రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, December 26, 2015

తారుమారు!!
దర్శకత్వం : జి. శ్రీనివాస రెడ్డి

తారాగణం : అల్లరి నరేష్, మోహన్ బాబు, పూర్ణ, మీనా, రమ్యకృష్ణ, వరుణ్ సందేశ్, అలీ, జీవా, కృష్ణ భగవాన్, రఘుబాబు, రాజా రవీంద్ర, సురేఖా వాని తదితరులు 
సంగీతం : కోటి, రఘు కుంచె, అచ్చు , ఛాయాగ్రహణం : బాలమురుగన్
బ్యానర్ : 24 ఫ్రేమ్స్ ఫిలిం ఫ్యాక్టరీ
నిర్మాత : విష్ణు మంచు
విడుదల : 25 డిసెంబర్, 2015
***
        కుటుంబ కథా చిత్రాల పేరుతో ఇవ్వాళ్ళ వస్తున్న సినిమాలు అయితే రాక్షస కుటుంబాల కథలుగా, కాకపోతే 1990 లనాటి పాత వాసన కథలుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే లోఫర్, సౌఖ్యం వంటి నరుక్కునే రాక్షస కుటుంబాల ‘ఫ్యామిలీ సినిమా’లు మళ్ళీ మళ్ళీ  ప్రేక్షకులు చూశాక, ఈసారి ‘మామ మంచు- అల్లుడు కంచు’ పేరుతో  1990 ల నాటి ‘ఫ్యామిలీ కామెడీ’ని వడ్డించేందుకు సిద్ధమయ్యారు దర్శకుడు జి. శ్రీనివాస రెడ్డి. ఇందుకు మోహన్ బాబు- అల్లరి నరేష్ లతోబాటు,  నాటి హీరోయిన్లు మీనా- రమ్యకృష్ణ లతో కలర్ ఫుల్ గా  కాంబినేషన్లు సెట్ చేసుకున్నారు. అయితే ఎంత కలర్ ఫుల్ గా సినిమా తీర్చిదిద్దారన్న కుతూహలం ఈ సినిమాకిచ్చిన పబ్లిసిటీతో ప్రేక్షకులకి ఏర్పడుతుంది. అలాటి  కుతూహలాన్ని శ్రీనివాస రెడ్డి ఎలా తీర్చారు, అసలు తీర్చాలా లేదా తెలుసుకోవాలని మనకి వుంటుంది. ఆ ప్రయత్నం చేద్దాం...

స్టోరీ @ 1990
        బిజినెస్ మాన్ భక్తవత్సలం నాయుడు (మోహన్ బాబు) కి ఇద్దరు భార్యలు. ఒక భార్య సూర్య కాంతం (మీనా) భర్తని  ‘బాయ్యా’ (బావయ్యా కి షార్ట్ ఫాం) అని ప్రేమగా పిలుస్తూ కూకట్ పల్లిలో వుంటుంది. ఇంకోభార్య ప్రియంవద ( రమ్యకృష్ణ) భర్తకి కడుపునిండా తిండి పెడుతూ జూబ్లీ హిల్స్ లో వుంటుంది. ఆమెకి శృతీ నాయుడు ( పూర్ణ) అనే కూతురుంటుంది, ఈమెకి గౌతమ్ నాయుడు ( వరుణ్ సందేశ్) అనే కొడుకుంటాడు. ఇలా ఇద్దరు భార్యల్నీ సపరేట్ గా వుంచి వాళ్లకి తెలీకుండా సీక్రెట్ గా మెయింటెయిన్ చేస్తూంటాడు భక్తవత్సలం. ఖర్మకాలి ఓనాడు ఆ శృతీ- ఈ గౌతమ్ లు లవ్ లో పడతారు. భక్తవత్సలం కొంపలంటుకుంటాయి. పిక్చర్లోకి బాలరాజు ( నరేష్) ఎంటరవుతాడు. భక్తవత్సలం ఇచ్చిన ప్లాను పట్టుకుని శృతి దృష్టిని  గౌతమ్ మీంచి మళ్ళించడానికి పూనుకుంటాడు. ఖర్మకాలి శృతితో తనే లవ్ లో పడతాడు. మళ్ళీ భక్తవత్సలం కొంపలంటుకుంటాయి. స్నేహితుడు ఇస్మాయిల్ (అలీ) ఎంటరవుతాడు. ఇక ఇటు భార్యనీ, అటు భార్యనీ, ఇటు కూతుర్నీ అటు కొడుకునీ కన్ఫ్యూజ్ చేసి పరిస్థితిని చక్కబెట్టేందుకు రంగంలోకి దూకుతారు. మధ్యలో తన కూతురు ప్రేమిస్తున్న బాలరాజుని అవుట్ చేసేందుకు భక్తవత్సలం ఎత్తుగడలతో... భక్తవత్సలంని తిప్పికొట్టేందుకు అతడి  ఫ్యామిలీ సీక్రెట్స్ తెలిసిపోతాయి బాలరాజుకి. ఇక తను ఆడుకోవడం మొదలెడతాడు..

        అసలు భక్తవత్సలం ఎందుకు ఇద్దర్నీ పెళ్ళిచేసుకున్నాడు, ఆ నిజమేమిటి, అది తెలుసుకున్న బాలరాజు భక్తవ్సలం ఫ్యామిలీ సమస్యనీ, తన లవ్ సమస్యనీ ఎలా తీర్చుకున్నాడు,  చివరికి భార్యలతో భక్తవత్సలంకి సుఖాంతమయిందా, దుఖాంతమయిందా తెలుసుకోవాలంటే ఈ ఫ్యామిలీ కామెడీ- డ్రామా పూర్తిగా చూడాల్సిందే- 1990 స్టయిల్లో. 

ఎవరెలా చేశారు
       
నిజానికి మోహన్ బాబు దారి తప్పి ఈ సినిమాలో నటించారు గానీ, లేకపోతే ఇప్పటికీ  చెక్కుచెదరని ఫిజిక్ తో, యాక్టింగ్ లో టైమింగ్ తో, డైలాగ్ డెలివరీతో వేరే పవర్ఫుల్ సినిమా ఏదైనా చేసివుంటే 181 వ సినిమా ధన్యమయ్యేది. ప్రస్తుత సినిమాలో ప్రధాన కథ తనదే, అల్లరి నరేష్ ది కాదు. అల్లరి నరేష్ ది తోడ్పడే పాత్ర మాత్రమే. ఇది బాగా మైనస్ అయింది యూత్ అప్పీల్ కి. పూర్తిగా మోహన్ బాబు సినిమానే అన్నట్టు తయారవడంతో యువ ప్రేక్షకులు ఫస్టాఫ్ లోనే, కొందరు ఇంటర్వెల్లోనే వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూస్తాం. అల్లరి నరేష్ మెయిన్ రోల్ దక్కే కథలో మోహన్ బాబు సపోర్టింగ్ రోల్ వేయాల్సిన లెక్కలు తారుమారయ్యాయి. దీంతో మోహన్ బాబు ఈ పాత్రలో ఎంత బాగా చేసినా, నవ్వించినా  బూడిదలో పోసిన పన్నీరే  అయింది. నరేష్ సంగతి చెప్పక్కర్లేదు. తను ఎప్పటినుంచో ప్లాన్ చేసుకుంటున్న 50 వ సినిమా కూడా ప్లస్ కాని పరిస్థితి.

        హీరోయిన్ పూర్ణ ఎంతసేపూ చిరునవ్వుతో చూడ్డం తప్ప ఇంకేమీ చేయదు. సీనియర్ హీరోయిన్ లిద్దరూ వాళ్ళ టాలెంట్ బాగానే చూపించుకున్నా,  ఇదీ మోహన్ బాబు పాత్రకి లాగే యూత్ అప్పీల్ కి నప్పలేదు. హీరోకి కత్తి లాంటి ఇద్దరు యువ హీరోయిన్లు, సీనియర్ హీరోకి ఒక సీనియర్ హీరోయినూ వుండి రక్తి కట్టించాల్సిన కామెడీ  ఇది. అంటే అల్లరి నరేష్ కే ఇద్దరు భార్యలుండాల్సిన ట్రెండీ కామెడీ, కాంబినేషన్లు తారుమారై కాలం చెల్లిన రూపాన్ని సంతరించుకుంది.
        అలీకి సినిమా ఆసాంతమూ చిక్కుల్ని పరిష్కరించే పాత్రదక్కింది. పాత్రకి ఆడపిచ్చి అతి గా మారింది. ఇతరపాత్రల్లో మిగిలిన నటీనటులు- వరుణ్ సందేశ్ సహా సోసోగా నటించేశారు.

        టెక్నికల్ గా, సంగీత సాహిత్యాల పరంగా చెప్పుకోవడానికేమీ లేదు.

చివరికేమిటి?
        ర్శకుడు ఈ సినిమాతో ప్రేక్షకుల కుతూహలం తీరుస్తున్నాననుకుంటూ నీరుగార్చాడు. ఉత్త డైలాగుల మోతతో సినిమా అంతా కామెడీగా నడుపుదామనుకోవడంలో కూడా వెనకబాటు తనమే కనిపిస్తోంది. టేకింగ్ కూడా పాత సినిమా శైలిలో వుంది. ఆఫ్ కోర్స్, ఈ డైలాగుల మోతతోనే కొన్ని చోట్ల బాగా నవ్వొచ్చేట్టు  సీన్లు తీసిన మాట నిజమే. ఇలాగైనా వీలైనన్ని చోట్లా సీన్లు స్టాండప్ కామెడీగా తీసివుండాల్సింది. ఇక మోహన్ బాబు పాత్ర రెండు పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన అగత్యం గురించి తెలిపే ఫ్లాష్ బ్యాక్ విషయంలో కూడా అలసత్వమే కనబరచాడు దర్శకుడు. మోహన్ బాబు- మీనా- రమ్య కృష్ణలు ఆనాడు నటించిన ‘అల్లరిమోగుడు’ దృశ్యాల్లోంచే క్లిప్పింగ్స్ తీసి ఫ్లాష్ బ్యాక్ గా వేశారు. ముందు పెళ్లి చేసుకున్న భార్యగా మీనా పాత్ర వుండగా, రెండో పెళ్లి ఆమెకి తెలీకుండా రమ్యకృష్ణ పాత్రని ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో చెప్పిన  కారణాన్ని  ‘ జీవిత చక్రం’ లోంచి ఎత్తేశారు. నందమూరి తారకరామారావు నటించిన ‘జీవిత చక్రం’ లో కమల (శారద) జబ్బుతో మరణం ఖాయమైపోయిన స్థితిలో చివరి కోరిక కోరుతుంది. రాజా (ఎన్టీఆర్) చేత తాళి కట్టించుకుని తృప్తిగా కన్ను మూయాలని. రాజా ఆమె కోరిక తీరుస్తాడు. ఆ తర్వాతే కథ అడ్డం తిరుగుతుంది- కమల బతికి బాగుపడుతుంది! కలవర పడిపోతుంది. చివరి కోరిక తీర్చుకుని చచ్చి ఈ లోకం లోంచి వెళ్ళిపోవాల్సిన తనే,  ఇలా సుశీల (వాణిశ్రీ) కి కి అడ్డు అయ్యిందేమిటి? రాజాకీ ఏమీ తోచని స్థితి! ఇదీ ట్విస్టు.

ఈ ట్విస్టే పెట్టి  ఫ్లాష్ బ్యాక్ చెప్పారు దర్శకుడు శ్రీనివాస రెడ్డి. ఆనాడు దర్శకుడు, గొప్ప కథా రచయిత సిఎస్ రావు పెట్టిన ఈ ట్విస్టు గొప్ప సంచలనమైతే ...ఈనాడు..???


-సికిందర్Friday, December 25, 2015

మూస మీద దాడి!
దర్శకత్వం : శ్రీ రామ్ ఆదిత్య టి.తారాగణం : సుధీర్ బాబు, వమిఖా గబ్బి, ధన్యా బాలకృష్ణ, సాయి కుమార్, పోసాని కృష్ణ మురళి, పరుచూరి గోపాల కృష్ణ, చైతన్య కృష్ణ  తదితరులు

కథ- స్క్రీన్ ప్లే : శ్రీ రాం ఆదిత్య టి., మాటలు : అర్జున్- కార్తీక్, సంగీతం : సన్నీ ఎం ఆర్, ఛాయాగ్రహణం : శ్యాందత్  సైనుద్దీన్, నృత్యాలు : చిన్ని ప్రకాష్, సుచిత్రా చంద్రబోస్, విజయ్, కూర్పు : ఎం ఆర్ వర్మ, పోరాటాలు : అన్బరీవ్, రామ్ సుంకర 
బ్యానర్ : 70 ఎం ఎం ఎంటర్ టిన్ మెంట్స్, నిర్మాతలు : విజయ కుమార్ రెడ్డి, శశిధర్ రెడ్డి 
విడుదల : 25 డిసెంబర్,  2015
****ప్రేమకథా చిత్రం’ తో ఓ మంచి హిట్ సాధించిన సుధీర్ బాబు, మళ్ళీ అలాటి ఒక సక్సెస్ కోసం విఫలయత్నాలు చేస్తున్నప్పటికీ,  కొత్తదనాన్ని ప్రయత్నించడం మానుకోక పోవడం అతడి ప్లస్ పాయింట్. దొంగాట, మోసగాళ్ళకు మోసగాడు, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ- అనే గత భిన్నమైన మూడు ప్రయత్నాలతో  అపజయాల బాట పట్టినప్పటికీ,  మళ్ళీ ఓ కొత్తదనాన్నే ఆశ్రయించి, కొత్త దర్శకుడ్నే పూర్తిగా నమ్మి,  ‘భలే మంచి రోజు’ తో తిరిగొచ్చాడు. కొత్త దర్శకుడు శ్రీ రామ్  ఆదిత్య న్యూవేవ్  థ్రిల్లర్ గా అందించిన  ఈ తొలి  ప్రయత్నానికి,  ‘స్వామిరారా’  స్ఫూర్తి అన్నట్టు స్పష్టంగా అన్పించినా, ఆ రేంజి సక్సెస్ కి ఇది చేరుకో గల్గిందా లేదా చూద్దాం...

కథ

రామ్ ( సుధీర్ బాబు) అనే నిరుద్యోగి  ప్రేమించిన గర్ల్ ఫ్రెండ్ ( ధన్యా బాలకృష్ణ) మోసం చేసి ఇదే రోజు పెళ్లి చేసుకుంటోందని,  ఆమెని  నాల్గు తన్ని వద్దామని ఫ్రెండ్ (ప్రవీణ్) తో కలిసి బయల్దేరతాడు. దార్లో ఫ్రెండ్ తో వాగ్వాదం తో ఆ కారు వెళ్లి ఇంకో కారుకి డాష్ ఇవ్వడంతో-ఆ కార్లో కిడ్నాపైన ఇంకో పెళ్లి కూతురు సీత ( వమిఖా గబ్బి) కారు దిగి పరారవుతుంది. దీంతో గ్యాంగ్ లీడర్ శక్తి ( సాయికుమార్) రామ్ ఫ్రెండ్ ని బంధించి, ఆ సీతని వెతికి తీసుకొచ్చే బాధ్యత రామ్  మీదేస్తాడు. రామ్ కి ఇద్దరు క్రిమినల్స్ యూసుఫ్- ఆల్బర్ట్ (వేణు- శ్రీరాం) లు  తగుల్తారు. సీత కూడా ఓ చోట తగుల్తుంది. ఈ క్రిమినల్స్ సాయంతో సీతని పట్టుకుని, శక్తి దగ్గరికి తీసుకోస్తూంటే ఇంకో గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది.. ఏమిటీ  కిడ్నాపులు? మొత్తం ఎన్ని గ్యాంగులు పనిచేస్తున్నాయి? వాళ్ళెవరెవరు? ఒకర్నొకరు ఎందుకు డబుల్ క్రాస్ చేసుకుంటున్నారు? మధ్యలో సీత పెళ్లి కథేంటి? ఒక్క రోజులో ఈ చిక్కులన్నీ ఇందులో ఇరుక్కున్న  రామ్ ఎలా పరిష్కరించాడు- మొదలైన ప్రశ్నలకి సమాధానాలు కావాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.

ఎలావుంది కథ
నిన్నటి ‘సౌఖ్యం’ దెబ్బకి ఇహ తెలుగు సినిమా కథంటే భయపడి పారిపోయే పరిస్థితి పరాకాష్ఠ కి  చేరుకున్నాక- ‘భలే మంచి రోజు’ కథ క్రిస్మస్ పండక్కి పండగ మూడ్ ని నాశనం చేయకుండా, ఈ మంచి రోజుని మంచిరోజులాగే ఉంచుతూ కొండంత ధైర్యాన్నిస్తుంది చూసే ప్రేక్షకులకి. ఇదేరోజు మళ్ళీ అవతల ‘మామ మంచు- అల్లుడు కంచు’ చూసే వాళ్ళ పరిస్థితి  వేరు, అదలా ఉంచుదాం. ఒక సహజంగా జరిగే కథ చూడడం ఎవరికైనా మూస సినిమాల నుంచి చాలా రిలీఫ్ నిస్తుంది.  సహజ సంఘటనలు, సహజ క్రిమినల్ పాత్రలు, సహజ కామెడీ, వీటితో థ్రిల్, సస్పెన్స్, వినోదం  కలగలిసి ఫ్రెష్ గా  తయారైన కథ ఇది. ముందే చెప్పినట్టు, ‘స్వామిరారా’ పంథాలో వుంటుంది. అయితే ‘స్వామిరారా’ తో ప్రామిజింగ్ దర్శకుడిగా కన్పించిన  సుధీర్ వర్మ అంతలోనే  రెండో ప్రయత్నం పాత మూస ‘దోచేయ్’ తో ఎంత షాకిచ్చాడో  తెలిసిందే. ప్రస్తుత కొత్త దర్శకుడు అలా కాకుండా ఆ ‘స్వామిరారా’  ప్రమాణాల కోసం- ఆ ఫీల్ కోసం తెగ ప్రయత్నం చేయడం ఇక్కడ తెర నిండా కన్పిస్తుంది.

ఎవరెలా చేశారు
        సుధీర్ బాబు కచ్చితంగా ఇంప్రూవ్ అయ్యాడు. పైగా ప్రారంభం నుంచీ  ముగింపు వరకూ సినిమాని తన భుజాన మోస్తూ ఒక పక్కా యాక్టివ్ క్యారెక్టర్ కి నిదర్శనంగా నిలచాడు. ఫ్రెండ్ కోసం హీరోయిన్ని కిడ్నాప్ చేస్తే, మళ్ళీ తల్లిదండ్రుల కోసం తప్పి పోయిన హీరోయిన్ ని మళ్ళీ పట్టుకునే బాధ్యత కూడా   మీద పడే, నిత్యం కర్తవ్యానికీ- హీరోయిన్ తో నైతిక బాధ్యతకీ  నడుమ  నలిగే పాత్రని  సమర్ధవంతంగా పోషించాడు. గత ఫ్లాపుల బాధ దీంతో తీరిపోవచ్చు.  

పంజాబీ హీరోయిన్ వమిఖా గబ్బీ కి ఇదే తొలి తెలుగు అయినా,  హిందీలో 2007 లో ‘జబ్  వి మెట్’  లో కరీనా కపూర్ చెల్లెలిగా వేసి నప్పట్నించీ వుంది. అంత  గ్లామరస్ కాకపోయినా,  గోదావరి జిల్లా అమ్మాయి పాత్రకి సరిపోయింది. రెండో హీరోయిన్ ధన్యా బాలకృష్ణ కెక్కువ కథలేదు. హీరో తండ్రిగా కార్ల షెడ్డు నడిపే పరుచూరి గోపాల కృష్ణ పాత్ర గమ్మత్తయినది. అలాగే చర్చి ఫాదర్ గా పోసానీ పాత్రకూడా బిన్నమైన కామిక్ పాత్రే. క్లయిమాక్స్ లో  వచ్చి గందరగోళం సృష్టించే పృథ్వీ తో క్లయిమాక్స్ కే బలం పెరిగింది. అయితే ఎంత సేపూ  సినిమాల్ని పేరడీ చేసే పాత్రలే ఆయనకి  దక్కుతున్నాయి. తన కామెడీకి ఇక  రూటు మార్చుకుంటే మంచిదేమో. హీరో చెల్లెలి పాత్రలో విద్యుల్లేఖా  రామన్ కూడా ఫన్నీ పాత్రే. ఓల్డ్ సిటీలో మూతబడ్డ థియేటర్ లో పాత సినిమాలేసుకు ఎంజాయ్ చేసే,  మెయిన్ విలన్ గా సాయికుమార్ దో  భిన్నమైన పాత్రా, నటనా. వీళ్ళందరితో బాటు, జంట క్రిమినల్స్ గా కమెడియన్ వేణు- శ్రీరాంలు సైతం కథని మలుపులు తిప్పుతూ ఎక్కడికో తీసికెళ్ళి పోయే పాత్రలే. ప్రతీ పాత్రా కథలో ఎక్కడో కలిసి కథ పరిధిని పెంచేదే.  ఈ సహజత్వం వల్ల ఇవి గుర్తుండి  పోతాయి.

టెక్నికల్ గా ఈ కథ డిమాండ్ చేస్తున్న మేకింగ్ తో వుంది. ‘ఉత్తమ విలన్’, ‘ విశ్వరూపం’ సినిమాల ఫేం కెమెరా మాన్ శ్యాందత్  సైనుద్దీన్ కలర్స్ తో, లైటింగ్ తో, షేడ్స్ తో ఉత్తమ పనితనం కనబరచాడు. అలాగే ‘స్వామిరారా’ లో లాగా జాజ్ మ్యూజిక్ ని ఫ్యూజన్ చేసిన బాణీలతో సన్నీ ఎం ఆర్ కథ ఫ్లేవర్ తగ్గ ట్రెండీ మ్యూజిక్ ఇచ్చాడు. మిగిలిన ఎడిటింగ్, యాక్షన్, కోరియోగ్రఫీ విభాగాలూ కూడా కథ ఏర్పరచిన చట్రంలోనే పని చేశాయి. పోతే మాటలు రాసిన అర్జున్- కార్తీక్ లు ఈ కామిక్ థ్రిల్లర్ కి చాలా స్పూర్తిదాయకమైన క్రియేటివిటీ ని కనబర్చా రు.

చివరి కేమిటి
కొత్త దర్శకుడు శ్రీరామ్  ఆదిత్యలో మంచి టాలెంట్ వుంది. సినిమాలు చూసే జనంగా యువ ప్రేక్షకులే మిగిలినప్పుడు,  వాళ్ళ అభిరుచిని దృష్టిలో పెట్టుకుని టార్గెట్ చేసిన న్యూవ్ వేవ్ థ్రిల్లర్ ఇది. ఇదయినా ‘స్వామి రారా’ అయినా ‘పల్ప్ ఫిక్షన్’ తో క్వెంటిన్ టరాంటినో పాపులర్ చేసిన తరహా సినిమాలే.  అవలా ఉంచితే,  మొత్తం థ్రిల్లర్ కుండాల్సిన స్పీడు, పెప్, టెంపో లోపించాయి.  షాట్స్ లో కెమెరా స్పీడు కూడా లేదు. అలాగే ఈ కథంతా ఒక్క  రోజులో జరుగుతోందన్న ఫీల్ కూడా తీసుకు రాలేకపోయారు. ఇవన్నీ స్క్రీన్ ప్లే సంగతుల్లో చూద్దాం. ఏమైనా కొత్త దర్శకుడు అప్పుడే పర్ఫెక్టుగా వుండాలని ఆశించలేం. ఈ కొత్త దర్శకుడి మీద విశ్వాసంతో అవకాశమిచ్చిన సుధీర్ బాబు, నిర్మాత లిద్దరూ అభినందనీయులే.


-సికిందర్
(స్క్రీన్ ప్లే సంగతులు రేపు!) 

సౌఖ్యం ఎవరికి?

దర్శకత్వం : ఏఎస్. రవికుమార్ చౌదరి

తారాగణం :  గోపీచంద్ , రేజీనా కాసాండ్రా, బ్రహ్మానందం, షావుకారు జానకి, పృథ్వీ, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్ రెడ్డి, జీవా, రఘుబాబు, కృష్ణ భగవాన్, ముఖేష్ రిషి, ప్రదీప్ రావత్, రాజన్   తదితరులు
సంగీతం : అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం :  ప్రసాద్ మురెళ్ళ, కథ- మాటలు : శ్రీధర్ సీపాన, స్క్రీన్ ప్లే : కోన వెంకట్- గోపీ మోహన్, కూర్పు : గౌతం రాజు, పోరాటాలు : వెంకట్
బ్యానర్ : భవ్య క్రియేషన్స్, నిర్మాత : ఆనంద్ ప్రసాద్
విడుదల : 24 డిసెంబర్,   2015
       2004 లో గోపీచంద్ తో ‘యజ్ఞం’ తీసి సక్సెస్ అయిన దర్శకుడు ఏ ఎస్ రవికుమార్ దశాబ్దం తర్వాత తిరిగి గోపీచంద్ తో ‘సౌఖ్యం’ తీస్తూ ప్రేక్షకులకి తగిన సుఖశాంతులు ఇద్దామనుకున్నాడు. గత సంవత్సరం సాయి ధరమ్ తేజ్ తో తన సెకండ్ ఇన్నింగ్స్ గా  ‘పిల్లా నువ్వు లేని జీవితం’  అనే హిట్ ఇచ్చిన తను, ఈ సక్సెస్ బాటలో ఈసారి ఏం చేశాడో తెలుసుకుంటే సుఖ శాంతులు  కష్ట సాధ్యంగానే వుంటాయి. శాంతము లేక సౌఖ్యము లేదన్నారు కాబట్టి – గోపీచంద్ కూడా లౌక్యం, శౌర్యం, శంఖం టైటిల్స్ బాటలో ‘సౌఖ్యం’ తో మోజు తీర్చుకోవడం కూడా అయింది. కానీ ‘సౌఖ్యం’ కంటే ముందు  ‘శాంతం’  అని ఒకటి తీసివుంటే వరస బావుండేది. జరిగిందేదో జరిగిపోయిందని ఇప్పటికైనా శాంతం గా ఉండకపోతే ఇకముందు ఎలాటి సౌఖ్యమూ దక్కదని గ్యారంటీగా చెప్పొచ్చు. అంతా గజిబిజిగా వుంది కదూ టైటిల్స్ తో ? కాస్సేపు ఈ టైటిల్స్ గొడవ పక్కన పెట్టి అసలు సంగతేమిటో చూద్దాం...


మళ్ళీ మళ్ళీ  అదే కథ!
చాలా చాలా రిపీట్- రిపీట్- రిపీటెడ్ గా శీను ( గోపీచంద్) పెళ్లవుతున్న ఓ అమ్మాయిని ఎత్తుకెళ్ళి  ఆమె ఇష్ట పడ్డ వేరే పెళ్లి చేసేస్తాడు. వెంటనే రొటీన్ గా పాటేసుకుంటాడు. ఆ వెంటనే  రొటీన్ గా ఓ రౌడీని కొడతాడు. ఆ రౌడీ బావూజీ (ప్రదీప్ రావత్) అనే ముఠా కోరు కొడుకు. తన కొడుకుని కొట్టిన వాణ్ణి చంపుతానని రొటీన్ గా ప్రతిజ్ఞ చేస్తాడు. శీను కి ఇంట్లో పెళ్లి చేయాలనుకుంటారు. ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక ఏ పెళ్ళీ వద్దంటాడు. ఆ అమ్మాయి శైలజ ( రేజీనా) ని కోలకత్తాలో పవర్ఫుల్  పీఆర్ (రాజన్) అనే అతడి కూతురు. అక్కడి సీఎం కొడుకుతో ఇష్టం లేని పెళ్లి చేస్తోంటే రొటీన్ గా పారిపోయి వచ్చి శీనుతో రొటీన్ గా ప్రేమలో పడింది. ఇప్పుడా తండ్రి గ్యాంగే రొటీన్  గా ఎత్తుకెళ్ళారు. ఈ నేపధ్యంలో బావూజీ కి ఇంకో గొడవ వుంటుంది. రొటీన్ గా శైలజని తన కొడుక్కు చేసుకోవాలని. ఇప్పుడా శైలజని కొలకత్తా లో పీఆర్ ఇంట్లోంచి తీ సుకురావాలంటే చాలా గట్టివాడు కావాలి. ఆ గట్టి వాడుగా రొటీన్ గా శీను ఆఫరిస్తాడు. కొలకత్తా వెళ్లి  శైలజని తీసుకుని రొటీన్ గా పారిపోయి వచ్చి తన ఇంట్లో పెట్టుకుంటాడు. ఇక్కడ్నించీ ఇంకా  -రొటీన్- రొటీన్ – పరమ రొటీన్ గా ఏం జరిగిందనేది ఓపిక మిగిలుంటే వెండితెర మీద చూసుకోవచ్చు.
కథెలా వుంది
        ప్రేక్షకుల మీద చేసిన స్కామ్ లా వుంది. ఏవేవో గొప్ప అంచనాలు కల్పిస్తారు, తీరా చూస్తే సవాలక్ష సార్లు చూసిందే చూపించి, నేడు సినిమా కథల పేరుతో జరుగుతోంది రీసైక్లింగ్ స్కామే తప్ప ఇంకేమీ కాదని చెప్పకుండానే చెప్పేస్తారు. పైన సగం వరకూ చెప్పుకున్న కథని చూస్తే అర్ధమైపోతుంది.  కథెలా వుందో ఇంకా విడమర్చి చెప్పుకోనవసరం లేదు. కథ రాసిన శ్రీధర్ సీపాన అనే రచయిత తన సొంత మస్తిష్కంతో ఏమీ ఆలోచించలేదు. శివమ్, బాద్షా, ఢీ, రెఢీ, పండగ చేస్కో...లాంటి డజన్ల సినిమాల దగ్గర్నుంచీ నిన్నటి ‘లోఫర్’ వరకూ తిరగమోత తాలింపు సినిమాలెన్నో వుండగా- వాటిని దింపెయ్యడానికి పెద్దగా మస్తిష్కం అవసరం లేదు. టాలీవుడ్ లో రైటర్ అనే వాడికి బుర్రే అవసరం లేదు. వచ్చిన ఏ తెలుగు సినిమాలో ఏ సీన్లున్నాయో గుర్తుంటే చాలు. పరీక్షలో అందరూ కలిసి ఒకరి దాంట్లో ఇంకొకరు చూసి మాస్ కాపీయింగ్ కి పాల్పడితే ఆన్సర్ పేపర్లు ఎలావుంటాయో, తెలుగు సినిమాలు అలాటి జిరాక్స్ కాపీల్లా ఉంటున్నాయి, ఇంకా వుంటాయి కూడా.
ఎవరెలా చేశారు
వరైనా చేయడానికి ఏం కావాలి? ఓ కథ, ఓ పాత్ర. ఈ రెండూ లేనప్పుడు గోపీచంద్ పొందిన సౌఖ్య మేమిటో జుట్టు పీక్కున్నా అర్ధంగాదు. మాట్లాడితే ఫైటు, మాట్లాడితే పాట, మధ్యమధ్యలో నాలుగు మాటలు- సెకండాఫ్ ని ఇతర నటీ నటులు పూర్తిగా హైజాక్ చేయడంతో,  ఆ గ్రూపుల  వెనకాల ఎక్కడో- చేష్టలుడిగి చూడ్డంతోనే సరిపోయింది. సెకండాఫ్ లో గోపీచంద్ వున్నట్టే గుర్తుండదు.  క్లయిమాక్స్ లో వచ్చే ఫైట్ కోసం పొంచి వున్నట్టు సీన్లలోంచి  గైర్ హాజరు. ఇలా వుంది హీరోయిజం.
హీరోయిన్ రేజీనా డిటో. ఈ  ఇంట్లోంచి ఆ ఇంట్లోకి, ఆ ఇంట్లోంచి ఈ ఇంట్లోకీ  తనని దాచిపెట్టే వాళ్ళ చేతుల్లో, అడపాదడపా ఎత్తుకెళ్ళే వాళ్ళ హస్తాల్లో పిప్పళ్ల బస్తాలా తయారయ్యింది తప్ప- నటనకి అవకాశం వున్న ఒక్క సీనూ లేదు.
ఇదేదో ఒక మహా ‘పండంటి కాపురం’ అయినట్టు, ఒక మహామహా  ‘దేవుడు చేసిన మనుషులు’ అయినట్టూ సినిమా నిండా తారాతోరణమే. ఎందరెందరో నటీ నటులు. అంతా కలిసి  దర్శకుడు- రచయితా చేసిన స్కామ్ లో తలా ఓ చెయ్యివేసి సాయం పట్టారు. పాపం ఇటీవలే శంకరాభరణం, బెంగాల్ టైగర్ లతో ఎక్కడికో....వెళ్ళిపోయిన మాస్టర్ కమెడియన్ పృథ్వీ కి సైతం జాపిగోల్పే స్థితి. బ్రహ్మానందం, సప్తగిరిలు చెప్పక్కర్లేదు. స్కామ్ అన్నాక బావుకోవడం ఎవరికైనా సాధ్య మవుతుందా?
రచన సైడు స్క్రీన్ ప్లేకి కోన – మోహన్ ద్వయం దోహదం చేశారు.  ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అవసరమా? అది వున్నట్టు అన్పిస్తోందా? హీరో క్యారక్టర్ పాసివ్ గా మారి సోదిలోకి లేకుండా పోయాక, ఎక్కడా సస్పెన్స్, థ్రిల్ అనేవి లేక కథనం నీరసించి పోయాక - దీన్నో డబ్బులు వచ్చే కమర్షియల్ సినిమా స్క్రీన్ ప్లే అందామా – రూపాయి రాని ఆర్ట్ సినిమా అవతారం అందామా? పదే పదే స్టార్స్ పోషించే పాత్రలు పాసివ్ పాత్రలు అవుతున్నాయనే స్పృహ కూడా లేకుండా- గొప్ప గొప్ప కాంబినేషన్స్ తో తీస్తున్న సినిమాలు – నిజానికి కమర్షియల్ ముసుగేసుకున్న ఆర్ట్ సినిమాలంటే నమ్ముతారా?
ఇక మాటలు కూడా రాసిన శ్రీధర్ సీపాన ఇంకా  ప్రాస డైలాగులే – అవి కూడా వచ్చిన సినిమాల్లో పేలిన డైలాగులే రూపం మార్చి దిగుమతి చేసుకోవడం  కూడా స్కామే!
సాంకేతికాల విషయానికొస్తే, కెమేరాతో ప్రసాద్ మూరెళ్ళ కీ, ఎడిటింగ్ తో గౌతమ్ రాజుకీ, పోరాటాలతో వెంకట్ కీ, సంగీతం తో అనూప్ రూబెన్స్ కీ   స్కాము బాధితుల పరిస్థితే. రొటీన్ సినిమాలే కదా అని ఒప్పుకుంటే స్కాములే మిగులుతాయి. రొటీన్ల కాలం పోయింది. స్కామ్ సినిమాల సీజన్ నడుస్తోంది.
చివరికేమిటి?
        ది రవికుమార్ చౌదరి వేసుకోవాల్సిన ప్రశ్న. చాలాకాలం కనుమరుగై,  ‘పిల్లా నువ్వు లేని జీవితం’ అనే హిట్ తో ఆశ్చర్య పరచిన తను- ఆ హిట్ కారణాలని బేరీజు వేసుకున్నట్టు లేదు.  పిల్లా నువ్వు లేని జీవితంలో కథనానికి వాడిన టెక్నిక్కే ఆ సినిమాకి టానిక్. సినిమాలకి ప్రమాదకరంగా పరిణమించే ఎండ్ సస్పెన్స్ ప్రక్రియతో కథనాన్ని - అసలు చివరిదాకా నడిచింది ఎండ్ సస్పెన్స్ కథనమే అని  తెలియకుండా ఇంటర్వెల్ వరకూ, ఆపైన మళ్ళీ క్లైమాక్స్ వరకూ రెండు సార్లు  ఎండ్ సస్పెన్స్ కథనం నడిపి సక్సెస్ అయ్యారు. సినిమాలకి సంబంధించి ఎండ్ సస్పెన్ కథలతో వచ్చే ఇబ్బందుల్ని తొలగిస్తూ ఎప్పుడో 1958 లో బ్రిటిష్ దర్శకుడు మైకేల్ ఆండర్సన్ టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో అనే బ్లాక్ అండ్ వైట్ థ్రిల్లర్ ద్వారా సెట్ చేసి పెట్టాడు. 1981 లో దీన్నే ధువాఁ గా హిందీలో విజయవంతంగా ఫ్రీమేక్ చేశారు. ఇదే యాదృచ్చికంగా, లేకపోతే  కాకతాళీయంగా పిల్లా నువ్వు లేని జీవితంలోనూ ప్రయోగించి విజయం సాధించారు. లేకపోతే ఎండ్ సస్పెన్స్ కథనాలతో  ‘జాదూగాడు’, ‘ఆ ఒక్కడు’ లాంటివి అనేక తెలుగు సినిమాలు వచ్చి ఫ్లాపయ్యాయి. ఎండ్ సస్పెన్స్ వల్లే ఇటీవల ‘బెంగాల్ టైగర్’ సెకండాఫ్ కూడా బలహీన పడింది.
ప్రస్తుత సినిమాలో రవికుమార్ చౌదరి క్రియేటివిటీ కనుమరుగైపోయింది. స్కామ్ కథే అయినా దాన్ని ఎక్సైటింగ్ గా చెప్పాలన్న ఆలోచనకోడా చేయకపోవడం విచారకరం. ఇంకెన్ని సార్లు సెకండాఫ్ లో కన్ఫ్యూజ్ కామెడీ పెట్టి ప్రేక్షకుల్ని నవ్వించాలనుకుంటారు. మారు వేషాలు వేయించి కామెడీ చేస్తారు? మారువేషాల కామెడీ ఎన్టీఆర్ బ్లాక్ అండ్ వైట్ ల రోజుల్లోనే నడించాయి. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ పోయి- కలర్ ఫిల్మూ పోయి – డిజిటల్ వచ్చింది. డిజిటల్ లో కూడా పాత మూస డ్రామాలతో చేతనైనంత స్కాములు చేసుకోవడమేనా?

-సికిందర్ 

(స్క్రీన్ ప్లే సంగతులు రేపు! )

Thursday, December 24, 2015

టెక్నాలజీని కమ్మేసిన కళ!

రచన- దర్శకత్వం : సంజయ్ లీలా భన్సాలీ

తారాగణం : రణవీర్ సింగ్, దీపికా పడుకొనే, ప్రియాంకా చోప్రా, తన్వీ అజ్మీ, మహేష్ మంజ్రేకర్, వైభవ్ తత్వావ్దీ తదితరులు 
సంభాషణలు :
 ప్రకాష్ కపాడియా, సంభాషణలు-తెలుగు  : మదన్ కర్కే, పాటలు : రామజోగయ్య శాస్త్రి, సంగీతం :సంజయ్ లీలా భన్సాలీ, శ్రేయాస్ పురాణిక్ ఛాయాగ్రహణం : సుదీప్ ఛటర్జీ, కూర్పు : రాజేష్ పాండే శబ్దగ్రహణం : బిశ్వదీప్ ఛటర్జీ, కళ : సలోనీ ధత్రక్, శ్రీరాం అయ్యంగార్, సుజీత్ సావంత్ఆహార్యం : మాక్సిమా బసు, అంజూ మోడీ,పోరాటాలు : శ్యాం కౌశల్, విజువల్ ఎఫెక్ట్స్ : ప్రైమ్ ఫోకస్

బ్యానర్ : సంజయ్ లీలా భన్సాలీ ఫిలిమ్స్
నిర్మాత :
 సంజయ్ లీలా భన్సాలీ
విడుదల :
 18 డిసెంబర్, 2015 
 ***

         వెండి తెర మీద సునాయాసంగా తైలవర్ణ చిత్ర లేఖనాలు చేసే విజువల్ మాంత్రికుడు మరోసారి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేందుకు మరోసారి విచ్చేశాడు. మరాఠా చారిత్రకాన్ని మహా దృశ్య- కావ్య వైభవ విలాసంగా మల్చి, హృదయాల్ని మెలితిప్పే  కళాత్మకతతో భావోద్వేగాల సమాహారం చేశాడు. భాండాగారాల్లో  నిక్షిప్తమైపోయిన శతాబ్దాల నాటి ప్రేమచరిత్రకి చిత్రిక పట్టి అజరామరమయ్యే శిల్పంలా చెక్కాడు. బాజీరావు- మస్తానీల స్మృతిని వెనకటి- ఇప్పటి- ఇంకా ముందటి తరాలన్నిటికీ ఒక జ్ఞాపకంలా  దృశ్యమానం చేసిపెట్టాడు.   


        సంజయ్ లీలా భన్సాలీ- ఈ  పేరు వింటేనే  నాటి ఖామోషీదగ్గర్నుంచీ మొన్నటి  రామ్ లీలా’  వరకూ కళ్ళప్పగించి  చూసే అద్భుత, అనిర్వచనీయ  లోకాలే కన్పిస్తాయి. సంగీత సాహిత్య సౌరభాల గుచ్చాలే ఆహ్వానిస్తాయి. అతని విజన్ వేరు, ఆలోచనవేరు, దృశ్య మాధ్యమపు నిర్వచనం పూర్తిగా వేరు. ఒక్కమాటలో చెప్పాలంటే, దేశంలోనే అతణ్ణి  మించిన మహోజ్వల చిత్రరాజాల రారాజు లేడనొచ్చు

        బాలీవుడ్ సూపర్ స్టార్లతో గ్లామరస్ గా బాజీరావు మస్తానీతెలుగు వెర్షన్ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. గ్లామరస్ గా ఆనడమెందుకంటే, ఇది నిఖార్శయిన ప్రేమ కథ అయినందుకే. అదికూడా అతి సరళంగా చెప్పి పామరుల నుంచీ పండితుల దాకా అందర్నీ సంలీనం చేయగలనందుకే. కింది క్లాసు మాస్ మహాజనులు ఎంత తదాత్మ్యంతో దీన్ని అక్కున జేర్చుకోగలరంటేసౌండ్ మిక్సింగ్ లోపాల వల్ల మొనోలో స్పష్టత కోల్పోయి  సంభాషణలు విన్పిస్తే, పదేపదే అలజడి రేపే దాకా!  మాస్ ప్రేక్షకులు సీరియస్ గా ఇన్వాల్వ్ అయి చూసేందుకు క్లాస్ మాస్ సినిమాలంటూ తేడాల్లేవని తెలిపే దాకా!

       రణవీర్ సింగ్, దీపికా పడుకొనే, ప్రియాంకా చోప్రా ల నట నాట్య భావప్రకటనా  విన్యాస విలాసాలకి  నిజానికి ఇంకా విస్తృత కాన్వాస్ అవసరం. భన్సాలీ కూర్చిన కథాప్రపంచం కూడా కురచనైపోయి-  ఈ ప్రతిభాశాలులు  పాత్రల్లో పాత్రలకి మించి ఎదిగిపోయారు. రాజు కంటే ధర్మం గొప్పదని పలికించిన ఒక సంభాషణలాగాతమ ఇమేజులకంటే పాత్రలు గొప్పవైపోయాయి!

        చరిత్రని భావజాలాల కళ్ళద్దాలతో చూస్తే డాక్యుమెంటరీలు చూసుకోవాలి. చారిత్రక ఆధారాలన్నిటినీ ససాక్ష్యంగా ముందుపెట్టి నిజాయితీని చాటుకోవడం సినిమా లక్షణం కాదు. సినిమా అనేది కళ, డాక్యుమెంటరీ అనేది సమాచారం. చరిత్రని జనబాహుళ్యానికి నాటకీయంగా మల్చి చూపడమే సినిమాకళ కర్తవ్యం. ఆ నాటకీయత అవధులు దాటితే దానికదే ఆ సినిమా అభాసు అవుతుంది. నాటకీయత కోసం కొన్ని సృజనాత్మక స్వేచ్ఛలు తీసుకోవడం కూడా  అవసరం. ఈ సృజనాత్మక స్వేచ్ఛ ఉద్దేశించిన సారాన్ని ఎలా ఎత్తి పట్టిందని మాత్రమేచూడాలి. అలా చూస్తే, భన్సాలీ ఉద్దేశించిన సారం కేవలం ప్రేమకథకి సంబంధించిందైనప్పుడు, పాత్ర రాజకీయ జీవితానికి సంబంధించిన అసంగతాలు అప్రస్తుతమైపోతాయి.

కథ
      18 వ శతాబ్దపు మరాఠా వీరుడు బాజీరావు (రణవీర్ సింగ్) ఢిల్లీ లో మొఘల్ రాజుల్ని పదవీచ్యుతుల్ని చేసి, భారత దేశమంతటా హిందూ రాజ్యాన్ని స్థాపించాలని  యుద్ధాలు చేస్తూంటాడు. ( హిందూ రాజ్యం కంటే మరాఠా రాజ్యం లక్ష్యంగా కొనసాగాడనీ,  అందుకే ఇతర సంస్థానాల రాజులు వ్యతిరేకమయ్యారనీ ఇంకో వాదం వుంది).  ఇలావుండగా,  మరాఠా సామ్రాజ్య చక్రవర్తి ( మహేష్ మంజ్రేకర్), తదుపరి  పీష్వా ( ప్రధాని) గా వారసుడి ఎంపిక కోసం అన్వేషిస్తున్నప్పుడు  బాజీరావు పరీక్షకి సిద్ధపడతాడు. ఆ పరీక్షలో నెగ్గి,  సేనాపతి అవుతాడు. ఈ సమయంలో బుందేల్ ఖండ్ రాజు ఛత్రశాల్ తన రాజ్యాన్ని ముట్టడించ డానికి సిద్ధమైన ముస్లిం సైన్యాలనుంచి కాపాడాల్సిందిగా రహస్య సందేశం  పంపిస్తాడు. ఆ సందేశ హరిణి మరెవరో కాదు, యువరాణి మస్తానీ (దీపికా పడుకొనే). ఈమె  కత్తి యుద్ధంలో, గుర్రపు స్వారీలో, నాట్యంలో, గానంలో అసమాన ప్రతిభగల పడతి. ఆమె కోరడంతో బాజీరావు బుందేల్ ఖండ్ వెళ్లి శత్రువుల్ని సంహరిస్తాడు. ఈ సందర్భంగా మస్తానీ  అతడితో  ప్రేమలో పడుతుంది. బాజీరావు కూడా ప్రేమలో పడిపోతాడు.

        బాజీరావుని  సాగనంపాక, మస్తానీ మనసులో మాట తల్లిదండ్రులకి చెప్తుంది. రాజపుత్ర వంశీయుడైన  బుందేల్ ఖండ్ రాజు ఛత్రశాల్,  రుహానీ బేగం అనే ముస్లిం ని చేసుకున్నాడు ( ఈమె అప్పటి నిజాం దర్బారులో నాట్యగత్తెగా వుండేది). మస్తానీ మాట కాదనలేక ఆమెని బాజీరావు దగ్గరికి పూనా పంపిస్తారు తల్లిదండ్రులు.

        అలా కోటలోకి ప్రవేశించిన మస్తానీకి తెలుసు, బాజీరావుకి కాశీ బాయి ( ప్రియాంకా చోప్రా)  అనే భార్య వుందని. అయినా తెగువతో ఇలా వచ్చేయడంతో బాజీరావు గొప్ప సంయమనం పాటించి ఆమెకి కోటలో స్థానం కల్పిస్తాడు. మొదట నాట్యగత్తె  అనుకున్న మస్తానీ తర్వాత భర్త  ప్రియురాలే  అని తెలియంతో  హతాశురాలవుతుంది కాశీబాయి. బాజీరావు తల్లి ( తన్వీ అజ్మీ), తమ్ముడు (వైభవ్ తత్వావ్దీ)  బాజీరావుకి వ్యతిరేకులవుతారు. రాజపుత్రులు - మొగలులు పెళ్లి సంబంధాలు చేసుకోవడమేమో గానీ, బ్రాహ్మణులైన మేము ఈ సంబంధాన్ని ఒప్పుకోబోమని చెప్పేస్తారు. దీంతో మొదలవుతుంది బాజీ -మస్తానీల ప్రేమలో సంక్షోభం. ఈ ప్రేమ ఇక్కడి నించీ ఏఏ మలుపులు తిరిగి ఏ దరికి చేరిందో ఇక వెండితెర మీద చూసి తరించాల్సిందే.


ఎవరెలా చేశారు.
      బాజీరావుగా రణవీర్ సింగ్ లో ఇంత నటనా పటిమ ఉంటుందని ఎవరూ ఊహించరు. బాజీరావంటే తను తప్ప ఇంకెవరూ వుండరనేంతగా ప్రాణ ప్రతిష్ట చేశాడు. యుద్ధ నైపుణ్యం తెలిసిన వీరుడిగా, కానీ  పరస్త్రీని ప్రేమించకుండా ఉండలేని బలహీనుడిగా- అతివలిద్దరి మధ్యా  సంధి కుదిర్చే తెలివిమంతుడిగా, పోనుపోనూ భగ్నప్రేమికుడిగా, ఇంకాతర్వాత మతిస్థిమితం కోల్పోయిన వాడిగా....రణవీర్ అభినయ చాతుర్యం పాత్రని సజీవం చేసింది. తన భావోద్వేగాల్ని, భావ ప్రకటనల్నీ అమోఘంగా అదుపులో ఉంచుతూ అండర్ ప్లే చేసిన రణవీర్ నటుడిగా ఇంత ఎదిగి ధన్యుడ వుతాడని కూడా ఎవరూ ఊహించరు.

        దీపికా  పడుకొనే మస్తానీ పాత్రని అజరామరం చేసింది. తను వీరనారియే కావొచ్చు,  కానీ ప్రేమలో పడ్డాక సౌమురాలై పోతుంది. అనేక అవమానాల్ని సైతం ప్రేమకోసం ఎదుర్కొనే ధీరత్వం ఆ సహజ వీరత్వం లోంచే వచ్చినట్టు,  తన వీరనారీతనం బెర్పినట్టు లోపలా బయటా సంఘర్షణ తాలూకు ఇరు పార్శాలని సమున్నతంగా ప్రదర్శించింది.

         ఇక ప్రియాంకా చోప్రా ఎలాటి పాత్రనైనా సునాయాసం గా అభినయించేయ గలదని బర్ఫీలోనే నిరూపించింది. ఇప్పుడు కాశీబాయి పాత్ర ఎంత సంక్లిష్ట పాత్రయినా సమర్ధవంతంగా నిర్వహించుకుపోయింది. ఇటు భర్తతో- అటు మస్తానీతో లవ్ –హేట్ రిలేషన్ షిప్ ఆమెది. అయినా మాటల్లో గానీ, చూపుల్లో గానీ పాత్ర  స్థాయినీ, హూందాతనాన్నీ నిలబెడుతూ హృద్యమైన నటనని పోషించింది.
ఈ ముగ్గురూ తమ తమ పాత్రభినయాలతో చిరకాలం మనల్ని వెంటాడుతారు. బాలీవుడ్ కి, ఆ మాటకొస్తే భారతీయ సినిమా తెరకి ఒక పరిపక్వ ప్రేమకథకి శాశ్వత తత్త్వం కల్పించిన స్టార్లు గా గుర్తుండిపోతారు.


భన్సాలీయే సారథి

           న్సాలీ సారధ్యం లేకుండా ఇంత  క్లాసిక్ చారిత్రక  ప్రేమ కథని ఊహించలేం. సంగీతం తనే నిర్వహించాడు,  అది చాలా తోడ్పడింది. చారిత్రక సినిమాలని కూడా టెక్నాలజీ మోజుతో డిజైనర్ చరిత్ర  సినిమాలుగా రుచీ పచీ వుండని కళావిహీన సరుకుగా అమ్మేస్తున్న ఈ రోజుల్లో, ఇలాటి సినిమాల నిర్మాణాలకి భన్సాలీ ఒక పాఠ్య పుస్తకాన్నే  ఇచ్చాడు, చరిత్రతో, చరిత్ర నాటి కాలంతో అతనెక్కడా రాజీ పడలేదు. 18 వ శతాబ్దపు కాలాన్నీ, వాతావరణ పరిస్థితుల్నీ, నిర్మాణాల్నీ, మనుష్యుల్నీ, కళల్నీ, సంగీతాన్నీ అచ్చుగుద్దినట్టు ఆ కాలంలోకి దిగుమతి చేశాడు. మరాఠా  సంస్కృతీ సాంప్రదాయలు ఉట్టిపడే శాస్త్రీయ సంగీత (దేశవాళీ వాద్య  పరికరాలతో) సాహిత్య గుబాళింపు లతో నింపేశాడు.  కాలంలో వెనక్కి  ప్రయాణిం జేయడమంటే ఇదే. ఎక్కడా గ్రాఫిక్స్ చేసినట్టూ అన్పించని అద్భుత కళాఖండాన్ని కళ్ళ ముందు నిలబెట్టాడు. రంగుల్ని కూడా రూపకా లంకారాలుగా  వాడుకున్నాడు. రెండు మతాలకి చెందిన కాషాయ, ఆకుపచ్చ రంగులతోనూ కథ చెప్పాడు, భావాల్నీ చెప్పాడు.  యుద్ధ దృశ్యాల చిత్రీకరణ అయితే ఒక ఆర్టు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూనే కథా కథనాలనీ, పాత్ర చిత్రణల్నీ అపూర్వంగా, సమర్ధవంతంగా  నిర్వహించుకొచ్చాడు. భారతీయ కమర్షియల్ సిన్మాకి భన్సాలీ ఒక ఆన్సర్.

        ఈ తెలుగు డబ్బింగ్ తో ఇంకో విషయం తేటతెల్ల మవుతోంది. చాలా  సరళమైన  ప్రేమకథని  అంతే సున్నితంగా, ఏ దృశ్య శబ్ద కాలుష్యాలకీ చోటులేకుండా, అదుపు చేసిన భావోద్వేగాలతో ఇంత బలంగానూ  చెప్ప వచ్చనేది. అలాగే  ఇలా బాజీరావు మస్తానీ’,  ‘కంచె’  లాంటి అర్ధవంతమైన క్వాలిటీ కథల సినిమాలు ఇంకో పది వరసగా వచ్చి మీద పడితే- మంచి సినిమాల్ని కుదురుగా కూర్చుని చూడలేని, అభిరుచి పట్టని, రసాస్వాదన తెలీని ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులు పధ్ధతి మార్చుకునే  వీలుంటుంది.


-సికిందర్