‘సినిమా కథ పాత్రని పట్టుకుని ప్రయాణిస్తే పాత్ర యాక్టివ్
గా వుంటుంది, ఆ యాక్టివ్ పాత్ర కథని ముందుకు నడుపుతుంది… Let's say in a
story heroine and hero has two opposite philosophies towards life. Heroine on a noble side and hero on
a selfish mode. Heroine’s goal is to change the hero. Secretly she plans some thing which transforms the hero by the end. Is this in line what you said
as per active role that drives the story!
―టాలీవుడ్ నుంచి ఒక లేఖ
కాకతాళీయంగా ఇప్పుడు తెలుసుకోబోతున్న అంశమిదే. మొన్న
ప్రచురించిన ‘రెండు ఒకే బాలీవుడ్ లు - రెండు ఒకే టాలీవుడ్ లు - కొత్త స్క్రీన్
ప్లే అయిడియాలు’ శీర్షిక రెండో భాగం ఇప్పుడు దీనికే కేటాయించాం. సినిమా
కథ పాత్రని పట్టుకుని
ప్రయాణిస్తే పాత్ర యాక్టివ్
గా వుంటుంది, ఆ
యాక్టివ్ పాత్ర కథని
ముందుకు నడుపుతుంది… అనడం ప్రధాన పాత్ర
గురించే. అయితే ప్రత్యర్ధి పాత్ర కూడా యాక్టివ్ గానే వుంటుంది, కాకపోతే కథ నడపదు. నడిపితే
ప్రధాన పాత్ర పాసివ్ అయిపోతుంది. ఇక - హీరో హీరోయిన్లకి పరస్పర విరుద్ధ
దృక్పథాలుండి, హీరోయిన్ దృక్పథం ఉన్నతంగా వున్నప్పుడు, హీరోని ఆ దిశగా నడిపిస్తే ఆమె
యాక్టివ్ పాత్రవుతుందా, కథ నడుపుతుందా అని పై ప్రశ్న. ఆమె యాక్టివ్ పాత్ర అన్నది
నిజం, కథ నడిపే పాత్ర అన్నది అబద్ధం. ఆమె ఇక్కడ ప్రత్యర్ధి పాత్ర. ప్రత్యర్ధి పాత్రెప్పుడూ
కథ నడపదు. ప్రత్యర్ధి పాత్రగా ఆమె ప్రధాన పాత్రని ఇరికించి కూర్చుంటే, పీక్కునే
పని ప్రధాన పాత్రగా హీరోదే. ప్రధాన పాత్ర అంటే ప్రత్యర్ధి పాత్ర సృష్టించిన
సమస్యని ఎదుర్కొని పరిష్కరించేదే. అంతేగానీ సమస్యని సృష్టించేది కాదు. సమస్యని
సృష్టించేది ప్రత్యర్ధి పాత్ర. ‘శివ’ లో
సమస్యని సృష్టించేది ప్రత్యర్ధి పాత్ర అయిన మాఫియా భవానీ, సమస్యని ఎదుర్కొని
పరిష్కరించేది ప్రధాన పాత్రయిన శివ. ఏ కథలోనైనా ఇంతే. సమస్య ప్రత్యర్ధి పాత్ర
చేతిలో వుంటే, పరిష్కారం ప్రధాన పాత్ర చేతిలో వుంటుంది. రెండూ యాక్టివ్
పాత్రలుగానే వుంటాయి. కానీ అక్కడ్నించీ కథ నడిపేది, అంతు తేల్చుకునేదీ ప్రధాన
పాత్రే. ఇదొక గేమ్. దృశ్య మాధ్యమమయిన సినిమా కథ ఒక గేమ్. గేమ్ లేని దృశ్య మాధ్యమం
కథ ఆత్మహత్యా సదృశ సోది.
ఇక్కడ హీరో దృక్పథానికి సవాలుగా హీరోయిన్ తన దృక్పథాన్ని ప్రతిపాదించింది. అందుకని
ఈమె యాక్టివ్ ప్రత్యర్ధి పాత్ర (పాసివ్ ప్రత్యర్ధి పాత్రలుండవు). ఇప్పుడు
వీళ్ళిద్దర్లో ఎవరు కరెక్టు? ఇది ఆర్గ్యుమెంటు. కథంటే ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఈ
ఆర్గ్యుమెంట్ లో హీరో గెలవాలనుకోవడమో, ఓడిపోవాలనుకోవడమో అతను పెట్టుకునే గోల్. ఈ
గోల్ తో హీరోయిన్ తో తన కెదురైన సమస్యతో సంఘర్షణ మొదలు పెడతాడు. ఆఖరికి అంతగా
విలువలు లేని తన దృక్పథాన్ని మార్చుకుని ఆమె ఉన్నత దృక్పథానికి మారతాడా, లేదా
అన్నది కథకి ముగింపు.
సమస్య
ఎక్కడొస్తుందంటే, సమస్యని ప్రత్యర్ధి పాత్ర సృష్టించి, పరిష్కారం కూడా ప్రత్యర్ధి పాత్ర
చేస్తేనే వస్తుంది. అది గేమ్ ఎలా అవుతుంది? దృశ్య మాధ్యమమైన సినిమా కథ గేమ్
కాకుండా ఎలాపోతుంది? ఈ గేమ్ మూలాలు సైకో థెరఫీలో కదా వుంటాయి? సినిమా కథ మూలాలు
పామరులు కూడా కనెక్ట్ అయ్యే సైకో థెరఫీలో
కదా వుంటాయి? సినిమా కథంటే కాన్షస్ – సబ్ కాన్షస్ మైండ్ ల లడాయే కదా? నిత్యం మన
సబ్ కాన్షస్ మైండ్ పెట్టే పరీక్షలనే కదా మన కాన్షస్ మైండ్ తో ఎదుర్కొంటాం?
ఎదుర్కొని నేర్చుకుంటాం, నేర్చుకుని బాగుపడతాం? మన సబ్ కాన్షస్ పెట్టే పరీక్షల్ని
సబ్ కాన్షస్సే పరిష్కరించేస్తే, మన
కాన్షస్ చేసే పనేమిటి, నేర్చుకునే దేమిటి? పైగా ఇది జరక్కుండా జరిగేదేమిటంటే, సబ్
కాన్షస్ పరిష్కారాల్ని కాన్షస్ అస్సలొప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదంటే, అది ఇగో
కేంద్రంగా పనిచేస్తుంది. ఆ ఇగో అస్సలొప్పుకోదు. పరీక్ష నువ్వే పెట్టి- పరిష్కారం కూడా
నువ్వే చూపిస్తే, నేనేం దద్దమ్మనా? నేను ఇగోని! నేనే పరిష్కరించుకుంటా ఫో-
అనేస్తుంది. అప్పుడేం చేస్తుంది? సబ్ కాన్షస్ (అంతరాత్మ) లోకి దూకి, అందులో వుండే
పచ్చి నిజాలు, జీవిత సత్యాలు, నైతిక విలువలూ
మొదలైన వాటితో సంఘర్షించి, తప్పొప్పులు తెలుసుకుని, ఒడ్డున పడి
పరిష్కరించుకుంటుంది. ఇగోని కాస్తా మెచ్యూర్డ్ ఇగోగా మార్చుకుంటుంది.
అంటే,
పై విధివిధానాలతో ఇగోని మెచ్యూర్డ్ ఇగోగా మార్చేదే మంచి సినిమా కథన్న మాట. ఇగో
మెచ్యూర్డ్ ఇగోగా మారకుండా, ఎలావున్న ఇగో అలాగే వుండిపోతే, జీవితాలకే కాదు,
సినిమాలకీ చెడ్డ కథ. పురాణాల్లో జరిగేది ఈ సైకో థెరఫీలే. ఈ మూలాల్ని, బేసిక్స్ నీ అర్ధం జేసుకోకుండా సినిమా కథల్ని రాయడమంటే కుక్క
తోక పట్టుకుని గోదారి ఈదడమే.
ఇలా
గోదారీది సినిమాల్ని తీస్తున్నారంటే, గుణాత్మకంగా అవి టికెట్టుకి సరిపడా విలువగల
సినిమాలు కావు. బెజవాడకి టికెట్టు డబ్బులు వసూలు చేసి కోదాడలో దింపేసినట్టుంటాయి. అప్పుడు
ప్రేక్షకులు కూడా ఫర్వాలేదు, కోదాడ దాకా లాక్కొచ్చాడు, 2.5 / 5 రేటింగ్ ఇవ్వొచ్చని
అల్పసంతోషాన్ని ప్రకటించుకుంటున్నారు. ఇగోకీ, మెచ్యూర్డ్ ఇగోకీ మధ్య దూరం కోదాడ
నుంచీ కంచికచర్ల మీదుగా బెజవాడ!
కథకుడు
నీరోగారి ఫిడేలు మీటుతున్నంత కాలం ఇగో
సినిమాలే వస్తాయి.
***
అందుకని
పై వివరణ దృష్ట్యా, హీరోయిన్ తన దృక్పథం వైపు హీరోని నడిపించాలనుకుని, ఆ సమస్యని తనే పరిష్కరిస్తే అది కాన్షస్ – సబ్ కాన్షస్ ఫ్రేమ్ వర్క్ లోకి
రాదు. ప్రత్యర్ధి పాత్రెప్పుడూ సబ్ కాన్షస్ మైండే. ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి.
ప్రధాన పాత్రెప్పుడూ కాన్షస్ ఇగోనే. ఇది కూడా గుర్తెట్టుకోవాలి.
అందుకని
కథ ప్రారంభించి ముగించడం ప్రత్యర్ధి పాత్రయిన హీరోయినే చేసేస్తే, ఇక ప్రధాన
పాత్రగా హీరో చేసేదేమిటి? నేర్చుకునేదేమిటి? ఆమె పెట్టిన పరీక్షని లెక్క చేయకుండా కూర్చున్నా,
ఆ పరీక్ష పరిష్కారమైపోతుంది – ఎందుకంటే, ఆమే పరిష్కరిస్తుంది కాబట్టి. అలాంటప్పుడు
హీరోతో ఆ కథంతా ఎందుకు? అప్పుడు హీరో యాక్టివ్ పాత్రెలా అవుతాడు, పాసివ్
పాత్రవుతాడు. అంటే గేమ్ లో వుండడు. ఫ్రేమ్ వర్క్ లోనూ వుండడు. మెచ్యూర్డ్ ఇగో
సినిమా తయారు కాదు, ఇమ్మెచ్యూర్డ్ ఇగోని చూపించి ముగించేస్తుంది.
ఇదే
జరిగింది ‘గీత గోవిందం’ లో, కొంచెం తేడాతో ‘శ్రీనివాస కళ్యాణం’ లో. మొదటిది హీరో చేతిలో
లేని సింగిల్ గోల్ కథయితే, రెండోది డబుల్ గోల్ కథ. వీటిలో మొదటిది దాని ప్లాట్
పాయింట్ వన్ ఎలా ఏర్పాటయిందో చూస్తే, బస్సులో నిద్రలో వున్న హీరోయిన్ తో సెల్ఫీ దిగబోతాడు
హీరో. అప్పుడు తూలి ఆమె మీద పడ్డంతో అతడి పెదాలు వెళ్లి ఆమె పెదాలకి తగుల్తాయి.
ఆమె గొడవ చేసి అన్నకి కాల్ చేస్తుంది. అతను భయపడిపోయి పారిపోతాడు. ఇలా సమస్యలో
ఇరుక్కుంటాడు ప్రధాన పాత్రగా హీరో. ఇప్పుడు హీరో గోల్ ఏమిటి? ఈ సమస్యలోంచి బయట
పడడమే.
సమస్యని
ఇంకొంచెం పెంచి, హీరోయిన్ అన్నకి, హీరో చెల్లెలికీ పెళ్లి సంబంధం కుదిర్చారు.
ఇక్కడ గోల్ తో మెచ్చదగ్గ క్రియేటివిటీ కనబడుతుంది. గోల్ తో మొనాటనీని ఛేదించడం గురించే
కదా ఈ రెండు వ్యాసాల ఎజెండా. ఇక్కడ గోల్ తో మొనాటనీని ఛేదించడం కనిపిస్తుంది.
ఎలాగంటే, బస్సు సీనుతో పారిపోయిన హీరోకి ఈ సీను ఆధారంగానే గోల్ ఏర్పాటు చేసి కథనడపలేదు. నడిపివుంటే రొటీన్
మొనాటనీ అయ్యేది. దీంతో ఏముంటుంది, హీరోయిన్ అన్న బారి నుంచి హీరో తప్పించుకోవడం,
ఎదుర్కోవడం, చివరికెలాగో అపార్ధం తొలగించడం...ఇదే కథయ్యి వుండేది. ఒకే సమస్య,
దాంతోనే కథంతా, దానికే పరిష్కారమనే లీనియర్ ఫ్లాట్ గోల్ ట్రావెల్ వుండేది. దీనికి
ప్రత్యాన్మాయాలు వెతుక్కోవాలనేగా ఈ ప్రయత్నం.
మరి
గత వ్యాసంలో ‘గోల్డ్’ లో గోల్ తో ఒక క్రియేటివిటీని ఇలా చూశాం : హీరోకి గోల్
ఏర్పాటయిన వెంటనే రొటీన్ గా ఆ గోల్ తాలూకు ప్రత్యక్ష సంఘర్షణలో పడెయ్యలేదు హీరోని.
సంఘర్షణని ఆలస్యం చేశారు. అంటే గోల్ నుంచి విడదీసేశారు. ఇది మెచ్చదగ్గ
క్రియేటివిటీ. ఇన్నోవేట్ అయిన, అప్డేట్ చేసుకున్న గోల్ మేనేజ్ మెంట్.
ఇదొక
కొత్త పద్ధతయితే, ఇక్కడేం జరిగిందంటే, బస్సు సీనుతో ప్లాట్ పాయింట్ వన్ లో, హీరోకి గోల్ ఏర్పాటయింది. ఇది మొనాటనీ బారిన పడకుండా
ఇంకో సీను ఏర్పాటయింది. పారిపోయిన హీరో ఇంటికెళ్ళగానే అక్కడ తన చెల్లెలికీ
హీరోయిన్ అన్నకీ పెళ్లి. దీంతో సమస్య తీవ్రత పెరగడమే గాక, గోల్ వ్యూహం మార్చుకోవాల్సిన
అవసరమేర్పడింది హీరోకి.
ఇక్కడ
హీరోయిన్ తనని ముద్దు పెట్టుకున్నది ఈ హీరోయేనని అన్నకి చెప్పేస్తే, హీరో ప్రాణాలు
పోవడమే గాక, చెల్లెలి పెళ్లి చెడిపోతుంది.
ఇక్కడేం
జరిగిందంటే, సాంప్రదాయంగా జరుగుతున్నట్టు, ప్లాట్ పాయింట్ వన్ ఒకే సీనుతో, దాని గోల్ తో, రొటీన్ గా అరిగిపోయిన ఏకోన్ముఖ మలుపుగా
లేకుండా, ద్విముఖంగా డైమెన్షన్ పెంచుకుంది. అంటే, బస్సు సీను ఒకవైపు, పెళ్లి సీను
ఇంకోవైపుగా రెండూ కలిసిన జంక్షన్ గా నిలబడింది. దీంతో కేవలం ఒక బస్సు సీనుతో రొటీన్
గా, ఏకోన్ముఖంగా ఏర్పడ్డ హీరో గోల్,
పెళ్లి సీనుని కలుపుకుని ద్విముఖంగా మారింది. అప్పుడు డైమెన్షనూ, దాంతో డైనమిక్సూ
పెంచుకుంది. సాంప్రదాయంగా ప్లాట్ పాయింట్ వన్స్ ఒకే సీనుతో వుంటాయి, వుంటూ
వస్తున్నాయి. అంటే, ఆ ఒక సీనులోనే వచ్చే మలుపుతో, అక్కడే గోల్ ఏర్పడుతూ రావడం
ఆనవాయితీగా వుంది. దీన్ని ఇక్కడ బ్రేక్ చేశారు.
అంటే
హీరో మీద రెండు సమస్యల్ని మోపు చేసే ట్రిక్ తో ద్విముఖ గోల్ అనే ఒక ఇన్నోవేషన్
జరిగిందన్న మాట. ఒక సమస్యలో ఇరుక్కున్న హీరోని ఇంకో సమస్యలో అక్కడే ఇరికించడం
ద్వారా ఇది వీలైంది.
***
మరి ఈ ద్విముఖ గోల్
నిర్వహణ ఎలావుంది? తన సంగతి హీరోయిన్ ఆమె అన్నకి చెప్పేస్తే తన ప్రాణాలకే ప్రమాదం,
అదే సమయంలో ఆమె అన్నతో తన చెల్లెలి పెళ్లి సంబంధం చెడి పోతుంది. ఈ రెండూ జరక్కుండా
చూడడం హీరో ద్విముఖ గోల్. ఇందుకేం చేయాలి? వ్యూహమేమిటి? యాక్షన్ కథల్లో కూడా కూడా
హీరోకి వెంటనే వ్యూహం వుండదు. విలన్ తో ఢక్కా మొక్కీలు తింటూ పాసివ్ గానే వుంటాడు
మొదట...ఆ ఒడుపు తెలిసేదాకా. ఒడుపు తెలిసిందో ఇక దాన్ని పట్టుకుని యాక్టివ్ గా
విజృంభించి విలన్ అంతు చూస్తాడు. చూడాలంటే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర సమస్యలో
ఇరుకున్న పధ్ధతి బలంగా, సమగ్రంగా వుండాలి. లేకపోతే దారీ తెన్నూ లేనివాడై పోతాడు.
ఉదాహరణకి
ఇక్కడే చూద్దాం : బస్సు సీన్లో హీరోయిన్ చేతిలో హీరో ఇరుక్కున్నాడు. ఎలాటి ఇరుక్కోవడమది?
సమగ్రమేనా? అక్కడికక్కడే ఆమెని తిప్పికొట్ట లేడా? ఇంకా తను సెల్ఫీ క్లిక్ చేయనే లేదు. కాబట్టి ఆ
ఫోటోఆధారం లేదు. తనకి కిస్ పెట్టడాన్న ఆమె ఆరోపణకి ఆమె మాటలు తప్ప ఆధారమే లేదు. ఆమెకి
నిజంగా అతడి మీద చర్య తీసుకోవాలని వుంటే అక్కడే బస్సాపించి అల్లరి చేయవచ్చు. అక్కడే అతణ్ణి
పట్టించవచ్చు. సాధారణంగా ఏ అమ్మాయినా ఆత్మరక్షణతో ఇదే చేస్తుంది. ఇదేమీ చేయకుండా,
ఎక్కడో అన్నకి కాల్ చేసి చెప్పిందంటే, ఈ లోగా హీరో పారిపోవడానికి అవకాశ
మిచ్చిందంటే, ఇవన్నీ పాత్రలు వాటి నైజంతో చేస్తున్న పనులా? కథా సౌలభ్యం కోసం
కథకుడు చౌచౌగా చేయిస్తున్న పనులా? పాత్రల్ని కథ నడిపుకోనిస్తున్నాడా, లేక వాటిని పాసివ్
గా చేసి తనే కథ నడుపుతున్నాడా? కథకోసం
సమస్యని ఏర్పాటు చేస్తున్నప్పుడు అందులో లోసుగులుండ కూడదు. కామన్ సెన్స్ కి దూరంగా
వుండకూడదు. అప్పుడే ఆ పాత్రలూ ఆ కథా, దాని ముగింపూ అర్ధవంతంగా, బలంగా వుంటాయి.
మొత్తం కథ ఆయురారోగ్యాలు ప్లాట్ పాయింట్ వన్ పటిష్టతతోనే వుంటాయి.
ఈ
సమస్య హీరోకి ఓ సమస్యే కాదు. అయినా హీరోయిన్ కి భయపడుతూ, ఆ భయంలోంచి కథకుడు
కోరుకున్న కామెడీ సృష్టిస్తూ, మంచి వాడుగా నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తూ – ఒక
గోల్ అంటూ లేకుండా పాసివ్ గానే వుండిపోతాడు. ఇక ఇతడి సమస్యని కూడా హీరోయినే
పరిష్కరించి బయట పడేస్తుంది! అంటే సమస్యని
సృష్టించిన ప్రత్యర్ధి పాత్రే సమస్యని తీర్చేయడమన్న మాట! ప్రధాన పాత్రగా హీరో
చేసిందేమీ లేదు, నేర్చుకుందేమీ లేదు, పరిష్కరించుకుందేమీ లేదు. ప్రత్యర్ధి పాత్రే
సమస్యని తీర్చే ఈ అవకరం గురించి – కథా అన్యాయం గురించి పై పేరాల్లోనే శాస్త్రీయంగా
చెప్పుకున్నాం. శాస్త్రీయత, సూత్ర బద్ధత అవసరం లేదనుకుంటే అది వేరే విషయం.
గుణాత్మకం కాకుండా వ్యాపారాత్మకం కాగలవు సినిమాలు. అయితే అన్ని సార్లూ అందరు
హీరోలతో సాధ్యంకాదు. నితిన్ తో కానిది విజయ్ దేవరకొండతో అయింది. కానీ విజయ్ దేవరకొండతో
ఇలాగే మరోసారి వ్యాపారాత్మకం అవుతుందన్న గ్యారంటీ లేదు.
ఇక,
ఇది మళ్ళీ మరొక మభ్య పెట్టే ప్రయత్నం. హీరోయినే సమస్య తీర్చడం. హీరో ఒక కవ్వించే
అమ్మాయికి లొంగకుండా, ఆమెని దారిలో పెట్టాడని ఎవరో చెప్పగానే నమ్మేసి, హీరోయిన్ కి
అపార్ధాలు తొలగిపోయి, హీరోకి ప్రేయసై పోతుంది!
తన అపార్ధం గురించి పగబట్టిన అన్నకి చెప్పేసి చల్లబర్చేస్తుంది. అంతే, ఆమె
పుణ్యాన ప్రధాన పాత్ర హీరో హేపీ.
ఇక్కడ
మభ్య పెట్టడం ఎలా జరుగుతుందంటే, హీరో ఆ అమ్మాయిని దారిలో పెట్టింది హీరోయిన్ తో పాడు
పని చేసి బ్యాడ్ అన్పించుకోక మునుపు కాదు. చాలా తర్వాత. హీరోయిన్ పరిచయం కాక
మునుపు ఒకమ్మాయిని దారిలో పెట్టాడంటే, పాపం నిజంగా అమాయకుడేనని హీరోయిన్
నమ్మవచ్చు. హీరోయిన్‌తో పాడు పని చేసిన చాలా తర్వాత ఆ అమ్మాయిని దారిలో పెట్టాడంటే,
అది హీరౌయిన్ తెలుసుకునేలా చేసే నాటకమైనా అయివుండాలి, లేదా తను పరివర్తన చెందే
ప్రయత్నం కొద్దీ అలా చేసి వుండాలి. పరివర్తన చెందాలను కోవడానికి తను చెడ్డ
వాడేమీ కాదు, కథలో మొదట్నుంచీ మంచోడే. కాబట్టి, అది కావాలని హీరో ఆడిన నాటకమై వుంటుందని
మనకి అన్పించేలా పొరపాటు కథనం చేశారు. అంతే కదా? యథా ప్లాట్ పాయింట్ వన్ – తథా
ప్లాట్ పాయింట్ టూ. సౌజన్యం : ఆరు ఆస్కార్ అవార్డుల బిల్లీ వైల్డర్.
ఇక
హీరోయిన్ ప్రేమిస్తున్నాక హీరో యాక్టివ్ అన్పించుకుంటూ (హీరోయిన్ పుణ్యానే) ఆమెతో
పెళ్లి దగ్గర బింకాలకి పోయి, ముందరి కాళ్ళకి బంధం వేసుకుని ఇంకోలా ఇరుక్కుంటాడు. చివరికి
అతిధి పాత్రగా వచ్చే నిత్యామీనన్ సలహా పాటించి
కొత్త సమస్య పరిష్కరించుకుంటాడు. అలాటి సలహా ఇచ్చి ఆమె ఫెమినిజపు ట్రిక్కు
ప్లే చేసి తిక్క కుదిర్చినట్టే అన్పిస్తుంది ఇది కూడా. వెరసి ఈ కథకి ఈమే ప్రధాన
పాత్ర అన్పిస్తుంది!
***
రొటీన్
ని బ్రేక్ చేసే ఈ ద్విముఖ గోల్ ఏర్పాటు కొత్తదే. ఒక ఇన్నోవేషన్. అయితే దీని నిర్వహణ మళ్ళీ షరా మామూలు తెలుగు సినిమా లోపాలతో
వుంది. అయినా ప్రేక్షకులు ఒప్పుకున్నారు, బాక్సాఫీసు నిండింది. దీనికి స్క్రీన్
ప్లే సంగతులు రాయాలనుకోలేదు. ప్రేక్షకులు ఒప్పుకున్నసినిమాలో లోపాలెన్నితే విమర్శలొస్తాయి.
మనకెందుకని వదిలెయ్యాలి. కానీ ‘గోల్డ్ లో గోల్ తో ఒక ఇన్నోవేషన్, ‘సంజు’ లో ఇంకో
ఇన్నోవేషన్ లాగే, ఇందులో మరింకో ఇన్నోవేషన్ కన్పిండం వల్ల, దీన్ని దృష్టికి తెచ్చే
ఉద్దేశంతో రాయాల్సి వచ్చింది. రాయాల్సి వచ్చినప్పుడు గోల్ నిర్వహణలో సకల లోపాలూ
దాని వెంటే రాయాల్సి వచ్చింది.
రోమాంటిక్
కామెడీల గొప్పతనం టాలీవుడ్ కి తెలియడం లేదు. హాలీవుడ్ రోమాంటిక్ కామెడీలు (వెన్ హేరీ
మెట్ శాలీ, మై బెస్ట్ ఫ్రెండ్స్ వెడ్డింగ్, లవ్ యాక్చువల్లీ, బ్రిజెట్ జోన్స్ డైరీ
మొదలైన వెన్నో) గొప్ప స్టడీ మెటీరియల్స్ అని అమెరికన్ యూనివర్సిటీల్లో భాగం చేశారు
ప్రొఫెసర్లు. వీటిలో లవర్స్ మధ్య వుండే వ్యూహ ప్రతివ్యూహాలు, వాటి అమలు, ఫలితాల
అధ్యయనం నిత్య వ్యవహారాల్లో, కార్పొరేట్ వ్యవహారాల్లో సైతం దిక్సూచిలా వుంటాయని
తేల్చారు. మరోపక్క చెత్త కూడా ఉత్పత్తి అవుతోందని టైం మ్యాగజైన్ రాసింది. ప్రేమల్ని తప్పుడుగా
చూపించడం, ప్రేమల్లో ఎదురయ్యే సమస్యలకి ప్రేమికులు రెస్పాండ్ అయ్యే తీరూ, అపరిపక్వ
పరిష్కారాలూ వగైరా అవే నిజమని యువత నమ్మేలా చేస్తున్నాయని తప్పు బట్టింది. దురదృష్ట
వశాత్తూ టాలీవుడ్ ఈ రెండో వర్గంలో వుంది. కానీ తెలుగు ప్రేక్షకులు ఇంకా లోకల్ గా లేరు,
వాడ వాడలా ఎప్పుడో గ్లోబలైజ్ అయ్యారు. మనోవికాసం
కల్గించే కొత్త గాలికి ముక్కు మూసుకోరు. కథకులే ముక్కులు దులుపుకోవాలి. ఆఘ్రాణ శక్తిని
పెంచుకోవాలి. ఆ గ్రంథులేమైనా మూసుకుపోతే సర్జరీలు చేయించుకోవాలి. ఫిడేలు, పెన్ను పక్కన
పడేసి, పలకలు ఎత్తుకోవాలి.
―సికిందర్