రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

21, సెప్టెంబర్ 2014, ఆదివారం

రివ్యూ..

నిర్లక్ష్యానికి పరాకాష్ఠ !

స్టార్ సినిమాలు సింగిల్ స్టార్ రేటింగ్ సినిమాలుగా దిగజారి స్టార్ల అమోఘ ఇమేజి తాపత్రయాల్ని వెక్కిరించే క్రమం యమజోరుగా ఇంకా కొనసాగుతోంది.  మిగతా దేశంలో స్టార్లు ఇమేజి ఎండమావుల వెంట పరుగులాపి పాత్రలతో ప్రయోగాలు చేస్తూ అభిమానుల్ని పెంచుకుంటూ పోతూంటే, తెలుగు యువ స్టార్లు ప్రపంచం ఎటుపోయినా మా ఇమేజుల్ని మేం వదులుకోంగాక వదులుకోమంటూ భీష్మించుకుని , భారీ ఎత్తున పుట్టెడు ఫ్యాన్స్ కి తప్ప మరెవరికీ అక్కరలేని పాత మూస సినిమాల తిరునాళ్ళకి తెరలేపుతున్నారు. 
          ఈ ట్రెండ్, ఈ రేసు యువ స్టార్లకి పాపం చాలా అర్జెంటు వినాశక పథకంలా తోస్తోంది.  ప్రతియువ స్టారూ అమాంతం ఈ హోమంలోకి దూకేస్తున్నాడు.  తెలుగులో చిన్న సినిమాలే వదిలేసిన మూసఫార్ములా కథల్ని పట్టుకుని అదే నవలోకంగా భ్రమిస్తున్నారు. చిన్న సినిమాలే కాదు, దేశంలో ఇంకే భాషలోనూ కానరాని అరిగిపోయిన పాతచింతకాయ కథల్లో మునిగి తేలుతూ ఇదే నేటికాలం సినిమా అంటూ తమకి తామే చక్కిలిగింతలు పెట్టుకుని ఆనందిస్తున్నారు. యువ స్టార్ అంటే ‘అనాధ పాత్ర’ గా హాస్యాస్పదంగా మార్చుకున్న పేరుని కాస్తా, అప్పుడే ఇరవైలో అరవై నిండిన ‘విశ్రాంత స్టార్’ గా సవరించుకుని వెలవెల బోతున్నారు.
          ఆనాడు సీనియర్ స్టార్లు స్థిరీకరించిన మాస్ సినిమాల ఫార్ములానే ఎప్పటికీ శ్రీరామ రక్ష అనుకుంటూ, ఆ సేఫ్టీ జోన్ లో  సినిమా నిర్మాణాన్నీ నటననీ తమాషాగా తీసుకుని విలువలకి పాతరేయడంలో పోటీలు పడుతున్నయువస్టార్లు,  తెలుగు సినిమాల్ని తిరుగులేకుండా తిరోగమన  బాట పట్టిస్తున్నారు. సీనియర్ స్టార్లే మూసఫార్ములాలు ఇక పనికిరావని, ఒక ‘మనం’ తో, ఒక ‘దృశ్యం’ తో, ఇంకో ‘లెజెండ్’ తో సూపర్ హిట్లిచ్చి కొత్త బాటపడుతోంటే, యువస్టార్లు ఇంకా తమ సీనియర్లే వదిలిపారేసిన పాతచింతకాయ పచ్చడినే చప్పరిస్తూ ‘రభస’ అని ఒకరు, ‘పవర్’ అని మరొకరు, ’ఆగడు’ అంటూ ఇంకొకరు, ‘అల్లుడు శీను’ అంటూ ఇంకో నవహీరో లేనిపోని బిల్డప్పులతో వరుసగా సత్తెకాలపు సత్తెయ్య లవుతున్నారు!
          ఈ పతనావస్థ  ‘ఆగడు’ తో పరాకాష్టకి చేరింది. వీధి నాటకం వేస్తున్నట్టే, దృశ్యాలు ఎక్కడికక్కడ కుదేలై, పాత్రలు చతికిలబడి, నిమిషాలపాటు కామెడీ పేరుతో పూనకం పూనినట్టు దండకాలు చదివే డైలాగుల మోత నరాల మీద ఎత్తి కొట్టిన సమ్మెటపోట్లు. ఆగడు అనే వాడు ఎక్కడికక్కడ ఆగిపోతూ దర్శకుడి పూర్వ సహచరులమీద, తోటి స్టార్లమీద, టీవీ షోల మీదా వెటకారాలతో చేసే వ్యర్థ ప్రేలాపనలు మెదళ్ల మీద మోదిన సుత్తి పోట్లు. ‘స్మోకింగ్ వార్నింగు’ లకంటే ప్రమాదకరంగా శబ్ద దృశ్య కాలుష్యాలతో వొంటి మీద కొరడా చరుపుళ్ళు!
          ఆరుపదుల కోట్లు ధారబోసి, విలువైన ప్రతినిమిష కాలాన్నీ వాగుడుకాయ పాత్రలతో నింపేసి సినిమా కళని తీవ్రాతి తీవ్రంగా అవమానించడం. ఎప్పుడో 1971 లో సత్యజిత్ రే జీవిత చరిత్ర రాసిన మేరీ సెటన్ భారతీయ సినిమాలు ఇంకా వీధి భాగోతాల స్థాయిలోనే వున్నాయని ఎత్తిపొడిచిన వైనాన్ని ఈ  రోజుల్లో కూడా నిజం చేస్తూ నిర్లక్ష్యంగా, నీచంగా స్క్రిప్టు పేజీలు నింపెయ్యడం!
The characters talk and talk, and this only leads into a story that is not
screen writing, that’s stage writing… the evolution of science and art is creating
a new language of film, a more visual way of telling stories for the screen. The
language of film is becoming more visual; scripts filled with pages and pages
of great dialogue are now considered “too talky.” Two people talking in an
restaurant, explaining things to each together, rarely works anymore.” అని
   ఏనాడో 1998 లో సిడ్ ఫీల్డ్ చేసిన హెచ్చరికనీ పాతరేసి ప్రేక్షకులకి నరకాతి నరకం చూపించడం!  
       ఆస్థాన రచయితల్ని కోల్పోయిన దర్శకుడికి (సలీం – జావేద్ ల కెరీర్ ప్లానింగ్ ని అనుసరించని జంట ఆస్థాన రచయితలపాట్లు వేరే కథ) దిక్కుతోచనట్టు తన గత సినిమానే ఇంకో పవర్ స్టార్ హిట్ సినిమాతో కలిపి రాని వంటకం ఏదో వండేసి అదే సినిమా అనుకోవడం. పవర్ స్టార్ పోలీసు పాత్ర అంత హిట్ ఎందుకయ్యిందో అంతఃస్సూత్రం తెలుసుకోకపోవడం. స్టార్ సినిమాలంటే కేవలం ఫ్యాక్షన్ అనో, మాఫియా అనో, యాక్షన్ కామెడీ లనో నమ్మేసి, వైవిధ్యంలేకుండా అవే తీస్తూపోయిన పాపానికి, ఏర్పడ్డ ప్రతిష్టంభనని బద్దలు కొట్టిన పవర్ స్టార్ పోలీసు పాత్ర ముసుగులో వున్న ‘కౌబాయ్ పాత్ర’ అనే క్రియేటివిటీని గ్రహించక గుడ్డిగా దాన్నే అనుకరించి బోల్తా పడ్డం!
          బ్యాడ్ రైటింగ్ కీ, పరమ బ్యాడ్ టేకింగ్ కీ ఫిలిం స్కూళ్ళల్లో హెచ్చరిక పాఠాల్లా ఉండాల్సిన  ఈ తలతిక్క బిగ్ బడ్జెట్ విశృంఖలత్వం ప్రేక్షకుల మధ్యకి రావడం క్షమించరాని నేరం. ఇంతకంటే దీని గురించి చెప్పుకోవడం శుద్ధ అనవసరం!

-సికిందర్