రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, June 15, 2022

1173 - 'డ్యూయెల్' స్క్రీన్ ప్లే సంగతులు-2

   బిగినింగ్ విభాగపు మూడో టూల్ అయిన సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనని విశ్లేషించుకుంటే, ఒకదాన్నొకటి ఓవర్ టేక్ చేసుకునే ఆ రెండు వాహనాల మూవ్ మెంట్స్ లో విషయం దొరుకుతుంది. మొదట ట్యాంకర్ డ్రైవర్ ఫ్రెండ్లీగా సైడ్ ఇవ్వడం, డేవిడ్ ఓవర్ టేక్ చేసి వెళ్ళి పోయాక ట్యాంకర్ డ్రైవర్ తను ఓవర్ టేక్ చేయడం, తిరిగి డేవిడ్ ఓవర్ టేక్ చేశాక మళ్ళీ ట్యాంకర్ డ్రైవర్ ఓవర్ టేక్ చేయడం...ఈ మూవ్ మెంట్స్ లో ట్యాంకర్ డ్రైవర్ అసహజంగా బిహేవ్ చేస్తున్నట్టు మనకర్ధమవుతుంది. ఇది ఈ మూవ్ మెంట్స్ లో వున్న సబ్ టెక్స్ట్, మనసు. ఇదేం గ్రహించని డేవిడ్ క్యాజువల్ గా ఓవర్ టేక్ చేస్తూ డ్రైవ్ చేయడాన్ని మనం గమనించవచ్చు. మూడోసారి ఓవర్ టేక్ చేసేప్పుడు డేవిడ్ దాదాపూ యాక్సిడెంట్ చేసేవాడే. ట్యాంకర్ డ్రైవర్ కావాలనే ఎదురుగా మరో కారు వస్తున్నప్పుడు డేవిడ్ కి సైడ్ ఇస్తాడు. ఎదురుగా కారు వస్తోందని తెలియని డేవిడ్ ట్యాంకర్ ని ఓబర్ టేక్ చేయబోయి - తక్షణం అప్రమత్తమై ప్రమాదాన్ని తప్పిస్తాడు.

     మూవ్ మెంట్స్ తో కథనంలో జీవాన్ని నింపే ఇంకో చర్య ఏమిటంటే, ట్యాంకర్ డ్రైవర్ కేవలం పదే పదే పోటీపడి ఓవర్ టేక్ చేయడం లేదు, అలా ఓవర్ టేక్ చేస్తూ వెంటాడుతున్నాడు. అంటే వేట మొదలెట్టాడు. ఎందుకని? అతడి ట్యాంకర్ ముందు భాగంలో వివిధ వాహనాల నెంబర్ ప్లేట్స్ బిగించి వున్నాయి. ఇదివరకు ఈ నెంబర్ ప్లేట్స్ గల వాహనదారుల్ని వెంటాడి చంపాడనడానికి ఇవి గుర్తులు. అంటే ఇతనొక సైకో. తనని సైడ్ అడిగినా, ఓవర్ టేక్ చేసినా సహించడన్న మాట!

    ఈ మూవ్ మెంట్స్ లో డైనమిక్స్ ఏమిటంటే, ట్యాంకర్ డ్రైవర్ ఉద్దేశం మనకర్ధమవుతోంది, డేవిడ్ కే తెలియడం లేదు. ఇది ఐరనీని సృష్టిస్తోంది. కథనానికి జీవాన్నీ, డెప్త్ నీ ప్రసాదిస్తోంది. ఈ ప్రమాదకర ఓవర్ టేక్స్ తో డేవిడ్ విసిగి పోయి ఎక్కడా ట్యాంకర్ డ్రైవర్ తో ఘర్షణ పడ్డం లేదు. ఘర్షణ పడితే ఇద్దరి పోరాటం ఇక్కడ్నించే మొదలైపోతుంది. బిగినింగ్ విభాగంలో ఈ పోరాటం జరగడాన్ని (కథ ప్రారంభమవడాన్ని) బిగినింగ్ సూత్రాలు ఒప్పుకోవు. ఆరాటం ఆపుకోలేని  మేకర్ ఇప్పుడే హీరో చేత తిట్టిస్తే ఇక్కడే కథ చచ్చిపోతుంది.

    ఇలా సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన చేశాక, కొంత గ్యాప్ తీసుకుంటుంది కథనం. ఈ గ్యాప్ లో పెట్రోల్ బంకు దగ్గర కథకి అవసరమున్న మరికొంత సెటప్ ఏర్పాటవుతుంది- 1. విండో గ్లాస్ మీద వాటర్ కొట్టడం, 2. ట్యాంకర్ డ్రైవర్ బూటు కాళ్ళు మాత్రమే రివీలవడం, 3. రేడియేటర్ పైపు మార్చాలనడం, 4. డేవిడ్ భార్యకి కాల్ చేయడం.

    ఈ సీనులో డేవిడ్ పెట్రోల్ బంకులో కారాపగానే ట్యాంకర్ వచ్చి పక్కనే ధడాల్న ఆగడం మనకర్ధమైపోతుంది. ఈ ట్యాంకర్ డ్రైవరనే వాడు సైకోతనంతో పగ బట్టేశాడని. డేవిడ్ కారులోంచి తల పైకెత్తి ట్యాంకర్ లో డ్రైవర్ ని చూడాలని ప్రయత్నిస్తూంటే, బంకు వర్కర్ వచ్చి విండో గ్లాస్ మీద వాటర్ కొట్టడం కూడా కథ చెప్పే కథనమే. వాటర్ కొట్టి తేటగా అద్దాన్ని తుడవడం- డేవిడ్ ఎంత స్పష్టంగా చూడాలని కూడా ప్రయత్నించినా ఆ డ్రైవరనే వాడు కంటపడే సమస్యే లేదని డేవిడ్ తో బాటు మనకూ తెలియజేస్తున్న కథనం. కథ కుండే మనసు.

   కారు కింద నుంచి ట్యాంకర్ డ్రైవర్ బూటు కాళ్ళు రివీలయ్యే సెటప్, తర్వాత సెకండ్ యాక్ట్ లో, అంటే మిడిల్ విభాగంలో, రెస్టారెంట్ సీన్లో పేఆఫ్ అవుతుంది. ఇక బంకు వర్కర్ డేవిడ్ కారు రేడియేటర్ పైపు మార్చాలనడం, డేవిడ్ తర్వాత మారుస్తాననడం గురించి...ఇది థర్డ్ యాక్ట్, అంటే ఎండ్ విభాగపు -అంటే క్లయిమాక్స్ యాక్షన్ కి ప్లాట్ పాయింట్ టూ లో, పేఆఫ్ అయ్యే సెటప్. దీన్ని ఇక్కడే ఏర్పాటు చేశాడు ముందు చూపుతో.

    సరైన స్క్రీన్ ప్లే లో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పాటయ్యే సమస్యకి పరిష్కార మార్గం ప్లాట్ పాయింట్ టూ లోనే దొరుకుతుంది. ఇదే ఇక్కడ జరగబోతోంది. ఈ పెట్రోలు బంకు సీను ప్లాట్ పాయింట్ వన్ సీనుగా ఎస్టాబ్లిష్ అవుతోంది. పాయింటేమిటంటే, డేవిడ్ కి తన కారు ప్రయాణం మామూలు ప్రయాణం కాదనీ, ఇది ఓ కథనే సృష్టించబోతోందనీ, ఈ కథలో చాలా ప్రాణాంతక సమస్య నెదుర్కోబోతున్నాడనీ ఇప్పటికీ అతడికి తెలీదు. ఇది డైనమిక్స్, ఐరనీ, డెప్త్ వగైరా వగైరా. ట్యాంకర్ డ్రైవర్ కి మాత్రం తను డేవిడ్ తప్పించుకోలేని సమస్యని  సృష్టించబోతున్నాడని తెలుసు, ఇది మనకీ తెలుసు. ఇది డేవిడ్ తో సస్పెన్సు ని సృష్టిస్తోంది.

   ఒక సినిమా చేసి వెళ్ళిపోయే మేకర్ కి-  ఈ పెట్రోల్ బంకులో డేవిడ్ ని దింపి, ట్యాంకర్ డ్రైవర్ ని బయటికి లాగి బూతులు లంకించుకుని, కింద పొర్లాడి కొట్టుకునేదాకా చూపించేస్తే గానీ కుతి తీరదు. ఇతను మేకరిన్లా (టాలీవుడ్ అల్లుడు) ఎలా అవుతాడు?

    ఇక బంకులో డేవిడ్ భార్యతో కాల్ మాట్లాడినప్పుడు, ఇంటి దగ్గర భార్యా ఇద్దరు పిల్లలూ రివీలవడం ఐరనీని మరింత పెంచుతుంది. ఇప్పుడిక్కడ డేవిడ్ టేబుల్ మీద కాలెత్తి పెట్టి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు, ఒక లావాటి ఆవిడ వస్తుంది. కాలు తీసేస్తాడు. లోపలి కెళ్ళి పోతుంది. ఈ బంకులో లాండ్రీ వసతి కూడా వుంది. ఆమె ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్ డోర్ తీసి బట్టలు తీసుకుంటూ వుంటే, గుండ్రంగా వున్న ఆ డోర్ గ్లాస్ లోంచి అవతల డేవిడ్ ఫ్రేమ్ ఇన్ ఫ్రేమ్ షాట్ లో కనిపిస్తాడు. ఏమిటి దీని కథనం? సమస్యలో పడబోతున్న డేవిడ్ చట్రంలో బందీ అవుతున్నాడని ఫిలిమ్ నోయర్ జానర్ ఎలిమెంట్ తో ప్రయోగం.    

    ఇదీ మొత్తం బిగినింగ్ విభాగపు సెటప్. సెటప్ లో బిజినెస్. ఇక్కడ్నించీ డేవిడ్ కారులో బయల్దేరడం సెకెండ్ యాక్ట్, అంటే మిడిల్ కి ప్రారంభం. మిడిల్, ఎండ్ విభాగాలు రేపు చూసేద్దాం.

    డ్యూయెల్ మేకింగ్ విశేషాలు చాలా వున్నాయి. అవన్నీ ఇక్కడ చెప్పడం సాధ్యం కాదు. ఈ వ్యాసం స్క్రీన్ ప్లే సంగతులుకే కేటాయించాం. దీని మేకింగ్ విశేషాల గురించే కాదు, ది మేకింగ్ ఆఫ్ ఏ ఫిలిమ్ కెరీర్ అంటూ స్పీల్ బెర్గ్ గురించి ఏకంగా ఓ పుస్తకమే వెలువడింది (దీని పీడీఎఫ్ కాపీని సుకుమార్ అసిస్టెంట్ కమలాకర్ రెడ్డి డౌన్ లోడ్ చేసి పంపారు, థాంక్స్). దీన్ని మీరు కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. చాలా ఉపయోగపడుతుంది.

—సికిందర్

Monday, June 13, 2022

1172 - ఈ రోజు స్పెషల్ -12 pm



   సినిమా తీయడానికి అరకొర బడ్జెట్టే చేతిలో వున్నప్పుడు ఒక్కటే మార్గం వుంటుంది. మేకింగ్ ని పైపైన మాక్రో లెవెల్లో చూడకుండా, లోతుపాతుల్లోంచి చూడడం. కథ లోతుపాతుల్నుంచీ మేకింగ్ ని మైక్రో లెవెల్లో బాగా అర్ధం జేసుకోవడం. ఇందుకు స్టీవెన్ స్పీల్బెర్గ్ వైపు దృష్టి సారించడం. హాలీవుడ్ లెజెండ్ స్టీవెన్ స్పీల్బెర్గ్ 25 వ యేట అరకొర బెడ్జెట్ తో తీసిన తొలి సినిమానే కల్ట్ క్లాసిక్ గా మార్చేశాడు. 1971 లో డ్యూయెల్ విడుదలై నేటికి 50 ఏళ్ళు దాటింది. నేటికీ దీనికి లక్షల మంది ప్రేక్షకులు, అభిమానులూ వున్నారు ఆన్ లైన్లో. బాగా చిన్నప్పుడే స్పీల్బెర్గ్ 8 ఎంఎం కెమెరా చేత బ ట్టుకుని చిత్రీకరణలు జరిపేవాడు. స్కూలు పోటీల్లో షార్ట్ ఫిలిమ్ తీసి ప్రథమ బహుమతి కూడా అందుకున్నాడు. కాలేజీ చదువు మధ్యలో ఆపేసి ఫిలిమ్ స్కూల్లో చేరిపోయి దర్శకత్వం నేర్చుకున్నాడు. ఎప్పుడూ కూడా అతడికి హాలీవుడ్ మీద, సినిమాల మీదా దృష్టి వుండేది కాదు. అందుకని టీవీ స్టేషన్లో చేరి సిరీస్ తీయడం మొదలెట్టాడు. అప్పుడు వచ్చిందే టెలి ఫిలిమ్ గురించి ఒక ఆఫర్. ఆ టెలి ఫిలిమ్ డ్యూయెల్ తీసి టీవీలో ప్రసారం చేస్తే విపరీత ఆదరణ పొందడమే గాక, సినిమాగా కూడా కొన్ని సీన్లు కలిపి విడుదల చేస్తే  స్పీల్బెర్గ్ కి అగ్రశ్రేణి దర్శకుల దర్బార్ లోకి ద్వారాల్ని తెరిచి పెట్టేసింది...


    త్యల్ప బడ్జెట్ తో 10 రోజుల్లో టెలి ఫిలిమ్ డ్యూయెల్ పూర్తి చేయాలని అప్పట్లో టీవీ స్టేషన్ ఆదేశం. జీవితంలో 10 రోజుల్లో సినిమా తీసే వుండరు తెలుగులో. ఒకవేళ తీయాల్సిన అవసరం ఏర్పడితే ఓ ఇండోర్ లొకేషన్ చూసుకుని ఆ ఇంట్లో పేరంటం జరుగుతున్నట్టు చుట్టేయడమే. ఇలా ఒక ఇంట్లో నడిచే ఇండోర్ కథనే అలవాటుగా ఆలోచిస్తారు. స్పీల్బెర్గ్  డిఫరెంట్ గా ఆలోచించాడు. ఆ 4 లక్షల డాలర్ల మినీ బడ్జెట్ కి  ఏకంగా హైవే మీద దౌడు తీసే ఔట్ డోర్ యాక్షన్ కథ నిర్ణయించాడు. ఇచ్చిన 10 రోజులు కాదు గానీ 13 రోజుల్లో పూర్తి చేశాడు. 1971 లో 4 లక్షల డాలర్లు అంటే అప్పటి మన రూపాయల్లో (డాలర్ కి రూ 7.50) 30 లక్షల రూపాయలు.  ఈ 30 లక్షల బడ్జెట్ తో ఆ రోజుల్లో ఎన్టీ రామారావు సినిమాలు 5 తీయవచ్చు. ఈ దృష్ట్యా స్పీల్బెర్గ్ కి 30 లక్షల బడ్జెట్ కేటాయించడం బాగా ఎక్కువే కదా అన్పిస్తుంది. కానీ మల్టీ మిలియన్ బడ్జెట్ల హాలీవుడ్ బజార్లో 4 లక్షల డాలర్లు అంటే- ఓ అర మిలియన్ లోపు లొట్టి పిట్ట డాలర్ల చాయ్ సిగరెట్ బడ్జెట్టే. రెండు దమ్ముల్తో వూది పారేసేంత.ఇది టెలి ఫిలిమ్ కోసం కేటాయించిన బడ్జెట్. దీన్నే సినిమాగా బూస్టప్ చేసి విడుదల చేయడంతో డెడ్ చీప్ బడ్జెట్ సినిమా అయింది. సాధారణంగా ముందు థియేటర్లో విడుదలై తర్వాత టీవీలో ప్రసారమవుతాయి సినిమాలు. డ్యూయెల్ విషయంలో ఇది తారుమారైంది. ముందు టీవీ మూవీగా లక్షల మంది చూసినప్పటికీ, తర్వాత సినిమాగా విడుదల చేస్తే అప్పుడూ విరగబడి చూశారు. ఇప్పుడూ ఆన్లైన్లో అంకిత భావంతో చూస్తున్నారు.     

  
   మొన్న స్వాతిముత్యం  సినిమా వెబ్ మేగజైన్లో గాంధీ వేసిన కార్టూన్ వచ్చింది. సినిమాని ముందు ఓటీటీకిచ్చి తర్వాత థియేటర్ రిలీజ్ చేస్తే ఎలా వుంటుందని కేప్షన్.  సినిమాల్ని థియేటర్లో విడుదల చేస్తే రెండు వారాల్లో ఓటీటీ కొస్తుందిలేనని థియేటర్లకి డుమ్మా కొడుతున్న ప్రేక్షకుల నుద్దేశించి ఈ కార్టూన్. ప్రేక్షకులు ఈ పల్స్ పట్టుకున్నాక ఆ విడుదలేదో ముందు ఓటీటీలోనే విడుదల చేసేస్తే సరిపోతుందిగా... ఇలాటి రోజులు కూడా వస్తాయేమో.
స్వాతిముత్యం వెబ్ మేగజైన్ 

    స్మాల్ మూవీస్ ని థియేటర్లో చూసేందుకు ఎవరూ రావడం లేదు. వాటి క్వాలిటీని చూసి ఓటీటీల్లో కూడా తీసుకోవడం లేదు. తెలుగులో క్వాలిటీతో తీసి ఓటీటీలో వేస్తే పెద్ద తెరమీద కూడా చూసి తీరాలన్న ఉత్సుకతని రేపాలి నిజానికి స్మాల్ మూవీస్. అప్పుడు
డ్యూయెల్ లాంటి ప్రయోగం తెలుగులో సక్సెసవుతుంది. క్వాలిటీ బావుంటే ముందు థియేటర్ రిలీజే చేసుకోవచ్చు కదా అనొచ్చు. స్మాల్ మూవీస్ క్వాలిటీ బావుందని థియేటర్లో రిలీజ్ చేస్తే బావుందన్న టాక్ వచ్చి వూపందుకోవడానికి ఓ వారం పడుతుంది. ఈ లోగా ఇంకేదో పెద్ద సినిమా వచ్చిందంటే దాన్ని థియేటర్లలోంచి లేపేస్తారు. ఈ గండం పొంచి వుంటుంది.

   అందుకని క్వాలిటీతో వున్న స్మాల్ మూవీస్ కి నిదానంగా మౌత్ టాక్ తో నిలబడేంత అవకాశమిచ్చే మంచి రోజులిప్పుడు లేవు. అందుకని మేకింగ్ చేస్తున్నప్పుడే ఫస్ట్ డే మార్నింగ్ షోని టార్గెట్ చేసి మేకింగ్ చేసుకోవాల్సిన అవసరం కన్పిస్తోంది. ఫస్ట్ డే మార్నింగ్ షో పడిందంటే ఇంకాలస్యం లేకుండా హిట్ టాక్ వచ్చేయాలి. ఆ షోతో ట్విట్టర్ రివ్యూలూ, వెబ్ రివ్యూలూ హిట్ టాక్ తో నిండిపోవాలి. స్మాల్ మూవీని తీసి విడుదల చేయడం కాదు, వైరల్ చేయాలి. స్మాల్ మూవీ కంటెంట్ విడుదలవడం కాదు, వైరల్ అవాలి. ఈ నైపుణ్యం అంతా డ్యూయెల్ లో వుంది.

అదృశ్య విలన్ 
స్పీల్బెర్గ్ జేబు ఖర్చు బడ్జెట్ తో డ్యూయెల్ ప్రారంభం నుంచీ ముగింపు వరకూ హైవే మీద ఏకబిగిన సాగే రోడ్ థ్రిల్లర్ ని వూహించాడు. ఆ కొద్దిపాటి బడ్జెట్ తోనే 2000 మైళ్ళ పొడవునా హైవే మీద షూట్ చేసుకుంటూ పోవాలి. తెలుగులో 20 మైళ్ళు  షూట్ చేసుకుంటూ పోయారో లేదో బ్యాంకు బ్యాలెన్స్ పెట్రోలు కంటే స్పీడుగా ఆవిరై పోతుంది. గుండె గుభేల్మని ఇక అదే కారేసుకుని అప్పుకోసం వూరూరా శరణార్ధుల్లా తిరగడం.

స్పీల్బెర్గ్ కథలో రెండే వాహనాలు. ఒక కారు, ఒక ఆయిల్ ట్యాంకర్ మధ్య యాక్షన్ సీన్లు. హీరో పాత్ర ఒక్కటే కన్పిస్తుంది కారులో, ట్యాంకర్ నడిపే విలన్ పాత్ర కన్పించదు. వెంటాడే ట్యాంకరే విలన్ గా కన్పిస్తుంది. పెద్ద భూతమేదో వెంట బడుతున్నట్టు. మనకైతే   ట్యాంకర్ లో వున్న విలన్నీ కూడా క్రూరంగా చూపిస్తే తప్ప సినిమా తీసినట్టు అస్సలుండదు. విలన్ కిచ్చుకున్న పారితోషికం జస్టిఫై అయిందన్పించదు.

ఇదో కథానిక
 ఒరిజినల్ గా ఇదొక కథానిక. ఈ కథానిక రిచర్డ్ మాథెసన్ అనే రచయిత రాశాడు. హైవే మీద తనకి జరిగిన ఒక అనుభవాన్ని పురస్కరించుకుని. ఈ కథానిక స్పీల్బెర్గ్ సెక్రెటరీ దృష్టిలో పడి (స్పీల్బెర్గ్ కి అప్పుడే ఒక సెక్రెటరీ!) స్పీల్బెర్గ్ కి చదవమని ఇచ్చింది. స్పీల్బెర్గ్ కి నచ్చి రిచర్డ్ మాథెసన్ చేతే స్క్రీన్ ప్లే రాయించుకున్నాడు. మాథెసన్ అప్పటికే స్క్రీన్ ప్లే రచయితగా వున్నాడు. రెండు వాహనాలతో యాక్షన్ సీన్స్ కి స్క్రీన్ ప్లే ఎలా రాస్తారు? ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఛేజింగ్స్ కూడా త్రీయాక్ట్స్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో కూర్చి చూపాడు మాథెసన్. పైకి చూస్తే గంటన్నర పాటు ఉరకలెత్తుతున్న ఉత్త ఛేజింగ్స్ లాగే అన్పిస్తుంది. ఇన్వాల్వ్ అయి చూస్తే ఈ ఛేజింగ్స్ కొక స్ట్రక్చర్ కన్పిస్తుంది. ఛేజింగ్స్ తో కూడిన కథనాన్ని  బిగినింగ్- మిడిల్- ఎండ్ అనే త్రీయాక్ట్స్ లో విభజించి, ఏ యాక్ట్ లో జరగాల్సిన బిజినెస్ ఆ యాక్ట్ లో, ప్లాట్ పాయింట్స్ సహా సమకూర్చడం ద్వారా, ఆద్యంతం ఒక సమగ్ర రోడ్ యాక్షన్ కథని సంతృప్తికరంగా కళ్ళముందుంచాడు రచయిత. వివరంగా దీన్ని స్క్రీన్ ప్లే సంగతుల్లో చూద్దాం.

   ఈ కథకి హీరోగా డెన్నిస్ వీవర్ (1924-2006) ని తీసుకున్నాడు స్పీల్బెర్గ్. 77 సినిమాల్లో నటించిన వీవర్ ని ఆర్సన్ వెల్స్ తీసిన టచ్ ఆఫ్ ఈవిల్ లో చూసి ఎంపిక చేసుకున్నాడు స్పీల్బెర్గ్. ఈ కొత్త కుర్రాడు ఏం దర్శకత్వం వహిస్తాడులేనని అయిష్టంగానే ఒప్పుకున్నాడు వీవర్. కానీ తీరా సినిమా విడుదలయ్యాక స్పీల్బెర్గ్ తన చేత నటింపజేసుకున్న విధానానికి మైమరచిపోతూ, యేటా రెండు సార్లు  డ్యూయెల్ ని చూసేవాడు తన నటన చూసుకోవడానికే వీవర్.

   ఇక కనిపించని విలన్ గా, ట్యాంకర్ ని నడిపే డ్రైవర్ గా  ప్రసిద్ధ స్టంట్ డ్రైవర్ కెరీ లాఫ్టిన్ (1914-1997) నటించాడు. యాభై ఏళ్ళ పాటు హాలీవుడ్ కి స్టంట్ సేవలందించిన లాఫ్టిన్-   ఫ్రెంచ్ కనెక్షన్, డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్, వాకింగ్ టాల్  మొదలైన సుప్రసిద్ధ సినిమాలకి పని చేశాడు.

కథ
భార్యా పిల్లలున్న డేవిడ్ మన్ ఒక బిజినెస్ ట్రిప్ మీద లాస్ ఏంజిలిస్ నుంచి బయల్దేరి వెళ్తాడు రెడ్ ప్లిమత్ కారులో. మానమాత్రుడు కనిపించని రెండు లేన్ల ఎడారి  రోడ్డు మీద అతడి ప్రయాణం ఒక భారీ ఆయిల్ ట్యాంకర్ వల్ల ప్రమాదంలో పడుతుంది. 18 చక్రాల ఆ భారీ ఆయిల్ ట్యాంకర్ కి వివిధ వాహనాల నెంబర్ ప్లేట్లు బిగించి వుంటాయి. ఆ నంబర్ ప్లేట్లు అతను అంతమంది వాహనదారుల్ని చంపిన గుర్తులుగా వుంటాయి. ముందున్న ఈ ట్యాంకర్ స్లోగా వెళ్తూ ఎంతకీ సైడ్ ఇవ్వకపోవడంతో, ఇచ్చినట్టే ఇచ్చి అడ్డురావడంతో డేవిడ్ మన్ కి మండిపోతుంది. ఎలాగో దాన్ని ఓవర్ టేక్ చేసి ముందుకు దూసుకు పోతాడు. ఇది ట్యాంకర్ డ్రైవర్ ఇగోని దెబ్బతీస్తుంది. ఈ డ్రైవర్ ఒక సైకో. తనని ఓవర్ టేక్ చేసి వెళ్ళిన డేవిడ్ మన్ మీద పగబట్టి  వెంటాడ్డం మొదలెడతాడు. డేవిడ్ మన్ ని చంపితీరాలన్న ప్రతీకారంతో వదలకుండా నరకం చూపిస్తాడు. ఈ సైకో డ్రైవర్ నుంచి డేవిడ్ మన్ ఎలా తప్పించుకున్నాడు? ఎన్నిసార్లు ప్రాణ గండంలో పడ్డాడు? సైకో డ్రైవర్ ని దెబ్బ తీయడానికి ఎలాటి ఎత్తుగడలు వేశాడు? హైవే మీద సుదీర్ఘ ప్రయాణపు ఈ ద్వంద్వ పోరాటంలో ఎవరు నెగ్గారు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ
ఇది కథలా వుందా? ఇందులో కథేమైనా వుందా? ఓ కారుని ఓ ట్యాంకరు వెంటాడ్డం అంతేగా? ఇది మొత్తం సినిమాకి కథెలా అవుతుంది? క్లయిమాక్స్ అవుతుందేమో? క్లయిమాక్స్ ని గంటన్నర సాగదీసి సినిమాలాగా చూపిస్తే తెలుగు ప్రేక్షకులు తెలివి తక్కువ వాళ్ళా?... ఇలా ఆలోచించుకుని పక్కనబెడితే  ఇలాటి లో - బడ్జెట్ గ్లోబల్ సినిమా తెలుగులో తీయలేరు. గ్లోబల్ సినిమా ఎలాగంటే  ఇందులో డైలాగుల్లేవు. ప్రపంచమంతటా అందరూ చూడొచ్చు. ఆద్యంతం యాక్షనే. రెండోది, యాక్షన్లో కంగారు పెట్టించే సస్పెన్స్. సస్పెన్స్ వీడిపోగానే థ్రిల్ కల్గించే యాక్షన్. మళ్ళీ కంగారు పెట్టించే సస్పెన్స్...ఇంతే గాక, సస్పెన్స్ బ్రహ్మ ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ ని తలపించే మిస్టీరియస్ వాతావరణ సృష్టి.

   స్పీల్బెర్గ్ కి హిచ్ కాక్ అంటే అభిమానం. తను టీవీ సిరీస్ తీస్తున్నప్పుడు హిచ్ కాక్ ని కలుసుకోవాలనుకుని ప్రయత్నించాడు. కలుసుకుని ఆయన కాళ్ళదగ్గర కూర్చుని, ఆయన చెప్పేవి వినాలనుకున్నాడు. అప్పుడు హిచ్ కాక్ ఫ్యామిలీ ప్లాట్ షూట్ చేస్తున్నాడు. దూరం దూరంగా తచ్చాడుతున్న స్పీల్బెర్గ్ ని చూపిస్తూ, ఆ అబ్బాయి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడని వచ్చి హిచ్ కాక్ కి చెప్పాడు అసిస్టెంట్. హిచ్ కాక్ ఓ లుక్కేసి- వాడెవడు మంకీలా వున్నాడు, తరిమేయ్ - అన్నాడు. అసిస్టెంట్ వెళ్ళి గేటవతలి దాకా తరిమేశాడు స్పీల్బెర్గ్ ని.

   తర్వాత 1975 లో స్పీల్బెర్గ్ మరో క్లాసిక్ జాస్ తీసినప్పుడు స్పీల్బెర్గ్ ని కలుసుకోవడానికి ససేమిరా అన్నాడు హిచ్ కాక్. ఎందుకంటే,  జాస్ లో తన వాయిసోవర్ చెప్పడానికి అక్షరాలా మిలియన్ డాలర్లు జేబులో వేసుకున్నాడు హిచ్ కాక్. ఇప్పుడు స్పీల్బెర్గ్  ఎదుటపడితే, వాయిసోవర్ కి మిలియన్ డాలర్లు నొక్కేసిన బజారు వేశ్యలా కన్పిస్తాననని కలవడానికి ససేమిరా అన్నాడు హిచ్ కాక్.

   డ్యూయెల్ కెమెరా యాంగిల్స్ లో, ఎడిటింగ్ లో హిచ్ కాక్ టెక్నిక్స్ నే ఉపయోగించాడు స్పీల్బెర్గ్. డ్యూయెల్ ని చూసిన హిచ్ కాక్, ఈ సైలెంట్ సీన్లు స్వఛ్చమైన సినిమాకి ప్రతిరూపాలుగా వున్నాయని కొనియాడాడు. తక్కువ బడ్జెట్ తో తొలి సినిమా తీస్తున్న కొత్త మేకర్, ప్రముఖులనుంచి ఇలాటి ప్రశంసలు పొందాలని కోరుకోక పోతే, ఆ తొలి సినిమా తీసేందుకు ఏళ్ళ తరబడి స్ట్రగుల్ చేయడంలో అర్ధం పర్ధం ఏమాత్రం లేదనే చెప్పుకోవాలి.

స్క్రీన్ ప్లే సంగతులు
పైన చెప్పుకున్నట్టు రచయిత మాథెసన్ ఈ రోడ్ థ్రిల్లర్ కథానిక స్క్రీన్ ప్లేని అయిదారుసార్లు తిరగ రాశాడు. ఇందులో మాటలతో కథ జరగదు. మూవ్ మెంట్స్ తోనే జరుగుతుంది. సాధారణంగా కథల్లో హీరోకీ విలన్ కీ మధ్య మాట తేడా వచ్చి సమస్య ఏర్పడి, ఆ సమస్యని సాధించే గోల్ తో ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. కానీ ఇద్దరూ పరస్పరం ప్రత్యక్షంగా ఎదురుపడకుండా వుంటే? ఒకరి గురించి ఇంకొకరికి ఏమీ తెలియని అపరిచితులైతే? ఇద్దరి మధ్యా ఒక్క మాటా లేకపోతే? అప్పుడు వాళ్ళ మూవ్ మెంట్సే  మూగగా కథనాన్ని, యాక్ట్స్ ని, ప్లాట్ పాయింట్స్ నీ ఏర్పాటు చేస్తాయి. ఇలా ఈ స్క్రీన్ ప్లే యాక్ట్స్ కథనమూ, సంభాషణలు రహిత మూవ్ మెంట్సూ ఎలా కుదురుకున్నాయో ఇప్పుడు చూద్దాం.

బిగినింగ్ విభాగం

ఒక ఇంట్లోంచి కెమెరా పుల్ బ్యాక్ అయి రోడ్డు మీద టర్న్ తీసుకుని సిటీ ట్రాఫిక్ లో ముందుకు సాగుతుంది. ఇవి కెమెరాతో పాటూ ముందుకు సాగుతున్న వాహనం పాయింటాఫ్ వ్యూ షాట్స్. వాహనం రివీల్ కాదు. కెమెరా ఒక టన్నెల్ లోకి ప్రవేశిస్తుంది. టైటిల్స్ ప్రారంభమవుతాయి. టన్నెల్ దాటి ఇంకో టన్నెల్ గుండా పోతుంది కెమెరా. టైటిల్స్ కొనసాగుతాయి. కెమెరా మూడో టన్నెల్లోకి పోతుంది. టైటిల్స్ కంటిన్యూ.

   టన్నెల్ దాటేసరికి ట్రాఫిక్ లేని, జన సంచారంలేని లేని రూరల్ ఏరియా వస్తుంది. ఇప్పుడు వాహనం పాయింటాఫ్ వ్యూ షాట్స్ కట్ అయిపోతాయి. లాంగ్ షాట్ లో కారు రివీల్ అవుతుంది. అది రెడ్ కలర్ ప్లిమత్ కారు. పోతున్న కారుని ముళ్ళ కంచె ఫ్రేమ్ చేసి ఇంకో షాట్. ఇప్పుడు టైటిల్స్  పూర్తయి, మిర్రర్ లో కారు నడుపుతున్న హీరో డేవిడ్ మన్ ఫేస్ రివీలవుతుంది... ఇదంతా అయిదున్నర నిమిషాల సమయం తీసుకుంటుంది.

కాస్త విశ్లేషణ
బిగినింగ్ విభాగంలో ఈ మూవ్ మెంట్స్ ని చూస్తే ఇవన్నీ బిగినింగ్ విభాగపు బిజినెస్ లో తొలి భాగమైన కథా నేపథ్యపు ఏర్పాటు, పాత్రల పరిచయమనే మొదటి రెండు స్క్రిప్టింగ్ టూల్స్ గా అర్ధమవుతాయి. ఒక ఇంట్లోంచి (హీరో ఇల్లు) కెమెరా పుల్ బ్యాక్ అయి టర్న్ తీసుకుని ట్రాఫిక్ లో పోవడం చూస్తే దీనికో అర్ధముంది. స్పీల్బెర్గ్ అనే పాతికేళ్ళ కుర్రాడు ఇంట్లోంచి బయల్దేరిన కారుని చూపించకుండా, కారు నడుపుతున్న హీరోనీ కూడా చూపించకుండా, కెమెరా కన్నుతో చూపిస్తున్న సిటీ దృశ్యాలతో ఏం చెప్పాలని తాపత్రయ పడుతున్నాడు? ఏమిటి అప్పుడే పాతికేళ్ళకే పొడుచుకొచ్చిన అంతర్జాతీయ స్థాయి క్రియేటివిటీ? హిచ్ కాక్ ని తలదన్నే టాప్ క్లాస్ యాక్టివిటీ?

   ఈ కథ ఒక ప్రాంతపు నేపథ్యంలోంచి ఇంకో ప్రాంతపు నేపథ్యంలోకి మారబోతోంది... జన సమ్మర్ధమున్న సిటీనుంచి, జనసంచారం లేని రూరల్ ఏరియాకి. ఈ తేడా రిజిస్టర్ చేయాలనుకున్నాడు. ఈ తేడా రిజిస్టర్ చేయాలంటే, బయల్దేరిన కారుని రిజిస్టర్ చేయకూడదు, కారు నడుపుతున్న హీరోనీ రిజిస్టర్ చేయకూడదు. అంటే ఈ రెండూ చూపించకూడదు. ప్రేక్షకులు తదేక ధ్యానంతో తాము సిటీలో ప్రయాణిస్తున్నట్టు ఫీలయ్యేలా సిటీ దృశ్యాలనే చూపిస్తూపోవాలి. సిటీ దాటగానే మారిపోయిన కొత్త ప్రపంచంలోకి ప్రవేశించినట్టు రూరల్ వాతావరణాన్ని ఫీలవ్వాలి. ఈ స్థల మార్పు తేడాల్ని అనుభవించాలంటే కారునీ, హీరోనీ చూపించి కలుషితం చేయకూడదు. ఇదన్నమాట కెమెరా కన్ను అంతరార్ధం.

   మాథెసన్ స్క్రీన్ ప్లేలో ఈ వివరాలుండవు. షూటింగ్ స్క్రిప్టులో ఈ విజువల్ నేరేషన్ ఇచ్చుకున్నాడు స్పీల్బెర్గ్. క్లయిమాక్స్ దృశ్యాలకి మాత్రం  స్టోరీబోర్డ్ వేయించుకున్నాడు వేరే సంగతి.

   ఇంతేగాకుండా ఈ విజువల్ కథనంలో సింబాలిక్ షాట్స్ కూడా వున్నాయి. మూడు సార్లు టన్నెల్స్ లోంచి పోతున్నట్టు చూపించడమంటే మృత్యు కుహరంలోకి వెళ్ళబోతున్నట్టు అర్ధం. తర్వాత కారు రివీల్ అయినప్పుడు, ముళ్ళ కంచెలో ఫ్రేమింగ్ చేసి చూపడం అతను చిక్కుల్లో పడబోతున్నట్టు అర్ధం. ఇలాటి విజువల్ ఎలిమెంట్స్ ఫిలిమ్ నోయర్ జానర్ సినిమాల్లో వుంటాయి. పాత్ర ప్రమాదంలో చిక్కుకో బోతోందని చెప్పేందుకు సంకేతంగా ముళ్ళ కంచెలు, కిటికీ వూచలు, డోర్ గ్రిల్స్ ఫ్రేమింగ్ చేసి పాత్రని చూపించడం. అందుకని ఉన్నతంగా తీసిన సినిమాల్ని మనం కేవలం కళ్ళతో చూడకూడదు, మనసుతో చదివి అర్ధాల్ని అనుభవించాలి.

   కెమెరా ఇలా పెట్టి ఆ పాసింగ్ కారు పాన్ తీసుకో, కట్ చేసి కారులో హీరో ఫేస్ క్లోజప్ కూడా బాగా తీసుకో- ఈ చెట్టు బాగుంది, దీని పక్కనుంచి కారు ఎగ్జిట్ తీసుకో- అంటూ తోచినట్టు కెమెరామాన్ కి సూచనలివ్వడం మేకింగ్ కాదు. కథ చెప్పడం కాదు. ఇందుకే కథ లోతుపాతుల్నుంచీ మేకింగ్ ని చూడాలని పైన చెప్పుకున్నాం. తన కథ లోతుపాతుల్లో దాగున్న అర్ధాలు తనకే తెలియకపోతే కొత్త మేకర్ కి పై మెట్లు కష్టమైపోతాయి.

తర్వాతి టూల్స్  
పైన చెప్పుకున్న విధంగా కథా నేపథ్యమనే టూల్ ని ఏర్పాటు చేశాక, పాత్రల పరిచయమనే రెండో టూల్ చూస్తే- ఇప్పుడు నిర్జన హైవే మీద కారు కెదురుగా భారీ ఆయిల్ ట్యాంకర్ కన్పిస్తుంది. చాలా పాతబడిన ఆ ట్యాంకర్ నత్త నడక నడుస్తూ పొగ గొట్టంలోంచి  పొగ మేఘాలు వదుల్తూంటుంది. వూపిరాడక దగ్గుతూ వుంటాడు కారు నడుపుతున్న డేవిడ్. డేవిడ్ పాత్రని ఇలా చూపించడమే పరిచయం. ఇంతకన్నా వివరాలు ఇక్కడ వుండవు. రెండో పాత్ర ఆయిల్ ట్యాంకర్. ఈ ట్యాంకర్ డ్రైవర్ కన్పించడు. ముందు పాత్ర ట్యాంకర్ ని, దాని వెనుక పోతూ డేవిడ్ నీ ఇలా చూపించాక- ఇక మూడో టూల్ సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన.

   ఈ టూల్ మూవ్ మెంట్స్ తోనే వుంటుంది. ఈ మూవ్ మెంట్స్ ని జాగ్రత్తగా పరిశీలిస్తే సమస్యని ఏర్పాటు చేసే దిశగా (నాల్గో టూల్) బిల్డప్ తెలుస్తుంది. ముందు ట్యాంకర్, వెనుక కారు. కారు దగ్గర్నుంచి లో యాంగిల్లో పుల్ బ్యాక్ చేస్తూ వస్తూంటే, దాని ఇంజన్ రొదతో  ట్యాంకర్ రాక్షస రూపం పూర్తిగా వెల్లడవుతుంది. ఈ కెమెరా పుల్ బ్యాక్ షాట్ ట్యాంకర్ ముందు భాగాన్ని భీకరంగా రివీల్ చేస్తూ ఎండ్ అవుతుంది. ఇప్పుడు కూడా ట్యాంకర్ నడుపుతున్న డ్రైవర్ కన్పించడు.

   ట్యాంకర్ డ్రైవర్ వెనుక వస్తున్న కారుని గమనించినట్టు సైడ్ ఇస్తాడు. స్పీడు పెంచి డేవిడ్ ముందు కెళ్ళిపోతాడు. రిలాక్స్ అవుతాడు. వెనుక వున్న ట్యాంకర్  విపరీతమైన స్పీడుతో వచ్చేసి ఓవర్ టేక్ చేసేస్తుంది. కొంత దూరం వెళ్ళాక మళ్ళీ సైడ్ ఇస్తుంది. డేవిడ్ ముందు కెళ్ళిపోయి పూర్తిగా రిలాక్స్ అయి రేడియో ప్రోగ్రామ్ వింటూ డ్రైవ్ చేస్తూంటే, సడెన్ గా చెప్పాపెట్టకుండా వచ్చేసి ట్యాంకర్ భీకరంగా  ఓవర్ టేక్ చేస్తూంటే అదిరిపడి కంట్రోలు చేసుకుంటాడు డేవిడ్. మళ్ళీ సైడ్ ఇచ్చేసరికి ముందు కెళ్ళి పోతాడు. ఇక వెనుక ట్యాంకర్ ఇప్పుడు కన్పించదు. కొంత దూరంలో పెట్రోల్ బంకులోకి కారుని తిప్పుతాడు డేవిడ్. బరబరా మంటూ వచ్చేసి అతడి పక్కనే ధడేల్మని ఆగుతుంది ట్యాంకర్.

   డేవిడ్ తల పైకెత్తి డ్రైవర్ ని చూడ్డానికి ప్రయత్నిస్తాడు. కన్పించడు. ఇంతలో కారు విండో గ్లాస్ మీద  వాటర్ పడి దృశ్యం బ్లర్ అయిపోతుంది. వాటర్ కొట్టిన బంక్ వర్కర్ అద్దాన్ని తుడుస్తూ వుంటాడు. డేవిడ్ పెట్రోలు కొట్టించుకుంటాడు. వర్కర్ ఇంజన్ చెక్ చేస్తానని బానెట్ ఎత్తి చూసి రేడియేటర్ పైప్ మార్చాలంటాడు. తర్వాత మారుస్తానంటాడు డేవిడ్. అటు కారు కిందనుంచి అటూ ఇటూ తిరుగుతున్న కాళ్ళు కన్పిస్తాయి. జీన్స్ షూస్ వేసుకున్న ట్యాంకర్ డ్రైవర్ కాళ్ళు. డేవిడ్ వర్కర్ దగ్గర కాయిన్స్ తీసుకుంటూ వుంటే ఒక్కసారిగా ట్యాంకర్ హారన్ వినిపిస్తుంది. డేవిడ్ అటు చూస్తాడు. డ్రైవర్ చెయ్యి మాత్రం కన్పిస్తుంది.

డేవిడ్ లోపలి కెళ్ళి ఫోన్ బూత్ లో ఇంటికి కాల్ చేస్తాడు. భార్యతో కాల్ మాట్లాడుతూ వుంటే, వాషింగ్ మెషీన్ డోర్ తో ఫ్రేమ్ ఇన్ ఫ్రేమ్ చేసి, ఆ చట్రం లోంచి చూపిస్తుంది కెమెరా డేవిడ్ ని.

   డేవిడ్ బయటి కొచ్చి వర్కర్ కి డబ్బులిస్తూంటే గట్టిగా హారన్ కొడతాడు ట్యాంకర్ డ్రైవర్. అటు వు రుకుతాడు వర్కర్. డేవిడ్ కారు స్టార్ట్ చేసి పోనిస్తాడు...

   ఇదీ బిగినింగ్ విభాగం స్ట్రక్చర్. ఇందులో మూడవ, నాల్గవ టూల్స్ .ద్వారా కథనం ఏం చేశాడు స్పీల్బెర్గ్ ఆలోచించండి. రేపు ఇచ్చే విశ్లేషణతో సరిపోల్చుకోండి.

—సికిందర్ 




Tuesday, June 7, 2022

1171 : తక్కువ బడ్జెట్ తో తంటాలు!


 











స్టీవెన్ స్పీల్బెర్గ్ లో- బడ్జెట్ సినిమా స్క్రీన్ ప్లే- మేకింగ్ సంగతులు రేపు!



Tuesday, May 24, 2022

1170 : స్పెషల్ ఆర్టికల్

 

    చార్య స్క్రీన్ ప్లే సంగతులు రెండవ భాగంలో ఒక చోట ఇలా చెప్పుకున్నాం - “ రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ లో  దివ్య శక్తులున్న ఆర్క్ ని దోచుకుందామని చూసే జర్మన్ నాజీల కేం గతి పట్టింది చివరికికాబట్టి  అమ్మవారితో వొక సూపర్ నేచురల్ హై పవర్ యాక్షన్ సీను కాగల కమర్షియల్ సందర్భాన్ని చేజార్చుకున్నారు. స్టార్ సినిమా కథకి థింక్ బిగ్ అనుకుంటే సరిపోదు, థింక్ హై అనుకోవాలి. రాస్తూంటే ఆ హై వచ్చేస్తూ వుండాలి” అని.

       చార్య ఆడలేదు. తర్వాత విడుదలైన సర్కారు వారి పాట బ్రేక్ ఈవెన్ కోసం స్ట్రగుల్ చేస్తూ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలా జరగడానికి కారణమేమిటి? రొటీన్ గా ఏ స్థాయిలో తెలుగు సినిమాలుంటున్నాయో అదే సోకాల్డ్ సేఫ్ జోన్ లో మళ్ళీ తీయడం. అంతకి మించి పైకి ఎదగకపోవడం. ఊహని విస్తరించక పోవడం. నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్ళక పోవడం. ప్రేక్షకులకి సరికొత్త అనుభవాన్నివ్వకపోవడం. చూసిందే చూపించే అదే రొటీన్, మూస, పాత ఫార్ములా - వీటినే నమ్ముకుని వుండడం. ఇలా బాక్సాఫీసు దగ్గర పరాభవాలెదురవుతున్నా మారకపోవడం. కరెన్సీ నోట్లు మారిపోయాయి, సినిమాలు మారడం లేదు. పాత నిల్వ సరుకు చూపిస్తూ కొత్త కరెన్సీ నోట్లు కోరుకుంటున్నాయి.   

        “... స్టార్ సినిమా కథకి థింక్ బిగ్ అనుకుంటే సరిపోదుథింక్ హై అనుకోవాలి. రాస్తూంటే ఆ ‘హై’ వచ్చేస్తూ వుండాలి అన్న కనువిప్పు ఇది వరకు ఈ వ్యాసకర్తకి లేదు. ఆచార్య స్క్రీన్ ప్లే సంగతులు  రాస్తూంటే అనుకోకుండా ఈ కనువిప్పు కల్గింది. కనువిప్పవడంతో ఆలోచన మొదలయ్యింది. మంచి సినిమాలు, చెడ్డ సినిమాలు అన్నీ ఆలోచింపజేస్తాయి క్వాలిటీ పరంగా. కనుక థింగ్ బిగ్ ఫిజికల్లీ యువర్స్ అనీ, థింక్ హై స్పిరిచ్యువల్లీ యూనివర్సల్ అనీ అర్ధం జేసుకుంటే సరిపోతుంది. అంటే థింక్ హై థింక్ బిగ్ కంటే విస్తారమైనదీ, శక్తిమంతమైనదీ అన్నమాట. థింక్ బిగ్ గురించి చాలా మోటివేషనల్ పుస్తకాలూ వీడియోలూ వున్నాయి. థింక్ హై అని గూగుల్ చేస్తే ఈ పేరుతో ఒక సాంగ్ మాత్రమే కన్పిస్తోంది.

ఐతే స్టార్ సినిమాలు థింక్ బిగ్ గా కూడా రావడం లేదు. స్టార్ సినిమాల్లో థింక్ బిగ్ అనేది టెక్నాలజీ పరంగా మాత్రమే వుంటోంది తప్ప కంటెంట్ పరంగా అదే సోకాల్డ్ సేఫ్ జోన్లో మూస తరగతే. మామూలు హీరోల సినిమా కథలే స్టార్ సినిమాలకుంటున్నాయి. కనుక థింక్ బిగ్ ని ఫిజికల్ అయినందుకు టెక్నాలజీకీ, థింక్ హై స్పిరిచ్యువల్ అయినందుకు కంటెంట్ కీ ఆపాదిస్తే, ఈ  ఫిజికల్- స్పిరిచ్యువల్ రెండిటి కాంబినేషన్ తో మంచి ఫలితాలు సాధించ వచ్చు. ఆఫ్టరాల్ స్క్రీన్ ప్లే అంటే తెరమీద చూపెట్టే మనిషి మానసిక లోకమే కాబట్టి- అంటే కాన్షస్ - సబ్ కాన్షస్ మైండ్ ల ఇంటర్ ప్లేనే కాబట్టి, ఇది స్పిరిచ్యువలే కాబట్టి, థింక్ హై ఇక్కడ కార్యాచరణలోకొస్తోంది.

దీనికేం చేయాలి?
        స్టోరీ ఐడియాల్ని వాడుకలో వున్న నిల్వ సరుకు నుంచి పుష్ చేసి ఇన్నోవేట్ చేయడమే. ఇమాజినేషన్ ని పుష్ చేసి, లేదా యాంటీగా ఆలోచించి, కొత్త పుంతలు తొక్కించడమెలా అన్నది ఇప్పుడు చూద్దాం.

        ఒక స్టోరీ ఐడియా లేదా కాన్సెప్ట్ ఎప్పుడు థింక్ బిగ్ అవచ్చు, ఎప్పుడు థింక్ హై అవచ్చు? హాలీ వుడ్ లాగ్ లైన్స్ (స్టోరీ ఐడియాలు) సెర్చి చేస్తూంటే ఏ క్వయిట్ ప్లేస్ అనే మూవీకి సంబంధించిన లాగ్ లైన్ థింక్ హైకి తార్కాణంగా కన్పిస్తోంది. చూస్తే ఇది 2018 లో 17 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో స్మాల్ మూవీ, కానీ బాక్సాఫీసు వచ్చేసి 341 మిలియన్ డాలర్ల గ్రాండ్ ఈవెంట్ గా వుంది!

        ఆలోచించాలి- ఎక్కడ 17, ఎక్కడ 341?మామూలుగా అయితే 17 మిలియన్ డాలర్ల ఈ స్మాల్ బడ్జెట్ మూవీకి లాగ్ లైన్ లేజీగా ఇలా వుండొచ్చు- అణుయుద్ధానంతరం నరమాంస భక్షక గ్రహాంతర జీవుల్ని తప్పించుకోవడానికి ఓ కుటుంబం ఇంట్లో తలుపులేసుకుని బందీ అయిపోయింది. ఈ స్టోరీ ఐడియా హైకాన్సెప్ట్ - బిగ్ బడ్జెట్ మూవీ స్క్రీన్ ప్లేకి కూడా బాగానే అన్పించ వచ్చు.  గ్రహాంతర జీవుల నుంచి రక్షించుకునే కథ. గ్రహాంతర జీవుల మీద ఎన్నో సినిమాలొచ్చాయి, ఇది డిఫరెంట్ గా ఏముంది? రొటీన్ గా ఏ స్థాయిలో ఇలాటి సినిమాలుంటున్నాయో అదే  సోకాల్డ్  సేఫ్ జోన్ లో ఇదీ వుందని లాగ్ లైన్ చూస్తే తెలిసిపోతోంది. ఇంతకి మించి పైకి ఎదగ లేదు. ఊహని విస్తరించుకో లేదు. నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్ళ లేదు. ప్రేక్షకులకి సరికొత్త అనుభవాన్నివ్వలేదు. చూసిందే చూపించే అదే రొటీన్, మూస, పాత ఫార్ములా - వీటినే నమ్ముకుని వుంది. కాబట్టి ఈ ఐడియాతో  ఎంత హైకాన్సెప్ట్ - బిగ్ బడ్జెట్ మూవీ తీసినా మూడో రోజుకల్లా కలెక్షన్స్ డ్రాప్ అవుతాయి.

        ఎందుకంటే ఇది టెక్నాలజీ పరంగా మాత్రమే ఫిజికల్లీ థింక్ బిగ్ కాబట్టి. కంటెంట్ పరంగా థింక్ హై ఆత్మ దీనికి లేదు కాబట్టి. థింక్ హై ఆత్మతో వుంటే కలెక్షన్స్ ని పిండుకుంటుంది. ఇదే చేసింది ఏ క్వయిట్ ప్లేస్’.

        ఏ క్వయిట్ ప్లేస్ లాగ్ లైన్ అసలేమిటంటే, అణుయుద్ధానంతరం వినికిడి శక్తి ఎక్కువున్న గుడ్డి నరమాంస భక్షక గ్రహాంతర జీవుల్ని తప్పించుకోవడానికి, ఓ కుటుంబం ఏ మాత్రం అలికిడి లేకుండా, ఎట్టి పరిస్థితిలో నోట్లోంచి మాట బైటికి రానివ్వకుండా తలుపులేసుకుని ఇంట్లో బందీ అయిపోయింది

        ఈ లాగ్ లైన్లో ఎంత సస్పెన్స్ వుంది, ఎంత థ్రిల్ వుంది. కేవలం రొటీన్ గా చూపించే గ్రహాంతర జీవులని గుడ్డి జీవులుగా చేసి, అధిక వినికిడి శక్తిని కల్పించడంతో కథే మారిపోయింది. కళ్ళు లేకపోయినా శబ్దం వింటే చంపేస్తాయి. నెక్స్ట్ లెవెల్ కెళ్ళిపోయింది కథ. తెలిసిన స్టోరీ లైనునే మెలిదిప్పితే కొత్త లైను అయిపోతుంది. ఇదే థింక్ హై టెక్నిక్.

        అశోకవనంలో అర్జున కళ్యాణం రొటీన్ లైనే. 33 ఏళ్ళు వచ్చినా హీరోకి పెళ్ళికాకపోవడం, పెళ్ళి ప్రయత్నాలు చేసుకోవడం కథ. ఈ లైనుతో ఇదివరకు సినిమాలొ చ్చేశాయి. ఈ కొత్త సినిమా కొత్తగా ఏం చూపించి బాక్సాఫీసు దగ్గర నిలబడింది? ఫ్లాప్ గానే మిగిలింది.

         33 ఏళ్ళు వచ్చినా పెళ్ళి  కానివాడు తనలాంటి ఇతరుల పెళ్ళిళ్ళు  చేయబూనాడు  అని లాగ్ లైన్ వుంటే కొత్త సినిమా అవుతుంది. రొటీన్ కి యాంటీగా ఆలోచించినప్పుడు థింక్ హై అవుతుంది. తన పెళ్ళి కోసం తను పాట్లు పడేవాడు కింది స్థాయి క్యారెక్టర్, తన పెళ్ళి కాకపోయినా ఇతరుల పెళ్ళిళ్ళు  చేసేవాడు పై స్థాయి క్యారెక్టర్. క్యారక్టర్ పై స్థాయిలో వుంటే కథ కూడా పై స్థాయిలో వుంటుంది.

రొటీన్ పాయింట్లు అనేవి నిల్వ సరుకు. నిల్వ సరుకుని వేడి చేసి అందిస్తే వర్కౌట్ అయ్యే రోజులు కావివి. అశోక వనంలో అర్జున కళ్యాణం కూడా పాత లైనుకి వేడి చేసిన  ఫ్రెష్ గా అన్పించే సీన్లే. ఫలితం ఏమైంది? స్టోరీ ఐడియాల్ని హై థింకింగ్ తో కథగా మార్చినప్పుడే నిజమైన ఫ్రెష్ సీన్లు వస్తాయి.

        స్టోరీ ఐడియా థింక్ హై గా వుండాలంటే ఈ  నాల్గిటిని కూడా థింక్ హైగానే   ఆలోచించాలి :  హీరో, హీరో గోల్, కాన్ఫ్లిక్ట్, సొల్యూషన్. రెగ్యులర్ హీరో, రెగ్యులర్ హీరో గోల్, రెగ్యులర్ కాన్ఫ్లిక్ట్, రెగ్యులర్ సొల్యూషన్ లతో సినిమాలుంటాయి. ఈ రెగ్యులర్ కి వ్యతిరేకంగా ఆలోచించినప్పుడు హీరో, గోల్, కాన్ఫ్లిక్ట్, సోల్యూషన్ హై లెవెల్లో కొత్తగా మారిపోతాయి. రిజర్వాయర్ డాగ్స్' లో దొంగలు దోపిడీ ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ విఫల మవుతుంది. అప్పుడు తమలో ఒకడు పోలీస్ ఇన్ఫార్మర్ వున్నాడని అనుమానిస్తారు. ఇది రెగ్యులర్. తమలో ఒకడు గాంధేయ వాది వున్నాడని అనుమానిస్తే? దొంగలందరూ  గాంధేయ వాదులుగా మారిపోతే? ఇదేదో కొత్త కామెడీ అవుతుంది. ఉన్నదానికి వ్యతిరేకం (యాంటీ) గా ఆలోచిస్తే థింక్ హై అయిపోతుంది. కాకపోతే యూనివర్సల్ స్పిరిచ్యువల్ టచ్ ఇవ్వాలి. గాంధేయ వాదులుగా మారడం యూనివర్సల్ స్పిరిచ్యువల్ టచ్చే. తన పెళ్ళి కాకుండా ఇతరుల పెళ్ళిళ్ళు చేయడం యూనివర్సల్ అప్పీలున్న స్పిరిచ్యూవల్ టచ్చే...

—సికిందర్


Sunday, May 22, 2022

1169 : సండే స్పెషల్

    సలు రాయాలంటే ముందు వామప్ (warm up) అవాలి. జిమ్ము కెళ్ళి బరువు లెత్తబోతే, జిమ్ ట్రైనర్ వచ్చేసి ముందు నీ బాడీని వామప్ చేసుకోమంటాడు. అంటే ఎకాఎకీన ఎత్తబోయిన బరువు శరీరం మీద పడి కండరాలు షాక్ కి గురవకుండా, నువ్వీ బరువెత్తబోతున్నావూ అని ముందస్తుగా కండరాలకి కౌన్సెలింగ్ చేసుకోవడమన్నమాట. కానీ రూములో రైటర్ రాయడానికి కూర్చున్నప్పుడు  మాత్రం అలాటి వామప్పులూ ఏవీ వుండవు. స్క్రిప్టు  రాయడం మొదలెట్టాడంటే వరసబెట్టి  సీన్లే రాసేస్తూంటాడు. జిమ్ములోలాగే రాయడానికి రూములో కూడా వామప్ చేసుకోవడం మనస్కరించదు. రాస్తున్న విషయానికి సంబంధించి ఏ విషయ సేకరణా (వామప్) వుండకపోతే, ఏ క్షేత్ర స్థాయి పరిస్థితుల పరిశీలనా (వామప్) వుండక పోతే, ఏవో వూహలు అల్లేసుకుంటూ తలోకంలో తాము ఆత్మకథ రాసుకోవడమే.  క్షేత్ర స్థాయిలో అంటే - పంపిణీ రంగంలో, ప్రేక్షక రంగంలో- జయాపజయాల కదనరంగంలో- ఇతర భాషా రంగాల్లో - పరిస్థితులేమిటో తెలుసుకోకుండానే గొప్ప వ్యాపారాత్మక  సినిమా స్క్రిప్టు రాయడం ఎలా సాధ్యం?

    బ్యాడ్ రైటింగ్ అంతా వామప్ కి ఎగనామం పెట్టే దగ్గరే మొదలవుతుంది. ఒక వస్తువు కొనాలన్నా నాల్గు చోట్ల వాకబు చేసి కొంటాం. కానీ  ఒక స్క్రిప్టు రాయాలంటే ఏ వాకబూ వుండదు. ఇప్పుడు నేనీ స్క్రిప్టు రాస్తున్నాను, దీన్నిప్పుడు ప్రేక్షకులు చూస్తారా, ప్రేక్షకులు ఎలాటివి చూస్తున్నారు, ఎలాటివి చూసి చూసి విసిగి పోయారు, కొత్తగా ఏం కోరుకుంటున్నారు, అసలు సినిమా ప్రేక్షకులుగా ఇప్పుడెవరున్నారు, మొదటి రోజు మొదటి ఆటకి వచ్చే ప్రేక్షకులెవరు, వాళ్ళ అభిరుచులేమిటి, వాళ్ళ అభిరుచులకి ఏ సామాజికార్ధిక పరిస్థితులు దోహదం చేస్తున్నాయి, ఏ సామాజికార్దిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని నేను రాయాలి, నేను రాయాలంటే సదా స్మరించుకోవాల్సిన  యూత్ అప్పీల్ అంటే ఏమిటి, ఆ యూత్ అప్పీల్ కి అబ్బాయిలే వున్నారా, అమ్మాయిలు కూడా వుంటున్నారా ప్రేక్షకుల్లో, ఎంత మంది అమ్మాయిలు  కొత్త దర్శకుల స్మాల్, మీడియం బడ్జెట్ సినిమాలకి వస్తున్నారు, రాకపోతే అబ్బాయిల కోసమే వేటిని దృష్టిలో పెట్టుకుని ఏ కల్చర్లో, ఏ జానర్లో  స్క్రిప్టులు రాయాలి...


        అసలు తెలుగు సినిమాల విజయాల రేటెంత, ఏ  సినిమాలు ఎందుకు ఫ్లాపవుతున్నాయి, ఎందరు కొత్త దర్శకులు వస్తున్నారు, వాళ్ళందరూ ప్లాపై వెళ్లిపోతూంటే నాకూ అదే పరిస్థితి వస్తుందా, అలా నాకు భయం వేయడం లేదా, ఎందుకు వేయడంలేదు, నా సొమ్ము కాదనా, ఫ్లాపవుతున్న వాళ్ళు చేస్తున్న తప్పులేమిటి, వాటిని నేనెలా నివారించుకోవాలి, వాళ్ళల్లో రచయితే వాళ్లకి శత్రువై పోతున్నాడా, అలాటి రచయితే  నాలో కూడా వున్నాడా,  ఐడియా నుంచీ డైలాగ్ వెర్షన్ దాకా నాకు తెలిసిందెంత, నా చుట్టూ వుండి సలహాలిచ్చే నా ఏజి గ్రూపు వాళ్ళ విషయ పరిజ్ఞానమెంత,  నూటికి నూరు శాతం ఫ్లాప్స్ ఖాయంగా ఏడాది కేడాది కళ్ళెదుట కన్పిస్తున్నప్పుడు నేను హిట్టివ్వగలనని ఏ ప్రాతిపదికన నమ్ముతున్నాను, అసలు నేను చేస్తున్న సబ్జెక్టు ప్రాతిపదికేమిటి, ప్రపంచంలో సినిమాలెన్ని రకాలు, కమర్షియల్ సినిమాలు, వరల్డ్ (ఆర్ట్) సినిమాలు అనే రెండు రకాలున్నాయని నాకు తెల్సా, వీటిలో మొదటి రకమే తెలుగులో పనికొస్తాయని నేనెప్పుడైనా ఆలోచించానా, స్క్రిప్టు కావల సినిమా ప్రపంచానికి సంబంధించి నా జనరల్ నాలెడ్జి ఎంత, నా స్క్రిప్టుకి శాస్త్రీయంగా స్ట్రక్చర్ లోవుంటూ అలరించే కమర్షియల్ సబ్జెక్టు ఎంచుకుంటున్నానా, లేక స్ట్రక్చర్ లేకుండా అశాస్త్రీయంగా వుంటూ తెలుగు ప్రేక్షకులకి సహన పరీక్షపెట్టే వరల్డ్ (ఆర్ట్)  మూవీస్ లాంటి ప్రయోజనంలేని సబ్జెక్టు చేస్తున్నానా,  నిర్మాత డబ్బుతో నా కళా తృష్ణ తీర్చుకోవడానికి వరల్డ్ (ఆర్ట్) మూవీ బాపతు స్క్రిప్టు రాసి నేనూ బరితెగించి నా వూళ్ళో ముఖం చూపించుకోలేని సినిమా అజ్ఞాని అనిపించుకోబోతున్నానా  ఒకవేళ...

        సినిమాలెక్కువగా ఎందుకని ఓన్ రిలీజ్ చేసుకోవాల్సి వస్తోంది, విషయం లేకపోతే  ఓన్ రిలీజ్ తప్పదా, ఓన్  రిలీజ్ అంటే ఆశలు వదులుకోవడమేనా, నిర్మాత ఓన్ రిలీజ్ కి సిద్ధపడక మూల పడేస్తే నా గతేంటి, ఇంకో సినిమా అవకాశం వస్తుందా, అసలీ కష్టాలెందు కొస్తున్నాయి, స్క్రిప్టు రాయడానికి ముందు తగు విధంగా వామప్ చేసుకోక పోవడం వల్లేనా...

        భారతదేశంలో మొత్తం ఎన్ని ప్రాంతీయ -  ఉపప్రాంతీయ సినిమా రంగాలున్నాయో -  అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలేమిటో నాకేమైనా తెలుసా, తెలుసుకోవడానికి ప్రయత్నించానా, ఎవరితోనైనా చర్చించానా, తుళు (టులు వుడ్) - బడుగ- కొంకణి - మీరట్ (మాలీవుడ్) - నాగపురి (ఝాలీవుడ్ ) -సంథాలీ (ఝాలీవుడ్) - డోగ్రీ- లడఖీ (పహారీవుడ్) - అస్సామీ (జాలీవుడ్) – ఒరిస్సా (ఓలీవుడ్) - చత్తీస్ ఘర్ (చోలీవుడ్)- గుజరాత్ (ఘోలీవుడ్) - భోజ్ పురి... ఇలా 30 దాకా ప్రాంతీయ, ఉప ప్రాంతీయ సినిమా పరిశ్రమలున్నాయని నాకెప్పుడైనా తెలుసా, ప్రాంతీయ- ఉపప్రాంతీయ సినిమాలంటేనే ఒకప్పుడు సామాజిక సమస్యలతో కూడిన వాస్తవిక (ఆర్ట్) కథా చిత్రాలే అయినప్పటికీ  అవన్నీ గత రెండు దశాబ్దాల కాలంలో ప్రపంచీకరణతో కొత్త తరం ప్రేక్షకులందుకున్న సరికొత్త అభిరుచులతో, జీవనశైలులతో పక్కా కమర్షియల్- మాస్- రోమాన్స్- కామెడీ – యాక్షన్ సినిమాలుగా మారిపోయి- సొమ్ములు చేసుకుంటున్న పరిణామ క్రమాన్ని నేనెప్పుడైనా గ్రహించానా...

        ఈ లోతట్టు ప్రాంతీయ - ఉప ప్రాంతీయ సినిమాలు చూసే ప్రేక్షకుల్లోనే ఇంత మార్పు వచ్చిందంటే, నేనింకా తెలుగు ప్రేక్షకులు నేను తీసే నాన్ కమర్షియల్ వరల్డార్టు సినిమాలు చూస్తారని ఎందుకు అనుకుంటున్నాను, తక్కువ మార్కెట్  గల ప్రాంతీయ -ఉపప్రాంతీయ రంగాల్లో తక్కువ బడ్జెట్లతో కమర్షియల్ సినిమాలు తీసి మూడు నాల్గు రెట్లు లాభాలెలా గడిస్తున్నారో ఎప్పుడైనా పరిశీలించానా, ఝార్ఖండ్ లో సినిమాలు తీస్తే రెండు కోట్లు సబ్సిడీ ఇస్తున్నారనీ -బాలీవుడ్ మేకర్లు ఝార్ఖండ్ బాట పడుతున్నారనీ నాకేమైనా తెల్సా, మొత్తం సినిమా వ్యవస్థని పరిశీలించకపోతే, అవగాహనా లేకపోతే  నేను మూవీ మేకర్ నెలా అవుతాను, స్క్రిప్టు రాయడానికి నేనేం పనికొస్తాను...

        నేను రాయబోయే సబ్జెక్ట్ ఏమిటి, దాని గురించి ఏం రీసెర్చి చేశాను, ప్రేమ సినిమా తీయాలన్నా సబ్జెక్టుని బట్టి రీసెర్చి తప్పని సరని నాకేమైనా తెల్సా,  దేని మీద ఆధారపడి సబ్జెక్టుకి ఐడియా అనుకుంటున్నాను, చూసిన తెలుగు సినిమాల నుంచి మృతప్రాయమైన మూస ఫార్ములా ఐడియాలు తీస్తున్నానా, లేక చుట్టూ ప్రపంచంలోకి చూసి మరింత డైనమిక్ గా  నాన్ ఫార్ములాయిక్ ప్రాక్టికల్ ఐడియాలు తీస్తున్నానా, ఒకప్పటి సినిమాల్లోలాగే ఇప్పుడు కుటుంబాలున్నాయా, ప్రేమలున్నాయా, పరిస్థితులున్నాయా...

        నేను రాసే సీన్లు -  డైలాగులు వచ్చిన సినిమాల్లో వచ్చినంత మంది వాడేసిన ఎంగిలి – టెంప్లెట్ సీన్లేనా -  డైలాగులేనా - లేక సొంతంగా నేనేమైనా సృష్టించి నాదంటూ వొక ముద్ర వేస్తున్నానా, నేను చూడడానికి - సినిమాగా తీయడానికి - విజువల్ గా స్క్రిప్టు రాస్తున్నానా, లేక చదువుకోవడానికి - చదువుకుని దిండు కింద పెట్టుకోవడానికి  మాత్రమే వ్యాసంలాగా స్క్రిప్టు రాస్తున్నానా,  నా సబ్జెక్టు ఏ జానర్ కిందికొస్తుంది, ఆ జానర్ మర్యాదలు నాకేమైనా తెల్సా, లేక గుండుగుత్తగా కలిపి కొట్టేస్తున్నానా, నేనేనుకున్న ఐడియా రఫ్ గా  మనసులోనే వుందా,  లేక స్పష్టంగా ముందు దాన్ని కాగితం మీద వర్కౌట్ చేశానా, నా ఐడియాలో కథే వుందా, లేక కమర్షియల్ సినిమాలకి పనికిరాని  గాథ వుందా, నా కమర్షియల్ ఐడియాని మూడు వాక్యాల్లో స్క్రీన్ ప్లే పాయింటాఫ్ వ్యూలో నిర్మించుకున్నానా, నిర్మించుకున్నాక స్క్రీన్ ప్లే పాయింటాఫ్  వ్యూలో సినాప్సిస్ రాసుకున్నానా, రాసుకున్నాక దాని ఆధారంగా వన్ లైన్ ఆర్డర్ వేస్తున్నానా, లేక ఇవన్నీ డుమ్మాకొట్టి పని దొంగలా మొక్కుబడి స్క్రిప్టు రాసి - రెండు కోట్లు బడ్జెట్ ఆశిస్తూ నిర్మాతల చుట్టూ తిరుగుతూ విఫలయత్నాలు చేస్తున్నానా...

        అసలు నాకు సినాప్సిస్ రాయడం వచ్చా, ఎప్పుడైనా నేనొక సినిమా చూసి ఒక పేజీలో క్లుప్తంగా  దాని కథ రాయగలిగానా, రెండు నిమిషాల్లో ఎవరికైనా ఆ సినిమా కథ  చెప్పగల్గానా, అసలు నేను అసిస్టెంట్ అవకముందు - అయ్యాకానూ -  ఏనాడైనా వివిధ జానర్లలో నా ఊహా శక్తినీ, నా కల్పనా శక్తినీ, నా సృజనాత్మక శక్తినీ  పరీక్షించుకుంటూ, సింగిల్ పేజీ మినీ కథలు రాసుకున్నానా...నేను ఇంటలిజెంట్ రైటర్నా, లేక లేజీ - అవుట్ డేటెడ్ రైటర్నా...

        ఇవీ వామప్ కి బారులు తీరే ప్రశ్నాస్త్రాలు. ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకోలేకపోతే స్క్రిప్టు రాయాలనే ఆలోచన వృధా అనుకోవాలి. ఈ వామప్ చేసుకున్నాకే స్క్రిప్టు రాయడం మొదలెట్టడానికి రెండో మెట్టు- స్క్రీన్ ప్లే సంగతులు తెలుసుకోవడం. వామప్ చేసుకోకపోతే  స్క్రీన్ ప్లే సంగతులు కూడా అనవసరం. అవి తెలుసుకుని ప్రయోజనం లేదు.

సికిందర్