రచన - దర్శకత్వం: మహేష్ సూరపనేని
తారాగణం : నారా రోహిత్, నమితా ప్రమోద్, నాగశౌర్య, నందిత, తనికెళ్ల భరణి, అజయ్, ప్రభాస్ శ్రీను తదితరులు
సంగీతం: ఇళయరాజా, విశాల్ చంద్రశేఖర్, ఛాయాగ్రహణం : నరేష్ కె రాణా
బ్యానర్ : ఆరోహి సినిమా
నిర్మాతలు: సౌందర్య నర్రా, ప్రశాంతి, బీరమ్ సుధాకర్ రెడ్డి, కృష్ణ విజయ్
విడుదల : సెప్టెంబర్ 15,
2017
***
ఇంకో కొత్త దర్శకుడు బాక్సాఫీసు
మీద బాంబులేసి చేతులు దులుపుకున్నాడు.
గాయాలన్నీ నారా రోహిత్ కయ్యాయి. కొత్త దర్శకులతో ఇంకెన్ని సినిమాలు త్యాగాలు చేయాలో
రోహిత్. ఇతర హీరోలకి మూస సినిమాలతో సమస్య అయితే తనకి డిఫరెంట్ సినిమాలతో సమస్య. తోటి
హీరోతో మల్టీ స్టారర్ గా చేసినా తీరని సమస్య. ‘కథలో రాజకుమారి’ తో ద్రవ్యోల్బణంలా పెరిగిపోయిన
సమస్య. సెన్సెక్స్ సూచీలా పెరగని సమస్య!
కొత్తదర్శకుడు మహేష్ సూరపనేని
తనకి ఏది వుందో గుర్తించి దాన్ని చేస్తే ఇలాటి సమస్యలు రావు. టేకింగ్ టాలెంట్ ని తనకి
వుంచుకుని, రైటింగ్ పవర్ ని అవుట్ సోర్సింగ్
చేస్తే పరిస్థితి బాగుపడొచ్చు. తన కథల్లో రాజకుమారిలు పారిపోకుండా వుండాలంటే పూలరధమెక్కించాలి,
పాడె సిద్ధం చేస్తే కాదు. దాని వెంట ప్రేక్షకులు కూడా రారు. అవతలి భాషల్లో ప్రేమకథలు
కొత్తబాట పడుతున్నాయి. ఇలా పురాతనంగా తీసి
విజయాల్ని ఆశించలేరు.
కథ
అర్జున్
(నారా రోహిత్) ఒక ప్రఖ్యాత సినిమా విలన్. యాభై సినిమాలు నటించి, ఐదు ఫిలిం ఫేర్
అవార్డులు కూడా అందుకున్న టూ ఇన్ వన్ దుష్టుడు. సినిమాల్లో ఎంత క్రూరంగా
నటిస్తాడో, జీవితంలో అంతకంటే రాక్షసంగా వుంటాడు. షూటింగుల్లో దర్శకులని ముప్పు
తిప్పలు పెడతాడు. తోటి నటుల్ని తీసిపారేస్తాడు. స్ట్రగుల్ చేస్తున్న నటుడు
(నాగాశౌర్య) తో సరిగ్గా నటించక ఇబ్బందులు పెడతాడు. తోటి వాళ్ళని హింసిస్తాడు. అతణ్ణి
మార్చాలని ప్రయత్నిస్తూ ఇద్దరు అసిస్టెంట్లు (అజయ్, ప్రభాస్ శ్రీను) వుంటారు.
విచ్చలవిడిగా జీవిస్తూంటాడు. అతడి పద్దతి చూసి గర్ల్ ఫ్రెండ్ (నందిత) బ్రేకప్ చెప్తే భరించలేక తాగేసి యాక్సిడెంట్
చేస్తాడు. డ్రైవర్ సూర్య) కాలు పోగొట్టుకుంటాడు.
దీంతో అర్జున్ పొగరంతా దిగిపోయి మంచి వాడుగా మారిపోతాడు. మంచివాడుగా మారిపోవడంతో
విలన్ గా నటించలేక పోతాడు. కెరీర్
ప్రమాదంలో పడుతుంది. కొందరి సలహాలు అడుగుతాడు. అప్పుడింకో విలన్ సలహా ఇస్తాడు – నీ జీవితంలో నీకున్న
శత్రువెవరో గుర్తించు, వాళ్ళ లైవ్ లో కి వెళ్లి వాళ్ళ సుఖ సంతోషాల్ని దూరం చెయ్ –
అని.
అలా
చేసే ప్రయత్నంలో తనలో మళ్ళీ విలన్ నిద్రలేస్తాడనుకుని అలాటి శత్రువెవరా అని
ఆలోచిస్తాడు అర్జున్. చిన్నప్పుడు తనతో కలిసి చదువుకున్న సీత (నమితా ప్రమోద్) జ్ఞాపకం
వస్తుంది. చిన్నపుడు ఆమె తనకి చందమామ కథలో రాజకుమారిలా వుండేది. కానీ ఆమె చేసిన ఒక పనికి తన జీవితమే దెబ్బతింది. స్కూలూ వూరూ
వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కాబట్టి ఆమె మీద
ఇప్పుడు పగ సాధించాలని నిర్ణయించుకుంటాడు.
ఎలావుంది కథ
ఇదొక
రోమాంటిక్ డ్రామా జానర్ కి చెందిన
ప్రేమకథ. మానసిక అసంతృప్తుల్ని తీర్చే సైకో
థెరఫీ సబ్జెక్టు గా మారాల్సిన కథ. కథకుడుకి
తన చేతిలో వున్న దాని విలువ తెలీక, ఇలా సగటు మూస రెగ్యులర్ ఫార్ములా ప్రేమ డ్రామాగా,
ఏ ప్రయోజనమూ లేని ఏడ్పుల కథగా వృధా
అయింది. ప్రతీ వారం విడుదలయి వెళ్ళిపోయే
చిన్నాచితకా రోమాంటిక్ కామెడీలనే
రోమాంటిక్ డ్రామాల్లో ఇదొకటి. మార్కెట్
యాస్పెక్ట్ అనే ప్రాథమిక అర్హతని కూడా
పట్టించుకోని జ్ఞానశూన్యమైన కథ. ఇక క్రియేటివ్ యాస్పెక్ట్ గురించి
చెప్పనక్కర్లేదు. ఈ రెండూ లేకపోయాక ఇదొక సినిమాయే కాకుండా పోయింది.
ఎవరెలా చేశారు
ముందుగా
- కనీసం చాలామంది హీరోల్లాగా మూస ఫార్ములా పాత్రల మీద మక్కువ పెంచుకుని పీడించకుండా,
సినిమాకొక వైవిద్యభరిత పాత్రల్ని నటించే
నారా రోహిత్ ని అభినందించుకోవడం మన బాధ్యత.
కొత్త దర్శకులని ప్రోత్సహిస్తున్నందుకూ, చాలా వరకూ తనే నిర్మాతగా రిస్కు
చేస్తున్నందుకూ కూడా హేట్సాఫ్ చెప్పాల్సిందే. అయితే తను చూస్తున్న కెలీడియో స్కోప్
లో వైవిధ్యాన్నీ, కొత్తదనాన్నీ తనతోబాటు చూసి
అందుకోలేక
పోతున్నారు సదరు మూస కళ్ళ దర్శకులు. స్టెతస్కోప్ పట్టుకుని పరీక్షించాల్సిన జ్వరం
సినిమాలు తీసి చేతిలో పెడుతున్నారు. కొత్త పాయింట్లని కూడా పెద్ద పెద్ద మూస
కళ్ళేసుకుని చూస్తున్నారు రోహిత్ ప్రోత్సహించే కొత్త ప్రయోగాల దర్శకులు కూడా. ఇదీ సమస్య. ముందు కంటి చికిత్స జరిగితేగానీ విచికిత్స
మొదలవదు. కంటి శుక్లాలన్నీ మూస బారిపోయాయి.
సినిమా
విలన్ మళ్ళీ విలన్ గా మారే పాత్ర. విలన్ పాత్రలో నటన బాగానే వుంది, అయితే దానికి
సరైన మూలాలు లేకపోవడం చేత అది బలహీనంగానే కన్పిస్తుంది. బలహీన పాత్రని రోహిత్ ఎంత
నటించినా బలంగా మారదు. ఇక ఈ బలహీన దుష్ట పాత్ర మంచి పాత్రగా మారాడానికి దారి తీసిన
పరిణామం కూడా తూతూ మంత్రంగానే వుండడంతో, మంచి వాడి పాత్ర మరీ నిరర్ధకమై అందులో
రోహిత్ నటన బాగా బోరు కొట్టించే స్థితికి చేరింది (1999 లో అక్షయ్ కుమార్ నటించిన
ఫ్లాప్ ‘జాన్వర్’ లో తెగ బోరు కొట్టించే
పాత్రలాంటిదే ఈ మంచి పాత్ర). ఈ స్థితి ముగింపులో సైతం బాగుపడలేదు. కథ ఎప్పుడూ బోరు కొట్టదు, పాత్ర
బోరు కొడితేనే కథ బోరు కొడుతుంది. పాత్రని బట్టే కథ.
ఇక
టైటిల్ రోల్ పోషించే హీరోయిన్ పాత్రలో నమితా ప్రమోద్ ఆకర్షణీయంగా వుంది.
ప్లాస్టిక్ ఆకర్షణ కాకుండా. టైటిల్ కి తగ్గట్టే రాజకుమారిలా వుంది. నటన కూడా
బాగానే వుంది. ఇలాటి హీరోయిన్లు మళ్ళీ ఇంకో సినిమాలో కన్పించకుండా పోతారు. లోపం
వాళ్ళది కాదు, సినిమాకొక కొత్త హీరోయిన్ ని తెచ్చి పడేసి, అవతల పడేసి పోతున్న
వాళ్ళది. ఐతే ముందు వొక అందమైన ప్రదేశంలో నర్సరీ నడుపుకుంటూ తన కాళ్ళ మీద నిలబడ్డ
ఈ రాజకుమారి పాత్రని ఓడించి, హీరో
పాదాక్రాంత చేయడంతో ఏడ్పుల రాజకుమారి అయిపోయింది. రోమాంటిక్ డ్రామాల్లో హీరోయిన్ల పాత్రలు దద్దమ్మలు అయిపోతున్నాయి. ప్రేమలో ఇద్దరూ సమానులనే అర్ధంలో పాత్రల్ని
తీర్చిదిద్దకుండా రాజకుమారిని భ్రష్టు పట్టించారు. ఓడించడానికి వచ్చిన నెగెటివ్
పాత్ర హీరోయే ఓడిపోవాలి. ఈమెని ఓడించేసి తిరిగి విలన్ లక్షణాలు తెచ్చుకుని,
సినిమాల్లో తను తిరిగి పాపులర్ అవుతాడు. ఈమె అన్నీ కోల్పోయి వెతుక్కుంటూ వెళ్లి అవార్డుల
సభలో అతడి ప్రేమ కావాలని ఏడవాలి - ఏమీటీ
చిత్రణ?
రోహిత్
పక్కన అజయ్, ప్రభాస్ శ్రీనులు సాధ్యమైనంత నవ్వించే ప్రయత్నం చేశారు. కానీ ఈ
రోజుల్లో హీరో నవ్వించకుండా నేస్తాలతో నవ్వించి అదే కామెడీ అని సరిపెట్టేస్తే ఒప్పు కోవడంలేదు ప్రేక్షకులు. ‘మేడమీద అబ్బాయి’ లో అల్లరి నరేష్ కంటే పక్క పాత్ర హైపర్
ఆది నవ్వించడమే ఎక్కువ.
హీరోయిన్
తండ్రి పాత్రలో పరుచూరి వెంకటేశ్వరరావు పాత్ర ఇంటి బాధ్యత హీరోయిన్ మీదే వదిలేసి
కూర్చోవడమేమిటో అర్ధంగాదు. నర్సరీ ఇబ్బందుల్లో వున్నా ప్రేక్షక పాత్ర వహించడమే. హీరోయిన్ చెల్లెలి
పాత్ర పనివాడితో లేచిపోయే పాత్ర. కథలో రాజకుమారి చుట్టూ ఇలాటి చవకబారు పాత్రలు.
కనీసం తమ రాజకుమారిని గౌరవించుకోని ఇంటి
పాత్రలు.
నందిత
ఒక సీన్లో నటించి వెళ్ళిపోతుంది- హీరోకి బ్రేకప్ చెప్పే సీను. ఇక స్ట్రగుల్ చేసే
నటుడి పాత్రలో నాగశౌర్య కథకి వెలుపల వుండిపోయే పాత్ర. కనీసం రోహిత్ పాత్ర మళ్ళీ
విలన్ గా మారడానికి వెళ్ళిపోయిన గ్యాప్ లో చకచకా ఎదిగి టాప్ లో వుండాల్సింది పోయి,
ఇంకా అలాగే ఊడిగం చేస్తూ వుండిపోయే ఉల్ఫా
పాత్ర.
ఈ
సినిమాకి అతి పెద్ద ఎసెట్స్ ఇళయరాజా సంగీతం, నరేష్ రాణా ఛాయాగ్రహణం అనాలి. ఈ రెండిటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ ఏం
లాభం, కొత్త దర్శకుడు తన కథతో,
దర్శకత్వంతో సెల్ఫ్ గోల్ చేసుకుంటే?
నిత్యం అప్ డేట్ అయ్యే అద్భుతమైన టెక్నీషియన్స్ వున్నారు. అప్ డేట్ కాని
దర్శకుల వల్ల వాళ్ళ నైపుణ్యం బూడిదలో పోసిన పన్నీరవుతోంది.
చివరికేమిటి
ఎలా చూసినా గజిబిజిగానే తోచే ప్రేమ డ్రామా. ఎక్కడైనా చిన్న
స్పార్క్ పట్టుకుని ఫర్వాలేదులే అనుకోవడానికి వీల్లేని చిత్రణలు. హీరో సినిమా
విలన్. జీవితంలో కూడా అందరికీ విలన్. ఇలాటి వాడు తాగి కారు నడిపి సొంత డ్రైవర్ కాలు
పోగొట్టాడు. దాంతో కళ్ళు తెర్చి జీవితంలో
విలనీ మానేశాడు. దీని ప్రభావం సినిమాల్లో విలనీ మీద పడింది. నటన కష్టమైపోయింది.
సలహా తీసుకున్నాడు- ‘నీ జీవితంలో
నీకున్న శత్రువెవరో గుర్తించు, వాళ్ళ లైఫ్ లో కెళ్లి వాళ్ళ సుఖ సంతోషాల్ని దూరం
చెయ్ - ’ అని ఒక విలన్ చెప్పిన మాట పట్టుకుని చిన్నప్పుడు తనని నష్టపర్చిన
హీరోయిన్ సంగతి తేల్చాలనుకున్నాడు.
ఇది
కథకి మొదటి మలుపు. మొదటి మలుపు (ప్లాట్ పాయింట్ వన్) లో ఏర్పాటు చేసే సమస్య సహేతుకంగా, బలంగా లేకపోతే ఇక్కడ్నించీ ఆ కథా నడకా, ముగింపూ ఏవీ సహేతుకంగా,
బలంగా వుండవు. మొదటి మలుపే కథకి డీఎన్ఏ. కథ బాగోగులన్నీ దీంట్లోనే వుంటాయి.
ఎవరైనా విలన్ గా నటించాలంటే నిజజీవితంలో విలన్
గా మారాలా? విలన్స్ గా నటించేవాళ్ళు ఇలాగే చేసి విలన్స్ అయ్యారా? మొదట్లో
సినిమాల్లో విలన్ గా, జీవితంలో కూడా విలన్ గానూ వున్న హీరో జీవితంలో ఓడిపోయినట్టే. ఒక
యాక్సిడెంట్ తో బుద్ధితెచ్చుకుని జీవితంలో మారాడు. కానీ సినిమాల్లో
విలన్ గా ఎలా విఫలమయ్యాడు? ఒకళ్ళని పీడిస్తే తప్ప విలన్ గా నటించలేని వాడు నటుడా?
అప్పుడు
సలహా ఇచ్చిన ఇంకో విలన్, మళ్ళీ హీరోని అదే
మనో వైకల్యానికి తోసెయ్యడ మేమిటి? ఇంకెవర్నో పీడిస్తే విలన్ గా రాణిస్తావనడమేమిటి?
ఈ మాట – వీడు తనకి అడ్డుండ కూడదని అన్నాడా? వీణ్ణి మనిషిగా పతనం చేసే ఉద్దేశంతో
అనివుంటే మంచిదే, ఈ రంగంలో ఇది సహజం కూడా. కానీ అంత తెలివిలేదు ఈ విలన్ కి. హీరో
మళ్ళీ విలన్ గా మారే ‘మంచి’ సలహా ఇచ్చాడు.
కానీ ఈ మంచి సలహా ఇవ్వడంలో వృత్తికే కళంకం తెచ్చే పోకడలు పోయాడు. శత్రువుని
గుర్తించి పీడించమనకుండా - నీ గత జ్ఞాపకాల్లో నిన్ను పీడిస్తున్న సమస్య ఏదో
వుండిపోయింది. దాన్ని క్లియర్ చేసుకో. దాని వల్లే జీవితంలో అందర్నీ పీడించావ్. అది
చూసుకునే విలన్ గా నటించ గల్గావ్. బూటకపు పునాదుల మీద వున్నావ్. అందుకే పడిపోయావ్.
ముందా మానసిక సమస్య తొలగించుకో, అప్పుడు ఒరిజినల్ టాలెంట్ తో నటుడివవుతావ్ –
అని చెప్పి వుంటే మంచి సలహా అయ్యేది.
ఆ
విలన్ ఇచ్చిన చెడ్డ సలహా ప్రకారం చూసినా, హీరో తనని చిన్నప్పుడు నష్టపర్చిన హీరో
యిన్ మీదికి వెళ్లడాన్ని ఇలా చూడాలి : ఎప్పుడో చిన్నప్పుడు ఏదో చేశారని
ఇప్పుడు పెద్దయ్యాక తవ్వుకుని ప్రతీకారం తీర్చుకునే మనస్తత్వం చాలా అరుదైన
సైకలాజికల్ కేసుగా వుంటుంది. దీన్ని సైకలాజికల్ ట్రేడింగ్ స్టాంప్స్ అన్నారు. ఒక కేసుంది : చిన్నప్పుడు
అన్నదమ్ములు బొమ్మ బస్సాట ఆడుకున్నారు. అప్పుడు అన్న బస్సు తమ్ముడి బస్సుకి తగిలి
డ్యామేజీ అయింది. దీన్నితమ్ముడు మనసులో వుంచుకున్నాడు.
అన్న
నడివయసు కొచ్చి కుటుంబంతో జీవిస్తున్నాడు. ఉన్నట్టుండి ఇంటిమీద రాళ్ళు పడసాగాయి.
కొన్ని రోజులు రాత్రి పూట ఎవరో రాళ్ళు వేసి పారిపోతున్నారు. ఒకరోజు అన్న వాణ్ణి
పట్టుకున్నాడు. వాడు 45 ఏళ్ల తన తమ్ముడే. ఎందుకిలా చేస్తున్నావంటే, చిన్నప్పుడు నువ్వు నా బొమ్మ బస్సుని డ్యామేజీ చేయలేదా, అందుకే ఇప్పడు నిన్ను
డ్యామేజీ చేస్తున్నానన్నాడు తమ్ముడు!
ఏమనాలో తోచక, జాలిపడి ఏడ్చి, ఆ తమ్ముడికి మానసిక చికిత్స చేయించాడు అన్న.
ఇంతే,
ఈ పరిధిలోనే వుంటుంది కథలో హీరో ప్రతీకారం కూడా – సైకలాజికల్ ట్రేడింగ్ స్టాంప్స్.
ఇది అరుదైన మనోవ్యాధి తప్ప ఇంకేం కాదు. ఈ
అల్ప విషయాన్ని కథకి మొదటి మలుపులో సమస్యగా
ఏర్పాటు చేసి, భీకరంగా నడపబోతే ఇందుకే విఫలమయ్యింది. చిన్నపుడు రాజకుమారిని టీచర్
దండిస్తే, ఆ టీచర్ మీద టపాకాయలు పేల్చాడు
హీరో. హీరోయే పేల్చాడని రాజకుమారి నిజం చెప్పేసింది. దీంతో స్కూలు వదిలేసి, వూరు
వదిలేసి హీరో వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ ఉత్తుత్తి పగ ఇప్పుడు తీర్చుకోవడానికి
వెళ్లి నానా కంగాళీ చేశాడు. చివరికి మళ్ళీ అదే మానసిక సమస్యతో తిరిగి విలనయ్యాడు, అలాటి వాడికి
హీరోయిన్ దాసోహ మయ్యింది.
‘బ్యాక్
టు ది ఫ్యూచర్’ (1985) కథ చేసేది సైకో థెరఫీ
అని చెప్పాడు స్క్రీన్ ప్లే పండితుడు జేమ్స్ బానెట్. ఇందులో హీరో (బాలనటుడు) తన
తల్లిదండ్రులు ఈసురోమని గడపడం దేనికో అర్ధంగాక స్ట్రగుల్ అవుతూంటాడు. ఒక సైంటిస్టు
తయారు చేసిన టైం మెషీన్లో సరదాగా ప్రయాణం చేస్తాడు. అది కాలంలో కొన్నేళ్ళు వెనక్కి
వెళ్లి ఒక వూళ్ళో ఆగుతుంది. అక్కడ టీనేజి లవర్స్ గా వున్న తన తల్లిదండ్రులు కన్పిస్తారు.
వాళ్ళతో చెలిమి చేస్తాడు, దగ్గర్నుంచి గమనిస్తాడు, పరీక్షిస్తాడు, పొరపచ్చాల్ని తొలగిస్తాడు.
తిరిగి వర్తమానం కాలంలో ఇంటికి వస్తే, హేపీగా కన్పిస్తారు తల్లిదండ్రులు!
ప్రస్తుత
కథలో ఆ విలన్ పైన చెప్పుకున్న విధంగా హీరోకి - ముందు నీ మానసిక అసంతృప్తికి
మూలాలు కనుక్కుని తీర్చుకో, బాగుపడతావ్ – అని మంచి సలహా ఇచ్చి వుంటే, హీరో చిన్నప్పటి హీరోయిన్ చేష్టకి సైకో థెరఫీ చేసుకునే లక్ష్యంతో వెళ్లి ఆమెతో బాటు,
వొళ్ళు కాలిన టీచర్నీ, ఇంకా అప్పటి వాళ్ళందర్నీ కలుసుకుని ప్రాయశ్చిత్తం చేసుకుంటే
సమస్య తీరిపోతుంది. ప్రాయశ్చిత్తం ఎందుకంటే, హీరోయిన్ తనకు చేసింది పూర్తి న్యాయం. నేరం
చేసిన వాడితో ఆమె వుండదు. తను టీచర్ వొళ్ళు కాల్చి పెద్ద నేరం చేశాడు. హీరో తనలోకి
తాను ప్రయాణం చేయకుండా, మళ్ళీ అదే బూటకపు పునాదుల మీద ఎదగాలనుకోవడం అజ్ఞానం.
-సికిందర్