రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, August 24, 2022

1195 : లైగర్

 

    రేపే పానిండియా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ థియేటర్స్ ని షేక్ చేస్తూ విడుదలవుతోంది. ఈలోగా దీని స్టోరీ లీక్ అయిందని పుకార్లు వైరల్ అవుతున్నాయి. కానీ లీక్ అవక పోయినా దీని స్టోరీ ఎలా వుంటుందో చెప్పొచ్చు. బాక్సర్ సినిమా కథలు కూడా మూసే కాబట్టి. గతంలో రవితేజతో పూరీజగన్నాథ్ తీసిన అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి లో రవితేజ బాక్సరే. జయసుధ అతడి మదర్. మదర్ సెంటిమెంటుతో ఈ బాక్సర్ కథ. ఇటీవల వరుణ్ తేజ్ నటించిన గని అనే మరో బాక్సర్ మూవీ వచ్చింది. ఇందులోకూడా మదర్ సెంటిమెంటే. బాక్సింగ్ అంటే ఇష్టం లేని మదర్ నదియాతో వరుణ్ తేజ్ స్ట్రగుల్. ఇప్పుడు లైగర్ కథ లీక్ అయిందని విన్పిస్తున్న వెర్షన్లు కూడా ఇదే కోవలో వున్నాయి- రౌడీ స్టార్ కి మదర్ రమ్యకృష్ణతో సెంటిమెంటల్ డ్రామా.

        నాడెప్పుడో అమితాబ్ బచ్చన్ తో త్రిశూల్ అని వచ్చింది. ఇందులో అక్రమ సంతానమైన అమితాబ్ బచ్చన్, తల్లి వహిదా రెహమాన్ కి న్యాయం చేయడం కోసం, బిల్డర్ అయిన తండ్రి సంజీవ్ కుమార్ తో తలపడతాడు.

ఇదే యాంగిల్ లీకైన ఒక వెర్షన్లో కన్పిస్తుంది... ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్‌ లైగర్ లో నటించిన విషయం తెలిసిందే. ఈ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్, రౌడీ స్టార్ తండ్రి పాత్రలో కనిపిస్తాడు. తల్లి పాత్రలో రమ్యకృష్ణ వుంటుంది. లైగర్ సినిమా కథ నటి నీనా గుప్తా వ్యక్తిగత జీవితం నుంచి తీసుకున్నట్టు ఈ వెర్షన్. ఈమె వెస్టిండీస్‌ క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్ ని ప్రేమించింది. అతడ్ని పెళ్లి చేసుకోకుండానే కుమార్తె మసాబాకి జన్మనిచ్చింది. లైగర్ కూడా ఇదే స్టోరీ లైన్‌లో వుండబోతోందని వూహాగానాలు. ఇందులో రౌడీ స్టార్ తను అక్రమ సంతానమనే ఉక్రోషంతో సొంత తండ్రి మైక్ టైసన్‌తో తలపడతాడు- త్రిశూల్ లో అమితాబ్ లాగా అన్నమాట.

వైరల్ అవుతున్న ఇంకో వెర్షన్ ఏమిటంటే, ఇది మైక్ టైసన్ నిజ జీవిత కథ అని ఇన్‌సైడ్ టాక్. తల్లిదండ్రుల మధ్య విభేదాల కారణంగా మైక్ టైసన్ బాల్యం చితికిపోయిన సంగతి తెలిసిందే. టైసన్‌ ని  అతని తల్లి పెంచింది. భర్తతో గొడవల కారణంగా  ఆమె డిప్రెషన్‌లో వుండేది. ఇంట్లో పరిస్థితులతో విసుగు చెంది కోపంతో వున్న మైక్ టైసన్ అనవసరమైన గొడవలకి దిగి స్కూల్లో తోటి స్టూడెంట్స్ ని కొట్టేవాడు. తల్లికి ఫిర్యాదులు రావడంతో, ఆమె చితగ్గొట్టేది. టైసన్ 13 ఏళ్లు దాటకముందే 38 సార్లు జైలుకు వెళ్లాడు. అతడి వార్తలు మీడియాలో కనిపించేవి. ఇది చూసి  న్యూయార్క్ కి చెందిన బాక్సింగ్ శిక్షకుడు టైసన్ కోపాన్ని బాక్సింగ్ వైపు మళ్లించాలని నిర్ణయించుకున్నాడు. ఈ మలుపు ప్రపంచానికి మైక్ టైసన్ రూపంలో బాక్సింగ్ లెజెండ్‌ ని  అందించింది. లైగర్ లో రౌడీ స్టార్- రమ్య కృష్ణ ల మధ్య ఈ కథే వుండబోతోందని వార్తలు.

ఈ వెర్షన్ ప్రకారం కరీంనగర్‌కి చెందిన రమ్యకృష్ణ  కొన్ని కారణాల వల్ల ముంబైకి వెళుతుంది. అక్కడ ఆమె ఒక మురికివాడలో టీ దుకాణం నడుపుతూ నివసిస్తుంది. ఆ మహానగరంలో ఒంటరి స్త్రీగా సమస్యల్ని ఎదుర్కొంటూ రౌడీ స్టార్ కి ధైర్యవంతురాలైన తల్లిగా మారుతుంది. అయితే రౌడీ స్టార్ ఆమెకి తెలియకుండా ఫైటర్ గా మారతాడు. కొడుకు ఫైటర్ కావడం రమ్యకృష్ణకి అస్సలు ఇష్టముండదు. కానీ రౌడీ స్టార్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా గొప్ప ఫైటర్‌గా ఎదిగి అంతర్జాతీయ స్థాయికి సెలెక్ట్ అవుతాడు.

లీకులు తెలుగు సినిమాలకి కొత్త కాదు. ఆచార్య కథని మెగా స్టార్ చిరంజీవి కూడా ఈవెంట్స్ లో వాయిదాల పద్ధతిన లీక్ చేస్తూ పోయారు. అల్లు అర్జున్ పుష్ప’, మహేష్ బాబు సర్కారువారి పాట’, నాగార్జున-నాగ ఛైతన్య ల బంగార్రాజు’, రాజమౌళి ఆర్ ఆర్ ఆర్’, ప్రభాస్ రాధేశ్యామ్ కథలు కూడా లీకయ్యాయి.

ఇంకా నిర్మాణం ప్రారంభం కానీ నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా కథ కూడా లీక్... గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రానున్న బాలాయ మూవీ కథ గురించి జోరుగా చెప్పుకుంటున్నారు. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం. ఒకటి అరవై ఏళ్ల వృద్ధుడి పాత్ర. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యపు కథ. ఇది నేటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకి అద్దం పడుతుంది. ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన  కొన్ని పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయి. అనంతపూర్ కి ఓ భారీ పరిశ్రమ రావాల్సి వుంది. అది వేరే రాష్ట్రానికి తరలిపోయింది.. ఇలా వుంటుంది ఈ కథ అని లీకులిస్తున్నారు.

ఇక రవితేజ రామారావు ఆన్ డ్యూటీ అయితే ఏకంగా సినిమాలోని దృశ్యాలే సోషల్ మీడియాలో దర్శన మిచ్చాయి. మహేష్ బాబు సర్కారు వారి పాట  ట్రైలర్ తో బాటు, అల్లు అర్జున్ పుష్ప లోని దాక్కో దాక్కో పాట కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో నిర్మాతలు సైబర్ క్రైమ్ ని ఆశ్రయించారు.

ఇంకా గమ్మత్తేమిటంటే, కథా రచయితే కథని లీక్ చెయ్యడం. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు మూవీ కోసం కథ సిద్ధం చేస్తున్న విజయేంద్ర ప్రసాద్- కథేమిటో చెప్పేశారు. రాజ‌మౌళికి జంతువులంటే చాలా ఇష్టం కాబ‌ట్టి ఆఫ్రికా అడ‌వుల నేపథ్యంలో కథ వుంటుందని చెప్పేశారు. ప్రసిద్ధ అమెరికన్ రచయిత విల్బర్ స్మిత్ రాసిన ఒక హిస్టారికల్ థ్రిల్లర్ ని కథ కోసం తీసుకున్నట్టు కూడా చెప్పేశారు...ఉండుండి ఆ మధ్య పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు కథ కూడా లీకైందని వార్తలొచ్చాయి.

ఈ విధంగా టాలీవుడ్ లో లీకుల పరిశ్రమ వెలసి దాని పని అది చేసుకు పోతోంది. సంతోషించాల్సిందేమిటంటే, లీకులు పాజిటివ్ గానే వుంటున్నాయి. సినిమాలు డ్యామేజ్ అయ్యేలా కథల్ని చెత్తగా మార్చి విష ప్రచారాలు చేయడం లేదు.
***


Tuesday, August 23, 2022

1194 : మలయాళం రివ్యూ!


 

ఆవాస వ్యూహం (మలయాళం – తెలుగు వెర్షన్)
దర్శకత్వం : కృషంద్
తారాగణం : రాహుల్ రాజగోపాలన్, నిలీన్ సంద్ర, గీతీ సంగీత, శ్రీనాథ్ బాబు, శ్రీజిత్ బాబు, ఝింజ్ షాన్
రచన : కృషంద్, రినాయ్ స్కేరియా జోస్; సంగీతం : అజ్మల్ హస్బుల్లా, ఛాయాగ్రహణం : విష్ణు ప్రభాకర్
నిర్మాత :  కృషంద్
విడుదల : ఆగస్టు 4, 2022, సోనీ లైవ్
***

      సినిమా ఆలోచనలో పడేసిందంటే రెండుంటాయి- ఎందుకు తీశాడా అని, ఎలా తీశాడా అని. అర్ధంపర్ధం లేకుండా తీస్తే ఈ చెత్త ఎందుకు తీశాడని తలపట్టు కోవడం, అర్ధానికే అర్ధాలు చెప్పేలా తీస్తే ఎలా సాధ్యమైందని కుస్తీ పట్టడం... సినిమాకో అర్ధముంటుంది : ఓ జానర్, ఆ జానర్ మర్యాదలకి సంబంధించిన వివిధ మసాలా దినుసులూ, ఇంతే. ఇంత మాత్రం అర్ధంతో వచ్చిన సినిమాలే వస్తూంటాయి. ఇలా కాకుండా వివిధ మసాలా దినుసుల బదులు ఏకంగా వివిధ జానర్లతోనే ఇంకెంతో అర్ధాన్నే చెప్తే? వూహించడానికే వంద సంవత్సరాల దూరానికి నెట్టేసి, వివిధ సజాతి, విజాతి జానర్లన్నీ మసాలా దినుసులుగా వాడేసి, సినిమా అనే అర్ధానికే ఇంకా తెలియని అర్ధాలు చెప్తే? వస్తువు కంటికి  కన్పించే అర్దంతోనే వుండదు. వస్తువుని పోస్ట్ మార్టం చేసి మరిన్ని అర్ధాలు కన్పించేలా చేయొచ్చు. మెదడు ఉన్నదున్నట్టు సమాచారాన్ని తీసుకోదు, దాన్ని మార్చేస్తుంది, మెలి దిప్పుతుంది, ఆ పైన నిల్వజేసుకుంటుంది. వెండి తెరమీద పాత్ర - అబ్బ! ఏం వేడి వేడి సమోసా!- అని డైలాగు పలికితే, మెదడు ఆ మాటల్ని మాత్రమే రికార్డు చేయదు. ఆ వేడి వేడి సమోసా రుచీ వాసనా ఎలా వుంటాయో నోరూరించే ఆ అనుభవాన్నీ కలగలిపి జ్ఞాపకాల్లో దాచేస్తుంది. ఇదే సినిమా నిర్మాణానికీ వర్తిస్తుంది. సినిమా అనే రొటీన్ అర్ధానికి వెనకాల ఇంకా అనుభవించగల ఎలిమెంట్లున్నాయి - వాటిని మెదడు రికార్డు చేసే వుంటుంది. వాటి జోలికి పోవడానికి మనస్కరించదు. ఉన్న ఆ వొక అర్ధాన్నే పట్టుకుని పుష్కరాలకి పుష్కరాలు గోదారి ఈదడం... గోవిందా అనుకుంటూ గోదాములో చేరిపోవడం.

        బాంబే ఐఐటీ పూర్వ అధ్యాపకుడైన దర్శకుడు కృషంద్ ఆవాస వ్యూహం తో దీనికి సమాధానం చెప్పాడు. తను చేసిన ఈ అనితరసాధ్య ప్రయోగమెలాటి దంటే, మేధావుల మెప్పుకే కాదు, ఏ జీవితాల గురించి ఇందులో చూపించాడో ఆ సగటు ప్రేక్షకులు చూసి వినోదించడానిక్కూడా అందించాడు (సగటు జీవుల కోసం రాసే కవితలు సగటు జీవులే చదవరు కదా- తమ గురించి కవిత్వం రాస్తున్నారనే విషయమే వాళ్ళకి తెలీదు- కవిత్వం చేయలేని పని సినిమా చేస్తుంది).

ఈ దర్శకుడు జానర్ల మిశ్రమంతో కథ చెప్పే దృశ్య భాషనే మార్చేసినా, సగటు ప్రేక్షకుల నాలెడ్జికి అందేలా సూపర్ హీరో క్యారక్టర్ని- మీరే ఈ క్యారక్టర్ అన్నట్టుగా, మీరూ చెడుని ఎదుర్కోవచ్చన్న కర్తవ్య బోధ చేశాడు. వ్యవస్థతో పోరాటమంటే అధికార కేంద్రంతో తలపడ్డం సినిమా సూపర్ హీరోలు చేసే పెద్ద పని. సామాన్యుడేం చేయగలడు- రోజువారీ తన కెదురయ్యే కప్పారావు కుప్పారావుల పనిపట్టగలడు. వ్యవస్థలో రేపటి భాగస్థులు కావాలని ఉవ్వీళ్ళూరే కప్పారావు కుప్పారావుల పనిబడితే వ్యవస్థ పనిబట్టినట్టే. పోరాటం పక్కనున్నోడితోనే ప్రారంభం కావాలి. ఈ పోరాటమేమిటో, సామాన్యుల సూపర్ మాన్ ఎలా పోరాడేడో ఇప్పుడు చూద్దాం...

కథ

అతను జాయ్ (రాహుల్ రాజగోపాలన్) అనే ఆధార్ కార్డులేని, రేషన్ కార్డు లేని అనామకుడు. ఎక్కడ్నించి వచ్చాడో, తన వాళ్ళెవరో తెలీదు. నేపాల్ నుంచి వచ్చాడని, శ్రీలంక నుంచి వచ్చాడని, కాదు బంగ్లా దేశ్ నుంచీ వచ్చాడనీ చెప్పుకుంటారు. అతను మత్స్యకారుడు. అతను నోటితో చేసే శబ్దాలకి చుట్టూ వచ్చి చేరిపోతాయి చేపలూ కప్పలూ. ఇతడికేవో మానవాతీత శక్తులున్నాయనుకుంటారు జనం. కానీ మత్స్యాహారం తినడు. వాటిని వలేసి పట్టడం కూడా ఇష్టముండదు. కేరళ పశ్చిమ కనుమల్లో కోచ్చి సమీపంలో సముద్ర తీరాన పుథువైపిన్ అనే వూళ్ళో వచ్చి చేరాడు.

ఇదే వూళ్ళో లిజ్జీ (నిలీన్ సంద్ర) అని లిటిల్ రాఘవన్ కూతురుంటుంది రొయ్యల డిపోలో పని చేస్తూ. ఈమెకొక సంబంధం వస్తుంది. అతను పడవల యజమాని సజీవన్. వీడు పెళ్ళాన్ని చంపినోడని వద్దని అనేస్తుంది. ఎలాగైనా పెళ్ళిచేసుకోవాలని సజీవన్ తమ్ముడు అనూజన్ మురళి (శ్రీనాథ్ బాబు) తో కలిసి పథకమేస్తాడు. జాయ్ అడ్డుకుంటే, అనూజన్ మురళి ప్లాంక్ (నిఖిల్ ప్రభాకరన్) అనే క్రాక్ రౌడీని తీసుకుని జాయ్ మీద దాడి కెళ్ళి, నెత్తి పగుల గొట్టించుకుంటాడు. ఇంకోసారి స్వయంగా సజీవనే దాడికొస్తే, జాయ్ రెండు పీకుళ్ళు పీకి సజీవన్ ని నిర్జీవన్ చేసేసి పారిపోతాడు. ఎక్కడికి పారిపోయాడో తెలీదు. అతడ్ని ప్రేమిస్తున్న లిజ్జీ బెంగ పెట్టుకుని వుంటుంది.

జాయ్ ఎక్కడి కెళ్ళాడు? వెళ్తే మళ్ళీ ఎలా వచ్చాడు? ఎవరు తీసికొచ్చారు? వచ్చి ఏం చేశాడు? పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తే మళ్ళీ ఎలా వచ్చాడు? ఈసారి ఇంకే రూపంలో వచ్చాడు? వచ్చి సరాసరి పారిస్ జువాలజీ మ్యూజియంలో అస్థిపంజరంగా ఎలా తేలాడు? ఈ చిక్కు ప్రశ్నలకి సమాధానమే మిగతా కథ.

ఎలావుంది కథ

ఈ కథ పర్యావరణ పరిరక్షణ గురించి. జీవవైవిధ్యం ఎంత విస్తారంగా వుంటే అంత పర్యావరణానికి ప్రయోజనకరమని చెప్పడం గురించి. పురోగతి అంటే స్వచ్ఛమైన గాలి, నీరు దొరకడమని చెప్పడం గురించి. ఈ కథలో చూపించిన పుథువైపిన్ లో 2017 నుంచీ ప్రజా పోరాటం జరుగుతోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అక్కడ ఎల్ పి జి ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తోంది. దీనికి వ్యతిరేకంగా ప్రజలు నిరవధిక పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం అక్కడ నిరవధిక 144 సెక్షన్ విధించింది. పర్యావరణానికీ ప్రజా జీవితానికీ ఈ ప్లాంట్ హానికారకమని ప్రజల అభ్యంతరం.

దీన్ని తీసుకుని ఈ ప్రాంతం చుట్టూ పర్యావరణం కథ అల్లాడు దర్శకుడు. మనిషి వల్ల జీవులు జీవన్మరణ పోరాటం చేస్తున్నాయి. చివరికి అంతరించి పోయే దశలోనూ  ఉనికిని చాటుకుంటూ సంకరం చెంది కొత్త జీవులుగా ఉద్భవించినా, ఇది ప్రకృతి వైపరీత్యమని మనిషి దాన్నీ అంతం చేస్తున్నాడు... ఈ కథలో ప్రకృతికి ప్రతీకగా వున్న పాత్ర జాయ్, కప్ప మనిషిగా మారినా మన్నించలేదు మనుషులు- అంతరించిపోయిన జీవుల మ్యూజియంలో పారిస్ లో కంకాళంగా మిగలాల్సిన పరిస్థితి.

మనిషి సృష్టించిన ప్రభుత్వ, న్యాయ, మత, రాజకీయ, పత్రికా వ్యవస్థలతో స్వార్ధపరుడిగా మారిపోతే జీవులు మ్యూజియాలలో నమూనాలుగా మిగలాల్సిందేనని ఒక హెచ్చరిక ఈ కథ.  

ప్రపంచీకరణ వచ్చేసి ప్రపంచాన్ని చదును చేసేసిందని ప్రసిద్ధ పాత్రికేయుడు థామస్ ఫ్రీడ్మన్ ఏనాడో ది వరల్డ్ ఈజ్ ఫ్లాట్ అన్న పుస్తకమే రాశాడు. ఆ చదును చేయడంలో విలువలు, ఆత్మలు, ప్రాణాలు సమస్తం నలిగిపోయాయన్నాడు. దీన్నే చెబుతూ 2018 లో అభయ సింహా తుళు భాషలో పడ్డాయి (పడమర) తీశాడు. ఇదొక అద్భుత ప్రయోగం. షేక్స్ పియర్ పాపులర్ మాక్బెత్ నాటకాన్ని ఇక్కడి పర్యావరణ కథగా మార్చేశాడు.

సామాజికంగా ఆర్ధికంగా ఆధునిక యుగంలో ప్రవేశించిన దేశాకాల పరిస్థితుల్ని మాక్బెత్ ఆధారంగా చూపించాడు. ఇక్కడి జాలర్లు వేటకి సముద్రంలో పడమర వైపు వెళ్తారు. తాము తూర్పుకి చెందిన వాళ్ళు. తూర్పుకి చెందిన తాము ట్రాలర్ల సాక్షిగా పడమర - అంటే పాశ్చాత్య విలువలకి మారాలన్న తహతహతో పాల్పడే చర్యల పరిణామాల్ని గొప్పగా చిత్రించాడు. వర్షాకాలం చేపలు గుడ్లు పెట్టే కాలమని వేటని నిషేధించిది ప్రభుత్వం. నిషేధాన్ని ఉల్లంఘించి కంపెనీల వాళ్ళు ట్రాలర్లతో ఫిషింగ్ చేస్తూ గుడ్లని నాశనం చేస్తున్నారు. ఇంకా పర్యావరణానికి హాని కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యాన్ని కూడా కథలో చిత్రించాడు.

పడ్డాయి - ఆవాస వ్యూహం రెండూ మత్స్యకారుల జీవితాలాధారంగా పర్యావరణ సమస్యని ఎత్తి చూపిస్తున్నవే. రెండూ క్రైమ్ థ్రిల్లర్లే. పడ్డాయిలో మత్స్యకారులైన భార్యాభర్తలు దురాశకి పోయి చేపల కాంట్రాక్టర్ ని హత్యచేసి, అతడి వ్యాపారాన్ని హస్తగతం చేసుకునే కుట్ర అయితే, ఆవాస వ్యూహం లో పెళ్ళి కోసం అమ్మాయిని వేధిస్తున్న చేపల కాంట్రాక్టర్ ని చంపే నేరం.

అయితే దీన్ని హాస్యరస ప్రధానంగా చెప్పాడు దర్శకుడు కృషంద్. సమస్య తీవ్రమైనదే, కానీ ఏ పాత్రా సీరియస్ గా మాట్లాడదు. వేళాకోళమే. చెట్లు పెంచితే మావోయిస్టు నయ్యానంటే నేను మావోయియిస్టుగానే వుంటాన్లే’... ‘వాడు క్రిమినల్, కిల్లర్, టెర్రరిస్ట్, యాంటీ నేషనలిస్ట్ ... విరక్తి అంటే ఏంటి?’ - అది బాధరా- రాజ్యాంగం అంటే ఏమిటి?’ - అదొక బుక్కురా ...ఆకలేస్తోందిగ్లూకోసు ఎక్కించారు కదా, అది కూడా చాల్లేదా నీకూ?’ ...ఇలా వుంటుంది ధోరణి.

2015 లో కన్నడ దర్శకుడు రాంరెడ్డి తిధి అనే ఆర్ట్ సినిమాని ఇంతే వినోద భరితంగా తీశాడు. చనిపోయిన 101 ఏళ్ళ తాత మరణం చుట్టూ వివిధ ఆచారాలూ, ప్రవర్తనా లోపాలపైన ఆలోచనాత్మక వ్యంగ్యాస్త్రాలు విసిరిన అపూర్వ ప్రయోగమిది- 20 జాతీయ, అంతర్జాతీయ అవార్డులతో. ఒక మరణం, దాంతో పేదరికంలో పుట్టే స్వార్ధం, దాంతో మోసం, కుటుంబ సంబంధాల లేమి మొదలైన సీరియస్ విషయాలని నవ్వొచ్చేట్టు చూపించాడు. ఇలా ఆర్ట్ సినిమాల్ని ఎంటర్టయినర్లుగా మార్చి, నేటి తరం ప్రేక్షకులకి సామాజిక అవగాహన కల్పించే దిశగా ప్రయాణిస్తున్నారు ఇలాటి దర్శకులు.
అయితే ఆవాస వ్యూహం దర్శకుడు హాస్యమాధారంగా కథ చెప్పడానికి వాడిన పరికరాలు, జీవ వైవిధ్యపు కథకి వైవిధ్య కళా ప్రక్రియల సంకలనంగా వుండడమే ఇతర ఆర్ట్ సినిమాల నుంచి దీన్ని వేర్పరుస్తోంది. బ్లాక్ కామెడీతో కథనం హాస్యంగా వుండడమే గాక, థ్రిల్లర్, ఎలక్ట్రానిక్ మీడియా, డాక్యుమెంటరీ, రషోమన్ ఎఫెక్ట్, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ జానర్లని అతుకులేసినట్టు కన్పించకుండా సంకలనం చేసిన కళే విస్మయ పరుస్తుంది.

నటనలు సాంకేతికాలు

'సూపర్ హీరో జాయ్ గా రాహుల్ రాజగోపాలన్ ది సినిమా హీరోయిజాన్ని ప్రదర్శించే పాత్ర కాదు. అతను ప్రకృతికి ప్రతీక. ప్రకృతిలో కలిసిపోయి వుంటాడు. జలచరాలు అతడి పిలుపు వింటే వచ్చేస్తాయి. ఇలాటి ఇతను మనిషి చేతిలో ప్రకృతి లాగా స్ట్రగుల్ చేస్తూంటాడు. తిరగబడాల్సిన చోట తిరగబడతాడు. ప్రకృతితో మనిషి, మతం, సైన్స్, ప్రభుత్వం, రాజకీయం, మీడియా వీటన్నిటి స్వార్ధ వైఖరులు ఇతడి దృష్టి కోణంలో తేటతెల్ల మవుతూంటాయి. వీటికి వ్యంగ్య భాషణం చేస్తూంటాడు. అతడి ముఖంలో అమాయకత్వమే వుంటుంది. బానిసగా నటన కూడా సింపుల్ గా వుంది.

ఇతడ్ని ప్రేమించే లిజ్జీగా నిలీన్ సంద్రది చివరంటా అతడ్ని వెతుక్కునే పాత్ర. మధుస్మితగా గీతీ సంగీత తో క్లయిమాక్స్ లో వచ్చి కథని మలుపు తిప్పుతుంది. జాయ్ ని వాడుకుని చేపల వ్యాపారం చేసుకునే సుశీలన్ పాత్రలో ఝింజ్ షాన్ ది కూడా కీలకపాత్రే. జాయ్ ని చంపాలని చూసే, హాస్యంగా సాగే జంట పాత్రలు పోషించిన శ్రీనాథ్ బాబు, నిఖిల్ ప్రభాకరన్ లు చివరికి కథని తామే ముగిస్తారు. ఈ నటులెవరూ కూడా కమర్షియల్ నటనల జోలికి పోకుండా, మన చుట్టూ వుండే మనుషుల్లాగే మాట్లాడతారు, ప్రవర్తిస్తారు.     

సాంకేతికంగా పైన చెప్పుకున్నట్టు వివిధ జానర్ల మిశ్రమానికి సి. రాకేష్ ఎడిటింగ్ కష్టమైన పనే. జానర్లతో మారిపోతూ వుండే శైలీ శిల్పాలతో కూడిన విజువల్స్ ని, సమ్మిళితం చేసిన తీరు మెచ్చదగిందే. దర్శకుడు తలపోసిన కళాఖండపు గౌరవానికి తగ్గకుండా ప్రొడక్ట్ ని చెక్కి అందించాడు ఎడిటర్. అలాగే నేటివిటీకి తగిన స్వరాలు కూర్చిన సంగీత దర్శకుడు అజ్మల్ హస్బుల్లా. ఛాయాగ్రహణంతో అద్భుత విజువల్స్ సృష్టించిన విష్ణు ప్రభాకర్. సముద్రం, నదీ తీరాలూ, అటవీ లోతట్టు ప్రాంతాలూ, క్రిమికీటకాల నుంచీ వివిధ జీవుల కలాపాలూ ఈ పర్యావరణపు కథా చిత్రానికి వన్నె తెచ్చాయి. 

సినిమాల గురించి ఒక కామెంట్ వాడుతూంటారు- పెట్టిన ప్రతీ రూపాయీ తెరమీద కన్పించిందని. ఎలా కన్పిస్తుందో? దేనికెంత పెట్టారో ఆడిటింగ్ చేశారా? ఎంత చెప్పి ఎంత పెట్టారో గుట్టులాగి చెప్తున్నట్టు. పెట్టిన ప్రతీ రూపాయీ తెరమీద కన్పించడం కాదు గానీ, పరిగణనలోకొచ్చేది రాసిన ప్రతీ పేజీ తెరమీదికెలా వచ్చిందనేది. ఇలాటి స్క్రిప్టు రాయడమే ఛాలెంజ్, దాన్ని తెర కెక్కించడం రొంబ ఛాలెంజ్. దర్శకుడు ముందు ఎంత కష్టపడి రాశాడో తెరమీద ప్రతీ పేజీ చెప్తోంది...ఇదీ మనక్కావాలి సినిమా నాలెడ్జికి!

చివరికేమిటి
స్క్రీన్ ప్లే పరంగా ఈ కథ రెండు కౌంటర్ ట్రాకుల్లో నడుస్తుంది. ఒక ట్రాక్ రీసెర్చర్ల బృందం పుథువైపిన్ అడవుల్లో అరుదైన ఉభయచరాన్ని కనుగొనే అన్వేషణతో, ఇంకో ట్రాకు వివిధ వ్యక్తులు జాయ్ గురించి తెలుసుకునే ప్రయత్నంతో. రీసెర్చర్ల బృందం అన్వేషణ వర్తమానంలో జరుగుతుంది. జాయ్ గురించి తెలుసుకునేందుకు వివిధ వ్యక్తులు చేసే ప్రయత్నం గతంలో జాయ్ గురించి తెలుపుతూంటుంది. విషయమేమిటంటే, ఈ వ్యక్తులు ఏ జాయ్ గతం గురించి చెప్తున్నారో, ఆ జాయ్ వర్తమానంలో పారిస్ మ్యూజియంలో అస్థిపంజరమై వుంటాడు. అతను కప్ప మనిషిగా మరణించాడు. ఈ కప్పమనిషి అనే ఉభయచరాలు ఇక్కడి అడవుల్లో ఇంకేమైనా వున్నాయా తెలుసుకోవడానికే రీసెర్చి బృందం అన్వేషణ అన్నమాట! అంటే కథ ముగింపే ప్రారంభం అన్నమాట. ఆద్యంతాలు లేని వర్తులం విశ్వం లాగా.

కథ మళ్ళీ నాల్గు చాప్టర్లుగా వుంటుంది. కథా కాలం 2015-2023 నడుమ వుంటుంది. మొదటి చాప్టర్ జాయ్ తో లిజ్జీ కథ, రెండో చాప్టర్ జాయ్ తో చేపల వ్యాపారి సుశీలన్ కథ, మూడో చాప్టర్ జాయ్ తో మధుస్మిత కథ. మధ్యమధ్యలో ఇతరపాత్రల సబ్ చాప్టర్లు వస్తూంటాయి.

ఈ పాత్రలు టీవీ కెమెరాకి చెప్తున్నట్టు చాప్టర్లు చెప్తూంటాయి. అంటే అకిరా కురసావా మాస్టర్ పీస్ రషోమన్ లో ఒక నేరం గురించి సాక్షులు తమతమ దృక్కోణాల్లో వ్యాఖ్యానాలు చేసే రషోమన్ టెక్నిక్ కథనమన్న మాట.

ఈ కథనంలో థ్రిల్లర్ కథ ప్లే అవుతూంటుంది. రీసెర్చర్ల బృందం ట్రాకుకి సైంటిస్టు కామెడీగా కామెంట్లు చేస్తూంటాడు. జాయ్ కథలో వచ్చే డాక్టర్, నర్సు, పోలీసులు వంటి పాత్రలు కూడా టీవీ కెమెరాకి చెప్తున్నట్టు సమాచారాన్ని అందిస్తూంటారు. వివిధ పాత్రలతో ఈ కథ మొత్తాన్నీ టీవీ న్యూస్ రిపోర్టింగ్ చేస్తున్నట్టు డాక్యుమెంటరీ అన్నట్టు వస్తూంటుంది.

ఇందులోనే బ్లాక్ కామెడీ, థ్రిల్లర్, రషోమన్ ఎఫెక్ట్, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ మొదలైన విభిన్న జానర్లు నీటుగా కలిసిపోయి సగటు ప్రేక్షకుల వినోదానికి మిఠాయిలా అందుతూంటాయి.

ఇన్ని పొరలతో కథ చెడకుండా స్క్రీన్ ప్లే సమకూర్చడం మామూలు విషయం కాదు. కళల మీద దర్శకుడికి ప్రకృతంత విశాల నేత్రముంటేనే సాధ్యం. ఈ గొప్ప సినిమా అందించిన దర్శకుడు కృషంద్ కి కేరళ రాష్ట్రపు ఉత్తమ చలన చిత్రం, ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డులు లభించాయి. ఈ కళాఖండం తెలుగులో అందుబాటులో వుంది సోనీ లైవ్ లో.

—సికిందర్

 

Thursday, August 18, 2022

1193 : స్ట్రక్చర్


 ఎందుకంటే...

* మన బామ్మలు కూడా మనకి కథ చెప్పే విధం  ఒక స్ట్రక్చర్ లోనే వుంటుండేది గనుక 
* శతాబ్దాలుగా స్ట్రక్చర్ అనేది ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఒకే పోలికతో  వుంటుంది గనుక

* ఆదిమ కాలం నుంచీ కథలు చెప్పుకోవడం స్ట్రక్చర్ ప్రకారమే జరిగింది గనుక
* కథా నాయకుడు కథలో ఎప్పుడు ప్రవేశించాలి, కథ ఎప్పుడు
మలుపు తిరగాలి
, ఎక్కడ ముగింపు  నివ్వాలి అన్నవి,
మౌఖికంగా కథలు చెప్పుకునే లిపిలేని కాలం నుంచీ సెట్ అయి వున్నాయి గనుక
* శాస్త్రజ్ఞుల ప్రకారం మనిషి మెదడు కథ చెప్పే తీరుకి, దాన్ని రిసీవ్ చేసుకునే
పద్దతికీ మార్పు లేకుండా అనువంశికంగా ట్యూన్ అయి వుంది గనుక!
స్ట్రక్చర్ అంటే...
*అనువంశికంగా సబ్ కాన్షస్ మైండ్ లో రూపుదిద్దుకున్న శాశ్వత నిర్మాణం 
* క్రియేటివిటీ అంటే..
* ఆ నిర్మాణం మీద కాన్షస్ మైండ్ కి నచ్చేట్టు సొంతంగా కథనానికి చెక్కుకునే శిల్పం 
* స్ట్రక్చర్  సార్వజనీనం, క్రియేటివిటీ వ్యక్తిగత అభిరుచి
* కథా నిర్మాణం (స్ట్రక్చర్)  ఎక్కడైనా ఒకేలా వుంటుంది, ఆ కథ చెప్పే తీరు
( క్రియేటివిటీ) కథకుడు కథకుడికీ మారుతుంది
* అందుకే స్ట్రక్చర్ కి రూల్స్ ఏర్పడ్డాయి, క్రియేటివిటీకి సాధ్యం కాదు
* ఈ తేడా తెలీక  స్క్రీన్ ప్లే కి రూల్స్ ఏమిటోయ్ అని అడ్డం తిరుగుతుంటారు
* వాళ్ళ ఉద్దేశంలో క్రియేటివిటీ కి రూల్స్ ఏమిటని!
* అవును- నిజంగానే క్రియేటివిటీకి రూల్స్ లేవు 
* అందుకే నా కథ నా ఇష్టం అన్నట్టుగా రాసుకుంటారు 
* ప్రకృతి ప్రకారం ప్రేక్షకుల మైండ్ కథల్ని రిసీవ్ చేసుకునేది స్ట్రక్చర్ పరంగానే తప్ప,
క్రియేటివిటీ పరంగా కాదని తెలుసుకోక-
* స్ట్రక్చర్ కీ, క్రియేటివిటీ కీ తేడా తెలీక...
* స్ట్రక్చర్ ని విస్మరించి క్రియేటివిటీ తోనే స్క్రిప్టు రాసుకోవడం వల్ల- 
* పునాదుల్లేని భవనానికి నగిషీలు చెక్కుకున్నట్టు వుంటోంది
* స్ట్రక్చర్ లేక ఎంత క్రియేటివిటీని  రంగరించినా...
* సినిమా కథల్ని ప్రేక్షకుల మెదళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతిలో రిసీవ్ చేసుకో
లేకపోతున్నాయి.
* అప్పుడవి అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి

ఇందుకే స్ట్రక్చర్ అవసరం!
* స్ట్రక్చర్ అనే వాస్తవాన్ని గుర్తించడం అవసరం
* సినిమా ఆఫీసుకి వాస్తు ఎలాగో, కథకి స్ట్రక్చర్ అలా 
* ఆఫీసుకి వాస్తు చూసుకుని, ఆ ఆఫీసు పెట్టడానికి మూలకారణమైన
కథకి వాస్తు (స్ట్రక్చర్)
వుందా లేదా ఆలోచించక పోవడం నిజంగా అవివేకం!

***


Wednesday, August 17, 2022

1192 : స్క్రీన్ ప్లే సంగతులు

 

 

      చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ నటించిన కార్తికేయ 2 కూడా హిట్. హిందీ, ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని రాష్ట్రాల నుంచి వసూళ్ళు బ్రేక్ ఈవెన్ దాటేశాయి. ఇలాటి హిట్టయిన సినిమా స్క్రీన్ ప్లే సంగతులు కూడా అద్భుతంగా వుండాలి. కానీ స్క్రీన్ ప్లే సంగతులు అద్భుతంగా లేకపోయినా ఒక్కోసారి సినిమాలు హిట్టవుతూంటాయి. సినిమా హిట్టవడానికి అర్ధవంతమైన స్క్రిప్టు వుండనక్కర్లేదనీ నిరూపి స్తూంటారు ఒక్కోసారి ప్రేక్షకులు. బజారులో ఒక వస్తువు కొనేప్పుడు దాని గురించి ఎంతో ఆలోచించి కొంటారు. కానీ సినిమాల్ని ఆలోచనాత్మకంగా చూసి ఆమోదించరు. అందులో ఏదో ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. అదొక్కటి పట్టుకుని ఓకే అనేస్తారు. వీళ్ళ ముందు స్క్రీన్ ప్లే సంగతులు రాసేవాడు ఓడిపోతాడు. రాయకుండా వుండడమే మంచిదనుకుంటాడు. రాయాలా వద్దా...రాయాలా వద్దా...అని ఆగి ఆగి రాస్తూంటాడు. రాస్తూంటే ఈ కింది విధంగా వచ్చింది...పాఠకులకి నచ్చకపోతే తిరస్కరించే హక్కు ఎలాగూ వుంది.

కథ  

గ్రీస్ లోని ఒక లైబ్రరీలో  ప్రొఫెసర్ రావు ద్వాపర యుగంలో కృష్ణుడికి సంబంధించిన ఒక రహస్యం తెలుసుకుంటాడు. శాస్త్ర సాంకేతికాభివృద్ధి పేరుతో మనుషులు ప్రకృతిని నాశనం చేస్తారని, దాని వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లెదుర్కొంటారనీ, దీన్నుంచి రక్షణగా తన కాలి కడియాన్ని తీసిచ్చాడు ఉద్ధవుడనే వాడికి కృష్ణుడు ఆనాడు. ఉద్ధవుడు దాన్ని ఒక రహస్య ప్రదేశంలో భద్రంగా దాచాడు. ఈ సమాచారంతో ప్రొఫెసర్ రావు- ఇప్పుడా రహస్య ప్రదేశం అన్వేషణ ప్రారంభిస్తాడు.

డాక్టర్ కార్తీక్ (నిఖిల్) కి తల్లిదండ్రులు, చెల్లెలు వుంటారు. సదానంద (శ్రీనివాస రెడ్డి) అనే మేనమామ, రవి (సత్య ) అనే ఫ్రెండ్ వుంటారు. కార్తీక్ కి అంధ విశ్వాసాలంటే పడవు. హేతువాది. మూఢ విశ్వాసులతో తలపడుతూంటాడు. ఒక రోజు మూఢ విశ్వాసి అయిన నగర మేయర్ని హాస్పిటల్లో లాగి కొడతాడు. సస్పెండ్ అవుతాడు.

ఇంకో రోజు ఆవు వచ్చి ఇంట్లో తులసి కోటని కుమ్మి కూల్చేస్తుంది. కార్తీక్ తల్లి (తులసి) తాంత్రికుడ్ని పిలుస్తుంది. అతనొచ్చి మొక్కేదైనా తీర్చుకోలేదా అంటాడు. ఏడాది క్రితం కార్తీక్ జబ్బు పడ్డప్పుడు, ద్వారకా వెళ్ళి 108 కేజీల వెన్న కృష్ణుడికి సమర్పించుకుంటానని మొక్కుకున్నానంటుంది. అయితే వెంటనే ద్వారక వెళ్ళి ఆ మొక్కు తీర్చుకో మంటాడు.

ఇలాటివి ఇష్టం లేని కార్తీక్ ని తీసుకుని ద్వారకా వెళ్తుంది తల్లి. అక్కడ ప్రొఫెసర్  రావు హత్యలో ఇరుక్కుంటాడు కార్తీక్. కార్తీక్ ని చంపడానికి గ్యాంగ్ వెంటపడతారు. కార్తీక్ తో ముగ్ధ (అనుపమా పరమేశ్వరన్) కలుస్తుంది. ఎవరీ ముగ్ధ? ప్రొఫెసర్ రావుని చంపిందెవరు? కార్తీక్ వెంట ఎందుకు పడుతున్నారు? కృష్ణుడి కడియం గురించి కార్తీక్ కెలా తెలిసింది? ఆ కడియాన్ని కార్తీక్ చేజిక్కించుకున్నాడా? ఏం జరిగింది? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ  

ట్రెజర్ హంట్- ఫాంటసీ జానర్ కథ. చనిపోతూ ఒకడు ఇంకొకడి చెవిలో నిధి రహస్యం చెప్పడం, అనుచరుల్ని నేలలో మొండెం దాకా పాతి పెట్టి, హీరోని చెట్టుకి తలకిందులుగా వేలాడదీసే లాంటి కౌబాయ్ మూవీ టెంప్లెట్ సీన్లు సహా. అయితే కృష్ణుడు పురాణ పాత్ర కాదనీ, అతను నిజంగానే వుండిన చరిత్ర అనీ, అన్ని శాస్త్ర సాంకేతిక విషయాలూ చెప్పిన ఆల్ ఇన్ వన్ సైంటిస్టు అనీ- మైథాలజీ అని నమ్మే వాళ్ళకి మైథాలజీ కాదూ హిస్టరీ అనీ చెప్పారు. ఇలాంటప్పుడు ఈ కథ హిస్టారికల్ థ్రిల్లర్ గా వుండాలి. ఇలాలేదు. ఇంతా చెప్పి మైథాలజీ లోకే తీసికెళ్ళారు.

ఇంకోటేమిటంటే, కృష్ణుడి కడియం దొరికితే అది ఏ మానవాళి సమస్యని తీరుస్తుందో  చెప్పక పోవడం. కృష్ణుడు మానవాళి సమస్యని తీర్చుకోమనే కడియం ఇచ్చాడు, తమాషాకి ఇవ్వలేదు.
కథ ఎత్తుగడలో కృష్ణుడు ఏ ఉద్దేశంతోనైతే కడియం ఉద్ధవుడికిచ్చాడో ఆ సెటప్ ని తర్వాత కథనంలో పే ఆఫ్ చేయకపోవడం. కథ ఇరవై నిమిషాలు పోయాక మంత్రికి సైంటిస్టు రిపోర్టు ఇస్తాడు మహమ్మారి (కోవిడ్) గురించి. ఈ వైరస్ చాలా ప్రమాదకరమనీ, ఇది వ్యాపిస్తే ప్రపంచానికే ప్రమాదమనీ, ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థకి తెలిసేలోగా మనమే యాంటీ డోట్ తయారు చేయాలనీ, అప్పుడే ప్రపంచాన్ని ఏలుకో గలమనీ మంత్రి అంటాడు.

ఆ ప్రపంచాన్ని ఏలుకునే శక్తిగల అస్త్రమే ఈ కడియమన్న అర్ధంలో ఎక్కడా కథ నడపకపోవడం, కనీసం మంత్రి చర్చించిన ఈ పాయింటు హీరోకి కూడా తెలియకపోవడం ఈ కథ ప్రత్యేకత. మహమ్మారి అనే అంశమే ఇక వుండదు. మహమ్మారితో ముంచుకొస్తున్న ప్రమాదం, కడియం కోసం హీరో పరుగులు, కడియంతో ప్రమాద నివారణ -అనే ఏక వాక్య లాగ్ లైన్ తో కథ వుండక పోవడాన్ని గమనించాలి.

అన్నీ శాస్త్రాల్లో వున్నాయి, మనమే ప్రపంచానికి ఎత్తి చూపడం లేదు, మన గొప్ప మనమే చెప్పుకోవడం లేదు - అని ఓ పక్క అనుపమ్ ఖేర్ పాత్ర చేత ఆరోపణ చేయిస్తూనే,   కృష్ణుడి కడియంతో ప్రపంచానికేం చేస్తారో చెప్పకపోతే ఆ ఆరోపణ కర్ధం లేదు. చెప్పాలిగా? మా కృష్ణుడి కడియం చూడండి అంతర్జాతీయ ముప్పునెలా తుప్పు వదిలిస్తుందో చూపించాలిగా? సినిమాని యూనివర్సల్ అప్పీల్ చెయ్యాలిగా?

ఇదే హాలీవుడ్డోళ్ళు అయితే ప్రపంచాన్ని కాపాడే గుత్తాధిపత్యం తమదే అన్నట్టు ఇండిపెండెన్స్ డే’, ఆర్మగెడ్డాన్’, కంటేజన్ లాంటి డిజాస్టర్ మూవీస్ అడపాదడపా తీసి ప్రపంచం మీద పడేస్తారు. కంటేజన్ ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని అరికట్టడం గురించే.

కోవిడ్ కంటే ముందు ప్రారంభించిన కార్తికేయ 2 కోవిడ్ వల్ల నిర్మాణం ఆగిపోతూ ఆగిపోతూ సాగింది. బహుశా ఈ సినిమాలో కోవిడ్ పాయింటు ఈ సమయంలో జోడించారు. అందుకని అంటీ ముట్టనట్టు వుంది. కొత్తగా వచ్చిన కోవిడ్ పాయింటుతో కథ నడపాలంటే కథ మొత్తం మార్చాల్సి వస్తుంది. అందుకని కథని ఇలా వదిలేశారు.

మిథికల్ థ్రిల్లర్స్ రాసే అశ్విన్ సంఘీ నవల ది కృష్ణ కీ కథకీ, కార్తికేయ 2 కీ పెద్ద తేడా అన్పించదు. వీకీపీడియాలో కథా సంగ్రహం ప్రకారం - చరిత్ర ప్రొఫెసర్ సైనీ, మిత్రుడు అనిల్ హత్య కేసులో ఇరుక్కుంటాడు. అనిల్ ఆర్కియాలజిస్టు. అతను సింధు నాగరికతకి చెందిన ముద్రికల సంకేత భాషని ఛేదించాడు. దీని కోసమే చంపి వుంటారని తెలుసుకున్న ప్రొఫెసర్ సైనీ, తన మీద నింద తొలగించుకోవడానికి, అనిల్ హత్యా రహస్యం తెలుసుకునే ప్రయాణానికి సమకడతాడు.

పురాణాల చీకటి కోణాల్ని తడుముతూంటే, తారక్ అనే సీరియల్ కిల్లర్ గురించి తెలుస్తుంది. ఈ తారక్ తను విష్ణువు చివరి అవతారమైన కల్కి అని నమ్ముతాడు. ప్రొఫెసర్ సైనీ అన్వేషణ కొనసాగిస్తూ, ద్వారకా, బృందావన్ ల కెళ్తాడు. బృందావన్ని ఔరరంగ జేబు కృష్ణుడి శమంతక మణి కోసం ధ్వంసం చేసిన శిథిలాల్ని చూస్తాడు.

ప్రొఫెసర్ సైనీ ముందున్న ఇంకో సమస్య- సంకేత భాష కోసం అనిల్ మిత్రుల్ని కూడా శత్రువులు టార్గెట్ చేశారు. వాళ్ళని కూడా  కాపాడాలి. సంకేత భాష విడి విడి నాల్గు భాగాలుగా ఎక్కడెక్కడో వుంది. వాటిని కనుగొని జోడిస్తేనే శమంతక మణి రహస్యాన్ని విప్పే తాళం చెవి (కీ) అవుతుంది.

యాదవ కుల తెగలైన సైనీ, భోజ, వృషినీ, కుకూర, చేడీ ల సంతతి దగ్గర  సంకేత భాష ఒక్కో భాగముందని తెలుసుకున్న ప్రొఫెసర్ సైనీ, తనూ పంజాబ్‌లోని సైనీ తెగకి చెందిన కృష్ణుడి వంశపారంపర్య వారసుడేనని తెలుసుకుని ... ఇలా మలుపులు తిరుగుతూ థ్రిల్లింగ్ గా సాగుతుంది కథనం. ప్రొఫెసర్ సైనీ ద్వారా మహాభారతానంతర చరిత్రని వివరంగా వర్ణిస్తాడు రచయిత. ప్రధాన కథాంశానికి సమాంతరంగా కృష్ణుడి జీవిత చరిత్రని చిత్రిస్తాడు.

కార్తికేయ 2లో కృష్ణుడు కల్పన కాదు చరిత్ర అని చెప్తూనే కడియంతో కల్పిత కథ చేశారు. ఆల్ ఇన్ వన్ అయిన సైంటిస్టు మహమ్మారికి విరుగుడేం చెప్పాడో చరిత్ర వుంటే చెప్పొచ్చు. కడియంతో చెప్పిన కథ కూడా మహమ్మారి కోసంగాక, కడియం కోసమే కడియమన్నట్టు సాగడం అర్ధవిహీనంగా మార్చింది కథనాన్ని. కృష్ణ కీ తో ఈ కథ పోలికలు మహమ్మారిని తీసేస్తే దాదాపూ ఒకటే.

పోతే, దేవుళ్ళ  మరణాల గురించి చెప్పుకోకూడదు, వినకూడదు, చదవకూడదన్న ఆంక్షని పక్కన బెట్టి కృష్ణుడి నిర్యాణాన్ని చూపించేశారు! ప్రారంభ దృశ్యం వద్దన్నా వెంటాడే బ్యాడ్ ఇంప్రెషన్.

సినిమా భక్తి ప్రవచనాల వల్ల, ఫాంటసికల్ చిత్రణల వల్ల; కడియం, నెమలి, నెమలి పింఛం, దుర్బిణీ వంటి దైవాంశ కలిగిన ప్లాట్ డివైసుల వల్ల, ప్రేక్షకుల ఆత్మిక దాహం తీర్చే సాధనంగా హిట్టయి వుండాలి. కథా కథనాలతో కాదు.

మతం క్రియాశీలంగా వున్న హిందీ రాష్ట్రాల్లో దీని డబ్బింగ్ వెర్షన్ అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లని కింద బోర్లా పడేసి ఇందుకే పుంజుకుంటోంది. ద్వారకా, మధుర, రాధా కుంద్, బుందేల్ ఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి పుణ్య ప్రదేశాల్లో సినిమాని  తిప్పడం వల్ల పాన్ ఇండియా అప్పీల్ వచ్చి వుంటుంది.

స్ట్రక్చర్ సంగతులు

హీరోకి సస్పెన్స్, ప్రేక్షకులకి ఓపెన్ కథ అన్నప్పుడు హీరోకి సస్పెన్స్ ఎంతవరకుండాలి? కథ ప్రారంభిస్తే ఇంటర్వెల్ వరకూ హీరోకి కథ (సస్పెన్సుగా వుంచిన విషయం) తెలియకుండా వుండాలా? వుంటే బోరు కొట్టదా? ప్రేక్షకులు ఓపెన్ కథలో విహరిస్తూంటే, హీరో వచ్చేసి ఎంతకీ ఆ కథలోకి రాకపోతే బోరే కొడుతుంది.

ఉదాహరణకి కథా ప్రారంభంలో హత్య జరిగిందనుకుందాం. ఆ హత్యని, హంతకుడ్నీ ప్రేక్షకులకి చూపించేశారు. హీరోకి తెలియకుండా వుంచారు. హీరో ఆ హంతకుడెవరా అని తెలుసుకుంటూ తెలుసుకుంటూ ఇంటర్వెల్ దాకా పోతే అది కథ అన్పించుకోదు. ఇది బోరు కొడుతుంది.

అందుకని 15, 20 నిమిషాల్లో హీరోకి ఏదో క్లూ దొరుకుతుంది. ఆ క్లూ ప్రకారం హంతకుడెవరో తెలిసిపోయి వాడి వేట, అంటే యాక్షన్ మొదలెట్టేస్తాడు. హంతకుడితో ఎలుకా పిల్లీ చెలగాటంగా. ఇది బోరు కొట్టదు. ఎందుకంటే 15, 20 నిమిషాల్లో హంతకుడెవరో తెలిసిపోవడంతో హీరో అంతవరకూ ప్రేక్షకులకే తెలిసిన కథలోకి వచ్చేశాడు. దాంతో బిగినింగ్ ముగిసి, ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడింది. హీరోకి హంతకుడ్ని పట్టుకునే గోల్ ఏర్పడింది- దాంతో మిడిల్ ప్రారంభమై యాక్షన్లోకి దిగిపోయాడు. యాక్టివ్ గా పాత్రగా వున్నాడు.  

హీరోకి ఇంటర్వెల్ వరకూ హంతకుడెవరో తెలియకపోతే అంతవరకూ ప్రేక్షకులకి తెలిసిన విషయం - అంటే కథ - హీరోకి తెలియదు. తెలియకపోతే బిగినింగ్ ముగియదు. ముగియక పోతే ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడదు. ఏర్పడక పోతే పాసివ్ పాత్రగా హీరోకి గోల్ ఏర్పడదు. ఏర్పడకపోతే మిడిల్ ప్రారంభంకాదు. ప్రారంభం కాకపోతే కథ ప్రారంభం కాదు. బిగినింగ్ లో వుండేది కథకాదు. ప్రారంభం కాబోయే కథకి ఉపోద్ఘాతం మాత్రమే. ఇలా ఇంటర్వెల్ వరకూ ఉపోద్ఘాతమే చెప్తారా?

ఇదే జరిగింది కార్తికేయ 2 లో. ప్రారంభంలో ప్రొఫెసర్ పరిశోధన, కృష్ణుడి కడియం రహస్యం ఎపిసోడ్, ప్రొఫెసర్ అన్వేషణ, కడియం కోసం ఒక విలన్ గ్యాంగ్, ఇంకో సీక్రెట్ సొసైటీ, మంత్రికి కోవిడ్ వైరస్ రిపోర్టు, మంత్రి ప్రపంచాధిపత్యం సాధించాలనడం...వంటి వన్నీ జరుగుతూంటే హీరో నిఖిల్ కివేమీ తెలియవు!

అతను హేతువాది అన్న విషయం తెలియడానికి మూడు నాల్గు సీన్లు నడుస్తాయి. అతను హేతువాది అన్న విషయం ఆల్రెడీ కార్తికేయ 1 చూపించేశారు. మళ్ళీ చూపిస్తూ హాస్పిటల్లో పాముని పట్టుకోవడం, హాస్పిటల్లో హోమం నిర్వహిస్తున్నాడని మేయర్ని కొట్టడం, సస్పెండ్ అయి ఇంటి దగ్గర తల్లితో వాదన, ఫ్రెండ్స్ తో కామెడీ, ఆవు తులసి కోటని కుమ్మే ఎపిసోడ్, చివరికి మొక్కు తీర్చుకోవడానికి తల్లితో ద్వారకా బయల్దేరడం- ద్వారకాలో భక్తి, కామెడీ, ఇంతలో ప్రొఫెసర్ మీద హత్యా ప్రయత్నం, అందులో తను ఇరుక్కోవడం....

అయినా ఇక్కడ ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడదు. తనని ఎవరు కేసులో ఇరికిస్తున్నారో తెలియదు. అసలు ద్వారకా వచ్చిన పని పెండింగులో వున్న మొక్కు తీర్చుకుంటే ఇలా జరిగేది కాదేమో. తులసి కోట దగ్గర్నుంచీ ఇప్పటి దాకా కృష్ణుడే తనకి వ్యతిరేకంగా  పని చేస్తున్నాడు!

ఇంతలో తల్లీ కూడా మాయమై పోతే ఇదొక సస్పెన్సు. పరుగులు, ప్రొఫెసర్ మీద దాడి చేసిన గ్యాంగ్ ఎటాక్, ఈ గ్యాంగ్ ఎవరో కూడా నిఖిల్ కి తెలీదు, మనకి తెలుసు. ఇంకొంత వెతుకులాట తర్వాత తల్లి తిరిగొచ్చేసి కామెడీ చేస్తుంది. గుళ్ళో భజన కార్యక్రమంలో భక్తితో వూగి పోయానంటుంది. అమ్మా తల్లీ, ముందు నువ్వా మొక్కు తీర్చుకోమ్మా, 108 కేజీల వెన్న ఏదీ?- అన్పిస్తుంది మనకి.

తర్వాత హీరోయిన్ అనుపమ ఎంట్రీ. సెకండాఫ్ లో ఈమెకూడా మాయమై తిరిగొచ్చేసి ఉత్తుత్తి సస్పెన్సు  క్రియేట్ చేస్తుంది. ఇంతలో ఆభీర తెగకి చెందిన వాళ్ళ దాడి. దీనికి కథతో సంబంధముండదు. సబ్ ప్లాట్ కాదు. సెకండాఫ్ లో ఇంకో కథతో సంబంధంలేని గ్యాంగు బంధిస్తుంది.

ఇంతవరకూ నిఖిల్ ఈ దాడులు చేస్తున్నదెవరో తెలుసుకునే అన్వేషణలోనే వుంటాడే గానీ, కడియం గురించి అతడికేమీ తెలీదు. ఇంటర్వెల్లో గానీ తెలిసి, ఒక డైలాగుతో బలహీనంగా ముగిస్తాడు.

ప్రేక్షకులకి ఓపెన్ కథ, హీరోకి సస్పెన్స్ అన్న స్కీము ఇంతసేపు వర్కౌట్ కాదు. ఒకటే జరగాలి- ప్రారంభంలో ప్రొఫెసర్ తో బాటు కృష్ణుడి ఎపిసోడ్ చూపించాక, మొత్తం కడియానికి సంబంధించిన ట్రాక్ ఎత్తేయాలి. ఎత్తేసి డాక్టర్ గా తన రోజువారీ ప్రపంచంలో వున్న నిఖిల్ కి, అరగంట లోపు అడ్మిట్ అయిన ఒక కోవిడ్ రోగితో ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడి కలకలం రేగాలి. ప్రొఫెసర్ వచ్చేసి వైరస్ ని అంతం చేసే మహిమగల కృష్ణుడి కడియం గురించి చెప్పాలి. ఇద్దరూ దాని వేటలో బయల్దేరాలి. నిఖిల్ గోల్ ఆ కడియంతో ప్రపంచ విపత్తునాపడం. ఇక జాతీయ, అంతర్జాతీయ శక్తులూ కడియాన్ని కైవసం చేసుకునే పథకాలతో నిఖిల్ సంఘర్షణ! సింపుల్ గా ఇలా వుంటుంది బలమైన కథ.

ఇక సెకండాఫ్ లో ప్రారంభమయ్యే కథ చూస్తే ఈ మిడిల్ విభాగంలో మిడిల్ బిజినెస్ వుండదు. ప్రొఫెసర్, అనుపమ్ ఖేర్ పాత్రలతో పరిశోధనేతప్ప విలన్లతో యాక్షన్ వుండదు. విలన్లు ఎందుకున్నారో తెలీదు, కనపడరు. చివరి అరగంట నిఖిల్ విలన్లు లేని ఏకపక్ష అన్వేషణతో వివిధ ప్రదేశాలు టూరు వేసి కడియాన్ని కనుగొనడంతో అయిపోతుంది కథ. ఎందుకు కనుగొన్నాడో, దాని అవసరమేమిటో ఇప్పటికీ తెలీదు నిఖిల్ కి...

మరి ఎలా హిట్టయ్యింది ఈ కథ? కథనాపుతూ అనేక చోట్ల భక్తి ప్రవచనాలతో భక్తి రసాన్ని పంచడం వల్ల హిట్టయ్యిందని చెప్పొచ్చు.

—సికిందర్