రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, March 30, 2018

630 : సందేహాలు - సమాధానాలు




Q :    కథ ప్రారంభిస్తూ విలన్ చేసే నేరాన్నిచూపించి టైటిల్స్ వేశాక, హీరో ని ప్రవేశ పెట్టి,  వెంటనే ఆ విలన్ మీదికి హీరోని  ప్రయోగిస్తే తప్పవుతుందా? ఎలా తప్పవుతుందో వివరించగలరు.
పేరు వెల్లడించ వద్దన్న దర్శకుడు
 
A :   ఇది క్రియేటివ్ స్కూలుతో వచ్చే సమస్య. ఇది కథనంలో వుండే డైనమిక్స్ ని చూడదు. సస్పెన్స్,  థ్రిల్, ఫోర్ షాడోయింగ్ మొదలైన ఎన్నో టెక్నిక్స్ ని  పట్టించుకోదు. అసలు ప్రేక్షకుల్నే పట్టించుకోదు. పట్టించుకోదనడం కంటే పట్టించుకోవాలని తెలీదనడం కరెక్టు. ఇప్పుడు కథలు చేస్తున్నవాళ్లు తమ టీనేజీలో,  అంటే గడచిన పది పదిహేనేళ్ళ కాలంలో, తెలుగులో చూస్తూ వస్తున్నవి కేవలం ప్రేమ సినిమాలు, లేదా స్టార్ ఫార్ములా యాక్షన్ సినిమాలు, ఇంకా వుంటే ఈ మధ్య హార్రర్ కామెడీలే. వీటి ప్రభావంలో పెరిగిన వాళ్లకి మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ కథలు చేయడం రావడం లేదు. వీటిని ప్రేమ సినిమాల ధోరణిలో తమ క్రియేటివిటీని  జోడించి తోచినట్టూ చేసేస్తున్నారు. క్రియేటివ్ స్కూల్లో స్ట్రక్చర్ ఆలోచన వుండదు. తోచింది చేసుకుపోవడమే. అది రాణించదు. స్ట్రక్చర్ స్కూల్లో స్ట్రక్చర్ తో బాటు క్రియేటివిటీకూడా వుంటుంది. ఇది రాణిస్తుంది. ఇక్కడ ఫ్లాపవడానికి స్క్రిప్టేతర కారణాలేమైనా వుంటే వుండచ్చేమో గానీ, స్ట్రక్చర్ స్కూల్ వల్ల ఫ్లాపయితే కావు. 

          ఇంకో ఇద్దరితో ఇదే సమస్య వుంది. మీరన్నట్టు, కథ ప్రారంభిస్తూ విలన్ చేసే నేరాన్నిచూపించి టైటిల్స్ వేశాక, హీరో ని ప్రవేశ పెట్టి,  వెంటనే ఆ విలన్ మీదికి హీరోని  ప్రయోగించడం.  ఇది  ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పడబోయే సమస్యకి వెంటనే కథనాన్ని ప్రారంభించడమన్న మాట. చాలాసార్లు ‘శివ’ని ప్రస్తావిస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు. ‘శివ’  ఓపెనింగ్ లో భవానీ అనుచరుడు కాలేజీ కొచ్చి ఒక విద్యార్థిని చంపుతాడు. టైటిల్స్ పడతాయి. ఆతర్వాత శివ పాత్ర ఎంటరవుతుంది. అప్పుడు – ‘ఎవడ్రా కాలేజీ కొచ్చి స్టూడెంట్ ని చంపిందీ?’ అని శివ అరుపులు అరిచి, వెంటనే  విలన్ వేటలో పడితే ఎలా వుండేది? దాన్ని ‘శివ’ కాదుకదా, అసలు సినిమా అంటారా? ఇలాటి సినిమాలు తీయాలని స్ట్రక్చర్ స్పృహ లేని క్రియేటివ్ బుద్ధి మాత్రమే ఆలోచిస్తుంది.

          అంటే అప్పుడే ప్లాట్ పాయింట్ వన్ కొచ్చేయడమన్న మాట కథనం. అసలు ప్లాట్ పాయింట్ వన్ కి ఎప్పుడు చేరుకుంటుంది కథనం?  ఈ బిగినింగ్ విభాగం బిజినెస్ ఏమిటి? ముందు పాత్రల పరిచయం చేయాలి, కథా నేపధ్యమేమిటో సృష్టించాలి,  ప్లాట్ వన్ దగ్గర తలెత్తబోయే సమస్యకి పరిస్థితుల కల్పన చేసుకుంటూ పోవాలి, అప్పుడు కథనాన్ని సమస్యలో పడేసి,  హీరో గోల్ తో ప్లాట్ పాయింట్ వన్ ని ఏర్పాటు చేయాలి కదా? అప్పుడు అదొక కథలా,  కథనంలా వుంటుంది కదా? ఇలా స్ట్రక్చర్ ని కాదనుకున్నప్పుడే సమస్య వస్తోంది. ఐతే సమస్యేమిటంటే అది తప్పని తెలుసుకోలేకపోవడమే. మీ కథ బిగినింగ్ విభాగాన్ని స్ట్రక్చర్ రీత్యా మార్చి చూస్తే అన్ని సమస్యలూ తీరిపోతాయి.  

 Q :   మేంపని చేసే దర్శకుల దగ్గర గానీ, కథలు చేసుకునే మా స్నేహితుల దగ్గర గానీ, స్ట్రక్చర్ గురించి మాట్లాడితే గొడవలవుతున్నాయి. అందరి కథల్లో మిడిల్ మటాష్, పాసివ్ పాత్రలు, ఎండ్ సస్పెన్స్ , సెకండాఫ్ సిండ్రోము లుంటున్నాయి, వాటి గురించి చెప్పినా విన్పించుకోవడం లేదు. పైగా మమ్మల్ని దూరం పెడుతున్నారు.
విడివిడిగా ముగ్గురు అసోషియేట్ల ప్రశ్న
          మీ ముగ్గురికీ ఎప్పట్నించో చెప్తున్నాం. అయినా మీరలాగే చేస్తూంటే మిమ్మల్ని బ్యాన్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ ఒకరు ప్రొడక్షన్ సమయంలో  స్థానం గల్లంతు చేసుకుని మళ్ళీ ఇంకో చోటా ఇలాగే  చేస్తున్నారంటే  మీరు మారరు.  మీరు స్ట్రక్చర్ గురించి నేర్చుకున్నది దర్శకులకో, స్నేహితులకో నేర్పడానికి కాదు. మీరెప్పుడైనా  సినిమా చేస్తేగీస్తే స్వయంగా అమలు పర్చుకోవడానికి. కాబట్టి ఇప్పుడు సినిమాలకి పనిచేస్తే మేకింగ్ నేర్చుకోవడానికి మాత్రమే పని చేసుకోవాలి. దర్శకుల ఆలోచనాధారల్లోకి వెళిపోయి ఆ మేరకు కథల్లోమీకు తోచిన బెటర్ మెంట్లు వుంటే చెప్పుకోవాలి.  మీ స్ట్రక్చర్ ఆలోచనాధార తెచ్చి అడ్డం పెట్ట కూడదు. వాదించ కూడదు. మీ స్థానాలు గల్లంతై పోతాయి. మీరు దర్శకులకి శిష్యులేగానీ పాఠాలు చెప్పే గురువులు కారు. ఇక స్నేహితులే కదాని వాళ్ళమీద అధికారం చెలాయించవచ్చని కూడా అనుకోవద్దు. ఎవరిష్టమొచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు, తీసుకుంటారు. ఒకవేళ స్నేహితులకి దర్శకులయ్యే  అవకాశం వచ్చి వాళ్లకి  మీరు పనిచేసినా, అప్పుడు కూడా నేర్పుడు కార్యక్రమం పెట్టుకోవద్దు. వాళ్ళ ఆలోచనాధారలోనే  పనిచేసి సేదదీరండి. స్ట్రక్చర్ ని ఇంటిదగ్గర పెట్టుకుని మీరు చేయాల్సి వచ్చినప్పుడు బయటికి తీయండి. ఇంకెప్పుడూ రాత్రిళ్ళు ఫోన్లు చేసి, పనిచేసే చోట స్క్రిప్టుల్లో ఘోరాలు జరిపోతున్నాయని నెత్తీనోరూ కొట్టుకోకండి. మీకంత అవసరం లేదు. మీ సీను మీరు సినిమా చేస్తున్నప్పుడు మొదలవుతుంది.

 Q :   నందమూరి బాలకృష్ణ ఇంకా టెంప్లెట్ సినిమాలే చేయక తప్పదంటారా? మార్చి తీస్తే ఆయనకు నప్పదంటారా?
పి. తిరుపతి రాజు, అసోషియేట్
 A :   ఇప్పుడు ‘భారతీయుడు’ లాంటి సినిమా వుంది. దాన్ని టెంప్లెట్ లో పెట్టి తీయలేరుగా? అయినా పెద్ద హిట్టయిందిగా? మరి అలాటి మేకింగ్ లో కాల్పనిక కథలు, పాత్రలు చేయడానికి బాలకృష్ణ ముందుకు రావాలిగా?  గత రెండు దశబ్దాలుగా మారని అవే బాషా – ఫ్యాక్షన్ ఫార్ములా టెంప్లెట్ లోనే వుండిపోయారు. మారిందేమిటంటే,  అప్పటికీ ఇప్పటికీ బడ్జెట్లే. అప్పటి కాలం చెల్లిన టెంప్లెట్ లని కూడా ఇప్పటి భారీ బడ్జెట్లతో తీస్తున్నారు. ఆయన ఆలోచించుకుని మార్చమని చెప్తే తప్ప ఆయన సినిమాలు మారే అవకాశం లేదు.  ‘శాతకర్ణి’ లాంటి చారిత్రికాలతో, ఇప్పుడు ‘ఎన్టీఆర్’ లాంటి బయో పిక్ లతో వేరు.  ఇలాటివి కనీసం ఏడాదికొకటి చేసినా మూస టెంప్లెట్ ల బాధ వదుల్తుంది.

Q :    ‘రంగస్థలం’ మూవీ స్టోరీ ఎనాలిసిస్ (ఒక వారం తర్వాతైనను) మీ వీలుని బట్టి మీ బ్లాగ్ లోమా వంటి ఔత్సాహికుల కోసం అందించగలరా?
ఆనంద్ త్రివేది, రచయిత
 
A :   రివ్యూలు, ఎనాలిసిస్ లు ఇకపైన వుండబోవని తేల్చి చెప్పేశాక కూడా మీ లాంటి వారు ఇంకా అడుగుతూనే వున్నారు. కొందరైతే అల్లాడిపోతున్నారు. ఒకవైపు స్క్రిప్టులు చేయడం వైపు లాగుతారు, ఇంకో వైపు రివ్యూలు రాయాలంటారు. రెండూ ఎలా కుదురుతాయి? ఏదో ఒకటే చేయాలి. ఒకవైపు స్క్రిప్టులు చేస్తూ, ఇంకో దర్శకుడి సినిమా చూసి వరస్ట్ గా వుందని ఎలా రివ్యూ రాయగలం. గొడవలవకుండా వుంటాయా? ఇన్నాళ్ళకి వచ్చి కొత్తగా గొడవలు పెట్టుకోవడం అవసరమా? మీరే వున్నారు. ఒక సినిమాకి రచన  చేస్తూ, ఇంకో సినిమా చూసి వరస్ట్ గా వుందని పోస్టు పెట్టగలరా?  ఒక దర్శకుడెవరైనా ఇంకో దర్శకుడి సినిమా చూసి, వరస్ట్ గా వుందబ్బా అని స్టేట్ మెంట్ ఇస్తారా?  కాబట్టి ఒకవేళ స్క్రిప్టులు చేస్తూ రివ్యూలు రాయాల్సి వస్తే, అవి ఆహా ఓహో అని ఆకాశానికెత్తేసేలానే వుంటాయి తప్ప విమర్శనాత్మకంగా (మనవరకూ నిర్మాణాత్మకంగా) వుండవు, కాబట్టి మీకుపయోగపడవు. 

          అసలు అన్నేసి సినిమాలకి రివ్యూలు రాసి రాసి వున్నాకా, అన్నేసి తప్పొప్పులు చెప్పేశాక,  ఇంకా రివ్యూలు అవసరమా? తప్పొప్పులేమిటో, అవెలా వుంటాయో  ఈపాటికి తెలిసిపోయే వుండాలిగా? ఇప్పుడు ‘రంగ స్థలం’ చూస్తే  మీబోటి వారు అందులో తప్పొప్పులేమిటో చెప్పేయగల్గాలిగా? మళ్ళీ ప్రత్యేకంగా ఎవరో రివ్యూరాస్తేనే తెలుసుకోగలమనుకుంటే, ఇన్నాళ్ళూ చదివి తెలుసుకున్న దేమిటి?  సినిమాలు తీసే సంగతి తర్వాత, సినిమాలు చూసే విషయంలో కూడా ఇంకా ఎక్స్ పర్ట్ లవకపోతే ఎలా? 

          కాబట్టి ఇక తెలుగు, హిందీ సినిమాల రివ్యూలు పక్కన బెట్టి, స్ట్రక్చర్ కి పేర్గాంచిన హాలీవుడ్ సినిమాలని విశ్లేషిద్దాం. కొన్ని స్ట్రక్చర్ లో వున్న పాత మంచి తెలుగు సినిమా లుంటే (బ్లాక్ అండ్ వైట్ అయినా సరే) వాటి ఎనాలిసిస్ చేద్దాం. కొత్త తెలుగు, హిందీ సినిమాల విషయం ఇక మర్చిపోదాం.

సికిందర్








Monday, March 26, 2018

629 : రైటర్స్ కార్నర్



          రాసే వాళ్లకి తీసే వాళ్ళ కష్టం తెలీదు. తీసే వాళ్లకి రాసే వాళ్ళ కష్టం తెలీదు. రెండూ చేసేవాళ్ళకి రెండూ తెలుస్తాయి. ఐతే తీయడం కంటే రాయడమే కష్టమంటారు క్రిస్టఫర్ మక్కోరీ. ‘యూజువల్ సస్పెక్ట్స్’ కి ఆస్కార్ అవార్డు పొందిన రచయిత తను. దర్శకుడు బ్రయాన్ సింగర్ కి రెగ్యులర్ రచయిత అయిన తను ఆయనతో కలిసి ‘పబ్లిక్ యాక్సెస్’, ‘వాకిరీ’, ‘జాక్ ది జెయింట్ స్లేయర్’, ‘ఎడ్జ్ ఆఫ్ టుమారో’   స్క్రీన్ ప్లేలు రాశారు.  ‘ది వే ఆఫ్ ది గన్’, ‘జాక్ రీచర్’ లని తనే రాసి దర్శకత్వం వహించారు. ‘మిషన్ ఇంపాసిబుల్ – రోగ్ నేషన్’ కి దర్శకత్వం వహించిన తను, ప్రస్తుతం ‘మిషన్ ఇంపాసిబుల్ – ఫాలౌట్’ కి రచన - దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకత్వం కంటే రచనే కష్టమన్న తను, దర్శకత్వం కంటే నటన కష్టమని కూడా అంటారు. రాయడం గురించీ,  తీయడం గురించీ ఇంకా ఆయన  వెల్లడించిన అనేక అనుభవపూర్వక విషయాలు ఈ క్రింది ఇంటర్వ్యూలో చూద్దాం...

అనుభవమున్న దర్శకుడికీ, అనుభవం లేని దర్శకుడికీ వ్యత్యాసం ఏమిటంటారు?
         
అనుభవమే! ఐతే అనుభవమున్నంత మాత్రాన నైపుణ్యం  వుండాలని లేదు. పోటీ పడని గొప్ప దర్శకులు, పోటీయే లోకంగా మామూలు దర్శకులూ అని రెండు రకాలుగా వుంటారు. వీళ్లిద్దరికీ నైపుణ్యంలో   తేడా ఎక్కడొస్తుందంటే,  తీసే కథని అర్ధం జేసుకోగలగడంలో. కథని ఎలా చెప్పాలి, భావోద్వేగాలు ఎలా సృష్టించాలి అన్న దగ్గరే తేడా వస్తుంది. విజయాలు సాధిస్తున్న చాలామంది గొప్ప దర్శకులున్నారు. వాళ్లకి హీనపక్షం భావోద్వేగాలపరంగా ప్రేక్షకుల్నిఎలా కట్టి పడెయ్యాలో  తెలీదు.

నవలగానీ లేదా ఒక చిన్న కథగానీ రాయడాన్నీ, సినిమాలకి స్క్రీన్ ప్లేలు రాయడాన్నీ ఎలా పోల్చవచ్చంటారు?
          పోలికే లేదు. చిన్నకథో,  నవలో రాసినప్పుడు ప్రతిదీ పేజీ మీద అక్షరాల్లో పొందుపర్చి పఠిత కోసమే వుంటుంది . అదే స్క్రీన్ ప్లే రాస్తున్నామంటే కేవలం సినిమా తీయడానికి అదొక బ్లూ ప్రింట్ అన్నట్టే వుంటుంది. ఇది చిన్నకథలాగో, నవలలాగో జనంలోకి వెళ్ళదు. ప్రొడక్షన్ విభాగంలో సంబంధిత శాఖలు తప్ప స్క్రీన్ ప్లేలనేవి బయట ప్రజల్లోకి వెళ్ళవు. కాబట్టి ఇవి ఇతర పాఠకుల కోసం కాదు, అంతర్గతంగా ప్రొడక్షన్ టీముల కోసం. ఇంకోటేమిటంటే,  చాలా మంది రచయితల స్క్రీన్ ప్లేలు ప్రొడక్షన్ కే నోచుకోవు. నా స్క్రీన్ ప్లేలు చాలా అలా మూలన పడున్నాయి. చిన్న కథో నవలో అచ్చవడానికి చాలా మాధ్యమాలున్నాయి. కానీ స్క్రీన్ ప్లేలు చాలా వ్యయప్రయాసలతో సినిమాలుగా వెండి తెరకి మాత్రమే ఎక్కాలి. ఎక్కకపోతే అవెన్ని రాసినా విలువ లేదు.

మీరు దేన్నిఇష్టపడతారు – రచనా, దర్శకత్వమా? ఎందుకు?
         
రచన కంటే దర్శకత్వం చాలా సులభమన్పిస్తుంది. దర్శకత్వానికి రాసింది చేతిలో వుంటుంది. అది చూసుకుని చకచకా తీసుకుంటూ పోవడమే, ఎంత వేగంగా నైనా తీసుకుంటూ పోవచ్చు. వేగం తగ్గితే వ్యయం పెరుగుతుంది. దర్శకత్వం దానికదే వేగాన్ని నింపుకుని వుంటుంది. రచన కొచ్చేటప్పటికి చేతిలో తెల్ల కాగితం తప్ప మరేమీ వుండదు. ఇక్కడ చకచకా వేగం సాధ్యం కాదు. ఒక్కో తెల్లకాగితం నింపే సరికి తలప్రాణం తోకకొస్తుంది. వేగం సంగతి అవతల పెడితే, అసలేం రాయాలో తెలిస్తే రాయడం కూడా సులభమవుతుంది. రాసింది ఎలా తీయాలో తెలిస్తే దర్శకత్వం సులభమైనట్టు. నాకు రెండూ తెలిసినప్పుడు రెండూ ఇష్టపడతాను.

సినిమాలకి రాయడానికీ, టీవీకి రాయడానికీ తేడా చెప్పండి.
         
కాలమే తేడా. సినిమాలకి స్క్రీన్ ప్లేలు రాయాలంటే నెలలు, కొన్ని సార్లు సంవత్సరాలూ  పడుతుంది. అదే టెలిప్లే కి వారంవారం రాసేస్తూ వుండాలి. కంటెంట్ లో తేడా : స్క్రీన్ ప్లే ఆ ఒక్కదాంతో ముగిసిపోతుంది, టెలిప్లే లు ఎంతకీ ముగియవు.

స్టూడియోలుగానీ, నిర్మాతలుగానీ  జోక్యం చేసుకోకపోతే,   మీ ఒరిజినల్ విజన్ ని ఎంతవరకూ మీరు తెరపైకి తీసుకు రాగల్గుతారు?
         
ఒరిజినల్ విజన్ అనేది కేవలం ప్రారంభ అభినివేశమని నా అనుభవంలో నేను తెలుసుకున్నాను. ఎవరి జోక్యం వున్నా, నేను స్వతంత్రంగా తీసినా,  సినిమా నిర్మాణమనేది నిరంతర రాజీ ప్రక్రియ. పరిస్థితులు ఒకలా వుండవు. పరిస్థితుల్ని బట్టి మారడానికి మనం సిద్ధంగా వుండాలి. ఐతే నాకొచ్చిన ఆలోచన అయినా , ఇతరులకి వచ్చిన ఆలోచన అయినా బెటర్ గా వుంటే దానికోసం పోరాడతాను. వొరిజినల్ విజన్ ప్రారంభంలోనే  వుంటుంది. అది ప్రాక్టికల్ విజన్ గా తర్వాత మారుతూ వుంటుంది.

మీకు పిల్లలూ కుటుంబం వుండడం రచయితగా, దర్శకుడుగా మీపై ఎలాటి ప్రభావం చూపుతోందంటారు?
          పిల్లలు - కుటుంబం వీటికంటే ముందు వృత్తిగతంగా ఇంకో కష్టాన్ని ఎదుర్కొన్నాను. పెళ్లి కంటే ముందు, పిల్లల కంటే ముందు,  నేను రచయిత నుంచి దర్శకుడిగా పరిణామం చెందే క్రమాన్ని చాలా క్లిష్టంగా ఫీలయ్యాను. రచయిత కుండే నైపుణ్య పరిధి వేరు, దర్శకుడికుండే నైపుణ్య పరిధి వేరు. రచయిత తన లోంచి తీసిస్తాడు, దర్శకుడు ఇతరుల నుంచి తీసుకుంటా
డు. రచయిత ప్రతి ఒక్కరి విజన్ నీ పరిగణన లోకి తీసుకోవాల్సిన నైపుణ్య పరిధిలో వుంటాడు. నిర్మాత, దర్శకుడు, నటీనటులు,  వీళ్ళందరి విజన్ తో బాటు, తన విజన్ ని కూడా దృష్టిలో పెట్టుకుని రాస్తాడు. ఇలాకాక దర్శకుడు ప్రతి ఒక్కరి పనిని  జల్లెడ పట్టి తన విజన్ లోకి మార్చుకుంటాడు. సినిమా కోసం పనిచేసే నటీనటుల్ని, సాంకేతికుల్ని  అందర్నీ పరికరాలుగా వాడుకుని తాననుకున్న విధంగా సినిమాని తీర్చి దిద్దుకుంటాడు. ఇలా పరస్పర విరుద్ధ దృక్పథాలు ఎక్కడా వుండవు రాయడం తీయడం ఒక్కరే చేస్తున్నప్పుడు. ఇవి రెండూ పూర్తి పరస్పర వ్యతిరేక మైండ్ సెట్టులు. కాబట్టి నా రచయిత మైండ్ సెట్ ని దర్శకుడి మైండ్ సెట్ గా మార్చుకోవడానికి చాలా కష్టపడ్డాను.  అలా ఓ మూవీకి దర్శకత్వం వహిస్తున్నప్పుడు, ఆ నటుల్లో జేమ్స్ కేన్ ఒకరు. నా స్ట్రగుల్ ని ఆయన కనిపెట్టి ఒకటే అన్నారు - చూడూ, నీకిష్టమున్నా లేకున్నా ఇది నీ మూవీ. ఇంకొకరి మూవీ కానే కాదు. ఇక్కడ నాతో బాటు యాక్టర్స్ అందరం  పిల్లల్లాంటి వాళ్ళం. మేమేం చేయాలో నువ్వు చెప్పాలని కోరుకుంటాం. నువ్వు చెప్పకుండా మాతో మొహమాట పడి, మాకే వదిలేసి, మా దృష్టిలో నువ్వు చాలా మంచివాడివని  అన్పించుకోవాలనుకుంటే మాత్రం దెబ్బతిని పోతావ్. నీకేం కావాలో డిమాండ్ చేసి మాతో చేయించుకో. మమ్మల్ని నీ విజన్ లోకి మార్చుకో- అని మందలించారు. సెట్ లో నియంతలా బిహేవ్ చేసే దర్శకులని చూశాను. నేను క్రియేటివ్ పర్సన్ ని అన్పించుకోవాలని మెత్తగా ప్రవర్తిస్తున్నాను. దీని వల్ల దర్శకుడిగా విఫలమవుతానని గుర్తించాను. తన క్రియేటివిటీ కోసం దర్శకుడు నియంతలా మారి ఇతరుల టాలెంట్ ని పిండుకోవాల్సిందేనని అప్పుడు తెలుసుకున్నాను.


          తర్వాత నాకు పెళ్ళయి పిల్లలు పుట్టాక, పేరెంట్ గా నేనెలా వుండాలో నేర్చుకున్నాను. పెరెంటింగ్ అంటే హద్దుల్ని ఏర్పర్చడమే. పిల్లల్ని వాళ్ళ స్వేచ్ఛ కొదిలేస్తూనే,  వాళ్ళు దారి  తప్పకుండా చూడ్డం. జేమ్స్ కేన్  ఇదే అర్ధంలో చెప్పివుంటారు. దర్శకత్వమంటే ఇదే.

నటన కష్టమంటారా, దర్శకత్వం కష్ట మంటారా?
          నటనే కష్టమంటాను. ప్రతీ వొక్కరూ - మళ్ళీ నొక్కి చెప్తున్నాను -  ప్రతి వొక్కరూ దర్శకులవ్వచ్చు. కానీ కెమెరా ముందు కొచ్చి అందరూ నటించలేరు. హావభావాల్ని ప్రదర్శించలేరు. ఐతే ఒక మంచి దర్శకుడు చెడ్డ నటుణ్ణి మంచి పాత్రలో నటింప జేసి మంచి నటుడుగామార్చవచ్చు. కానీ ఆ నటుడు తన లోపాల్ని అలా ఎంత కాలమూ కప్పిపుచ్చలేడు. అదే చెడ్డ దర్శకుడు ఎక్కడా దొరికిపోకుండా  విజయవంతమైన దర్శకుడుగా కొనసాగగలడు.

దర్శకుడిగా మీరు ప్రేక్షకుల పట్ల ఏ విషయంలో అసంతృప్తి ఫీలవుతారు?
          కొన్నిసార్లు ప్రొడక్షన్ విశేషాలు చూసి ఇది ఫ్లాపవుతుందని ముందే చెప్పేస్తూంటారు ప్రేక్షకులు. కావొచ్చు. కానీ అలాంటి అంచనాలకి మేం రాలేం.  బయటి నుంచి చెప్పడం వేరు, లోపల పని చేయడం వేరు. నిర్మాణం పూర్తయ్యేవరకూ స్పష్టత రాదు. నిర్మాణంలో వున్నప్పుడు ఆ నిర్మాణంలో పడి కొట్టుకుపోతాం. ఎక్కడికి చేరుకుంటున్నామో మాకే తెలీదు. ‘మిషన్ ఇంపాసిబుల్ –రోగ్ నేషన్’ తీస్తున్నప్పుడు తీసుకుంటూనే  పోయాం. కొన్ని కొన్ని తీస్తున్నవి దెబ్బతీస్తాయని తెలుసుకునేప్పటికి చాలా ఆలస్యమైపోయింది. ఈ నేర్చుకున్న పాఠాలతో  తర్వాతి మూవీలో జాగ్రత్తలు తీసుకున్నాను. ప్రేక్షకులు ముందే జాతకం చెప్పేయడం ఈజీ, మేం తెలుసుకోవడం ఈజీ కాదు. ప్రేక్షకులు గ్రహించాల్సిన ఇంకో విషయమేమిటంటే,  ఎవరూ కావాలని చెడ్డ సినిమా తీయరు. మంచి సినిమా తీయాలనే మంచి ఉద్దేశాలతో సంకల్పిస్తాం. ఐతే  పరిస్థితులు ఎదురుతిరిగే పరిస్థితులు కూడా వస్తాయి.
***
.

                  


Sunday, March 25, 2018



This Blog thrives…

Alexa rank in India : 58,968     (today, 26.3.18 : 56,694)
World : 957,784         (today, 26.3.18 : 935,728) 
Since the last three years it remains
approximately the same…In  the world of
millions of websites and blogs… a Telugu
blog 
continuously holds  this position.
Thank you readers!

***

628 - ఒక ఎత్తుగడ!

"నాదొక మాఫియా క్వశ్చన్ బాసూ -  సినిమా కథంటే సరుకులేని స్మగ్లింగేనా!"

        ఈ మధ్య విడుదలవుతున్న తెలుగు సినిమాలు వాటి అనుకున్న కాన్సెప్ట్సుకి,  ఆ కాన్సెప్ట్సు కిస్తున్న ట్రీట్ మెంట్సు (స్క్రీన్ ప్లే) తో ఎలాంటి సంబంధమూ  లేకుండా ఎందుకొస్తున్నట్టు? సినిమా కథలకి రాసే రచయితలతో బాటు, రాయని ఇంకెందరో రచయితలుఉండడం వల్ల, ఈ సమస్య తప్పడం లేదు.  కనుక కాన్సెప్ట్సు కిచ్చే ట్రీట్ మెంట్స్ మీద ఎందరి హస్తాలు పడ్డా, వాటి ఏకత్వ సూత్రాలకి ఏమాత్రం భంగం కలక్కుండా,  మొత్తం కథ నాణ్యత కూడా పూర్తిగా  దిగజారిపోకుండా కాపాడుకునే మార్గ మేదైనా వుందా?

          ప్పకుండా వుంది. నిత్యం ఫీల్డుని బెంబేలెత్తించే ఫ్లాపుల సంఖ్యని తగ్గించుకోవాలనుకున్నా, ఓ పరిష్కారమార్గం ఆవశ్యకత ఎంతైనా వుంది. ఒక టాక్ షోలో దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నట్టు- తెలుగు సినిమాపుట్టి 75 సంవత్సరాలు గడుస్తున్నా,  ఇంకా అనుభవాల మీద ఆధారపడి సినిమాలు నిర్మిస్తున్నారు తప్పితే, ఎలాటి సినిమా సైన్సు పట్లా అవగాహన ఇప్పటికీ లేదు..నిజమే,  సినిమా సైన్సు అంతా విదేశాల్లోనే దినదినాభివృద్ధి చెందుతూ, ఇంగ్లీషు పుస్తకాల్లో నిక్షిప్తమై వుంది. వీటిని చదివే ఓపిక లేదు.  తెలుగులోకి తెచ్చే ప్రయత్నమూ లేదు. కనుక మన దగ్గర ఇలా భూస్థాపితమై పోయిన సినిమా సైన్సు అనే భోషాణం లోంచి కథా శాస్త్రాన్ని పైకి తీసి చూసుకుంటే, ఓ బ్రహ్మాండమైన పరిష్కార మార్గమే కన్పిస్తుంది!

         
ఏమిటా పరిష్కారం? చాలా సింపుల్. శ్రమనుకోకుండా కాస్త మూలాల్లో కెళ్ళి, గొప్ప కథలకి ఏ ఏ అంశాలైతే పునాది రాళ్ళుగా ఉంటున్నాయో వాటిని స్థాపించుకుంటూ పోవడమే. అప్పుడా బలమైన నిర్మాణం మీద ఎందరు ఎలా చేయిచేసుకున్నా, నోరెలా పారేసుకున్నా, స్క్రిప్టు పూర్తిగా అధఃపాతాళానికి జారిపోకుండా, కనీసం మధ్యస్థ నాణ్యతా ప్రమాణాలతోనైనా  ఉంటూ, ఓ మంచే కథ అన్పించుకుని బయట పడే అవకాశముంది. ఏ పునాదీ లేకుండా కేవలం సొంత నమ్మకాలాధారంగా గాలిలో అల్లుకునే కథల్ని కథా చర్చల పేరుతో నల్గురూ కలిసి కూర్చుకుని, జీరో చేసి వదిలేకన్నా ఇది నయమే కదా? మధ్యస్థంగా ఓ మంచి కథ!

       ఈ రోజుల్లో ఓ మంచికథ తయారైతే చాలు. గొప్ప గొప్ప కళాఖండాలు ఇప్పుడెవరూ తీయడంలేదు. కనుక గొప్ప కథలంటూ తలలు బద్దలు చేసుకోనవసరంలేదు. కాలక్షేపానికి ఒద్దికగా ఓ మంచి కథ అందించ గల్గితే చాలు. గొప్ప కథలంటే హాలీవుడ్ స్థాయిలో వచ్చే స్టార్ వార్స్’, ‘జురాసిక్ పార్క్’, ‘టైటానిక్’, ‘జాస్’, ‘సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్లాంటివన్నమాట. ఇవి అంత గొప్ప కథలెలా కాగలిగాయో తెలుసుకుంటే, కథకుడు ఆ రహస్యాన్ని తన కాన్సెప్టు లో ఇమిడ్చి గొప్ప స్క్రిప్టు నే ఊహించగలడు. అప్పుడు తెలుగు సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది!

         
కానీ అంత సీను లేదు. కళాఖండాలకి కాలం కాదుకున్నాం గనుక అంతేసి గొప్ప కథలకి గిరాకీ తగలడం అసాధ్యం. నో ప్రాబ్లం. ఐతే మొట్ట మొదట ఆ స్థాయిలో కథని ఊహించ గల్గితేనే కథకుడనే వాడు  అవసరమైతే దాని ఇంకో వెర్షన్ ని కూడా ఆత్మవిశ్వాసంతో విన్పించగలడు. గొప్ప పునాదితో తనకొచ్చిన ఆ గొప్ప ఊహని అప్పుడో మెట్టు కిందికి దించి, ఫ్రేము వదులు చేసి, అలవాటు పడ్డ తెలుగు సినిమాల రన్నింగ్ ని అప్లై చేస్తే, అప్పుడింక ఎవరెన్ని మార్పు చేర్పులు కోరినా, గొప్ప కథ పునాది మొదటే పడింది గనుక, కాన్సెప్ట్ నుంచి ట్రీట్ మెంట్ పతనమూ కాదు, సినిమా భ్రష్టు కూడా పట్టిపోదు.

         
నాణ్యత ఓ మెట్టు దిగినా, మంచి కథ అనే కితాబు ఎక్కడికీ పోదు. అప్పటికీ నిద్రపట్టక ఇంకా నీచానికి దిగలాగే చేతులు వుంటే, వాళ్ళని అట్టర్ ఫ్లాప్తిరస్తు  –అని దీవించేసి వాళ్ళ ఖర్మానికి వదిలెయ్యడమే!

         
గొప్పకథకి అలాటి బలమైన పునాది వేయడమెలా? చాలా సింపుల్. ముందుగా తెరమీద కదలాడే చలన చిత్రమంటే అది మనిషి మనసు లోపలి ప్రపంచాన్ని ( మానసిక ప్రపంచాన్ని) ఆవిష్కరించే శాస్త్రమని గుర్తిస్తేచాలు. వెండి తెర మీద మనం చూసే పాత్రలు నిజానికి నిజ జీవితంలో నిత్యం మనం చవిచూసే  వివిధ ఎమోషన్స్ కి ప్రతిరూపాలే. ఇగో’  అనే ఎమోషన్ కి హీరో పాత్ర, ప్రేమాశృంగార భావాలకి హీరోయిన్ పాత్ర, మానసికోల్లాసానికి హాస్యగాడు, శాంతి సౌఖ్యాలకి తల్లి, భద్రతా భావానికి తండ్రి, మార్గదర్శకత్వానికి గురువు లేదా గాడ్ ఫాదర్, మనం అణిచిపెట్టుకునే సవాలక్ష జంతు లక్షణాలకి విలన్ పాత్రలూ సింబల్స్ అన్నమాట. ఈ ఎమోషన్స్ అన్నిటినీ కలబోసి మైమరిపించేదే గొప్ప కథ. ఇప్పుడిన్నేసి ఎమోషన్స్ వెండితెరమీద ఆవిష్కారం కావడంలేదు. పాత్రల సంఖ్య తగ్గిపోవడమే ఇందుక్కారణం. మన మనో ప్రపంచాన్ని తెర మీద సంపూర్ణంగా ప్రతిఫలింప జేయడం ఏనాడో తగ్గిపోయింది. అయినా కూడా నో ప్రాబ్లం. మనలో వుండే  తొమ్మిది రకాల ఎమోషన్స్ లో చాలా వాటికి వెండి తెర మీద ప్రాతినిధ్యం తగ్గిపోయినా, ప్రధాన ఎమోషన్ అయిన ఇగో’ ( అంటే హీరో పాత్ర)  నైనా సవ్యంగా పోషించుకో గల్గితే చాలు, అప్పుడు ఆటోమేటిగ్గా అదే ఓ మంచి సినిమాగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశం వుంది.

         ఇగో ఎవరి మాటా వినని మొండి ఘటం. అందుకని దాన్ని యుక్తిగా దారిలో పెట్టి, మెచ్యూర్డ్ ఇగో దిశగా నడిపించేదే గొప్ప కథ కుండే ప్రధానలక్షణం. ఆ నడకలో ఎడబాటు- ప్రయత్నం-అవగాహన- జ్ఞానోదయం అనే నాలుగు మజిలీలుంటాయి. జ్ఞానోదయంవల్ల ఇగో చివరికి మేచ్యూర్డ్ ఇగోగా మార్పు చెంది కథ ముగిస్తుంది.

         
మన మైండ్ రెండు గా విభజించి ఉంటుందనేది తెలిసిందే. ఆ రెండూ కాన్షస్ మైండ్- సబ్ కాన్షస్ మైండ్ లు. కాన్షస్ మైండ్ కి ఇగో కేంద్రంగా ఉంటూ, లాజికల్ గా ఆలోచిస్తుంది. పరిస్థితిని బేరీజు వేస్తుంది. నిర్ణయాలు తీసుకుంటుంది. సినిమా కథలో ఇగో చేసే పాత్ర ప్రయాణం లో దానికి సంబంధించిన కార్యకలాపాల్ని హీరో పాత్ర ద్వారా అడ్డదిడ్డంగా డిస్టర్బ్ చేయకుండా,  జాగ్రత్తగా నిర్దేశిత గమ్యం వైపు నడిపించాల్సి వుంటుంది.

          ఇంకాస్త లోతు కెళ్దాం. పైన వివరించిన హాలీవుడ్ సినిమాలు అంత గొప్ప ఆస్కార్  అవార్డు కథ లెందు కయ్యాయంటే, అవి మనిషి మానసికావసరాల్ని అంత కరువుదీరా తీర్చేశాయి గనుక! మనిషి మానసిక ప్రపంచాన్ని పైన చెప్పిన కాన్షస్- సబ్ కాన్షస్ మైండ్ లు ప్రభావితం చేస్తాయి. వెండితెర మీద ఈ రెండు మైండ్స్  కీ చెలగాటం పెట్టి రఫ్ఫాడించి హిట్లు కొడతారు సరయిన సృష్టికర్తలైతే. ఈ రెండు మైండ్సూ ఎలాటి ఏర్పాటుతో ఉంటాయంటే, మధ్యలో లంకలా కాన్షస్ మైండ్ వుంటే, ఆ లంక చుట్టూ  మహా సముద్రంలా పర్చుకుని సబ్ కాన్షస్ మైండ్ వుంటుంది. లంకని పాలించుకునే ఇగోకి,  ఆ సముద్రంలోకి వెళ్ళాలంటే మహా భయం. ఎందుకంటే, ఆ సముద్ర గర్భంలో తాను తట్టుకోలేని నిజాలుంటాయి, ఎదుర్కోలేని ప్రశ్నలు దాగి వుంటాయి. సాధ్యమైనంత వరకూ ఆ  సబ్ కాన్షస్ మైండ్ కి మొహం చాటేసి తిరగడమే అది నేర్చు కుంది. అంతరాత్మకి (సబ్ కాన్షస్) కి సమాధానం చెప్పుకోవడం దానికి సుతరామూ ఇష్టముండదు. పలాయనవాదంతో దాన్ని తొక్కిపెట్టి  బలాదూరు తిరగడమే దానికిష్టం!

          ఇదే సమయంలో సబ్ కాన్షస్ మైండ్- లేదా మన అంతరాత్మ అపార విజ్ఞాన ఖని కూడా. దానికి తెలీని సమాచారమంటూ వుండదు. అది సర్వాంతర్యామి. అందుకే తన వైపు రావడానికి జంకే ఇగోకి అది తియ్యటి షుగర్ కోటింగ్ కలలతో అవసరమైన సమాచారాన్ని అందిస్తూ ఆపత్కాలంలో ఆదుకుంటూ వుంటుంది.

      ఇక పాయింటు కొచ్చేద్దామా? సరీగ్గా మనలో లంకలాంటి  కాన్షస్ మైండ్ కీ- ఆ లంక చుట్టూ మహా సముద్రంలాఆవరించుకుని వుండే  సబ్ కాన్షస్ మైండ్ కీ లడాయి పెట్టి స్టీవెన్ స్పీల్ బెర్గ్  ‘జాస్అనే గొప్ప కథా చిత్రాన్ని నిర్మించేశాదు! సినిమాలో చూపించే సముద్రం- ఆ మధ్యలో వుండే దీవి మన మానసిక ప్రపంచానికి నకళ్ళే. సముద్రంలోంచి సొర చేప రివ్వుమని వచ్చేసి దాడి చేస్తూంటుంది. ఈ సొర చేప మన సబ్ కాన్షస్ లో దాగి మనల్ని భయపెడుతూ వుండే నగ్నసత్యాలకి ప్రతీక. ఈ సొర చేపతో తలపడే హీరో మన ఇగోనే!

         
స్పీల్ బెర్గేతీసిన ఈటీలోనూ భూమ్మీదికి గ్రహాంతర జీవి ఒకటి వస్తుంది. మనకి మనం నివశించే భూమి మనకి తెలిసిన ప్రపంచమే-కాన్ష మైండ్ కి సింబల్ గా దీన్నితీసుకుంటే, అప్పుడా గ్రహాంతర జీవి అదేమిటో మనకి తెలీని నిగూఢ లోకం- సబ్ కాన్షస్ మైండ్ కి గుర్తుగా తీసుకుంటే- (పని గట్టుకుని తీసుకోనవసరంలేదు- యాదృచ్చికంగా మన మెదడే అలా కనెక్ట్ అయిపోతుంది-మెదళ్ళకి కనెక్ట్ అవుతూ  మనకి తెలీకుండా మాయ చేసేదే గొప్ప కథ! ).. అప్పుడు ఈ రెండిటి దోబూచులాట ఎలా వుంటుంది మన మనస్సుకి?

 
         అంతరిక్ష యుద్ధాన్ని చిత్రించే  స్టార్ వార్స్మాత్రం? అంతరిక్షం మన సబ్ కాన్షెస్సే! ఇక సముద్రంలో మునిగిపోయే నౌక టైటానిక్మాత్రం? సముద్రం భయంకరమైన సబ్ కాన్షస్- నౌక బిక్కుబిక్కు మనే కాన్షస్! జురాసిక్ పార్క్లోకూడా ఆ కాంపౌండు మన కాన్షస్ అయితే, దాని చుట్టూ పార్కు సబ్ కాన్షస్. ఇక చూస్కోండి ఆట!

           మన మానసికలోకంలో ద్వైదీభావపు ఈ రెండు మైండ్స్ కీ  నిత్యం జరిగే సంఘర్షణకి సజీవ చిత్రణలే ఇవన్నీ. ఇందుకే ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల ప్రేక్షక బాహుళ్యం నాడిని ఇవి అంతబాగా పట్టుకోగాలిగాయి. తెలుగు ఫీల్డులో ప్రేక్షకుల నాడిని పట్టుకోవడం కష్టమని అలవాటుగా అనేస్తూంటారు. అది అవగాహన లోపించిన మాట. పైన పేర్కొన్నట్టు  తమ్మారెడ్డి భరద్వాజ విశ్లేషణ లోంచి పుట్టిన జీవులు అలాగే మాట్లాడతాయి. ఇంకో గమ్మత్తేమిటంటే, జీవితంలో తాము చేయలేనివి తెర మీద హీరో చేస్తూంటే ప్రేక్షకులు ఆనందిస్తారని మోటుగా అనేస్తూంటారు. ఈ మెకానిజమేంటో తెలుసుకోరు. ఇప్పటిదాకా మనం చెప్పుకుంటూ వచ్చిందే ఆ మెకానిజం. మన సబ్ కాన్షస్ ని మనం ధైర్యంగా ఎదుర్కోలేకపోవడమనే బలహీనతని, తెర మీద మన ఇగో రూపంలో హీరో చేసేస్తూంటే అది మనకి ఆత్మసంతృప్తి కలిగిస్తుందన్నమాట! 

          సినిమాల్లో కథల్లో లేవనెత్తే సమస్యలకీ, వాటిని పరిష్కార దిశగా నడిపించడానికి రాసుకునే ట్రీట్ మెంట్లకీ పొంతన లేకుండా ఎందుకు ఉంటోందో గ్రహిస్తే కదా నాడిని పట్టుకోవడానికి! స్థాపించే సమస్య సబ్ కాన్షస్ అయితే, దాని పరిష్కార మార్గం, లేదా దానికై పోరాటం కాన్షస్ మైండ్ అన్న ప్రాథమిక జ్ఞానం లేకుంటే ఎలా!

         
కనీసం తెలుగులోనే వచ్చిన కొన్ని గొప్ప/ మంచి సినిమాలని కాపీ కొట్టి వాటిలాగే హిట్ చేయలన్నా అసలంటూ సైన్సు తెలియాలి. రాం గోపాల్ వర్మ  శివలో నాగార్జున పాత్ర కాన్షస్ ఇగో అవుతుందనీ, అతను తలపడే చీకటిమాఫియా ప్రపంచం సబ్ కాన్షస్ అవుతుందనీ, అందులో రఘువరన్ విలన్ పాత్ర ఎదుర్కోక తప్పని ఒక కఠిన ప్రశ్నవుతుందనీ ఎందరికి తెలుసు? నీలకంఠ మిస్సమ్మలో శివాజీ-భూమికలు కాన్ష ఇగో- సబ్ కాన్షస్ లకి గుర్తులు. ఒక్కడులో భూమికని దాచిపెట్టిన గది సబ్ కాన్షస్ అయితే, భూమిక ఆ సబ కాన్షస్ లో పరిష్కరించాల్సిన ఒక సమస్య! మిగతా ఇల్లూ- చార్మినార్ అంతస్తూ కాన్షస్. మహేష్ బాబు పాత్ర కాన్షస్ ఇగో. కురుక్షేత్రం లో నూరుమంది కౌరవులు మన మనసుల్ని పీడించే ప్రతికూల భావాలకి ప్రతీకలైతే, అర్జునుడు వాటితో పోరాడే మన కాన్షస్ ఇగో అని చిన్మయానంద స్వామి తన ఆర్ట్ ఆఫ్ మాన్ మేకింగ్అనే గ్రంధంలో ఏనాడో చెప్పేశాడు.

          కాబట్టి ఇలా గొప్ప సినిమా కథల అంతర్నిర్మాణ పోస్ట్ మార్టం ని విస్పష్టంగా చూడగల్గినప్పుడు...ఆ బలమైన పునాది కాన్షస్- సబ్ కాన్షస్ మైండ్ ల ఇంటర్ ప్లే తోనే ఏర్పడుతుందనే  అవగాహన పెంచుకున్నప్పుడు, కథలకిచ్చే ట్రీట్ మెంట్స్, లేదా స్క్రీన్ ప్లేలు కనీసం గొప్ప కథల స్కేలు పైనుంచి మరీ కిందికి జారిపోకుండా చూసుకోవడమెలాగో తెలిసిపోతుంది.

         
కథని ఇలాటి ఇంటర్ ప్లే తో బలంగా లాక్ చేశాక, నలుగురి నోళ్ళూ చేతులూ పడ్డా అది కథనం వరకే పరిమితమౌతూ కొంత మేర వాళ్ళవాళ్ళ క్రియేటివిటీతో దిగజారుస్తారేమో గానీ,  ఏం చేసీ మొత్తంగా చెడగొట్ట లేరు! కథకుడు చేయాల్సింది ఇంటర్ ప్లేకి బలమైన లాక్ వేసి ఆకట్టుకోవడమే. బలహీన లాక్ తో కథా చర్చల్లో కూర్చుంటే ఆ లాక్ కూడా వుండదు- ఇంకేవో కథనాల్ని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పారించుకునే ఏలూరు లాకుల్లాంటివి వచ్చి పడతాయి!

 సికిందర్
(జూన్ 2007 ఆంధ్రభూమి’)

(ఈ మధ్య కొందరు రాసుకున్న కథలు మార్పు చేర్పులకి
లోనై బలహీనంగా మారిపోతున్న పరిస్థితిని దృష్టిలో
పెట్టుకుని పై వ్యాసాన్ని పునర్ముద్రించాం -
కథలు బలహీనపడకుండా  కాపాడుకునేందుకు
ఈ ఎత్తుగడ పనికొస్తుందన్నఉద్దేశంతో)


Saturday, March 24, 2018

627 : సందేహాలు -సమాధానాలు



Q :    మీరు స్క్రీన్ ప్లేకి ‘శివ’ స్ట్రక్చర్ ని వాడమంటే ఇక్కడ అర్ధం గావడం లేదు. మేము ప్రేమ కథో, ఇంకేదో కథో రాయాలనుకుంటున్నామే గానీ, మాఫియా కాదంటున్నారు. ‘శివ’ స్ట్రక్చర్ అలాటి మాఫియా సినిమాలకే అనుకుంటున్నారు. ‘శివ’ ప్లాట్ పాయింట్ వన్ లో నాగార్జున జేడీ ని కొడతారు. మా ప్రేమ కథలో అదెలా పెట్టాలి? ఎవరు ఎవర్ని కొట్టాలి? అంటున్నారు. ఇదే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ప్రేమ కథకైతే  సంఘర్షణ ఎలా పుట్టవచ్చో  ఉదాహరణగా ‘బొమ్మరిల్లు’ ని వివరించినా అర్ధం జేసుకోవడం లేదు. ఇక ప్లాట్ పాయింట్ వన్ దగ్గర మెయిన్ క్యారక్టర్ కి ఏర్పడే గోల్ లో,  నాల్గు ప్రాపర్టీస్ వుండాలన్నా కొట్టి  పారేస్తున్నారు. ‘శివ’ లో బిగినింగ్ విభాగంలో లాగే,  ‘బొమ్మరిల్లు’ బిగినింగ్ విభాగంలో కూడా  ఆ నాల్గు ప్రాపర్టీస్ ఎలా ప్లే  అయ్యాయో చూడమన్నా ఒప్పుకోవడం లేదు. ఏం చేయాలి? ఇది ఒక చోటని కాదు, చాలా చోట్ల చూస్తున్నాను ఇలాటి పరిస్థితి.
 
జె దుర్గా స్వామి, కో డైరెక్టర్
A :    ‘శివ’ ప్లాట్ పాయింట్ వన్ లో నాగార్జున జేడీ ని కొడతారు, మా ప్రేమ కథలో అదెలా పెట్టాలి? ఎవరు ఎవర్ని కొట్టాలి? అన్నప్పుడే వాళ్ళెంత బుద్ధిమంతులో అర్ధమవుతోంది. బుద్ధిమంతులకి ఇంకేం చెప్తాం. ‘శివ’ నే ప్రేమ కథ గానో, కుటుంబ కథగానో మార్చమంటున్నామని వాళ్ళ బుద్ధికి అంది బెదిరి పోతున్నట్టుంది.  సిడ్ ఫీల్డ్ స్ట్రక్చర్ కి ఉదాహరణగా ‘శివ’ని చూపించడం పాపమై పోయింది. వాళ్ళు సిడ్ ఫీల్డ్ పుస్తకం చదివినా,  అందులో ఆయన చూపించే  హాలీవుడ్ నమూనాలకి ఇంకా బెదిరిపోవచ్చు.  ‘సిటిజన్ కేన్’ ని మా ప్రేమ కథగా ఎలా తీయాలని  గోలగోల చేయవచ్చు. కాబట్టి వాళ్ళ అవగాహనకి వాళ్ళని వదిలెయ్యాలి.  

Q :   ఐడియాలో మార్కెట్ యాస్పెక్ట్, యూత్ అప్పీల్ వుండాలని మీరు చెప్తూంటారు కదా... మరి ఈ వారం విడుదలైన ‘కర్తవ్యం’ తమిళ డబ్బింగ్ లో, పూర్వపు ‘అన్నమయ్య’, ‘ఆ నల్గురు’ లాంటి కథల్లో యూత్ అప్పీల్ వుండదు కదా... మరి అలాంటి కథలు రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
అశోక్ పి, అసోషియేట్
A :   రెగ్యులర్ కమర్షియల్ కథల్లో  యూత్ అప్పీల్ గ్లామర్ ప్రధానంగా వుంటుంది. సీరియస్ సామాజిక కథల్లోనో, లేక భక్తి కథల్లోనో వాటిలోని సెంట్రల్ పాయింటుతో బాటు వాటిలో నటించే తారాగణం  యూత్ అప్పీల్ ని ప్రేరేపిస్తాయి. అయితే భక్తీ సామాజికాలని  కేవలం యూత్ అప్పీల్ తో తీసే అవస్థ వుండదు. వాటికి  అన్ని వర్గాల ప్రేక్షకుల వ్యవస్థ వుంటుంది. కాబట్టి అవి సేఫ్ అవుతూంటాయి. అవి కూడా ఈ రోజుల్లో ఎప్పుడోగానీ రావు. కానీ ఎప్పుడూ వచ్చే రెగ్యులర్ కమర్షియల్స్ కి అన్ని వర్గాల ప్రేక్షకులు వుండడం లేదు. కాబట్టి యూత్ ని, మాస్ ని టార్గెట్ చేస్తూ వాటి అప్పీల్స్ తో తీస్తూంటారు. మళ్ళీ ఇలాటి సినిమాలకి యూత్ లో కూడా సినిమాలకి వస్తున్న గర్ల్స్ అతి తక్కువ. ఎందుకంటే యూత్ అప్పీల్ పేరుతో  బాయ్స్ వేషాలే అతిగా చూపించి గర్ల్స్ రాకుండా చేస్తున్నారు. కాబట్టి యూత్ అప్పీల్ కి బాక్సాఫీసులో సగం దాదాపు లేనట్టే .
‘కర్తవ్యం’ సామాజికం. బోరు బావుల్లో పడిపోతున్న పిల్లల గురించి. ఈ ఘటనలు తరచూ జరిగి ఆసక్తి రేపుతున్నాయి కాబట్టి ఈ సెంట్రల్ పాయింటు యూత్ ని కూడా ఆకర్షించవచ్చు. పైగా నయనతార లాంటి గ్లామర్ తార వుంది.  అయినా తెలుగులో ఫ్లాప్ అయింది. అదే కార్తీ లాంటి పాపులర్ హీరో వుంటే తెలుగులో యూత్ అప్పీల్ వచ్చేదేమో అదే బోరుబావుల సామాజికానికి. కొన్ని కొన్ని సామాజికాల్ని యూత్ లోకి తీసి కెళ్లాలంటే పాపులర్ తారలు అవసరపడతారు.
          ‘ఆ నల్గురు’  తండ్రీ కొడుకుల కథ కాబట్టి సహజంగానే కొంత యూత్ అప్పీల్ వుంటుంది. మిగతా వర్గాలనీ ఆకర్షిస్తుంది. యూత్ అప్పీల్ కి  ఆర్ధిక కోణాలు తోడయ్యాయి. మానవ సంబంధాల్లో ఆర్ధిక సంబంధాలు కన్పించకపోతే ఏ యూత్ అప్పీలూ వుండదు. అందుకే ఇప్పటి సినిమాల్లో ఎకనమిక్స్ లేదా, ఇంకో యూత్ అప్పీల్ అయిన రోమాంటిక్స్ కన్పించాలనేది.  ఆనాటి ‘ఆకలి రాజ్యం’ లో నిరుద్యోగమే యూత్ అప్పీల్. నిరుద్యోగమంటే ఎకనమిక్స్  కాబట్టి.
‘నీదీ నాదీ ఒకే కథ’  కూడా యూత్ అప్పీల్ వున్న సామాజికమే. ఎకనమిక్సే.  కాకపోతే ఏం తేల్చారన్నది వేరే విషయం. యూత్ అప్పీల్ కి నెగెటివ్ పాజిటివ్ లని వుండవు - ఎటు చూపిస్తే అటు పడిపోతారు. ఇంకా నెగెటివ్ కే ఎక్కువ పడిపోతారు. ‘అర్జున్ రెడ్డి’ కి కూడా ఇలాగే పడిపోయారు.
          ఇక ‘అన్నమయ్య’ లాంటి భక్తి కథలకి గ్లామర్ తారలు తోడయితే, యూత్ అప్పీల్ దానికదే వుంటుంది, ఇతర వర్గాల ప్రేక్షకుల మన్నన సరేసరి. భక్తికి ఇప్పుడు కూడా యూత్ అప్పీల్ వుంది. ఇటీవల యూత్ లో దైవ భక్తి బాగా పెరిగిపోయింది. కాకపోతే ఇంకా పాతదేవుళ్ళే  కాకుండా,  యూత్ ని ఆకర్షిస్తున్న దేవుళ్ళు ఇంకెవరో కనిపెట్టి, అలాటి వీసా బాలాజీల మీద తీస్తే బ్రహ్మరథం పట్టొచ్చు. భక్తి కథల్లో కూడా ఇప్పుడు ఎకనమిక్సే కన్పించాలి. మోక్షం భిక్షం అంటే  తిప్పి కొడతారు.
          ఇలా సామాజిక,  భక్తి సినిమాల్లో యూత్ అప్పీల్ వుండదని  కాదు, వుంటుంది. వాటిని ఎలా ఉపయోగించాలనేది అప్పుడున్న యూత్ మెంటాలిటీని బట్టి వుంటుంది. యూత్ మెంటాలిటీ ఒక్కటే – ఎకనమిక్స్. లేదా రోమాంటిక్స్ లేదా ఈ రెండిటి మిశ్రమం.  అయితే సామజిక, భక్తి కథల్లాగా యాక్షన్ కథల్ని కూడా సీరియస్ గా తీస్తే యూత్ అప్పీల్ వుంటుందా? రెండు పెద్ద యాక్షన్ స్క్రిప్టుల్లో ఎకనమిక్స్ గానీ, రోమాంటిక్స్ గానీ లేక డ్రైగా కన్పిస్తూంటే వాటికి యూత్ అప్పీల్ వుంటుందా? ఇదే మార్కెట్ యాస్పెక్ట్ ని చూడకపో
వడమంటే. కేవలం క్రియేటివ్ యాస్పెక్ట్ ని పట్టుకుపోవడమంటే. చూద్దాం ఫలితాలెలా వస్తాయో.

Q :    ఏ జానర్ కి జానర్ డిమాండ్ చేసే లక్షణాలు వుంటాయిని ఒక వ్యాసంలో మీరు చెప్పారు. దయచేసి జానర్ లక్షణాలను డిమాండ్ చేస్తుందో,  సజాతి, విజాతి జానర్స్ ఏవేవో వివరిస్తారని ఆశిస్తున్నాను.
రాజ్, అసోషియేట్
A :  ఈ క్రింది రెండు లింకులు క్లిక్ చేసి చూడండి.
       జానర్ మర్యాద -1  జానర్ మర్యాద -2

        



సికిందర్