రచన- దర్శకత్వం: వెలిగొండ శ్రీనివాస్
తారాగణం: రాజ్తరుణ్, హెబ్బా పటేల్, రాజేంద్రప్రసాద్, రాజా రవీంద్ర,, ఆశీష్ విద్యార్థి, సాయాజీ షిండే, సత్య, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర< ఛాయాగ్రహణం: బి.రాజశేఖర్
బ్యానర్ : ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
విడుదల: జూన్ 2, 2017
***
ఏకే ఎంటర్
టైన్మెంట్స్ లో వరసగా రెండో సినిమా నటించిన రాజ్ తరుణ్ రోమాంటిక్ కామెడీల నుంచి
దూరంజరిగి కామిక్ థ్రిల్లర్స్ వైపు మొగ్గుతున్నట్టు అన్పిస్తాడు. ఇదే బెటర్. కాకపోతే
ఈ కామిక్ థ్రిల్లర్స్ కూడా పాత వాసనేయడం తన ప్రత్యేకతగా నిలబెట్టు
కుంటున్నాడు. ఈ సినిమాతో దర్శకుడైన రచయిత వెలిగొండ శ్రీనివాస్ కి ఇప్పుడు కావలసిన స్వేచ్ఛ అంతా లభించింది. తాను అనుకున్నది అనుకున్నట్టు తెరకెక్కించే అవకాశం లభించింది. ఈ అవకాశంతో దర్శకుడుగా తానేం తేడా చూపించాడో, రాజ్ తరుణ్ కూడా తన అభిమానులని ఎలా అలరించాడో ఈ కింద చూద్దాం.
కుంటున్నాడు. ఈ సినిమాతో దర్శకుడైన రచయిత వెలిగొండ శ్రీనివాస్ కి ఇప్పుడు కావలసిన స్వేచ్ఛ అంతా లభించింది. తాను అనుకున్నది అనుకున్నట్టు తెరకెక్కించే అవకాశం లభించింది. ఈ అవకాశంతో దర్శకుడుగా తానేం తేడా చూపించాడో, రాజ్ తరుణ్ కూడా తన అభిమానులని ఎలా అలరించాడో ఈ కింద చూద్దాం.
కథ :
పుట్టుకతో
అంధుడైన గౌతమ్ (రాజ్ తరుణ్) అనాధాశ్రమంలో నేస్తాలతో పెరుగుతాడు. ఆ నేస్తాలు
ముగ్గురికీ చూపు తెప్పించే చికిత్సకి అవకాశం రావడంతో తను తప్పుకుని నేస్తాలనే పంపిస్తాడు.
పెద్దయ్యాక రేడియో జాకీ గా పనిచేస్తూ నేత్ర ( హెబ్బా పటేల్ ) అనే కళ్ళ డాక్టర్ తో
ప్రేమలో పడతాడు. తన అంధత్వం బయట పడకుండా నటిస్తూంటాడు. ఓ రోజు ఆమెకి
తెలిసిపోతుంది. అప్పుడు కులకర్ణి (రాజేంద్ర ప్రసాద్) అనే అతను యాక్సిడెంట్ కి గురై
చనిపోవడంతో, అతడి కళ్ళు గౌతమ్ కి మర్చి
చూపు తెప్పిస్తుంది. అప్పటి నుంచీ గౌతమ్ వింతగా ప్రవర్తిస్తూంటాడు. అతణ్ణి కులకర్ణి ఆత్మ పట్టుకుని హత్యలు చేయిస్తూంటుంది. దీంతో పిచ్చెత్తి పోయిన గౌతమ్ తిరగబడతాడు- అప్పుడేం
జరిగిందనేది మిగతా కథ.
ఎలావుంది కథ
వారంవారం
చంపి పగదీర్చుకునే వయొలెంట్ కథలతో యంగ్
హీరోలు క్యూలు కడుతున్నారు. ‘వెంకటాపురం’ తో రాహుల్ టికెట్ తెగింది, తర్వాత వెంటనే మరుసటి వారం ‘కేశవ’ తో నిఖిల్ టికెట్ తెగింది. వారం గ్యాప్ ఇచ్చి ఇప్పుడు రాజ్ తరుణ్ ‘అంధగాడు’ తో తన టికెట్
చించుకున్నాడు. రాబోయే వారాల్లో టికెట్లు పట్టుకుని ఇంకెదరున్నారో తెలీదు. ఇలా యాక్షన్
జానర్ కి మార్పు లేకుండా అదే పాత మోడల్ పగలనే జోడిస్తూ పోవడంతో వరసగా ఈ రొటీన్ నే చూడాల్సి
వస్తోంది. రోమాంటిక్ కామెడీల స్థానంలో ఈ రివెంజి కథలు ఇంకొక ట్రెండ్ గా కొన్నాళ్ళు భయపెడతాయేమో
అన్నట్టుంది. హృతిక్ రోషన్ ‘కాబిల్’ కూడా అంధుడి ప్రతీకారమే గానీ, ఆ కథని కిందా మీదా, వెనకా ముందూ చేసి ఫ్లాష్
బ్యాకులతో గందరగోళం చేసి చెప్పలేదు. అతడికి జరిగిన అన్యాయాన్ని ఇప్పటికిప్పుడు
జరుగుతున్నట్టుగా లైవ్ గానే చూపిస్తూ, వెంటనే
పగదీర్చుకోవడం కూడా ఇప్పటికిప్పుడు జరుగుతున్నట్టు లైవ్ గానే చూపించడంతో దాని ఎమోషన్, డైనమిక్స్ అంత బలంగా
వర్కౌట్ అయ్యాయి. ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యాయి. అన్యాయం ఎప్పుడో చిన్నప్పుడు
జరిగిన చద్దన్నంలా వుంటే, దాని మీద ఎప్పుడో పెద్దయ్యాక హీరోకి ఎంత వేడి వేడి పగని రగిలించినా,
ఈ రోజుల్లో లైవ్ గా ఫీల్ కారు యువప్రేక్షకులు. యూత్ కి ఏదైనా హాట్ హాట్ గా, లైవ్ గానే
వుండాలి, ఏనాటివో గతించిన కాలపు ఫ్లాష్
బ్యాకులు కాదు. కేసులు తెమలడానికి కోర్టుల్లో ఏళ్ల కేళ్ళు పడుతున్నట్టు-
సినిమాల్లో కూడా ప్రతీకారాలు అంత కాలం తీసుకుంటే- వ్యవస్థకీ సినిమాలకీ తేడా
ఏముంటుంది? పాతికేళ్ళ తర్వాత హీరో గారు తీరిగ్గా
పగని రీచార్జి చేసుకుని వస్తానంటే, యువప్రేక్షకులకి ఈరోజుల్లో పిచ్చి పుల్లయ్యలాగే కన్పిస్తాడు. నేటి హిట్ అండ్ రన్ తరానికి ఏదైనా
తక్షణం జరిగిపోవాలి. కానీ వస్తున్న ఈ బాపతు ఫార్ములా రివెంజి డ్రామా- మెలోడ్రామా కథలు
1970 ల నాటివి. ‘కాబిల్’ దీన్ని నవీకరించి కాలానికి తగ్గట్టుగా హిట్ అండ్ రన్
చేసింది.
ఈ సినిమాతో దర్శకుడైన వెలిగొండ శ్రీనివాస్ పాతస్కూలు రచయితే. చాలా పాత సినిమాలనే మార్చి మార్చి రీసైక్లింగ్ చేసిన పాత స్కూలుకి చెందిన వాడే. రచయితగా తనకి స్వేచ్ఛ లేకపోయి వుండొచ్చు. దర్శకుడయ్యాక చాలా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని వుండాలి. కానీ ఈ తేడా ఏమీ కన్పించడం లేదు. యథా రైటర్ కొలువు తథా డైరెక్టర్ పదోన్నతి.
ఎవరెలా చేశారు
రాజ్
తరుణ్ కి అంధుడిగా నటించేంత టాలెంట్ అప్పుడే లేదుగానీ, కళ్ళు వచ్చాక రాజేంద్రప్రసాద్
కోరల్లో చిక్కుకుని విలవిల్లాడే కామెడీయే
అతడికి పట్టింది. హీరోయిన్ హెబ్బా పటేల్ తో అంధుడిగా బయటపడకుండా నటించే విషయంలో కూడా బలహీనమే. ముందుగా రాజ్ తరుణ్
అంధత్వాన్ని నమ్మించగల్గితే అప్పుడీ పాత్రలో ఏమ చేసినా చెల్లి పోతుంది. అంధుడి లానే
అన్పించనప్పుడు అంధ పాత్ర పోషించి
ప్రయోజనం లేదు. ఆ పాత్ర, నటన, ఫస్టాఫ్ లో అంతా కృతకంగా, హడావిడిగా సాగిపోతాయి. ఫీలవడానికేమీ
వుండదు. ఇక తన పాత్ర మూడు ఛేంజ్ ఓవర్స్ తో వుంటుంది : అంధుడుగా, కళ్ళు వచ్చాక
రాజేంద్ర ప్రసాద్ బాధితుడిగా, చివర్లో పగదీర్చుకునే యాంగ్రీ యంగ్ మాన్ గా. వీటిలో
చివరి రెండే తనకి సూటయ్యాయి.
హీరోయిన్ హెబ్బాపటేల్ కూడా డాక్టర్ గా నమ్మించలేకపోయింది. ఆమె డాక్టర్ అంటే ఎవ్వరూ నమ్మరు. యంగ్ నటికి కళ్ళజోడు పెట్టి హీరో అక్క అంటే ఎలా నమ్మమో, హెబ్బా పటేల్ కూడా తెల్లకోటు తగిలించుకున్నంత మాత్రాన డాక్టరై పోదు. మెడికో అవచ్చు.
రాజేంద్రప్రసాద్ తన కొట్టిన పిండి అయిన కామిక్ సెన్సు, టైమింగ్ మొదలైన హాస్యాస్త్రాల్ని సంధిస్తూ అప్పుడప్పుడూ నవ్విస్తాడు. అయితే తన పాత్ర బతికున్నప్పుడు ఎలావుందో అలా కాక, చచ్చాక అంటే ఆత్మగా మారేక, మారాం చేసే చిన్న పిల్లాడిలా రాజ్ తరుణ్ ని వేధించుకు తిని పనిజరుపుకునేలా వుంటే, హాస్యం ఇంకా బాగా వచ్చేది. మార్పు లేకుండా ఎంత సేపూ బెదిరిస్తూనే వుండడం వల్ల ఫన్ తగ్గింది.
ఇతరపాత్రల్లో సైకియాట్రిస్టుగా ఆశీష్ విద్యార్థి, పోలీస్ కమీషనర్ గా సాయాజీ షిండే, లాయర్ గా జయప్రకాశ్ రెడ్డి, అనాధాశ్రయం నిర్వాహకుడుగా పరుచూరి వెంకటేశ్వర రావు, విలన్ గా రాజా రవీంద్ర, హీరో ఫ్రెండ్ గా సత్య రొటీన్ గానే కన్పిస్తారు.
పాటల్లో రెండో పాట, దాని చిత్రీకరణ, నాల్గో పాట, దాని చిత్రీకరణా బావున్నాయి. ఛాయాగ్రహణం, లోకేషన్స్, ఇతర ప్రొడక్షన్ విలువలు రిచ్ గా వున్నాయి.
చివరికేమిటి
థ్రిల్లర్ ని ఫ్లాష్ బ్యాకులతో కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వెంకటాపురం,
కేశవ కూడా ఈపనే చేశాయి. దీనివల్ల వీక్షణాసక్తి సన్నగిల్లుతుంది. ప్రేక్షకులకి ఆలోచనలు రేకెత్తిస్తే మంచిదే గానీ, ఇలా జ్ఞాపకశక్తికి
పరీక్షపెడితే ఫాలో అవడం మానేస్తారు. చివర్లో రాజ్ తరుణ్ సస్పెన్స్ ని విప్పుతూ- అప్పుడలా చేశానంటే ఇందుకు చేశాను, ఇప్పుడిలా
చేస్తే కారణం అదిగో అప్పుడలా జరిగింది- లాంటి సవాలక్ష వివరణ లిస్తూ- మళ్ళీ ఆ సీన్లు
చూపిస్తూ కథని ‘సమప్’ చేసే బరువెత్తుకోవడం
మాస్ మీడియా అయిన సినిమాకి పనికొస్తుందా? జరిగిపోయిన సంఘటనల్ని గుర్తు చేసుకుంటూ,
కార్యకారణ సంబంధాన్నిఊహించులోవాల్సిన మానసిక శ్రమ ప్రేక్షకులకి ఎందుకు? ఇది ‘ఆ ఒక్కడు’ నుంచీ బాగా రిపీటవుతోంది.
ఆ కట్ షాట్స్, మాంటేజెస్, ఫ్లాష్ బ్యాక్స్
తో శిరోభారం కల్గించడం తప్ప ఒరిగేదేమీ లేదు. గందరగోళానికి లోను చేయడం తప్ప మరేమీ కాదు.
ఈ కథే రాజ్ తరుణ్ సెకండాఫ్ దాటి పోయేవరకూ చెప్పే సుదీర్ఘ ఫ్లాష్ బ్యాక్ తో సాగుతుంది. ఇందులో మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ ఫ్లాష్ బ్యాక్ వుంటుంది. ఇవి అయ్యాక, ప్రెజెంట్ లో కొచ్చి, మళ్ళీ రాజ్ తరుణ్ చిన్ననాటి ఫ్లాష్ బ్యాక్ ఎత్తుకుంటాడు. ఇదయ్యాక అన్ని ఫ్లాష్ బ్యాకులనీ తులనాత్మక విశ్లేషణ చేయడం మొదలెడతాడు- ఓ గాడ్! సీదా సాదాగా స్ట్రెయిట్ గా చూపిస్తే బలంగా వుండే ఇంతోటి రివెంజి కథకి ఇన్ని కథన చాతుర్యాలా? ఇంత పాండిత్య ప్రకర్షా?
ఫస్టాఫ్ అంతా మళ్ళీ టెంప్లెట్ లాగే హీరోయిన్తో లవ్ ట్రాక్, గంట గడిచాక రాజేంద్ర ప్రసాద్ రాకతో కథ మొదలవుతుంది. షరామామూలుగా అప్పటించీ హీరోయిన్ మాయమై పోతుంది. కేవలం ప్రేమకి, పాటలకి వుంటుంది.
ఈ కామిక్ థ్రిల్లర్ లా అనిపించే రివెంజి సినిమా ఒక్క రాజేంద్ర ప్రసాద్ వున్న మేరకే చాలా ఆసక్తి కల్గిస్తుంది, వినోద పరుస్తుంది. రాజేంద్ర ప్రసా కి ఆవల, ఈవల అంతా సోసో పాత ఫార్ములా సంగతులే.
- సికిందర్
http://www.cinemabazaar.in