రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, June 14, 2021

1047 : సందేహాలు - సమాధానాలు


Q : మాములుగా ఎలాంటి థ్రిల్లర్ సినిమాలలో అయినా హీరో పోలీసుగా, లేదా బాగా తెలివి గల వాడుగా ఉంటాడు. సో హీరో తన తెలివితో కేసు సాల్వ్ చేస్తాడు. ఇక మరొక వైపు విలన్ కూడా సైకో కిల్లర్ లేదా బాగా కన్నింగ్. పూర్తి విలన్ లక్షణాలతో ఉంటాడు. అలాగే చాలాసార్లు విలన్ ఒక మానసిక రుగ్మతతో కూడా క్రైమ్స్ చేస్తూ ఉంటాడు. అసలు ఇలా కాకుండా హీరో ఒక మాములు తెలివి తేటలున్న సాధారణ యువకుడై, అలాగే క్రైం చేసిన విలన్ కూడా తెలివి తేటల్లేని సాధారణ యువకుడై వుంటే, వీళ్ళ ఇద్దరి పాత్రలతో క్రైం థ్రిల్లర్స్ చేయలేమా?  అసలు థ్రిల్లర్స్ లేదా ఇన్వెస్టిగేషన్ కథలకి కచ్చితంగా హై పాయింట్ కథలే ఉండాలా? స్లో బర్నింగ్ లాంటి కథలు చేసుకోలేమా? వివరంగా చెప్పండి.

కె. రాజేష్, అసోసియేట్

A : చేసుకోవచ్చు. ఇప్పుడున్న ట్రెండ్ లో ఏమైనా చేసుకోవచ్చు. బెంగాలీలు మలయాళీలూ ఎప్పట్నించో చేస్తున్నారు. ఇప్పుడైనా వాళ్ళ బాట పట్టడం నేర్చుకోవాలి. వీటితో బాటు ఫిలిం నోయర్ సినిమాలున్నాయి. మన దేశంలో క్రైం సినిమాలతో బెంగాలీలు ఎక్కువ ముందున్నారు. అది ఇంటింటా సత్యజిత్ రే వేసిన బాట. మనం మలయాళం తప్ప బెంగాలీ సినిమాలసలే చూడంగా. మమతా బెనర్జీ తొడపాశం పెట్టినా చూడం. ఇలా ఒకలాటి మూసలో బతుకుతూ మూస కాని సినిమాలెలా తీస్తాం. జానర్ స్టడీ లేకుండా సరైన కథలు ఆలోచించలేరు. అపర మేధావి హీరో, అపార తెలివున్న విలన్ - లాంటి పాత్రలతో సినిమా చరిత్ర సమస్తం నిండిపోయింది. ఇవి కృత్రిమ ఫార్ముల్లా కథలు. వాస్తవంలో జరగని పలాయనవాద మూస కథలు. చూసి చూసి విసుగెత్తి వుంటుంది ప్రేక్షకులకి.

        మూసకీ వాస్తవికతకీ తేడా పసిగట్టక పోతే చిన్న సినిమాకిప్పుడు బ్రతుకు లేదు. చిన్న సినిమాలకిక మూస కథల మోజు మనసులోంచి తీసేయాలి. మూసకీ వాస్తవికతకీ జానర్ తేడాలు స్పష్టంగా తెలుసుకున్న నాడే చిన్న సినిమాలకి కొత్త జీవితం లభిస్తుంది. అంతవరకూ ఇంకా చావుబ్రతుకుల సమస్యే. ఆలోచనల్లో ఈ మార్పు నిర్మాతల్లో కూడా రావాలి, నాల్గు డబ్బులు కళ్ళ జూడాలనుకుంటే. నిర్మాతలు పాత కాలంలోనే వుండడంతో ఈ సంవత్సర కాలంగా కనీసం మనకు తెలిసి ఇలాటి పది స్క్రిప్టులు అలా పడి వున్నాయి. వాటిని మూసలోకి మార్చమంటారు. మార్చడానికి యంగ్ మేకర్లు సిద్ధంగా లేరు. ఒక యంగ్ మేకర్ అవకాశాల కోసం దారుణ మసాలా కథగా మార్చేస్తే, మందలించి మాన్పించాం.  

        కనుక వాస్తవిక, రియలిస్టిక్ కథలతో  ప్రేక్షకులతో ఏ పేచీ లేదు, నిర్మాతల అభిరుచులతోనే పేచీ. సినిమా అనేది నిర్మాతల కోసమా ప్రేక్షకుల మార్కెట్ కోసమా  తేల్చుకుంటే గానీ ఈ చిక్కు విడిపోదుప్రేక్షకులు పగటి వేషగాళ్ళు కాదు.

        పగలంతా పడ్డ కష్టం మర్చిపోవడానికి ప్రేక్షకులు పలాయన వాద ఫార్ములా సినిమాలు చూశారు. ఇప్పుడు వాళ్ళ ఆలోచనల్లో మార్పు వచ్చింది. ప్రస్తుత మహమ్మారి సృష్టించిన ఆర్ధికారోగ్య విలయంతో ప్రజలు అంతర్ముఖీనంగా మారుతున్నారు. జీవితం ఏమిటీ అని ప్రశ్నించుకుంటున్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా. న్యూయార్క్ టైమ్స్ లో ఎనిమిదేళ్ళ బాలిక తన వేదన రాసుకొచ్చింది. కేరళ నుంచి పదేళ్ళ బాలిక సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. ప్రతీ వొక్కళ్ళూ అంతర్ముఖీనులవుతున్నారు. ఇంత కాలం బాహ్యంగా జీవించారు. ఇప్పుడు అంతరంగంలోకి చూసుకుంటున్నారు. సబ్ కాన్షస్ మైండ్ తో కనెక్ట్ అయి ఆలోచనాత్మకంగా మారుతున్నారు. త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్లో మిడిల్ అంటే సబ్ కాన్షస్ మైండే. ఇంతకాలం మిడిల్ తో పలాయనవాద సినిమాలు ఎంజాయ్ చేశాం. ఇప్పుడు దాని మౌలిక స్వరూపం ఆలోచనాత్మక సినిమాలతో ప్రజల తృష్ణ తీర్చడం అవసరం.

        చుట్టూ జీవితంలో కన్పించే మనుషుల్ని తెర మీద చూడాలనుకుంటున్నారు సహజ చిత్రీకరణలతో. తెలివి లేని హీరో, అంతే తెలివిలేని విలన్ నిజ జీవితపు పాత్రలు. పోలీసులు, గూఢచారులు వంటి వాళ్ళకున్న తెలివి తేటలు సామాన్యులకుండవు. అలాటి ఒక తెలివి లేని సామాన్య హీరో, అసలు తెలివంటూ లేని విలన్ లాంటి ఐడియాలతో కచ్ఛితంగా చిన్న సినిమా కథలు చేసుకోవచ్చు. కాకపోతే రియలిస్టిక్ అని అడ్డగోలుగా చేసుకోకుండా స్ట్రక్చర్లో చేసుకోవాలి. రియలిస్టిక్ కి సహజ కథ ఎంత ముఖ్యమో, సహజ పాత్ర చిత్రణలు అంతే ముఖ్యం. ముందు జానర్ స్టడీ, రీసెర్చి  చాలా అవసరం.

Q : సాధారణంగా లవ్ స్టొరీ లలో హీరో హీరోయిన్ పాత్రలకు పెద్దగా గోల్స్ ఉండవు. కేవలం ఎదుటి వారి ప్రేమను గెలుచు కోవడమే వాళ్ళ గోల్ గా ఉంటుంది. అలా కాకుండా ఈ ఫార్మాట్ ను బ్రేక్ చేస్తూ లవ్ లను కొత్తగా ఎలా చేసుకోవాలి?
ఎస్. వినుకొండ, అసోసియేట్

A :  యువతీ యువకుల మనస్తత్వాల్ని తెలుసుకోవాలి. ఒకరు ప్రేమంటే ఆర్ధిక
సమానత్వమంటే, ఇంకొకరు అవసరాలంటారు. ఇలా చాలా నిర్వచనాలుంటాయి. రాడికల్ ప్రేమలు చాలా వున్నాయి బయట.  వాటిని ప్రతిబింబింప జేసే కథలే నమ్మదగ్గ నిజమైన ప్రేమ కథలవుతాయి. యువతరం కనెక్ట్ అయ్యే కథలవుతాయి. కానీ ఏం జరుగుతోంది- అయితే అపార్ధాలతో విడిపోయే, కాకపోతే ప్రేమని వెల్లడించలేక పోయే - ఈ రెండే టెంప్లెట్స్ లో పెట్టి గత రెండు దశాబ్దాలుగా ప్రేమ సినిమాల పేరుతో కాకమ్మ కథలు అమ్మ జూస్తున్నారు. ఇప్పుడు మారాలంటే మారుతారా. మారరుగాక మారారు. ఫెయిల్డ్ ఫార్ములాగా తమకు తెలిసిన ఈ లొట్టపీసు చాక్ పీస్ ప్రేమలే తీస్తూంటారు.  

        ప్రేమల గుట్టుని ఎప్పుడో 1952 లో ప్రసిద్ధ హిందీ రచయిత, ధరమ్ వీర్ భారతి విప్పి చెప్పాడు. శరత్ దేవదాసు కథ డొల్ల తనాన్ని కూడా స్పష్టం చేసే విధంగా నవల రాశాడు. దేవదాసు కథ సామాజికార్ధిక మూలాల్లోంచి ఉద్భవించకపోవడం వల్ల ఆ కాలానికి అది సరి తూగలేదని తేలుస్తాడు. దేవదాసులాగా పునాదిలేని ఉత్త ప్రేమలని గాక, సామాజికార్ధిక కారణాలు కలగలిసిన ప్రేమల్ని ఆయన స్థాపిస్తాడు. సాహసం, పరిపక్వత లేని ప్రేమలు విఫలమవుతాయని చెప్తాడు. ప్రేమలు కావాలన్నా, పోవాలన్నా సామాజికార్ధిక శక్తుల పైనే ఆధారపడి వుంటుందని విశ్లేషణ చేస్తాడు.

    ఆ నవల పేరు  సూరజ్ కా సాత్వా ఘోడా (సూర్యుడి సప్తాశ్వాల్లో ఏడో గుర్రం). దీన్ని 1992 లో శ్యామ్ బెనెగల్ ఇదే పేరుతో అద్భుతంగా తెరకెక్కించారు. 46 ప్రచురణలు పొంది ఇప్పటికీ విపరీతంగా అమ్ముడుపోతున్న నవల. 1999 లో ఇంగ్లీషు అనువాదం విడుదలైంది. యూట్యూబ్ లో నవలా పరిచయం ఇంకా పెడుతున్నారు. లక్షల్లో వ్యూస్, కామెంట్స్ వుంటున్నాయి యువతరం ప్రేక్షకులతో. సినిమా తప్పక చూసి, వీలైతే నవల కూడా చదివి ప్రేమల వాస్తవ రూపం పట్ల అవగాహన పెంచుకుంటే మంచి కథలు చేసుకోవచ్చు.

Q : క్యారక్టర్ ఆర్క్ అంటారు. అంటే ఏమిటి? దాన్నెలా చూడాలి?
పవన్, అసోసియేట్

A :  తెలుగులో చెప్పాలంటే పాత్రోచిత చాపం. అంటే కథలో పాత్ర ప్రయాణంలో ఏర్పడే ఉత్థాన పతనాల గ్రాఫ్. పాత్ర ప్రయాణమంటే విలన్ని పిడి గుద్దులు నాల్గు సిక్స్ ప్యాక్ తో గుద్ది భౌతికంగా ఎదగడం కాదు. మానసిక ఎదుగుదల జరిగే ప్రయాణం. కథా ప్రయాణంలో మానసికంగా ఏం తెలుసుకున్నాడు, ఏం అనుభవించాడు, ఏం సంఘర్షించాడు వంటి ఎలిమెంట్స్ తో కూడిన జర్నీ. చివరికొచ్చేసి ఏం పొందాడు, లేదా కోల్పోయాడనేది ముగింపు. క్యారక్టర్ ఆర్క్స్ మూడు రకాలుగా వుంటాయి కథని బట్టి. మానసిక పరివర్తన, ఎదుగుదల, పతనం.  

సికిందర్

 

Sunday, June 13, 2021

1046 : సందేహాలు- సమాధానాలు)

 Q : కరోనా విలయాన్ని చూస్తూనే ఉన్నాం కద. ప్రాణ నష్టం జరిగిన కుటుంబాలు వందల్లో ఉంటే, ప్రాణాలు దక్కినా లక్షల అప్పుల్లో కూరుకుపోయిన కుటుంబాలు వేలల్లో ఉన్నాయి. ఇక ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన కుటుంబాలయితే లక్షల్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా బాధ్యత ఏమిటి? ఎలాంటి కథలు ఇప్పుడు సమాజానికి కావాలి? పరిష్కారాన్ని చూపించేవా, లేకుంటే సమస్యను మరిపించేవా(అమెరికాలో రిసెషన్ టైంలో, హాలీవుడ్ ఎక్కువగా వినోద ప్రదాన సినిమాలను నిర్మించిందని గతంలో మీరే ఓ సారి చెప్పారు)? ఇవి రెండూ కాకపోతే అసలు ఈ పాండమిక్ ని ఓ పీడకలగా భావించి పూర్తిగా ఇగ్నోర్ చేసే కథలా? వీలైనంత వివరంగా చెప్పగలరు.

పి. అశోక్, అసోసియేట్

 A : మీ భాష బావుంది. పాండమిక్ ని పూర్తిగా ఇగ్నోర్ చేయడం ఏ కళా ప్రక్రియైనా -సినిమా, టీవీ, నాటకం వగైరా- చేయాల్సిన మొట్టమొదటి పని.  మనమొక చారిత్రక సందర్భంలో వున్నాం. వందేళ్ల తర్వాత స్పానిష్ ఫ్లూ లాంటి మహమ్మారిని ఎదుర్కొంటున్నాం. భవిష్యత్తరాలు, చరిత్రకారులు మనవైపు చూస్తారు. మహమ్మారితో మనమేం అనుభవించాం, నష్టపోయాం, ఎలా జయించాం ఇవన్నీ వార్తల రూపంలో, శాస్త్రవేత్తల నివేదికల రూపంలో లభ్యమవుతాయి. నేటి కళలు ఏం బాధ్యత నిర్వర్తించాయన్నది భవిష్యత్తరాలు చూస్తే తెలియాలి. ఇందుకు రిఫరెన్స్ మాత్రం లేదు. 1918- 20 మధ్య 5 కోట్ల మందిని (మనదేశంలో కోటిన్నర మందిని) రాల్చేసిన స్పానిష్ ఫ్లూ మహమ్మారి తర్వాత, హాలీవుడ్ లో సినిమాలు ఎప్పటి కథలతోనే తీస్తూ పోయారు. కారణం 1914-18 మధ్య మొదటి ప్రపంచ యుద్ధం. 1918 లో మొదటి ప్రపంచయుద్ధం ముగియగానే స్పానిష్ ఫ్లూ మొదలైంది. దీంతో యుద్ధ ప్రభావంతో వున్న హాలీవుడ్ స్పానిష్ ఫ్లూ తో కథలు మార్చుకోవాలని ఆలోచించలేదు. అప్పట్లో సినిమాలు తీయడమే గొప్ప. అవీ మూకీలు. ఇక యుద్ధ ప్రభావంతో యుద్ధ సినిమాలూ తీయలేదు. విషాదాన్ని సొమ్ము చేసుకునే ఆలోచన సినిమా రంగం చేయలేదు.

    1945 లో రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక కూడా యుద్ధ సినిమాలు తీయలేదు. తీసినవి ఆడలేదు. బిల్లీ వైల్డర్ రోమాంటిక్ కామెడీ, హిచ్ కాక్ సస్పెన్స్ థ్రిల్లర్, ఇంకా ఇతర కామెడీలూ, కౌబాయ్ లూ, ఫిలిం నోయర్లూ, డ్రామాలూ, ఫాంటసీలూ విరివిగా తీశారు. ఈ సినిమాల్లో ఎక్కడా యుద్ధ ప్రస్తావనే తీసుకురాలేదు, గుర్తు చేయలేదు (తాజాగా ఒకరు పంపిన రోమాంటిక్ థిల్లర్ స్క్రిప్టులో హాస్పిటల్లో సీను, అక్కడ ఆక్సిజన్ తో కుట్రా వుంటే తీసేయాల్సిందిగా కోరాం). 9/11 అమెరికా జంట హార్మ్యాల మీద దాడి విషాదాన్ని కూడా హాలీవుడ్ సొమ్ము చేసుకోవాలనుకోలేదు. తర్వాత సినిమాల్లో ఎక్కడైనా ఆ ప్రస్తావన వుంటే తీసేశారు. దాడికి పూర్వం తీస్తున్న ఒక సినిమాలో బ్యాక్ గ్రౌండ్ లో జంట హార్మ్యాలు కన్పిస్తూంటే ఆ షాట్ తొలగించారు.

        ప్రాణనష్టం జరిగిన విషాద ఘట్టాలతో హాలీవుడ్ ఇలాటి మర్యాద పాటిస్తే, ఆర్ధిక నష్టాలప్పుడేం చేసిందో చూద్దాం : 1929- 33 ఆర్ధిక మహా మాంద్యంలో గ్యాంగ్ స్టర్ సినిమాలు, కామెడీలూ తీస్తూపోయారు. అప్పటికి టాకీల శకం ప్రారంభమైంది. ఆర్ధికమాంద్యంలో ఈ సినిమాలతో హాలీవుడ్ కి స్వర్ణయుగం అంటారు. డబ్బులు బాగా గడించారు. నిరుద్యోగంతో, ఇతర ఆర్ధిక నష్టాలతో దిక్కుతోచని ప్రజలు ఈ సినిమాలకి ఎగబడ్డారు. దోపిడీలు చేసే గ్యాంగ్ స్టర్ల సినిమాలు!

      తర్వాత 2008 ఆర్ధిక మాంద్యంలో రోమాంటిక్ కామెడీలతో ఆర్ధిక సమస్యల్ని మరిపించాలని ప్రయత్నించింది హాలీడ్ వుడ్. ఇప్పుడీ మహమ్మారి. ఇప్పుడు మనకేం సినిమాలవసరం? అవసరమా? మన దారే వేరు. తెలుగు ప్రజలెలాలాటి పరిస్థితుల్లో వున్నా సినిమాలవే వుంటాయి. తీస్తున్నవే వుంటాయి. ఎప్పుడు ప్రజల పక్షాన వున్నాయి గనుక. అయితే ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే, తీసే వాళ్ళూ చూసే వాళ్ళూ ఒకే మునిగే నావలో వున్నారు. మహమ్మారి తెచ్చిన వ్యాధి బారిన అందరూ పడలేదు, ఆర్ధిక సంకటంలో మాత్రం అందరూ పడ్డారు. వ్యాధి బారిని పడినా పడక పోయినా, పడి ప్రాణాలు కోల్పోయినా నిలబెట్టుకున్నా, ఎదర బ్రతుకంతా చిందర వందరై కన్పిస్తోంది. ఉపాధులు పోయాయి, మూడున్నర కోట్ల ఉద్యోగాలు పోయాయి, 23 కోట్ల మధ్య తరగతి పేద తరగతికి పతనమయ్యారు. ప్రభుత్వాలు ఆరోగ్యం వరకూ చేస్తాయేమో గానీ, ఆర్ధికంగా ఆదుకోవు. ఎవరి పోరాటం వాళ్ళు చేసుకోవాల్సిందే. చిన్న కుండలమ్ముకునే ముసలమ్మ కాడ్నించీ, పెద్ద సినిమాలు తీసే నిర్మాతల వరకూ.

        ఈ పరిస్థితుల్లో సినిమా కథలెలా మారబోతున్నాయని హాలీవుడ్ నుంచీ బాలీవుడ్ దాకా ఈ మధ్య గమనిస్తూంటే, అందరిదీ ఒకే మాట- సహృదయతతో, మానవతతో కూడిన ఆశావహ దృక్పథపు సినిమా కథలు. అంటే ఓదార్చే కథలు. ఓదార్చడం నాన్సెన్స్. ఓదార్చడమంటే తిరిగి విషాదాన్ని కెలకడమే. సమస్యకి రెండో వైపు చూడడం లేదు : ఆర్ధిక సంక్షోభం. కావాల్సింది ఆర్ధిక విజయాల గురించి చెప్పే కథలు.  

      70 ల్లో, 80 ల్లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా వున్నప్పుడు అంతులేని కథ’, ఆకలిరాజ్యం లాంటి బాలచందర్ సినిమాలు, టి. కృష్ణ సినిమాలు, వేజెళ్ళ సత్యనారాయణ  సినిమాలూ ఆకర్షించేవి. ఇప్పుడా నిరుద్యోగ సమస్యతో బాటు ప్రపంచం ఆర్ధికంగా తలకిందులైన తీవ్ర సమస్య కళ్ళ ముందుంది. 70 ల్లో, 80 ల్లో హిందీలో మన్మోహన్ సింగ్ తీసిన మాస్ ఎంటర్ టైనర్స్ లో తిండి గురించే వుండేది. ఆయన తీసిన మల్టీ స్టారర్స్ లో చిన్నప్పుడు హీరోలు దొంగతనాలు చేయడం వుండేది. 'రోటీ' లో రొట్టె కోసం రాజేష్ ఖన్నా ఫైటర్ శెట్టితో పోరాడే పాపులర్ సీను వుంది.   

        ఇప్పుడా రొట్టెనే జనం వెతుక్కుంటూ వుంటే రొమాంటిక్ కామెడీలు కావాలా? బ్యాంకులో పది రూపాయల్లేక పేమెంట్ యాపులు దీనంగా వుంటే, గర్ల్ ఫ్రెండ్ తో ఏం వెలగ బెడతాడు. ఏం ప్రేమ సినిమాలు ఎంజాయ్ చేస్తాడు. గర్ల్ ఫ్రెండ్ కి బర్గర్ కాకపోయినా డబల్ రొట్టె ముక్క అయినా కొనాలా?

     రొట్టె గురించే విక్టర్ హ్యూగో 'లే మిజరబుల్' నవల రాశాడు. ఇప్పుడు కోవిడ్ అయితే అప్పట్లో కలరా. 1832 లో ఫ్రాన్స్ లో కలరా చుట్టూ ముట్టింది. పారిస్ లో ఇరవై వేల మంది చనిపోయారు. ఆరోగ్య శాఖ చేతులెత్తేసింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉపాధులు పోయాయి. తినడానికి తిండి లేదు. అశాంతి రేగింది. జైళ్ళు నిండిపోయాయి. ఇలాంటప్పుడు సోదరి కొడుకు కోసం ఒకడు రొట్టె దొంగిలించే కథతో విక్టర్ హ్యూగో రాశాడా సుప్రసిద్ధ నవల. ఈ దృశ్యాన్ని కళ్ళారా చూశాడు హ్యూగో. రొట్టె దొంగిలించిన కథా నాయకుడికి 20 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది! ఇది నిజంగా జరిగింది. ఈ మహోజ్వలనవల ఆధారంగా వందల సినిమాలు, టీవీ సీరియల్స్, నాటకాలూ వచ్చాయి. తెలుగులో'బీదల పాట్లు' అని రెండు సార్సు వచ్చింది.

     1832 నాటి ఫ్రాన్స్ ఎండమిక్, నేటి పాండమిక్ ఒకటే. ఆర్ధిక విపత్తు. ఇలాంటప్పుడు ప్రజలకేం మార్గం చూపుతూ  సినిమాలు తీయాలన్నది ఎవరికి వారే ఆలోచించుకోవాలి. ఓదార్పులొద్దు.

(మిగిలిన ప్రశ్నలు రేపు)
సికిందర్

Friday, June 11, 2021

1045 : స్పెషల్ ఆర్టికల్


      కథకి, లేదా గాథకి పునాది ఐడియా. ఐడియాని విడమర్చి చెప్పడం ఆ ఐడియాలో కథ వుందా, లేక గాథ వుందా తెలుసుకోవడంతో ప్రారంభమవుతుంది. ఐడియాలో కథ కన్పిస్తే కథా లక్షణాల్ని దృష్టిలో పెట్టుకుని కథగా చేసుకోవడం, ఐడియాలో గాథ కన్పిస్తే  గాథ లక్షణాలని బట్టి గాథగా చేసుకోవడం జరగాలి. లేదూ ఆ కథని గాథగా, గాథని కథగా మార్చుకోవాలనుకుంటే అదిప్పుడే - అంటే ఐడియాని సిద్ధం చేసుకునేప్పుడే జరగాలి. ముందుగా ఐడియాతో కచ్చితంగా ఏం చెప్పాలనుకుంటున్నారో స్పష్టత లేకపోతే సూపర్ ఫ్లాపవడం ఖాయం.

        చ్చుకి రెండు ఐడియాలు ఇలాటివి చూద్దాం : బద్రీనాథ్ లో పూర్వం విదేశీ దురాక్రమణ దార్లు దేశంలో దేవాలయాల్ని కొల్లగొట్టారని, ఇప్పుడు టెర్రరిస్టులు పని చేస్తున్నారని, అక్షరధాం ఉదంతాన్ని చూపుతూ, ఇలాటి పుణ్య క్షేత్రాల సంరక్షణకి హీరో ఏం చేశాడన్నది ఐడియాగా తీసుకున్నారు. అంటే మంచి మార్కెట్ యాస్పెక్ట్ తో, భారతీయ వెండితెర మీద అపూర్వంగా, ఇండియన్ టెంపుల్స్ వర్సెస్ టెర్రరిజం కథని చూపబోతున్నారని ఉత్సుకతని పెంచేశారు. తీరా చూస్తే, ఇదంతా కాకుండా, ఓ మామూలు ఫ్యాక్షన్ ప్రేమ కథగా మూసలోకి తిప్పేస్తే అట్టర్ ఫ్లాపయింది. అంతే కాదు, చివరికొచ్చేసి, స్వమతస్థులే దేవాలయం మీద తిరగబడి మారణహోమం సృష్టించినట్టు విచిత్ర ముగింపు కొచ్చారు. ఇలా ఐడియాతో ప్రేక్షకులకి ఉత్సుకత రేపిందొకటి, చూపించిందొకటి చేశారు. 

        సూర్య వర్సెస్ సూర్య లో వినూత్నంగా జిరోడెర్మా అనే రుగ్మత గురించి ఐడియా.  హీరో ఎండలో తిరిగితే పావుగంటలో చచ్చిపోయే రుగ్మత అది. అందుకని రాత్రి పూటే తిరుగుతాడు. ఈ సమస్యతో వున్న ఇతడితో ప్రేమలో పడ్డ హీరోయిన్ కి, ఈ సమస్య గురించి తెలిస్తే ఏమౌతుందన్న ప్రశ్న కథలో తలెత్తుతుంది. దీన్ని పక్కన బెట్టేసి, వాళ్ళ ప్రేమలో ఐడియాతో సంబంధం లేని ఇంకేవో అపార్ధాలు సృష్టించి, ఏడ్పుల ప్రేమ కథగా మార్చేశారు. ఫ్లాపయింది.

        ఇలాటి ఐడియాలు రీసెర్చిని కోరుకుంటాయి. ఇప్పుడు కూడా రీసెర్చి చేయని రియలిస్టిక్ ఐడియాలతో నాంది’, మోసగాళ్ళు మలయాళం ఒన్ లాంటివి వస్తున్నాయి. ఇలాటి కథలకి విషయపరమైన రీసెర్చి చాలా అవసరం. ఫార్ములా కథలకి విషయపరమైన రీసెర్చి అవసరముండదు. హవాలా కథతో ఫార్ములా సినిమా తీయాలనుకుంటే రీసెర్చి అవసరం లేదు. కానీ హవాలా కథతో సూపర్ ఓవర్ లాంటి రియలిస్టిక్ తీయాలంటే మాత్రం రీసెర్చి అవసరం. ఇందులో హైదరాబాద్ నేపథ్యంలో హవాలా వ్యాపారం నెట్వర్క్ గురించి రీసెర్చి బాగానే చేశారు.

      రీసెర్చి కోరుకునే కథలకి రీసెర్చి దశ తర్వాత వస్తుంది. ముందుగా ఐడియా మార్కెట్ యాస్పెక్ట్ ని సమీక్షించుకోవాలి. ఐడియా సామర్ధ్యాన్ని దాని పూర్తి స్థాయిలో రాబట్టుకుంటేనే వసూళ్ళ రూపంలో దాని మార్కెట్ సామర్ధ్యానికి న్యాయం చేసిన వాళ్ళవుతారు. కోటి వచ్చే అయిడియా చేతిలో వున్నప్పుడు లక్ష చాలని ఎవరను  కుంటారు. ఇలా నాంది’, మోసగాళ్ళు’, ఒన్  వంటి జాతీయ మార్కెట్ ని ఆకర్షించే కిల్లర్ (కత్తిలాంటి) ఐడియాల్ని మార్కెట్ యాస్పెక్ట్ విశ్లేషణ చేసుకోకుండా లోకల్ మార్కెట్ కి  సరిపెట్టుకున్నారు.

        నాంది (1017) లో 211 చట్టం గురించి కథ. ఈ కథని 211 చట్టం గురించి గాక రొటీన్ రివెంజీ కథగా మార్చేసి ముగించారు. 211 చట్టం గురించి అది చెప్పే సరైన కథగా ఐడియాని డెవలప్ చేసివుంటే జాతీయ స్థాయిలో వైరల్ అయ్యేది. మోసగాళ్ళు’(1028) లో దేశంలో సంచలనం సృష్టించిన అంతర్జాతీయ కాల్ సెంటర్ స్కామ్ ఐడియా సామర్ధ్యాన్ని తగ్గించి మూస ఫార్ములా కథ చేసేశారు. లేకపోతే ఇది కూడా జాతీయ స్థాయిలో వైరల్ అవాల్సిన ఐడియా. మలయాళం ఒన్’ (1037) లో రైట్ టు రీకాల్ చట్టంతోనూ ఇదే పరిస్థితి. ఇలా ఐడియా మార్కెట్ యాస్పెక్ట్ ని విశ్లేషించుకోక పోవడం వల్ల సినిమాలు వాటి స్థాయిని అందుకోలేక పోతున్నాయి.

        ఐడియా మార్కెట్ యాస్పెక్ట్ స్పష్టమయ్యాక, దాని స్ట్రక్చర్ కి రావాలి. అంటే తీసుకున్న ఐడియాలో కథ వుందా, గాథ వుందా పరిశీలించాలి. హీరో హీరోయిన్ని ప్రేమిస్తాడు, దాంతో హీరోయిన్ని పొందాలనుకున్న ఒక డాక్టర్ హీరోని కురూపిని చేస్తాడు, దీనికి ప్రతీకారంగా డాక్టర్నీ అతడి అనుచరుల్నీ కురూపుల్ని చేస్తాడు హీరో అని ఒక ఐడియా వుందనుకుందాం. ఇందులో మొదట కథ కవసరమైన స్ట్రక్చర్ వుందా లేదా చూసుకోవాలి. 1. హీరో హీరోయిన్ని ప్రేమిస్తాడు (బిగినింగ్), 2. దాంతో హీరోయిన్ని పొందాలనుకున్న ఒక డాక్టర్ హీరోని కురూపిని చేస్తాడు (మిడిల్), 3. దీనికి ప్రతీకారంగా డాక్టర్నీ అతడి అనుచరుల్నీ కురూపుల్ని చేస్తాడు హీరో (ఎండ్). ఇలా మూడు పరస్పరాధార విభాగాలుగా త్రీయాక్ట్స్ స్ట్రక్చర్ లో వుంది కథ.

        ఉబుసుపోక ఆలోచిస్తూంటే ఇదే ఐడియా ఇలా తోచిందనుకుందాం : హీరో హీరోయిన్ని ప్రేమిస్తాడు, దాంతో హీరోయిన్ని పొందాలనుకున్న ఒక డాక్టర్ హీరోని కురూపిని చేయాలని ప్రయత్నిస్తూంటాడు, ఇంకా ఇంకా ప్రయత్నిస్తూంటాడు, మరీమరీ ప్రయత్నిస్తూంటాడు, ఇంతలో హీరో చేతిలో అనుకోకుండా హీరోయినే కురూపి అయిపోతుంది. ఇప్పుడు ఇది గాథవుతుంది. దీంట్లో బిగినింగ్, మిడిల్, ఎండ్ లతో కూడిన స్ట్రక్చర్ లేదు. హీరో హీరోయిన్ని ప్రేమిస్తాడు (బిగినింగ్) దాంతో హీరోయిన్ని పొందాలనుకున్న ఒక డాక్టర్ హీరోని కురూపిని చేయాలని ప్రయత్నిస్తూంటాడు (ఇంకాస్తా బిగినింగ్), ఇంకా ఇంకా ప్రయత్నిస్తూంటాడు (ఇంకాస్తా బిగినింగ్), మరీ మరీ ప్రయత్నిస్తూంటాడు (మరి కాస్తా బిగినింగ్), ఇంతలో హీరో చేతిలో అనుకోకుండా హీరోయినే కురూపి అయిపోతుంది (ఎండ్).

     గాథలు ఆడవని కాదు. ఇప్పుడిక ఆడతాయి. కోవిడ్ వల్ల ఈ ఏడాదిన్నర కాలంగా ఓటీటీకి అలవాటు పడ్డ ప్రేక్షకులు రియలిస్టిక్ సినిమాలు చూసేస్తున్నారు. కోవిడ్ కి పూర్వం థియేటర్లలో రెగ్యులర్ కమర్షియల్స్ అయితేనే చూసేవాళ్ళు. థియేటర్లు మూతబడ్డాక ఓటీటీల్లో రియలిస్టిక్కులు చూసేస్తున్నారు. ఇవే సినిమాలు థియేటర్లలో విడుదలైతే ఎంతమంది చూస్తారనేది సందేహమే. టికెట్టు కొని థియేటర్లో చూడాలంటే ఆ సినిమా ఫుల్ మజా ఇచ్చే మూస ఫార్ములా అయివుండాలి. టికెట్టు కొంటే ఒక అభిరుచి, ఫ్రీగా వస్తే ఇంకో అభిరుచి. అందుకని రియలిస్టిక్స్ తీసే మేకర్లు థియేటర్ల మీద ఆశ పెట్టుకోవాలంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సి వుంటుంది.

        పూర్వం ఆర్ట్ సినిమాలు గాథలే. ఆర్ట్ సినిమాలే గాథలతో రూపం మార్చుకుని రియలిస్టిక్స్ గా వస్తున్నాయని గమనించాలి. ఈ ట్రెండ్ కి ముందు సెమీ రియలిస్టిక్ అంటూ కాస్త ధైర్యం చేస్తూ వచ్చేవి. ఇప్పుడు పూర్తిస్థాయి రియలిస్టిక్ గా వచ్చేస్తున్నాయి.


        ఇక కథకీ, గాథకీ తేడా ఏమిటో అనేకసార్లు చెప్పుకున్నదే. కథంటే ఆర్గ్యుమెంట్ అని, గాథంటే స్టేట్ మెంట్ అని. కథ ఒక సమస్యని పరిష్కరించే వాదాన్ని (ఆర్గ్యుమెంట్) ని ప్రతిపాదిస్తేగాథ సమస్యని ఏకరువు పెట్టి వాపోతుంది (స్టేట్ మెంట్).  అంటే గాథలు పరిష్కారం జోలికి పోకుండా కేవలం  సమస్యని ఏకరువుబెట్టే స్టేట్ మెంట్ మాత్రంగా 
వుంటేకథలు  సమస్య అంతు తేల్చి జడ్జిమెంటు ఇచ్చేవిగా వుంటాయి. గాథల్లో పాసివ్ పాత్రలుంటే, కథలో యాక్టివ్ పాత్రలుంటాయి.



        ఇలా ఐడియాలో మార్కెట్ యాస్పెక్ట్, స్ట్రక్చర్ నిర్ణయించుకున్నాక రీసెర్చికి రావాలి. రీసెర్చి అంటే ఐడియాకి సంబంధించి విషయ సేకరణ. విషయ సేకరణ తర్వాతే కథ ఆలో చించాలి. విషయ సేకరణని బట్టి కథ వుంటుంది గానీ కథని బట్టి విషయ సేకరణ వుండదు. ఐడియాని బట్టి విషయ సేకరణ వుంటుంది. దీని గురించి రేపు తెలుసుకుందాం.

సికిందర్

 

 

Sunday, June 6, 2021

1044 : సందేహాలు - సమాధానాలు

 Q :  నా స్క్రిప్టు స్ట్రక్చర్ చెక్ చేయించాలనుకుంటున్నాను. మీరు తప్ప నాకెవవరూ కని పించడం లేదు. ట్రీట్ మెంట్, డైలాగ్ వెర్షన్ వీటిలో ఏది మీకు పంపాలి? ఎలా పంపాలి? స్ట్రక్చర్ చెక్ చేయిస్తే సరిపోతుందా? తెలియజేయగలరు. 
దర్శకుడు


A : డైలాగ్ వెర్షన్ కాకుండా ట్రీట్ మెంట్ పంపండి. డైలాగ్ వెర్షన్ లో ట్రీట్మెంట్ కి మార్పు చేర్పులు జరిగితే డైలాగ్ వెర్షన్నే పంపండి. స్ట్రక్చర్ చెక్ లో సరిచేసుకోవాల్సిన సమస్త లోపాల గురించే లిస్టు ఇవ్వడం వుంటుంది. వీటిని సరిచేయాల్సి వస్తే స్క్రీన్ ప్లే సెట్టింగ్ అని వేరే వుంటుంది. ఇది పదిహేను రోజులు ముఖాముఖీ సమావేశం. మెయిల్ అయితే : msikander35@gmail.com కి, వాట్సాప్ అయితే : 9247347511 కి పంపండి.

Q :  నాయాట్టు మూవీలో మణియన్ చనిపోయాక మిగిలిన ఇద్దరూ వీడియో ఆధారంగా కేసులోంచి  బయటపడి వుంటే అది గాథ కాకుండా కథ అయ్యేది కదా? కమర్షియల్ గా కూడా వుండేది కదా?
సత్యఫణి, దర్శకత్వ అభిలాషి

A :  ఈ కాన్సెప్ట్ కేసులోంచి బయటపడడం గురించి కాదు, బోగస్ కేసుకి బలి అవడం గురించి. కనుక ఇది కథగా మారే అవకాశమే లేదు. గాథ గానే సరిగా చూపించాలి. చనిపోయిన మణియన్ మాట్లాడిన వీడియో వున్న సెల్ ప్రవీణ్ చూసినప్పుడేం చేయాలి? వెనుక నుంచి పోలీసు టీం తరుముకొస్తోంది. తను ఎలాగూ దొరికిపోతాడు. ఆ వీడియోని ఇంకెవరికో సెండ్ చేసేస్తే వీడియో సేఫ్ అయిపోతుంది. ఇది చేయకుండా సెల్ తో సహా దొరికిపోతాడు. దీంతో అతడి దారులు పూర్తిగా మూసుకుపోయాయి. ఇలా పాసివ్ క్యారక్టర్ అయిపోయాడు. ఇలాకాక, వీడియో సెండ్ చేస్తున్నప్పుడు అతను దొరికిపోయి వుంటే సీను కరెక్టుగా వుండేది- కథనంతో, పాత్ర చిత్రణతో.

        తర్వాత ఆ వీడియోని పై అధికారి చూసి, దీని కాపీ వుందా అని అడుగుతాడు. లేదని కింది ఉద్యోగి చెప్పేసరికి, ఆ పై అధికారి సెల్లోంచి మెమరీ కార్డు తీసి విరిచేస్తాడు. అలా ఆ వీడియో సాక్ష్యం లేకుండా చేశానను కుంటాడు. ఇది కూడా తప్పే. ఆ వీడియోని ప్రవీణ్ సెండ్ చేసి వుండడని ఎలా నమ్ముతాడు. ఇక కథలు మాత్రమే కమర్షియల్ అనుకోకూడదు. సరిగా తీస్తే గాథలు కూడా కమర్షియల్సే. రియలిస్టిక్స్ కూడా కమర్షియల్సే. కథల్నే సరిగా తీయకపోవడంతో కమర్షియల్ గాకుండా పోతున్నాయి.   

Q :   'శివ 1989' పర్ఫెక్ట్ త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో ఉంది కదా. మరి 'శివ 2006' ఎందుకు ప్లాప్ అయింది?
మహేష్ రెడ్డి, రైటర్

A : 1989 నాటి శివ 2006 నాటి రీమేక్ కి కాలం చెల్లిన పోయిన కథ. స్ట్రక్చర్ తో సంబంధం లేదు. 2006 లో కాలేజీ యూనియన్లూ, విద్యార్ధి రాజకీయాలూ ఎక్కడున్నాయి. 2019 లో విడుదలైన డియర్ కామ్రేడ్ లో చూపించిన హీరో వామపక్ష భావజాలం, స్టూడెంట్ యూనియన్లూ, స్టూడెంట్స్ మీద శివటైపు రాజకీయ పెత్తనాలూ, క్యాంపస్ ఎలక్షన్లూ  ఇప్పుడెక్కడున్నాయి. ఇది కూడా ఫ్లాపయింది. 2019 లోనే ఇలాటి కథతో జార్జిరెడ్డి హిట్టవ్వాల్సింది. ఎందుకంటే అది 1970 లలో  జార్జిరెడ్డి అనే రెబెల్ విద్యార్ధి బయోపిక్. దీన్ని గజిబిజిగా తీసి ఫ్లాప్ చేశారు. ఇలాటి కథలతో బయోపిక్స్ లేదా పీరియడ్ మూవీస్ తీయొచ్చేమో గానీ, ఈ కాలపు కాల్పనిక కథలుగా తీయడం అర్ధం లేని పని.     

Q :   నాయాట్టు చూశాక నాదొక సందేహం. అసలు  హీరోకి గోల్ లేకుండా కథ చేయలేమంటారా?
శ్యాంబాబు, అసిస్టెంట్

A : చేయొచ్చు మానసిక శాస్త్రంతో. ఏదైనా సాధిస్తే ఇంకా సాధించాలన్పిస్తుంది. ఎంత  సంపాదించినా ఇంకా సంపాదించాలన్పిస్తుంది. సంతృప్తి అనేది వుండదు. ఒక గోల్ అంటూ వుండదు. ఫుల్ స్టాప్ వుండదు. అలాగే హీరోకి విలన్ని చంపాలన్న గోల్ వుందనుకుందాం. ఆ గోల్ ని పట్టించుకోడు. చంపాక ఇంకా ఇంకా చంపాలన్పిస్తుంది కాబట్టి. ఒకసారి చంపాక ఇంకా ఇంకా ఎలా చంపుతాడు? ఇదీ సమస్య. ఆ సమస్యెలా తీరాలి? ఇదీ కథ.

Q : కథ రాసుకునేటప్పుడు ఏ స్టేట్ ఆఫ్ మైండ్ తో వుండాలి?
ఒక అసోసియేట్    

A : ఏ పని చేసేప్పుడైనా బాడీ, మైండ్, ఎమోషన్, ఎనర్జీ కలిసి పనిచేసేట్టు చూసుకుంటే పనికి ప్రయోజనం చేకూరుతుంది- అని మనం కాదు, జగ్గీ వాసుదేవ్ చెప్తున్నాడు. 

సికిందర్