సినాప్సిస్
రాసుకోకపోవడం వల్ల చాలా సినిమాలు అట్టర్ ఫ్లాపవుతున్నాయి. సినాప్సిస్ ఐడియా
నుంచి పుడుతుంది. ఐడియా ఒక స్టోరీ లైన్ లోకి ఒదగలేదంటే, సినాప్సిస్ (4 పేజీల కథాసంగ్రహం) కూడా కుదరదు. ‘జక్కన్న’ లో
చిన్నప్పుడు విలన్ చేసిన సాయానికి జక్కన్న ప్రతిసాయం చేయాలనుకోవడం మాత్రమే కథకి ఐడియా
అవుతుందా? ఇది అర్ధవంతంగా వుందా? ఇందులో కథ కన్పిస్తోందా? స్ట్రక్చర్
కన్పిస్తోందా? బిగినింగ్-మిడిల్- ఎండ్ విభాగాలు
కన్పిస్తున్నాయా? ఇవేవీ కన్పించనప్పుడు కోట్ల రూపాయలతో ఈ సినిమా తీయడానికి ఎలా సాహసించినట్టన్నది
జక్కన్నే చెప్పాలి.
సినిమా తీయడానికి వాస్తు చూసుకుంటారు, ముహూర్తాలు
చూసుకుంటారు, పూజలు చేసుకుంటారు, జ్యోతిషం కూడా చెప్పించుకుంటారు. కానీ తీస్తున్న
సినిమా ఐడియాకి వాస్తు వుందా, శాస్త్రం వుందా, జ్యోతిషం చెప్పించుకోవాలా అని
ఆలోచించరు. తమకి తోచిందే ఐడియా, తమకు తోచిందే శాస్త్రం, తమకు తట్టిందే దాని
వాస్తు. ఈ కర్ర పెత్తనం లేని హాలీవుడ్ లో
సినాప్సిస్ రైటింగ్ కే ప్రత్యేకమైన శిక్షణా సంస్థలు ఎందుకుంటున్నాయో కాస్త
ఆలోచించాలి.
నిజానికి
సినాప్సిస్ రాయడానికి జక్కన్న ఐడియాలో పావు వంతు కథే కన్పిస్తోంది. అంటే ప్రేక్షకులనుంచి పూర్తి సినిమా డబ్బులు
తీసుకుని, పావు వంతు కథే చూపించారన్న మాట. ఇలాటి స్కాములు కూడా జరురుగుతున్నాయని అర్ధంజేసుకోవాలి. ఈ పావువంతు కథతో- ‘విలన్ తనకి చిన్నప్పుడు చేసిన సాయానికి
జక్కన్న ప్రతిసాయం చేయాలనుకుని వస్తాడు’ ...అనేది మాత్రమే ఐడియాగా కన్పిస్తోంది.
ఈ అయిడియా పావు వంతు కథ మాత్రమే. ఎందుకంటే ఇది స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో బిగినింగ్ ని మాత్రమే సూచిస్తోంది. ‘సాయం చేయడానికి
జక్కన్న వస్తే విలన్ ఎలా రియాక్ట అయ్యా’ డనేది కలుపుకుంటే అప్పుడు ఇంకో
సగం కథ కలుస్తుంది. అంటే స్ట్రక్చర్ లో
మిడిల్ విభాగమవుతుంది. చివరికేమైందో
చెప్పుకుంటే మిగతా పావు వంతూ కథ కలిసి -అంటే ఎండ్ విభాగం కూడా జతకూడి
స్ట్రక్చర్ పూర్తవుతుంది. వలయం పూర్తి కాకుండా విద్యుత్ ప్రవహించదు, అవునా? అలాగే బిగినింగ్-
మిడిల్-ఎండ్ అనే వలయం పూర్తికకపోతే ఐడియా, సినాప్సిస్, స్క్రీన్ ప్లే ఏదీ సాధ్యం కాదు.
తనకి
విలన్ చిన్నప్పుడు చేసిన సాయానికి ప్రతిసాయం చేయాలనుకున్న జక్కన్నకి- విలనే తెగ సాయం
చేసేస్తూ ఎదురు బాదుడు మొదలెడితే జక్కన్న
పరిస్థితి ఏమిటీ ...అని ఐడియాని సవరించుకోవచ్చు. అప్పుడిందులో కథకి
మూడంకాలు (బిగినింగ్- మిడిల్- ఎండ్ లు) కన్పిస్తాయి. అంకాలు లేని కథ డొంక
దారే చూసుకుంటుంది. ప్రతిసాయం చేయడానికి జక్కన్న రావడం బిగినింగ్, విలనే ఎదురు
సాయంతో బాదడం మిడిల్, అప్పుడు జక్కన్న పరిస్థితేమిటన్నది
ఎండ్ గా కథకి కావాల్సిన స్ట్రక్చర్లో ఐడియా వుంటుంది.
ప్రతిసాయం
చేయాలనుకుని వచ్చిన వాడు ఆ సాయమేదో చేసేసిపోతే, కథెలా అవుతుంది? అది సినిమా
తీయడానికి పనికిరాని ఉత్త ‘గాథ’ అవుతుంది.
జక్కన్న చేసే ప్రతిసాయాన్ని విలన్
అడ్డుకుంటూ సమస్యలు సృష్టిస్తే అప్పుడది కథకి అవసరమైన ఆర్గ్యుమెంట్ ని
ప్రతిపాదిస్తూ కథా లక్షణాన్ని ప్రదర్శిస్తుంది. ‘గాథ’ గా ఎలా వుంటుందంటే - నాకెప్పుడో
విలన్ చేసిన సాయానికి నేను ప్రతిసాయం చేసి ఇలా బదులు తీర్చుకున్నానూ –
అని చప్పగా జక్కన్న ‘స్టేట్ మెంట్’ ఇచ్చేసి తప్పుకునేదిగా వుంటుంది.
ఇదే కథయితే ఎలా వుంటుందంటే –నేను పొందిన సాయానికి ప్రతిసాయం
చేద్దామని వస్తే తనదైన పాయింటుతో అడ్డుకుని ఎదురు సాయం చేస్తూ పోయాడు వెధవ- అని జక్కన్నకీ- విలన్ కీ మధ్య ఓ
పాయింటుతో ఆర్గ్యుమెంట్ సహిత సంఘర్షణని సృష్టించేదిగా వుంటుంది. స్టేట్ మెంట్ కీ,
ఆర్గ్యుమెంట్ కీ తేడా గుర్తించాలి : స్టేట్ మెంట్ లో కథ వుండదు, ఆర్గ్యుమెంట్ లో
కథ వుంటుంది. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ తో
సంఘర్షణ పుడుతుంది, స్టేట్ మెంట్ తో సఘర్షణ పుట్టదు. సినిమా కథంటే
సంఘర్షణే. గాథల్లో సంఘర్షణ వుండదు. ఇందుకే ‘జక్కన్న’ లో విలన్ సంఘర్షించకుండా ఏమీ చేతకాని
జోకర్ లా మిగిలిపోయాడు.
పైన
చెప్పుకున్నట్టు- ‘తనకి విలన్ చిన్నప్పుడు
చేసిన సాయానికి ప్రతిసాయం చేయాలనుకున్న జక్కన్నకి- విలనే తెగ సాయం
చేసేస్తూ ఎదురు బాదుడు మొదలెడితే జక్కన్న
పరిస్థితి ఏమిటీ ...’ అన్న
సవరించిన అయిడియాతోనే సినాప్సిస్ కి పూనుకున్నామనుకుందాం. (అసలు కథంటే డైనమిక్స్ కూడా. హీరో అనుకున్నట్టే జరిగిపోతే
అది కథే కాదు. జక్కన్న ప్రతిసాయం చేసేద్దామని వస్తే విలన్ దానికి చెక్ పెడుతూ తనే
ఎదురు సాయం చేస్తూ చావగొడితే అప్పుడిందులో
డైనమిక్స్ వుంటాయి). ఈ విధంగా
ఐడియాని సవరించుకుంటే అప్పుడు వర్కౌట్ అవుతుందా? ముందు ఈ ఐడియా ప్రేక్షకులకి
అమ్ముడుబోయే ఐడియాయేనా? లేకపోతే ప్రేక్షకుల దగ్గర పక్కాగా అసలీ నోట్లు లెక్కెట్టుకుని
తీసుకుని, ఆనవాయితీగా నకిలీ సినిమా అంటగట్టడమే
అవుతుందా? రెండు చోట్ల బతికిపోతారు తయారీదార్లు- ఒకటి, మద్యం ధరలు పెంచేసినా
ఉద్యమాలు చెలరేగే పరిస్థితి వుండదు; రెండు, నకిలీ సినిమాలు అంటగట్టినా
తిరుగుబాట్లు జరుగుతాయనే భయం వుండదు. సినిమాల విషయంలో ఎప్పుడో ఒకసారి బయ్యర్లు
రోడ్డెక్కుతారు, అంతే. కానీ ఎవరెలా పోతే మనకేంటనుకున్నా, ఫ్లాప్ టాక్ వస్తే జక్కన్న పరువుకి అంత మంచిది కాదేమో?
కాబట్టి
ముందు సెలెక్టు చేసుకున్న ఐడియా
అమ్ముడుబోయే ఐడియాగా వుండక తప్పదు. అమ్ముడుబోవడానికి ఈ ఐడియాలో ఏముందని? సాయం
చేస్తే ప్రతి సాయం చేయడమేనా? అదీ పదిహేనేళ్ళ తర్వాత విలన్ చేసిన సాయం గుర్తు
పెట్టుకుని మరీ ప్రతి సాయం చేద్దామని రావడమేనా? కన్విన్సింగ్ గా వుందా? సాయానికి
ప్రతిసాయం చేయాలనుకోవడమే వెర్రితనం. సాయం చేసే వాళ్ళు తిరిగి ఆ మనిషి నుంచి ఏదో ఆశించి
సాయం చేయరు. ఒకవేళ సాయం చేసిన మనిషి ఆపదలో
వుంటే గుర్తుంచుకుని ఆదుకోవడం ధర్మమే కావచ్చు. జక్కన్న చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్న
పాఠం ఇదే. చీమ ఆపదలో వున్నప్పుడు పక్షివల్ల సాయం పొందింది. తిరిగి పక్షి ఆపదల్లో
పడ్డప్పుడు చీమ కాపాడింది.
అంతేగానీ
తన ప్రాణాలు కాపాడినందుకు -నీ ప్రాణాలు
కూడా నేను కాపాడతానూ, నీ ప్రాణాలు కూడా
నేను కాపాడతాను ప్లీజ్ - అని పక్షి
వెంట పడలేదు చీమ. కానీ పెద్దయ్యాక కూడా జక్కన్న- తన పర్సు కింద పడిపోతే బెగ్గర్
కొట్టెయ్యకుండా తీసిచ్చిన పాపానికి, అప్పటికప్పుడు
వెంటపడి మరీ సాయం చేసిన బెగ్గర్ ని సింగర్
గా మార్చేసే దాకా వూరుకోడు. ఇలాటి వాణ్ణి చూస్తే పొరపాటున కూడా వీడికి సాయం చేయకూడదనే
అన్పిస్తుంది ఎవరికైనా. తనకి సాయం చేసిన వాళ్ళ జీవితాల్లో వ్యవసాయం చేసేస్తానని
ఊతపదం కూడా జక్కన్నకి. నిజానికిది మానసిక రోగం. ఈ రోగం పది రెట్లవుతుంది.
అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఒక విలన్ వల్ల కాకతాళీయంగా తను బతికిపోతే, పదిహేనేళ్ళ తర్వాత ఆ
విలన్ కి సాయం చేద్దామని బయల్దేరి రావడమే సైకోతనం.
మురెల్
జేమ్స్- డొరోతీ జొన్గేవార్డ్ లు రాసిన ప్రసిద్ధ పుస్తకం ‘బోర్న్ టు విన్’ వుంది. అందులో ఒక సైకలాజికల్ కండిషన్ ని వివరిస్తారు. ఉదాహరణకి
చిన్నప్పుడు అన్నదమ్ములు బొమ్మ బస్సుతో ఆటలాడుకుంటూంటారు. ఆ బొమ్మ బస్సు
తమ్ముడిది. దాని చక్రం అన్న చేతిలో విరిగింది. అది మనసులో పెట్టుకున్నాడు తమ్ముడు.
ఇద్దరూ పెద్దవాళ్ళయి పోయారు, బాగా పెద్ద వాళ్ళయి పోయారు. ఎవరి కుటుంబాలతో వాళ్ళు సుఖంగా
వున్నారు. అంతలో ఏమైందో, అన్న బతుకు దుర్భరం చేయసాగాడు తమ్ముడు. ఇంటిమీదికొచ్చి
దాడి చేయడం, పారిపోవడం. ఏంటంటే, చిన్నప్పుడు నువ్వు నా బస్సు చక్రం విరగ్గొట్ట
లేదా? ఇప్పుడనుభవించూ!
ఇదీ
విషయం. ఈ మానసిక స్థితిని ‘సైకలాజికల్
ట్రేడింగ్ స్టాంప్స్’ అన్నారు సదరు
సైకియాట్రిస్టులైన ఈ గ్రంథ రచయిత్రులు.
అంటే చిన్నప్పుడు పొందిన చిన్న చిన్న అవమానాలు కూడా అలాగే మనసులో ముద్రేసుకుని
వుండిపోతాయి. మనసు వొక ఆల్బం అనుకుంటే ఆ అవమానాలు స్టాంప్స్. ఒక్కో అవమానం ఒక్కో
స్టాంపుగా మనసు ఆల్బంలో భద్రపర్చుకుంటూ పోతారు. ఎప్పుడో బుర్రతిరుగుతుంది. అప్పుడు
ఆ మనసు ఆల్బం తిరగేసి స్టాంపులు చూసుకుంటూ, ఏళ్ళు గడిచిపోయాక పాత కక్ష తీర్చుకుంటూ
ఇలా తిక్క వేషాలేస్తారన్న మాట!
ఇది
పసి మనస్తత్వమే. జక్కన్న ఐడియా ఈ మానసిక స్థితి ఆధారంగా పుట్టి వుండవచ్చా అంటే అలా
కూడా అన్పించదు. పక్కా సైకో పాత్రగానే కన్పిస్తాడు. మరి సైకోతో బ్లాక్
కామెడీ వర్కౌట్ అవుతుంది. ఇది బ్లాక్ కామెడీయా అంటే అదీ కాదు, ఏదో ఓ యాక్షన్
కామెడీ. ‘భేజా ఫ్రై’ అనే హిందీ హిట్
కామెడీలో మ్యూజిక్ కంపెనీ ఓనరైన రజత్
కపూర్ ఇంట్లో పల్లెటూరి నుంచి సింగర్ నవుదామని వచ్చిన వినయ్ పాఠక్
తిష్ట వేసి నానా బీభత్సం సృష్టిస్తాడు. తన చేష్టలతో ఆ కుటుంబంలో
భార్యాభర్తలు విడిపోయేలా అపార్ధాలు కూడా సృష్టిస్తాడు. ఇతను సైకోనా అంటే కాదు,
మ్యూజిక్ వరల్డ్ గురించి ఏమీ తెలీని అమాయకుడు. తన చేష్టల వల్ల ఎంత నష్టం
జరుగుతోందో కూడా తెలుసుకోని భోళాశాకంరుడు.
కాబట్టి
జక్కన్న సైకో అయితే తప్ప, అదీ బ్లాక్ కామెడీ అయితే తప్ప, ఈ అయిడియా వర్కౌట్ కాదని
తేలుతోంది. ప్రేక్షకులు సైకోలు కారు. కనుక ఒక సైకో కాని జక్కన్నేంటీ ఇలా సాయం చేసిన వాళ్ళ జీవితాల్లో వ్యవసాయం
చేస్తానంటూ వెంట పడుతున్నాడూ - అనేసి జక్కన్నతో ఎమోషనల్ గా కనెక్ట్ కూడా కాలేరు. పోనీ
ఇది కామెడీ కాబట్టి పక్షీ చీమా నీతి
కథనే జక్కన్న అతి చేస్తున్నాడని
సర్దుకుపోవడానికీ లేదు. ఎందుకంటే కామెడీ కథకి పునాదిగా వుండే పాయింటు లాజికల్ గా
వుంటేనే దానిపై కమెడియన్ ఎంత అసంబద్ధంగా, అతిగా కామెడీ చేసినా చెల్లిపోతుంది.
పునాదిగా వున్న పాయింటునే (నీతికథనే) అతి చేస్తే దాన్నాధారంగా అతి చేయడానికి ఏ
కామెడీ వుండదు. కాబట్టి ఈ సవరించిన ఐడియా అబ్సర్డ్ (అసంబద్ధ) కామెడీగానూ
పనికిరాదు. ఇదొక అసహజ పాత్ర, దీంతో ఐడియాని ఎంత సవరించినా ఎంతకీ అమ్ముడుబోని ఐడియాగానే వుండిపోతుంది.
దీంతో సినాప్సిస్ రాయడమే కుదరదు, స్క్రీన్ ప్లే సంగతి తర్వాత!
ఇలా
ఐడియాలో అర్ధవంతమైన కథ కన్పించడం ఎందుకవసరమో తెలుసుకున్నాక, ఈ అమ్ముడుబోని ఐడియా
కథనం కూడా ఎలావుందో ఇప్పుడు చూద్దాం...
కథ
బిగినింగ్ : చిన్నప్పుడు పక్షీ చీమా నీతి
కథ తెలుసుకున్న గణేష్ అలియాస్ జక్కన్న
(సునీల్) కథలో చీమలా కాకుండా అతిగా బిహేవ్ చేస్తూంటాడు. తన కెవరైనా చిన్న సాయం
చేస్తే జీవితాతం వెంటపడి వాళ్లకి సాయం చేసేస్తూ ఉంటాడు. ఇలాటి వాడు ఒకరోజు బట్టలు
సర్దుకుని వైజాగ్ వచ్చేస్తాడు. చేత్తో వేసిన ఒకడి బొమ్మ పట్టుకుని ఆరా తీస్తూ
తిరుగుతూంటాడు. ఆ బొమ్మ బైరాగి (కబీర్ సింగ్) అనే మర్డర్లు చేసే రౌడీది. వీడు
ఎవరికీ కన్పించడు. పేరు మాత్రమే జనాలకీ, పోలీసులకీ తెలుసు, కానీ ఎలా ఉంటాడో రూపం తెలీదు.
ఇలా
ఒకవైపు వీడి కోసం వెతుకుతూ, ఇంకో కన్పించిన సహస్ర (మన్నారా చోప్రా) అనే అమ్మాయి
వెంట పడుతూంటాడు. ఈమె నెలరోజుల్లో ఒకడ్ని కొట్టడం కోసం కుంగ్ ఫూ మాస్టర్
(సప్తగిరి) దగ్గర కరాటే నేర్చుకుంటోంది. ఆ కరాటే స్కూల్లో తనూ చేరి ఆమెని
ప్రేమించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు జక్కన్న.
పోగాపోగా
బైరాగిని కనుక్కుంటాడు. ఇంతకీ నువ్వెందుకు నాకోసం వెతుక్కుంటూ వచ్చావని బైరాగి
అడిగితే చెప్పడు. నీకోసం ఏమేం చేస్తానో
చూడూ అని వెంటపడతాడు. బైరాగీ ఎలా వుంటాడో వూరంతా పోస్టర్లు అంటించి జనాలకీ
పోలీసులకీ, శత్రువులకీ తెలిసి పోయేట్టు చేస్తాడు. ప్రతీ సెంటర్ కీ జనాల మధ్యకి బైరాగిని
రప్పిస్తూ దొరక్కుండా ఆటలాడుకుంటాడు. వీడెడవడ్రా అసలు వీడికేం కావాలీ- అని
అనుచరుడు నల్లస్వామి( సత్య ప్రకాష్) దగ్గర తలబాదుకోవడమే చేస్తూంటాడు బైరాగి.
బైరాగి
శత్రువులు బైరాగిని చంపడానికి వచ్చేస్తారు. వాళ్ళందర్నీ చంపేసి బైరాగి ప్రాణాలు
కాపాడతాడు జక్కన్న. అప్పటికీ తానెవరో చెప్పకుండా ఏడ్పిస్తూనే వుంటాడు. బైరాగిని
పట్టుకోవడానికి ఢిల్లీ నుంచి ఇన్స్ పెక్టర్ (పృథ్వీ) వస్తాడు. ఇన్స్ పెక్టర్ ని బోలెడు
కన్ఫ్యూజ్ చేస్తూ బైరాగి దొరక్కుండా చేస్తూంటాడు జక్కన్న. అన్ని ఆధారాలతో బైరాగిని
అరెస్టు చేయడానికి ఇన్స్ పెక్టర్ వచ్చేస్తే, బైరాగీ ఇంట్లో బోలెడు మంది బంధువులుని
దింపి ఇన్స్ పెక్టర్ని ఫూల్ చేస్తాడు జక్కన్న. ఇన్స్ పెక్టర్ నీ, బైరాగీని
కన్ఫ్యూజ్ చేస్తూ బైరాగి ఇంట్లో గేమ్ ఆడుతూంటాడు జక్కన్న.
తను
ప్రేమిస్తున్న సహస్ర బైరాగి చెల్లెలని తెలుస్తుంది. ఆమె తల్లిదండ్రులు
తల్లిదండ్రులు కారు. ఆమె చిన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని బెదిరించి బైరాగీయే
అప్పగించాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ తర్వాత, తను
బైరాగికి ఎందుకు సాయం చేస్తున్నాడో ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటాడు జక్కన్న.
చిన్నప్పుడు బైరాగీ మర్డర్లు చేస్తున్న సంఘటనలో ఇరుక్కున్న తనని, బైరాగీ శత్రువు చంపబోతూంటే, అప్రయత్నంగా శత్రువుని
చంపేసి తన ప్రాణాలు కాపాడాడని చెప్పుకుంటాడు.
ఎండ్ :
ఇప్పుడు బతికున్న శత్రువు మళ్ళీ బైరాగిని చంపేందుకు
ప్రయత్నిస్తాడు. ఈ శత్రువుని జక్కన్న చంపేసి బైరాగిని కాపాడతాడు. ఇక బరాగి దగ్గరే
సెటిలై ఇంకా సాయం చేస్తూనే వుంటా నంటాడు.
వద్దురాబాబూ అని దండం పెట్టుకుంటాడు
బైరాగీ. సహస్ర జక్కన్న చేయి అందుకుంటుంది. అందరూ హాయిగా నవ్వుకుంటారు. శుభం కార్డు
పడుతుంది.
స్క్రీన్ ప్లే సంగతులు
పై కథలో జక్కన్న తానెందుకు బైరాగీకి సాయం చేస్తున్నాడో ఫ్లాష్ బ్యాక్ చెప్పే వరకూ సుదీర్ఘంగా సాగిందంతా బిగినింగ్ విభాగంగా గుర్తించాలి. ఆ తర్వాత నుంచీ బైరాగి శత్రువుని జక్కన్న చంపేశాక కథ ముగింపు వరకూ ఎండ్ విభాగం. ఈ బిగినింగ్ కీ ఎండ్ కీ మధ్య మిడిల్ విభాగం ఈ కథలో కన్పించదు. అంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్నమాట. కథంతా మిడిల్లోనే వుంటుంది కదా? ఆ మిడిలే ఈ కథలో లేదు, అందుకే ఇది పావువంతు కథ. రూపాయి తీసుకుని పావలా కథ చూపించారన్న మాట. పొట్లం విప్పి చూస్తే ఆ పొట్లం చుట్టిన కాగితం తప్ప అందులో ఏమీ లేదన్నమాట! రివ్యూలు అలా రాశారు ఇలా రాశారూ అని ఎదురు నిరసనలు తెలపకుండా, సినిమా ఆఫీసు టోల్ ఫ్రీ కాల్స్ ఏర్పాటు చేస్తే, నేరుగా ప్రేక్షకులనుంచే కుప్పతెప్పలుగా ఫీడ్ బ్యాక్ వచ్చి పడుతుంది కదా?
ఫస్టాఫ్ అంతా బైరాగిని వెతకడం, బైరాగిని బకరా చేస్తూ పోస్టర్ల ప్రహసనంతో ఆడుకోవడం, బైరాగిని చంపడానికి వచ్చిన వాళ్ళని చంపేసి కాపాడ్డమూ జరిగి, అసలు నువ్వెవరు, ఎందుకొచ్చావని బైరాగీ అడిగితే- ముందు ముందు ఇంకా వుంది ఆట- అని కవ్విస్తాడు జక్కన్న. దీంతో ఇంటర్వెల్ పడుతుంది.
తేజ తీసిన ఫ్లాపయిన ‘హోరాహోరీ’ లో కూడా ఇలాటిదే ఇంటర్వెల్ సీన్లో కథేమిటో తెలీకుండా పోతుంది. ఇంటర్వెల్ మీదుగా బిగినింగ్ దురాక్రమించి, సెకండాఫ్ లో ఎక్కడో ముగిసి, అప్పుడు మాత్రమే కథేమిటో తెలిసే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అది. ఇలాటిదే ఫ్లాపయిన ‘కిక్ – 2’ కూడా.
|
ఉండాల్సిన స్ట్రక్చర్
|
అంటే ఇప్పటికి గంటంపావు సమయం గడిచిపోయాక కూడా ఇంటర్వెల్లో కూడా బిగినింగ్ ముగిసి ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడకుండా, కథేమిటో తెలియకుండా, జక్కన్న గోల్ ఏమిటో తెలియకుండా, జక్కన్నకి బైరాగితో సంఘర్షణ పుట్టకుండా- మొత్తం ఫస్టాఫ్ అంతా విషయం లేకుండా వృధాగా నడిచిందన్న మాట. కోట్లమీద కోట్లు పెడుతూ పెట్టి ఇదంతా దండగ్గా తీసుకుంటూ పోయారన్న మాట.
సెకండాఫ్ లో ఇంకా బిగినింగ్ విభాగమే కొనసాగుతూంటుంది జక్కన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పే వరకూ. సెకండాఫ్ లో అరగంటకి ఈ ఫ్లాష్ బ్యాక్ వచ్చినప్పుడే కథేమిటో తెలుస్తుంది. అంటే మొత్తం గంటా ముప్పావు సమయంవరకూ కథేమిటా అని ఎదురు చూస్తూ కూర్చోవాలన్న మాట. ఇంత సేపూ జరిగిందంతా కథే అన్న అజ్ఞానంతో దర్శకుడెలా వుంటాడో అర్ధంకాదు. ఈ సెకండాఫ్ లో ఇంతసేపటికి ఏర్పడే ఈ ప్లాట్ పాయింట్ వన్ నుంచీ కథ మిడిల్లో పడడానికేమీ లేదు. డైరెక్టుగా ఎండ్ లోకి వెళ్ళిపోవడమే. అంటే ప్లాట్ పాయింట్ టూ లేకుండా ప్లాట్ పాయింట్ త్రీ వచ్చేసిందన్న మాట.
|
జక్కన్న స్ట్రక్చర్ (!) |
ఇలాటి అల్లాటప్పా స్క్రిప్టు ఎలా రాస్తారో అంతుచిక్కదు. స్టార్ దొరగ్గానే సీనిమా తీయాలంటే వుండే భయభక్తులన్నీ ఎగిరిపోతాయేమో!
ఇంటర్వెల్ దగ్గరైనా జక్కన్న బైరాగికి ఇదీ విషయమని చెప్పకుండా కామెడీ చేయడం గొప్ప సస్పెన్స్ ని పోషిస్తున్నామనుకున్నట్టుంది. ఈ సస్పెన్స్ ఏమిటో- బైరాగి జక్కన్నకి ఏం సాయం చేసివుంటే తిరిగి బైరాగికి ప్రతిసాయం చేయడానికి జక్కన్న వచ్చాడో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఇంకా కుతూహలపడతారనుకున్నట్టుంది. ఇది ఎండ్ సస్పెన్స్ అనే సుడిగుండం లోకి దిగలాగి సినిమాని నిండా ముంచేస్తుందని అస్సలు గ్రహించలేదు.
ఏది సస్పెన్స్ అవుతుంది? ఫస్టాఫ్ లో సకాలంలో ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటుచేసి. ఇదీ విషయం- ఇందుకోసమే హీరో - విలన్లు ఘర్షించుకుంటున్నారని స్టోరీ పాయింటు చెప్పి, ఆతర్వాత వాళ్ళిద్దరి మధ్య సంఘర్షణ ఎలా ఉంటుందనేది సూచనలివ్వకపోతే అది సస్పెన్స్ అవుతుంది. స్టోరీ పాయింటే ఓపెన్ చేయకుండా- అది సస్పెన్స్- దీనికోసం చివరంటా వెయిట్ చేయండంటే అది సస్పెన్స్ అవదు, ప్రేక్షకులకి సహనపరీక్ష పెట్టి సినిమా తన మరణ శిక్ష తనే విధించుకోవడం అవుతుంది.
ఫస్టాఫ్ లో ప్లాట్ పాయింట్ వన్ పెట్టుకోకపోవడం, బిగినింగ్ నే సెకండాఫ్ సగం దాకా సాగదీయడం, మిడిల్ మటాష్ చేసుకోవడం, ఎండ్ సస్పెన్స్ పోషించడం, విలన్ పాత్రని బకరాగా పాసివ్ గా తయారు చేయడం, జక్కన్న క్యారక్టరైజేషన్ ని ఆడియెన్స్ తో ఎమోషనల్ కనెక్షన్ లేకుండా చేసుకోవడం....ఇదంతా ఒకెత్తు అయితే, విలన్ ఇంట్లో అందర్నీ పోగేసి, కన్ఫ్యూజ్ కామెడీ అను సింగిల్ విండో స్కీములోకి కథని దింపెయ్యడం ఒకెత్తూ.
కథనం పురాతనం
కథనం కూడా నేటి సినిమా చూస్తున్నట్టుగాక పల్నాటి కాలపు నాటకం
వేస్తున్నట్టు వుంటుంది. ప్రారంభ సీనే పాఠశాలలో చిన్నప్పడు హీరో నీతికథ వినడంతో (ఇంకా ఈ చిన్నప్పటి ముచ్చట్లతో చాదస్తపు
సినిమాలేంట్రా బాబూ!) , ఆ నీతితో క్లాస్ మేట్ చేసిన సాయానికి ప్రతిసాయం
చేయడంతో మొదలయ్యే క్యారక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్ పాట్లు –ఇంకా పెద్దయ్యాక బెగ్గర్
తో, అదయ్యాక ఒక పాటతో ఇదే క్యారక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్ పాట్లు జీడిపాకంలా సాగుతూనే వుంటాయి. ఈ జక్కన్న ఇలాటి వాడూ అని చెప్పడానికి
నేటికాలపు ప్రేక్షకులు అమూల్ బేబీ లైనట్టు ఇంత స్పూన్ ఫీడింగ్ అవసరమా? పైన ఈఎమ్
ఫార్స్టర్ అన్నట్టు- స్పూన్ ఫీడింగ్ తో
నేర్చుకునేదేమీ వుండదు ఆ స్పూను షేపు గురించి తప్ప! పావుగంట కాలాన్ని తినేసే ఈ స్పూన్ ఫీడింగ్ నంతా తీసేసి, ఒకే
సీనుతో హీరో ఏమిటో చెప్పెయ్యొచ్చు. దీంతో నీతికథ ప్రసక్తి లేకుండా, నీతికథని అతి
చేస్తున్నాడనే రసభంగమూ కలక్కుండా క్యారక్టరైజేషన్ తో ఎస్కేపయ్యే వీలుండేది. పైగా
సాయం చేస్తే మీ జీవితాల్లో వ్యవసాయం చేస్తానని వాగనవసరం లేకుండా (అలా వాగడం
వల్ల క్యారక్టర్ ఇంకా వరస్ట్ గా తయారయ్యింది)
అదేదో యాక్షన్ (చర్యల) ద్వారా చూపించి వుంటే కొంతైనా ఆడియెన్స్ కనెక్ట్ ఏర్పడేది.
లవ్
ట్రాక్ అయితే మరీ బోరు. అసలు జక్కన్న
వైజాగ్ ఎందుకొచ్చాడు? బైరాగిని పట్టుకుని వాడికి ప్రతిసాయం చేసి
తరించడానికేగా? ఆ పని మీదుండక హీరోయిన్ కన్పించగానే లొట్టలేస్తూ అటెలా
వెళ్ళిపోతాడు? ‘కబాలి’ లో తలెత్తిన కన్ఫ్యూజన్ లా ఇది హీరోయిన్ తో లవ్ స్టోరీయా,
లేక విలన్ తో యాక్షన్ స్టోరీయా? ఏది ప్రధాన కథ, ఏది ఉపకథ?
ఒకవైపు
హీరోయిన్ వెంటపడుతూ, ఇంకో వైపు విలన్ని వెతుకుతూ హీరో గోల్ చెదిరిపోవడం
బావుంటుందా, లేక హీరోని చూసి హీరోయిన్ అతడి వెంటపడుతూ, హీరో విలన్ వెంట పడుతూ వుంటే హీరో గోల్ చెదరకుండా, డైనమిక్స్ కూడా ప్లే అవుతూ,
ఈ కథనం బావుంటుందా?
పదిహేనేళ్ళ
క్రితం చూసిన బైరాగి బొమ్మేసుకుని జక్కన్న రావడంలోని సహేతుకతని క్షమిద్దాం, ఆ
బొమ్మని ఏ షోషల్ మీడియాలోనో పెట్టేస్తే
క్షణాల్లో బైరాగి దొరికిపోతాడు కదా, బొమ్మ
పట్టుకుని కనపడిన వాళ్ళనల్లా అడుగుతూ గంటసేపూ
స్క్రీన్ టైంని తినేస్తాడెందుకు? ఇది 1980 లనాటి సినిమా అనుకుంటున్నాడా జక్కన్న?
దొరికిన
బైరాగికి ప్రతిసాయం చేసే పద్ధతేమిటి, పగతీర్చుకుంటున్నట్టు లేదూ? గుట్టుగా
బ్రతుకుతున్న బైరాగి ఐడెంటిటీని రట్టుచేయడం ప్రతి సాయమా? అన్ని నేరాలు చేస్తూ తన
ముఖం ఎలా వుంటుందో బయటి ప్రపంచానికి తెలియకుండా బ్రతకడం బైరాగికి ఎలా
సాధ్యమయ్యింది? బొమ్మ పట్టుకుని జక్కన్న తిరుగుతూ ఫస్టాఫ్ అంతా టైం పాస్ చేయడానికేగా బైరాగి ఐడెంటిటీతో ఈ అసంబద్ధ కథనం?
బైరాగిని
పట్టుకోవడానికి ఎక్కడో ఢిల్లీ నుంచి పోలీసు అధికారి రావడమేమిటి? వైజాగ్ లో బైరాగి
నేరాలతో అతడికేం సంబంధం? బిల్డప్ వుంటుందనేగా ఢిల్లీనుంచి దిగినట్టు అల్లాటప్పాగా
చెప్పించారు? పోట్లంలో సరుకులేకపోయినా, పొట్లం చుట్టిన కాగితం కూడా ఇంత ఛండాలంగా
వుండాలా? కథనమనే పొట్లం చుట్టిన కాగితం కూడా చెత్త కుండీ లోంచి వచ్చిందే
అన్నట్టుంది. ఇలా అంటున్నందుకు సారీ, కానీ ఈ సినిమాని క్లాసే కాదు, మాస్ కూడా ఏకోశానా ఎంజాయ్
చేయలేకపోయారు. బుకింగ్స్ దగ్గర చూస్తే
మాస్ ఎంత హుషారుగా తరలివచ్చి హౌస్ ఫుల్ చేశారో(టికెట్లు దొరక్క చాలామంది
వెనక్కి వెళ్ళిపోయారు) అంత నీరసపడి ఇంటర్వెల్ కి బయటి కొచ్చారు, మరింత
నీరసపడి మిగతాసగం చూసి వెళ్ళిపోయారు. తర్వాతి ఆటలకి ఈ సినిమాకి అంత సీను లేకుండా
పోయింది. సినిమా వాళ్ళు మల్టీ ప్లెక్సుల్లో క్లాస్ ప్రేక్షకుల మధ్య సినిమాలు
చూస్తే ఏమీ లాభంలేదు, క్లాస్ కి ఆవల మిగతా వర్గాల ప్రేక్షకులు ఎలా రెస్పాండ్
అవుతున్నారో తెలీని వర్చ్యువల్ ప్రపంచంలో వుండిపోతారు మల్టీ ప్లెక్సులో సుఖంగా సినిమాలు చూసే సినిమా వాళ్ళు. రాజకీయాల్లో ఓటరు
అంటే ధనికులు కారు, సామాన్య జనం. సినిమాలకి కూడా ప్రేక్షకులంటే సామాన్య జనమే.
ఇక డైలాగులు చూస్తే అంతా ప్రాసలమయమే. ప్రతీపాత్రా
ప్రాస డైలాగులే వల్లిస్తుంది. ఈ రోజు వచ్చిన నీ అదృష్టం ఆర్టీసీ బస్సులో వస్తే సాయంత్రం
వోల్వో బస్సులోవస్తుంది... తండ్రిని భయపెట్టించాడు, మనకిక మామిడి తాండ్రే... నీకు మార్షల్
ఆర్స్ట్ తెలుసా?- నీకు గీతా ఆర్ట్స్ తెలుసా?...ప్రతోడూ సంచుల కొద్దీ పంచులిస్తున్నాడు...ఇదీ
వరస! ఇది చాలనట్టు ఇంగ్లీషు పదాలతో కూడా ప్రాస
కాలుష్యమే. ప్రాస డైలాగులతో కామెడీ వస్తుందనే దురవగాహనతో వున్నట్టుంది. కేవలం ఒకే ఒక్క చోట పలికిన
- నేను లే అవుట్ వేస్తే వాడు వెంచర్
వేశాడు - అనే డైలాగులో కామెడీ మెరుస్తుంది నిజానికి. ఇలాటి ప్రయోగాలు సృజనాత్మకత
అన్పించుకుంటాయి.
కథనంలో
ఇంకా పృథ్వీ తో దిక్కులేనట్టు అదే బాలకృష్ణ డైలాగుల పేరడీ. మళ్ళీ చిరంజీవి వీణ డాన్సు
బిట్టు ఒకటీ. ఇలా కొత్తదనం, కొత్తగా ప్రవేశ పెట్టిన ఒక్క అంశమూ లేకుండా రకరకాల సినిమాల్లోంచి
కత్తిరించుకుని తెచ్చిన ముక్కలతో జక్కన్నని చెక్కి- ఓ పనైందన్పించుకుని - ఇంకా నెక్స్ట్
సినిమా తీసెయ్యడానికి ఒకచోట చేరి ఇంకెలాటి
భయంకర చర్యలకి సమాలోచనలు చేస్తున్నారో!! ఇలాటి సమాలోచనల ఇన్ఫర్మేషన్ అందుకుని దాడులు
చేయడానికి టాలీవుడ్ ఒక స్క్వాడ్ ని ఏర్పాటు చేసుకోవాలి...
-సికిందర్