీస్తు ఉనికితో ఆధ్యాత్మిక కోణం అనే అదనపు సినిమాటిక్ విలువ జతపడింది. దీనికి ఆధారం ‘బెన్ హర్ : ఎ టేల్ ఆఫ్ ది క్రైస్ట్’ (1880) అనే మహాగ్రంథం. ఆ గ్రంథ రచయిత లివ్ వాలేస్.

 ఆ మహోద్గ్రంథమే కాలపరీక్షకు తట్టుకుని ఎనిమిది దశాబ్దాల తర్వాత కూడా 1959 నాటికి వేలమందికి ఉపాధి కల్పించింది. ఒక కావ్యం జనసామాన్యానికి కళ్లారా కనువిందు చేసే ఏకైక సామూహిక దృశ్య మాధ్యమం సినిమాగా రూపొందే స్థాయికి చేరిందంటే అది అమరమైనట్టే. ఇప్పుడు కూడా మైక్రోసాఫ్ట్ విండోస్ స్టోర్ నుంచి దీని యాప్స్‌ని ఎనభై రూపాయలకే డౌన్‌లోడ్ చేసుకుని ఎంచక్కా చదువుకోవచ్చన్నమాట! ఇంకేం కావాలి? సినిమాతో పాటు ఈ రచనా కాలంలోకి ప్రయాణిస్తూనే ఉంటుంది ఎల్లకాలం. ఐతే ఇప్పుడు మనం చూస్తున్న 1959 నాటి  బెన్ హర్ సినిమాకి ముందు మరికొన్ని బెన్ హర్‌లున్నాయి.

మంచిచెడులు నవంబరులోనే!
      బెన్ హర్ సినిమాల కంటే ముందు బెన్ హర్ నాటకమే ఉంది. ఆ నాటకం వందేళ్ల తర్వాత మొన్నటికి మొన్న 2009లో మళ్లీ స్టేజికెక్కింది. 1899 నవంబర్ 29న మొదటిసారి నాటకంగా న్యూయార్క్‌లో ప్రారంభమైంది. డిసెంబర్7, 1907న మూకీ లఘు చిత్రంగా తొలిసారిగా వెండితెరకెక్కింది. 1925 డిసెంబర్ ఇరవైన మరో మూకీ చిత్రంగా విడుదలైంది. ఆ నిర్మాణ స్టూడియో ఎంజీఎమ్మే తిరిగి 1959లో ఇప్పుడు మనం చూస్తున్న బెన్ హర్‌ని రీమేక్‌గా నిర్మించి నవంబర్ 18న విడుదల చేసింది. కానీ నిర్మాత సామ్ జింబాలిస్ట్ సినిమా విడుదలకి ముందే, నవంబర్ 4, 1958న షూటింగ్‌లోనే గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు! ఇలా నవంబర్ మాసంతో బెన్ హర్‌కి మంచీ చెడూ రెండూ ప్రాప్తించాయి. గ్రంథ ప్రచురణ, తొలి నాటకం, బెన్ హర్ రీమేక్, నిర్మాత మరణం ఇవన్నీ నవంబర్లోనే సంభవించాయి. పైగా తొలి, మలి మూకీలు రెండూ డిసెంబర్‌లోనే విడుదలయ్యాయి. 2003లో యానిమేషన్‌గానూ వచ్చింది. 2010లో టీవీ సిరీస్‌గానూ ప్రసారమైంది.

      మెట్రో గోల్డ్విన్ మేయర్(ఎం.జి.ఎం.) స్టూడియో 1925 నాటి బెన్ హర్‌ని రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించింది 1952లోనే. అంతలోనే స్టూడియోలు వచ్చేసి సినిమా థియేటర్ల మీద గుత్తాధిపత్యాన్ని వదులుకోవాలన్న కోర్టు తీర్పు శరాఘాతంలా తగిలి, పెపైచ్చు టీవీ ఛానెళ్లు వచ్చేసి సినిమా వ్యాపారాన్ని తూట్లు పొడవటంతో రీమేక్ ప్రకటన వెనక్కి తీసుకున్నారు. ఐతే, ఆ ఆర్థిక సంక్షోభం నుంచి స్టూడియోని గట్టెక్కించడానికి అప్పుడప్పుడే (1956లో) విడుదలైన ‘టెన్ కమాండ్‌మెంట్స్’ వంటి బైబిల్ కథాంశంతో కూడిన సినిమా అఖండ విజయం ధైర్యాన్నిచ్చింది. ‘టెన్ కమాండ్‌మెంట్స్’ని సాటి స్టూడియో పారమౌంట్ పిక్చర్స్ నిర్మించింది.

ఈ స్ఫూర్తితో మొత్తమ్మీద ఎమ్జీఎమ్ 1957లో తన నూతన ఆవిష్కరణ 65 ఎం.ఎం. వైడ్ స్క్రీన్ ప్రాసెస్ అనే సాంకేతిక హంగుతో రీమేక్‌ని చేపట్టింది. ఇందుకు సామ్ జింబాలిస్ట్‌ని నిర్మాతగా ప్రకటించింది. బడ్జెట్ 70 లక్షల డాలర్లు. ప్రీ ప్రొడక్షన్ నాటికి కోటి డాలర్లు అని అంచనా వేశారు. తీరా నిర్మాణం ప్రారంభించే నాటికి, కోటిన్నర డాలర్లు అవసరమని లెక్కలేశారు. నిర్మాణం పూర్తయ్యేసరికి కోటి 52 లక్షల డాలర్లని లెక్క తేల్చుకున్నారు.

స్క్రిప్టు రైటర్ కోసం కసరత్తు
      నిర్మాతగా వ్యవహరించిన సామ్ జింబాలిస్ట్ ఓ పట్టాన స్క్రిప్టుని ఒప్పుకునే మనిషి కాడు. నవల మాదిరిగా క్రైస్తవ ఆధిక్య సమాజాన్ని చూపించడానికి ససేమిరా అన్నాడు. భిన్న సంస్కృతుల అమెరికన్ సమాజమే కావాలని పట్టుబట్టాడు. పన్నెండు మంది రచయితల్ని పరీక్షించాడు. గోర్ విడల్‌ని ఖరారు చేశాడు. ఇంకో కృష్ణుడుగా క్రిస్టఫర్ ఫ్రై అనే రచయిత తెరపైకి వచ్చాడు. తర్వాత ఈ స్క్రిప్టు ఎవరిదన్న దానిమీద పెద్ద వివాదమే రేగింది. అంతిమ విజేత కార్ల్ టున్ బెర్గ్ అయ్యాడు. కానీ దర్శకుడు విలియం వైలర్ చేతికి ఆ స్క్రిప్టు వచ్చేసరికి పరిస్థితి తిరిగి మొదటికొచ్చింది. ఇది పరమ ఆటవికంగా ఉందని తిప్పికొట్టాడు వైలర్. హీరోలు, విలన్లు ఒక పద్ధతిగా లేరని చెప్పాడు.

     1925లో మూకీ బెన్ హర్‌కి పనిచేసిన 30 మంది సహాయ దర్శకుల్లో విలియం వైలర్ ఒకడు. మూకీ బెన్ హర్ తర్వాత దర్శకుడుగా మారి, 1958 వరకూ 33 ఏళ్ల కాలంలో 57 సినిమాలకి దర్శకత్వం వహించాడు. వాటిలో ‘రోమన్ హాలిడే’, ‘డెస్పరేట్ అవర్స్’ వంటి క్లాసిక్స్ ఉన్నాయి. రెండుసార్లు ఆస్కార్ అవార్డులు పొందాడు. ప్రస్తుత బెన్ హర్ తర్వాత మరో రెండు ఆస్కార్లు అందుకున్నాడు. 1970 నాటికి మరో అయిదు సినిమాలు తీసిన వైలర్, 1981లో 79వ ఏట మృతి చెందాడు.

       బెన్ హర్ స్క్రిప్టుకి సంబంధించి వైలర్‌ది ఒక్కటే అభ్యంతరం - ఆటవికంగా ఉందని. ‘‘అది నాకు తెలుసండీ, కానీ ఏం చేద్దాం? ఆ రథప్పందాల్ని మర్చిపోండి. అది సెకండ్ యూనిట్ చూసుకునే వ్యవహారం. మీరు దయచేసి ఆ మిగిలిన ఆటవిక తనానికి జీవం పోయండి. సంస్కరించండి, డెప్త్ తీసుకురండి. బాడీ - డెప్త్ - ఇంటిమసీ... వీటికే కదా మీరు ప్రసిద్ధులు. కానివ్వండి, అది పూర్తిచేస్తే ఆటవిక లక్షణాలు పోతాయని నా అభిప్రాయం’’ అని జింబాలిస్ట్ నచ్చజెప్పాడు. ఆ స్క్రిప్టు మీద పనిచేస్తున్న వైలర్‌కి కొన్నాళ్లకి మనసు మారి - దీనికి సరైన కథానాయకుడు లభించకపోతే తప్పుకుంటానని మళ్లీ మెలిక పెట్టాడు. అలాంటి కథానాయకుడుగా చార్ల్‌టన్ హెస్టన్ వచ్చి వైలర్‌ని మెప్పించగలిగాడు.

      కానీ హెస్టన్‌కి అంత త్వరగా ఆ అదృష్టం వరించలేదు. మరికొందరు హేమాహేమీలు కాలదన్నుకున్న తర్వాత వచ్చి ఒళ్లో పడింది. కాలదన్నుకున్న నట దిగ్గజాల్లో బర్ట్ లాంకాస్టర్ స్క్రిప్ట్ పరమ బోరుగా ఉందని తిరస్కరించాడు. పొడుగు జుబ్బాలు ధరిస్తే తన కాళ్లు అందంగా కనపడవని పాల్ న్యూమన్ కాదన్నాడు. మార్లన్ బ్రాండో, రాక్ హడ్సన్, జాఫ్రీ హార్న్, లెస్లీ నీల్సన్... ఇలా స్టార్లంతా ఇలాంటి వంకలే పెట్టి ఆస్కార్ అర్హత గల బెన్ హర్ పాత్రని చేజార్చుకున్నారు. ఆఖరికి ఇటలీలో కిర్క్ డగ్లస్‌ని కూడా అనుకున్నారు. అంతిమంగా చార్ల్‌టన్ హెస్టన్ ఎంపికయ్యాడు.

      అప్పటికి 1956లో టెన్ కమాండ్‌మెంట్స్‌లో మోజెస్‌గా నటించి ప్రముఖుడై ఉన్నాడు చార్ల్‌టన్ హెస్టన్. బెన్ హర్‌కి ముందు 1941 నుంచీ 21 సినిమాల్లో నటించాడు. బెన్ హర్ తర్వాత 2003 వరకూ మరో 62 సినిమాల్లో నటించాడు. వాటిలో ఏర్‌పోర్ట్ 1975, ట్రూలైస్ ముఖ్యమైనవి. చివరికి 2008లో తనతో 64 ఏళ్లు కాపురం చేసిన భార్యని వదిలి, 84వ ఏట పైలోకాలకెళ్లిపోయాడు.

      చార్ల్‌టన్ హెస్టన్ (బెన్ హర్) లేకుండా ఈ మహాదృశ్య కావ్యాన్ని ఊహించగలమా? ఎర్రటి ఎండలో చుక్క నీటికోసం అల్లాడుతున్నాడు. అప్పుడు బైబిలు ఘట్టం! యోహాను 4:13-14 ‘‘అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును; నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవనమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను’’. ఇలా ఏసుప్రభువు దాహం తీరుస్తూంటే, అదేమిటి చివరికైనా కృతజ్ఞతాభావంతో చూడడే అన్పించినా, హెస్టన్ ఈజ్ హెస్టనే... ఆస్కార్ న్యాయనిర్ణేతల మనసు అలా గెలిచాడు. ఒకసారి నాటి ఆస్కార్ ప్రధానోత్సవ బ్లాక్ అండ్ వైట్ ఫిలిం క్లిప్పింగ్‌ని చూస్తే - అవార్డునందుకుంటున్న హెస్టన్ కళ్ల నీళ్లు అచ్చంగా ఆ నిజజీవితపు అపూర్వ ఘట్టం తెప్పించినవే. కానీ మనకలాంటి నిజజీవితంలో కళ్లనీళ్లు కేవలం బెన్ హర్‌గా నటించి తెప్పించేస్తాడు! బెన్ హర్‌ని హాలీవుడ్ లెజెండ్‌గా ప్రతిష్టించి పెట్టినవాడు హెస్టన్.

ముఖ్యపాత్ర జీసెస్ మాటేమిటి?
     షూటింగ్ ప్రారంభమైంది. 1958 మే 18న రోమ్ నగరంలో షూటింగ్ ప్రారంభమయ్యేనాటికి దర్శకుడు వైలర్ చదివింది మొదటి పదీ పన్నెండు పేజీల స్క్రిప్టే. స్క్రిప్టులో బెన్ హర్‌గా హెస్టన్ ఎంత ముఖ్యుడో అతడి తల్లీ చెల్లీ పాత్రల్లో ‘టెన్ కమాండ్‌మెంట్స్’లో హెస్టన్ తల్లిగా నటించిన మార్తా స్కాట్, వైలర్ మరదలు కేథీ ఓ డానెల్ అంతే ముఖ్యులు. ప్రేయసిగా హయా హరారీట్, బాల్య స్నేహితుడిగా స్టీఫెన్ బాయిడ్‌లు అంతే శ్రేష్ఠులు.

     అయితే... అయితే... అసలు అందరికంటే ముఖ్యపాత్ర జీసస్ క్రైస్ట్ మాటేమిటి?
ప్రొడక్షన్ మేనేజర్ హెన్రీ హెనింగ్సన్ రోమ్ నగరంలో ఓ సంగీత విభావరికెళ్లినప్పుడు అక్కడ పాడుతున్న యువ అమెరికన్ సింగర్ కంఠస్వరం, అత్యంత సుందరమైన అతడి ఆధ్యాత్మికత ఉట్టిపడే ముఖారవిందమూ చూసి పరుగెత్తుకొచ్చి వైలర్, జింబాలిస్ట్‌ల చెవిన వేశాడు. తక్షణం అతన్ని పిలిపించి స్క్రీన్ టెస్ట్ చేశారు. అలా కాకతాళీయంగా క్లాడ్ హీటర్ కరుణామయుడి పాత్రధారి అయ్యాడు. అయితే సినిమాలో అతడి పృష్ట భాగమే చూపించారు తప్ప ముందు నుంచి ఎక్కడా చూపించలేదు, ముఖం ఎక్కడా కనపడకుండా జాగ్రత్త తీసుకున్నారు. కొన్నిసార్లు కొన్ని విషయాలు ప్రేక్షకుల ఇమాజినేషన్‌కి వదిలేస్తేనే న్యాయం చేసినవాళ్లవుతారు. ఇక టైటిల్స్‌లో క్లాడ్ హీటర్ పేరు కూడా వేయలేదు. 1927లో జన్మించిన క్లాడ్ హీటర్ ఇంకా జీవించే ఉన్నాడు.

      ఇంకా వేల మంది ఎక్స్‌ట్రాలు! 50 వేలమంది ఎక్స్‌ట్రాల కోసం రోమ్‌లో గాలించారు. ఈ ఎక్స్‌ట్రాలతో చాలా చిక్కొచ్చిపడింది. చిరునామాలుండవు, ఫోన్ నెంబర్లుండవు. సమాచారం చేరదు, వాళ్లకీ వీళ్లకీ చెప్పి పంపిస్తే ఆ సమాచారం చేరడానికి కొన్ని రోజులు పట్టేది. ప్రీ ప్రొడక్షన్‌లోనే కాస్ట్యూమ్స్‌కి, సెట్స్‌కి, ప్రాపర్టీస్‌కి సంబంధించి 15 వేల స్కెచ్చులు, డ్రాయింగులు స్టూడియో ఆర్ట్ డిపార్ట్‌మెంట్ సిద్ధం చేసింది. 200 ఒంటెలు, 2,500 గుర్రాలు సమీకరించారు. క్లైమాక్స్‌లో రథప్పందాల్లో పాల్గొనడానికి 72 అశ్వాల్ని యుగోస్లేవియా నుంచీ, సిసిలీ నుంచీ ప్రత్యేకంగా రప్పించారు.

      సినిమాకి ఆయువు పట్టు లాంటి ఆ రథప్పందాల షూటింగ్ పూర్తిచేయడానికే మూడు నెలలు పట్టింది. ఈ షూటింగులో ఎంతో ఖరీదైన రెండు 70 ఎం.ఎం.లెన్సులు నాశనమయ్యాయి. మిగతా టాకీ పార్టు ఆరు నెలలు తీసుకుంది. చివర్లో కుష్టు వ్యాధిగ్రస్థులుగా చూపించాల్సిన తల్లీకూతుళ్ల పాత్రధారులిద్దర్నీ నెలరోజులు కుష్టు మేకప్‌లోనే వుంచేశాడు దర్శకుడు వైలర్. వాళ్లలాగే జీవించారు ఆ నెలరోజులూ. ఎట్టకేలకు 1959 జనవరి 7న ఆ చారిత్రాత్మక షూటింగ్ ముగిసింది. మొత్తం పదకొండు లక్షల అడుగుల ముడి ఫిలిం ఖర్చయ్యింది. ఎడిటింగ్ తర్వాత 19 వేల అడుగులతో, మూడు గంటలా 33 నిమిషాల స్క్రీన్ టైముతో విడుదలకి సిద్ధమయ్యింది.

బెన్ హర్ కాపాడింది
     బెన్ హర్... కోర్టు తీర్పుతో, చానెళ్ల బెడదతో ఖాయిలా దిశగా దౌడు తీస్తున్న స్టూడియోని పుష్కలంగా ధనార్జన చేసి కాపాడింది. అది చేదు అనుభవాన్నే మిగిల్చి ఉంటే, తిరిగి అదే ఎమ్జీఎం స్టూడియో, పారమౌంట్ పిక్చర్స్‌తో కలిసి ఇప్పుడు మరోసారి రీమేక్ చేయడానికి సాహసించేది కాదు. అంత కచ్చితంగా 2016 ఫిబ్రవరిలో విడుదల చేస్తామని ప్రకటించేది కాదు. ఈ రీమేక్ ప్రస్తుత క్లాసిక్‌తో సాటి రాదో, వస్తుందో అప్పుడే చెప్పలేం. కానీ ఒకటి మాత్రం చెప్పగలం: ఓల్డ్ క్లాసిక్ ఎప్పుడూ ఓల్డ్ క్లాసిక్కే. రిఫరెన్స్‌కి ఎప్పుడూ నమ్మకమైన దిక్కే. చారిత్రక అంశాల్లో కచ్చితత్వానికి పెద్దపీట వేసిన బెన్ హర్ ఆస్కార్ చరిత్రలో మొట్టమొదటిసారిగా 11 అవార్డులు కైవసం చేసుకుంది. మళ్లీ ఈ రికార్డుని చాలం కాలం తర్వాత ‘టైటానిక్’ బ్రేక్ చేసింది. ‘టైటానిక్’ రికార్డుని ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ది కింగ్’ బ్రేక్ చేయగలిగింది.

     ప్రపంచ సినిమా చరిత్రలో బెన్ హర్‌ని మించిన కళాత్మక సాంకేతికం సాధ్యం కాదేమో. వైలర్‌కే ప్రత్యేకమైన ‘కాంపోజిషన్ ఇన్ డెప్త్’ అనే విజువల్ టెక్నిక్‌తో దృశ్యాలు ఊపిరి సలపనివ్వవు. అలా కళ్లప్పగించి చూస్తూండాల్సిందే. రాబర్ట్ సర్టీస్ ఛాయాగ్రహణం, మిక్లాస్ రోజ్సా సంగీతం... నటీనటుల అభినయాలు, సంభాషణలు, రథప్పందాల యాక్షన్ కొరియోగ్రఫీ... మొత్తంగా వెండితెర మీద నాటి పురాతన రోమ్ నగరపు నిలువెత్తు రంగుల శోభ బెన్ హర్! ఈ నవంబర్ 18తో 55 సంవత్సరాలు నిండిన ఈ క్లాసిక్ ఇంకా ముందు తరాల్ని ఆనందాశ్చర్యాలలో ముంచెత్తుతుంది. సాత్విక - రాజసిక - తామసిక గుణాలతో కుదిపేస్తుంది - మనిషి ధర్మం ఎలా ఉండాలో ఉద్బోధిస్తుంది.

      జుడా బెన్ హర్ తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారేచ్ఛతో ఎంత రగిలిపోయినా, దయామయుడి స్పర్శతో - క్షమాగుణం ఎంత శక్తిమంతమైనదో తెలుసుకోవడమే అతడి ముక్తికి మార్గమైంది.  క్షమలోనే శాంతి ఉంది, పగ చల్లార్చుకోవడంలో లేనే లేదు.
       సినిమా  ముగింపు ఎంత హృద్యమో, ప్రారంభమూ అంతే ప్రశాంతమయం ఏసు జననంతో. అందుకే దర్శకుడు విలియం వైలర్ స్టూడియో అధిపతుల్ని కోరాడు - బ్యానర్ లోగోలో ఎప్పటిలా సింహం గర్జిస్తే ప్రారంభం రసభంగమౌతుందని. విజ్ఞులైన అధిపతులు అందుకు అంగీకరించారు. అందుకే ఆ సింహం ‘లియో ది లయన్’ సెలైంట్ అయింది, మూవీ బ్రిలియెంట్ అయింది.

ఇదీ కథ
      క్రీస్తు శకం ఒకటో శతాబ్దపు రోమన్ సామ్రాజ్యంలో బెన్ హర్ ఒక ఐశ్వర్యవంతుడైన యూదు యువరాజు. చిన్ననాటి స్నేహితుడు మెసాలా రోమన్ సైన్యాధికారి. ఇద్దరికీ సైద్ధాంతిక విభేదాలు. యూదుల్ని రోమన్ ఉక్కుపిడికిలితో పాలించాలన్న కాంక్షతో వచ్చి, ఇక్కడ అవిధేయులైన యూదుల పేర్లు వెల్లడించమంటాడు మెసాలా. వాళ్లని చంపి ఒక హెచ్చరిక చేస్తానంటాడు. దీనికి బెన్ హర్ అంగీకరించడు. దీంతో ఇద్దరూ విరోధులవుతారు. పట్టణ వీధుల్లో ఒక ఊరేగింపులో భవంతి పైనించి ఒక పెంకు జారి మెసాలా మీద పడుతుంది. భవంతి పైన బెన్ హర్‌తో కలిసి ఊరేగింపు చూస్తున్న చెల్లెలి చేయి తగిలి వదులుగా ఉన్న ఆ పెంకు జారిపడిందన్న మాట. అసలే బెన్ హర్ మీద కోపంతో ఉన్న మెసాలా, దీన్ని తనమీద దాడిగా ఎంచి బెన్ హర్ చెల్లెల్నీ తల్లినీ చెరసాలలో వేసి, బెన్ హర్‌ని యుద్ధ నౌక మీద తెడ్డు వేసే బానిసగా పంపించేస్తాడు.

      అసలు జరిగిందేమిటో చెప్పి తనవాళ్లని వదిలెయ్యమన్నా వినిపించుకోడు మెసాలా. అక్కడ్నించీ బెన్ హర్‌కి పగ రగులుతుంది స్నేహితుడి మీద. ఆ నౌక మీది బానిసలకి, ఖైదీలకి దాహార్తి తీర్చే సామాన్యుడిలా ఉంటాడు ఏసుక్రీస్తు. నౌక మీద సముద్రపు దొంగల దాడి జరుగుతుంది. ఆ దాడిలో రోమన్ అధికారి ప్రాణాలు కాపాడతాడు బెన్ హర్. దాంతో ఆ అధికారి బెన్ హర్‌ని కొడుకుగా దత్తత తీసుకుంటాడు.

      అధికారి ఆప్యాయత ఎంత మాత్రం రుచించదు బెన్ హర్‌కి. మనసంతా మెసాలా చేసిన మోసం మీదే. ఎక్కడ్నునారో ఎలా ఉన్నారో ఇంకా తెలీని తల్లీ చెల్లెళ్ల మీదే. ఈ సమయంలో ఒక అరబ్ గుర్రాల వర్తకుడు పరిచయమౌతాడు. అతడి ద్వారా తెలుస్తుంది - త్వరలో జరగనున్న రథప్పందాల గురించి. అందులో పాల్గొనబోతున్న మెసాలా గురించి. వాణ్ని నువ్వోడించాలని తర్ఫీదునిచ్చి పందాల్లో దింపుతాడు బెన్ హర్‌ని అరబ్ వర్తకుడు. ఈ సందర్భంగా మెసాలాని కలిసి ఒక్కరోజు కోసం తనవాళ్లని విడుదల చెయ్యమని బెన్ హర్ వేడుకుంటే, వాళ్లెప్పుడో చనిపోయారంటాడు మెసాలా.

      దీంతో కుంగిపోయిన బెన్ హర్ అలాగే పందాల్లో పాల్గొంటాడు.
 ఆ పందాల్లో బెన్ హర్ చేతిలో చిత్తుగా ఓడిపోయి, కొనవూపిరితో ఉన్న మెసాలా - నీ తల్లీ చెల్లీ కుష్ఠు వ్యాధి సోకి లోయలో ఉన్నారని అసలు విషయం చెప్తాడు. లోయలో హృదయవిదారకంగా ఉన్న వాళ్లిద్దర్నీ చూసుకుని బావురుమంటాడు బెన్ హర్. ఇక సర్వ రక్షకుడు జీసస్సే శరణ్యమని వాళ్లిద్దర్నీ జీసస్ దగ్గరికి తీసుకుపోతూంటే - ఆ లోక రక్షకుడేమో శిలువెక్కుతూ..!
***

మొదట ద్వేషించాడు! తర్వాత క్షమించమన్నాడు!

     ఉద్గ్రంథాలు రాయాలంటే ఉగ్గుపాలప్పట్నించీ ఉదాత్త భావాల్ని ఉగ్గబట్టుకుని ఉండాలి. కానీ ‘బెన్ హర్’ లాంటి మహాగ్రంథ రచయిత లివ్ వాలేస్‌కి ఉగ్గుపాలప్పట్నించే క్రీస్తు అన్నా, క్రైస్తవం అన్నా అస్సలు వొంటికి పడలేదు. ఈ గ్రంథం రాయడానికి పూనుకున్నప్పుడు తను క్రైస్తవుడే కాదు. ఈ గ్రంథం రాసి క్రీస్తు అసలు దేవుడే కాదని నిరూపించదల్చుకున్నాడు. క్రీస్తు అనే నమ్మకాన్ని భూస్థాపితం చేయాలనుకున్నాడు. క్రీస్తు పునరుత్థానమే కాలేదనీ, క్రైస్తవమే బూటకమనీ స్థిరపర్చాలనుకున్నాడు. దీంతో 1873లో పరిశోధనకి పూనుకున్నాడు. ఏళ్ల తరబడి ఆ లోతైన పరిశోధన కాస్తా అతన్ని లోతైన క్రైస్తవంలోకే దిగ లాగింది. ఏసుక్రీస్తు అచ్చంగా దేవుడేనన్న నమ్మకాన్ని ససాక్ష్యంగా కల్పించింది. అప్పుడు ఒక్కసారిగా మోకాళ్ల మీద చతికిలబడి కుళ్లి కుళ్లి ఏడ్చి, గొంతెత్తి అరిచాడు - ప్రభువా నన్ను క్షమించమని!

      1880లో గ్రంథ రచన పూర్తిచేశాడు. ప్రయాణాల్లోనూ, ఇంటి ముందు బీచ్‌లో చెట్టు కిందనూ కూర్చుని తడవతడవలుగా రాసి పూర్తిచేశాడు. తను తక్కువవాడేం కాదు. గ్రంథ రచన పూర్తిచేసే నాటికి న్యూ మెక్సికో గవర్నర్‌గా ఉన్నాడు. ఆ హోదాలోనే గులాబీ రంగు సిరాతో ముచ్చటగా ఫేర్ చేసిన రాత ప్రతితో ప్రచురణ కర్త దగ్గరికి న్యూయార్క్‌దాకా ప్రయాణించాడు. హార్పర్ బ్రదర్స్ సంస్థ అధిపతి మిస్టర్ జోసఫ్ హెన్రీ హార్పర్ చేతిలో ఆ రాత ప్రతిని పెట్టాడు. వాలేస్ రాసిన ఆ ప్రయోగాత్మక కాల్పనికానికి హార్పర్ చకితుడై, కళ్లకద్దుకుని ప్రచురించి, అదే సంవత్సరం -1880లో - నవంబర్ 12న విడుదల చేశాడు. 550 పేజీల ఆ ఉద్గ్రంథం ఒకటిన్నర డాలర్ ధరకి నెమ్మది నెమ్మదిగా అమ్ముడవుతూ పోయింది. 1900 కల్లా 36 ఆంగ్ల భాషా ఎడిషన్లలో ప్రచురణ అవడమే గాక, ఇరవైకి పైగా భాషల్లో అనువాదమైంది. ఈ భూమ్మీదికొచ్చినందుకు తన వంతు బాధ్యత అలా ప్రశంసనీయంగా నెరవేర్చిన వాలేస్, 1905 ఫిబ్రవరి ఐదున ప్రశాంతంగా కన్నుమూశాడు.

 కొన్ని ఫన్నీ డైలాగ్స్
షేక్ ఇల్డెరిమ్: ఒకే దేవుడంటే అర్థం చేసుకోగలను. ఒకే భార్యేమిటి? అనాగరికం!
* మార్కెట్ ప్రాంతంలో బెన్ హర్ - మెసాలా వాదించుకుంటున్నప్పుడు బ్యాక్ గ్రౌండ్‌లో వినిపించే  డైలాగు: కిదర్ జాతా హై భాయ్, కిదర్ జాతా హై?
* పాంటియాన్ పిలేట్: ఎదిగిన మనిషికి తను జీవిస్తున్న లోకం తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆ లోకం రోమ్ నగరం.
* బెన్ హర్: దేవుడు నాకు పగదీర్చుకునే శక్తి నివ్వుగాక! నేను తిరిగి వచ్చే దాకా నువ్వు బతికే వుండాలని ప్రార్థిస్తున్నా.
 మెసాలా: తిరిగొస్తావా?
* షేక్ ఇల్డెరిమ్: బల్తసార్ మంచి మనిషి.... కానీ అతనిలాగే అందరూ అయ్యేవరకూ మన ఖడ్గాలు మెరుస్తూ ఉండాలి!
* బెన్ హర్: నువ్వు పెళ్లి కుమార్తెగా ఉండకపోతే ముద్దిచ్చి గుడ్ బై చెప్పే వాణ్ణి.
* ఈస్థర్: నేను పెళ్లి కూతుర్నై ఉండకపోతే చెప్పడానికి గుడ్ బైలే ఉండేవి కావు.
* సెక్స్‌టస్: బుర్ర పగల గొట్టొచ్చు. అరెస్ట్ చేసి లోపలెయ్యెచ్చు. నరకంలో పడెయ్యొచ్చు. కానీ బుర్రలో ఉన్న ఐడియాల్ని ఎలా కంట్రోల్ చేస్తామబ్బా? ఐడియాలతో ఎలా పోరాటం చేస్తాం?
* షేక్ ఇల్డెరిమ్: బుర్ర తక్కువ వెధవా, ఆ పగ్గాలిలా ఇవ్వు! నా గుర్రాల్ని జంతువుల్లాగా చూస్తావా? గొర్రెల్ని బర్రెల్ని తోలుకు వచ్చే వెధవ - గెటాఫ్ ఈడియెట్!
* రియస్: నీ కళ్ళ నిండా ద్వేషం ఉంది. వెరీగుడ్! ద్వేషం మనిషిని బతికిస్తుంది. బలాన్నిస్తుంది.
* సాలా: సెక్స్‌టస్! ఐడియాతో ఎలా పోరాడతామని అడిగావు కదూ? చెప్తా విను- ఐడియాని ఐడియాతోనే పోరాటం చేయాలి!


- సికిందర్ 
( 'సాక్షి' కవర్ స్టోరీ- 23/11/2014)

Sunday, November 16, 2014

రివ్యూ..

స్క్రీన్ ప్లే తోనే జీవితం!
రచన- దర్శకత్వం : ఏఎస్ రవికుమార్ చౌదరి 
తారాగణం : సాయి ధరమ్ తేజ్, రెజినా కసాండ్రా, జగపతిబాబు, ప్రకాశ రాజ్,సాయాజీ షిండే, రఘుబాబు, షఫీ తదితరులు.
సంగీతం : అనూప్ రూబెన్స్ , ఛాయాగ్రహణం : దాశరధి శివేంద్ర, కూర్పు : గౌతమ్ రాజు, కళ : రమణ, యాక్షన్ : గణేష్
బ్యానర్ : గీతా ఆర్ట్స్ – శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్    నిర్మాతలు : బన్నీ వాస్, శ్రీ హర్షిత్
విడుదల : నవంబర్ 14, 2014
***
మెగా ఫ్యామిలీ నుంచి కొత్త హీరో  సాయి ధరమ్ తేజ్ ప్రయోగం సాఫీగా జరిగిపోయింది. ఇక కక్ష్యలో ప్రవేశించడమే మిగిలింది. నింగి నంతా పర్చుకుని ఇప్పటికే  తళుక్కు మంటున్న బోలెడు తారల్లో  ఏ తారగా మెరుస్తాడో  ఇక అతడిపైనే ఆధారపడి వుంది. రిమోట్ ఎలాగూ గ్రౌండ్ స్టేషన్ లో వుంటుంది కాబట్టి, ఆ విషయంలో ఆందోళన చెందనవసరం లేదు.
          గత నాల్గేళ్ళుగా అజ్ఞాతంలో వున్న దర్శకుడు ఏ ఎస్ రవి కుమార్ చౌదరికి మెగా వారసుణ్ణి తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసే ఖ్యాతి దక్కింది. ఏదో గేమ్ ఆడిస్తే తప్ప యువహీరో జెట్ స్పీడుతో దూసుకుపోలేడన్న నమ్మకం కొద్దీ కావొచ్చు- నితిన్ తో  ‘ఆటాడిస్తా’ లాంటి గేమ్ విఫలమయ్యాక, రిస్కు చేసి మళ్ళీ ఇంకో గేమ్ తో ఈ కొత్త మెగా హీరోని బరిలోకి దింపాడు.
          అల్లు అరవింద్, దిల్ రాజు లిద్దరూ ఈ బరువుని మోశారు. ఇద్దరికీ ఒక హిట్ చాలా అవసరమే. ఈ బెట్ బెడిసి కొట్టలేదు.
          రవికుమార్ చౌదరి పూర్వపు పేలవమైన టేకింగ్ ని పక్కనబెట్టి, ఈ సారి ట్రెండీ గా –ఆడియెన్స్ ఫ్రెండ్లీ గా వుండడం కోసం ప్రయత్నించడం వల్ల ఈ బెట్ బెడిసి కొట్టలేదు.
మరో మాస్ శీను మసాలా!
          తెలుగు రాష్ట్రాల్లో వున్న అనాథల్ని ఎవరు ఆదుకుంటున్నారో లేదో గానీ, తెలుగు సినిమాలని మాత్రం అనాథలే బతికిస్తున్నారు. అలాటి ఒక శీను (సాయి ధరమ్ తేజ్) అనే అనాథ ఈసారి ఏకంగా రాష్ట్ర రాజకీయ భవిష్యత్తునే నిర్ణయించే గేమ్ ఆడేశాడు. తొలి సినిమాకి టెండర్ క్యారక్టర్, లవ్ స్టోరీ ఉండాలన్న నియమ నిబంధనలు ఇప్పుడు లేవు కాబట్టి, శీను సీన్ వన్ నుంచీ  రాఫ్ఫాడించేస్తూంటే ఈ సడెన్ జెర్కుకి అడ్జస్టయ్యే  స్టామినా కూడా ప్రేక్షకులకి వుండాలి. పాలకొల్లు నుంచి వచ్చి అతను హైదరాబాద్ లో సుపారీ కిల్లర్ మైసమ్మ (జగపతి బాబు) ని కలిసి తనని చంపెయ్యమని ఆఫరిస్తాడు. మైసమ్మ ఆరా తీస్తే తన ప్రేమ కథ చెప్పు కొస్తాడు. తను చదువుతున్న కాలేజీలోనే శైలూ (రెజినా కసాండ్రా) ని ప్రేమించాడు, ఆమె ఛీ కొడుతోందంటూ రకరకాల మలుపులతో, మెలికలతో చెప్పుకొస్తూ- మైసమ్మ ఒప్పుకున్న కాంట్రాక్టుకే  గట్టి షాకిచ్చే అసలు విషయం విప్పుతాడు.
          ఆ శైలూనే మైసమ్మ చంపబోతున్నాడు. ఇప్పుడు శీను ఛాలెంజి చేస్తున్నాడు. మైసమ్మ ఏం చెయ్యాలి? ఇదీ పాయింటు. ఇక్కడ్నించీ ద్వితీయార్ధం కథ.
          అప్పుడప్పుడే ఎన్నికలు జరిగి, గెలిచిన పార్టీ సీనియర్లు రెండు వర్గాలుగా చీలిపోయి సీఎం పదవికోసం పోటీ పడుతోంటే షఫీ (షఫీ) అనే టీవీ జర్నలిస్టు ఇద్దరి అవినీతి, అనైతిక బాగోతాలూ చేజిక్కించుకుంటాడు. సుపారీ తీసుకున్న మైసమ్మ  అతణ్ణి చావబాదుతాడు. అతన్నే కాదు, బాగోతం బైటపడే అవకాశమున్న శైలూని కూడా చంపే బాధ్యత అతడి మీద వుంది. శైలూ కేం సంబంధం? ఇదీ సస్పెన్సు.
          నేపధ్యంలో ప్రభాకరరావు ( ప్రకాష్ రాజ్), గంగా ప్రసాద్ ( సాయాజీ షిండే) వర్గాలు, ప్రత్యక్షంగా మైసమ్మా అతడి గ్యాంగు, వెంట ద్వేషించే శైలూ..ఇలాటి పరిస్థితుల్లో శైలూని  శీను ఎలా కాపాడాడు? ఇదీ విషయం.
ఎవరెలా చేశారంటే...
          హడావిడీ చేశారు. పట్టుకోలేనంత స్పీడుతో పరుగులు తీశారు. హీరో సరే సరి, పాత హిందీ హీరోయిన్ సాధన పేరు మీదుగా పాపులరైన ‘సాధన కటింగ్’ అనే హేర్ స్టయిల్ తో అబ్బిన చైల్డిష్ లుక్స్ తో, కావలిసనంత మాస్ నటన పాత కాపులా రుద్ది అవతల పడేశాడు. శరీరం, ముఖ్యంగా తొడలు లావెక్కి డాన్స్ మూవ్ మెంట్స్ లో అవి కొట్టొచ్చినట్టు కన్పించసాగాయి. ఫైట్స్ కూడా స్పీడే. డైలాగ్ డెలివరీ, వాయిస్ బలంగానే వున్నాయి, కానీ హావభావాల దగ్గర అంత పట్టులేదు. పైగా పాత్ర ఒకటే పరుగు తీయడం వల్ల కాస్తయినా ఊపిరి తీసుకునే స్పేస్ లేక – అతను హృదయాల్లో ఒదిగిపోయే సీన్స్ కొరవడ్డాయి. ఎక్కడ మన మనసులో ముద్ర వేశాడంటే ఏమీ చెప్పుకోలేం. కనీసం ఒక ఫీల్ తో కూడుకున్న క్లోజప్ కూడా! అతన్ని ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు కావలసినంత టెక్నికల్ హంగామాకి పాల్పడ్డాడే తప్ప అందులో ఆత్మని పోయలేకపోయాడు. జ్యూనియర్ ఎన్టీఆర్ నటించిన  ‘అశోక్’ లో ఆ పాత్ర ఎలా వున్నా, ఇంటర్వెల్ తర్వాత  వచ్చే సోలో మెలోడీ పాటలో లయబద్ధంగా స్టెప్పు లేస్తూ అతను చాలా హోమ్లీగా హత్తుకు పోతాడు.
          హీరోయిన్ రెజీనా ది సీరియస్ పాత్ర కావడంతో ( రోమాంటిక్ కామెడీలో శోకరసం తో కూడిన సీరియెస్ నెస్ కి  తావులేదు, అలాగని రోమాంటిక్ కామెడీ కాని ఈ యాక్షన్ కామెడీలో నూ సీరియెస్ నెస్ కి చోటు వుండ కూడదు)  గ్లామర్ కోషెంట్, యూత్ అప్పీల్  వగైరా కొరవడ్డం తో బాటు, రోమాన్స్ కీ అవకాశం లేకుండా పోయింది. ఈ  నేపధ్యానికి  తగట్టే ఆమె ముఖ కవళికలూ వున్నాయి.
          మరోసారి జగపతిబాబు విలన్ గా ముద్రవేశాడు. గమ్మత్తేమిటంటే  హీరో కంటే కూడా జగపతిబాబే ఆ పాత్రలో గుర్తుండి పోతాడు. కామిక్ విలనీ ఎప్పుడూ కలర్ ఫుల్ గానే హైలైట్ అవుతుంది.
          కామెడీ ని మోసిన ఇంకో ముఖ్య నటుడు రఘుబాబు. ఇక బ్రహ్మానందం అవసరమే రాలేదు! ఇతర పాత్రల్లో నటించిన వాళ్ళందరూ –ప్రకాష్ రాజ్ –సహా కామెడీకి కావలసినంత తోడ్పడ్డారు.
          సంభాషణల పరంగా డైమాండ్ రత్నం రాసిన డైలాగు ‘మనిషి అనేవాడు బ్లడ్ రిలేషన్ ని వదిలేస్తాడేమో గానీ, మనీ రిలేషన్ ని వదులుకోడు’ టాప్ డైలాగ్. సంగీతం, ఛాయాగ్రహణం, పోరాటాలు ఇతర సాంకేతికాంశాలూ ఓకే. ముఖ్యంగా స్టయిలిష్ లుక్ తీసుకు రావడానికి ఎడిటింగ్ చాలా తోడ్పడింది- స్మాష్ కట్స్, జంప్ కట్స్ వగైరాలతో.  రీ రికార్డింగ్ విషయాని కొస్తే – రైల్వే ట్రాక్ మీద హీరో మైసమ్మ గ్యాంగుతో అభిమన్యుడిలా తలపడుతున్నప్పుడు, ఆ సన్నివేశానికి ఉత్తేజం తీసుకురావడానికి ఉద్వేగ భరిత పాట వేయడం వరకూ ఓకే- హిందీ ‘గ్యాంగ్ స్టర్’  లో ‘యా ఆలీ’ పాట వేసినట్టుగా- కానీ, దానికది అదొక ఘట్టం మాత్రమే! దాంట్లో కి తర్వాతి మెయిన్ షో డౌన్ ని కూడా కలిపేసి గుంపులో గోవిందా చేయకూడదు. అది ముగిసి, అదే చోట ఇక ఫైనల్ గా హీరో మైసమ్మ తో తలపడుతున్నప్పుడు- ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సన్నివేశం దానికదే ఒక ప్రత్యేకతని సంతరించుకుంది. ఆ ప్రత్యేకత గాంభీర్యం!  దీనికి మునుపు ముఠా తో పోరాడినప్పటి నేపధ్య సంగీతాన్నే గోలోగోలగా కంటిన్యూ చేస్తే ఆ గాంభీర్యం కాస్తా, ఎదురుచూసిన హైలైట్ కాస్తా మట్టి కొట్టుకు పోయింది. పూర్తి నిశ్శబ్ద వాతావరణంలో, కేవలం వాళ్ళిద్దరి ఎమోషన్స్ తో, పిడి గుద్దుల  చప్పుళ్ళతో మాత్రమే రక్తికట్టించాల్సిన ఘట్టమది- ‘షోలే’  లో ఠాకూర్ కుటుంబాన్ని గబ్బర్ సింగ్ వచ్చి హతమారు స్తున్నప్పుడు, విన్పించే ఒక్క ఆ గన్ షాట్స్ లాగా!
          కథలోనే ఆత్మ గురించి ఆలోచించ నప్పుడు టెక్నికల్ విలువలకీ అది పట్టలేదు. ఎంత రిచ్ గా తీశామని కాదు- సినిమా వీడియో గేమ్ కాదేమో? దాని రక్త మాంసాల గురించి కూడా కాస్త పట్టించుకోవాలేమో?
స్క్రీన్ ప్లే సంగతులు
          ఈ మధ్య వస్తున్న చాలా స్టార్ సినిమాల స్క్రీన్ ప్లేలు ఏవైనా కొత్త టెక్నిక్స్ తో కథ చెప్పడంగాక, ఎప్పుడు ఈ సోదిని ఇంటర్వెల్ కి చేరవేస్తామా, అక్కడ పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేసి పారేసి, ఎప్పుడు సెకండాఫ్ లోకి దూకేస్తామా అన్నట్టుగా ఉంటున్న విషయం  తెలిసిందే. ఫస్టాఫ్ ని కేవలం సెకండాఫ్ కి బల్ల కట్టుగా ఉపయోగించుకుంటున్నారు. విషయం లేకుండా ఏదో కాలక్షేపం మాత్రంగా  కానిచ్చేస్తున్నారు. ఆ సెకండాఫ్ అయినా విషయం వుంటుందా అంటే అదీ లేదు. విషయంతో సంబంధంలేని కామెడీ ట్రాకుతో నడిపేసి చివర్లో మొక్కుబడిగా విషయం  చెప్పేయడం. ఈ సెకండాఫ్ సిండ్రోమ్ అనేది ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాలుగా రకరకాలుగా వెంటాడుతున్నదే. క్రియేటివిటీ కోల్లేరవడం అంటారు దీన్ని. కొల్లేటి సరస్సులో బల్లకట్టు విన్యాసాలు.
          ప్రస్తుత సినిమాకి అదృష్ట వశాత్తూ ఇది దాపురించలేదు.  ఉన్న రొటీన్ కథని ఏదో భిన్నంగా చెప్పాలని తపన పడ్డాడు. ఐతే ఈ భిన్నత్వం ఇందాక పైన చెప్పుకున్న హీరో-విలన్ల మధ్య షోడౌన్ లో రసోత్పత్తిని అంతకి ముందు ఫైట్ ఆర్.ఆర్ తోనే ఫ్లాట్ గా చదును చేసేసి నట్టు- ఫస్టాఫ్ స్క్రీన్ ప్లే టెక్నిక్ నే సెకండాఫ్ లోనూ ప్రయోగించి- రెంటికీ తేడా లేకుండా చేశాడు. అంతసేపూ ఫస్టాఫ్ టెక్నిక్ తో ప్రేక్షకులు అలసిపోతారు- సెకండాఫ్ లో మళ్ళీ దాన్నే ప్రారంభించాడమంటే రిలీఫ్ ఏదీ లేదు, కొత్త ఫీల్ ఏదీ లేదు. ఈ తరహా కథనాన్ని ‘మిస్టర్ పర్ఫెక్ట్’ లోనూ చూడొచ్చు. 

      ఈ టెక్నిక్ ని - అంటే ఎండ్ సస్పెన్స్ తో నడిచే ఇలాటి కథలతో అనుసరించాల్సిన  టెక్నిక్ ని-1958 లో బ్రిటిష్ దర్శకుడు మైకేల్ ఆండర్సన్ ‘టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ అనే బ్లాక్ అండ్ వైట్ థ్రిల్లర్ ద్వారా సెట్ చేసి పెట్టాడు. 1981 లో దీన్నే ‘ధువాఁ’ గా హిందీలో విజయవంతంగా ఫ్రీమేక్ చేశారు. దురదృష్ట మేమిటంటే, ఎండ్ సస్పెన్స్ తో వచ్చే, వస్తున్న సవాలక్ష సినిమాలు ఈ టెక్నిక్ ని పట్టుకోకపోవడంతో అట్టర్ ఫ్లాపవుతూ వస్తున్నాయి. నవలకి తప్ప దృశ్య మధ్యమానికి ఎండ్ సస్పెన్స్ కథలు పనికి రావని ఇప్పటికీ తెలుసుకోవడం లేదు.
          దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి పైన చెప్పుకున్న బ్రిటిష్ థ్రిల్లర్ టెక్నిక్ తోనే ఇంటర్వెల్ దగ్గర ఎండ్ సస్పెన్స్ ని సమర్ధవంతంగా బ్లాస్ట్ చేశాడు. ( ఇది కాకతాళీయమే కావొచ్చు- ఈ బ్రిటిష్ సినిమాలో గిటార్ తో విన్పించే థీమ్ మ్యూజిక్ లాంటిదే అక్కడక్కడా హీరో ని హైలైట్ చేస్తున్నప్పుడు అనూప్ రూబెన్స్ విన్పించాడు)  అప్పటివరకూ నడించింది ఒక దోషిని పట్టుకునే పన్నాగమే నని మనకి తట్టదు. కాకపోతే బ్రిటిష్ సినిమాలో ఆ దోషిగా ఏన్ బాక్స్టర్ దొరికిపోతుంది, హిందీలో రాఖీ దొరికిపోతుంది, ఇప్పుడు తెలుగులో జగపతి బాబు!

     ఇలాటి స్క్రిప్టుల్లోనే రివ్యూలు  రాయడానికి ఆనందం దొరుకుతుంది. ‘మనం’ తర్వాత ఆ ఆనందం ఇదే. దీంతో అయిపోలేదు. అసలు మొత్తం కథలోనే ఒక ఎండ్ సస్పెన్స్ సమస్య వుంది. అది ప్రధాన విలన్ చిట్ట చివర్లోనే రివీలయ్యే సస్పెన్స్. అప్పటివరకూ ఆ విలన్ వున్నట్టు మనకే కాదు, హీరోకీ తెలీదు. మైసమ్మ పాత్ర లేకపోతే, ఈ కథ ఇలా వుండేది : ఎవరు తనమీద, హీరోయిన్ మీదా హత్యాయత్నాలు చేస్తున్నారో తెలీక, హీరో ఆ దాడుల్ని తిప్పి కొడుతూ మాత్రమే ఉండిపోయే రియాక్టివ్ ( అంటే పేలవమైన పాసివ్) క్యారక్టర్ గా వుండి  పోయేవాడు- ‘అశోక్’  లో ఇలాటి సిట్యుయేషన్ లోనే ఎన్టీఆర్ పాత్ర వుండి  పోయినట్టు!
          చిట్ట చివర్లో ఆ విలన్ని కనుక్కుని అప్పుడు మాత్రమే నేరుగా తలపడేవాడు.
అప్పటివరకూ విలన్ని దాచడం ఎండ్ సస్పెన్స్ కథ. ఇలాటి కథలో హీరో పాత్ర పేలవమై పోతుంది. ఏకపక్షంగా కథ నడుస్తూ వుంటుంది. దిక్కుతోచక హీరో తిరుగుతూంటాడు. మనల్ని దిక్కులు చూసేలా చేస్తాడు.
          ఈ  సమస్యని కవర్ చేయడానికే మైసమ్మ పాత్ర పనికొచ్చింది. దీంతో హీరో విలన్ కోసం వెతుక్కుంటు న్నాడన్నవిసుగు పుట్టలేదు. కళ్ళ ముందు మైసమ్మే విలన్ గా కన్పిస్తున్నాడు, అతడి మనుషులే వెంట పడ్డారు, అతడితోనే హీరో తలపడుతున్నాడు- ఇలా ఎండ్ సస్పెన్స్ అనే ఆత్మహత్యా సదృశ ఫీల్ కలక్కుండా కథ  నడుస్తూ- ఇక చివర్లో అసలు విలన్ రివీలయ్యే టప్పటికి మరో కొత్త మూడ్ లోకి ప్రేక్షకులు సర్దుబాటు అయ్యేట్టు ప్లే అయ్యింది.
          కథలో స్ట్రక్చర్ పరంగా సమస్యలు పరిష్కరించుకోవడానికి పాత్ర పనికొస్తే అది నిలబడుతుంది. అయితే ఇక్కడ ప్రేక్షకులుగా మనసంగతి వదిలేస్తే, అసలు మైసమ్మకి ఆ కాంట్రాక్టు ఇచ్చిన అసలు కుట్రదారు ఎవరా అని హీరో ఆలోచించక పోవడం అతడి కుశాగ్రబుద్ధి పాత్ర చిత్రణకే గొడ్డలి పెట్టు.  సెకండాఫ్ లో హీరోయిన్ చెప్పే వరకూ అతను తెలుసుకోడు.           ఇలాకాక, మైసమ్మ గురించి మొత్తం ముందే తెలిసి ఎలా వచ్చాడో- అలా అప్పటికి ప్రధాన విలన్ గురించి కూడా హీరో కి అంత ముందే తెలిసివుండాలి. అది చివర్లో తనే రివీల్ చేయాలి. అప్పుడీ పాసివ్ నెస్ పోయేది. మొత్తం కథా ప్రపంచంలో ఏం జరుగుతుందో హీరోకి తెలియకుండా వుండకూడదు కదా?.
          ఇక క్లైమాక్స్ కూడా జర్నలిస్టు చేతికి వదిలేశాడు. ఇలా ఎప్పుడు వదిలేస్తారంటే- ప్రాణాలు వదుల్తున్నప్పుడు! ఒక పాత్ర క్లైమాక్స్ లో ప్రాణాలు వదుల్తూ  లక్ష్యం పూర్తి చేయమని ఇంకో పాత్రకి అందిస్తుంది. అప్పుడా అందుకున్న పాత్ర ఫ్లాగ్ క్యారక్టర్ అవుతుంది. ఇక్కడ లెక్క ప్రకారం జర్నలిస్టు పాత్ర వుండకూడదు. చనిపోతూ ఆ ట్రంప్ కార్డు హీరో ప్లే చేసుకోవడానికి ఇచ్చేసి అడ్డుతొలగాలి.

-సికిందర్