రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, October 3, 2018

692 : స్క్రీన్ ప్లే సంగతులు


          తెలుగు సినిమా మలిస్వర్ణ యుగంలో పాతాళభైరవి తర్వాత దొంగరాముడు పుణే ఫిలిం ఇనిస్టిట్యూట్ లో బోధనాంశంగా స్థానం సంపాదించుకుంది. సినిమా విడుదలై అరవై యేళ్ళు దాటింది. ఈ అరవై ఏళ్ళ కాలంలో సినిమా ధోరణులు ఆరు సార్లు మారుతూ వచ్చాయి. పదేళ్లకో ధోరణి (ట్రెండ్) మారిపోతూ వుంటుంది. తొలిస్వర్ణ యుగమైనా (1931-51), మలిస్వర్ణ యుగమైనా (1951- 71) అప్పట్లో సినిమాలు పూర్తిగా వ్యాపారాత్మకం కాలేదు. దేశస్వాతంత్ర్యానికి పూర్వం రెండు దశాబ్దాలు, స్వాతంత్ర్యానికి తర్వాత ఇంకో రెండు దశాబ్దాలుగా అటూ ఇటూ సాగిన ఈ రెండు స్వర్ణ యుగాలూ, విలువలకి పట్టం గట్టాయంటే  అప్పటి దేశకాల పరిస్థితులు అలాటివి. దేశభక్తి ముందు అవినీతి రాజకీయాల్లేవు, స్వార్ధపూరిత జీవితాలు లేవు. దేశంలో మొట్ట మొదటి స్కామ్1980 లలోనే బోఫోర్స్ తో ప్రారంభమైంది. అలా జీవితాల్లో విలువలు తరిగి పోవడంతో,  తొలివ్యాపార యుగపు (1971 – 2000) సినిమాల్లో కూడా విలువలకి స్థానం లేకుండా పోయింది. ఇక 2000 నుంచి ప్రారంభమైన మలి (కల్తీ) వ్యాపార యుగం గురించి చెప్పనవసరం లేదు. ఇవి కూడా విలువలే, కాకపోతే లపాకీ విలువలు. 

          యితే విలువలు ఎలాటివైనా వాటిని చిత్రించేందుకు కొన్ని ప్రమాణాలు వుంటాయి. ప్రమాణాలకి కూడా విలువలు తీసేస్తే?  అప్పుడు మలి (కల్తీ) వ్యాపార యుగమైనా వ్యాపారంలా వుండదు. 90 శాతం అట్టర్ ఫ్లాపులతో పాపంలా పెరుగుతుంది. 

          నాటి మలిస్వర్ణ యుగం సమాజంలో విలువలు - సినిమా నిర్మాణంలో ప్రమాణాలూ అనే జోడుగుర్రాల స్వారీగా సాగినట్టు కనబడుతుంది చరిత్ర చూస్తే. సమాజ విలువల్ని కాపాడుతూనే; రచనలో, దర్శకత్వంలో, నటనల్లో ప్రమాణాలు నెలకొల్పడం. పాతాళ భైరవి, మిస్సమ్మ, మల్లీశ్వరి, మాయాబజార్, దేవదాసుల నుంచి మొదలుకొంటే; మూగమనసులు, మోసగాళ్ళకు మోసగాడు, సాక్షి, మరో ప్రపంచం, సుడి గుండాలు వరకూ ఈ ప్రమాణాలు - ఇప్పుడు మాయమైపోయిన ఎన్నో వైవిధ్యభరిత జానర్లని కూడా అందించాయి. తొలి స్వర్ణయుగపు ప్రతీకలైన భక్తీ, పౌరాణిక, చారిత్రాత్మక, సామాజిక, కుటుంబ జానర్లని కొనసాగిస్తూనే; విప్లవ, హాస్య, ప్రేమ, వాస్తవిక, గూఢచారి, కౌబాయ్, హార్రర్, క్రైం థ్రిల్లర్ మొదలైన ఇతర జానర్లెన్నోమలి స్వర్ణయుగంలో ప్రవేశ పెట్టినవే. అంతే కాదు, సార్వజనీన త్రీ యాక్ట్ స్ట్రక్చర్ తో స్క్రీన్ ప్లేలు పరిఢవిల్లింది కూడా ఈ కాలంలోనే. స్ట్రక్చర్ ని నిలుపుకుంటూనే స్ట్రక్చర్ లోపల విభిన్న క్రియేటివిటీలు, తత్సంబంధ టెక్నిక్కులు, ఫార్ములాలూ కనిపెట్టింది కూడా ఈ కాలంలోనే. ఊత పదాలు సహా ఐటెం సాంగుల్ని పరిచయం చేసింది కూడా ఈ మలిస్వర్ణ యుగంలోనే. కాకపోతే ఊతపదాలు ప్రతినాయక పాత్రలకి రాశారు. పాతాళభైరవి ఎస్వీ రంగారావు నోట ‘సాహసం శాయరా డింభకా’, దొంగ రాముడులో ఆర్ నాగేశ్వరరావు చేత ‘బాబుల్ గాడి దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాలి’  లాంటివి. పాతాళభైరవిలో ‘వగలోయ్ వగలు’  అనే పాట ఐటెం సాంగే. ఐతే ఈ పాటని కథలో వుంచుతూ, కథని మలుపు తిప్పే ఘట్టంగా చిత్రించారు. యాభయ్యేళ్ళ తర్వాత ప్రారంభమైన ఇదే ఐటెం సాంగుల ట్రెండులో కథతో సంబంధంలేని కరివేపాకు పాటలయ్యాయి. ఇక లో - బడ్జెట్ లో సాక్షి, సుడిగుండాలు, మరోప్రపంచం లాంటి వాస్తవిక ప్రయోగాత్మక సినిమాలని తీయడాన్ని ప్రారంభించింది కూడా మలిస్వర్ణ యుగంలోనే. కాకపోతే చివరి అంకంలో. 

        మలి స్వర్ణ యుగంలో గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, కథల్ని తేటగా, నునులేతగా, సహజత్వంతో కూడుకున్న నిరాడంబర కథనాలుగా చూపించే వారు. డైలాగుల మోత, మెలో డ్రామా వుండేవి  కాదు. ఇదంతా తర్వాత తొలివ్యాపార యుగంలో హీరోయిజాల, వూర హీరోయిజాల కొత్త ట్రెండ్ లో  తిరగబడింది. వాస్తవికత, సహజత్వాలనేవి జవసత్వాలు చాలించి కూర్చున్నాయి. ఒవరాక్షన్లు, అతి డైలాగులు, రక్త స్నానాలు, బూతు జలకాలూ, మెలో డ్రామాలు, నాటకీయతలూ, అమల్లోకి వచ్చాయి. మలి (కల్తీ) వ్యాపార యుగంలోనూ గత నాల్గైదు ఏళ్ల క్రితం వరకూ ఇదే పరిస్థితి. ఈ పరిస్థితి ఇప్పుడు కాస్త మారుతోంది. అంటే నాటి మలి స్వర్ణయుగంలోకి ప్రయాణం కడుతోంది. అప్పటి సహజత్వాలు, అప్పటి వాస్తవికతలు, అప్పటి తక్కువ సంభాషణలు, అప్పటి తేటదనాలే కాకుండా, అప్పటి ప్రయోగాత్మక ప్రయత్నాలూ ఇప్పుడు కనబడుతున్నాయి. అయితే ఈ ప్యాకేజీలో ఒకటే లోపం – మలిస్వర్ణ యుగపు కథ చెప్పే టెక్నిక్, అప్పటి డైనమిక్స్ మచ్చుకైనా కానరాకపోవడం. అసలు కథనాల్లో డైనమిక్స్ అంటే ఏమిటో, అవెలా ఏర్పడతాయో, వాటి ప్రయోజనాలేమిటో అసలే అర్ధంజేసుకోలేక పోవడం.  

          దొంగరాముడు మలిస్వర్ణ యుగపు 1955 లో విడుదలైంది. ఇప్పుడు చరిత్ర పునరావృతమవుతున్నట్టు, లపాకీ విలువల మలి (కల్తీ) వ్యాపార యుగం, తెలియకుండానే నాటి మలిస్వర్ణ యుగపు సొగసులు అద్దుకుంటున్నఈ చారిత్రక మలుపులో -  సృజనాత్మకతా పరంగా దొంగరాముడ్ని పరిచయం చేసుకోవాల్సిన అవసరముందని పక్కాగా తేలింది. ఈ కల్తీ యుగం తర్వాత మిగిలేది యుగాంతమేనేమో తెలీదు. ‘మేరా నామ్ జోకర్’ లో రాజ్ కపూర్ పాడినట్టు - ఈ సర్కస్ మూడు గంటల షో...మొదటి గంట బాల్యం, రెండో గంట యౌవనం, మూడో గంట వృద్ధాప్యం...ఆ తర్వాత – ఖాళీ ఖాళీ కుర్చీలే, పిచ్చుకలెగిరి పోయిన గూళ్ళే... లాంటి పరిస్థితి తెచ్చిపెట్టుకోకూడదంటే, ఇంకా ముసలి సినిమాలు రాయకుండా తీయకుండా వుండాలంటే - కుర్చీలు ఖాళీ అయిపోకుండా వుండాలంటే – పరవళ్ళు తొక్కిన మలిస్వర్ణ యుగంతో గుణాత్మకంగా బంధుత్వాన్ని కలుపుకోవాల్సిందే.

***
       దొంగ రాముడులో డైనమిక్స్ ఎక్కువ. కథ నిదానంగా దాని సమయం తీసుకుంటూ సాగినా, దృశ్యాల్లో కన్పించే డైనమిక్స్ ఎక్కువ. హీరో చిన్నప్పటి కథ పూర్తవడానికి 25 నిమిషాలు పడుతుంది. అప్పుడు మాత్రమే ఎదిగిన హీరోగా దొంగరాముడు (అక్కినేని నా గేశ్వర రావు) కనిపిస్తాడు. ఆ తర్వాత ఇంకో 15 నిమిషాలకి గానీ హీరోయిన్ సీత (సావిత్రి) కన్పించదు. ఆ తర్వాత 5 నిమిషాలకి గానీ ఇంకో ముఖ్యపాత్ర దొంగరాముడి చెల్లెలు లక్ష్మి (జమున) తెరపైకి రాదు. అంటే నాగేశ్వరరావు, సావిత్రి, జమునలు వంటి ప్రముఖ తారలు ప్రేక్షకులకి తెరమీద కన్పించడానికి అరగంట నుంచీ ముప్పావు గంట సమయమూ  తీసుకుంటారన్న మాట. అప్పటికి ఆక్కినేని –సావిత్రిల సూపర్ హిట్ దేవదాసు విడుదలై రెండేళ్ళయింది. అయినప్పటికీ కూడా అంతటి పాపులర్ తారల ఇమేజిని, ఫాలోయింగ్ నీ దృష్టిలో పెట్టుకుని దొంగరాముడు కథ చేయలేదు. అప్పట్లో ఇంకా హీరోయిజాలు ప్రారంభం కాలేదు కాబట్టి, తారలు కాకుండా కథ, అది తీసుకునే సమయమే ప్రధానమైంది. తర్వాత వ్యాపార యుగం నుంచీ ప్రారంభమైన తారల గ్లామర్ హంగూ ఆర్భాటాలతో పోలిస్తే, మలిస్వర్ణ యుగంలో కన్పించేది గ్లామర్ లేని పాత్రలే. ఏవైతే 1970 లలో ఆర్టు సినిమాలంటూ రావడం ప్రారంభించాయో, వాటిలో వుండే బీదాబిక్కీ తరహా గ్లామర్ లేని సామాన్య పాత్రల్నే మలిస్వర్ణ యుగంలో సహజత్వానికి ధర్మాసనం వేస్తూ ప్రేక్షకులకి అందించారు. 

          దొంగరాముడులో ఇంకో ముఖ్య పాత్ర కన్పించదు. అది విలన్ పాత్ర. విలన్ లేకుండానే దొంగరాముడికి కష్టాలుంటాయి. అతడి చేష్టలు చాలు తనకి తానే విలన్ అవడానికి. 

          దొంగరాముడు నిర్మాత దుక్కిపాటి మధుసూదన రావు; దర్శకుడు – స్క్రీన్ ప్లే రచయిత కెవి రెడ్డి, కథ కెవి రెడ్డి, డివి నరసరాజు, దుక్కిపాటి మధుసూదన రావు; మాటలు డివి నరసరాజు, సంగీతం పెండ్యాల, ఛాయాగ్రహణం ఆడి ఎం ఇరానీ, ఇతర తారాగణం జగ్గయ్య, రేలంగి, ఆర్ నాగేశ్వరరావు, సూర్యకాంతం తదితరులు. 

          దొంగరాముడు కథ అరగంటకోసారి రిపీటవుతూ వుంటుంది. దీంతో మూడు క్లయిమాక్సులు వున్నట్టుగా అన్పిస్తుంది. భవిష్యత్తులో 1998 లో రన్ లోలా రన్ లాంటి మూడు క్లయిమాక్సుల మూవీ వస్తుందని అప్పుడే వూహించారేమో. కొన్ని అలా జరిగిపోతాయి. 

          దొంగరాముడు చిన్నప్పుడు అలా చేసి వుండకపోతే జైలుకి వెళ్ళేవాడు కాదు. విడుదలై  పెద్దోడుగా అలా చేసి వుండక పోతే మరోసారి జైలుకి వెళ్ళే వాడు కాదు. మళ్ళీ విడుదలయ్యాక అలా కూడా చేసి వుండక పోతే ఇంకోసారీ జైలుకి వెళ్ళే వాడే కాదు. మరి ఏంచేసి వుండాలి దొంగరాముడనే వాడు?



 రేపు!

సికిందర్


Tuesday, October 2, 2018

691 : స్పెషల్ ఆర్టికల్


          2010 ఆస్కార్ ఉత్తమ విదేశీ చిత్రం అవార్డు పొందిన అర్జెంటీనా మూవీ ‘ది సీక్రెట్ ఇన్ దెయిర్ ఐస్’ ఒక అద్భుత చిత్రరాజం. చూస్తే మరిచిపోవడం కష్టం. నిర్మాత, దర్శకుడు, రచయిత, ఎడిటర్ జువాన్ జోస్ కాంపెనెల్లా 1979 నుంచీ సినిమాలు తీస్తున్నా, ఎట్టకేలకు 2010 లో ఆస్కార్ అవార్డుకి నోచుకుని అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. ఎడురాడో సచేరీ  అనే రచయిత రాసిన ‘లా ప్రెగంటా డీ సాస్ ఒజొస్’ (వారి కళ్ళల్లో ప్రశ్న) నవలని చిత్రానువాదం చేసి తెరకెక్కించాడు దర్శకుడు కాంపెనెల్లా. ఇంజనీరింగ్ ఐదో సంవత్సరం జా యినయ్యే రోజు,  ‘ఆల్ దట్ జాజ్’ అనే సినిమా చూశాక, కాలేజీలో జాయినవ్వడం మానేసి దర్శకుడవ్వాలని అప్పటికప్పుడు నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం ఇలా ఆస్కార్ కి చేర్చింది...  

        ‘ది సీక్రెట్ ఇన్ దెయిర్ ఐస్’ సినిమా చివరి వరకూ చూస్తే,  సినిమా తీసిన విధానం ఎంతో జాగ్రత్తగా నవలని మనం చదువుతున్నట్టే వుంటుంది. ఇది పూర్తి డ్రామా (నాటకీయత) చిత్రమూ కాదు. రహస్యాన్ని ఛేదించడమనే మిస్టరీ, శృంగారం అనే రసాలు కలగలిసిన చిత్రం. ఇందులో సినిమాని  ముందుకు నడిపేది రహస్య ఛేదన అనే మిస్టరీనే కాబట్టి రహస్య ఛేదనలో రహస్యంగా ఏదో జరగాలి. దాని వెనుకున్న అంతుచిక్కని రహస్యాన్ని ఛేదించాలి. అలా దీన్లో అంతుచిక్కని రహస్యం దాగున్నది ఏమిటి? దీనిలో చర్చించిన విలువలు ఏమిటి?

         ఈ సినిమా మొదట్లో అతను అంతర్ముఖుడు. తనలో వున్న భావాలు బయటకు తెలుపలేడు బెరుకు వల్ల. సినిమా చివరికి వచ్చే సరికి బహిర్ముఖుడుగా మారతాడు  ధైర్యం వల్ల. ఇవే సినిమాలో విలువలు. ఇది నాన్లీనియర్స్ట్రక్చర్లో నిర్మితమైన కథనం.

          సినిమా
ప్రారంభంలో సోలెడాడ్ విలామిల్ (కధానాయిక), కథానాయకుడు రికార్డో డారిన్వైపు మౌనంగా, ఆర్తితో, నిరాశగా చూస్తుంటుంది. ఆమె చూపుల్లో అతను వెనక్కి వస్తాడనే భావన ఎక్కడో కనిపిస్తుంది. అమె చుట్టూ వున్న ప్రపంచం చలిస్తూ వుండగా, ఆమె నిశ్చలంగా వుంది. తనెక్కడో ఆగిపోయింది -  అతను బ్యాగ్ అందుకుని ట్రైన్ ఎక్కుతాడు. అతనికి రావాలనే వుంది, తనలోనే ఏదో తనని ముందుకు నడిపిస్తుంది. కాదు వెనక్కిలాగుతుంది. తన స్వంతమైన దాన్ని దూరం చేసుకునేలా చేస్తుంది. ట్రైన్ కదులుతుంది. ఆమె పరిగెడుతూ ట్రైన్ని అందుకోవాలని చూస్తుంది, అతను ట్రైన్లో నుండి ఆమెని చూస్తుంటాడు. ట్రైన్ వేగాన్ని అందుకోలేని తను నిలబడుతుంది. ఇద్దరి మధ్య దూరం పెరుగుతూనే వుంది. ఇమేజ్ బ్లర్ అవుతూ, లాగ్ అవుతూ వున్న, ట్రాక్/డాలీ అవుట్ షాట్. దూరం కావాలని సృష్టించుకున్నది, కృత్రిమమైనది. దూరం ఎందుకు? కారణం ఏమిటి? కథ ముందుకు వెళుతున్న కొద్దీ తెలుస్తుంది.

          రాయటం
, చెరపటం, మనసు సంతృప్తి కలిగే దాకా మళ్ళీ రాయటం అతనికి అలవాటే. రాయటం అతని ప్రవృత్తి. అతను అంతర్ముఖుడు. తనలో వున్నది తనలోనే దాచుకునే వ్యక్తి, మాటల్తో బయటికి చెప్పలేడు రచయిత కదా. భావాల్ని అక్షరాల్లో వ్యక్తీకరించటం అలవాటే. వయసు మీద పడింది. మనం చూసిన యువకుడు కాదతను. కథని రాయటం ప్రారంభించగానే అనేకానేక సంఘటనలు ఊహల్లో మొదులుతాయి. అవన్నీ గతంలో తన అనుభవాలే చూసినవి లేదా విన్నవి. విసుగొచ్చి పడుకుంటాడు. నిద్రలో లేచి రాస్తాడు.  పొద్దుటే దాన్ని తీసి చూస్తాడు. భయం అనే రాసాడు రాత్రి. దేనికి భయపడుతున్నాడు? కారణం ఏమిటి? కథా గమనంలో క్రమంగా అర్ధమవుతుంది.

       రచన ప్రవృత్తి ఐతే, అతని వృత్తి ప్రభుత్య న్యాయ ప్రతినిధి. కథ వెనక్కి వెళ్తుంది. ఆమె అతని పై అధికారి. తప్పని పరిస్థితుల్లో కేసు విచారణకి వెళ్తాడు.  చనిపోయింది కార్లా క్వెవెడో అనే టీచర్. భర్త పాబ్లో రాగో అనే బాంక్ క్లర్క్. అత్యంత అమానవీయ స్థితిలో రక్తపు మరకలతో వున్న ఆమె మృతదేహం నగ్నంగా పడి వుంటుంది. ఎవరు చంపారో ఆధారాలు లేవు. రహస్యాన్ని ఛేదించాలి. ఇదే కథ మొదలైన  15 నిమిషాల్లో పడే హుక్. ఇక కేసుని ఛేదించటం, తనపై అధికారిణి పై ప్రేమని వ్యక్తం చెయ్యటం, రెండూ జరుగుతాయా జరగవా అనే ఆసక్తిని కథ రేకెత్తిస్తుంది

         
విచారణ మొదలవుతుంది. భర్తపై అనుమానం లేదు,  హంతకుడెవరో తెలీదు. ఆమె జీవితాన్ని తరచి తరచి శోధిస్తారు. ఎవరిపై ఎలాంటి అనుమానమూ కలిగే అవకాశం లేదు. ఇంట్లో హత్య జరిగిన సమయంలో ఇద్దరు తాపీ పనివాళ్లు పక్కన ఇంట్లో పని చేస్తున్నారని తెలుస్తుంది. రొమానో అనే అధికారి వారిని పట్టుకున్నాడని తెలుస్తుంది. వాళ్ళని విచారించడానికి జైలుకి వెళ్తాడు రికార్డో డారిన్. వారిద్దరు అమాయకులని అర్ధమవుతుంది. కేసుని కప్పి పుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అసలు హంతకుడెవరు? రొమానోనే అసలు హంతకుడ్ని తప్పిస్తున్నాడని రికార్డో అతనితో గొడవపడతాడు.

         రికార్డో సహాయకుడు గిలిరెమో ఫ్రాన్సెసా తాగుబోతు, ఇంట్లో విషయమై భార్యతో గొడవ అతను తాగి పడిపోయే స్థితిలో రికార్డో అతన్ని ఇంట్లో దిగబెడుతుంటాడు.కథలో కీలకమైన మలుపు (ప్లాట్ పాయింట్ -1. 30 నిమిషాలు) రికార్డో - కార్లా ఫొటోలని తిరగేస్తూ దాన్లో ఒక వ్యక్తిని అనుమానిస్తాడు. అతని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే చిన్ననాటి స్నేహితుడని తెలుస్తుంది. భర్త అతను ప్రస్తుతం ఎక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. కార్లా బ్యూనస్ ఏర్స్ కి వచ్చాక ఆమె, జేవియర్ గోడినో ఇద్దరు కలుసుకోలేదని తెలుస్తుంది. విచారణ కొనసాగుతుంది. అతను పని చేసే చోట విచారిస్తారు. అతనికి రాత్రి ఫోన్ వచ్చిందని అది రాగానే అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడని తెలుస్తుంది. పై అధికారులు కేసుపై ఆసక్తి కనబరచరు. అతని తల్లి ఇంటిని సోదా  చేసే అవకాశం రికార్డోకి ఇవ్వరు. తోటి అధికారితో కలిసి అనుమతి లేకుండా ఇల్లు  శోధిస్తాడు. పాత ఉత్తరాలు దొరుకుతాయి. విషయం తెలిసిన పై అధికారులు అనుమతి లేకుండా అనుమానితుడి ఇల్లు శోధించినందుకు మందలిస్తారు. దొరికిన లేఖల్లో ఎలాంటి ఆధారాలు వుండవు. కథ రెండో అంకం మధ్య భాగానికి వచ్చే సరికి (మిడ్ పాయింట్ - షుమారు 60 నిమిషాలు) కీలకమైన మలుపు తిరుగుతుంది.

         
అతన్ని తామెందుకు కనిపెట్టలేకపోతున్నామో తాగుబోతు సహఅధికారి వివరిస్తాడు. అతను ప్రతిసారి ఉద్యోగాలు మారుతున్నాడు, చిరునామాలు మారుస్తున్నాడు. కానీ ప్రతి వ్యక్తిలో మార్పు చెందని విషయం ఒకటి వుంటుంది. మనం ప్రత్యేకంగా కనిపించడానికి ఏదైనా మార్చగలం కానీ ఒక్క విషయాన్ని మార్చలేము. అదే వ్యక్తికున్న మోహం. మనం దేన్నయితే అధికంగా ఇష్టపడతామో దాన్ని మోహిస్తాం.  దాన్ని మార్చుకోలేం.  అది మన అలవాటుగా మారుతుంది. నువ్వు మన పై అధికారిపై ప్రేమ నుండి తప్పించుకోలేవు, నేను తాగకుండా వుండలేను, ఇవే మన అంతరంగం నుండి పుట్టిన కామనలు. అలాగే అతనికి ఫుట్బాల్ అంటే ఇష్టం. అతన్ని అక్కడే దొరకపట్టొచ్చు అని చెప్తాడు.ఫుట్బాల్ మైదానానికి వెళ్తారు అతను దొరుకుతాడు. కానీ నేరాన్ని అంగీకరించడు. రికార్డీ ప్రియురాలు పై అధికారిణి అతని మనఃతత్త్వాన్ని పసిగట్టి అతన్ని పరీక్షిస్తుంది. సన్నివేశం అత్యద్భుతంగా చిత్రీకరించారు. రచించిన విధానం అమోఘం. అతనికి శిక్ష పడేలా చేస్తారు.

       అతను కొన్ని రోజుల తర్వాత వాళ్ల ఎదురుగా బయట తిరుగుతూ కనిపిస్తాడు. వాళ్లకి కనిపించిన మొదటిసారి లిఫ్ట్లో సన్నివేశం భయం గొలుపుతుంది. స్థితికి వచ్చే సరికి కథలో మనం పూర్తిగా లీనమై వుంటాం. రికార్డీ పై అధికారిణీ ప్రియురాలికి పెళ్ళి కుదురుతుంది. ఏదైనా చివరి క్షణంలో చెప్తాడని చూస్తుంది కానీ చెప్పడు. రికార్డోని చంపడానికి వచ్చిన హంతకులు అతని సహచరుడు తాగుబోతుని చంపేస్తారు. చిత్ర ప్రారంభంలో చూసిన సన్నివేశం వస్తుంది. ఆమెకి తను సరికాదని తన ప్రేమని వ్యక్తిం చేయలేక అతను ఆమె నుండి దూరంగా వెళ్ళిపోతాడు.

         
చాలా ఏళ్ల తర్వాత చనిపోయిన అమ్మాయి భర్తని కలవడానికి వెళ్తాడు. జరిగిందేదో జరిగిపోయింది ఇక నువ్వు వెళ్లు, అందరూ మర్చిపోయారు, నీ ఙ్ఞాపకాల్లోంచి సంఘటన తీసివెయ్యి అంటాడు. ఇది కీలకమైన మలుపు (ప్లాట్ పాయింట్ -2. 100  నిమిషాలు)  హంతకుడ్ని తనే చంపానని చెప్తాడు.  ప్రవర్తన అనుమానాస్పదంగా వుండి తన భయాన్ని జయించి వెళ్లిన వాడు వెళ్లినట్టే వెళ్ళి తిరిగి దొడ్డి దారిన అతని ఇంటిని పరిశీలిస్తాడు. అతను ఒక గదిలోకి భోజనం తీసుకెళ్తూ కనిపిస్తాడు. అక్కడ చూసి దృశ్యం ఒళ్లు గగుర్పాటుని కలిగిస్తుంది.

         
అతడు ధైర్యంగా రహస్యాన్ని ఛేదించాడు. చివరికి తన ప్రేమని సాధిస్తాడు. దాన్లోనూ ధైర్యాన్ని ప్రదర్శిస్తాడు. పెళ్లయింది అని ఆమె చెప్పినా తన ప్రేమని ధైర్యంగా వ్యక్తం చేస్తాడు. మొదట సన్నివేశంలో భయంతో తనకి దూరమైన అమ్మాయి మనసు గెలుస్తాడు. 

         
ఈ మూవీని సినిమా వర్గాలు ఎందుకు చూడాలంటే...
          1.
పాత్రలమధ్య భావోద్వేగాల ట్రాక్
          2.
హిచ్ కాక్ టైపు ట్విస్టులు
          3.
పాత్ర రచన చేయడం ద్వారానే రహాస్యాన్ని ఛేదించే కథనం
          4.
లవ్, మర్డర్, రాజకీయం జానర్ల కలబోత
 
మూల్పూరి. ఆదిత్య చౌదరి.