రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, సెప్టెంబర్ 2014, మంగళవారం

ఆర్టికల్

దారులు తారుమారు!
సీనియర్లు హిట్ – జూనియర్లు ఫట్!

స్టార్ సినిమాలు సింగిల్ స్టార్ రేటింగ్ సినిమాలుగా దిగజారి స్టార్ల ఇమేజి తాపత్రయాల్ని మట్టి కరిపిస్తున్న క్రమం యమజోరుగా ఇంకా కొనసాగుతోంది.  మిగతా దేశంలో స్టార్లు ఇమేజి ఎండమావుల వెంట పరుగులాపి పాత్రలతో ప్రయోగాలు చేస్తూ అభిమానుల్ని పెంచుకుంటూ పోతూంటే, తెలుగు యువ స్టార్లు ప్రపంచం ఎటుపోయినా మా ఇమేజుల్ని మేం వదులుకోంగాక వదులుకోమంటూ భీష్మించుకుని, భారీ ఎత్తున పుట్టెడు ఫ్యాన్స్ కి తప్ప మరెవరికీ అక్కరలేని పాత మూస సినిమాల తిరునాళ్ళకి తెరలేపుతున్నారు.
          ఈ ట్రెండ్, ఈ రేసు యువ స్టార్లకి పాపం చాలా అర్జెంటు వినాశక పథకంలా తోస్తోంది.  ప్రతియువ స్టారూ అమాంతం ఈ హోమంలోకి దూకేస్తున్నాడు.  తెలుగులో చిన్న సినిమాలే వదిలేసిన మూసఫార్ములా కథల్ని పట్టుకుని అదే నవలోకంగా భ్రమిస్తున్నారు. చిన్న సినిమాలే కాదు, దేశంలో ఇంకే భాషలోనూ కానరాని అరిగిపోయిన పాతచింతకాయ కథల్లో మునిగి తేలుతూ ఇదే నేటికాలం సినిమా అనేసి తమకి తామే చక్కిలిగింతలు పెట్టుకుని ఆనందిస్తున్నారు. యువ స్టార్ అంటే ‘అనాధ పాత్ర’ గా హాస్యాస్పదంగా మార్చుకున్న పేరుని (ఇమేజిని) కాస్తా, అప్పుడే ఇరవైలో అరవై నిండిన ‘విశ్రాంత స్టార్’ గా సవరించుకుని వెలవెల బోతున్నారు.
          ఆనాడు సీనియర్ స్టార్లు స్థిరీకరించిన మాస్ సినిమాల ఫార్ములానే ఎప్పటికీ శ్రీరామ రక్ష అనుకుంటూ, ఆ సేఫ్టీ జోన్ లో  సినిమా నిర్మాణాన్నీ నటననీ తమాషాగా తీసుకుని విలువలకి పాతరేయడంలో పోటీలు పడుతున్న యువస్టార్లు,  అన్ని వనరులు వుండీ తెలుగు సినిమాల్ని తిరుగులేకుండా తిరోగమన బాట పట్టిస్తున్నారు. సీనియర్ స్టార్లే మూసఫార్ములాలు ఇక పనికిరావని, ఒక ‘మనం’ తో, ఒక ‘దృశ్యం’ తో, ఇంకో ‘లెజెండ్’ తో సూపర్ హిట్లిచ్చి కొత్త బాటపడుతోంటే, యువస్టార్లు ఇంకా తమ సీనియర్లే వదిలిపారేసిన పాతచింతకాయ పచ్చడినే చప్పరిస్తూ ‘రభస’ తో అహా అని ఒకరు, ‘పవర్’ తో ఒహో మరొకరు, ’ఆగడు’ తో యమహా అంటూ ఇంకొకరు, ‘అల్లుడు శీను’ తో ఎహే అని ఇంకో నవ హీరో లేనిపోని బిల్డప్పులతో వరుసగా సత్తెకాలపు సత్తెయ్య లవుతున్నారు!
          ఈ పతనావస్థ  ‘ఆగడు’ తో పరాకాష్టకి చేరింది. ‘జడివాన వెలసిన వెనుకా జరిగింది తెలియునులేరా..’ అని పాత పాట ఒకటుంది. ‘దూకుడు’ ఘన విజయం సాధించడంతో ఆ కలెక్షన్ల జడివాన జోరులో ముందూ వెనుకా చూసుకోకుండా మహేష్ బాబూ- దర్శకుడు శ్రీను వైట్ల వెనువెంటనే  ‘ఆగడు’ అనే మరో సినిమా ప్రారంబించేసి ఇక ఏం చేసినా చెల్లిపోతుందనే ధోరణిలో చెలరేగిపోయారు. తీరా సినిమా విడుదలయ్యాక చూసుకుంటే, శిథిలాలే కన్పిస్తున్నాయి! ఒక్క ప్రచండ గాలులకి సర్వం నేలమట్ట మైనట్టు- ఉదయం షో నడుస్తూండగానే ఎనిమిదిన్నరకి  అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చేసింది!
          ఆ తర్వాత ప్రతి షోలోనూ ఎంతో కొంత మంది ఇంటర్వెల్లో లేచిపోయే దృశ్యాలే! చరిత్ర మొత్తంలో సినిమా చూస్తున్నామన్న ఫీలింగ్ కాకుండా స్టేజి నాటకం చూస్తున్నట్టు అన్పించే అరవై కోట్ల భారీ బడ్జెట్ స్టార్ సినిమా ఏదైనా వుందంటే అది ఇదే! ఈ సినిమాని నిలువునా పాతరేసింది ఈ ‘సి’ గ్రేడ్ దర్శకత్వ ప్రతిభే. కామెడీ పేరుతో ప్రేక్షకులు బుర్ర కెక్కించుకోలేని స్పీడుతో ఏవేవో డైలాగులు- ప్రతిపాత్రా నిలబడి నిమిషాల కొద్దీ గొంతెత్తి అరవడం దీన్నో వీధి భాగోతంలా మార్చేసింది. వీధి భాగోతాల్ని చిన్నబుచ్చడం కాదు, ప్రాచీనకళ వీధిభాగోతం వీధి భాగోతమే. అది సినిమా కళ కాదు. ఏ కళకాకళ దాని లక్షణాల్ని ప్రదర్శిస్తేనే అదో కళ అన్పించుకుంటుంది. ఈ సినిమాకి ఈ విచక్షణ లేదు. ఒకప్పుడు గుంటూరు జిల్లాలో బాషా నాటకాలని ఆడేవారు. అవి కూడా ఆసాంతం సినిమా సీన్లతో, పాటలతో వినోదాత్మకంగా ఉండేవి. ఈ  సినిమా మాత్రం తలాతోకా లేని దృశ్యాలతో కామెడీని పండి స్తున్నామనుకుని తలపోటు తెప్పించే శబ్ద కాలుష్యంగా తయారయ్యింది. మహేష్ బాబు లాంటి  సూపర్ స్టార్ తన స్థాయిని మరచి ఇంత చవకబారు వ్యవహారంలోకి ఎలా తల దూర్చాడబ్బా అని ఇప్పుడు ఫిలిం నగర్ లో తలలు బాదుకుంటున్నారు.

జడ్జిమెంట్! కేవలం జడ్జిమెంట్ లేకే యువస్టార్లు ఇలాటి బీభత్సాలకి శ్రీకారాలు చుడుతున్నారు.
వాళ్లకి కథలంటే ఒకటే తెలుసు, పాత్రలంటే ఒకటే తెలుసు. కథలంటే అట్టడుగు స్థాయి ఫ్యాన్స్ కీ, మాస్ కీ మాత్రమే  అర్ధమయ్యే భాషలో వుండాలి. పాత్రలంటే వాళ్లకి మాత్రమే పట్టే దిక్కూ దివాణం లేని, అడుక్కుతినే అనాథ అయి వుండాలి. వాడి ఏడ్పుల్ని చిన్నప్పట్నించీ చూపించాలి. ఇదీ వరస. ఈ వరసపాత సినిమాల్లో తమ సీనియర్ల సినిమాల్లో ఉన్నదే కదా. మాస్ సినిమాలకి వాళ్ళే మార్గ నిర్దేశకులు కదా? అటు హిందీలో చూసినా అలనాడు మన్మోహన్ దేశాయ్ రకరకాల సూపర్ స్టార్లతో తీసిన కమర్షియల్ సిన్మాల్లో హీరో చిన్నప్పుడు అడుక్కుతినే అనాధే కదా? అనాధ ఎప్పటికీ తమ స్టార్ డమ్కి అన్నం పెట్టేవాడే కదా? వీడ్ని ఎలావదులుకోవడం? కాబట్టి దత్తత తీసుకుని సినిమాల్ని ఉద్ధరించే కార్యక్రమం పెట్టుకున్నారు.
          మరి కథలు? కథలు కూడా ఆనాటి సీనియర్ స్టార్లు నటించిన బాపతువే అయి వుండాలి. అదే మసాలా, అదే కామెడీ, అదే లవ్, అవే విరామాలతో పాటలూ ఫైట్లూ.
          ‘రభస’ నే చూద్దాం. ఇందులో కథేమిటంటే,
ఎన్టీఆర్‌ తన తల్లి జయసుధకి మరదల్నే పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు. అయితే ఎప్పుడో తన చిన్నప్పుడే ఆ మామయ్య తన తండ్రి తో దెబ్బలాడి కూతురితో నగరానికి వెళ్ళిపోయాడు. దీంతో ఎన్టీఆర్ ఇప్పుడు ఆ మరదల్ని  వెతుక్కుంటూ సిటీకి వస్తాడు. ఇక్కడికి వచ్చాక ప్రణీత ని చూసి ఈమే మరదలనుకుని వెంటబడతాడు. తర్వాత మరదలు ఈమె కాదు, ఎప్పుడూ తనతో గొడవపడే సమంతే అని తెలుసుకుంటాడు. ఇక ఈమెని లైన్ లో పెడదామనుకుంటే ఈమె వేరొకడ్ని ప్రేమిస్తూంటుంది. ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ తల్లికిచ్చిన మాట ఎ లా నిలబెట్టుకున్నాడు, సమంతని ఎలా పెళ్లి చేసుకున్నాడు, మామయ్యతో ఎలాటి గేములు ఆడాడన్నది మిగతా కథ.
          ఇందులో ఏమైనా కొత్తదనం ఉందా? తల్లి కిచ్చిన మాట- మరదలు- మొండి మామయ్యా –ఏనాటి కథ ఇది? ఎన్నేసి సార్లు చూసేసిన వ్యవహారమిది? ఇప్పుడు ప్రేక్షక సమాజం ఏ ట్రెండ్ లో వుంది? కంపెనీలు మార్కెట్ సర్వేలు చేస్తూంటాయి. సినిమాల వాళ్ళు ఎప్పుడైనా చేస్తారా? ఈ కథని మొదటి ఆటకే ఎందుకు తిప్పికొట్టారు ఎన్టీఆర్ అంతగా నమ్ముకున్న ఫ్యాన్సూ మాస్ ప్రేక్షకులూ సైతం? ఎవళ్ళ (పవరు దిగిన పాత చింతకాయ) పచ్చడి వాళ్ళ కిష్టమైతే కావొచ్చును..అదే అందరికీ వడ్డిస్తామంటే ఎలా? ఎన్టీఆర్ వరుసగా నటించిన ఇలాటి ఆరు పాత మూస సినిమాల్లో ఇది నాల్గో ప్లాపు. ఎంతవరకు నిజమో గానీ, ఇప్పడు ఎన్టీఆర్ డిప్రెషన్ లో వున్నట్టు, ఇకపైన పారితోషికమూ నిర్మాణ ఖర్చులూ తగ్గించి నిర్మాతకి లాభాలు మిగల్చాలని యోచిస్తున్నట్టు వినికిడి. ఇది మంచి నిర్ణయమే. అదే సమయంలో ఇంతటి డిప్రెషన్ కి దారి తీయించిన మరో పాత  చింతకాయ జోలికి వెళ్ళకుండా వుంటేనే మంచిది.
         
‘పవర్’ కథ చూద్దాం...ఓ కారణంతో పోలీసాఫీసర్ రవితేజ అవినీతి పరుడిగా మారతాడు. బాంబు పేలుడు కేసులో ఉరి శిక్ష పడ్డ హోంమంత్రి ముఖేష్‌ రుషి తమ్ముడ్ని పోలీసులనుంచి తప్పించే ప్రయత్నంలో చనిపోతాడు. అప్పుడు ఈ రవితేజ స్థానంలో ఇంకో రవితేజని ప్రవేశపెడతాడు ముఖేష్ రుషి. చచ్చిపోయిన రవితేజ బృందం ఆధీనంలో వున్న తన తమ్ముడ్ని విడిపించమంటాడు. ఈ ఎత్తుగడని కొత్త రవితేజ సక్సెస్ చేశాడా లేదా అన్నది మిగతా కథ.
           ఇదేమైనా కొత్తకథా? అరిగిపోయిన పాత మూస ఫార్ములాయే గా? పైగా ఇదే రవితేజ నటించిన
‘విక్రమార్కుడు’ తిరగమోతేగా? ఇంకెన్ని సార్లు చూడాలి? వసూళ్ళలో నష్టాల అంచునున్నఈ పెద్ద బడ్జెట్ సినిమా, వారం తేడాతో విడుదలైన ‘ఆగడు’ ఫ్లాప్ అవడంతో బతికిపోయింది గానీ లేకపోతేరవితేజ కి అంత శోభ నిచ్చేది కాదు. ఐదు వరస మూస ఫ్లాపుల తర్వాత తీవ్రాలోచనలో పడ్డ రవితేజకి తర్వాత మరో మూస ‘బలుపు’ ఎలాగో హిట్టన్పించుకుంది. అయినా అదే బాటలో నడుస్తున్నట్టు ‘పవర్’ ఫలితాలు తెలియజేస్తున్నాయి.
          ఇక తాజా ‘ఆగడు’ సంగతి చూస్తే,
ఇందులో మహేష్ బాబు ఒక అనాధ. ఇతడ్ని పోలీసు  అధికారి రాజేంద్రప్రసాద్ చేరదీస్తాడు. అనుకోని పరిస్ధితుల్లో రాజేంద్రప్రసాద్  ఓ కేసులో మహేష్ బాబుని జైలుకి పంపిస్తాడు. మహేష్ బాబు అక్కడే పెరిగి పెద్దవాడయ్యి ఎనకౌంటర్లు చేసే ఇన్స్పెక్టర్ గా తయారై బయిటికొ స్తాడు. స్వీట్లు తయారు చేసి అమ్ముకునే  తమన్నాని ప్రేమిస్తాడు. బుక్కపట్నం లో అరాచకాలు చేస్తున్న విలన్ సోనూసూద్ ని అడ్డుకోవడానికి చెలరేగిపోతాడు. ఆవిలన్ కట్టబోతున్న పవర్ ఫ్లాంట్ ని ఆపుచేయిస్తాడు. ఈ లోగా విలన్ గురించి ఇంకో నిజం తెలుస్తుంది. అదేమిటి, దాంతో మహేష్ బాబు కేం సంబంధం అన్నవి మిగతా కథలో తెలుసుకోదగ్గ విశేషాలు.
          ఇందులో ఏమైనా ఆసక్తి రేపే అంశముందా? ఎన్ని వందల సార్లు ఇలాటి సినిమాలొచ్చాయి? ఈ సినిమా తీసి చూపించకపోతే ప్రేక్షకులు ఏదో అదృష్టం మిస్సయిపోతారా? ఉదయాన్నే అడ్డంగా అట్టర్ ఫ్లాపైన ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రరాజం ప్రేక్షకులనుంచి ఎదుర్కొంటున్న అభిశంసనల తాకిడి మరే సినిమాకూ లేదు. ఇప్పుడు తీరిగ్గా ప్రిన్స్ మహేష్ బాబు ఇంతభారీ పరాభవ కారణాల్ని విశ్లేషించు కుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ ఏడాది నటించిన ‘నేనొక్కడినే’ అనే అర్ధం కాని ఇంటలెక్చువల్ సినిమా, ‘ఆగడు’ అనే అసలే భరించలేని సినిమా రెండూ రెండూ మహేష్ ని ఆత్మరక్షణలో పడేసిన అసలు కారణాలేంటో తెలుసుకుని సమూలంగా పాత చింతని భూస్థాపితం చేస్తే మంచిది!
          వరుసగా  నాల్గు వారాల్లో ఈ మూడు సినిమాలే కాదు, మునుపు రిలీజైన ప్రతీ యువ స్టార్ సినిమా ఇంతే. ఇవే కథలు, ఇవే నటనలు, ఇవే కృతక ప్రేమలు, డాన్సులు- పాటలు, మొక్కుబడి ఫైట్లు, కామెడీలు, సెకండాఫ్ మొదలవగానే అదే బ్రహ్మానందం అదే ఎంట్రీ. పూర్వం సర్కస్ లలో మనం చూసేవాళ్ళం -  కొంత ఉత్కంఠ రేపే కళాకారుల ప్రదర్శన తర్వాత, ఓ జోకర్ బుడుంగున బరిలోకి దూకి  ప్రదర్శనతో సంబంధం లేకుండా తన హాస్య చేష్టలతో నవ్వించి పోయేవాడు. అలా తయారయ్యింది సెకండాఫ్ బ్రాహ్మీ సార్ ఎంట్రీల ప్రహసనం. ముందు నుంచీ కథతో పాటు కలిసి సాగితే అది వేరు. సెకండాఫ్ లో కథ నడపడానికి ‘విషయం’ లేదుగాబట్టే బ్రహ్మానందం రప్పించి ఆ గ్యాప్ ని నింపుతున్నారన్న రహస్యం ఇప్పుడు సామాన్య ప్రేక్షకులకీ తెలిసిపోయింది.
          ఇంతే, ఇలా సెట్ చేసిన స్కీముతో, ఒకేపోతలో పోసినట్టుండే వైవిధ్యంలేని సినిమాలు చూసి చూసి ఇహ ఎంతమాత్రం సహించలేని స్థితి కొచ్చేసింది ప్రేక్షక లోకం. నాల్గు వారాల్లో వరుసగా మూడు సార్లు ప్రమాద ఘంటికలు మోగించేశారు. ఇంకా ఇలాగే ఎప్పటిదో సీనియర్లు అనుసరించిన ఫార్ములా దారిలోనే పోతామంటే, ఆ సీనియర్లే దారులు మార్చుకుని కొత్తబాట పడుతున్నారు. ఆమాట కొస్తే జూనియర్లు నటించాల్సిన కొత్త తరహా సినిమాల్ని తామే నటిస్తూ చెప్పకనే చెబుతున్నారు...నేటి కాలం సినిమా ఇదిరా బాబూ అనేసి!
          నేటి కాలం సినిమా- దాని కుండాల్సిన సృజనాత్మతే  కాకపొతే సీనియర్ స్టార్ అక్కినేని నాగార్జున తన తండ్రీ కుమారుడులతో కలిసి నటించిన ‘మనం’ అంత పెద్ద హిట్ ఎందుకవుతుంది? అందులో ఏ హీరోయిజాలు, బిల్డప్పులు, పంచ్ డైలాగులూ వున్నాయి? అలాగే మరో సీనియర్ స్టార్ వెంకటేష్ నటించిన ‘దృశ్యం’ మాత్రం? ఇంకో సీనియర్ స్టార్ బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ లో హీరోయిజాలు, బిల్డప్పులు, పంచ్ డైలాగులూ వున్నా, దానికో కథంటూ వుంది, ఆ కథకి బాలకృష్ణ పండించిన సీరియస్ నటనా వుంది. ఏ బ్రహ్మానందం కామెడీ మీదా సెకండాఫ్ ఆధార పడలేదు. లోలోపల బాధ అనుభవిస్తూ, పైన రోషంగా వుండే బాలకృష్ణ కట్టిపడేసే నటనకి ఏ యువ స్టార్ సరితూగ గలడు? ఎప్పుడైనా ఈ కోవలో
సినిమాని ఆలోచించారా?
          కాకతాళీయంగా ఈ సంవత్సరం సూపర్ హిట్టయిన పై మూడు సినిమాలూ కుటుంబ నేపథ్య కథలు గలవే. కుటుంబం ఎదుర్కొనే సమస్యలతో కూడుకున్నవే. ప్రేక్షకులు వీటికి పట్టం గట్టారంటే, యువ స్టార్లు వండి వడ్డిస్తున్న కాలం చెల్లిన పగా ప్రతీకారాల కథలతో ఎంత విసిగిపోయారో అర్ధం జేసుకోవచ్చు. ఈ సినిమాల్ని కేవలం ఫ్యాన్సూ మాస్ ప్రేక్షకులు మాత్రమే కలిసి హిట్ చేశారా? కుటుంబాలకి కుటుంబాలే  కదిలి వచ్చాయి.
          దీంతో అయిపోలేదు. నాగార్జున, వెంకటేష్ లు ఇదే బాటలో మరో రెండు కొత్త సినిమాల్లోనూ నటించబోతున్నారు. నాగార్జున తాతా మనవళ్ళు గా ద్విపాత్రాభినయంలో ‘సోగ్గాడే చిన్న నారాయణ’ అనే సినిమాలో నటించబోతోంటే, వెంకటేష్ ‘సలీం’ అనే తమిళ హిట్ రీమేక్ లో తిరగబడిన డాక్టర్ పాత్ర పోషించబోతున్నారు.  ఈ పాత్ర తమిళంలో విజయ్ ఆంథోనీ అనే యువ హీరో నటించాడు. రొటీన్ మసాలాకి  భిన్నంగా ఒక సీరియస్ సమస్యని చర్చించే ఇలాటి కథలో అతనే నటించి హిట్ చేసుకున్నప్పుడు మన యువస్టార్ లకి అంత భయమెందుకు? దిక్కూ దివాణం లేని అనాధ పాత్ర ఇమేజి సృష్టించుకుని ఇంకెన్నాళ్ళు? ఇంకెన్ని ఫ్లాపులు?
-సికిందర్